మా దగ్గరకొచ్చేకొలదీ అతని శరీరం త్వరత్వరగా పెరగసాగింది. అలా పెరిగే క్రమంలో నేను అతని అనేక రూపాలని చూశాను: టెలెస్కోప్ని ఆకాశం వైపు తిప్పడం, పైనుండి క్రిందకి పడే రాయి వేగాన్ని లోలకంతో లెక్కకట్టడం, పాదరసం ఉన్న గొట్టంతో పీడన కొలవడం. అతని రూపం బ్రహ్మాండమైంది: తల ఆకాశాన్ని అంటింది; కాళ్ళు పాతాళం లోతులని చూశాయి; చేతులు రెండు దిశలనీ తాకాయి. అతని చేతిలోని దీపం ఆకాశం అంతటా, అగాధాలలో, నేల నలు మూలలా, వెలుగు ప్రసరించింది. ఎవరీ మహాకాయుడని అడిగాను. ప్లేటో ప్రత్యక్షమయి, ‘ప్రయోగం’ అని సమాధానమిచ్చి..
Category Archive: వ్యాసాలు
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హెలెన్ కెల్లర్ 19 నెలల పసిగుడ్డుగా ఉన్న బాల్యంలోనే జబ్బుపడి వినికిడి శక్తిని, చూపుని పోగొట్టుకుంది. తనకి ప్రాప్తించిన గుడ్డితనం కంటే వినికిడిని పోగొట్టుకోవడం వల్ల కలిగిన బలహీనత, ఒంటరితనం, బాధ, ఎన్నో రెట్లు ఎక్కువ అని చెప్పుకుని ఆమె బాధ పడింది.
ఈ సంవత్సరం జ్ఞానపీఠ్ అవార్డ్ ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన వినోద్‌కుమార్ శుక్లాకు లభించింది. ఈ సందర్భంగా ఆయన రాసిన ‘దీవార్ పర్ ఏక్ ఖిడికీ రహతీ థీ’ అనే హిందీ నవల గురించి భారతీయ నవలా దర్శనం అన్న పుస్తకంలో వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు రాసిన వ్యాసాన్ని ఈమాట పాఠకులకోసం పునర్ముద్రిస్తున్నాం.
పిచ్చివాడు వాళ్ళమధ్యకు దూకి, వాళ్ళను తీక్షణంగా చూశాడు. “ఎక్కడికెళ్ళాడు దేవుడు?”, అని అరిచాడు; నే చెబుతా. మనం చంపేశాం, నీవూ, నేనూ. మనమంతా ఆయన హంతకులం. కాని, ఎలా చంపాం? సముద్రాన్ని ఎలా తాగగలిగాం? ఆయన ఆనవాళ్ళు లేకుండా దిగంతాలను ఏ తడిగుడ్డతో తుడిచేశాం? సంకెళ్ళు తెగగొట్టి యీ భూగోళాన్ని సూర్యుడినుండి విడిపించినపుడు, మనం ఏం చేస్తున్నామో తెలిసే చేశామా? తెగిన భూగోళం ఎటు వెళుతున్నది? మనం ఎటువైపు వెళుతున్నాం? ఆదిత్యులనుండి దూరదూరంగా?
స్వచ్ఛమైన గాలీ, నీరు ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో చాలావరకూ ఆరోగ్యంగా వుంటారేమో. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి వాళ్ళు ఆనందంగా కూడా వుంటారనుకుంటాను. అందుకేనేమో భూటాన్‌ను ఆనందమయదేశం అంటారు.
ఈ ఆధునిక సిద్ధాంతాలను చూసినప్పుడు, కుమారిల భట్టు కంటే శంకరాచార్యులు, బౌద్ధులు సత్యానికి ఎక్కువగా దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తుంది. బౌద్ధులు, శంకరాచార్యులు కూడా స్థల-కాలాలు మనోనిర్మితాలని, మనం చూసే దృశ్యాలు దేహ పరిమితుల నుంచి పుట్టాయని చెప్పారు. ఆధునిక విజ్ఞానవేత్తలు కూడా దాదాపు ఇటువంటి సిద్ధాంతాన్నే ప్రతిపాదించడం ఆబ్బురపరిచే విషయం.
నిజానికి ఆ సూపర్ కంప్యూటర్ కంటే ఈనాడు మన అరచేతిలో ఉన్న ఫోనులోని కంప్యూటర్ కొన్ని వేల రెట్లు శక్తివంతమైనది. లక్షల ట్రాన్సిస్టర్లు ఉన్న ఆనాటి కంప్యూటరు కంటే ఈనాటి సెల్ ఫోనులో ఎన్నో వేల రెట్లు ఎక్కువ ట్రాన్సిస్టర్లు ఉంటాయి. ఆనాటి కంప్యూటరు ఒక అంతస్తులో సగభాగం ఆక్రమిస్తే, ఈనాటి సెల్ ఫోనులు అరచేతిలో పట్టేస్తాయి.
ప్రస్తుతం వస్తున్నవి డయాస్పోరా కాదని నా ఉద్దేశం. లొకేషన్ మారితే అవి డయాస్పోరా అవుతాయనుకోవడం తప్పు. అమెరికా నుండి వచ్చే సాహిత్యం డయాస్పోరా సాహిత్యం కావాలంటే మనం నూతన సమాజంలో ప్రవాసులుగా ఒక హైబ్రిడ్ సంస్కృతిని రూపొందించుకొని, ఆ సమాజంలో మనకే ప్రత్యేకమైన సమస్యలు, సంక్లిష్టతలు, అనుభవాలతో ఒక కొత్త జాన్రా సృష్టించుకోగలగాలి. అప్పుడు ఆ సాహిత్యాన్ని డయాస్పోరా సాహిత్యం అనవచ్చు.
అయినా ఇప్పుడు నేను చేశానని చెప్పినా నా మాట ఎవడు నమ్ముతాడు? నా ఆధారాలు ఎవడు నిజమనుకుంటాడు? అనవసరంగా నా భార్యాపిల్లలకు జీవితాలలో సుఖము శాంతి లేకుండా చేయడం తప్ప ఒరిగేదేముంది? పొరపాటు పని కాదా? ఏది ఒప్పు ఏది తప్పు? జనం ఏమంటారు? మెచ్చుకుంటారా? నా మంచితనాన్ని గుర్తిస్తారా? నా నిర్ణయాన్ని గౌరవిస్తారా?
మా అందరి సామాజిక నేపథ్యం, పుట్టిన ఊర్ల, చదువుకున్న చదువుల, పెరిగిన పద్దతుల వాతావరణాలు వేరు. యవ్వనంలో స్నేహం అనేదానికి వ్యత్యాసాల అంటరానితనం ఉండదు. మాలో ఏ ఇద్దరికీ వ్యక్తిగత అభిరుచులు, వ్యాపకాలు ఒకటి కావు. అవేమీ లేకపోయినా, గంటలకొద్దీ ఆడుకోవడానికి కబుర్లు, కాలు సాగేకొద్దీ నడవడానికి దారులు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడానికి సమయం పుష్కలంగా ఉండేది.
ఇదేనా అసలు కారణం? లేక వేరేదైనా రహస్యం ఉందా? సార్వత్రిక విషాణు వత్సలాలని తయారుచెయ్యడం వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ఆయా మందులు తయారుచేసినా వాటి ధరలు ఆకాశాన్ని అంటేలా ఉంటాయి. కనుక ప్రభుత్వాల దన్ను లేకుండా సార్వత్రిక విషాణు వత్సలాలు వాడుకలోకి వస్తే నష్టపోయేది ఎవరు? ప్రజలు ఏటేటా టీకాలు పొడిపించుకోవడం వల్ల లాభపడేది ఎవరు?
మాట్లాడితే మనుస్మృతిని రామాయణాన్ని పురాణాలని పురాణ పాత్రల్ని విమర్శిస్తూ వాటి వెనక నక్కి ఆధునిక యుగంలో తమ ఆలోచనలు ఆచరణ తీసుకువచ్చిన విషమ పర్యవసానాలను గుర్తించడంలో ప్రగతి శీల మేధావులందరూ విఫలమయ్యారు.
సీతాకోకచిలుక పురుగునుండి బయటపడడంతో కథ పూర్తి కాదు. వచ్చిన రెక్కలతో ఎగరగలగాలి. త్యాగము ప్రేమ నిండిన జీవితం కోరుకోవడం, అభ్యుదయభావాలను నిరసించి నిశ్శేయసం వైపు రావడం, పోరాటంలో సగభాగమే. పోరాటం కేవలం బయటి ప్రపంచంతో కాదు, తన లోపల నిలిచిపోయిన ఊహలతో కూడా.
అద్దం ఎదుట నిలబడి ఒకసారి చూసుకొండి! ఏమిటి కనిపించింది? రెండు కళ్ళతో సూటిగా ఎదుటికి చూస్తూన్న ఒక భోక్త విగ్రహం! దరిదాపుగా భోక్తలన్నిటికి రెండు కళ్ళు, ముఖానికి మధ్యస్థంగా ఉండి, ఎట్టఎదుటకు సూటిగా చూస్తూ ఉంటాయి; తద్వారా వాటి ద్విచక్షు దృష్టిని ఉపయోగించి అవి భోజ్యాన్ని వేటాడి తినగలవు!
ఆశిష్ నంది ఆధునిక ఇండియాని అమెరికా పాశ్చాత్య దేశాల నకలుగా భావించారు. మొదట్లో అమెరికా ఒక ఒకే ఒక దేశంగా ఎదుగుతున్న క్రమంలో సివిక్ మిషన్ – ఒక పౌరుడు ఒక జాతీయ కమ్యూనిటీ ఏర్పాటు చేయడం – ప్రధానంగా భావించబడింది. ఉత్పత్తి పెంచడం, రవాణా విస్తరించటం వాటికవే లక్ష్యాలు కాదు. ఒక జాతి భావనను కూడా అధిగమించి, పౌరుడు అనే ఉమ్మడి కమ్యూనిటీ వైపు ప్రయాణం ప్రధానంగా భావించబడింది.
నా కవితా వ్యాసంగం మా ఊళ్ళో వాళ్ళకు తెలిసింది. వాళ్ళు నేనేదో మహాకవినై పోయినట్లు గౌరవించేవాళ్ళు. దాంతో నాకు ప్రోత్సాహం కలిగింది. ప్రతిదినం ఏటి ఒడ్డుకు పోయి కూర్చుండి నీళ్ళకు వచ్చే వాళ్ళను, పశువులను కడిగేవాళ్ళను, పాత్రలు తోముకునే వాళ్ళను చూస్తూ రకరకాల పద్యాలు రాసేవాణ్ణి.
ఏ ప్రక్రియలో ఐనా ప్రాథమిక అంశాలు కీలకమైనవి. శాస్త్రీయ సంగీతంలో ముందు సరళీస్వరాల మీద సంపూర్ణమైన పట్టును సంపాదించేందుకు చాలా కృషి చేయాలి. హిందుస్తానీ శైలిలో ఐతే కేవలం ‘ఆ’కార్ గాయనంలో నైపుణ్యం సంపాదించేందుకు సంవత్సరాల తరబడి సాధన చేస్తారు! సాహిత్యమూ అంతే. కవులు, రచయితలు కాదల్చుకున్నవారికి మొదట ప్రాథమిక అంశాలలో ప్రావీణ్యం ఉండటం అవసరం.
దొస్తోయెవ్స్కీ ప్రధానజీవితదర్శనం బాధ్యతారహితనిశ్చేష్టతను, హేతువాదస్వర్గాన్ని, వ్యతిరేకిస్తుంది. రెండు రెళ్ళు నాలుగే. నిజమే. కాని రెండు రెళ్ళు అయిదు అనే స్వేచ్ఛ నీకు లేదని ఎందుకు అనుకుంటావు? విధినిర్ణయం జరిగిపోయింది. నిజమే, కాని దాని అర్థం నీ బాధ్యత లేదని కాదు.
ఈ సందర్భంలో గతంలో జరిగిన ఒక హృదయ విదారకమైన సంఘటనని మన దృష్టికోణంలో పెట్టుకోవడం అప్రస్తుతం కాదు. వేవిళ్ళతో బాధపడే గర్భిణులకి ఉపశమనం కలిగించడానికి 1950, 1960 దశకాలలో థాలిడొమైడ్ అనే మందు వాడడం వల్ల దరిదాపు 10,000 మంది పిల్లలు వికలాంగులుగా పుట్టేరు.
భావనాబలం, సంకల్పం ఉంటే హిందూ జాతి గొప్పదిగా అవతరిస్తుoది అని గోల్వాల్కర్ అంటాడు. అదే భావనాబలంతో క్రైస్తవులు ముస్లింలు తమ జాతి గొప్పదని చాటుకోవచ్చు కదా అని నిలదీస్తాడు కరపాత్ర స్వామి. హిందుత్వకి అనుగుణంగా భారతీయ తత్వాన్ని ఆలోచనలని వక్రీకరించడాన్నీ తీవ్రంగా ఖండిస్తాడు. నిత్య అనిత్య వస్తు వివేకం అనే శంకర అద్వైత భావనని హిందూ సమాజ పరంగా అన్వయిస్తాడు గోల్వాల్కర్.