ఎడారిసీమలో ఇటలీభామ

ల ఇతాలియాన ఇన్ అల్జెరీ (L’italiana in Algeri, Italian Girl in Algiers) అనునది ఆంజెలో అనెల్లీ (Angelo Anelli, 1761 – 1820) అను ఇటలీదేశ కవీంద్రునిచే వ్రాయబడిన రెండంకముల గేయరూపకము. సంగీతస్వరకర్తలలో అత్యంత సుప్రసిద్ధుడైన జికోనో ఆంతోనియో రొసీని (Gioachino Antonio Rossini, 1792 –1868) అను సంగీతజ్ఞుడు దీనిని స్వరబద్ధము చేసెను. సుప్రసిద్ధుడైన రొసీని స్వరబద్ధము చేసిన 33 ఆపెరాలలో ఇప్పటిని తరచుగా ప్రదర్శింపబడుచున్న ప్రహసనరూపకమిది. దీనియొక్క ఇంగ్లీషు లఘువ్యాఖ్యలతో కూడిన ఫిలడెల్ఫియా ఆపెరావారి రంగప్రదర్శన అంతర్జాలంలో ఈ రెండు లంకెల ద్వారా చూడవచ్చును: మొదటి లంకె, రెండవ లంకె.

క్రీ.శ.1819లో ప్రచురింపబడిన ఇంగ్లీషుభాషానువాదముతో గూడిన ఈ రూపకముయొక్క పీడియఫ్ ప్రతిని ఈ లంకె ద్వారా పొందవచ్చును.

ఈ ప్రహసనము యొక్క కథ సంగ్రహముగా నిట్లున్నది.

కథాసంగ్రహము: ప్రథమాంకము

19వ శతాబ్దములో తురుష్క సామ్రాజ్యములో నంతర్భాగమైన అల్జీరియా దేశమును ముస్తఫా అనునతడు ప్రతినిధిగా పాలించుచున్నాడు. అతనికి అత్యంతసాధ్వియైన ఎల్వీరా అను భార్య యున్నది. శుద్ధాంతములో ఇతరకాంత లనేకులున్నారు. కాని ఇప్పుడు వారిపై అతని మనస్సు పోవుట లేదు. అతని భార్యను అతనిదగ్గర బందీగా నున్న ఇటాలియను సేవకుడైన లిండోరా అను వానికి నిచ్చి వారిర్వురిని ఇటలీకి బంపివేయ నతడు సమకట్టినాడు. తనకై ఒక అందమైన ఇటలీదేశపు కన్యను వెదకి తెమ్మని తన సన్నిహితసేవకుడైన ఆలీ అను వాని నాదేశించినాడు. ఇంతలో పెనుతుఫానులో జిక్కుకొని ఒక నావ సముద్రతీరమున వచ్చి పడినది. అందులో ఇటలీకి జెందిన ప్రయాణీకులున్నారు. వారందఱిలోను అందకత్తెయైన ఇసబెల్లా అను ఇటాలియను యువతి, కొంచెము వయసు ముదిరిన టెడ్డియో అను ఇటాలియను పురుషుడున్నాడు. ఆమెను చూచిన ఆలీకి ఆడబోయిన తీర్థ మెదురైనట్లైనది. ఇసబెల్లాను ముస్తఫా యంతిపురమున కర్పించి తన నిర్దేశమును పూర్తిచేసికొనుట కాతడు సమకట్టినాడు. క్రొత్త దేశములో పరస్పరము అండగా నుండుటకు టెడ్డియోను తన మేనమామయని ఇసబెల్లా ఆలీకి పరిచయం చేసి, తాముభయులు కలిసియుండవలెనని అతనిచే అంగీకృతి పొందినది. నిజానికి ఇసబెల్లా లిండోరా ప్రియురాలు. చాలాకాలముక్రింద సముద్రయానమున కేగి తిరిగి రాని లిండోరాను వెదకుచు, ఆమె ఇచ్చట వచ్చి పడినది.

ఎల్వీరాను భార్యగా గ్రహించిన పక్షమున లిండోరోను దాస్యమునుండి విముక్తుని చేసి, వారి నిర్వురను ఇటలీకి బంపుదునని ముస్తఫా లిండోరో కాశపెట్టినాడు. ఆట్లైన తనకు దాస్యవిముక్తి కలిగి, స్వదేశమునకు పోగల యవకాశము వచ్చునని లిండోరా ఎట్టకేలకు దాని కంగీకరించి నాడు. ఎల్వీరాను, ఆమె పరిచారికయైన జుల్మాతోగూడ తీసికొని ఓడలో నిటలీకి పోవలసినదని ముస్తఫా లిండోరో నాదేశించినాడు.

ఆలీ ఇసబెల్లాను ముస్తఫా సమక్షమునకు గొనివచ్చినాడు. ఆమెను చూచిన తత్క్షణమే ముస్తఫా ఆమెయం దనురక్తుడైనాడు. ఆమెయు అతనియందనురక్త యైనట్లు నటించినది. ఇంతలో టెడ్డియో ఆమె తన మేనకోడలని ముస్తఫాకు దెలుపుచూ అచటికి వచ్చినాడు. అప్పుడే ఇటలీ కేగుటకు ముందు ముస్తఫాకు వీడ్కోలు చెప్పుటకు లిండోరా, ఎల్వీరా, జుల్మా లచటికి వచ్చినారు. అట్లు హఠాత్తుగా ముస్తఫా సమక్షమున జరిగిన పునర్దర్శనమునకు ఇసబెల్లా లిండోరాలు లోలోపల సంతుష్టులైనారు. ఎల్వీరా ఎవరని ఇసబెల్లా ముస్తఫానడిగినది. ఆమె ఇంతవఱకు తన భార్యయే యని, ఇప్పుడామెను లిండోరా కిచ్చి వారిని ఇటలీకి బంపుచున్నానని ముస్తఫా చెప్పినాడు. కాని ముస్తఫా తనను నిజముగా ప్రేమించుచున్నచో ఎల్వీరా నట్లు వెలివేయగూడదని, లిండోరాను తన సేవకునిగా నుంచవలెనని ఇసబెల్లా ముస్తఫాను కోరినది. కామాంధుడైన అతడు కొంత అసమ్మతిగా నైనను దాని కంగీకరించినాడు. ఎల్వీరా లిండోరోల ఇటలీ ప్రయాణము రద్దైనది. ఇంతటితో ప్రథమాంకము ముగిసినది.

కథాసంగ్రహము: ద్వితీయాంకము

తనను విస్మరించి, ఎల్వీరాయందనురక్తుడైనాడని ఇసబెల్లా లిండోరో ననుమానించినది. కాని అది నిజముకాదని, ఇంకను ఆమెయందే తాను బద్ధానురాగుడై ఉన్నానని ఇసబెల్లాకు లిండోరా నమ్మిక కల్పించినాడు. ఇసబెల్లాకు మేనమామనని చెప్పుకొనుచున్న టెడ్డియోకు కైమెకానను ఉన్నతపదవి నర్పించి, తద్ద్వారా ఇసబెల్లాను వశపఱచుకొనవచ్చునని ముస్తఫా అతనికి కైమెకాను పట్టమును గట్టినాడు. కాని టెడ్డియోనే ఏకపక్షంగా ఇసబెల్లాను ప్రేమింప మొదలిడినాడు. లిండోరా టెడ్డియో ఇసబెల్లాలు ముస్తఫాను చతురముగా వంచించి, ముస్తఫా అధీనములో నున్న ఇతర ఇటలీయసేవకులతో గూడి స్వదేశమునకు పాఱిపోవ నొక పన్నుగడను పన్నినారు. దీని ప్రకారము లిండోరా టెడ్డియోలు ఇసబెల్లా నిజముగా ముస్తఫాను ప్రేమించుచున్నదని, ఇటలీలో స్త్రీవశీకరణప్రవణులైన వారు పాపటాచీ అను వర్గమునందు సభ్యులౌదురని, అట్టి అరుదైన సభ్యత్వమును ముస్తఫాకు ప్రసాదించుటకు ఇసబెల్లా ఘనముగా సభ్యత్వ ప్రదానోత్సవమును చేయుచున్నదని ముస్తఫాను ఆమె కడకు గొనివచ్చినారు.

ఆయుత్సవములో ముస్తఫాకడ దాసులుగా నున్న ఇటలీ దేశీయులు బృందగాయకులుగా పాల్గొన్నారు. కామాంధుడైన ముస్తఫా ఆ సభ్యత్వము గైకొని, దాని నియమములను తప్పక పాటింతునని ప్రమాణము చేసినాడు. ఆ నియమములు సుష్ఠుగా నిరంతరము తినుచుండుట, సురాపానము చేయుచుండుట, చుట్టూరా ఏమి జరుగుచున్నను దానిని పట్టించుకొనక యుండుట – అనునవి. ఇట్టి స్థితిలో నున్న ముస్తఫానుండి తప్పించుకొని ఇటలీయు లందఱు పాఱిపోవుచుండగా, ఎట్టకేలకు తెలివిదెచ్చుకొనిన ముస్తఫా వారిని పట్టుకొనుటకై భటుల నాదేశించినాడు. కాని ఇసబెల్లా అంతకు ముందే వారిని సురాపానమత్తులను చేసియుండుటచే వారెవ్వరు అతని నిర్దేశమును పాటింపలేదు. ఇటలీయులు సులభముగా నోడలో తమ దేశమునకు పాఱిపోయినారు. ఇంతలో ఎల్వీరా తనను పరిగ్రహింపుమని ముస్తఫాను వేడికొన్నది. అతడు పరకాంతావ్యామోహమువల్ల గల్గిన చేటు నవగతము చేసికొని, సాధ్వియైన తన సతినే పునః పరిగ్రహించినాడు.

ప్రస్తుతప్రయత్నము

ఆసక్తికరమైన ఈ ఇతివృత్తమును భారతదేశమున కన్వయించుటకంటె దేశకాలపాత్రములను మూలములో నున్నట్లుగనే ఉంచుట ఉచితమని తోచినది. అందుచే దేశకాలపాత్రములను మార్చక, అవసరమనిపించినచోట్ల కొన్ని సన్నివేశములను స్వల్పముగా మార్చి, వారివారి స్వభావమునకు తగినట్లుగా మూలములోని పాత్రల పేర్లు మార్చి, ఈరూపకమును అనువాదముగా గాక, స్వతంత్రమైన అనుసృజనగా తెలుగులో రచించితిని. పాటలను మాత్రాచ్ఛందస్సులలోను, సంభాషణలను తేటగీతి, ఆటవెలది, కంద, ఉత్పల, చంపక, మాత్రాచ్ఛందస్సుల లోను వ్రాసితిని. కొన్నిచోట్ల విసంధి చేసితిని. ఇది ఈపరంపరలో వ్రాయబడిన నాల్గవ రూపకము.


పాత్రలు

ముస్తఫా: అల్జీరియా దేశపాలకుడు
ఖాదిము(ఆలీ): ముస్తఫాకు ఇష్టుడైన అనుచరుడు
సమీరా(ఎల్వీరా): ముస్తఫా భార్య
సలీమా(జుల్మా): సమీరా పరిచారకురాలు
బెలిండా (ఇసబెల్లా): నాయిక – ఇటలీదేశపు యువతీమణి
ఫిడేలియో(లిండోరా): బెలిండా ప్రియుడు, ముస్తఫా కడ సేవకుడుగా నున్నవాడు
ఎమీలియో(టెడ్డియో): కొంచెము వృద్ధుడైన ఇటలీయుడు, బెలిండా మేనమామనని చెప్పుకొనుచు ఏకపక్షముగానామెను ప్రేమించువాడు

ప్రథమాంకము

మొదటిదృశ్యము

(స్థలము: మహావైభవాన్వితమైన సుందరమైన ముస్తఫా అంతర్మందిరం. పట్టమహిషి సమీరా, ఆమె ప్రియదాసి సలీమాలు. ఎవరిపక్షమును వహింపక జరుగుచున్న విషయముపై లఘువ్యాఖ్యానము చేయుచు పాడు షండుల బృందము (కోరస్). తరువాత ముస్తఫా, అతని అనుచరుఁడు ఖాదిముల ప్రవేశము.)

బృందం (కోరస్):
సేవకె శ్రమకే స్త్రీలిట నున్నది
దైవనియోగం బీవిధ మున్నది
ఇది గురుతింపక యేదో వైభవ
పదముం గోరిన భంగము దప్పదు
సమీరా:
చీఁదఱలాడుచు చేదువిసంబటు
నాదిల్దారే నన్ను త్యజించెను
చెంతను జేరడు, చేర్పడు కౌఁగిట,
చింతింపడు నాసేమం బింతయు

(దిల్దార్=ప్రియుఁడు, Darling)

సలీమా:
ఓరిమి దాల్చుట ఉత్తమకార్యము
మారదు నీపతి మతి సులభంబుగ
సమీరా:
ఆతపకృశమగు నాపగ కైవడి
ఆతని ప్రేమం బకటా! నాయెడ
నానాటికి క్షీణంబగుచున్నది
ఏనాటికి సుమియించెడి విరిలో
తావింబలె నాతనిలో వలపుల
తావులు పునరుదితము లగునో…
సలీమా:
కోరిన నెనరున, కొసరుచు వేఁడిన
మారునొ యేమో మాలికు చిత్తము

(మాలిక్=పాలకుఁడు,యజమాని)

కోరస్:
గప్‌చుప్ గప్‌చుప్ కనుఁడదె ముస్తఫ
ఠప్‌ఠప్ ఠప్‌ఠప్ ఠప్పున వచ్చును
శాంతిని బాపఁగ సాధ్వి సమీరకు
ధ్వాంతమువలె నాతఁడు వచ్చును

(ముస్తఫా తన అనుచరుఁడు ఖాదిముతో ప్రవేశించుచు పాడును)

ప్రతిదిన మదియే ప్రమదామణితో
కాలము బుచ్చుట కష్టప్రదము
అనుదిన మొక్కొక అబలామణితో
కౌఁగిట గడపుట కడు సౌఖ్యదము

కలకాలం బదె కాంతల యందున
మనసును నిల్పుట మంచిది గాదు
తొడుగం దొడుగం దొడుగులు మాయుట
తెలియని విషయం బిలలోఁ గాదు

కోరస్:
చిత్రం బతిచిత్రం బీతని తర్కము!
సలీమా:

(సమీరాతో ఏకాంతముగాఁ బల్కును)

అదరక బెదరక విదితము సేయుము
మదినిం గలఁచెడు నదవద భర్తకు

సమీరా:

(ముస్తఫాతోఁ బల్కును)

మున్నుగ నున్నటు నన్ను గ్రహింపరు
నన్నుం జూడరు, నాతోఁ బల్కరు
కన్నీరొలుకఁగ విన్నప మొనరుతు
మున్నటి విధముగ నన్నలరింపుఁడు

ముస్తఫా:
సున్నితమగు నా శ్రోత్రపుటంబుల
భిన్నము సేయును ప్రియ! నీ పల్కులు
మన్ననమీరఁగ మఱియొక మగనికి
నిన్నర్పించిన నన్నియుఁ గుదురును
నిన్నర్పించిన నన్నియుఁ గుదురును
ఇతరులు, కోరస్:
ఎంతటి హేయం బీతని చింతన
ఇంతులు బొమ్మలె యీతని మనమున
ముస్తఫా:
చంచలవలె చేలాంచలముంబలె
చంచలమగు నా స్వాంతము గోరును
నవనవ్యంబగు నారీగణముల
కవుఁగిళులందున నవసౌఖ్యంబును
ఇతరులు, కోరస్:
చంచలవలె చేలాంచలముంబలె
చంచలుఁ డీతఁడు; వాంఛించు సదా
నవనవ్యంబగు నారీగణముల
కవుఁగిళులం బ్రతినవసౌఖ్యంబును
ముస్తఫా:

(దర్పముతోఁ బల్కును)

గలగలవాగుచు నిలువకుఁ డిచ్చట
తొలఁగుడు మీరీ స్థలమున నుండక;

(ఖాదిముతో)

నిలువుము నాతోఁ బలుకఁగ ఖాదిము!

(ఖాదిము దప్ప ఇతరులందఱు నిష్క్రమింతురు)

ముస్తఫా:
వ్రాలు సుమమందు భ్రమరంబు వ్రాలనట్లు
చేర దిపుడు నామనము సమీరయందు
ఆమెనుం ద్యజించుట నింద్యమగును గాని
ఆమె భరణంబు దుర్భరం బంతకంటె

ఆమె నూరక త్యజియించినందువలనఁ
గలుగు నింద నోర్వఁగలేను గాన నేను
బానసీఁడును నిటలీయుఁడైనయట్టి
ఫిడెలియో కామె నర్పింతు పెండ్లికొఱకు

ఖాదిము:

(తనలో)

ఎంత ఘోరంబొ యీతని చింతనంబు
అర్పణము చేసి బానిస కాత్మసతిని
నవ్యతారుణ్యవతులైన నళినముఖుల
కౌఁగిలింతల సౌఖ్యంబుఁ గాంచ నెంచు!

(ప్రకాశముగా)

వాఁడు తౌరుష్కసంతతివాఁడు గాడు
అతని కిచ్చెదవెట్లు నీసతిని స్వామి?

ముస్తఫా:
ఐన నేమయ్యె? మాఱుమాటాడకుండ
తాల్మియుం బేర్మియుంబూని ధవుని కెపుడు
సంతసము గూర్చు తౌరుష్కకాంత గల్గ
నందమొందని యిటలీయు డెందుఁ గలఁడు?
ఖాదిము:
కాని యిస్లాము ధర్మవిధానమునకు
బాధకంబగునట్టి సంబంధ మేల?
ముస్తఫా:
ముస్తఫాప్రోక్తమౌ ధర్మ మొకటి దక్క
వేఱుధర్మంబు పుట్ట దీవిశ్వమందు
కావునం దామసింపక నీవు పొమ్ము,
బానిసీని ఫిడేలియోన్ ద్వరగఁ దెమ్ము.
ఇంకను…
అంతిపురమునిండ అతివలుండిరి గాని
వారిపొందు మనసు గోర దిపుడు
ఇంపుగొల్పుచుందు రిటలీందుముఖులందు
రట్టిదాని నొకతెఁ బట్టి తెమ్ము.
ఖాదిము:
స్వామి! దూరముండె నిటలీసీమ మనకు,
ప్రళయమందునఁ బోలె తుఫాను చాల
సాంద్రమై రేఁగుచుండెను సంద్రమందు
ఎట్లు గొనివత్తు నేనట్టి యింతినిపుడు?
ముస్తఫా:

(నిష్కర్షగా ననును)

వ్యవధినిత్తును వారంబువఱకు నీకు
అంతలోపల నాయింతి యంతిపురికి
మండనంబయి ననుఁ దన్పుచుండవలెను
లేకయుండిన సిలువయే నీకు ప్రాప్తి!

ఖాదిము:

(తనలో)

భళిర! నాభాగ్య మిప్పుడే పండుచుండె!

(నిష్క్రమింతురు)

రెండవదృశ్యము

(ఫిడేలియో తన పరిస్థితిని తలంచుకొని చింతించుచుండును)

ఫిడేలియో:
సుందరి నాచెలి సందిట నిటలీ
యందున సౌఖ్యము నందక నేనిట
బందీనై చిఱుబంటుగఁ గొనఁబడి
వందురుచుంటిని ప్రతినిమిషంబును

అంతం బెఱుఁగని అంబుధి కావల
సంతతచింతాసంక్రాంతుఁడనై
కాంతాస్మరణాకాంక్షయె మదికిం
గొంత ప్రశాంతిని గూర్పఁగ నుంటిని

తఱుగని ప్రేమను నిరతము దలఁచుచు
మఱవకయుండును మత్ప్రియ నన్నను
స్థిరవిశ్వాసమె చింతను కొంతగఁ
గరఁగించుచు నను గాచుచు నున్నది

ఎప్పుడు వాయునొ ఈ నిర్బంధము
ఎప్పుడు నాహృదయేశ్వరి నవ్వులఁ
జిప్పిలు తేనియ చినుకులఁ దోఁగుచు
ముప్పిరిగొను ముదముం గందునొ?

(ఇంతలో ముస్తఫా ప్రవేశించును. ఫిడేలియో అతనికి వంగి నమస్కరించును.)

ముస్తఫా:
బానిసీఁడ! నీకు పరిణయయోగంబు
కల్గనుండె నాదుకరుణచేత
అర్పణంబు సేతు నతివనొక్కతె నీకు
పెండ్లికొఱకు నిపుడె ప్రియము మీర
ఫిడేలియో:
ఇంత యాకస్మికంబుగ నిట్టి కరుణ
ఏల గల్గెనొ నాపైని మాలికునకు?
కాని కల్యాణ మేరీతిఁ గలుగు నాకు
ఎన్నడేనియుఁ జూడని కన్నెతోడ?

చూడని, ప్రేమింపని, మా
టాడని, భావం బెఱుఁగని యంగన నెటులం
గూడం జాలుదు పెండిలి
వేడుకయం దిది విచిత్రవిధమై తోఁచున్

ముస్తఫా:
కన్నెఁ జూడకున్నఁ గల్యాణమున కేమి?
వచ్చునామెతోడ బహుళధనము
అంతధనము రాఁగ నామె యెట్లున్నను
పెండ్లియాడవచ్చు ప్రియము మీర
ఫిడేలియో:
ధనము నిత్తురేని దయ్యంబువలె నున్న
వనితతోడ పెండ్లి వలదు నాకు
ముస్తఫా:
సందియంబు లేదు సుందరీరత్నమే,
ఆమెసాటి గారు అతివ లెవరు
ఫిడేలియో:
అందమున్న నేమి, ఆస్తి యుండిన నేమి,
మంచిగుణము లేని మగువ వలదు.
ముస్తఫా:
ఉన్నవవన్నియు న్మఱియు నున్నవి యింకను గొన్ని,
ఫిడేలియో:
ఎవ్వియో?
ఉన్నవె లేడికన్నులును, ఉన్నతసుస్తనయుగ్మశోభయున్,
సన్ననికౌను, చందనపుసౌరభమూనినమేను, చంద్రికా
సన్నిభమైన హాసము, కిసాలసమారుణకోమలోష్ఠముల్?

(భావానుసారముగా జూపి నటించుచు అడుగును; కిసాలము=చిగురాకు;
పై రెండు సంభాషణ లొకే ఉత్పలమాలలోని భాగము లనుట స్పష్టము)

ముస్తఫా:
అన్నియున్నవంచు విన్నవించితి మున్నె,
పాడినదియె మఱలఁ బాడనేల?
ఆలతాంగి నాకు నర్ధాంగియై యుండె
అందువలనఁ దెలియు నన్ని నాకు!

ఫిడేలియో:

(సందేహించుచు, తనలో)

ఎంత నీతిదూరుఁ డీతండు దలపోయు
స్వీయపత్ని నొసఁగ సేవకునకు
వినకయున్న నితని వెఱ్ఱినిర్దేశంబు
హానికలుగు నాదు ప్రాణములకె

పాట

ప్రియురాల! యేరీతి విందు నీతనిమాట
వినకున్న ప్రాణాలె వెడలించు నీతండు

పట్టువడి యిచట నీ పడవదొంగలకు
బంటునై దీనతం బడియుండి నేను
నిరతంబు నిన్నె ధ్యానించు చెదలోన
ప్రాణంబు లెట్లొకాపాడుకొనుచుంటి

నీతిమాలిన యితని నిర్దేశ మిపుడు
కారంబు జల్లినటు గాయంబునందు
నాల్గింత లొనరించి నావిరహబాధ
ప్రాణంబుకే ముప్పు వాటించుచుండె

ప్రియురాల! యేరీతి విందు నీతనిమాట
వినకున్న ప్రాణాలె వెడలించు నీతండు

ముస్తఫా:

(విసుగుతో ననును)

ఱాతివొ, కొయ్యవో యకట! రమ్యతరాంగిని, రాచకన్నియన్,
చేతము పల్లవింపఁగను జేయు వయారిని నుద్వహార్థమై
ప్రీతిగ స్వీకరింపుమని వేఁడఁగ, మీనము మేష మెంచుచుం
జేతువెదో వితర్కమును, చెప్పవు నీమది సత్వరంబుగన్.

(నిష్కర్షగాఁ జెప్పును)

విలువలేని తర్కంబుతో ఫలము లేదు
నాదు వాక్యంబులే శాసనంబు లిచట
కాన వేషాలు మాని నిష్కర్షగాను
స్వీకరింప సమీరాను సిద్ధమగుము

(నిష్క్రమింతురు)

మూఁడవదృశ్యము

(నేపథ్యములో ముస్తఫా పక్షమున వర్తించు పడవదొంగలు సముద్రపుపడవను అందులోగల ప్రయాణీకులతోను, బంగారువంటి విలువైన వస్తువులు గల పెద్దపెద్ద పెట్టెలతోను అపహరించుకొని వచ్చి క్రింద నిచ్చిన కోరస్ పాడుచు తీరమునందు దించుచున్న కోలాహలము విన్పించును. కోరస్ ముగిసిన తర్వాత తెర తీయబడును. పడవదొంగలు, వారు దింపిన పెట్టెలు, వారు అపహరించుకొని తెచ్చిన స్త్రీలు, పురుషులు గల దృశ్యము రంగములో కన్పడును. అపహరించి తెచ్చిన స్త్రీలలో ఇతరస్త్రీలతో బాటు బెలిండా అను అందమైన ఇటాలియను యువతి యుండును. ఆమెను గుప్తముగా ప్రేమించుచున్న వయసైన ఎమీలియో యను నతఁడు దొంగలు పడవను దోచుకొనునప్పుడు భయముతో నొక పెద్దపెట్టెలో దూరి యుండును. ఆ పెట్టెనట్లే దొంగలు తీరమునందు దింపుదురు.)

దొంగల కోరస్:
విలువైన బంగారు, వెలలేని వజ్రాలు
గల పెట్టెలివి మీరు బలముగా బట్టుఁడీ
కలసికట్టుగఁ బట్టి మెలమెల్ల నిసుకలో
నిలువంగఁ బెట్టుఁడీ నిలువంగఁ బెట్టుఁడీ!

బెదరుచుండిరి స్త్రీలు, మృదువుగా వారలం
బొదవుచుం గరములం భూమికిం దించుఁడీ!
మది మెచ్చి ముస్తఫా మనకుఁ గానుకలిచ్చు
పదిలముగ నతనికిం బంపుదము వీరినిన్

(ఖాదిము ప్రవేశించి, ఆశ్చర్యముతో ఆ పెట్టెలను, స్త్రీలను, స్త్రీలలో అత్యంతరూపవతిగా నున్న బెలిండాను చూచి పల్కును)

ఖాదిము:
వారె వా! వారెవా! వచ్చిరీ పడవలో
తారుణ్యవతులైన తరళాక్షు లెందఱో
వారలందఱియందు హారంబులో నున్న
పేరైన మణివోలె నీ రమణి రాజిల్లు

అంతిపురిలోన నీ యతివనే కన్నచో
సంతసంబున వేయు గంతులే ముస్తఫా!

బెలిండా:

(దీనముగా పాడును)

తోయధియాత్రకుఁ బోయి నివర్తిల్లని
నాయెద దోఁచిన నాథుని వెదకఁగఁ
బోవుచుఁ జిక్కితి నీ విషవలయంబున
ఏవిధమున దరియించెద నీయాపద
ఏవిధమున నా హృదయేశునిఁ గాంచెద
దైవంబేటికి దయతో ననుఁ బ్రోవడు?
నాప్రేమనిధానమ! నాదు ఫిడేలియొ!
నీప్రేమకె గద!నేనిది భరియింతును!
నీప్రేమకె గద!నేనిది భరియింతును!
నాప్రేమనిధానమ! నాదు ఫిడేలియొ!
నాప్రేమనిధానమ! నాదు ఫిడేలియొ!

కోరస్:
చక్కనగు నీకాంత సౌందర్యముం గాంచ
నిక్కముగ ముస్తఫా నేత్రాలువికసించు
బెలిండా:

(ధైర్యముతో పాడును)

చాలును, చాలును సంతాపంబులు
చాలిఁక, చాలిఁక సందేహంబులు
నాయందమె, నా నయగారంబే
ఈ యాపద తరియించెడు మార్గము

మరుతూపులవలె మదిలో దూఱెడు
సరసీజాక్షుల సరసపుఁ జూపులు,
దరహాసంబులు, తనుమంజిమ లే
పురుషుని మనముం గరఁగింపవు?

మసివలె నల్లని మనుజుండైనను
శశివలె తెల్లని సరసుండైనను
శశివదనల కనుసన్నల నాడెడి
పసికూనలె యై పరగుట సత్యము!

వీరుండైనను, భీరుండైనను,
చోరుండైనను, సుగుణుండైనను
వేరెవఁడైనను కోరున దొక్కటె
నారీసంగమ నవసౌఖ్యంబునె

తరణిం దోఁచిన తస్కరులైనను (తరణి=ఓడ)
పురుషులె వీరని మఱవఁగరాదు;
తరుణీవీక్షణతాపమె వీరిని
కరఁగించును హిమకణికలతీరున.

(పెట్టెలో దూరియున్న ఎమీలియో తెరువుమని పెట్టెను లోపలినుండి గట్టిగా కొట్టును. దొంగ లాపెట్టెను తెరచి, అతనిని పట్టుకొని వత్తురు.)

ఎమీలియో:

(దొంగలతో)

రక్షించండి! దయ ఉంచండి! కనికరించండి!

ఖాదిమ్:
నోరు మూసుకో! ఊరి శునకమా!
బెలిండా:
ఎమీలియో!
ఎమీలియో:

(ఇంకను సంక్షోభంతో)

రక్షించండి! దయ ఉంచండి! కనికరించండి!

బెలిండా:
ఎమీలియో! నేనే! ఇటు చూడు!
ఖాదిమ్:
ముసలీ! ఈ మోహిని యెవరు?
ఎమీలియో:

(సందేహిస్తూ)

ఏమని చెప్పుదు?

బెలిండా:

(సర్దుకొంటూ)

మేనమామ ఈయన!

ఎమీలియో:

(తడముకొంటూ)

నిజమే! ఈమె మేనమామ! అందుచే ఇద్దరం కలసి ఉండాలి.

ఖాదిమ్:
మీ ఊరూ?
ఎమీలియో:

(భయపడుతూ)

పీ…సా.. ఇ..ట..లీ!

ఖాదిమ్:
ఓహో… ఆహా… ఈహీ… ఇట్టలీ!
ఎమీలియో:

(ఇంకా భయపడుతూ)

ఔ…ను…

బెలిండా:

(ధైర్యంతో)

ఔను ఇటలీ! ఇంపైన ఇటలీ! సొంపైన ఇటలీ!

ఖాదిమ్:

(ఉత్సాహముతో బిగ్గరగా)

వహ్వా ఇటలీ! వయ్యారి ఇటలీ!

బెలిండా:
అంత విచిత్ర మేముంది?
ఖాదిమ్:
ఆహ! ఎంత చక్కని, ఓహొ! ఎంత చక్కని
ఆహ! ఎంత చక్కని చుక్క! ఓహొ! ఎంత చక్కని చుక్క!

సుస్తనీతతి కీర్ష్య గొల్పెడు
నిస్తులాకృతి గల్గు నీయమ
ముస్తఫా శుద్ధాంతకీర్తిని
విస్తరించును విశ్వమందున

అంతిపురమున కతులశోభను
సంతరింపఁగఁజాలు నీమెను
అప్పగించిన అతని కిమ్ముగ
మెప్పు గల్గును, మేలు గల్గును

(ఆ ఇటలీయుల నిద్దఱిని చూపుచు దొంగలతోఁ బల్కును.)

వెతలఁబెట్టక వీరి నిర్వుర
అతిథులంబలె నాదరింపుఁడు
అప్పగింతును ఱేపు వీరిని
గొప్పకాన్కగ ముస్తఫాకును

(మిగిలిన బందీలను చూపుచు దొంగలతో పల్కును)

పనులు సేయఁగ బానిసలుగాఁ
గొనుచు వీరినిఁ జనుఁడు మీరలు

(ఖాదిము దొంగలతో, బందీలతో నిష్క్రమించును. బెలిండా ఎమీలియోలు, బందీలుగా చిక్కిన స్త్రీలు, వీరి కాపలాకై దూరముగా ఇద్దఱు పడవదొంగలు మాత్ర మచ్చట నుందురు.)

ఎమీలియో:
అంతా అరిష్టం, సర్వనాశనం బెలిండా!
బెలిండా:
ఎందుకో?
ఎమీలియో:
శుద్ధాంతం…వినలేదా శుద్ధాంతం… శుద్ధాంతం?
బెలిండా:
వింటే?
ఎమీలియో:
సిద్ధమైతివె ముస్తఫా ముద్దు దీర్ప?
బెలిండా:
జరిగిపోయినదేదియు తిరిగి రాదు
ఒరుగదేమియుతర్కింప తిరిగి దాని
ఎమీలియో:
ఔనులే! అది మచ్చ గాదందు నేను
ఎఱుఁగనిది గాదు నీశీల మెంత ఘనమొ!
మున్ను నీవొక్క వయసునందున్నవాని
ప్రియునిగాఁగొంటివని నేను విననె వింటి!
బెలిండా:
అది నిజమె కాని సాగరయాత్రకేగి
అతఁడు రాడయ్యె బహుకాలమైనఁగాని
ఎమీలియో:

(ఎత్తిపొడుచుచూ)

అతని వెదకంగ నీసాధ్వి యాత్ర చేసి
అంకితంబయ్యె ముస్తఫా అంతిపురికి!

బెలిండా:
మఱి నీవో
ఎమీలియో:
వచ్చితిని నీకుఁ దోడుగ పడవయందు
కాని నీయందు ప్రేమంబు క్రమముగాను
పెంచుకొనుచుంటి, నిప్పుడీ పిడుగువంటి
వార్త వినఁగానె నాయెద పగులుచుండె,
బెలిండా:
అయ్యయో యెంతటి ప్రమాదమావహిల్లె!
కట్టుకొను మెద కొకపట్టి గట్టిగాను
ఫట్టుమంచెద ముక్కలై పడకయుండ;
ఇట్టి భీరుని వరియింప నెపుడునేను!

ఎమీలియో:
భీరువునని నన్నూరక దూఱకు
నారీజనములు నచ్చెడు పోఁడిమి
కూరిమి యోరిమి గూడినవాఁడను
బెలిండా:
ఈమోఱకు వరియించెడి వారల
నేమనవలె వారెంత యభాగ్యలొ
ఎమీలియో:
అవమానింపకు మవలేపముతో
అవనిం గల్గిన యతివల యందున
ఎవతో యొక్కతె యిష్టంబుగ నను
వివహంబాడఁగఁ దివురక పోవదు
బెలిండా:

(చులకన చేయుచు)

ఆవధు వెవరో అయ్యో! ఆమెను
బ్రోవును గావుత దైవమె దయతో

(విచారముతో)

అది యేమైనను హృదయేశునికై
వెదకుచు నిచ్చట వీరికిఁ జిక్కితి
కనలేక విమోచనమార్గంబును
వనరుచునుంటిని పరదేశంబున

నీతియు రీతియుఁ బ్రీతియు నెఱుఁగక
నాతుల శుద్ధాంతంబుల బొమ్మల
రీతిగ నుంచెడు స్త్రీసుఖలోలుర
చేతులఁ బడి కడు చింతిలుచుంటిని

ఎమీలియో:
నీకంటెను నాస్థితి కడు హీనము
వేకువనుండియు రాతిరి దాఁకను
నీరాహారంబుల నీయక యే
భారంబుల భుజముల నెత్తించుచు

ఏరీతిగ నను బాధింతురొ, వీ
రేరీతిగ నను హింసింతురొ?
ఇది యంతయు నూహింపఁగ నా
యెద వ్రక్కలె యగుచున్నది

బెలిండా:
వలలోఁ జిక్కిన జలచరములవలె
వెలువడు వెరవుం దెలియక యుంటిమి
ఎమీలియో:
కలహించుచు నిటు లలమట నొందక
తెలివిగ నొకటై మెలఁగుట మంచిది
బెలిండా:
ఇరువుర మొకటై ఇఁక నీ యాపద
తరియింపం దగు దారిని గందము
ప్రియమగు మామ యెమీలియొ!
ఎమీలియో:
ప్రియమగు కోడల బెలిండా!
ఇర్వురు:

(వదులుగా కౌఁగిలించుకొనుచు పాడుదురు)

ఈముస్తఫా కుతంత్రము
లేమియు సాగంగనీక యిఁక నేర్పున నీ
మామయు కోడలు నొకటై
స్థేమముతోడం దరింత్రు సేగుల నెల్లన్

నాల్గవదృశ్యము

(ముస్తఫా ప్రాసాదము. సమీరాసలీమాలు వెనుక కొంత దూరముగా నుండగా ముస్తఫా ఫిడేలియోతో మాట్లాడుచుండును.)

ముస్తఫా:
కలదు నీకొకవార్త, కల్యాణకరమైన వార్త
వెలలేని వజ్రాలు, వెండిబంగారములతోడ
జలధిలో నిటలీకిఁ జనుచున్న నావనుం బట్టి
బలవంతముగ చోరవర్గంబు గొనివచ్చె నిటకు
విలువైన సరకెల్ల వేగనిట దించి యానావ
తొలఁగిపోవగనుండె తొలిమార్గమున నిటలీకి
తలఁతు నేనందులోఁదరలింప నిటలీకి నిన్ను
తలపడుము వెంటనే దానిలోఁ బయనింప నీవు
ఫిడేలియో:
ఎంతటి సువార్త సుల్తాన్!
సంతసమునఁ బూర్ణిమానిశార్ణవమటు నా
స్వాంతం బుప్పొంగెను, నా
యింతినిఁ గనుభాగ్యమొదవె నిటలీయందున్

వానజల్లు లెడారిలోఁ బడినయట్లు
నాయెడం గురిసెను మీఘృణారసంబు
స్వేచ్ఛగా నన్ను నిటలీకిఁ జేరుకొనఁగ
అనుమతించిన మీకిదె యంజలింతు.

ముస్తఫా:
గాలిలో మేడలనిపుడె కట్టఁబోకు
నా సమీరను నీతోడఁ దీసికొనుచు
నేగవలె, నిందుకొడఁబడవేని నీవు
ఖైదివై యిట కాలంబు గడపవలెను
ఫిడేలియో:
ఆహా! అదియే నేను గోరునది!

(అసమ్మతిగా తనలో పైమాట ననుకొనుచు కొంత సంశయించును)

ముస్తఫా:
ఆమెతోఁగూడి స్వేచ్ఛగా నధివసింప
ద్రవ్యమిత్తును నీకు పర్యాప్తముగను
ఫిడేలియో:
ఆమె నట్లు పెండ్లాడుదునేమొ నేను!
ముస్తఫా:
భళిర! ఉత్తమోత్తమము నీ భావసరణి!

నీవధిరోహింపనిదే
నావను దోలఁగవలదని నాయానగ నా
నావనడుపరికిఁ దెల్పఁగ
నీవేగుము, నిశ్చితంబు నీపయన మిఁకన్

ఫిడేలియో:

(తనలో)

అకట! సమీరనుం గొనక యానమొనర్పఁగరాదటంచు నీ
వికృతవివేకి నన్నిటనె భృత్యునిగాఁ బడియుండఁ గోరు, లే
దిఁక మఱుదారి యేదియును, ఏగెద నామెను గొంచు స్వేచ్ఛమై
సుకముగ నుండఁగా భువనసుందరమైన వెనీసునందునన్.

(ప్రకాశముగా)

స్వామి! మీయభీష్టంబును చక్కగాను
వారి కెఱిఁగించి త్వరగానె వత్తు నేను

(నిష్క్రమించును. వెనుక దూరముగానున్న సమీరాసలీమాలు ఇప్పుడు ముందరికి వచ్చి మాట్లాడుదురు.)

సలీమా:
ఎంతటి సాధ్వీమణివో?
ఇంతగ నవిధేయుఁడైన యీతని నింకన్
ఎంతువు పతిగా, వెదకఁగ
నెంతువు దయ నతని క్రూరహృదయమునందున్
సమీరా:

(సలీమాతో)

అది దోసంబనియే యెఱుఁ
గుదు నైనం దఱుగకుండె కూర్మి యతనిపైన్

(సమీపించి, ముస్తఫాతో దీనంగా)

ఇది నిజమేనా? తలఁతురు
వదలించుకొనంగ నన్ను వాలాయముగన్?

ముస్తఫా:
దాఁపరిక మేమియును లేదు తలిరుబోఁడి!
ఓడలో ఫిడేలియొతోడ నేఁడె నిన్ను
నిశ్చయించితిఁ బంప వెనీసునకును
సిద్ధపడుము నీవిఁక జాగు సేయకుండ.
సలీమా:
ఎంత క్రూరుం డెంత కృతఘ్నుండు!
ఖాదిము:

(సరభసంగా ప్రవేశించి)

జయము జయము జాయీమన్!

(సూచన:జాయీమన్ అంటే అరబ్బీభాషలో ప్రభువు, పాలకుడు అని అర్థం)

ముస్తఫా:
సఫలమైనట్లు దోఁచు నీ శ్రమము కొంత!
ఖాదిము:

(అతిసంతోషంతో)

కొంతయె కాదంతయు, న
త్యంతం బనవలె, లభించె నందంబున స్త్రీ
సంతతి కవతంసంబయి
కాంతిలు నిటలీ ప్రభూత కాంతామణియే!

ముస్తఫా:

(ఖాదిముతో)

ఎంతో యోగ్యుఁడ వీవని
యింతటితో రూఢి యయ్యె, నింక మదీయా
త్యంతశ్రీయుతమగు శు
ద్ధాంతమునకుఁ జేర్చుమామె నట నేనుందున్.

ముస్తఫా:

(సమీరాతో)

మీనముమేషము లెంచక యానంబునకుం గదలుము
రేవున నాయత్తంబయి నావ నిరీక్షించును నీకై

(సలీమాతో)

నిను ప్రియమగు సేవికగా గణియించు సమీరా
కావున నామెకుఁ దోడుగ నీవును బొమ్ము సలీమా

(పై వాక్యములను నిష్కర్షగా నుడివి ఖాదిముతోనిష్క్రమించును)

సమీరా:

పాట

పల్లవి:
అనురాగముతో నర్పించితి సర్వంబును
నను నీవీవిధమున నెడజేయుదు వెందుకు
చరణం1:
కసరిన గదరిన రుసరుసలాడినఁ గానీ
ఇసుమంతయు నీయెడ రోసం బూనక
ప్రతినిమిషము నీభద్రంబునె నే నెంచితి
సతతము నిన్నే స్వాంతంబున భావించితి ॥అనురాగముతో…॥
చరణం2:
పావనమైన వివాహశుభాహమునందున
నీవు వచించిన నిర్మలనియమార్థంబులు
నీరై నిండెను నీహృదయంబున నిప్పుడు
తోరపు పరకాంతారతి నిరతాధ్యానమె ॥అనురాగముతో…॥
చరణం3:
ఎన్నో చేసితి విట్టి యకార్యము లైనను
నిన్నే నమ్ముచు నీకడ నోర్చుచు నుంటిని
అన్నియుఁ జాలక నన్నిపు డీయఁగఁ జూతువు
నిన్నటిదాఁకను నీ సేవకుఁడగు వానికి ॥అనురాగముతో…॥
చరణం4:
ఇంతలు చేసిన నింకను నామది యెట్టిదొ
చింతించును నీచెంతనె సుఖముం గనుఁగొన
న్యాయము చేయును నాకల్లా యెటులో యను
ధ్యేయం బొకటే ఆయువు నింకను నిల్పును ॥అనురాగముతో…॥
ఫిడేలియో:

(ప్రవేశించి)

రేవులో నిటలీకేగు నావ యొకటి
సిద్ధమయి మనకై నిరీక్షించుచుండె
చేరఁ బోవలె మలికా సమీర! మనము
ఆలసించిన ముస్తఫా ఆగ్రహించు

(అరబ్బీభాషలో మాలిక్=ప్రభువు,యజమాని; మలికా=రాణి)

సమీరా:
కాని నావ నెక్కక మున్ను గాన నెంతు
మాలికును కడసారిగా మమత దీర
సలీమా:
ఏమి యందును, పిండఁగా నెంచుచుండె
ఱాతిలో నీమె పీయూషరసపుధార!
ఫిడేలియో:
ఆమె భావ మాక్షేపణీయంబు గాదు
శాశ్వతంబుగ దేశంబు సంత్యజించి
పోవుటకుముందు దరిసించి ముస్తఫాను
అతని సెలవుగైకొనుట న్యాయ్యంబె మనకు

(అని చెప్పి, సమీరాతో నిట్లనును)

నీయెడ నిట్లు వర్తిలెడు నీతనియందున నింక నీకు నా
ప్యాయపుభావమెట్లు చ్యుతమై చనకుండెనొ, నీదురూపముం
బ్రాయము మంజిమంబుఁ గని రక్తిమెయి న్నిటలీయులెందఱో
జాయగ నిన్నుఁ గోరుదురు; సంశయ మిందున లేదొకింతయున్

కోరని పతితో నేటికి
బేరములాడుట, సుఖమును, స్వేచ్ఛయు, ప్రియతా
పూరము గల్గిన యిటలీ
జేరం జనుదము సమీర! చేరుము నాతోన్

ఐదవదృశ్యము

(వైభవాన్వితమైన శుద్ధాంతభవనము. సేవికలు విలాసవంతమైన దుస్తులతో ముస్తఫా నలంకరించుచుందురు. రంగమునకు వెనుకభాగమున కోరస్ [వందిమాగధగాయకబృందము] ఉండును.)

కోరస్:
మదనునిగజములమాదిరి లొంగని
ముదితల గర్వంబుల నడఁగించెడు
మదనక్రీడామర్మవిధిజ్ఞుఁడు
మదనావేశితమతి మనముస్తఫ!
మదనావేశితమతి మనముస్తఫ!
ముస్తఫా:
వరమగు రూపము పరువము గలదను
గరువముచేఁ జిక్కరు సులభంబుగ
పురుషులకిటలీతరుణులు గానీ
యెఱుఁగరు వారీ తురకప్రభువును

లొంగని యువతుల కంగజలీలల
రంగుగ నేర్పెడి రమ్యాశ్రమ మీ
హంగుల నమరిన అంతఃపురము
అంగన లిందున లొంగక తప్పదు

ఆ యిటలీకాంతాలింగనమున
హాయిని గాంచఁగ నాకాంక్షింతును;
ఏయెడ కేగెనొ ఆయువతిం గొని
ఈయెడకున్ రాడాయెను ఖాదిము

కోరస్:
మదనావేశితమతి మనముస్తఫ!
మదనావేశితమతి మనముస్తఫ!
ఖాదిము:

(సగర్వముగా ప్రవేశించి)

ఆఅందాలబరిణ బయట వేచియున్నది

ముస్తఫా:
కొనిరమ్ము లోనికి!

(ఖాదిము ఆమెను ముస్తఫా ఎదుటకు గొనివచ్చును)

ముస్తఫా:

(ఆమెను చూస్తూ ఆశ్చర్యంతో)

అహహ! నేఁడుగా సార్థక్యమావహిల్లె
తాల్చినందుకు కనుదోయి తనువునందు

కోరస్:
అచ్చర నిల్చెను అంతఃపురమున
ముచ్చట దీర్పఁగ ముస్తాఫాకును
అచ్చర నిల్చెను అంతఃపురమున
ముచ్చట దీర్పఁగ ముస్తాఫాకును
బెలిండా:

(తనలో)

ఏమి రూపం బేమివేషము
ఏమి చెలువం బేమి చూపులు
ఎలుగుబంటియు నితని సులువుగ
చెలువమందున గెలువఁగల్గును

ఇతనిరూపం బిట్టు లున్నను
ఇతని చిత్తం బెపుడు గోరును
సౌరుకత్తెల సంగమంబునె

ఈ రిరంసయె ఈస్వభావమె
ఇగురుఁబోఁడుల కితని లోఁగొనఁ
దగిన సాధన మగుట తథ్యము

ముస్తఫా:

(తనలో)

సొలయుచుఁ గనుచుంటి మదిం
గలఁచుచు నెదుటను నిలిచిన కాంచనగాత్రిన్,
ఇలకుం దిగి నాయెదుటను
నిలిచిన వీనసొ యనఁదగు నీరజనేత్రిన్

వలలోఁ జిక్కిన మీనము
వలె నామది యీలతాంగి వలపులరసముం
జిలికెడు చూపుల వలలో
పలఁ జిక్కె,వశంబు దూలె వపువునయందున్

బెలిండా:

(దీనంగా)

కొందలమందుచు నీరధి
యందున నాపద కెరయయి, అవనీశ్వర! మీ
ముందర నిల్చితి, నాదుకొ
నం దగు నను మీరలు కరుణాళువు లగుచున్

ముస్తఫా:

(తనలో)

చక్కన రూపం, బింకను
చక్కన యీచెలి మిఠాయిసమమగు పలుకుల్;
మక్కువఁ బుట్టించుచు నవి
ఉక్కిరిబిక్కిరిగఁ జేయుచుండెను నన్నున్

ఈ యిటలీ వాల్గంటుల
సోయగ మేమనఁగ వచ్చు, సురుఁగక స్థిరమై
యీయువతుల తనురుచి అ
ధ్యేయంబై తగు మెఱుంగుతీవల కిలలోన్

(గమనిక: పై పద్యంలో ‘ఇలలోన్’ అనుపదంవల్ల ఆకాశంలో క్షణమాత్రం మెఱిసే మెఱపులు భూమికి దిగివచ్చి ఆ యిటలీకాంతలయొక్క స్థిరమైన తనురుచిప్రకారము నభ్యసింపవలెనను విశిష్టార్థము కల్గుచున్నది. క్షణమాత్రమే కాంతి గల్గియుండుటచే మెఱపులకు ‘క్షణప్రభ’లని కూడ పేరు; ఇంతలో అలజడి. ఎమీలియో లోపలికి ప్రవేశింప యత్నించుచుండఁగా ఖాదిము ఆతనిని నివారించుచుండును)

ఎమీలియో:

(ఖాదిముతో)

ఆపకాపకు నన్ను, ఆపకాపకు నన్ను
ఆమె మామెను నేను, ఆమె మామను నేను

(అట్లు పెనగులాడుచున్న ఎమీలియోను ఖాదిము పట్టుకొని వచ్చును.)

ఎమీలియో:

(ముస్తఫాను, బెలిండాను పరీక్షగా చూచి అలజడి చెందుచు ఆత్మగతముగా నిట్లనుకొనును)

కామపూరితదృక్కుల నీమె నెట్లు
కప్పుచుండె నీ తౌరుష్కగార్దభంబు!
అకట!అతని కీమెయు వశ్య యయ్యె నేమొ?
ఐన గతి యేది నాప్రణయంబు కింక!

(ముస్తఫాతో ప్రకాశముగ)

నా యభ్యర్థన నాలింపుడు సుల్తాన్
జాయీమన్ బాద్‌షా యికిందాశ్!

ముస్తఫా:
పానకంబులోన పుడుక వోలె వెఱ్ఱికుక్క వీఁడెవండు?
వెలికి గెంటి వేసి వీని చర్మమొలిచివేయుఁ డిపుడె!

(ఆమాటలు విని ఎమీలియో భయముతో వణకుచుండగా ఖాదిము అతనిని బలవంతముగా పట్టుకొని తీసికొని పోవ యత్నించును)

ఎమీలియో:

(ఏడ్చుచు)

అయ్యో అయ్యో నేనీ
తొయ్యలి మామను, ‘బెలిండ! తోలొలువంగా
చయ్యన ననుఁ గొని చనుచుం
డ్రయ్యో నీవైనఁ గావుమమ్మా నన్నున్’

బెలిండా:

(నిష్కర్షగా)

విడువుఁడు నా మామయ్యను
ఉడుగుండిఁక మీ యమానుషోద్యోగంబుల్
వడఁకుచు జడియుచుఁ దత్తఱ
పడుచుం దీనుఁడఁయి యుండె పాపం బతఁడున్

ముస్తఫా:

(తనలో)

బ్రతుకనిచ్చిన వీని నీ ప్రమద నాకు
వశ్యురాలగుం గద! సులభంబుగాను

(ప్రకాశముగా)

వాఁడీమె మామ యఁట! వదలండి వానిని.

బెలిండా:
మేలు మేలు మియో తెసోరో! తెలిసికొంటి విటలీయుల వలచు తీరు
ముస్తఫా:
‘మియో తెసోరో, ‘మియో తెసోరో’’, ఏమీ ‘మియో తెసోరో’?
బెలిండా:
అది వశీకరణమంత్రం!
ముస్తఫా:
ఓహో! అది స్త్రీవశీకరణమంత్రం!
మియో తెసోరో బెలిండా! మియో తెసోరో బెలిండా!
వలపుతో నిండె నాగుండె బెలిండా!

(ఇటాలియనుభాషలో మియో థెసారో అంటే నాప్రియతమా, నాప్రాణధనమా అనిఅర్థము)

ఖాదిము, కోరస్:

అదిగొ, సింహంబు గార్దభం బగుచునుండె!
అంతరించె నీతనిబుద్ధి సాంతముగను

(ఇంతలో సమీరా,సలీమా, ఫిడేలియోలు మువ్వురు ప్రవేశింతురు)

మువ్వురు:
ఆయత్తమగుచుంటి మంబుధిం దరియించి
మీయాన తలదాల్చి మేమేగ నిటలీకి
ఏకష్టమెదురౌనొ మాకచ్చటం గాని
మీకరుణచే నిందు మేలుగా నుంటిమి
పరదేశమందున న్వసియించుచున్నను
మఱవంగలేము మీ కరుణావిశేషంబు
అందుకై యాత్రకున్ముందుగాఁ గడసారి
వందించి మిము, మీశుభాశీస్సులం బొంది
యానంబు సేయు టగు నార్యధర్మంబంచు
పూని వచ్చితిమిటకు ముస్తఫాప్రభువర్య!

(బెలిండాఫిడేలియాలు ఒకరినొకరు చూచికొని, ఆశ్చర్యముతో అంతరంగములోని భావములను వ్యక్తీకరించుచు క్రిందివిధముగా పాడుదురు. వారి ప్రవర్తనను ఇతరులు ఆశ్చర్యముతో గమనించుచుందురు. వారట్లు పాడెడు వాక్యములు వానికి క్రింద నిచ్చిన చంపకమాలలోని భాగములు)

బెలిండా:
అకట! ఫిడేలియో? కలయ? అంజనమా యిది?
ఫిడేలియో:
ఓ! బెలిండయా నికటమునందునుండె, నిది నిక్కమ, లేక మతిభ్రమంబ?
బెలిండా:
తప్పక యితఁడౌను మత్ప్రియుఁడె, పట్టువడంగనుబోలు వీరికిన్
ఫిడేలియో:
వికలమనస్కయై నను గవేషణసేయుచు నీమె వచ్చెనో?

(చ.అకట! ఫిడేలియో? కలయ? అంజనమా యిది? ఓ! బెలిండయా
నికటమునందునుండె, నిది నిక్కమ, లేక మతిభ్రమంబ? త
ప్పక యితఁడౌను మత్ప్రియుఁడె, పట్టువడంగనుబోలు వీరికిన్,
వికలమనస్కయై నను గవేషణసేయుచు నీమె వచ్చెనో?)

బెలిండా:
‘మియామోరే ’
ఫిడేలియో:
‘మియామాతో’

(పైవిధంగా సంబోధించుకొంటూ వారాలింగనం చేసికొనబోతుండగా, ముస్తఫా ఈర్ష్యాగ్రహములతో వారిని వేఱుచేయవలసిందిగా ఖాదిమునకు సైగ చేయును. ఖాదిము వారిని వేఱు చేయును. అట్లు సేవకుఁడైన ఫిడేలియాతో చనువుగా నున్నందు కామెను చెఱసాలకు గొనిపొమ్మని ముస్తఫా ఖాదిము నాదేశించును. అర్థవివరణ: మియా=నా, అమోరే= ప్రియా, అమాతో= ప్రేయసీ – అని ఈ ఇటాలియను పదాల కర్థం. ఇవి ఉభయ లింగాలకు వర్తించే పదాలు. ఉచ్చారణలో ఇటలీయులు మనలాగే రెండు పదాలకు సవర్ణదీర్ఘసంధి చేసి వాని నేకపదంగా పలుకుతారు)

ముస్తఫా:

(ఖాదిముతో)

నాసేవ కంకితంబైన యీకాంత
నాసేవకుని యందు మర్లుగొనుచుండె
ఘనమైన నేర మీవర్తనము గానఁ
గొనిపొమ్ము చెఱసాల కీయింతి నిపుడె

బెలిండా:

(పెద్దగా నవ్వుతూ)

ఎంత బేలవు ప్రభువర్య! ఇంతయేన
నీదు రసికత్వ, మింతేన నీదు యోషి
తామనోభావసంవేత్తృతామనీష?
నేర్వవలసిన దింకెంతొ నీకుఁ గలదు!

మీకంకితమయి యుంటిని
మీకింకరుఁ గోరి యేమి మేలును గందున్?
రాకాచంద్రునిఁ గోరక
చీఁకటినిం గోరి యెవతె చింతను గుందున్?

ముస్తఫా:
త్వరతోడ నీపైని తప్పుమోపితి నేను
తరళాక్షి! మన్నించు దయతోడ నన్ను
బెలిండా:
మియామోరే, మియామాతో
తీయనౌ ఈరెండు మంత్రాలు
తోయలుల మనసులం గరగించి
నీయందు ప్రేమంబు గలిగించు

ఈమంత్రములతోడ నిటలీయ
కామినులు నీకు వశవర్తులై
నీమోజు చెల్లింతు రందుచే
ఏమఱక వల్లింపు మిఁక వీని

ముస్తఫా:

(జపించుచుండును)

మియామోరే, మియామాతో
మియామోరే, మియామాతో …
ముస్తఫాబెలిండాలు గాక ఇతరులందఱు, కోరస్:

సంశయము లేదెంతమాత్రము
భ్రంశమయ్యెను నితని స్వాంతము
భ్రంశమయ్యెను నితని స్వాంతము

బెలిండా:
నీదు జపమున నిశ్చయంబుగ
నాదుడెందము కరఁగుచుండెను
ముస్తఫా:

(గర్వముతో)

భళిర! ముస్తఫా! నీప్రేమపంట పండె
ఆఫ్రడైటీయె నీవశం బయ్యె నిపుడు
ఈమె నేర్పిన మంత్రంబు నీమె పైనె
పన్ని విజయుఁడ వైతివి వలపునందు

బెలిండా:

(సమీరాను చూపుచు)

ఈమె యెవ్వతె?

ముస్తఫా:
భార్యయే యగు నింతవఱకీమె!
బెలిండా:
ఇఁకమీఁద భార్య కాద?
ముస్తఫా:
పీడవలె నేఁడె యీమెను విడిచిపుచ్చి
ఈ ఫిడేలియోకు సతిగ నిచ్చుచుంటి
క్రొత్తకొత్తగ నీవంటి కొమిరెలుండ
ప్రాతకాలపుభార్యతోఁ బాటు లేల?
బెలిండా:

(తనలో)

ఎంత వినీతుం డెంతటి కాంతాలోలుఁడు!

(ప్రకాశముగ)

సాధ్వియును, సుందరియు నైన జాయ నిట్లు
దూర మొనరించు పురుషునిం గోర నేను
వలతువేని సంతసము గూర్పంగ నాకు
ఈమెనుం ద్యజియింపక యేలుకొనుము

ముస్తఫా:
అసాధ్యమది.
బెలిండా:

(గంభీరంగా)

ఆహ! తెలిసిపోయెను నన్నీవు వలచుట లేదని

ముస్తఫా:

(అలజడితో)

లేదు.. లేదు.. అది నిజం కాదు

బెలిండా:

(ఫిడేలియోను చూపించుచూ)

ఐన విను మిదియును సావధానముగను
చేయవలె నీ బడుగును నా సేవకునిగ

ముస్తఫా:
అది అసాధ్యము
బెలిండా:

(గంభీరంగా)

తెలుపుచున్నది వలపులేదని నీదుధోరణి
నిలువదింతయు నీదు చిత్తము సుస్థిరంబుగ
గెలువలేదీ చెలువ మానస మట్టి చిత్తము

ముస్తఫా:

(అలజడితో)

కాదు కాదది నిజము గాదు. నీ యభీష్టమే జరుగును. నీ యభీష్టమే జరుగును.

(తనలో)

సర్వశాసకుండను నేను గానా? నన్నె శాసించుచున్న దీమె!

కోరస్:
తారాపథమే ధరణికి జాఱెను
పారావారమె పడియగ మారెను
గిరియే కూలెను చిఱుగాడ్పునకు
కరియే తూలెను గఱిక వ్రేటునకు
కేసరి యిప్పుడు మూషికమయ్యెను
శాసకుఁడిప్పుడు శాసితుఁడయ్యెను
అస్తవ్యస్తం బయ్యె సమస్తము
అస్తవ్యస్తం బయ్యె సమస్తము

(ప్రథమాంకము సమాప్తము)

ద్వితీయాంకము

మొదటిదృశ్యము

(ముస్తఫా భవనంలో సుందరమైన గది. సమీరాసలీమాఖాదిములు, తర్వాత ముస్తఫా)

కోరస్:
రతిచింతయే నిండె మతిలోన నెపుడు
మతి దప్పె ముస్తఫామాలికున కిపుడు
సమీరా:
ఏమాయ పన్నెనో యిటలీయురాలు
ఆమాయలోఁ జిక్కి ఆద్యంతముగను
అనిశంబు జపియించు నామె నామంబె
కనడింత వినడింత మనమాట నతఁఁడు
సలీమా:
చతురురా లాయింతి స్వార్థంబుకొఱకు
అతిరక్తి నటియించు నతనిపై నిపుడు
ఆరక్తి అవ్యాజమని నమ్మి యితఁడు
ఆరామపొందుకై ఆరాటమొందు
కోరస్:
రతిచింతయే నిండె మతిలోన నెపుడు
మతి దప్పె ముస్తఫామాలికున కిపుడు
ఖాదిము:
అతిమోహనంబైన యామె తనుకాంతి
అతని ప్రేమోన్మాదయుతునిగాఁ జేసె
కనుచూపుతో నామె కనుకట్టు చేసి
క్షణములో నతని వశ్యంబు చేసికొనె

కోరస్:
రతిచింతయే నిండె మతిలోన నెపుడు
మతి దప్పె ముస్తఫామాలికున కిపుడు
ఖాదిము:
శాంతంబు! ముస్తఫా చనుదెంచు నిటకు
ముస్తఫా:

(ప్రవేశించి, సమీరాసలీమాలను జూచి పల్కును)

చేరెద మధువుం ద్రావఁగ
నా రమణీయ యిటలీయ యౌవనవతితో
నీ రజనీముఖమందని
మీరామెకుఁ దెల్పఁ బొండు మృదుతరఫణితిన్

సలీమా, సమీరాలు:
సర్వవేళల మీపూన్కి సల్పఁగాను
శ్రేయముం గూర్చు సేవలం జేయఁగాను
వేచియుందుము ప్రభువర్య! వేగ నిపుడె
మీదు పనుపును జేయంగఁ బోదు మేము
సలీమా:
కాని జిత్తులకత్తె యాకాంత మిగుల
నమ్మగా రాదు మీర లానాతి నెపుడు!
సమీరా:
ఆమె చేష్టలు వయ్యార మటులె యుండె
విశ్వసింపంగరా దామె వేషములను
ముస్తఫా:
పుట్టుటకు ముందె స్త్రీజాతి పుట్టె నీర్ష్య
అన్నసామెత మీయందు నయ్యె నిజము
ఆమె గుణముల నెఱుఁగనియట్టి వట్టి
మందుఁడనె? మానుఁ డీశంక మగువలార!

రెండవదృశ్యము

(ముస్తఫా భవనంలోని చిన్నగదిలో బెలిండా, ఫిడేలియోలు)

బెలిండా:

(విచారంతో)

వెదకఁగ వచ్చి నాప్రియుని భీకరచోరులహస్తమందు నా
పదలను బొంది యీ తురకవల్లభు కైవసమైతి, నాప్రియుం
డదయత విస్మరించి నను నన్యవధూగ్రహణార్థి యయ్యె, నిం
పొదవు వెనీసునందు సుఖముండక చిక్కితి నీ యెడారిలోన్

ఫిడేలియో:

(ప్రవేశించి)

అహహ! ఏకాంతమందు నిన్నరయఁ గల్గు
గొప్ప యవకాశమిప్పుడు గూడె నాకు

(అని సంతోషంతో బెలిండాను సమీపించును. కాని బెలిండా అతనియందు విముఖతను ప్రదర్శించును. ఆమె ననునయించుచు నతఁడిట్లనును)

వీడుము వైముఖ్యము సఖి!
వాడిన పువువోలె నుండ వల్లభు నెదుటం
బాడియె? నమ్ముము నను, నీ
తోడిదె ప్రాణంబు నాకుఁ, దొఱఁగుము కినుకన్
బెలిండా:

(న్యక్కారంతో)

మఱచితి వేనాఁడో నను,
దొరకొంటివి పెండ్లియాడ దొరసానిని, నీ
మెఱమెచ్చులతో నిప్పుడు
మఱపింపఁగఁబోవ కీ యమానుషకృతులన్

ఫిడేలియో:
అకట! యథార్థముం గనక అల్కవహింతువు; విస్మరింప నే
నొక నిముసంబునేని నిను; ఉద్వహమాడ సమీర నాత్మలో
నొకపరియేనిఁ గోర, నిట నుంటిని నీపరిరంభణంబులో
సుకమును గాంచఁగాఁగలుగు శోభనవేళ నిరీక్ష సేయుచున్
బెలిండా:
నమ్మం దగినవి యేనా కమ్మని నీపల్కులు?
ఫిడేలియో:
నామాటలె పొల్లయినన్
నామానసమందు నితరనారీమణులం
గామించినచో, నిపుడే
నా మే నశనిక్షతమయి నాశం బగుతన్
బెలిండా:
అంతఘోరం బనవసరంబు.
నిన్నునమ్మెద నిశ్చయంబుగ.

(కౌఁగిలించుకొనును. కౌఁగిలిలోనే యుండి ఈక్రింది రెండు పద్యములను పాడుదురు.)

ఫిడేలియో:
మగుడ వసంతారంభం
బగుచుండెను మన బ్రతుకులయందునఁ, ద్వరగా
మగుడఁగ మన మిటలీకిం
దగు వ్యూహంబును రచింపఁ దలకొందమిఁకన్
బెలిండా:
ఇంతకంటెను కర్తవ్య మేమి గలదు?
మోహముగ్ధునిఁ గావించి ముస్తఫాను
ఉదధిపై ననుఁ దెచ్చిన యోడలోనె
చేరుదము మన మిటలీకి స్వేచ్ఛగాను

మూఁడవదృశ్యము

(ముస్తఫా ప్రాసాదం. వందిమాగధుల కోరస్ వెనుక నుండగా ముస్తఫా కొలువుదీరి యుండును. ఇంతలో వాడిబల్లెములు ధరించిన ఇద్దఱు భటులు త్వరత్వరగా తఱుముచున్నట్లు వెనుక నడచుచుండఁగా భయవిహ్వలుఁడై రోజుచు ఎమీలియో ప్రవేశించును.)

ఎమీలియో:
రక్షించు సుల్తాన్ ముస్తఫా రక్షించు రక్షించు!

ముస్తఫా:
ఏమైన దేమైనది?
ఎమీలియో:

(భటులను చూపిస్తూ)

చర్మ మొలువఁగ వీరు సన్నద్ధు లగుచు
తఱుముచున్నారు నిష్కరుణులై నన్ను
ఎట్టి కష్టములైన బెట్టుండు గాని
చర్మమొలిపించు యోచన మానుఁడయ్య!

ముస్తఫా:

(బల్లెముల నతనిపై గురిచేయుమని భటులకు సూచిస్తూ అతనిని ఇంకా భయభ్రాంతుని చేయుటకు గంభీరముగా నిట్లనును)

నిన్నుఁ జూచిన తోడనె నీదు చర్మ
మొలువ నాజ్ఞవెట్టితి ఖాదిమునకు నేను
తప్పనివి చావు, రాజాజ్ఞ ధరణిలోన
అనుభవింపనేవలయు నాయాన నీవు!

ఎమీలియో:

(విలపిస్తూ ముస్తఫా కాళ్ళపైఁబడి వేఁడికొనును)

కాలు మ్రొక్కెద సుల్తాను కరుణతోడ
నన్నుఁ గావుము; నిర్దోషి నయ్య నేను,
నీవు వలచెడి యిటలీయ నెలఁత కేను
మామ నౌదను గద, నను మనుపు మయ్య!

ముస్తఫా:

(అతనిని లేవనెత్తి పెద్దగా నవ్వుతూ పల్కును)

నెమ్మదిం గనుమింక నిర్భయము నీకు
చింతింపవలదింత, శిక్షింపఁ గాదు
మన్నింపఁగా నెంచి మద్భటులచేత
నిన్ను రావించితిని నేనిటకు నిపుడు

ఆఫ్రొడైటీలీల నందాలనిధి యైన
నీమేనకోడలికి ఆమోదముం గూర్ప
గౌరవప్రదమైన కైమెకాన్ పట్టంబు
నీకుఁ గట్టగ నేనె నిన్ను రావించితిని

ఎమీలియో:
ధన్యుఁడ నైతిని. ధన్యవాదములు మీకు!
కైమెకా ననఁగా నేమి ప్రభూ?
ముస్తఫా:
విను

(వందిమాగధబృందము కైమెకాన్ పదవిని వర్ణిస్తూ ఈక్రింది పాటను పాడుచుండఁగా, ఖాదిము, సేవికలు ఎమీలియోను ఆపదవికి అర్హమైన తురుష్కవేషముతో నలంకరింతురు.)

కోరస్:
జోతలు జోతలు నూతన కైమేకానుకు
నాతుల కింపగు నవవేషాన్వితునకు
శ్రేయస్కరునకు సింహబలాంచితునకు
న్యాయపు ముస్లిము నాయకశేఖరునకు
నక్కవలెం బలు టక్కులు నేర్చిన నటునకు
చక్కనిస్త్రీలను శయ్యకుఁ దార్చెడి విటునకు
జోతలు జోతలు నూతన కైమేకానుకు
జోతలు జోతలు నూతన కైమేకానుకు
ఎమీలియో:
బలము లేదు, బుద్ధిబలము లేదు,
మర్మ మరయ, తుర్కధర్మమరయ,
హేతి నెఱుఁగ, యుద్ధరీతి నెఱుఁగ,
కాను నర్హ మేను కైమెకానుగాను
ముస్తఫా:

(పెద్దగా నవ్వుతూ)

అందుకొఱకె నీ కర్పించి తాపదంబు
క్రొత్తరకమైన కైమెకాన్ వృత్తి యిద్ది
వయసుకత్తెల కాశలవలలు పన్ని
నాకు వశ్యులఁ జేయు టీనవ్యవృత్తి

అందునను నీదుకోడలియందమందు
అహరహంబును సంసక్తమై తపించు
నాదుచిత్తము గాన నా నళిననేత్రి
నాకుఁ గూర్చెడి యత్నంబె నీకు వృత్తి

కోరస్:
జోతలు జోతలు నూతన కైమేకానుకు
నాతులఁ దార్చెడి నవకితవాగ్రేసరునకు
ఎమీలియో:

(తనలో)

అయ్యొ! ఎంతటి ఘోరదుర్దశ
ఆవహిల్లెను నాకు నిప్పుడు
నాదు ప్రేమకు లక్ష్యమై తగు
నాతినే యీతనికిఁ గూర్పఁగ
తార్పుకానిగ మారవలసిన
దైన్యసంస్థితి దాపరించెను

వీరి పనుపును వినకయుండిన
వ్రేలఁగట్టుదు రిపుడె సిలువకు
తోలు నొలువఁగ, చిత్రహింసల
పాలు సేయఁగ నుద్యమింతురు

కాన వీరికి లొంగినట్లుగఁ
గానిపించుచు నీమహాపదఁ
గడచు యోచన చేయఁగా వలెఁ
గడవఁగావలెఁ గష్ట మెట్టులొ

(ప్రకాశముగ ముస్తఫాతో)

ఘనమైన కైమెకాన్ గౌరవాంకంబు
దయచేసి చేసితిరి ధన్యునిగ నన్ను
నాకోడలి మనంబు మీకు సుముఖముగ
జేయఁగా యత్నంబుఁ జేతు నేనింక

కోరస్:
జోతలు జోతలు నూతన కైమేకానుకు
నీతులరీతుల నింత గణింపక ఱేనికి
నాతులఁ దార్చెడి నవకితవాగ్రేసరునకు
జోతలు జోతలు నూతన కైమేకానుకు

నాల్గవదృశ్యము

(అంతఃపురములో తురుష్కస్త్రీవేషములో బెలిండాను ముస్తాబు చేయుచున్న సేవికలు, సలీమా సమీరాలు, సేవకుఁడుగా నటించు ఫిడేలియో)

బెలిండా:
చల్లగా నేతెంచు పిల్లివలె ముస్తఫా
సల్లాప మొనరింప, సారాయి సేవింప
ఉల్లాసముగ కాల మొక్కింత గడపంగ!

(ఫిడేలియోకొఱకు జూచుచు)

సేవకుఁ డెక్కడ?

ఫిడేలియో:

(తడబడుచు)

దేవిగారి ఆజ్ఞ?

బెలిండా:
మేల్కొను మిప్పుడైన. మదిర గొనిరమ్ము!
ఫిడేలియో:
ఎందఱికి?
బెలిండా:
కనీసం ముగ్గురికి
సమీరా:
ముగ్గురికెందుకు? మీయిర్వురికే యేకాంతమని ఆయన యభిప్రాయము!
బెలిండా:
అహహ! అతని సతియేనా యీమాటలాడునది?
ఎంత బేలవొ తార్పంగ నెంతువీవు
నీదుభర్తకు వేఱొక నెలఁత నయ్యొ,
సిగ్గుచేటిది యని చింతసేయ వింత!
సమీరా:
అతని నైజ మెఱుఁగక యిట్లందు వీవు
సిగ్గుచేటిది యగుఁగాక, చేయకుండ
అతని పనుపును ధరలోన బ్రతుకలేము
సలీమా:
మోజు దీర్చినకొలఁదిని రాఁజుచున్న
అగ్గివలె నింక జృంభించు నతని కోర్కె
బెలిండా:
మీరిటు జడియుచు నుండుటె
కారణమని యందు మీదుకష్టంబులకున్
మీరును నిటలీ నారుల
తీరున మెలగంగవలెను ధీరత మీరన్
సమీరా:
అది యెట్లు?
బెలిండా:
తెలుపఁగల నెన్నియో వెరవులను గాని
ఇపుడు మాత్రము ప్రక్కకు నపసరిల్లి
పులియె పిల్లిగ మాఱెడు పొలుపు నెల్ల
అరయుచుండుఁడు పొంచి రహస్యముగను

(సమీరాసలీమాలు ప్రక్కగదిలో ప్రచ్ఛన్నముగా నుండి జరుగునదెల్లఁ జూచుటకు తొలఁగుదురు. ఫిడేలియో మును పాజ్ఞాపింపబడినట్లుగా మదిరను తెచ్చిపెట్టును. అప్పుడు ముస్తఫా నటకు దీసికొని రమ్మని బెలిండా ఫిడేలియో నాదేశించును.)

ఫిడేలియో:
దేవి యాన. ఇదిగో మదిర!
బెలిండా:
దాని నిట నుంచి, ముస్తఫా నిటకుఁ దెమ్ము.

(అని ఫిడేలియో నాదేశించి తనను సేవికలు అలంకరించుచుండఁగా నా యలంకరణలను ఎదురుగా నున్న నిలువుటద్దములో పరికించుచు బెలిండా యీక్రింది ప్రణయగీతమును పాడుచుండును. అప్పుడామె యున్నగది ననుసరించి యున్న విశాలమైన శాలవఱకు ఫిడేలియో, ఎమీలియో, ముస్తఫాలు వచ్చి, అచ్చటినుండియే ఆమెను గుప్తముగా చూచుచు, ఎవరికివారు ఆపాట తమకే వర్తించునట్లు భావించి నటించుచుందురు.)

బెలిండా:
పల్లవి:
ఆతని కెంతయొ ప్రీతిని గూర్చెడి
రీతిని సింగారించుఁడు నన్ను !
చరణం1:
కరముల మణికంకణముల నుంచుఁడు
శిరమున రవ్వల శేఖర ముంచుఁడు
ఉరమున కంచెల సరిగ బిగించుఁడు
విరులును సొమ్ములు విరివిగ నుంచుఁడు ॥ఆతని…॥
చరణం2:
కమ్మల వీనుల నిమ్ముగఁ బెట్టుఁడు
అమ్ములవలె కనుబొమ్మలఁ దీర్చుఁడు
కమ్మగ వలచెడి గంధపుపంకము
నెమ్మేనునఁ గడు నీటుగ నలఁదుఁడు ॥ఆతని…॥
చరణం3:
సరిచేయుఁడు శేఖర మొక యించుక
అరుణాశ్మంబుల హరితాశ్మంబుల
విరచితహారము లురమున నుంచుఁడు
కరశాఖల నుంగరములఁ దొడుగుఁడు ॥ఆతని…॥
చరణం4:
అతివల హాసమె అతనికి ప్రాణము
అతివల హావమె అతనికి భావము
అతివల వీక్షణ మతనికి తేజము
అతివల యందమె అతనికి బంధము ॥ఆతని…॥

(వెలుపలినుండి ఆమెను గమనించుచు కామవశుఁడై నటించుచున్న ముస్తఫా నుద్దేశించి తనలో నిట్లనుకొనుచు పాడును.)

(ఓ యువతీమృగయోద్యమశీలుఁడ!
మాయంబగులే నీయుద్ధతి యిఁక
ఈయిటలీయువతీక్షణజాలము
చేయక మానదు చిఱుతను పిల్లిగ)
ఫిడేలియో,ఎమీలియో,ముస్తఫా:
అవనిని రాగభోగరతు లర్చనచేసెడు నాఫ్రొడైటితో
సవతు వహించు నీ తరుణి సౌరును గాంచిన తత్క్షణంబునన్
ఎవని మనోబ్ధిలోన జనియింపకయుండు నితాంతరాగమో
హవివశతాతరంగనిచయభ్రమచార మవారితంబుగన్?

(ఆఫ్రొడైటీ యనునది గ్రీకుల కామదేవత. వీనసు అనునది రోమనుల కామదేవత)

ముస్తఫా:

(ఫిడేలియోతో)

కలఁచుచుండెను వలవంత గాఢమగుచు
ఇటులె యుండిన డెందంబు పెటిలిపడును
ఇంక నాలస్యముం జేయ కీవు వోయి
తెమ్ము నా సమక్షమున కాతమ్మికంటి

ఫిడేలియో:
దేవర యాజ్ఞ శిరోధార్యము
ముస్తఫా:

(ఎమీలియోతో)

నీపదోన్నతిఁ గూర్చి నేఁదెల్ప నెంతు
ఆమెకుంగాన నీవాగు మిటఁ గాని
తుమ్మినంతనె నేను మమ్ము నిర్వురను
ఏకాంతముగ నుంచి యేగవలె నీవు

(ఫిడేలియో లోపలిగదినుండి బెలిండా సహితముగా వచ్చును)

బెలిండా:
సలాం సలాం జాయీమన్ సుల్తాన్!

(వంగి ముస్లిముపద్ధతిలో నమస్కరించును. ముస్తఫా క్రింది విధముగా క్రొత్తకైమెకానునుగుఱించి సగర్వముగా నామెకుఁ దెల్పును)

ముస్తఫా:
కలకంఠి! కను నూత్నకైమెకా నితఁడు
బహుమాన్యమైన యీపదము నీతనికి
కైసేయుచుంటి నీగౌరవార్థంబె
ఇదె సాక్ష్య మెంత ప్రేమింతునో నిన్ను!
బెలిండా:

(ఎమీలియోతో వ్యంగ్యగా)

గర్వింపఁ దగినదీ కైమెకాన్పదవి
వీక్షింపఁ దగినదీ వేషంబు గూడ
బండికిం జక్రాలవలె నివి నీకు
చక్కగా సమకూడె సంశయము లేదు

(ముస్తఫాతో)

నామామ నీరీతి గోముగాఁ జూచు
సాన్యోషు ముస్తఫా! సంస్తుత్య మెంతొ
నీయోర్మి నీకూర్మి నీయాదరంబు

(సాన్యోషు అని తెలుగులో అజంతముగా వాడబడిన సాన్యోష్ అను టర్కీభాషాపదమునకు Seigneur=Lord అని అర్థము)

ఎమీలియో:

(బెలిండాతో)

నీవల్ల నాకొనరె నీవైభవంబు
కైమెకా ననగాను ఘనమైన బిరుదె
కాని కర్తవ్యంబు కామినీమణులఁ
దార్చుటే సుల్తాను తల్పకేళికకు

ఫిడేలియో:

(ముస్తఫాతో)

ఆమె వేషంబెంత అలరించుచుండె!
అంగరాగముతోడ నంగంబు దీర్చి
వక్షోజపీనత్వవర్తులత్వంబు
కటిబింబపూర్ణతం గనఁజేయుచున్న
వలిపవస్త్రంబామె వలపింప నిన్నె
ధరియించి నీముందు తారాడుచుండె

బెలిండా:

(ముస్తఫాతో ప్రియముగా)

మియామోరే ముస్తఫా!

ముస్తఫా:
మియామాతో బెలిండా! ఇచ్ఛీ!

(తుమ్మును)

ఎమీలియో:

(తనలో)

తుమ్మినం దుమ్మనీ, తొలఁగ నేనిటనుండి

ముస్తఫా:
ఇచ్ఛీ! ఇచ్ఛీ! ఇచ్ఛీ!

(తుమ్మును)

ఎమీలియో:

(తనలో)

తుమ్ముచుండుమటులె, తొలఁగ నే నిటనుండి

ముస్తఫా:
ఇచ్ఛీ! ఇచ్ఛీ! ముసళ్ళ నోటబెట్టవలె నీమొండిదద్దమ్మను!
ఫిడేలియో, బెలిండా:
పొమ్ముపొమ్మంచు నీతండు తుమ్ముచుండె
పోను పోనంచు నాతండు మొండి చేసె
ఒకరికంటెను బాలిశు లొక్కరగుచు
బాలకులకంటె లోఁకువై పరగుచుండ్రి
బెలిండా:
అయ్యో! మద్యమెక్కడ?

(సమీరా సుందరమైన బంగారు పాత్రలలో మద్యమును తీసికొని వచ్చి అచ్చట నుంచును.)

ముస్తఫా:

(సమీరాను చూస్తూ)

ఈమెందుకిట నున్నది?

సమీరా:
అతిరుచ్యమగు మద్యమిది అలాజీజీ!

(అలాజీజీ= Dear Husband in Arabic)

ముస్తఫా:
నీచేతిలో నది విషమగుచున్నది
బెలిండా:

(ముస్తఫాతో)

నీసతి నటు నిందింపకు
వేసారక యామె నిపుడు ప్రేమము మీరన్
నీ సరసకుఁ జేర్చుకొనుము
ఆసాధ్వీమణి సతంబు నర్చించు నినున్

ముస్తఫా:
ఆమెకంటెను మేలు క్షయవ్యాధి నాకు
బెలిండా:
ఆమె సాధ్వీమణి. కరుణింపుము.
సమీరా:
హా ప్రియనాథా!
బెలిండా:

(ముస్తఫాతో)

ఆమె నాదరింపుము

ముస్తఫా:

(తనలో)

నన్నాట పట్టించుచున్నారా?

(ప్రకాశముగా)

అంతకంటె విషపానమే మేలు

సమీరా:
అంతమాటనకు నాథా! విషము గాదు, నా యధరామృతము ద్రావుము

(అనుచు ముస్తఫాను కౌఁగిలించుకొనఁబోవును. ముస్తఫా ఆమెను ప్రక్కకుఁ ద్రోసి ఆగ్రహముతో క్రిందివిధముగా పాడును.)

ముస్తఫా:
ఆటలాడింత్రు నన్నందఱుం జేరి
మీమాట లాలించి, మీయాటలాడు
బుద్ధిమాలినవాఁడు ముస్తఫా కాడు
తౌరుష్కతేజంబు, తార్తారుబలము
దండిగాఁ గలయట్టి ధరణీశుఁ డితఁడు
తలచినన్మిమ్ములను సిలువకెక్కించు
అధికారముం గల్గు అవనీశుఁడితఁడు
ఇతరులందఱు:
పరిహాస మొనరించి బ్రతుకంగ లేము
గరువంబుతోనుండి కడవంగ లేము
తెరువెఱుంగని యట్టి తెర్వరులమేము
కరుణించు ముస్తఫా ధరణీశ మమ్ము

(అని ఆతని ప్రసన్నుని చేసికొందురు)

ఐదవదృశ్యము

(ఫిడేలియో, ఎమీలియోలు, తరువాత ముస్తఫా)

ఎమీలియో:
ఏమనుచుంటివి? ముస్తఫా హస్తములనుండి బెలిండాను విముక్త మొనరించుచుంటివా?
ఫిడేలియో:
అందుకు నీసాయ మామె ఆశించుచున్నది
ఎమీలియో:
ఆమె కాదు, నీవనుకొందును. నేనెవరో నీవెరుగవా?
ఫిడేలియో:
ఆమె మామవు
ఎమీలియో:
నీవది నమ్మెదవా? అది నాటకం. తన కాప్తుఁడైన ప్రియుఁడున్నాడని ఆమె నీకెపుడు తెలుపలేదా?
ఫిడేలియో:
ఔను. ఉన్నాడని తెలుసు.
ఎమీలియో:

(గర్వంగా)

ఆప్రియుఁడను నేనే! నేనే ఆప్రియుఁడను!

ఫిడేలియో:

(వ్యంగ్యంగా)

ఐతే అభినందనలు నీకు! జాగ్రత! ముస్తఫా ఇటకు వచ్చుచున్నాడు.
నాకు తోడుగానుండి నన్ను బలపఱచు.

ముస్తఫా:

(ప్రవేశించి)

నీదుకోడలు నన్నెంచు మేదకునిగ
ఆదరింపదు, నాయందు నాశ గొనదు
ఇట్టి యుద్ధతికిం దగినట్టి శిక్ష
ననుభవించును తప్పక యామె యిపుడు

ఫిడేలియో:
మీర లూహించినది యెల్ల మిథ్య యనుచు
విన్నవింతును ప్రభువర్య! వినతి చేసి
ఆమె మీయందె ఆసక్తినంది యుండె
తమరిపొందుకే తమకంబుఁ దాల్చుచుండె
ముస్తఫా:
‘పొందుకే తమకంబుఁ దాల్చుచుండె’ – ఇది నిజమేనా?
ఫిడేలియో:
సందేహమా ప్రభూ!
ఎమీలియో:
నిద్ర గూడ మాని నిరీక్షించుచుండె!
ఫిడేలియో:
తననె ప్రేమించు ముస్తఫా యనుచుఁ జాల
పొగడుకొనుచుండెఁ దనుఁదానె తెగువతోడ

ముస్తఫా:
అది యథార్థమ? ఇప్పుడే యామె మనము
కనుగొనం జనియెద నామె కడకు నేను!
ఎమీలియో:
అంత త్వర తగదు. కొంచె మాగుట మేలు.
ముస్తఫా:
ఎందుకు?
ఫిడేలియో:
ఒక్కమాట వినండి!
ముస్తఫా:
వినిపించు త్వరగా!
ఫిడేలియో:
ఇల ‘పాపటాచి’ యనియెడు
విలువైన పదంబుఁ బూని విశ్రుతులగుచున్
వెలసెడి పురుషుల కిటలీ
లలనలు పూర్ణంబుగ వశలగుదురు గానన్

వెలయఁగ వాద్యగీతములు, వెల్గుచునుండఁగ దీపరేఖ, లా
చెలువ బెలిండ కట్టెదుటఁ జేతుము మిమ్ముల పాపటాచిగా,
నిల నతిదుర్లభంబయిన యీ యిటలీయపదంబు దాల్చు మి
మ్ముల నిఁక వీడకుండ పరిపూర్తిగ మీవశమౌను నామెయున్

ముస్తఫా:
పాపటాచి అంటే?
ఫిడేలియో:
ఇంతు లొనరించు చేష్టల కింతయేని
కలఁగకుండఁగ, నింతేని అలుగకుండ
నుండు నుత్తమప్రియునికి నొసఁగుచుందు
రట్టి పద మిటలీయందు నరుదుగాను
ఎమీలియో:
ఘనమైన కైమెకానును నేను
ప్రథితులగు పాపటాచీ మీరు
మాన్యపదమండితులము మనము!
మన్నించితిరి నన్ను కైమెకానుగ మీరు
మన్నించెదము మిమ్ము పాపటాచిగ మేము!
ముస్తఫా:

(తనలో)

సత్య మిటలీయు లెంతయో సరసమతులు
మఱవ రన్యులమేలును మదుల నెపుడు
శ్లాఘ్యమైనది వారల సౌహృదంబు!

(సంతోషంతో ప్రకాశముగా)

పాపటాచీ! ఆహ! పాపటాచీ!

ఫిడేలియో:
అద్భుతంబైన పదమిది అవనియందు!
ముస్తఫా:
కౌతూహలంబొదవు కన్గొనంగ
పాపటాచీవర్తనప్రకారంబు?
ఎమీలియో:
తనవిదీరఁగ మదిరను త్రాగుటొకటి
సుష్ఠుగా సంతతము దినుచుండు టొకటి,
ఇష్టముగ నిద్ర జెందుట యింక నొకటి
పాపటాచికి నిర్ణీత వర్తనములు
ముస్తఫా:
తినుట త్రాగుట నిద్రలో మునుగుచుంట
అద్భుతంబగు వృత్తులే యన్ని గూడ
ఇష్టమైనవి యీవృత్తు లెంతొనాకు
శ్రేష్ఠమైన దీ పాపటాచీపదంబు!

అండగా నుండి మీరు బెలిండ కిపుడు
పాపటాచీప్రదానోత్సవంబుకొఱకు
హంగులన్నియుఁ గూర్చుకొనంగఁ బొండు
నన్నుఁ బిల్వుఁడన్నియు సమకొన్నపిదప

(నిష్క్రమింతురు)

ఆఱవదృశ్యము

(ఖాదిము, సలీమాలు)

ఖాదిము:
అంతులేని నమ్మక మున్నయట్లు దోఁచు
రాణిగారికి నిటలీయరమణియందు
సలీమా:
దోసమేమున్న దాయింతి యాస గొల్పి
మాలికును వశవర్తిగా మలఁచుకొనెను,
కాని యంతయున్ మెఱమెచ్చుగానె తోఁచు,
అతనియందామెకుం గూర్మి అసలు లేదు,
అతని స్త్రీలౌల్యముం బాపి అతని మనసు
పట్టమహిషి సమీరయం దెట్టులైనఁ
ద్రిప్పుటకె యామె యట్లు వర్తించుచుండె
ఖాదిము:
ఐన ముస్తఫాభటులను, సైనికులను
మతులులేకుండ నీరీతి మదిరలోన
ముంచుటకు కారణం బేమొ బోధపడదు
సలీమా:
ఆమె యన్నువఁ గని ముగ్ధులగుచు వార
లాశ్రయించిరి ఆయింతి నర్థి మీర
వారి నలరించుటకె యామె వారి నిట్లు
ముంచుచుండెను మదిరలో నంచుఁ దలఁతు
ఖాదిము:
కాని తౌరుష్కనర్తకీగణము నేల
ఆయితము సేయుచుండెను నామె యిపుడు?
సలీమా:
రాణికే సాయమొనరింపఁ బూని యామె
అంతయుం జేయునంచు భావింతు నేను
ఖాదిము:
ఇంకఁ గలదేదొ దీనికి హేతువనుచు
గట్టి సందేహమే నాకుఁ గల్గుచుండె
సలీమా:
మోహమో, మౌఢ్యమో యేదొ ముస్తఫాను
ఆమెగీతికి నర్తించు నటులఁ జేసె
అట్లు భ్రమకొల్పి చివరికి నప్పగించు
రాణికే ఱేని నని నేను లోనఁ దలఁతు
ఖాదిము:
ఆమె ఆశయ మదియొ అన్యంబొ కాని
నాప్రలాపంబు మాని మౌనంబు నూని
ఆడఁబోయెడి ఆబోఁటి యాట లెల్ల
జూడఁగా నెంతు నుత్కంఠతోడ నేను

ఏడవదృశ్యము

(ఫిడేలియో, ఎమీలియో, తర్వాత బెలిండా, సేవకులుగాఁ గొనఁబడిన ఇటలీదేశీయుల కోరస్)

ఎమీలియో:
తనతోడ బందీగఁ గొనఁబడిన యిటలీయు
లను గూడ ముక్తులం బొనరింపఁగ బెలిండ
ఒనరించుచుండెను వ్యూహంబు లనిపించు
ఫిడేలియో:
అనుపమానంబైన దామె చాతుర్యంబు
కను నామె తప్పక తన లక్ష్య మని తోఁచు
ఎమీలియో:
అది యెట్లు సాధ్యంబు? ఆమె వ్యూహంబేమి?
ఫిడేలియో:
పాపటాచీప్రదానోత్సవంబునందు
గాయకులుగ వారల నియోగంబు చేసి
మదిరమత్తులో భటులు మైమఱచియుండ
వారితోఁ గూడి ఇటలీకిఁ జేరఁ దలఁచు
ఎమీలియో:
భవ్యమైన వ్యూహంబునే పన్నుచుండె
శ్లాఘ్య మామె ఆలోచనాశక్తి చాల
ఫిడేలియో:
ముస్తఫా నామె యాడించు బొమ్మవోలె
ఇదియె ఆయింతి బలమని యెంతు నేను
చూడు మిదె యిటలీయులం గూడి యామె
వచ్చుచుండెను తనపూన్కి పరిఢవింప

(ఎమీలియో, ఫిడేలియోల వెనుక నున్న తెరను తొలగింపఁగా బెలిండా, సేవకులుగాఁ గొనఁబడిన ఇటలీదేశీయుల కోరస్‌ కనపడును)

కోరస్:
వీరుల మిటలీపౌరులమూ
ధీరుల మతిబలధారులమూ
పేరిమి మీరఁగఁ జేరితి మిచ్చట
పూరింపగ నీ పూన్కిని పూర్తిగ

బెలిండా:
మీ తోడ్పాటునె నే గోరితిని
మీ తేకువనే నేనమ్మితిని
మీతో నిఁక మాతృధరిత్రికి
చేతం బలరఁగఁ జేరం గోరితి
కోరస్:
మనదేశంబన మది యుప్పొంగును
మన నగరంబులు, మన సంఘంబులు
మనశైలంబులు, మన శాద్వలములు
మనసునఁ దలఁచిన మది పులకించును
బెలిండా:
ఈదాస్యమునుండిఁక ముక్తులమై
పోదము నేఁడే పుట్టినయిండ్లకు
ఏదెటులైనను నీయాశయమును
సాధించుటకై సాగుద మిపుడే

(ఎమీలియో, ఫిడేలియోలతో)

వెఱఁగందుచు నుంటిరి ప్రతిమలవలె
సరగున మాతో సాగుచు రండిఁక!
స్మరియించినచో మాతృధరిత్రిని
గరువంబునఁ బొంగద మీ డెందము?

కోరస్‌తో సహ అందఱు:
పిలుచుచునుండెను ప్రియముగ నిటలీ
నిలువక క్షణమును నేఁడే దాస్యపు
గొలుసుం దునుదున్కలు గావింతుము
చెలఁగి స్వదేశముఁ జేరం బోదుము

ఎనిమిదవదృశ్యము

(ఎమీలియో, ముస్తఫా, తర్వాత ఫిడేలియో)

ముస్తఫా:
కైమెకాన్! నీకోడలెక్కడ?
ఎమీలియో:
పాపటాచీప్రదానోత్సవంబుకొఱకు
చేయుచుండెను సర్వంబు సిద్ధముగను
అదియుఁ ద్వరగానె ముగియించి యామె మిమ్ము
మోదమలరఁగఁ బిలిపించు సాదరముగ
ముస్తఫా:
దీనికంత యత్న మవసరమా?
ఎమీలియో:
వైభవమున్ యశంబు సుఖవాంఛయుఁ గల్గిన మిమ్ముబోంట్లకున్
శోభనమైన యాబిరుదు సుందరమందిరమందు నృత్యగీతముల్
శోభిలుచుండఁగా నొసఁగుచుండుటయే పరిపాటి గాన నిట్టులా
శోభనగాత్రి యన్నియును చొక్కముగా సమకూర్చుచుండెడిన్

(ఇంతలో ఫిడేలియో ప్రవేశించి, వంగి ముస్తఫాకు సలాము చేసి పల్కును)

పాపటాచీప్రదానోత్సవంబుకొఱకు
అంతయును సిద్ధమైనది ఆర్య! యిపుడు
నాదు స్వామిని మిముఁ బిల్వ నన్నుఁ బంపె
తమరు వేంచేయవలయు సత్వరముగాను
ముస్తఫా:
మెచ్చితిని, మంచివార్తనే తెచ్చితీవు
ఆలసింపక పోవుద మటకు నిపుడె

(నిష్క్రమింతురు)

తొమ్మిదవదృశ్యము

(ఫిడేలియో ,ఎమీలియో, ముస్తఫాలు, తురుష్కనాట్యకత్తెలు, ఇటాలియనుల కోరస్, తర్వాత బెలిండా, సమీరా,సలీమాలు. ఫిడేలియో, ఎమీలియోలతో ముస్తఫా రంగములోనికి ప్రవేశించుచుండఁగా తురుష్కనాట్యకత్తెలు క్రింది పాటతో నటించుచు అతని నాహ్వానింతురు.)

పల్లవి:
స్వాగతం సుల్తాను, స్వాగతం ముస్తఫా!
రాగంబు భోగంబు రంజిల్లు ముస్తఫా!
చరణం1:
బహుదుర్లభంబైన పాపటాచీపదవి
బహుమాయలెఱుఁగని వారినే వరియించు
బహుపరాక్కయ్యును బహుమాయ లెఱుఁగని
బహదూరువని నిన్ను వరియించె నాపదవి ॥స్వాగతం…॥
చరణం2:
నీదు శుద్ధాంతమున నెలఁత లెందఱొయున్న
చేదుగాఁ దోఁచు నాస్త్రీలసంగము నీకు
అందుచే పరదేశసుందరుల పొందుచే
నందించు యోగంబు నొందించు నీపదవి ॥స్వాగతం…॥
చరణం3:
హరిణాంకునిం గోరు అభ్రతారకలట్లు
హరిదశ్వునిం గోరు అబ్జినీలతలట్లు
పాపటాచీపదవి వహియించు నినుగాంచి
రూపవతు లర్మిలిం గైపునే వహియింత్రు ॥స్వాగతం…॥
చరణం4:
జోహారు సుందరీ సుమకార్ముకాకార!
జోహారు సుందరీ సురభూరుహాకార!
జోహారు సుందరీ సుఖపేటికాకార!
జోహారు సుందరీ స్నేహహృష్టాకార! ॥స్వాగతం…॥

(ఇట్లు స్వాగతింపఁబడి ముస్తఫా అర్హాసీనుఁడగును. అతనికి వెనుక ఏడవదృశ్యమునందలి కోరస్ గాయకులుందురు. ఫిడేలియో ఈక్రింది వాక్యములను పలికి విధాన మారంభించవలసినదిగా కోరసుకు సైగ చేయును)

ఫిడేలియో:
గౌరవంబు, మర్యాదయుం గ్రాలుచుండ
స్త్రీప్రదంబైన పాపటాచీపదంబు
నార్యముస్తఫాసుల్తాను కప్పగించు
క్రమము సాగించుఁడిఁక మీరు గాతలార!
కోరస్:
రమ్ము ముస్తఫా, తాల్పరమ్ము ముస్తఫా
పురుషులందు పరమపురుషుఁడనుచు
తరుణులెల్ల నిన్నె తలఁచి తమక మూన
పరమమాన్యమైన పాపటాచిపదము
తాల్ప రమ్ము ముస్తఫా, రమ్ము ముస్తఫా!
ముస్తఫా:
సంతసంబు నింపె స్వాంతంబునం దెంతొ
నేస్తులార మీదు నిర్ణయంబు
ఈపదంబుఁ దాల్చి యిఁకపైని సులువుగా
వశము చేసికొందు వనజముఖుల
ఫిడేలియో, ఎమీలియో, బెలిండాలు:
అచంచల మీతని విశ్వాసము,
అమోఘం బీతని ఆకాంక్ష!
కోరస్:
పదవికిం దగురీతి నిప్పుడు
కుదురఁగావలె వేషభాషలు
గుండుపాగకు బదులు శిరమున
నుండఁగావలె రంగుటోపియె

కదలుచుండెడి పొదలఁబోలుచు
వదులుగా తనువందు వ్రేలెడు
వసనములపైఁ దొడుగఁగావలె
పసిఁడివన్నియ పొడుగుకోటును

ఎఱుపువన్నియపాపటాచీ
గురుతుతో రహియించు పట్టీ
నురముమీదను నేటవాలుగ
మెఱయునట్లుగఁ గట్టఁగావలె

ఇంపుమీఱఁగ బాహుపురులను
ఉంపఁగావలె మూపులందున
మొలకు గట్టిగఁ జుట్టఁగావలె
చిలుకపచ్చని పట్టుదట్టీ

(పై విధముగా కోరస్ పాడుచుండఁగా సంభ్రమముగా తురుష్కసేవకులు ముస్తఫాకు పాపటాచీ వస్త్రధారణ చేయుదురు. అతఁడు సంతోషంతో తన వేషమును తేఱిపాఱఁ జూచికొనుచు క్రింది విధముగా పల్కును)

ముస్తఫా:
ఆహ! అనుపమాన మద్భుతంబు
పాపటాచివేషవైభవంబు!
ఇట్టి వేషమందు నింపుగొల్పు
నన్నుమెచ్చకున్నకన్నె గలదె?
ఫిడేలియో,ఎమీలియో, బెలిండా:
రక్తిగట్టుచు నుండెను రంజుగాను
మనదునాటక మీకామమత్తునందు!
బెలిండా:
ప్రమదాళి ప్రేమకుం బరమలక్ష్యంబైన
పాపటాచీపదము పరిపూర్ణముగ మీకు
సిద్ధించుటకు ముందుఁ జేయంగవలె మీరు
పాపటాచీనియమపాలనప్రమాణంబు
ముస్తఫా:
సంశయింపఁగ నేల, సర్వంబు గావింతు
తెల్పుడిఁక దానినిం దేటతెల్లంబుగా
కోరస్:
బాపురే! ముస్తఫా పండె నీ భాగ్యంబు
పాపటాచీవగుచు పరిఢవిల్లెదవింక!
ఫిడేలియో:
నేమంబుతో నింక నిశ్శబ్దముగఁ గనుఁడు
పాపటాచీనియమవాగ్దానపర్వంబు
బెలిండా:

(ఎమీలియోతో)

కైమెకాన్! పఠియించు నియమాళి

(ముస్తఫాతో)

అతఁడు చదివినట్టి దక్షరాక్షరముగ
పల్కవలెను మీరు స్పష్టముగను
పల్కినట్టిదెల్ల పాటింతు నని మీరు
ప్రతిన చేయవలయు భక్తితోడ

ముస్తఫా:
ఆలస్యమేటికి? అదియేదొ చదువుఁడు!

(ఎమీలియో క్రింది నియమావళిని చదువును. అతఁడు చదివిన దెల్ల ప్రమాణపూర్వకముగా ముస్తఫా ప్రతివదించును)

కనినఁ గానీ కనకయుందును
వినినఁగానీ వినకయుందును
తినుట త్రాగుట కునుకుదీయుట
యనెడు వృత్తులయందు నుందును

విహితధర్మము లివియె భువిలో
మహితమౌ పాపటాచీపద
నిహితులై స్త్రీజనాకర్షణ
సహితులై మనఁగోరు వారికి

వీనిఁ దప్పక యాచరింపఁగ
పూని చేతును ప్రమాణంబును
మాననీయుఁ డిలాహి సాక్షిగ
నేను సుల్తాన్ ముస్తఫాఖ్యుఁడ!

ముస్తఫా తక్క ఇతరులు, కోరస్:
సాహొ సుల్తాను ముస్తఫా! సాహొ పాపటాచి ముస్తఫా!
బెలిండా:

(ఎమీలియోతో)

పాపటాచీ ముస్తఫాతోడఁ గూర్చుండి
చూపు మిఁక కైమెకాన్ పాపటాచీవిధుల

(ముస్తఫా ప్రక్క కొక ఆసనముపై ఎమీలియో కూర్చొని భోజునపానీయములను తెమ్మని సేవకుల నాజ్ఞాపించును.)

ఎమీలియో:
నవపాపటాచియై నలువారు సుల్తాను
తన బాధ్యతలు దీర్చుకొనఁగాను త్వరగాను
కొనిరండు దండిగా మనసైన భోజ్యంబు,
ఎనలేని మాంద్యంబు నెనయించు మద్యంబు

(నిర్దేశానుసారముగా సేవకులు నానావిధముల భోజనపానీయములను తెచ్చి ఎమీలియోముస్తఫాల ముందుగల సుందరమైన బల్లపై నుంతురు.)

ఎమీలియో:
అతులసులభంబైన బాధ్యతయె యిద్ది!
ముస్తఫా:
అతులరుచ్యంబైన బాధ్యతయె యిద్ది!

(ఇర్వురు యథేచ్ఛగా తినుట కారంభింతురు)

కోరస్:
సుష్ఠుగా తినుటయే నిష్ఠతోఁ ద్రాగుటయె
శిష్టులౌ పాపటాచీజనుల బాధ్యతలు
వినకుండఁ గనకుండ వేఱేదియును మీరు
పొనరించుచుండుఁ డీభూరిబాధ్యతలను

(కోరస్ నిష్క్రమించును)

బెలిండా:
నియమపాలననిష్ఠ నిప్పుడు
కొలువఁగావలె కొంచె మిట్టుల

(ఫిడేలియాతో)

ప్రియతమా ఫిడేలియో!

ఫిడేలియో:
ప్రేమదేవతా బెలిండా!

(పైవిధముగా సంబోధించుకొనుచు వారాలింగనము జేసికొనుచుండ ముస్తఫా వారి నీర్ష్యతో జూచి యిట్లనును)

ముస్తఫా:
ఘోరం ఘోరం. ఇదేమి నాయెదుట జరుగుచున్నది?
ఎమీలియో:

(ముస్తఫాతో)

ఘోరం ఘోరం. నీచిత్త మస్థిరమగుచున్నది.
పాపటాచినియమభంగ మగుచు నున్నది.
ఇదిగొ నన్నుఁ జూచి అనుకరించు!

ఫిడేలియో:

(బెలిండాతో)

నా ప్రణయనిధానమా బెలిండా

(ముస్తఫా మఱల వారివైపు జూచును. అతని దృష్టిని దప్పించుటకు ఎమీలియో క్రిందివిధముగాఁ బల్కుచు మఱింతగాఁ దినుచుండ, ముస్తఫా అతని ననుకరించును.)

ఎమీలియో:
భక్షించుచునె యుండు పాపటాచీ!
బెలిండా:
నాప్రణయధనమా ఫిడేలియో!

(ఫిడేలియోను మునుపటికంటె గాఢముగ కౌఁగిలించుకొనును)

ఎమీలియో:
భక్షించుచునె యుండు పాపటాచీ!

(అనుచు ఎమీలియో ఇంకను అధికముగాఁ దినుచుండ, ముస్తఫా అతని ననుకరించును. ఇంతలో సమీరాసలీమాలు ఇటాలియన్ ద్రాక్షసారాయి సీసాలను గొనివచ్చి ముస్తఫా ముందున్న బల్లపై నుంతురు. వారిని చూచి ముస్తఫా)

ముస్తఫా:
వారెందు కిందున్నారు?
ఎమీలియో:
నియమభంగమగుచునుండె మఱల!
చూచియును జూడకుండవలె నీవు.
ఎదుట నేమి యైనఁ నేమి, తినుట మానవలదు నీవు.

(అనుచు మునుపటికంటె అధికంగా మెక్కుచు చూపించును)

ముస్తఫా:
ఆహ! తెలిసిందిలే కిటుకు! ఆచరింపఁగలను అంతకంటె బాగుగా!
బెలిండా, ఫిడేలియోలు:
ఎంత యథాజాతుం డీతండు!

(వారట్లు తినుచు, త్రాగుచునే యుండఁగా సముద్రపురేవులో ఇంతకు ముందు కోరస్ పాడిన ఇటలీయులతో కూడిన ఓడ యొకటి కన్పించును)

కోరస్:
తరగల యుద్ధృతి తగ్గుచునుండెను
సరియగు దిశలో కరువలి వీచెను
త్వరపడు డిదియే సరియగు కాలము
తరలుచు నిటలీధరకుం జేరఁగ
బెలిండా:

(ఫిడేలియాతో)

రమ్ము ప్రియా! రారమ్ము ప్రియా! ప్రే
మమ్మున సహయానమ్మొనరింతము

ఫిడేలియో:
జక్కవలంబలె జంటను వీడక
మక్కువతో నిఁక మనుచుం బోదము

(బెలిండాఫిడేలియోలు చెట్టాపట్టాలు పట్టుకొని పరస్పరానురాగమును ప్రకటించుకొనుచుఁ బోవ నుద్యమింపఁగా, సంభ్రమాసూయలతో ఎమీలియో వారిని జూచి వారు పాఱిపోవుచున్నట్లుగా ముస్తఫాను హెచ్చరించును. కాని అతఁడదివఱకే తిండిలో త్రాగుటలో పూర్తిగా నిమగ్నుఁడై మతిదప్పియుండి ఎమీలియో హెచ్చరిక పట్టించుకొనకుండును.)

ఎమీలియో:

(తనలో)

ఎంతటిఘోరం బెంతటిఘోరము!
అంతము సేసి మదాశాలతికను
సంతసమున నాకాంతను గైగొని
యింతయు జడియక యీతం డేగును

(ప్రకాశముగా ముస్తఫాతో)

అంతయు మోసం బంతయు మోసము
ఇంతయు వెఱవక యింతి బెలిండను
గైకొని పాఱుట కదిగొ! ఫిడేలియొ
మేకొనుచుండెను మీముందరనే

ముస్తఫా:
కన నేమియు, అన నేమియు నేను
ఎమీలియో:
ఓరి మూర్ఖుఁడా!
ముస్తఫా:
విన నేమియు, అన నేమియు నేను
ఎమీలియో:
అనకేమియుఁ, గనకేమియు
వినకేమియు, వెనుకాడక
తనివారఁగఁ దినుచుండుము

(ముస్తఫా మఱింత తీవ్రముగాఁ దినుచుండును. ఎమీలియో తనలో క్రిందివిధముగా నాలోచించి, ఫిడేలియోబెలిండాలను చేరఁబోవును)

ఎమీలియో:
ప్రణయపుగతి భగవంతుఁడెఱుంగును
ప్రాణము దక్కదు పడియుండిన నిట
వారినిఁ గూడుచుఁ బాఱుటె ఉచితము
ఫిడేలియో, బెలిండాలు:
పరుగునఁ బోవలె పడవను జేరఁగ
త్వరగను మాతో నరుగు మెమీలియొ!
తరుణము మించిన మరణమె మనలం
దరుముచు వచ్చును తస్మాజ్జాగ్రత!

(ముగ్గురు వడిగా నిష్క్రమింతురు)

ముస్తఫా:
కైమెకాన్! కైమెకాన్!

(పెద్దగా పిలుచును)

సమీరా సలీమాలు:
లేడు లేడాతఁడిచ్చట!
ముస్తఫా:
నాప్రణయధనమా బెలిండా! బెలిండా!
సమీరా సలీమాలు:
లేదు లేదామె యిచ్చట!

(తమలో)

అన్యయోషితావ్యామోహ మపనయించు
పాఠమునె నేర్పె నితని కాపడఁతి నేఁడు

ముస్తఫా:
ఓరి సేవక! ఫిడేలియో!
సమీరా సలీమాలు:
లేడు లేడాతఁడిచ్చట!
ముస్తఫా:
ఎచటి కేగిరి చవటలెల్లరు?
సమీరా సలీమాలు:
తీరముం జేరిరి పాఱిపోవఁగ!

(ఆమాట వినగానే జాగృతుడై ముస్తఫా క్రిందివిధముగా నఱచును)

ముస్తఫా:
దొంగలు! ద్రోహులు! పట్టితెండు వారిని!
భటులెక్కడ? ద్వారరక్షకు లెక్కడ!
సమీరా సలీమాలు:
అందఱును త్రాగి పడియుండిరి
ముస్తఫా:
యా అల్లా! యా ఇల్హీ! ఖరాబీ! కుల్ ఉల్ఖరాబీ!
జ్ఞానోదయమగుచున్నది నాకిపుడు!
సమీరా:
ఎంతగ నీవు నిర్దయత నెగ్గులు వల్కినఁగాని, నన్ను నీ
వెంత పరాభవించి త్యజియింపఁగ నెంచినఁగాని, ఆర్య! నా
స్వాంతమునందు నర్మిలియె పాయక యుండెను, నిప్పుడైన నా
వంతల విస్మరించి సుఖవంతులమై చరియింత మేకమై
ముస్తఫా:
కామాంధుఁడనై నీదగు
ప్రేమంబును విస్మరించి వేఱగు స్త్రీలం
గామించి భంగపడితిని
ఈ మోఱకునిన్ క్షమింపు మీవు సమీరా!

సమసెను పరకాంతాసం
గమకౌతుక మంతరమున, గాఢప్రియతా
ధ్వములోఁ జేతము సుఖయా
నము నిఁక నిర్వుర మొకటయి నమ్మికతోడన్

(నేపథ్యమునుండి ఈక్రింది కోరస్ పద్యము వినిపించును)

తమసతులను గణియింపక
తమకంబున నన్యసతుల తగులంబులకై
శ్రమపడువారికి నీకథ
యమరును గనువిప్పు సేయు నౌషధమగుచున్

ఎడారిసీమలో ఇటలీభామ రూపకము సమాప్తము