అభిసారిక, విప్రలబ్ధ

కావ్యరసములలో శృంగారమును రసరాజముగా లాక్షణికు లంగీకరించి యుండుట సర్వజనవిదితమే. ఇట్టి శృంగారరసమునకు ఆలంబనములు నాయికానాయకులు. నాయికానాయకుల యొక్క చక్షుష్ప్రీతి, మనస్సంగములవల్ల కలుగు మనోవికారమే రూఢమై శృంగారరసముగా పరిణమించును. దీనికి పరిసరములందలి సురభిళానిల సుందరోద్యాన చంద్రికాదిసన్నివేశములును, పరస్పరాభిహితమైన ఆహార్యాంగహార చేష్టాదులును ఉద్దీపకములుగా లాక్షణికులు గుర్తించినారు. ఇవన్నియు అనురక్తులైన నాయికానాయకుల అనుభవ మందున్నవే. వీనినే లాక్షణికులు సిద్ధాంతీకరించినారు. నాయికావిషయప్రసక్తిలో ఆసక్తికరమైన విషయము అష్టవిధశృంగారనాయికావర్గీకరణము. ఇది నాయికా తాత్కాలిక మనోధర్మవర్గీకరణమే కాని, నాయికాప్రకృతివర్గీకరణము కాదు. అనగా ఒకే నాయిక తత్తత్కాలమనోధర్మము ననుసరించి, ఈ అష్టవర్గములలో ఏదో యొక వర్గమునకు చెందియుండుననుట. కావ్యాలంకారసంగ్రహములో ఈ శృంగారనాయికల లక్షణము లిట్లు చెప్పబడినవి:

సీ.వరుఁడు కైవసమైన వనిత స్వాధీనభ
          ర్తృక
; ప్రియాగమవేళ గృహముఁ,దనువు
     సవరించు నింతి వాసకసజ్జ; పతిరాక
          తడవుండ నుత్కంఠఁ దాల్చునింతి
     విరహోత్క; సంకేత మరసి, నాథుఁడు లేమి
          వెస నార్తయౌ కాంత విప్రలబ్ధ;
     విభుఁడన్యసతిఁ బొంది వేఁకువ రాఁ గుందు
          నబల ఖండిత; యల్క నధిపుఁ దెగడి

గీ. అనుశయముఁ జెందు సతి కలహాంతరిత; ని
      జేశుఁడు విదేశగతుఁడైనఁ గృశతఁ దాల్చు
      నతివ ప్రోషితపతిక; కాంతాభిసరణ
      శీల యభిసారికాఖ్యయై చెలువు మెఱయు.

(అనుశయము=పశ్చాత్తాపము)

పై పద్యములో ఈ అష్టవిధనాయికల పేర్లు సాంద్రమైన (Bold)అక్షరములతో గుర్తింపబడినవి. కడచిన మూడు ఈమాట సంచికలలో వాసకసజ్జికా, విరహోత్కంఠితా, ఖండితా, కలహాంతరితా, స్వాధీనపతికా, ప్రోషితభర్తృకా యను ఆర్గురు నాయికాలక్షణములను వివరించినాను. ఇప్పుడు మిగిలిన ఇద్దఱు నాయికలు – అభిసారికా, విప్రలబ్ధా అనువారి లక్షణములను వివరించి, వారి మనోధర్మములను ప్రతిబింబించునట్లుగా నేను వ్రాసిన గీతములను శ్రవ్యమాధ్యమములో ప్రదర్శింతును. ఇదియే ఈ వ్యాసము యొక్క ఆశయము.

అభిసారిక

మదనానలసంతప్తా యాభిసారయతి ప్రియమ్|
జ్యోత్స్నాతమస్వినీయానయోగ్యాంబరవిభూషణా|
స్వయం వాభిసరేద్ యా తు సా భవేదభిసారికా||

అని రసార్ణవసుధాకరములో నభిసారికాలక్షణము గలదు. అనగా మదనానలసంతప్తయై ప్రియుని తనకడకు రప్పించుకొనునది గాని, వెన్నెల రాత్రులలో, చీకటిరాత్రులలో తన్నితరులు గుర్తింపనిరీతిగా వేషభూషలను ధరించి (గుట్టుగా) ప్రియుని గలియుటకు సంకేతస్థలమునకు బోవునది గాని, అభిసారిక యనబడునని పైశ్లోకముల కర్థము. మొదటి రకమైన యభిసారిక సామాన్యముగా నొక దూతిక ద్వారా సందేశమును పంపి, ప్రియుని తనకడకు రప్పించుకొనును. అతడు వచ్చినప్పుడు వాసకసజ్జికవలెనే సర్వము సంసిద్ధము చేసికొని అతనితో సవిలాసముగా గడపును. ఇట్లు ఈవిధమైన అభిసారికకు, వాసకసజ్జికకు, కించిద్భేదమే యున్నది. వస్తుతః శృంగారమంజరీకర్త వంటి కొందఱు లాక్షణికులు ఈరకమైన అభిసారికను వాసకసజ్జికగానే పరిగణించుచున్నారు. ఇది యెట్లున్నను, ప్రియుని కిట్టి సందేశమును పంపునప్పుడు సరియైన దూతిక నెన్నుకొనవలెను. సుకుమారి, సుందరాంగి, స్వలాభపరాయణురాలగు దూతికను పంపుటవల్ల కలిగిన యనర్థమును పుష్పబాణవిలాసములోని ఈ క్రిందిశ్లోకము చక్కగా వర్ణించుచున్నది.

దూతీదం నయనోత్పలద్వయమహో! తాన్తం నితాన్తం తవ
స్వేదామ్భఃకణికా లలాటఫలకే ముక్తాశ్రియం బిభ్రతి|
నిశ్వాసాః ప్రచురీభవన్తి నితరాం, హా! హన్త! చన్ద్రాతపే
యాతాయాతవశా ద్వృథా మమకృతే శ్రాన్తాసి కాన్తాకృతే!

దీనికి నా యనువాదము:

మ. చెలియా! నీనయనోత్పలంబు లకటా! చెందెంగదే మ్లానతన్,
     అలికంబందున స్వేదబిందువులు ముక్తాభంబులయ్యెం, గడుం
     బొలిచె న్నిశ్వసనంబు, లీగతి వృథా పోవ న్మదర్థంబు, బి
     ట్టలయించెంగద సుందరాంగి! నిను జ్యోత్స్నాఽయాతయాతవ్యథల్!

సందర్భము: ఒక నాయిక సుందరాంగియైన యొక దూతికను నాయకుని దోడ్తేర బంపినది. ఘటికురాలైన ఆ దూతిక అతనితో విహరించి వచ్చుటయే కాక అతడు రాకుండుట కేదో మిషను కల్పించి, అతడు రాలేడనినది. కాని ఆమె తనువందు స్పష్టమైన సంభోగచిహ్నము లున్నవి. ఆ విషయమును గమనించిన నాయిక వక్రోక్తిగా నిట్లనుచున్నది.
హే దూతీ=ఓ చెలీ! ఇదం=ఈ, తవ=నీయొక్క, నయనోత్పలద్వయమ్ = కలువకన్నులజంట, నితాన్తం=ఎంతగానో (మిక్కిలి), తాన్తం= వాడినది, అహో=ఆశ్చర్యము; స్వేదామ్భఃకణికా=చెమటనీటిబిందువులు, లలాటఫలకే=నుదుటియందు, ముక్తాశ్రియం =ముత్యములకాంతిని, బిభ్రతి=ధరించుచున్నవి; నిశ్వాసాః=నిట్టూర్పులు, నితరాం=మిక్కిలి, ప్రచురీభవన్తి =హెచ్చగుచున్నవి. హా! హన్త = అయ్యయ్యో! కాన్తాకృతే=అందమైనదానా, చంద్రాతపే=వెన్నెలలో, వృథా మమకృతే= వృథాగా నాకై చేయబడిన, యాతాయాతవశాత్= పోయివచ్చుటల వలన, శ్రాన్తాసి=డస్సియుంటివి.

‘వృథా మమకృతే శ్రాన్తాసి’ అనుటవల్ల నాకొఱకు పోయిన పని నిష్ఫలమయ్యెను. నీకు అలసటయే చిక్కెను – అనునది పైకి దోచు భావము. నాయర్థము వ్యర్థమైనది గాని నీయర్థము సిద్ధించినదని వ్యంగ్యము. ‘చంద్రాతపే’, ‘నిశ్వాసాః ప్రచురీభవన్తి’, ‘స్వేదాంభఃకణికా లలాటఫలకే’, ‘తాన్తం నితాన్తం’ అనుటవల్ల, ఎంత సుకుమారివో చల్లని వెన్నెలలో నేగివచ్చినంతనే నీకు శ్రమవల్ల నిశ్వాసము లధికమైనవి, చెమటపట్టినది, కనులు వాడినవి – అనునది పైకి దోచు భావము. చల్లనివెన్నెలలో కించిద్దూర మేగివచ్చినంతనే ఇట్టి శ్రమము కల్గదు, చెమట పట్టదు, కనులు వాడవు, నిశ్వాసములధికము గావు. ఈచిహ్నములన్నియు నాప్రియునితో భోగించుటచేతనే కల్గినవనునది వ్యంగ్యార్థము. కనులు అలయుట (మ్లానమగుట), స్వేదము గల్గుట, నిశ్వాసములు దట్టమగుట రతిచిహ్నములు. ‘కాన్తాకృతే’ అనుటవల్ల నీయందమే నాకొంప ముంచినది. నీవంటి యందకత్తెను దూతిగా బంపుట నాదే పొరపాటు – అనునది వ్యంగ్యము. అందుచేతనే ‘నోజ్జ్వలం రూపవన్తం వా, న చాతురం దూతం వాపి హి దూతీం వా బుధః కుర్యాత్కదాచన’ – అనగా, ‘ఉజ్జ్వలమగు వేషము, సుందరరూపము, ఆతురత గల వ్యక్తిని దూతగా గాని, దూతిగా గాని నిర్ణయింపదగదు’ – అని భరతుడు నాట్యశాస్త్రములో చెప్పినాడు.

ప్రియుని తనకడకు రప్పించుకొనునది గాక, తానే ప్రియుని సంకేతస్థలమున కలసికొనునది రెండవరకమైన అభిసారిక. ఇట్టి అభిసారికనే తరచుగా కవులు కావ్యములందు వర్ణించియున్నారు. ఇందులో స్వీయా, పరకీయా, సామాన్యాభేదము లున్నవి. స్వీయ యనగా తన కంకితయైన ప్రియురాలు. పరకీయ వేఱొక స్త్రీ. ఈమె కన్యక గాని, అన్యవిధమైనస్త్రీ గాని కావచ్చును. సామాన్య యనగా వేశ్య. గూఢముగా వెన్నెలరాత్రులలో నభిసరించు స్త్రీకి జ్యోత్స్నాభిసారిక యనియు, అట్లే చీకటిరాత్రులలో నభిసరించు స్త్రీకి తమోభిసారిక, లేక తమిస్రాభిసారిక యనియు పేర్లు. బాహాటముగా నభిసరింప బోవు స్త్రీకి ఉజ్జ్వలాభిసారిక యని పేరు. వీరిలో జ్యోత్స్నా, తమిస్రాభిసారికలవర్ణనమే అధికముగా కావ్యములలో కన్పించుచుండును. వీరిర్వురు గూఢముగా సంకేతమునకు బోవుచున్నారు గావున, వెన్నెలలోను, చీకటిలోను ఆయావేళలకు తగిన వేషభూషాదులను ధరించి, ఇతరులు తమను గుర్తింపని విధముగా అభిసరింతురు. ఉదాహరణకు కావ్యాదర్శములో దండి మహాకవి జ్యోత్స్నాభిసారికావేషము నిట్లు వర్ణించుచున్నాడు.

మల్లికామాలధారిణ్యాః సర్వాంగీణార్ద్రచన్దనాః|
క్షౌమవత్యో న లక్ష్యన్తే జ్యోత్స్నాయామభిసారికాః||

దీనికి నా యనువాదము:

తే. మల్లెదండలు వెట్టి, క్షౌమములు గట్టి,
     వపువునందెల్ల చందనపంకమలఁది,
      చనెడు నభిసారికాస్త్రీలఁ గన రెవండ్రు
      వెండివెన్నెలకంటెను వేఱుగాను.

జ్యోత్స్న యనగా వెన్నెల. ఆవెన్నెలలో చరించు అభిసారికలు జ్యోత్స్నాభిసారికలు. తెల్లని మల్లెదండలు తలనిండ ధరించి, తనువు నిండ తెల్లని చందనము నలందికొని, తెల్లని పట్టువలిపెమును గట్టుకొని, వెన్నెలకంటె వేఱుగా గుర్తింపరాని యట్లు వారు వేషధారణ చేసికొని చరించుచున్నా రని పై శ్లోకమున కర్థము. మేఘసందేశములోని ఈక్రింది శ్లోకములోను చక్కని జ్యోత్స్నాభిసారికావేషవర్ణన మున్నది.

గత్యుత్కమ్పా దలకపతితై ర్యత్ర మన్దారపుష్పైః|
పత్త్రచ్ఛేదైః, కనకకమలైః కర్ణవిభ్రంశిభి శ్చ||
ముక్తాజాలైః, స్తనపరిసరచ్ఛన్నసూత్రై శ్చ హారైః|
నైశో మార్గః సవితురుదయే సూచ్యతే కామినీనామ్||

దీనికి నా యనువాదము:

చ. అలకలనుండి జారి పడినట్టి సురద్రుమసూనముల్, శ్రవ
     స్ఖలితసువర్ణపద్మములు, సంశ్లథపత్త్రకఖండముల్, గుచాం
     చలబహుకర్షణత్రుటితసర్జువులున్, గతికంపితాంగులై
     యిల నభిసారికల్నిశల నేఁగినజాడలఁ జూపు వేకువన్.

అర్థము: గత్యుత్కమ్పాత్= మిక్కిలి ఉత్కంఠతో గూడిన గమనమునందలి చలనమువలన, అలకపతితైః మన్దారపుష్పైః =ముంగురులనుండి జారిపడిన మందారపుష్పములచేతను (మందారము దేవతావృక్షము. దీని పూవులు తెల్లనివి), పత్రచ్ఛేదైః=(చెక్కిళులనుండి తొలగిన) మకరికాపత్త్రముల ఖండములచేతను, కర్ణవిభ్రంశిభిః=చెవులనుండి పడిపోయినవైన, కనకకమలై శ్చ= బంగారుకమలములచేతను(యక్షస్త్రీలు దేవయోను లగుటచే వారు స్వర్గంగలో విరిసిన బంగారుకమలములను కర్ణాభరణములుగా ధరింతురు), ముక్తాజాలైః= (తలనుండి పడి పోయిన) ముత్తెపుసరులచేతను, స్తనపరిసర = స్తనపరిసరములందు, ఛన్నసూత్రైః= తెగిన అంతస్సూత్రములుగల , హారై శ్చ=మెడలోని హారములచేతను (కఠినమైన స్తనముల రాపిడిచేత హారములలోని దారములు తెగుటచే క్రిందపడిన హారముల శకలములచేత ననుట), కామినీనాం= మదనాతురలైన (అభిసారికా)స్త్రీలయొక్క, నైశో మార్గః=(ప్రియుల గవయుటకై పోయిన) రాత్రియందలి మార్గము, యత్ర=ఏ అలకాపురియందు, సవితురుదయే =సూర్యోదయకాలమునందు, సూచ్యతే=సూచింపబడుచున్నదో.

అలకాపురమున జ్యోత్నాభిసారికలు వెన్నెల కర్హమైన వేషములు ధరించి రయభయములతో గూడిన గమనోత్కంపముతో జనగా వారు ధరించిన తెల్లని మందారపుష్పములు, బంగారు కమలముల కర్ణావతంసములు, ముత్యముల దండలు, లోదారము తెగుటచే నేలపై బడిన స్తన ప్రాంతమునందలి ముత్యాలహారఖండములు వారేగుదారిలో పడిపోయినవి. అవి వేకువను జూచువారికి వారేగిన దారుల జాడలను తెల్పు చున్నవి. ఈశ్లోకములో వెన్నెలలో కలసిపోవునట్లు అభిసారికలు ధరించిన తెల్లని యలంకారము లన్నియు తెల్పబడినవి.

ఇట్లే తమిస్రాభిసారిక చీకటిలో కలసిపోవునట్లు నల్లని వస్త్రములు, నల్లని భూషణములు ధరించును. కావ్యములలో తమిస్రాభిసారికల వర్ణనలు బహుళముగా నున్నవి. చీకటిలోనే వీరి ప్రణయప్రయాణము. రసమంజరిలోని ఈక్రిందిశ్లోకము వీరి స్వభావమును చక్కగా సమీక్షించుచున్నది.

నామ్బుజైర్న కుముదై రుపమేయం,స్త్వైరిణీజనవిలోచనయుగ్మమ్|
నోదయే దినకరస్య నవేందోః, కేవలే తమసి తస్య వికాసః||

దీనికి నా యనువాదము:

తే. పద్మకైరవంబులను బోల్పంగఁ దగదు
     స్త్వైరిణీజనలోచనద్వయముతోడ
     తరణిచంద్రులు విరియింపఁ దగరు వాని,
     వాని విరియింపఁ జాలును ధ్వాంతమొకటె.

పద్మములను సూర్యుడు, కలువలను చంద్రుడు వికసింపజేయు ననుట, కన్నులను పద్మములతో, కలువలతో బోల్చుట కవుల సంప్రదాయము. కాని స్త్వైరిణీస్త్రీల (తమోభిసారికల) కనులను మాత్రమట్లు బోల్పరాదు. ఏలనన, వాని వికాసము సూర్యుడు గల పగటియందును, చంద్రుడు గల రాత్రియందును గలుగదు. వాని వికాసము సూర్యచంద్రులు లేని చీకటిరాత్రులందే కలుగును.

అట్టి తమిస్రాభిసారికల నల్లనైన వేషధారణమును జయదేవుని గీతగోవిందమునందలి యీక్రింది శ్లోకము రమ్యముగా వర్ణించుచున్నది.

అక్ష్ణో ర్నిక్షిపదంజనం, శ్రవణయో స్తాపింఛగుచ్ఛావలీం,
మూర్ధ్ని శ్యామసరోజదామ, కుచయోః కస్తూరికాపత్త్రకం,
ధూర్తానా మభిసారసంభ్రమజుషాం విష్వఙ్నికుంజే సఖి!
ధ్వాతం నీలనిచోళచారు సుదృశాం ప్రత్యంగ మాలింగతి||

దీనికి నా భావానువాదము:

మ. తలలో నల్లనికల్వలున్, శ్రవములం దాపింఛగుచ్ఛంబు, ల
     క్షులకుం గాటుకయుం, గుచస్థలులఁ గస్తూరీలసత్పత్త్రకం
     బులు గైసేసి తమోఽభిసారికలకున్ బూర్ణాంధకారంబు, వా
     రల ప్రత్యంగము నంటు కార్ముసుఁగు లీలం గ్రమ్మి, కుంజంబులన్.

తాత్పర్యము: జయదేవు డీశ్లోకములో ధ్వాంతమును (గాఢాంధకారమును) కర్తగా గొని, అతడు చేయు కార్యములను చెప్పుచున్నాడు. ఆ యంధకారములో అభిసారసంభ్రమముతో ధూర్తస్త్రీలు నికుంజసంకేతములకు జేరినారు. ఆస్త్రీల కన్నులకు నల్లనికాటుకను, శ్రవణములకు నల్లకానుగుపూలమొత్తమును, తలలకు నల్లగల్వలను, స్తనములకు కస్తూరి పత్త్రభంగములను అతడు గైసేసినాడు (అట్టి నల్లని వేషములను ధరించి వారలు వచ్చినారనుట). చీకటినే వారికి నల్లని ముసుగుగా వేసి, వారి సమస్తాంగముల నతడు సంశ్లేష మొనరించినాడు. ముసుగు నిండుగా గప్పికొన్నప్పు డది సమస్తాంగములను ఆవరించుట సహజమే కదా! ఇట్లావరించుటనే జయదేవుడు సకలాంగసంశ్లేషముగా నుత్ప్రేక్షించినాడు. తమిస్రాభిసారికలు ధరించు శ్యామలాహార్యమును వర్ణించుట ఈశ్లోకముయొక్క ప్రధానాశయము. సమాసోక్తివలన నిచ్చట ననేకనాయికల గైసేసి కౌఁగిలించుకొనుచున్న దక్షిణనాయకుని వృత్తాంతము సైతము స్ఫురించుచున్నది.

ఇట్లు చీకటిలో నభిసరించునప్పుడు మదనాతురైకమతులైన వారు దారియందలి సర్పవర్షకంటకాదిభయములను లెక్క సేయరని కవులు వర్ణింతురు. అమరుకములోని ఈక్రింది శ్లోకము ప్రశ్నోత్తరరూపములో నిట్టి మదనాతురతను ధ్వనించుచున్నది.

క్వ ప్రస్థితాసి కరభోరు! ఘనే నిశీథే?
ప్రాణాధికో వసతి యత్ర జనః ప్రియో మే!
ఏకాకినీ బత కథం న బిభేషి బాలే?
న్వస్తి పుంఖితశరో మదనః సహాయః!

దీనికి నా యనువాదము:

ఉ. ఇట్టి నిశీథమందుఁ దరళేక్షణ! యెచ్చటి కేఁగుచుంటివే?
     గట్టిగ నాత్మకంటె నధికప్రియుఁడౌ జనుఁడున్నచోటికే!
     కట్ట! యిదెట్టి సాహసమె? కాదొ భయం బిటులేఁగ నొంటిగన్?
      పుట్టదు భీతి, మన్మథుఁడు పుంఖితమార్గణుఁ డుండె తోడుగన్!

అర్థము సులభము. పుంఖితమార్గణుఁడు=ఎక్కుపెట్టబడిన బాణములు గలవాఁడు (మన్మథుఁడు). మార్గణ మనగా బాణము.

కాళిదాసు ఋతుసంహారమునందలి ఈక్రింది శ్లోకము భయావహములగునట్లు మబ్బులు గ్రమ్మి, ఉరుములు ఉరుము చున్నను, వానిని లెక్క చేయక ఆమేఘముల మెఱుపులే దారి చూపుచుండగా అభిసారికలు వెడలుచున్నారని వర్ణించుచున్నది.

అభీక్ష్ణ ముచ్చై ర్ధ్వనతా పయోముచా
ఘనాంధకారీకృతశర్వరీష్వపి
తటిత్ప్రభాదర్శితమార్గభూమయః
ప్రయాన్తి రాగాదభిసారికాః స్త్రియః||

దీనికి నా యనువాదము:

ఉ. భీతి జనింపఁజేయుచు నభీక్ష్ణముగా నినదించు చంబుభృ
     జ్జాతము లావరింప నతిసంతమసాఢ్యములైన రాత్రులం
     దాతురరాగమత్తలగు నంగన లా ఘనజాతచంచలా
     జాతము దారిసూప నభిసార మొనర్తురు చేరఁ గాంతులన్.

రాత్రి చీకటైనది. మబ్బులు గ్రమ్మినవి. ఉరుములు ఉరుముచున్నవి. మెఱుపులు మెఱయుచున్నవి. చిమ్మటలు పాడుచున్నవి. ఒక ముగ్ధాకాంత ఆచీకటిలో నభిసారమొనర్ప వెనుదీయుచున్నది. ఆమె నభిసార మొనర్పుమని ప్రోత్సహించుచు ఆమె చెలికత్తె యిట్లు పల్కుచున్నది.

దూతీ విద్యుదుపాగతా, సహచరీ రాత్రిః సహస్థాయినీ|
దైవజ్ఞో దిశతి స్వనేన జలదః ప్రస్థానవేలాం శుభామ్||
వాచం మంగళికీం తనోతి తిమిరస్తోమోఽపి ఝిల్లీరవైః|
జాతోఽయం దయితాభిసారసమయో ముగ్ధే విముంచ త్రపామ్||

దీనికి నా యనువాదము:

ఉ. దూతియొ నాఁగఁ గ్రొమ్మెఱుఁగు తోడయి వచ్చె, వయస్యరీతిగన్
     రాతిరి గ్రమ్మె, చిమ్మటలరావములం దిమిరంబు మంగళా
     మ్నాత మొనర్చె, గర్జనల మంచితఱిం బ్రకటించె నంబుద
     జ్యౌతిషికుండు, బాల! యభిసారమొనర్పుము, వీడు వ్రీడమున్.

అర్థము సులభము. చీకటిలో భయంకరమగు వస్తువుల నన్నిటిని అభిసారమునకు హితమైన మంగళకరమైన వస్తువులుగా అభివర్ణించి, అంతగా ప్రణయము తెలియని ముద్దరాలిని అభిసారము చేయుమని చెలికత్తె ప్రోత్సహించుచున్నది. ఇది భానుదత్తుని రసమంజరిలో ముగ్ధాతమిస్రాభి సారిక కిచ్చిన యుదాహరణము.

గంగాదేవి రచించిన మధురావిజయకావ్యములో పై కాళిదాసు మేఘసందేశములోని శ్లోకమును బోలిన యీచిన్న శ్లోకము తమిస్రాభిసారికకు వర్తించునట్లుగా చమత్కారయుతముగా నున్నది.

అగమన్నభిసారికాః ప్రియా
ననురాగాంజనరంజితేక్షణాః|
అభినత్తిమిరేఽపి తాః పున
శ్శ్వసితేనైవ సుగన్ధినా జనః||

దీనికి నా యనువాదము:

తే. అంజనానురక్తుల నభిరంజితాక్షు
     లగుచు, ధ్వాంతమందునఁ గలియంగఁ బ్రియులఁ
     జనెడు నభిసారికాస్త్రీల జాడ దెల్పె
     వదననిర్గతనిశ్వాసపరిమళంబె.

తాత్పర్యము: తమిస్రాభిసారికలు కంటికి నల్లని కాటుక వెట్టి, కన్నులందు అనురాగము రంజింప చీకటిలో పరులకు గనపడకుండ పోవు చున్నారు. కాని పరిమళాన్వితమైన తాంబూలములను వేసికొన్నారు. ఆఘుమఘుమలు వారి యూర్పుగాలుల మూలమున అంతటను ప్రసరించుచున్నవి. ఈవిధముగా వారు కనపడకున్నను వారి జాడ లితరులకు దెలియనే తెలియుచున్నవి.

పగటియందుగాని, రాత్రియందుగాని, ఉజ్జ్వలమైన వేషభూషాదులు ధరించి చక్కగా నలంకరించుకొని, ఇతరులు చూతురను జంకుకొంకు లేకుండ అభిసరించునది ఉజ్జ్వలాభిసారిక. ఇందుల కమరుకమందలి యీక్రింది శ్లోక ముదాహరణము.

ఉరసి నిహితస్తారో హారః కృతా ఘనే జఘనే|
కలకలవతీ కాంచీ, పాదౌ రణన్మణినూపరౌ||
ప్రియ మభిసరస్యేవ ముగ్ధే! త్వమాహతడిండిమా|
యది కి మధికత్రాసోత్కంపం దిశ స్సముదీక్షతే||

దీనికి నా యనువాదము:

చ. ఘనజఘనంబునందు ఘలుఘల్లను గజ్జెలపట్టె, యంఘ్రుల
     న్మణుల రణించు నందెలు, స్తనంబుల ముత్తెపుదండ లూనుచుం
     బణవము మోదినట్లు తెగువన్నభిసారమొనర్పనెంతు వై
     నను దెస లేల జూతువు ఘనంబగు త్రాసముతోడ బేలవై!

తాత్పర్యము: అంతగా ప్రణయచాతుర్యము లేని యొక ముగ్ధ గొప్పనైన పిఱుదులపై ఘల్లుఘల్లురను గజ్జెల యొడ్డాణము ధరించినది. కాళ్ళకు గణగణ ధ్వనించు మణుల యందెలు బెట్టికొన్నది. వక్షోజములపై తారహారము నలంకరించుకొన్నది. ఈవిధముగా నుజ్జ్వలవేషము ధరించినది. కాని ధైర్యముగా బోవక జంకుతో దిక్కులు చూడ నారంభించినది. ఆమెతో చెలికత్తె యనుచున్నది – ‘ఇంతగా నగారా వాయించినట్లు ధ్వనించుచు ప్రపంచమునకెల్ల నీఅభిసరణమును ప్రకటించుచున్నదో యనునట్లున్న ఆహార్యమును ధరించినావు. చేసే అభిసరణ మేదో చేయి. చేయకుండా బేలవై భయంతో దిక్కులెందుకు చూస్తున్నావు?’


శ్రీమతి చర్ల రత్నశాస్త్రిగారు పాడిన మత్కృతమైన ‘పతిచాటుదానరా’ అనునీపాట శ్రీకృష్ణునియం దాసక్తయైన తమిస్రాభిసారికాలక్షణమును ప్రతిబింబించునది.

పతిచాటుదానరా (కాపి రాగం)

పల్లవి:
పతిచాటు దానరా పగలింక మిగిలెరా
అతిచార మొనరింప నదనుకాదుర శౌరి
అ.పల్లవి:
కాలరాత్రిని పతిని కనుమొఱగి యేతెంతు
తాళురా గోపాల ఏలరా త్వర యింత
చరణం 1:
యామినీముఖమును యవనికం బోలె
శ్యామలంబగు తమం బావరించిన వేళ
కోమలాంఘ్రుల తులాకోటి సవ్వడి లేక
నేమమున నెమ్మదిగ నేతెంతురా స్వామి
చరణం 2:
నల్లని కాటుకను నయనాల దీర్చి
నల్లని వలువలో నాదు తనువును దూర్చి
నల్లపూసలపేరు నాకంఠమున గూర్చి
అల్లనల్లన రేయి నరుదెంతురా కన్న!
చరణం 3:
మతినిండ రతి నించు మధురనాదముతోడ
శ్రుతిపర్వమగు నీదు సుషిరంబు నాపరా
ప్రతినబూనితి రాత్రి వాలాయముగ వత్తు
శతపత్త్రదళనేత్ర! సరసగోపీమిత్ర!

కొన్ని పదముల కర్థములు: అతిచారము= మేర మీఱి (మర్యాద దప్పి ) ప్రవర్తించుట; యవనికంబోలె = తెరవలె; తులాకోటి సవ్వడి = కాలియందెల చప్పుడు; కోమలాంఘ్రులు=మృదువైన పాదములు; శతపత్త్రదళనేత్ర=తామరఱేకులవంటి కన్నులు గలవాఁడా.

విప్రలబ్ధ

క్వచిత్సంకేత మావేద్య దయితే నాథవఞ్చితా|
స్మరార్తా విప్రలబ్ధేతి కలావిద్భిః ప్రకీర్త్యతే||

అని విద్యానాథుని ప్రతాపరుద్రీయములో విప్రలబ్ధాలక్షణము. ‘ఒకానొక సంకేతస్థలమునకు రమ్మనిన ప్రియుడు, ఆ సంకేతమునకు తాను రాకుండుటచే వంచింపబడి, స్మరార్తయైన నాయిక విప్రలబ్ధ యని కలావిదులందురు’ – అని దీనికర్థము. భానుదత్తుడు రసమంజరిలో ‘సంకేతనికేతనే ప్రియమనవలోక్యసమాకులహృదయా విప్రలబ్ధా| అస్యాశ్చేష్టా నిర్వేద నిశ్వాస సంతాపాలాప భయ సఖీజనోపాలంభ చింతాశ్రుపాత మూర్ఛాదయః|’ – అన్నాడు. ‘సంకేతనికేతనమున ప్రియుని గానక వ్యాకులమతి యగునది విప్రలబ్ధ. తత్ఫలితముగా నీమె నిర్వేదము, నిశ్వాసము, సంతాపము, ప్రలాపము, భయము, చెలులను, పరిసరములను నిందించుట, చింతించుట, ఏడ్చుట, మూర్ఛిల్లుట – అను చేష్టలను చేయును’ – అని ఈ లక్షణమున కర్థము. నాట్యశాస్త్రములో భరతుడును ఈచేష్టలచేతనే విప్రలబ్ధ తన యవస్థ నభినయించవలెనని తెల్పినాడు. దీనికి మదుక్తమైన యొక యుదాహరణము:

చ. తమకము మీరఁగాఁ గృతకధైర్యముతోడఁ బ్రియోక్తవాటికిం
     గమలదళాక్షి వచ్చి యటఁ గానక వల్లభు నిందసేయుఁ బు
     న్నమచలివెల్గు నభ్రవిపినంబున వెల్గు దవాగ్ని యంచు, ఋ
     క్షములను విస్ఫులింగములసంఘము లంచు వియోగతప్తయై.

వివరణ: ఋక్షము లనగా నక్షత్రములు. ఒక ముగ్ధ పున్నమనాటి రాత్రి ప్రియుని గవయవలెనను నుత్కటేచ్ఛతోడ తెచ్చికోలు ధైర్యముతో ప్రియుడు రమ్మనిన తోటకు వచ్చినది. కాని అతడేమో యట లేడు. చాలసేపు నిరీక్షించినది కాని అతడు వచ్చు జాడ కన్పడలేదు. ఎంతో తమకముతో నున్న యామె కా వియోగము దుస్సహమైనది. చల్లని పూర్ణిమాచంద్రుడు, తళతళలాడు నక్షత్రము లింకను ఆతాపము నధికము చేసినవి. అందుచే నామె రాకాశీతకరుని ఆకాశమను నరణ్యములో మండు దవాగ్ని యని, నక్షత్రముల నా యగ్నియొక్క విస్ఫులింగములని నిందించినది. విప్రలబ్ధానాయికయొక్క నిందాచేష్టిత మిందు వర్ణింపబడినది.

విద్యానాథుని ప్రతాపరుద్రీయములో నీయబడిన విప్రలబ్ధోదాహరణమునకు శ్రీమాన్ చెలమచర్ల రంగాచార్యులవారి అనువాద మీక్రింది పద్యము:

మ. నడు చేటీ!యిట ముందు, వీడు మిఁక నా నాథాగమాలాపముల్,
     నడురే యయ్యె; వృథా మదశ్రుకణసంతానమ్మునన్ ఱొంపి పు
     ట్టెడు సంకేతగృహంబ; పోయెద; వధూటీభూష భాషన్, సిరిం,
     బుడమిం, గేళులఁ దేల్చు ఱేఁ డనక రా మోసంబు వాటిల్లెఁగా!

వివరణ:నాయకుడగు ఱేడొక కాంతను సంకేతగృహమునకు రమ్మనెను. ఆమె చక్కగా నలంకరించుకొని చెలికత్తె వెంట రాగా అచ్చటి కేగెను. కాని యతడు రాడయ్యెను. అత డిప్పుడు వచ్చు నప్పుడు వచ్చునని చెలికత్తె ఆమెకు ధైర్యము చెప్పినది. అట్లు నాయిక నడురేయి దాక అతనికై ఉత్కంఠతో ఎదురు చూచినది. విరహతప్తయై రోదించినది. ఆశ్రువులచే నేల ఱొంపి యైనది. కాని అతని జాడలు లేవు. నిరాశచే నిక మఱలిపోవుట కుద్యమించి, చెలికత్తెతో ననుచున్నది ‘ ఓ చెలీ! అర్ధరాత్రి యైనది. నా నాథునిజాడలు లేవు. నా యశ్రువులచే (రతిస్వేదముచే గాదు) నేల ఱొంపి యైనది. అతడో వధూటీమణి యైన భాషాయోషతోను, (సామ్రాజ్య)లక్ష్మితోను, భూదేవితోను కేళీలోలుడై యున్నాడు. అటువంటి బహు నాయికాలంపటుని గోరి వచ్చుటే నా పొరపాటు. ఇక నడు. తిరిగి పోదము’. ఈ యుదాహరణములో విప్రలబ్ధానాయికయొక్క నిర్వేదము, రోదనము, సంతాపము, ప్రలాపము అను చేష్టలు వర్ణితము లైనవి.

భానుదత్తుని రసమంజరిలోని యీక్రింది శ్లోకములో ఉత్కంఠాపూరితురాలైన విప్రలబ్ధావర్ణనము రమ్యముగా సాగినది.

స్నాతం వారిదవారిభి, ర్విరచితో వాసో ఘనే కాననే|
పుష్పైశ్చన్దనబిన్దుభి ర్మనసిజో దేవ స్సమారాధితః||
నీతా జాగరణవ్రతేన రజనీ, వ్రీడా కృతా దక్షిణా|
తప్తం కిం న తపస్తథాపి స కథం నాద్యాపి నేత్రాతిథిః||

దీనికి నా యనువాదము:

ఉ. స్నానము చేసితిన్ జలదసంస్రుతవారి, వసించితి న్మహా
     కాననమందుఁ, గొల్చితిని గంధసుమంబులతో మనోభవున్,
     పూనితి రాత్రి జాగరణ, పొందుగఁ బెట్టితి వ్రీడదక్షిణన్,
     నేనిటులం దపించినను నేత్రగతుం డతఁ డేల గాడొకో!

అర్థము: పరులకంట బడకుండ రాత్రిపూట దూరాటవిలో సంకేతమునకు వచ్చి, ప్రియు డచ్చట లేకుండుటచే వంచితయైన నాయిక తాను నాయకదర్శనమునకై తపస్సు చేసినను అతడెందుకీ రాత్రి కనపడుట లేదని ఈవిధముగా తర్కించుకొనుచున్నది.

వారిదవారిభిః = వర్షజలముచేత, స్నాతం=(నాచేత)స్నానము చేయబడినది. వర్షజలము అన్నిటికంటె స్వచ్ఛమైనది. అందులో చేసిన స్నానము తపస్వుల కతిపవిత్రమైనది. ప్రియునికొఱకై వర్షములో దాను స్థాణువువలె నిల్చి తడిసిపోయితినని నాయికయొక్క అభిప్రాయము.

ఘనే కాననే వాసః విరచితః = గొప్ప యడవిలో వాసము చేయబడినది. తపస్వులు దూరారణ్యములో వసించుట ప్రసిద్ధము. ప్రియునికొఱకై తాను భీకరారణ్యములో నుంటినని నాయికయొక్క అభిప్రాయము.

మనసిజో దేవః = మనస్సులో నున్న దేవుడు, పుష్పైశ్చన్దనబిన్దుభిః = పుష్పములచేతను, గంధపంకముచేతను, సమారాధితః=బాగుగా నర్చింపబడెను. మనస్సులో నున్న ఇష్టదైవమును తపస్వులు గంధపుష్పాదులచేత నర్చించుట ప్రసిద్ధము. మనసిజు డనగా మన్మథుడు. కాముకుల మనస్సే అతని జన్మస్థానము. అందుచేత తానభిసరించుటకై యలంకరించుకున్న పుష్పగంధలేపములచే తనలో నున్న మన్మథు డర్చింపబడినాడని నాయికయొక్క అభిప్రాయము.

జాగరణవ్రతేన=నిద్రలేమి యను వ్రతముచే, రజనీ=రాత్రి, నీతా=గడపబడినది. దైవదర్శనమునకై తపస్వులు రాత్రుల జాగరణవ్రతమును చేయుట ప్రసిద్ధము. నాయకునికై రాత్రియంతయు నిద్ర దొఱగి యుంటినని నాయికయొక్క అభిప్రాయము.

వ్రీడా=సిగ్గే, కృతా దక్షిణా= దక్షిణగా చేయబడినది. పూజాంతమున ఋత్విజులకు దక్షిణ నిచ్చుట ప్రసిద్ధము. నా సిగ్గును ఇతరులకు దక్షిణప్రాయముగా వదలుకొని నీ కడకు వచ్చితినని నాయికయొక్క అభిప్రాయము.

తప్తం కిం న తపః = నేను చేయని తపస్సేది గలదు? ఉక్తవిధముగా అన్ని తపస్సులు చేసితి ననుట, తథాపి=అట్లైనను, అద్యాపి=ఇప్పుడు, సః=అతడు, కథం న నేత్రాతిథిః = ఎట్లు నేత్రగోచరు డగుట లేదు?

తాత్పర్యము: వ్రతనిష్ఠులైన తపస్వులు చేసినట్లుగా పావనజలస్నానము, వనవాసము,సుమగంధములచేత చిత్తములో నున్న దేవుని యర్చనము, రాత్రియందు జాగరణము, దక్షిణప్రదానముల నన్నిటిని చేసితిని. ఒక నేను చేయని వ్రతమేమున్నది? ఐనను నా ప్రభువు నా కక్షిగోచరు డెందు కగుట లేదు? – అని నాయిక వితర్కించుచున్నది. భక్తితో చేయు తపఃక్రియ లన్నిటిని ప్రణయక్రియలతో సంవదించుట ఈశ్లోకము నందలి చక్కనైన చమత్కారము.


చివరిగా శ్రీమతి చర్ల రత్నశాస్త్రిగారు పాడిన మత్కృతమైన ‘చేరవచ్చితి గాని చెల్వుడిట లేడు’ అనునీపాట విప్రలబ్ధయైన జ్యోత్స్నాభిసారికాలక్షణమును ప్రతిబింబించునది.

చేరవచ్చితిగాని (దేశ్ రాగం)

పల్లవి:
చేరవచ్చితి గాని చెల్వుడిట లేడు
సంకేతమున వానిజాడలే లేవు
అ.పల్లవి:
నిండుపున్నమరేయి నినుజేర వత్తు
తోటలో ననె గాని మాటుచేసెను మోము
చరణం 1:
చెలువూన దలలోన తెలిమల్లెవిరులు
పొలుపూన గళమందు ముత్యంపుసరులు
చెలువార తనువందు తెలిచీరపొరలు
లలిమీర కౌముదీలక్ష్మివలె నేను
చరణం 2:
మాయమాటలు వల్కి మక్కువలు సేసి
తోటకును రమ్మనగ తొలియామమందె
వానిమాటలు నమ్మి వలదన్న చెలులు
ముస్తాబు చేసికొని మురిపెంబు మీర
చరణం 3:
చాటుమాటుగ నేను సంకేతమును జేర
తాను రాడయ్యె వలపూనగా బలికి
ఎంత ఆశయొ కాని సుంత సవ్వడి విన్న
అతడేమొ యని కన్ను లంతటను జూచు