Comment navigation


15528

1 2 3 4 5 ... 1553 »

  1. వంటా వార్పు గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    11/19/2024 6:42 am

    తెలుగుసాహిత్యకారులు సాధ్యమైనంతవరకు తెలుగుభాషలోనే వ్రాస్తే బాగుంటుందని నాఅభిప్రాయం.

    (ఈమాటకు అభిప్రాయాలూ విమర్శలూ పంపే వారు కూడా తెలుగుసాహిత్యం గురించి మాట్లాడుతున్నవారే కాబట్టి వారు కూడా సాధ్యమైనంతవరకు తెలుగుభాషలోనే వ్రాస్తే బాగుంటుందని కూడా నాఅభిప్రాయం.)

    కథ మొదలు పెడుతూనే రూంలో అని ఇంగిలిపీసు ముక్కను ప్రధమకబళే మక్షికాపాతః అన్నట్లు వేయకుండా గదిలో అని కాస్త కరుణించవచ్చును కదా! చాదస్తంగా ఇంగ్లీషుముక్క లన్నీ తెలుగుచేయమని అనను కాని కాస్త వీలైనంత తెలుగు వాడవచ్చును కదా అని వాపోతున్నాను.

    అదిసరే, ఈకథ బాగుంది. బహుకాలం క్రిందట చదివిన సాంబారు జన్మవృత్తాంతాన్ని వివరించే కథలాగా ఉందనిపించింది ఎందుకో (ఆకథకు రచయిత పెట్టిన పేరు గుర్తులేదు. మన్నించాలి)

    ఆకథను టూకీగా చెప్తాను. కైలాసంలో శివకుటుంబంలో అమ్మవారు ఒకసారి చిరాకుపడి వంటావార్పూ అంతా నావంతే అంటే కుదరదూ – నాకూ భక్తులున్నారు బోలెడుమంది – వారిని చూచుకోవద్దా నేను? అందుకని ఇకనుండీ అందరూ వంతులవారీగా వంటపని చూడాలి అని నియమం చేసారట. అలా బండి నడుస్తూ ఉండగా ఒకనాడు సాంబశివులవారి వంతు వచ్చింది. ఆయనకు ఏం చేయాలో తోచక చివరకు గంగాళంలో నీళ్ళు ఉడకనిచ్చి కనిపించిన కూరానారా అంతా ముక్కలు చేసి దాంట్లో వేసి గుప్పెళ్ళతో ఉప్పూ కారం పులుపూ అంతా వేసి కూర్చున్నారు.
    భోజనాలసమయంలో అందరూ ఆద్రవపదార్ధాన్ని దాంట్లో భీతావహంగా ములుగుతూ తేలుతూ ఉన్న రకరకాల రంగురంగుల ముక్కల్నీ చూసి ముందు జడుసుకున్నా రుచి మాత్రాం బాగా వచ్చిందని సంతోషపడ్డారు. ఈవంటకం పేరేమిటండీ అని అమ్మవారు అడిగితే నాకు మాత్రం ఏమి తెలుసూ అని శివయ్య నవ్వాడట. సాంబశివులవారు కనిపెట్టిన వంటకం కాబట్టి అప్పటినుండీ దాన్ని సాంబారు అని పిలవాలని ఏకగ్రీవంగా నామకరణం చేసారని ఆకథ చెబుతున్నది. (ఇదీ నాకు గుర్తు ఉన్నంతవరకూ ఆకథ. ఏమిటో మీతో పంచుకోవాలని అనిపించి చెప్పాను. తప్పైతే మళ్ళా మన్నించేయండి.)

    శివయ్య కాబట్టి ఎలాచేసినా అమృతంలాగా ఉండటానికి కుదురుతుంది కాని పాపం మనవాడు చేసింది బంగాళాదుంపల పప్పు కదా అలా ఎలా కుదురుతుందీ అని.

  2. వంటా వార్పు గురించి Ramesh గారి అభిప్రాయం:

    11/18/2024 10:23 am

    “వంట రెడీగా వుండడం చూసి నన్ను మెచ్చుకుని, తలలు తుడుచుకుంటూ పళ్ళేలు తెచ్చుకుని అందులో వుడికీ వుడకని అన్నాన్నీ, పొటేటో పప్పును వేసుకుని మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్న తర్వాత వాళ్ళు చూసిన చూపుంది చూశారూ నా కిప్పటికీ గుర్తే!”

    బంగాళాదుంపల పప్పు చాలా బాగుంది, punch is very స్త్రొంగ్, కథ చక్కగా నవ్వించింది, నమస్కారం

  3. చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    11/18/2024 9:17 am

    మహాభారతం సభాపర్వంలోని రెండు మహా ప్రసిధ్ధమైన తెలుగు పద్యాలూ వాటికి మూలమైన వ్యాసులవారి శ్లోకాలూ ఇలా ఉన్నాయి.

    మొదటిది.
    అస్యపాపస్య దుర్బుధ్ధేర్భారతాపదస్య చ
    స పిబేయం బలాద్ వక్షః భిత్వా చేద్ రుధిరం యుధి (సభా. 68-53)

    అనువాదం.
    మ. కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్ మదో
    ద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
    కర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైల రక్తౌఘ ని
    ర్ఝర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్

    రెండవది.
    పితృభిః సహ సాలోక్యం మా స్మ గఛ్ఛేద్ వృకోదరః
    యద్యే తమూరుం గదయా న భిద్యాం తే మహాహవే (సభా. 71-14)

    అనువాదం.
    ఉ. ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రం
    భోరుని జోరు దేశమున నుండగ బిల్చిన యఈ ద్దురాత్ము దు
    ర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భ
    గ్నోరుతరోరు జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్

    విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్ష అవతారిక లో “ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి అని కొనియాడబడిన తెలుగువారి ఆదికవి గారు మూలశ్లోకాలను ఏవిధంగా విస్తరించి తెనుగించారో పాఠకులను చిత్తగించవలసిందిగా కోరుతున్నాను. పాఠకుని ఊహకు వదిలేయవలసిన విషయాన్ని విస్తరిస్తూ దండుగ్గణాలు చేరిన నన్నయ్య చేసిన అనువాదం, పేలవ ప్రదర్శన గా మారిపోయింది అని ఎవరన్నా అనుకుంటే వారికొక నమస్కారం.

  4. నౌకరీ గురించి Ramesh గారి అభిప్రాయం:

    11/18/2024 6:20 am

    ఎందుకో abrupt ending అనిపించింది,

  5. ఆవిడ గురించి Ramesh గారి అభిప్రాయం:

    11/18/2024 5:34 am

    ఈ రోజేమో, అక్కడెవరూ లేరు కాని తను పెద్దగా ఏడుస్తూ అరుస్తూంది, ‘మగలంజకొడుకులంతా ఒకటేరా అని తెలిసినా కూడ పెంచి పెద్ద చేసిన కదర ముండా కొడుకా’ అని ఎవరినో తిడుతూంది.

    ఆమె లోని అమ్మతనం తను పెంచిన అమ్మాయిని తన సొంత కొడుకే పాడు చేస్తాడు అని అతన్ని తిట్టినప్పుడే తెలుస్తుంది. చాలా మంచి కథ, నమస్కారాలు.

  6. సత్యం గురించి Ramesh గారి అభిప్రాయం:

    11/18/2024 3:41 am

    “మనకి మనమాడే అబధ్ధాలు అంతగా అలవాటు అయిపోయినట్లున్నాయి.”
    “అబధ్ధమన్న తర్వాత ఏదైనా అబధ్ధమే! చిన్నదీ, పెద్దదీ, హానికరమయిందీ, కానిదీ అనుకునేది మనని మనం సమర్థించుకోటానికే!”

    ఈ కథ చాలా ఆలోచింపచేస్తుంది. పిల్లల పెంపకం, వాళ్ళ పట్ల మన ప్రవర్తన గురించి చక్కగా చెప్పారు, నమస్కారం.

  7. కృత్రిమ మేధ, ప్రజ్ఞానం, నోబెల్ బహుమానాలు గురించి తమ్మినేని యదుకుల భూషణ్ గారి అభిప్రాయం:

    11/17/2024 6:44 pm

    దేశంలో సైన్సు చదువుకున్న ఆచార్యులు ఎందరో ఉన్నారు. కానీ తమకు తెలిసిన విషయాన్ని ఇతరులతో పంచుకోవాలి అన్న ఉదారస్వభావం గలవారిని వేళ్ళ మీద లెక్కించగలము – అటువంటి వారిలో అగ్రగణ్యులు వేమూరి గారు. ప్రస్తుత వ్యాసం – కృత్రిమ మేధ (AI) పూర్వాపరాలను పరిశీలించి – ఏ రకంగా దాని అనువర్తనాలు భౌతిక రసాయనిక శాస్త్రాల స్థితిగతులను మార్చి, ఒక కొత్త విప్లవానికి దారితీశాయో – చివరిగా దానిలో భాగస్వాములైన శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం లభించడం మేలుమలుపుగా కొనియాడుతూ , సమాజం మీద కృత్రిమ మేధ ప్రభావం , మంచి చెడులను చర్చించి వదులుతుంది. ఈ వ్యాసంలో చర్చించిన విషయాలు, ప్రస్తావించిన సంగతులు కొత్తవి. మన కుతూహలపరిధిని అనంతంగా విస్తరించే ఇవన్నీ ఆహ్వానించదగినవి- సహజంగా ఎన్నో పారిభాషిక పదాలు (చాలా వాటికీ బ్రాకెట్లలో ఆంగ్ల మూలాలు ఇచ్చారు) దొర్లాయి. ఎప్పటిలాగే – నాకు ఈ విభాగంలో కొన్ని అభ్యంతరాలున్నాయి.

    సైన్సులో తెలుగు వ్యాసాలకు పాఠకులు – చాలావరకు చిన్నప్పుడు కనీసం పదవ తరగతి దాకా తెలుగు మీడియంలో చదువుకుని -కనీసం క. సా.గు కట్టడం తెలిసిన వారు, అంతేకాదు, కణం, ఉండుకం, క్లోమం, ప్లీహం, అణువు, పరమాణువు, యానకం, లోలకం, పౌనః పున్యం, తరంగ దైర్ఘ్యం లాంటి పదాలు చెవిన పడిన వారు – వారిలో కొందరు వయసు పైబడుతున్న రీత్యా, మరుపుదారిలో ఉన్న బాపతు అని చెప్పవచ్చు. కాబట్టి, మనకున్న పాఠక ప్రపంచం పరిమితులెరిగి, ఇదివరకు ప్రచారంలో ఉన్న పారిభాషిక పదాలను పొదుపుగా వాడుకోవాలి అన్న ధోరణి నాది.

    ‘బణువు’(molecule) అన్న ప్రయోగం నాకు ఇబ్బంది కలిగించింది- కారణం ఇప్పటికీ ప్రచారంలో ఉన్న పాఠ్యగ్రంథాల్లో Molecule ను అణువుగా, Atom ను పరమాణువుగా వ్యవహరిస్తున్నారు. అలాగే, Thermodyamics ను చాలా కాలంగా ‘ఉష్ణగతి శాస్త్రం’గా వ్యవహరిస్తున్నారు – దాన్ని అలాగే వాడటం మంచిది అనుకుంటాను. కొత్త పారిభాషిక పదాలు అవసరం కొద్దీ సృష్టించుకోవచ్చు.

    నా స్నేహితుడు ఒకడు, 1994లో అన్నా విశ్వవిద్యాలయంలో Remote Sensing లో ANN (Artificial Neural Networks) వినియోగం మీద M.Tech ప్రాజెక్టులో భాగంగా పరిశోధన పత్రం సమర్పించాడు. దాని సారాంశం (abstract ) ఆంగ్లంతో పాటు ఒక భారతీయ భాషలో ఉండాలి. అప్పుడు తెలుగులో abstract నేను రాసి పెట్టాను. ఆ సందర్భంలో – Remote Sensingను దూరగ్రహణంగా , ANNను కృత్రిమ నాడీ జాలాలుగా పేర్కొన్నాను. చెప్పొచ్ఛేది ఏమిటంటే, లేని వాటికి మనం హాయిగా కొత్త పారిభాషిక పదాలు సృష్టించుకోవచ్చు. ఇక, వ్యాసంలోకి ప్రవేశిస్తే, neural net ను నాడీ వలయంగా పేర్కొన్నారు, internet ను అంతర్జాలం అని పిలుస్తున్నామా, ఆ పంపిణీ మీద neural net ను నాడీ జాలంగా వ్యవరిస్తే బావుండేది. వలయం, వృత్తం అనగానే అందులో సంభాషణ/సంకర్షణలకు స్థానం లేదు. ANN లకు అదే ఆయువుపట్టు కదా.

    consciousness ను ప్రజ్ఞానంగా పేర్కొనడం ఇదే మొదలు అనుకుంటాను. చేతన / చైతన్యం అని వాడుకలో ఉంది. సాహిత్యంలో Stream of consciousnessను చైతన్య స్రవంతి అని , subconsciousnessను అవచేతన, Unconsciousnessను చక్కగా అచేతన అని వ్యవహరిస్తున్నాము. consciousness కు మన అనుభవానికి సంబంధం ఉంది. మేధకు, కృత్రిమ మేధకు – జ్ఞానం / సమాచారం ముఖ్యం. కృత్రిమమేధస్సులో అనుభవానికి ఒక ప్రాతిపదిక లేదు. Consciousness ను ప్రజ్ఞానం అనడంలో ఇక్కడే చిక్కు వస్తుంది. అదేదో జ్ఞాన సంబంధి అనుకునే అవకాశం ఉంది, తద్భిన్నంగా consciousness అనుభవ సంబంధి. ప్రస్తుతం వాడుకలో ఉన్న చేతన చక్కగా సరిపోతుంది. Consciousness ప్రజ్ఞానం అయితే మరి subconsciousness / Unconsciousnessని ఏమని పిలవాలి? ఇలాంటి చిక్కులున్నాయి అనిపిస్తుంది. తీగ లాగితే డొంకంతా కదులుతుంది.

    ఇక చిల్లర విషయాలు: క్రింది వాక్యాల్లో లోతైన జేబులు (deep pockets), పసరు తగ్గిపోతూందా (No more juice) అన్న ప్రయోగాలు: “ఈ రెండు బహుమానాలూ అందుకున్న ఐదుగురిలో ‘ముగ్గురు లోతైన జేబులు ఉన్న’ గూగుల్ కంపెనీతో సంబంధం ఉన్న పరిశోధకులు.ఈ ధోరణి చూస్తూ ఉంటే భౌతిక, రసాయన శాస్త్రాలలో ‘పసరు తగ్గిపోతూందా ‘అనే అనుమానం ఒక పక్క.”

    బ్రాకెట్లలో సూచించిన అమెరికన్ జాతీయాలకు (idioms) తెలుగు అని తెలుస్తోంది. ‘చేతిలో కాసులు గల గల లాడుతున్న’, ‘శక్తియుక్తులు నీరు కారిపోతున్నాయా’ లాంటి తెలుగు నుడికారం వాడితే సులభంగా అర్థమవుతుంది. ‘Emerging behaviour’ను ‘హఠాదుత్పన్న ప్రవర్తన’ అనడం బరువుగా ఉన్నా అర్థబోధకు వచ్చిన చిక్కు లేదు. లేదంటే సరళంగా ఆకస్మిక ప్రవర్తన/ సాహసిక ప్రవర్తన అని పిలవచ్చు. పొతే, వంగ భాషలో ‘emerging’ని ‘ఉదీయమాన’ అని వ్యవహరిస్తారు. ఇక మిగిలినది brute force – చక్కగా తెలుగులో మొద్దు బలం అంటే సరిపోతుంది. చివరాఖరిగా ‘కపాలం మీది టోపారం’ నాకు అర్థం కాలేదు.

    ప్రముఖ సైన్సు రచయితగా అప్పుడప్పుడు మంచి వ్యాసాలు రాస్తూ అందరి బుర్రల్లో తుప్పు వదలగొడుతున్న వేమూరి గారికి అభినందనలు, ఇలా, వారు ఇంకా ఎన్నో వ్యాసాలు రాసి పాఠకుల కుతూహలాన్ని ఇనుమడింప చేయగలరని ఆశిస్తాను.

  8. కృత్రిమ మేధ, ప్రజ్ఞానం, నోబెల్ బహుమానాలు గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    11/15/2024 6:06 pm

    ప్రొఫెసర్ రాజ్ రెడ్డి గారు చురుకుగా పని చేసిన రోజులలో నాడీవలయాలు ఊపందుకుని ఉండుంటే ఈ నోబెల్ బహుమానం ఆయనకి దక్కి ఉండేదేమో!! అప్పుడు మనం అంతా కాలరెత్తుకుని తిరిగి ఉండేవాళ్ళం. నోబెల్ బహుమానాలకి కూడా కాలం, కర్మం కలసి రావాలి.

  9. కృత్రిమ మేధ, ప్రజ్ఞానం, నోబెల్ బహుమానాలు గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    11/15/2024 10:22 am

    కృత్రిమ మేధ, నాడీ వలయాల పునర్జన్మ అంశాల మీద మంచి వ్యాసాన్నిచ్చిన శ్రీ వేమూరి వేంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు. 1985లో హైద్రాబాదులో ప్రొ. రాజ్ రెడ్డిగారి ఉపన్యాసం విన్నందున… వారినీ స్మరిస్తూ…

    భవదీయుడు,
    కె. కె. రామయ్య

    Dabbala Rajagopal “Raj” Reddy is an Indian-American computer scientist and a winner of the Turing Award. He is one of the early pioneers of artificial intelligence and has served on the faculty of Stanford and Carnegie Mellon for over 50 years.

  10. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-2 గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    11/14/2024 12:53 pm

    ప్రతాప చంద్రశేఖర్ గారు,

    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. అయితే, మీరు చెప్పిన అథర్వశీర్షం అన్నది అథర్వవేదంలో భాగం కాదండి.

    మీరు చెప్పిన గణపతి అథర్వ శీర్షం అన్నదే శ్రీగణపత్యథర్వశీర్షోపనిషత్ అని కానీ గణపత్యుపనిషత్ అని పేరు పొందిన రచన చాలా అర్వాచీనం. దీని మీద పరిశోధన చేసిన అనిత రైనా థాపన్[1] ఇది 16వ శతాబ్దంలోనో 17వ శతాబ్దంలోనో రచించబడి ఉండవచ్చునని ఆధారాలతో వాదించారు.

    [1] Anita Raina Thapan (1997). Understanding Gaṇpati. Manohar Publishers. p. 40. ISBN 978-81-7304-195-2.

    గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తు గురించి వికీ పేజీ మీరు చూడవచ్చు:
    Ganapati Atharvaśīrṣa Wikipedia page

    నమస్సులతో,
    సురేశ్.

1 2 3 4 5 ... 1553 »