ఆ గోడకు ఒక కిటికీ ఉండేది!

[ఈ సంవత్సరం జ్ఞానపీఠ్ అవార్డ్ ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన వినోద్‌కుమార్ శుక్లాకు లభించింది. ఈ సందర్భంగా ఆయన రాసిన ‘దీవార్ పర్ ఏక్ ఖిడికీ రహతీ థీ’ అనే హిందీ నవల గురించి భారతీయ నవలా దర్శనం అన్న పుస్తకంలో వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు రాసిన వ్యాసాన్ని ఈమాట పాఠకులకోసం పునర్ముద్రిస్తున్నాం. అడిగిన వెంటనే ఈ వ్యాసాన్ని అందజేసిన రచయిత్రికి మా ధన్యవాదాలు – సం.]

‘దీవార్ పర్ ఏక్ ఖిడికీ రహతీ థీ’ అనే హిందీ నవలకు 1999లో కేంద్ర సాహిత్యఅకాదెమీ అవార్డు లభించింది. రచయిత వినోద్‌కుమార్ శుక్లా కవి కూడా. మరెన్నో అవార్డులు కూడా పొందినవాడు.

ఈ నవలను అనువదించిన మలయశ్రీగారు దీన్ని హాస్యసంభాషణలతో, సామాన్య జన జీవన, మానసిక విశ్లేషణతో నిండిన నవలగా పేర్కొన్నారు. అంతకన్నా ఇంకేమీ చెప్పలేదు. అనువాదవిధానంలో తాను అవలంబించిన తన విధానాలేవో రాశారు తప్ప నవల గురించి ఏమీ చెప్పలేదు. హిందీ మాతృకలోనే ముందుమాట రాసిన విష్ణుఖరే అనే విమర్శకుడు కూడా ఈ నవలకు సంబంధించిన లోతయిన విమర్శ ఏదీ చెయ్యలేదు. అట్టవెనుక రాసిన నాలుగు వాక్యాలలోనూ ‘దాంపత్య జీవనంలోని మాధుర్యాన్నీ, భావావేశ బంధాలనూ చిక్కనైన హాస్యమిళిత పాత్రలద్వారా పాఠకులకందించారు ఈ నవలలో’ అని మాత్రమే ఉంది.

కానీ ఈ నవల చదువుతూ చదువుతూ కొంత దూరం వచ్చిన తర్వాత ఇది ఒక వింత నవలగా అనిపించింది. మరి కొంత ముందుకు జరిగాక తప్ప ఆ వింత అర్థం కాలేదు. అర్థమయిన తర్వాత ఈ నవల ప్రత్యేకత ఏమిటో తెలిసింది. ఆ ప్రత్యేకతే దీనికి కేంద్ర సాహిత్య అకాదెమీ పురస్కారానికి అర్హత కలిగిన దానిగా చేసింది.

నవలలో నిజానికి కథ ఏమీ లేదు. కేవలం దైనందిన జీవనవర్ణన. రఘువర ప్రసాద్ డెబ్బయివేల జనాభా వున్న పట్టణంలో ఒక కాలేజీ లెక్చరర్. ఆ కళాశాల పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది స్థాపించి మూడు సంవత్సరాలు మాత్రమే అయ్యింది. అతనికి నెలకు ఎనిమిదివందల రూపాయల జీతం. ఈ కథ 1999లో రాసినది అని గుర్తు పెట్టుకోవాలి. రఘువరప్రసాద్ గణితశాస్త్రంలో లెక్చరర్. ఆ కళాశాలలో ఇతనికంటే సీనియర్ మరొకడు ఉన్నాడు. ఆయన డిపార్ట్మెంట్ హెడ్. అంటే విభాగాధ్యక్షుడన్నమాట. అతను ఇతనికన్నా వయసులో పెద్దవాడు. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను రఘువరప్రసాద్ తాలూకు మంచి చెడులు చూస్తుంటాడు.

రఘువరప్రసాద్‌కు కొత్తగా పెళ్ళయింది. తమ గ్రామం నుంచి అతని భార్యను అతని తండ్రి తీసుకొచ్చి వదిలి వెళ్ళాడు. రఘువరప్రసాద్‌కు ఒక తమ్ముడున్నాడు. తల్లి, తండ్రి, తమ్ముడు తమ గ్రామంలో ఉంటారు. ప్రతినెలా అతను తన జీతం నుంచి కొంత డబ్బు ఇంటికి పంపవలసి ఉంటుంది. అందువల్ల ఒకే ఒక గదిలో కాపురం ఉంటాడు. పక్కనున్న రెండుగదులలోనూ రెండుకుటుంబాలు ఉంటాయి.

కొత్త పెళ్ళికూతురు వచ్చి ఇంట్లో దీపం వెలిగించి, వంట చేసింది. ఆనాడు అతడు. కళాశాలనుంచి వచ్చేసరికి ఇంటి ముంగిట హడావిడి. ఇంట్లో తన భార్య ఉన్న ఛాయలు కనిపించాయి.

చిత్రంగా ఆరోజు ఉదయం అతను కళాశాలకు వెళ్ళడానికి ఎప్పటిలాగే టాంగా కోసం ఎదురుచూస్తూ ఉంటే ఆ దారివెంట ఒక సాధు ఒక ఏనుగును తోలుకుంటూ వచ్చాడు. అతడు రఘువరప్రసాద్‌ను ఏనుగుమీదకు రమ్మని, కళాశాల దగ్గర దింపుతానని అన్నాడు. రఘు మొదట సంకోచించాడు. కానీ తర్వాత ఎక్కాడు. అందరూ వింతగా చూశారు. కానీ అతనికి ఈ అనుభవం ఎంతో బావుంది.

డిపార్ట్మెంటెడ్కి స్కూటర్ ఉంది. మిగతా వాళ్ళు ఆటోలలోనూ, టాంగాలలోనూ వెళ్తుంటారు. అవి ఎప్పుడూ కిక్కిరిసి ఉంటాయి. రఘుకి సైకిలుకూడా లేదు. ఇటువంటి పరిస్థితిలో అతనికి ఈ ఏనుగు వాహనం దొరికింది. ఆరోజు ఇంటి దగ్గర అతను ఏనుగుమీంచి దిగేసరికి భార్య కొత్తగా కాపురానికి వచ్చి ఉంది.

ఆ రాత్రి అతని తండ్రి తిరిగి తమ గ్రామానికి వెళ్ళిపోయాడు. రఘువరప్రసాద్ తండ్రిని బస్ ఎక్కించి వచ్చి భార్యతో చనువు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆమె అతనితో మాటలు కలిపింది. అన్నీ చిత్రమైన మాటలు. మరో ప్రపంచం తెరుచుకుంది.

‘మనం పక్షులుగా మారి ఎగిరిపోదాం’ అంటుంది ఆమె. ‘ఎక్కడ ఆరునెలలు రాత్రిగా ఉంటుందో అక్కడికి’ అని అతను అన్నాడు. అప్పుడు ‘పిట్టలు మనం లేవడం కోసం ఎదురుచూస్తూ ఉంటాయి’ అని ఆమె అంది. ఇలాంటి మాటలతో నిద్రపోయి. లేవగానే అతనికి తమగది కిటికీరెక్కలు తెరచి ఉండడం కనిపించింది. ఆ కిటికీ బైట నుంచి చిన్న పిల్లలు పిలుస్తున్నారు.

అతను లేచి చూశాడు. రాత్రి కిటికీరెక్కలు వెయ్యడం మరచిపోయాడు. కిటికీకి ఊచలులేవు. అవతలనుంచి పిల్లలు మేకపిల్లని చూద్దామని పిలుస్తున్నారు. రఘు భార్యను లేపాడు. ఆమె కూడా చూద్దామంది. కిటికీలోంచి ఇద్దరూ బయటికి దూకారు.

ఆపై అదంతా వేరే ప్రపంచం. ఒక పెద్ద రావిచెట్టు. గాలికి రావిఆకుల గలగల. పేడతో అలికిన నున్నటి కాలిబాట. ఇంతలో ఏనుగు వచ్చిందనే పిలుపు విని వెనక్కి కిటికీలోంచి ఇంట్లోకి వచ్చి కాలేజీకి వెళ్ళిపోయాడు.

ఆ మరునాడు అతను తన హెడ్‌ను ఇంటికి పిలిచాడు. ఇంటికి వచ్చాక కిటికీలోంచి అతన్ని బయటకు తీసుకువెళ్ళాడు. భార్య అప్పటికే కిటికీ బయటకి వెళ్ళి చెట్టుకింద రాలిన మామిడికాయలు ఏరుతోంది. ఆమెను పలకరించి, దాటి మరింత ముందుకు వెళ్ళారు. ఆ కాలిబాటలు, చెట్లు, చల్లటి గాలి, మర్రిచెట్లు, రావిచెట్లు, చల్లటి నీళ్ళతో ప్రవహించేనది. దాని ఒడ్డునే చిన్న చాయౌ కొట్టు. అక్కడ ఒక ముసలి అవ్వ వీళ్ళనిద్దర్నీ పిలిచి వేడి వేడి చాయ్ ఇచ్చింది… అప్పుడు హెడ్ రఘుతో ‘ఇంత అందమైన ప్రదేశం ఉందని నాకు ఎప్పుడూ తెలీదు’ అంటే రఘు ‘అవునుసార్. నాకూ తెలీదు. పెళ్ళి అయిన తర్వాతనే ఇక్కడికి వచ్చాను. అప్పుడు తెలిసింది. సోన్సీ వచ్చాక పూర్తిగా తెలిసింది’ అంటాడు. సోన్సీ అతని భార్య.

మర్నాడు హెడ్ తన భార్యను, పిల్లల్ని తీసుకొని వచ్చాడు. వాళ్ళని కూడా కిటికీలోంచి తీసుకువెళ్ళి ఆ సుందరప్రదేశం చూపించాలని చూపిస్తానని కూడా వాళ్ళకి చెప్పాడు. కానీ గదికి తాళం వేసి ఉంది. రఘు, భార్య లేరు. హెడ్ ఇంటి వెనకకు వెళ్ళి చూశాడు కిటికీలోంచి వెళ్ళింది ఇంటి వెనక్కే కదా అని. కానీ ఇంటి వెనుక ఆ ప్రదేశం లేదు. పెంటకుప్పలూ అవీ తప్ప.

ఆ మర్నాడు కూడా అతను ఆ ప్రదేశంకోసం ఆ ప్రాంతం అంతటా వెతికాడు ఎక్కడా కనిపించలేదు.

రఘు, సోన్సీమాత్రం తరచుగా కిటికీలోంచి దూరి ఆ చెట్లలోంచి కాలిబాట వెంట నడిచి కొలను చేరి అక్కడ స్నానాలు చేస్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ రాత్రింబ గళ్ళు గడిపివస్తుంటారు. ముసలి అవ్వ వేడి వేడి టీ ఇస్తూ ఉంటుంది.

ఒక్కొక్కమాటు సోన్సీ ఒక్కతే వెళ్తూ ఉంటుంది. అలా ఒకసారి వెళ్ళినప్పుడు ఆ అవ్వ ఆమెకు బంగారుకడియాలు బహుమతిగా ఇస్తుంది. ఒకసారి రఘు తల్లిదండ్రులు వచ్చినప్పుడు రఘు, సోన్సీ వారిని కిటికీలోంచి అవతలికి పంపుతారు. బలవంతం మీద వెళ్ళినా వెళ్ళాక ఆ పెద్దవాళ్ళిద్దరూ తమ జీవితం కొత్తగా ఉత్సాహంగా, సంతోషంగా మారడం గమనిస్తారు.

రఘు ఏనుగుమీదే కాలేజీకి వెళ్తుంటాడు. కానీ ప్రిన్సిపాల్, హెడ్ కలిసి అభ్యంతరం చెప్తారు. విద్యార్థులకు ఏనుగువల్ల హాని కలుగుతుందని, రావద్దని వారిస్తూ ఉంటారు. ఎవరో మరచిపోయి వదిలేసుకున్న సైకిల్ ఇచ్చి దానిని వాడుకోమంటారు. రఘు ఆ సైకిల్ మీద తిరుగుతూ ఆ పాతసైకిల్ వల్ల ఇబ్బందులు పడుతూ, ఏనుగుమీద ఎక్కకుండా తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ ప్రయాసపడుతూ ఉంటాడు. చివరకు ఆ సైకిల్నే వదిలిం చుకొని ఏనుగుతోటే అనుబంధం పెంచుకుంటాడు.

సైకిలయితే తాళం వెయ్యాలి. లేకపోతే పోతుందని భయం. ఏనుగును కట్టవలసిన అవసరం లేదు. ఎక్కడికీ పోదు. ప్రమాదం అంత పెద్ద ఏనుగు వల్లనేనా ఉండవచ్చు. చిన్న పక్షివల్ల కూడా ఉండవచ్చు. చిన్న పక్షి ఢీకొనడం వల్ల పెద్ద విమానమే కూలిపోవచ్చు అనుకుంటాడు రఘు.

సోన్సీ ఎంతో అనుకూలవతి అయిన భార్య, కోడలు కూడా. కానీ చివరకు ఆమె అత్తవారి యింటికి వెళ్ళి తమ మామగారి పాత సైకిల్ను బస్మీద వేసుకుని తీసుకొస్తుంది. ఆ సైకిల్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చి గుమ్మం దగ్గర పెట్టి తాళం వేస్తుంది. మధ్యరాత్రి ఒకటి, రెండుసార్లు లేచి ఉన్నదో, లేదో అని భార్యాభర్తలిద్దరూ పరీక్షించుకుంటారు. నవల పూర్తి అయిపోయింది. చివర ఒక వాక్యం ఉంటుంది. ‘రఘువరప్రసాద్ ఇంటి ముందున్న వేపచెట్టు తనను ఎవరూ వదిలిపెట్టిపోలేదు అన్నట్టు నిలిచి ఉంది. విభాగా ధ్యక్షుడు తన తొందరలో వెళ్ళిపోతూ ఆ వేపచెట్టును గమనించి ఉండకపోవచ్చు’. ఇలా నవల ముగిసింది.

ఇందులో ఏనుగు గురించి రచయిత ఇలా రాస్తాడు. ‘ఈ భూగోళం ప్రపంచారంభకాలంలో నెమ్మదిగా చలించేది. అప్పుడు ఏనుగు తూగుతూ మెల్లగా సంచరించేది. ఇప్పటికీ ఏనుగు మొదటిలాగే నెమ్మదిగా నడుస్తోంది. లోకంతో పాటుగా ఇప్పుడు అది ఉండనీ ఉండకపోనీ, కానీ, ఏనుగుతోపాటు లోకం ఇప్పుడూ ఉంది. ఆ ఏనుగులోకంలోనే రఘువరప్రసాద్ కూడా చేరిపోతున్నాడు’

స్థిమితంగా, నిదానంగానే సాగే జీవనానికి ఏనుగును ప్రతీకగా భావించవచ్చునేమో. మరోచోట ఏనుగుకి సంబంధించిన మరో కథ రాస్తాడు. పూర్వం ఒక రాజు ఆకుకూర కొనడానికి బజారుకి వచ్చాడట. అందరూ తమ అంగళ్ళను వెనక్కి జరుపుకుని ఏనుగు రావడానికి దారిని విశాలం చేశారట. రాజు ఒక కూరగాయల అమ్మి ముందుకు సంచిని విసిరితే ఆమె కూరగాయలు వేసి ఏనుగుకు అందించింది. రాజు పైసలు ఏనుగుద్వారా అందించాడు. ఈ ఇచ్చి పుచ్చుకోవవడానికి వెనుక అంత పెద్ద ఏనుగు, దాని పాత్ర ఉన్నాయి.

ఈ కథ ద్వారా కూడా రచయిత ఏనుగును ఒక గంభీరంగా సాగే స్థిమితమైన జీవితానికి ప్రతీకగా చెప్పుకున్నాడు.

లోకం అంతా స్కూటర్లమీద, టాంగాలమీదా, ఆటోలమీదా కనీసం సైకిళ్ళమీద ప్రయాణిస్తున్న కాలంలో రఘువరప్రసాద్ ఏనుగుమీద ప్రయాణించడానికి ఆసక్తి చూపెడు తున్నాడు. ఇది ఒక ప్రతీక.

మరొకటి గణితశాస్త్రాధ్యాపకుడయిన రఘువరప్రసాద్ బ్లాక్బోర్డుమీద రెండుచేతుల తోనూ రాయగలడు. ఎడమచేతితో మొదలు పెట్టి సుద్దముక్కను కుడిచేతిలోకి మార్చుకుని కుడిచేతితో రాస్తాడు. అది ఎంత త్వరగా చేతులు మారేదంటే విద్యార్థులెవరూ కనిపెట్టలేక పోయేవారు. మొత్తం మీద రఘువరప్రసాద్కు రెండు చేతులూ కుడిచేతులే అనవచ్చు అంటాడు రచయిత.

అతన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఆ కిందిమధ్యతరగతి జీవనంలోనే ఆనందాన్ని పొంద గలుగుతూ అనుకూలంగా ఉంటుంది అతని భార్య సోన్సీ.

ఇటువంటి వారి ఇంటిలోపలి గోడలోంచి ఒక కిటికీ తెరుచుకుంటుందనీ, ఊచలు లేని ఆ కిటికీలోంచి దూకి అవతలికి వెళ్ళగలిగితే కేవలం ప్రకృతినుంచి లభించే సహజీవనపు ఆనందం దొరుకుతుందని, అది రోజు రోజుకూ పెరుగుతూ దానిని మరింత నవనవం చేస్తుందనీ రచయిత వాస్తవాన్ని మాంత్రికతతో జోడించి చెప్పాడు. అక్కడ జానపదకథలలో కనిపించే ముసలి అవ్వ ఆమె ఇచ్చే బంగారుమురుగులు ఒక మేజిక్. ఆమె అందించే వేడి వేడి టీ వాస్తవం.

ఈ ప్రశాంతసుందరజీవనపార్శ్యం హెడ్‌కు రఘువరప్రసాద్ వెంట వెళ్ళడం వల్ల కనిపించింది. మళ్ళీ తన భార్య పిల్లలతో కలిసి ఇరుకయిన తన ప్రాపంచికజీవనంలోంచి చూద్దామంటే కిటికీ కనపడలేదు సరికదా తలుపుకి తాళం కూడా వేసి ఉంది. ఊరంతా వెదికినా ఆ ప్రదేశం ఎక్కడా కనపడలేదు. అంటే అది రఘువరప్రసాద్ ఇంటి చుట్టుప్రక్కల గానీ ఇంటి వెనుక గానీ లేదు. ఆ ఇంటిగది గోడకున్న కిటికీలోంచి దూకివెడితే మాత్రమే కనిపిస్తుందన్నమాట.

రఘువరప్రసాద్ తన తల్లి తండ్రులను కూడా మానసికంగా సంసిద్ధం చేసి పంపిం చాడు. అందువల్ల వారు కూడా ఆ నిసర్గమైన ఆనందం అనుభవించగలిగారు.

సోన్సీ సైకిలు తీసుకురావడంతో కథ అయిపోయింది. వాళ్ళ జీవితంలో ఇక ఏనుగు లేదు. యంత్రంసంబంధమైన వేగం ప్రవేశించింది. ఇప్పుడు నవలకు రచయిత పెట్టిన పేరు గుర్తు చేసుకోవాలి ‘ఆ గోడకు ఒక కిటికీ ఉండేది’. అంటే ఇక లేదన్నమాట. మాయ మైపోయింది.

జీవితంలోకి యంత్రాలద్వారా, అధికధనం ద్వారా ప్రవేశించిన వేగం జీవన మాధుర్యాన్ని, స్థిమితాన్ని, నిదానాన్ని, గాంభీర్యాన్ని ఎలా హరించి వేస్తోందో రచయిత ఈ నవలలో ఒక కొత్త రచనావిధానం ద్వారా చెప్తారు.

ఈ కొత్తవిధానాన్ని మనం ‘మేజికల్ రియలిజం’ అనవచ్చునేమో? లాటిన్అమెరికాలో పుట్టి యూరోపియన్ సాహిత్యమంతటా నిండిన ఈ కొత్తవిధానాన్ని వినోద్‌కుమార్ శుక్లా ఎంతో ఒడుపుగా ఈ నవలలో ఉపయోగించుకున్నట్టు కనిపిస్తుంది.

తెలుగులో దీన్ని మాంత్రికవాస్తవికత అనాలేమో! గోడకు కిటికీ – కిటికీలోంచి దూకితే వచ్చే మరో లోకం, అక్కడి చిత్రమైన సంగతులు. ఇదంతా మాంత్రికతే. ఈ అభూతకల్పనని ఒక కఠోరవాస్తవాన్ని చెప్పడానికి ఉపయోగించుకున్న విధానమే ఈ నవలకు ఒక ప్రత్యేకతను తీసుకువచ్చింది.

మనుషులు తమలో తాము విడిపోతూ కట్టుకున్న గోడలకూ, ప్రకృతిలోని అందం నుంచి, ఆహ్లాదకత్వం నుంచి విడిపోతూ తమ చుట్టూ కట్టుకుంటున్న గోడలకూ కిటికీల యినా ఉండాలని, ఆ కిటికీలకు చువ్వలు ఉండకూడదని, కిటికీ తలుపులు తెరిచే ఉండాలని రచయిత మ్యాజికల్ రియలిజం పద్ధతిలో ఈ నవల ద్వారా చెప్పడం కనిపిస్తోంది.

అనవసరంగా పెరుగుతున్న జీవనవేగాన్ని ప్రశ్నించడం సమకాలీన భారతీయ నవలలన్నింటా మనం చూస్తున్నాం. ఇది మానవసంబంధాలను దెబ్బతీస్తున్న విధానాన్నే ఆయా రచయితలంతా ప్రశ్నించడం ఈ నవలల్లో కనిపిస్తోందన్నది సత్యం.