రచయిత వివరాలు

తిరుమల కృష్ణదేశికాచార్యులు

పూర్తిపేరు: తిరుమల కృష్ణదేశికాచార్యులు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

 

సంస్కృతములో మాఘునివలె, వేంకటాధ్వరివలె నొక ఆశ్వాసము నంతయు యమకాలంకారమయముగా చేసిన కవులు తెలుగులో నరుదుగా నున్నారు. అట్టివారిలో చంద్రికాపరిణయప్రబంధకర్త యగు సురభిమాధవరాయలు ముఖ్యుఁడు.ఇతఁడీ ప్రబంధములోని చతుర్థాశ్వాసమునంతయు యమకాలంకార మయము చేసినాడు.

అల్పకాంతులతో నసంఖ్యాకముగను
నింగి నాక్రమించుచు నిగనిగలఁ గుల్కు
తారకాతతి సౌరు సందర్శనీయ
మగును రాకేందుఁ డుదయింపనంతవఱకె.

క్రోధి యను పేరు గల్గినం గోపపడక
మక్కువను నిత్యసౌఖ్యంబు మాకుఁ గూర్చి
ఆదుకొనవయ్య మమ్ము నవాబ్దవర్య!
త్యక్తమొనరించి నీ అభిధార్థమెల్ల!

వసుచరిత్రలోని రెండవ ఆశ్వాసంలో శుక్తిమతీనది, కోలాహలపర్వతాల సంబంధాన్ని, సంగమాన్ని ప్రకృతిపరంగాను, వ్యక్తిపరం గాను శ్లేషమూలకంగా అత్యద్భుతంగా వర్ణించడంలో రామరాజభూషణుఁడు చూపిన వైదుష్యం, కౌశల్యం, కవిత్వపాటవం సాహిత్యవిమర్శకులు తరచుగా విశ్లేషించునవే. శుక్తిమతీ కోలాహలుల పుత్త్రికయైన గిరికయొక్క చెలికత్తె మంజువాణి గిరికాదేవి జన్మప్రకారాన్ని నర్మసచివునికి వివరించే సందర్భంలో ఈవర్ణన చేయబడింది.

బేలూరు చెన్నకేశవాలయం యునెస్కోవారసత్వనిర్మాణములలో శాశ్వతసభ్యత్వగౌరవము లభించిన ఈశుభతరుణంలో నా మహాశిల్పి జక్కనచరిత్రలోని వర్ణనను నేనిక్కడ పునర్మననం చేసికొంటున్నాను. 1992లో ఆ ఆలయమును దర్శించిన తర్వాత కల్గిన అపూర్వమైన ప్రేరణవల్లనే నేను ఈ మహాకావ్యాన్ని వ్రాసినాను.

అంతఃపురస్త్రీల అపహరణము అనునది యోహాన్ గాట్లియబ్ స్టెఫనీ డి యోంగర్ అను నాటకకర్తచే రచింపఁబడి, వుల్ఫ్‌గాంగ్ అమెడెయుస్ మొజార్టు అను సుప్రసిద్ధుడైన ఆస్ట్ర్రియను సంగీతకారునిచే సంగీతబద్ధము చేయఁబడిన గేయవచన సంభాషాత్మకమైన రూపకము. అట్టివాటిలో నన్నింటికంటె ప్రసిద్ధమైనది ఈ మోజార్టు ఓపెరా.

కాని నేను ఫలానా ఛందస్సులో వ్రాయాలని సంకల్పించను. భావం ఛందస్సులో నిముడాలనే బదులు ఛందస్సు భావంలో నిముడాలనే అభిప్రాయం గల వాణ్ణి నేను. అట్లని పద్యాలలో వ్యర్థ పదాలు చోటు చేసికొనరాదు. అందుచేత నొక అపూర్వమైన ఛందస్సు భావంలో స్ఫురించినప్పుడు కాదనక దానినట్లే స్వీకరించినాను. అందుచేత అనేకనూతనవృత్తాలను, ఖండ, చతురశ్ర, మిశ్ర, త్ర్యస్రగతులలో సాగే అనేకమాత్రాపద్యభేదాలను వివరించుటయే ఈ వ్యాసంయొక్క లక్ష్యం.

ఇందలి ఇతివృత్తము శృంగార,కరుణారస భరితమై ఇంపుగా నున్నది. దీనిని భారతసంస్కృతికి అన్వయించుకొనుటకు కొన్ని ముఖ్యమైన మార్పు లవసరమైనవి. 12వ శతాబ్దిలో జెరూసలెంవంటి క్రైస్తవపుణ్యస్థలములను పరిరక్షించుకొనుటకై అచ్చట నున్న ముస్లిముపాలకులతో మధ్యప్రాచ్యదేశములలో యూరోపియనుల కనేక మతయుద్ధములు జరిగినవి.

ప్రతిభ యనగా నేమి? అపూర్వవస్తు నిర్మాణ దక్షమైన ప్రజ్ఞయే ప్రతిభ యని అభినవగుప్తుని అభిప్రాయము. ఎప్పటికప్పుడు నవనవముగా వికసించు బుద్ధియే ప్రతిభ, దాని కాశ్రితుడై నిపుణమైన వర్ణనలు చేసేవాడే కవియని భామహుడను ఆలంకారికుడు ప్రతిభను నిర్వచించెను. ప్రతిభయే కవిని అకవి నుండి వేఱుచేసే లక్షణం.

ముగ్గులు లేవిట, కానీ
అగ్గలమగు సంతసమున నతివలు నీకై
యొగ్గిరి కుసుమాంజలులన్
దిగ్గున రమ్మిక నవాబ్ద! దీవింప మమున్.
 
వడకఁగానేమి వలిచేత వపువు లిచట,
లోనఁ గలదోయి వెచ్చనిదైన మనసు
అందుచేఁ బల్కెదము మనసార నీకు
నంచితంబగు నాహ్వాన మభినవాబ్ద!

మేనక అను ఈ ఆపెరా ఈకోవలో నేను చేసిన ఏడవరచన. ఇది మసెనే ఆపెరాకంటె అనేకవిషయములలో భిన్నముగా నున్నది. ఇతివృత్తమును భారతసంస్కృతికి అన్వయించుచు వ్రాయుటకై ఈభిన్నత్వ మవసరమైనది. అందుచే మాసినో ఆపెరాకు అనువాదముగాఁ గాక అనుసృజనగా, అనేకమైన మార్పులతో, నూతనసన్నివేశ పరికల్పనలతో చేసిన స్వతంత్రరచన యిదని గ్రహింపవలెను.

సంస్కృత సాహిత్య సంప్రదాయములపై ఆధారపడి తెలుగుకవులు తమ ప్రబంధాలలో పాటించిన కవిసమయములు, దోహదక్రియలు. సాలంకృతపద్మినీజాత్యంగనలు అకాలంలో తరులతాదులు పుష్పింపజేయుటకు చేయవలసిన క్రియలే దోహదక్రియలు. విజ్ఞానశాస్త్రముద్వారా సమర్థనీయము గాని ఈ సంప్రదాయమును పాటించి కవులు అత్యంతమనోరంజకమైన వర్ణనలు చేసినారు.

లక్ష్మి యను పేరునకు యూరోపియనుల ఉచ్చారణలో వికృతమైన లాక్‍మె యను పేరుగల ఆపెరా ఎడ్మోఁ గోడినే మఱియు ఫిలీప్ జీలా అను ఫ్రెంచి కవుల రూపకరచనకు సుప్రసిద్ధుఁడైన ఫ్రెంచి సంగీతకారుఁడు లియో డెలీబ్ సంగీతరచన చేసిన సంగీతరూపకము.

లూచియా డి లమర్‌మూర్ అనునది సాల్వదోరే కమ్మరానో అను ఇటాలియను కవి రచించిన విషాదాంతసంగీతరూపకము. దీని నితడు సర్ వాల్టర్ స్కాట్ రచించిన లమర్‌మూర్ వధువు అను నవల ననుసరించి రచించియుండెను. ఈ రూపకమును సుప్రసిద్ధుడైన ఇటలీదేశసంగీతకర్త గితానో దొనిట్సెత్తి సంగీతబద్ధము చేసెను.

ప్రాంగణంబులయందున ప్రమదలెల్ల
రంగురంగుల వ్రాసిన రథములందు
యానమొనరించి యేతెంచె నదిగొ కనుడు
మకరసంక్రాంతిలక్ష్మి సమ్మదముతోడ

ఆయుత్సవములో ముస్తఫాకడ దాసులుగా నున్న ఇటలీదేశీయులు బృందగాయకులుగా పాల్గొన్నారు. కామాంధుడైన ముస్తఫా ఆ సభ్యత్వము గైకొని, దాని నియమములను తప్పక పాటింతునని ప్రమాణము చేసినాడు. ఆ నియమములు సుష్ఠుగా నిరంతరము తినుచుండుట, సురాపానము చేయుచుండుట, చుట్టూరా ఏమి జరుగుచున్నను దానిని పట్టించుకొనక యుండుట – అనునవి.

లా సెర్వ పద్రోనా అనునది జెన్నర్ ఆంతోనియో ఫ్రెదెరికో అను రచయిత ఇటాలియను భాషలో వ్రాసిన గేయరూపకమునకు ఇటాలియను సంగీతకర్త యగు జ్యోవానీ బత్తిస్తా పెర్గొలేసీ అను నతడు సంగీతరచన చేసిన లఘుసంగీతరూపకము. లోగట ఈమాటలో ప్రచురింపబడిన నారెండు ఆపెరాలవలెనే, ఇందులో గూడ సులువైన పదములుగల కంద, గీత, ఆటవెలదులను, గేయములను వ్రాసినాను.

ఇల్ మాత్రిమోనియో సెగ్రేతో అనునది జొవాన్ని బెర్తాతి ఇటాలియను భాషలో వ్రాసిన గేయరూపకమునకు సుప్రసిద్ధ ఇటాలియను సంగీతకర్త యగు దొమీనికో చిమరోసా అను నతడు సంగీతరచన చేసిన సుప్రసిద్ధమైన సంగీతరూపకము . హాస్యరసాన్వితమైన అన్ని ఆపెరాలకును ఇది తలమానికమైనదని సంగీతపండితుల అభిప్రాయము.

ఇటాలియను భాషలో నున్న అత్యంత రసవత్తరమైన ఈ రూపకముయొక్క ఆంగ్లానువాదమును ఆధారముగా చేసికొని, తెలుగులో దీనిని పునర్మించితిని. ఇది ఇంగ్లీషు ప్రతికి అనుకరణయే కాని అనువాదము కాదు, మూలేతివృత్తాధారముగా నిర్మింపబడిన స్వతంత్ర రచన. మూలములో నున్న సన్నివేశములు, పాత్రల పేర్లు భారత సంస్కృతికి తగునట్లుగా మార్చబడినవి.

మరణముఖమును అరయుచున్నను ఇంత చక్కగ, నింత భావస
మంచితంబుగ నల్లినాడవు మేదినీసుర! నీదు కవితను

నీదుమహిమను నేనెఱుంగక నీకు వేసితి నిధనశిక్షను.
నాదు సుతపై నీదు ప్రేమము ఉత్తమాశయయుత మద్వితీయము.

చిత్రకవిత్వము యొక్కయు, ఆశుకవిత్వము యొక్కయు ప్రధానాశయము వినోదమే. చిత్రకవిత్వమును కవి ముఖ్యముగా తన పాండిత్యప్రకర్షను ప్రదర్శించుకొనుట కనేక నిర్బంధములకు లోనయి వ్రాయుట జరుగుచున్నది. ఇట్టి నిర్బంధములకు లోనయినను, చక్కని పద్యము నల్లిన కవి యొక్క మేధాశక్తి విస్మయావహముగా నుండుటయు, అట్టి మేధాశక్తికి పాఠకుడు అబ్బురమును, ఆనందమును పొందుటయు ఇట్టి కవిత్వము యొక్క ప్రధాన ప్రయోజనము.

గ్రంథమును కవి శ్రీకారముతో గూడిన మగణముతో ఆరంభించినాడు. ఇట్టి ఆరంభము కవికిని, కావ్యపఠితల కును శుభప్రదమగుమని ఛందశ్శాస్త్రము. తరువాతి శ్లోకములో చెప్పినట్లుగా శృంగారరసప్రధానమైన కావ్యమును వ్రాయ సంకల్పించుచున్నాడు గనుక కవి గోపికాస్త్రీశృంగారచేష్టాయుతమైన మంగళశ్లోకముతో కావ్యారంభము చేసినాడు. గోపికాసాంగత్యముచే సంతుష్టుడైన శ్రీకృష్ణుడు కావ్యపఠితలను గూడ సంతుష్టులను జేయగలడని కవియొక్క ఆశయము.

ప్రియుని తనకడకు రప్పించుకొనునది గాక, తానే ప్రియుని సంకేతస్థలమున కలసికొనునది రెండవ రకమైన అభిసారిక. గూఢముగా వెన్నెలరాత్రులలో నభిసరించు స్త్రీకి జ్యోత్స్నాభిసారిక యనియు, అట్లే చీకటిరాత్రులలో నభిసరించు స్త్రీకి తమోభిసారిక, లేక తమిస్రాభిసారిక యనియు పేర్లు.

ప్రియుని ప్రవాసవార్తను విన్నంతనే ఆమె తనువు కృశించినది. కన్నీరు నిరంతరముగా కారిపోయినది. ఆ వెళ్ళబోవుప్రియునితో అతనికి మిత్రములైనట్లుగా ఇవన్నియు బయలుదేరినవి. ఒక్క ప్రాణము మాత్రమే ఆమెలో మిగిలియున్నది. ఓప్రాణమా! నీవును నీకు మిత్రసమానులైన వారితో బోవక ఎందుకున్నావు? అని యామె ప్రశ్నించుచున్నది.

రాత్రి యంతయు అన్యకాంతతో గడపి, ప్రొద్దున సంభోగ చిహ్నములతో నిలు చేరిన ప్రభువును జూచి ఖండితానాయిక వక్రోక్తిగా ననుచున్నది: రాత్రియో మూడుజాములు మాత్రమే. తమరికో ప్రియాసంఘము వేయింటి కున్నది. ఏదో తెల్లవాఱి దారిని బోవుచు ఈయింటిలో దూరితిరి. తాము ప్రభువులు (సరసులు గారనుట).

గృహమును, దేహమును చక్కగా నలంకరించుకొని, చెలికత్తెలతో నాయకుని గుణగణములను ముచ్చటించుచు, అతని రాకకై ఎదురుచూచునట్టి వాసకసజ్జిక, అతడెంత కాలమునకును రాకపోవుటచే నుత్కంఠాపూరితయై, అతని విరహమును సహింపలేక విరహోత్కంఠిత యగును.

ఇది నేను కొన్ని నెలలక్రింద ఈమాటలో ప్రచురించిన ‘వాణి నారాణి’ అను నాటికలో సందర్భానుసారముగా ఐదుపాటలను వివిధరాగములలో వ్రాసితిని. శ్రీమతి చర్ల రత్నశాస్త్రిగారు ఆ ఐదుపాటలను పాడిరి. ఆపాటలతో గూడిన పినవీరనవృత్తాంతము నిక్కడ ప్రదర్శించుచున్నాను.

మాదొక చిన్న విన్నపము. విద్యాశాఖామాత్యులు మీరు తలచుకుంటే తక్షణం అనుగ్రహింపవలసినది …
 

మంత్రివృషభమ! మాదుగ్రామంబునందు
పాఠశాలను నెలకొల్పు ‘ప్లాను’ గలదు;
దీనికై మీప్రభుత్వంపు దీవెనలను,
‘పర్మిటును’ గోరుటకు నిట వచ్చినాము.

క్రిందటి రాత్రి వఱకును గావ్యమునకు పినవీరభద్రుఁడు శ్రీకారము చుట్టలేదని రాజునకును, సభికు లకును దెలియును. ఒకరాత్రిలో నాశువుగ నైనను అంతటి మహాకావ్యమును వ్రాయుట దుర్లభ మని సభికు లభియోగము దెచ్చిరఁట. అప్పుడు పినవీరభద్రకవి ‘వాణి నారాణి’ యనియు, తన కది యసా ధ్యము కాదనియు వారికి బదులు చెప్పెనఁట!

రాజకుమారి యామిని ఉంది చూడు. ఆ అమ్మాయి ఒక కాశ్మీరకవీంద్రుని వద్ద సంస్కృతం నేర్చుకుంటున్నదని నీకింతకు ముందు చెప్పినాను కదా! ఆయనను నేను చూచినాను. ఆయన మహాపండితుడు, గొప్పకవి అంటే విన్నాను. అంతే కాదు. ఆయనంతటి స్ఫురద్రూపిని నేనెన్నడూ చూడలేదు. నీలవర్ణం బదులు బంగారు రంగుతో మెఱిసే శ్రీకృష్ణమూర్తిలాగ ఆయనుంటాడు. అంతేకాక ఆయన యువకుడు గూడ.

పున్నాగములు కొన్ని మూర్ధంబునందు,
కాంచనంబులు కొన్ని కంఠంబునందు,
మల్లెపూవులు కొన్ని యుల్లంబునందు,
హల్లకంబులు కొన్ని హస్తంబులందు,
పంకజంబులు కొన్ని పాదంబులందు,

అతనితీరును గనుచున్న యామె తరళ
నేత్రము లతని కనులతో మైత్రి నెఱపె;
అంత మందాక్షమందాక్ష యగుచు నామె
వెన్కవెన్కకు తగ్గుచు వెడలసాగె.

సిరియాళదేవి క్రీ.శ.300 ప్రాంతములో కందారపురము రాజధానిగా ఆంధ్ర,తెలంగాణ ప్రాంతములలో కొంతభాగము నేలిన సోమదేవరాజు ధర్మపత్ని. ఈ సోమదేవునికి, ధాన్యకటకము (అమరావతి) ముఖ్యపట్టణముగా నేలుచుండిన బల్లహునికి నిరంతర యుద్ధములు జరుగుచుండెను.

కావ్యనాటకసంగీతకళలయందు
పండితుండైన కాకతిప్రభున కామె
కావ్యనాటకసంగీతకళలయందుఁ
దనరు పాండితిచేత మోదంబు గూర్చు.

మస్తానీ బాజీరావుల ప్రణయగాథ రతీమన్మథుల కథవలె భారతీయులకు చిరస్మరణీయమైనది. ఈతడు బుందేలుఖండము నేలుచుండిన హిందూప్రభువైన ఛత్రసాలునికి పారసీక వనితవల్ల గల్గిన మస్తానీయను ముస్లిముకాంతను వివాహమాడెను.

కఱ్ఱచట్రంబు పైఁ గట్టి గట్టిగాను
చిత్రలేఖన కనువైన శ్వేతపటము
వ్రాయఁ గాఁ గడంగితిఁ దద్వి హాయసానఁ
గ్రాలు ఘనమాలికాచిత్రమాలికలను.

మునులచందము గానల మనుచునున్న
గిరికుమారుల మస్తిష్కసరణులందు
మెఱపుతీవలవోలె సంస్ఫురితమైన
భావబింబములొకొయీ ప్రపాతతతులు!

బ్రహ్మతేజము మీరు ఫాలభాగమునందుఁ
దిరునామదీప్తులు మెఱయుచుండ,
ఎత్తుబాహులయందు బెత్తెడంచుల జరి
యుత్తరీయపుకాంతి యోలగింప.
వెడదయురమ్ముపై నిడుపైన యజ్ఞసూ
త్రద్వయవిద్యుతుల్ దనరుచుండ,
మల్లెపూడాలుకుం జెల్లెలై విలసిల్లు
తెల్ల దోవతికాంతి యుల్లసిల్ల,

గగనమందలి తారకాగణము లెల్ల
అవనికిం జాఱిపడినవో యనఁగఁ గురిసె
అర్యమాంశుభాస్వంతంబు లగుచు ధవళ
హిమకణంబులు ధాత్రిలో నెందుఁ గనిన

ఈవ్యాసంలో నేను కవిత్వానికి ఛందస్సు అవసరమా, అనవసరమా అనే వాదానికి తలపడడంలేదు. ఛందస్సులో వ్రాసిన సంప్రదాయకవులను భూషించడం లేదు, వ్రాయని వచనకవులను దూషించడం లేదు. కాని, సంస్కారవంతుడైన కవికి కవితావేశం కల్గినప్పుడు వెలువడే కవిత్వంలో ఛందస్సు స్వయంభువుగా – అంటే తనంతకు తానే – ఉద్భవిస్తుందని నిరూపించ దలచుకొన్నాను.