ప్రాణాంతక ప్రణయము

చతుర్థాంకము

ప్రథమదృశ్యము

స్థలము:వివాహశాల; సమయము: ఆనాటిరాత్రి; ప్రవేశము: మాలినీ మైత్రేయులు, తర్వాత ఇతరులు

(ప్రవరసేనుని సమక్షమున పగలు జరిగిన సంఘటనలు కామిని మనస్సును అత్యంతముగా కలచివేయును. అందువల్ల ఆమె ఉన్మాదస్థితికిఁ జేరుకొనును. తాను ముందుగా ప్రవరసేనుని కలసికొన్నట్టి తోఁటలోని జలయంత్రము చెంత అతఁడు నిలిచి తనను పిలుచుచున్నట్లు మిథ్యాదృశ్యమామె మనస్సుకు తోఁచును. ఆతని నా తోఁటలో వివాహము చేసికొనుచున్నట్లుగా తోఁచి ఆమె వెఱ్ఱిగా ప్రవర్తించును. ఈసందర్భములో ఆమె వదులైన తెల్లని వస్త్రములను ధరించి, చిందఱవందఱైన కేశములతో ప్రేతకళ గల్గిన ముఖముతో దయ్యమువలె భయంకరముగా నుండును.)

మాలిని:
ప్రవరసేనుని రాకచేఁ బగటియందు
సంభవించిన తీవ్రదృశ్యంబు లెల్ల
అతులసంక్షోభజనకంబు లగుచు నిపుడు
కూల్చె కామిని నున్మాదకూపమందు
ప్రేతకళతోడ వదనంబు భీతి గొల్ప
చెదరి వ్రేలుచు కేశముల్ చెలువు దప్ప
వదలువదులుగ వ్రేలాడు వలిపమొకటి
కట్టి దయ్యంబువలెఁ గనుపట్టు నామె
మైత్రేయుఁడు:
అన్నచే మున్నె వంచిత యైన యామె
మొగుడు పూవట్లు ఖిన్నయై పొగులుచుండె
అంతలో ప్రవరుండు ప్రత్యక్షమగుచు
ఆమె నున్మాదకూపంబు నందుఁ ద్రోసె
అవ్యవస్థితస్థితియందు నలమటించు
నామె యెపు డేమి చేయునో అరయ లేము

(వారిట్లనుకొనుచుండఁగనే తెల్లని వదులైన వస్త్రము ధరించి, చెదరినవెండ్రుకలతో, వికృతమగు ముఖముతో తీవ్రోన్మాదస్థితిలో కామిని ప్రవేశించును.)

కోరస్:
కనుఁడు కామిని, కనుఁడు కామిని
నడలు తడబడ అడలుచుం గడు
వెఱపు గొల్పెడు వికృతాకృతిఁ
బూని వచ్చును భూతమట్టుల
కామిని:
తాళుమో ప్రియుఁడ! తాళుమో ప్రవర!
ఏల తత్తరము నీకింత ప్రవర
లీలగా పక్షివలె గాలిలో నెగిరి
వ్రాలఁగాఁ జాల నీమ్రోల త్రుటిలోన
వచ్చితిని వచ్చితిని వడిగానె ప్రియుఁడ!
ముచ్చటలు దీరంగ మురిపెంబు మీర
చెచ్చెరను నాతోడ స్నేహంబుతోడ
ముచ్చటింపుము నీవు మోహనాకార!
వచ్చితిని వచ్చితిని వడిగానె ప్రియుఁడ!
వైరి నైతినె నీకు వచియింపు ప్రవర!
దూరమందున నుండి చేరరావేల?
కోర నన్యుని నేను కోరుదును నిన్నె
చేరితిని నిన్నె మన వైరులను వీడి
వణకుచుంటిని నేను వలిచేత ప్రవర!
కొనుము నీకౌఁగిటను నెనరునం బ్రవర!
మన ముంగరమ్ములను మార్చుకొని యున్న
వనమందుఁ జరియింప మనసయ్యె రమ్ము
వనమందుఁ జరియింప మనసయ్యె రమ్ము
ఇతరులు, కోరస్:
ఏమి కామిని ఏమి యీగతి
తెలివిఁ గోల్పడి పలుకుచుంటివి?
లేడు లేడిట లేడు ప్రవరుఁడు
భ్రమసి యూరక వదరుచుంటివి
స్వప్నజగమున సంచరించుట
మఱచి వాస్తవ మరసి మెలఁగుము
కామిని:
మీర లంధులు, చూడలేరు నిజంబు
తారవలె నిల్చెనిట మీరతనిఁ గనుఁడు
మన ప్రేమమును భగ్న మొనరింప నెంచు
జనులిందు నున్నారు మనచుట్టు ప్రవర!
వమ్ము చేతము రమ్ము వారి యతనమ్ము
లిమ్ముగాఁ బెండ్లాడి యిప్పుడే మనము
చిమ్ముచుం జలములం జిత్రంబుగాను
ఇమ్మహావనమందు నీయంత్రముండె
రమ్మిటం బ్రవర! కూర్చొమ్ము నాతోడ
ఇమ్మౌను మనపెండ్లి కీస్థలమె చాల!
అయ్యయో ఈనీటి యంత్రంబునుండి
దయ్యంబు లెగబ్రాకి తర్జించు నన్ను
రమ్మింక దాగుదము రక్షణార్థంబు
కొమ్మలం గుబురైన కుంజంబునందు
మాలిని,కోరస్:
ఎంత ఘోరం బెంతఘోరము!
ఆదినుండియు అవ్యవస్థిత
మానసాన్విత యైన యీమెకు
నిన్న జరిగిన నిశ్చితార్థము
వేడ్క గూర్పక వెఱ్ఱి గూర్చెను
మైత్రేయుఁడు:
దైవ మొక్కఁడె కావఁజాలును
ఈ యభాగ్యను నింకమీఁదట
కామిని:
ఈక్షింపుమో ప్రవర! ఈ నికుంజంబు
సాక్షాత్తుగా మనకు సమకూర్పబడిన
మనువాడు మంటపంబనురీతి నుండె
మనపెండ్లి కుద్దిష్టమగు పీటలట్లు
ననలిందుఁ బడియుండె పెనురాసిగాను
కడనున్న ద్విజరాజి కల్యాణగీతి
నుడువుచుం బొదరింట సడిచేయుచుండె
పరిణయంబున కిది సరియైన వేళ
మురిపెంబు మీర వరపుష్పమాలికల
కనకాంగుళీయముల వినిమయం బిపుడె
పొనరించుకొంద మీ పొదరింటియందె
పొనరించుకొంద మీ పొదరింటియందె
చెలికాడ! నీవలపువెలుగు లీక్షణము
తొలఁగించె నాలోన నెలవైన తమము
నీమూలమునఁ బండె నామనోరథము
నామనంబున నిండె నామోదమహము
నీసఖ్యమే సౌఖ్యనిధి యౌను నాకు
నీ సన్నిధియె స్వర్గనిభమౌను నాకు
మనజీవితాలలో మలయులే యింక
ఘనతరామోదంబు గంధంబు వోలె

(భీమవర్మ, మిత్రసేనుఁడు ప్రవేశించి ఆమె ఉన్మాదావస్థను గమనింతురు)

కామిని:
అదిగొ! ఆభద్రగోపాఖ్యుఁ డయ్యయ్యొ
అదుటున న్ననుఁ బెండ్లి యాడంగవచ్చె
నాయన్న యతనికి న్నను ధారవోసె
సైయంటి దాని కసహాయ నగు నేను
ఆరీతి నన్నాగ్రహంబునం గనకు
మారలేదేమి నామనసు నీయందు
నావల్లభుఁడ వీవె నాదైవ మీవె
నేవలతు నిన్నెపుడు నిక్కముగ ప్రవర!
నీయల్కచే మున్ను నీవొసగియున్న
నీయుంగరము దీసివేయకుమట్లు
నీప్రేమలోకాన నేనుందు నెపుడు
నాప్రేమలోకాన నీవుండు మెపుడు
నను వీడకో ప్రవర! ననువీడ కిపుడు
నినుఁ బాసి క్షణమైన మనలేను ప్రవర!
ఇది గూడకున్నచో ఈధరణి వీడి
ఎదురుచూతును నీకు త్రిదివంబునందు
భీమవర్మ,మిత్రసేనుఁడు:
అయ్యయో మన మాచరించిన
ద్రోహ మీమెకు దుర్భరంబగు
గరళముంబలె పరిణమించెను
ఈ యఘంబున కెంత వగచినఁ
గాని నిష్కృతి గాంచ నేరము
ఈమె మనసున కింత యేనియు
స్వస్థతను గూర్పంగఁ జాలము

(తమలో నట్లు చింతించి, మాలినీమైత్రేయుల కామెను శాంతింపఁజేయ సంకేతము చేతురు. వారును, మఱికొందరామెను పట్టుకొని శాంతింపఁ జేయుటకు యత్నింతురు)

కామిని:
వీరెవ్వరో బలాత్కారంబుగాను
చేరి నను బట్టుకొన చెలరేగుచుండ్రి
వేరు చేయఁగ నేమొ ప్రియ! నిన్ను నన్ను
వైరులే యందఱీ ధారణుని మనకు
సారంబు లేని యీజగమునే వీడి
పాఱిపోదును నేను పైలోకమునకె
పాఱిపోదును నేను పైలోకమునకె

(అనుచు వారినుండి తప్పించుకొను యత్నములో కామిని మతిదప్పి క్రింద పడిపోవును. ఆమె పరిస్థితిని చూడలేక మాలినీ మైత్రేయుల కామెను జాగ్రత్తగా చూచుకొమ్మని చెప్పి నిర్వేదముతో భీమవర్మ మిత్రసేనుని గూడి నిష్క్రమించును)

భీమవర్మ:
నాదగు ద్రోహమీయమను నాగఫణింబలెఁ గాటువేసె, ని
ర్వేదముతోడ నాక్రియకు బెగ్గిలు నేను కనంగఁ జాల ను
న్మాదముచేత మూర్ఛిలిన నాదుసహోదరి యార్తి, కాన మీ
రాదుకొనుండు వృద్ధసచివాగ్రణి, మాలిని యీమె నర్మిలిన్

ద్వితీయదృశ్యము

(స్థలము: ప్రవరసేనుని పూర్వీకులయొక్క సమాధులు గల ప్రేతవనము)

ప్రవరసేనుఁడు:
ఈసమాధులలోన శయించియున్న
పితృగణములార! మీవంశవృక్షమందు
ఉండె శేషించి యొక్కటే యొక్క శాఖ
అదియు నిప్పుడు నాశంబు నందుచుండె
వైభవంబును వాసియుఁ బాసి మున్నె
సంతపించెడు మీవంశజాతుఁడకట!
ప్రణయవంచితుఁడయి నేఁడు ప్రాణములను
త్యాగమొనరించి మిముఁగూడ నేఁగుచుండె
కామినీరహితమగు లోకంబు నాకు
దాఁటరాని యెడారికి సాటి యయ్యె
వెన్నెలలు లేని తామసి విధము నాదు
బ్రతుకు గాఢాంధకార సంభరిత మయ్యె
మఱచి పూర్తిగ నన్నామె మఱొక వరుని
కౌఁగిలింతలలోనఁ జొక్కంగ నుండె
మఱవఁజాలక యామె నొంటరిగ నేను
వనరుచుంటిని యీ ప్రేతవనములోన
వైభవంబును రాజ్యంబు బంధుగణము
నెల్లఁ గోల్పడి కుందు నాహృదయమందు
నూతనాశాప్రదీపంబు నుంచె నామె
ఆర్పె నిపుడామె దాని స్వహస్తములనె
ఎదురుకొన నేల? జీవింపనెంచ నేల?
ద్వంద్వయుద్ధంబునందామె భ్రాత నింక?
అతనికత్తిపైఁ బడి నేనె ఐచ్ఛికముగ
కనెద శాశ్వతశాంతి దుర్గతినిఁ బాసి

తృతీయదృశ్యము

(అనుచు ఖడ్గధారియై, నిర్వేదముతో ఉషఃకాలములో భీమవర్మతో ద్వంద్వయుద్ధమునకై ఏర్పాటు చేసికొన్నట్టి మున్ను తాను, కామిని ఉంగరములు మార్చుకొన్నట్టి తోఁటలోనికి వచ్చి, నిర్ణీతసమయమున కచ్చటికి రాని భీమవర్మకై నిరీక్షించుచు ఇట్లనుకొనును)

ప్రవరసేనుఁడు:
మును బల్కినయటు నిటకుం
జనుదెంచితి ద్వంద్వయుద్ధసన్నద్ధుఁడనై
నను నెదిరింపఁగ నెందుకొ
చనుదేరఁడు భీమవర్మ సమయంబునకున్
వెఱచునొ ద్వంద్వయుద్ధమున వీఁకగఁ దాఁకఁగ నన్ను, లేక తా
నరసెనొ యిట్టిపోరితము వ్యర్థమటంచును నాత్మలోనఁ, దా
నరయడు నేఁదలంచితిని యాతని వశ్యమె చేయఁగా జయేం
దిర నని, చేర నుంటి నని దేవభువిం గల మాదు వంశ్యులన్

(ఇంతలో మాలిని విషణ్ణవదనముతో నక్కడికి వచ్చుచుండును. ఆమెను చూచి)

ఎందుకో మాలిని యేతెంచు నిటకు,
ఇందులో మర్మంబు నెఱుఁగంగవలెను
(సమీపించిన మాలినిని చూచి)
ఏల వచ్చితి విపుడు మాలిని? ఏమి వార్తను దెచ్చి తిప్పుడు?
మాలిని:
ఏమి చెప్పుదు నేమి చెప్పుదు
కామినికి నీక్షణమునందున
దాపురించెను దారుణంబగు
ప్రాణహానికరప్రమాదము
ప్రవరసేనుఁడు:
అయ్యొ, చెప్పు మేమయ్యెను?
మాలిని:
రాత్రి యంతయు రమణి నిన్నే
తలఁచి పలవుచు, పలవరించుచు
చేతనత్వము చేడ్పడంగను
అసువులం బాయంగ నుండెను
ప్రవరసేనుఁడు:
అయ్యయ్యొ, హతవిధీ! ఆమె జీవింపదా యిఁక?
మాలిని:
వెరవులన్నియు విఫలమైచన
కావ నామెను నీవె దిక్కని
పూర్వవైరము పొంతఁ బోవక
ఆమె నెట్టుల నైనఁ గావఁగ
వేగ రమ్మని భీమవర్మయె
నిన్నుఁ గోరఁగ నన్నుఁ బంపెను
రమ్ము ప్రవరుఁడ! రమ్ము ప్రేమిక!
ఇమ్ముగను నీ హృదయరాజ్ఞీ
ప్రాణములఁ గాపాడుకొమ్మిఁక
రమ్ము వేగమె, రమ్ము నాతో
ప్రవరసేనుఁడు:
పద మాలిని! పద పోదం బిపుడే!

చతుర్థదృశ్యము

(స్థలము: భీమవర్మ దుర్గమునందలి అంతర్మందిరము. అందులో నొక మంచముపై అప్పుడప్పుడే మృతి జెందిన కామిని శవముండును. క్రింది కోరస్ వినిపించుచుండగా మాలినీప్రవరులు అచ్చటికి ప్రవేశింతురు)

కోరస్:
ప్రణయమె పాపము! ప్రాణాంతకమై
కొనిపోయెను దివమున కీ తరుణిని
ననతీవియ నేలను గూలినయటు
చనె నీయమ యౌవన మధ్యంబున
ప్రణయమె ….యౌవనమధ్యంబున

ప్రవరసేనుఁడు:
అయ్యయ్యొ, అయ్యయ్యొ, ఆమె దివికేఁగెనా?
మైత్రేయుఁడు:
దురదృష్టవంతుండ! దూరమయ్యెను నీకు
ప్రాణంబుతో నామె పరికించు భాగ్యంబు
భీమవర్మ, కోరస్:
తీఱె నామెకు నీకు స్థిరముగా బంధంబు
వేఱుచేసెను మిమ్ము విధివ్రాతయే తుదకు
తీఱె నామెకు …విధివ్రాతయే తుదకు
ప్రవరసేనుఁడు:
(కామినీశవమును సమీపించి పాడును)
కనుదెరువు ప్రియురాల! కనుమొక్కసారి
కనుదెరచి నీప్రియునిఁ గనుమొక్క సారి
మనలేడు నీప్రియుఁడు నినుఁబాసి భువిని
చనుదెంచు నీవెంట నినుఁజేర దివికి
ఘనమైన ద్వేషంబు క్రౌర్యంబు గలసి
మనప్రేమ భగ్నంబు నొనరించె నిలను
ఇవిలేని దివమందు నింక నిను గూడి
నివసింపఁ జనుదెంతు నేనసువు లుడిగి
మనుజలోకమునందుఁ గనలేని సుఖము
కనుగొంద మిఁకగూడి వినువీట మనము
నినుఁ గూడ నీక్షణమె చనుదెంచుచుంటి
కొనివచ్చు దైవంబె నను నీదుకడకు

(చివరి రెండు పంక్తులను పాడి ఉద్రేకముతో తనచేతిలో నున్న కత్తితో పొడిచికొనును)

కోరస్:
అయ్యయ్యొ ఇదియేమి ఘోరంబు?
మైత్రేయుఁడు:
ఏమీ ఉన్మాదము? రక్షింపుఁ డితని, రక్షింపుఁ డితని!
ప్రవరసేనుఁడు:
వలదు, వలదు, రక్షింపవలదు
క్షేమంబు కరవైన ఈమర్త్యలోకాన
కామంబు మనమధ్య కడు నింద్యమయ్యె
పరలోకమందునం బరగదీదృశబాధ
పరలోకవాసంబె పరమంబు మనకు
అందుచే ప్రియురాల అరుదెంచుచుంటి
ముందేగియున్న నిన్నందుకొన నిపుడె
వినువీటిలో నెపుడు విడిపోక మనము
మనుచుందుముం గాక ఘనమోదమునను

(అనుచు బాధాయుతమైన నిమ్నస్వరములో కామినీ శవముపై నొరుగుచు పాడి ఆమెపైనే కూలి మరణించును)


(ప్రాణాంతకప్రణయము సంపూర్ణము)