[అడిగిన వెంటనే ఈ పద్యాలను సుమధురంగా పాడి మాకు అందజేసిన సముద్రాల హరికృష్ణగారికి మా ధన్యవాదాలు! – సం. ]
వ.
తొలకరిజల్లులకుఁ బులకరించిన పుడమితడివాసనఁ బోలు నొక గంధ మేదో యెడందఁ బర్వ నిండైనభక్తితో శిష్యసమేతంబుగ వాల్మీకి నారదునిఁ బూజించె, నా దేవర్షియు సమ్ముదంబున వారివద్ద సెలవు గైకొని యూర్ధ్వలోకంబుల కేగినంత (24)
కం.
రామకథ రామనామం
బే ముని మదిలో మరిమరి మెదలి పొదలె నం
దే మహిమమున్నదో! సుమ
కోమలమౌ యెద మరింత కోమల మాయెన్ (25)
బే ముని మదిలో మరిమరి మెదలి పొదలె నం
దే మహిమమున్నదో! సుమ
కోమలమౌ యెద మరింత కోమల మాయెన్ (25)
ఉ.
ఈ కథ నాది! నా యునికి యెల్లను నీ కథయందె నిల్చె రా
శీకృతమై యనాదియగు జీవునివేదన సర్వ మీ కథా
ప్రాకటహోమవహ్ని నకలంకనివేదనఁ జేయగావలెన్
నాకప్రసూనసుందరరసాకృతి రాముడు నేన కావలెన్ (26)
శీకృతమై యనాదియగు జీవునివేదన సర్వ మీ కథా
ప్రాకటహోమవహ్ని నకలంకనివేదనఁ జేయగావలెన్
నాకప్రసూనసుందరరసాకృతి రాముడు నేన కావలెన్ (26)
వ.
కదా యని సదా రామకథాస్వరూపసౌందర్యపిపాసం దగిలి వాల్మీకి దినంబులు గడుపుచుండె. (27)
తే.గీ.
అంత నొకప్రొద్దునన్ మౌని యల్లనల్ల
ననుగు శిష్యుండు తోడఁ ద న్ననుగమింప
నల్లనల్ల గంగానది ననుగమించు
పుణ్యతమసానదీతీరభూమి చేరె (28)
ననుగు శిష్యుండు తోడఁ ద న్ననుగమింప
నల్లనల్ల గంగానది ననుగమించు
పుణ్యతమసానదీతీరభూమి చేరె (28)
తే.గీ.
సజ్జనుని మనం బట్లు ప్రసన్నసార
సంబు రమణీయము నకర్దమంబు నుత్త
మంబునగు తీర్థమున్ గని మౌనివరుని
మనము గూడఁ బ్రసన్నాచ్ఛమై వెలింగె (29)
సంబు రమణీయము నకర్దమంబు నుత్త
మంబునగు తీర్థమున్ గని మౌనివరుని
మనము గూడఁ బ్రసన్నాచ్ఛమై వెలింగె (29)
వ.
గురుని ముఖకవళికల గురుతు నెరింగిన భరద్వాజుండు కమండులువు నేల నునిచి, యతనికి వల్కలంబుల నందించె, నా సమయంబున 30.
తే.గీ.
ప్రతిభచేతఁ గవి కథాప్రపంచమందు
నొలయ నవరసదీప్తి తా నూదు రీతి
ప్రభలచే రవి సకలప్రపంచమందు
నుదయ నవరాగదీప్తుల నూదుచుండె (31)
నొలయ నవరసదీప్తి తా నూదు రీతి
ప్రభలచే రవి సకలప్రపంచమందు
నుదయ నవరాగదీప్తుల నూదుచుండె (31)
కం.
ఆ రాగదీప్తు లొయ్యనఁ
బారిన దెస మౌనిచూపు పర్వుచుఁబోయెన్
దీరావని వనిఁ గనినన్
దూరాడె నెవో పురాస్మృతుల్ లోలోనన్ (32)
బారిన దెస మౌనిచూపు పర్వుచుఁబోయెన్
దీరావని వనిఁ గనినన్
దూరాడె నెవో పురాస్మృతుల్ లోలోనన్ (32)
మ.
ఒకనా డెన్నడొ యొక్క రాకొమరు డోహో! యీయెడన్ రాజ్యమున్
సకలంబున్ ద్యజియించి కారడవి సంసారంబుఁ జేపట్టెగా!
ఒకనా డొక్క మహాపతివ్రతయు నయ్యో! భర్తకున్ దూరమై
వికలంబైన మనంబుతో నిచటనే బిట్టేడ్చి శోషిల్లెగా! (33)
సకలంబున్ ద్యజియించి కారడవి సంసారంబుఁ జేపట్టెగా!
ఒకనా డొక్క మహాపతివ్రతయు నయ్యో! భర్తకున్ దూరమై
వికలంబైన మనంబుతో నిచటనే బిట్టేడ్చి శోషిల్లెగా! (33)
వ.
ఆ పురారహోగాథలెవో మనోవీథిఁ గదలాడ శిష్యు డొసగిన వల్కలంబు లట్టే చేతఁబట్టుకొని, సంభ్రమన్మనోభరద్వాజుండై భరద్వాజుండు తన్ననుసరింప, వాల్మీకి యా తీరాటవీమార్గంబునఁ దిరుగాడఁ దొడంగె (34)
తే.గీ.
ఇంతలోఁ గొంతదూరాన నిగురులొత్తు
కోరికల కూడియాడుచు కువకువల క
లరవము సెలగ హాయిమైఁ బరగు క్రౌంచ
మిథునమును మునిశ్లోకుడు మింటఁ గాంచె (35)
కోరికల కూడియాడుచు కువకువల క
లరవము సెలగ హాయిమైఁ బరగు క్రౌంచ
మిథునమును మునిశ్లోకుడు మింటఁ గాంచె (35)
రగడ
ఎటు పొంచియున్నాడొ యెక్కుపెట్టిన యమ్ము
కటునిషాదుం, డెంత కఠినమా హృదయమ్ము
త్రుటిలోన నేసె నాతురముగా గురి చూసి
చటుకునన్ మగపక్షిఁ జంపె గుండెను దూసి (36)
కటునిషాదుం, డెంత కఠినమా హృదయమ్ము
త్రుటిలోన నేసె నాతురముగా గురి చూసి
చటుకునన్ మగపక్షిఁ జంపె గుండెను దూసి (36)
చ.
వలపుల జోడు, నెన్న డెడబాయని తోడు, రవంటి కెంపుసొం
పులతలవన్నెలాడు, దిటవున్ గల రెక్కల పోటుగాడు, తా
నిలఁ బడి నెత్తుటేట విచలించెడు నా ద్విజరాజుఁ జూచి తా
నిలఁ బడి భార్యయున్ బొరలె నెక్కటికంబు రవంబు పెల్లుగా (37)
కం.
కల్లోలితక్రౌంచీరవ
ముల్లమ్మునుఁ దాకి కరుణ యుప్పొంగె వడిన్
బ్రల్లదము నోర్వఁజాలక
వెల్లివిరిసె ఋషి ముఖమున విద్యుద్వాక్కుల్ (38)
ముల్లమ్మునుఁ దాకి కరుణ యుప్పొంగె వడిన్
బ్రల్లదము నోర్వఁజాలక
వెల్లివిరిసె ఋషి ముఖమున విద్యుద్వాక్కుల్ (38)
మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః ।
యత్ క్రౌంచ మిథునాదేకమవధీః కామమోహితమ్ ॥
యత్ క్రౌంచ మిథునాదేకమవధీః కామమోహితమ్ ॥
శా.
మౌనంబంతట “మా నిషాద” యనుచున్ మాట్లాడె నా మాట స
మ్మానంబైన వరంబొ? శాపమొ? కృపామౌగ్ధ్యస్వనన్మాధురీ
గానంబో? ఘనశోకపూర్ణరసగంగాశీకరాపూరమో?
ప్రాణంబుల్ మెలిపెట్టు వాక్య మది కావ్యంబయ్యె దివ్యంబుగా!! (39)
మ్మానంబైన వరంబొ? శాపమొ? కృపామౌగ్ధ్యస్వనన్మాధురీ
గానంబో? ఘనశోకపూర్ణరసగంగాశీకరాపూరమో?
ప్రాణంబుల్ మెలిపెట్టు వాక్య మది కావ్యంబయ్యె దివ్యంబుగా!! (39)
ఆ.వె.
గురువు ముఖమునుండి వరలిన వాక్యంబు
వినుచునున్న చట్టు మనములోనఁ
బట్టరాని శోకభావంబు పెల్లున
చెలగి యుపశమించె చిటికలోన (40)
వినుచునున్న చట్టు మనములోనఁ
బట్టరాని శోకభావంబు పెల్లున
చెలగి యుపశమించె చిటికలోన (40)
వ.
ఆ క్షణమందుఁ దననోట నప్రయత్నముగ వెడలిన వాక్కు లపూర్వములగుట నెరింగి, మతిమంతుండగు నా ముని వానిఁ గూర్చియే చింతింపన్ దొడంగె (41)