చంద్రికాపరిణయంలోని యమకాలంకారాలు

యమకాలంకారలక్షణం

లాక్షణికులు నిర్వచించిన శబ్దాలంకారములలో రమ్యమైన, శ్రావ్యమైన ఒక శబ్దాలంకారం యమకాలంకారం. భట్టుమూర్తి కావ్యాలంకారసంగ్రహంలో దీని లక్షణ మిట్లు చెప్పబడినది:

కం.
సమవర్ణయుగాధికమై
యమరిన నియమంబు యమకమగుఁ గృతులందా
యమకం బనేకవిధమగుఁ
గ్రమమున నొక రెండుమూఁడు గతు లెఱిగింతున్

అనఁగా రెండుగానిఅంతకంటెఎక్కువగాని తుల్యస్వరవ్యంజనసహితాక్షరములయొక్క ఆవృత్తియే యమకము. ఇది అనేకవిధములుగానుండును. అందులో రెండుమూఁడు రకముల నుదాహరింతునని పై పద్యమున కర్థము. కాని ఈనిర్వచనము సమగ్రముగా లేదు. ఆవృత్తి చెందినఅక్షరసముదాయము భిన్నార్థములను కలిగి యున్నప్పుడే అది యమకమగును. లేకున్న నది అనుప్రాస మగునని గ్రహింపవలెను. భోజరాజు సరస్వతీకంఠాభరణములో విశేషముగా యమకలక్షణ మిట్లు వచించినాడు:

శ్లో॥
విభిన్నార్థైకరూపాయా యా వృత్తిర్వర్ణసంహతేః।
అవ్యపేత వ్యపేతాత్మా యమకం తన్నిగద్యతే॥
శ్లో॥
త దవ్యపేతయమకం వ్యపేతయమకం తథా।
స్థనాస్థానవిభాగాభ్యాం పాదభేదాచ్చ భిద్యతే॥
శ్లో॥
యత్ర పాదాది మధ్యాంతాః స్థానం తేషూపకల్ప్యతే।
య దవ్యపేత మన్యద్వా తత్ స్థానయమకం విదుః॥

ఒకే రూపమును గల్గి భిన్నార్థములతో రెండుగాని (అంతకంటె ఎక్కువగాని) అక్షరగుచ్ఛములు ఆవృత్తి నొందినచో అది యమకమగును. అది అవ్యపేతము, వ్యపేతము అని రెండువిధములు. అక్షరగుచ్ఛములు వెనువెంటనే ఇతరాక్షరములతో వ్యవధానము నందకయుండినచో అది అవ్యపేత యమకము. అట్లు వ్యవధానము నందినచో నది వ్యపేతయమకము. ఈయమకములు పాదాదిలోను, పాదమధ్యంలోను, పాదాంతంలోను ఉండవచ్చును. ఆ స్థానభేదమును బట్టి యవి పాదాది, పాదమధ్య,పాదాంతస్థాన యమకములని వ్యవహరింపబడును- అని పైశ్లోకముల కర్థము.

యమకభేదము లనంతములు

భోజుని సరస్వతీ కంఠాభరణములో నింకను కొన్ని విషయము లిట్లు చెప్పబడినవి – స్పష్టముగా ఆదిమధ్యాంతములలో గాక పాదములో నేదో యొకచోట పదావృత్తి యుండినచో దానికి అస్థానయమకమని పేరు. ఆవృత్తినందు పదగుచ్ఛములో రెండక్షరములే యున్నచో దానికి సూక్ష్మమనియు, రెంటికంటె అధికముగా నున్నచో దానికి స్థూల మనియు పేర్లు. పాదమంతయు ఇంకొక పాదముగా అన్యార్థముతో ఆవృత్తి యైనచో దానికి పాదయమక మనియు, రెండుపాదము లట్లే ఆవృత్తి యైనచో సముద్గయమక మనియు, నాల్గుపాదములు ఆవృత్తములైనచో, అనగా పద్యము/శ్లోకము నందలి నాల్గు పాదములు ఆద్యంతముగా నొకే పదావృత్తి కల్గియుండియు విభిన్నార్థములైనచో దానికి మహాయమక మనియు పేర్లు.

యమకం ఒక్కపాదంలో మాత్రమున్నచో నది ఏకపాదయమకం. ఇదిపద్యం నాల్గుపాదాలలోఏదోయొక పాదములో నుండుటచేత నాల్గు విధములుగా నుండును. రెండు పాదములలో నున్న యమకం ద్విపాదయమకం. ఇది 1,2 పాదములందును, 1,3పాదములందును, 1,4పాదములందును, 2,3పాదము లందును, 2,4పాదములందును, 3,4పాదము లందును ఆఱువిధములుగా నుండవచ్చును. మూడు పాదములలో నుండు యమకం త్రిపాదయమకం. ఇది 1,2,3 పాదములలోను, 1,2,4 పాదములలోను, 1,3,4 పాదములలోను, 2,3,4 పాదములలోను నాల్గువిధములుగా నుండవచ్చును. ఇక నాల్గు పాదములలో నుండు యమకము సర్వపాదయమకము. ఇది ఒకవిధముగా నుండును. ఇట్లు పాదయమకములు 15 విధములైనవి. ఇవి పాదాదిలోను, పాదమధ్యమందును, పాదాంతమందును, ఆదిమధ్యములందును, ఆద్యంతములందును, మధ్యాంతములందును, ఆదిమధ్యాంతములందును 7 విధములుగా నుండవచ్చును. ఇట్లు వీటి సంఖ్య 15*7=105 ఐనది. వీనిలో మఱల వ్యపేత, అవ్యపేత, వ్యపేతావ్యపేతభేదములచేత వీటి సంఖ్య మఱల 105*3=345 సంఖ్యకు బెఱుగును. పై భేదములతోబాటు సూక్ష్మ,స్థూలభేదములను, అస్థానయమకభేదములను గూడ గణించినచో వీటిసంఖ్య అత్యంతముగా బెఱుగును. అందుచేతనే ‘అత్యన్తం బహవ స్తేషాం భేదాః’ అని దండి కావ్యాదర్శములో పేర్కొన్నాడు.

యమకప్రధానరచనలు

సంస్కృతాలంకారికులలో ప్రథముడుగా పరిగణింపబడు భరతముని తన నాట్యశాస్త్రములో పదిరకముల యమకములను సోదాహరణముగా పేర్కొనినాడు. దండిమహాకవి కావ్యాదర్శములో యమకచక్రమను ప్రకరణములో బహువిధమైన యమకభేదములను సోదాహరణముగా నిరూపించినాడు. 11వ శతాబ్దికి చెందిన భోజరాజు అనేక యమకభేదములను చాలా వివరముగా లక్షణోదాహరణములతో నిచ్చినాడు. కిరాతార్జునీయములో భారవి యమకముతో గూడ ననేకచిత్రకవితారీతులను ప్రదర్శించినాడు. తరువాతి 7వ శతాబ్దివాడైన మాఘకవి శిశుపాలవధకావ్యములోని ఆఱవసర్గనంతయు బహువిధ యమకాభిరామముగా చేసినాడు. ఈసర్గలోని అనేకశ్లోకములలో నతడు సముద్గయమకమును నిబంధించినాడు. అట్లే సంస్కృతములో శ్లేషయమకచక్రవర్తిగా ప్రసిద్ధుడైన వేంకటాధ్వరిమహాకవి తన లక్ష్మీసహస్రకావ్యములో ‘యమకస్తబక’మను అధ్యాయమును కేవలము యమకాలంకృత శ్లోకములకే పరిమితం చేసినాడు. తెలుఁగులో ప్రబంధకవులందఱును షష్ఠ్యంతములలోను ఆశ్వాసాంతపద్యములలోను పుష్పాపచయసందర్భములో వ్రాసిన రగడలలోను రమ్యమైన యమకాలంకారములను ప్రదర్శించినారు. పోతనగారి భాగవతములోను, వసుచరిత్రలోను, దాని ననుసరించిన పిల్లవసుచరిత్రముల లోను, కాణాదము పెద్దనగారి ముకుందవిలాసములోను కవులు కథాభాగమునందునుకొన్నిపద్యములను యమకాలంకృతముగా వ్రాసినారు. కాని సంస్కృతములో మాఘునివలె, వేంకటాధ్వరివలె నొక ఆశ్వాసము నంతయు యమకాలంకారమయముగా చేసిన కవులు తెలుగులో నరుదుగా నున్నారు. అట్టివారిలో చంద్రికాపరిణయప్రబంధకర్త యగు సురభిమాధవరాయలు ముఖ్యుఁడు.ఇతఁడీ ప్రబంధములోని చతుర్థాశ్వాసమునంతయు యమకాలంకార మయము చేసినాడు. ఏకపాదయమకంఅంత రమ్యంగా నుండకపోవుటచే, యమకబాహుళ్యము గల కావ్యభాగములలో కవులు తదన్యమైన పాదయమకములనే ప్రధానముగా గ్రహించినారు. మాధవరాయలు సైతము ఈపద్ధతినే పాటించినాడు.

చంద్రికాపరిణయంలోని కొన్ని యమకభేదములు

ప్రతిపద్యంలోను ఏదోయొక యమకవిశేషం గల్గిన చంద్రికాపరిణయంలోని చతుర్థాశ్వాసమునందలి యమకభేదాలనుగఱించి చెప్పుటకు ముందు, అందులో గల కథాంశమును సంగ్రహంగా చెప్పడం యుక్తంగా ఉంటుంది. ఈ ఆశ్వాసంలో మొదట నాయకుఁడగు సుచంద్రుఁనియొక్క విరహావస్థ వర్ణితమైంది. తరువాత నాయికయగు చంద్రికయొక్క విరహము, వసంతర్తువర్ణనము, విరహబాధావృతమైన ఆమె మనమును అన్యాక్రాంతము చేయుటకు చెలికత్తెలు చేయు ప్రకృతివర్ణనలు, పుష్పాపచయము, జలకేళి, మన్మథార్చనము, సంధ్యాకాల, చంద్రోదయచంద్రికావర్ణనలు, మదన,చంద్ర,చంద్రికా, మలయ మారుతాదుల ఉపాలంభనము, చివరికి ఉషఃకాల సూర్యోదయాదుల వర్ణనలు చేయబడినవి. ఇందులోని ప్రతిపద్యము యమకాలంకారభూషితమే యైనను, వానిలో వివిధయమక భేదములకు విశిష్టోదాహరణములుగా నీయదగిన కొన్నిపద్యములను మాత్రము నేనిట పేర్కొంటాను. అత్యంతప్రౌఢమైన యీ పద్యములందలి యమకాలంకారవిశేషములను గ్రహించుటకును, వానిని సరిగా అర్థము చేసికొనుటకును, తద్ద్వారా భాషాజ్ఞానమును పెంపొందించుకొని పూర్వపద్యకావ్యములయం దాసక్తిని పెంచుకొనుటకును వీలుగా కీర్తిశేషులైన కొల్లాపురసంస్థానస్థమహాపండితులు వెల్లాల సదాశివశాస్త్రిగారు, అవధానం శేషశాస్త్రిగారు రచించిన టీకతో గూడ నీపద్యముల నిచ్చట నిచ్చుచున్నాను. ఈ సవ్యాఖ్యానచంద్రికాపరిణయప్రతి నాచే యూనికోడు తెలుగులిపిలో పునర్లిఖితమై ఈమాట అంతర్జాలపత్రికా గ్రంథాలయములో లభించుచున్నది (యూనికోడ్ ప్రతి).

  1. సుచంద్రుని విరహవర్ణన సందర్భములోనిదైన ఈసీస మనేకయమకలక్షణసముపేతమై యున్నది:
    సీ.
    అహిరోమలతికపొం◊దందినఁ గాని నొం-
    పఁగ రాదు మలయాగ◊మారుతములఁ,
    గనకాంగికౌఁగిలి ◊యెనసినఁ గాని పెం-
    పఁగ రాదు మధుపభా◊మారుతముల,
    ఘనవేణిఁ గూడి మిం◊చినఁ గాని రూపుదూ-
    ల్పఁగ రాదు శశభృన్న◊వప్రకరముల,
    వనజారివదనఁ జే◊రినఁ గాని సిరు లడం
    పఁగ రాదు వనసంభ◊వప్రకరముల,
    తే.
    ననుచు రాజీవనేత్రమో◊హంబు చాల
    ననుచు రాజీవసాయకా◊నల్పభయము
    మలయ గాహితచింతమైఁ ◊గలఁగఁ జిత్త
    మల యగాహితనిభుఁడు తా◊పాప్తి నడల. 5

    ఈ సీసము ‘పగరాదు’ అను సర్వపాదమధ్యయమకమునకు, ‘మారుతముల’ అను ప్రథమద్వితీయపాదాంతయమకమునకు, ‘వప్రకరముల’ అను తృతీయచతుర్థపాదాంతయమకమునకు ఉదాహరణముగా నున్నది. తేటగీతి ‘ననుచు రాజీవ’ అను ప్రథమద్వితీయపాదాదియమకమునకు,‘మలయ గాహిత’ అను తృతీయచతుర్థపాదాదియమకమునకు ఉదాహరణముగా నున్నది. ఇవన్నియు వ్యపేతయమకములే. ఇట్లక్షరగుచ్ఛసామ్యమున్నను, క్రింద నిచ్చిన టీకలో వివరించినట్లుగా వాని యర్థములు వేఱుగా నున్నవి.

    టీక: అహిరోమలతికపొందు =సర్పతుల్యమగు నూఁగారు గల చంద్రికయొక్కసాంగత్యమును; అందినఁ గాని = పొందిననే గాని; మలయాగమారుతముల = మలయాచలసంబంధులగు గాడ్పులను; నొంపఁగ రాదు = నొప్పించుట కలవిగాదు. అనఁగా చంద్రిక సర్పతుల్యమైన రోమావళి గలది గావున తత్సాంగత్యమున వాయువును గెలువ వచ్చు ననుట. సర్పములు వాతాశనము లగుట ప్రసిద్ధము.

    కనకాంగికౌఁగిలి = సంపెఁగనుబోలు నంగములు గలదానియొక్క యాలింగనమును; ఎనసినఁ గాని = పొందినఁగాని; మధుపభామారుతములన్ = ఆఁడుతుమ్మెదలయొక్క రొదలను; పెంపఁగరాదు = నశింపఁజేయుట కలవి గాదు. చంద్రిక చంపకాంగి గావున ఆమెకౌఁగిటఁ జేరినచో తేంట్ల నడఁపవచ్చు ననుట.

    సంపెఁగకు తేంట్లకు గల విరోధము ప్రసిద్ధము. తేంట్లరొద విరహము నుద్దీపన చేయునని కవిసంప్రదాయము.

    ఘనవేణిన్= మేఘమువంటి జడగలదానిని; కూడి = పొంది; మించినన్ కాని = అతిశయించిననే కాని; శశభృన్నవప్రకరములన్ = చంద్రునియొక్క నూతనమగు ప్రకృష్టకిరణములను; రూపుదూల్పఁగ రాదు = రూపుమాప నలవిగాదు. చంద్రిక జలదము వంటివేణి గలదిగావున దానిసాంగత్యమునఁ జంద్రకిరణములఁ గప్పవచ్చు ననుట.

    వనజారివదనన్=చంద్రునిఁబోలు మోముగలదానిని; చేరినన్ కాని=పొందిననేకాని; వనసంభవప్రకరములన్=తమ్ములయొక్క సమూహములయందు; సిరులడంపఁగ రాదు =కాంతుల నడఁచుటకు నలవిగాదు. చంద్రిక చంద్రునివంటి మోముగలది గావున దానిఁ జేరి కమలముల సిరుల నడంప వచ్చు ననుట.

    ననుచు రాజీవనేత్రమోహంబు – అనుచున్= ఇట్లు వచించుచు, రాజీవనేత్రమోహంబు=చంద్రికయందలి యనురాగము; చాలన్=మిక్కిలి; ననుచు రాజీవసాయ కానల్పభయము – ననుచు = వృద్ధిఁబొందించుచున్న, రాజీవసాయక=మరునివలననైన, అనల్పభయము=అధికమైన భీతి;

    మలయ గాహితచింతమైన్ -మలయన్=ఉద్రేకింపఁగా, గాహితచింతమైన్ = పొందఁబడినచింతచేత; చిత్తము=హృదయము; కలఁగన్=కలఁతపాఱఁగా; అల యగాహితనిభుఁడు= ఇంద్రతుల్యుఁడైన యాసుచంద్రుఁడు; తాపాప్తిన్=సంతాపప్రాప్తిచేత; అడలన్=తపింపఁగా – దీనికి ‘తనర్చెన్’ అను నుత్తరపద్యస్థక్రియతో నన్వయము.

  2. విరహాతురయైన చంద్రిక తన ప్రియుడగు సుచంద్రుని చిత్రమును లిఖించి, దాని నీక్షించుచు, ప్రత్యక్షప్రియసందర్శనము లభించినట్లుగా భావించుచున్నవిరహావస్థను వర్ణించు నీక్రింది పద్యము తృతీయచతుర్థపాదములందు పాదమధ్యమునుండి అంతమువఱకు సాగు ‘యమహాఫలకాలసమాన రూపమున్’ అను వ్యపేతయమకమున కుదాహరణము:
    చ.
    కనుదొవదోయి నిర్నిమిష◊గౌరవ మందఁగ నబ్బురంబుతో
    ననుపమరక్తితోఁ బ్రియమ◊హాఫలకాలసమానరూపమున్
    గనుఁగొను నెప్పు డెప్పు డల◊కామిని యాతఱి యెల్ల నెన్నఁగా
    ననువుగఁ బొల్చెఁ బూనియ మ◊హాఫలకాలసమానరూపమున్. 19

    టీక: అలకామిని = ఆచంద్రిక; ప్రియమహాఫలకాలసమానరూపమున్ – ప్రియ=ప్రియుఁడగు సుచంద్రునియొక్క, మహాఫలక = గొప్పపలకయందు, ఆలసమాన=మిగులఁ బ్రకాశించుచున్న, రూపమున్=స్వరూపమును; అబ్బురంబుతోన్ = ఆశ్చర్యముతోను; అనుపమరక్తితోన్ = సాటిలేని యనురాగముతోను; కనుదొవదోయి = కలువలవంటికన్నుఁగవ; నిర్నిమిష గౌరవము = ఱెప్పపాటిలేమియొక్క యాధిక్యమును; అందఁగన్=పొందునట్లుగా; ఎప్పుడెప్పుడు=ఏయేసమయమునందు; కనుఁగొనున్ = చూచునో; ఆతఱి యెల్లన్ = ఆసమయమంతయు; ఎన్నఁగాన్=పరికింపఁగా; మహాఫలకాల సమానరూపమున్ – మహత్ = గొప్పదియైన, ఫలకాల=ప్రియసమాగమకాలమునకు, సమానరూపమున్=తుల్యరూపమును; పూనియ=పొందియే; అనువుగన్=అనుకూలముగా;పొల్చెన్=ఒప్పెను. ఆచంద్రిక కాలక్షేపార్థము పలకయందు వ్రాయఁబడిన తన ప్రియునిరూపము నెప్పు డెప్పు డనురాగాతిశయమున నవలోకించునో అప్పుడు ప్రత్యక్షప్రియసంగమువలె నామెకు భాసిల్లు నని భావము.

  3. చంద్రికావిరహవర్ణనపద్యపరంపరలోనిదైన ఈక్రింది పద్యము’నలినసమాననా’ అను ప్రథమతృతీయపాదాదియమకమునకును, ‘మలయసమీరణా’ అను ద్వితీయచతుర్థపాదాదియమకమునకును ఉదాహరణముగా నున్నది.
    చ.
    నలినసమాననా ధృతిఘ◊నత్వ మడంచె రుషార్చి నెమ్మదిన్
    మలయ సమీరణాళికుసు◊మవ్రజబోధిత భృంగశింజినిన్
    నలి నసమాన నాల సుమ◊న శ్శర మండలిఁ గూర్చి నొంచుచున్
    మలయసమీరణాఖ్యరథ◊మధ్యగుఁడై ననవిల్తుఁ డుద్ధతిన్. 25

    టీక: ననవిల్తుఁడు=పుష్పధన్వి యగు మరుఁడు; ఉద్ధతిన్=దర్పముచేత; మలయసమీరణాఖ్యరథమధ్యగుఁడై =మలయమారుత మను పేరిటితేరి నడుమ నుండినవాఁడై; సమీరణాళికుసుమవ్రజబోధిత భృంగశింజినిన్ –సమీరణాళి=మరువపుచాలు యొక్క, కుసుమవ్రజ=పూమొత్తములచేత, బోధిత= మేల్కొల్పఁబడిన, భృంగ=తుమ్మెదలనెడు, శింజినిన్=అల్లెత్రాటియందు; నలిన్ = మిక్కిలి; అసమాననాలసుమనశ్శరమండలిన్= సాటిలేని కాఁడలుగల పూవుటమ్ములయొక్కగుంపును; కూర్చి= సంధించి; నొంచుచున్=నొవ్వఁజేయుచు; రుషార్చి =రోషజ్వాల; నెమ్మదిన్=నిండుమనమునందు; మలయన్=వ్యాపింపఁగ; నలినసమాననాధృతిఘనత్వము – నలినసమాననా = తమ్మినిఁబోలు మోముగల చంద్రికయొక్క, ధృతి=ధైర్యముయొక్క, ఘనత్వము = ఆధిక్యమును; అడంచెన్=అడఁగఁజేసెను.

    అనఁగామలయమారుతభ్రమరఝంకారాదులచేఁ జంద్రికకు సంతాప మెక్కుడై యాసుచంద్ర నరేంద్రునిపొందు లేక నిలువఁజాల నను నధైర్య ముదిత మయ్యె ననుట.

  4. వసంతమందలి కోకిలాలాపములు, పుష్పపల్లవశోభితమైన యడవులు దూరదేశగతులైన విరహులకు దుంఖకారకమయ్యె నని వర్ణించు నీ క్రింది పద్యముద్వితీయతృతీయపాదములందలి పాదాదియమకమున కుదాహరణము.
    మ.
    కలకంఠీకులపంచమస్వరగృహ◊త్కాంతారవారంబులన్
    దలిరా కాకమలేశ్వరాత్మజ మహ◊స్త్వంబున్ సుమచ్ఛాయకం
    దలి రాకాకమలేశ్వరాత్మజ మహ◊స్త్వంబున్ గడుం బూని క
    న్నుల కుద్వేలభయంబు గూర్ప మఱి పాం◊థుల్ గుంది రప్పట్టునన్. 40

    టీక: అప్పట్టునన్=ఆసమయమందు; కలకంఠీకులపంచమస్వరగృహత్కాంతారవారంబులన్ – కలకంఠీకుల=కోకిలస్త్రీల గుంపులయొక్క, పంచమస్వర=తజ్జాతినియత మగు పంచమరాగమునకు, గృహత్=గృహమువలె నాచరించుచున్న, ఆశ్రయ మైన యనుట, కాంతారవారంబులన్=అరణ్యసమూహములయందు; తలిరాకు=చిగురుటాకు; ఆకమలేశ్వరాత్మజ మహస్త్వంబున్ – ఆకమలేశ్వరాత్మజ=ఆలక్ష్మీపతియైన విష్ణువుయొక్క తనూజుఁడైన మన్మథునియొక్క, మహస్త్వంబున్= ప్రతాపభావమును; సుమచ్ఛాయకందలి – సుమ=కుసుమములయొక్క, ఛాయ=కాంతులయొక్క,కందలి=మొలక, ఇట ‘ఛాయా బాహుల్యే’ అను సూత్రముచేత ఛాయాశబ్దమునకు నపుంసకత్వము; రాకాకమలేశ్వరాత్మజమహస్త్వంబున్ = పూర్ణిమాచంద్ర ప్రకాశభావమును, కమలేశ్వరుఁడనగా జలాధిపతియగు సముద్రుడు, అతని యాత్మజుఁడు చంద్రుఁడు,‘సలిలం కమలం జలమ్’ అనియు, ‘పూర్ణే రాకా నిశాకరే’ అనియు నమరుఁడు; కడున్=మిక్కిలి; పూని=వహించి; కన్నులకున్= చూపులకు; ఉద్వేలభయంబున్=అధికమైన వెఱపును; కూర్పన్=ఘటిల్లఁజేయఁగా; పాంథుల్=తెరువరులు; మఱి=మిగులను; కుందిరి= దుఃఖించిరి.

    అడవులయందుఁ గోకిలాలాపములు, నవపల్లవములు, కుసుమస్తోమకాంతియుఁ బాంథులకు దుస్సహములై ప్రియావియోగదుఃఖము నతిశయింపఁజేసె నని తాత్పర్యము.

  5. పైన ప్రథమద్వితీయ, ప్రథమతృతీయ, ద్వితీయతృతీయ, ద్వితీయచతుర్థ, తృతీయచతుర్థ పాదగతద్విపాదవ్యపేతయమకములైదింటికి ఉదాహరణ లీయబడినవి. ఇటువంటి పద్యము లింకను అనేకముగా చంద్రికాపరిణయములో నున్నవి. కాని ఆఱవదైన ప్రథమచతుర్థపాదగతయమకము నాకీ కావ్యములో గన్పడలేదు. అది అంత రమ్యముగా నుండకపోవుటచే మాధవరాయ లట్టి పద్యమును వ్రాయకుండవచ్చును. ఇక లోగడ నాల్గు తెఱగులుగా నుండునని చెప్పిన పాదత్రయగతయమకములకు కొన్ని ఉదాహరణ లిత్తును. ద్వితీయ,తృతీయ, చతుర్థపాదగత పాదాదియమకసహితములైన పద్యము లనేకము లీగ్రంథములో నున్నవి. వానిలో నొకటి చంద్రికావిరహవర్ణనమందలి ఈక్రింది పద్యము:
    మ.
    జననాథస్మర చింతనా పరవశ ◊స్వాంతంబునం బొల్చుకో
    కనదామోద రయంబుచేఁ గమిచి పొం◊గంజేసెఁ దాపంబుఁ జ
    క్కన దామోదరసూను ఘోటపటలీ ◊గాఢధ్వనిశ్రేణి యా
    కనదామోదరసాప్త భృంగకుల ఝం◊కారంబు లప్పట్టునన్. 16

    టీక: అప్పట్టునన్=ఆసమయమందు; దామోదరసూనుఘోటపటలీగాఢధ్వనిశ్రేణి – దామోదరసూను=మరునికి, ఘోట= అశ్వములగు చిల్కలయొక్క, పటలీ=గుంపుయొక్క, గాఢధ్వనిశ్రేణి = తీవ్రమైన ధ్వనిపరంపర; ఆకనదామోదరసాప్తభృంగ కులఝంకారంబులు – ఆకనత్=మిగులఁ బ్రకాశించుచున్న, ఆమోదరస=సంతోషరసమును, ఆప్త=పొందిన, భృంగకుల= తేఁటిగుంపులయొక్క, ఝంకారంబులు= మ్రోఁతలు; జననాథస్మరచింతనాపరవశ స్వాంతంబునన్ – జననాథస్మర= మరునిఁ బోలు సుచంద్రునియొక్క, చింతనా=ధ్యానమునకు, పరవశ=ఆయత్తమైన, స్వాంతంబునన్=మనస్సుచేత; పొల్చు కోకనదామోదన్ = ఒప్పుచున్న పద్మగంధియగు చంద్రికను, కోకనదము లనఁగా రక్తోత్పలములు, వానియామోదమువంటి యామోదము (గంధము) గలది కోకనదామోద ; రయంబుచేన్=వేగముచేత; కమిచి=పట్టుకొని; తాపంబున్=సంతాపమును;చక్కనన్ = బాగుగను; పొంగంజేసెన్ = ఉప్పొంగునట్లు చేసెను.

    శుకకూజిత భ్రమరఝంకారములచేఁ జంద్రికసంతాపము మిక్కిలి యుప్పొంగుచుండెనని సారాంశము.

  6. మదనోపాలంభనసందర్భములోని ఈక్రిందిపద్యము ద్వితీయ,తృతీయ, చతుర్థపాదగత పాదాంతయమకమున కుదాహరణమై యున్నది.
  7. చ.
    కలుగునె నీకు సద్యశ మ◊ఖండరుషాగతి నిస్వనద్గుణో
    జ్జ్వలవిశిఖాసముక్తశిత◊సాయకధారఁ గృపీటజాంబకా
    వలిఁ గర మేఁచఁ ద్వద్బలని◊వారకసారకృపీటజాంబకా
    తులితభుజాసహోమహిమఁ ◊దూల్చినఁ గాక కృపీటజాంబకా! 115

    టీక: కృపీటజాంబకా=ఓపద్మబాణుఁడవైన మదనా! త్వద్బల నివారక సార కృపీటజాంబ కాతులిత భుజాసహోమహిమన్ – త్వత్=నీయొక్క, బల=సామర్థ్యమునకు, నివారక=వారించునది యైన, సార=శ్రేష్ఠమైన, కృపీటజాంబక=వహ్నినేత్రుఁడైన శివునియొక్క, అతులిత=సాటిలేని, భుజాసహః=బాహుబలముయొక్క, ‘సహో బల శౌర్యాణి’ అని యమరుఁడు,మహిమన్ =అతిశయమును; తూల్చినన్ కాక=తూలఁజేసిననే కాని; అఖండరుషాగతిన్=అవిచ్ఛిన్నరోషప్రాప్తిచేత; నిస్వన ద్గుణోజ్జ్వల విశిఖాసముక్త శితసాయక ధారన్ – నిస్వనత్=మ్రోయుచున్న, గుణ=అల్లెత్రాటిచేత, ఉజ్జ్వల=ప్రకాశించుచున్న, విశిఖా= ధనుస్సుచేత, సముక్త=విడువఁబడిన, శితసాయక=తీక్ష్ణమగు బాణములయొక్క, ధారన్=అంచుచేత; కృపీటజాంబకావలిన్ – కృపీటజ=జలజములవంటి, అంబకా=నేత్రములు గల స్త్రీలయొక్క, ఆవలిన్=సమూహమును; కరము=మిక్కిలి; ఏఁచన్= బాధింపఁగా; నీకున్; సద్యశము = మంచిఖ్యాతి; కలుగునె=జనించునా?

    వహ్నినేత్రుఁడైన శివుఁడు నీభుజబలమును నశింపఁజేసినను ఇంకను నీ తీక్ష్ణమైన బాణములచేత జలజాక్షులను మిక్కిలి బాధించుటవల్ల నీకు కీర్తి గల్గున మదనా? – అని సారాంశము.

  8. మదనబాధ నుపశమింపజేయుటకై చెలికత్తెలు చంద్రికను కేళీగృహమునకు గొనితెచ్చుటను వర్ణించు నీక్రింది పద్యము ప్రథమ,ద్వితీయ,తృతీయ పాదగతపాదాదియమకసహితమై యున్నది.
  9. చ.
    నలినకరాలలామక మ◊నస్థభయంబు తలంగఁ జేసి వే
    నలి నకరాలసత్ప్రియము◊నం జలజాస్త్రుప్రసాద ముంచి చా
    న లినకరాలఘుక్రమము◊నన్ దొవతీవియ నా స్మరాశుగా
    వలులఁ దలంకుకొమ్మ గొని ◊వచ్చిరి కేళినిశాంతసీమకున్. 90

    టీక: నలినకరాలలామకమనస్థభయంబు – నలినకరాలలామక=పద్మములవంటి కరములుగల స్త్రీలయందు శ్రేష్ఠురాలైన చంద్రికయొక్క, మనస్థభయంబు= మనోగతమైనభీతి; తలంగన్ చేసి =తొలఁగునట్లు చేసి; వేనలిన్ =కొప్పునందు; అకరాలసత్ప్రియ మునన్ =అకుటిలమై శ్రేష్ఠమైన ప్రీతిచేత; జలజాస్త్రుప్రసాదము=మన్మథుని ప్రసాదమును; ఉంచి = నిల్పి; చానలు=స్త్రీలు; ఇనక రాలఘుక్రమమునన్ – ఇనకర=సూర్యకిరణములయొక్క, అలఘుక్రమమునన్=అధికప్రసరణముచేత; తొవతీవియ నాన్ = కలువతీవయో యనునట్లు; స్మరాశుగావలులన్= మదనబాణపరంపరలచేత; తలంకుకొమ్మన్=భయపడుచున్నచంద్రికను; కేళినిశాంతసీమకున్=కేళీగృహప్రదేశమునకు; కొనివచ్చిరి = తెచ్చిరి. అనఁగా నాస్త్రీలు చంద్రిక నూఱడించి, యామె మనోగత భీతిని దొలంగఁజేసి, ప్రీతితోడ స్మరప్రసాదమును నామెతుఱుమునం దుఱిమి, తీవ్రసూర్యకిరణప్రసరణమునకుఁ గలువతీఁగెవోలె స్మరాస్త్రములకు భీతిల్లు నామెను కేళీగృహమునకుఁ దోడి తెచ్చిరని సారాంశము.

    ఇక ప్రథమ,ద్వితీయ,చతుర్థపాదగతయమకములును, ప్రథమ,తృతీయ,చతుర్థపాదగతయమకములు గల త్రిపాదియమకపద్యము లీయాశ్సాసములో నాకు గన్పడ లేదు. అవి అంత రమ్యములు గాకపోవుటచే అట్టిపద్యములను మాధవరాయలు వ్రాయలేదనిపించును.

  10. నాల్గుపాదములందును ఒకే అక్షరగుచ్చము యమకముగా నుండు పద్యము లనేకములు చతుర్థాశ్వాసములో నున్నవి. జలక్రీడావర్ణనమందలి ఈక్రింది పద్యములో పద్యారంభంలోని ‘తమ్ముల’ అనే పదంతో యతిస్థానంలోని ‘తమ్ముల’తో చతుష్పాదవ్యపేతయమకం యొక్క కల్పన అత్యంత మనోహరముగా నున్నది.
    ఉ.
    తమ్ములఁ జేరి రోదరశ◊తమ్ములఁ గైకొని తావి భృంగపో
    తమ్ముల కుంచి యౌవతయు◊తమ్ముల మత్తమరాళరాజజా
    తమ్ముల మించి చిత్రచరి◊తమ్ముల నీఁదిరి కొమ్మ లెల్లఁ జి
    త్తమ్ముల వారిదేవతలు ◊తమ్ము లలిన్ వినుతింప నయ్యెడన్. 69

    టీక: అయ్యెడన్=ఆసమయమునందు; కొమ్మ లెల్లన్=స్త్రీలందఱు; తమ్ములన్=పద్మములను; చేరి=పొంది; రోదరశత మ్ములన్ = చక్రవాకశతములను; కైకొని=స్వీకరించి; తావిన్=పరిమళమును; భృంగపోతమ్ములకున్ =తుమ్మెదబిడ్డలకు; ఉంచి = నిల్పి; యౌవత=యువతీసమూహముతో; యుతమ్ములన్=కూడియుండినట్టి; మత్తమరాళరాజజాతమ్ములన్ – మత్త=మదించిన, మరాళరాజ=రాజహంసశ్రేష్ఠములయొక్క, జాతమ్ములన్= సమూహములను; మించి=అతిశయించి; వారిదేవతలు =జలాధిదేవతలు; చిత్తమ్ములన్=మనస్సులయందు; తమ్మున్=తమను; లలిన్=ప్రేమతో; వినుతింపన్=కొని యాడఁగా; చిత్రచరితమ్ములన్ = ఆశ్చర్యకరమైన వ్యాపారములచేత; ఈఁదిరి=జలక్రీడ సల్పిరి.

    అనఁగా నాస్త్రీలు కొలను ప్రవేశించి తమ్ము జలాధిదేవతలు కొనియాడునట్లు పైఁజెప్పిన విధముగ నీఁది రనుట.

  11. వసుచరిత్రములోని ‘లలనాజనాపాంగ’ యనుపద్యమునకు దీటైన వసంతారంభమును వర్ణించుచున్న రమ్యమైన యీ సీసము ప్రతిపాదమందును మూడేసి వ్యపేతతుల్యవర్ణగుచ్ఛములతోను, తేటగీతి రెండేసి అవ్యపేతతుల్యవర్ణగుచ్ఛములతోను, ఒక వ్యపేతతుల్యవర్ణగుచ్ఛముతోను అలరారుచున్నది.
    సీ.
    సుమనోగసమ చూత◊ సుమనోగణ పరీత
    సుమనోగణిత సార◊ శోభితాళి,
    కలనాదసంతాన◊ కలనాద సమనూన
    కలనా దలిత మాన◊బల వియోగి,
    లతికాంతరిత రాగ◊ లతికాంతసపరాగ
    లతికాంతపరియోగ◊లక్ష్యకాళి,
    కమలాలయాస్తోక◊ కమలాలయదనేక
    కమలాలసితపాక◊కలితకోకి,
    తే.
    జాలకవితానవితాన◊పాళిభూత
    చారుహరిజాతహరిజాత◊తోరణోల్ల
    సద్వ్రతతికావ్రతతికావ్ర◊జక్షయాతి
    భాసురము పొల్చె వాసంత◊వాసరంబు. 27

    టీక: సుమనోగ సమ చూత సుమనోగణ పరీత సుమనోగణిత సార శోభితాళి – సుమనోగ=కల్పవృక్షముతోడ, సమ=తుల్య మగు, చూత=మావులయొక్క, సుమనోగణ=కుసుమకదంబముచేత, పరీత=వ్యాప్తమైన, ఇది అళివిశేషణము, సుమనః = మంచిమనస్సులయందలి, అగణిత=అధికమైన, సార= సామర్థ్యముచేత, శోభిత=ప్రకాశించుచున్న, అళి=తుమ్మెదలు గలది.

    అనఁగా రసాలకుసుమముల నాశ్రయించినవి మనస్సులయం దగణితసామర్థ్యము గలవి యగు తుమ్మెదలు గల దనుట, ఇది వాసంతవాసరమునకు విశేషణము. ముందు నిట్లె తెలియవలయు.

    కలనాదసంతాన కల నాద సమనూన కలనా దలిత మానబల వియోగి – కలనాదసంతాన =కోయిలగుంపుయొక్క, కల= అవ్యక్త మధురమైన, నాద=ధ్వనియొక్క, సమనూన = మిగుల నధికమైన, కలనా=ఆకలనముచేత, అనఁగా వినికిచేత, దలిత = పోఁగొట్టఁబడిన, మానబల=కోపసామర్థ్యము గల, వియోగి=విరహులు గలది. అనఁగా కోకిలాలాపసమాకలనముచేత విరహిజన మానబలము పోయిన దనుట.

    లతికాంతరిత రాగ లతికాంత సపరాగ లతికాంత పరియోగ లక్ష్య కాళి – లతికాంతరిత=తీవెలచేతఁ గప్పఁబడిన, రాగ=దాడిమలయొక్క, లతికా=కొమ్మలయొక్క, అంత=మనోజ్ఞమగు, సపరాగ=పుప్పొడితోఁ గూడిన, లతికాంత=పువ్వులయొక్క, పరియోగ = సంపర్కముచేత, లక్ష్య=చూడఁదగిన, క=ఉదకముయొక్క, ఆళి=శ్రేణులు గలది. అనఁగా వసంతవాసరమున జలహ్రదాదులు పుప్పొడితోఁ గూడి వ్రాలిన దాడిమీ కుసుమములచేఁ జూడ సొంపుగా నుండు ననుట.

    కమలాల యాస్తోక కమలాలయ దనేక కమలాలసిత పాక కలిత కోకి – కమలాలయ=పద్మాకరములయొక్క, అస్తోక= అధికములగు, ఇది కమలములకు విశేషణము, కమలా=లక్ష్మీదేవికి, ఆలయత్=గృహమువలె నాచరించుచున్న, అనేక= అసంఖ్యాకములైన, కమలా=పద్మములయందు, ఆలసిత=మిగులఁ బ్రకాశించుచున్న, పాక=పిల్లలతోడ,‘పోతః పాకోర్భకో డిమ్భః’ అని యమరుఁడు, కలిత=కూడుకొనిన, కోకి=ఆఁడుజక్కవలు గలది. ఈసమాసముమీఁద సమాసాంతవిధి యనిత్య మగుటఁ జేసి ‘నద్యృతశ్చ’ అని కప్ప్రత్యయము లేదు. కొలఁకులయందు వసంతవాసరమున చక్రవాకస్త్రీలు బిడ్డలతో నివసించి రాజిల్లుచుందు రనుట.

    జాలక వితానక వితాన పాళిభూత చారు హరిజాత హరిజాత తోరణోల్లసద్వ్రతతి కావ్రతతికా వ్రజ క్షయాతిభాసురము – జాలక= మొగ్గలయొక్క, వితానక=సమూహమనెడు, వితాన=మేలుకట్టుచేతను, పాళిభూత= బారులుగా నున్న, చారు= మనోజ్ఞములైన, హరిజాత=మన్మథునికి, హరిజాత= వాహనములైన చిలుకలగుంపనెడు, తోరణ=తోరణముచేతను, ఉల్లసత్ =ప్రకాశించుచున్న, వ్రతతి=తీవెలయొక్క, కావ్రతతికా=ఈషల్లతలయొక్క, పక్కకొమ్మలయొక్క యనుట, ‘ఈషదర్థేచ’ అను సూత్రముచేత కుశబ్దమునకు కాదేశము, వ్రజ=సంఘములనెడు, క్షయ=గృహములచేత, ‘నివేశః శరణం క్షయః’ అని యమరుఁడు, అతి భాసురము = మిగులఁ బ్రకాశమాన మైనది. అనఁగా వసంతవాసరమున లతాగృహములు మొగ్గలగుంపు లనెడు మేలుకట్లచేతను, చిల్కలబారు లనెడు తోరణములచేతను విలసిల్లుచుండు ననుట; వాసంతవాసరంబు=వసంతదినము; పొల్చెన్=ఒప్పెను.

    మంజు లానేక కుసుమవ ద్వంజులాది కాగమము – మంజుల=మనోజ్ఞమగు, అనేక=అసంఖ్యాకములగు, కుసుమవత్= పుష్ప ములు గల్గిన, వంజుల=అశోకవృక్షము, ఆదిక=మొదలుగాఁగల, ఆగమము = వృక్షములు గలదియు నగు; చైత్రికాగమంబు = చైత్ర మాసము రాక, ‘ స్యాచ్చైత్రే చైత్రికో మధుః’ అని యమరుఁడు; ఇలన్=భూమియందు; పొల్చెన్= ప్రకాశించెను.

  12. చెలికత్తెలు నాయిక యగు చంద్రిక కావసంతవైభవమును గూర్చి వర్ణించు నీమనోహరమైన సీసము ప్రతిపాదమందును రెండేసి అవ్యపేతసూక్ష్మ యమకములను కల్గి యున్నది. తేటగీతి నాల్గుపాదములందును ఒక్కొక్క అవ్యపేతసూక్ష్మయమకమున్నది.
    సీ.
    బాలాంబుజతమాలమాలాభినవజాల
    జాలామృతోల్లోల◊షట్పదౌఘ,
    రాగాదిపరమాగమాగాంతసుపరాగ
    రాగావరణభాగ◊రాళపవన,
    కేలీగృహన్మౌలిమౌలిస్థితపికాలి
    కాలీనరవలోలి◊తాధ్వగాత్మ,
    రాజీవశరవాజివాజీననిరతాజి
    తాజీజనకరాజి◊తామ్రఫలిక,
    తే.
    భవ్యఋతుకాంతకాంతతా◊త్పర్యసృష్ట
    ఘనవిషమబాణబాణసం◊ఘాతకలిత
    తిలకమధుగంధగంధసం◊చులుకితాశ
    కనదచిరధామధామ యి◊వ్వనిక గంటె. 53

    టీక: బాలాంబుజ తమాలమాలాభినవ జాలజా లామృ తోల్లోల షట్ప దౌఘ – బాల=లేఁతనైన, అంబుజ=తమ్ములయొక్క యు, తమాలమాలా=కానుగపంక్తులయొక్కయు, అభినవ=క్రొత్తనగు, జాలజాల=మొగ్గలగుంపుయొక్క, అమృత=పూఁ దేనియయందు, ఉల్లోల=మిక్కిలి యాసక్తములైన, షట్పద=తుమ్మెదలయొక్క,ఓఘ=సమూహము గలది;

    రాగాది పరమాగ మాగాంత సుపరాగ రాగావరణభా గరాళ పవన – రాగాది=దాడిమీవృక్షము మొదలుగాఁగల, పరమ= శ్రేష్ఠము లైన, అగమ=వృక్షములయొక్క, అగాంత=పుష్పములయొక్క,సుపరాగ=మంచిపుప్పొడియొక్క, రాగ=రక్తిమ యొక్క, ఆవరణ=ఆచ్ఛాదనమును, భాక్=పొందిన, అరాళ=కుటిలములగు, పవన=వాయువులు గలది;

    కేళీగృహ న్మౌలి మౌలి స్థిత పికాలికాలీన రవ లోలి తాధ్వగాత్మ – కేళీగృహత్=విహారగృహములగుచున్న, మౌలి=అశోక వృక్షములయొక్క, మౌలి=అగ్రములయందు, స్థిత=ఉండిన, పికాలికా=కోకిలపంక్తులయొక్క, అలీన=స్ఫుటమైన, రవ= ధ్వనిచేత, లోలిత=చలింపఁజేయఁబడిన, అధ్వగ=పాంథులయొక్క, ఆత్మ=మనములు గలది;

    రాజీవశర వాజి వాజీన నిరతాజి తాజీ జనక రాజి తామ్రఫలిక – రాజీవశర=మన్మథునికి, వాజి=అశ్వములైన, వాజీన=పక్షి శ్రేష్ఠములయొక్క, నిరతాజిత = ఎల్లప్పుడు నోటువడని, ఆజీ=కలహములకు, జనక=హేతువైన, రాజిత=ఒప్పుచున్న, ఆమ్ర ఫలిక = మావిపండ్లు గలది;

    భవ్య ఋతుకాంత కాంతతాత్పర్య సృష్ట ఘన విషమబాణబాణ సంఘాత కలిత తిలక మధు గంధ గంధ సంచులుకితాశ – భవ్య= మనోజ్ఞమైన, ఋతుకాంత=వసంతునిచేత, కాంతతాత్పర్య=మంచియాసక్తిచేత, సృష్ట=సృజింపఁబడిన, ఘన=అధి కములైన, విషమబాణబాణ= మన్మథుని బాణములైన పుష్పములయొక్క, సంఘాత=సముదాయముతో, కలిత=కూడు కొన్న, తిలక= బొట్టుగుచెట్లయొక్క,

    మధు=మకరందముయొక్క, గంధ=పరిమళముయొక్క, గంధ=లేశముచేత, ‘గన్ధో గన్ధక ఆమోదే లేశే సంబంధ గర్వయోః’ అని విశ్వము, సంచులుకిత=పుడిసిలింపఁబడిన, ఆశ=దిక్కులు గలదియు నగు; ఇవ్వనిక=ఈయుద్యానవనము; కనదచిరధామధామ – కనత్=ఒప్పుచున్న, అచిరధామధామ=మెఱపువంటికాంతిగలదానా! కంటె=చూచితివా?

    నవాంభోజతమాలజాలకములపూఁదేనియయం దాసక్తము లగు తుమ్మెదలు గలదియు, దాడిమి మున్నగు మ్రాఁకుల పుష్పరేణువులచేత వ్యాప్తములగు తెమ్మెరలు గలదియు, బాటసారుల చిత్తమును జలింపఁజేయు నశోకవృక్షవాసి కోకిలల ధ్వనులు గలదియు, ఎల్లపుడు చిలుకలకు జగడము గలుగఁజేయు మావిపండ్లు గలదియు, వసంతోదయమున నుదయించిన బొట్టుగులపువ్వుల వాసనాలేశముచేఁ బుడిసిలింపఁబడిన దిక్కులు గలదియు నగు నీవనమును జూడుమని యర్థము.

  13. లక్షణగ్రంథములలో ‘ముక్తపదగ్రస్త’మను శబ్దాలంకారము ప్రసక్తమైనది. దీనికి విడువబడిన (=అంతమైన) పదమును అవ్యవధానముగా పునర్గ్రహించుటచే నేర్పడిన శబ్దాలంకారమని అర్థము. పై ఉదాహరణములో మాల, జాలాదిశబ్దములు అవ్యవధానముగా పునరుక్తములైనవి. అందుచేత నివి ముక్తపదగ్రస్తములే. కాని ఇవి సమాసాంతర్గతములై యున్నవి. కాని సమాసాంతమున నున్న ఇట్టి శబ్దములు తదనంతరసమాసాదిలో నుండునట్లుగా వ్రాసిన యమకములను కవులు తఱచుగా నాశ్వాసాంతపద్యములందు గూర్చినారు. ఈ అలంకారముయొక్క మఱియొక మనోహరరూపము పూర్వపాదాంత శబ్దమును ఉత్తరపాదాదిశబ్దముగా గూర్చుట. దీనిని దండి సముద్గయమక మన్నాడు. కొందఱు దీనిని ‘పాదసంధియమక’మన్నారు. భట్టుమూర్తి కావ్యాలంకారసంగ్రహములో దీనిని ‘పాదాంతపాదాది ముక్తపదగ్రస్త’మన్నాడు. తన కావ్యభర్త యగు మదనగోపాలస్వామి కంకితముగా చంద్రికాపరిణయం చతుర్థాశ్వాసాంతంలో వ్రాసిన పద్యములలో మాధవరాయ లీరెండు విధముల యమకములను సైతము గూర్చినాడు. మొదట సమాసాంతసమాసాది ముక్తపదగ్రస్తమున కుదాహరణము:
    మ.
    సతతానందితనంద! నందనవనీ◊సంచారజాగ్రత్ప్రియో
    ద్ధతకౌతూహలకంద! కందసుషమో◊దారాంగసాక్షాత్క్రియా
    రతినందన్ముచికుంద! కుందరదనా◊రత్నాంఘ్రిలాక్షాంకగుం
    భితవక్షస్త్విడమంద! మందరధరా◊భృద్భూరిభారాంచితా! 138

    టీక: సతతానందితనంద=ఎల్లప్పుడు సంతసింపఁజేయఁబడిన నందుఁడు గలవాఁడా! నందనవనీసంచారజాగ్రత్ప్రియోద్ధత కౌతూహలకంద – నందనవనీ=నందనవనము యొక్క, సంచార=సంచారముచేత, జాగ్రత్=నిస్తంద్రమైన, ప్రియా=సత్య భామయొక్క, ఉద్ధత=మిక్కుటమగు, కౌతూహల=సంతసమునకు, కంద=కారణమగువాఁడా! కందసుషమోదారాంగ సాక్షాత్క్రియారతినందన్ముచికుంద—కంద=మేఘముయొక్క, సుషమా=పరమశోభవంటి శోభచేత, ఉదార=ఉత్కృష్ట మగు, అంగ=శరీరము యొక్క, సాక్షాత్క్రియా=ప్రత్యక్షకరణమందలి, రతి=ఆసక్తిచేత, నందత్=సంతసించుచున్న, ముచికుంద=ముచికుందుఁడను భక్తుఁడుగలవాఁడా! కుందరదనారత్నాంఘ్రిలాక్షాంకగుంభితవక్షస్త్విడమంద – కుందరదనారత్న= స్త్రీరత్నమగు లక్ష్మీదేవియొక్క, అంఘ్రిలాక్షాంక=పాదములందలి లత్తుకగుర్తులచేత, గుంభిత=కూర్పఁబడిన, వక్షః=ఉరముయొక్క, త్విట్=కాంతిచేత, అమంద=అధికుఁడయినవాఁడా! మందరధరాభృద్భూరిభారాంచితా – మందరధరాభృత్= మందరపర్వతముయొక్క, భూరి=అధికమైన, భార=భారముచేత, అంచితా=ఒప్పెడివాఁడా!

    ఈకృతిపతి సంబోధనములకు నుత్తరపద్యములందలి తత్సంబోధనములకు నాశ్వాసాంతగద్యముతో నన్వయము. ముక్తపదగ్రస్తాలంకారము.

    ఈక్రిందిపద్యము పాదాంతపాదాది (లేదా పాదసంధి) ముక్తపదగ్రస్తమున కుదాహరణము. ఇందులో గల మఱియొక విశేషమేమనగా, పద్యాదిలో నున్న ‘వారణ’శబ్దమే పద్యాంతమున పునరుక్తమైనది. భట్టుమూర్తి ఇట్టి యమకభేదమును ‘సింహావలోకనముక్తపదగ్రస్తయమక’ మని పేర్కొన్నాడు. అందుచేత నీ పద్యములో పాదాంతపాదాదియమకమే కాక సింహావలోకనముక్తపదగ్రస్తయమకము సైతమున్నది.

    ఉత్సాహ.
    వారణప్రభూతదంత◊వైరిదోర్విసారణా!
    సారణాంకమౌనిరాజ◊చక్రతోషకారణా!
    కారణప్రభాతిఘోర◊కంసమల్లమారణా!
    మారణద్దనుప్రభూత◊మండలీనివారణా! 140

    టీక: వారణ ప్రభూత దంత వైరి దోర్విసారణా—వారణ=కువలయాపీడ మను గజముయొక్క, ప్రభూత=గొప్పలగు, దంత = దంతములకు, వైరి=శత్రువులగు, దోర్విసారణా=భుజప్రసారణముగలవాఁడా! సార ణాంక మౌనిరాజచక్ర తోషకారణా – సార= శ్రేష్ఠమగు, ణ=జ్ఞానమే, అంక=చిహ్నముగాఁగల, మౌనిరాజచక్ర=మునిశ్రేష్ఠమండలియొక్క, తోష=సంతసమునకు, కారణా=హేతువైనవాఁడా! ‘ణం సరోజదళే జ్ఞానే నేత్రిషు నిస్తలవస్తుని’అని రత్నమాల; కారణప్రభాతిఘోర కంసమల్ల మారణా –కారణ=కరణసంబంధియగు, ప్రభా=కాంతిచేత, అతిఘోర=మిగుల భయంకరుఁడగు, కంసమల్ల=చాణూరునకు, మారణా =సంహర్త యైనవాఁడా! మా రణ ద్దనుప్రభూత మండలీ నివారణా – మా=లక్ష్మిచేత, రణత్=ధ్వనించుచున్న, సంపత్సమృద్ధు లైన యనుట, దనుప్రభూత=దనుజులయొక్క, మండలీ=గుంపునకు, నివారణా=నివారకుఁడా! పాదసంధియమకవిశేషము.

ఉపసంహారము

ఈవిధముగా ననేకమైన మనోహరమైన పద్యము లీచతుర్థాశ్వాసములో నంతటను ఉన్నవి. లాక్షణికులు నిర్వచించిన లక్షణములదృష్ట్యా వీనిని నేను కొంతవఱకు సమీక్షించినాను. ఈయమకవిధానములను తెలిసికొని ఈయాశ్వాసమును పఠించినచో మఱింత కావ్యానందము కల్గునని నావిశ్వాసము. ఈవ్యాసమువల్ల కావ్యమునట్లు పరిశీలించు నాసక్తి ఒకరిద్దఱికైన కల్గినచో అది నాయదృష్టముగా భావింతును.