(ఇది నేను కొన్ని నెలలక్రింద ఈమాటలో ప్రచురించిన ‘వాణి నారాణి’ అను పద్యనాటికయొక్క కథాసారము. ఆనాటికలో సందర్భానుసారముగా అనేకపద్యములు, కథకు మూలస్తంభములవంటి ఐదుపాటలను వివిధరాగములలో వ్రాసితిని. అట్లు నిర్దిష్టమైన రాగములలో టొరంటోలోని నామిత్రురాలు, శ్రేయోభిలాషిణి, శ్రీమతి చర్ల రత్నశాస్త్రిగారు ఆ ఐదుపాటలను పాడిరి. పద్యనాటికలోని పద్యములను చదువ సాహసింపలేని వారును, ఈకథాసారమును చదువుచు, ఇందులో చొప్పించిన పాటలను విని శ్రోతృధర్మమునుగూడ వహించి సంతసింతురని ఆపాటలతో గూడిన పినవీరనవృత్తాంతము నిక్కడ ప్రదర్శించుచున్నాను. ఇట్లు అసదృశప్రతిభాన్వితుడైన ఈమహాకవిని గుఱించి మఱికొంతమందికి తెలియునని ఆశించుచున్నాను. సూచన: ఈమాటలో ప్రచురించిన నానాటకప్రతిని మఱికొంతగ మార్చి సవరించినాను. అభిలాష ఉన్నవారికి ఈమెయిల్ ద్వారా నన్ను సంప్రదించినచో దీని పి.డి.ఎఫ్ ప్రతిని పంపుదును. – ఇట్లు: దేశికాచార్యుడు.)
పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు- శ్రీనాథ కవిసార్వభౌమునికి సరియైన సాహిత్యవారసుడై, పెద్దనాది ప్రబంధకవులకు మార్గదర్శకుడైన మహా కవీంద్రుడు – నేటి నల్లగొండజిల్లాలో నున్న పిల్లలమఱ్ఱి ఈతని జన్మస్థానమై వాసి గన్న గ్రామము. గాదిరాజు, నాగాంబిక ఈతని గన్న పుణ్య దంపతులు. పెదవీరభద్రుడు ఈతని అన్నగారు. వీరిద్దఱు కవలలుగా జన్మించిరి. భారతీతీర్థయతీంద్రుడు ఈతని గురువు. అవతారదర్పణము, నారదీయపురాణము, మానసోల్లాసము, మాఘమాహాత్మ్యము, పురుషార్థసారనిధి, శృంగారశాకుంతలము, జైమినిభారతము అనునవి ఈతని కృతులు. మన దురదృష్టమువల్ల శాకుంతల, జైమినిభారతములే మన కిప్పుడు లభించు గ్రంథములు.
పినవీరభద్రుడు మహాసరస్వతీ ఉపాసకుడు. ఈతడు తన శృంగారశాకుంతలమును నెల్లూరిమండలములోగల సోమరాజుపల్లియందలి చిల్లర వెన్నయామాత్యుని కంకితమిచ్చెను. ఈతని కవితావైదుష్యము నాకర్ణించి అప్పటి విజయనగరసామ్రాజ్యాధీశ్వరుడైన సాళువ నరసింహ రాయలు ఈతనిని తన ఆస్థానమున కాహ్వానించెను; సంస్కృతములో ఐదువేలశ్లోకములలో నున్న జైమినిభారతమునందలి అశ్వమేధపర్వమును ఆంధ్రీకరించి తన కంకిత మీయమని కోరి, రత్నాంబరకర్పూరతాంబూలాదులొసంగి, ఆస్థాననర్తకియైన మదాలసచే ‘స్వాగతనాట్యనీరాజనము’ నిప్పించెను.
పాట: స్వాగతము కవీంద్రా, మోహనరాగం, ఆదితాళం.
పల్లవి:
సుందర కవితా విభవా, సంక్రందనగురు ప్రతిభా |స్వాగతము|
అనుపల్లవి:
వాణీపూజనతత్పర, వందితసాధుపరంపర |స్వాగతము|
చరణం:
సూరిజనబృంద వందిత, సుందర కవితానందిత పండిత,
అసదృశసద్గుణమణిగణ, ఆంధ్రగీర్వాణవాగ్భూషణ,
వేదాంతశాస్త్రనిపుణ, విశ్రుతకీర్తివిభూషణ పినవీరనా |స్వాగతము|
సస రిరి గప ధఫ సస ధ ప పగ రిరి ప గ రి స ధసా
స రి గ ప ధ స ధ ప గ రి ప గ రి స ధ సా
సస రిరి గరి గప గప ధస ధప గరి సా గరి సధ సా |స్వాగతము|
ఆకాలమున విజయనగరములో దసరా నవరాత్రులు అతివైభవముగా జరుగుచుండెను. అవి విజయదశమినాడు అద్వితీయముగా జరుగు నుత్సవముతో పరాకాష్ఠ చెందుచుండెను. ఆవిజయదశమినాడే తనకు జైమినిభారతము అంకితము కావలెనని నరసింహరాయలు నిర్దేశించెను. దానికొక మూడువారములు మాత్రమే వ్యవధి యుండెను. ఐనను పినవీరభద్రుడు వెనుకాడక ఈ బృహత్కావ్యరచన కంగీకరించెను.
మదాలస సంగీత, సాహిత్య, నాట్యములయం దద్వితీయప్రతిభాన్విత. ఆమెతో పినవీరభద్రునికి గాఢమగు పరిచయ మేర్పడెను. ఆమె తన నయగారము, నాట్యవిన్యాసముల ద్వారా పినవీరనను తనయందు అనురక్తుని జేసికొనజూచెను.
పాట: త్వర యేలరా సామి, కాపీరాగం, త్ర్యస్రగతి ఏకతాళం.
పల్లవి:
తొలియామమే యింకఁ దొలఁగలేదుర సామి
అనుపల్లవి:
జిలుగువెన్నెల యింక వెలుగుచుండెర మింట |త్వర|
చరణం 1:
చల్లియుంచిన పాన్పు శయనింప రమ్మనెర
ఆమోదమును గ్రమ్ము నగరుధూపపు చాలు
సామోదముగఁ గూడి శయనించి పొమ్మనెర |త్వర|
చరణం 2:
కరములందునఁ దాల్చి కమ్మకమ్మనిసుధలు
వలపించి మురిపించి తెలిరిక్కకన్నియల
వెన్నెలలతోఁటలో విహరించు జతగూడి |త్వర|
చరణం 3:
తొలఁగిపోవఁగఁ జాల తొందరించుట యేల
వలపుగొంటివొ యేమొ పరకాంతలందునం
దెలుపరా నిజమింకఁ దేనెపలుకులు మాని |త్వర|
చరణం 4:
వచ్చి చేరినకాంత వలపు గైకొనర
మచ్చికలు మీరంగ వెచ్చనౌ కౌఁగిళులఁ
బుచ్చరా యీరేయి పోవ నీకేల |త్వర|
కాని పినవీరన ఆమెయందు సర్వకళాసమన్విత యైన సరస్వతీరూపమునే కాని సామాన్యనర్తకీస్వరూపమును చూడలేదు. ఇది ఆమెయు గ్రహించి, అతనిపై పూజ్యభావమునే పెంచుకొనెను. ఆమె అతనికై నిరంతరముగా నాట్యము చేయును. అతడు సర్వమును మఱచి ఆమెలో సరస్వతినే దర్శించును. సరస్వతినే భావించును. ఆమె సన్నిధిలోనే ఆతడు కాలమునంతయు వ్యయించును. ఇదంతయు బాగుగనే సాగినది కాని కావ్యరచనమే సాగుట మానినది. ఇంతలో మహానవమి వచ్చినది. అప్పటికి కావ్యములో 100 పద్యములు మాత్రమే పూర్తియైనవి. మఱొక 1400 పద్యములు వ్రాసినగాని కావ్యము పూర్తి గాదు. మఱునాడే రాజుగారికి కావ్యము నంకితమీయవలెను. అట్లు జరుగనిచో అది రాజధిక్కారమగును. భూరితరసత్కారమునకు బదులు ఘోరతరకారాగారము ప్రాప్త మగును. పెదవీరభద్రుడు ఈవిషయమునుగుఱించి మిక్కిలి చింతించుచుండెను. కాని పినవీరభద్రుడు మాత్రము దీనిని పట్టించుకొనకుండెను. అతడింటిలోని సరస్వతీసన్నిధిని అలికించి, మామిడితోరణములచే నలంకరించి, దీపపు సెమ్మెలతో వెలిగించి, ఒక బుట్టెడు తాటాకులు, వంద గంటములు అట నుంచి, సరస్వతిని ధ్యానింపమొదలిడెను.
కాని మనస్సు సరస్వతిపై లగ్నము గాకుండెను. అప్పుడతనికి మదాలసయే శరణ్య మనిపించెను. అతడు మదాలస గృహమున కేగెను. అప్పుడు మదాలస తన వీణను, గజ్జెలను సరస్వతి ముందుంచి స్తుతించుచుండెను.
పాట: సరసిజాసనురాణి, కానడరాగం, త్ర్యస్రగతి ఏకతాళం.
పల్లవి:
దీవింపవే నన్ను దివ్యసన్నుత! వాణి!
అనుపల్లవి:
నెలవైన గీర్వాణి! నిరతంబు నినుఁ గొల్తు |సరసి|
చరణం 1:
నాపాదమంజీరనాదంబులోన
నీపల్కుతేనియలె నిండారి ప్రవహింప
నాపల్కుగమిలోన, నాపాటలోన |సరసి|
చరణం 2:
నానాట్యమున కొసఁగ నవ్యచైతన్యంబు
నీవల్లకీజాత నిరుపమక్వణనంబు
నావల్లకికిఁ గూర్ప నవ్యమాధుర్యంబు |సరసి|
చరణం 3:
అందమగు నీరూపు నానందముగఁ గొల్తు
సుందరోజ్జ్వల భావబృందంబులే నీకు
మందిరంబుగఁ జేసి మనఁగాను మది నెంతు |సరసి|
చరణం 4:
నాగజ్జెలను నీకు నవఘంటికలఁ జేసి
నానాట్యమున నీకు నారాత్రికముఁ జేసి
ఆనందముగ నిన్ను నారాధనము సేతు |సరసి|
పినవీరన ఆమెను గాంచి, ఆమె మఱొకసారి నాట్యము చేసిన ఆమెలో సరస్వతిని దర్శించి సరస్వతీప్రసాదముచే కావ్యమును పూర్తి చేతు ననెను. ఆమె అంగీకరించి, సరస్వతిని గూర్చి పాడుచు అద్భుతమగు నాట్యము చేసెను.
పాట:చిన్తయామి శ్రీకరీం, హిందోళరాగం, ఆదితాళం.
పల్లవి:
బ్రహ్మలోకవాసినీం భారతీం
అనుపల్లవి:
కీరపుస్తకాక్షహారధారిణీం |చిన్తయామి|
చరణం 1:
ఇందీవరసమసుందరనేత్రీం
వందారుసుజనవాంఛితదాత్రీం
మందాత్మగతతమోగుణహర్త్రీం |చిన్తయామి|
చరణం 2:
వందేఽహ మద్భుతగుణకలితే
వందేఽహమఖిలామరవినుతే
వందేఽహమతులదయాసహితే |చిన్తయామి|
పినవీరన ఇంటికేగి, ఆరాత్రి సరస్వతీసన్నిధిలో తలుపులు మూసికొని కూర్చొని ప్రగాఢసరస్వతీధ్యానమగ్నుడయ్యెను. అప్పుడు క్రమముగా ఆ పూజామందిరము వేయిసూర్యుల కాంతితో వెలుగసాగెను. నూరుగంటము లొకేసారి తాటియాకులపై వ్రాయు సవ్వడి నిరంతరముగా సాగజొచ్చెను. ఇట్లు రాత్రియంతయు జరిగెను. పెదవీరభద్రుని కిదంతయు బహువిచిత్రముగా తోచెను. చివరి కతడు ఉత్కంఠ నాపుకొనలేక తెల్లవారు సమయమున తలుపుసందులోనుండి లోనికి చూచెను. ‘అదిగో! బావగారు చూచుచున్నారు. ఇక విరమింతును’ – అను వాక్యము లత్యంతమధురమైన స్త్రీకంఠస్వరముతో విన్పడెను; గంటముల చప్పు డాగిపోయెను. మందిరప్రకాశము తొలగిపోయెను. ఆ కంఠస్వరమే సరస్వతీ కంఠస్వరము. ఆగంటముల చప్పుడే ఆమె తాటియాకులపై పద్యములు వ్రాసిన సవ్వడి. అప్పటికి అతిస్వల్పభాగముదక్క కావ్యమంతయు పూర్తి యయ్యెను. మిగిలిన స్వల్పభాగమును త్వరగా పినవీరన పూరించి రాజాస్థానమునకు గొనిపోయెను. రాజాస్థానమునందలి పండితులు ఎంత సరస్వతీప్రసాదమున్నను ఇంతటి బృహత్కావ్యము నొక్కరాత్రిలో వ్రాయుట అసాధ్యమని యధిక్షేపించిరి. అందుకు పినవీరన ‘వాణి నారాణి, నాకిది సాధ్యమే’ యనెను. ఆమాటకు మఱింతగ పండితులధిక్షేపించిరి. ఐన ‘సభామండపమున నొక తెరను గట్టింపుడు. నారాణియే మీకు ప్రతివల్కును’ అని పినవీరన యనెను. తెర కట్టింపబడెను. పినవీరన త్రికరణశుద్ధితో సరస్వతిని ప్రార్థించెను. తెరవెనుక గొప్ప ప్రకాశము కన్పడెను. ‘ఔను! ఔను!’ అనుచు సంకేతించుచున్న నొక స్త్రీయొక్క కరచాలనము, కోమలకంఠధ్వని ప్రదర్శితములయ్యెను. పండితులు పినవీరభద్రుని పాదాక్రాంతులైరి. రాజుగారు కావ్యమును స్వీకరించి, కవిని సత్కరించి, మదాలసచే కవికి నాట్యనీరాజనము నిప్పించిరి. పినవీరన కృతార్థుడు, స్థిరప్రఖ్యాతు డయ్యెను.
పాట: మధురము మధురము, ఆరభిరాగం, ఆదితాళం.
పల్లవి:
రంభాధరమధు మధురము కవనము
అనుపల్లవి:
పలుకులఁ దేనియ లొలికెడు కవనము |మధురము|
చరణం 1:
మధురసవాహిని , మంజుల మతులం |మధురము|
చరణం 2:
తకఝణు స రి మ గ రి ధ స రి మ ప
తఝణు స రి మ గ రి త ఝం ఝం తకిట
ధిత్తాం కిట ధ ప మ గ రి తధీం ఝణుతాం
మవ్వపు పదముల పువ్వుల నొలికెడు
మధురసవాహిని , మంజుల మతులం |మధురము|
చరణం 3:
మందారంబుల మకరందంబున కెనయై
ఆస్వాదింపఁగ నమృతంబునకుం దులయై
మది కింపొసగును మృదు మధురంబై |మధురము|
చరణం 4:
తకధిత తోంతక తోంతక తకధిత ధిరణా
సుప్రసాద గుణ శోభితంబు
రమ్యశబ్ద గణ రాజితంబు
తక ధిక తోం తక తోం తక ధిరణా
తకధిక తకధిత తోంతక తోంతక ధిరణా
శ్రావ్య పద్య గద్య సంయుతంబు
చంద్ర కాంతి తుల్యసౌఖ్యదంబు |మధురము|