పాత్రలు
పినవీరభద్రుడు – కథానాయకుడు, ఆంధ్రకవిపుంగవుడు పెదవీరభద్రుడు – పినవీరభద్రుని అన్నగారు గాదిరాజు – పినవీర,పెదవీరభద్రుల తండ్రి నాగాంబిక – పినవీర,పెదవీరభద్రుల తల్లి భారతీతీర్థస్వామి – విజయనగరరాజ్యప్రభువు చిల్లర వెన్నయామత్యుడు – గాదిరాజ,వీరభద్రాదుల గురువు సింగన – వ్రాయసకాడు మదాలస – విజయనగరాస్థాననర్తకి మణిప్రభ – మదాలస సేవిక ఇంకను మంత్రి, సేవికలు, సదస్యులు, పురోహితుడు, బ్రాహ్మణులు మున్నగువారు.
మొదటి దృశ్యము
(సమయం: మధ్యాహ్నం 3గంటలు. స్థలం: విజయనగరసమ్రాట్టు సాళువ నరసింహరాయల సాహితీ సభామండపం. నేపథ్యంలో వందిమాగధులు జయగీతికలు, ఆ తర్వాత వేదవిప్రులు ‘ధ్రువం తే’ అను మంత్రమును చదువుచుండగా, మంత్రికవిపండితులతో గూడిన సభామందిరాన్ని అతడు ప్రవేశించి సింహాసనాసీను డౌతాడు.)
వంది
మాగధులు:
విజయనగరసామ్రాజ్యాధీశ్వర, రాజాధిరాజ, రాజపరమేశ్వర! జయము! జయము!
నిఖిలదక్షిణాపథభూభారధౌరేయ, మేదినీవరాహబిరుదాంక! జయము!జయము!
దుర్వారగర్వితారివిదళనకరవాల, కటారిసాళువబిరుదాంక! జయము! జయము!
పాండురయశోగండూషితనిర్జరాపగాకాండ, గుండయనరసింహభూమండలాఖండల! జయము! జయము!
వేదవిప్రులు:
ధ్రు॒వం తే॒ రాజా॒ వరు॑ణో ధ్రు॒వం దే॒వో బృహస్ప॒తిః॑| ధ్రు॒వం త॒ ఇన్ద్ర॑శ్చా॒గ్నిశ్చ॑ రా॒ష్ట్రం ధా॑రయతాం ధ్రు॒వమ్||
రాయలు:
మంత్రిసత్తములు, కవిసత్తములు, వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములతో బ్రశస్తమైన ఈ సభకు నమస్కారము. మా పరిపాలనలో మీ సుఖసంపదలకు లోటు లేదు కదా!
మంత్రి:
పంచపాండవుల మెండైన దండితనంబునకు నిండైన మూర్తులై, ఐవరగండులని యఖండకీర్తిని వహించి, దానశౌండులై, కవిపండితపక్షపాతులైన తమరి పాలనలో సుఖసంపదలకు లోటేమి యుండును మహారాజా!
ఒక
సదస్యుడు:
అందుకే కదా,
యః పంచశాఖశాఖాభి ర్జిత్వా పంచామరద్రుమాన్!
పంచఘంటానినాదోఽభూత్ పంచఘంటానినాదనాత్||
సత్య సత్త్వేషు సంధాన రూప లావణ్య ధీగుణైః|
జిత్వా యః పాణ్డవాన్ పంచ ప్రాపదైవరగండతామ్||
అని పంచామరద్రుమములదాతృత్వమును కుంచించు తమరి వదాన్యతను, పంచపాండవుల గుణపరంపరను నిరసించు తమరి సత్యసంధతను, దోస్సత్త్వాన్ని, శరసంధానచాతుర్యాన్ని, రూపసంపదను, ధీశక్తిని కవులు ప్రస్తుతించుచున్నారు.
రాయలు:
ఆప్తులారా! నాకు వయసు మీరుచున్నది. ఆదినుండియు సంగ్రామక్రీడాసక్తమైన నా మేనున క్రమముగా శక్తి సన్నగిల్లుచున్నది. అది సన్నగిల్లిన కొలది నాకు పురాణేతిహాసశ్రవణ మందు, సాహితీవనవిహరణమందు ఆసక్తి మిన్న యగుచున్నది. వాపీకూపతటాక దేవాయతనపురవన నిర్మాణాది పుణ్యకార్యము లెన్నో నేనింతవఱకు చేసితిని. కాని వీని కన్నింటికంటెను ప్రశస్తమైనది, శాశ్వతమైనది కావ్యము.
ఆదట సప్తసంతతుల యందును నొక్కొక కాలమందు వి
చ్ఛేదము గల్గు నాఱిటికిఁ, జెప్ప విపర్యయ మేయుగంబునన్
లేదు కవిత్వసంతతికి, నిక్కము తత్కవితావిలాసమున్
జాదులు నిష్టదైవము ప్రసాదము నౌ హరికీర్తనంబునన్.నామది నిరతము భారత
రామాయణకథలఁ బ్రేమ రంజిలు, నందున్
జైమినిభారత మనఁగా
భూమి నపూర్వము పురాణముల గణియింపన్.ఆ పురాణంబు గనఁ దెనుఁ గయ్యెనేనిఁ,
జెప్పనేర్చిన కవియుఁ బ్రసిద్ధుఁడేనిఁ,
దెనుఁగు నుడికారమున మించు గనియెనేని,
కుందనము కమ్మవలచిన చంద మగును.
అందుచేత, ఈ చరమదశలో ఆంధ్రీకృతజైమినిభారతమును కృతిగా గొని తరింపవలెనని నాకున్నది. కాని ఇందులో ఒక క్లేశ మున్నది. నెలరోజులలో దసరా నవరాత్రులు ఆరంభ మగుచున్నవి. ఈ స్వల్పవ్యవధిలో ఐదువేల శ్లోకములకు పైబడిన ఆ గ్రంథమును మూలానుసారముగా, రసనిర్భరముగా, పాఠకశ్రోతృహృదయాహ్లాదకరముగాఁ దెనిగించి నవరాత్రి ఉత్సవములలో నాకర్పింపగల కవితల్లజు డెవ్వడా యని చూచుచున్నాను.
ఒక కవి:
(లేచి) మహారాజా! మేము కవుల మగుమాట నిజమే. కాని ఈ గడువు లోపల ఇంతటి ఉద్గ్రంథాన్ని అనువదించడం అంత సులభం కాదనుటలో వితథ్యం లేదని నా అభిప్రాయము.
రెండవ కవి:
దానితో నేనూ అంగీకరిస్తాను. కాని, ఈ విషయమై ప్రభువులకు చింత అవసరం లేదని నా అభిప్రాయం. మీకు విధేయులూ, విజయనగరరాజ్య శ్రేయస్కరులైన నాయకపరంపరలో పిల్లలమఱ్ఱి పెదవీరభద్రుల వారున్నారు గదా! వారి సోదరుడు పినవీరభద్రకవి, ఆ గ్రంథము నిప్పుడిప్పుడే అనువదింప నుద్యుక్తుడైనాడని నేను విన్నాను. ఈ కార్యమును నిర్వహించుటకు ఆ మహాకవీంద్రుని కంటె సమర్థులు వేరొకరు లేరని నాభావన.
తాతయుఁ, దండ్రియు, నగ్ర
భ్రాతయునుం దాను భువనభాసురకృతిని
ర్మాతలు, పిల్లలమఱి వి
ఖ్యాతునిఁ బినవీరుఁ బోలఁగలరే సుకవుల్.అమృతాంశుమండలం బాలవాలము గాఁగ
మొలిచె నొక్కటి జగన్మోహనముగ,
చిగురించె విలయసింధుగత కైతవడింభ
శయనీయవరపలాశములతోడ,
పితృదేవతలకు నంచితసత్త్రశాలయై
చెట్టుగట్టెను గయాక్షేత్రసీమ,
నిలువ నీడయ్యె నిందీవరప్రియకళా
కోటీరునకు భోగికుండలునకు,మఱ్ఱి మాత్రంబె పిల్లలమఱ్ఱి పేరు
పేరువలెఁ గాదు శారదాపీఠకంబు
వారిలోపలఁ బినవీరు వాక్యసరణి
సరసులకు నెన్నఁ గర్ణరసాయనంబు.
మూడవ
కవి:
ఔను మహారాజా! సుధామధురమగు వాగలంకారవైదుష్యముచే నతడు మున్నుగ అవతారదర్పణము, నారదీయపురాణము, మాఘమాహాత్మ్యము, మానసోల్లాసము రచించినాడు. ఇటీవల శృంగారశాకుంతలమను సుందరప్రబంధమును రచించి చిల్లర వెన్నయామాత్యుల కంకితము చేసినాడు. కాళిదాసు శాకుంతలము వలె ఈ శాకుంతలమును అనర్ఘరసాలవాలమై యున్నదని విన్నాను.
అల్లన విచ్చు చెంగలువలందురజంబును కప్పురంబు పైఁ
జల్లఁగఁ జల్లనై వలచు సౌరభముల్ వెదచల్లు భావముల్
పల్లవహస్త చన్నుఁగవపయ్యెద జీబుగఁ దోఁచు భాతిగాఁ
బిల్లలమఱ్ఱి వీరన యభిజ్ఞఁడు చెప్పఁగ నేర్చుఁ గబ్బముల్.
కావున దూరమున నున్నను మీ మనోరథము నెఱింగినవాని వలె జైమినిభారతాశ్వమేధపర్వమును రచింప నుద్యుక్తుడైన ఆ మహాకవిని రప్పించి ఆతనికీ పురాణరచనాభారము నప్పగించిన చక్కగా నుండునని ఇచ్చటి కవిపండితుల వాక్యముగా నేను మీకు విన్నవించు కొనుచున్నాను.
ఏరీతి నెఱిఁగెనో పిన
వీరన దేవరతలంపు విఖ్యాతముగాఁ
బేరును బెట్టిదియును దన
పేరుగ రచియింపఁ బూనెఁ బేశలఫణితిన్.
రాయలు:
సభ కిది అంగీకార్యమేనా?
సభ:
అవశ్యము మహారాజా! ఇంత స్వల్పవ్యవధిలో అంతటి బృహత్తరపురాణానువాదము చేయ గల సమర్థుడు పినవీరభద్రు డనుటలో సందియము లేదు. కాని అతడిప్పుడు వెన్నయామాత్యుని కొలువులో సోమరాజుపల్లెలో నున్నాడు. సత్వరమే మీయాస్థానమునకు రప్పించి ఈ కార్యమును నిర్దేశించిన మీ గడువు లోగా నతడు గ్రంథమును పూర్తి చేయగలడని మాకు పరిపూర్ణ విశ్వాసమున్నది.
రాయలు:
అట్లే కానిండు. పినవీరభద్రుని వెంటనే సాదరముగా నాయాస్థానమునకు బిలువ బంచెదను.