వసుచరిత్రంలోని వర్ణనలలో సంఘస్థితి ప్రతిబింబాలు

అపారే కావ్యసంసారే కవిరేకః ప్రజాపతిః ।
యథాఽస్మై రోచతే విశ్వం తథేదం పరివర్తతే ॥
శృఙ్గారీ చేత్కవిః కావ్యే జాతం రసమయం జగత్ ।
స ఏవ వీతరాగశ్చే న్నీరసం సర్వమేవ తత్ ॥ (ఆనందవర్ధనుడు-ధ్వన్యాలోకము)

శక్తి ర్నిపుణతా లోక శాస్త్రకావ్యాద్యవేక్షణాత్ ।
కావ్యజ్ఞ శిక్షయాఽభ్యాస ఇతి హేతుస్తదుద్భవే ॥ (మమ్మటుడు- కావ్యప్రకాశిక)

సాహిత్యశాస్త్రంలో కొద్దిపాటి ప్రవేశమున్నవారికి గూడ పై శ్లోకాలు పరిచితమయ్యే ఉంటాయి. కేవలం అట్టి ప్రవేశం లేని వారి కొఱకై నేనిచ్చట వాని భావాన్ని సంక్షేపిస్తాను. మొదటి రెండు శ్లోకాలు ఆనందవర్ధనుని ధ్వన్యాలోకం లోనివి. ‘కావ్య ప్రపంచానికి నిర్మాత కేవలం కవియే. అతని యిష్టానుసారంగా ఆ ప్రపంచం పరివర్తితమౌతుంది. కవి శృంగారి, రసాత్మకుడైనచో ఆ ప్రపంచం రసాత్మకమౌతుంది. అతడే నీరసుడైనచో, అది నీరసంగా పరిణమిస్తుంది.’ – అని ఈ శ్లోకాల కర్థం. ఇట్లివి కవికి, అతడు చేసే కావ్యసృష్టికి ఘనిష్ఠమైన సంబంధమున్నదని తెల్పుతున్నవి.

ఐతే ఉత్తమకార్యసృష్టి చేసేందుకు కవికి కావలసిన యోగ్యత లేవి అనే విషయాన్ని తర్వాతి మమ్మటుని కావ్యప్రకాశికలోని శ్లోకం చెపుతూ ఉన్నది. ‘1.శక్తి- అంటే ప్రతిభ, 2.లోకమును, శాస్త్రములను, కావ్యాదులను అధ్యయనం చేసి ఆకళించుకొనుటద్వారా కలిగే నిపుణత, బహువిషయజ్ఞత – అదియే వ్యుత్పత్తి, 3. కావ్యతత్త్వ మెఱింగిన విజ్ఞుల కడ శిక్షణను బొంది, తనుగుణముగా దాని నభ్యాసము చేయుట – అనగా ప్రతిభావ్యుత్పత్త్య భ్యాసములను నీ మూడును కవికి తన కావ్యప్రపంచసృష్టియందు యోగ్యునిగా జేయు నంశములని ఈశ్లోకమున కర్థము.

ప్రతిభ యనగా నేమి? అపూర్వవస్తు నిర్మాణ దక్షమైన ప్రజ్ఞయే ప్రతిభ యని అభినవగుప్తుని అభిప్రాయము. ‘ప్రజ్ఞా నవనవోన్మేషశాలినీ ప్రతిభా మతా, తదనుప్రాణనాజ్జీవేద్వర్ణనానిపుణః కవిః’- అని భామహుడను ఆలంకారికుడు ప్రతిభను నిర్వచించెను. అనగా, ఎప్పటికప్పుడు నవనవముగా వికసించు బుద్ధియే ప్రతిభ, దాని కాశ్రితుడై నిపుణమైన వర్ణనలు చేసేవాడే కవియని అతని అభిప్రాయము. ప్రతిభయే కవిని అకవి నుండి వేఱుచేసే లక్షణం. లోకమును పరిశీలించుట ద్వారా, కావ్యశాస్త్రాదులను క్షుణ్ణంగా అభ్యసించడం ద్వారా పాండిత్యమలవడుతుందే కాని, కవిత్వమలవడదు. అట్లు కల్గిన పాండిత్యానికి, అనగా వ్యుత్పత్తికి ఉత్తమమైన ప్రతిభ బంగారానికి తావి యబ్బినట్లుగా తోడైనపుడే చక్కని కావ్యనిర్మాణం సాధ్యమౌతుంది.

లోకపరిశీలనం, లోకానుభవం వ్యుత్పన్నతకు దోహదం చేస్తాయని పైన చెప్పినాము. జన్మతః గాని, దైవ్యోపాసనాదులచేత గాని అలవడిన విశిష్టమైన ఊహాశక్తిచే కవి సంఘములో నితరులకంటెను విశిష్టుడైనను అతడు సంఘజీవియే. అందుచేత అతని ఊహలలో, వర్ణనలలో, సంఘప్రభావము అంతర్గతముగా నుండక తప్పదు. తానుండే కాలమునకు గాక, గతకాలమునకుగాని, ఆగామికాలమునకుగాని సంబంధించినట్టియు, అలౌకికమైన ఇతివృత్తములను గల్గినట్టియు కావ్యములయందును కవియొక్క వర్తమానసంఘానుభవము ప్రతిబింబించుచునే యుండును. ఇట్టి కావ్యములందును ప్రతిభాన్వితుడైన కవి తన లోకానుభవమును నిక్షిప్తమొనరించుచుండును. ఇట్లు చేయుటలో అతనికి భాషపై గల అధికారము, ముఖ్యముగా శ్లేషార్థపరిజ్ఞానము మిక్కిలి సహాయకారులుగా నుండును.

తెలుగు సాహిత్యములో శ్లేషయమకచక్రవర్తియైన రామరాజభూషణుని వసుచరిత్ర మీలక్షణమునకు ఉత్తమమైన ఉదాహరణము. అనన్యసామాన్యమైన ఊహాశక్తితో తెలుగు కవిత్వానికి మకుటాయమానమైన ప్రబంధాన్ని నిర్మించిన ఆ మహాకవియొక్క ఊహలయందును ఆనాటి రాజకీయసాంఘికపరిస్థితులు ప్రతిబింబింపక తప్పలేదు. ఆ మహాకవి ప్రస్తుతమైన కావ్యేతివృత్తమునకు అప్రస్తుతమైన ఈ రాజకీయసాంఘికస్థితులనెట్లు జోడించినాడో ఒండు రెండు ఉదాహరణలు చూపడమే ఇచ్చట నా లక్ష్యము.

సీ.
భువిఁ గవితాకన్యఁ బుట్టించె నెవ్వాఁడు, బడి నాగమము లెల్ల నడపె నెవ్వఁ
డేను నీవనుమాట లెనయించె నెవ్వాఁడు, కోమలపదలీలఁ గూర్చె నెవ్వఁ
డనఘతులాకోటి నలరించె నెవ్వాఁడు, నిఖిలగుణంబులు నేర్పె నెవ్వఁ
డినకరసంప్రాప్తి నెసగించె నెవ్వాఁఁడు, రహి నించె నర్థగౌరవము నెవ్వఁ
తే.గీ.
డట్టి వాణిగురుత్వమహత్త్వఖనుల, ఘనులఁ బ్రాచేతసవ్యాసకాళిదాస
దండి భవభూతి మాఘసత్కవి మయూర, భారవుల భారవుల నాత్మఁ బ్రస్తుతింతు. 1-9

ఈ పద్యములో రామరాజభూషణుడు పూర్వగీర్వాణభాషాకవుల కంజలి ఘటించినాడు. గీర్వాణభాషాకవితాకన్య జనించినది మొదలు క్రమక్రమముగా నెట్లు వృద్ధినొందెనో దానికేయే మహాకవులు కారకులైరో ఇందులో వర్ణించినాడు. తాను నిత్యమును చూచుచున్న సంఘములో నొక బాలిక జన్మించినది మొదలుకొని ఎట్లు క్రమక్రమాభివృద్ధిని పొందుచున్నదో ఆ క్రమమును ఆ కవితాకన్యకు శ్లేషతో అన్వయించినాడు. ఒక మహాత్ముడు (వాల్మీకి[1]‘ఆదికవీ చతురాస్యౌ కమలజవాల్మీకజౌ వన్దే, లోకశ్లోక విధాత్రో ర్యయో ర్భిదా లేశమాత్రేణ’ – శ్లోకనిర్మాతయైన వాల్మీకి లోకనిర్మాతయైన బ్రహ్మకల్పుడని ఈ శ్లోకము చెప్పుచున్నది.) కవితాకన్యను పుట్టించినాడు. ఆగమముల విభాగము చేసిన వేఱొకడు (వ్యాసుడు[2]‘నమస్సర్వవిదే తస్మై వ్యాసాయ కవివేధసే, చక్రే పుణ్యం సరస్వత్యా యో వర్షమివ భారతమ్’ – అను శ్లోకమువల్ల వ్యాసుడు కవితాకాంతకు దేశికుడని (గురువని) తేలుచున్నది. దేశికుడు గావున ఆగమోక్తక్రమము జరిపించినాడని భావము.) ఆ కవితాకన్యకు (బాలికకు) ఆగమవిధానములను (జన్మకర్మ నామకర్మాదులను) జరిపించినాడు. ‘త్వమేవాహమ్’ అని సాక్షాత్తుగా భారతిచేత ననిపించుకొన్న మఱియొకడు (కాళిదాసు[3]కాళిదాసు ‘నేనెవరు?’ అని భారతి నడుగగా, ‘త్వమేవాహమ్’ అంటే ‘నీవే నేను’ అని ఆమె పల్కినట్లు ఐతిహ్యము.) నేను, నీవను ఇత్యాది తొలిపల్కులను ఆ కవితాకన్యకు (బాలికకు) నేర్పినాడు. పదలాలిత్యమునకు ప్రసిద్ధుడైన మఱియొకడు (దండి[4]‘దణ్డినః పదలాలిత్యమ్’ అని ప్రసిద్ధి.) ఆమెకు కోమలపదగతులు (సుతారంగా నడవడం) నేర్పినాడు. కవిత్వమును త్రాసులో పెట్టి తూచినాడని ప్రథయున్న మఱియొకడు (భవభూతి[5]‘అహో మే సౌభాగ్యం! మమ చ భవభూతేశ్చ భణితీ తులాయామారోప్య ప్రతి ఫలతి తస్యాం లఘిమని, గిరాందేవీ సద్యశ్శ్రుతి కలితకల్హారకలికా మధూళీమాధుర్యం క్షిపతి పరిపూర్త్యై భగవతీ’ అను శ్లోకము భవభూతిపట్ల ప్రసిద్ధము. సమానమైన తూకంగల తాటాకులపై భవభూతి, కాళిదాసులు తమ కవితలను వ్రాసి శారదాదేవి సమక్షంలో తూచగా, భవభూతి కవిత్వం కాళిదాసు కవిత్వంకన్న ఒకబిందువంత బరువు తక్కువ తూగడంవల్ల, శారదాదేవి తాను కర్ణావతసంగా ధరించిన కల్హారములోని ఒక మధుబిందువును చిలికి, ఆ న్యూనతను పూరించిందని ఐతిహ్యము. ఈ శ్లోకమునకు ఛాయయే పినవీర భద్రుని శృంగారశాకుంతలములోని ‘మ. పొసగ న్నేఁ గృతిఁ జెప్పగాఁ బరిమళంబుల్ చాల కొక్కొక్కచోఁ, గొసరొక్కించుక గల్గె నేనియును సంకోచంబు గాకుండ నా, రసి యచ్చోటికి నిచ్చుఁగాత పరిపూర్ణంబొంద వాగ్దేవి యిం,పెసలారం దన విభ్రమశ్రవణకల్హా రోదయామోదముల్’ అను పద్యము.) ఆ కవితాకన్యకు తులాకోటి (తుల=త్రాసు, కోటి=అంచుయొక్క) ఘటనను కల్పించినాడు. ‘పాదాంగదం తులాకోటి ర్మంజీరో నూపురోఽ స్త్రియామ్’ – అని తులాకోటి అంటే కాలియందె యని కూడ అర్థము. అందుచే సుతారంగా నడవనేర్చిన బాలిక కాళ్ళకు అందమైన అందెల నలంకరించినాడని భావము. లలితపదగతుల నలవర్చుకొన్న కవితాకన్యకను భవభూతి తన కావ్యములనెడు తులాకోటులతో నలంకరించినాడనియు చెప్పవచ్చును. కావ్యగుణము లన్నిటికి గనియైన మఱియొకడు (మాఘుడు[6]‘దణ్డినః పదలాలిత్యం, భారవే రర్థగౌరవమ్, ఉపమా కాళిదాసస్య, మాఘస్యైతే త్రయో గుణాః’ అని ప్రతీతి. దండికవిత్వంలో పదలాలిత్యం, భారవికవిత్వంలో అర్థగౌరవం, కాళిదాసు కవిత్వంలో ఉపమాలంకారం ప్రసిద్ధంగా ఉన్నాయి గాని, మాఘుని కవిత్వంలో ఈ మూడుగుణాలు గూడ ప్రసిద్ధంగా ఉన్నాయని ఈ శ్లోకానికర్థం.) ఆ కవితాకన్యకకు (బాలికకు) ఉత్తమగుణములన్నీ అలవర్చినాడు. మఱియొకడు (సూర్యశతకకర్త యగు మయూరుడు) ఆ కవితాకన్యకకు ఇనకరసంప్రాప్తిని (సూర్యశతకప్రకాశమును) కల్గించినాడు, ‘ఇనస్సూర్యే నృపే పత్యౌ’ అని ఇనుడంటే భర్త యని కూడ అర్థ మున్నందున ఆ బాలికకు పతియొక్క కరప్రాప్తిని, అనగా భర్తృపాణిగ్రహణప్రాప్తిని, కల్పించినాడని యర్థము. చివరిగా, అర్థగౌరవమునకు ప్రసిద్ధుడైన మఱియొకడు (భారవి) ఆ కవితాకన్యకకు అర్థమను అర్థమును (ద్రవ్యమును) కూర్చినాడు. ఇట్టి వాల్మీకిని, వ్యాసుని, కాళిదాసును, దండిని, భవభూతిని, మాఘుని, మయూరుని, భారవిని ప్రస్తుతిస్తున్నానంటున్నాడు రామరాజభూషణుడు.

ఇందులో శ్లేషచేత తాను నిత్యం సంఘంలో దర్శించుచున్న బాలికల జననాదివివిధదశలను నిబంధించినాడు. ఒక స్త్రీ శిశువు జనించిన తర్వాత ఆమెకు ఆగమోక్తముగా జన్మకర్మ, నామకర్మ ఇత్యాది సంస్కారములు జరుగును. ఆ తర్వాత ఆ బాలిక ‘నేను, నీవు’ ఇత్యాది సులభమైన మాటలతో నారంభించి క్రమముగా భాష నేర్చుకొనును. తర్వాత మెల్లగా నడక నేర్చుకొనును. అట్లు నడవంగ నేర్చిన బాలిక కలంకారార్థమై నూపురములను (కడియములను) తొడుగుట పరిపాటి. శైశవము గడచి ఆమెకు లోకజ్ఞాన మలవడుచున్న దశలో ఆమెకు మంచి ప్రవర్తన (గుణములు) నేర్పెదరు. అట్లు గుణవంతురాలైన బాలికకు సరియైన భర్తను గూర్చి వివాహము సేతురు. ఆమె జీవితము సుకరముగా నుండుటకు వీలైనంత ద్రవ్యసాహాయ్యమును చేతురు. ఇది సంఘము నందు రామరాజభూషణుడు చూచిన బాలికల పెంపకము. ఈ విధమైన బాలికల పెంపకము మన మీనాడును చూచుచున్నాము. కాని ఈ పెంపకముతో సంబంధము లేని గీర్వాణకవుల ప్రశస్తియందు శ్లేషతో నాతడీ సాంఘికవిధానమును చొప్పించినాడు.

సీ.
కావు కావనువారిఁ గదిసి తుంగపయోధరాంతరంబు చేరంగనీదు
వివృతాగ్రరదనులై వ్రేళ్ళు చీకెడువారి మోముఁ జేర్చి శిరంబు మూరుకొనదు
పదములు దొట్రిలఁ బరువు లెత్తెడివారి ననురక్తవృత్తి వెన్నాడి చనదు
పలుచాపలములఁ బుట్టలు మెట్టఁ జనువారిఁ దత్తరంబునఁ గ్రుచ్చి యెత్తుకొనదు
తే.గీ.
కాంచదో విజయశ్రీలఁ, బెంచదో ప్రతాపబాలార్కులను శుభోదయము మీఱ
నౌర తిరుమలరాయ బాహాసిపుత్త్రి, యఖిలలోకాద్భుతక్రీడ నతిశయిల్లు. 1-56

ఈ పద్యములో రామరాజభూషణుడు యుద్ధములో నోడి రక్షింపుమని శరణుజొచ్చెడు తిరుమలదేవరాయల శత్రువుల చర్యలను తాను నిత్యమును ప్రతియింటిలోను చూచుచున్న శిశుదశనుండి మూడేండ్ల ప్రాయమువఱకు నెదిగెడు బాలబాలికల లక్షణములతో సమన్వయించుచు వర్ణించినాడు.

  1. తిరుమలదేవరాయల అసిపుత్త్రి (ఛురిక) కావు, కావుమని – రక్షింపు, రక్షింపుమని -తన్ను వేడికొను శత్రువులను ‘తుంగపయోధరాంతరంబు’నకు, అనగా స్వర్గమార్గమునకు బంపదు, అనగా చంపదని అర్థము. (యుద్ధములో నిహతులైనవారు స్వర్గమునకు బోదురని, కాని శరణుగోరినవారి కట్టి మరణము లేనందున వారు స్వర్గమార్గమునకు బోరని అర్థము.) శిశుపరంగా కావుకావుమని ఏడ్చే శిశువులను స్తనప్రాంతమునకు జేర్చుకొని లాలింపదని అర్థము. పయస్సంటే జలము, క్షీరము అని అర్థములుండుటవల్ల పయోధర పదానికి శత్రువుల విషయములో మేఘములని, తల్లి విషయములో స్తనములని శ్లేష.
  2. నోటిలో వ్రేళ్ళు వేసికొని చీకుచు లొంగిపోయిన శత్రువుల శిరంబుల నాఘ్రాణింపదు. అంటే అట్లు శరణుజొచ్చిన శత్రువులను చంపదని భావము. బాల్యసహజమైనచేష్టలచేత నోటిలో వ్రేళ్ళు వేసికొని చీకుచున్న అర్భకుల శిరములను ఆప్యాయంగా ఆఘ్రాణింపదని శిశుపరమైన అర్థము.
  3. కాళ్ళు తడబడ పరుగెత్తువారిని ప్రేమతో వెంటనంటి అనురక్తవర్తనతో లాలింపదు. అంటే వారిని వెన్నాడి చంపదని అర్థము. ఇక్కడ అనురక్తవృత్తి అను పదమునకు శత్రువుల ననుసరించిన రక్తముయొక్క వర్తనము (ఉనికి) అను అర్థమును చెప్పి, వారు ఖండింపబడనందున అట్టి రక్తముయొక్క ఉనికి లేకుండ ఉండునది యను అర్థమును చెప్పవచ్చును. తడబడుచు పరుగెత్తు అర్భకులు క్రింద పడకుండ ప్రేమతో వారి వెంట నురికి రక్షింపదని శిశుపరమైన అర్థము.
  4. చాపలముచేత, ఎటుపోయిన ప్రాణములు దక్కునో యని తెలియక పుట్టలను మెట్టెడివారిని వెన్నంటి చెంతకు జేర్చి యెత్తుకొనదు – ప్రత్యంతరము లేక యెటు పోవలెనో యెరుగక కర్తవ్యతామూఢులై పుట్టలుమిట్టలపాలైన శత్రువులను వెంటనంటి ఖండింపదని భావము. శిశుపరంగా క్రొత్తగా నడవంగ నేర్చి, బాల్యచాపల్యముచేత పుట్టలను మిట్టల నెక్కుచున్న అర్భకులను ప్రేమతో గ్రుచ్చి కవుంగిలించుకొని యెత్తుకొని లాలింపదని అర్థము.

ఇట్లీ పద్యములోని మొదటిచరణములో కావుకావను యేడ్చు పురిటికందువుయొక్కయు, రెండవచరణములో వ్రేళ్ళుచీకెడి స్వభావము గల నెలల బిడ్డలయొక్కయు, మూడవచరణములో తప్పటడుగులు వేయు వత్సరమాత్రప్రాయము గల అర్భకులయొక్కయు, నాల్గవచరణములో చాపల్యమున ప్రాంతవస్తుజిజ్ఞాసతో నటునిటు పరుగెత్తు రెండుమూడేండ్ల అర్భకులయొక్కయు ప్రవర్తనలను – తాను సంఘములో చూచి గ్రహించిన వాటిని – రామరాజభూషణు డతినిపుణముగా కూర్చినాడు. కాని తల్లి అర్భకుల నిట్లు లాలింపకుండుట చాలా విచిత్రముగా నున్నది. ఎందుకనగా, ఆ ఛురిక అనే తల్లి ఇదివఱకే విజయలక్ష్ములనే బాలికల నెందఱినో కన్నది. ప్రతాపములనెడి బాలసూర్యుల వంటి బాలకులను పోషించినది. అట్టి అనుభవజ్ఞురాలు ఇట్లు వర్తించుట ఎంతో విచిత్రముగా నున్నది.

ఈ పద్యములో ఛురికకు ‘అసిపుత్త్రీ’ యను స్త్రీలింగశబ్దమును వాడుటచే ఛురికను తల్లిగా చెప్పుటకు వీలగున్నది. ‘స్యాచ్ఛస్త్రీ చాసిపుత్త్రీ చ ఛురికా చాసిధేనుకా’ అని అమరము. ఖడ్గమునకు పుత్త్రికవలె (చిన్నగా) నుండునది గావున ఛురికకు అసిపుత్త్రి యని పేరు. ఈ పద మీ పద్యములో సార్థకముగా వాడబడినది. దీనివల్ల శత్రువులను పారద్రోలుటకు తిరుమలదేవరాయలకు అసిపుత్త్రియే (చిన్నకత్తి మాత్రమే) చాలునని, అసితో (పెద్దకత్తితో) అవసరం లేదను విశేషార్థము స్ఫురించినది. తిరుమలదేవరాయల ఛురిక, అనేక విజయములను గాంచినదని, బాలసూర్య ప్రతీకాశమైన ప్రతాపములకు పోషకమైనదని, అట్టి మహత్త్వపూర్ణమైన ఛురిక యుద్ధమున ప్రాణములకు వెఱచి శరణుగోరెడు శత్రువులను చంపకుండ విడిచిపెట్టినదని అసలైన అర్థము.

ఈ క్రింది పద్యంలోని సూర్యాస్తమయవర్ణనలో తాను చూచిన రాజ్యాల చరమస్థితిని చాలా చక్కగా నిరికించినాడు రామరాజభూషణుడు. రాజు బలహీనుడైనపుడు అతని ప్రతినిధుల ఆధిపత్యం పెరుగుతుంది. కాని ఏయొక్క ప్రతినిధి అధికారం రాజుయొక్క అధికారమంత ఉండదు. ఇట్లు తమ ప్రక్క రాజ్యం బలహీనమౌతుంటే వారి శత్రువులా స్థితిని గమనించి, ఆ రాజ్యాన్ని ఆక్రమించే యత్నం చేయకుండా ఊరుకుంటారా? వారు పార్ష్ణిగ్రాహులై ఆ ప్రతినిధుల మండలాలాక్రమించు కొనడానికి ముట్టడిచేయకుండనే ఉంటారా? ఇది ఆనాటి రాజకీయ పరిస్థితి. ఆ సత్యాన్ని సూర్యాస్తమయవర్ణనలో నెంత నిపుణంగా రామరాజభూషణు డిరికించినాడో చూడండి.

ఉ.
కాలవశంబునం దన యఖండితచండిమ దూలి హేళి య
స్తాలయవాటికిం జనుచు నాత్మకరావృతదుర్గపాళి నా
ప్తాలి నమర్చె నాఁ బరిణతాతపము ల్గిరులెక్క నిక్కెఁ ద
న్మూలములం దనాతపసమూహము పేరిటి యిర్ల వేలముల్. 4-5

ఈ పద్యాన్ని అర్థం చేసికొనడానికి హేళి అంటే సూర్యుడని, కరములు అంటే కిరణములు, చేతులు అనీ, దుర్గములు అంటే కోటలు, పర్వతములు అనీ అర్థాలు గుర్తుంచుకోవాలి. సూర్యుడనే రాజు కాలం బాగులేక తనయొక్క అపారప్రతాపాన్ని గోల్పోయి అస్తాచల మనే రిటైర్మెంటుహోముకు పోతూ, తన కిరణములనే చేతులచేత వశము చేసికొన్న పర్వతములనే కోటలపై నిల్పిన తనయొక్క ఆప్తప్రతినిధులవలె ఆ పర్వతాలనే కోటల పైభాగమున పండుటెండలు నిల్చినాయట. కాని పర్వతాలనే ఆ కోటల క్రిందిభాగములను నీడలాక్రమించుకొన్నవట. ఆ నీడలా దుర్గములపై దాడిచేయుటకు మూగిన శత్రువుల దండువలె నున్నవట! ఎంత అద్భుతంగా ఈ సుర్యాస్తమయవర్ణనలో ఆనాటి రాజకీయ పరిస్థితిని రామరాజభూషణుడు ఇరికించినాడు!

ఉదయసాయంసమయాలలో తీక్ష్ణత లేకుండా ఉండే ఎండలకు వరుసగా నీరెండలు (బాలాతపములు), పండుటెండలు (పరిణతాతపములు) అని పేర్లు. ఈ పండుటెండలను రాజప్రతినిధులని చెప్పుటవల్ల వారి బలహీనత ద్యోతకమైంది. దుర్గముల పైభాగమున అట్టి పండుటెండలున్న సమయములో దుర్గములయొక్క అధోభాగములో మూగినట్టి ‘ఇర్లవేలముల’ను శత్రువుల మూకలుగా చెప్పుట స్వాభావికముగా నున్నది. ఎందుకన వెల్గునకు శత్రువు చీకటియే కదా! ఆ నీడలే చీకటులై సూర్యాస్తమయమైన తర్వాత కొండలనే దుర్గములను పూర్తిగా నాక్రమించునని ఇచ్చట భవిష్యవృత్తమును సూచించినాడు. అంతేకాక దుర్గమును ముట్టడించు శత్రువులు దుర్గముయొక్క క్రిందిభాగమున నుండుట, దుర్గరక్షకు లాదుర్గము యొక్క పైభాగమున నుండి, ఆ ముట్టడిదారులపై పలురకముల దాడి చేయుచు దుర్గమును రక్షించుకొనుట యుద్ధములో ననుసరింపబడు పద్ధతులే!

పల్లెపట్టున పెరిగిన ఎవ్వరికైనను వరిపంట సిద్ధమైన తర్వాత వరిమళ్ళలోని నీటి నెండగట్టి, పంటను కోసి, కుప్పవేసి, ఆ తర్వాత కళ్ళంలో దానిని వలయాకారంలో పఱచి, జోడెద్దులగుంపులచేత త్రొక్కించి, లేదా ఈ రోజులలో ట్రాక్టరును ఆ వరి పోచలపై గుండ్రంగా ద్రిప్పి, బంతిగట్టడం జరుగుతుంది. బంతి గట్టినప్పుడు ఆ పోచలనుండి గింజలు, గడ్డి వేరవుతాయి. గింజలు గడ్డికంటె సాంద్రంగా ఉండడం చేత, అవి క్రిందికి రాలి, పైన గడ్డి పఱచుకొని ఉంటుంది. అప్పుడా గడ్డిని ఎత్తి కుప్ప వేస్తారు. ఐనను, గింజలతోబాటు చిన్నచిన్న గడ్డిముక్కలింకా ఉంటాయి. ఆ గింజలను, గడ్డిని, గింజలలోని తాలును వేఱుచేయుట కొక ఎత్తుప్రదేశంలో (బండిపై) నిలుచుండి, గాలి వీచే దిశకు దిరిగి తూర్పారబట్టుతారు. అప్పుడు గింజలు ముందరి వైపు, వాని కెదురుదిశలో కొంచెం దూరంలో గింజలలో నున్న గడ్డిముక్కలు, తాలు వేరుగా కుప్పబడుతాయి. వరిధాన్యాన్నీవిధంగా సిద్ధం చేయడం అనాదినుండి ఇప్పటివఱకు వస్తున్న ఆచారమే. ఈ విధానాన్ని ఇంత విస్తృతంగా చెప్పడం దేనికంటే, పల్లె ముఖం చూడని పట్టణవాసుల కీవిధానంపై అవగాహన ఉండదేమో అను అనుమానంతో. కాని రామరాజభూషణునికి ఆ బాధ లేదు. అతడు అచ్చంగా పల్లెలో పుట్టి పెరిగినవాడు. అతడు వరిధాన్యాన్ని తూర్పారపట్టడం ప్రతియేడూ చూచియే వుంటాడు. ఆ అనుభవాన్ని అద్భుతమైన ఊహాశక్తితో మేళవించి, అతడు వసుచరిత్రలో ఈ క్రింది ఉదయకాల వర్ణనను చేసినాడు.

శా.
తారాసస్యము పండినన్ గగనకేదారంబునం జంద్రికా
నీరంబారఁగఁ గోసి, తద్రుచిఫలానీకంబు ప్రాతర్మహా
సీరిగ్రామణి తూరుపెత్తెనన దోఁచెం దూర్పునం దెల్పు, త
ద్దూరన్యస్తపలాలరాశిక్రియ నిందుండేఁగె నిస్సారుఁడై. 4-130

ఆకాశమనేదొక వరిపొలం. ఆ వరిపొలంలో వెన్నెల అనే నీరు పారించి, తారలనే వరిపైరును సాగుచేసినారు. అది పక్వానికి వచ్చింది. పక్వానికి వచ్చిన ఆ తారాసస్యానికి పండిన పంట యేమిటంటే అది తారలప్రకాశమే. పక్వానికి వచ్చిన ఆ పైరును ప్రాతఃకాలమనే గొప్ప రైతు కోసినాడు. కాని కోయడానికి ముందు పొలంలోని నీటిని ఆరగట్టాలి గదా! ఇక్కడ వెన్నెలయే ఆ నీరగుటవల్ల, అది ఉదయకాలంలో అంతరించిపోవడంద్వారా ఆ నీటిని ఆరగట్టడం సమకూడింది. ఇక కోసిన పంటలోని గట్టి గింజలను, తాలును వేరుచేయడానికి ఆ ప్రాతఃకాలమనే రైతు తూర్పారబట్టినాడు. అట్లు తూర్పారబట్టగా సారమైన సస్యఫలం ఉదయకాలపు తొలివెల్గు రూపంలో తూర్పుకు కుప్పగా బడింది, నిస్సారమైన పొల్లు నిస్తేజుడైన చంద్రునిరూపంలో పశ్చిమానికి కుప్పగా బడిపోయిందట! నిండుచంద్రుడు తూర్పున ఉదయించి, రాత్రంతా తన వెన్నెలరూపంలో తారా సస్యానికి జలమందించి, ఉదయసమయానికి ఆ నీటిని కట్టివేసినట్లుగా వెన్నెల ప్రభ దరగిపోగా పడమట నిస్తేజుడై పొల్లుకుప్ప లాగా కనిపిస్తున్నాడు. తూర్పున బడ్డ తారలప్రకాశమనే సస్యఫలము సంఘటితమై వేకువవెల్గుగా ప్రకాశిస్తున్నది అని తాత్పర్యం.

ఈ పద్యంలో రామరాజభూషణుడు వాడిన కొన్ని పదాల స్వారస్యాన్ని గమనింపవలసి ఉంది. గగనం నల్లగా ఉంటుంది. వరిపండే పొలం గూడ నల్లగా వుంటుంది. జలాన్ని తెల్లగా నున్నట్లు వర్ణించడం కవితాసంప్రదాయం. వెన్నెల గూడ తెల్లగా ఉంటుంది. జలంవలెనే వెన్నెలకుగూడ అంతట వ్యాపించే స్వభావముంది. అందుచే ఆ నల్లనైన ఆకాశమనే మాగాణిపొలంలో విస్తరించే తెల్లని జలంలాగ తెల్లని వెన్నెల ఆకాశంలోవ్యాపించింది అని చెప్పడంలో ఎంతో స్వారస్యముంది. అంతేకాక మాగాణికి కేదారమనే సంస్కృతనామం వాడబడింది. కే జలే దార్యత ఇతి కేదారః – నీరు గట్టి దున్నబడునది – అని కేదార శబ్దానికి వ్యుత్పత్తి. మాగాణిపొలం నీరుగట్టి దున్నేది గావున ఇది అర్థవంతమైన శబ్దం. ఈ విధంగా సూర్యోదయవర్ణనలో వరిని సాగుచేయడం నుండి తూర్పారబట్టడం వఱకు గల తతంగమంతా జోడింపబడింది.

రామరాజభూషణుడు బట్టుపల్లె అను గ్రామానికి చెందినవాడని కొందఱు సాహిత్యచరిత్రకారులు వ్రాసినారు. కాని ఆ విషయం రూఢిగా నిర్ణయింపబడినట్లు లేదు. ఆ మహాకవి జన్మస్థానము బట్టుపల్లె యైనను, బ్రాహ్మణపల్లె యైనను అతని బాల్యం పల్లెపట్టుననే కడచిందనుట తథ్యం. తన ఊరిలో కర్షకులు పొలాలలో పేర్చిన పెద్దపెద్ద ఎత్తైన వరికుప్పలను తప్పక అతడు చూచియే ఉంటాడు. అది గుర్తుంచుకొనియే అధిష్ఠానపురంలో నివసించే శూద్రజాతి పేర్చిన మహోన్నతములైన వరికుప్పలను ఈ క్రింది పద్యంలో అద్భుతంగా వర్ణించినాడు.

మ.
బలిచూడామణులందు విష్ణుపదజుల్ వాటించు ధాన్యంపుఁ ది
ప్పలు చంద్రామృతసారసేకమునఁ బైపై మోసు లెత్తంగఁ ద
త్కలమాంకూరపుఁ బంపు మేయు నెలజింకన్ సారె వారించు వా
రల తోఁబుట్టువు గంగ పద్మముఖనిర్యద్భృంగనాదార్భటిన్. 1-100

శూద్రజాతికి, ఆకాశగంగకూ జన్మస్థానం విష్ణువుయొక్క పాదమని పురాణప్రసిద్ధి. విష్ణుపదజులు, అంటే విష్ణుపాదములనుండి జనించినవారును, అందుచేత వామనావతారములో విష్ణువు తన పాదాన్ని బలిచక్రవర్తి తలపై మోపినప్పుడు బలితలకు శిరో భూషణములుగా నున్నవారును ఐన ఆ అధిష్ఠానపురవరమందలి శూద్రులు పుష్కలంగా వరిని పండించి, ఆకాశాన్నంటే పెద్ద పెద్ద వరికుప్పలను వేసినారు. అవి ఆకాశాన్ని తాకుచుండడంచేత, రాత్రిపూట అమృతకిరణుడైన చంద్రుని కిరణాలలోని అమృతంలో తడిసి, ఆ కుప్పల పైభాగాలలోని వడ్లగింజలు మొలకెత్తినాయట. మఱి చంద్రుడు హరిణాంకుడు– లేడి గల్గినవాడు- గదా! అందుచేత ఆ చంద్రునిలో నున్న లేడిపిల్ల కాస్త ఇదే అవకాశమని చాపల్యంచేత ఆ వరిమొల్కలను తినడానికి ఉద్యమించిందట. అయ్యో, నా తోఁబుట్టువులు కష్టపడి వేసికొన్న వరిధాన్యమును కాస్త ఈ చిలిపి లేడిపిల్ల ఫలహారం చేసివేస్తున్నదని, ఆకాశగంగానది తనలో పెరిగే అసంఖ్యాకములైన పద్మాలలో నున్న తుమ్మెదల రొదచేత ఆ లేడిపిల్లను వారిస్తున్నదట! తన పల్లెటూరి అనుభవం ప్రతిబింబించే ఈ పద్యంలో ఈమహాకవి భావన కూడా ఆ వరికుప్పలవలెనే గగనోన్నతంగా ఉంది కదూ!

మ.
సిరి నెత్తామరయింటికిన్ మగుడి రాఁ జెంతన్ ద్విజారావమా
ధురిఁ బుణ్యాహముఁ దెల్పుచున్ గురుతరు ల్దోడ్తో నటత్పల్లవో
దరనీహారజలంబు చిల్కఁగ నయుక్తం బొంటిమై నుండ నం
చు రథాంగంబు ద్విజాతిగానఁ గవ యై చూపట్టె నిప్పట్టునన్. 4-131

కొంతకాలము గృహమును పరిత్యజించి పునరావాసము చేయునప్పుడు గృహశుద్ధ్యర్థం, శోభనార్థం ద్విజులచే పుణ్యాహవాచనము చేయించి అందులో వసించుట గృహ్యసూత్రవిహితమైన పద్ధతి. పుణ్యాహవాచనమునకై, కలశము నుంచి, అందులో జలమును నింపి, ఆ జలములో వరుణుని ఆవాహన చేసి అర్చించి, కలశమునకు నలువైపులా నాసీనులైన నల్గురు బ్రాహ్మణులచే వరుణపవమానహిరణ్యాది సూక్తములను పఠింపజేసి, అట్లు మంత్రపూతమైన జలమును దర్భలు, ఆమ్రపర్ణములతో నద్దుకొని యావద్గృహమును, గృహవాసులను ప్రోక్షించుట పద్ధతి. ఈ విధానము నంతయు పై పద్యములోని ఉదయ కాలవర్ణనలో శ్లేషచే నతినిపుణంగా పొదిగినాడు రామరాజభూషణుడు.

రాత్రిపూట పద్మాలు ముకుళిస్తాయని, ఉదయం తెఱచుకొంటాయని కవిసమయం. పద్మం లక్ష్మికి నివాసస్థానమనీ ‘పద్మప్రియే పద్మిని పద్మహస్తే, పద్మాలయే పద్మదళాయతాక్షి!’ ఇత్యాది శ్లోకాలు, ‘పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్’- అని శ్రీసూక్తం తెల్పుతూ ఉన్నవి. ‘రథాంగ’మంటే చక్రవాకపక్షి. చక్రవాకపక్షిమిథునము రాత్రిపూట విడిపోయి మఱల ప్రొద్దున కలిసికొంటుందని కూడ కవిసమయము. ద్విజ, ద్విజాతి అను సమానార్థకశబ్దాలకు బ్రాహ్మణుడు, పక్షియను అర్థాలను, సిరి శబ్దానికి లక్ష్మి, కాంతి (శోభ) అను అర్థాలను, పుణ్యాహశబ్దానికి పుణ్యాహవాచనము, మనోజ్ఞమైన దినమను అర్థాలను, గురుతరుల్ అను శబ్దమునకు ఉన్నతవృక్షములు, మాన్యులైన పెద్దలు అను అర్థములను ఈ పద్యాన్ని అర్థం చేసికొనడానికి గుర్తుంచుకొనడం అవసరం.

రాత్రిపూట పద్మాలు ముకుళించినప్పుడు వానిలోని సిరి అంటే కాంతి(శోభ) తొలగిపోయి, ఉదయంలో ఆసిరి మఱల నెత్తామరయింటికి’ అంటే శ్రేష్ఠమైన పద్మగృహమునకు జేరుకొన్నది. అంటే రాత్రి ముకుళించి, కాంతి దొరగిన పద్మాలు ప్రొద్దున మఱల కాంతి(శోభా)వంతములై వికసించినవని అర్థము. అట్లు కాంతి తన పద్మగృహమునందు పునరావాసము జేయువేళ ద్విజారావమాధురి, అంటే పక్షులయొక్క కూజితముల మాధుర్యము పుణ్యాహమును, అంటే మనోహరమైన ఉదయావిర్భావమును, ప్రకటించినది (‘పుణ్యం మనోజ్ఞేఽభిహితం, తథా సుకృత ధర్మయోః’ అని విశ్వకోశప్రకారము పుణ్యశబ్దమునకు మనోహరమైనదనియు, పుణ్యమనియు, ధర్మమనియు అర్థములు.) తోడ్తోన్=తదుపరి, గురుతరుల్=ఉన్నతవృక్షములు, నటత్=చలించుచున్న, పల్లవోదర=చిగురుటాకులందలి, నీహారజలంబు=మంచునీటిని, చిల్కినవి. అనగా ఆ ఉదయకాలములో ఉన్నతవృక్షములయొక్క చలించెడి ఆకులనుండి శీతజలశీకరములు రాలినవని అర్థము. ఇంకను, రాత్రి విడిపోయిన చక్రవాకపక్షులు మఱల జంటగూడినవి. ఇది ఈ పద్యమునకు సామాన్యమైన అర్థము.

పై సామాన్యార్థమునందు శ్లేషచే పుణ్యాహవాచనసంస్కార మిట్లు నిబంధింపబడినది. రాత్రిపూట నెత్తామరయింటిని (పద్మగృహమును) త్యజించిన సిరి=లక్ష్మి, మగుడి రాన్=తిరిగి వచ్చిన సమయమున, ద్విజారావమాధురి=బ్రాహ్మణుల యొక్క(మంత్ర)రవములయొక్క మాధుర్యముచేత, పుణ్యాహము దెల్పుచున్=పుణ్యాహవాచనము ఘటించుచు, తోడ్తోన్= ఆ మంత్రపఠనానంతరము, గురుతరుల్= పెద్దలు, నటత్= (హస్తవిన్యాసముచేత) కదల్చుచున్న, పల్లవ=లేత (మామిడి) ఆకులచేత, ఉదర నీహార జలంబు=(పుణ్యాహవాచనకలశోదరమందలి) శీతలజలమును, చిల్కగన్=చిలుకుచుండగా, ఇప్పట్టునన్=ఇట్టి మంగళసమయమందు, ద్విజాతిగాన=(తాను) బ్రాహ్మణజాతికి చెందినది గావున, రథాంగంబు= చక్రవాకము, ఒంటిమై నుండన్=ఒంటిగానుండుట, అయుక్తం బంచున్=అమంగళమని యెంచుచు, కవయై=జంటగూడి, చూపట్టెన్=కననయ్యెను. ఒంటిబ్రాహ్మణు డగపడుట అశుభకరము, బ్రాహ్మణదంపతు లగపడుట శుభకరమని, పుణ్యాహవాచనము లక్ష్మియొక్క పునఃపద్మగృహప్రవేశకాలశుభకార్య మగుటచే ద్విజాతికి (=బ్రాహ్మణజాతికి) చెందిన చక్రవాకము తనస్త్రీని గూడి (ఉదయకాలమున చక్రవాకమిథునము కూడియుండునను కవిసమయప్రకారముగా) కనిపించినదని అర్థము.

సంఘంలో అనాదినుండి వేశ్యలుండనే ఉన్నారు. ముఖ్యంగా విజయనగరంలో కొందఱు వేశ్య లత్యంతధనవంతులై ప్రాసాదములలో నివసించుచు, సంఘమున గౌరవమును గూడ పొందెడివారని ఆనాడు విజయనగరమును చూచిన పోర్చుగీసు పర్యాటకులు వ్రాసినారు. ఇటువంటి వేశ్యలనే ‘వారముఖ్య’ లందురని ‘సత్కృతా వారముఖ్యా సా’ అని అమరకోశము తెల్పుచున్నది. ఒకవిధంగా స్థానికులకంటె పర్యాటకులకే ఈ వారముఖ్యలవిషయం అధికంగా తెలియునేమో! నిశితసంఘ పరిశీలకుడైన రామరాజభూషణుడు తన కాలమునందలి వేశ్యలను చక్కగా గమనించియే యుండును. ఆ వేశ్యాలక్షణములను కుకవి కాపాదించుచు వసుచరిత్రములో నతడీ క్రింది పద్యమును వ్రాసినాడు.

శా.
భావం బెక్కడ లేక, వృత్తనియమాపాయంబుఁ జింతింప కెం
దే వర్తించి పరార్థవంచనలచే దీపించి, మూర్ఖాళి సం
భావింపం గుకవిప్రణీతకృతి సామాన్యాకృతిం బూని పై
పై వన్నె ల్పచరింప దానిఁ దిలకింపం బోరు ధీరోత్తముల్ 1-11

స్పష్టమైన లేక వ్యంగ్యార్థపూరితమైన భావము లేకుండా, వృత్తనియమములందలి ప్రమాదములను – వృత్తములకు నిర్దిష్టములైన గణయతిప్రాసలభంగములను – బట్టించుకొనక, ఇతరకావ్యములందలి అర్థములను దొంగిలించుటచేత కొంతగా రుచిగొల్పుచు, (పండితసభలలో గాక) ఎచ్చటనో మాఱుమూలల (అపండితులచేత) చదువబడి, భాష తెలియని మూర్ఖుల చేత నాదరింపబడుచు పైపైమెఱుగులు చూపెడు సామాన్య (వేశ్య)వంటి కుకవికృతులను పండితులు గణింపరు, పట్టించుకొనరు – అని ఈ పద్యానికి అర్థం. ఎవ్వనియందును భావము (అనురక్తి) లేక, తన నడవడికయందలి ప్రమాదములను గూర్చి చింతింపక, ఎచ్చటెచ్చటనో వ్యభిచరించుచు, ఇతరుల (విటుల) ద్రవ్యమును లాగికొనుటచేత శోభించుచు, మూర్ఖులచేత నాదరింపబడుచు, బాహిరమైన అలంకారములతో అందముగా గన్పించు సామాన్య (వేశ్య)వలె కుకవికృతి యుండునని శ్లేష చేత ఈ పద్యములో సామాన్యాలక్షణము లన్నియు కుకవికృతికి రామరాజభూషణు డాపాదించినాడు.

ఇంకను ఇట్టివే ఇతరమైన ఉదాహరణములు వసుచరిత్రలో నున్నను, ఇచ్చట దిఙ్మాత్రముగా నివి చూపబడినవి. ఈప్రయత్న మితరుల కాసక్తిని రేపిన, వారిట్టి ఉదాహరణముల నింకను విశ్లేషింతురని ఆశింతును. పైన విశ్లేషించిన ఉదాహరణములను పరిశీలించినచో ప్రస్తుతవిషయవర్ణనతో ఇతరవిషయమును జోడించినప్పుడు, శ్లేష యను జిగురుచే నావిషయమును ప్రత్యంగసుందరముగా నతికించుట రామరాజభూషణుని విశిష్టమైన రచనాశిల్పముగా, ప్రజ్ఞగా దోచును.

అధస్సూచికలు[+]