దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 6

కార్తహేన, కొలంబియా

2022లో 18 రోజులపాటు మధ్య అమెరికాకు చెందిన ఏడు దేశాలూ తిరిగి చూశాక, 2023లో మరో 16 రోజులపాటు ఆ యాత్రను దక్షిణ అమెరికాకు కొనసాగించాను. ఆ ఖండంలో ప్రస్ఫుటంగా కనిపించే ఒకప్పటి ఇన్కా నాగరికత ఛాయలను దగ్గర్నించి చూడాలన్నది నా ముఖ్యమైన లక్ష్యం. అందుకు కొలంబియా, ఎక్వదోర్ దేశాలను ఎన్నుకున్నాను. భౌగోళికంగా చూస్తే, మధ్య అమెరికా యాత్రలకు ఆఖరి బిందువు అయిన పనమా దేశం పక్కనే ఉన్న కొలంబియాతోనే నా దక్షిణ అమెరికా ప్రయాణాన్ని ఆరంభించాలి. కానీ లండన్ నుంచి దక్షిణ అమెరికాకు చేర్చే విమానాల రాకపోకల లాంటి కారణాల దృష్ట్యా నా ప్రయాణాన్ని ఎక్వదోర్ నుంచి ఆరంభించాను. తొమ్మిది రోజులు ఎక్వదోర్‌లో గడిపాక మరో ఏడు రోజులపాటు కొలంబియాలో గడపడానికి 2023 ఫిబ్రవరి పన్నెండో తారీఖున కార్తహేన (Cartagena) నగరానికి చేరుకున్నాను.

దక్షిణ అమెరికాలోని పెద్ద దేశాలలో కొలంబియా ఒకటి. బ్రెజిల్, అర్హెంతీన, పెరు దేశాల తర్వాత కొలంబియాది నాలుగవ స్థానం. పోల్చి చూస్తే వైశాల్యం విషయంలో యునైటెడ్ కింగ్‌డమ్‌కన్నా అయిదు రెట్లు పెద్దది. యు.ఎస్. లోని టెక్సస్, కాలిఫోర్నియా రాష్ట్రాలు కలిపితే వాటితో సమానం. అటు అట్లాంటిక్ తీరరేఖ, ఇటు పసిఫిక్ తీరరేఖా కలిగిన ఏకైక దక్షిణ అమెరికా దేశం కొలంబియా. దేశపు జనాభా 5 కోట్ల 30 లక్షలు; జనాభా పరంగా దక్షిణ అమెరికా ఖండంలో కొలంబియాది రెండవ స్థానం. ప్రపంచంలో స్పానిష్ భాష మాట్లాడే దేశాలలో కొలంబియాది మూడవ స్థానం. మెహికో, యు.ఎస్.ఎ.లు మొదటి రెండు స్థానాల్లో ఉంటే, తల్లిగడ్డ స్పెయిన్‌ది నాలుగో స్థానం మాత్రమే!

కొలంబియాలో జనవైవిధ్యం అపారం. జనాభాలో ఏభై శాతంమంది యూరోపియన్-ఆఫ్రికన్-నేటివ్ అమెరికన్లు కలగలసిన మిశ్రమజాతి మెస్తీహోలు. ఇరవై ఐదు శాతం శ్వేతజాతీయులు. తొమ్మిది శాతం ఆఫ్రికన్లు. నాలుగున్నర శాతం ఆ గడ్డకే చెందిన స్థానికులు. మతపరంగా కాథలిక్‌లు, ప్రొటెస్టెంట్లు కలగలసిన క్రిస్టియన్ దేశం. విభిన్న జాతుల, మతాల కలయికవల్ల, ఆ దేశంలో ఒక విలక్షణమైన లాటినో-కరేబియన్ సంస్కృతి రూపుదిద్దుకుంది.

జీవవైవిధ్యం పరంగా కొలంబియా ఉన్నతస్థాయికి చెందిన దేశం. మొత్తం ప్రపంచపు జీవవైవిధ్యంలో పదోవంతు కొలంబియాలో కనిపిస్తుంది. పక్షులూ లతల విషయంలో ఈ దేశానిది మొట్టమొదటి స్థానం. వృక్షాలు, సీతాకోక చిలుకలు, ఉభయచరాలు, మంచినీటి చేపల విషయంలో రెండవ స్థానం.

భాషలూ జాతులూ సంస్కృతుల సంగతి ఎలా ఉన్నా, నిన్నమొన్నటిదాకా నేరసామ్రాజ్యపు ముద్దుబిడ్డ అన్న అపఖ్యాతిని సంతరించుకున్న దేశం కొలంబియా. అసలు ఆ దేశంలో కాలుపెట్టడమంటేనే బయటిదేశాల సగటు మనషులు వెనుకాడేవారు. హత్యలు, దోపిడీలు, కిడ్నాపింగులు, మాదక ద్రవ్యాల అధినేతల గాంగ్‌వార్‌లు, విప్లవకారుల గెరిల్లా యుద్ధాలు – శాంతి అన్నది లేకుండా దశాబ్దాలపాటు తల్లడిల్లిన దేశమది. 2016లో విప్లవకారులకూ రాజ్యానికీ మధ్య జరిగిన ఒప్పందంవల్ల, పరిస్థితి చాలావరకూ మారింది. మాదకద్రవ్యాల వ్యాపారాధినేతలు అదుపులోకి వచ్చారు. దేశంలో శాంతిభద్రతలు గణనీయంగా పెరిగాయి. అయినా ఇప్పటికీ ‘కొలంబియా చూడటానికి వెళుతున్నాం’ అనగానే ‘హమ్మో! అక్కడికా’ అని గుండెల మీద చేతులు వేసుకొనేవాళ్ళే ఎక్కువ. గతకీర్తి అయినా అపకీర్తి అయినా ఏ మనిషినీ ఏ దేశాన్నీ అంత తొందరగా వదిలిపెట్టవనుకుంటాను!


ఫిబ్రవరి 12, ఉదయం ఎనిమిదిన్నరకు కార్తహేన నగరపు రఫాయేల్ నునేజ్ (Raphael Nunez) అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టాను. నా అలవాటు ప్రకారం ఒక వంద డాలర్లను కొలంబియన్ పెసోలలోకి మార్చుకున్నాను. ఊబర్ పట్టుకుని అరగంటలో హోటలుకు చేరుకున్నాను. టాక్సీ సముద్రపు ఒడ్డునే సాగే హైవే ద్వారా వెళ్ళింది కాబట్టి అరగంట… మామూలు రోడ్లలో వెళితే ఆ ఉదయపు పీక్ అవర్లో ఇంకా ఎక్కువ సమయం పట్టి ఉండేది.

దక్షిణ అమెరికాలోని పురాతన నగరాలలో కార్తహేన ఒకటి. కొలంబియా దేశపు ఉత్తరాన, కరేబియన్ సముద్రపు తీరాన ఉన్న రేవు పట్టణమది. దేశమంతటిలోకీ సుందరమైనదిగా పేరు పొందింది. కరేబియన్ ఆణిముత్యం – పర్ల్ ఆఫ్ కొలంబియా – అన్న ముద్దుపేరు సంతరించుకున్న నగరమది. పదిలక్షల జనాభా నివసించే కార్తహేన – కొలంబియాలో ఐదవ పెద్ద నగరం. దేశపు బొలీవార్ ప్రావిన్స్‌కు రాజధాని. 1533లో పెద్రో ఎరెదియా (Pedro Heredia) అన్న స్పానిష్ ఆక్రమణదారుడు తన మాతృసామ్రాజ్యపు అవసరాలకోసం ఈ నగరాన్ని స్థాపించాడు. ఈ ఎరెదియా, అతని అనుచరులు స్పెయిన్ దేశంలోని కార్తహేన నగరానికి చెందినవారు. తమ ఊరిమీది మమకారంతో, ఈ దక్షిణ అమెరికా నగరానికీ ఆ పేరే పెట్టారు. స్పష్టత కోసం, ‘కార్తహేన దె ఇండియాస్’ అన్నారు. అంటే ఇండియాలోని కార్తహేన అని అర్థమన్నమాట. ఆ రోజుల్లో తాము కనిపెట్టిన భూభాగం భారతదేశమే అని స్పానిష్‌వారు బాగా నమ్మారు.

స్పానిష్‌వారు రావడానికి ముందు ఇపుడీ నగరమున్న ప్రదేశంలో కలమారి (Calamari) అన్న చిరుగ్రామం ఉండేది. టైరోన (Tyrona), సిను (Sinu) అన్న స్థానిక తెగల వాళ్ళు ఆ కరేబియన్ తీర ప్రాంతాలలో నివసించేవారు. వీరికి మాయన్, ఇన్కా, అజ్టెక్‌ లాంటి వికసిత నాగరికతలు లేకపోయినా, స్వయం సమృద్ధమైన ఆర్థికవ్యవస్థ ఉండేది. ఆ ఆర్థిక పుష్టిని అమాయకంగా బయటవారి ముందు ప్రదర్శిస్తూ ఉండేవారు. అలా వారు ధరిస్తున్న బంగారు ఆభరణాలు స్పానిష్ వారిని ఆకర్షించాయి. ఆ ప్రాంతమంతా బంగారంతో నిండి ఉంది అన్న భావం – ఆశ – వారికి కలిగింది. వెరసి అక్కడ ఉందనుకొంటోన్న సంపద కోసమని, తాము ముందు ముందు నడపబోయే లాభసాటి వ్యవహారాలకు అనువుగా ఉంటుందనీ కార్తహేన నగరనిర్మాణాన్ని స్పానిష్‌వారు చేపట్టారు. అంతేగాకుండా ఆ కలమారి ప్రాంతం మగ్దలీనా నది సాగరసంగమ బిందువు దగ్గర ఉంది. ఆ విధంగా జలరవాణాకూ అనుకూలం. ఇన్ని కారణాలవల్ల నూతన నగర నిర్మాణానికి అది అన్నివిధాలా అనువైన ప్రదేశమని స్పానిష్‌వారు సహజంగానే భావించారు.

కొలంబియా అనే కాదు – మొత్తం దక్షిణ అమెరికా ఖండానికే కార్తహేన నగరం ఉత్తర ముఖద్వారం. స్పానిష్ ఆక్రమణదారులు కొలంబియా ప్రాంతాలలోనే గాకుండా, సుదూరపు పెరు దేశంలోనూ దోపిడీలూ లూటీలూ చేసి దోచుకున్న సంపదలను భద్రపరచడానికి కార్తహేన నగరాన్ని ఉపయోగించుకున్నారు. వాటిని దాయడానికి గిడ్డంగులు కట్టారు. ఆ సంపత్తిని ఓడలకెక్కించి స్పెయిన్‌కు పంపారు. ఆ ప్రక్రియలో కార్తహేన నగరం సాగరచోరులనూ ప్రైవేటు సైన్యాల అధినేతలనూ అయస్కాంతంలా ఆకర్షించింది. సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ అన్న ఇంగ్లీషు అన్వేషి-ప్రైవటీరు 1586లో నగరం మీద దాడిచేసి ఆక్రమించి, లూటీ చేశాడు. అలాంటి తోడేళ్ళ బారినుంచి కాపాడుకోడానికి స్పానిష్‌వాళ్ళు ఆ తర్వాత నగరాన్ని కోటగా మార్చి పటిష్టం చేశారు.


ఉదయం తొమ్మిదిగంటల ప్రాంతంలో కాసా లాస్ లోపెజ్ కార్తహేన అన్న మా హోటలుకు చేరుకున్నాను. గలాపగోస్ ద్వీపాలనుంచి కార్తహేనకు చేరడానికి అంతా కలసి 22 గంటల సమయం పట్టింది. నిన్న ఉదయం 11 గంటలకు పుయెర్తో అయోరా వదిలాను. టాక్సీ, బోటు, బస్సు, మూడు విమానాలూ మారి, ఈనాటి ఉదయాన 9 గంటలకు కార్తహేన చేరుకున్నాను.

విమానయానంలో రెండుచోట్ల కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఆగవలసి వచ్చింది. కీతో విమానాశ్రయంలో అయితే ఏకంగా తొమ్మిది గంటల లే-ఓవర్! అందులో అయిదు గంటలు ఆ ఎయిర్‌పోర్ట్ లౌంజ్‌లో గడిపాను. నా దగ్గర ఉన్న బార్క్‌లేస్ బాంక్ కార్డు పుణ్యమా అని ఆ లౌంజ్ సౌకర్యాలని అందుకోగలిగాను. నేను సాధారణంగా లౌంజ్‌లో గడపడానికి ఇష్టపడను. ఒకటేమో నాకుండే లే-ఓవర్‌ల వ్యవధి తక్కువ. రెండోది, ఆ కాసేపూ బోర్డింగ్ గేట్‌ల దగ్గర చేరి, అక్కడి జనసందోహాన్ని గమనించడం నాకు ఇష్టం. ఓ మారుమూల వాలుకుర్చీలో చేరగిలబడి ఉండిపోవడం నాకు గిట్టని విషయం. కానీ ఇలా ఏడెనిమిది గంటలు గడపాల్సి వచ్చినపుడు ఈ లౌంజ్ సదుపాయం అక్కరకొస్తుంది. భోజనం, పానీయాలు లభిస్తాయి. స్నానం చేసే సదుపాయం ఉంటుంది. తాజాతాజాగా మరుసటి విమానం ఎక్కవచ్చు… గలాపగోస్‌లోని బార్త్రాలో విమానం ఎక్కాక కీతో లోను, కొలంబియా దేశపు బొగొతా లోనూ విమానాలు మారి చివరికి కార్తహేనకు చేరానన్నమాట.

మా లాస్ లోపెజ్ హోటలు గది సంసారపక్షంగా ఉంది. ఒక్క మనిషికైతే సరిగ్గా సరిపోతుంది. రెండో మనిషికి ఆ గదిలో చోటంటూ లేనే లేదు! సుదీర్ఘ ప్రయాణం కదా – సరిగ్గా నిద్ర లేదు. కానీ ఆ మధ్యాహ్నంపూట నిద్రపోతే నిద్ర-మెలకువల సమతౌల్యం దెబ్బతింటుంది. అంచేత బాక్‌పాక్‌ని గదిలో పదిలపరచి వెంఠనే టౌను దారి పట్టుకున్నాను. నిద్ర సంగతి సాయంత్రం చూసుకోవచ్చు – కాస్తంత పెందరాళే నిద్రపోతే రేపటికి ఏ సమస్యా ఉండదు. ఊళ్ళోకి వెళ్ళేముందు రిసెప్షనిస్టు విక్టర్‌ను కదిపి, ఊరి వివరాలు తెలుసుకున్నాను. శాంతిభద్రతల గురించి వాకబు చేశాను. విక్టర్ స్నేహశీలి. నా ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పాడు. ఊళ్ళో ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేం గమనించాలి అన్న విషయాలు చక్కగా చెప్పాడు. నగరంలో శాంతిభద్రతలకు కొదవ లేదని భరోసా ఇచ్చాడు. పాతపట్నం లోను, ఊళ్ళోని గత్సెమని (Gatsemani) అన్న ముఖ్యమైన ప్రదేశంలోనూ నిక్షేపంగా తిరిగి రావచ్చునన్నాడు. ‘వీధుల్లో దుకాణదారులు జలగల్లా పీడిస్తారు. అది మాత్రం జాగ్రత్తగా కాచుకోండి’ అని హెచ్చరించాడు.

అంతకుముందు నేను చేసిన అధ్యయనమూ ఇపుడు విక్టర్ ఇచ్చిన సమాచారమూ సమన్వయించగా, ఊరిగురించి చక్కని అవగాహన వచ్చింది. స్థూలంగా ఊరు మూడు భాగాలుగా విభజింపబడి ఉంది: చరిత్ర నిండిన పాతపట్నం, పాతపట్నాన్ని ఆనుకొని ఉన్న గత్సెమని అన్న బొహీమియన్ సరళ సంస్కృతి నిండిన భాగం, ఊరి చివర బహుళ అంతస్తుల భవనాలతో కూడిన బోకా గ్రాందె (Boca Grande) అన్న ప్రదేశం. మా హోటలు ఊరి మధ్యన గత్సెమని ప్రాంతంలో ఉంది.

ఆ సమయంలో వాతావరణం ఏమంత సుఖంగా లేదు. వేడి, ఉక్క. మా హోటలు ఉన్నది రెసిడెన్షియల్ ఏరియాలో. అదంతా చూడచక్కని రంగుల ఇళ్ళతో నిండి ఉంది. అక్కడి ఓ షాపులో లోకల్ సిమ్ తీసుకున్నాను. ఫోను సమస్య తీరింది. ఆ వర్ణవైభవాన్ని తనివిదీరా చూసుకుంటూ పాతపట్నం వైపుకు దారి తీశాను.

నేను నడుస్తోన్న ఆ గత్సెమని ప్రాంతంలో ఎటుచూసినా ఉత్సవసౌరభం. రంగులు, జీవశక్తి, తనదైన విలక్షణ అస్తిత్వం – చూడగానే నన్ను ఆకట్టుకొంది. కొన్ని నివాసస్థలాలు కాస్తంత మొరటుగానూ గందరగోళంగానూ ఉన్న మాట నిజమే – అయినా అదో వింత ఆకర్షణ. పదేళ్ళ క్రితం వరకూ ఈ ప్రాంతం డ్రగ్స్‌కు సంబంధించిన నేరాలతో నిండి ఉండేదట. ప్రమాదకరమైన ప్రదేశంగా పరిగణించబడేదట. ఎంతో తక్కువ వ్యవధిలో పరిస్థితి మారింది. ఇపుడా వీధులన్నీ కళాకృతులతోనూ మ్యూరల్స్‌తోనూ నిండి ఉన్నాయి. కొన్ని కొన్ని రోడ్లయితే కుడ్య చిత్రాలతో నిండిపోయి పూర్తి నిడివి కళారూపాల్లా కనిపించాయి.

పాతపట్నం వేపు నడుస్తూ దారిలో మంచినీళ్ళు కొందామని ఓ పెద్దపాటి దుకాణం దగ్గర ఆగాను. దుకాణం తలుపుల దగ్గర, వెంట ఇద్దరు చిన్న పిల్లలున్న ఓ ఆడమనిషి నన్నాపింది. ఆకలిగొన్న పిల్లల కోసం పాలపొడి కొనివ్వమని సంజ్ఞల ద్వారా కోరింది. నాకో నియమముంది: యాచకులకు చేసే ఏ సహాయమైనా బిచ్చమెత్తడాన్ని మరింత ప్రోత్సహిస్తుంది అని నా నమ్మకం. అందుకని సాధారణంగా వాళ్ళను విస్మరిస్తాను. కానీ పసిపిల్లల తల్లి, పాలపొడికోసం అడుగుతోంటే కాదనలేకపోయాను. ‘సరే, షాపులోకి వెళ్ళి పాకెట్‌ని ఎంపిక చేసి తెచ్చుకోండి’ అన్నాను. ఆమె వెళ్ళింది. ఏకంగా రెండుకిలోల పాకెట్ పట్టుకొచ్చింది! విస్తుపోయాను. నా పరిస్థితి చూసి కౌంటరు దగ్గర కుర్రాడు ముసిముసి నవ్వులు నవ్వుకోవడం తెలుస్తూనే ఉంది. అయినా బిల్లు వెయ్యమన్నాను – 25 డాలర్లు! ఆవిడ థాంక్స్ చెప్పి, పాలపొడి పాకెట్ చేపట్టి అదృశ్యమైపోయింది. ఇదేమన్నా అపరిచితుల్ని మోసం చేయడానికి వేసిన ఎత్తుగడా?! తెలియదు. అయినా ఎక్కడో మనసులో – లేదు, ఆమెకు నిజంగా అవసరమయ్యే తీసుకుంది – అనిపించింది. మరి రెండు కిలోలు?! ముందటి రోజుల అవసరం కోసం ఆశ పడి ఉండవచ్చుగదా…

ఆ పాతపట్నం చుట్టూ 13 కిలోమీటర్ల దిట్టమైన కోటగోడ ఉంది. స్పానిష్‌వారి వలసపాలననాటి మూలనగరమది. ముందే అన్నట్టు, సాగరచోరుల తాకిడినుంచి నగరాన్ని కాపాడుకోవడానికి అంత దిట్టమైన గోడ కట్టుకోవలసి వచ్చింది. ఆ ప్రాకారసహితనగరాన్ని యునెస్కోవాళ్ళు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు.

శీర్షాన నిడుపాటి గంటస్థంభం ఉన్న బృహత్తర ధనుస్సు ఆకారపు ప్రవేశద్వారం మనల్ని ఆ పాతపట్నపు మొదటి కూడలి దగ్గరకు చేరుస్తుంది. ఆ కూడలి పేరు ప్లాసా లాస్ కోచెస్ (plaza los Coches). కూడలికి ఒక కొసన కార్తహేన నగర స్థాపకుడు పెద్రో ఎరెదియా విగ్రహముంది. అప్పటిదాకా ఎంతో సుందరంగా కనిపించిన ఆ కూడలి, అక్కడి బోర్డుమీద రాసి ఉన్న వివరాలు చదివాక పరమ వికృత సీమలా తోచింది. ఆఫ్రికానుంచి దోచుకొని తెచ్చిన బానిసల అమ్మకాలూ కొనుగోళ్ళకు కేంద్ర బిందువట ఆ కూడలి… అది తెలిశాక మనసు వికలమయింది.

బానిసల వ్యాపారం జోరుగా సాగిన 16-17 శతాబ్దాల కాలంలో, దాదాపు పది లక్షలమంది బానిసలు ఈ నగరంలో అమ్ముడు పోయారని ఒక అంచనా. ఆ రోజుల్లో, ఆ పరిసర ప్రపంచంలో, బానిస వ్యాపారంలో కార్తహేనదే అగ్రస్థానమట. ఇప్పటికీ ఆ నగరంలో కనిపించే గాఢమైన కరేబియన్ సంస్కృతికి అదిగో ఆ విషాదగతమే ఒక మూలకారణం అని చెప్పవచ్చు. అక్కణ్ణించి మెల్లగా నడచి కార్తహేన కథెడ్రల్ దగ్గర ఉన్న ప్రొక్లమేషన్ స్క్వేర్ చేరుకున్నాను. ఆ రోజుల్లో ముఖ్యమైన ప్రకటనలన్నీ ఇక్కడే చేసేవారట. స్పానిష్ వారినుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకొన్న మొదటి నగరాలలో కార్తహేన ఒకటి. ఆ ప్రకటన 1810లో ఈ కూడలి దగ్గరే జరిగింది.

అక్కడ ఉన్న కాసా రఫాయేల్ నునేజ్ (Casa Raphael Nunez) అన్న కొలంబియా దేశపు పూర్వ అధ్యక్షుని నివాస భవనం చూడగానే మనల్ని ఆకర్షిస్తుంది. 130 సంవత్సరాల క్రితం దేశానికి అధ్యక్షునిగా వ్యవహరించిన వ్యక్తి – ఈ రఫాయేల్ నునేజ్. ఆయన ఈ కార్తహేన నగరానికి చెందిన మనిషి; దేశవ్యాప్తంగా ప్రజలకు ఇష్టమైన నాయకుడు. ఊరి విమానాశ్రయానికి ఆయన పేరే పెట్టారు. ఆయన కేవలం నాయకుడే కాదు – కవి, రచయిత, స్వరకర్త, లాయరు కూడానూ! దేశపు రాజ్యాంగానికి రూపకల్పన చేసిన వారిలో ఆయన ఒకరు. మళ్ళా తమ జాతీయగీతానికి స్వరకల్పన చేసిందీ ఈ రఫాయేల్ నునేజ్ మహాశయుడే. ఇన్ని చక్కని లక్షణాలున్న వ్యక్తిని దేశప్రజలు నాలుగుసార్లు అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. అలా అక్కడ నాలుగుసార్లు అధ్యక్షునిగా ఎన్నికయిన ఒకే ఒక వ్యక్తి రఫాయేల్ నునేజ్. ఇపుడాయన నివాస గృహాన్ని మ్యూజియంగా మార్చారు.

అక్కడి కథెడ్రల్‌లో కాసేపు గడిపాక నా నడకను కొనసాగించాను. ఒంట్లో ఎక్కడో ఏదో అసౌకర్యంగా అనిపించింది. అందుకు అలసట, నిద్రలేమి కారణాలు అని సరిపుచ్చుకోబోయాను. ‘కాదు, ఇప్పటిదాకా మాకు కాఫీ పొయ్యకపోవడమే కారణం’ అంటూ కడుపులోంచి కేకలు వినిపించాయి. నిజమే. పొద్దుట్నించీ కాఫీ అన్నది పడలేదు. గబగబా కాఫీ కోసం వెతుకుతూ నడకను సాగించాను. ప్లాసా సాంతా దొమింగో అన్న కూడలి దారిలో కనిపించి నిలవరించింది. పరుగులు పెడుతూ వచ్చింది కాఫీ కోసమే అయినా ఆ కూడలి సౌందర్యం నన్ను కట్టిపడేసింది. ‘నగరంలోకెల్లా అందమైన ప్రదేశం ఆ కూడలి’ అని విక్టర్ చెప్పడం గుర్తొచ్చింది. జనజీవితం పలుముఖాలుగా సాగిపోతోన్న కూడలి అది. ఒక పక్కన చక్కని సాంతా దొమింగో చర్చి, మరో మూల శ్రద్ధగా వింటోన్న శ్రోతల కోసం లయబద్ధంగా సంగీతసృష్టి చేస్తోన్న కళాకారుడు… చర్చి ముందు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఫెర్నాందో బొతేరో అన్న కొలంబియన్ శిల్పి రూపొందించిన, ఒక పక్కకు ఒరిగి విశ్రమిస్తోన్న స్థూలకాయురాలి నగ్నప్రతిమ – ‘ల గార్డ గెర్త్రూదేస్’ (స్థూలకాయురాలు గెర్ట్రూడ్) కనిపించింది. బొతేరో రూపొందించిన శిల్పాలలో అంతర్జాతీయంగా పేరుపొందిన వాటిలో ఈ బొమ్మ కూడా ఒకటట!

అలా ఆ కూడలిని రెండు కళ్ళు నాలుగు చేసుకుని చూస్తూ ఉండగా కఫె సాన్ అల్బర్తో అన్న రెస్టరెంటు కనిపించి మళ్ళా కాఫీ కాఫీ అంటూ గుర్తు చేసింది. పైగా ఆ రెస్టరెంటు సైన్‌బోర్డులో దిగువన కనిపించిన – ‘కొలంబియా దేశంలోకెల్లా ఎన్నెన్నో అవార్డులు గెలుచుకొన్న కాఫీకి ఇది నిలయం’ అన్న పదాలు ‘పదపద రమ్మ’న్నాయి. వెళ్ళాను. ఒకప్పుడు నాకు ఎంతో ఇష్టమైన కొలంబియన్ కాఫీ జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి. 1990లలో యు.కె.లో స్థిరపడిన కొత్తలో, ఈ కాఫీ అన్న పదార్థం వేరువేరు దేశాలనుంచి వస్తోందని, ఒక్కో దేశపు కాఫీకి ఒక్కొక్క పరిమళం ఉంటుందనీ బోధపడింది. అది తెలిసాక కీన్యా, బ్రెజిల్, కోస్త రీకా, కొలంబియాలాంటి భిన్నదేశాల కాఫీలు రుచి చూశాను. వాటిల్లో కొలంబియన్ కాఫీ నా మనసును దోచుకుంది. చాలా ఏళ్ళపాటు ఆ కాఫీనే కొని వాడుతూ ఉండేవాడిని. ఏళ్ళు గడిచే కొద్దీ అలాంటి సున్నితత్వాలకు దూరమయ్యాను. ఇపుడు ఎక్కడ ఎలాంటి కాఫీ దొరికినా తాగి సంతృప్తిపడే స్థితికి చేరుకున్నాను… యాత్రికుడికి ఇలాంటి సున్నితత్వాలు వదిలించుకోవడమూ అవసరమేననుకొంటాను. బయట ఎండ మండుతోంది. దానితోపాటు ఉక్క. ఆ స్థితిలో వేడివేడి కాఫీ తాగటం అనుచితం అనిపించింది. కోల్డ్ కాఫీ ఆర్డర్ చేశాను. పాలులేని కాఫీలో ఐసు ముక్కలు విరివిగా వేసి అందించారు. చక్కని రుచి.

ఊళ్ళోని ఆరుబయలు ప్రదేశాలూ ముఖ్యమైన కూడళ్ళూ మహాదివ్యంగా రాజసంతో వెలిగి పోతోంటే, కాస్త పెడగా వెళితే కనిపించే నివాసస్థలాల్లోని వీధులు ముద్దుగా, అందంగా, అమాయకంగా కనిపించాయి. లేత రంగుల వలసకాలపు ఇళ్ళు, వాటికి ఉన్న చెక్క బాల్కనీలు; ఆ బాల్కనీలు పై అంతస్తులమీంచి వీధుల్లోకి చొచ్చుకువచ్చిన తీరు ముచ్చటగొలిపింది. వాటికి తోడు ఇళ్ళముందంతా బోగన్ విలాలాంటి క్రీపర్లతో నిండి మనోహరంగా అనిపించింది. ఆ వీధుల్లోనే పచ్చదనం నిండిన చిట్టి కూడళ్ళు అనేకం కనిపించాయి. ఆ సుందరసీమలో మహదానందంగా నా నడకను సాగించాను. సామాన్య ప్రజానీకం నివసించేది, తమ దైనందిన కార్యకలాపాలు నిర్వహించేదీ ఇదిగో – ఇలాంటి ముచ్చటైన ప్రాంగణాల్లోనే. వాళ్ళంతా తమతమ పనుల్లో మహా విలాసంగా నిమగ్నమై ఉండటాన్ని గమనించడమే నాకు దక్కిన అతి చక్కని అనుభవం అనిపించింది.

అలా నడచి నడచి ల సెవీచేరియా కార్తహేన (La Cevichería) అన్న సుప్రసిద్ధ సీ‌-ఫుడ్ రెస్టరెంటు దగ్గరకు చేరాను. పచ్చని చెట్లు గొడుగు పడుతోన్న ఒక చిట్టి కూడలిలో ఉందా రెస్టరెంటు. ఆంథొనీ బోర్డెన్ (Anthony Bourdain) అన్న టీవీ హోస్టు నిర్వహించిన వంటల కార్యక్రమం – నో రిజర్వేషన్స్, ఈ రెస్టరెంటుకు ఖ్యాతిని సంతరించి పెట్టింది. అప్పటికింకా భోజనాల సమయం అవలేదు. అయినా ఒక చిన్న బృందం అప్పటికే ఆ రెస్టరెంటుకు వచ్చేసి చక్కని టేబులు సంపాదించే ప్రయత్నం చెయ్యడం నాకు కనిపించింది. నేను కూడా కాస్త ముందుగా రావడం మంచిదయిందన్నమాట. అందరం ఓ చివర చక్కని టేబుళ్ళు సంపాదించగలిగాం. నావరకూ నేను ఓ కొలంబియన్ బాణీకి చెందిన మిశ్రమ సీ-ఫుడ్ సెవీచెని ఆర్డర్ చేశాను. అప్పటికే నేను చిలె, పనమా, ఎక్వదోర్ దేశాలలో సెవీచెలని రుచి చూశాను. ఇదిగో ఇపుడు ఈ కొలంబియన్ సెవీచె. ఎక్వదోర్‌లో నేను రుచి చూసిన సెవీచెలు తడిగా రసాలూరుతూ ఉండేవి; ఈ కొలంబియన్ సెవీచె అందుకు భిన్నంగా, పొడిపొడిగా ఉంది. అయినా రుచిగా ఉంది. పైగా నాకు లభించిన సెవీచె పరిమాణంలో ఘనంగా ఉంది. రొయ్యలూ చేపలూ కలగలసిన సెవీచె అది. వాటితోపాటు పొడవాటి అరటి చిప్సు, అరపండిన మామిడి ముక్కలు సరేసరి.

పాతపట్నపు శోధనలో నాకు తటస్థపడి, చెరగని జ్ఞాపకంగా మిగిలిన వ్యక్తి సాన్ పెద్రొ క్లెవేర్ (San Pedro Clever). నల్లవారి స్వేచ్ఛావాణిగా పేరుపొందిన మనిషి ఆయన. 1580-1654 మధ్య జీవించిన స్పానిష్ మిషనరీ. కార్తహేన బానిస విపణిలోకి వస్తోన్న నల్లవారిని చూసి, కదిలిపోయి, వారి శ్రేయస్సు కోసం, స్వయంగా మతబోధకుడు కూడా అయిన క్లెవేర్ 40 సంవత్సరాలు ఎంతగానో పాటుపడ్డాడు. మూడు లక్షలమంది నల్లవారికి బాప్టిజమ్ ఇప్పించి రక్షించాడు. అలా బాప్టిజమ్ ఇచ్చాక, వాళ్ళందరికీ సాటి మతస్తులుగా పౌరహక్కులు లభించడం కోసం ఎంతగానో పాటుపడ్డాడు. వాళ్ళు పనిచేస్తోన్న ప్లాంటేషన్ భూములకు వెళ్ళి అక్కడి యజమానులను, ‘వీరందరినీ మనుషులుగా చూడండి’ అని అర్థించాడు. సాధించాడు. ఆ క్రమంలో ఆయన, బానిసలందరికీ రక్షక దూతగా పరిణమించాడు. స్వయంగా తనను తాను ‘బానిసలకు బానిస’ అని ప్రకటించుకున్నాడు. అతని నిస్వార్థ సేవలకు వాటికన్ చర్చి 1888లో అతడిని సెయింట్‌గా గుర్తించి గౌరవించింది. మరణానంతరం అతడిని నగరంలోని సెయింట్ పెద్రొ క్లెవేర్ చర్చి ప్రాంగణంలో ఖననం చేశారు. అతడు అక్కడ గడిపిన సమయానికి చెందిన జ్ఞాపకాలు, వివరాలతో ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. అతను నివసించి, మతబోధలు చేసిన అతి సామాన్యమైన ఇంటిని కూడా ఎంతో జాగ్రత్తగా పదిలపరచారు. పాతపట్నంలోని ఓ విశాలమైన కూడలికి అతని పేరు పెట్టారు. మరణించి మూడున్నర శతాబ్దాలు దాటినా ఇప్పటికీ అతనిని కార్తహేన నగరం తన జ్ఞాపకాలలో పదిలంగా దాచుకొంది.

ఊళ్ళోని ఎన్నో చర్చిల ప్రాంగణాలలో విశాలమైన కూడలి ప్రదేశాలు ఉన్నాయి – మళ్ళా వాటి చుట్టూ గంభీరమైన భవనాలు… అలాగే అక్కడ నగరపు చరిత్రకూ సంస్కృతికీ సంబంధించిన వ్యక్తుల జ్ఞాపకార్థం నిర్మించిన ఎన్నో కట్టడాలు కనిపించాయి. ఆంగ్లభాషాసీమ నుంచి వచ్చిన నాకు ఆయా వ్యక్తులతోను, వారి కృషితోనూ పరిచయం లేకపోవడంవల్ల వారి ప్రాముఖ్యాన్ని గ్రహించలేకపోయాను. కానీ స్పానిష్ జానపద వాగ్గేయకారుడు సెర్బాన్తేస్ (Cervantes) ప్రతిమను గుర్తించి ఆనందించగలిగాను. డాన్ కిహోత్తె (Don Quixote) అన్న సుప్రసిద్ధ పాత్రను సృష్టించింది ఈ వాగ్గేయకారుడే… తన మేజా ముందు కూర్చుని రాసుకొంటోన్న భంగిమలో మలచిన శిల్పమది. స్పానిష్ ప్రపంచపు షేక్‌స్పియర్ ఈ సెర్బాన్తేస్. స్పానిషేతర ప్రపంచాలలో కూడా పరిచయం అవసరం లేని ప్రముఖవ్యక్తి ఈయన.

ఊళ్ళో నా నడక కొనసాగి, సిమోన్ బొలీవార్ ప్లాజా దగ్గర తేలింది. అక్కడే ఇంక్విజిషన్ పాలెస్ కూడా ఉంది. ఆ భవనపు మొదటి అంతస్తులో అప్పటి స్పానిష్ అధినేతల ఇంక్విజిషన్ పద్ధతులను ప్రదర్శించే వివరాలతో ఓ మ్యూజియం ఉంది. మతవ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని విచారించి శిక్షించడానికి కాథలిక్ వ్యవస్థ ఏర్పాటు చేసిన పద్ధతి ఈ ఇంక్విజిషన్. గెలీలియోలాంటి శాస్త్రవేత్తలు కూడా తమ నమ్మకాలూ పరిశోధనల ఫలితాల పుణ్యమా అని ఈ ఇంక్విజిషన్ బారిన పడినవారే. ఇక్కడి మ్యూజియంలో అప్పటి శిక్షా పద్ధతులు – అన్నిటికన్నా ఘోరమైనది వేదిక మీద సజీవ దహనం – వివరంగా మనకు కనిపిస్తాయి.

సిమోన్ బొలీవార్ – దక్షిణ అమెరికా జనజీవనసరళిలో అణువణువునా ఇమిడిపోయిన వ్యక్తి. 19వ శతాబ్దపు తొలిదినాలవరకూ ఎన్నో దక్షిణ అమెరికా దేశాలు మూకుమ్మడిగా స్పానిష్‌వాళ్ళ పాలనలో కునారిల్లుతూ ఉండేవి. ఆ సమయంలో జరిగిన స్వాతంత్ర్యపోరాటాలకు బొలీవార్ నేతృత్వం వహించాడు. ఆ పోరాటాలకు కార్తహేన నగరపు ప్రాకార ప్రాంగణాన్ని కొంతకాలంపాటు తన స్థావరంగా చేసుకున్నాడు. ఆ సమయంలో ‘కార్తహేన మానిఫెస్టో’ అన్న ముఖ్యమైన రాజకీయపత్రానికి రూపకల్పన చేసి వెలువరించాడు. అప్పటి పోరాటయోధులకు మార్గదర్శిగా ఉపకరించిన పత్రమది. యుద్ధవ్యూహాలలో ఆరితేరిన మనిషి బొలీవార్. తమకన్నా ఎంతో ఎక్కువ ఆయుధసంపత్తి ఉన్న స్పానిష్ సేనలను తన వ్యూహరచనా చాతుర్యంతో పదేపదే ఓడించాడాయన. వెనెసుఏలాలో (Venezuela) పుట్టిన సిమోన్ బొలీవార్, దక్షిణ అమెరికా ఖండపు ఉత్తరభాగాన ఉన్న దేశాలన్నిటా వాటివాటి స్వాతంత్ర్య సమరాలకు కేంద్రబిందువుగా నిలిచాడు. కనీసం ఆరు దేశాల వారు – వెనెసుఏలా, కొలంబియా, ఎక్వదోర్, పనమా, బొలీవియా, పెరు – ఆయనను తమ జాతిపితగా భావిస్తారు. బొలీవియా దేశపు పేరు ఆయన మీదుగానే వచ్చింది. మన దేశంలో గాంధీగారికి జరిగినట్టుగానే దక్షిణ అమెరికా దేశాలలో అసంఖ్యాకమైన వీధులకు, పార్కులకు, పబ్లిక్ భవనాలకు, స్మారకచిహ్నాలకు బొలీవార్ పేరే ఉంటుంది. మన రాజధాని ఢిల్లీ నడిబొడ్డున కూడా ఆయన పేరిట ఒక వీధి ఉంది. 1983లో ఆయన జ్ఞాపకార్థం ఒక స్టాంపును కూడా మన దేశంలో విడుదల చేశారు.

స్థూలంగా వెరుపెరుగని స్వాతంత్ర్య సేనాని అయిన బొలీవార్, బానిస వ్యవస్థ వెర్రితలలు వేసిన రోజుల్లో దాని నిషేధానికి కూడా ఎంతగానో కృషి చేశాడు. అబ్రహాం లింకన్ కన్నా ఏభై ఏళ్ళు ముందుగానే బానిసత్వపు నిషేధంకోసం పోరాడి, ఎంతోమంది నల్లవారిని ఆ ఉక్కుసంకెళ్ళనుంచి తప్పించాడు. తర్వాత వారంతా ఎంతో స్ఫూర్తితో ఆయన నడిపిన స్వాతంత్ర్యపోరాటాల్లో పాల్గొన్నారు. విడుదల అయిన బానిసలతోపాటు, స్థానిక ఇండియన్ల మద్దతూ బొలీవార్‌కు పుష్కలంగా లభించింది. ఆ విధంగా సమాజంలోని అన్ని వర్గాలనూ స్పానిష్ వలసపాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి సమీకరించగలిగాడు. దక్షిణ అమెరికా ఖండం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎంతగానో గౌరవించే వ్యక్తి – సిమోన్ బొలీవార్.


కార్తహేన పాతపట్నపు సందుగొందుల్లో మనసుతీరా తిరుగుతున్నప్పుడు ఓ పందిరి బాట, దిగువన బారులు తీరి ఉన్న చిరుదుకాణాలు కనిపించాయి. అందులో ఒక దానిలో కొకాదాస్ బ్లాంకాస్ అన్న మిఠాయిని అమ్ముతున్నారు. తురిమిన కొబ్బరిని రంగురంగుల తియ్యటి పాకంలో ఉడికించి చేస్తోన్న మిఠాయి అది. దాన్ని చూశాక ఏనాటివో జ్ఞాపకాలు అస్పష్టంగా మనసులో మెదిలాయి. ఒకటి కొని తీసుకున్నాను. ఒక ముక్క కొరకగానే ఆ జ్ఞాపకాలు స్పష్టమయ్యాయి. మా చిన్నప్పుడు అమ్మ చేసి పెట్టిన కొబ్బరి లౌజు ఇదేగదూ! అమ్మ చేసిన మిఠాయి సహజమైన తెలుపురంగులో ఉండేది; ఇవి ఆకర్షణీయమైన రంగుల్లో ఉన్నాయి – అదొక్కటే తేడా… రుచి ఒకటే. నా ప్రయాణాల్లో అనేకమార్లు ఇలా ఎక్కడెక్కడి దేశాలలోనో అనుభవాలు నా చిన్ననాటి జ్ఞాపకాలతో అనుసంధింపబడటం జరిగింది. బహుశా నన్ను ప్రయాణాలకు ప్రేరేపించే కారణాలలో, బాల్యస్మృతుల నెమరువేతకూడా ఒకటి అయి ఉండవచ్చు. హఠాత్తుగా ఇలాంటి అనుభవాలు కలిగినపుడు ఆయా రోజులు మరికాస్త మెరుపులతో కనిపిస్తాయి. ఇవాళ ఈ కొకాదాస్ బ్లాంకాస్ ఆ పని చేసింది!

వెళుతూ వెళుతూ ఉండగా ఒక చక్కని కూడలిలో క్రిస్టఫర్ కొలంబస్ విగ్రహం కనిపించింది. అన్నట్టు ఈ కొలంబియా దేశానికి ఆయన పేరే పెట్టారు. తాను భారతదేశాన్ని కనిపెట్టానన్న నమ్మకంతోనే కొలంబస్ తనువు చాలించాడు. తన ఆవిష్కరణ ఎంత ఘనమైనదో అతనికి తెలియనే తెలియదు. నాలుగుకోట్ల పాతిక లక్షల చదరపు కిలోమీటర్ల భూఖండాన్ని – యూరప్ ఖండానికి నాలుగున్నర రెట్లు పెద్దదైన భూఖండాన్ని ఆవిష్కరించానన్న విషయం అతనికి తెలియదు. అన్నట్టు, తన పేరు పెట్టుకున్న కొలంబియా దేశంలో కొలంబస్ అడుగు పెట్టనే లేదు.

కొలంబియా వీధుల్లో చిరువ్యాపారుల పెనువత్తిడి కొత్తవాళ్ళను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఎక్వదోర్‌లో ఈ బెడద లేదు. మా రిసెప్షనిస్టు విక్టర్ ముందే హెచ్చరించాడు కాబట్టి నేను ఆ వత్తిడిని పట్టించుకోకుండా ప్రతి వారికీ ‘నో, గ్రాసియాస్ – వద్దు, థాంక్యూ’ అని చెబుతూ దాటవేశాను.

చిన్నదుకాణాలవారి బెడద సంగతి ఎలా ఉన్నా, కొన్ని కొన్ని ప్రదేశాల్లో స్థానిక దళారీలు టూరిస్టుల దగ్గరికి వచ్చి అందమైన ఆడపిల్లల గురించి గుసగుసలుగా మాట్లాడటం నాకు తెలిసిన విషయమే. కార్తహేనకు సెక్స్ టూరిజపు కేంద్రంగా ‘ఘనఖ్యాతి’ ఉంది. ఆ గుసగుసల ముసుగులో టూరిస్టులకు మత్తుమందులిచ్చి దోచుకున్న ఘటనలూ లేకపోలేదట. అలాంటి దళారీలు పక్కకు చేరినపుడు ఖచ్చితంగా ‘నో’ చెప్పి తొలగిపోవడం ఉత్తమం. వాళ్ళు ఎంత పట్టుకుని వేలాడినా, వీలయినంత తక్కువ సమయంలో, అలా వేలాడటం సమయాన్ని వృధా చెయ్యడమే అన్న ఎరుకని వాళ్ళకి కలిగించడం ఉభయతారకం. గత్సెమని ప్రాంతంలో తిరుగుతున్నప్పుడూ, పాతపట్నంలో తిరుగుతున్నప్పుడూ నాకలాంటి దళారీల తాకిడి మూడు నాలుగుసార్లు ఎదురయింది.

ఏ దేశంలో అయినా ఏ ప్రాంతంలో అయినా, చిరువీధుల పద్మవ్యూహంలో చిక్కడిపోవడం ఏ యాత్రికుడికైనా ఆనంద హేతువు. స్థూలంగా అన్ని వీధులూ ఒక్కలానే అనిపించినా, పరీక్షగా చూస్తే ఒక్కో వీధిదీ ఒక్కో బాణీ అని తెలుస్తుంది. పాతపట్నంలో టూరిస్టులను సరదా విహారానికి తీసుకువెళుతోన్న గుర్రపుబళ్ళు విరివిగా కనిపించాయి. జంటలుగా వచ్చినవారూ పిల్లలతో వచ్చినవారూ తప్పకుండా చేసే పని, ఈ గుర్రపుబండిలో పాతపట్న విహారం. అది కుటుంబాలకు వదిలేద్దాం – నాకు నా కాళ్ళు చాలు అనుకొన్నాను. నిజానికి నాకు కాలినడకే మహా ఇష్టం.

సాయంత్రమయింది. పాతపట్నపు కోటగోడలు ఎక్కి, కరేబియన్ సముద్రంలో సూర్యాస్తమయాన్ని చూడాలిగదా – అటువేపు నడిచాను. కోట బురుజుల దగ్గర ఉన్న కఫే దెల్ మార్ అన్న రెస్టరెంటు సూర్యాస్తమయాన్ని చూడటానికి ఉత్తమస్థానం అనిపించింది. నేను సూర్యాస్తమయ సమయానికి అరగంట ముందే – అయిదున్నరకే ఆ రెస్టరెంటుకు చేరినా, అప్పటికే అక్కడ వందలాది సూర్యాస్తమయ దర్శనాభిలాషులు పోగుపడి కనిపించారు. సరైన చోటు దొరకడం కష్టమని అర్థమయింది. నేనూ గబగబా ఓ కాఫీ అందిపుచ్చుకుని సాయందృశ్యం చక్కగా కనిపించే చోటుకు చేరుకోగలిగాను. నా పక్కనే సముద్రం వైపు ఎక్కుపెట్టిన ఫిరంగులు కనిపించాయి. అవి తమ పని సజావుగా చేస్తోన్న రోజుల్లో శత్రువులనూ సాగరచోరులనూ బాగా బెదరగొట్టి ఉండాలి. ఇప్పుడా ఫిరంగులే చప్పచల్లారిపోయి నాలాంటివారికి ఆసనాలుగా మారాయి. ఏదేమైనా చక్కగా కాఫీ చప్పరిస్తూ, సందర్శకుల కోలాహలాన్ని గమానించి ఆనందిస్తూ, సముద్రంలోకి దిగిపోతోన్న సూర్యుడికి వీడ్కోలు చెప్పాను.

హోటలుకు తిరిగివచ్చేటపుడు ఓ వీధి దుకాణంనుంచి డిన్నరుకోసం రెండుమూడు అరెపాలు సేకరించాను. ఈ అరెపాలన్నవి, మొక్కజొన్న పిండితో చేసిన గుండ్రని రొట్టెల్లాంటివి. పిజ్జాల్లానే ఇవీ వేరువేరు టాపింగ్స్‌తో లభిస్తాయి. నేను తీసుకున్నది చీజు టాపింగుతో నిండిన అరెపాలు. ఆ అరెపాలను చేతబట్టుకుని గత్సెమని వీధులగుండా నా హోటలు వేపు నడిచాను. కాస్తంత దూరమెక్కువే. అప్పుడే ఆ ప్రాంతపు నిశాజీవితం – నైట్‌లైఫ్, ఊపందుకుంటోంది. నాకేమో నైట్‌లైఫ్ మీద పెద్దగా ఆసక్తి లేదు. పైగా నాకు నేను బాకీ పడిన నిద్ర నాకోసం ఎదురుచూస్తోందిగదా – బుద్ధిగా హోటలుకి చేరుకున్నాను.

మొత్తానికి కార్తహేన నగరం నా మనసు మీద ఒక రంగురంగుల ముద్రని వదిలింది. లాటిన్ అమెరికాలో నేను చూసిన అందమైన, రంగులీనే నగరాలన్నిటినీ గుర్తు చేసింది. క్యూబాలోని ట్రినిడాడ్ పట్టణం, గ్వాతెమాలలోని అంతీగా నగరం, నికరాగ్వాలోని గ్రనాద నగరం, కొలోనియా సాక్రమెంతో అన్న ఉరుగ్వే నగరం, వల్పరైసో అన్న చిలే నగరం – వీటన్నిటికీ రంగుల బాంధవ్యముందనిపించింది. ఇవన్నీ స్పానిష్‌వారు కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన నగరాలు. ఆ వలసకాలపు వాస్తురీతిని, ఆ కాలపు మనోహరమైన పట్టణత్వాన్నీ ఈ ఊళ్ళు జాగ్రత్తగా కాపాడుకొంటున్నాయి.


మర్నాటి ఉదయం – ఫిబ్రవరి 13న, కార్తహేన కోటను చూద్దామని సంకల్పించాను. టాక్సీ మాట్లాడుకున్నాను. మొరీసియో అన్న మా స్నేహశీలి టాక్సీ డ్రైవరు, ‘కోటతోబాటు రెండు మూడు గంటలసేపు ఊరి శివార్లలోని ప్రదేశాలు కూడా చూపిస్తాను, ఆ రకంగా ప్లాను చేసుకోండి’ అన్నాడు. ఆ సలహా నాకు నచ్చి సరేనన్నాను. ఎలాగూ నా తదుపరి గమ్యం – మెదెయీన్ (Medellin) నగరానికి విమానం ఎక్కాల్సింది సాయంత్రమే – అంచేత ఆ ఉదయమంతా నింపాదిగా కార్తహేన శివార్లూ చూసి రావచ్చు. అలా మొరీసియో నాకు టాక్సీ డ్రైవరు-గైడుగా పరిణమించాడు. అతనిలో నాకు మిశ్రమజాతి పోలికలు కనిపించాయి. ముప్పై రెండేళ్ళ మనిషి. స్థానికుడు. భార్య, ప్రైమరీ స్కూలుకు వెళ్ళే ఇద్దరు పిల్లలు – చిన్న కుటుంబమట.

మా పసుపురంగు టాక్సీ చక్కగా అలంకరించబడి ఉంది. అలంకరణే అయితే సరే. కారు టైర్లకు నిడుపాటి సూది మొనలున్న కడ్డీలు అమర్చి ఉన్నాయి; బెన్ హర్ సినిమాలో జనరల్ మెసాలా రథానికి ఉన్నాయిగదూ, అలాంటివన్నమాట. ఆశ్చర్యం కలిగింది. చిన్నపాటి కలవరం కూడా. కాస్తంత చనువు కుదిరాక, ‘ఏవిటి సంగతి’ అని అడిగాను. ‘ఇవి ప్రమాదకరంగాదూ’ అనీ అన్నాను. నవ్వేసి, ‘నా కారును ప్రమాదాలనుంచి దూరంగా ఉంచడానికే ఈ ఏర్పాటు’ అన్నాడు!

కార్తహేన కోట – కాస్తీయో ద సాన్ ఫెలిపె బహారాస్ అన్నది దాని పేరు, ఓ కొండగుట్ట మీద ఉంది. మీటర్లకొద్దీ మందం ఉన్న కోటగోడలు, పైన విశాలమైన బురుజులు, చూడటానికి గంభీరంగా ఉంది. నేల దిగువన సొరంగాలు, సామాన్లు భద్రపరిచే గదులు ఉన్నాయి; అప్పట్లో దోచి తెచ్చిన సంపదను దాచుకోవడానికి ఆ ఏర్పాటు. స్పానిష్‌వారి వలస ప్రాంతాల్లోకెల్లా అతి పటిష్టమైన కోటగా పేరుపొందిందీ కార్తహేన కోట. సైనిక నిర్మాణాలకు ఈ కోట వాస్తురీతి ఓ మచ్చుతునక. నగరాన్ని విహంగవీక్షణం చెయ్యడానికి ఎంతగానో అనువైన ప్రదేశమది.

కోట చూడటం ముగిశాక మొరీసియో పక్కనే ఉన్న కొండ మీది కాన్వెంతో ద పోప – ద పోప్‌స్ కాన్వెంట్ – అన్న ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. నూటయాభై మీటర్ల ఎత్తున్న కొండ… కార్తహేన నగరంలోకెల్లా ఎత్తైన ప్రదేశమది. కారును బయట పార్క్ చేసి, ‘మీరు లోపలికి వెళ్ళి చూసి రండి. మీరొచ్చేదాకా నేనిక్కడే ఉంటాను, అన్నాడు మొరీసియో. టికెట్టు కొనుక్కుని కాన్వెంటు ప్రాంగణంలోకి ఒక పెద్ద ఇనుప గేటు గుండా ప్రవేశించాను. అక్కణ్ణించి కార్తహేన నగరం నగరమంతా చక్కగా కనపడింది. పాతపట్నం, పక్కన గత్సెమని ప్రాంతం, కొంచెం పెడగా ఆకాశ హార్మ్యాల బోకా గ్రాందె ప్రాంతం – అన్నీ స్పష్టంగా కనిపించాయి. కాన్వెంటు కాంపౌండు వాల్ మీద పెద్దపాటి శిలువ అమర్చి ఉంది. 400 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆ కాన్వెంటులో కోండెలారియా వర్జిన్ – విర్హిన్ దె ల కోందెల్లారియా ప్రతిమ ఉంది. ఆ ‘వర్జిన్ మేరీ’ కార్తహేన నగరపు రక్షకదేవత.

ఊళ్ళోకి తిరిగి వచ్చేటప్పుడు మొరీసియో, కారును పాతపట్నం ప్రవేశద్వారం దగ్గరున్న ‘అ ల ఇందియా కాతలీన’ అన్న కట్టడం దగ్గర ఆపాడు. అక్కడ ఓ స్థానిక ఇండియన్ వనిత ప్రతిమ ఉంది. ఆమె కురులలోంచి ఓ అందమైన పెద్దపాటి పక్షి ఈక చొచ్చుకు వచ్చి కంటికి నదరుగా కనపడుతోంది. ఆమె పేరు కాటలీనా అట. ఇంతకు ముందు చెప్పుకున్న కార్తహేన నగర నిర్మాత పెద్రొ ద ఎరిదియాకు ఆమె అప్పట్లో దుబాసీగా వ్యవహరించిందట.

కార్తహేన నగరంలో విచిత్రాలకేం కొదవు లేదనుకుంటాను. హోటలుకు వెళ్ళే దారిలో, రెండు పేద్ద సైజు – ఏడెనిమిది అడుగుల పొడవు, ఐదారు అడుగుల ఎత్తు – బూట్లు ఉన్న మాన్యుమెంటు లాంటిది కనపడింది. వాటిలో ఒకటి నిలకడగా నిలిచి ఉండగా, రెండోది పక్కకు వాలి ఉంది. మొరీసియో కారు ఆపాడు. దగ్గరకు వెళ్ళాం. కొంతమంది టూరిస్టులు అక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు. ఏమిటి దీని కథా అని మొరీసియోను అడిగాను. ‘కథంటూ ఏమీ లేదు… అయినా అందరూ ఆగి ఫోటోలు తీసుకుంటారు’ అన్నాడు. నేనూ ఓ ఫోటో దిగాను. తర్వాత శోధించగా, ఆ కట్టడాన్ని కొలంబియన్ కవి లూయీస్ కార్లోస్ లోపెజ్‌కు (Louis Carlos Lopez) నివాళిగా ప్రతిష్ఠించారట. ల మి సియుదాద్ నేతీవ (la mi ciudad nativa) అన్న కవితలో ఆ కవి కార్తహేన నగరాన్ని పాత బూట్ల జతతో పోల్చాడట… అదీ సంగతి. ఇలాంటి వింతలూ విచిత్రాలే ఆయా ప్రదేశాలకు ఒక ప్రత్యేకతను సమకూర్చి టూరిస్టుల కుతూహలానికీ సంబరానికీ హేతువు అవుతాయి.


లంచి టైమయింది. ఏదన్నా మంచి రెస్టరెంటుకు తీసుకువెళ్ళమని మొరీసియోకు చెప్పాను… తీసుకువెళ్ళాడు. నాతోపాటు భోజనం చెయ్యమని అతన్నీ పిలిచాను. సందేహించాడు. కాస్తంత నొక్కి చెప్పాక ఒప్పుకున్నాడు. మేము వెళ్ళిన ‘మార్ దె లాస్ ఆంతీయాస్’ అన్న గత్సెమని రెస్టరెంటు సాగరసంపదను వండి వడ్డించే రెస్టరెంట్లలో అగ్రగణ్యమని క్షణాల్లో అర్థమయింది. అక్కడంతా కరేబియన్ వాతావరణం తొణికిసలాడుతోంది. గోడలకు సీ బ్లూ రంగు వేశారు. వాటిమీద సాగరజలచరాలను చిత్రించారు. పై కప్పునుంచి కూడా విభిన్న జలచరాల బొమ్మలను కళాత్మకంగా వేలాడదీశారు. అడుగుపెట్టిన ఎవరి మనసైనా ఉల్లాసంతో నిండిపోయేలా తీర్చిదిద్దిన రెస్టరెంటది. భోజనం వచ్చేదాకా నేనూ మొరీసియో కబుర్లలో మునిగిపోయాం.

నేను రకరకాల జలచరాలు కలగలసిన కాసుయేలా ద మరిస్కోస్ (cazuela de mariscos) అన్న వంటకాన్ని తెప్పించుకున్నాను. అందులో చేపలు, రొయ్యలు, స్క్విడ్, ఆక్టోపస్, ఆయిస్టర్లు కలగలసి ఉన్నాయి. వాటితోపాటు ఓ చిన్న ముద్ద బియ్యం, కొబ్బరి అన్నం, పెద్దపెద్ద అరటి ముక్కలు రెండు, సూపులాంటి మరో వంటకాన్నీ అందించారు. చక్కని భోజనం. మొరీసియో తనకో సీ ఫుడ్ వంటకమూ, అన్నాన్ని తెప్పించుకున్నాడు.

భోజనం చేశాక కూడా విమానాశ్రయానికి వెళ్ళడానికి నాకో గంట సమయం మిగిలింది. మొరీసియో నన్ను మళ్ళా పాతపట్నంవేపు తీసుకువెళ్ళాడు. ఆ పాతపట్నంలోకూడా ఖరీదైన హోటళ్ళు ఉన్నాయి. ‘ఈ ప్రాంతం సామాన్యులకు అందుబాటులో ఉండే చోటు కాదు’ అని వివరించాడు మొరీసియో. అక్కడ అన్నీ మహా ఖరీదట. స్థానికులు ఆ ధరలను ‘గ్రింగో’ ధరలు అంటారట. గ్రింగో అన్నది తెల్ల అమెరికన్లను కాస్తంత నిరసనగా స్థానికులు పిలుచుకునే పేరు.

‘పలెన్‌కేరాస్ (Palenqueras) దగ్గరికి తీసుకువెళతాను, ఫోటోలు దిగుతారా’ అని అడిగాడు మౌరిసియో. వాళ్ళ గురించి చూచాయగా విని ఉన్నానుగానీ ఇంకా ఏం చూస్తాంలే అనిపించి ముందు వద్దన్నాను. అతను చిరునవ్వు నవ్వి, ‘కార్తహేన యాత్రలో పలెన్‌కేరాస్‌తో ఫోటోలు దిగకపోతే అది అసలు యాత్రే కాదు’ అన్నాడు. సరేనన్నాను. వాళ్ళ ఆసక్తికరమైన పూర్వాపరాలను తనకు తెలిసిన మేరకు చెప్పుకొచ్చాడు. వాళ్ళు కనిపించిన కూడలి దగ్గర కారాపాడు.

ఈ పలెన్‌కేరాలు ఆఫ్రికానుంచి బానిసలుగా తీసుకురాబడిన వారి వారసులు. ఒకానొక సమయంలో వాళ్ళు బానిస సంకెళ్ళు ఛేదించుకొని, తమకంటూ సాన్ బసిలియో డి పలెన్‌కే (San Basilio de Palenque) అన్న పట్టణాన్ని నిర్మించుకుని స్థిరపడ్డారు. బానిసలు స్వయంగా నిర్మించుకొని, స్వతంత్రంగా నడుపుకున్న మొట్టమొదటి అమెరికన్ పట్టణం అది. ఇప్పటి గినియా బిసావు అన్న పశ్చిమ ఆఫ్రికా దేశపు మూలాలు ఉన్న, ‘బంటూ’ భాష మాట్లాడే డొమింగొ బెన్కోస్ బియాహొ (Domingo Benkos Bioho) అన్న వ్యక్తి, అప్పటి ఆ పరిణామాలకు నేతృత్వం వహించాడు. కార్తహేన తీరం దగ్గర మునిగిపోయిన ఒక బానిస వర్తకపు ఓడలోంచి తప్పించుకొని, తనలాగా పారిపోతున్న మరికొంతమంది బానిసలను సమీకరించి, వలస ప్రభువుల ప్రభావానికి లొంగనంత దూరాన ఆ పట్టణాన్ని స్థాపించాడు. దాన్నొక కోట స్థాయిలో పటిష్టపరచాడు. తమలాగా తప్పించుకొని వచ్చిన ఇతర ప్రాంతాల బానిసలకు కూడా తమ పట్టణంలోకి స్వాగతం పలికాడు. క్రమక్రమంగా పట్టణం పెద్దదయింది. స్పానిష్ ప్రభువులు మోసంతో అతడిని చంపగలిగారు కాని, ఆ పట్టణాన్ని అదుపులోకి తీసుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. చివరికి ఆ పట్టణం తమ పాలనాపరిధిలోకి రాదని స్పానిష్ చక్రవర్తి ప్రకటించాడు. కానీ ఇక ముందట పారిపోయి వస్తోన్న ఇతర బానిసలకు ఆశ్రయం ఇవ్వరాదన్న ఆంక్ష పెట్టాడు. అలా అమెరికా ఖండాలలో మొట్టమొదటి స్వతంత్ర ఆఫ్రికన్ చిరుదేశం అవతరించింది. ఇప్పటికీ అక్కడివాళ్ళు తమ బంటూ భాషను పరిరక్షించుకుంటున్నారు. పట్టణవాసుల్లో సగంమంది బంటూ-స్పానిష్ కలగలసిన భాషలో మాట్లాడతారు.

ఆ పట్టణంలోని వారంతా తమను తాము తమ పట్టణం పేరిట పలెన్‌కేరాస్ అని పిలుచుకుంటారు. వాళ్ళంతా స్వతంత్రమయితే సాధించుకోగలిగారు గానీ ఇప్పటికీ ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించుకోలేకపోయారు. అక్కడి మహిళలు, తమ పట్టణంలో పండించిన పళ్ళను తట్టన పెట్టుకుని కార్తహేన నగరానికి రావడం, నాలుగు డబ్బులు సంపాదించుకొని తిరిగివెళ్ళడం ఒక సంప్రదాయంగా మారింది. కాలక్రమేణా పలెన్‌కేరాలు కార్తహేన నగరపు సాంస్కృతిక ఆవరణంలో విడదీయలేని ఒక భాగమయ్యారు. వాళ్ళంతా కొలంబియా పతాకంతో కూడిన గాఢమైన వర్ణాల దుస్తులు ధరిస్తారు. ఆ రంగుల వెల్లువకు తోడుగా తలలమీద పళ్ళతట్టలు – ఆ తట్టల్లో ఉష్ణమండలపు మధురఫలాలు, మరికొన్ని కొబ్బరి నిండిన మిఠాయిలు – అడిగిన వాళ్ళకు భంగిమలిస్తూ నిలబడతారు. వాళ్ళిచ్చే ఒకటీ అరా డాలర్లను సంతోషంగా తీసుకుంటారు – అలా ఇప్పటి పలెన్‌కేరా మహిళలు, తరాలుగా వస్తోన్న సంప్రదాయ వర్ణచిత్రాలలా కార్తహేన దైనందిన జీవితంలో భాగమై ఉన్నారు.

ఆ పలెన్‌కేరాస్ కూడి ఉన్న చోట మొరాసియా మా కారు ఆపాడు గదా – దిగి వెళ్ళి పలకరించాను. భాష రాకపోయినా చిరునవ్వులు, హావభావాలతో మా ‘సంభాషణ’ కొనసాగింది. వాళ్ళ రంగురంగుల వస్త్రధారణను అభినందించాను. ఫోటోలకు వాళ్ళు చక్కగా సహకరించారు. థాంక్స్ చెప్పి కాసిన్ని డాలర్లు ముట్టజెప్పి అక్కణ్ణించి ముందుకు సాగాం.


కార్తహేన నగరంలో నేను గడిపిన చివరి క్షణాల్లో మా మొరీసియో నాకు రెండు అమూల్యమైన కానుకలను అందించాడు. ముందుగా నన్ను కొలంబియా రచయిత గాబ్రియేల్ గార్సీయా మార్కేజ్ ఇంటి దగ్గరకు తీసుకు వెళ్ళాడు. మార్కేజ్ రాసిన నూరేళ్ళ ఏకాంతం – హండ్రెడ్ యియర్స్ ఆఫ్ సాలిట్యూడ్, ఆధునిక ప్రపంచసాహిత్యంలో ఆణిముత్యంగా దశాబ్దాల తరబడి వెలుగుతోంది. నోబెల్ బహుమతిని గెలుచుకొంది. తెలుగుతో సహా అనేకానేక ప్రపంచ భాషల్లోకి అనువదితమయింది. తన రచనలతో కొలంబియా దేశానికి ప్రపంచ సాహితీ పటంలో ప్రముఖమైన స్థానాన్ని సాధించిపెట్టాడు మార్కేజ్.

కార్తహేనకు చెందిన మరో ప్రముఖ కళాకారిణి షకీరా. ఆమెకు ఊళ్ళో ఒక ఇల్లుంది. ఆమె పుట్టిన బరన్‌కియా (Barranquilla) నగరం కార్తహేనకు దగ్గరలోనే ఉంది. తన పాటల రికార్డులు పది కోట్లు అమ్మిన గాయని షకీరా. ‘వక వక ఏ ఏ, దిస్ టైమ్ ఫర్ ఆఫ్రికా’ అంటూ ఆమె 2010లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్ పోటీల సందర్భంగా పాడిన పాట, ఆ రోజుల్లో ఓ ప్రభంజనం. వ్యక్తిగతంగా నాకు బాగా ఇష్టమైన పాట. మార్కేజ్, షకీరాల ఇళ్ళు పాతపట్నంలో సముద్ర తీరాన సంపన్న పరిసరాల్లో ఉన్నాయి.

మొరీసియో దాదాపు రోజంతా నాతో గడిపాడు. చొరవ తీసుకుని ముందుగా నేననుకున్న కార్తహేన కోటనేగాకుండా, కార్యక్రమంలో ఇతర అంశాలను కూడా చేర్చి మొత్తం కార్యక్రమాన్ని ఫలవంతం చేశాడు. ఆ ప్రక్రియలో అతను నాకో చక్కని స్నేహితుడిగా పరిణమించాడు. కార్యక్రమం ముగిశాక ముందుగా మాట్లాడుకున్న మొత్తమే కాకుండా మరికొంత పారితోషికంగా చేర్చి అందించాను. ఈసారి కుటుంబంతో సహా తమ ఊరికి రమ్మన్నాడు మొరీసియో. తన టాక్సీని పూర్తిగా మాకోసమే నియోగించి అన్నిచోట్లా తిప్పి చూపిస్తానన్నాడు. తన ఫోన్ నెంబరు నాకిచ్చి, దేశంలోని ఏ నగరంలో ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తనకు ఫోన్ చెయ్యమని, అక్కడ ఉండే తన స్నేహితుల్ని నాకు సహాయంగా నిలబెడతాననీ చెప్పాడు.

ఒక్క మొరీసియో అనే కాదు; దక్షిణ అమెరికా జనసమూహాల్లో ఈ ఆత్మీయత, స్నేహభావం ఒక సామాన్యలక్షణంగా నాకు చాలాసార్లు కనిపించింది. వీళ్ళంతా పరాయి మనుషుల్ని కలవడానికీ స్నేహంగా మసలడానికీ ముందుకువచ్చే బాణీ వ్యక్తులు. పాశ్చాత్యదేశాల మనుషులలో కనిపించే గాంభీర్యం, ముభావం ఇక్కడివారిలో కనిపించవు. మళ్ళా అక్కడకూడా ఉత్తర యూరప్ బాణీ వేరు; దక్షిణ యూరప్ లోని స్పెయిన్, పోర్చుగల్, ఇతర మధ్యధరా ప్రాంతపు దేశాల్లోని ప్రజానీకం అటువంటి బింకాలకు పోరు. మనుషులతో స్నేహంగా కలిసిపోతారు.

మొరీసియోకు మనసారా వీడ్కోలు చెప్పి, విమానాశ్రయం లోపలికి వెళ్ళాను. నా తదుపరి గమ్యం మెదెయీన్ నగరం. 600 కిలోమీటర్లు. గంటంబావు ప్రయాణం. విమానంలో నా పక్కసీట్లోని సాంతియాగో అన్న వ్యక్తితో మాట కలిసింది. రాజధాని బొగొతాకు చెందిన మనిషి. నాలానే ఏభైల నడుమ వయసు. వ్యాపారవేత్త అట. కార్తహేనలో తన పనులేవో చూసుకుని మెదెయీన్ మీదుగా బొగొతాకు తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. పలకరింపులు ముగిశాక సంభాషణ కొనసాగింది. ‘మెదెయీన్‌కు వెళ్ళాలన్న ఆలోచన మీకు ఎలా కలిగిందీ’ అని అందరిలాగానే నవ్వుతూ అడిగాడాయన. ‘కాలేజ్ రోజుల్లో నాకు కొలంబియాలో తెలిసిన ఒకే ఒక నగరం అది. ఆ నగరాన్ని చూద్దామని’ అంటూ నా స్టాక్ సమాధానం చెప్పాను. ‘అయితే ఆ తెలియడం డ్రగ్ మాఫియా, ఎస్కోబార్‌ల వల్ల అయి ఉంటుంది’ అంటూ సరిగ్గానే అంచనా వేశాడు సాంతియాగో. నేనూ బెరుకు నిండిన చిరునవ్వుతో తలూపాను. ‘అదంతా గతం. నేను కుర్రాడిగా ఉన్నప్పుడు మెదెయీన్ నగరం మాఫియా మూకల కంచుకోటగా ఉండేది. ఇపుడు నగరపునరుజ్జీవనంకు చక్కని ప్రతీకగా నిలబడుతోంది. రెక్కలు విప్పుకుని ప్రపంచానికేసి ఎగసే నగరంగా మారింది’ అని చెప్పుకొచ్చాడు సాంతియాగో. ‘అన్నట్టు నగరానికి గంటా గంటన్నర దూరంలో గ్వాతాపె (Guatapé) అన్న చక్కని పట్నం ఉంది. మా అమ్మ వాళ్ళ ఊరది. నాకు బాగా ఇష్టమైన ప్రదేశం; ఏ చిన్న సాకు దొరికినా ఆ ఊరికి వెళిపోతూ ఉంటాను. మీరూ ఓ పూట అటు వెళ్ళి రండి. బావుంటుంది’ అని సలహా ఇచ్చాడు.

అందరూ అడిగినట్లే భారతదేశాన్ని గురించి కుతూహలం నిండిన ప్రశ్నలు గుప్పించాడు సాంతియాగో. ‘అన్ని కోట్లమంది అక్కడ ఎలా ఉండగలుగుతున్నారూ’ అని విస్తుపోయాడు. ‘అదేంగాదు… అందరూ పట్టేంత విశాలమైన దేశమే మాది’ అని నవ్వుతూ చెప్పాను. చెప్పి, ‘అసలు ఇండియా అనగానే జనాభా సంగతి అటుంచి మీ మనసులోకి వచ్చే ఇతర ఆలోచన ఏమిటీ’ అని అడిగాను. ఆయన సమాధానం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘మా దేశానికీ వెనెసుఏలా దేశానికీ మిస్ యూనివర్స్‌లాంటి అందాల పోటీల్లో గట్టిగా ఎదురునిలిచి నిలబడే దేశం మీది’ అన్నాడాయన. ఆ కోణంలోంచి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రపంచంలో ఏ మూలనో ఉన్న కొలంబియా లాంటి దేశంలో ఇండియాను తమకు గట్టి పోటీ ఇచ్చే అందగత్తెల పుట్టిల్లుగా భావిస్తారన్న సంగతి, నా ఊహాలకందని విషయం.

తన వివరాలు నాకిచ్చి ‘మీకు బొగొతాలో ఎలాంటి అవసరం కలిగినా నన్ను కాంటాక్ట్ చెయ్యండి’ అన్నాడు సాంతియాగో.

మెదెయీన్ విమానాశ్రయం చిన్నపాటిది. ఏ సంక్లిష్టతలూ లేవు- నా సామాన్లు ఎంతో అవలీలగా చేతికి అందాయి. మళ్ళా మరికాసిని డాలర్లను పెసోల్లోకి మార్చుకున్నాను. నేనా పనిలో ఉండగానే ఓ లేతరంగు కురుల, మలి-నడివయసు మహిళ వచ్చి పలకరించి, తనను తాను అక్కడి టాక్సీ డ్రైవరుగా పరిచయం చేసుకుంది. ఆమె పేరు కార్మెన్. విమానాశ్రయంనుంచి ఊళ్ళోకి వెళ్ళడానికి ఛార్జీలన్నీ ముందస్తుగా అధికారులు నిర్ణయించినవేనని, తనతో వస్తే శ్రద్ధగా తీసుకువెళతాననీ చెప్పిందామె. మా హోటలుకు తీసుకువెళ్ళడానికి ఆమె చెప్పిన రేటు సమంజసమే అనిపించింది. మరో ఆలోచన లేకుండా సరేనన్నాను. పాతిక కిలోమీటర్ల దూరం. నలభై నిముషాల ప్రయాణం. విమానాశ్రయంనుంచి హోటలుకు వెళ్ళే సమయంలో ఆమెతో సంభాషణ మొదలయింది. ఆమెకు అతి పరిమితంగా ఇంగ్లీషు తెలుసు. నా స్పానిష్ అంతకన్నా అన్యాయం. అంచేత సంభాషణకు గూగుల్ ట్రాన్స్‌లేట్ ముఖ్యసాధనం అయింది.

‘కార్తహేన ఎలా ఉందీ? మీకు నచ్చిందా?’ అని కుశలమడిగింది కార్మెన్. ‘మా మెదెయీన్ కార్తహేనకు పూర్తిగా భిన్నం’ అనీ అన్నది. ఏమిటీ ఆ తేడా అని ఆడగబోయి, మళ్ళా సంభాషణ పాబ్లో ఎస్కోబార్‌ వేపుకు మళ్ళుతుందేమోనని సందేహించి అడగలేదు. 80లు, 90లనాటి మాఫియా యుద్ధాల ప్రస్తావన తీసుకురావడం సరైన పని కాదు అని తెలుసు. ఊళ్ళో ప్రతి కుటుంబానికీ ఏదో ఒక విషాదగాథ ఉండే అవకాశం ఉంది. ఆ జ్ఞాపకాల తుట్టెను కదపగూడదు కదా!

నేను వ్యాపారపు పనులమీద రావడంలేదని గ్రహించిన కార్మెన్ ‘మరెందుకొస్తున్నారూ’ అని అడగనే అడిగింది. ‘ఈ ఊరిగురించి ఎప్పట్నుంచో వింటున్నాను… ఈమధ్య పరిస్థితి బాగా మారిందనీ విన్నాను’ అంటూ కాస్తంత అస్పష్టంగా సమాధానమిచ్చాను. నా ఇబ్బంది గ్రహించింది కాబోలు, ఆమె తిన్నగా విషయాన్ని ఎస్కోబార్‌ దగ్గరకు తీసుకు వెళ్ళింది. అందుకు ఆమె ఏ ఇబ్బందీ పడలేదు!

ఇక సంకోచాలని పక్కకుపెట్టి నేనూ తిన్నగా విషయంలోకి వెళ్ళాను. ‘ఆ రోజులు మీకు గుర్తున్నాయా? ఎలా ఉండేవీ?’ అని అడిగాను. ఆమె కథంతా చెప్పుకొచ్చింది. వాళ్ళ అమ్మ అప్పట్లో ఓ బట్టల దుకాణం నడిపేదట. ఒక రోజున వాళ్ళ అమ్మ కళ్ళముందే ఆవిడ తమ్ముడిని మాఫియా మూకలు కాల్చి చంపాయట. ఎందుకు చంపారో అప్పటికీ ఇప్పటికీ ఆ కుటుంబానికి తెలియదట. పోలీస్ ఇన్‌ఫార్మర్ అన్న అనుమానంతో చంపారన్నది ఒక బలమైన ఊహ. ఆ దుర్ఘటన జరిగాక కార్మెన్ వాళ్ళ అమ్మ దుకాణాన్ని అమ్మేసి, నగరంలోని మరో ప్రాంతానికి మారారట – తనకూ తన పిల్లలకూ కూడా ఆ పాత ప్రదేశంలో ఉంటే ప్రమాదమన్నది ఆ తల్లి ఆలోచన. ‘ఇలా ఎన్నో కుటుంబాలు 1980లనాటి విషపరిణామాలను రుచి చూశాయి. అదే సమయంలో ఆ మాఫియా ముఠాలతో కుమ్మక్కయి బాగుపడినవాళ్ళూ లేకపోలేదు. అప్పట్లో ఎస్కోబార్‌ వల్ల చితికిపోయిన కుటుంబాలు ఒకపక్కన ఉంటే, బాగుపడిన కుటుంబాలు మరోపక్క – ఇప్పటికీ నగరంలో ఆ స్థూలవిభజన తాలూకు ఛాయలు మనకు కనిపిస్తాయి’ యథాలాపంగా చెప్పుకొచ్చింది కార్మెన్. ఆమెకు ఆ విషయాలు వినీ వినీ మామూలు అయిపోయి ఉండవచ్చుగానీ ఆ విపరీత ఘటనల ప్రత్యక్షసాక్షి ద్వారా ఆ వివరాలని వింటోంటే మనసు భారమయింది. దిగులనిపించింది.

ఎంత యథాలాపంగా చెప్పినట్టనిపించినా కార్మెన్ ఆ కథనాన్ని ముగించాక కాసేపు మౌనంగా ఉండి, తమాయించుకొంది. అప్పుడొక ఆసక్తికరమైన సంఘటన చెప్పుకొచ్చింది. తన చిన్నప్పుడు ఎస్కోబార్‌ను అతి దగ్గర్నుంచి చూసిందట! అప్పుడామెకు పదిహేనేళ్ళు. ఒక స్థానిక బార్‌లో బార్‌మెయిడ్‌గా పని చేస్తోందట. ఉన్నట్టుండి ఎస్కోబార్‌, అతని అనుచరులూ మూడు కార్లలో దిగి బార్‌లోకి ప్రవేశించారట. అతని చుట్టూ పదిమంది సాయుధులైన అంగరక్షకులు… ‘ఇపుడంతా బాగా సర్దుకుంది. ఆ చీకటి రోజులు గతంలో కలిసిపోయాయి. ఇపుడు మెదెయీన్ నగరం శాంతియుతం. సురక్షితం’ అని ముక్తాయించింది కార్మెన్. తానే విషయాన్ని మార్చి, ‘మీరు ఉండబోయే తెర్రా బియో ఒతేల్ ఊళ్ళోని లారెలెస్ అన్న సుందరమైన ప్రాంతంలో ఉంది’ అంటూ ఉత్సాహపరచింది. తన కార్డు ఇచ్చి, ఎప్పుడు టాక్సీ అవసరం అయినా పిలవమంది. ముఖ్యంగా మళ్ళీ విమానాశ్రయానికి వెళ్ళేటపుడు తానే వస్తానంది. చక్కని మనిషి కార్మెన్. సంభాషణాశీలి. స్థిరత్వం ఉన్న మనిషి. కలుపుగోరుతనం బాగా ఉంది. ఆమెకు ధన్యవాదాలు చెప్పి హోటలు ప్రాంగణంలోకి ప్రవేశించాను.

(సశేషం)