మహితతెలగాణదేశంపు మకుటమైన
పాలమూరుజిల్లా హారవజ్రమైన
భవ్యబల్మూరుపురమందు ప్రభవమంది
నాఁడ, సిసలైన తెలగాణవాఁడ నేను!
భక్తపోతన భాగవతపద్యసరసిలో
హంసమై విహరించి యలరినాఁడ,
పాల్కుర్కిసోమన్న బసవపురాణస్థ
మణులఁ జూఱఁగొనంగ మరగినాఁడ,
అద్వితీయకవిత్రయాంధ్రభారతవనిన్
మలయు సౌరభముల వలచినాఁడ,
పెద్దన,మూర్తికవీంద్రుల సత్ప్రబం
ధరససుధం గ్రోలి తనిసినాఁడ,
మల్లినాథుని వ్యాఖ్యానమహిమ నెఱిఁగి
నాఁడ, మహితవిద్యానాథ నాటకరస
లక్షణాన్వితసంస్కృతగ్రంథసరణిఁ
దెలిసినాఁడను, నిండగు తెలుఁగువాఁడ!
శ్రీశైలమల్లన్న శిరమందుఁ జెలువొందు
స్వర్ణదీతీర్థంపు చలువఁ గంటి,
భద్రాద్రి రామన్న పాదతీర్థంబును
శిరమందుఁ దాల్చెడు వరము గంటి,
శేషాద్రి వెంకన్న శ్రీకరాభయహస్త
వాసిలో సౌభాగ్యపథము గంటి
సింహాద్రి అప్పన్న శ్రీచందనాలేప
లేశంబుఁ గనులందుఁ బూసికొంటి
అట్లు తెలగాణరాయసీమాంధ్రధరణి
జనులకెల్లను సౌభాగ్యజనకులైన
దైవతతులను గొల్చి భద్రంబుఁ గంటి,
తెలుఁగువాఁడఁ, దెలంగాణపొలమువాఁడ!
చరితము, సంస్కృతి న్మఱియుఁ జక్కనిబాసనెఱుంగనట్టి యొ
క్కరుఁడొనరించినట్టి పలుగాకిపనిం గణుతించి పెద్దగా
నరయక ముందువెన్కలను నాంధ్రము రెండుగఁ జీల్చు యత్నముల్
బిరబిరఁ జేయుచుండిరట! భీరువులై భరతోర్వినాయకుల్.
అనియెడు వార్త నన్నశని యట్లు గలంచఁగ నట్టి దుఃస్థితి
న్మనమునఁ జాల చింతన మొనర్చి వెలార్చుచునుంటి మత్ప్రఘో
షను, దెలగాణ సోదరుల స్వాంతములందున నూత్నబోధమున్
మునుకొనఁ జేయ నీయతనమున్ మునుముందుగఁ ద్రుంచివేయఁగన్.
కుక్కలు చింపిన విస్తరి,
ముక్కలుగాఁ గొట్టఁబడిన ముకురమువోలెన్
చక్కని రాష్ట్రముఁ జీల్తురె
ఒక్కని స్వార్థముకొఱకయి యోరిమి కఱవై!
అల త్రిలింగపదభవంబు తెలగపదము;
ఆణె మన దేశమగుఁ, గాన నర్థమగు న
ఖండతెలుఁగుధరకుఁ దెలంగాణమనఁగ
నిది యెఱుంగక విభజింప నెంతు రేల?
ఇట్టి తెలగాణ మందె వసించుచుండి
లేదు తెలగాణరాష్ట్రంబు లేదటంచు
హస్తగతదీపకాంతుల నరయలేని
అంధులంబోలె నూరక యఱతురేల?
దక్షిణాపథమందు విస్తారతమము,
అన్యరాష్ట్రాల కీర్ష్యావహంబునైన
ధరణిఖండంబు ఖండింపఁ దలఁతురేల?
కూర్చొనిన కొమ్మనే కొట్టుకొందురేల?
ఆంధ్ర, సీమ,తెలంగాణ మనెడు మూఁడు
కన్నులం గూడి, మృడుపత్ని కరణి నొప్పు
నాంధ్రి, యందొక్క నయనంబు నపచయింపఁ
దలఁతురే సుంత పాపచింతనము లేక?
హరిహరబుక్కరాయ లను నాంధ్రచమూపతు లోరుగంటివా
రురుతరతెన్గువైభవసముద్ధరణవ్రతు లానెగొందిలో
పురవరమొండు గట్టిరదె పొల్చెను ద్రావిడకన్నడాంధ్రరా
జ్యరమకు నద్వితీయనిలయంబయి, తత్కథ నాత్మఁ దల్పరే!
అట్లు తెలగాణయోధుల అతిశయంబు
రాజ్యములఁ గూర్చుటందగు; త్యాజ్యమగును
రాజ్యములఁ గూల్చు కార్యవర్తనము వారి
కిదియుఁ జింతింప కిటు కలహింతురేల?
ఒక భాగం బభివృద్దిఁ జెందె మఱి వేఱొక్కండు భాగంబునన్
వికలంబయ్యెను వృద్ది యంచు విషయం బిష్టానుసారంబుగా
శకలంబుల్ పొనరించినం గలుగునే సర్వత్రమౌ వృద్ధి? యీ
వికటాలోచనలం ద్యజించి మనుఁడీ వియ్యాలవారిం బలెన్.
ఊరక యుంటిరేల? విబుధోత్తములార! పరిక్రమించుఁడీ!
తీరని ముప్పుదెచ్చిరి మతిం దలక్రిందుగ నూహసేయు పా
ర్టీరథచోదకుల్, వివిధరీతుల వారల స్వార్థచిత్తసం
స్కారములం బ్రజావళికి స్పష్టము సేయఁగ రండురండిఁకన్.
అరివశమైన రాజ్యమును నాదుకొనం జను తిక్కనార్యునిన్
పురమును ముట్టడించు నరిభూపు మరల్చిన పెద్దనార్యునిన్
కరణములందు వాక్కులను గాఢముగాఁ దలపోసి యట్ల యాం
ధ్రరమకుఁ గూడినట్టి విపదం దొలఁగింపఁగ రండు సత్కవుల్!
గుండ్లకమ్మయు నంతె, గోదావరియు నంతె,
సమభావయుతమైన స్వాంతములకు,
కృష్ణవేణియు నంతె, కిన్నర సానియు
నంతె, సంయమనయుతాంతరులకు,
తుంగభద్రయు నంతె, దుందుభీనది యంతె,
ప్రాంతభేదములేని పండితులకు,
వేగవతియు నంతె, పెన్నానదియు నంతె,
స్థలభేద మెంచని సజ్జనులకు,
ఆంధ్రమెంతొ,తెలంగాణమంతె, రాయ
సీమ యెంతయొ, శేషాంధ్రసీమ యంతె,
కాన భేదభావము లేక కలసిమెలసి
దేశవృద్ధికిఁ బూనుఁడో తెలుఁగులార!
[తెలగాణెము, తెలగాణము, తెలంగాణము అనునవి సమానార్థకములు; తెలగ+ఆణెము, లేదా తెలుంగు+ఆణెము= =తెలుఁగుదేశము, తెలగ యనునది త్రిలింగశబ్దభవము. “ఆణె మనగ దేశాహ్వయంబు” – అని ఆంధ్రభాషార్ణవము. కాలక్రమమున తెలగాణెమే తెలగాణముగను, తెలంగాణముగను మారి ఇక్కాలమున తెలంగాణమను పేరు రూఢియైనది. శాసనములందు “తెలుంగాణె” మని వ్రాయఁబడినది.]