రెండు శరీరాలు

ఒక శరీరం ఉంటుంది
జీవన వ్యాపారానికి కావలసిన వివిధ విధుల్నీ
అదే క్రమంలో పదేపదే నిర్వహిస్తుంది
సుఖిస్తుంది, దుఃఖిస్తుంది
బాధల్ని పంటి బిగువున సహిస్తుంది

వయసుతో వచ్చే అన్ని మార్పుల్ని మౌనంగా అంగీకరిస్తుంది

పనులతో, బాధ్యతలతో అలసి సొలసి
ఊరట కోసం ఏ నడి రాతిరి వేళకో
నిద్రనాశ్రయిస్తుంది.

మరొక శరీరం ఉంటుంది
దీనికి అలుపు లేదు, ఆశాభంగం లేదు
వయసు లేదు, వృద్ధాప్యం లేదు
ప్రాణమై ప్రవేశించే ఒక పద్య పాదం కోసం
అనంత కాలం నిరీక్షిస్తుంది

అంతర్గత లయను గుండె చప్పుడుగా మార్చుకొంటుంది
ఊహలు ఉచ్చ్వాస, నిశ్శ్వాసాలై ఊపిరి పోస్తాయి
పద చిత్రాలు జవసత్వాలొసగుతూ
సిరలు, ధమనుల్లోకి బిరబిర ప్రవహిస్తాయి

చైతన్యం పొందిన రహస్య శరీరం
విశ్వమంతా యథేచ్ఛగా విహరిస్తుంది

కాలం సైకత తీరం మీద
దాని అడుగు జాడలు చెరిపివేయలేక
మఱపు కడలి నిరాశగా
వెనుతిరుగుతుంది