మీకు నా లేఖలు అందవు
అవి అందివుంటే, తెలిసేది-
ఈ మధ్య నాలోలాగే, దేశంలోనూ
శూన్యత విస్తరిస్తోందని.
తప్పనిసరై వదిలేశాను,
కలుపు మొక్కల మధ్య ప్రేమ లేఖలని.
ఇతర విషయాలేమీ అంతగా తెలియవు
ముఖ్యంగా ఒంటరి పక్షులు పయనించే
దారుల గురించీ-
భయంకరమైన గాలికి మొదలంటా కూలిన
మహా వృక్షాల గురించీ.
నేనెవరికైనా అలాగే చెప్తాను
కానీ, తిరిగిరాని వారు వదిలిపెట్టిన
కాసింత ప్రేమను సరిగ్గా పంచాలి కదా?
అందుకే, రాలిన ప్రతి ఆకు మీదా రాయండి-
అదేంటంటే,
ఇది చివరి యుద్ధమేమీ కాదని.
ఎందుకంటే-
ఆ లేఖలన్నీ చేరినప్పుడే కదా,
మన చుట్టూ అడవులు విస్తరించేది
అందరికీ నాలుగు వేళ్లూ నోట్లోకి పోయేది!