రాగమాలిక

“వర్షాలు మొదలయ్యాయి. కొండలు పచ్చగా మెరిసే సమయం. సెలయేళ్ళు గలగల పారే సమయం. ఇంట్లోనే ఉండిపోతే ఎలా?” సలహా, కన్సర్న్, మందలింపు ఆ స్వరంలో.

ఎవరదీ? ఎవరదీ? చుట్టూ చూశాను. కనబడలేదు. మరో క్షణానికల్లా అర్థమయింది–గత పది రోజులుగా కురుస్తోన్న వానలు పలుకుతోన్న పలుకులవి.

నిజమే. ఇది ఇంటిపట్టున ఉండాల్సిన సమయం కాదు. కానీ కారణముంది. ఈమధ్యే ఆరోగ్యసమస్యలు ఎదుర్కొన్న అమ్మ ఇపుడు నాతోపాటు ఢిల్లీలో ఉంటోంది. తనకు నిరంతరం తోడు అవసరం.

“మేరీ పాస్ మా హై!” అందామన్నంత ఆవేశం వచ్చేసింది. ఇంతోటిదానికి కాపీ కొట్టడం ఎందుకులే అని తమాయించుకొన్నాను. కానీ నేను నిరంతరం జపించే ‘మనసుంటే మార్గముంటుంది’ అన్న మాటా గుర్తుకొచ్చింది.

ఇరవై జులై. శుక్రవారం.

ఆదివారం నాడు లక్ష్మి ఇంట్లోనే గదా ఉండేదీ… కొంచం ఊహలను సారిస్తే కొండలు. మేఘాలు. వర్షం. మనుషులు–ఓ ఐదారు గంటలు తిరిగి, తిరిగిరావడం సాధ్యమే గదా…

సాధ్యమే. ఓ అరగంట రైల్వేవాళ్ళ సైట్‌తో కుస్తీ. శనివారం రాత్రి బయల్దేరి ఢిల్లీ నుంచి కల్కా, అక్కడ్నించి సోలన్, బరోగ్, తిరిగి ఆదివారం రాత్రికి అదే దారిలో ఢిల్లీ. ఇదీ ప్రణాళిక.

అంతా కలసి నాలుగు టికెట్లు. రెండు కన్ఫర్మ్‌డ్. ఒకటి ఆర్.ఎ.సి, ఒకటి వెయిట్ లిస్టు. ఫర్లేదు. ఆమాత్రం ఛాన్స్ తీసుకోవచ్చు.


‘ఎన్నిసార్లు ప్రసంగించినా ప్రతిసారీ కొత్త ప్రసంగం, మొట్టమొదటి ప్రసంగం అన్న భావన కలుగుతుంది. చిన్న అసౌకర్యం కలుగుతుంది. మరికాస్త మరికాస్త ప్రిపేరయ్యేలా చేస్తుంది,’ అన్నారు మృణాళిని, మొన్నామధ్య మా ఢిల్లీ సమావేశాల్లో ఆత్మకథలు గురించి కీలకోపన్యాసం చెయ్యడానికి వచ్చినపుడు.

మొన్న శనివారం రాత్రి దాదాపు నాదీ అదే పరిస్థితి.

దేశమంతటానూ విదేశాలలోనూ గత నలభై ఏభై ఏళ్ళుగా మూలమూలలకూ తిరిగివచ్చిన మాట నిజమే కానీ, ప్రయాణం పెట్టుకొన్న ప్రతిసారీ చిరు అలజడి. ఆంగ్లంలో అప్రెహెన్షన్. శక్తి కూడగట్టుకొని దాన్ని అధిగమించడం.

ఢిల్లీలో రాత్రి తొమ్మిదిన్నరకు కల్కా వెళ్ళే రైలు. మూడు వందల కిలోమీటర్లు. ఏడు గంటలు. హిమాలయాల పాదాల దగ్గర ఉంది కల్కా పట్నం. ఆ ఊరు దాటగానే హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం. దాటించడానికి చక్కని నారోగేజ్ బొమ్మ రైలు, వంద కిలోమీటర్ల దూరాన ఉన్న సిమ్లా దాకా.

ఢిల్లీలోనే రైలు రెండుగంటలు లేటయింది. మరి నేను ఎక్కవలసిన బొమ్మరైలు దాటిపోతుందా?!

“వెళ్ళదు. ఈ అయిదు గంటల బండీ, తర్వాత బయల్దేరే ఆరు గంటల బండీ ఈ కల్కా మెయిల్ కోసం ఆగుతాయి. మెయిలు రెండుమూడు గంటలు లేటయినా, వచ్చేదాకా ఆగుతాం.” బొమ్మరైలు గార్డుగారిని మాటల్లో పెడితే వచ్చిన సమాచారం.


నా రైలు ఆరుగంటలకు.

అరగంట టైము–స్నానపానాలకు. తాజా తాజాగా. చీకట్లు తొలిగిపోయి మబ్బులాంటి వెలుగు అంతటా పరచుకొంటోంది.

రెండో తరగతి సిటింగ్ కంపార్టుమెంటు. నా ఆర్‌.ఎ.సి. కన్ఫర్మ్ అయింది. పైగా కిటికీ సీటు. వహ్ రె వా!

ఐదారు పెట్టెల బండి మాది. ఒకటో రెండో మొదటి తరగతి. మరో రెండు రెండో తరగతి. మిగిలినవి జనరల్ కంపార్టుమెంట్లు. తరగతుల తారతమ్యమే లేకుండా అన్ని పెట్టెలకూ రంగురంగుల రంగులు, అమెజాన్ అడవుల్లో కనిపించే సెంటిపీడ్‌లా (ఇది నా ఊహే సుమా!) మైదానాలు దాటి, పల్లెలు దాటి, పట్నాలు దాటి, కొండలు ఎక్కుతూ రైలు. వేసవి సీజన్ ముగిసినా, కిక్కిరిసి కాదు గానీ రైలు నిండా మనుషులు. కోలాహలం.

మెల్లగా చిక్కనవుతోన్న అడవి. లేతాకు పచ్చదనం అడవి నిండుగా–పచ్చిక, పచ్చని చెట్లు, నిన్న రాత్రి వర్షంలో తడిసి మెరుస్తోన్న పరిసర ప్రపంచం… మొదలయిన సన్నపాటి తుంపర.

గంట తర్వాత కోటి అన్నదగ్గర రైలు మొదటి హాల్టు. బిలబిలా దిగిపోయిన ప్రయాణికులు. తేనీరు. అల్పాహారం. ఫోటోలూ సెల్ఫీలూ సరేసరి. ‘అవి సరే, అటు లోయలోకి చూడండి’ అని చెప్పాలన్న తహతహ. దాన్ని అరికడుతోన్న కామన్‌సెన్సు…

‘ఎక్కండి ఎక్కండి’ అంటూ రైలు కూత. అంతా ఎక్కేవరకూ కిందనే ఉండి ఆజమాయిషీ చేసిన గార్డుగారు. బయల్దేరి వేగం పుంజుకున్నాక ఎక్కాలని ఉబలాటపడే యువకిశోరాలు. అన్నట్టు ఆ రైలు వేగం బహు సరళం. ఇరవై పాతిక కిలోమీటర్లు మించదు. ‘జీవితం కూడా ఇంత సరళంగా గడుపుకోవాలోయ్’ అని అందంగా చెబుతోందా అనిపించింది.

కొండదారి కదా, మెలికల మెలికల, మలుపుల మలుపుల రైలు మార్గం. ప్రతి మలుపులోనూ వంపు తిరిగి కనిపించే రైలు… పచ్చని వనాల మధ్య రంగురంగుల బండి. ఎన్ని ఫోటోలు తీసినా తీరని తనివి. కాస్త ఎత్తుకు చేరి లోయలు దాటేటపుడు వంతెనలే వంతెనలు… విల్లులా వంగిన నిర్మాణం… వరసాగ్గా కనిపిస్తోన్న సొరంగ మార్గాలు… ఈ రైలు మీద కనీసం ఇరవైసార్లు ప్రయాణం చేసి ఉన్నా మొట్టమొదటిసారి ఎక్కినంత సంబరం…

చిక్కబడిపోయిన అడవి, పల్చబడుతోన్న జనావాసాలు. హఠాత్తుగా ధర్మపురం అన్న ఒక మోస్తరు పట్నం. మళ్ళా ఈ ఇళ్ళ మధ్యకు చేరాం ఏమిటీ అన్న చిరాకు. ఎదురుచూస్తోన్న బరోగ్ టన్నెల్… టన్నెల్ నెంబర్ 33… పదకొండు వందల మీటర్ల పొడవు. కల్కా-సిమ్లా మార్గంలో అతి పొడవాటి సొరంగం.

టన్నెల్ దాటీదాటగానే బరోగ్ స్టేషన్. సిమ్లా వరకూ దూరం లెక్కపెడితే ఇది మధ్య బిందువు. ప్రతి రైలూ ఇక్కడ పదీపదిహేను నిముషాలు ఆగుతుంది. ప్రకృతి సౌందర్యం దృష్ట్యా ఇదో అద్వితీయమైన ప్రాంతం. ఎదురుగా పరచుకొన్న సువిశాలమైన లోయ. లోయకు అటు చివర పర్వతాల దొంతరలు. లోయనూ పర్వతాలనూ కమ్ముకుంటూ తెల్లని మేఘాలు. ఆ మేఘాల మధ్యనుంచి తొంగిచూసే చిరుగిరి శిఖరాలు. తనివితీరని దృశ్యమది!

మరొక్క పావుగంటలో సోలన్ స్టేషన్. మరో ముఖ్యమైన పట్నం. మోహన్ మీకన్స్‌ వాళ్ళ బ్రూవరీ ఒకప్పుడు ఆ ఊరికి అన్ని విధాలా కేంద్రబిందువు. ఇపుడా ఊరు అష్టపాదిలా విస్తరించి సిమ్లా చిన్నతమ్ముడిలా కనిపిస్తోంది. ఈసారి నా ప్రయాణానికి అదే ఆఖరి బిందువు. బండి దిగేసరికి పావుతక్కువ తొమ్మిది.


“ఆగాగు, నా ఫోటో తియ్యక!” ఆంగ్లంలో కఠినమైన సూచన. ఎవరా అని చూశాను. ఎర్ర టీషర్టు, నిర్లక్ష్యపు నడక, స్వేచ్ఛాపతాకలాంటి ముఖకవళికలు.

“అయ్యో! సారీ, నొక్కేశాను. నా ఉద్దేశం మనుషులు కాదు. ఊరిని ఉదయపు పూట కెమేరాలో ఒడిసిపట్టుకొనే ప్రయత్నం…” వివరించాను. రైలు స్టేషనూ, అక్కణ్నించి కనిపించే నగరపు శివార్లూ, మెయిన్ రోడ్డుమీద కనిపించే వాణిజ్య కోలాహలాలూ తియ్యాలన్నది నా ప్రయత్నం.

అతని కాఠిన్యంలోనే ఏదో ఆకర్షణ కనిపించింది. ‘సరే సరే’ అంటూ విసవిసా వెళిపోతోన్న అతగాడిని వెంటబడి చేరుకుని నాకు తెలిసిన వివరమే అడిగాను: “ఇక్కడ్నించి బరోగ్ ఎంతదూరం?”

“తొమ్మిది.”

“రెండున్నర గంటలు చాలా?”

“ఎందుకూ! బస్సు పట్టుకో, అరగంట.”

“కాదు కాదు, నడచే వెళ్ళాలి,”

ఎగాదిగా చూశాడు. అర్థమయినట్టుంది. యవ్వనపు మలిదశలో ఉన్న అతని మొహంలో చిరునవ్వు.

“ఏ ఊరూ? ఏం పనిమీద వచ్చావూ?”

చెప్పాను.

“సరే. నీ పనికి సరి అయిన మార్గం రైలు దారి వెంబడే నడచివెళ్ళడం. కార్లూ బస్సుల హడావుడి లేకుండా అచ్చమైన ప్రకృతిలో నడవవచ్చు. దగ్గర దారి కూడానూ… పద, రైలు మార్గం దగ్గర నిన్ను వదిలివస్తాను.”

కలసి ఓ పది నిముషాలు. అతనూ ఢిల్లీ మనిషే. అక్కడ ఇల్లు వుంది. కానీ మూలాలు హిమాచల్‌కు చెందినవి. సోలన్‌లో అతనికో షాపుంది.

మెయిన్ రోడ్డు నుంచి ఎడమకు మళ్ళి ఇళ్ళమధ్యలోంచి సాగుతోన్న ఓ సన్నపాటి మార్గం చూపించాడు. “ఓ రెండొందల గజాలు ముందుకువెళ్ళు. కుడివేపున గుడి కనిపిస్తుంది. అక్కడ కిందకు దిగు. రైలుబాట కనిపిస్తుంది. బరోగ్ దారిలో రెండో సొరంగం తర్వాత ఓ చిన్నపాటి నీళ్ళ పుంత ఉంది. ఆ నీళ్ళనిండా ఆరోగ్యమే ఆరోగ్యం. అక్కడ ఆగి తప్పకుండా నీళ్ళు తాగు.”

ఆ సన్నపాటి సందులో మొదటి అంతస్తులో కాఫీ కప్పుతో మమ్మల్ని గమనిస్తూ ఓ మధ్యవయసు మహిళ… నేను నడక సాగిస్తోంటే ముందు సందేహం సందేహంగా. తర్వాత కాస్తంత సంకోచంగా… చివరకు పలకరింపుగా అరచిరునవ్వు. ఆ క్షణాన్ని అక్కడే పదిలంగా నిలుపుకోవాలన్న నా ఇంగితం…

రైలు బాట మీదకు దిగీ దిగగానే దాన్నో కాలిబాటలా వాడుతోన్న స్థానికులు. ‘తప్పేమో’ అన్న సంకోచం తొలగగా సంతోషంగా ముందుకు… వంపు తిరగబోతున్న రైలు పట్టాలు… వంపు అవతల వెలుతురు వెల్లువ… ఎడమన అవతలి కొండలమీద విస్తరించిన ఊరు… కాసేపట్లో చిన్నపాటి సొరంగం. మా నాయన బాలయ్య ముఖచిత్రం లాంటి దృశ్యం. పక్కనే తోడుగా వస్తోన్న కారుల మార్గం.

ఇంతకుముందు ప్రయాణాల్లో దారిపొడవునా అడవి గులాబీలు కనిపించిన గుర్తు. ఋతువు కాదనుకుంటాను, ఈసారి వాటి ఉనికి లేదు. కానీ తెలుపూ ఎరుపూ నీలపు రంగుల్లో ఏవేవో పూలు. కెమేరాను నిలవరించే అడవి పూలు.

హఠాత్తుగా గమనిక. చుట్టూ పైన్ చెట్లు. భూమిని ధిక్కరిస్తూ ఆకాశంకేసి ఎగసి పెరుగుతోన్న పొడవాటి పైన్లు.

అరగంట. రెండో టన్నెలు. గోడకు అమర్చివున్న నీటిగొట్టంలోంచి జారుతోన్న జలధార. ఇదేనా ఆ ఎర్ర టీషర్టు మిత్రుడు అన్న నీటి చెలమ? అనుమానం.

“అవును, ఇదే. గొప్ప మహత్యమున్న నీళ్ళివి. పైన కొండలమీంచి వస్తున్నాయిగదా, ఔషధ గుణాలున్నవి.” నా అనుమానం తీర్చింది, అక్కడే మూడు నాలుగు పాత్రల్లో నీళ్ళు నింపుకొంటోన్న పంజాబీ మహిళ. పాత్రల్ని నెత్తిన నిలుపుకోడానికి నా సాయం. ‘థాంక్యూ’ అంటూ ఆమె ఆశ్చర్యపరచడం. ఇంగ్లిష్ తెలిసిన మనిషన్నమాట!

ఏవేవో చిన్నిచిన్ని పిట్టలు… కిలకిలారావాలు… ఉదయపు క్రీడలు… చెట్లమీంచి పట్టాలమీదకూ, పట్టాలమీంచి పొదలమీదకూ… వాటిల్ని కెమేరాతో పట్టుకొనే ప్రయత్నం. చివరికి పట్టాలమీద దొరికిన పిట్ట.

అరకొర చినుకులు కాస్తా సన్నపాటి జల్లుగా మారగా తడవటానికి జుట్టంటూ లేకపోయినా తలకో షవర్ కాప్, ఒంటికి తగిలించిన చిన్నపాటి పల్చని విండ్ ఛీటర్. నిజానికి వాటి అవసరంలేదనీ, ఆ జల్లుకు లొంగటంలోనే ఆనందముందనీ తెలుసు. అయినా మరో నాలుగయిదు గంటలు తిరుగాడాలి కదా, కాస్తంత పొడిగా ఉంటే బావుండదూ…

సోలన్‌లో నడక మొదలెట్టి గంటన్నర… చాలావరకూ వాహనాల రొద వినిపించి వెంబడించినా అక్కడక్కడ అచ్చమైన అడవి కప్పు. రైలు పట్టాలమీదా, రైలు ఇనుప స్లీపర్లమీదా మెరుస్తోన్న వర్షపు వెలుగులు. పైన్ చెట్ల వరుసల మధ్య నుంచి సాగిపోతోన్న మెలికల రైలు బాట… దారిలో కనిపించే మనుషులు. హలోలు… రామ్‌రామ్‌లు… ఏ శబ్దాలూ, మనుషుల అలికిడులూ లేని కట్టిపడేసే ఏకాంత బిందువులు. సమయపు స్పృహను పక్కనబెట్టి ఏకాంతపు అందాన్ని అందుకోవటం.

‘అదిగో ద్వారక, ఆలమందలవిగో’ బాణీలో ఓ మలుపు తిరగగానే- అదిగో బరోగ్ స్టేషను…


ఆ స్టేషనుతో నా పరిచయం వయసు నలభైనాలుగేళ్ళు. నేను తొలిచూపులో ప్రేమలో పడిన అనేకానేక ప్రదేశాల్లో ఇదీ ఒకటి.

ఒక కొండ వాలున… సొరంగపు చెంతన… రెండు జతల పట్టాలు… చిన్నపాటి వెయిటింగు రూము. ఎదురుగా అతి సుందరమయిన రిటైరింగ్ రూముల చిరుభవనం. కాస్తంత పక్కన ఆంగ్ల వాస్తురీతిలో స్టేషను సిబ్బంది ఆఫీసు. ప్లాట్‌ఫామ్‌ మీద టీ దుకాణాలు, ఛోలే భటూరే స్టాలు. ఆ సమయంలో వచ్చే ప్రయాణీకులకు అది అల్పాహార స్థానం.

చేరేసరికి పదిన్నర.

నిజానికి నేను నాలుగు దశాబ్దాలు లేటుగా చేరాననాలి… ఆ స్టేషను దాటిన ప్రతిసారీ దిగిపోవాలనిపించేది. దిగి ఒక పూట గడపాలనిపించేది. ఆ చక్కని ప్రాంతంలో కలసిపోవాలని కల. కల. కల.

ఆ కల ఈనాటికి సాకారమయింది.

నా తిరుగు బండి పావుదక్కువ రెండింటికి. మూడు గంటలు నావంటే నావే అక్కడ.

కడిగిన ముత్యంలా స్టేషను ఆవరణ మెరిసిపోతోందిగానీ చూద్దామంటే ఒక్క మనిషీ కనిపించలేదు. చివరికి ఆఫీసు భవనంలోంచి బయటకు వస్తోన్న పాయింట్స్‌మెన్…

“టీ ఏమన్నా దొరుకుతుందా? టిఫినూ?”

“అదిగో, ఆ రిటైరింగు రూముల పక్కనే రెస్టారెంటు…”

వెళ్ళాను. లోపల బిజీబిజీగా ఓ యూనిఫామ్ మనిషి.

“టిఫిను… కాఫీ…” మరీ ఆశకు పోతున్నానా?

“టిఫిను కాదుగానీ సాదా పరోటా, కూరా ఇస్తాను. కాఫీనా… సరే ఇస్తాలే,”

“షుగర్లేకుండా…” భయంభయంగా.

“ఊ.”

పొగలుగక్కే రుచి నిండిన బంగాళాదుంపల కూర. వేడి వేడి పరోటాలు. ఆశ్చర్యం! అతి చక్కని కాఫీ… ఏమి నా భాగ్యం!

బయట జల్లు పెద్దదయింది.

మా రెస్టారెంటున్నది ఆ భవనపు మొదటి అంతస్తులో.

అప్పటికే చనువు వచ్చేసింది. రెండు కుర్చీలు బయట వరండాలో వేసుకొని దిగువున రైలుపట్టాలూ ప్లాట్‌ఫామూ చూస్తూ, కురిసే జల్లును మురిపెంగా పలకరిస్తూ… ఎవరో గొడుగు వేసుకొని నడచి వెళుతున్నాడు. చెయ్యి ఊపాను. ఇంకా మనసాగక ‘రామ్‌రామ్‌జీ’ అని పలకరించాను. స్పందించాడు. నడచివెళ్ళి అక్కడే ఓ పూలచెట్టు దిగువున ఉన్న ఛోలే భటూరే స్టాల్‌లో స్టవ్ అంటించసాగాడు.

విడవలేక విడవలేక రెస్టారెంటును వదిలి దిగువకు.

వర్షం కోసం నేను తెచ్చిపెట్టుకొన్న పారదర్శకపు రెయిన్‌కోటు విప్పాను. దానికో కథ వుంది. 2015లో మా పాప మిన్నీ కాన్వొకేషన్ డ్యూక్ యూనివర్సిటీ డరమ్‌లో జరిగింది. ఆ వేడుక ఓ బేస్‌బాల్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఆ ముందటి రాత్రి భోరున అకాల వర్షం. మర్నాటి కార్యక్రమం నీరుగారుతుందా అనుకొంటూ వెళితే రాత్రికి రాత్రి కొన్ని వేల ‘వాడి పారేసే’ మాదిరి రెయిన్‌కోట్లు తెప్పించి తలా ఒకటి ఇచ్చారు. పారెయ్యకుండా జ్ఞాపకంగా తెచ్చుకొన్నాను.

అలాగే పాదరక్షలు. నేను మామూలుగా వాడేవి కాన్వాసు నిండిన వాకింగ్ షూస్. వర్షం కోసమని అతి తేలికపాటి బిగించడానికి బెల్టులు వున్న సాండల్స్ తీసుకువెళ్ళాను. నయాగరా జలపాతం దగ్గర నీటికిందకు వెళ్ళినపుడు ఇచ్చిన సాండల్సవి. అప్పటి జ్ఞాపికలు ఇపుడు వర్షపు నడకకు అనుకూలపు పాదరక్షలు.

అన్నీ ధరించి, అన్నీ బిగించుకొని, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌లా మేడ దిగి నేలమీద అడుగుపెట్టాను.

స్టేషన్‌లో కోలాహలపు జాడలు…

ఓ పావుగంట పరిసరాలను అడుగడుగునా పలకరించి మరోసారి కాఫీ తాగాలనిపించి అడిగితే, కుదరదు, రైలొచ్చే సమయం! అన్న జవాబు.

అదన్నమాట కోలాహలం.

కల్కా వెళ్ళే రైలు వచ్చి ఆగింది.

స్టేషను ఒక్కసారిగా పెళ్ళి కళ సంతరించుకొంది.

మా రెస్టారెంటు పెద్దాయన పరోటాలు, కూర పాకెట్లు పట్టుకొని ప్లాట్‌ఫామ్ మీదకు. అప్పటికే నేను రామ్‌రామ్‌జీ అని పలకరించిన ఛోలే భటూరే పెద్దాయన స్టాలు చుట్టూ మూగిన రైలు జనం. పక్కనే టీలూ సమోసాలకూ డిమాండ్. మరికొందరు ప్రకృతి ప్రేమికులు ముందుకువెళ్ళి లోయలో రహస్య సౌందర్యాలు వెదకడం. జంటలు, బృందాలు, ఫోటోలు, సెల్ఫీలు, ఒకటీ అరా విదేశీ యాత్రికులు, అతి కొద్దిగా పొగరాయుళ్ళు, సీట్లోంచీ కంపార్ట్‌మెంటులోంచీ కదలకుండా కూర్చున్న నిమ్మకు నీరెత్తిన జ్ఞానులు, అవీ ఇవీ తెమ్మని పురమాయిస్తున్న కూతుళ్ళూ భార్యలూ, కూతపెట్టిన రైలు, పట్టాలమీంచి ఎగిరిపోయిన పిట్టలు, పెట్టెల్లో సర్దుకొన్న ప్రయాణాల పక్షులు… ముందుకు సాగడానికి సర్వం సంసిద్ధం.

రైలు సొరంగంలోకి వెళుతోన్న దృశ్యాన్ని ఫోటో తియ్యాలని తట్టింది. గబగబా వెళ్ళి ఓ చక్కని ప్రదేశంలో కాపువేశాను. రైలింజను సొరంగంలోకి వెళ్ళీవెళ్ళగానే ఫోటోగాదు, వీడియో తియ్యి అని మెదడునుంచి ఆజ్ఞలు.

మెల్లగా, మెలమెల్లగా ఒక్కో కంపార్టుమెంటూ సొరంగంలోకి దూరిపోతుండగా, చిట్టచివరి ఇంటూ గుర్తు ఉన్న గార్డుగారి పెట్టెకూడా అదృశ్యమయ్యాక, వీడియో తీసేశాక…

అంతా నిశ్శబ్దం. అంతటా నిశ్శబ్దం. దాన్ని ఛేదిస్తూ, ‘పద, కాఫీ ఇస్తాను,’ అన్న రెస్టారెంటాయన పిలుపు.


రైలు కోసమే అన్నట్టుగా తెరిపి ఇచ్చిన వర్షం మళ్ళీ జోరందుకుంది. నేనింకా నా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఆహార్యం వదలనేలేదు. టైము చూశాను. నా ఒకటి ముప్పావు బండికి ఇంకా గంటన్నర టైముంది.

మళ్ళీ సోలన్ వేపుగా ఒక గంటసేపు తిరిగొద్దాం అనిపించింది. నీటి ధారవరకూ వెళ్ళిరావడానికి సమయం సరిపోతుంది. ఆ ఒకటీ ఒకటిన్నర కిలోమీటర్ల ప్రాంతంలో అచ్చమైన ప్రకృతి ఉందికూడానూ.

అడుగటు వేశాను.

ఎదురుగా వస్తూ ముగ్గురు మనుషులు. ఒక మధ్య వయస్కుడు, అతనికి గొడుగు పడుతూ ఓ పసి యువకుడు. పక్కనే వర్షంలో తడుస్తూ మరో యువకుడు.

ఆ యువకులు ఇంతకుముందు తటస్థపడినవాళ్ళే. గుర్తుపట్టి పలకరింపుగా నవ్వారు. పెద్దాయన ఏకంగా సంభాషణలోకి దిగిపోయాడు. రెండు నిముషాల్లో అర్థమయిపోయింది- పట్టపగలే అయినా ఆ మహానుభావుడు మహామత్తులో ఉన్నాడని.

“అంకుల్! ఈయన మా మేనమావ. తాగుడుకు అలవాటుపడిపోయాడు. వెదికి తీసుకురావడానికి వెళ్ళాం. కొంచం మీరన్నా తాగుడు మానమని చెప్పండి.” కుర్రాళ్ళ వేడ్కోలు!

నేనా! ఎలా చెప్పనూ? ఇరవై ఒక్క రోజులపాటు కాఫీ (రోజుకు ఐదారు), ఫేస్‌బుక్ (మూడునాలుగు గంటలు) మానేస్తేనేగదా నాకు చెప్పే అర్హత… అయినా కుర్రాళ్ళు అడిగారుగదా అని ఉపదేశం మొదలెట్టాను.

“ఎందుకయ్యా ఈ దురలవాటు… తీరని సమస్యలున్నాయా? లేకపోతే మరి ఎందుకీ వ్యసనం? ఎంతమందిని దుఃఖపెడుతున్నావో తెలుసా? ఆరోగ్యం సంగతేమిటీ?” రెచ్చిపోతున్నట్టు తెలిసిపోయింది. ఆనకట్ట వేశాను. అతను నవ్వుతూ వింటున్నాడు.

అసలీ సలహాలు, మందలింపులకన్నా పెద్ద వ్యసనం మరోటి లేదు! వినేవాళ్ళుండాలేగానీ సలహాలకేమీ?! వందలు వేలు గంగా ప్రవాహంలా ఉరకలువేయవూ!

పానప్రియునికి హితవచనాల ఘట్టం కట్టిపెట్టి ముందుకు సాగాను.

ఇందాక ఇటే వచ్చాగదా, తెలిసిన మార్గం అనిపించేసింది. అందమైన ప్రదేశాలూ, ఆగి చూడవలసినవీ, కాస్సేపు పచ్చికలో చేరగిలబడవలసినవీ, పలకరించవలసిన వృక్షాలూ, రైలు మార్గపు వంపులూ, పువ్వులున్న ప్రదేశాలూ…

హఠాత్తుగా ఓ భావన… ఎరుక… నేను ఉండాల్సింది ఈ అడవులూ చెట్లూ మధ్య కదా… వినవలసినది ఈ నిశ్శబ్ద సంగీతాలను కదా… ఆలకించవలసిందీ రుతురాగాలను కదా…

ఈ భావన, అనుభూతి కొత్తేంగాదు. ఒంటరి ప్రయాణాల్లో ప్రతిసారీ కాకపోయినా తరచుగా కలిగే భావనే ఇది.

అసలా భావన బలమే నన్ను ఇలాంటి ప్రదేశాలవేపుకు లాగుతూ ఉంటుందేమో!


“ఏంవాయ్! ఓ ఫోటో తీస్తావా?”

ఆ ప్రదేశాల మధ్య ఆ వాతావరణం మధ్య నా ఉనికిని పట్టుకొని దాచుకోవాలనిపించింది. మనిషికోసం చూస్తున్నా…

ఆగాడు. మొబైల్‌ని కెమెరా మోడ్‌లో పెట్టి అందించాను.

తీశాడు. ఏంగిల్సవీ చూసుకొన్నాడు. అటు నుంచో, ఇటు నుంచో అంటూ డైరెక్షనూ చేశాడు. తననూ తీస్తానంటే పోజు ఇచ్చాడు.

“ఏ క్లాసూ?”

“ఏడు.”

“ఇంగ్లీషు వచ్చా?”

“ఆరో క్లాసు నుంచీ మొదలయిందా సబ్జెక్టు…”

నా హైస్కూలు తొలి దినాలు గుర్తొచ్చాయి. ఆరోక్లాసులో ఏబిసిడిలు దిద్దడం గుర్తొచ్చింది.

“నాన్న ఏం చేస్తారూ?”

చెప్పాడు.

“అన్నలూ అక్కలూ?”

“అన్న తొమ్మిదో క్లాసు. అక్క ఎనిమిది.”

“వర్షంలో తడుస్తూ వెళ్తున్నావు… జలుబు చెయ్యదా?” కావాలనే కొంచం గిల్లాను.

“ఎందుకు చెయ్యదూ?! కానీ వర్షం వచ్చేదే మనం ఇలా తడవడానికి కదా…”

వహ్ రే వాహ్… భలే దొరికావు పిల్లాడా!

మాటలన్నీ మితంగా, సరళంగా… అతి ప్రసంగం లేదు. వయసుకు మించిన పరిణతి.

ఈసారి కెమేరా అందించాను. జూమ్ ఎక్కడుందో చూశాడు. మరి కాసిని ఫోటోలు. బోలెడు మితాక్షరపు కబుర్లు. ఇల్లు. చదువు. ఊరు. స్కూలు. స్నేహితులు. ఆటలు.

కబుర్ల మధ్య అంకుల్ అనిగానీ, సర్ అనిగానీ మర్యాదలు లేవు. నేనూ ‘ఏఁవోయ్, పిల్లాడా’లు కట్టిపెట్టాను.

కలిసి నడిచాడు. సెల్ఫీ తీసుకొన్నాం.

“నీటి ధార ఎంతదూరం?”

“దగ్గరే.”

అక్కడిదాకా తోడు వచ్చాడు. ‘అభీ నా జావో…’ అందామనిపించింది. వెళ్ళకుండా ఎంతసేపు అతన్ని అట్టేపెట్టగలనూ?!


తిరిగి తిరిగి స్టేషను చేరి చూసుకొంటే నా రైలుకింకా అరగంట టైముందని తేలింది.

ఛోలే భటూరే మనిషి రాబోయే రైలు కోసం సన్నాహాలు మొదలెడుతున్నాడు. పలకరించి మాటలాడదామనిపించింది. అతను పెట్టేవి కూడా తినేస్తే లంచ్ పని కూడా అయిపోతుందిగదా… అతనూ పలకరిస్తే పలికే మనిషే.

గలగలా కబుర్లు.

రాజస్థాన్ మనిషి. గత పాతికేళ్ళుగా బరోగ్‌లో, ఈ పనిలో. ఏభై దరిదాపు వయసు. అనుభవాలతో పండిన మొహం.

“ఇద్దరు కొడుకులు. పర్లేదు, బానే చదువుకొన్నారు. పెద్దాడు పన్నెండుతో ఆపేసి, పనిలోకి దిగిపోయాడు. పెళ్ళయింది. ఓ బాబు. రెండోవాడు బీకామ్ చివరి సంవత్సరం. ఇద్దరికీ ఒకటే మాట చెపుతూ ఉంటాను. మీ పెంపకం, బాగోగులు, చదువులు నా బాధ్యత. అవి తీరిపోయాయి. ఇహ మీ కుటుంబాలు, పిల్లలు, వాళ్ళ పెంపకం. అది మీరూ మీరూ చూసుకోవాలి. అందులో నా ప్రమేయం ఉండదంటే ఉండదు. నా బాధ్యత కాదు.”

అరే! ఇది నేను ఎప్పుడూ పాడే పాటే కదా! ఇపుడు అవే మాటలు ఈ మారుమూల మనిషి నోట!

అబ్బురమనిపించింది. దగ్గరి మనిషనిపించింది.

భటూరేలు వేయిస్తూనే అతను కబుర్లే కబుర్లు. అనుభవాలే అనుభవాలు. అందులోంచి కాచివడపోసిన అభిప్రాయాలు!

భావ సారూప్యం–తోబుట్టువుల మధ్య కూడా అమరితీరాలని రాసిపెట్టిలేని, భావ సారూప్యం!


రైలొచ్చింది.

ఆ స్టేషను నాదే అయినట్టూ, ఆ పెళ్ళి పెద్దల్లో నేనూ ఒకడినయినట్టూ, రైలునూ అందులోని యాత్రికులనూ రిసీవ్ చేసుకొంటోన్న ఫీలింగు!

తిరిగి చూసుకొంటే అంతా కలసి అక్కడ ఉన్నది ఎంతా?

ఐదారుగంటలు… అంతే!

ఇంత గ్రంథం ఆ అయిదారు గంటల్లోనే నడిచిందా?

ఇన్నిన్ని రాగాల మాలిక ఆ స్వల్ప వ్యవధిలోనే అమరిపోయిందా?!

ఆశ్చర్యమనిపించలేదు. మనసు శ్రుతి అయితే అది సాధ్యమేనని తెలుసు.

కానీ నా కాళ్ళను చూస్తే ఆశ్చర్యమనిపించింది. అప్పటిదాకా ఏ ఇబ్బందీ పెట్టలేదవి. నొప్పులూ, అలసటా అని అననే లేదు.

కానీ ఒకసారి రైలు ఎక్కగానే ఇహ కాళ్ళూ ఒళ్ళూ విరామం ప్రకటించేశాయి. కళ్ళు కూడా వాటితో చేరిపోయి కాసేపు కునుకు తీస్తాం అన్నాయి.

అయినా ఆనందం!

అయిదారుగంటలపాటు విశ్రాంతి అన్నమాట ఆలోచనల్లోకి రాకుండానే నా కాళ్ళ మీద నేను తిరుగాడగలిగాను.

ఫర్లేదు. మరి కొన్నాళ్ళు, కొన్నేళ్ళు అలా తిరగగలనన్న నమ్మకం, భరోసా… వయసు దాటిపోతోన్న ఈ మానవ యంత్రానికి తరచూ ఇలాంటి కార్యశీల నిర్ధారణలు అవసరం కదా!