హొయసలుల దేవాలయాలకు యునెస్కో గుర్తింపు

జగదద్భుతమైన శిల్పకళాసౌందర్యంతో కర్ణాటకలోని హొయసలరాజ్యపాలకులు 12-13 శతాబ్దములలో నిర్మించిన బేలూరు, సోమనాథపురములలోని చెన్నకేశవాలయములకు, హళేబేడులోని జైనశివాలయములకు యునెస్కో ప్రపంచవారసత్వనిర్మాణములలో శాశ్వతసభ్యత్వము లభించిందను వార్తను సెప్టెంబరు 19, 2023 నాటి ఈనాడుపత్రికలో చదివి నే నమందానందగంధిలహృదయారవిందుడ నైనాను. బేలూరు చెన్నకేశవాలయం నా మహాశిల్పి జక్కనచరిత్ర కావ్యానికి ప్రేరకమగుటయే దీనికి కారణము. 1992లో ఆ ఆలయమును దర్శించిన తర్వాత కల్గిన అపూర్వమైన ప్రేరణవల్లనే నేను 1200 పద్యముల ఈ మహాకావ్యాన్ని వ్రాసినాను. అది హైదరాబాదులోని యువభారతిద్వారా 1994లోను, పాలపిట్టబుక్స్ ద్వారా 2012లోను ప్రచురింపబడి యూనివర్శిటీ డాక్టరేటు పరిశోధనలకు పాత్రమై ఇప్పుడు పిడిఎఫ్ రూపంలో లభిస్తూ ఉన్నది. ఇందులోని షష్ఠోల్లాసంలో ఈకావ్యానికి ఆత్మవంటిదైన బేలూరుదేవాలయ వర్ణన మున్నది. ఈదేవాలయానికి యునెస్కోవారసత్వనిర్మాణములలో శాశ్వతసభ్యత్వగౌరవము లభించిన ఈశుభతరుణంలో ఆవర్ణనను నేనిక్కడ పునర్మననం చేసికొంటున్నాను. ఈదేవాలయమును గుఱించిన రెండు యూట్యూబు ప్రదర్శనలు క్రింది రెండు లంకెలద్వారా చూడవచ్చును. ఈదేవాలయశిల్పములను దృశ్యమాధ్యమంలో చూచి ఈపద్యములను వాటికి అన్వయించుకొనడం ప్రయోజనకరంగా ఉంటుందని నా భావన.

బేలూరు చెన్నకేశవ స్వామి గుడి దర్శనం – తెలుగు వ్యాఖ్యానంతో.

బేలూరు చెన్నకేశవుని గుడి – యునెస్కోవారసత్వనిర్మాణములలో శాశ్వతసభ్యత్వగౌరవము.

బేలూరు చెన్నకేశవాలయవర్ణనము

  1. ఐదువందల శిల్పీంద్రు లహరహంబు
    నాలయస్థలి సృజనైకశీలు రైరి;
    వారి కందఱికిని నాధిపత్య మూని
    పరమశిల్పియై జక్కన పరగుచుండె.
  2. తారకాకృతిఁ బరిధి యొప్పారుచుండ
    మూఁడుమూరల యెత్తైన గోడతోడఁ
    బొనరు వేదిపైఁ బ్రాఙ్ముఖంబుగను గట్టె
    మందిరము నాతఁ డత్యంతసుందరముగ.
  3. గర్భగృహమును దారకాకార మూని
    పొనరు నందున, దానికి ముందుఁ దనరు
    మండలాకారతాండవమండపంబు;
    దాని కుత్తరదక్షిణస్థానములను
    దనరుఁ బార్శ్వమండపములు, ద్వారములును.
  4. ఆ రమణీయమండపములం దలరారు నపూర్వశిల్పసు
    శ్రీరుచిరంబులైన యితరేతరసామ్యవితథ్యరమ్యశై1
    లీరచితంబులైన, లవలీదళరీతిఁ, బ్రతీపదర్శినీ2
    చారుకపోలపాళికలచందము నిద్దములైన కంబముల్.
  5. [1. ఇతరేతరసామ్యవితథ్యరమ్యశైలీరచితంబులైన = ఒకదానితో నింకొకటి పోలియుండుట యన్నది తథ్యము గానటువంటి అందమైన శైలితోడ నిర్మింపబడిన (అనగా, ప్రతిస్తంభము నొక ప్రత్యేకమైన శిల్పశైలితో నిర్మించె ననుట; 2. ప్రతీపదర్శిని = స్త్రీ.]

  6. అనుపమమైన స్వీయసృజనైకవిలాసము గాంచి యీర్ష్యకుం
    బనుపడి విశ్వకర్మ పలుమారులు తన్నెదిరింప నాతనిన్
    గొనకొని గెల్చి చిహ్నముగఁ గూర్చెనొ పొల్పగు గెల్పుకంబముల్
    ఘనుఁడగు జక్కనార్యుఁ డనఁ గన్నులవిం దొనరించుఁ గంబముల్.
  7. అనుదినమందుఁ బ్రత్యుషమునందున నాట్యముసేయు శాన్తలం
    గనఁగను బోవు నా స్థపతికౌలసుధాంబుధిచంద్రుఁ, డట్టు లా
    వనిత యొనర్చు నాట్యగతభంగిమలెల్లఁ దదేకచిత్తుఁడై
    మననము సేయుఁ, జేసి ప్రతిమాకృతులన్ రచియించు వానికిన్.
  8. ఆతఁడు దన్నుఁ దా మఱచి యారయుచుండఁగ నామెనాట్యమున్
    ఆతనికిం గ్రమంబుగఁ దదాకృతి తోఁచును మల్లికానవా
    బ్జాతముఖీవిధం బగుచుఁ, బ్రాప్తిల నిట్లు నిజప్రియాపున
    ర్ద్యోతన మాతఁ డాప్లవమునొందును నూతనకౌతుకాంబుధిన్.
  9. మల్లికాకృతి మీరంగ మలఁచివైచు
    రమ్యతరనాట్యవిగ్రహప్రతతి నటుల;
    రమ్యతరనిలింపాంగనాప్రతతి నెల్ల
    సృష్టి యొనరించు పరమేష్ఠి చెలువు నలరి.
  10. అట్టులఁ జెక్కినట్టి ప్రతిమావళి స్తంభశిరఃప్రదేశమం
    దుట్టిపడంగ కౌశలసమున్నతి నిల్పె నతండు, తీవెకుం
    దుట్టతుదన్ సుమించిన మృదుప్రసవంబులయట్లు, స్వీయమౌ
    దిట్టతనంబు నెల్లరకుఁ దెల్లముసేయు పదంబులట్టులన్3.
  11. [3. పదము=(అడుగు)జాడ, చిహ్నము- అనగా నా శిల్పములు జక్కన కౌశలమునకుజాడలవంటివి మాత్రమే యనియు, వాని ననుసరించి అతని పరిపూర్ణపాండిత్యము నావిష్కరింపవలెనని ధ్వని.]

  12. భువనమునందు నెందునను పోలిక లేని సుమంజిమంబుతో,
    కవిత కచుంబితంబయిన కమ్రరసోత్కటభావదీప్తితో,
    దివిజలతాంగులేనియు మదిం దలపోయని భంగిమాళితో,
    నవకముమీరఁగా మలఁచె నాతఁడు దత్ప్రతిమావితానమున్.
  13. అందున నొక్కకంబమున నల్లదె మోహిని కన్నుదోయికిన్
    విందును గూర్చుచున్నయది; పీనకటిస్థలి రమ్యకాంచికా
    సుందరమై వెలుంగఁ, గడు స్రుక్కఁగ మధ్యము భూర్యురోజసం
    బంధము నోర్వలేక, తలపైనిఁ గిరీటము తళ్కులొల్కఁగన్.
  14. ఒకముగ్ధ ముకురాన నొయ్యారముగఁ జూచి
    తనచెల్వునకుఁ దానె తన్మయము నొందు,
    ఒకనారి కీరంబు నొయ్యనొయ్యనఁ బల్కి
    వల్లభున కెదొవార్తఁ బనుపంగ నెంచు,
    ఒకచెల్వ వల్వలో నున్న తేలును జూచి
    వెఱఁగునం జెఱఁగునున్ విదిలింపఁ జూచు,
    ఒకప్రోడ డాకేల నొఱపువీణియ నూని
    గ్రావమున రమ్యరాగాలు వలికించు,

    నాట్యవేదపారీణయౌ నాతి యొకతె
    తాండవాలోలయౌఁ దన్ను దానె మఱచి,
    వాద్యసంగీతనిపుణయౌ వనిత యొకతె
    మర్దలంబులఁ బలికించు మంజుఫణితి.
  15. ఆలయకుడ్యభాగములయందున నొప్పు నపూర్వరమ్యశై
    లీలలితంబులైన కమలేక్షణ, శంభు, రమా, సరస్వతీ
    శైలసుతా, రతీ,మనసిజాద్యఖిలామరమూర్తు, లుర్విలో
    నోలగముండిరో దివిజు లూర్ధ్వజగంబును వీడి యన్నటుల్.
  16. గోరక్షణార్థంబు గోవర్ధనాద్రినిం
    గేల నెత్తిన గోపబాలు నొకట,
    రెండడుగులతోడ నిండారి జగమెల్ల
    బలిమీఁదఁ గాల్మోపు వటువు నొకట,
    కాళియుఫణమందుఁ గాలూని నటియించు
    బాలకృష్ణుని నాట్యకేళి నొకట,
    వీరనృసింహావతారంబు ధరియించి
    హేమకశిపుఁ జీల్చు స్వామి నొకట,

    మోహినీరూపమును బూని మురువుమీర
    నాట్యమాడుచు భస్మదానవుని రూపు
    మాపిన మురారి మోహనరూప మొకట,
    నలువుగా మలఁచెను జక్కనార్యుఁ డచట.

  17. నల్లనిసామితోడ రమ నవ్వులుచిల్కుచుఁ గొల్వుదీఱెడిన్,
    వల్లభుతోడ నందిపయిఁ బార్వతి లోకము లేలఁబోయెడిన్,
    బల్లిదుఁడైన రక్కసుని భైరవి కాలను రాచుచుండెడిన్,
    అల్లదె నాట్యలోలయయి యందములొల్కెను శారదాంబయున్.
  18. బారకు నెక్కుడైన యసిపత్త్రశరాసన4 మూని లోకముల్
    భోరనఁ గెల్వఁగా నసమపుష్పశరుండదె సందడించె, నం
    భోరుహవక్త్ర యోర్తు ధ్వజముం గొనుచుం దనవెంట రాఁగ, నెం
    తో రహిమీరఁగా రతియుఁ దోడగుచుం దను వెంబడింపఁగన్.
  19. [4. అసిపత్త్రశరాసనము=చెఱకువిల్లు, అసిపత్త్ర మనఁగా చెఱకు.]

  20. అతులితసుందరంబులగు నా ప్రతిమావళిచే సజీవమై
    శతమఖలోకరీతిగ5 నెసంగెడి యాలయకుడ్యనిమ్నపా
    ర్శ్వతలములందునం దొలిచె జక్కన యైహికదృశ్యరాజముల్,
    ప్రతిదినలోకవృత్తముకురాయితమై గుడి వొల్చునట్లుగన్.
  21. [5. శతమఖలోకము=ఇంద్రలోకము, శతమఖుఁ డనఁగా ఇంద్రుడు.]

  22. అనుదినదృశ్యమాన వివిధాండజ, వృక్ష, లతాప్రతానినీ6,
    వనరుహ, వన్యజంతు, ఫణి, పంకరుహానన, దాసదాసికా
    జనపరిసేవితాఢ్యజనసంఘము లాదిగఁ గల్గు దృశ్యముల్
    తనదగు శిల్పకౌశలపతాకలునై తగఁ జెక్కె నచ్చటన్.
  23. [6. లతాప్రతానినీ=లతలతోఁ గూడిన పొదరిల్లు.]

  24. సన్నని మధ్యమున్, వలుదచన్నులు, తోరపు శ్రోణియుం దగన్,
    సొన్నపుఁగంటెయున్, వరకుచోపరిహారము, లొడ్డణంబులున్,
    సన్ననివల్వయుం దొడిగి, సస్మితయై యొకచెల్వ వీడ్యముం
    జెన్నుగ నందియిచ్చెనదె చేరెడుకన్నుల వల్పులొల్కఁగన్.
  25. అల్లదె పండుగోయుటకునై యరుదెంచిన దొక్క బాల7, యా
    పల్లవపాణి కోయుటకు వంచిన పండున వ్రాలె నయ్యయో
    నల్లని యీఁగ, యామెపయినం దయచేతనొ, పర్వుపర్వునన్
    బల్లియొకండు వచ్చెనదె పారణసేయఁగ మక్షికాధమున్.
  26. [ 7. బాల, పల్లవపాణి యనునవి సాభిప్రాయపదములు.]

  27. కుసుమమిషన్ హసించినవి కోమలవల్లరు, లా లతాళిలో
    నసదృశనృత్యభంగిమయుతాంగముతోడ వసంతకన్య తా
    నెసఁగుచునున్న దల్లదిగొ, యిక్షుసురాంచితపానపాత్రతో
    మిసిమివయారి యోర్తు రహిమీరఁగఁ గొల్చుచునుండఁ జెంగటన్.
  28. వామకరంబునందుఁ గొని వల్వచెఱంగును, దక్షిణంబునన్
    గోముగ నొక్కవానరము కోకను చేఁగొని యీడ్చుచుండఁగా
    రామ8 యొకర్తు కోపపరిరంజితవక్త్రము దాల్చి నిల్చెఁ, దా
    నేమి యొనర్చెనో కద హృదీశుఁడు కోమలి యిట్లు గందఁగన్?
  29. [8. రామ, కోమలి యనునవి సార్థకపదములు.]

  30. ముకురము చేతఁ బట్టుకొని, పూవులతీవియపైని వాల్చి మే
    నొక సుకుమారి యంగుళుల నొయ్యన దూరిచి ఉంగరంబులై
    చకచకలాడు కేశములఁ జక్కగఁ దీర్చుచునుండె నల్లదే
    ప్రకటము గాఁగఁ బద్మముకుళంబులఁ బోలు నురోజకుంభముల్.
  31. మును మకరేంద్రునుండి పరిపూర్ణదయారసవృష్టిఁ గాచెఁబో
    మన కరిరాజుఁ గేశవుఁడు, మాన్యుఁడతం డగునంచు నెంచి యా
    ఘనరుచిరాంగునిన్ సతముగాఁ గడనుండి భజించుచుండెనో
    యన ద్విపసంతతుల్ వెలసె నాలయభిత్తికలందు నందమై.
  32. ఎంతటి పక్షపాతమొ రమేశ్వరుఁ9 డల్పపుపంకజంబులన్
    సంతత మూను బొడ్డునను, చక్కని హస్తములన్, శిరంబునం
    దింతకు మేము జాలమొకొ? హేతు వెఱుంగుదమంచు వచ్చెనో
    పంతముఁ బూని నా వెలసె భాసురకుడ్యములందు నెల్లెడన్
    వింతలువింతలౌ లతలు, విచ్చినపూవులు, గోరకంబులున్.
  33. [9. ఈ పద్యములో రమేశుడు, పంకజము (బురదలో పుట్టినది) అను పదములు సాభిప్రాయపదములు.]

  34. ఒకచెంత భాగవతోదంతముల్ దెల్పు
    శిల్పసంతతు లెన్నొ చెన్నుమీర,
    ఒకపొంత రామాయణోత్కృష్టగాథలన్
    వివరించు ప్రతిమాళి వేడ్కగొల్ప,
    ఒకప్రక్క యక్షిణీసుకుమారలీలలన్
    వర్ణించు శిల్పముల్ పరిఢవిల్ల,
    ఒకదిక్కు గ్రామీణయువతీయువకవృత్త-
    ముకురంబులౌ మూర్తి నికరమొప్ప,

    ఒక్కయెడఁ దురంగారూఢయోధగణము,
    లొక్కకడ హంసహంసికాయూథములును,
    కొమరుమీరంగ, మందిరకుడ్య మలరు
    నఖిలసృష్టికిఁ బట్టిన యద్ద మనఁగ.