వస్తావనే చూస్తున్నాను
ఈ దారిలో
ఎదురౌతావనే నిల్చున్నాను
వేకువ ప్రమిదలో
వెలుతురు ఒత్తి వేసి
వెలిగిస్తావనే
ఇక్కడ వేచి ఉన్నాను
సంధ్య కొమ్మల మీద
సన్నాయి పాటలు
ఊపందుకున్నాయి
మంచు తెరల చాటుగా
మబ్బుల కళ్లు
తొంగి చూస్తున్నాయి
నిశ్శబ్దం పాము
వెనుకమార్లా కదుల్తూ
అలికిడి పుట్టలోకి
ముడుచుకు పోతుంది
ఇక నీవొచ్చే వెళయ్యిందని
తెలుస్తూనే వుంది
రాతిరి పరిమళాలన్నింటినీ
శ్రద్ధగా సేకరించి
జేబుల్లో నింపుకొచ్చిన గాలి
నీకు స్వాగతం చెప్పేందుకే
నా పక్కకొచ్చి
నిస్సద్దుగా నిరీక్షిస్తోంది
ఏడు గుర్రాల రథం
తూరుపు మెరక పైకి
కదిలొస్తున్నట్టే ఉంది
ఇదిగో నేనూ జతకలుస్తున్నా
ఎనిమిదో గుర్రాన్నై