రాయలు:
మదాలసా! ఈ శుభసందర్భములో కవిచంద్రులకు నీ నృత్యనీరాజనమును సమర్పింపుము.
మదాలస:
చిత్తము ప్రభూ.
(ఈ క్రింది పాటను ఆరభిరాగములో పాడుచు నాట్యము చేయును.)
పల్లవి:
మధురము మధురము నీకవనము
రంభాధరమధు మధురము నీకవనముఅనుపల్లవి:
పలుకుల చెలువకు చెలువగు రవణము
పలుకులఁ దేనియ లొలికెడు కవనము (మధురము)చరణం 1:
మవ్వపు పదముల పువ్వుల నొలికెడు
మధురసవాహిని , మంజుల మతులం (మధురము)తాం తకిట తకతక ధిమి రి స ని ధ
తకఝణు స రి మ గ రి ధ స రి మ ప
తఝణు స రి మ గ రి త ఝం ఝం తకిట
ధిత్తాం కిట ధ ప మ గ రి తధీం ఝణుతాం
మవ్వపు పదముల పువ్వుల నొలికెడు
మధురసవాహిని, మంజుల మతులం (మధురము)చరణం 2:
సుందరమై సురసుందరి సంస్మితనిభమై
మందారంబుల మకరందంబున కెనయై
ఆస్వాదింపఁగ నమృతంబునకుం దులయై
మది కింపొసగును మృదు మధురంబై (మధురము)చరణం 3:
తకిట ధిమిత తకతక ధిమి ధీంతక
తకధిత తోంతక తోంతక తకధిత ధిరణా
సుప్రసన్నభావశోభితంబు
రమ్యశబ్ద రాజి రాజితంబు
తక ధిక తోం తక తోం తక ధిరణా
తకధిక తకధిత తోంతక తోంతక ధిరణా
శ్రావ్య పద్య గద్య సంయుతంబు
చంద్ర కాంతి తుల్యసౌఖ్యదంబు (మధురము)
(అని నాట్యము చేసి పినవీరనకు పాదాభివందనము చేయును. నేపథ్యంలో క్రింది శ్లోకములు వినిపించుచుండఁగా యవనిక పతిత మగును.)
*వీరభద్రకవీంద్రస్య, చారుకీర్తివిలాసినీ|
నృత్యతాత్సతతం విశ్వ, నృత్యరంగస్థలే భృశమ్||జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః ।
నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయమ్||
అనుబంధము – ‘వాణి నారాణి’ ఐతిహ్యము
- ఈనాటికకు మూలమైన ‘వాణి నారాణి’ అను వచనమునకు సంబంధించిన ఐతిహ్యము డా.జి.వి. సుబ్రహ్మణ్యంగారి ‘పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి’ యను పరిశోధనగ్రంథములో నిట్లున్నది:
‘సాళువ నరసింహరాయలు జైమినిభారతమునురచించుట కొకగడువును నిర్ణయించెను. భోగ లాలసుఁడైన పినవీరభద్రకవి, అన్నగా రెన్నిసారులు ప్రబోధించినను వినక, గడువు రేపటికి ముగియు నను నంతవఱకు కావ్యరచనమును జేపట్టక విలాసముగా దిరుగుచుండెను. తెల్లవారినచో రాజాస్థాన మున కావ్య మంకిత మీయవలెను. ఆనాఁటి రాత్రి పినవీరన తన గదిని గోమయముచే నలికించి, రంగ వల్లులు తీర్పించి, యావునేయితో దీపము పెట్టి, తలుపులు బంధించి, తాటియాకులను ముందుంచు కొని సరస్వతీధ్యానమగ్నుఁడై కూర్చుండెను. వాణి ప్రసన్నయై, శతఘంటములతో కావ్యరచనమును నిర్వహించుచుండెను. సహస్రసూర్యులకాంతి మిరిమిట్లు గొల్పుచు గదియంతయు నిండిపోయెను. పినవీరన యన్న తలుపుసందులనుండి వెలికివచ్చు నాకాంతిని చూచెను. బ్రాహ్మణసంతర్పణమున నొక్కసారిగాఁ బూరీలు నమలునప్పు డయ్యెడి చప్పుడులవలె తాళపత్రములపై గంటముల చప్పుడు వినవచ్చుచుండెను. పెదవీరన యాయద్భుతమును గాంచ నెంచి తలుపుసందులగుండ గదిలోనికిఁ జూచెను. సరస్వతి ‘బావగారు వచ్చి’రని పినవీరనకుఁ జెప్పుచు నంతట నదృశ్యమయ్యెను. వాణి వ్రాయగా మిగిలిన స్వల్పభాగము పినవీరన పూరించి, మఱునాఁ డాకావ్యమును రాజసభకుఁ గొని పోయెను.
క్రిందటి రాత్రి వఱకును గావ్యమునకు పినవీరభద్రుఁడు శ్రీకారము చుట్టలేదని రాజునకును, సభికులకును దెలియును. ఒకరాత్రిలో నాశువుగ నైనను అంతటి మహాకావ్యమును వ్రాయుట దుర్లభమని సభికు లభియోగము దెచ్చిరఁట. అప్పుడు పినవీరభద్రకవి ‘వాణి నారాణి’ యనియు, తన కది యసాధ్యము కాదనియు వారికి బదులు చెప్పెనఁట! జగదారాధ్య యైన వాగ్దేవి నహంకరించి, ‘రాణి’ యని పినవీరభద్రుఁడు నిందించె నని పండితు లధిక్షేపించిరి. అందులకు పినవీరన ‘సభలో తెర వేయించినచో వాణియే మీకు సాక్ష్య మిచ్చు’ నని పలికెను. రాజు తెర గట్టించెను. సరస్వతి తన స్వర్ణకంకణహస్తమును తెరపైఁ జూపి ‘ఔను, ఔను’ అని చెప్పి సభికుల నాశ్చర్యమున ముంచెనఁట!’
(ఈ కథ నేను స్కూలులో చదువుకొనునప్పుడు 7వతరగతి తెలుగు ఉపవాచకములోగూడ నుండెను.)
- సూచన: 41వ పేజీలోని ‘ఇందీవరసమసుందరనేత్రీం’ అన్న వాక్యంలో ‘నేత్రీ’శబ్దం ‘నేత్రా’ అని ఉండాలని పాణినీయవ్యాకరణ మున్నను, ముగ్ధబోధవ్యాకరణం ‘నేత్ర’శబ్దమును అంగాదులలో చేర్చుటచేత, ‘నేత్రీ’ అను వికల్పరూపం కూడ సాధువే యని బ్రహ్మశ్రీ వజ్ఝల చినసీతారామస్వామిశస్త్రులవారు వారి ‘బాలవ్యాకరణోద్ద్యోతము’లో తెల్పినారు. ‘సరోజదళనేత్రి హిమగిరిపుత్రి’ అని శ్యామశాస్త్రి కీర్తన కూడ ఉన్నది.
- * ఈ గుర్తు గల పద్యములు ఈ నాటకకర్త వ్రాసినవి. ఈగుర్తు లేని పద్యములు పినవీరభద్రుని శృంగారశాకున్తలమునుండియో, జైమినిభారతమునుండియో గ్రహింపబడినవి. ‘కుల్లా యుంచితి’ అను పద్యము శ్రీనాథుని చాటువు. గీతము లన్నియు ఈనాటకకర్త వ్రాసినవే. ‘సువక్షోజకుమ్భాం’ అను శారదాస్తోత్రము శ్రీజగద్గురు ఆదిశంకరాచార్యకృతము. ‘జయంతి తే…’ అను శ్లోకము భర్తృ హరి సుభాషితములలోనిది. ‘యః పఞ్చశాఖాభిర్జిత్వా’ అను శ్లోకము దేవులపల్లి తామ్రశాసనము లోనిది. ఈశాసనవిషయమును తమ పరిశోధనవ్యాసం ద్వారా తెలియజేసిన శ్రీఏల్చూరి మురళీధరరావుగారికి నాకృతజ్ఞతలు.
- ◊ఇవి ప్రస్తుతసందర్భానుసారంగా కొంచెం మార్చబడ్డ పినవీరన జైమినిభారతంలోని పద్యములు.