చివరి కచేరి

“నీలాంబరి లేచి కాస్త ఏమైనా ఎంగిలి పడిందా?”

లేని ఓపిక గొంతులోకి తెచ్చుకుంటూ అడిగారు చిదానంద శాస్త్రి. పక్కనే కూర్చుని ఉన్న భార్య బాలాత్రిపురసుందరీదేవిని. “లేదు. పిల్ల మూసిన కన్ను తెరవలేదు” అన్నది ఆందోళన నిండిన స్వరంతో చిదానంద శాస్త్రి మొహం చిన్న బోయింది ఆ జవాబుకు.

ఆయనలో ఆందోళన ఎక్కువయింది. ఒక పక్కన నీలాంబరి మూసిన కన్ను తెరవకుండా పడుకుని వున్నది. మరొక పక్కన కచేరీకి పట్టుమని రెండు రోజులు సమయం కూడా లేదు. ఈలోగా నీలాంబరికి తగ్గకపోతే ఎలా? దేవుడు ఎందుకిలా ఆడుకుంటున్నాడు? జరగబోయేది తన చివరి కచేరి. ఈ కచేరి తరువాత తానిక కచేరీలు చేయబోవడం లేదు. “చిదానంద శాస్త్రి గారి చివరి కచేరీ” అని నిర్వాహకులు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని వున్నారు. కచేరీ రసాభాస అయితే ఎంత అప్రతిష్ట. గత పది సంవత్సరాలుగా నీలాంబరే తనకు వయోలిన్ సహకారం అందిస్తున్నది. నీలాంబరి లేకుండా కచేరీ ఊహించను కూడా ఊహించలేము. నీలాంబరి కేవలం వయోలిన్ సహకారం మాత్రమే కాదు, అవసరమైతే తనకు కుడిభుజంలా నిలబడగలదు కూడా!

ఆలోచనలతో ఆయన మనసు వేడెక్కింది. అప్రయత్నంగా “ఏమి సేతురా లింగా!” చిదానంద శాస్త్రి పెదవుల మీద కదలాడింది. మరుక్షణంలో ఆయన హృదయంలో భారం దిగిపోయినట్టు అయింది. మనసు కాస్త నిమ్మళించింది. అంతా ఆ సర్వేశ్వరుడే చూసుకుంటాడు అన్న ఆలోచన మదిలో మెదలాగానే ఆయన మెల్లగా లేచి నీలాంబరి దగ్గరకు వెళ్ళాడు. మంచం మీద గువ్వపిట్టలా ముడుచుకుని పడుకున్న నీలాంబరి తల మీద చెయ్యేసి ఆప్యాయంగా నిమిరాడు. ఆ స్పర్శకి నీలాంబరి కళ్ళెత్తి చిదానంద శాస్త్రి వంక చూసింది. ఆమె కళ్ళనిండా నీళ్లు. ఆయన ఫర్వాలేదన్నట్టు చూసి ఆమె పక్కన రెండు నిమిషాలపాటు కూర్చుని బయటకు వెళ్ళిపోయాడు. ఆయన పెదవుల మీద అన్నమయ్య నాట్యమాడుతున్నాడు

చిదానంద శాస్త్రికి డెబ్బయి పైనే ఉంటుంది వయసు. మొహంలో వృద్ధాప్యం కొలువు తీరినా స్వరం మాత్రం ఇంకా యవ్వనంలోనే వుంది. ఇంకా ఇంకా సంగీత కచేరీలు చేయాలని మనసులో వున్నా శరీరం సహకరించకపోవడంతో గత రెండేళ్ల నుండీ కచేరీలు చేయడం మానేశారు ఆయన. కానీ మొన్నీమధ్య ఆయన శిష్యులు అందరూ కట్టకట్టుకుని వచ్చి చిదానంద శాస్త్రి లాంటి గొప్ప సంగీత విద్వాంసుడు అనామకంగా సంగీత రంగం నుండి నిష్క్రమించడం బావోలేదని, సంగీతానికి చిదానంద శాస్త్రి చెప్పే వీడ్కోలు నభూతో నభవిష్యతి అనేలా వుండాలని పదే పదే పోరు పెట్టడంతో ఆయన తన చివరి కచేరీని చేయడానికి ఒప్పుకున్నారు. కానీ ఇదివరకులా ఎక్కువ సేపు చేయలేనని కచేరీ మరీ దీర్ఘంగా కాకుండా మరీ లఘువుగా కాకుండా మధ్యస్థంగా ఉంటే బావుంటుందని సూచించారు. సరిగ్గా రెండు రోజులు కూడా లేదు. ఈలోగా నీలాంబరికి ఒళ్ళు తెలియని జ్వరం. ఈ కచేరీ ఎలా ముగుస్తుందా అని ఆయనకు ఆందోళనగా వుంది

అలా ఆందోళన పడుతూనే చిదానంద శాస్త్రి గతంలోకి జారుకున్నాడు


మాతృగర్భంలో ఉన్నప్పుడే చిదానంద శాస్త్రికి సంగీతం మీద ఆసక్తి కలిగింది. చల్ల చిలుకుతూ, ఇంటి పనులు చేసుకుంటూ తల్లి పాడే సాంప్రదాయ కీర్తనలు, మంగళహారతి పాటలు వింటూ ఊ-కొట్టిన చిదానంద శాస్త్రికి లోకంలోకి వచ్చి పడ్డాక చదువు అర్ధం కాని బ్రహ్మ పదార్థంగా మిగిలితే సంగీతం మాత్రం సూదంటు రాయిలా ఆకర్షించింది. సంగీతం పట్ల ఉన్న ఆసక్తి చూసి చిదానంద శాస్త్రి తండ్రి రామ్మూర్తి ఒక సంగీత విద్వాంసుడి దగ్గర చిదానంద శాస్త్రిని వదిలేసాడు. ఆసక్తి, అనురక్తి రెండూ సంగీతం మీద ఉండటంతో నాలుగురోజుల్లోనే ఆ సంగీత విద్వాంసుడి దగ్గర తనకు కావలసింది ఏదీ లేదని చిదానంద శాస్త్రికి అర్ధం అయింది.

రాజమండ్రి వీరేశలింగం సాహితీ సాంస్కృతిక సంస్థ నిర్వహించిన సంగీత పోటీలకు హాజరైన చిదానంద శాస్త్రి తన పన్నెండేళ్ల వయసులో మొదటి సారి పోటీలలో పాల్గొన్నాడు

ఆ పోటీలకు న్యాయ నిర్ణేతగా వచ్చిన శ్రీపాద పినాక పాణి దృష్టిలో పడ్డాడు. ఫలితంగా మరుసటి రోజే పినాక పాణి ఇంటికి మారిపోయాడు. ఎనిమిదేళ్లు పినాకపాణి చిదానంద శాస్త్రిని కన్నబిడ్డ లాగా చూసుకున్నాడు.

మొదటి కచేరీ కాకినాడ సరస్వతీ గానసభలో. భయం భయంగా వేదిక ఎక్కిన చిదానంద శాస్త్రి ఒక్క సారి మనసారా శ్రీపాద పినాక పాణికి మనసులోనే నమస్కరించుకుని “వాతాపి గణపతిం భజే” అనే దీక్షితార్ కీర్తనతో సభికుల ముందు గొంతు విప్పాడు.

పేరి సుబ్బారావు మృదంగ సహకారం ఇస్తే నరసింగ రావు వయోలిన్. చిన్న పిల్లాడు ఏమి పాడతాడులే అనుకున్న సభికులు అంతా దాదాపు రెండుగంటల పాటు ఆ సంగీత సాగరంలో ఓలలాడారు. ద్వితీయ విఘ్నం కాకుండా కాకినాడలోనే శ్రీ రామ భక్త సమాజం చిదానంద శాస్త్రి కచేరీ ఏర్పాటు చేసింది. అలా మొదటి రెండు కచేరీలు ఆంధ్ర దేశపు తంజావూరు కాకినాడలోనే కావడంతో చిదానంద శాస్త్రికి వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది

ఒకసారి త్యాగరాయ గానసభలో కచేరీ. లాల్గుడి జయరామన్ వయోలిన్ వాయిస్తున్నారు. చిదానంద శాస్త్రి “జానకీ రమణ కల్యాణ సజ్జన” అనే రామదాసు కీర్తన త్రిపుట తాళంలో కాపీ రాగంలో పడుతున్నారు. సాధారణంగా కాపీ రాగం ఎవరూ విస్తారంగా పాడరు. కానీ చిదానంద శాస్త్రి ఆ రోజు మహా ఉత్సాహంలో ఉండి కాపీ రాగాన్ని చాలా విస్తారంగా, విస్తారంగా పాడి లాల్గుడి జయరామన్ వంక వయోలిన్ నాదం కోసం వాయించమన్నట్టు చూసారు. లాల్గుడి” నేనిక వాయించను!” అన్నారు. లాల్గుడి లాంటి గొప్ప సంగీత నిధి, అదీ కచేరీ మధ్యలో వాయించను అనేసరికి చిదానంద శాస్త్రికి లాల్గుడి జయరామన్‌కి కోపం వచ్చిందేమో అన్న అనుమానం వచ్చి “నేనేమైనా పొరపాటు చేస్తే క్షమించండి. దయచేసి వయోలిన్ తీసుకోండి” అన్నారు.

అయినా లాల్గుడి “లేదు. నేను వాయించను. నువ్వు పాడేయి” అన్నారు.

చిదానంద శాస్త్రి లాల్గుడి వంక తేరిపారా చూసారు. ఎక్కడైనా కోపఛాయలు కనిపిస్తాయేమోనని. ఈలోగా శ్రోతలలో నుండి ఒకరిద్దరు, నిర్వాహకులూ వేదిక పైకి వచ్చి లాల్గుడి జయరామన్ వయోలిన్ వాయించమని బతిమాలారు. ఆయన ససేమిరా వాయించడానికి ఒప్పుకోకుండా “నేను వాయించను. నువ్వు పాడేయి” అన్నారు. చిదానంద శాస్త్రి కీర్తన పూర్తి చేసారు.

ఆ వెంటనే మరొక త్యాగరాజ స్వామి వారి కీర్తన “కాల హరణ మేలరా హరే సీతారామ” శుద్ధ సావేరి రాగంలో రూపక తాళంలో అందుకున్నారు. లాల్గుడి జయరామన్ ఈసారి వయోలిన్ అద్భుతంగా వాయించారు.

రెండు గంటల సేపు త్యాగరాయ గాన సభ కర్ణాటక సంగీతాంబుధిలో ఓలలాడింది. వేదిక దిగివచ్చాక చిదానంద శాస్త్రి లాల్గుడి జయరామన్‌ని “ఎందుకండీ ‘జానకీ రమణ’ పాటకు వయోలిన్ ఇవ్వలేదు” అని అడిగారు.

దానికి లాల్గుడి జయరామన్ చిన్నగా నవ్వి “నేను వాయించటానికి నువ్వు ఏమి అట్టేపెట్టావు నాకు? నువ్వు కాఫీ రాగం సంపూర్ణంగా పాడేసావు. అంచేత నాకేమీ మిగల్లేదు. అప్పుడు నేను ఇంక వాయిస్తే బాగుండదు. అందుకనే పాడేయమన్నాను” అన్నారు

అంతకు మించిన ప్రశంస ఏముంటుంది?

అదంతా గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకున్నాడు చిదానంద శాస్త్రి

చిదానంద శాస్త్రికి ఇద్దరు మగపిల్లలే. వాళ్ళిద్దరికీ సంగీతం అంటే ఆసక్తి శూన్యం.

“నాన్న తరం అంటే గడిచిపోయింది కానీ ఇప్పుడు ఇంగ్లిష్ చదువుకుని ఏదో ఒక వుద్యోగం సంపాదించుకోక పోతే జీవితం గడవడం కష్టం. అయినా నాన్నకి గొప్ప సంగీత విద్వాంసుడు అన్న పేరు తప్పిస్తే ఏమి మిగిలింది? నలుగురు చుట్టాలు ఒక్కసారే వస్తే ఒకరో ఇద్దరో బయటకు వెళ్ళవలసినంత చిన్న ఇల్లు. బొటాబొటీగా ఇల్లుగడవడం తప్పిస్తే ఇంకేమైనా ఉందా?” అని ఇద్దరు మగ పిల్లలూ ఏక స్వరంతో అంటారు.

మగ పిల్లలు అలా అంటారు కానీ చిదానంద శాస్త్రికి మాత్రం ఆ ఇద్దరు మగపిల్లలకి తోడుగా మరొక ఆడపిల్ల ఉంటే బావుండును అనిపిస్తుంది.

“ఒక్క ఆడపిల్లైనా ఉంటే, ఇంటికి వచ్చే ఆ శోభే వేరు” అని లోలోపల ఉంటుంది. తన తరువాత తన వంశానికి కొనసాగింపు ఉంటుంది కానీ తన సంగీతానికి కొనసాగింపు లేదు అనే భావన తనను అప్పుడప్పుడూ వేధిస్తూ ఉండేది. ఆ రోజులలోనే ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కచేరీ ముగించుకుని ఆయన రాజమండ్రి బయలు దేరారు రాత్రి పన్నెండు గంటలప్పుడు. రాజమండ్రి చేరుకునేసరికి తెల్లవారుజామున నాలుగు గంటలు అయి ఉంటుంది. మెయిన్ రోడ్ మీద రిక్షా దిగి తన ఇంటి వైపు నడుచుకుంటూ వెళుతూ ఉంటే చిన్నగా మూలుగు లాంటి ఏడుపు ఏదో వినిపించింది. ఆయన పరిశీలించి చూడగా పక్కనే వున్న ముళ్లపొదల్లో ఒక పసిపాప ఏడుస్తూ కనిపించింది. గబగబా దగ్గరకు వెళ్లాడు. బహుశా ఈ లోకంలోకి వచ్చి రెండు మూడు రోజులకంటే ఎక్కువ అయి ఉండదు. దగ్గరకు వెళ్లి చూశాడు. ఆడ పిల్ల. ఆయన మనసు ఆగక చేతిలోకి తీసుకున్నాడు. చుట్టుపక్కల ఎవరూ లేరు.

తాను నిత్యం పూజించే అమ్మవారే తనకాబిడ్డను అనుగ్రహించింది అనుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు.

అలా తన ఇంటికి చేరుకున్న పసి పాపకి తనకు ఇష్టమైన నీలాంబరి రాగం పేరు పెట్టుకున్నాడు. రోజులు గడిచే కొద్దీ, పాప మాటలతో తమను అలరిస్తుంది అనుకుంటే పధ్నాలుగు నెలలు గడచినా పాప “తాత” అనో, “మామ” అనో అనక కేవలం శబ్దాలు మాత్రమే చేయడంతో హతాశుడై పోయాడు. ఇంట్లో ఇద్దరు మగపిల్లలు గొడవ. మూగదాన్ని తీసుకొచ్చి అదనపు భారం నెత్తిన వేసుకున్నాడు అని.

చూస్తుండగానే నీలాంబరికి ఐదేళ్లు వచ్చాయి. ఏదో ఒక అద్భుతం హఠాత్తుగా జరిగితే తప్ప ఆమెకు మాటలు రావని సంప్రదించిన డాక్టర్లు అందరూ చెప్పేసారు

నీలాంబరి మాట్లాడలేదు కానీ చిత్రంగా సంగీతం మీద ఆసక్తి ప్రదర్శించింది. ఆమెకు వయోలిన్ నేర్పాలని నిర్ణయించుకున్నాడు చిదానంద శాస్త్రి. అలా నీలాంబరి వయోలిన్ సాధన చేయడం మొదలు పెట్టింది.

సాధారణంగా వయోలిన్‌లో వున్నత స్థాయి ప్రావీణ్యత సాధించాలి అంటే కనీసం ఒక దశాబ్దం పడుతుంది. కానీ నీలాంబరి ఎనిమిదేళ్లలోనే ఆ ప్రావీణ్యం సాధించింది. మొట్ట మొదటి సారి చిదానంద శాస్త్రికి ఆమె వయోలిన్ సహకారం అందించింది, తన పన్నెండవ ఏట విశాఖ పట్నం పోర్ట్ ట్రస్ట్ వారు రామ నవమి సందర్భంగా ఏర్పాటు చేసిన కచేరీలో. భయం భయంగా వేదిక ఎక్కిన నీలాంబరి మొదట వయోలిన్‌కి, తరువాత చిదానంద శాస్త్రికి నమస్కరించి వేదిక మీద ఆసీనురాలు అయింది

ఆమె మొదటి సారి హంసధ్వని రాగం, ఆది తాళం‌లో “గజవదన బేడువే గౌరీ తనయ బేడువే” అనే పురందర దాసు కీర్తన చిదానంద శాస్త్రి ఆలపిస్తుండగా వయోలిన్ సహకారం అందించింది. అది మొదలు మళ్ళీ వెనక్కు తిరిగి చూడలేదు. ఆ తరువాత నీలాంబరి చిదానంద శాస్త్రి ఎక్కడకు వెళ్లినా వయోలిన్ సహకారం అందించేది


చిదానంద శాస్త్రి మెల్లగా లేచి నీలాంబరి దగ్గరకు వెళ్లారు. నీలాంబరి కళ్ళు తెరచి శాస్త్రి వంక చూసి “తగ్గింది. ఫరవాలేదు” అన్నట్టు నవ్వింది. నీలాంబరి నవ్వు చూశాక చిదానంద శాస్త్రికి గుండెల మీద నుండి పెద్ద భారం ఎవరో చేత్తో తేసేసినట్టు అనిపించింది. ఆమె మంచంమీద కూర్చుని ఆమె చేతులు తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా స్పర్శించాడు. చిదానందశాస్త్రి పితృపూర్వక స్పర్శ ఆమెలో కొత్త ఉత్సహాన్నీ కలిగించింది.

చిదానంద శాస్త్రి వంక కృతజ్ఞతగా చూసిందామె. “శాస్త్రి గారు లేకపోతే తానేమైవుండేది? ఈ ప్రశ్న తలచుకున్నప్పుడల్లా నీలాంబరి తల్లకిందులు అయిపోతుంది. అనాథను, అందునా మూగపిల్లను ఎవరు మాత్రం సొంత కూతురులా పెంచుతారు? చిదానంద శాస్త్రి ఆ పని చేశాడు. కళ్ళు కూడా తెరవని పసిగుడ్డును తీసుకుని వెళ్ళినప్పుడు “చేతిలో ఉన్న పసి బిడ్డను” చూసి భార్యే పెదవి విరిచింది. “కులమూ, గోత్రమూ లేని దానిని ఎలా పెంచుకుంటాము?” అని దీర్ఘం తీసింది

అయినా చిదానంద శాస్త్రి భార్యకు జంక లేదు. నీలాంబరి ఇంట్లో ఉండాల్సిందే అని చిదానంద శాస్త్రి పట్టుబట్టాడు. నీలాంబరికి మాటలు రావని తెలిసిన తరువాత బాలాత్రిపురసుందరి ఆమెను వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. చిదానంద శాస్త్రి ఒకసారి కచేరి చేయడానికి విశాఖపట్నం వెళితే ఆయన వచ్చేలోగా నీలాంబరిని తీసుకుని వెళ్లి అనాథ శరణాలయంలో చేర్పించి వచ్చింది. సంగతి తెలిసిన చిదానంద శాస్త్రి మళ్ళీ నీలాంబరిని తీసుకుని వచ్చాడు. చిన్న పిల్లే అయినా నీలాంబరి కీప్ అన్నీ అర్ధం అవుతూనే ఉండేవి. మాట్లాడాలని ఎంతగా గొంతు చించుకున్నా స్వరం బయటకు వచ్చేది కాదు. చిదానంద శాస్త్రి తెల్లవారు ఝామునే నిద్ర లేచి అన్నమయ్య, త్యాగరాజు కీర్తనలు పాడుతుంటే తానూ కూడా ఆయనతో కలిపి స్వరం కలిపేది. అయితే ఆ గాత్రం స్వర పేటికను చీల్చుకుని బయటకు వచ్చేది కాదు. నీలాంబరికి మాట రాదు అన్న లోపం తప్పిస్తే మిగతా అవయవాలన్నీ రెట్టింపు సామర్ధ్యంతో పనిచేసేవి. సహజంగా పుట్టుకతో మూగ అయిన వాళ్లకు వినికిడి లోపం కూడా ఉంటుంది అంటారు కానీ నీలాంబరికి ఆ లోపం లేదు. ఆమె ఏదయినా ఒక్కసారి వింటే చాలు ఇట్టే గుర్తుపెట్టుకుంటుంది. నీలాంబరికి ఒకటే నమ్మకం. అది తన పట్ల తనకు ఉన్న విశ్వాసం కావచ్చు, లేదా తాను నమ్ముకున్న అమ్మవారి పట్ల నమ్మకం కావచ్చు, ఏదో ఒక క్షణంలో తన గొంతు పెగిలి మాటలు ధారాపాతంగా వర్షిస్తాయని.

చిదానంద శాస్త్రి పాడే ప్రతి కీర్తనా ఆమెకు కంఠోపాఠం. ఆయనకే ప్రత్యేకమైన కాపీ రాగ విస్తరణ ఆమె కూడా మనసులో అచ్చం ఆయనలాగే చేసేది. ఆయన తనకు వయోలిన్ నేర్పించడం తన అదృష్టం అనుకుంటుంది నీలాంబరి.

వయోలిన్ నేర్చుకునేటప్పుడు ప్రతి స్వరం యొక్క ఖచ్చితమైన స్థానాన్ని, ప్రతి తీగపై, ప్రతి స్థానంలో గుర్తుంచుకోవాలి. ఇది ఎవరికైనా కష్టంగా ఉంటుంది అనే కంటే భయంకరంగా వుంటుంది అంటే కచ్చితంగా ఉంటుంది. వయోలిన్ వాయించేటప్పుడు ఉన్నత స్థానాలకు వెళ్లినప్పుడు విరామాల మధ్య పరిమాణం మారుతుంది కాబట్టి, ఖచ్చితమైన నమూనాను పునరావృతం చేయడానికి బదులుగా, చేయి పైకి వెళ్లేటప్పుడు చిన్న సర్దుబాట్లు చేయాలి. ఈ సర్దుబాటును చాలా అద్భుతంగా, అతి తక్కువ సమయంలో నీలాంబరి నైపుణ్యం సాధించింది.

మొదటి సారి చిదానంద శాస్త్రి వయోలిన్ సహకారం అందించిన రోజు నీలాంబరి ఆనందం అంబరాన్ని తాకింది. ఇలా ప్రాణం ఉన్నంత వరకూ చిదానంద శాస్త్రి గారికి వయోలిన్ సహకారం అందిస్తూ ఆయన ఋణం కొంతైనా తీర్చుకోవాలి అనుకుని లోలోపల గట్టిగా సంకల్పించింది.


ఆ రోజు ఉదయం నుండే హడావిడి మొదలయింది. ఆ హడావిడికి తగ్గట్టు గానే నీలాంబరికి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ఆమె తెల్లవారుజామునే లేచి గంటసేపు వయోలిన్ సాధన చేసింది. సాయంత్రం నాలుగయ్యేసరికి కళాక్షేత్రానికి బయలు దేరారు చిదానంద శాస్త్రి, నీలాంబరి ఒక జట్టుగా. బాలాత్రిపురసుందరి, ఇద్దరు మగపిల్లలు మరొక జట్టుగా. అప్పటికే కొంతమంది రసజ్ఞులైన ప్రేక్షకులు వచ్చి రాకరకాలురా సమయం గడిపేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది వస్తూ వస్తూ వున్నారు.

వేదికను చాలా అందంగా అలంకరించారు. చిదానంద శాస్త్రి గారు, మిగతా వాద్య బృందం సుఖంగా కూర్చోవడానికి మెత్తటి పరుపులు వేశారు. వెనుక భాగంలో కర్ణాటక సంగీత త్రిమూర్తుల నిలువెత్తు చిత్రాలు అందరికీ కనపడేలా అమర్చారు. వేదిక రెండు పక్కలా నిలబెట్టిన అరటి శాఖలు ఒక పండుగ వాతావరణాన్ని ప్రతిబింబింప చేస్తున్నాయి.

అప్పటికి సరిగ్గా ఆరుగంటలు అయింది. హాలు పూర్తిగా నిండి పోయింది. చిదానంద శాస్త్రి శిష్యులలో ఒకరు వేదిక మీదకు వచ్చి చిదానంద శాస్త్రి గురించి లఘు పరిచయం చేశారు. తరువాత చిదానంద శాస్త్రిని వేదాశీర్వచన మంత్రాలతో వేదిక మీదకు నలుగురు శిష్యులు తోడ్కొని వచ్చారు. అందరూ కలిసి పూల దండలు, శాలువాలు, అంతకంటే ఘనమైన ఆసిర్వచనాలతో నభూతో నభవిష్యతి అన్నట్టు సన్మానించిన తరువాత కచేరీ మొదలు అయింది

వాతాపి గణపతిం భజేతో ప్రారంభించి మెల్లగా శ్రోతలను తన సంగీతావరణంలోకి లాక్కున్నారు. నీలాంబరి వయోలిన్, మృదంగ చంద్రశేఖర్ సహకరిస్తుండగా, త్యాగరాజ విరచిత ‘మోక్షము కలదా!’ అనే కీర్తనను సారమతి రాగంలో పాడడం ప్రారంభించారు ఆ కీర్తనతో కిక్కిరిసిన సభామందిరం యావత్తు అదోరకమైన తన్మయస్థితిలో తేలిపోయింది. త్యాగరాజస్వామి వారు ఎంతటి ఆర్తితో ఆ కీర్తన రాసారో అదే ఆర్తి, చిదానంద శాస్త్రి స్వరంలో తొణికిసలాడింది. అద్భుతమైన ఆలాపన, స్వరకల్పన సంగీత ప్రియులను సమ్మోహితులను చేసాయి. సుమారు నలభయ్ అయిదు నిమిషాలపాటు ఆడిటోరియం, చిదానంద శాస్త్రి సంగీత లహరిలో మునకలు వేసింది.

చివరగా తనకు ఎంతో ఇష్టమైన పురందర దాసు కీర్తన ‘వేంకటాచల నిలయం వైకుంఠ పుర వాసం పంకజ నేత్రం పరమ పవిత్రం, శంఖు చక్రధర చిన్మయ రూపం’ సింధు భైరవి రాగంలో ఆది తాళంలో ఆలపించడం మొదలు పెట్టారు. శ్రోతలంతా మంత్ర ముగ్ధులైపోయారు. స్వర రాగ గంగా ప్రవాహంలో తలమునకలై పోయారు. ”భక్త పోషక శ్రీపురందర విఠలమ్” అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్వరార్ణవంలో మునిగిన వారికి తేరుకోవడానికి నాలుగు క్షణాలు పట్టాయి. ముందుగా తేరుకున్నది నీలాంబరి.

ఆమె కంఠ నాళాలు తెంచుకుని మరీ బయటకు ”నాన్నా” అన్న పదం. చిదానంద శాస్త్రి ప్రాణాలు ఆ వేంకటేశ్వరుడిలో కలిసిపోయాయి. నీలాంబరి నోటి నుండి వెలువడుతున్న దుఃఖోద్విగ్న “నాన్నా! నాన్నా!” అన్న మాటలు మినహా ఆడిటోరియం మొత్తం దిగ్భ్రాంతిలో ఉండి పోయింది.