పాఠశాలకై పర్మిటు

(స్థలము: విద్యామంత్రి గృహం. మంత్రిగారి ఆంతరంగికకార్యదర్శి రంగదాసు ముందు నడచుచు దారి చూపగా జంటకవులు – రామకృష్ణకవులు – అనగా రామశాస్త్రి, కృష్ణశర్మలు – ప్రవేశింతురు. రంగదాసు మంత్రికి దగ్గరగా ప్రక్కనే యున్న కుర్చీలో కూర్చొనును. వారి ముందర మంత్రిగారి కుక్క ‘టైగర్’ పడుకొనియుండును. రామకృష్ణకవులు మంత్రి కభిముఖముగా కొంచెము దూరముగా నున్న కుర్చీలలో కూర్చొందురు.)

కవులు:

నమస్కారము మంత్రివర్యులకు…

మంత్రి:

దండాలు . కూరుసోండి.

రంగదాసు:

(మంత్రి నుద్దేశించి) వీరే జంటకవులు రామకృష్ణులు. కార్యార్థమై మీదర్శనానికి వచ్చినారు.

మంత్రి:

కవిగారలూ! మీరెక్కడినుంచి వచ్చిండ్రు, ఎందుకొచ్చిండ్రు?

కృష్ణశర్మ:

రాముఁడీతండు, నే కృష్ణనామకుండ,
పుట్టినారము బల్మూరుపురమునందు,
వచ్చినారము హైదరాబాదనంగ,
భాగ్యనగర మనంగను ప్రథితమైన
తెలుఁగురాజధానికి మిమ్ముఁ గొలుచుకొఱకు.

రంగదాసు:

ఓహో! అంత గొప్పకవులా? పోయెట్రీలోనే మాట్లాడేస్తారా?

రామశాస్త్రి:

యతుల నతుకంగలేక, యే గతులు లేక,
పదపరిజ్ఞాన మొసఁగెడు చదువు లేక,
వచనకవితల వల్లించువారి కేము
పాఠముం గఱపంగ సత్పద్యకవిత
లోనె భాషింతుమయ్య వీలైనకొలఁది.

మంత్రి:

కవిగారలూ! ఎన్కటికి చక్కగా పాడుకునే పదియాలుండేవి. అట్లే మీరూ పాడిండ్రు. ఇప్పుడేమో ప్రతివాడూ కవే! కాకులూ కవులే, మేకలూ కవులే. స్టేజిమీది కెక్కి ఏదో పొడువూగ రాసి దాన్ని దీర్గాలు దీర్గాలు తీసి చదివితే దాన్నే గొప్ప కవితం అంటూ అందఱూ చప్పట్లు చరుస్తుండ్రు.

రామశాస్త్రి:

అందుకే అన్నానండి ‘పదపరిజ్ఞాన మొసఁగెడు చదువు లేక’ అని. వచన కవిత్వం రాసే వారికైనా పదపరిజ్ఞానం, భాషాజ్ఞానం, భావజాలం ఉంటే కొంతవఱకు బాగుంటుందండి. యతులు ప్రాసలు గణాలు వీనితో పని లేదన్నారని భాష నేర్చుకొనకుండా రాస్తే మనబోటి వారి సంగతి అటుంచి రాసిన వాడికే అర్థం కాదండి.

మంత్రి:

నేను బడికి వెళ్ళింది లేదు, చదివింది లేదు గాని, నాచిన్నతనంలో మా అమ్మమ్మ చెప్పిన పదియం ఇంకా నాకు గుర్తుకొస్తుంటది. చూడండి:

గంగిగోవుపాలు గంటెడైనను చాలు
కడివెడైన నేల ఖరముపాలు
భక్తి గల్గు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ! వినుర వేమ!

రామశాస్త్రి:

చక్కగా పాడినారు మంత్రిగారూ. పదాల అర్థం తెలిస్తే ఆనాటి పద్యాలు అర్థ మయ్యేవి. అక్షరాలు రానివాండ్లు కూడ వానిని పాడుకొని ఆనందించేవాండ్లు. ఇప్పటి కవిత్వంలో పదం లేదు, పస లేదు, అర్థం లేదు. పాడటం అసలు లేదు. పదాల అర్థం తెలిసినా ఆ కవిత్వం అర్థం కాదు. రాసినవాడిని దీనికి అర్థమేంట్రా అని అడిగితే వానికీ గొంతులో వెలగకాయ పడినంత పనౌతుంది. మీరెప్పుడో నేర్చుకున్న పద్యం ఇప్పటికీ గుర్తుంది. సర్వత్ర పద్యాలు ధారణకు అనుకూలంగా ఉంటాయి. ఇది పద్యాల కుండే విశేషలక్షణం. మఱి ఈనాటి కవిత్వాల్లో ఒక్క ముక్కైనా ఇట్లా గుర్తుంచుకోవడానికి వీలుంటున్నదా?

కృష్ణశర్మ:

మహామతిమంతులు మీరు మంత్రిగారూ! స్కూలులో చదువుకొనకున్నా మహా తెలివిగలవారండి. లేనిదే రాజకీయాల్లో ఇంత ముందుకువచ్చి మంత్రులౌతారా?

రంగదాసు:

ఎలక్షన్లో నిలిచేందుకు సంఘబలం ఉండడం ముఖ్యంగాని చదువుబలంతో పనేముంది. అందుకే ఎలక్షన్లలో గెలువడానికి గొప్ప చదువుండాలనే నిర్బంధాన్ని ప్రభుత్వాలు పెట్టడమూ లేదు, వోట్లు వేసే జనాలు పట్టించుకోవడమూ లేదు.

రామశాస్త్రి:

చక్కగా చెప్పారు రంగదాసుగారూ! ఔను మఱి …

చదువు లేకున్న నేమయ్యె సంఘబలమె
చాలదా యెలక్షన్లలో జయమునంద,
యేచదువు నేర్చి వనచరం బెక్కుచుండె
నున్నతంబగు తరువుల (తరగల) నుర్వియందు?

(పైపద్యము లోని చివరి పాదమును చదువునప్పుడు తరువులు అని పలికి వెంటనే తడబడి తరగలు అని సవరించుకొనును.)

రంగదాసు:

ఏమయ్యా! వనచరం అని నెమ్మదిగా అనేస్తున్నావే! వనచరం అంటే కోతి కాదూ? వనచరం అని అర్థం కాని పదం వేసి మంత్రిగారిని చెట్టెక్క నేర్చిన వనచరం అంటున్నావా? నాకు బాగా తెలుసులే – వనచరం అంటే కోతి అని.

రామశాస్త్రి:

ఎంతమాట. ఎంతమాట. నేనట్లంటానా రంగదాసుగారూ? ‘వనే సలిల కాననే’ అని వనానికి అమరకోశం రెండర్థాలు చెపుతూ వుంది. సలిలం అంటే నీరు, కాననం అంటే అడవి. వీనిలో మనకు కావలసింది మొదటి వనం కాని రెండవ వనం కాదండి. అందుచేత వనచర మంటే నీటిలో తిరుగుతూ ఉండేది – అంటే చేప. చేపలు సముద్రంలో ఉండే తరగలకు ఎదురెక్కుతుంటాయి గదా! ఏవిద్య నేర్చి అవి అంత అసాధ్యమైన కార్యాన్ని చేస్తున్నాయి? అట్లాగే మంత్రివర్యులూ చదువులతో పని లేని బుద్ధిబలంతో, సంఘ బలంతో ఎన్నో అడ్డంకులు ఎదురైనా వాటికి ఎదురీది, వానిని అధిగమించి గొప్ప ప్రభువు లైనారు – అని అన్నానంతే!

రంగదాసు:

చేపలు తరువు లెట్లెక్కుతాయయ్యా?

రామశాస్త్రి:

ఆ! అలా అనలేదండి? మీరు వినలేదా? పొరపాటున తరువులు అని నోట జారినందున వెంటనే తరగలు అని దానిని సవరించుకొన్నానండి.

కృష్ణశర్మ:

(సమయస్ఫూర్తితో) క్షమించాలి రంగదాసుగారూ! నాకుమాత్రం తరగలనే వినిపించింది. ‘ఏచదువు నేర్చి వనచరం బెక్కుచుండె, ఉన్నతంబగు తరగల నుర్వి యందు’ అనే వినిపించింది. ‘ఉన్నతంబగు తరగల నుదధియందు’ అంటే ఇంకా బాగుండేది. తరగ లంటే అలలూ, ఉదధి అంటే సముద్రం గదా! అందుచేత, మా రామన్న పద్యాన్ని ఇట్లా పాడితే ఇంకా బాగుంటుంది.

చదువు లేకున్న నేమయ్యె సంఘబలమె
చాలదా యెలక్షన్లలో జయమునంద,
ఏచదువు నేర్చి వనచరం బెక్కుచుండె
నున్నతంబగు తరగల నుదధియందు?

మంత్రి:

రంగదా సేమంటుండడో కాని, నాకు మాత్రం మీపదియం ఇనసొంపుగా ఉండది.

రామశాస్త్రి:

మంత్రిగారూ మనం ప్రకృతి నుండి నేర్చుకొనవలసింది చాలా వుందండి. చూడండి. వసంతకాలం వస్తూనే పంచమ రాగంలో ఏగాయకుడూ పాడలేనంత తీయ తీయగా పాడుతూ వుంటుంది కోకిల. కాని అది ఏ సంగీతకళాశాలలో, ఏ గురువు దగ్గర విద్యను నేర్చుకుంది?

ఏకళానిలయంబున నేప్రసిద్ధ
గురువుకడ విద్య నేర్చెను కోకిలంబు?
పరమగాయకమణులేనిఁ బాడలేని
పాటచే మదిఁ బరవశింపంగఁజేయు.

కృష్ణశర్మ:

కాన విద్యతోఁ బనిలేదు ఘనుల కిలను,
మేటి తరగల కెదురెక్కు మీనమట్లు,
తీయగాఁ బాడనేర్చిన కోయిలట్లు,
సహజమతిమంతులే మీరు సచివవర్య!

మంత్రి:

బాగున్నదయ్యా మీపదియం, ఆ పదియం చదివిన తీరు. పోయిన వారం ఏదో కవుల సంబేళనమని నడపడానికి నన్ను రమ్మనిండ్రు. నేను చదువుకోకున్నా విద్యా మంత్రి నైతే ఐతి గదా! అందుచేత నన్ను పిల్చిండ్రనుకుంటా. ఆ కవుల కవితాలు నాకు తలాతోకా అరథమైందంటె ఒట్టు. పలుగురాళ్ళ బాటపై నడిచే బండిలాగ గడబిడ చేసే వాండ్ల కవితంలో దునియా సాంతం దుక్ఖం, రక్తంతో నిండిన పీన్గుల పెంటనే. ఒక గొప్ప కవి యంట. ఈ కాలంలో గొప్ఫ కవితం రాస్తడంట. ఆయన ‘కుక్కపిల్లా, గాజుబిళ్ళా, గాడిదపిల్లా’ ఇట్లా దేనిమీద నైనా కవితం కమ్మగా రాయొచ్చు అని మొదలుపెట్టి, కాయితం గతిలేదా మరి కాయితం మీద రాయక గాడిదపిల్ల మీద ఎందుకు రాస్తుండడో అని నేను విస్తుపోతుండగనే , తాను ‘పెంటకుప్ప’పై రాసిన కవితం పెద్దగా చదివిండు. అది పిసరంతా నాకరథం కాలేదు గాని, అది చదువుతుంటే అందఱూ చెవులు మూసికొనిండ్రు. రోడ్డుపక్క పెంటకుప్పను చూచి దాని కంపుకు తట్టుకోలేక ముక్కు మూసుకున్నట్టే పెంటకుప్పపై ఆయన రాసిన కవితం యిని, యినలేక, తాళలేక వాండ్లు చెవులు మూసుకుండ్రేమో అని నాకనిపించింది. కవిగారలూ! మీరు గొప్ప కవులమని చెప్పుకుంటుండ్రు గదా! ఏదీ పెంటకుప్పపై మీరూ ముద్దుగా పదియం చెప్పండి చూతాం!

కృష్ణశర్మ:

వీథికుక్కల కెల్లను విందుసేయు

రామశాస్త్రి:

పందులకు నగు నందమౌ మందిరంబు

కృష్ణశర్మ:

ఎరువుగామారి పంటల వృద్ధి సేయు

రామశాస్త్రి:

పెంటకుప్పకు సరిలేదు పృథ్వియందు!

కృష్ణశర్మ:

కలవు మానవులందున కామ లోభ
మదము లను పెంటకుప్పలు మంత్రివర్య!
వీథికుప్పలకన్నను వేయిరెట్లు
చెఱచుచుండెను మనుజులఁ జేరి యవియె.

రామశాస్త్రి:

ఇట్టివారలు ప్రభువులై యేలిరేని
పెంటకుప్పయె రాజ్యమై వెలయునయ్య!
న్యాయహీనత యవినీతి యనెడు పాడు
కంపులం గూడి దేశంబు క్షయముఁ జెందు.

(ఈ పద్యము చదువుచుండగా రంగదాసు, మంత్రి చేదును మింగుచున్నవారివలె ముఖ వైఖరులను ప్రదర్శింతురు.)

మంత్రి:

పెంటకుప్పపై ఇటువంటి గొప్ప అరథంతో పదియం చెప్పినోళ్ళ నెరుగను. కవిగారలూ, మా టైగర్ పదియం చదువుతుంటే మీమొకమే చూస్తుండది. దానిపై ఒక పదియం పడేయండి చూతాం.

కృష్ణశర్మ:

అదెంత పని, తప్పకుండా మంత్రిగారూ!

వోటు వేసినవారికే లోటు లేని
యట్లు చూచికొనెడి మంత్రియట్లు నీవు
సాకికొన్నట్టి మంత్రిని సంతతంబు
గొల్తువో కుర్కురంబ! నీ కొనరు శుభము!

మంత్రి:

(రంగదాసుతో జనాంతికముగా) దాసూ! మొదటి రెండు లైనులు భేషుగా ఉండవి. కాని చివరి రెండు లైనుల బావమేంటీ అని ఆలోచిస్తుండ. కర్కురమంటే కుర్ కుర్ అనే కుక్కనా? అంటే మంత్రిని – నన్ను – కుక్కతో పోలుస్తుండడా ఈ బోడి బాపనోడు?

రంగదాసు:

(ఆలోచించినట్లు నటించి, మంత్రితో జనాంతికముగా) అదేమీ కాదు లెండి. మీలాగే మీ కుక్క కూడ ప్రయోజనకారి అంటున్నాడంతే! అంటే మిమ్మల్ని కుక్కతో గాదు గాని కుక్కను మీతో – అంటే మీ కుక్క మంచితనాన్ని మీ మంచితనంతో – పోలుస్తున్నాడనిపిస్తోంది నాకు.

మంత్రి:

(రంగదాసుతో జనాంతికముగ) అమ్మ! బతికిపోయిండు. లేకుంటేనా – (కవులతో ప్రకాశముగ) బాగుండది పంతుళ్ళూ! ముద్దుగా, కుక్క గూడ నాలాగే మంచిదని బలె బాగ చెప్పిండ్రు.

రంగదాసు:

(మంత్రితో జనాంతికముగా) సార్! మీకు కొద్దిసేపట్లో చీఫ్‌మినిష్టరుగారితో మీటింగుంది. మీరు మర్చిపోయినట్లుంది.

మంత్రి:

(రంగదాసుతో జనాంతికముగా) బాగ గుర్తుకు దెచ్చుకున్నవయ్యా. మఱి వీరి కత యేదో జల్దీగ ముగించి పోదాం. నీవు గూడ మీటింగులో ఉండవు గదా! వీరికి మన మామూలు సంగతి ముందే ఎరుక చేసినౌ గదా!

రంగదాసు:

(మంత్రితో జనాంతికముగ) మఱి చేయకుండా ఉంటానా? (ప్రకాశముగా కవులతో) కవిగార్లూ! నాకు చిన్నప్పటి సుమతీశతకంలోని పద్యమొకటి గుర్తుకొస్తూ వుంది.

పతికడకు, తన్ను గూర్చిన
సతికడకును, వేల్పుకడకు, సద్గురుకడకున్,
సుతుకడకు, రిత్తచేతుల
మతిమంతులు చనరు, నీతిమార్గము సుమతీ!

మఱి మీరేమైనా …

కృష్ణశర్మ:

ఓహో! కానుకలా? వానికేం లెండి …

సారసాహిత్యరసములఁ జవులుగొల్పు
పద్దెరతనాల మీకు నుపాయనముగ
నీదలంచితిమయ్య! మీరివి గ్రహించి
తీర్పుఁడయ్య మాకార్యము నోర్పుతోడ!

మంత్రి:

(రంగదాసుతో జనాంతికముగ) ఏదో సారా, సాయిత్యం, రసాలూ, పెద్ద రతనాలూ – ఉపాయంగా ఇస్తమంటుండ్రు. మఱి వీరి మడిసంచిని చూస్తుంటే బూడిద తప్ప ఇంకేం లేనట్లుండది. ఏమిస్తుండ్రో బాగ అరసుకో.

రంగదాసు:

(జంటకవులతో ప్రకాశముగ) ఏమండీ చాలా పెద్దమాటలే చెప్తున్నారు – సారా, సాహిత్యం, రసాలూ, పెద్దరతనాలూ ఉపాయంగా ఇస్తామంటున్నారు. కాని ఖాళీ మడిసంచి చూపెట్టడమే ఆ ఉపాయమా?

రామశాస్త్రి:

రామరామ! మేమట్లా అనలేదండి. సార – అంటే సారా కాదండి. యోగ్యమైన, చక్కనైన అని అర్థం. సాహిత్య మంటే –పప్పు , ఉప్పు, చింతపండు, నెయ్యి, బెల్లం ఇవన్నీ పెట్టి బ్రాహ్మణులకు దానం చేసే సాహిత్యం కాదండి. రసాలంటే, రసాల మామిడిపండ్లు కావండి. సాహిత్యమంటే చక్కని వాఙ్మయం. రసాలంటే శృంగారవీరకరుణాది నవ రసాలు. అట్టి రసాలతో కూడిన చక్కని పద్యాలు అనే రత్నాలను తమకు ఉపాయంగా కాదు – ఉపాయనంగా – అంటే కానుకగా సమర్పించుకుంటామన్నామండి. అంతేకాని ఆగర్భదరిద్రులం – మాకెక్కడివండీ రత్నాలూ, వజ్రవైడూర్యాలూ!

మంత్రి:

(తన మూఢత్వాన్ని కప్పిపుచ్చుతూ) కవిగారలూ! ఈ రంగదాసు పఖ్ఖా మూర్ఖుడండి. తెలియకపోతే మీవంటి పెద్దల నడిగి తెలుసుకునాలి గాని ఇట్లా పెడర్థాలు తీయడం పెద్ద తప్పండి. మాకు మీటింగుకు పోవల్సిన పనుంది కనుక మీకు కావల్సిం దేందో చెప్పుకోండి.

కృష్ణశర్మ:

మాదొక చిన్న విన్నపము. విద్యాశాఖామాత్యులు మీరు తలచుకుంటే తత్క్షణం అనుగ్రహింపవలసినది …

మంత్రివృషభమ! మాదుగ్రామంబునందు
పాఠశాలను నెలకొల్పు ‘ప్లాను’ గలదు;
దీనికై మీప్రభుత్వంపు దీవెనలను,
‘పర్మిటును’ గోరుటకు నిట వచ్చినాము.

రంగదాసు:

(మంత్రి ఆగ్రహాశ్చర్యములతో చూచుచుండగా) ఏమండీ కవిగారూ! మంత్రి వృషభమ – అని నెమ్మదిగా అనేస్తున్నారే? వృషభము – అంటే ఎద్దు, దున్నపోతు – అని మాకు తెలియదనుకోకండి. నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు పద్యాలప్పచెప్పక పోయినా హోంవర్కు చేయకపోయినా మామేష్టారు ‘తిండిపోతా’ అనడానికి ‘తిండివృషభమా’ అని గంభీరంగా తిట్టి నన్ను బెంచిపీట ఎక్కించేవాడు. అప్పటినుండీ వృషభమంటే ఏమిటో నాకు బాగా తెలుసు.

రామశాస్త్రి:

కార్యదర్శిగారూ! ఈవృషభం ఆవృషభం కాదండి. అమరసింహుడనే గొప్ప పండితుడు అమరకోశమనే సంస్కృతనిఘంటువులో

‘స్యురుత్తరపదే వ్యాఘ్ర పుంగవర్షభ కుంజరాః,
సింహ శార్దూల నాగాద్యాః పుంసి శ్రేష్ఠార్థగోచరాః’

అని చెప్పినాడు. అంటే, వ్యాఘ్ర, పుంగవ, వృషభ, సింహ, శార్దూల, నాగ శబ్దములు సమాసంలో ఉత్తరపదంగా ఉన్నప్పుడు అవి శ్రేష్ఠార్థాన్ని బోధిస్తాయని దీని కర్థం. అందు చేత రాజసింహుడు, రాజవృషభుడు అంటే అంటే శ్రేష్ఠుడైన రాజు అని అర్థం. అందుచేతనే రామాయణంలో దశరథమహారాజు శ్రీరామచంద్రుణ్ణి విశ్వామిత్రుని వెంబడి పంపడానికి అంగీకరించే సందర్భంలో

‘ఇతి మునివచనాత్ ప్రసన్నచిత్తో,
రఘువృషభస్తు ముమోద భాస్వరాంగః,
గమన మభిరురోచ రాఘవస్య,
ప్రథితయశాః కుశికాత్మజాయ బుద్ధ్యా’

అంటాడు వాల్మీకి. అంటే – విశ్వామిత్రుడు తాటకాదిరాక్షసుల వధించి, యాగరక్షణ చేయడానికి రాముణ్ణి పంపమని దశరథమహారాజు నర్థిస్తాడు. ఐతే బాలుడైన రాముణ్ణి అట్టి కష్టకార్యానికి పంపడానికి తటపటాయిస్తాడు దశరథమహారాజు. అప్పు డాతని కుల గురువూ, పురోహితుడూ, పూజ్యుడూ ఐన వసిష్ఠమహర్షి ‘దశరథమహారాజా! విశ్వా మిత్రుడు స్వయంగా రాక్షసులను నిర్మూలించడానికి సమర్థుడే ఐనా, రాముని మేలు కొఱకే, రామునికి అజేయమైన అస్త్రశస్త్రాలను, క్షాత్రవిద్యలను దత్తం చేయడానికే – ఈ విధంగా కోరుతున్నాడు. అందుచేత నీవు నిస్సందేహంగా రాముణ్ణి పంపవలసిందని బోధిస్తాడు. అట్టి వసిష్ఠునివాక్యాలవల్ల రఘువృషభుడు – అంటే రఘువంశంలో శ్రేష్ఠుడైన దశరథుడు – సంతుష్టుడై విశ్వామిత్రునివెంట రాముని పంపడానికి ఇష్టపడ్డాడు – అని ఈ శ్లోకం చెపుతున్నది. అందుచేత దాసుగారూ! యీ వృషభం రామాయణంలోని వృషభం గాని, మీ తెలుగుక్లాసులోని వృషభం కాదండి.

మంత్రి:

(సర్దుకొని, సంతృప్తిని నటిస్తూ) దాసూ! నీ అగ్నానాన్ని మళ్ళీ బయటేసుకొంటివి గదా! (రామశాస్త్రివైపు చూచి) శాస్త్రులూ! ఈ రుషభం చర్చలో పడి మీ ప్లాను ఇవరాలట్టే మర్చిపొయినాను. మళ్ళీ చెప్పండి.

రామశాస్త్రి:

మంత్రిచంద్రమ! మాదుగ్రామంబునందు
పాఠశాలను నెలకొల్పు ‘ప్లాను’ గలదు;
దీనికై మీప్రభుత్వంపు దీవెనలను,
‘పర్మిటును’ గోరుటకు నిట వచ్చినాము.

రంగదాసు:

ఓహో! వృషభం చంద్రునిగా మారిందా ఇప్పుడు?

రామశాస్త్రి:

వృషభంలో – అంటే వృషభరాశిలో – చంద్రుడు ప్రవేశించినాడనుకోండి. దాసు గారూ! మీరీమాట అన్నారు కాబట్టి వాల్మీకి సుందరకాండలో చేసిన వర్ణన మొక్కటి గుర్తు కొస్తూ వుంది. హనుమంతుడు సీతను వెదకుటకు లంకలో ప్రవేశిస్తాడు. అప్పుడప్పుడే రాత్రి – ఆరాత్రిలో చంద్రోదయం ఔతుంటుంది. ఆచంద్రుణ్ణి వాల్మీకి ఇట్లా వర్ణిస్తాడు:

‘తత స్స మధ్యంగత మంశుమన్తం,
జ్యోత్స్నావితానం మహదుద్వమన్తమ్,
దదర్శ ధీమాన్ దివి భానుమన్తం,
గోష్ఠే వృషం మత్తమివ భ్రమన్తమ్’

మంత్రి:

నాకేం అరథం కాలేదు గాని కమ్మగా చదివిండ్రు. అంతం మంతం అని నాల్గుసార్లు అనిపించి చెవికింపుగ వినిపించిండ్రు. కొంచెం దీని అరథం గూడ చెప్పండి.

కృష్ణశర్మ:

మహాకవి వాల్మీకిది చాలా గొప్ప వర్ణనండీ. హనుమంతుడు లంకలో ప్రవేశించే వేళకు రాత్రి అయిందట. ఆ రాత్రిలో ఆకాశమధ్యంలో అన్నిదిక్కులా వెన్నెలలు విరజిమ్ముతూ ఉన్న చంద్రుడు అతనికి కనపడ్డాడట. ఆ చంద్రుడు గోశాలలో తిరుగాడే పెద్ద వృషభం లాగ ఉన్నాడట. అంటే ఆకాశగోళం ఒక గోశాలవలె ఉన్నదని, అందులో ఉండే నక్షత్రాలు ఆవులవలె ఉన్నవని, ఆ నక్షత్రాల మధ్య చరిస్తూ వున్న చంద్రుడు ఒక పెద్ద వృషభంలాగ, ఆ నక్షత్రాలన్నిటికంటె పెద్దగా కనిపిస్తున్నాడని వాల్మీకి వర్ణన. చూచినారా మన శెక్రెటరీగారి వృషభప్రసక్తి చంద్రమండలం దాకా ప్రాకింది. (అందఱూ నవ్వుదురు.)

మంత్రి:

భేష్| బలె బాగ నాకు ఎక్సప్లేన్ జేసిండ్రు. ఇక స్కూలు జోలికి వత్తాం. స్కూలులో ఎన్ని తరగతు లుంటవి?

రామశాస్త్రి:

ఎనిమిది తరగతులు.

మంత్రి:

(రంగదాసుతో జనాంతికముగా) మఱి యీళ్ళకు పర్మిటు కయ్యే మామూలు సంగతి ముందే చెప్పింటివా? దాన్ని వాండ్లు తెచ్చిండ్రా?

రంగదాసు:

(మంత్రితో జనాంతికముగా) ఆ!ఆ! క్లాసుకు పదివేల చొప్పున 80 వేలు చెప్పినాను. దానికేం పర్వాలేదన్నారు. మఱి తెచ్చినారేమో మీ ముందే అడుగుతాను. (కవులతో ప్రకాశముగ) కవిగార్లూ ! మఱి పర్మిటు ఖర్చుల సంగతి మీకు గుర్తుందా? తెచ్చినారా?

కృష్ణశర్మ:

లేకేం విభూతిసహస్రదశకం తెమ్మన్నారు.

రంగదాసు:

ఏమయ్యా! ఖర్చులు తెమ్మంటే విభూతి తెచ్చినారా? బూడిదలో స్కూలు మొలుస్తుందా?

కృష్ణశర్మ:

విభూతి అంటే బూడిదే కాక ఐశ్వర్యం అనే అర్థముందండి.

‘విభూతి ర్భూతి రైశ్వర్య మణిమాదిక మష్టధా,
అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రాప్తిః ప్రాకామ్య మీశిత్వం వశిత్వం చాష్టభూతయః’

అని అమరసింహుడు అమరకోశంలో చెప్పినాడండి. అంటే విభూతి, ఐశ్వర్యం అనేవి సమానార్థకాలు. ఈ విభూతులు అణిమా, మహిమా, గరిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం అని ఎనిమిది విధాలు. అందుచేత విభూతి అనే పదం అష్టైశ్వర్యాలకు సంకేతం. సహస్రం అంటే వేయి, సహస్రదశకం 10 వేలు. ఈ రకంగా విభూతి సహస్రదశకం అంటే 80 వేలు. లెక్క సరిపోయింది గదా!

రంగదాసు:

లెక్క సరిపోయింది గానీ రొక్క మెక్కడుందయ్యా?

రామశాస్త్రి:

సెక్రెటరీగారూ మాది చాలా కుగ్రామం. వనరులు లేవు. ఎంతో కష్టపడి ఇంటి కింత అని నిర్బంధచందాలను వసూలు చేసి దీనికి పూనుకున్నాం. దీనికొక కమిటీ వేసినాం. ఈ కమిటీ పెద్ద ఎజుకేషన్ డిపార్టుమెంటు చుట్టూ పది నెలలనుండి తిరిగినాడు. ఫలితం శూన్యం. డిపార్టుమెంటులో ప్రతివాడూ ఇమ్మని చేయి చాపేవాడే.

లంచము పంచక తినకుము
కొంచెంబే యైన చేత గొనకుము సుమ్మీ
లంచంబు పట్టువారికి
కించిత్తుగ రాల్చకున్న కీడగు పనికిన్

అని ఏదో కవి చెప్పినట్లుగా, ఈ పంపకాలన్నిటికీ కావలసిన మొత్తం మీరు చెప్పిన మొత్తానికంటే రెండింతలయ్యే పరిస్థితి ఏర్పడింది. అందుచేత కమిటీ పెద్దలు విచారించి, ఇది నల్గురి కుపయోగపడే కార్యం గదా, నేరుగా మంత్రిగారితో ఈ విషయం విన్నవిస్తే ఈ ఖర్చులన్నీ మినహాయించవచ్చునని నిర్ణయించి మమ్ముల నీపనికి నియోగించినారు. ఏదో పద్యాలు చెప్పగలం కాని మాకు వ్యవహారజ్ఞాన మంతంతే. ఐనా ధైర్యం చేసి పొమ్మన్నారు. మా దీనపరిస్థితిని గమనించి, ఈ ఖర్చులను మినహాయించి మా స్కూలుకు పర్మిషను ఇవ్వవలసిందిగా మహామహులైన మంత్రిగారిని అభ్యర్థిస్తున్నాము.

మంత్రి:

(ఆలోచన నటిస్తూ, రంగదాసుతో జనాంతికముగా) ఈకవులు చాలా గట్టిమనుషుల్లాగ కనిపిస్తుండ్రు. వీరికి సాయం చేయకుంటే మన డిపార్టుమెంటు యవహారాలపై మాటి మాటికి పదయాలలో చెడు ప్రచారం చేసే పమాదముండది. వీరి కాయవకాశం ఇచ్చే బదులు కోరినట్టుగా మన మామూలు ముట్టకున్నా వీరికి పర్మిశనిచ్చి, వీరిని మన ప్రచారం కొరకు వాడుకుంటే మంచిదనిపిస్తుండది. చదువుకోనివాండ్లు మనకే వోట్లేస్తుండరు గాని, వీండ్లను మనవెంట గట్టుకొని, వచ్చే ఎలక్షనులో చదువుకున్నోరిని, అగ్రవర్నాలోరిని గూడ మనవైపు తిప్పుకోవచ్చు.

(ప్రకాశముగా) కవిగారలూ! శెక్రెటరికేం తెలుసు గాని మీ రడగినట్టు ఖర్చులు లేకుండనే మీకు పర్మిటు నిస్తాం. మీ స్కూలుకు ఆసరా పడడం మా డిపార్టుమెంటు బాగ్యంగా, గరువంగా బావిస్తుంది. మీరు పరేశాన్ కాకండి. స్కూలు పూర్తయితె నేనే వొచ్చి ఇనాగ్రేశన్ చేస్తా. మీ తోడు కూడ ముందు ముందు మాకుండాలె మఱి. రాబోయే యెలక్షన్లో మంచి మంచి పదియాలూ, పాటలూ రాసి అందఱూ మాకు వోటు వేసేట్టు సాయం చెయ్యాలె. ఇది ఇప్పుడే ఒక విదంగ మాకు చేసి చూపెట్టాలె. మీపదియాలతో మా డిపార్టుమెంటు కొక పని చేసి పెట్టాలె. దీని సంగతి రంగదాసు మీకు ఎరుక చేస్తడు. (రంగదాసుకు ఎదురుగా నున్న మద్యనిషేధప్రచార పటాన్ని (పోష్టరును) చూపిస్తూ ఏదో చెప్పుమని సైగ చేస్తాడు.)

రంగదాసు:

కవిగార్లూ! ఇటీవల ప్రభుత్వం మద్యనిషేధచట్టాన్ని ప్రవేశపెట్టింది. అది మీకు తెలిసిందే కదా! ఐతే ఈ ఉద్యమప్రచారం కొఱకు సామాన్యప్రజానీకానికి అర్థమయ్యేటట్లు వినోదకరంగాను, విజ్ఞానకరంగాను ఉండేటట్లు ఏవో కొన్ని ప్రచారసందేశాలను తయారు చేయమని మా ఎడ్యుకేషన్ డిపార్టుమెంటును – అంటే విద్యాశాఖను – ప్రభుత్వం కోరింది. ఇప్పుడు మీ ఆశుకవిత్వాన్ని విన్న తరువాత మీరా మద్యనిషేధం పైన కొన్ని పద్యాలు చెపితే ఈ ప్రచారానికి చాలా ఉపయోగపడవచ్చునని మా కనిపిస్తూ వుంది. అందుచేత మీకు దోచిన నాలుగు పద్యాలను పలికి మీ స్కూలుకు పర్మిటును మీరు పట్టుకపోండి.

రామశాస్త్రి:

పద్యాలకేం దొరవారూ! చేతనైనన్ని చెపుతాం. కాని ఇందాక ‘సార సాహిత్య’ అని పద్యం చదివితే సారాపైన మక్కువ చూపినట్లున్నారు – ఇప్పుడేమో సారా నిషేధాన్ని గుఱించి వక్కాణిస్తున్నారు తమరు.

రంగదాసు:

ఆ!ఆ! రాజకీయాలు తెలియనివారికి ఈ సంగతు లర్థం కావటం కష్టం లెండి. మద్యనిషేధం ప్రజలకు గాని, ప్రభుత్వానికి కాదుగదా! ఈ విషయం గుర్తుంచుకుంటే ఇందులో వింతేమీ లేదు.

కృష్ణశర్మ:

ప్రభుత్వమంటే అధికారులే కదా! ప్రభుత్వానికి నిషేధం లేదంటే అధికారులకు లేదనే అనుకోవచ్చా?

రంగదాసు:

శర్మగారూ! దీని నంతగా తర్కించ గూడదు. అందుకే మీకు రాజకీయా లర్థం కావన్నా. ప్రభుత్వానికి లేదంటే అర్థం చేసుకొని అంతటితో వదిలేయాలి. ఆ! ఆ! కానీయండి, కానీయండి మద్యం పైన – అంటే నిషేధం పైన మీపద్యాలను పలుకండి.

రామశాస్త్రి: తరుముచు వచ్చు దానవుల ధాటికి నోర్వఁగలేక దేవతల్
ఉరువడి నాకవీథిఁ బడి యుస్సురుమంచును బర్వువెట్టఁ, ద
త్కరగతభాండ మొల్క, నమృతంపుపృషంతులు కొన్ని భూమిపై
దొరలిన, నుద్భవిల్లెఁగద తోరములై యవి యీఁతచెట్లుగన్.

కాక యూరునె యిట్టు లామ్రాఁకులందు
అమృతతుల్యంబని ప్రతిసాయంతనమున
ఎల్లవారును జేరి సేవించుచున్న
కల్లనంబడు బహుమాదకాసవంబు!

మంత్రి:

ఏమయ్యా! కల్లు నిశేదాన్ని గురించి చెప్పమంటే కల్లును పొగడుతుండవే?

కృష్ణశర్మ:

చిత్తగించవలెను మంత్రిగారూ! మీకా సందేహ మక్కఱ లేదు.

కాని సురపానలోలత్వ మూనవలదు;
చెఱచు నయ్యది యెల్లరఁ జెంతఁ జేరి
చిర్నగవు లొల్కి, పైస కాఁజేసి, తుదకు
వీథిలో విటుఁ బడఁద్రోయు వేశ్యవోలె.

నలుగురిలోన నీబ్రతుకు నవ్వులపాలగుఁ, బచ్చకప్రపుం
బలుకులవోలె మాయమగు భాయి! గడించిన పైకమంతయున్,
కలిమి గతింప నీగతి బికారితనంబునఁ గుందు నిన్ను నీ
చెలువయు, సూనులుం దరికిఁ జేరఁగనీయరు నమ్ము, మిత్రమా!

రిక్షా త్రొక్కియొ, బండి లాగియొ, మహాద్రింబోలు పెన్బండలం
దీక్షాసక్తునిఁబోలె మోసియొ యెటో నీ కొన్న రూప్యంబులన్
ప్రక్షాళింతువె మద్యనిర్ఝరమునన్, బాగోయి! యీ చర్యయే
రక్షించుం గద! నీకుటుంబమును, మర్యాదన్ భువిన్ గార్మికా!

కల్లును ద్రావి మత్తుగొని కష్టము లెల్లను విస్మరించినన్
పెల్లగు శాంతి యాత్మకు లభించు నటంచుఁ దలంపకోయి, య
ట్లుల్లమునందు శాంతిఁ గను యోచన యున్న భజింపుమోయి సం
పల్లలనావిభున్, దురితవారణ మాతఁడు సేయు రూఢిగన్.

సారా కొనకుమి – సతికిన్
సారతరంబైన ‘సిల్కుసారీ’ కొనుమీ;
నీరా కొనకుమి – సుతకున్
నీరజములయంచు చీర నెనరునఁ గొనుమీ!

మంత్రి:

భేష్| బాగ బాగ చెప్పిండ్రు. రేపే మీకు పర్మిశను దొర్కుతుంది. మర్చిపోకండి. మా యెలక్షనుకు మీరు మంచి మంచి పాటలు రాసి సాయం చెయ్యాలె. చదువుకున్నోండ్లు వోటేసేట్లు మాకు మంచి మంచి మాటలు రాసి పెట్టాలె.

జంటకవులు:

కృతార్థులం మంత్రిగారూ! మీకవసరమైనప్పుడల్లా మాకు తెలియజేయండి. మా చేతనైనంత మీకు మంచి పాటలూ, పద్యాలూ, స్పీచులూ అన్నీ వ్రాసి పెడతాం.
(తెర)