అంతవఱకె

తే. గీ.
అల్పకాంతులతో నసంఖ్యాకముగను
నింగి నాక్రమించుచు నిగనిగలఁ గుల్కు
తారకాతతి సౌరు సందర్శనీయ
మగును రాకేందుఁ డుదయింపనంతవఱకె.
(రాకేందుఁడు=పూర్ణిమాచంద్రుఁడు)
తే. గీ.
గానగోష్ఠులఁ జేయుచుఁ గాననముల
సంచరించెడు బహుపక్షిసంచయముల
వైభవము మాననీయమై వఱలుచుండు
అలిమకము గొంతు విప్పని యంతవఱకె.
(అలిమకము=కోకిల)
తే. గీ.
అల వసంతము నందరణ్యంబులందు
వివిధసౌరభంబుల నూని విరియుచున్న
విరుల యతిశయంబెల్ల చాంపేయలతలు
సౌరభంబూని విరియని క్షణమువఱకె.
తే. గీ.
కొలనునీటను బింబితంబులయి యున్న
తీరసంస్థితతరులతావారసుమిత
మంజరీతతి మోదంబు మదికిఁ గూర్చు
అబ్జముల్నీట విరియని యంతవఱకె.
తే. గీ.
ప్రౌఢరాయల కొల్వులోఁ బండితుండ
టంచు కీర్తిచంద్రికలు వహించియున్న
డిండిముని యవలేప మాతండు వాద
మందు శ్రీనాథు నెదిరింపనంతవఱకె.
తే. గీ.
స్వల్పమైనను పాండితీస్పర్శలేక
వచనకవితల నల్లుచు వాసిఁ గాంచ
నెంచెడు కవిబ్రువుల ఖ్యాతి హెచ్చుచుండు
అజ్ఞులగు పాఠకులు గల్గినంతవఱకె.
తే. గీ.
అంగనాతతి దైహికంబైన యట్టి
అందమారసి మురిసితి, నట్టి యన్ను
కన్న మిన్నయౌ సుగుణంపుటన్నువున్న
సన్నుతాంగినిఁ గనకున్న క్షణమువఱకె.
ఆ. వె.
సారరహితమైన సంఖ్యాబలమ్ములు
గుణములేనియట్టి కోమలికము
విద్యలేనియట్టి వెఱ్ఱికవిత్వంబు
కావు యోగ్యములును కామ్యములును.