తయారుగా…

1
ఒకటే రోజులోకి కనులు తెరిచినా, మూసినా
మన పగళ్ళూ, రాత్రులూ ఒకటి కాదు
పగటి రంగులూ, చీకటి లోతులూ వేరువేరు

ఒక జీవితాన్ని జీవిస్తూ వెళతాం
మజిలీ వచ్చినవారు దిగిపోతారు
జీవితం కొనసాగుతుంది

నువు దిగిపోయే మనిషివి కావు,
కొనసాగే జీవితానివి అంటారు
సరిహద్దులు దాటిన కొందరు

2
నీకు నువు వేరే,
నిశ్శబ్దంలోంచి నిశ్శబ్దంలోకి ప్రయాణించే
నీదైన రాగానివి

నీకీ లోకం వేరే,
దీనిలోని బాధా, భయమూ, ఆకర్షణా వేరే

చాలా ఏడుస్తావు, భయపడతావు చాలా,
దిగులులోకి ముడుచుకుంటావు పలుమార్లు
కానీ, కాలం పన్నిన వల ఉంది చూడు
నిన్ను బయట పడనీయదు, ఎగరనివ్వదు

లోకం ఎరవేసే సౌఖ్యాలన్నీ
పిల్లల ఆటల కన్నా అల్పమైనపుడు
జీవితం ఊపిరాడని అనుభవమని తోస్తుంది

బహుశా, అపుడు
పగలూ, రాత్రీ నీపై నుండి చెరిగిపోతాయి
నీటిపైన రాసింది చెరిగినట్టు,
మెలకువలో కల మునిగిపోయినట్టు

3
ఓర్చుకో అనటం మినహా
వారైనా చెప్పగలిగింది ఏముంది

నీ ప్రియుని రహస్య భాషణ
నువు మాత్రమే వినవలసి ఉంది
తయారుగా ఉన్నావా, లేదా
తనతో ఏకాంత సమాగమానికి


బివివి ప్రసాద్

రచయిత బివివి ప్రసాద్ గురించి:

హైకూకవిగా, తాత్విక కవిగా సుపరిచితులు. మూడు హైకూ సంపుటాలు: దృశ్యాదృశ్యం, హైకూ, పూలు రాలాయి; నాలుగు వచన కవితా సంపుటాలు: ఆరాధన, నేనే ఈ క్షణం, ఆకాశం, నీలో కొన్నిసార్లు ప్రచురిత రచనలు. హైకూ సాహిత్యానికి గాను మచిలీపట్నం సాహితీసమితి అవార్డు, ఆకాశం సంపుటికి ఇస్మాయిల్ అవార్డుతో సహా మూడు అవార్డులూ వచ్చాయి. సంపుటాలన్నీ బ్లాగులో ఈ-పుస్తకాల రూపంలో చదవవచ్చును.

 ...