మస్తానీ

“ననుఁ దౌరుష్కకరాళశృంఖలలలోనం జిక్కి కారాగృహం
బున బందీకృతుఁడైనవానిని దయాపూర్ణత్వ, మిత్రత్వముల్
ఘనవిక్రాంతియు నొప్పఁగా ననిఁ దురుష్కానీకమున్ గెల్చి ము
క్తుని గావించితి వింతకంటె ఘనమౌ తోడున్నదే యెందునన్!

చల్లనిచోట నింపయిన చల్లనిమాటలు వల్కి మిత్రతా
వల్లరిఁ బ్రోదిసేయఁ గను వారలు పల్వురుగాని, ప్రాణముం
దల్లడవెట్టు వైరిపృతనాగ్నిని మిత్రునిఁ గావ దూఁకు శౌ
ర్యోల్లసితుండు మిత్రుఁడగు యోగము గల్గుట సాధ్యమే ధరన్.

అట్టు లమరలోకమునుండి యవతరిలిన
యమవిరోధిదూతయుఁ బోలె నరుగుదెంచి
నాదు నసువులఁ గాచిన యోధవర్య!
ఎటుల దీర్చికొందును నీదు ఋణము నేను?

నీకిదె యిత్తుఁ గైకొనుము నిర్మలభూసురవంశచంద్ర! సా
హూకుతలేశమంత్రివర! ఉజ్జ్వలదగ్నిశిఖాప్రతాప! బా
జీకమనీయనామ! అతసీసుమరోచి, సువర్ణరోచి, బం
ధూకసురోచిరమ్యమయి తోఁచు నొకానొక రత్నరాజమున్.”

అనుచు వృద్ధుఁడౌ ఛత్రసాలాఖ్యనృపతి
సాహు ధరణిపాలామాత్యసత్తముండు
ప్రాప్తయౌవనుఁడగు బాజిరాయమంత్రి
కరము దనచేతఁ గొని యెత్తెఁ దెరను పైకి.

అంతటఁ గాంచె మంత్రివరుఁ డక్కజమొప్ప నవాతసీసుమా
త్యంతవినీలకాంతికలితాయతకుంతల, బంధుజీవవ
ల్ల్యంతసురాగరమ్యమృదులాధరశోభితఁ,బూర్ణచంద్రమః
కాంతియుతాస్యఁ, దప్తకనకచ్ఛవిపిచ్ఛిలగాత్ర నవ్చటన్.

ఒకపరి మూఁడువన్నియలయొప్పుల నొప్పు తదీయరత్న మూ
రక కను వాని కబ్బెను నిరర్థితనిర్నిమిషత్వసిద్ధి, యం
తకుఁ దనివొందకుండఁ గనఁదల్చు నతం డనిమేషనేతృతన్
ప్రకటము గాదె మంత్రులిల వాంఛిలుటల్ ప్రభుతాపదంబులన్.

కనకవిద్యుతి మీరు కమనీయగాత్రంబు
    స్వర్ణమయము సేయ ప్రాంతమెల్ల,
పగడంబు జగిమీరు పల్లవాధరకాంతి
    పద్మరాగశ్రేణిఁ బాదుకొల్ప,
విచ్చుగల్వల మీరు వీక్షణద్యుతు లింద్ర
    నీలాలచాలుల నూలుకొల్ప,
అర్ధచంద్రుని మీరు అలికంబు విధుకాంత
    మణిరాజికల్పనంబును ఘటింప,

స్వీయసౌందర్యవిభవంబుచేతఁ బరిస
రంబుకెల్ల మణిగణవిరాజమాన
భర్మపేటికాభద్రవిభ్రమము గూర్చు
రమ్యగాత్రినిఁ గనె బాజిరాయమంత్రి.

సొంపారు తీవియ వంపుసొంపుల నూని
    బంగారుమైఁదీగ పరిఢవింప,
వల్లీమతల్లికాపల్లవాకృతి నూని
    కోమలాంఘ్రియుగంబు కొమరుమిగుల,
మంజులవ్రతతికామంజరీపీవరం
    బై యురోజద్వయియందగింప,
వ్రతతికాశాఖోల్లసితకోరకములట్లు
    సోగలై యంగుళుల్ సొగసులొల్క,

అతులపేశలతన్వంగ మతిశయిల్ల
పొలఁతిరూపము దాల్చిన ఫుల్లమాధ
వీలతికయో యనఁ బరఁగు లోలనేత్రి
నరసె నచ్చట బాజిరాయండు పేర్మి.

కూరిమి, లజ్జయున్ముదము గూడి పెనంగ మనంబులోన, వి
స్ఫారితనేత్రయుగ్మమును ప్రక్కకు నించుక వంచి, వంచి పం
కేరుహమిత్త్రవక్త్రము నొకించుక కాంచె విలోలనేత్రయై
ఆరమణీశిరోమణి నవాంబురుహాస్త్రుని నయ్యమాత్యునిన్.

సామ్రాజ్యలక్ష్మికిన్ స్థావరంబై తగు
    వెడదయురమ్ముతో నడరువాని,
ధారుణీభారమున్ దాల్పఁగాఁ దగినట్టి
    యున్నతాంసంబుల నొనరువాని,
శస్త్రవిద్యాభ్యాససంప్రాప్తకిణయుతం
    బైన హస్తంబుల నలరువాని,
శౌర్యముద్రితమైన శ్మశ్రురేఖాంకిత
    వక్త్రేందుబింబంబు వరలువాని,

అలరుటమ్ముల రోసి, అయఃకృతాస్త్ర
గణముతో జగంబును గెల్చు కంతుఁ డనఁగఁ
జెలువుమీరెడి రూపంబు గలుగువాని
పరవశించుచుఁ గాంచె నా పద్మనయన.

వెన్నెలపుల్గులయ్యెఁ జెలి వీక్షణపంక్తులు వానియాస్యపున్
వెన్నెలఱేనిఁ గ్రోలునెడ, భృంగపరంపరలయ్యెఁ దమ్మిపూ
చెన్నున నొప్పు వాని వికచేక్షణమంజిమఁ గ్రోల, వాని ర
మ్యోన్నతవిగ్రహంబు కడ మూగి నటింపఁగ నయ్యె నెమ్ములున్ .

ఆమెను గాంచు నాక్షణమె యాతనిలో నుదయించు రాగభా
వామృతధారతో నతని నారయు నామె యెడందలోన మెం
డై మెయికొన్న రాగఝరి ఐక్యము చెందఁగ వెల్లువెత్తు రా
గామృతవాహినిం గలసి యానము సేసిరి వారలిర్వురున్.

కఱకుకత్తులతోడ పైకుఱికివచ్చు
వైరి కెన్నడు లొంగని వీరుఁడిపుడు
దిరిసెనముకన్న మృదువైన తరుణి మంద
హాసమునకు విధేయుఁడై యచట నిల్చె.

అంతకుఁ బూర్వమాహవమునందు లభించు జయంబుచేతనే
సంతసమందఁగాఁ గలుగు సాహుధరాధిపమంత్రిచిత్త మ
క్కాంత సుధోపమానమగు కమ్మనిహాసముచేత నోడియున్
సంతసమందె; నోటమియె సౌఖ్యదమౌఁగద కొన్నిచోటులన్!

వారల యాంగికచేష్టా
సారము గ్రహియించి ఛత్రసాలనృపాలుం
డీరీతిం బల్కెను బా
జీరాయామాత్యమణికి స్నేహమెలర్పన్.

“ఈ సుకుమారి నా తనయ; ఇమ్ముగ నాకనురాగవర్తియై
భాసిలు పారశీకసతివల్ల జనించిన రత్నమీమె, బ్రా
హ్మీసమ నృత్యగానముల నీ సుమకోమలగాత్రి, సద్గుణ
శ్రీసముపేత, పూతతులసీసతిసన్నిభసాధుశీలయున్.

సన్నని మాలతీలతిక చందము సున్నితమైన మేనితో
నున్నది యీలతాంగి యని యొచ్చెము సేయకుమన్న! క్షాత్రసం
పన్నములైన భల్లరణ వాజ్యధిరోహణ విద్యలందు న
త్యున్నతకౌశలంబు గల యుగ్మలి నా సుత నిశ్చయంబుగన్.

మస్తానీనామాంకిత
విస్తారలలితకళాసివిన్యాసవిధా
న్యస్తాద్భుతమేధాన్విత
నిస్తులగుణ నీ వధూటి నీకగుఁ గొనఁగన్.

వాహినిం గూడి పూర్ణుఁడౌ వార్ధివోలె,
చంద్రికం గూడి పూర్ణుఁడౌ చంద్రువోలె
నీ రసధుని నీ చంద్రికాచారుహాసఁ
బరిణయంబాడి పూర్ణతం బడయుమయ్య!”

అని తన పారశీకసతి యచ్చటికిం గొనివచ్చియున్న క్రొ
న్ననల సుగంధమాలికల నా మిథునంబు కొసంగ ఛత్రసా
లనృపతి, హర్షితాననవిలాసములుం, బులకాంకురంబులుం
బొనరఁగ వారు మార్చుకొని పొల్చిరి శ్రీహరులట్లు దండలన్.

బ్రాతిగ నామెపైని గల రాగము వెల్లడిసేయు రీతిగా
నాతఁడు హల్లకస్రజము నామెగళాన నలంకరింపఁగా
నాతరళాక్షి యందుకు హృదంచిత హర్షము దెల్పురీతిగా
నాతని కంఠమందునిచె నచ్చపుమల్లెలదండ నింపుగన్.

అట్లు వారల యెదలను హత్తుకొనుచు
నెదలయందున దాగిన ముదముపొలుపు
వెలికిఁ దెలిపెడి పొలుపున వలపులొలికె
పూలదండలు చాల నా శాలయందు.

తదుపరి నొక్కనాఁడు శుభదంబగు భద్రముహూర్తమందు నా
ముదితకు నయ్యమాత్యునకుఁ బూర్ణనృపోచితలాంఛనంబులున్
సదమలశాస్త్రపద్ధతియు సంధిల నుద్వహనంబు సేసె స
మ్మదమున ఛత్రసాలుఁ, డసమానముదాన జనంబు వొంగఁగన్.

ఆ తరుణంబునందు నృపుఁ డ ల్లునకిచ్చెను రాజ్యమందునన్
ఖ్యాతిని గన్న రాష్ట్రములఁ గాలపి, ఝానిసి, సాగరంబులన్,
శ్వేతహయంబులం, గరుల, వింశతిలక్షల స్వర్ణనిష్కముల్,
దూతల, దూతికామణుల, దోర్బలశాలుర మల్లవీరులన్.

ఆవిధి బాజీరాయం
డా వధువును బెండ్లియాడి యతిమోదముతో
పావనపూనాపురమున
నావాసంబుండెఁ బేర్మి నయ్యంగనతోన్.

రాచకార్యములం దతిశ్రాంతుఁడైన
యతని కాసతి చిఱునవ్వె హాయి గూర్చు;
అస్త్రశస్త్రాభ్యసనముల నలసియున్న
యతని కామె యాశ్లేషమే వెతను దీర్చు.

బహుళములైన యుద్ధములఁ బాల్గొన రాయఁడు వోవు వేళ భ
ద్రహయముపైని నామె సయితంబును నేఁగును భర్తతోడుతన్,
అహహ! జయేందిరారమణి ఆహవపూర్వమె బాజిరాయనిన్
సుహసితయౌచుఁ గూడెనదె, చోద్యమిదంచు జనంబు వల్కఁగన్.

చపలవిలోకనంబులును, చంచలగాత్రము, పాదచారులున్,
నిపుణరసానుభావపరినిష్ఠితవక్త్రము లుల్లసిల్లఁ దా
నపరఘృతాచియో యనఁగ నాయమ నాట్యము సేయఁ గాంచి తా
నపరసురేశుఁడైనయటు లక్కునఁ జేర్చును నామె నాతఁడున్.

ఆతఁడు వల్లకిం గొని రసాంచితరాగము లాలపించుచో
నాతని వీణకుం దగినయట్టుల గానముసేయు నామెయున్,
ఆతఁడు శ్రావ్యగానపరుఁడైన క్షణంబున నామె వల్లకిం
జేతను బూని వీణియకుఁ జెప్పును నాథుని గీతపాఠమున్.

ఆమె యతనికి సర్వస్వమై రహింప
నాతఁడామెకు సర్వస్వ మయ్యె నటులె;
వారి యనురాగబంధంబు పరిఢవిల్లె
పరమజీవాత్మపరమాత్మబంధ మటుల.

వారి చరిత్ర సత్కవుల భావనలందున ని ల్చె కావ్యమై
వారి చరిత్ర జానపదవాఙ్మయమందు రహించె గీతమై,
వారి చరిత్ర నర్తకుల పాలిటఁ బొల్చెను నాట్యగాథయై,
వారి చరిత్ర సఖ్యతకు వ్యాఖ్యగ నిల్చెను భారతావనిన్.


(మస్తానీ బాజీరావుల ప్రణయగాథ రతీమన్మథుల కథవలె భారతీయులకు (ముఖ్యముగా మహారాష్ట్రులకు) చిరస్మరణీయమైనది. మహారాష్ట్రమును పాలించిన పీష్వాలలో మొదటి బాజీరావు (క్రీ.శ. 1699-1740) అత్యంత సమర్థుడు. ఇతడు మహారాష్ట్రరాజ్యమును మథురదాక విస్తరింపజేసిన మహాయోధాగ్రేసరుడు; సంతతవిజేత. ఈతడు బుందేలుఖండము నేలుచుండిన హిందూప్రభువైన ఛత్రసాలుని శత్రువులనుండి రక్షించి, అతనికి పారసీక వనితవల్ల గల్గిన మస్తానీయను ముస్లిముకాంతను వివాహమాడెను. బ్రాహ్మణుడైన యతడు ముస్లిమువనితను వివాహమాడి ఆమెయందు నిత్యానురక్తుడగుట అతని తల్లి రాధాబాయికి, కులకాంతకు నచ్చలేదు. ఐనను మస్తానీ ఆకర్షణనుండి అతడు తప్పుకొనడయ్యెను. పూనాసమీపమున ఒక అందమైన ప్రాసాదమును నిర్మించి ఆమె నందులో నుంచెను. బాజీరాయని కుటుంబ మామెయందు స్పర్థతో వ్యవ హరించినను, ఆమెకుమాత్రము అతడే సర్వస్వమయ్యెను. అతని నామె యుద్ధ రంగములందు, ప్రవాసయానములందు అనుగమించెను. అనన్యసామాన్యసౌకుమార్యలావణ్యసౌందర్యములు గల్గి నృత్యగానములు నేర్చియుండినదైనను ఆమె భల్లయుద్ధమునందు, అశ్వచాలనమందు నిష్ణాతురాలై యుండెను. క్రీ.శ. 1740లో బాజీరాయడు తన 40వ యేట హఠాత్తుగా మరణించినప్పుడామె అతనితోబాటు సహగమనము చేసెనని చెప్పుదురు. ఆమె సమాధి పాబెల్ అను గ్రామములో నున్నది. ఆమెకు బాజీరావువలన కలిగిన ఏకైకపుత్రుడు ఆమె తర్వాత బాజీరాయని కులసతితో బెంప బడి, తండ్రివలెనే మహాయోధు డయ్యెను. ఇతడు మహారాష్ట్రులకు, అహమద్ షా అబ్దాలీకి జరిగిన మూడవ పానిపత్ యుద్ధములో మహారాష్ట్రుల పక్షమున బోరుచు మరణించెను. ఈ ఖండికలో నేను ముఖ్యముగా మస్తానీ బాజీరాయల వివాహసందర్భమునే వర్ణించితిని. మిగితా విషయములు వ్రాయవలెనన్న ఒక కావ్యమే యవసర మగును.)