ప్రాణాంతక ప్రణయము


ద్వితీయాంకము

ప్రథమదృశ్యము

(నాల్గు నెలల తర్వాత; భీమవర్మ, మిత్రసేనుల ప్రవేశము)

భీమవర్మ:
తనకు విపక్షులై తనదుతమ్ముని రాజ్యమునందు నిల్పఁగా
మును యతనంబు చేసిన చమూపతిమండలనాయకాళి పె
త్తనము నడంచి స్వీయవిభుతం దనమిత్రులతోడఁ దీర్పఁగా
మొనకొనుచుండె నూత్నముగ భూపతియైన నృసింహుఁ డిత్తరిన్
ఆతఁడు వైరివర్గములయందునె యెన్నును నన్నుఁ గావునన్
నాతనుమానసంపదలు నష్టములౌ దురదృష్ట మేర్పడెన్
చాతురిమీర నిర్వురికి సంధినిఁ గూరిచి నన్ను నష్టసం
ఘాతమునుండి కావఁగల కారుణికుండొకఁడే కలండిలన్
వీరుఁ డుదారుఁడు సౌమ్యుఁడు
నారీమానసహరుండు నవయౌవనుఁడున్
ధారుణినాథున కాతఁడు
కూరిమి సచివుండు భద్రగోపాఖ్యుండున్
అతనికి కామినీకరము నర్పణచేసితి నుద్వహార్థమై
అతిశయరూపరమ్య యగు నామెను నుద్వహమాడ నాతఁడుం
గుతుకము నూనియుండె, నిటు గూడిన చుట్టఱికంబుచేత ని
ర్గతి గననెంతు నాకొదవఁగాఁగల దుర్గతినుండి యెట్టులో
కాని కామిని నాశత్రువైనవాని
మాయలోఁబడి సుంత నామాట వినదు
వంశనాశకమైన యాపదను గనదు
స్వార్థమే యామెకుం బరమార్థమయ్యె
మిత్రసేనుఁడు:
ప్రవరసేనునియందు విరక్తి గొల్పు
కరణమునఁగాని మార దాతరుణి మనము
అట్టి కరణము గల్పించు నవసరమున
సృష్టి చేసితి నీలేఖ కృత్రిమముగ
వారి ప్రణయంపులేఖల దారిలోనె
అడ్డుకొని మున్నె చేసితిమందకుండ
ఇప్పు డీలేఖనుం జూడ తప్పకుండ
రక్తియే విరక్తిగ మారు ప్రవరునందు

(అని ప్రవరసేనుఁ డన్యకాంతయందు గాఢానురక్తుఁడై ఆమెకు వ్రాసినట్లుగా కూటసృష్టి చేసిన ప్రేమలేఖను భీమవర్మ కొసంగును. దాని నాతఁడు చదువుచుండఁగా కామిని వచ్చుచున్న చప్పుడగును. అది విని భీమవర్మ మిత్రసేనుని నిష్క్రమింపవలసినదిగా సైగ చేయును. అతఁడు నిష్క్రమించును. కామిని విషాదవదనముతో ప్రవేశించును.)

భీమవర్మ:
రమ్ము కామిని! ప్రియమార రమ్ము రమ్ము!
నిన్ను గాంచఁగ హర్షంబు నిండె మదిని
కాని యేలకొ వాడిన కంజమట్లు
మ్లానమై యుండె నీముఖమండలంబు?
కామిని:
పాట
ముఖమందున, నాముఖమందున
నగపడు ఘనమగు ఆవేదనకున్
నడలందున, నానడలందున
పొడమెడు తఱుచగు తడబాటునకున్
స్వనమందున, నాస్వనమందున
వినపడు ఘననిర్వేదంబునకున్
ప్రియునందున, నాప్రియునందున
నియతంబగు నీనిరసనమునకున్
మదియందున, నామదియందున
నొదవిన శోకసముద్గతి హేతువు
భీమవర్మ:
నాకాఠిన్యము, నానైష్ఠుర్యము
లాకాంక్షించును నీకల్యాణమె
మనవంశక్షతి ననిశము గోరెడి
మనుజుం డేవిధి మనకాప్తుండగు?
అన్నివిధంబుల నర్హుఁడు భద్రుఁడు
సన్నుతశీలుఁడు సచివోత్తముఁడు
అనుమోదించెను నతఁ డర్థితుఁడై
నిను పెండ్లాడఁగ నితని గ్రహింపుము
కామిని:
చాలును సోదర! చాలును బోధలు!
భీమవర్మ:
ఏలకొ కామిని! యింతటి హఠము?
కామిని:
త్రికరణంబులచేత నర్పించుకొంటి
మున్నె ప్రవరసేనునికిని నన్ను నేను
దూరమందున్న యతనికిం ద్రోహమెంచి
వంచనము సేయఁగాఁజాల ప్రతినఁ దప్పి
భీమవర్మ:
కందువు నీదుస్వార్థమునె కాని కుటుంబపు క్షేమ మింతయే
నిం దలపోయవీవు, కడునిష్ఠురుఁడై నరసింహుఁ డుద్యమిం
చెం దనవైరివర్గముల శ్రీ హరియించి తదీయదుర్గరా
జిం దన కైవసంబుగను జేసికొనంగ బలావలేపియై
గణియించుటచే నన్నును
దనవైరిగణంబులందుఁ దప్పదు నాకా
తనిచేతం డెప్పఱికము,
ఘనదుర్గైశ్వర్యవస్తుగణనష్టంబున్
నాయెడ నారసింహుని మనఃస్థితమైన విరోధిభావముం
బాయఁగఁజేయ దక్షుఁడగు వాఁడిల నొక్కఁడు భద్రగోపుఁడే,
పాయని రక్తి నీకరముఁ బట్టఁగ నాతఁడు గోరుచుండె, నీ
వీయది సమ్మతించి తరియింపఁగఁ జేయవలెం బ్రమాదమున్
తలఁపుము కులగౌరవముం,
దలఁపుము నాదగు కఠోరదైన్యస్థితినిం,
దలఁపుము కనికర మెదలోఁ,
దలఁపుము స్వార్థంబు వీడి త్యాగము చెల్లీ!
కామిని:
దీనముగ నుండె నీస్థితి దీనియందు
సందియము లేదు, కాని నాడెంద మోర్వ
కుండె మున్ను నే గావించి యున్న ప్రతిన
నుజ్జగించి యన్యునిఁ గూడ నుద్వహమున
భీమవర్మ:
మనకున్ బద్ధవిరోధియైన ప్రవరున్ మాన్యుండువోలె న్మదిన్
ఘనవిశ్వాసము నూని గోరుదకటా కల్యాణయోగార్థమై,
కనఁగాఁజాలవు వాని వెడ్డుతనముం గాపట్యమున్ శాఠ్యమున్,
కనుమో కామిని! వానివంచనకు లేఖారూపసాక్ష్యం బిదే!

(అని మిత్రసేనుఁడు సృజించిన కూటలేఖ నామె చేతిలో నుంచును. ఆమె దానిని చదువుకొని నిర్విణ్ణురాలగును)

కామిని:
ఎంతటి ఘోరము దైవమ! ఇంకను చావక బ్రతికియె యుంటిని.

పాట

కుప్పగఁ గూలెను కూరిమిమేడయె
డెప్పఱికంబున డెందము వ్రీలెను
నమ్మినప్రియుఁడే నన్నెడఁజేసెను
అమ్ముకొనెం దన నన్యవధూటికి
(కూరిమిమేడ=అనురాగసౌధము)
ఆశాలతయే అవనికిఁ గూలెను
నాశనమయ్యెను నాసర్వస్వము
చీకటియే నాజీవితభవనపు
వాకిట నిల్చెను భయముం గొల్పుచు
బ్రతుకుటకంటెను ప్రాణము వీడుటె
హితమగు నాకీ క్షితితలమందున
ప్రాణము లెందుకు వాయువునందున
లీనము నొందక మేనున నుండెను?

(అనుచు శోకముతో నేలకొరుగుచుండఁగా భీమవర్మ నామెను గ్రహించి సోఫాలో కూర్చుండఁబెట్టి, ఓదార్చుచుఁ బల్కును.)

భీమవర్మ:
ఎదలో నాటిన ఈటెను బోలుచు
ఇది యెంతో నిన్నిపుడు గలంచును
కానీ కాలము క్రమముగ నడఁచును
నీనిర్వేదము నీశోకంబును
ఆతని మోసపురీతులు దెలియుట
చేతను మేలే చేకురె నీకును
అతినింద్యుండగు నాతని వీడుట
హితకరమగు నీ కిపు డత్యంతము
అతని స్వభావం బరయక చేసిన
ప్రతినలు భంగం బగునని వగవకు;
వంచనచేత గ్రహించిన ప్రతినల
నించుక యేని గణించుట వ్యర్థము
విను కామిని, నా విన్నపమించుక
కొను మాభద్రుని కల్యాణార్థము
గుణవంతుండును కోమలహృదయుఁడు
నిను నేలుకొను న్నెనరున నాతఁడు
ఆతని రాగరసైకోదితమగు
నూతనసౌఖ్యవినోదవికాసము
మఱపించును నీమదిలో నిప్పుడు
ఇరవొందెడు వెత నింతకు నింతకు
కామిని:
ఇంతలు దెలిసియు నెందుకొ ఆతని
చెంతనె యుండఁగ స్వాంతము గోరును
విగళితతర్కాన్వితమై యాతని
సొగసుం దలఁచుచుఁ జొక్కఁగ నెంచును
ఘనసంవృతుఁడై కాంతినిఁ దొఱఁగిన
ఇనునివిధంబున నిప్పుడు నామది
అతిసంక్షోభావృతమయి దొఱఁగెను
చతురవిమర్శనచైతన్యంబును
పొదలెడు శోకంబునఁ గుందెడు నా
మది కిప్పుడు సామర్థ్యము శూన్యము
ఎది యహితంబో, ఏది హితంబో
ఎది కర్తవ్యమొ యేర్పఱుపంగను
భీమవర్మ:
విను కామిని! భద్రుని బాంధవ్యమె
నను రక్షించుకొనంగల మార్గము
నాక్షేమంబును, నీక్షేమంబును
రక్షింపంగల రమ్యపథం బిది
నావిభవంబును నాప్రాణంబును
కావంజాలిన ఘనుఁ డతఁ డొక్కఁడె
భావనసేయుము నీవిది మదిలో
కావుము నన్నుం గరుణను కామిని!

(అని పలికి నిష్క్రమించును. కామిని ఇంకను నిర్విణ్ణురాలై దైవమునిట్లు ప్రార్థించుచుండును)

కామిని:
కామితమొసఁగెడు కారుణికుండవు
స్వామివి దీనావనతత్పరుఁడవు
నీవని నిరతము నిన్నే నమ్ముచు
సేవింతురు గద శ్రీమహిళావర!
ఆశ వినాశం బందఁగ నశ్రుల
యాసారంబున నార్ద్రీకృతమౌ
శిలవలె నిచ్చట చేడ్పడి పడితిని
తిలకింపుము నా దీనావస్థను
ఈలోకంబున నెవ్వరు ననుఁగని
జాలిం జూపరు సముదాయింపరు
మరణము నైనను వరముగ నీయుము
పరిమార్పఁగ నాపరిదేవనమును

(చివరి రెండుచరణములను వినుచు మైత్రేయుఁడు ప్రవేశించును.)

మైత్రేయుఁడు:
ఎందుకు కామిని! నీవీ
చందంబున శోకపూర్ణసంభాషణతోఁ
గుందుచు నుంటివి? మరణ
మ్మొందెడు యోజన యొనర్చుచుంటివి మదిలోన్?
కామిని:
ఇపుడె యరసిన లేఖాంశ మెల్ల నన్ను
అంతమెఱుగని శోకాబ్ధియందు ముంచె
ఈవిషాదముఁ దొలఁగింప నితరమైన
వార్త యెదియైన నున్నచోఁ బలుకు మార్య!
మైత్రేయుఁడు:
అందుకొననీక మీప్రణయంపు లేఖ
లడ్డుకొనుచుండ్రి దారిలో ననెడు నీదు
శంక నాకునుం గల్గంగ సత్య మెఱుఁగ
నెంచి వేఱొక్కమార్గంబు నెంచికొనుచు
పంపితిని లేఖలను నేను ప్రవరసేనుఁ
డున్న దేశమున కతని యునికి నెఱిఁగి
కారణం బేమొ స్పందింపనేరఁ డతఁడు
వ్యాఖ్య యొనరించు నిది వాని వలపుతీరు
కామిని:
ఐన కర్తవ్య మేమందు రార్య! నాకు?
మైత్రేయుఁడు:
విధికృతంబును దప్పింప వీలు గాదు
దాని నంగీకరించుటే తగిన విధము
కామిని:
భగ్నమొనరింతు నెట్లు నాప్రతిన నేను?
మైత్రేయుఁడు:
మానసోద్రేకమునఁజేసి పూని నట్టి
ప్రతిన దప్పుట కాదెందు పాపకరము
ఈవిచారము మాని నీయింటివారి
కేది హితమౌనొ గావింపు మీవు దాని!
కామిని:
మానసంబట్లు సేయంగఁ బూనుకొనిన
కాదు కాదను హృదయంబు గాఢముగను
మైత్రేయుఁడు:
ఒక్కయింతగ హృదయమ్ము నూరడించి
ఒదవనిమ్మందులో వివేకోదయమ్ము
పంచత నంది ప్రాంత తరువాటికలోని సమాధిలోన ని
ద్రించుచునున్న నీజనని ప్రీణనకై, నరసింహుచేతిలోఁ
బంచతనొందు దుర్గతిని భ్రాతకుఁ బాపుటకై, దయార్ద్రధీ
సంచితసద్వివేకి వయి స్వార్థము నీవు త్యజింపఁగావలెన్
కామిని:
పెనుభారము మోపుచునుంటిరి నాపై
మైత్రేయుఁడు:
విను కామిని, నీ భ్రాతకునై…., నీతల్లికినై…
కామిని:
వినుచుంటిని. నెరపుదు ననుకొందును తమరి నియోగము!
మైత్రేయుఁడు:
సంతసమయ్యెను కామిని
ఎంతో త్యాగం బొనర్ప నిచ్ఛింతువు ని
న్నెంతో కలఁచెడు వంతలఁ
జింతింపక నీదు భ్రాతృసేవార్థంబై
దైవ మవశ్యంబుగ నీ
పావనకృత్యంబు మెచ్చి పరమందున సౌ
ఖ్యావహనిస్తులశాంతిమ
యావస్థాతుష్టిఁ గూర్చి యలరించు నినున్

(కామిని యింకను అసమ్మతితోనే కర్తవ్యము నాలోచించుచుండును. మైత్రేయుఁడు నిష్క్రమించును.)