మొదటి దృశ్యం
(సమయం: పున్నమినాటి రాత్రి ఏడుగంటలు. స్థలము: రాణి మందారమాల అంతఃపురం. గవాక్షము నుండి పూర్ణచంద్ర బింబము స్పష్టముగా కనిపిస్తూ, నిర్మలమైన చంద్రిక అచట గల నాట్యవేదికపై పడుతూ ఉంటుంది. నాట్యవేదిక దీపాలంకృతమై ప్రకాశిస్తూ ఉంటుంది. అచట మందారమాల, ఆమె పరిచారికలు, ఆయత్తమై ఉంటారు. రాణికి పరిచారికలు వీవనలు వీస్తుండగా, యామినీపూర్ణతిలకకు నాట్యము నేర్పించు మయూరిక రాణికి సమీపంలో ఒక వైపు కూర్చుని ఉంటుంది. రాణికి మఱొకవైపు మయూరిక కెదురుగా యామినీపూర్ణతిలక సుసజ్జితవేషంలో కూర్చొని ఉంటుంది.)
రాణి:
ఆచార్యా మయూరికా! నేటికి యామిని నాట్యసంగీతములు చక్కగా నేర్చినదని మీ అభిప్రాయమా?
మయూరిక:
సందేహము లేదు మహారాజ్ఞీ! అందుచేతనే కదా మీముందు నేడామె పటిమను ప్రదర్శింప దలచుకొన్నాను.
రాణి:
ఐతే కానిండు. ముందుగా వీణావాదనం ఆతర్వాత నాట్యప్రదర్శనం – ఇదేగా క్రమం.
మయూరిక:
తమరి ఊహ సరియైనదే. అదిగో ఆ గవాక్షం ద్వారా చూడండి. నేడు పూర్ణిమ. నిండుచంద్రుఁడు లోకాన్నంతా అమృతసేచనంతో పరవశింప జేస్తున్నాడు. ఆచంద్రుని కరలాలనలో ఈయామిని పులకించి పోతున్నది. ఈ సన్నివేశానికి తగినట్టుగా ఒక అపూర్వమైన గీతాన్ని మన యామినీదేవి వీణపై ముందుగా ఆలపిస్తుంది. తరువాత అదే గానానికి భావయుక్తంగా ఆమె నాట్యాభినయం చేస్తుంది. (యామినివైపు తిరిగి) యామినీ! నీవు సిద్ధమే కదా! నా గౌరవాన్ని నిలుపుతావు కదా!
యామిని:
ఆచార్యకు అభివాదములు. నాశక్తివంచన లేకుండ సాధిస్తాను. (నాట్యవేదికపై కూర్చుండి ముందు నాట్యార్థమై పాడఁబోవు పాటను వీణపై శ్రావ్యంగా పలికిస్తుంది.)
రాణి:
(వీణావాదనాంతమున) బాగు బాగు. చక్కగా నేర్చినావమ్మా! కృతజ్ఞతాపూర్వకంగా మఱొకసారి ఆచార్యకు పాదాభివందనం చేయి.
(యామిని మయూరికాపాదాభివందనం చేస్తుంది. తర్వాత యామిని నాట్యకత్తె వేషంతోను, పరిచారికలు నాట్యార్హమైన వాద్యాలతోను ఆయత్తమౌతారు. ఈ క్రింది గీతాన్ని నాట్యోచితమైన గమకాలతో పాడుతూ యామిని నాట్యం చేస్తుంది.)
నిండుపున్నమివేళ నెనరార ద్విజరాజ!
రారమ్ము యామినిం జేరంగ ద్విజరాజ!
కన్నుల నీజిగి కాంచిన యంతనె
కుసుమించు నెవో కూరిమితలపులు
నీకరములు నను దాకినయంతనె
ఉదయించు నెవో మదిలో వలపులు |నిండు|
సురుచిరమగు నీకరములు సాచుచు
లోఁగొనుమోయీ తీగె విధంబున
సుందరయౌవనసుమశోభితమౌ
నాదగు మేనును నీదేహంబున |నిండు|
పాండిత్యంబే వరపాండిమమై
రాసిక్యంబే రమ్యామృతమై
పరగిన విబుధప్రవరుడ వీవే
యామిని వలచిన స్వామివి నీవే |నిండు|
రాణి:
(యామిని నుద్దేశించి) యామినీ! బాగు బాగు. సానబెట్టిన వజ్రంవలె మయూరిక నీ కళాకౌశలాన్ని ప్రకాశింప జేసినది. నీ అభినయము బాగున్నది, కాని నీకీ గీతానికి అర్థం పరిపూర్ణంగా తెలుసునా?
యామిని:
ఆ! దీనికి ఆచార్య చెప్పిన అర్థం నాకు తెలుసు. ఆ అర్థాన్నే కదా నే నభినయించినది.
రాణి:
అంతకంటె గూఢార్థమేమైన దీనికున్నదా? ద్విజరాజంటే ఏమిటి?
యామిని:
చంద్రుఁడు.
రాణి:
ద్విజరాజంటే బ్రాహ్మణశ్రేష్ఠుడనే అర్థం కూడ ఉన్నది. అట్లాగే విబుధప్రవరుడు అంటే పండిత శ్రేష్ఠుడనీ, దేవతాశ్రేష్ఠుడనీ అర్థాలు. ఐతే అవి ఇప్పు డప్రస్తుతం. పదాలకుండే అర్థాలన్నీ తెలుసుకుంటే సందర్భానుసారంగా ఒకే గీతాన్ని వివిధరీతులుగా అన్వయించుకొనవచ్చు. ఈ విధమైన జ్ఞానంవల్ల గీతార్థాన్నీ, అది ఆలంబనంగా సాగే నాట్యాన్నీ మఱింత శోభాయమానంగా మలచుకొనవచ్చు.
మయూరిక:
దీనికి నేనూ కొంతవఱకు బాధ్యురాలను. నాకు సంగీతనాట్యాలలో ఉన్నంత పరిజ్ఞానం సాహిత్యంలో లేదు.
రాణి:
అందులో దోషమేమీ లేదు. ఆరెంటిలో మీకున్నంత పరిజ్ఞానం నా గుర్తులో మఱెవ్వరికీ లేదు. (యామిని నుద్దేశించి.) యామినీ! మయూరిక దయవల్ల సంగీతనాట్యాలలో విదుషీమణివైన నీవు సాహిత్యంలోను అట్టి పరిణతి సంపాదించవలెనని నాకున్నది. నీవే మందువు?
యామిని:
నేను కోరేదీ అదే. కాని బాల్యంనుండి సాధించనిదే సాహిత్యం పట్టుపడదంటారు. నాకీ వయస్సులో సాధ్యమేనా?
రాణి:
ముదిరిన వృక్షపు చేవ చతురుడైన వడ్రంగి చేతిలో ఉత్తమశిల్పంగా మారుతుంది. విజ్ఞుడైన సాహితీగురువు చేతిలో నీవుత్తమసాహితీసరస్వతిగా మారుతావు. ఇట్టి సాహితీమూర్తి గవేషణకై నేను మహారాజులవారిని అర్థిస్తాను.
యామని:
కృతార్థురాలను.
రెండవ దృశ్యం
(సమయం: అపరాహ్ణం. పాంచాలదేశప్రభువైన మదనాభిరాముడు మంత్రి విద్యాపతితో సమావేశమై ఉంటాడు.)
మదన:
విద్యాపతీ! నిన్నటి కర్ణసుందరి నాటకం అమోఘంగా ఉండింది. ఈ నాటకకర్త బిల్హణుడు చాలా గొప్ప కవిలాగున్నాడు.
విద్యా:
సందేహం లేదు మహారాజా! అందుకే కదా మీకవార్యమైన కార్యభారమున్నా ఈ నాటకాన్ని చూడవలసిందిగా నేను మీకు విన్నవించుకొన్నది.
మదన:
ముందుగా ఆ కర్ణసుందరి చిత్రమే అలౌకికసౌందర్యశోభితమై ఉన్నదంటే, ఆమె స్వయంగా రంగంలో ప్రవేశించినప్పుడు ఆహా! ఆమె హావభావాలు, ఆహార్యం, సౌందర్యం వర్ణనాతీతంగా ఉన్నవి. మొత్తానికి ఇదొక ఉత్తమమైన నాటకం.
విద్యా:
అందుకే అచిరకాలంలోనే కాశ్మీరం నుండి పాంచాలం దాకా దాని ప్రథ ప్రాకింది. అంతేకాదు మహారాజా! మన రాజధాని భాగ్యం పండింది. బిల్హణకవి దేశాటనం చేస్తూ మన నగరానికి వచ్చినట్లు నాకు తెలిసింది. నిన్న నాటకారంభంలో అతడు వేదికపై కనపడవలసే ఉండింది కాని కనపడలేదట.
మదన:
ఎందుకో?
విద్యా:
విన్నాను. ఆమహాకవి కుష్ఠరోగులంటే కండ్లు మూసుకుంటాడట. పైగా కార్యార్థం వెళ్ళే వేళ కుష్ఠరోగి ఎదురుగా వస్తే అది ఘోరమైన అపశకునంగా భావించి వెళ్ళడం మానేస్తాడట. ఇట్లాంటిదేదో జరిగిందని నా అనుమానం. కాని అంతటి మహాకవి సాహితీరసజ్ఞులైన దేవరవారి దర్శనం చేసికొనకుండా నగరం వీడిపోడని నా నమ్మకం.
మదన:
ఆ మహాకవిని ఆహ్వానించి సత్కరించవలసిందే. ఐతే విద్యాపతీ! మీరొక్క ప్రకటన చేయవలసి ఉన్నది. అమ్మాయి యామినికి సంస్కృతం నేర్పడానికి సాహిత్యాలంకారవిదుడైన ఒక పండితునికై.
విద్యా:
మన నగరంలో జగత్ప్రసిద్ధులైన వైయాకరణులు, తార్కికులు, ఇంకా మీమాంసకులూ ఉన్నారు. సంస్కృతం చక్కగా రావడానికి వ్యాకరణం, తర్కం అవసరం కదా! ఇవి వచ్చి తాత్త్వికదృష్టి ఉంటే కాని మీమాంసకులు కాలేరు. ఇట్టి గాఢమైన విజ్ఞానం ఆలంబనంగా చేసికొని అటుపై సాహిత్యసౌధం నిర్మించు కొనవచ్చు.
మదన:
అది కొంతవఱకు సత్యమే కాని, పెద్దలు వైయాకరణి సాహితీకన్యకు తండ్రి వంటివాఁడనీ, తార్కికుడు తోబుట్టువు వంటివాడనీ, మీమాంసకుడు కేవలం షండుని వంటివాడనీ, అందుచేత వీరెవ్వరూ వరణీయులు కారని చెపుతుంటారు. అందుచేత ఈ చదువులు యథావసరముగా నెఱిగి కావ్యనాటకచ్ఛందోలంకారాదులందు పండితుడైన కవీంద్రుడున్నచో అతడీ కార్యమునకు తగినవాడని నాయభిప్రాయము.
సరసుఁడు, కావ్యశాస్త్రములఁ జక్క నెఱింగినవాఁడు, స్వీయసుం
దరకవితావిదగ్ధుఁ డయినట్టి కవీంద్రుఁడు గాక యన్యు లౌ
దురె బుధవర్య! యామినికిఁ దూర్ణముగా వరసాహితీమనో
హరవిదుషీత్వకౌముదిని నంటఁగఁజేయ నఖండితంబుగన్.
ప్రతీహారి:
(ప్రవేశించి) రాజా! కాశ్మీరపండితుడంట. మీదర్శనార్థమై వచ్చినాడంట.
మదన:
వెంటనే ప్రవేశపెట్టు. మాసన్నిధి పండితుల కెప్పుడైనా సన్నిహితంగానే ఉంటుంది.
ప్రతీహారి:
చిత్తం. (వజ్రకుండలభూషితుడైన మహావర్చస్వియైన పాతికవత్సరాల ప్రాయము గల బిల్హణుని ప్రవేశపెట్టును.)
బిల్హణుడు:
స్వస్తి పాంచాలప్రభువులకు.
విద్యా:
అయ్యా!తమరెవ్వరు?
బిల్హణుడు:
నాపేరు బిల్హణుడు. కాశ్మీరదేశకవిని. కర్ణసుందరీనాటకకర్తను.
విద్యా:
కాశ్మీరంనుండి ఇక్కడికి రావడానికి కారణం.
బిల్హణుడు:
విద్య పూర్తియైనది. కవిగా కొంత ప్రశస్తి కూడ వచ్చినది. బ్రహ్మచారిని. బాధ్యతలు పెరుగక ముందే వివిధదేశాలనూ ఆస్థానాలనూ సందర్శించాలనే కుతూహలమే దీనికి కారణం.
మదన:
బిల్హణమహాకవీ! నేడు సుదినం. మీ రాకవల్ల మా ఆస్థానం పవిత్రమైనది. మీ నాటకాన్ని మా నగరంలో నిన్ననే చూచినాను. నాకు బాగా నచ్చింది. అందులో మీకవిత్వం అత్యద్భుతం.
బిల్హణుడు:
కృతార్థుడను. మీ సాహిత్యాభిలాషను, మీ వదాన్యతను దేశం నలుమూలలా వ్యాపించిన మీ కీర్తియే తెల్పుతూ ఉన్నది.
రాజట గాని శూన్యమట రాజ్యము, వైభవలేశ మున్నచో
భ్రాజిలునంట యద్ది యొకపక్షముమాత్రమె రాత్రులందు, ఆ
రాజొక రాజె? శ్రీమదనరాజ! అహర్నిశలందు లోకవి
భ్రాజితకీర్తివైభవము రాజిలు మీరలు రాజు గాకిలన్?
మదన:
ఆహా! అద్భుతం మీకవనం. మాలోకవిభ్రాజితవైభవం మేమున్నంతకాలమే కాని, మీ లోకవిభ్రాజితవైభవం ఎల్లకాలమూ మాయకుండా ఉంటుంది.
విద్యా:
కవిగారూ! మీరెంతకాలం మా నగరంలో ఉంటారు?
బిల్హణుడు:
నేను భ్రమరం లాగున దేశదేశాలపండితసభలలో విజ్ఞానరసాస్వాదనం, వినిమయం చేస్తూ తిరుగుతున్నాను. ఎంతకాల ముంటానో చెప్పలేను.
మదన:
మీరు మానగరంలో కొంతకాలం స్థిరంగా ఉండి, మీకవితారసపానం చేసే అవకాశాన్ని మాకు ప్రసాదించాలని మా అభిలాష. మీవిడిదికై మా రాజోద్యానం ప్రక్కనే ఉన్న భవనం ఏర్పాటు చేస్తాము. మా ఉద్యానవన సౌరభాలు మీకవితాసౌరభాన్ని ద్విగుణీకృతం చేస్తాయని మా ఆశ.
బిల్హణుడు:
మీ ఆదరణకు కృతజ్ఞుడను.
మదన:
(చప్పట్లు చఱచి) ఎవరక్కడ? (ఒక రాజసేవకుడు ప్రవేశించును). ఇదిగో ఈబిల్హణకవీంద్రులను నగరాధికారి కడకు తీసికొని పోయి రాజోద్యానం ప్రక్కనే ఉన్న ఉన్నతభవనంలో వారు కోరినంతకాలం వారికి విడిది నేర్పాటు చేయించు. (బిల్హణుడు సేవకునితో నిష్క్రమించును)
విద్యా:
ఈకవీంద్రుడు యామినికి తగిన గురువుగా నాకు దోచుచున్నాడు.
మదన:
అందులో సందేహం లేదు. ఇతడు మహావర్చస్వియే కాక మన్మథుని దలపించే స్ఫురద్రూపి. తప్త కాంచననిభమైన తనువుతో నితడు బంగారువిగ్రహం వలె వెలుగొందుచున్నాడు. అంతే కాక,
బ్రహ్మవర్చస్సుతోఁ గడు పరిఢవిల్లు
నితని వదనంబు వాగ్దేవి నెంతగాను
మోహపెట్టెనొ యామె తన్ముఖమునందె
వాసమొనరించు నెప్పుడు వదలకుండ.
విద్యా:
ఇంకెందుకు సందేహం. ఆడఁబోయిన తీర్థం ఎదురే అయింది గదా!
మదన:
కాని నన్నొక సందేహం పీడిస్తున్నది. అమ్మాయి వింశతివర్షాల పరిపూర్ణయౌవనవతి. అత్యంత సౌందర్యవతి. సంగీతనాట్యకళాసరస్వతి. అతడో పుంభావభారతి. రూపజితరతిపతి. బోధించే విషయం శృంగారరస భూయిష్ఠం. యౌవనమత్తత చిత్తచాంచల్యమునకు హేతువు. ఈ శిష్యురాలు గురువుల సంబంధం మనమూహింపని సంబంధానికి దారి తీస్తుందేమో అని నా భయం.
విద్యా:
ఇట్టి సందేహం కల్గడం దేవరవారి విస్తృతలోకానుభవానికి నిదర్శనం. ఐనా… బిల్హణునివంటి గురువు ఆమెకు లభించడం పూర్వజన్మసుకృతఫలం. (కొంచెం ఆలోచించి) నాకొక ఉపాయం తోస్తున్నది. గురువు కుష్ఠులను జూడలేడు. అంతేవాసిని అంధుల నవలోకింపదు. అందుచేత యామినీదేవికి ఆచార్యు డంధుడని చెప్పి, యామినీదేవికి కుష్టురోగ సంపర్కం ఉందని ఆచార్యునికి చెప్పి, వారికి మధ్య నొక దట్టమైన తెరను గట్టి పరస్పరాలోకనం జరుగకుండా మనం జాగ్రత్తపడవచ్చు. అంధుడైనను మహాపండితుడు, కవీంద్రుడు, శ్రావ్యతరవాగ్భూషణుడైన అతని కంఠస్వనశ్రవణమాత్రాన సంస్కృతం చక్కగా నేర్చుకొనవచ్చని రాజపుత్త్రిని ఒప్పించి ఈ కార్యాన్ని నెరవేర్చవచ్చు. మఱి మీరేమందురో?
మదన:
నాకిది సాధ్యమే అనిపిస్తున్నది.
విద్యా:
మహారాజా! మీరు యామినీదేవిని ఒప్పించండి. బిల్హణమహాకవి విషయం నేను చూచుకుంటాను.
మదన:
అట్లే కానిండు.
మూఁడవ దృశ్యం
(స్థలం: రాజోద్యానసమీపం. పట్టమహిషి మందారమాల ఆంతరంగిక సేవిక యైన శరావతి ఉద్యానవనమునుండి పూవులు గోసి తెచ్చుటకై ఒక బుట్టను తీసికొని పోవుచు, ఆమెకు ప్రియ స్నేహితురాలైన వేత్రవతి కంటఁబడును)
వేత్రవతి:
ఏమే శరావతీ! నీవీ మధ్య అందరాని అపరంజివైపోయావు? అంత తీరిక లేకుండా ఉంటున్నావా.
శరావతి:
ఏం చెప్పనే వేత్రా! అంతఃపురంలో అంతులేని పనులు.
వేత్రవతి:
ఇప్పు డాపని మీదనే తోటకు వెడుతున్నావా పూలబుట్టను తీసికొని.
శరావతి:
ఆ! గ్రహించినావుగా, త్వరలో ఈ బుట్టనిండా సంపెంగలు నింపుకొని పోవాలి.
వేత్రవతి:
మఱి నేను నీతో రానా? నీకు సాయం చేయనా?
శరావతి:
ఆ! నీకు తీరిక ఉంటే రావచ్చు. చాలాకాలానికి కలిశాం కనుక పూలు కోస్తూ కాసిన్ని కబుర్లూ చెప్పుకోవచ్చు. (ఇద్దరు కలిసి ఉద్యానంలో ప్రవేశించి పూలు కోయుట కుద్యమింతురు)
వేత్రవతి:
ఈమధ్య రాజకుమారి యామినీదేవి సంగీతం, నాట్యం చక్కగా నేర్చిందని విన్నాం?
శరావతి:
ఆ! మొన్ననే ఆమె రాణిగారి ముందర చాలా చక్కగా తన పాండిత్యం ప్రదర్శించుకుంది. నేనూ దానిని చూచాను. ఎంత బాగుందో!
వేత్రవతి:
మరి శిక్షణ ముగిసింది కదా! రాజకుమారి కల్యాణం జరుగనున్నదా?
శరావతి:
ఆ సంగతి చివరిదాక మనబోటి వారికి తెలియదు గాని నా అనుమానం అది ఇప్పుడే జరుగదని.
వేత్రవతి:
ఏం ఎందుచేత? సంగీతం, సౌందర్యం, సౌకుమార్యం, సంపూర్ణయౌవనం, సంపదా అన్నీ ఉన్నాయిగా! ఒక్క చక్కనయ్య దొరుకుటే తరువాయి. అదేం కష్టం ఇవన్నీ ఉన్నాక.
శరావతి:
అది కాదే, మొన్నటి ప్రదర్శన తర్వాత రాణిగారు రాజకుమారిని సంస్కృతం నేర్చుకొమ్మన్నారు. దాని తర్వాత గాని పాపమా నవయౌవనాంగికి కల్యాణయోగం కలిగేట్లు లేదు.
వేత్రవతి:
ఆ! ఎంత విడ్డూరమే. వయసైన పిల్లకు పెండ్లిచేయక ఇంకా చదువుకొమ్మనడం. మఱి ఆమె సంస్కృతం సాధిస్తూ వుందా ఇప్పుడు?
శరావతి:
త్వరలోనే మొదలు కాబోతుందని విన్నాను. కాశ్మీరం నుంచి ఒక గొప్ప పండితకవి వచ్చాడట. ఆయన చాలా తేలికగా సంస్కృతం నేర్పిస్తాడట. ఆయన ఎక్కడున్నాడనుకున్నావు. ఈ ఉద్యానవనం ప్రక్కనే ఆ పెద్దభవనం ఉందే. అందులోనే ఆయన నివాసమంట. ఆ భవనంలోనే ఒక పెద్ద మండపం ఉందట. అక్కడే ఆయన పాఠాలు చెపుతాడంట. ఒక్క రహస్యం. ఎవ్వరికీ చెప్పకు మఱి. నాకు తెలిసిందేమంటే గురువు, శిష్యురాలు ఒకర్నొకరు చూసుకోరంట. సంస్కృతంలో శృంగారం చిక్కగా ఉండే కావ్యాలు చాలా ఉన్నాయంట. యౌవనంలో ఉండే శిష్యురాండ్రను చూస్తూ అట్లాంటివి చెప్పాలంటే ఆయనకు వల్లమాలిన సిగ్గంట. అందుచేత వారిద్దరికి మధ్య పెద్దతెరను గట్టి ఒకర్నొకరు చూచుకోకుండా చదువు సాగిస్తారంట. ఈ గుడ్డి చదువెంత కాలం సాగుతుందో చూడాలని నాకూ వేడుకగా ఉంది.
వేత్రవతి:
ఈ కోసిన పూలు చాలా, ఇంకా కొయ్యాలా?
శరావతి:
చాలులే. పోదాం. రాణిగారు నాకై చూస్తుంటారు (నిష్క్రమింతురు.)
నాల్గవ దృశ్యం
(స్థలం: బిల్హణుని మందిరంలో విద్యామండపం. అందులో ఒక సగంలో యామిని కూర్చొని యుండును. ఆమెకు ముందర మిగితా సగము నాచ్ఛాదించుచు నొక దట్టమైన తెర కట్టబడి యుండును. రెండు సగములకు ప్రత్యేకమగు తలుపు లుండును)
యామిని:
స్వస్తి! గురువర్య! మధురసపానలోల
మైన తేఁటిచందాన నాయత్త యయ్యె
యామినీపూర్ణ యిట, భాష నభ్యసింపఁ
జేయ రావలయుఁ దమరు శీఘ్రముగను.
బిల్హణుడు:
స్వస్త్యస్తు! ప్రియాంతేవాసిని! ఇహాగచ్ఛామి. (వచ్చి తన సగములో కూర్చొనును. అట్లు కూర్చొని) యామినీ! పాఠానికి ముందుగా సరస్వతీ ప్రార్థన చేయి.
యామిని:
కలావిలాసా న్మకరందబిందు
ముద్రాం వినిద్రే హృదయారవిన్దే|
యా కల్పయన్తీ రమతే కవీనాం
దేవీం నమస్యామి సరస్వతీం తామ్||◊
బిల్హణుడు:
యామినీ! నీవు ఆశుగ్రాహివి. ముందే సంగీతనాట్యములలో పాండితి సంపాదించినావు కనుక ఆవిద్యలకు సోదరి వంటిదైన సాహిత్యవిద్యను నీవు త్వరగా సాధింపగల్గుతున్నావు. అచిరకాలంలోనే రఘువంశాన్ని నేర్చుకొని ఇప్పుడు కుమారసంభవం సాధిస్తున్నావు. ఆ పాఠమే నీకీరోజు చెపుతాను.
యామిని:
కాళిదాసు తృతీయసర్గలో మన్మథుడు రతీవసంతాదులతో వనంలో ప్రవేశించినప్పుడు చేసిన వర్ణనద్వారా శృంగారరసాన్ని చక్కగా పోషించినా డన్నారు. దానిని గుఱించి చెపుతారా యిపుడు?
బిల్హణుడు:
ఔను యామినీ. ఆవనంలో వసంతరతీమన్మథాదులు ప్రవేశించగానే శృంగారరసం రెచ్చిపోయింది అని చెపితే శృంగారరసానుభూతి కల్గదు. అప్పుడా వనంలో కల్గిన పరిణామాలను, దృశ్యాలను రసలక్షితంగా వర్ణిస్తే చక్కని రసానుభూతి కల్గుతుంది. ఇటువంటి వర్ణనలలో కాళిదాసు సిద్ధహస్తుడు. ఈ శ్లోకాలను చూడు. (అత్యంతశ్రావ్యమగు కంఠధ్వనితో చదువును)
మధు ద్విరేఫః కుసుమైకపాత్రే, పపౌ ప్రియాం స్వామనువర్తమానః|
శృంగేణ చ స్పర్శ నిమీలితాక్షీం, మృగీమ్ అకండూయత కృష్ణసారః||
దదౌ రసాత్ పంకజరేణుగంధి, గజాయ గండూషజలం కరేణుః|
అర్ధోపభుక్తేన బిసేన జాయాం, సంభావయామాస రథాంగనామా||
పర్యాప్త పుష్ప స్తబకస్తనాభ్యః, స్ఫుర త్ప్రవాళోష్ఠమనోహరాభ్యః|
లతావధూభ్య స్తరవోఽప్యవాపుః, వినమ్రశాఖా భుజబంధనాని||
యామిని:
(తనలో) ఆహా ఎంతశ్రావ్యంగా ఈ శ్లోకాలను చదువుతున్నాడో. ఇంతటి పండితుడు, శ్రావ్యగాయనుడు అంధుడగుట నాదురదృష్టం. అంధుడైనను నా నియమోల్లంఘన చేసి ఈతనిని చూడవలెనని మనస్సు ఉవ్విళ్ళూరుచున్నది. (అని ఆలోచించుచు క్షణమాత్రము పరధ్యానముగా నుండును)
బిల్హణుడు:
ఈ శ్లోకాలను వ్రాసికొన్నావా?
యామిని:
(తేరుకొని) ఆ!వ్రాసుకొన్నా. మొదటి శ్లోకానికి నాకు తోచినట్లు అర్థం చెపుతాను. మీరు తప్పులు దిద్ది, విశేషార్థాలు వివరించండి.
బిల్హణుడు:
ఆ! కానీయి. అంతా నేనే చెప్పే బదులు నీ ఉపజ్ఞానుసారంగా నీవు స్వతంత్రంగా యోచించి చెప్పడం నాకు సంతోషంగా ఉంది.
యామిని:
ఏకపాత్రే, ఒకే పుష్పమను పాత్రలో, స్వాం ప్రియాం, తన ప్రియురాలిని, అనువర్త మానః, అనుసరిస్తూ, ద్విరేఫః, తుమ్మెద, మధు, పూఁదేనెను, పపౌ, త్రాగెను. కృష్ణసారః చ, నల్లనిమగలేడియు, స్పర్శ, తాకుటచే, నిమీలితాక్షీం మృగీం, కన్నులు మూసికొనిన ఆడులేడిని, శృంగేణ, కొమ్ములతో, అకండూయత, గోకినది. ఇదేకదా దీని అర్థం.
బిల్హణుడు:
చాలా చక్కగా చెప్పినావమ్మా. అది సామాన్యార్థం. యుక్త వయస్కులైన ప్రేయసీప్రియులకు ఏకీభావముంటుంది. వారు పరిపూర్ణంగా మనస్సు చేత, కర్మ చేత పరస్పరానుకూలమైన దానినే చేస్తారు అనే అనురాగతత్త్వాన్ని కాళిదాసు ఆ రెండు తుమ్మెద లొకే పుష్పపానపాత్రలో మధువును త్రాగినవని చెప్పడం వల్ల ఈ శ్లోకంలో చిత్రీకరిస్తున్నాడు. ఇక రెండవసగంలో ఆడుమగలేళ్ళ మధ్య ఇంతటి ఏకీభావమున్నట్లు వ్రాయలేదు. తొలి ప్రణయంలో ప్రేయసీప్రియులు పరస్పరాకర్షణకు లోనై, స్పర్శాదులమాత్రం చేతనే పరస్పరానందం పొందే స్థితిని కాళిదాసు వర్ణించినాడు. ఈవిధంగా ఈ శ్లోకంలో అనురక్తి యొక్క పరిణత దశను, ప్రథమదశను అత్యంతచాతుర్యంతో మనస్తత్త్వ శాస్త్రజ్ఞునివలె కాళిదాసు చిత్రించినాడు. ఇట్లాంటి విశేషార్థమే చంద్రునికి చంద్రికవలె కావ్యానికి అత్యంతశోభాకరమౌతుంది. కాళిదాసు కవిత్వంలో ఇట్టి అర్థం పుష్కలంగా ఉంది కనుక అతని కవిత్వం ఉత్తమకవిత్వమని పండితులంటారు.
యామిని:
ఎంత చక్కని వర్ణన! ఇటువంటి వర్ణనల వల్ల శృంగారరసనిష్పత్తి కలుగుతుం దనుటలో సందేహం లేదు. మిగితా రెండు శ్లోకాలను వివరిస్తారా?
బిల్హణుడు:
రెండవ శ్లోకంలో రసాత్, అంటే ఉత్కటమైన శృంగారరసభావన చేత నని అర్థం. పంకజరేణుగంధి గండూషజలం కరేణుః గజాయ దదౌ – అంటే పద్మములపుప్పుడి చేత సువాసితమైన జలాన్ని కరేణుః అంటే ఆడేనుగు పుక్కిటబట్టి గజాయ అంటే మగయేనుగునకు, దదౌ అంటే ఇచ్చెను – అని అర్థం. అట్లాగే రథాంగనామా అంటే చక్రవాకమనేపక్షి, అర్ధోపభుక్తేన బిసేన జాయాం సంభావయామాస, అంటే తాను సగము తినిన తామరతూడుచేత తనభార్య యైన ఆడుచక్రవాకమును ఆదరించెను – అని అర్థం. ఈ శ్లోకంలో దంపతులు ఉచ్ఛిష్టదోషాన్ని లెక్కచేయక చేసే చేష్టలు వర్ణింపబడ్డాయి. ఈస్థితి దంపతులమధ్య ప్రేమ విశ్వాసాలు పరాకాష్ఠ చెందినపుడే కలుగుతుంది.
యామిని:
మొదటి శ్లోకంలో చెప్పిన తుమ్మెదజంట కలిసి పానం చేసే అవస్థకంటె ఈ శ్లోకంలో చెప్పింది అంతకంటె ఉన్నతమైన అవస్థకదా!
బిల్హణుడు:
చక్కగా అర్థం చేసికొన్నావు. ఈ రెండు శ్లోకాల్లో కాళిదాసు వసంతమన్మథులచే ప్రభావితమైన ప్రకృతిలోని జంతువర్గంలో కల్గిన మనఃపరిణామాలను వర్ణించినాడు. ఇక మూడవ శ్లోకంలో సాధారణంగా జడమైన తరు లతాదులు కూడ ఆప్రభావానికి లోనైనవని వర్ణిస్తాడు. నిండుగా పుష్పించిన పూగుత్తులనెడు స్తనములు, మెరిసే చిగురుటాకులనే ఎఱ్ఱనిపెదవులు కల్గిన మనోహరమైన లతలవల్ల, వంగిన కొమ్మలను బాహువుల చేత, తరవః అపి, అంటే చెట్లు కూడ కౌగిలింతలను పొందినవి – అని చెట్లకు పురుషత్వమును, లతలకు స్త్రీత్వమును ఆపాదించి, జడప్రకృతులు కూడ శృంగార చైతన్యవంతము లైనవని ఈ శ్లోకంలో కాళిదాసు వర్ణించినాడు. ముందు జరుగబోయే పార్వతీశివుల శృంగారరూపకమైన మనఃపరిణామానికి ఈవిధంగా శృంగారమయమైన ప్రకృతిరంగాన్ని కాళిదాసు ఈ వర్ణనల ద్వారా కల్పించినాడు.
యామిని:
చక్కగా చెప్పినారు గురువుగారూ.
బిల్హణుడు:
సరే! వ్రాసికొన్నావుగదా! ఒకసారి ఈశ్లోకాలను చక్కగా చదువు. (యామిని పై శ్లోకములను చక్కగా పఠించును. అంతలో, యామినివైపు అర్ధభాగపు తలుపులోనుండి శరావతి ప్రవేశించును)
శరావతి:
రాజకుమారికి నమస్కారము.
యామిని:
ఏమే శరావతీ వచ్చినావు, రాణిగారేమైన కబురంపినారా?
శరావతి:
ఔను దేవీ! నేడు చైత్రపూర్ణిమ గదా! ఈ సాయంకాలం మీరుద్యానవనంలో సఖులతో సహా సంపూర్ణ చంద్రోదయశోభ తిలకిస్తామన్నారట గదా! దానికి ఆయత్తం చేయడానికై మహారాణిగారు మిమ్ములను రమ్మన్నారు.
యామిని:
ఔను. కాలాతీతమౌతున్నది. పోదాం పద. గురువర్యా! మీకు నమస్కృతులు. యామినికి సెలవిప్పించండి.
బిల్హణుడు:
తథాస్తు. సంపూర్ణద్విజరాజసందర్శనప్రాప్తిరస్తు.
ఐదవదృశ్యము
(సమయం: సాయంకాలం, చంద్రోదయానికి కొంతకాలం ముందు. స్థలం: బిల్హణుని భవనం ప్రక్కనే ఉన్న ఉద్యానవనం. ఆ భవనగవాక్షం నుండి ఉద్యానవనం చక్కగా కన్పడుతుంది. ఉద్యానవనస్థులకు ఆ గవాక్షంలో గల వ్యక్తి యొక్క ముఖం చూచాయగా కన్పడుతుంది గాని ఆ వ్యక్తి యొక్క ధ్వని మాత్రం స్పష్టంగానే వినపడుతుంది. అప్పుడు యామినీపూర్ణతిలక చంద్రిక, మధురిక అను చెలికత్తెలతో సహవిహారార్థమై వస్తుంది.)
యామిని:
(ఒక కృత్రిమ సరస్సు లోని పద్మలతను చూపిస్తూ) చంద్రికా! చూడవే యీ పద్మిని అంతఃపురంలో రాణి లాగ ఈ సరస్సులో ఎంత అందంగా ఉందో!
చంద్రిక:
ఔను దేవీ! కాని ఈపద్మినీవిలాసం ఇనసంపర్కం ఉన్నంతవఱకే. ఆ యినుడు త్వరలో అస్తాద్రి కేగ బోతున్నాడు. అప్పటినుండి పాపం ఈ పద్మినికి ప్రోషితభర్తృకవలె కృశించడమే ప్రాప్తమౌతుంది.
యామిని:
నీవనేదీ సత్యమే. ఏ పద్మిని యైనా ఇనసంపర్కం లేనిదే రాజిల్లదు గదా!
మధురిక:
చూడు దేవీ! ఇదే కొలనులో కలువతీగెలు కూడ ఉన్నాయి. అవి శోభావిహీనంగా ఉన్నాయి.
యామిని:
త్వరలో ద్విజరాజు రాబోతున్నాడు షోడశకళలతో. ఆ ద్విజరాజును చూస్తూనే ఈ కుముదినులముఖాలు శోభామోదాలతో వికసిస్తాయి.
చంద్రిక:
అంతేకాదు. యామిని ముఖమూ ద్విజరాజును చూస్తే అలాగే వెల్గిపోతుందిలే. (ఈ మాటలకు యామిని కొంచెము సిగ్గును నటించును)
యామిని:
చంద్రికా! కొలను గట్టున నున్న సంపెంగతీగను చూడు. బంగారురంగు పూలతో ఆమోదం వెదచల్లుతూ అది యెంత అందంగా ఉందో.
చంద్రిక:
బంగారు చీరను గట్టి త్వరలో బయల్పడే ద్విజరాజుకై వేచే కన్యకలాగే ఉన్నదది. (యామిని కొంచెము సిగ్గును నటించును)
మధురిక:
ఔనులే! త్వరలో ద్విజరాజావిష్కారం జరుగుతుంది. యామినీముఖం వెలుగుతుంది. (యామిని కొంచెము సిగ్గును నటించును)
యామిని:
పుష్పాలంకృతమైన లతకూనలతో ఈ ఉద్యానం ఎంత అందంగా ఉన్నదే!
మధురిక:
ఔను. ఒకవైపు తెల్లగా విరిసిన మల్లెలు సుగంధం వెదచల్లుతున్నాయి. ఆ మల్లెలతో పోటీ పడ్డట్లుగా బంగారురంగుతో సంపెగలు ఘుమఘుమలు నింపుతున్నాయి. ఒకవైపు నిండుగా విరిసిన మోదుగులు మదనుని కొడవళ్ళలాగ ఎఱ్ఱనిపూలతో వెలుగొందుతున్నాయి.
(అందఱు కలసి ఈ క్రిందిపాటను మధ్యమావతిరాగంలో వనావిష్కరణచేస్తూ అభినయయుక్తంగా పాడుతారు)
చైత్రమాసపువేళ చక్కగా నరుదెంచె
చిత్రముగ వనమెల్ల సింగార మొలికించె
నీతనూలతతోడ నిలువెల్ల పెనవేసి
కౌఁగిలించితి గాని గాటముగ వీడెవడె
మాకందపురుషుండొ మన్మథుండో వీడు
చెప్పవే మాధవీ సిగ్గేల నీకు |చైత్రమా|
వలవంత బూనకే కలువకన్నియ చాల
పులకింపజేయుచున్ భువినెల్ల త్వరలోన
వెలయునే నీరాజు, వేయిచంద్రులలీల
వెలుగునే నీమోము కలత నీ కేల |చైత్రమా|
తెలిపూలవలిపంబు నిలువెల్ల ధరియించి
సరిలేని జ్యోత్స్నాభిసారికాచందాన
మల్లికా నీవింత తల్లడిల్లెద వేల
వచ్చులే నెలరాజు త్వరగ నిను జేర |చైత్రమా|
ఫలభంగములు సేయ పాడియే ఓచిలుక
ఆకసంబున నిల్చి అధ్వగుల బరికించి
వారివిరహంబుచే వ్యథనొందు కాంతలకు
తెలుపవే ప్రియులవార్తలను నీవింత |చైత్రమా|
కోకిలా నీకెంత కోప మింతులపైన
పంచమంబున బాడి పతిలేక వెగడొందు
విరహార్తలను చాల వెతలపా లొనరించి
గుట్టుగా దాగెదవు చెట్టుచాటునను |చైత్రమా|
యామిని:
అదిగో ఆ గున్నమావిని చూడు. నాకెందుకో బోధపడటం లేదు. పగలంతా ఆ గున్నపై కూర్చొని పాడే పుంస్కోకిల రాత్రి మౌన మెందుకు వహిస్తుందో.
మధురిక:
బహుశః రాత్రంతా ఆ వృక్షంపైన ఉండే గూడనే పడకటింటిలో సుఖంగా గడపి, పగలంతా ఆ సుఖానుభవాన్ని పాటరూపంగా పలవరిస్తూ ఉంటుందేమో!
చంద్రిక:
ఎంత చతురంగా మాట్లాడుతున్నావే మధురికా.
యామిని:
ఆహా! అదిగో తూర్పున నిండుచంద్రు డుదయించినాడు.
స్వాధీన పతికకున్ సరిలేని అమృతంపు
భాండంబె యీతండు పడఁతి కనవె!
అభిసారికాస్త్రీల ఆచూకి పతులకుం
దెలుపు చారు డితండు పొలతి కనవె!
విరహిణీచిత్తంబు లెఱియించు చల్లనౌ
వింతకొఱవి యితం డింతి కనవె!
మదవతీహృదులందు స్మరభావ ముప్పొంగఁ
జేయు సిద్ధుడితండు చెలియ కనవె!
ధాత్రి నెల్లను పాలసంద్రముగఁ జేసి
దంపతుల ననురాగయుక్తముగఁ జేసి
కలువకన్నెకు మోదంబు గలుగఁ జేసి
వెలుగుచుండెను చంద్రుండు చెలువ కనవె!
(ఆ స్త్రీలు మువ్వురూ విలాసముగా పూర్ణుడై ఉదయించిన చంద్రుని యందమును తిలకించుచూ ఉద్యానవనములో నుండగా ఉద్యానవనసమీపభవనగవాక్షము నుండి ఈ విధముగా వినపడును)
బిల్హణుడు:
ఆహా! ఏమి ఈ చైత్రపూర్ణిమాచంద్రుని అందం. లోకాన్నంతా ఆనందమయం చేస్తూ వెలుగొందుచున్నాడు.
కలువల నిద్రలేపి, రతికాంతుని మాంద్యము వాపి, పుష్కర
స్థలిఁ దిమిరంబుఁ జోపి, రతిఁ జాలని బాలల నూపి, దేవతా
వళి కమృతంబుఁ జేపి, వరవాసవదిక్పతి కుండలంబునై,
కలువలఱేనిమండలము కాంతిలుచుండెను తూర్పుకొండపై.[1]
వెన్నుని యెదపై నున్న శ్రీవత్సలాంఛనంవలె నిండుగా సుధామయధవళమూర్తియై వెలసిన ఈతనిలో ఆకళంక మేమి?
కాదగు నింద్రనీలమణికాలిమమో, హరిణంబొ, అబ్ధిలో
శాదమొ, మచ్చయో, పుడమిచాయయొ యంచుఁ దలంత్రు గాని నే
నేదియుఁ గాదు రాత్రి తమమెల్లను ద్రావుట కుక్షిలోపలన్
మేదురమౌచుఁ బేరుతమమే యని యందును నిందుచిహ్నమున్.[2]
మఱియును,
సుందరాంగుల సృజియించుచో విరించి
అమృతమయమైన మృత్తిక నపహరింప
నేర్పడిన కుహరంబె యౌనేమొ చంద్ర!
నీదు తనువందు నెలకొన్న నీలిమంబు.
చంద్రి.మధు.:
(ఏకకంఠంతో) ఎవరే యామినీ, ఇంత మధురంగా జాబిల్లిని ప్రశంసిస్తున్నారు?
యామిని:
ఏమో నాకు సుపరిచితమైన కంఠంలాగానే ఉంది. కొంచెం వితర్కించి, (తనలో) ఇది తప్పకుండా గురువు గారి కంఠస్వనమే. అదే శ్రావ్యత, అదే స్పష్టత. సందేహమే లేదు. మఱి అత డంధుడని అన్నారు గదా! అంధుం డెట్లు చంద్రుని చూచును? చూడనిదే ఇంత చక్కగా నెట్లు వర్ణించును? ఇదంతయు అయోమయముగా నున్నది. ఆత డంధుండని నన్ను భ్రమ పెట్టుటకే అన్నారా? దీని తత్త్వము నే నెట్లైనా కన్గొనవలెను. దూరగవాక్షము నుండి ఒక బంగరు రంగుగల వ్యక్తి రూపము నాకు చూచాయగా దోచుచున్నది. ఈ సువర్ణమూర్తి యేనా బిల్హణుడు? బంగరుకు తావి యబ్బినట్లు ఈ శ్రావ్యకంఠస్వనం, ఈ పాండిత్యం, ఈ కవిత్వం ఆ సువర్ణమూర్తికే యబ్బినవా? ఈ సత్యము నెట్లైనా నిరూపింపవలెను. (ప్రకాశముగా) ఔను! నాకు పరిచితమైన కంఠమే కాని, ఆ వ్యక్తి యెవ్వరో ఇదమిత్థముగా నిర్ణయింపజాలకున్నాను.
చంద్రి.మధు.:
యామినీ! నీవు పున్నమిచంద్రునిపై చక్కని పాటను పాడుతూ నీ నాట్యవిన్యాసాన్ని ప్రదర్శించినావట కదా! ఈ మధుమాసపు పూర్ణవిధునికి ఆపాట పాడవూ?
(యామిని ‘నిండుపున్నమివేళ నెనరార ద్విజరాజ!రారమ్ము యామినిం జేరంగ ద్విజరాజ!’ అను ముందుగా కల్యాణిరాగములో పాడిన పాటను ఇప్పుడు మోహనరాగములో పాడును. ఆపాట గవాక్షము చెంత నిల్చిన బిల్హణునికి కించిదస్పష్టముగా వినిపించును)
బిల్హణుడు:
‘పాండిత్యంబే వరపాండిమమై
రాసిక్యంబే రమ్యామృతమై
పరగిన విబుధప్రవరుడ వీవే
యామిని వలచిన స్వామివి నీవే
నిండుపున్నమివేళ నెనరార ద్విజరాజ!
రారమ్ము యామినిం జేరంగ ద్విజరాజ!’
ఆహా! ఏమీపాట! ఎంత మధురం. పరిచితమైన కంఠస్వనం. (కొంచెం వితర్కించి) ఆ! ఇది యామినీకంఠస్వనమే. యామినీ, నీవెందుకిట్లు పాడుచున్నావు? నీవు నాపై మరులు గొన్నావా? నేను కుష్ఠరోగగ్రస్తులను చూడనైనా చూడలేనని నీవెరుగవా? (మఱల కొంత వితర్కించి) కాని నియమభంగమైనను ఈ మధుర నాదం వెలువడే వదనాన్ని చూడవలె ననిపించుచున్నది. మనసెందుకో ఇట్టి ఉత్కంఠను చూపుచున్నది. దీనిని నిలువరింపగలనా? ఏమో? ఎట్లైనను ఱేపటి వఱకు నా హృదయము నెట్లో నిలువరించుకొందును.
చంద్రి.మధు.:
చక్కని పాట యామినీ! భోజనానికి వేళైంది. ఇక పోదామా? (అందఱు నిష్క్రమింతురు)
ఆఱవదృశ్యము
(స్థలం: విద్యామండపం. యథాప్రకారం యామినీబిల్హణులు తెర కిరువైపుల ఆసీనులై యుందురు)
యామిని:
గురువర్యులకు నమస్కారము.
బిల్హణుడు:
సత్వరసత్కల్యాణప్రాప్తిరస్తు. యామినీ నిన్నటి పూర్ణచంద్రికావనవిహార మెట్లు జరిగినది?
యామిని:
బాగుగానే జరిగినది గురువర్యా! నా ప్రియసహచారిణులు చంద్రికామధురికలతో సహ ఆటపాటలతో, అపూర్వపుష్పితవృక్షసమక్షములో చక్కగా జరిగినది. ఐతే ఒక వింత జరిగినది. ఈ భవనగవాక్షం నుండే అపూర్వము, అద్భుతము, అసదృశమైన రాకాసుధాకరవర్ణనం అమృతతుల్యమైన కంఠస్వరంతో వినపడింది. అందులో ముఖ్యంగా చంద్రునిలోని కందును గుఱించిన పద్యం నన్ను అవాక్కును చేసింది.
బిల్హణుడు:
ఆ వర్ణనలు చేసింది నేనే. ఆ పద్యాలు చదివింది నేనే. ఎందుకో నిన్న చంద్రునిలోని కందు నా కదృష్ట పూర్వంగా తోచింది. అప్పుడచ్చంగా నీ ముఖస్మరణమే నాకు కల్గింది. నీ ముఖం పూర్ణచంద్రుని వంటిదే కాని అందులో చందురుని లోని కందువలె కుష్ఠరోగ చిహ్నముందని విద్యాపతి వల్ల నాకు తెలిసింది. అందుచేత ఆ కందు గల చందురుని నీ ముఖమునే స్మరించుకొంటూ వర్ణించడం జరిగింది.
యామిని:
ఏమీ నాముఖం కుష్ఠరోగ్రస్తమైందా? ఎంత అబద్ధం! మీరు అంధులని కూడ నన్ను భ్రమింపజేసినారు. నిండుచంద్రుని సోయగాన్ని కనులనిండ చూచి కమనీయవర్ణనాపూర్ణమైన కవిత్వాన్ని ఆశువుగా పల్కిన మీరంధు లెట్లౌతారు? ఇది యేమి మోసం? మన కడ్డంగా హిమాలయం వంటి యీ కాండపట మెందుకు? (అని గబుక్కున తెరతీసి బిల్హణుని వైపు నడచి, ఆ మనోహరమూర్తి మనోజ్ఞత నొక్కసారిగా ఆపాద మస్తకం చూచి పరవశించి నిశ్చేష్టురాలై పడబోతుంది)
బిల్హణుడు:
ఇదేమి యామినీ? పరవశించిపడిపోతున్నావు. (పడబోయిన యామినిని తన చేతులుసాచి గ్రహించి ఆమె తలను తన ఒడిలో నిడుకొని పరుండబెట్టి)
ఇంతులఁ గాంచి తెందఱినొ యీజగమందునఁ, గాని వారిలోన్,
పంతముఁ బూని సత్కవులు వర్ణన సల్పిన కావ్యనాయికా
సంతతులందు నిట్లు స్మరశక్తియె రూపము దాల్చినట్లుగన్
స్వాంతముఁ దన్పునట్టి 3వరవర్ణినిఁ గాంచను కాంచ నెప్పుడేన్.
కందుసుంతయు లేని యీకుందరదన
ఆస్యమున కెట్లు సరివచ్చు ననుదినంబు
నెదుగుచున్నను తనతోడ నెదుగుచున్న
మచ్చ గలయట్టి హరిణాంకమండలంబు?
ఆహా! ఈమె తనూలావణ్యము! ఈమె ముఖమంజిమము! అవనికి దిగిన అప్సరసవలె నున్నది. ఈమె ముఖము నా యొడియందు కొలనునందు తామరవలె వెలుగుచున్నది.
(యామిని గురువర్యా! బిల్హణకవీంద్రా, బిల్హణకవీంద్రా — అని పలవరించును.)
బిల్హణుడు:
యామినీ! లేలెమ్ము! నిస్సంశయముగా నుండుము. రోహిణియం దనురక్తుడైన చంద్రునివలె, దమయంతియం దనురక్తుడైన నలునివలె నీయందు నేననురక్తుడనై యున్నాను. లెమ్ము.
యామిని:
(అలసముగా లేచి గాటముగా బిల్హణునికి ముద్దిడును) ఆర్యా! బిల్హణకవీంద్రా! సాగరమునందు లీనమగు స్రవంతివలె, మేఘమును జేరిన మెఱుపువలె నేను నీలో నేక మయ్యెదను. ఈ సంబంధమును గాంధర్వ వివాహపద్ధతి ద్వారా పునీత మొనర్చుదము. లోకములో నెట్టి శక్తులును మన బంధమును విచ్ఛిన్న మొనర్పకుండునుగాక.
బిల్హణుడు:
పంచభూతంబు, లష్టదిక్పాలవరులు,
హరిహరాదులు, తత్సతు లస్మదీయ
పూతగాంధర్వబంధనంబునకు సాక్షు
లగుచు దీవింత్రుగాక యత్యాదరమున!
(బిల్హణుడు, యామిని ఇర్వురు ఉత్కటమగు ప్రేమతో గాఢముగా కౌఁగిలించుకొందురు)
ఏడవదృశ్యము
(స్థలము: వేత్రవతిగృహం. వేత్రవతి సుసజ్జితయై గృహాభ్యంతరంలో ఉంటుంది. అప్పుడు శరావతి పసుపు కుంకుమలతో, ఫలములతో ఆమె గృహమునకు వస్తుంది)
వేత్రవతి:
ఏమే శరావతీ! ఎట్లున్నావు? ఇట్లా సన్నద్ధమై వచ్చావు?
శరావతి:
నాకేం గాని, బాగానే ఉన్నాను. ఇది శ్రావణమాసం గదా! ఎల్లుండి మాయింట్లో మంగళ గౌరీవ్రతం. ఏదో నాకు సన్నిహితులైన ఇద్దఱు ముగ్గురు ముత్తైదువలను పిలిచి వ్రతం చేసి భోజనతాంబూలదక్షిణాదులను ఇవ్వాలనుకొన్నాను. నీవు వస్తావు గదా?
వేత్రవతి:
ఆ! నీవు పిలువడం, నేను రాకుండ ఉండడమా, అది జరుగదు.
(శరావతి వేత్రవతికి పసుపుకుంకుమలు ఫలములు ఇచ్చును)
వేత్రవతి:
ఈమధ్య నిన్ను చూడలేదు. రాజభవనంలో రాచకార్యాలలో మునిగితేలుతున్నావా?
శరావతి:
ఔనే! ఈమధ్య తీరిక లేకుండానే ఉంది.
వేత్రవతి:
అంత ఘనకార్యాలేమి చేస్తున్నావో…
శరావతి:
ఏవో పనులు. నీవెవరికీ చెప్పనని ప్రమాణం చేయి. నీకొక విషయం చెపుతాను.
వేత్రవతి.:
ఒట్టు. ఆసంగతి నానోటినీ, ఈయింటి గుమ్మాన్నీ దాటదు.
శరావతి:
(నిమ్నస్వరంతో, నెమ్మదిగా) రాజకుమారి యామిని ఉంది చూడు. ఆ అమ్మాయి ఒక కాశ్మీరకవీంద్రుని వద్ద సంస్కృతం నేర్చుకుంటున్నదని నీకింతకు ముందు చెప్పినాను కదా! ఆయనను నేను చూచినాను. ఆయన మహాపండితుడు, గొప్పకవి అంటే విన్నాను. అంతే కాదు. ఆయనంతటి స్ఫురద్రూపిని నేనెన్నడూ చూడలేదు. నీలవర్ణం బదులు బంగారు రంగుతో మెఱిసే శ్రీకృష్ణమూర్తిలాగ ఆయనుంటాడు. అంతేకాక ఆయన యువకుడు గూడ.
వేత్రవతి:
ఆయనను గుఱించే చెప్తున్నావు కాని, ఆయన చెప్పే చదువును గుఱించి చెప్పడం లేదు.
శరావతి:
వస్తున్నా! ఆ చదువు కొంతకాలం సాగింది. రతీమన్మథుల్లాగ ఉన్న వారిద్దరూ ఒకర్నొకరు చూచుకుంటే వారి రతి చదువుపై గాక సురతంపై పడుతుందని వారిద్దఱికి మధ్య ఒక తెరగట్టారట. కాని ఆ తెర పెండ్లిలో వధూవరులకు మధ్య గట్టే తెరే అయిందిట. వారెట్లో పరస్పరం చూచుకొని ప్రేమలో పడి గాంధర్వం చేసుకొన్నారట.
వేత్రవతి:
ఆహా! నిజంగానే రతి సురతంపై పడింది. కథ పాకంలో పడింది. ఆపై నేమైందే?
శరావతి:
అయ్యేదేముంది? నాకు యామినీదేవి అంతఃపురభవనంతో సంబంధం లేదు గాని, ఆ అంతఃపుర పరిచారికలు ఈ నాటకాన్ని కొంతకాలం చూచి, అది రాజుగారికి తెల్పకపోతే తమ పీకలమీదికి వస్తుందని, ఇదంతా ఆ కాశ్మీరయ్యవల్లే జరిగిందని రాజుగారికి నిన్ననే విన్నవించారట.
వేత్రవతి:
మఱి రాజుగారేం చేశారే?
శరావతి:
ఇంకా ఏం చేసినట్టు లేదు. ముందు ముందేం చేస్తారో చెప్పలేం. ఇంత రసవత్తరమైన సంగతి నీతో పంచుకొనకుండా ఉండలేకపోయాను. ఈ సంగతి ఎవ్వరికీ చెప్పవు గదా!
వేత్రవతి:
ఒట్టు. ఇది నా పెదవి దాటి బయటికి పోదు.
శరావతి:
మఱి వస్తాను. ఇంకా ముగ్గురు ముత్తైదువులను పిలవాలి.
వేత్రవతి:
(శరావతిని ఆలింగనం చేసికొని) మంచిది. పోయిరా.
ఎనిమిదవదృశ్యము
(స్థలం: రాజభవనం. రాజు మదనాభిరాముడు, రాణి మందారమాల, మంత్రి విద్యాపతి అర్హాసనములపై నాసీనులై యుందురు)
మదన:
విద్యాపతీ! విన్నావు గదా! ఆపండితబ్రువునితో యామిని చదువెంతకు పరిణమించిందో!
విద్యా:
ఆ విన్నాను మీముఖంగానే.
మదన:
విద్యావంతుడు, విప్రుడూ, కవీంద్రు డని అమ్మాయిని అప్పగించితే శృంగారపాఠాలు చెప్పి ఇట్లు అమాత్రంగా ఆమె నపహరిస్తాడా? దానికి తగిన శిక్ష అనుభవింపక తీరుతాడా?
విద్యా:
విద్యావంతుడూ, విప్రవరుడూ, పండితుడూ, కవీంద్రుడూ అతడగుట నిజమే. అగ్ని నుండి తేజస్సును వేరుచేయలేనట్లు అతని నుండి ఈ ఉత్తమలక్షణాలను మనం వేరు చేయలేము. వచ్చిన మోసమేమనగా అతడు మన్మథుని మీరిన స్ఫురద్రూపి కూడ. అందుచేతనే ఇది జరిగినది. అతని స్ఫురద్రూపమునూ మనం తొలగించలేము అతనిని అంగవికలుని చేస్తే తప్ప. మహాపండితుడైన ఈ విప్రునిపట్ల ఇట్లాలోచించుటయే మహాపాతకము.
రాణి:
‘తానొకటి తలచిన దైవ మొకటి తలచును’ అని ఉన్నదే కదా! మనుష్యయత్న మెట్లున్నను ఫలితము దైవాధీనమే కదా! అందులోనూ ‘కన్యా వరయతే రూప’మ్మని ఉండనే ఉంది కదా!
మదన:
అంతమాత్రాన మన క్షత్రియవంశానికి సంప్రాప్తమైన ఈ కళంకాన్ని విస్మరింపగలమా? ఆ బాపనిని శిక్షింపకుండ ఉండగలమా?
రాణి:
అమ్మాయిని పిలిచి ఆమెకు బుద్ధి గరపుటకు యత్నింతము. ఆ బ్రాహ్మణుని దేశబహిష్కారము చేతము.
మదన:
(చప్పట్లు చఱచి) ఎవరక్కడ? (ఒక సేవిక ప్రవేశించును)
సేవిక:
మహాప్రభువులకు నమస్కారము.
మదన:
యామినీపూర్ణతిలకను వెంటనే తీసికొనిరమ్ము.
సేవిక:
చిత్తము. (సభను వీడి, యామినిని ప్రవేశపెట్టి, తాను నిష్క్రమించును)
యామిని:
పితరులకు, మంత్రివరులకు యామిని ప్రణామములు.
రాణి:
అమ్మాయీ! నీవు మన రాజవంశమును కళంకిత మొనర్చితివి.
యామిని:
అదెట్లు?
మదన:
ఇంకా అదెట్లు అని కండ్లు మూసికొని పాలు త్రాగిన పిల్లివలె అంటావేమి? అది నీ హృదయానికే తెలియదా? ఆ బ్రాహ్మణబ్రువునితో తగులము పెంచుకొంటివి.
యామిని:
అది కళంకిత మెట్లగును? శకుంతలాదుష్యంతు లేకమైనట్లు మేము ధర్మశాస్త్రవిహితమైన అష్టవిధ వివాహములలో నొకటైన, క్షత్రియులకు సమ్మతమైన, గాంధర్వవివాహము చేత ఏకమైతిమి.
మంత్రి:
అది ద్వాపరయుగం నాటి మాట. ఇప్పటి ధర్మనిర్ణయం ఈనాటి పద్ధతుల ప్రకారం చేయవలసి ఉంటుంది.
యామిని:
హైందవసంస్కారం అవిచ్ఛిన్నంగా ఆనాటినుండి వస్తున్నదే కదా! ఇందులో దోష మేమున్నది?
మదన:
ఇప్పటికైనను మించినది లేదు. ఆ విప్రసంపర్కమును త్యజించి ఒక ఉత్తమక్షత్రియకుమారుని వివాహము కమ్ము.
యామిని:
అది అసాధ్యము. ఆ మహాకవి నాహృదయాధినాథుడు. అతనితో నా బంధము అనివర్తనీయమైనది. అచంచలమైనది.
ఆవిమలాత్ముసఖ్యమె మదంగము నెప్పుడు చేతనత్వసం
భావితముం బొనర్పఁదగు ప్రాణము; తద్రహితాంగ మెన్నఁగా
జీవములేని కాష్ఠమగు, చేకొని దానముసేయ దాని నిం
కో వసుధాధినాథునకు యుక్తమె చెప్పుమ మానవేశ్వరా!
రాణి:
అమ్మాయి యామినీ! ప్రభువుల హృదయాన్ని ఇంకా కఠినతరం చేయకు. నిగ్రహానుగ్రహదక్షులైన వారికి నీయందు నిగ్రహమే జనింపనీయకు.
యామిని:
అమ్మా! స్త్రీహృదయం తెలిసిన మీరును ఇట్లు మాట్లాడెదరేమి?
మదన:
(తనలో) ఈమె పట్టు వీడకున్నది. ఈ పట్టుదలకు ఆవిప్రుని కుతంత్రమే కారణము కావలెను. అతనిని పిలిచి విచారింతును. (ప్రకాశముగా) ఎవరక్కడ!
ప్రతీహారి:
(ప్రవేశించి) ప్రభువుల కభివాదము.
మదన:
వెంటనే బిల్హణుని కొని తెమ్ము. (ప్రతీహారి బిల్హణుని ప్రవేశపెట్టి తాను నిష్క్రమించును)
బిల్హణుడు:
స్వస్తి పాంచాలప్రభువులకు.
మదన:
(కోపముతో)
బ్రాహ్మణుండవు, సత్కవీశ్వరుఁడ వమల
మతివి, యనుచు పాఠంబులు మద్దుహితకు
నేర్ప నియమింప నక్కటా! నేర్పితయ్య
మంచిపాఠంబులే యామె కంచితముగ!
బిల్హణుడు:
రాజా! ఆమె సంగీతనాట్యసరస్వతి. నేను కవిబ్రహ్మను. మా సంగమము భారతీబ్రహ్మల సంగమము వలె పవిత్రమైనది, సహజమైనది. ఇది సంగీతసాహిత్యనాట్యకళల సహజసంగమము. అందుచేత హర్షింప దగినది.
మదన:
బాగున్నది నీ వాదన. తనయాజనకులసంబంధమైన బారతీబ్రహ్మలసంబంధ మెట్లు దూష్యమో మీ గురుశిష్యురాండ్ర సంబంధమును అట్లే దూష్యమైనది.
రాణి:
(తనలో) ఈ బ్రాహ్మణు డెంత యందకాడు! ఎంత గొప్ప పండితుడు? ఈతని గాంచిన యౌవనవతుల మనస్సు చలించుటలో సంశయ మేమున్నది. ఇతడు క్షత్రియుడు కాకున్నను, ధనికుడు కాకున్నను సర్వవిధముల అర్హుడుగనే తోచుచున్నాడు.
బిల్హణుడు:
ధర్మశాస్త్రప్రకారము ఇది సమర్థనీయమే. అనులోమవివాహము శాస్త్రసమ్మతమే.
విద్యా:
శాస్త్ర మెట్లున్నను గురుశిష్యురాండ్ర సంబంధమును కించపఱచుట నింద్యమే.
మదన:
ఇందులకు నీకు మరణశిక్షయే న్యాయము.
బిల్హణుడు:
జాతస్య మరణం ధ్రువమ్. ఏదో విధంగా మరణం తప్పదు. దానికి నాకు భయం లేదు. ఐతే ఈ స్వల్ప జీవితంలో యామినీసాంగత్యభాగ్యం నాకు లభించిందనే తృప్తితో ఈ లోకం వీడుటకు సిద్ధముగా నున్నాను.
యామిని:
ప్రియతమా! అట్లనకుము. నీతోడిదే నాజీవనము. నీవు లేనిచో నేను జీవింపజాలను.
బిల్హణుడు:
అది మీ తండ్రిగారి చేతులలోనే యున్నది.
రాణి:
ప్రభూ! ఇంతమాత్రమునకు విప్రునకు మరణశిక్ష విధించుట యుక్తము కాదు గదా! మీకు నచ్చకున్న వారిని గృహాంతరమందు గాని, నగరాంతరమునందు గాని ఉంచుడు. ఈ విప్రుడు నిర్ధనుడైనను మిక్కిలి యోగ్యుడే కదా! యామినియు నాతని వరించినది.
విద్యా:
ఔను ప్రభూ! ఈయపచారమునకు మరణశిక్ష న్యాయము కాదు. వలసిన యెడల వారికి దేశబహిష్కారమును విధించండి.
మదన:
ఈతని చర్యవల్ల కన్యాగౌరవము, రాచమర్యాద నశించినది. మా క్షత్రియవంశమున కిది మాయని మచ్చ యైనది. ఈ నేరము క్షమార్హము కాదు. నా మాటకు తిరుగు లేదు. మరణమే ఇతనికి ప్రాప్తము.
(కోపముతో సభను వీడి పోవును. యామిని ఉద్రేకముతో నురికి బిల్హణకవిని ఆలింగనము చేసికొని దుఃఖించును. రాణి వారి శోకమును చూడలేక తానును అశ్రుసిక్తనయన యగును. విద్యాపతి సానుభూతితో వారిని చూచుచు నిస్సహాయతాజనితమైన అసంతృప్తిని ప్రదర్శించును)
తొమ్మిదవదృశ్యము
(స్థలం: బిల్హణుని భవనం, సమయం: అపరాహ్ణం. ఇద్దఱు భటులు ప్రవేశింతురు)
మొ.భటుడు:
(బిల్హణుని చూచి, తనలో) ఆహా! ఏమి ఈతని రూపం. అచ్చంగా చందమామవలె ఉండది. చూస్తే చాలా గొప్ప బాపనయ్యలాగుండాడు. ఈయన చేసిన నేరమేందో? (ప్రకాశముగా) అయ్యా! ప్రభువుల యాజ్ఞ. ఈరాత్రికి మిమ్ములను చెఱసాలలో బెట్టి రేపు తలతీసేందుకు తీసికొనిపోవాల్నంట.
రెం.భటుడు:
అయ్యా! మేము పరాధీనులం. ప్రభువు పంపకం చేయక తప్పదు. (అనుచు బిల్హణుని శృంఖలాబద్ధుని జేయును)
బిల్హణుడు:
(శృంఖలాబద్ధుని చేసి భటులు లాగుకొని పోవుచుండగా) యామినీ! మరాళగామినీ! మత్ప్రియా! ఈ కవిచంద్రుడు నిన్నెడజేసి నాకస్థలి కేగుచున్నాడు.
(నేపథ్యము నుండి యామినీతిలక కంఠస్వరంతో క్రింది పద్యములు వినిపించును)
హా కవిరాజశిఖామణీ! హా నవమోహన! హా మనోహరా!
హా కరుణాగుణాభ్యుదయ! హా రమణీనవపంచసాయకా!
హా కమనీయగాత్ర! యొకరైన నినుం గృపఁ బ్రోవరై రయో!
యీ కడ నీవు దైవమున కేమి విరోధము చేసితో కదా!
ఓకవిచంద్ర! నీదుప్రణయోత్కటచంద్రిక పర్వనట్టి యీ
లోకమునందు యామినియు లోఁగిలియౌఁగద శాశ్వతవ్యథా
నీకతమశ్చయంబునకు, నీప్రణయంపు రసప్రసేక మ
య్యో! కనలేని నాదుభవ మూషరభూమియె కాదొకో సఖా![4]
యామినీ! మత్ప్రియా! ఈ బడుగుబాపఁడు నీ శోకవిదారణ చేయలేని అసహాయస్థితిలో నున్నాడు.
ఓ సుకుమారి! యామిని! సముజ్జ్వలకాంచనగాత్రి! నిన్నెడం
బాసి మహీసురుండితఁడు మ్రందఁగఁబోవుచు నున్నవాఁడు, నీ
యాసలు దీర్పలేని యసహాయపరిస్థితి కిప్డు లజ్జచే
గాసిలుచున్నవాఁడు, విధికల్పిత మియ్యది పో ప్రియాంగనా!
స్వర్గమందలి యప్సరోభామ లిపుడు
మరులు గాంచిరి యీకవివరునియందు
దక్కనీయక నీ కిలాతలమునందు
లాగుకొనిపోవుచుండిరి వేగముగను.
అయ్యో! యామినీ! చంద్రునిఁ బాసిన చంద్రిక వలె, మేఘమును బాసిన మెఱుపు వలె నీ వేకతమ జీవిత మెట్లు గడపెదవు? నా వెత నేఁడే నా తోడనే అంతమగును. నీ వెత నిన్ను జీవితాంతము వేధించును గదా! అయ్యో! ప్రియా! ప్రాణేశ్వరీ!
(అని సంతప్తుడై విలపించుచు అవశుడై క్రిందపడును. భటులు కర్కశముగా నతని లేవనెత్తి బిరబిర చెఱసాలకు గొని పోయి కారాగృహపతి యగు వీరసేనుని కప్పగింతురు)
భటులు:
అయ్యా! వీరసేనా! ఈయన కవిరాజు బిల్హణుడు. ఈ సాయంత్ర మీయనను చెఱసాలలో బెట్టి రేపు తల తీయవలెనని ప్రభువుల యాజ్ఞ.
వీర:
అయ్యో! ఎంతటి మహాత్ముని కెంతటి విపత్తు వచ్చినది? ఈ కవీశ్వరుని కింత కఠినదండనమా? న్యాయదేవతా నీవు కండ్లు మూసికొన్నావా? లేనిచో ఈ వైపరీత్యమేమి?
భటులు:
రాజాజ్ఞ చెఱుపరానిది.
వీర:
అది నిజమే. కాని కొన్నిసార్లది నిండుగా న్యాయసమ్మతమై ఉండకపోవచ్చును. ఐనా మనం చేసేదేమీ లేదు. దానిని పాటింపవలసిందే. ఈతనిని నా గది ప్రక్కనే ఉన్న గదిలో ఉంచండి.
(భటులట్లే చేయుదురు)
భటులు:
వీరసేనా! మేమింక పోయి మా పని పూర్తయిందని ప్రభువులకు తెల్పుతాం.
వీర:
వెళ్ళిరండి. (తనలో) ఇంతటి మహానుభావునికి ఈ మరణదండన మేమిటి? దీనిని విచారింతును గాక! (అని కవిపరిస్థితికి చింతాక్రాంతుడై, అతని గది కేగి మాట్లాడును)
వీర:
బిల్హణకవీంద్రా! మీకెంతటి దారుణస్థితి సంభవించినది. రాజాస్థానములయందు బ్రాహ్మీపీఠ మలంకరింప వలసిన మీకీ కారాగారవాస మేమి? మరణదండన మేమి?
బిల్హణుడు:
వీరసేనా సర్వము విధికృతము. నేను నిర్భయముగా నున్నాను. మరణమన్న నాకు భయము లేదు.
వీర:
అదేమి స్వామీ!
బిల్హణుడు:
ఏ ప్రియురాలి సంగము ఈ అవస్థకు కారణమైనదో, ఏ ప్రియురాలిని దూరీకృతం చేయుటకై నాకీ శిక్ష విధించిరో ఆ ప్రియురాలు నా చెంతనే, నా ఆత్మలోనే ఉన్నది. ఆమె నా ఆత్మలో నున్నంతవఱకు నన్ను మరణమైనను బాధింపదు. కాయ మశాశ్వతము. ఆత్మ శాశ్వతము. నాయాత్మతో నేకమైన నా ప్రియురాలి యాత్మ నాయాత్మతోనే చిరకాల ముండును. అందుచేత నాకీ శిక్ష యన్నభయము లేదు.
వీర:
ధీరోదాత్తులు స్వామీ తమరు.
బిల్హణుడు:
ఆరుచిరాంగియె మంత్రా
కారాన్వితయై మదాత్మకమలమునందున్
జేరిన దింకేటికి భయ
మూరకయే వీరసేన! ఉర్విని వీడన్.
వీర:
స్వామీ! ఇంచుక నెమ్మదింపుడు. మీ మనోహరకవిత్వమును వినగల భాగ్యము త్వరలో మము వీడ నున్నది. ఈ చివరి క్షణమందైనను తమరి కవిత్వమును నేను వ్రాసికొని నిరంతరము చదువుకొని ఆనందింతును. (అని, భూర్జపత్రము, కలము గొని వ్రాయగడగును)
బిల్హణుడు:
ప్రేయసీ యామినీ! నీ స్మరకేళీవిభ్రమమములను నాస్వాంతము సంతతము స్మరించుచునే యున్నది గదా!
విలసిత మన్మథన్, విరహ విహ్వల లాలస గాత్రి, సుందరిన్,
లలిత కురంగ నేత్ర, సువిలాస రసాంచిత చారు కాంచనో
జ్జ్వల మహనీయ చేల యుత, శ్యామ, విరాజిత హంసయాన, నే
నలవడ సంస్మరించెద ననారతమున్ మదిలోన వేడుకన్.[5]
ముకురమునందు గూఢముగ మోమును గాంచెడు వేళ, వెన్క నే
నొకపరి నిల్వ నాదటను, నుల్కున మత్ప్రతిబింబ మందునం
జకచకఁ గాంచి, లజ్జయును, సంభ్రమమున్, మదనాభిలాషయుం
దికమకవెట్ట నెమ్మదిని దీప్తిలు నింతి స్మరింతు నాత్మలోన్.[6]
ఉన్నతచారుపీవరపయోధరభారముచేత ఖిన్నయై,
చెన్నగుతమ్మిమోముగలచెల్వ కనంబడెనేని నిప్పు డా
సన్నుతగాత్రి గాటముగ సందిట గ్రుచ్చి తదోష్ఠమాధురిన్
గ్రన్ననఁ బీల్తు బంభరము కంజరసంబును బీల్చినట్లుగన్.[7]
నాకిపుడు పంచత్వము నాబ్రహ్మదేవుడే ప్రాప్తింపజేయుచున్నాడు. అది ప్రాప్తించిన పిదప పంచభూతాత్మకమైన నా శరీరమునందలి పంచభూతములు నా చెలితో గలసియుండునట్లు విధించుమని ఆ విధాతనే ప్రార్థించెదను.
క్షోణ్యంశ మాఘనశ్రోణి చరించెడు
క్షేత్రంబునందునఁ జేర్పుమయ్య!
ఆపంబు నాయమృతాధర నిత్యంబు
జలకమాడెడి నీటఁ గలుపుమయ్య!
తేజంబు నాతటిద్దేహ దర్శించు నా
దర్పణాంతరమందుఁ దార్పుమయ్య!
గంధవాహాంశ మాగంధిలశ్వాసకుం
బట్టు వీవనలోనఁ బెట్టుమయ్య!
ఆకసంబును శూన్యమధ్యాంగణంబు
నందు లీనంబు గావింపు మయ్య నలువ!
మేను పంచత్వమొందినఁ గాని, నాదు
పంచభూతాత్మ చెలితో వసించునట్లు.[8]
(అనుచు పరిదేవన మొనరించి మూర్ఛిల్లును)
వీర:
(పై పద్యముల నన్నిటిని వ్రాసికొని) ఆహా! ఏమి యీ కవితావైభవము! ఈతడు స్వర్గలోకగతుడైనచో బృహస్పతి తన పదవికి తిలోదకముల నిచ్చుకొనవలసినదే. ఈతని కారాజకుమారిపై అచంచలమైన, అపారమైన, అసాధారణమైన ప్రేమ యున్నది. లేనిచో నిట్టి పద్యములఁ జెప్పనేర్చునా? మహారాజున కీతని సామర్థ్యము పూర్తిగా తెలియనట్లున్నది. ఈ పద్యముల జూపినచో సాహితీపిపాసియు, తార్కికుడు నగు నతని మనస్సు చలింపవచ్చును. ఈ మహాత్మునికి మరణము తప్పవచ్చును. అట్లే చేసెదను గాక.
పదవదృశ్యము
(స్థలం: రాజాస్థానము, సమయం: మఱునాటి ఉదయం. మదనాభిరాముడు మంత్రితోడ, రాణితోడ సమావేశమై యుండును.)
మదన:
పండితునికి మరణశిక్ష విధించితిని కాని, నా మన మప్పటినుండియు అతలకుతల మగుచున్నది.
మంత్రి:
మహారాజా! మీరు చేసిన నిర్ణయము సంతృప్తికరముగా నుండకపోవుటయే దీనికి కారణము కావచ్చునని నాకనిపించుచున్నది.
మదన:
మీ ఊహ కొంతవఱకు సమర్థనీయమే.
రాణి:
అతడు మహాపండితుడు, బ్రాహ్మణుడు, కవిశేఖరుడు. యౌవనము ఉద్రేకపూరిత మైనది.
మంత్రి:
రాజపుత్త్రి అతిలోకసౌందర్యవతి, యౌవనవతి.
రాణి:
వారి పరస్పరసందర్శనము వల్ల కల్గిన పరిణామం ప్రభువు లూహించినట్లే జరిగినది. ఇందులో ఉభయులకు బాధ్యత ఉన్నదని నేననుకొనుచున్నాను.
మదన:
నిజము వచింపుచున్నావు మహారాణీ! ఇందులో యామినికిని సమానబాధ్యత ఉన్నది.
మంత్రి:
ఐతే శిక్ష ఒకరికే ఎందుకు? అందును శిక్ష నేరమునకు తగినట్లుండుట న్యాయము కాదా?
మదన:
ఈ విచారమే నన్ను గలచుచున్నది.
రాణి:
అతని కింకను మరణశిక్ష పడలేదు. అది మధ్యాహ్నానంతరము జరుగును.
మంత్రి:
అందుచేత ప్రభువులు నిర్ణయమును మార్చుకొనుటకు వీలున్నది.
మదన:
అదియే ఆలోచించుచున్నాను. ధర్మశాస్త్రము ద్విజుని విషయములో,
శూద్రైవ భార్యా శూద్రస్య, సాచ స్వా చ విశః స్మృతే|
తేచ స్వాచైవ రాజ్ఞశ్చ, తాశ్చ స్వా చాగ్రజన్మనః||
అని మూడు న్యూనవర్ణములవారి తోడను ద్విజునికి అనులోమవివాహముల ననుమతించుచున్నది. అందుచేత వీరికూటమి శాస్త్రవిరుద్ధము కాదనియే మఱల నాకనిపించుచున్నది.
మంత్రి:
బిల్హణకవియు ఇదియే అన్నాడు కదా!
ప్రతీహారి:
(ప్రవేశించి) ప్రభువులకు నమస్కారము. కారాగారాధిపతి వీరసేనుడు మిమ్ములను జూడ గోరుతున్నాడు.
మదన:
(తనలో) ఈతడెందుకు వచ్చినాడో. ఐనా… (ప్రకాశముగా) ప్రవేశపెట్టుము. (ప్రతీహారి నిష్క్రమించును. వీరసేనుడు ప్రవేశించును)
వీర:
ప్రభువులకు జయము.
మదన:
నీ రాకకు కారణ మేమి?
వీర:
మహారాజా! బిల్హణకవికి ఈ మధ్యాహ్నము శిరఃఖండనము జరుగ నున్నది. ఆతని కవితాసరస్వతి ఈ లోకమునుండి నిష్క్రమింపనున్నది. ఈ లోపల నిన్నటి సాయంత్ర మత డద్భుతమగు పద్యములతో చరమగీతమును పాడినాడు. నాకు కవిత్వముపై గల ఆసక్తివల్ల ఆ పద్యములను నేను వ్రాసికొని, కవితా రసజ్ఞులైన దేవరవారికి సమర్పింప దెచ్చినాను. ఇట్టి ఉత్తమకవీశ్వరు డింత చిన్నవయస్సులో ధరాతలమును వీడుట మన దురదృష్ట మనియే చెప్పవలెను.
మదన:
ఏదీ ఇటు దెమ్ము. (వీరసేనుడు తాను వ్రాసికొనిన భూర్జపత్రముల నిచ్చును)
మదన:
(ఆతురుడై మనసులో చదువుకొని, చిట్టచివరి పద్యమును ప్రకాశముగా శ్రావ్యమగు కంఠస్వరముతో చదువును)
క్షోణ్యంశ మాఘనశ్రోణి చరించెడు
క్షేత్రంబునందునఁ జేర్పుమయ్య!
ఆపంబు నాయమృతాధర నిత్యంబు
జలకమాడెడి నీటఁ గలుపుమయ్య!
తేజంబు నాతటిద్దేహ దర్శించు నా
దర్పణాంతరమందుఁ దార్పుమయ్య!
గంధవాహాంశ మాగంధిలశ్వాసకుం
బట్టు వీవనలోనఁ బెట్టుమయ్య!
ఆకసంబును శూన్యమధ్యాంగణంబు
నందు లీనంబు గావింపు మయ్య నలువ!
మేను పంచత్వమొందినఁ గాని, నాదు
పంచభూతాత్మ చెలితో వసించునట్లు.
(అట్లు చదివి)
బిల్హణకవీంద్రా! నీకవన మద్వితీయము, అమోఘము. మరణముఖమున నున్నను ఇట్టి ఉన్నతభావయుక్తమైన కవిత్వమును చెప్పుటలో నీకు నీవే సాటి. ఈ కవితద్వారా యామిని యందు నీ ప్రేమ ఉద్రేకపూరితము కాదు ఉత్తమాశయసమన్వితమని ఋజువు చేసికొన్నావు. నీవు మహానుభావుడవు. నీకంటె అర్హుడగు అల్లుడు నాకు దొరకడు. నిన్ను వరించిన నాకూతురు మిక్కిలి అదృష్టవంతురాలు. వీరసేనా! తక్షణ మాకవీంద్రుని సంకెళ్ళను తొలగించి ఇచ్చటికి గొనిరమ్ము.
వీర:
మహాప్రభువుల యాజ్ఞ. నాజీవితములో నింతకంటెను ఉత్తమకార్య మింతవఱకు జరుగలేదు, జరుగబోదు కూడ. (నిష్క్రమించును)
రాణి:
ప్రభువుల యౌదార్యమునకు నాకవధిలేని యానందము కల్గుచున్నది.
మంత్రి:
ప్రభువులు ధర్మమూర్తులు. న్యాయమే జరిగినది.
మదన:
ఎవరక్కడ? (సేవిక ప్రవేశించును)
సేవిక:
ప్రభువులకు నమస్కారము
మదన:
రాజకుమారి నిటకు గొని రమ్ము.
సేవిక:
చిత్తము (నిష్క్రమించును)
పదకొండవదృశ్యము
(స్థలం: రాజాస్థానము. రాజదంపతులు,మంత్రి ఆసీనులై యుందురు. యామినీ బిల్హణులు నిలబడి యుందురు)
మదన:
బిల్హణమహాకవీ! నా తొందరపాటును, నా పొరపాటును క్షమింపుము. నీ కనర్హమైన శిక్షను వేసి నే ననర్హుడ ననిపించుకొన్నాను. నీవంటి ఉత్తమజామాత లభించుట మా సుక్షత్రియకుటుంబమునకు వరము వంటిది. ఇక యామిని నీసొమ్మే. నిను వీడని నీడయే.
అమ్మాయి యామినీ! నీకుత్తమవరుడు లభించినాడు. మీసంగమం సంగీతసాహిత్యనాట్యముల అపూర్వ, సంపూర్ణసంగమం. హృదయంగమం. ఇంక అగ్నిసాక్షిగా మీవివాహము జరుపు నేర్పాటు చేసెదను. సుఖముగా నుండుడు.
రాణి:
అమ్మాయి యామినీ! నీకు చదువే కాదు, చంద్రుని వంటి భర్త లభించినాడు. అదృష్టవంతురాలవు.
మంత్రి:
చేసిన తప్పున కిర్వురికి చివరికి సమానమైన శిక్షయే పడినది. ఇది సుదినము. ఇంతకంటె మంగళకరమైన దినము లేదు.
మదన:
ఆ! మఱచినాను చెప్పడం. మీపుత్రుడే ఈరాజ్యానికి పట్టభద్రుడౌతాడు.
బిల్హణుడు:
ప్రభువుల యౌదార్యమునకు ఋణపడి యున్నాను.
యామిని:
జననీజనకులకు ప్రణామములు. మీకును, మాకును సంతతసంతోషప్రదమై వర్ధిల్ల గల మా దాంపత్యమున కిది నాంది.
పన్నెండవదృశ్యము
(రాజోద్యానమునందు యామినీబిల్హణుల వినోదవిహారము. ఆభేరి (భీమపలాసి) రాగంలో గాని, లేదా శృంగారరసమున కనువైన రాగమాలికలో గాని ఈ క్రింది గీతమును పాడవలెను.)
తొలగెను కలతల తొలకరిమబ్బులు
వెలిగెను బ్రతుకున వెన్నెల వెలుగులు
యామిని:
జీవితమే యొక పూవులనావయి
చేరునులే సుఖతీరంబుల నిక
ప్రభవించునులే ప్రత్యహమందున
పారమెఱుంగని కూరుములే యిక |తొలగెను|
బిల్హణుడు:
తీవవు నీవై, పూవును నేనై,
పూవువు నీవై, తీవెను నేనై
అరమరికలు మన కణుమాత్రంబును
పొడమని మనుగడ గడపెద మిటుపై |తొలగెను|
యామిని:
పూచిన సంపెఁగ పూల సుగంధము
వలె మన ప్రణయము వాసించెనులే
మంజుల నీరజ మధు పూరమువలె
మధురం బయ్యెను మన ప్రణయములే |తొలగెను|
బిల్హణుడు:
కోయిలపాటలె కూరిమి యారతు
లయ్యెను మన ప్రణయంబున కోచెలి
శుకముల పలుకులె శ్రుతి మంత్రములై
అలరెను మన ప్రణయంబున కోసఖి |తొలగెను|
యామిని:
శాద్వలమే యొక చక్కని పఱుపై
పరగెను మనకై పవళించుటకై
నీలాకాశమె నిల్చెను పటమై
కప్పుకొనంగను ఇప్పుడు మనకై |తొలగెను|
బిల్హణుడు:
యుగమే యొక దివసోపమ మగుచును
మాసం బొక క్షణమాత్రం బగుచును
పరగగ నిటు పై పయనింతములే
ప్రణయోజ్జ్వల జీవన పథమందున |తొలగెను|
యామిని:
నిండుచంద్రునిలీల నెనరార ద్విజరాజ
రారమ్ము యామినిం జేరంగ ద్విజరాజ
పాండిత్యంబే వరపాండిమమై
రాసిక్యంబే రమ్యామృతమై
పరగిన విబుధ ప్రవరుడ వీవే
యామిని వలచిన స్వామివి నీవే
సురుచిరమగు నీకరములు సాచుచు
లోఁగొనుమోయీ తీగె విధంబున
సుందరయౌవనసుమశోభితమౌ
నాదగు మేనును నీదేహంబున
నిండుచంద్రునిలీల నెనరార ద్విజరాజ
రారమ్ము యామినిం జేరంగ ద్విజరాజ
(సంస్కృతములో గల 152శ్లోకముల బిల్హణచరిత మను కావ్యములోను, దీనిని తెనిగించుచూ, స్వకల్పితమైన ఇతరపద్యములను చేర్చుచూ 650 గద్యపద్యములతో చిత్రకవి సింగరాచార్యులు తెలుగులో రచించిన బిల్హణీయమను కావ్యము లోను ఈకథ యున్నది. ఈ కథ ననుసరించి, సంస్కృతమూలంలోని ‘అఙ్కం కేఽపి శశాఙ్కిరే’, ‘పఙ్చత్వం తనురేతు’ అను శ్లోకములను సన్నివేశకల్పనకు ఆలంబనంగా గొనుచు, మూలములలో నున్న సన్నివేశముల యందలి అసాంగత్యమును తొలగించుచూ, స్వకల్పితమైన సన్నివేశనిర్మాణముతో నీ నాటికను రచించితిని.)
- ◊. బిల్హణునికి సమకాలికుడైన మహేశ్వరసూరియొక్క విశ్వకోశమునందలి శ్లోకము.
- 1,4,5. ఈపద్యములు చిత్రకవి సింగరాచార్యుల ఆంధ్రబిల్హణీయకావ్యమునుండి గ్రహింపబడినవి.
- 2. ఈపద్యము సంస్కృతబిల్హణచరిత్రమునందలి ఈక్రింది శ్లోకమునకు భావానువాదము.
- 3. వరవర్ణిని=శ్రేష్ఠమైన రూపముగల స్త్రీ, ‘వరోరాహా మత్తకాశి న్యుత్తమా వరవర్ణినీ’ అని అమరము. ‘శీతే సుఖోష్ణసర్వాఙ్గీ, గ్రీష్మేతు సుఖశీతలా, భర్తృరక్తాచ యా నారీ సా భవేద్వరవర్ణినీ’ అని వరవర్ణినీలక్షణము.
- 6. సంస్కృతబిల్హణచరితములోని చోరపంచాశికయందలి క్రిందిశ్లోకమున కిది భావానువాదము.
- 7. సంస్కృతబిల్హణచరితములోని చోరపంచాశికయందలి క్రిందిశ్లోకమున కిది భావానువాదము.
- 8. సంస్కృతబిల్హణచరితములోని క్రిందిశ్లోకమున కిది భావానువాదము.
అఙ్కం కేఽపి శశాఙ్కిరే జలనిధేః పఙ్కం పరే మేనిరే
సారఙ్గం కతిచి చ్చ సంజగరిరే భూచ్ఛాయ మైచ్ఛ న్పరే,
ఇన్దౌ య ద్దళితేన్ద్ర నీల శకల శ్యామం దరీదృశ్యతే
తత్ సాన్ద్రం నిశి పీత మన్ధతమసం కుక్షిస్థ మాచక్ష్మహే.
అద్యాపి తాం రహసి దర్పణ వీక్ష్యమాణ, సంక్రాన్త మత్ప్రతినిధిం మయి పృష్ఠలగ్నే|
పశ్యామి వేపథుమతీం చ ససమ్భ్రమాం చ, లజ్జాకులాం చ సముదఞ్చిత మన్మథాం చ||
అద్యాపి తాం యది పునః కమలాయతాక్షీం, పశ్యామి పీవర పయోధర భార ఖిన్నామ్|
సంపీడ్య బాహు యుగళేన పిబామి వక్త్రమ్ , ఉన్మత్తవాన్ మధుకరః కమలం యథేష్టమ్||
పంచత్వం తను రేతు; భూత నివహే స్వాంశా మిళన్తు ధ్రువం
ధాతః త్వాం ప్రణిపత్య సాదర మిదం యాచే నిబద్ధాఞ్జలిః;
త ద్వాపీషు పయః, తదీయ ముకురే జ్యోతిః, తదీ యాంగణే
వ్యోమః స్యా చ్చ, తదీయ వర్త్మని ధరా, తత్తాళవృన్తేఽనిలః||