కవిత్వం: దోహదక్రియలు

ప్రకృతిపరిశీలనద్వారా, తన ఊహాశక్తిద్వారా మానవుడు రెండు మేధాప్రపంచాలను సృష్టించుకొన్నాడు. ప్రకృతిలోనుండే చరాచరాలను పరిశీలించి, నిత్యసత్యములైన సిద్ధాంతములద్వారా, సూత్రములద్వారా వానిస్వభావాన్ని విశ్లేషించే విజ్ఞానశాస్త్రప్రపంచం అందులోనొకటి. అది అవలోకనము, ప్రయోగాత్మక సాక్ష్యములద్వారా నిబద్ధమైనది. అందులో కల్పనకు అవకాశం లేదు. రెండవది కళాప్రపంచం. అది సాక్ష్యనిరూపణకు లొంగని, దానితో అవసరంలేని కృత్రిమ ప్రపంచం. అది మానవుడు తన కాల్పనిక శక్తిద్వారా నిర్మించుకొన్నది. అనందాన్ని, రసస్ఫూర్తిని కలిగించడమే దీని లక్ష్యం. కాని ఇది కూడ కొన్ని సంప్రదాయాలపై, నియమాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి ఉదాహరణాలు సంస్కృత సాహిత్య సంప్రదాయములపై ఆధారపడి తెలుగుకవులు తమ ప్రబంధాలలో పాటించిన కవిసమయములు, దోహదక్రియలు. సాలంకృతపద్మినీజాత్యంగనలు అకాలంలో తరులతాదులు పుష్పింపజేయుటకు చేయవలసిన క్రియలే దోహదక్రియలు. విజ్ఞానశాస్త్రముద్వారా సమర్థనీయము గాని ఈ సంప్రదాయమును పాటించి కవులు అత్యంతమనోరంజకమైన వర్ణనలు చేసినారు. ఈ సంప్రదాయం ఏరకంగా కవుల ఊహాశక్తిని ప్రేరేపించిందో తెలుసుకొనడానికి చేసే అల్పప్రయత్నమీవ్యాసం. సాంప్రదాయిక తెలుగుకవిత్వంతో కొంత అనుభవమున్నవారెవరికైనా ‘కవిసమయములు’ అనే మాట తెలిసే వుంటుంది. చంద్రుడు కలువలకు మిత్రుడని, సూర్యుడు వైరియని, సూర్యుడు పద్మములకు మిత్రుడని, చంద్రుడు వైరియని, పరస్పరమిత్రత్వమేకాక పద్మినీసూర్యులకు, కుముదినీచంద్రులకు నాయికానాయక ప్రణయాన్ని కట్టబెట్టడం పూర్వకవిత్వం కొంత స్పర్శించినా మనకు అనుభవమౌతాయి. ఈవిధంగా వర్ణించడం ఒక కవితాసంప్రదాయం. ఇట్టివే అనేకములున్నవి. నేరుగా దోహదములను గుఱించి చెప్పక ముందుగా కవిసమయాలను గుఱించి ఎందుకు చెప్తున్నానంటే, దోహదక్రియలు వేఱుగా చెప్పబడినను, అవి కవిసమయాలుగానే భావించాలి.

కవిసమయాలంటే?

ఆదికావ్యమైన వాల్మీకిరామాయణంతో ఆరంభమై కవిసమయములు సంస్కృతకావ్యసాహిత్యమునందంతటను, అందునుండి తెలుగులోనికిని ప్రాకినవి. కాని వీనిని శాస్త్రీయముగా నిర్వచించినవాడు 9వ శతాబ్దమునందలి కావ్యమీమాంసాకర్తయైన రాజశేఖరుడు. ఆతర్వాతి ఆలంకారికులు ఇతని నిర్వచనమునే అనుసరించినారు. అందుచేత ఇతని నిర్వచనానుసారము కవిసమయములను గుఱించి కొంచెం తెలుసుకొని తర్వాత దోహదక్రియలను గుఱించి తెలుసుకుందాం.

‘అశాస్త్రీయ మలౌకికం చ పరంపరాయాతం యమర్థ ముపనిబధ్నన్తి కవయః స కవిసమయః’ అని రాజశేఖరుని కవిసమయనిర్వచనం. అంటే పారంపర్యముగా, తరతరాలుగా, కవులచేత అనుసరింపఁబడుచున్న అశాస్త్రీయములు, అలౌకికములైన కవితాసంప్రదాయములే కవిసమయములని దీని అర్థం. ఈ నిర్వచనంలో ముఖ్యమైన పదములు ‘అశాస్త్రీయములు’, ‘అలౌకికములు’, ‘పరంపరాయాతములు’ అనునవి. అశాస్త్రీయములంటే విజ్ణానశాస్త్రంచేత సమర్థనీయములు గానివని, అలౌకికములంటే లోకానుభవము కంటె విరుద్ధములైనవని అర్థం చెప్పుకొనవచ్చు. మూడవదైన ‘పరంపరాయాతములు’ అనేది చాలా ముఖ్యమైన లక్షణం. అంటే తరతరాలనుండి దేశకాలావధులు లేక నాటుకున్న సంప్రదాయాలు మాత్రమే కవిసమయములనీ, ఇట్టివి క్రొత్తవి సృష్టించరాదని దీని అర్థం. అశాస్త్రీయములు, అలౌకికములైన వర్ణనలు కావ్యదోషములు గావా అని అడుగవచ్చు. ఈ ప్రశ్న వేసికొని రాజశేఖరుడు ‘వస్తువృత్తి రతన్త్రమ్; కవిసమయః ప్రమాణమ్’ – అనగా కావ్యవర్ణనలందు వాస్తవస్థితిగాక పరంపరాయాతమైన, మనోరంజకమైన కవిసమయములే ప్రమాణములు అని అభిప్రాయపడ్డాడు. అది నిజమే కదా! వాస్తవాన్ని వర్ణించేది శాస్త్రం. కాని కవితాప్రపంచం వాస్తవానుభవంపై ఆధారపడి నిర్మింపబడిన ఒక కల్పితప్రపంచం. రసస్ఫూర్తి దాని లక్ష్యంగాని వాస్తవస్థితినిరూపణ దాని లక్ష్యం కాదు. రసస్ఫూర్తిని కల్గజేసే కవిసమయములవంటి సంప్రదాయాలే కవిత్వానికి ప్రధానం.

అసత్తును, అనగా, లేనిదానిని ఉన్నదని చెప్పినను, సత్తును, అనగా, ఉన్నదానిని లేదని చెప్పినను, లేదా పరంపరాయాతమైన ఒక కృత్రిమనియమముననుసరించి చెప్పినను అది అశాస్త్రీయమని రాజశేఖరుని అభిప్రాయము. కవిత్వంలో వీనికి అనేక ఉదాహరణాలున్నా, ప్రస్తుతం ఒకటి రెండు మాత్రం పరిశీలించడం చాలు.

పాఱే నీరుగల నదులలో కమలాలుగాని, కలువలుగాని ఉండవు. కాని వాల్మీకికాలంనుండి నదులలో ఇవి ఉన్నట్లు వర్ణించడం పరిపాటి అయిపోయింది. ఈ విధమైన వర్ణన లేనిదానిని ఉన్నట్లు చెప్పడమేకదా! వాల్మీకి అయోధ్యాకాండంలో ‘క్వచిత్ఫుల్లోత్పలచ్ఛన్నాం, క్వచిత్పద్మవనాకులామ్’ – అంటే కొన్నిచోట్ల విప్పారిన కలువలు, మఱికొన్నచోట్ల విప్పారిన కమలవనాలు గంగానదిలో ఉన్నవని వర్ణిస్తాడు. కిష్కింధాకాండలో ప్రస్రవణగిరిప్రాంతమందలి నదిలో రంగురంగుల కలువలున్నవని వర్ణిస్తాడు.

క్వచిన్నీలోత్పలైశ్ఛన్నా భాతి రక్తోత్పలైః క్వచిత్
క్వచిదాభాతి శుక్లైశ్చ దివ్యెః కుముదకుట్మలైః

ఆ నది కొన్నిచోట్ల నల్లకలువలచేతను, కొన్నిచోట్ల ఎఱ్ఱకలువలచేతను, ఇంకొకచోట శ్రేష్ఠమైన తెల్లకలువల మొగ్గలచేతను కప్పబడి ప్రకాశిస్తున్నది – అంటాడు. ‘ప్రత్యూషేషు స్ఫురితకమలామోదమైత్రీకషాయః’ – అంటూ, వికసించిన తామరలయొక్క సుగంధముతో గూడి శిప్రానదినుండి ప్రభాతవాతము వీస్తున్నదని కాళిదాసు వర్ణిస్తాడు. ఇట్లే గంధవతీనదిలో వికసించిన కలువపుప్పొడుల పరీమళమును, ఆ నదిలో జలకమాడు స్త్రీలు మేనికి బూసికొన్న గంధాదుల పరీమళమును వహించి వీచు వాయువు చెంతనున్న వనతరువులను కదలించుచున్నదని కాళిదాసు మేఘసందేశంలో వర్ణిస్తాడు. ఈ సంప్రదాయం వాల్మీకికాలంనుండి ఇప్పటివఱకు అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉన్నది.

ఇట్లాంటిదే ప్రతిశైలమునందు స్వర్ణరజతములు, మణులు ఉన్నవని వర్ణించడం. ఉదాహరణకు చంద్రికాపరిణయంలోని ఈ పద్యం.

మ.
జననాథేశ్వర కంటె రత్నకటకాంచత్ స్వర్ణమౌళ్యాప్తమై,
అనిశాత్యాశ్రితరాజసింహనిచయంబై, సంవృతానేక వా
హినియై, చందనగంధవాసితమునై, యీశైలవర్యంబు దాఁ
దనరెన్ నీవిట నొందుమాత్రనె భవత్సారూప్యమున్ గాంచెనాన్.

హేమకూటమనే పర్వతాన్ని గుఱించి సుచంద్రుడనే రాజునకు అతని అనుచరుఁడు చేసే పర్వతవర్ణన ఇది. ‘ఓరాజా! నీవిటకు వస్తూనే ఈ పర్వతం నీ రూపాన్నే వహించినట్లుగా రత్నాల కడియాలు, బంగారు కిరీటం ధరించి, గంధవంతమై, ఎప్పుడూ ఆశ్రయించి ఉండే గొప్పనైన రాజుల సమూహాలతో, అనేకసేనలతో గూడియున్నది’ అని అంటాడు. పర్వతం ఇట్లుండడం సాధ్యమేనా అని అడిగేవారు – కటకమంటే కడియం, పర్వతసానువనీ, స్వర్ణమంటే బంగారు, సంపెంగ అనీ, మౌళి అంటే కిరీటము, అశోకవృక్షమనీ, రాజసింహ అంటే రాజశ్రేష్ఠుడు, సింహరాజమనీ, వాహిని అంటే సేన, నది అనీ ఈ పదాలకుండే శ్లేషార్థాలు గమనించాలి. ఈ శ్లేషార్థాలవల్ల ఆ పర్వతం రత్నాలసానువులతో, బంగారుతో, అశోకవృక్షములతో, గొప్పనైన సింహములతో, చందనవృక్షములతో, అనేకములగు కొండయేర్లతో గూడియున్నదనే పర్వతసహజమైన అర్థం స్ఫురిస్తుంది. రాజువిషయంలో స్వర్ణమౌళి అంటే బంగారు కిరీటం అని, పర్వతవిషయంలో బంగారు, అశోకవృక్షములని అర్థం చెప్పుకోవాలి. స్వర్ణమనేది సంపెంగకు గూడ పేరు గనుక ఆ పర్వతం సంపెంగచెట్లతో, అశోకవృక్షాలతో కూడియున్నదని కూడ చెప్పవచ్చు. కాని స్వర్ణమంటే బంగారు అనీ, ఆ పర్వతం స్వర్ణమయమైనదని చెప్పడం ప్రస్తుత కవిసమయ వివేచనకనుకూలంగా ఉంటుంది.

ఇక ఉన్నదానిని(సత్తును) ఉన్నట్లు చెప్పకపోవడానికి ఉదాహరణం. పద్మాలు రాత్రిపూట ముకుళింపవు గాని పగటివలె శోభాన్వితంగా ఉండవు. అట్లే కలువలు రాత్రి శోభతో ఉండి, పగలు కొంచెం శోభ గోల్పడి ఉంటాయి. అంతేకాని కలువలు పగటివేళగాని, పద్మాలు రాత్రివేళగాని పూర్తిగా ముకుళింపవు. కాని వానికాయావేళలలో ఉండే శోభాలఘుత్వాన్నే అవి పూర్తిగా ముకుళిస్తున్నట్లు వర్ణించడం ఒక కవిసమయంగా రూపొందుటయే కాక తద్విరుద్ధంగా చేయకూడదనే నియమం గూడ ఏర్పడింది. అంతేకాక కుముదినికి, చంద్రునికి, పద్మినికి, సూర్యునికి నాయికానాయకసంబంధంగూడ స్థిరీకృతమైంది. సాయంకాలం ముకుళించే పద్మాలనే చెరసాలలో తుమ్మెదలు చిక్కుకొని ఆ పద్మాలు పగలు విచ్చుకుంటూనే విడుదల ఔతాయనే విచిత్రమైన నియమాత్మకమైన కవిసమయంగూడ ఏర్పడింది. చెదలవాడ మల్లయ్యగారి విప్రనారాయణచరిత్రములోని ఈ క్రిందిపద్యం ఈ కవిసమయాలకు చక్కని ఉదాహరణం.

చం.
బుగబుగ తావులం బొదలు పుప్పొడిచే మరందధారచే
నొగిఁ దముఁ బ్రోచినంత వడియున్ గడు నర్మిలిఁ జేరి కొల్చి మా
పగుటయుఁ దుమ్మెదల్ జలరుహంబుల తొల్లిటిరూపు దప్పినన్
దగఁ దొగల న్వసించెను గృతఘ్నుల నెన్నడు నమ్మవచ్చునే?

వికసించిన పద్మాలలో ఉన్న పరాగాన్ని, మకరందాన్ని పగలంతా ఆ పద్మాలపై ఎంతో ప్రేమచూపుచు అనుభవించి, రాత్రిపూట ఆ పద్మముల రూపు మారినంతనే వానిని త్యజించి, అప్పుడే వికసించిన కలువలను తుమ్మెదలు చేరుకొన్నవి. ఇటువంటి కృతఘ్నుల నెప్పుడుగూడ నమ్మరాదుగదా! అని దీని తాత్పర్యం. ఈ వర్ణనలో యౌవనవతిగా నున్నంతసేపు ఒకానొక నాయికననుభవించి, ఆ నాయికయొక్క పరువము తగ్గినంతటనే ఆమెను త్యజించి వేఱొక యౌవనవతిని గూడఁబోవు ధూర్తవిటుని లక్షణము ధ్వనించుచున్నది.

మాళవికాగ్నిమిత్రంలో హర్షవిషాదమిళితమైన మాళవికాముఖమును కాళిదాసీ కవిసమయగర్భితముగా నిట్లు వర్ణించినాఁడు:

సూర్యోదయే భవతి యా సూర్యాస్తమయే చ పుణ్డరీకస్య వదనేన సువదనాయాస్తే సమవస్థ క్షణాదూఢే

సూర్యోదయమునందు, సూర్యాస్తమయమునందు కమలమున కేయవస్థ సంభవించునో ఆ యవస్థలు ఈ సువదన వదనముచే నేకక్షణములో వహింపబడినవి – అని సూర్యోదయమందలి పద్మోన్మీలనము, సూర్యాస్తమయమందలి పద్మనిమీలనములిందులో చతురముగా జెప్పబడినవి.

కవులయొక్క కళాకల్పనకు దోహదంచేసే ఇటువంటి 27 కవిసమయాలను శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రులవారు వారి కావ్యాలంకారసంగ్రహవ్యాఖ్యానంలో పేర్కొన్నారు. వాటన్నిటిని లక్ష్యలక్షణసమన్వితంగా వివరించాలంటే ఒక పుస్తకమే అవసరమౌతుంది. కాని ఇక్కడ అది నా లక్ష్యం కాదు. రాజశేఖరుని నిర్వచనానికి ఉదాహరణాలుగా ఒండురెండింటిని పేర్కొనడం మాత్రమే నా లక్ష్యం. ఇంక దోహదక్రియలను గుఱించి విచారింతాము.

దోహదములు కవిసమయాలేనా?

తరుగుల్మలతాదీనా మకాలే కుశలైః కృతమ్
పుష్పాద్యుత్పాదకద్రవ్యం దోహదం స్యాత్తు తత్క్రియా

అని దోహదముల నిర్వచనం. అంటే తరుగుల్మలతాదులను అకాలంలో పుష్పింపఁజేయు ద్రవ్యమునకు, అట్లు చేసెడు క్రియలకును దోహదములని పేరు. ఈ దోహదక్రియలేవో తరువాతి శ్లోకాలు తెల్పుతూ ఉన్నవి.

అశోకశ్చరణాహత్యా, వకుళో ముఖసీథునా, ఆలింగనాత్కురువకః, తిలకో వీక్షణేన చ
కరస్పర్శేన మాకందః, ముఖరాగేణ చమ్పకః, సల్లాపతః కర్ణికారః
సిన్దువారో ముఖానిలాత్ గీత్యా ప్రియాళు ర్నితరాం నమేరు ర్హసితేన చ

సాలంకృతయైన పద్మినీజాతి స్త్రీయొక్క పాదతాడనముచే అశోకవృక్షము, ఆమె నోటిలోని మద్యం ఉమియుటచేత పొగడచెట్టు, కౌఁగిలింతలచేత ఎఱ్ఱగోరింటలు, చూపులచేత తిలకవృక్షములు, కరస్పర్శచేత మామిడి, ముఖరాగముచేత చంపకము, సల్లాపమువల్ల కొండగోఁగుచెట్టు, ముఖవాయువుచేత వావిలి, పాటచేత ప్రేంకణము, నవ్వుచేత సురపొన్న అకాలంలో పుష్పిస్తాయని ఈ శ్లోకాలకర్థం. ఇట్లు పుష్పింపజేయు చర్యలకే దోహదక్రియలని పేరు.

విజ్ఞానశాస్త్రముచే సమర్థింపబడకుండుటచే అశాస్త్రీయములును, లోకానుభవదూరమగుటచే అలౌకికములును, అతిపూర్వకాలంనుండి వచ్చుచుండుటచే పరంపరాయాతములును అగుటచే ఈ దోహదక్రియలు రాజశేఖరుని కవిసమయనిర్వచనమునకు తగినట్లుగానే ఉన్నవి. ఐనను ఎందుకో తన కావ్యమీమాంసలో అతడు వీనిని కవిసమయములుగా పేర్కొనలేదు. అతని తర్వాతివారగు సాహిత్యదర్పణకర్త విశ్వనాథుడు (14వ శతాబ్ది), కేశవమిశ్రుడు (16వ శతాబ్ది) వీనిని కవిసమయములుగానే గుర్తించినారు.

కాళిదాసు మేఘసందేశములోను, కుమారసంభవములోను, మాళవికాగ్నిమిత్రములోను దోహదక్రియలు విషయముగా గల శ్లోకములున్నవి. ముఖ్యంగా మాళవికాగ్నిమిత్రంలో మాళవిక అశోకవృక్షానికి చేసే దోహదక్రియయే మాళవికాగ్నిమిత్రుల మేళనమునకు మూలకమై, ఆ నాటకేతివృత్తమునకు కీలకమైనది. ఇట్లు అతిపురాతనకాలమునుండి పరంపరాయాతముగా వచ్చిన ఈ విచిత్రసంప్రదాయము తెలుగుకవులయొక్క అతిలోక, అత్యద్భుతవర్ణనలకు సాధనమైనది.

ఆసూరి మఱింగంటి వేంకట నరసింహాచార్యులవారి తాలాంకనందినీపరిణయంలోని ఈ పద్యంలో పై దోహదక్రియలు రమ్యంగా పేర్కొనబడినవి.

సీ.
చరణాహతి నశోకతరువు నొక్కపడంతి (అశోకశ్చరణాహత్యా),
పొదిగిఁట కురవకంబును నొకర్తు (ఆలింగనాత్కురువకః)
ఊరుపుచే సింధువారమ్ము నొకలేమ (సిన్ధువారో ముఖానిలాత్)
కనుచూపులను తిలకంబు నొకతె (తిలకో వీక్షణేన చ)
చేజాచి సహకారభూజంబు నొకయింతి (కరస్పర్శేన మాకందః),
ఉమియుచు వకుళంబు నొక్క బోఁటి (వకుళో ముఖసీథునా)
గానం బొనర్చి ప్రేంకణము నొక్కవధూటి (గీత్యా ప్రియాళుః)
పకపక నగి పొన్న నొకలతాంగి (నమేరు ర్హసితేన చ)
తే.
ముఖవిదీప్తిని చంపకమ్ము నొకభామ (ముఖరాగేణ చమ్పకః)
కలికిపలుకుల గోఁగు నొక్కపికవాణి (సల్లాపతః కర్ణికారః),
అలరు లెత్తించి రాయావిహారగతుల
బయలు పడనీక దోహదక్రియలు నెఱపి

ఈపద్యం ‘అశోకశ్చరణాహత్యా’ అనే శ్లోకానికి రమ్యమైన పద్యానువాదమని చెప్పవచ్చును.

మఱికొన్ని కావ్యోదాహరణాలు

ప్రబంధాలలో నీదోహదక్రియల కుదాహరణాలు కొల్లలుగానున్నవి. వానిలో చక్కనైన వాటిని కొన్ని నిచ్చట స్పర్శించి చూతాం.

శృంగారశాకుంతలంలో పినవీరభద్రుడు ఇట్టి దోహదక్రియలవల్ల వివిధ వృక్షములను సద్యఃపుష్పవంతములుగా జేసి, ఆ తాజాతాజాపూవులనే దేవకన్యలు కోసుకొన్నారని వారిని సర్వతంత్రస్వతంత్రలనుగా అందంగా వర్ణించినాడు.

సీ.
చటుకున నడిచి రసాలంబు నొక్కతె ననిపించి యా ప్రసూనములు కోసె (కరస్పర్శేన మాకందః)
చులుకగా దన్ని యశోకంబుఁ బూయించి విద్రుమాధరి యోర్తు విరులు కోసె (అశోకశ్చరణాహత్యా),
నవ్యగీతులఁ బ్రేంకణము వికసింపించి వనిత యొక్కతె ప్రసూనములు కోసె (గీత్యా ప్రియాళుః),
సమదరాగస్థితి సంపెంగ విరియించి చంద్రాస్య యోర్తు పుష్పములు కోసె (ముఖరాగేణ చమ్పకః)
తే.
కలికిచూపులఁ బరువంబుగా నొనర్చి తిలకమునఁ బూవు లొకతెఱవ కోసె (తిలకో వీక్షణేన చ)
నిండుఁగౌఁగిటఁ గొఱవి మన్నించి యొక్క సురతలోదరి అలరుమంజరులు గోసె (ఆలింగనాత్కురువకః)

పై దోహదక్రియలలో 8 వృక్షాలకు చేసేవి గౌరవనీయంగానే ఉన్నాయి కాని, అశోకానికి, పొగడకు అట్లాంటి గౌరవం దక్కలేదు. వాటికి అవమానకరమైన పాదాభిఘాతం, ముఖసీథువులో తడవడం మాత్రమే ప్రాప్తించినాయి. కవికులశిరోమణియైన రామరాజభూషణుని ఈ విషయం ఎంతగా కలవరపరచిందో పాపం! అందుచే వసుచరిత్రంలో అతడీ పద్యాన్ని వ్రాసినాడు:

మ.
చనువొప్పన్ నగి, పల్కి, పాడి, కని, ఆశ్వాసంబు నొందించి, చే
కొని, మో మిచ్చి, కవుంగిలించి తరులం గొన్నింటి మన్నించి, అం
గన లయ్యో! మము నెంతచేసి రనుచున్ కంకేళియున్, కేసరం
బును భూజానికి మ్రొక్కె గుచ్ఛవినతిం బూదేనె కన్నీటితోన్

వసురాజు తన ఉద్యానవనంలో విహరించడానికి వస్తున్నాడు. అతడు వచ్చే సమయానికి ఇంకను పుష్పించని వృక్షాలను ఉత్తమజాతిస్త్రీలు దోహదములతో పుష్పింపజేసినారు. యథాప్రకారం అశోకవృక్షానికి, పొగడకు వారు అవమానకరమైన దోహదములే చేసినారు. రాజును చూస్తూనే తమబాధను అతనికి విన్నవించుకోవాలనిపించిందేమో ఈ రెండు చెట్లకు. ఎంతైనా ప్రభువు దీనావనుడు గదా! అందుచేత ‘ఓ రాజా! మిగితా చెట్ల నన్నింటిని ప్రేమతో గూడిన నవ్వులచేత, మాటలచేత, పాటలచేత, చూపులచేత, ఊర్పులచేత, తాకుటచేత, ముఖానికి హత్తుకొనుటచేత, ఆలింగనాదులచేత సత్కరించి, మమ్ము తన్ని, మాపైన ఉమ్మి, మమ్మెంతగా అవమానపఱచినారో చూడు రాజా’ అని ప్రభువునకు మ్రొక్కిమొరపెట్టుకుంటున్నట్లుగా ఆ రెండు వృక్షాలు పూగుత్తుల భారంతో ఆ రాజు ముందర (పాదాలంటగా) వంగి, కన్నీరు గార్చుతున్నట్టుగా మకరందాన్ని స్రవించినాయట! ఎంత అద్భుతమైన ఊహ! విశేషంగా, పూగుత్తుల భారంతో వంగిన ఆ వృక్షశాఖలు స్తనభారంతో వంగిన స్త్రీలవలె ఉన్నాయని ఈ పద్యంలో ధ్వని.

స్త్రీలు వృక్షాలకు దోహదక్రియలు చేసినారనే బదులు వృక్షాలే ఇతరవృక్షాలకిటువంటి క్రియలు చేసినవని వర్ణించడంలో ఒక క్రొత్తదనముంది. ఇట్లాంటి వర్ణన చంద్రికాపరిణయంలోని యమకాలంకారభూషితమైన ఈ క్రింది పద్యంలో కనిపిస్తుంది.

సీ.
ఫలియించెఁ దిలకముల్ భసలేక్షణమ్ముల సురసాలతా సముత్కరము గాంచ,
చివురించె నునుఁబొన్న నవసూనసంతతి సురసాలవల్లరుల్ సరస నవ్వ
ననఁ జూపెఁ బొగడచాల్ నవమధుచ్ఛట నింద్రసురసా లలితశాఖ కరము నుమియ
కుసుమించె లేఁగ్రోవి కొమరు వీవలి విభాసుర సాలవల్లికల్ సొరిది నలమ
తే.
సితవసు రసాల చారుమారుత ముఖాప్తవరులు మెచ్చంగ మధు వలర్పకయ మున్నె
అలరి సురసాలవైఖరిఁ జెలువు గాంచె, నపు డగశ్రేణి యిట్లు దోహదనిరూఢి.

వసంతకాలంలో కొన్ని వృక్షాలు ముందే పుష్పించినవి. అట్లు పుష్పించిన ఆ వృక్షాలు వానిప్రక్కనే ఉన్న ఇతర వృక్షాలను వసంతునికి ముందే తాము దోహదక్రియలతో పుష్పింపజేసినవని అయావృక్షాలకు వాడిన స్త్రీలింగాంతములైన శబ్దసంచయనంవల్ల ఈ పద్యం వర్ణిస్తుంది.

సురసాలతా అంటే సర్పాక్షి అనే తీగ. అది తనపూలపై మూగిన తుమ్మెదలనే చూపులతో తిలకవృక్షమును సుమింపఁజేసింది (తిలకో వీక్షణేన చ); చక్కగా పుష్పించిన రసాలశాఖ పువ్వులనెడు నవ్వులతో ప్రక్కనున్న పొన్నచెట్టును పుష్పింపజేసినది (నమేరు ర్హసితేన చ); ఇంద్రసురసా అంటే వావిలి. అది ముందే పూచి, ప్రక్కనున్న పొగడపై మకరందాన్ని కార్చడం (ఉమియడం) చేత ఆ పొగడ పూచింది (వకుళో ముఖసీథునా); సాలవల్లికలంటే ఏపెచెట్లయొక్క లేతకొమ్మలు. అవ్వి లేతగాలికి కదలి, అలముకొనగా అంటే కౌఁగిలింపఁగా కొండగోఁగు పుష్పించింది (ఆలింగనాత్కురువకః); ఈ విధంగా వృక్షశాఖలనే స్త్రీలే దోహదక్రియలు నెరపడంవల్ల వాని చెంతనున్న వృక్షాలు వసంతుఁడు వానిని పుష్పింపఁజేయకముందే చక్కగా పుష్పించినవి.

పారిజాతాపహరణంలో ముక్కుతిమ్మన దేవతాస్త్రీలు ఈ దోహదక్రియలన్నీ ఒక్క కల్పవృక్షానికే చేయడంవల్ల కల్పవృక్ష మేకకాలంలో ఈ పదిరకాల పుష్పాలు పూచిందని ఇట్లు వర్ణిస్తాడు:

చం.
కనఁ దిలకంబుఁ, గేసరము కల్లుమియన్, రహిఁ బాడఁ బ్రేంకనం
బు, నిముర మావి, నవ్వ సురపొన్న, ముఖాంబుజ మెత్తఁ జంపకం
బు, నెఱ గవుంగిలిం గొఱవి, మూర్కొన వావిలి, తన్న వంజులం
బు, నుడువ గోఁగునై తరుణి! పూచు సురద్రుమ మిన్ని పువ్వులన్

పాపం అప్సరసలు పైవిధంగా ముఖ్యంగా కాలెత్తి తన్నడానికి, ఉమియడానికి ఎంత శ్రమపడపడ్డారో కదా! కాని అట్టి శ్రమ అక్కఱ లేకుండా, వారాయా దోహదములను మనసులో స్మరించినంత మాత్రమున నందనవనంలోని కల్పవృక్షం ఆయావృక్షముల పుష్పములు తానే పూచిందని ఈ క్రింది పద్యంలో తిమ్మన చక్కగా వర్ణిస్తాడు:

చం.
వినుమింతుల్ దిలకంబుఁ జంపకముఁ గ్రోవిన్ సిందువారంబుఁ బ్రేం
కణమున్ మామిడి గోఁగుఁ బొన్నఁ బొగడం గంకేళి నూహించి క
న్గొన మోమెత్తఁగఁ గౌఁగిలించుకొన మూర్కోఁ బాడఁ జేనంటఁ బ
ల్క నగం గల్లుమియంగఁ ననుచుం గల్పాగ మాయా విరుల్

ఈ పద్యం ప్రథమార్ధంలో వృక్షాలు, ద్వితీయార్ధంలో ఆయావృక్షాలకు చేయవలసిన దోహదక్రియలూ నిపుణంగా పేర్కొనబడినవి. ఈ దోహదక్రియలు ఆధునికకవుల ఊహలకుగూడ దోహదకారులైనవనుటకు ఈ క్రింది దాశరథి కృష్ణమాచార్యులవారి పద్యం ఉదాహరణం:

చం.
గుమగుమలాడి నామనసు గొన్న నవాబ్జముఖీముఖానురా
గమున సుమించె జంపకము; కౌగిలిలో ప్రసవించె గోరటల్;
సుమరమణీయమై తగె నశోకము తచ్చరణాహతిన్; ప్రహా
సమున సుమించె పొన్నలు పసందగు నందనదివ్యవాటిలో!

ఇందులో ‘ముఖరాగేణ చంపకః’, ‘ఆలింగనాత్కురువకః’, ‘అశోకశ్చరణాహత్యా’, ‘నమేరు ర్హసితేన’ అనే దోహదములు స్పష్టంగా దర్శనమిస్తునాయి గదా!

దోహదముల నిర్వచనంలో దోహదక్రియలే కాక, దోహదకారులైన ద్రవ్యాలు కూడ ఉన్నట్లు చెప్పబడినవి. ధూమాదులచేత కొన్ని వృక్షము లకాలపుష్పఫలవంతము లగునను ఆచార మిట్టిదాని కుదాహరణము. ఈ విధంగా దాడిమవృక్షమునకు చేసిన ధూపదోహదమును వసుచరిత్రలో రామరాజభూషణుఁడు రమ్యంగా వర్ణించినాఁడు:

చం.
చలితలతాంతకాంతి యనుచందరుకావిచెఱంగు దాఁటి స
మ్మిళితవయోవిలాసముల మీటిన విచ్చు ఫలస్తనాగ్రముల్
వెలువడఁ గప్పెఁ దత్క్షణమ వేల్లితదోహదధూపధూమ కుం
తలములు విప్పి దాడిమలతాలలితాంగి నృపాలు చెంగటన్

వసురాజు తన ఉద్యానవనాన్ని చూడగా వచ్చిన సమయానికి దాడిమవృక్షానికి ధూపంతో దోహదం చేస్తున్నారు. తత్ఫలితంగా ఆ దాడిమలత అనే లతాంగి ఎఱ్ఱనైన పూవులను, బంగారురంగుతో భాసిల్లే వట్రువలైన ఫలములను దాల్చింది. ఆ ఎఱ్ఱనిపూల సుషమ కావిరంగు పైటవలె ఆవృక్షలతాంగిని గ్రమ్ముకొన్నది. భారవంతము లగుటచేత గుండ్రనివైన దాడిమఫలములు వయోవిలాసముచే బయల్పడిన స్తనములవలె నుండఁగా, అట్లు వస్త్రహీనత నొందిన స్తనములను (మానరక్షణకై) ధూపమనే నల్లని కేశములతో దాడిమలతాలతాంగి కప్పుకొన్నదా అన్నట్లుగా ఆ దాడిమవృక్ష మున్నదని రామరాజభూషణుఁడు అత్యద్భుతంగా ఉత్ప్రేక్షించినాడు. ఈ పద్యంలో వయోవిలాసములు అనే పదానికి వయస్సుయొక్క విలాసమని స్త్రీపరంగాను, పక్షులయొక్క చంచువిలాసమని ఫలపరంగాను శ్లేషార్థాలు చెప్పుకొనవలె. ఈ దోహదద్రవ్యంయొక్క యాథార్థ్య మెట్లున్నను, ఇటువంటి వస్తువున్నదనే భావన ఈ మహాకవి ఊహనెంత సుందరంగా తీర్చిదిద్దిందో!

ఈ విధంగా అశాస్త్రీయములు, అలౌకికములైనను ఈ దోహదములు కవుల మనోజ్ఞతరమైన ఊహాశక్తికి దోహదకారులైనవనుటలో సందేహంలేదు. ఆ వర్ణనలను మననం చేసినకొద్దీ రసజ్ఞుల హృదయాలు గూడ ఆనందకందళితమౌతాయనుటలో సందేహమక్కఱలేదని నిష్కర్షగా చెప్పవచ్చు. ఈ విచిత్రమైన సంప్రదాయానికి కారకములేమిటో మనం కొన్ని ఊహలుమాత్రమే చేయవచ్చు. కొంచెం లోతుగా ఆలోచించగా ఆయావృక్షాలకు చేసే దోహదక్రియలు అవి చేసే అందెకత్తెల వివిధాంగసౌందర్యవ్యంజకములో, లేక వారి యంగముల సాదృశ్యమును వహించునట్టి వృక్షాంగకముల వ్యంజకములుగానో, వృక్షతత్త్వవ్యంజకములుగానో ఉన్నట్లుగా తోచును.

ఉదాహరణకు కాళిదాసు మాళవికాగ్నిమిత్రములోని మూడవ అంకమునకంతయు మూలమైన అశోకవృక్షదోహదములో ‘అరుణశతపత్రమివ’ ఎఱ్ఱనై, ‘ఆర్ద్రాలక్తక’ లిప్తమై యున్న మాళవికాచరణముల ఎఱ్ఱదనానికి అశోకపుష్పముల ఎఱ్ఱదనానికి సామ్యం స్పష్టంగా మనకు స్ఫురిస్తుంది. స్థూలంగా అందకత్తెలయొక్క కోకనదసన్నిభమైన పదకాంతికి రక్తాశోకపుష్పకాంతికి గల సామ్యమే ‘అశోకశ్చరణా హత్యా’ అనే దోహదక్రియకు మూలంగా మనమూహించవచ్చు.

స్వభావతః పొగడపూవులలో మదిరాగంధమునుబోలిన పరిమళముండును. ఆ పరిమళముతో సామ్యమువహించు సుర నుమియుటచేత పొగడలు సుమించునను దోహదమున కీ సామ్యమే కారణము కావచ్చును. ఋతుసంహారంలో కాళిదాసు ‘కాంతాముఖద్యుతిజుషామపి చోద్గతానాం, శోభాం పరాం కురువకద్రుమమంజరీణాం’ అని కురువకములను (ఎఱ్ఱగోరింటలను) వర్ణిస్తాడు. ఎఱ్ఱగోరింటలు కాంతలముఖకాంతిని కొల్లగొనియున్నవా అన్నట్లు పరిశోభిస్తున్నవని దీని కర్థం. అనురాగవంతులైన నాయికల ముఖకాంతి ఎఱ్ఱగా ఉంటుందని కవులు వర్ణిస్తారు. ఇది కృత్రిమవర్ణన మేమీకాదు. స్వభావతః భావోల్బణం కల్గినపుడు రక్తప్రసార మధికమై ముఖం ఎఱ్ఱబడడం సాధ్యమే! అందుచేత ‘ఆలింగనాత్కురువకః’ అనే దోహదక్రియ ఈ ముఖరాగసాదృశ్యానికే వ్యంజకమేమో!

తిలకవృక్షము (బొట్టుగుచెట్టు) నువ్వుపువ్వులవంటి తెల్లని పూలతోగూడి, తుమ్మెదల కత్యంతాకర్షణీయముగా నుండును. కాళిదాసు మాళవికాగ్నిమిత్రములో ‘ఆక్రాన్తా తిలకక్రియాపి తిలకై ర్లగ్నద్విరేఫాంజనైః, సావజ్ఞేన ముఖప్రసాధనవిధౌ శ్రీ ర్మాధవీ యోషితాం’ అని వర్ణిస్తాడు. ‘క్రమ్ముకొన్న (నల్లని) తుమ్మెదలనెడి కాటుకతో గూడిన తిలకపుష్పములచేత వనలక్ష్మి (ఉత్తమజాతి) స్త్రీయొక్క తిలకాలంకరణ విధిని దిరస్కరించుచున్నట్లున్నది’ – అని దీని కర్థం. కవులు చూపులను తుమ్మెదలబారులవలె వర్ణిస్తారు. ‘పూనెం బ్రేక్షణమాలికామధుకరీ పుంజంబు లిర్వంకలన్’ అనే రామరాజభూషణకవి ‘నానాసూనవితానవాసనల’ అనే పద్యాన్నెఱుగని రసికులుండరు. అందుచేత ‘తిలకో వీక్షణేన’ అనే దోహదక్రియ ఈ చూపులకే వ్యంజకమేనేమో!

బంగారురంగుతో గూడిన శరీరములు గల్గిన స్త్రీలందకత్తెలని కవులు వర్ణిస్తారు. ఇట్టి వర్ణనలు సాహిత్యంలో కొల్లలుగా నున్నవి. ‘కాబోలు నీహేమగాత్రి క్రొత్తగ సానదీరిన వలఱేని చారుహేతి’ – అను సురభి మాధవరాయల చంద్రికాపరిణయంలోని ఈ వర్ణన మిట్టివానికొక్క ఉదాహరణం మాత్రమే! ‘బంగారురంగు శరీరముతో నొప్పు నీయందకత్తె క్రొత్తగా సానబెట్టడంవల్ల తళతళ మెఱిసే మన్మథుని కత్తియే కావచ్చును’ అని దీనికర్థం. హేమశబ్దానికి బంగారు, సంపెంగ అనే రెండర్థాలూ ఉన్నవి. సంపెంగ కూడ బంగారువలె పచ్చని వర్ణంతో ప్రకాశిస్తూ ఉండడం వల్ల హేమశబ్దాని కీఅర్థద్వయం కల్గింది. అందుచేత ఆ స్త్రీ సంపెంగకూ బంగారానికీ రెంటికీ తుల్యమైన శరీరవర్ణం గలదని చెప్పుకొనవచ్చు. ఈ శరీరకాంతిసాదృశ్యమే ‘ముఖరాగేణ చంపకః’ అనే దోహదక్రియకు దోహకమైందేమో!

ఈ విధంగా మిగిలిన దోహదక్రియలను గూడ కొంతవఱకు విశ్లేషించవచ్చు. ఈ క్రియల మూలమేదియైనను, వాని నాధారముగా గొని మహాకవులు చేసిన వర్ణనలు అత్యంతప్రీతికరములుగను, రసనిష్యందులుగను ఉన్నవనుటలో సందేహము లేదు. ఏమైనను జడములైన వృక్షములు కొన్ని ఉపచారములవల్ల చైతన్యవంతములగుననే రహస్యమును మన పూర్వీకు లెఱింగియుండిరనుటకు నివి నిదర్శనములు. సంగీతమునకు కొన్ని వృక్షములు, సస్యములు స్పందించి అధికఫలవంతములగునని వృక్షశాస్త్రజ్ఞులు కనుగొన్న విషయము స్పష్టమే కదా! ‘గీత్యా ప్రియాళుః’ అనే దోహదక్రియ ఇట్టిదేనేమో! ఈ విధంగా వృక్షతత్త్వముల నెఱింగిన మన పూర్వీకుల నమ్మకములే కవుల చేతిలో అలంకారదృష్టిబద్ధములై, స్త్రీసౌందర్యముపట్ల వారికి గల నిరంతరాభిలాషను సంతరించుకొని ఈ దోహదక్రియలుగా రూపొందినవేమో!