అపరదిక్కాంత స్వీయాలయాంగణమందు
ఆరవేసిన కావిచీర యనఁగ,
కాలాఖ్యచోరుండు కాఁజేసి ప్రకటించు
లోకాప్తవసురాశిలోప్త్ర మనఁగ,
రాఁబోవు రాజుకై రజనీకుటుంబిని
పఱచిన కావితివాచి యనఁగ,
గగనోపవనిలోన నగుచున్న దళమైన
బంధూకసుమముఖప్రభయనంగ,
కమలినీవల్లభనటుండు గగనవేది
నిష్క్రమించిన మీఁదట నిల్పినట్టి
అరుణతరతిరస్కరణియో యనఁగఁ బర్వె
సాంధ్యరాగంబు పశ్చిమాశాస్యమందు.
అత్తఱి హన్మకొండ యను నాంధ్రపురీంద్రమునందు ధ్యానయో
గాత్తపవిత్రచిత్తులు ధరామరు లాజ్యకుశాక్షతాదు లా
యత్తము సేసి హవ్యవహు నర్చనసేయఁ గడంగి రట్టి వి
ప్రోత్తములందు నొక్కడు మహోజ్జ్వలధీయుతుఁ డొప్పె నీగతిన్.
వివిధశాఖల నొప్పు వేదద్రుమంబున
కాలవాలంబయి యలరువాఁడు,
గౌతమాదిమునీంద్రకల్పితధర్మసూ
త్రాధ్వనిత్యాధ్వగుండైనవాఁడు,
బహులశాస్త్రపురాణపంకేజవనసంచ
రద్రాజహంసమై ప్రబలు వాఁడు,
సౌజన్యకారుణ్యసంప్రదానార్తిసం
త్రాణసద్గుణఖాని యైన వాఁడు,
మఘవగురుసముండు,మాధవశర్మాహ్వ
యుండు, మంజువిగ్రహుండు, పరమ
సాత్త్వికుండు, నిరతచంద్రచూడచరణ
భజనపరుఁడతండు, బ్రాహ్మణుండు.
సమిధ లక్షతలాజ్యకుశాదికములు
సరస నిడుకొని మాధవశర్మ యపుడు
హవనమొనరింప నుంకించు నంతలోన
ప్రాంగణంబుననొక యార్తరవము మొరసె.
సమిధలు కుశలాజ్యంబుల
సమితిం బట్టించుకొనక సరగున నాతం
డమితాకులుఁడై చని కనెఁ
బ్రమదవిరహితయగు నొక్కప్రమదామణినిన్.
చిఱుమబ్బు గ్రమ్మిన హరిణాంకునిం బోలె
వదనేందుబింబంబు వన్నె దఱుగ,
కాసారజలమగ్నకంజంబులం బోలె
నక్షిపద్మము లశ్రులందుఁ దోఁగ,
విస్తరించుచునున్న వింతమేఘమువోలె
శ్లథకేశపంక్తు లంసముల వ్రాల,
పవమానచాలితపల్లవంబును బోలె
నధరబింబంబు బిట్టదరుచుండ,
భీషణప్రభంజనభుగ్నవీరుధంబు
వోలెఁదనువు పటుత్వంబుఁ దూలితూల,
మూర్తిమంతమై నిల్చిన యార్తివోలె
నిల్చె నక్కాంత దేహళీనికటమందు.
ఆ రమణీశిరోమణి మహార్తిసముద్గతశోకబాష్పవాః
పూరము తోరమై చనఁగ మోమును తద్ధరణీసురాంఘ్రలం
జేరిచి మ్రొక్కె, నట్లు నతి సేయు లతాంగిని లేవనెత్తి యా
పాఱుఁడు వల్కె నీగతి కృపారసపూర్ణసుపేశలోక్తులన్.
“తరుణీ! యెవ్వతెవీవు? దైన్యయుతవై త్రస్తాత్మవై యీగతి
న్నరుదెంచం గత మేమి? వైరిగణదౌష్ట్యంబేమి గారించెనో?
చిరభుక్తంబగు సంపదల్ దొఱఁగెనో? చిత్తేశసాన్నిధ్యమే
మరుగైపోయెనొ? యింక నే విపద సంప్రాప్తించెనో తెల్పవే!
చెదరుచు వారిభంగములఁ జిక్కిన చంద్రునిబింబమట్లు లో
నొదవెడు వంతచే నపగతోజ్జ్వలతాంచితమయ్యు నింతి! నీ
వదనము దెల్పుచున్నయది బాహుజవంశజ వీవటంచు, రాట్
సదనములందు నుండ కిటు సాధ్వసమందుచు వచ్చితేటికిన్?
ఒక్కతె వీవు గాదు; పృథులోన్నతమై తగు నీదు కుక్షిలో
చక్కని పాప వర్ధిలెడి చందము దోఁచుచు నున్నయద్ది, పెన్
వెక్కసమైన మార్గమున వ్రేఁగగు గర్భము నూని యేవిధం
బిక్కడి కేఁగుదెంచితివొ! యెంతటి గాసికి నోర్చియుంటివో!
అనదల కర్థిగణంబుల
కనుకూలుఁడనై వఱలుదు నా కతమున నీ
వనుమానింపక యరుదెం
చిన కార్యము దెల్పుమమ్మ శీఘ్రమె నాకున్”
అనియెడు నా ధరామరుని యాదరపూర్ణమనోజ్ఞవాగ్ఝరిన్
మునుగుచు నామె చిత్త మొక మోస్తరు శాంతినిఁ బొందె, నంత నా
తని నిలయాంతరాంచితవితర్దికపై సుఖముండి యామె యీ
యనువునఁ దెల్పె గూఢముగ నాత్మవిషాదకథావిధానమున్.
“స్వామీ యేమందును? నా
స్వామిన్ బాసితిఁ గఠోరసమరమునందున్,
భీమాకృతియై భల్లహ
భూమీశుఁడు మాదురాజ్యమున్ హరియించెన్.
సారపరాక్రమార్కుఁడయి, సద్గుణభూషితుఁడై, యపారకం
దారపురీంద్రలక్ష్మి కధినాథుఁడు నై తగు సోమదేవ ధా
త్రీరమణుండె బంధుఁడు మదీయధవుండును, యుద్ధరంగదు
ర్వారుఁడు నయ్యుఁ బ్రాణములఁ బాసె నతం డపవిద్ధభాగ్యుఁడై.
ఆతఁ డనేకసత్రములు, యాగము లాగమశాస్త్రసూత్రవి
ఖ్యాతముగా నొనర్పఁ బతి కండగ నేనును సోమిదమ్మనై
పూతచరిత్రనై, విబుధపూజనతత్పరచిత్తనై, సదా
చేతును వేదధర్మహితజీవనమున్ ధరణీసురోత్తమా!
ధవుని వధించి బల్లహుఁడు దారుణభంగిఁ దదీయబంధులం
దెవరును జిక్కకుండ మడియింపఁగఁ జూచెడి పూన్కిఁ జూచి మం
త్రివరుఁడొకండు సాయమొనరింపఁగ నెట్లొ ప్రదుర్గమాటవీ
నివహము నెల్ల దాఁటి దయనీయదశం జనుదెంచితేనిటన్.
గర్భవతినైన ననుఁజంప సార్భకముగఁ
బాయు శత్రుశేషంబని బల్లహుండు
భటశతంబులతోడనీ ప్రాంతమెల్ల
మార్గణము సేయుచున్నా డనర్గళముగ.
సిరియాళ నాదు నామము
సురగురుసన్నిభ! సిరియును,సుఖమును జెడి నీ
శరణమె శరణంబని కా
తరనై వచ్చితి నిఁక నను దయతోఁగనుమా!”
అనియెడు నామె దైన్యభరితాలపనంబుల నాతఁ డాదరం
బున విని, వారిబిందుగణపూర్ణనభస్యఘనంబుపోలికన్
ఘనకరుణారసోర్మికణికాభరితంబయి పొంగు మానసం
బునఁ గని వత్సలత్వపరిపూర్ణమృదూక్తులఁ బల్కె నీగతిన్.
“వింటిని మున్నె సోమపృథివీపతి ధర్మహితైకవర్తియై
మింటినిఁదాఁకు కీర్తిమిసిమిం గనె నంచును, సోమిదమ్మవై
యుంటివి నీవుసైతము మహోజ్జ్వలధర్మపథానువర్తివై
వింటిని నీదు దైన్యదశ, వీడుము శోకము నింక మానినీ!
ఉండుము నాదు పుత్త్రివయి యుమ్మలికంబును బాసి యింక నా
యండను మద్గృహంబుననె యబ్జదళాక్షి! ధరాసురాంగనో
ద్దండపవిత్రవేషమును, దైనికచర్యను బూని కానరా
కుండఁగ నీదు క్షాత్రకులగోత్రము లేరికి బ్రాహ్మణింబలెన్.
కట్టుబొట్టులందున విప్రకాంత వగుచు,
కాళికాదేవిని హృదయకమలమందు
అవిరతము నిల్పి సేవింపుమమ్మనీవు
భక్తతారిణి యాదేవి భద్ర మొసఁగు.
ఎంత యదృష్టమో దుహిత లేరును లేని మదన్వయంబునన్
శాంతయు, సద్గుణాశ్రయయు, చారుతరాకృతి యైన చానమే
ల్బంతిని పుత్త్రిగాఁ గొనెడు భాగ్యము నేఁడొనగూడె,నింక నీ
యింతి మదీయగేహమును నిందిరగేహముగా నొనర్చుతన్.
నీదు గర్భస్థశిశువును నీరజాక్షి!
యోగదృష్టినిఁ జూడ విద్యోతమయ్యె,
నతఁడు చక్రవర్తిపదంబు నధివసించి
అరిదముండయి సత్కీర్తి నందు ననుచు.
ముక్కలుముక్కలై తెనుఁగుభూమి పరస్పరవిగ్రహంబులం
జిక్కిన నాయకబ్రువుల చేష్టలఁ జిక్కి యపాస్తభాగ్యయై
స్రుక్కెను నేఁడు, తత్ప్రతనశోభను వెండియు నుద్ధరింపఁగా
నక్కఱయయ్యె నిప్పుడు మహాధిపుఁ డొక్కఁడు తెన్గునేలకున్.
కావున నీదుగర్భమునఁ గ్రాలెడు నర్భకు డట్టి నాయకుం
డై వఱలంగలాఁ డనెడు జ్యౌతిషికాంకము నాకుఁ దోఁచెడిన్,
ప్రోవఁగలాఁడ నీదుశిశువు న్నినుఁ గష్టము లెన్ని కల్గినన్
భావి తెనుంగురాజ్యరమభాగ్యముకోసము నీరజాననా!
ప్రాణవిత్తమానభంగంబుఁ దప్పింపఁ
గల్లలాడ నఘము గలుగదండ్రు
గాన నీకు ప్రాణహానియే యెదురైనఁ
గల్లలాడియైనఁ గాతు నిన్ను.”
అని యా బ్రాహ్మణుఁ డా భయద్రుతను స్వీయాగారమందుంచి ర
క్షణగల్పింపఁగ నామెకుం గలిగె నొక్కం డాత్మజాతుండు శ
త్రునికాయానలసన్నిభుండు, సకలాంధ్రోర్వీవిజేతృండు, పా
వనుఁడున్ మాధవవర్మనామకుఁడు సంపద్దైర్యవర్ధిష్ణుఁడున్.
పితరుని జంపినట్టి పృథివీశుని బల్లహు నాహవంబునన్
హత మొనరించి, మండలధరాధిపులందఱ గెల్చి, సార్వభౌ
మతఁగని తెన్గుధాత్రిని సమస్తము నేలెనతండు, తద్ధరా
పతికులజాతులే పిదప పాలనసేసిరి కాకతీయులై.
[సిరియాళదేవి క్రీ.శ.300 ప్రాంతములో కందారపురము (ఇది నేటి గుంటూరుజిల్లా లోని చేజెర్ల, లేదా కాంతేరు కావచ్చునని చారిత్రకుల అభిప్రాయము) రాజధానిగా ఆంధ్ర,తెలంగాణ ప్రాంతములలో కొంతభాగము నేలిన సోమదేవరాజు ధర్మపత్ని. ఈ సోమదేవునికి, ధాన్యకటకము (అమరావతి) ముఖ్యపట్టణముగా నేలుచుండిన బల్లహునికి నిరంతర యుద్ధములు జరుగుచుండెను. చివరికి బల్లహుడు సోమదేవుని యుద్ధమునందు వధించి, ఆతని రాజ్యము నాక్రమించెను. ఆ సమయమున సిరియాళదేవి గర్భవతిగా నుండెను. ఆమె ఎట్లో తప్పించుకొని అనుమకొండలో నున్న మాధవశర్మయను నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుని శరణుపొందెను. ఆతడామెను కూతురుగా గ్రహించి ఆమెకు రక్షణమొసంగెను. బల్లహుడు భటులను బంపి, ఆమె యునికిని కన్గొనెను. కాని అనుమకొండ యందలి బ్రాహ్మణులందఱును, మాధవశర్మ యందలి గౌరవము చేత ఆమె అతని కూతురేయని వచించిరి. అదియే నిజమైన ఆమె చేతి వంటకము మీరు తిని నిరూపించుడని బల్లహుడనెను. అప్పుడు బ్రాహ్మణులందఱు ఆమె సోమిదమ్మ యగుటవలన, ఆమె చేతి వంటకము తినుటలో దోసము లేదని అట్లే చేసిరి. అప్పుడు విధిలేక బల్లహుడామెను వధింపక విడిచిపెట్టెను. తదనంతర మామె కొక పుత్త్రుడు జనింపగా, మాధవశర్మ యందలి గౌరవముచే ఆ శిశువున కామె మాధవవర్మ యను పేరిడెను. ఈతడు మాధవశర్మ వద్దనే పెరిగి,విద్యాబుద్ధులు నేర్చి, ఉద్దండుడై సైన్యమును కూర్చుకొని పితృహంతయైన బల్లహుని వధించి, ఇంకను అనేక మాండలికులను జయించి, హనుమకొండ రాజధానిగా తెనుగుదేశము నేలెను. ఈతని సంతతివారే తర్వాత కాకతీయ ప్రభువులైరి యని కాసె సర్వప్ప (16వ శతాబ్దము) సిద్ధేశ్వరచరిత్రమను ద్విపదకావ్యము తెల్పుచున్నది. 1962లో ప్రచురింపబడిన మహాసహస్రావధానులు బ్రహ్మశ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రులవారు రచించిన ఆంధ్రసామ్రాజ్యము అను పద్యగ్రంథములో గూడ నీ చరిత్ర చక్కగా వర్ణింపబడినది. ఈ ఖండికలో వారిర్వురూ నామమాత్రముగా స్పృశించిన సిరియాళదేవి శరణాగతిఘట్టమును నేను కొంత వివరముగా వర్ణించితిని.]