కావ్యరసములలో శృంగారమును రసరాజముగా లాక్షణికు లంగీకరించియుండుట సర్వజనవిదితమే. ఇట్టి శృంగారరసమునకు ఆలంబనములు నాయికానాయకులు.
నాయికానాయకుల యొక్క చక్షుష్ప్రీతి, మనస్సంగములవల్ల కలుగు మనోవికారమే రూఢమై శృంగారరసముగా పరిణమించును. దీనికి పరిసరములందలి సురభిళానిల సుందరోద్యాన చంద్రికాదిసన్నివేశములును, పరస్పరాభిహితమైన ఆహార్యాంగహార చేష్టాదులును ఉద్దీపకములుగా లాక్షణికులు గుర్తించినారు. ఇవన్నియు అనురక్తులైన నాయికానాయకుల అనుభవమం దున్నవే. వీనినే లాక్షణికులు సిద్ధాంతీకరించినారు. నాయికావిషయప్రసక్తిలో ఆసక్తికరమైన విషయము అష్టవిధశృంగార నాయికావర్గీకరణము. ఇది నాయికా తాత్కాలిక మనోధర్మ వర్గీకరణమే కాని, నాయికాప్రకృతి వర్గీకరణము కాదు. అనగా ఒకే నాయిక తత్తత్కాలమనోధర్మము ననుసరించి, ఈ అష్టవర్గములలో ఏదో యొక వర్గమునకు చెంది యుండుననుట. కావ్యాలంకారసంగ్రహములో ఈ శృంగారనాయికల లక్షణము లిట్లు చెప్పబడినవి:
సీ.వరుఁడు కైవసమైన వనిత స్వాధీనభ
ర్తృక; ప్రియాగమవేళ గృహముఁ,దనువు
సవరించు నింతి వాసకసజ్జ; పతిరాక
తడవుండ నుత్కంఠఁ దాల్చునింతి
విరహోత్క; సంకేత మరసి, నాథుఁడు లేమి
వెస నార్తయౌ కాంత విప్రలబ్ధ;
విభుఁడన్యసతిఁ బొంది వేఁకువ రాఁ గుందు
నబల ఖండిత; యల్క నధిపుఁ దెగడి
గీ. అనుశయముఁ జెందు సతి కలహాంతరిత; ని
జేశుఁడు విదేశగతుఁడైనఁ గృశతఁ దాల్చు
నతివ ప్రోషితపతిక; కాంతాభిసరణ
శీల యభిసారికాఖ్యయై చెలువు మెఱయు.
(అర్థము సులభము; అనుశయము=పశ్చాత్తాపము)
పై పద్యములో ఈ అష్టవిధనాయికల పేర్లు సాంద్రాక్షరములతో గుర్తింపబడినవి. మార్చినెల యందలి ఈమాటలో వాసకసజ్జికా, విరహోత్కంఠితా లక్షణములను గుఱించి కొంత వివరించినాను. ఇప్పుడు ఖండిత, కలహాంతరిత నాయికలనుగుఱించి వివరించి, వారి మనోధర్మములను ప్రతిబింబించునట్లుగా నేను వ్రాసిన గీతమును శ్రవ్యమాధ్యమములో ప్రదర్శింతును. ఇదియే ఈ వ్యాసము యొక్క ఆశయము.
ఖండిత
నీత్వాఽన్యత్ర నిశాం ప్రాతరాగతే ప్రాణవల్లభే|
అన్యాసంభోగచిహ్నై స్తు కుపితా ఖండితా మతా||
అని విద్యానాథుని ప్రతాపరుద్రీయములో ఖండిత నిర్వచనము. ‘రాత్రియంతయు అన్యకాంతతో గడిపి, ప్రొద్దున తత్సంభోగచిహ్నములతో వచ్చిన నాయకునిపట్ల కుపితయైన నాయిక ఖండిత’ అని దీని కర్థము. ప్రతాపరుద్రీయమునే అనుసరించిన రామరాజభూషణుని ‘విభుఁడన్య సతిఁ బొంది వేఁకువ రాఁ గుందు నబల ఖండిత’ అను నిర్వచనము దీనికి దాదాపుగా సరిపోవుచున్నది. కాని ఈ నిర్వచనములో నాయకుని యొక్క అన్యస్త్రీసంగమచిహ్నముల ప్రసక్తి లేదు. చిహ్నములు లేకున్నను ప్రియుడు అన్యకాంతాసంగము చేసి వచ్చినాడని శంకించి కోపగించిన నాయికయు ఖండితయే యగుచున్నది. అన్యకాంతాసంగము జరిగినదను అనుమానమే ఈనాయికయొక్క రోషదైన్యాదులకు కారణము.
అన్యవ్యాపకముల వల్ల నాయకుడు రాకున్నచో మనోవైకల్యమును జెందునది విరహోత్కంఠిత. ఈవిధముగా ఖండిత యొక్కయు, విరహోత్కంఠిత యొక్కయు మనఃస్థితులకు కారణమైన పరిస్థితులకు స్పష్టమైన భేదమున్నది. అందుచే వీరు వేర్వేరు నాయికలుగా గుర్తింపబడినారు. సాపరాధుడైన నాయకుని దేహమునందలి పరకాంతాసంగమసంకేతములను పరిశీలించి, చింత, నిశ్శ్వాసము, ఖేదము, సఖీసంలాపము, గ్లాని, దైన్యము, అశ్రుపాతము, రోషము, భూషణత్యాగము, రోదనాదులతో ఖండితానాయిక తన యవస్థ నభినయించవలెనని భరతుడు తెల్పినాడు. రసార్ణవసుధాకరములోని ఈక్రింది శ్లోకము ఇట్టి ఖండితానాయికయొక్క చేష్టలను చక్కగా వర్ణించుచున్నది.
ప్రభాతే ప్రాణేశం నవమదనముద్రాంకితతనుం
వధూర్దృష్ట్వా రోషాత్ కిమపి కుటిలం జల్పతి ముహుః|
ముహుర్ధత్తే చిన్తాం ముహురపి పరిభ్రామ్యతి ముహు
ర్విధత్తే నిఃశ్వాసం ముహురపిచ బాష్పం విసృజతి||
తాత్పర్యము: ప్రభాతమునందు ప్రాణేశునియొక్క నవమదనముద్రాంకితమైన తనువును చూచి, అతని కాంత రోషంతో మాటికి ఏవో కుటిలమైన (ఎత్తిపొడుపు) మాటలు వల్లించును. మఱిమఱి చింత వహించును. మఱిమఱి నిలుకడ లేక చలించును, నిఃశ్వాసములు వెడలించును, కన్నీటిని గార్చును. ఇట్లు కాంతుని ప్రవర్తనపట్ల కాంతలో గలిగిన సంక్షోభము నామె చేష్టలు ప్రవ్యక్తమొనర్చినవి.
వసుచరిత్రం లోని ఈక్రింది పద్యంలో రామరాజభూషణుడు బహురమ్యంగా తుమ్మెద తనువందు పద్మినీసంగమచిహ్నము లున్నట్లు వర్ణించినాడు.
ఉ. తుమ్మెద త్రిమ్మరీఁడు పయిఁదోఁచుపిశంగిమ పద్మినీనిశాం
కమ్మది తాఁ బరాగపటిఁ గప్పి మధువ్రతిఁ జేరఁబోవుచున్
నమ్మిక కంగజప్రహరణమ్ముల ముట్టెడుఁ జూడవమ్మ ప
ల్గొమ్మలఁ జెందువారలు తగు ల్విరియాటలు నేర కుందురే.
తాత్పర్యము: తుమ్మెద యను త్రిమ్మరి మధువ్రతిని (ఆడతుమ్మెదను) జేరబోవుచు, తన శరీరమునందలి నిశాంకమైన (రాత్రి పద్మినిని గూడియున్నందువలన మేనికంటిన) పసుపుపచ్చని మరకను (తెల్లని) పరాగమను వస్త్రముతో గప్పి, తాను రాత్రియందు పద్మినీసంగము చేయలేదని మధువ్రతికి నమ్మిక కల్గునట్లు మన్మథాయుధములను ముట్టుకొనుచున్నాడు. మఱి పలుకొమ్మలను (అనేకస్త్రీలను, అనేకతరు శాఖలను) పొందువారు తగులములు (ఆసక్తులు), విరియాటలు (పుష్పక్రీడలు, స్వేచ్ఛావిహారములు) నేర్వకుందురా? – నేర్తురుగదా యని కాకువు.
వివరణ: తుమ్మెదలు రాత్రియందు ముకుళించు పద్మములయందు జిక్కుకొని పగ లాపద్మములు విచ్చికొనగానే బయల్వెడునని వర్ణించుట కవుల సంప్రదాయము. అట్లు (తుమ్మెద యను నాయకుడు) పద్మినితో (అనగా పద్మలతయను పద్మినీజాతిస్త్రీతో) రాత్రియంతయు గడపుటచేత ఆనాయకునిమేనికి నిశాంకము పచ్చగా నంటినది. ఇచ్చట నిశాంక మనగా రాత్రికేళీపరమైన చిహ్నము. ‘నిశాఖ్యా కాంచనీ పీతా హరిద్రా వరవర్ణినీ’ అని యుండుటచేత నిశాశబ్దమునకు పసుపనియు అర్థము. అందుచే ఆపద్మినీజాతిస్త్రీ శరీరమున లేపనము చేసికొన్న పసుపు ఆమెతో రాత్రి క్రీడించుటచే నాయకున కంటుకొన్నదని అర్థము. రాత్రిపూట పద్మములో జిక్కుకొనుటచే పద్మపరాగము తుమ్మెదమేనికి పచ్చగా పసుపుమరకవలె అంటుకొన్నదని స్వాభావికార్థము. అట్టి పరస్త్రీసంగమచిహ్నమును (తెల్లని) పరాగమను వస్త్రముతో గప్పివైచి, పైగా దానేమి తప్పును చేయలేదని నమ్మకము కల్గించుటకై మన్మథాస్త్రములను ముట్టుకొని ఒట్టును పెట్టుకొనుచున్నాడీ మగతుమ్మెద యను ధృష్టనాయకుడు. మన్మథాస్త్రములన పువ్వులు. మన్మథునికి అస్త్రములు పువ్వులే కదా! పద్మములలో నుండి వెల్వడిన తుమ్మెద లితరపుష్పముల పరాగమును ధరించుట, ఇతరపుష్పములను స్పృశించుట స్వాభావికమేకదా! ఇట్లీ ప్రశస్తమైన పద్యములో ఖండితానాయికకు కోపకారణమైన నాయకుని యొక్క పరకాంతాసంగమచిహ్నములు చక్కగా వర్ణింపబడినవి. కపటియైన నాయకుడా చిహ్నములను గప్పిపుచ్చి తాను నిర్దోషినని మన్మథప్రహరణములను ముట్టుకొని ఒట్టుపెట్టుకొని ఆమెను నమ్మించి, ప్రమాదమును తప్పించుకొనినాడు.
రాత్రిర్యామత్రయపరిమితా, వల్లభాస్తే సహస్రం
మార్గాసక్త్యా మమ గృహమపి ప్రాత రేవాగతోసి|
కిం కర్తవ్యం? వద! నృపతిభిః వీక్షణీయా హి సర్వాః
కోవా దోషస్తవ? పునరహం కామ మాయాసయిత్రీ||
పై శ్లోకము ఖండితాలక్షణమునకు ప్రతాపరుద్రీయములో విద్యానాథు డిచ్చిన చక్కని ఉదాహరణము. దీనికి శ్రీమాన్ చలమచర్ల రంగాచార్యుల వారి అనువాద మీక్రింది పద్యము:
మ. సరిగా జాములు మూఁడు రేయికిఁ; బ్రియాసంఘంబ వేయింటి కౌ,
వఱువాతన్ నృప! దారిఁబోవుచు నిటుల్ వైళంబ విచ్చేసితే?
నరపాలుర్ దమ, రందఱం గనుఁగొనన్ న్యాయ్యంబెగా! యేమనన్?
మఱి మీదోసము లేదు లెండు, మిగులన్ బాధించు నాదోసమే!
రాత్రి యంతయు అన్యకాంతతో గడపి, ప్రొద్దున సంభోగచిహ్నములతో నిలు చేరిన ప్రభువును జూచి ఖండితానాయిక వక్రోక్తిగా ననుచున్నది: రాత్రియో మూడుజాములు మాత్రమే. తమరికో ప్రియాసంఘము వేయింటి కున్నది. ఏదో తెల్లవాఱి (రాత్రి కాదని భావము) దారిని బోవుచు (అనైచ్ఛికముగా ననుట) ఈయింటిలో దూరితిరి. తాము ప్రభువులు (సరసులు గారనుట). మీకందఱు సమానులే (గుణదోషవిచక్షణ లేదనుట). అందఱిని చూడవలసినవారే. మీకింతటి బాధను (ప్రయాసను) కలిగించుట నాదే దోషము. మీదోష మిసుమంతయు లేదు.
ఇటువంటి వక్రోక్తి (వ్యాజస్తుతి) గలదే పుష్పబాణవిలాసం లోని అందమైన ఈక్రింది శ్లోకము.
సత్యం తద్యదవోచథా మమ మహాన్ రాగ స్త్వదీయాదితి
త్వం ప్రాప్తోఽసి విభాత ఏవ సదనం మాం ద్రష్టుకామో యతః|
రాగం కించ బిభర్షి నాథ హృదయే కాశ్మీరపత్త్రోదితం
నేత్రే జాగరజం లలాటఫలకే లాక్షారసాపాదితమ్.||
వివరణ: నాయకుడు రాత్రి అన్యకాంతతో గడిపి, వేకువన తనకాంత కడకు వచ్చినాడు. అతనిని జూచి, వ్యాజస్తుతితో ఆనాయిక ఇట్లు ఉపాలంభించుచున్నది. నాథ=ప్రియుడా! త్వదీయాత్=నీకంటె, మమ రాగః మహాన్ ఇతి= నా రాగము అధికమైనదని, యత్=ఏది, అవోచథాః= పలికితివో, తత్=అది, సత్యం=సత్యమే; యతః=ఎందుచేత ననగా, మాం=నన్ను, ద్రష్టుకామః =చూడగోరినవాడవై, త్వం=నీవు, విభాత ఏవ = పెందలకడనే (రాత్రి రాలేదనుట), ప్రాప్తోఽసి=వచ్చితివి; కించ=మఱియు, హృదయే=ఎదయందు, కాశ్మీరపత్త్రోదితం= కుంకుమ పత్త్రభంగజనితమైనట్టిదియు, నేత్రే జాగరజం= కనులయందు జాగరణచే గల్గినదియు, లలాటఫలకే=నొసటియందు, లక్షారసాపాదితం= లాక్షా రసముచే గల్గినదియు నగు, రాగం=రాగమును , బిభర్షి=ధరించియున్నావు.
తాత్పర్యము: ఓ నాయకుడా! నాకు మనసులో మాత్రమే నీపై రాగమున్నది. మఱి నీకో శరీరమందంతటను రాగమున్నది. నీయెదలో కశ్మీరపత్ర రాగ మున్నది; కనులలో జాగరణరాగ మున్నది; నొసటిపై లాక్షారసరాగ మున్నది. నాపై ఎంత మక్కువయో, నాకడకు పెందలకడనే వచ్చితివి (రాత్రి రాలేదనుట). నీవు వచించినట్లు నీకు నాయందు గల రాగాతిశయ మధికమైన దనుటలో అసత్య మింతయు లేదు. ఇచ్చట రాగ మనగా అనురాగమనియు, ఎఱ్ఱదనమనియు గ్రహింపవలెను. ‘నాకు మనసులో మాత్రమే రాగమనగా అనురాగ మున్నది. నీకో శరీర మంతటను రాగము (అనగా అన్యకాంతాసంభోగచిహ్నమైన ఎఱ్ఱదనము) ఉన్నది’ అని వ్యాజస్తుతిచే నాయిక నాయకుని ఉపాలంభించుచున్నది.
న బరీభరీతి కబరీభరే స్రజో, న చరీకరీతి మృగనాభిచిత్రకమ్|
విజరీహరీతి న పురేవ మత్పురో, వివరీవరీతి న చ విప్రియం ప్రియా||
అందమైన ఈశ్లోకం పుష్పబాణవిలాసంలోనిది. నాయకుని అన్యకాంతాసంగమచిహ్నములను గాంచి ఒక ఖండితానాయిక ఈర్ష్యామానములు వహించినది. అతనివైపు చూచుట లేదు, అతనితో మాటాడుట లేదు. అతని కామె నెట్లు ప్రసన్నురాలిని చేసికొనవలెనో తోచుట లేదు. ఆతడామె చెలికత్తెతో నిట్లనుచున్నాడు: ప్రియా=ప్రియురాలు, పురా ఇవ=ముందువలె, కబరీభరే=గొప్పనైన కొప్పునందు, స్రజః=పూదండను, న బరీభరీతి=మఱిమఱి తుఱుముకొనదు; మృగనాభిచిత్రకమ్=కస్తూరితిలకమును, న చరీకరోతి= మఱిమఱి (సవరించి) పెట్టుకొనదు; మత్పురః=నాయెదుట, న విజరీహరీతి=తరచుగా (మఱిమఱి) చరింపదు; విప్రియం=(నా)తప్పిదమును, న వివరీవరీతి చ= (మఱిమఱి యడిగినను) చెప్పదు గూడ.
ఓ చెలీ! ఈమె వైఖరి నీకు దెలిసియున్న చెప్పుము.
అలంకారశాస్త్రప్రకారము ఈనాయిక మధ్యా-ధీరా అను కోవకు చెందినది. ‘మధ్యా ధీరా ప్రియం మానే న పశ్యతి న భాషతే’ – ‘మధ్యా ధీర మానము (ప్రణయకోపమును) వహించినప్పుడు ప్రియునివైపు చూడదు, మాటాడదు’ – అని ఆమె లక్షణము. పైశ్లోకములో అపరాధియైన నాయకునిపట్ల ఇట్టి (ఖండిత)నాయిక చేయు విపరీతవర్తనము వర్ణింపబడినది. ఇందులో గల ‘బరీభరీతి’, ‘చరీకరీతి’ ఇత్యాది పౌనఃపున్యార్థ కములైన యఙ్లుగంతరూపములు ఈశ్లోకమునకు అధికమైన అందము నొసగుచున్నవి.
ఖండితానాయికకు కావ్యాదులనుండి ఎన్నియో చక్కని ఉదాహరణ లీయవచ్చును. ఉదాహరణకు పారిజాతాపహరణకావ్యములోని ప్రథమాశ్వాసములో సత్యభామను చక్కని ఖండితానాయికగా ముక్కుతిమ్మన నిరూపించినాడు. రుక్మిణియందలి అనురాగముచే తనను కించపఱచినాడని సత్యభామ ఈర్ష్యాపరిపూర్ణమానసయై అట్లు చేసినది. రుక్మిణిసిగలో పారిజాతమును తుఱిమినపుడు శ్రీకృష్ణునిమేనిలో నెలకొన్న ‘పారిజాతకుసుమాగతనూతనదివ్యవాసనల్’ అతని అన్యకాంతానురక్తిని పట్టియిచ్చు చిహ్నములైనవి. ఇవి ఆమె ఈర్ష్యాకోపముల నినుమడింప జేసినవి. ‘వేఁడినిట్టూర్పులు దళంబుగా నిగిడినవి’. ‘మానసంబున నెలకొన్న క్రోధరసము న్వడిఁగట్టుచునున్నకైవడిన్’ స్తనతటమందలి కుంకుమపత్రభంగములు చెమటచే కరఁగి వెలిపట్టుపయ్యెద తడిసి ఎఱ్ఱవారినది. ఆమె శ్రీకృష్ణుని శిరస్సును తన్నుటయే గాక అతని ననేకవిధముల సూటిపోటిమాటలతో తూలనాడినది. చివరికి ‘ఈసునఁ బుట్టి డెందమున హెచ్చిన శోకదవానలంబుచే గాసిలి’, ‘పంకజశ్రీ సఖమైన మోముపయిఁ జేలచెఱంగిడి బాలపల్లవగ్రాసకషాయకంఠకలకంఠవధూకలకాకలీధ్వని’తో నేడ్చినది. ఈమానసికలక్షణములు, చేష్టలన్నియు అలంకారశాస్త్రములో లాక్షణికులు ఖండిత కాపాదించినవే. ఇట్లు ఖండితయొక్క పరిపూర్ణస్వరూపమును ముక్కుతిమ్మన సత్యభామయందు చూడనగును.
కలహాంతరిత
ఈర్యాకలహనిష్క్రాన్తో యస్యా నాగచ్ఛతి ప్రియః|
సామర్షవశసంప్రాప్తా కలహాన్తరితా భవేత్||
అని నాట్యశాస్త్రములో కలహాన్తరితాలక్షణము గలదు. ‘అల్క నధిపుఁ దెగడి అనుశయముఁ జెందు సతి కలహాంతరిత’ యను నిర్వచనము దీనికి సమముగానే యున్నది. ‘కలహేన అంతరితా వ్యవహితా అర్థాత్ ప్రాణనాథతః’ – ‘కలహమువల్ల వల్లభునితో ఎడయైనది’ అని కలహాంతరితా శబ్దమునకు వ్యుత్పత్తి. ఈకలహము రోషము, ఈర్ష్య, అసహనములచేత కలుగవలెను. ఇట్టి మనఃస్థితి అన్యకాంతానురక్తుడైన నాయకుని విషయమున గలుగుట సహజము. అట్టి కాంత ఖండిత యగును. అట్లు తనచే నుపాలంభింపబడి దూరమైన నాయకునిగూర్చి చింతించుచు, తనచర్యకు పశ్చాత్తాపము నొందు నాయిక కలహాంతరిత యగును. ఇట్లు ఖండితకు, కలహాంతరితకు స్వాభావికమైన పారంపర్యము గలదు. అమరుకశతకంలోని ఈ క్రింది శ్లోకము ‘కలహాంతరిత’కు చక్కని ఉదాహరణము.
చరణపతన ప్రత్యాఖ్యాన ప్రసాద పరాఙ్ముఖే
నిభృతకితవాచారేత్యుక్తే రుషాపరుషీకృతే|
వ్రజతి రమణే నిఃశ్వస్యోచ్చైః స్తనార్పితహస్తయా
నయనసలిలచ్ఛన్నా దృష్టిస్సఖీషు నిపాతితా||
అర్థవివరణము: నాయకునియందు పరస్త్రీసంభోగచిహ్నములు బయల్పడుటచే ఆమె కృద్ధురాలైనది. ఆమె కోపము నుపశమింపజేయుటకై ఆమె చెలుల సమక్షములో నాయకు డామె పాదములపై బడినాడు (ముక్కుతిమ్మన శ్రీకృష్ణుడును ఇట్లే చేసినాడు). ఐనను ఆమె అతనియందు విముఖురాలైనది. పైగా ‘నిభృతకితవాచారా =(సిసలైన మోసగాడా)’ అని అతనిని (చెలుల యెదుట) పరుషముగా నిందించినది. అతడు (రోషముతో) వెడలిపోసాగినాడు. ఆతని నివారించుట కామె మాన మడ్డము వచ్చినది. అంతలో తన చేష్టల కామెకు కొంత పశ్చాత్తాపము కల్గినది. అప్పుడామె స్తనతటమం దుంచిన హస్తముతో, బిగ్గరగా (దీనయై) నిట్టూర్చుచు, ఆశ్రుచ్ఛన్నములైన నేత్రములను (మీరైన ఆతనిని మఱలింపలేరా అను భావముతో) చెలులపై నిల్పినది. కోపముతో నిందింపబడిన నాయకుడు , తనను విడిచిపోగా తన చేష్టలకు పశ్చాత్తాపము నొందు నాయిక యిందు వర్ణింపబడినది.
రామరాజభూషణుని కావ్యాలంకారసంగ్రహములోని క్రింది యుదాహరణముసైతము రమ్యముగా నున్నది.
ఉ. ఆనఁగరాని కోపమున నప్పుడు కాంతుని ధిక్కరించుచో
మానదురాగ్రహగ్రహము మానుపలేకపు డెందుఁ బోయెనో
యా ననవింటిదంట యిపు డేఁపఁదొడంగె; భవిష్యదర్థముల్
గానని నా మనంబునకుఁ గావలె నిట్టి విషాదవేదనల్.
తాత్పర్యము: ఈర్ష్యాకోపముల బట్టలేక ఒకకాంత నాయకుని దూఱినది, తిరస్కరించినది. అతడామెకు దూరమైనాడు. వల్లమాలిన మానము, దురాగ్రహములనెడు భూతము తనను సోకినప్పుడు వానిని నివారింపలేని మన్మథుఁడు తననిప్పుడు సోకి బాధించుచున్నాడు. ముందుచూపు లేక యట్లు ప్రవర్తించిన తన మనసున కిట్టి దుఃఖము, ప్రయాస కల్గవలసినదే యని ఆకాంత పశ్చాత్తప్తురా లైనది.
ఇటువంటి మానసికస్థితిని ప్రతిబింబించునదే ఈక్రింది భానుదత్తుని ‘రసమంజరి’లోని శ్లోకము:
అకరోః కిము నేత్ర! శోణిమానం?
కిమకార్షీః కర! పద్మతర్జనం వా?
కలహం కిమధా ముధా? రసజ్ఞే!
హితమర్థం న విన్దతి దైవదృష్టాః!
దీనికి నా భావానువాదము:
తే. పూనితేల నేత్రంబ! ప్రశోణిమంబు?
జగడమాడితి వేల రసజ్ఞ! వృథగ?
కేలుదమ్మిచే వెఱపించితేల? కరమ!
మిమ్మనఁగ నేల? నాభాగ్య మిట్లు గ్రాల!
వివరణ: ఒక ఖండితానాయిక కాంతుని నిందించినది. అతఁడు పాదగ్రస్తుఁడై ఆమెను అనునయింప యత్నించినాడు. ఐనను మానవతియైన ఆమె ప్రసన్నురాలు కాలేదు. ఇంకను కనులెఱ్ఱచేసి అతనిపై కోపగించినది. నిష్ఠురము లాడి కలహించినది. హస్తమందలి లీలాపద్మమును ౙళిపించి ఆతని వెఱపించినది. ఆతడామెను వీడి పోయినాడు. కొంతసేపటి కామె మానము వీగిపోయినది. కలహాంతరితయైన ఆమె తన కాత్మీయమైన నేత్రజిహ్వాహస్తములే వైరులవలె నట్లు చేసినవని వానిని నిందించినది. కాని అట్లు వాని ననుట వ్యర్థమనుకొన్నది. తన దౌర్భాగ్యముచే నట్లు జరిగినదని విధినే దూషించుచు పశ్చాత్తాపము నొందినది. ఇట్టి చేష్టావిశేషములవల్ల ఆనాయిక ప్రౌఢ యని తేలుచున్నది. చివరిగా రసభావానుకూలముగా టొరంటోలోని శ్రీమతి చర్ల రత్నశాస్త్రిగారు పాడిన మత్కృతమైన యీక్రిందిపాటలో, అన్యకాంతా సంభోగచిహ్నముల గాంచి కాంతుని దూషించిన ఖండితానాయిక, కలహాంతరితయై పశ్చాత్తాపముతో వానిని ప్రసన్నుని జేసికొని రమ్మని సరసురాలైన తన సఖిని వేడికొనుట ఇతివృత్తముగా నున్నది:
(మోహనరాగం)
పల్లవి:
విభుని దూరము సేసి, విరహంబు పాలైతి
అ.పల్లవి:
మునుపుగూడినదాని పొంతకే పొమ్మంటి |ఏమి సేతునె|
చరణం 1:
గండమందున దానికంటికాటుక గంటి
కనులయందున జాగరణ చిన్నెలను గంటి
నన్ను దాకకు, దాని సన్నిధికె పొమ్మంటి |ఏమి సేతునె|
చరణం 2:
చాలులే మురిపాలు సరసాలు పొమ్మంటి
అంటి నే గాని యిటులొంటరిని ననుజేసి
స్మరువింటి కెరసేసి చనడేమొ యనుకొంటి |ఏమి సేతునె|
చరణం 3:
త్వరతోడ జని వాని తిరిగి రమ్మనవె
తాళుకొంటిని వాని తప్పిదం బనవె
బాళితో నలరింతు పంతమేలనవె |ఏమి సేతునె|