సేవికయే నాయిక

లా సెర్వ పద్రోనా

లా సెర్వ పద్రోనా (La Serva Padrona) అనునది జెన్నర్ ఆంతోనియో ఫ్రెదెరికో (Gennar Antonio Frederico) అను రచయిత ఇటాలియను భాషలో వ్రాసిన గేయరూపకమునకు ఇటాలియను సంగీతకర్త యగు జ్యోవానీ బత్తిస్తా పెర్గొలేసీ (Giovanni Battista Pergolesi (1710-1736)) అను నతడు సంగీతరచన చేసిన 50 నిమిషముల నిడివి గల లఘుసంగీతరూపకము (Operetta). క్రీ.శ.1733లో నేపుల్స్‌ నగరంలో ప్రదర్శింపబడిన ఇల్ ప్రిజియొన్తెరొ సుపెర్బో (Il Prigiontero Superbo, గర్వితబంధితుడు) అను దీర్ఘమైన ఆపెరాలోని విరామకాలములో ప్రదర్శించుటకై పెర్గొలేసీ ఈ లఘుసంగీతరూపమును రూపొందించియుండెను. కాని అనంతరకాలములో ఆ దీర్ఘరూపకము విస్మృతమై ఈ లఘురూపకము మాత్రము స్వతంత్రముగా ప్రదర్శింపబడుచు ప్రసిద్ధమైనది. దీనికథ (ఇంగ్లీష్ అనువాదము) సంగ్రహముగా నిట్లున్నది.

స్పెయిన్ దేశంలో ఉబెర్తో అను అవివాహితుడైన మధ్యవయస్కుడైన ధనవంతుడున్నాడు. అతనికి సెర్పీనా అను యువతి ఇష్టమైన సేవికగా నున్నది. వెస్పోనె అనునతడు సేవకుడుగా నున్నాడు. ఒకనాడు సెర్పీనా అతనికి చాకొలెటు పానీయమును సకాలమునకు ఈయకుండుటయే కాక చాల దురుసుగా ప్రవర్తించినది. అందుచేత ఉబెర్తోకు ఆమెపై అత్యంతాగ్రహము కల్గినది. ఎంతో విసుగు జనించినది. ఈమె దురుసుతనమునుండి తప్పించుకొనుటకు తనకు వివాహము కొఱకై ఒక వధువును వెదకి తెమ్మని అతడు వెస్పోను నాదేశించినాడు. కాని తననే పెండ్లాడుమని సెర్పీనా అతనిని కోరినది. అతడు నిరాకరించినాడు. ఇంతటితో ప్రథమాంకము ముగిసినది.

సెర్పీనా వెస్పోనెకు ఆశ కల్పించి అతనితో గూడి తననే ఉబెర్తో పెండ్లాడునట్లు ఒక పథకము పన్నినది. వెస్పోనెకు భయప్రదుడైన సైనికుని వేషము వేసి, అతనిని తాను పెండ్లాడుచున్నట్లు ఉబెర్తోకు చెప్పి, సమక్షములో భయప్రదుడైన ఆ సైనికుని ప్రవేశపెట్టినది. వెస్పోనె ఎక్కువ మాట్లాడకుండ తాను సెర్పీనాను పెండ్లాడుటకు అధికమైన వరకట్నమును చెల్లించవలెనని ఉబెర్తోను నిర్బంధము చేసినాడు. ఉబెర్తో దానిని తిరస్కరించినాడు. అట్టి తిరస్కారము ప్రాణములకే ముప్పు తెచ్చునని వెస్పోనె ఉబెర్తోను ఇంకను భయభ్రాంతుని చేసినాడు. ఆ ముప్పునుండి తప్పించుకొనుటకు తాను కోరిన వరకట్నము నీయని పక్షమున ఉబెర్తోయే సెర్పీనాను పెండ్లాడవలెనని నిర్బంధము చేసినాడు. ఉబెర్తో సెర్పీనాను పెండ్లాడుటకు అంగీకరించినాడు. ఉబెర్తో సెర్పీనాల పెండ్లితో కథ ముగిసినది. వస్తుతః ఈపెండ్లి ఉబెర్తోకు అనిష్టమైనది కాదు. ఆమె అప్పుడప్పుడు దురుసుగా ప్రవర్తించినను, అతని కామెపై లోలోపల ప్రేమయే యున్నది. పెండ్లితోబాటు రెండవ అంకము గూడ ముగిసినది.

ప్రస్తుతప్రయత్నము

ఈ ఇతివృత్తము భారతసంస్కృతికి సరిపడునట్లు మార్చుట కనువుగా నున్నను, నాకు రెండవ అంకములోని ఇతివృత్తము బొత్తిగా నచ్చలేదు. మూలములోని మూడుపాత్రలే కాక మఱొక పాత్రను కల్పించిన మొత్తము నాటకమును మఱింత పరిపుష్టముగా చేయవచ్చు ననిపించినది. నా అనుసృజనలో ఉబెర్తో స్థవిరుడైనాడు. వెస్పోనె భద్రుడైనాడు. సెర్పీనా భామిని యైనది. ఈ ముగ్గురికిని, అందులో ముఖ్యముగా స్థవిరునికి, మిత్రునిగా సిద్ధార్థుడను నాల్గవవ్యక్తి ప్రవేశపెట్టబడినాడు. ప్రథమాంకములోని మొదటి దృశ్యములో స్థవిరుడు వివాహమునకు విముఖుడైనట్లును, సిద్ధార్థుడతని సుముఖునిగా జేయ యత్నించుచున్నట్లు కల్పించినాను. రెండవదృశ్యములో సిద్ధార్థుడు భామిని స్థవిరునియం దిష్టురాలైనదని గ్రహించినాడు. స్థవిరుని కోపోద్రిక్తుని జేసి, విసిగించి, అతనిని వివాహమునకు సుముఖునిగా జేయునట్లుగా ఆమెతో పథకమును బన్నినాడు. ఈ రెండు దృశ్యములును అమూలకములైన కల్పనలు. తర్వాత మూలమునందలి ప్రథమాంకములో నున్నట్లుగనే ఆమె అతనికి ప్రాతరుపాహారము నందీయక దురుసుగా ప్రవర్తించి, అతనియందు వివాహకాంక్ష కలిగించినది. అప్పుడతడు తనకై వధువును వెదకవలసినదిగా సిద్ధార్థు నాదేశించినాడు.

రెండవ అంకము పూర్తిగా అమూలకమైన కల్పన. ముందుగా వేసికొన్న పథకము ప్రకారము సిద్ధార్థుడు భామినికి మాఱువేషము వేసి, ఆమెకు భావిని యని పేరిడి, ఆమె నొక తోటలో నుంచినాడు. తానుత్తమమైన వధువు నొకదానిని వెదకినానని, ఆమెను తోటలో చూడవచ్చునని స్థవిరుని భావిని యున్న తోటకు తీసికొని వచ్చి, వారికి పరస్పరపరిచయము చేసి, తానచ్చటినుండి ఉపాయముగా తప్పుకొన్నాడు. భావిని తన ఒయ్యారముచే స్థవిరుని మనసును కరగించినది. అతని తనయందనురక్తుని చేసికొన్నది. వారిర్వురు తోటలో విహరించుచుండగా పొదలోనుండి ఒక పాము బయటికి ప్రాకినది. దానినుండి భావినిని రక్షించి, ఆమెతోగూడ స్థవిరుడు తోటలోని శిలాపీఠముపై కూర్చొన్నాడు. అప్పుడామె పాముబాధ కలుగదను మూఢనమ్మకముతో చిన్నప్పుడే తన అఱకాలిలో పామురూపమున ఒక పచ్చ పొడిచినారని ఆ పచ్చను (కావలెననియే) స్థవిరునికి చూపించినది. ఆ పచ్చను భామిని అఱకాలియందాత డిదివఱకే చూచియుండుటచేత, మాఱువేషములో నున్నను ఆమె రూపురేఖలను, కంఠధ్వనిని, పాదమునందలి పచ్చను సమన్వయించుకొని ఆమె భామినియే యని గుర్తించి అతడు కోపగ్రస్తు డగుచుండును. అదే సమయమునకు సిద్ధార్థభద్రు లచటికి వత్తురు. సిద్ధార్థుడు స్థవిరుని చల్లబఱచును. భామినిగా గూఢముగను, భావినిగా ప్రకటముగను భామినియం దాసక్తుడై యుండుటచే స్థవిరుడామె నిప్పుడు పెండ్లాడుట కంగీకరించుటతో కథ శుభాంతమగును.

ఇందులోగల పాత్రల పేర్లన్నియు పాత్రల స్వభావమును వ్యంజించునవిగా గమనింపవచ్చును. బహుకాలం తిష్ఠతీతి స్థవిరః, ష్ఠా గతినివృత్తౌ అనగా చాలాకాలమునుండి ఉన్న (వయసైన)వాడు, స్థిరముగా (పెండ్లి వలదను విషయమున) నున్నవాడు అని ఈ వ్యుత్పత్తుల నన్వయించుకొనవలెను. ప్రథమాంకములో కోపముతో దురుసుగా వర్తించినది గనుక నాయికకు భామిని అను పేరు సార్థకమైనది. కోపనా సైవ భామినీ అని అమరకోశము. భామ్యతి, కుప్యతీతి భామినీ, భామ క్రోధే–కోపస్వభావము గలది అని వ్యుత్పత్తి. అట్లే మాఱువేషములో నున్న ఆమెకు భావినీ–భావశ్శృంగారచేష్టా సోఽస్యాస్తీతి భావినీ–శృంగారచేష్టలు గలది అను పేరు తన శృంగారచేష్టలచేత నాయకుని మనస్సు హరించుటచే సరిపోయినది. స్థవిరుని వివాహమునకు సుముఖుని చేయుటలో సిద్ధార్థుడైన సిద్ధార్థుని కాపేరు సరిపోయినది. భామిని పెట్టు భాధకోర్చి భద్రకార్యమునకు సహకరించుటచేత భద్రుని కానామము అర్థవంతమైనది.

లోగట ఈమాటలో ప్రచురింపబడిన నారెండు ఆపెరాలవలెనే, ఇందులో గూడ సర్వసామాన్యముగా వచనమునకు చేరువగాగల సులువైన పదములుగల కంద, గీత, ఆటవెలదులను, ఖండ, త్ర్యస్ర, మిశ్ర, చతురస్రగతులలో గల గేయములను వ్రాసినాను. గేయములలోను యతిప్రాసలను పాటించినాను. చాలా అరుదుగా, ‘యతిర్వాప్రాసో వా’ అను నియమముతో సరిపెట్టుకొన్నాను. సందర్భానుసారముగా ఆఱుచోట్ల వృత్తములను వ్రాసినాను. కొన్నిచోట్ల విసంధి చేసినాను.


పాత్రలు

స్థవిరుఁడు: 40 సంవత్సరములు దాటిన అవివాహితుఁడైన ధనవంతుఁడు
భామిని: 24 సంవత్సరముల అందకత్తె యైన స్థవిరుని సేవిక
భద్రుఁడు: స్థవిరుని సేవకుఁడు
సిద్ధార్థుడు: పై ముగ్గురికిని స్నేహితుఁడు


ప్రథమాంకము

మొదటి దృశ్యము: స్థవిరసిద్ధార్థులు

సిద్ధార్థుఁడు:
నలువది యేండ్లును దాఁటెను,
చెలువంబును తగ్గుచుండె, చెలి లేదయ్యెన్,
చెలి లేని జీవితం బిఁక
సులభముగాదు గడపంగ, శోకమయంబౌ!

కావున మిత్రమ! రూపము,
ఠీవియు, గుణముం గల సుదతీమణితోడన్
వైవాహికబంధంబున
నీవేకంబగుటయె వరణీయము నీకున్.

స్థవిరుఁడు:

(పాట)

వీడుము సఖ! నీవిట్టి విచారము
కూడును సౌఖ్యము చేడెను పెండిలి
యాడిన నను వేదాంతముతోడను
చూడకు నామనసును మార్చఁగ

చిఱునవ్వులతో, సరసోక్తులతో,
వరరూపముతో, వయ్యారముతో,
పరిణయమను పెనుపంజరమందున
పురుషుల బంధింతురు తరుణులు

ఆవలవంతలు, ఆమురిపెంబులు
ఆవలపులు మాయంబగు త్వరలో
ఆవల భర్తల నతివలు చూతురు
తావులు వాసిన పూవుల రీతిగ

వంటలువార్పులు భామిని సేయఁగ
బంటై భద్రుఁడు పరిచారింపఁగ
ఇంటినెలంతుక యిట లేకున్నను
ఉంటిని గద! నేనొంటిగ సుఖముగ

కలదిందున సౌఖ్యము, స్వాతంత్ర్యము
నళినాక్షుల పరిణయబంధంబులఁ
గలఁగుటకంటెను కామ్యంబగుచుం
జెలఁగును నాకీ జీవనశైలియె.

సిద్ధార్థుఁడు:
చాలిఁక నీ వైరాగ్యము
మూలికలం దినుచు నడవిమూలలలోనం
గాలముఁ బుచ్చెడు మౌనుల
వోలె వచింతువు కుతర్కపూరితమతివై

నీవొకఁడవె? లేరా వర
వైవాహికబంధమందు భద్రము గనుచుం
బూవుందోఁటలవలెఁ దమ
జీవితములఁ జేసికొన్న స్త్రీయుతు లిలలోన్?

స్థవిరుఁడు:
వారుండినయటు లుండని,
బేరములాడంగఁబోను విధితో నెపుడున్
కారణము విధియె యందును
నారీపరిణయవిముఖత నాకొదవుటకున్
సిద్ధార్థుఁడు:
అంతకును విధి నిర్ణేత యనఁగరాదు
నీదుబుద్ధియె నిర్ణేత నీదు స్థితికి
కాని కల్యాణయోగంబు గలదు నీకు
ననుచు ఘోషించుచుండె నా యంతరాత్మ
స్థవిరుఁడు:
కలలు గనుచుంటివో లేక నిలిచియుండి
కునుకుచుంటివొ సిద్ధార్థ! కూడు నెట్లు
నాకుఁ గల్యాణయోగంబు, లేకయుండ
కొంచెమైనను మదిలోనఁ గోర్కె యందు?
సిద్ధార్థుఁడు:
అంతకును విధి కారణంబందు వీవు
అదియె నీడెందమును మార్చు నందు నేను
స్థవిరుఁడు:
అది యసాధ్యమె యందు సిద్ధార్థ నేను!
సిద్ధార్థుఁడు:
అంతయును సాధ్యమని విశ్వసింతు నేను
వేచి చూడుము; నాకిప్డు దోఁచుచుండె
ఏర్పడఁగనుండె క్రొంగ్రొత్తమార్పు లేవొ
నీదు జీవితమందంచు నికటమందె (నిష్క్రమింతురు)

రెండవ దృశ్యము

(భామిని స్థవిరునియందు తన వలపును దెలుపు పాట పాడుచుండును. ఆపాటను చాటునుండి విని అది ముగియుచుండగా సిద్ధార్థుఁడామె గమనించకుండా వెనుకనుండి ప్రవేశించును)

భామిని:

(పాట)

రేగెను కోర్కెలు తీగలుసాగుచు
దాగెను మదిలో దర్పకుఁ డేచుచు

ఉదధిం గలఁచెడు నూర్మికలంబలె
మదినిం గలఁచెను మధురోహంబులు
పొదలో విరిసిన పూవులఁ బోలుచు
ఎదలో విరిసెను నేవో యాశలు ॥రేగెను…॥

భ్రమరమువలె నాభావమునందున
భ్రమియించు నజస్రము స్థవిరుండే
క్రమముగ కలికయె సుమమగు రీతిగ
సుమియించెను ప్రేమము స్థవిరునిపై ॥రేగెను…॥

నగరాజము పైకెగబ్రాకుటకై
వగఁబూనిన నిమ్నగవలె నేనును
వగఁగొనుచుంటిని వలపించుటకై
నగముంబలె స్థిరుఁడగు స్థవిరుని ॥రేగెను…॥

వైవాహికమే వలదను నాతఁడు
సేవికనగు నను జేరఁగఁదీయునొ
పూవులయమ్ములదేవర యేవిధి
దీవించునొ నన్నేవిధి మంచునొ? ॥రేగెను…॥

సిద్ధార్థుఁడు:
పాడుచునుంటివి భామిని! యేదో?
భామిని:
మాటాడుచునుంటిని నామదితోనే!
సిద్ధార్థుఁడు:
నేనూ వింటిని నీపాట నొకింతగ. స్థవిరునియెడ ప్రేమము గలిగెన నీకు?
భామిని:

(సిగ్గును నటిస్తూ)

అది నాలో నేననుకొను మాటయె. ఇతరుల కది విదితము గాకూడదు.

సిద్ధార్థుఁడు:
చాలు బిడియంబు జవరాల! సంతతంబు
నీదుమేలునె కాంక్షించు నేస్తకాఁడ!
స్థవిరునిన్నిన్నుఁ గూర్పంగ సాధ్య మనియె
తలఁతుఁ దెల్పుము నీదు చిత్తంబు నాకు.

ఐన వరియింప నేకాంత ననుచు నతఁడు
బెట్టు సేయుచునుండెను నట్టి వాని
మనము మార్పంగవలయును మనము మొదట
పైని నన్నియు సమకూడు బాగుగాను

భామిని:
అదెట్లు జరుగును?
సిద్ధార్థుఁడు:
బెట్టు చేసినఁగాని నీవిషయమందు
కొంత మెత్తగ నున్నట్లు గోచరించు
నతఁడు గావున నేఁజెప్పినట్లు సేయ
నంతయును సాధ్యమౌనను నాశ గలదు
భామిని:
నీవు చెప్పెడి చొప్పేదొ నిశ్చయముగ
దెలుపు సిద్ధార్థ! ఆలింపఁదలఁతు నేను.
సిద్ధార్థుఁడు:
అది రహస్యంబు, తెలియరాదన్యజనుల
కిదిగొ చెవి యిమ్ము, వినిచెద పదిలముగను.

(చెవిలో రహస్యముగా ఏదో చెప్పును.)

భామిని:
అది సాధ్య మనిపించు, యత్నింపఁగలను.
ఐన భద్రుని విషయంబు? అతడోర్చికొనున?
సిద్ధార్థుఁడు:
వాని నొప్పింతు నీకట్టి వంత వలదు.
భామిని:
సాగును గావుత మన నాటకము!
సఫలంబగుత మనోరథము!

(నిష్క్రమింతురు.)

మూఁడవ దృశ్యము

(స్థవిరభద్రులు, తర్వాత భామినీసిద్ధార్థులు)

స్థవిరుఁడు:

(పాట)

భామినీ! భామినీ!

(అని పిలుచును. కాని ఆమె పలుకకుండును.)

కలచును నన్నీ క్రమరాహిత్యము
పిలిచిన నెంతయు పలుకదు సేవిక
భామిని యనియెడి నామము గల్గిన
ఆమెకు కోపమె ఆకృతి నిండుగ

(టంగ్ టంగ్ అని గంటను మ్రోగించును. కాని ఆమె స్పందింపకుండును.)

టంగ్‌టంగను ఘంటాధ్వనిచే
దిక్కులు ప్రతినినదించెను గానీ
అవిధేయతకే ఆకృతియై తగు
ఆ సేవిక చెవి కాధ్వని సోఁకదు

కార్యార్థము జను కాలము మీరెను
ఐనను బోవక ఆమె యొసంగెడి
ప్రాతరుపాహారంబునకై యిట
యాచకునింబలె వేచుచునుంటిని

సేవిక విధమున సేవింపక నను
నాయిక విధమున నాడించును
భామిని ధార్ష్ట్యత బహువిధముల
అగలించును నన్నత్యంతము

శైశవమాదిగ చక్కని కృపతో
పెంచితి నామెను పేరిమి మీరఁగ
కానీ ఆయమ కఠినాచరణము
పెరిగిన కొలఁదిని పెరుగుచు నున్నది
“భామినీ! భామినీ!”

(అని పెద్దగాఁ బిలుచును. ఆమె ఇంకను పలుకకుండును. పాట నాపి కోపముతో భద్రునితో నిట్లనును.)

ఓరి సేవక! గొఱ్ఱెలాగుంటి వేమి?
రాతిబొమ్మరీతిగ నిల్చి చూతువేమి?
పొమ్ము! సత్వరమ్ముగ గొనిరమ్ము నన్ను
విస్మరించుచు నున్న యావెఱ్ఱి నిటకు.

(భద్రుఁడు భామినిని కొనివచ్చుటకై పోవును. స్థవిరుఁడు మఱల క్రింది రెండు చరణములను పాడును.)

తోరపుకూరిమితోఁ బెంచుటయే
ఈయవిధేయత కెల్లను హేతువు
తానే నాయిక యైనటు లిప్పుడు
నను బొమ్మవిధంబున నాడించును

అరికట్టన్వలె నామె యహంకృతి
కనఁజేయవలెం దన స్థానంబును
స్పష్టము గావలె స్వామి యెవారో
సేవిక యెవరో ఆవగలాఁడికి

(స్థవిరుని గమనించకుండా, భామిని భద్రునితో పరుషముగాఁ బలుకుచు ప్రవేశించును.)

భామిని:
చాలించుము దుర్భాషలు;
నే లొంగ నెవారికైన, నేదెటులైనన్
వీలైనప్పుడె వత్తును,
ఆలస్యముఁ జేతుననుచు నఱవకు నన్నున్.

స్థవిరుఁడు:

(తనలో)

ఆహా! ఎంత కోమల మీమె ధోరణి!

భద్రుఁడు:
కాని వెంటనే రమ్మని యజమాని సందేశము!
భామిని:
చాలాయన సందేశాలూ, నీ వల్లింతలూ!
గొప్పతనంబును జూపకు;
చెప్పకు పాఠములు నాకుఁ; జెప్పినచొప్పుం
దప్పి చరించిన నీకుం
దప్పవు దెబ్బలు; మెలఁగుము దాసుని పగిదిన్

(కొట్టునట్లు నటించి భద్రుని బెదరించును)

స్థవిరుఁడు:
తాళు మొకయింత భామిని! తగదు నీకు
నిరపరాధియౌ భద్రుని నింద సేయ;
భామిని:
కాని భామిని యెదుట సగౌరవముగ
మెలఁగు రీతిని వీనికిఁ దెలుపవలెను
స్థవిరుఁడు:
వదలుమది వాని స్వామికి వారిజాక్షి!
భామిని:
ఆర్య! వినుమిది, సేవిక యనుచు నన్ను
లోకువగఁ జూడఁ జెల్లదు; లోకమందు
నాయికల లీల నన్ను నాప్యాయముగను
నిండు మాన్యతతోడ మన్నింపవలెను.

లేదు వైషమ్య మింతేని నాదు మదిని
యుక్తమని తోఁచు కార్యంబు యుక్తితోడ
క్షణములోఁ జేతు, నిట్టి నిగర్వియైన
వనిత సేవిక యగుట మీభాగ్యఫలము!

స్థవిరుఁడు:
అది సరియే, రాణిగారి కిప్పుడు లోపించిన దేమి?
భామిని:
అరసి చూడుడు, నాహృదయంబునందు
ప్రేమకరుణాస్రవంతులే వెల్లిగొనుచు
ఎడతెగక పాఱుచున్నవి; యిట్టి నన్ను
దుర్విదగ్ధుఁడై యీతండు దూఱుచుండె.
స్థవిరుఁడు:
అయ్యయో! అమ్మగారి నంత యవమానపఱచెనా?
భామిని:
కాకేమి?
మెత్తమెత్తగఁ బల్కక మేరమీరి
స్వామివలె నన్ను శాసించి పల్కుచుండె
ఇట్టి యవమతి నోర్వ నేఁ బుట్టలేదు
తెలుపవలె వీనికిం దగు పలుకుతీరు!

(మఱల భద్రుని కొట్టునట్లు నటించును)

స్థవిరుఁడు:
తాళు తాళుము కాళికాకృతి!

(అనుచామెను వారించి, భద్రునితో ననును)

నీవేమంటివి?

భద్రుఁడు:
మీరామెను రమ్మనుచుండిరంటిని.
భామిని:
కాని రాజువలె శాసించు మనలేదు.
స్థవిరుఁడు:

(భద్రునితో)

నీవట్లంటివా?

భద్రుఁడు:
నేను వినయముతో మృదువుగాఁ బల్కితిని.

స్వామి! మీయాన పాటించి సాదరముగ
త్వరగ రమ్మని పల్కి తీ తరుణి కంతె
దాని కింతటి ఱంతేల? దాని తప్పు
చేసి ఊరక నన్ను దూషించు టేల?
రట్టు చేసిన నిట్టు కారణము లేక
ఎట్టు సేతును మీకార్య మింక నేను?

స్థవిరుఁడు:

(భామినితో)

నేనే నిన్ను త్వరగాఁ బిల్వఁ బంపితిని ?

భామిని:
అంత త్వర యేల? కొంపలు మునిగెనా?
స్థవిరుఁడు:

(ధిక్కృతితో)

అంత త్వరా…? కొంపలు మునిగెనా…?
దేవిగారిని గోరితిఁ దెమ్మటంచు
వేగముగ నుపాహారంబు వేకువందె
కాని దానికి మోక్షంబు గానరాదు
కలియుగాంతముదాఁక నా కర్మ మేమొ!

(కోపముతో)

తెమ్ముపాహార మీ నిముసమ్మునందె
తాళఁజాల నీసోమరితనము నింక

భామిని:

(చులకన జేయుచు)

కడచిపోయెను దానికిం గాల మెపుడొ
మరచిన న్మంచి దాచింత మనమునందు
కనుడు – మధ్యాహ్నభోజన కాలమయ్యె
కాని యదియును సిద్ధము గాక యుండె.

స్థవిరుఁడు:

(కోపముతో పాడును)

అంతకంతకు హద్దు మీరెను
ఈమె దౌష్ట్యము లీమె చేష్టలు

నేను తెలుపనఁ దాను నలుపను
నేను ముందనఁ దాను వెనుకను
నేను మీఁదనఁ దాను క్రిందను
తాను పల్కినదే నిజంబను ॥అంతకంతకు…॥

ఈమెతోడుత నిల్లు నడపుట
పాముతోడుత పవ్వళించుటె
ఎట్టులైనను ఈపరిస్థితి
దిట్టతనమున దిద్దుకొనవలె ॥అంతకంతకు…॥

(భామినితో)

సాగవింక నీదు సయ్యాట లీయింట
సాగునింక నాదు శాసనంబె
ఇష్టముండదేని నీయింట నట్లుండ
లోకమెల్లఁ గలదు నీకు నుండ

భామిని:

(నిరసించుచూ పల్కును)

నిరతంబు మీసేవ నేఁజేసి నందులకు
సరియైన సత్కృతియె సమకూడుచుండె!
పదియేండ్ల నుండియుం బడినట్టి శ్రమకెల్ల
నిదియె ఫలితంబయ్యె, నిదియె లాభంబయ్యె

స్థవిరుఁడు:
అయ్యయో! ఎంత అన్యాయంబయ్యె ఈసాధ్వి కిపుడు!

(ఎత్తిపొడుచుచూ పలికి, భద్రునితో ననును)

తెమ్ము నాపాదరక్షలుం దెమ్ము గొడుగు
వెంటనే చని పూటకూళ్ళింట నైన
దోసమెంచుట రుచులందు దోసమంచు
నెంచి పొట్ట నింపుకొనెద నెట్టులైన

(భద్రుఁడవి తెచ్చుటకై నిష్క్రమించును.)

భామిని:
మీరెక్కడికీ పోవలసిన అక్కఱ లేదు
స్థవిరుఁడు:
ఏమి? నీ ఆజ్ఞ లేనిదే బయటి కడుగిడలేనా?
భామిని:
పొండి, చూతము!
స్థవిరుఁడు:
అవధులు దాటుచు నున్నది నీ ఆగడము
భామిని:

(న్యక్కారముతో నీ క్రింది పాటను పాడును.)

అక్కఱ లేకయె ఆగ్రహమెందుకు
చక్కగ విను నా సందేశంబును

కోపము తాపము కూరలు పెట్టవు
ఆగ్రహమేమియు అన్నముఁ బెట్టదు
కావున నుండిన నేవచియించెడు
విధమున దొరకును విందులె యెప్పుడు

రుసరుసలాటలు, రూక్షపుచూపులు
విసవిస నవ్వులు, వెఱ్ఱితలంపులు
సర్వము మూటగ సరగున గట్టి
పాతాళంబునఁ బడఁగా నెట్టుము

భామిని యానతి పడయక యింటిని
వీడుట తగదని వేగ గ్రహింపుము
ఆసీనుఁడవై ఆకలిబాధను
బాపికొనుము నాపాకముతో నిఁక

(చివరి చరణమును పాడుచుండఁగా భద్రుఁడు స్థవిరుని చెప్పులు, గొడుగులతో ప్రవేశించును)

స్థవిరుఁడు:
వింటివా భద్రా! దేవి మాటలు. ఈమె అనుమతి లేక ఈ స్థవిరుఁడు ఇల్లు వీడరాదట!
భామిని:
అంత రభస యెందుకు? అది చేయు టేమంత కష్టము?
స్థవిరుఁడు:
ఔను! ఆమె శాసన మౌదలఁ దాల్చవలసినదే! భద్రా! ఆ చెప్పులూ, గొడుగూ ఉన్నచోటనే ఉంచి రమ్ము.

(భద్రుఁడు వానిని తీసికొని పోవుట కారంభించి, అంతలో ఆగి, విస్మయంతో స్థవిరుని తదేకంగా చూచుచుండును. అది గ్రహించి, భామిని భద్రునితో నిట్లనును)

పంజరంబులోని పక్షినిం గన్నట్లు
విస్మయంబుతోడ వెఱ్ఱివాఁడ!
కోడిగ్రుడ్డులంత గ్రుడ్లు ముఖంబెల్లఁ
గప్పుచుండ నట్లు గాంతు వేల?
స్థవిరుఁడు:
పంజరంబులోని పక్షిచందమె యుంటి
అందులోన సందియంబు లేదు;
ఆమె కరుణ యెప్పు డబ్బునో, యెపుడామె
విడిచిపుచ్చునొ యని వేచియుంటి!

(ఇంతలో సిద్ధార్థుఁడు ప్రవేశించును)

భామిని:
చాలీ బాలక్రీడలు, అజ్ఞానపు మాటలు
సిద్ధార్థుఁడు:
వందనము సుహృద్వరునికి!
స్థవిరుఁడు:

(వారించుచు)

చూడు సిద్ధా! ఈనాటకం ముందుగా!

స్థవిరుఁడు:

(కోపంతో అనును)

సోమరులందున సోమరి వగుచును
భామిని! ఊరక వదరుచునుంటివి
నేనిఁకఁ దాళను నీవిరసోక్తులు
ఈనాటక మిపుడే ముగియఁగవలె

ఆహా! నాకిపుడు జ్ఞానోదయ మైనది!

ఎటులో యిందను కీయమ
కుటిలత్వము నెల్ల నోర్చికొంటిని గానీ
త్రుటితంబయ్యెను నేఁడే
పటపట నా సహనగుణము పరిపూర్ణముగన్

ఈయమ తన యఱకాలున
వ్రాయించుకొనిన భుజంగివలె నుత్థితయై
నాయెడ విసంబు గ్రక్కుచు
రాయిడివెట్టుచు నిలు రణరంగము చేసెన్

నేమము దప్పి చరించెడు
నీమెకతంబున నశాంతియే యిట నిండెన్
ఈమెకు మారుగ నేనొక
చామను పెండ్లాడి యిపుడె సౌఖ్యము గందున్

(పాట)

ఏగు మింక సిద్ధ! ఎట్టిదైనఁ దెమ్ము
మంచిదైనఁ గాని, క్రించుదైనఁ గాని,
రూపవతియె కాని, కోపవతియె కాని,
స్నేహశీల గాని, మోహశీల గాని,
ముద్దరాలు గాని, మూఢురాలు గాని,
గూని దైనఁ గాని, కుంటిదైనఁ గాని,
ఎడ్డిదైనఁగాని, దొడ్డదైనఁ గాని
ఎట్టిదైన నేమి? యీమెకంటె మేలు
నాతి యైనఁ జాలు ప్రీతితోడ నిపుడె
పెండ్లియాడఁ దలఁతు వెదకి తెమ్ము.

(పాట కనుగుణముగా నటించును)

సిద్ధారుఁడు:

(తనలో)

భళిభళి! నాపథకంబిదె ఫలవంతంబగుచున్నది.

భామిని:

(తనలో)

ఈతని చిత్తము పెండ్లికి సుముఖం బగుచున్నది.

(స్థవిరునితో ప్రకాశముగా)

పెండ్లాడుదువా? ఇందుకు నా పరిపూర్ణాంగీకారమున్నది.

పంతము బూని వివాహపుఁ
జింతను జేతు విది నీకు శ్రేయస్కరమౌ,
ఎంత సువార్తయొ ఆర్యా!
సంతసమయ్యె, నిది నాకు సమ్మతమయ్యెన్

స్థవిరుఁడు:

(ఎత్తిపొడుపుగా ననును)

ఆహా! దేవిగారనుగ్రహించిరి. ఇంక వివాహ మాగునా?

వింతను గనుఁడీ నాకీ
కాంతాసమ్మతి లభించె కరపీడనకై,
సంతసమారఁగఁ బెండ్లి శు
భాంతమ్ముగఁ గాకయుండ నాగున యింకన్!

భామిని:
నా సమ్మతి నన్నే పెండ్లాడుటకు. అన్యస్త్రీని గాదు.
స్థవిరుఁడు:
హతవిధీ! ఇదెక్కడి కర్మము?
భామిని:
హతవిధి కాదిది కృతవిధి! విధికృతమే మన బంధము!
స్థవిరుఁడు:
ఇది యేమి నిర్బంధము?

(భద్రునితో అనును)
చెప్పులు గొడుగును చప్పున నిమ్మిటు
ఇప్పుడె వీడెద నింటిని భద్రుఁడ!
ఎటులో పాయుచు నీనిర్బంధము
నెటకో యేగెద నీక్షణమందే!

భామిని:
పాసి చనఁగ లేవు భామినీబంధమ్ము
సలుపకట్టి సాహసంబు నీవు!
పలుకరించు నన్ను భార్యామణీ యంచు,
పలుకనిమ్ము నిన్ను పతి యటంచు.
స్థవిరుఁడు:
అది యసాధ్యంబు, త్యజియింపుమట్టి యాశ
ఎరిగియుండియు గోతిలో నెవఁడు వడును?
భామిని:
ఎంత బేలవొ! ఎరిగితి వింత యేన
ఇన్నినాళ్ళును నీతోడ నున్న నన్ను?

(యుగళగీతం)

భామిని:
ఔనని ఔనని ఔనని నుడువుము
మీనము మేషము లెంచుట విడువుము
స్థవిరుఁడు:
కాదని కాదని కాదని యందును
ఏదియు మార్చదు నామది నందును
భామిని:
కాదని కాదని కాలముఁ బుచ్చకు
ఏది విధీప్సిత మదియే నచ్చును

విప్పుము విప్పుము వీక్షణమించుక
ఒప్పగు నాచెలువును దిలకించుము
చిప్పిల మోదము చిత్తమునందున
తప్పక నను నీదారగఁ గాంచుము

(అనుచు సమ్మోహనకరముగ తన హొయలును ప్రదర్శించుచు నటించును. స్థవిరుఁ డామెను చూచుచు నీక్రిందివిధముగా తనలో ననుకొనుచు, దాని కనుగుణముగా ముఖవైఖరిని చూపుచుండును.)

స్థవిరుఁడు:
కనఁగనఁగా నీకన్నియ రూపము
మనసీమెకు వశమై చనుచున్నది
తనకే విజయము దక్కెడు రీతిగ
నను మత్తునిగ నొనర్చుచు నున్నది
భామిని:
(తనలో) క్రమముగ నెండకుఁ గరఁగుచు నీరగు
హిమము విధంబున నీతని బీరము
సమసి నవంబగు సరసత మదిలో
సముదితమగు వైనము దోఁచును

(అతని ముఖభావములను పరిశీలించి తనలో పైవిధముగా ననుకొని ప్రకటముగా నిట్లనును.)

జాగొనరింపక సత్వరముగ అను
రాగముతోడ కరంబు గ్రహింపుము
రాగము భోగము రంజిలుచుండఁగ
సాగించుము సరసంబుగఁ గాలము
స్థవిరుఁడు:
(తనలో) రంగగురూపము రమ్యోక్తులతో
సంగతమొనరిచి స్వాంతంబును దోఁ
చంగను యత్నము సల్పుచు నున్నది;
లొంగుట తగదీ యంగన హొయలుకు

(ప్రకాశముగా భామినితో) కోరను కోరను కోమలి నీకర
మూరక నను వేసారింపకుమిఁక
వారించును నా స్వాంతము నను
భారంబగు నీ బంధంబనుచును

(పంతగించుచు సిద్ధార్థునితో) వడివడిగా నిఁక వధువును వెదకఁగ
వెడలుము సిద్ధార్థుఁడ! యవిధేయపు
నడవడి గల యీ పడఁతిం జేకొని
ఇడుమలఁబడు దురదృష్టముఁ బాపుము

సిద్ధార్థుఁడు:
సందియమేల మిత్రమ! పసందుగఁ గూర్తును నీకు మానసా
నందమొసంగుదాని, సదనంబును సేవికచంద మెప్పు డిం
పొందఁగఁ దీర్చుదాని, మధువుంబలెఁ దీయగఁ బల్కుదాని, శో
భం దపనీయశిల్పమటు భాసిలుదానిని భామినీమణిన్.

ౘలమును జూపెను గానీ
మొలిపించెను నీదు డెందమున శుభదంబౌ
తలఁపును భామిని; మిత్రమ!
కలిగెను సర్వంబును హితకరమయి నీకున్.

(నిష్క్రమింతురు; ప్రథమాంకము సమాప్తము)

ద్వితీయాంకము

ప్రథమదృశ్యము: స్థవిరుఁడు, తర్వాత సిద్ధార్థుఁడు

స్థవిరుఁడు:
సేవిక యనుచును, చిలిపిదటంచును
కావించితి నాకాంతను దూరము;
ఈవర్తనచే నెంతటి వంతకు
ఆవనితామణి నర్పించితినో!

చిన్నది, అనుభవమన్నది లేనిది
ఉన్నది మెండుగ నుద్రేకంబును
ఎన్నియొ పల్కును ఇంగితమెఱుఁగక
ఎన్నుట తగదివి యన్నియుఁ దప్పుగ

అనుకంపయొ మఱి అనుశయమో?
అనురాగమొ? సౌహార్దమొ యెదొ
జనియించును నా మనమందున
కనినంతనె ఆమెను చెంతను

మదిలో నామెయె మెదలుచునుండెను
ఇది నిజముగ వలపే యగునా?
అది యెట్లున్నను అలజడి మదిలో
నొదవుట మాత్రం బున్న యథార్థము

ప్రేమను సేవికఁ బెండిలియాడిన
స్వామిని సంఘము సన్మానింపదు;
నామనమెందుకు భామినిఁగూరిచి
యేమోమో యిటు లెంచుచు నున్నది?

(ఇంతలో సిద్ధార్థుఁడు ప్రవేశించి పల్కును)

సిద్ధార్థుఁడు:
కంటిని భామినిన్ సఖుఁడ! కాంచనవల్లికవంటిదాని, నా
తుంటవిలుం ధరించుదొరతొయ్యలికిం బ్రతియైనదాని, నీ
యింటను లక్ష్మివోలె రహియింపఁగ నింపగు దాని, నింక ని
ష్కంటకమైన చిత్తమునఁ గాంచెదమామెను బోయి తోఁటలోన్
స్థవిరుఁడు:
మిత్రుఁడన్న నీవె మిత్రుండ వో సిద్ధ!
ఇంతత్వరగ నాదు నీప్సితంబుఁ
జేసివచ్చితివిఁకఁ జెలువనుం జూడంగ
చనుద మామె యున్న వనముకడకు.

ద్వితీయదృశ్యము

(స్థలము: ఉద్యానవనము. వసంతకాలసన్నివేశము.క్రింది గీతంలో పల్లవిని నేపథ్యమందలి బృందం (కోరస్) పాడుచుండును. భావిని యను పేరిట సుందరమైన మాఱువేషములో నున్న భామిని చరణములను మాత్రము పాడుచు పాట కనుగుణముగా సవిలాసముగా నటించుచుండును. అట్లు సోత్సాహముగా పాడుచుండగా, దానికి భంగము కల్గకుండా ఆమె విలాసమును చాటునుండి చూచి, పాట పూర్తియైన తర్వాత స్థవిరసిద్ధార్థులు ఆమె సమక్షమునకు వత్తురు.)

[ఈ గేయాన్ని రాగమాలికగా పాడి మాకు అందజేసిన టొరంటోలోని గాయని శ్రీమతి చర్ల రత్నశాస్త్రిగారికి మా కృతజ్ఞతలు]

కోరస్:
చెలువము దాల్చుచుఁ జెలఁగె వసంతము
పులకితమయ్యెను పుడమి సమస్తము
భావిని:
పలురంగులతో ప్రతిభాసించెడు
అలరులగుత్తుల ఆభరణంబులు
పొలుపుగఁ దాలిచి పూవుందీవెలు
నిలిచెను సీమంతినులం బోలుచు (కోరస్: చెలువము…సమస్తము)
భావిని:
అందంబగు మాకందసుమంబుల
స్యందితమగు నాసవముం దృప్తిగ
నిందిందిరముల బృందము ద్రావుచు
సందడి చేసెను సానందంబున (కోరస్: చెలువము…సమస్తము)
భావిని:
చిలుకలు తరువులఁ జిలిపిగఁ బలికెను
లలితపు జిగురుల లలిమీరఁగఁ దిని
కలకంఠంబులు గానశతంబుల
నలరించె జనంబుల విపినంబుల (కోరస్: చెలువము…సమస్తము)
భావిని:
యోగుల సైతము భోగులఁ జేయుచు
రాగము నిండెను ప్రత్యణువందున
త్యాగం బొనరిచి అలసత్వంబును
భోగించుట కిది బాగగు సమయము (కోరస్: చెలువము…సమస్తము)
భావిని:
శుకములపలుకే శ్రుతిమంత్రంబయి
పికముల గీతమె పెండిలిపాటయి
ప్రకటంబొనరిచె భద్రం బెదియో
నికటంబగుచుండెను నిపుడనుచును (కోరస్: చెలువము…సమస్తము)

(మాఱువేషములో నట్లు పాడుచున్న భామినిని జూచి స్థవిరుఁ డిట్లనును. )

స్థవిరుఁడు:
హావముభావముం గదుర నాటలుపాటలు నేర్చి పాడు నీ
భావిని నాదుమానసము పండువలెం మృదులం బొనర్చె, నా
పూవులవింటిజోదు వెరవొప్పగ నిప్పుడె నన్ను స్వీయ శ
స్త్రావళి శిక్షణార్థ మనువైన శరవ్యముగా గ్రహించెడిన్.
సిద్ధార్థుఁడు:
తొందరపడకుము మిత్రమ!
ముందుగఁ గనుగొంద మామె మూర్తిం బోలెన్
సుందరమగునో బుద్ధియు,
అందం బగునో వచస్సు, వ్యవహారంబున్.

(అని ఇర్వురు పరాక్రమించి సమక్షమునకు వత్తురు.)

భావిని:
ఆశ్చర్యము! చిత్రమిట సిద్ధార్థులను గనుట!
సిద్ధార్థుఁడు:
అలవోకగఁ జరియించుచు
నిలిచితి మిట నీవనస్థ నిర్మల పవనో
ర్ముల లాలనలో బడలిక
దొలఁగించుకొనంగ నిదియు త్రోవనె యుంటన్

ఈతఁడు స్థవిరుఁడు, నాకుం
బ్రీతుండగు మిత్రుఁడు, మునుపీతని విషయం
బే తెల్పియుంటిఁగద! నీ
కీతని దరిసించుయోగ మిపు డొనగూడెన్. (స్థవిరుని జూపుచు పల్కును)

భావిని:
(సాదరనతాంగి యగుచు స్థవిరునితో బల్కును.)
వింటి నిందాఁక మిముగూర్చి విషయమెంతొ
కంటి మిము నేఁడు నాభాగ్యకారణమున
వందనంబార్య! మీతోడి పరిచయంబు
కల్గుటయె నాకు కల్యాణకారకంబు!
స్థవిరుఁడు:
(తనలో) తొలిమాటలోనే ఈమె ‘పరిచయంబు కల్యాణకారకంబు’ అనుచున్నది.
ఈమె మనస్సు వివాహప్రవణమై యున్నటులున్నది.
సిద్ధార్థుఁడు:
మఱచివచ్చితిని. వెంటనే చక్కబెట్టవలసిన గృహకార్య మొకటి యున్నది. అది నిర్వర్తించి,
త్వరగా తిరిగి వత్తును. ఈలోపల మీపరిచయప్రసంగములు సాగుచుండనీ.
స్థవిరుఁడు:
త్వరగా రమ్ము. ఈప్రథమపరిచయ మెట్లు పరిణమించునో!
సిద్ధార్థుఁడు:
సందేహము లేదు. సర్వమనుకూలించును. (నిష్క్రమించును)
భావిని:
సర్వవిషయములందు నిస్సంశయముగ
ప్రథమయత్నము లేక యేఫలము లేదు;
కాన సందేహముడిగి సత్కారమొప్పఁ
బలుక సఖ్యతాంకూరంబు మొలకదొడఁగు.
స్థవిరుఁడు:
పలుకుచుంటివి సరసంపు వచనములను
నీదుమర్యాద శ్లాఘ్యంబు నీరజాక్షి!
సుందరంబైన రూపంబు సుందరంబు
లైన వాక్కుల కాకరమౌట నిజము!

(తనలో) అందమగు నీమె రూపంబు నరయఁగాను
ఇంపయిన యీమె రవము నాలింపఁగాను
ప్రచురమగుచు సాదృశ్యనిబంధనంబు
భామినియె నిల్చు నాస్మృతిపథమునందు.

భావిని:

(పాట)

జీవితమనియెడి పూవులతోఁటకు
యౌవనమే కుసుమాగమకాలము
భావసుమంబులఁ బ్రణయపు తావులు
ప్రోవై మలసెడు భావుకకాలము

పరువము దొరఁగని విరికన్నియలను
కరువలి నెనరునఁ గౌఁగిటఁ జేర్చును
సరసములాడుచు సాగుచుఁ దూఁగుచు
హరియించును తత్పరిమళపూరము

పరువము దొరఁగిన విరికన్నెలకుం
బరిమళ ముండదు, సరసత యుండదు
కరువలి విరులం గ్రమ్మినఁ నిప్పుడు
విరుగం దను లవి ధరణికి వ్రాలును

అలవిరికన్నియ కనిలునకుంబలె
అలరును ధరలో ననువగుకాలము
చెలిమియుఁ బ్రేమయు జీవితమందున
ఫలదము సుఖదంబయ్యెడు కాలము

(కరువలి=గాలి; భావుకకాలము=శుభసమయము)

స్థవిరుఁడు:
యౌవనవంతుల కాదర్శములై
నీవిమలోక్తులు నెగడును భావిని!
ప్రాయము ముదిరిన నాయందవి యెటు
శ్రేయోవహమగునో, యిది చింత్యము!
భావిని:
తారుణ్యముతోఁ దనరుచుఁ జైత్రంబున
పూరెమ్మలఁ గౌఁగిటిలోఁ బొదవెడు చైత్రుఁడు
వయసై యున్నను వైశాఖమునందున
ప్రియుఁడై పూరెమ్మల నలరించును గాదా?
స్థవిరుఁడు:
నీదు రాసిక్య మెన్నంగ నిస్తులంబు
కాంచ నెవ్వారి నిట్టి వాక్చతురమతుల
అతివ! నీదు హృత్పంజరమందుఁ దగిలి
తిరిగిరాదయ్యె నాదు హృత్కీర మిపుడు.
భావిని:
విప్పి వచింప నేల? వలపించెడు చెల్వుఁడు చెంతఁ గల్గినం
గప్పినయగ్ని విస్మయముగాఁ బునరుత్థితమైన చొప్పునం
జొప్పడి వింతవేఁడి మనసుం దహియించును, గాత్రవల్లియం
దుప్పతిలు న్నిదాఘ పులకోద్గమ సంభ్రమ హర్షకంపముల్.

చెన్నగు నీలక్షణములు
మిన్నగ నున్నట్టి నాదు మేనిం గనఁగా
నున్నది తెలిసెంగద, యిఁక
కన్నులవిల్తునిఁ గొలుతము కాంక్షలు దీరన్.

(యుగళగీతం: ఆయాచరణములలో వర్ణింపబడిన వృక్షాదులును చూచుచు తోఁటలో చరించుచూ, పల్లవిని, 5వ చరణమును ఉభయులు గలసి పాడుదురు. ఇతరచరణములెవరివి వారు పాడుదురు. సూచన: ప్రకృతిని గుఱించి పాడెడు నీపాట భామినీస్థవిరుల మానసావస్థను ధ్వనించు ప్రణయగీతముగా నుండుట గమనింపదగును.)

ఇర్వురు:
ఏదో మధురిమ యీవనమందున
మోదం బెదలో పొదలఁగఁ జేసెను
భావిని:
పూవున నిండిన పుష్పాసవమును
త్రావెను భ్రమరము తనివారంగను
చంచువునం గొని జలరుహనాళిక
అంచ యొసంగెను హంసికి ప్రియముగ ॥ఏదో మధురిమ…॥
స్థవిరుఁడు:
సకలసుమంబులు సంపెఁగలే యని
తికమకలాడుచుఁ దిరిగిన భృంగము
అకలంకిత పునరాలోకంబున
వికసించిన యరవిందమునే కనె ॥ఏదో మధురిమ…॥
భావిని:
కమనీయంబగు తమలపుఁదీవియ
క్రముకస్కంధపు కౌఁగిట నిలిచెను
మహిళాహ్వయమగు మంజులవల్లిక
సహకారాశ్లేషంబునఁ గులికెను ॥ఏదో మధురిమ…॥
స్థవిరుఁడు:
ముందు సుమోద్గమ మెందును గానక
అందము దొరఁగిన మందారంబే
సుందరసురభిళ సుమబంధురమై
నందించుచుఁ గానంబడు నిప్పుడు
ఇర్వురు:
ఏదో మధురిమ యీవనమందున
మోదం బెదలోఁ బొదలఁగఁ జేసెను
ఈమనుగడ యెపుడిటులే సాగిన
ఆమరలోకంబదియే కాదా!

పాట

(ఇంకను తోఁటలోనే ఇతరసన్నివేశములను చూచుచూ , పైపాటకంటె భిన్నమైన శైలిలో ఈక్రిందిపాటను పాడుదురు. ఈపాటలో చరణములను స్థవిరుఁడు పాడఁగా, భావిని పల్లవివలె నున్న తర్వాతి రెండు పంక్తులను పాడును.)

స్థవిరుఁడు:

(పుష్పించిన పొన్నచెట్టును చూపుచు, గమనిక:పున్నాగమనఁగా పొన్నచెట్టు, పురుషశ్రేష్ఠుఁడు అని అర్థములు)

పున్నాగం బన, పొన్న యనంగను
కేసర మనఁగను, వాసిం గాంచుచు
కన్నెమనస్సులఁ గాంక్షలు పెంచుచు
నిండుగఁ బూచెను నీతరురాజము

భావిని:
పున్నాగముఁ గను కన్నెల మనసుల
కాంక్షలు రేఁగుట కాదాశ్చర్యము!
స్థవిరుఁడు:

(ఎఱ్ఱని పూగుత్తులతో భూమికి వంగిన కరవీరంబుల(=గన్నేరుచెట్ల) గుంపును చూపుచు; వ్రేఁగున=బరువుచే)

కెంపులకాంతుల నింపుగఁ బూనుచు
విరిసిన సుమముల వ్రేఁగున వంగుచు
కరవీరంబులు ధరణికిఁ బేర్మిని
ప్రణమించుచు నుండెను గాంచుము!

భావిని:
జన్మమొసంగిన జననిం బ్రియముగఁ
గొల్చుట ధర్మము గుణవంతులకు!
స్థవిరుఁడు:

(పుష్పించిన పొగడచెట్టును (=వకుళమును) చూపుచు; తారలు=ముత్యములు, నక్షత్రములు; ఉద్వాహము=పెండ్లి)

నవ్యవధూకంఠంబునఁ గట్టిన
హారమునందలి తారలతీరుగ
ధవళచ్ఛవితోఁ దళతళలాడెడు
పూవులు నిండెను పొగడలయందున

భావిని:
వకుళంబులలో వధువు స్ఫురించుట
ఉద్వాహంబున కుత్తమశకునము!
స్థవిరుఁడు:

(ఆకులు పూవులతో దట్టముగా నున్న మల్లెపొదను చూపుచు; పుట్టము=వస్త్రము,చీర; పట్టాంబరము=పట్టుచీర)

వనరమ గట్టిన పచ్చని పుట్టము
నందునఁ గుట్టిన అందపు టలరుల
వరుసలొ యనఁగా విరిసెను మల్లెలు
పచ్చనియాకుల పట్టాంబరమున

భావిని:
చక్కని వర్ణన స్థవిరుఁడ! నేనును
తాల్పఁగ నెంతును తాదృశవస్త్రమె!

(భావిని పైవాక్యములను ముగించుచుండఁగనే ఆమల్లెపొదనుండి వెడలి ఒక సర్పము వారివైపు ప్రాకుచుండును)

స్థవిరుఁడు:
అయ్యో, పాము… పాము… తప్పుకో… తప్పుకో…

(సంక్షోభముతో భావినిని వారించుచు ప్రక్కకు దప్పించును. ఆమె భయమును నటించును. ఆమెను పట్టుకొని ప్రక్కకు గొనిపోయి, ఇర్వురొక శిలాపీఠముపై కూర్చొందురు. అంతలో దూరమునుండి సిద్ధార్థుడు భద్రునితో గూడి అచ్చటికి వచ్చుచుండును. ఆమె కొంత తేరుకొని ఇట్లనుచుండును.)

భావిని:
పాముపచ్చ యొక్కటి నాదుపాదమందు
చెక్కబడియెను చక్కగా చిన్ననాఁడె
పాము బాధను బాపు నీ పచ్చయనెడు
మూఢభావంబుచేతనో, ముద్దుకొఱకొ!
స్థవిరుఁడు:
(తనలో) అదియే చక్కని యాకృతి
అదియే వాగ్రీతియు, భుజగాకృతి యదియే
పదమందున, మదిలో నీ
మదవతి భామిని యని యనుమానం బొదవున్

ఐన నిర్ధారణమొనర్ప దీని నింక
నిట్టులందును నేమియు నెరుగనట్టు!

(ఇంతలో సిద్ధార్థభద్రులు వారికి చేరువగా వత్తురు.)

(ప్రకాశముగా) ఆశ్చర్యము! పాముపచ్చ అంటే….?
సిద్ధార్థుఁడు:
పచ్చగా బొడిచిన పాము స్వరూపమేమో!
భావిని:
అంతే…!
స్థవిరుఁడు:
(ఆమె పాదములను పరిశీలించి) ఏదీ, నీపాదమందేదియు లేదే!
పొదలుపుట్టలు గలత్రోవఁ బోవునపుడు
పాముకాటులు పాదాలఁ బ్రచురమగుట
రక్షణార్థమై ఆపచ్చ వ్రాసిరేమొ!
ఐన నీపాదమందేది కానరాదు.
భావిని:
అది అఱకాలులో నున్నది.

(అని కుడి అఱకాలును చూపించును.)

స్థవిరుఁడు:
(కోపముతో) ఎంతమోసం బెంతమోసము
భావినీరూపంబుఁ దాల్చిన
భామినివె నీవగుట తథ్యము
నీదునాకృతి, నీదువాగ్రుతి
పాదమందున పన్నగాకృతి
అన్నియును నీ అసలురూపము
బట్టబయలగునట్టు చేసెను
పట్టియిచ్చెను గుట్టునెల్లను
పట్టియిచ్చెను గుట్టునెల్లను
భావిని:
(అనునయముతో) మోస మనుటేల? నాతోడఁ జేసితీవు
ప్రణయపూర్ణలీలావిహారంబు నిపుడె
మారనేటికి నింతలో, మారలేదు
అణువుమాత్రంబు నాకు నీయందు ప్రేమ

కోపన యగు భామినిగా
రూపింపక నన్నరయుచు రూపొందిన ప్రే
మాపగ యగు భావినిగా
నాపాణిని బట్టుమింక నమ్మిక మీరన్.

సిద్ధార్థుఁడు:

(వారించుచు)

తాళుము మిత్రమా! అవిరతంబును నీకుశలంబు గోరు నే
నీలఘునాటకంబు నటియింపఁగఁజేసితి నీమెచేత, నీ
వీ లలనం గళత్రముగ నింక గ్రహింపుము, నీగృహంబు సౌ
ఖ్యాలయమై ధరిత్రిని సమాహితమైన దివంబయై చనన్.

సేవికయే నాయికయై
జీవనపథమున సుఖముల శేవధియై, నా
నావిధముల నీకీ రా
జీవానన తోడ్పడంగఁ జెలఁగుము భువిలోన్.

స్థవిరుఁడు:
(పునరాలోచించుచు, తనలో)
చిన్నది గావున చిలిపితనం బొక
యింతగ నున్నది యీ వధువందున
ఐనను నీయమ మానస మెంతయొ
విమలంబైనది వెన్నెల చందము

మనసునెఱుఁగనట్టి మగువకన్న
మనసు నెఱిఁగినట్టి మగువ మిన్న
కాన సందియంబు మాని యీమె
కరముగొనుట క్షేమకరము కరము

(ఈక్రింది పద్యములను చదివి భావినిని ప్రేమతో గాఢాలింగనము చేసికొనును)

సేవిక యగు భామినియే
భావినిరూపమున నాదు స్వాంతము దోఁచెన్
భావినిగానే యిఁకపై
భావించుచు నీమెఁ గొందు పరిణయమందున్

అనురాగభరంబున నీ
వనజాక్షిని నేలికొందు ప్రాణమువోలెన్
అనిశం బీసతి తోడై
తనరం బొనరింతు గృహ్యధర్మము లెల్లన్

(నేపథ్యమునుండి ఈక్రింది కోరస్ వినిపించును. కోరస్‌తో బాటు సిద్ధార్థభద్రులును పాడుదురు.)

సేవికయే నాయికయై, నాయికయే సేవికయై
జీవనమందున స్నేహించుచు నిరతం బుండఁగ
సాగునులేయిఁక సంసారశతాంగము చక్కగ
భోగింతురులే రాగల కాలంబున పూర్ణంబుగ

శ్రీరంజిల్లఁగ వర్ధమానమయి సంశ్రేయఃప్రపూర్ణంబునై
సారోదారపవిత్రధర్మపదవీసంప్రాప్తపుణ్యంబునై
నీరేజాంబకకేళికాంతరలసన్నిస్తుల్యసౌఖ్యంబునై
మీరుంగావుత నద్వితీయమగుచున్ మీదంపతీత్వంబిఁకన్

అందఱు:
స్వస్తి ప్రజాభ్యాం, పరిపాలయన్తాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః।
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా స్సమస్తా స్సుఖినో భవన్తు॥

(తెర)
(సేవికయే నాయిక సమాప్తము)