తే.గీ.
క్రోధి* యను పేరు గల్గినం గోపపడక
మక్కువను నిత్యసౌఖ్యంబు మాకుఁ గూర్చి
ఆదుకొనవయ్య మమ్ము నవాబ్దవర్య!
త్యక్తమొనరించి నీ అభిధార్థమెల్ల!
(*క్రుధ క్రోధే అను క్రుధ ధాతువునుండి జనించిన క్రోధిన్ శబ్దానికి కోపముగలవాఁడని అర్థము)
తే.గీ.
చిత్రముగ మున్ను దాల్చిన పత్రవస్త్ర
ములకు మారుగ తెలిమంచు పుట్టములను
గట్టియున్నట్టి తీవియకన్నెలెల్ల
మఱల హరితశాటులఁ గట్టు తరుణ మొదవె.
కం.
కడచిన వత్సరమందలి
యిడుమలు నవ్యాబ్ద! నీదునేల్బడియందున్
విడిపోయి మాదుబ్రతుకులఁ
బొడసూపుత భవ్యసౌఖ్యపుష్పోదయముల్!
ఉ.
లేవిట మావిపిందెలును, లేవిట యిక్షురసంపునూటలున్,
లేవిట మోదుగుంబువులు, లేవిట కోకిలగానగోష్ఠులున్,
లేవివియంచుఁ గుంద పనిలేదు, నిసుంగుల ముద్దుమాటలున్,
భావుకమిత్రవాక్యములె, భామలపాటలె లోటుఁ దీర్చెడిన్
ఉ.
విచ్చును సత్వరంబుగనె వింతగురంగులపూలు తోఁటలన్
పచ్చతివాచియో యనఁగఁ బ్రాంగణసీమలఁ బర్వు ఘాసమున్
పచ్చని డ్యాఫొడిల్ కనుల పండువుసేయుచు విచ్చు నెల్లెడన్,
ఇచ్చటి భూమి యింక వహియించునునూత్నమనోజ్ఞరూపమున్
సీ.
స్వాగతింపుఁడు నూత్నవత్సరాధీశునిన్ శుభహారతులతోడ సుదతులార!
అర్చింపుఁ డర్ఘ్యపాద్యాచమనార్పణంబులతోడ ముదమార పురుషులార!
ప్రణమించుఁడీ భావిభాగ్యైకసంప్రాప్తికై భక్తితో పిల్లకాయలార!
స్తవియింపుఁ డీ క్రోధి యవతారమూనిన సుజనునిం జేరి సర్వజనులార!
తే.గీ.
కాలకర్మంబులను మీరఁ గాదు తరము
బ్రహ్మకేనియు నా పరాత్పరునికేని
అందుచే నబ్దరూపుఁడై యలరువాని
కాలపురుషుని నర్చించి కనుఁడు సుఖము!
రచయిత తిరుమల కృష్ణదేశికాచార్యులు గురించి:
డా. తిరుమల కృష్ణదేశికాచార్యులు ప్రముఖ కవి, పద్యనాటక కర్త. ఆధునిక సాహిత్యంలో పద్యరచనతో పాటు అనేక అరుదైన ఛందోరీతులను ప్రయోగించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశారు. వీరు రచించిన హనుమప్ప నాయకుడు – రాయలసీమ ప్రాంతానికి చెందిన చారిత్రక వీరుని ఇతివృత్తంగా 1986లో రాసిన పద్యకావ్యం. మహాశిల్పి జక్కన చరిత్రము, శిల్పకళా వైభవాన్ని, జక్కన జీవితాన్ని వర్ణిస్తూ సాగిన పద్యకావ్యం.ఇతర రచనల్లో ‘ఋతుసంహారము’ (కాళిదాసు రచనకు అనువాదం), ‘గానభారతి’, ‘పూర్వప్రయోగచంద్రిక’ ముఖ్యమైనవి. సాహిత్యంలో నిష్ణాతులైన వీరు పద్యరచనలో నూతనవృత్తాలను (వసంత కోకిల, నయాగరా, మనోరమా మొదలైనవి) సృష్టించి ఛందోవైవిధ్యాన్ని ప్రదర్శించారు.
...
పూర్తిగా »