వసుచరిత్రలో నర్మసచివుని వాక్చాతుర్యం

(వంగూరి ఫౌండేషను, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయముల సంయుక్తాధ్వర్యవములో నిటీవల ఆవిష్కరింపబడిన సభావిశేషసంచికలోని కించిత్సంక్షిప్తమైన వ్యాసమునకిది పునఃపరిశీలిత విస్తృతరూపము.)

వసుచరిత్రలోని రెండవ ఆశ్వాసంలో శుక్తిమతీనది, కోలాహలపర్వతాల సంబంధాన్ని, సంగమాన్ని ప్రకృతిపరంగాను, వ్యక్తిపరం గాను శ్లేషమూలకంగా అత్యద్భుతంగా వర్ణించడంలో రామరాజభూషణుఁడు చూపిన అనన్యసామాన్యమైన వైదుష్యం, కౌశల్యం, కవిత్వపాటవం సాహిత్యవిమర్శకులు తరచుగా విశ్లేషించునవే. శుక్తిమతీకోలాహలుల పుత్త్రికయైన గిరికయొక్క చెలికత్తె మంజువాణి గిరికాదేవి జన్మప్రకారాన్ని వసురాజుయొక్కనర్మసచివునికి వివరించే సందర్భంలో ఈవర్ణన చేయబడింది. కాని ఈవర్ణనకు ముందుగా నర్మసచివుడు కృతకయతిరూపం ధరించి మంజువాణితో తననుగుఱించి తెలిపే పద్యాలుకూడ శ్లేషమూలక ప్రకృతాప్రకృతార్థరమ్య ములై చాలా రసవత్తరంగా, భావపూరితంగా ఉంటాయి. వీటినిగుఱించి విశేషంగా విశ్లేషించినట్లు కానరాదు. మనం టీవీలో వక్త ఒక ప్రయోజనాన్నిగుఱించి వచించే వాక్యాలు శ్రోతలకు వారి వర్తమానపరిస్థితికి వర్తించునట్లుగా అన్యవిధంగా అర్థమై, తన్మూలకంగా ఉత్కంఠాభరితమైన నాటకీయత ఏర్పడడం తరచుగా చూస్తుంటాం. ఇట్లాంటి నాటకీయతనే ఈసందర్భంలో వసుచరిత్రలో గల శ్లేష మూలకప్రకృతాప్రకృతార్థపూరితమైన పద్యముల ద్వారా రామరాజభూషణుడు పోషించినట్లు వీనిని లోతుగా పరిశీలించినపు డర్థ మౌతుంది. ఇట్లు చదువరులకా దృశ్యాన్ని సాక్షాత్తుగా నాట్యరంగంపై చూస్తున్న అనుభవం కల్గుతుంది. ఈవిషయాన్ని విశదీకరించుటకు ఈపద్యాలను వీలైనంత సరళంగా వివరించే ప్రయత్నమే యిది.

వసురాజు తన నర్మసచివునితో విహారార్థం తన క్రీడాశైలమైన కోలాహలపర్వతానికి వస్తాడు. రామరాజభూషణుఁ డీనర్మసచివుని పాత్రను సంస్కృతనాటకాల్లో సామాన్యంగా కన్పించే విదూషకపాత్రవలె చిత్రించినట్లుగా కన్పడుతుంది. నాయికను సంధానింపఁ జేయుటలో సహాయకుఁడు, బ్రాహ్మణుఁడు, వేషభాషాదులచే హాస్యకారి, మాటకారి యగువాఁడు విదూషకుఁడుగా సంస్కృత నాటకములలోఁ గన్పడుచున్నాడు. వసురాజు నర్మసచివుఁ డొకసందర్భములో తాను ‘పరమహాసప్రతిభానుభావుఁడ’ నని చెప్పి కొన్నను, అతని హాస్యమును నిరూపించు సన్నివేశములీ సందర్భములో లేవు. కాని అతఁడు గౌతమగోత్రజుఁడైన బ్రాహ్మణుఁడుగాను, సమయజ్ఞుఁడుగాను, వాక్చతురుఁడుగాను, ప్రణయసంధానకర్తగాను, గిరికావసురాజుల పరస్పరప్రథమదర్శనకారకునిగాను కన్పడుచున్నాడు. ఇతని గోత్రనామము గౌతముఁడని అతని సంభాషణలవల్ల విదితమౌతుంది కావున ఆపేరుతోనే అతనిని నేను వ్యవహరిస్తాను.

వసురాజు గౌతమునితోఁగూడ కోలాహలపర్వతమునందలి ఒక పొదరింటిలో విశ్రమించుచుండఁగా వారికొక శ్రావ్యమైన వీణానాదం ‘వీనులవిందై, అమృతపుసోనల పొందై, అమందసుమచలదళినీగానము క్రందై, ఆనందబ్రహ్మంబై’ విన్పడుతుంది. దాని మూలమేదో కన్గొని రమ్మని వసురాజు గౌతముని బంపుతాడు. గౌతముఁడంతా తిరిగి చూచి తరువులచే నావృతమైన యొకకోనలో స్వర్ణ,రజత వికారములైన గోడలు గల్గిన ఒక దివ్యమైన మణిమందిరమును కనుగొంటాడు. తళతళ మెఱిసే ఆభవనకుడ్యములందు ప్రతిబింబించిన రూపముల ద్వారా ఆభవనంలో నొక లోకోత్తరసుందరి అందకత్తెలైన చెలికత్తెల మధ్యన అమృతస్యందియైన వీణానాదం చేస్తున్నట్లు, తాము విన్ననాద మదియే యైనట్లు కనుగొంటాడు. ఇందాక మనం చెప్పినట్లుగా నతఁడు సమయజ్ఞుఁడు గావున హఠాత్తుగా తాను వారి మధ్యలో కనపడితే, పానకంలోని పుడుకవలె వారి ఏకాంతం భంగం చేస్తానని అతనికి దెలుసు. అందుచేత అతఁడా భవనం చుట్టున్న చెట్లసందులనుండే సరసంగా అదృశ్యాన్ని చూచి వచ్చి, ఆమె సౌందర్యాన్ని పరిపరివిధాలుగా వర్ణించి, రాజున కామెయందు అనురక్తిని కల్గించి, ఆవర్ణనను అత్యంతసుందరమైన ఈక్రింది పద్యం ద్వారా ముగిస్తాడు.

స్వైరవిహారధీరలగు సారసలోచన లున్నచోటికిన్
భోరున లాతివారు చొరఁబూనినచో రసభంగమంచు నేఁ
జేరక పువ్వుఁదీవియల చెంతనె నిల్చి లతాంగిరూపు క
న్నారఁగఁ జూచి వచ్చితి నవాంబురుహాంబక నీకుఁ దెల్పఁగన్ 2-55

ఓ రాజా! స్వచ్ఛందంగా వర్తించే ఆసుందరు లున్నచోటికి హఠాత్తుగా అన్యులు చొరబడితే రసభంగమౌతుందని నేనట్లు సేయక పూవుం దీవెల చాటునుండే ఆలతాంగిని చక్కగా చూచి నీకుఁ దెల్పఁగా వచ్చినాను –అనేది ఈపద్యతాత్పర్యం. కాని లోతుగా పరిశీలిస్తే, ఈపద్యంలో ఎన్నో విశేషాలున్నాయి.

1. ఆస్త్రీలు సారస (పద్మ) లోచనలు. హఠాత్తుగా అపరిచితు లక్కడ ప్రవేశిస్తే రసభంగమౌతుంది. అక్షరాలా ఇది జరుగుతుంది. ఎట్లాగంటే సారసంలోని ర-సవర్ణాలు భంగమై, సారసలోచనలు కాస్త సాలోచనలు –చింతాక్రాంతులు- ఔతారు. ఇట్లద్భుతమైన శబ్దచిత్ర మిందులోఁ జొప్పించినాఁడు రామరాజభూషణుఁడు.
2. రాజును నవాంబురుహాంబక – క్రొత్తనైన, అంటే అప్పుడే వికసించి, నిండుపరువముతో, ప్రకాశముతో నున్నపద్మములవంటి కన్నులు గలవాఁడా, అన్నాడు. తానింతవఱకు వర్ణించిన నాయికయొక్క అద్భుతమైన సౌందర్యమునుగూర్చి వినుటవల్ల రాజులో అద్భుతరసస్ఫూర్తి కల్గి, అతని కనులు విప్పారినాయని అందుచే నవి క్రొత్త పద్మములవలె వెలుగుచు అనురక్తిని ప్రకటిస్తున్నాయనే సూచన నీవిధంగా చేస్తున్నాడు. లోకోత్తరవస్తు సందర్శనముచేగాని, శ్రవణముచేగాని కల్గిన విస్మయమే అద్భుతరసమునకు స్థాయీభావము. కనులు విప్పారుట, ప్రకాశించుట దానికి అనుభావములని ఇచట మనము గ్రహింపవలెను.
3. రాజువలెనే నాయికసైతము సారసలోచన. అందుచే ‘వివాహశ్చ వివాదశ్చ సమయోరేవ శోభతే’ అన్నట్లు తుల్యరూపులైన వారిర్వురు పరస్పరానురక్తికి యోగ్యులనే విషయాన్ని కూడ ఈపద్యంలో స్ఫురింపఁజేస్తున్నాఁడు. ఇక్కడ నచాంబురుహాంబకశబ్దానికి అభినవమన్మథు డనియు అర్థము చెప్పవచ్చును. అప్పుడు నవాంబురు హాంబకుడైన నవాంబురుహాంబకుడని, అనగా నవమన్మథునివలె అందకాడును, అద్భుతరసస్ఫూర్తి కల్గుటవలన సద్యోవికసిత పద్మములవలె భాసమానమైన వికసితనేత్రములు గలవాడనియు విశేషార్థము చెప్పుకొనవచ్చును.

సరే, ఆమెయందట్లనురక్తుఁడై, అద్భుతరసాప్తి నందిన రాజున కానాయికయొక్క ప్రత్యక్షదర్శనోత్సుకమైన ఆవేగమను వ్యభిచారభావ ముదయించినది. అందుచేత నతడు నర్మసచివునివెంట నాయికను చూచుటకు బయలుదేఱినాడు. నాయికను జూడవలెనను తహతహ ఎంతగా నున్నను ఆరాజు దేశకాలోచితజ్ఞ్డుఁడు. అందుచేత తానా స్త్రీల మందిరాంతికమున నున్న తీవెలచాటునుండే విషయమును పరికించుచు, ఆనాయికాజన్మక్రమము నెఱిగి, యుక్తసమయములో తన్నటకు రావింపుమని నర్మసచివుని బంపినాడు. నర్మసచివుడును సమయజ్ఞుఁడే కావున నొక కృత్రిమమునివేషమును ధరించి అట కేఁగినాడు. అట్లాతడా భవనాంతికమునకు రాగా అతని కచ్చట నాయికాగీతమును ప్రశంసిస్తూ ఆమె చెలికత్తె పలుకు ఈక్రింది పద్యం వినిపిస్తుంది:

గంధగజయాన గీతప్రబంధకలన , నలరి యతి లియ్యమై వచ్చు నరిది మగువ
లార కనుఁగొంటిరే యను నాళివాక్య, మొకటి విననైన నిదె వేళ యొదవె ననుచు. 2-80

ఈపద్యంలో యతి అనే పదానికి మౌని యనీ, సంగీశాస్త్రనియతమైన యతి అనీ అర్థద్వయాన్ని గ్రహించవలసి ఉంటుంది. గౌతముఁ డక్కడికి వస్తున్న సమయంలో నొక చెలికత్తె ‘ఈమె గీతరచనయందు యతి చక్కగా కూడిరావడం అరిదిగా, అంటే ఆశ్చర్యకరంగా ఉంది’ అని నాయికయొక్కగీతములో అలవోకగా వచ్చే సంగీతశాస్త్రనియతమైన యతిని కొనియాడుతుంటే, దాన్ని ‘ఈమె గీతరచన కలరి (సంతోషించి) యతీశ్వరుఁ డొకఁడు కూడి రావడం ఆశ్చర్యకరంగా ఉంది’ అంటున్నట్లుగా యతిశబ్దానికి గల శ్లేషచే అర్థం చేసికొని గౌతముఁ డదే వారి సమక్షంలో కన్పడుటకు తగిన సమయమని భావించి,

మేలు లతాంగి నీపలుకు మెచ్చితినే, యతి వచ్చుజాడ యే
లీల నెఱింగితమ్మ, బహుళీకృతచాతురి మించు నీ విపం
చీలలితారవామృతము చిత్తము సోఁకినవార లీకళా
శాలినిఁ జూచి దీవెన లొసంగక పోవరు సుమ్ము నావుడున్. 2-81

‘బాగుబాగు లతాంగీ! యతి వచ్చు జాడ నీ కెట్లు తెలిసెనమ్మా, ఔనులే బహుసంగీతవైదగ్ధ్యము గల ఈమె వీణారవామృతమును (దూరమునుండైనా) చవిచూచిన వారెవ్వరూ, ఇట్టి విదుషీమణిని (సమక్షములో) చూచి దీవింపక పోవరుగదా’ అని సమయస్ఫూర్తితో తన హఠాత్ప్రవేశాన్ని సమర్థించుకొనుచూ పక్కా నాటకీయఫణితిలో నర్మసచివుఁ డక్కడికి ప్రవేశిస్తాడు. మునినివేషములో నున్న అతఁడు గాక వేఱొక పరాయివాఁ డక్కడికి ప్రవేశిస్తే తప్పకుండా రసభంగమయ్యేదే! అందుచేత రామరాజభూషణుడు అతనికి మునివేషం వేసి, అతని నాస్త్రీల యెదుట ప్రవేశపెట్టడంలో గల ఔచిత్యాన్ని, నాటకీయతను చదువరులు గ్రహింపవలెను.

ఇట్లు ప్రవేశించిన గౌతముని ఆస్త్రీలు సంభ్రమాశ్చర్యములతోఁ జూచి, తమ ఆసనములు డిగ్గి అతనికి నమస్కరిస్తారు. అట్లు నమస్కరించే గిరికయొక్క నలువైన నిలువెత్తు రూపాన్ని చెట్లచాటునుండి చూచి వసురాజు ఆమెయం దింకను అనురక్తుఁడౌతాడు. ఈసందర్భాన్ని రామరాజభూషణుఁడు చక్కనైన అర్థాంతరన్యాసంతో అతిరమ్యంగా ఈక్రింది పద్యంలో వర్ణిస్తాడు.

ముని యటు రాఁ దటాలున సమున్నతపీఠము డిగ్గి నిల్చు నం
గన నిఱుపేదకౌను కుచగౌరవ మోర్వక కంపమొందఁగా
జనపతి చూడ్కి తోడనె ససంభ్రమభరితానుకంపమై
యెనసి వలగ్నముం బొదివె, నీశులు దీనదయాళుదర్శనుల్. 2-84

అట్లు తనను సేవించు గిరికను మాయామౌని గౌతముఁడు ‘ఓ అనన్యకన్యాసామాన్యలావణ్యప్రభావ! సువల్లభుం బెండ్లియాడు’ మని దీవిస్తాడు. ఇక్కడ ‘ఓ అనన్యకన్యాసామాన్యలావణ్యప్రభా! వసువల్లభుం బెండ్లియాడుము’ అని వసురాజును బెండ్లియాడుమని చెప్పుట అతని ఉద్దేశ్యమైనను, ‘ఓ అనన్య కన్యాసామాన్య లావణ్యప్రభావ! సువల్లభుం (మంచి భర్తను) బెండ్లియాడుము’ అని సాధారణమైన దీవెనగా ఆస్త్రీలకు దోఁచునట్లు కూర్చుట ఒక విశేషం.

తర్వాత అతని నాస్త్రీలు సగౌరవంగా స్వర్ణపీఠాసీనుని గావిస్తారు. వారిలో ‘సమంజసవచనచాతురీరంజిత’ యైన మంజువాణి అను చేటిక సంభాషణను కొనసాగిస్తూ,

లలనాలలామ వీణా, కలనాదము మెచ్చి కరుణఁ గమనీయవరా
కలనాదరమున వచ్చిన, యల నాదప్రియుఁడవో మహాత్మ! దెలుపవే?’ 2-89

‘ఈ స్త్రీలలామ (నాయిక) యొక్క వీణానాదమును మెచ్చి వరాకలనోద్దేశ్యముతో నరుదెంచిన నాదప్రియుఁడవైన నారదుఁడవో నీవు మహాత్మా?’ అని అతని నడుగుతుంది. ఇక్కడ ‘వర+ఆకలన+ఆదరమున’ అంటే వరశబ్దమునకుఁ గల వరము,వరుఁడు అను అర్థశ్లేష వల్ల ‘వరము లొసంగుటయందలి ఆదరమువల్ల’ అని ప్రకృతార్థము స్త్రీలపరంగా, ‘వరుని గూర్చుటయందలి ఆదరముచేత’ అనే అప్రకృతార్థము యతిపరంగా కూర్చడం గమనింపవలె. నారదుని నేరుగా నారదుఁడనక నాదప్రియుఁడవో అనుటవల్ల, నీవు నాద ప్రియుఁడవు గావుననే ఈమె నాదాన్ని విని వరమీయగా వచ్చిన మహాత్ముఁడవను విశేషార్థము స్ఫురించుచున్నది. అంతేకాక నారదుఁడు కొన్నిపట్టుల నాయకీనాయకుల శోభనకర్తగాను, పారిజాతాపాహరణమువంటి పట్టుల తాత్కాలిక నాయికానాయక విశ్లేషణకర్తగాను చూపట్టుచుండుటచే, శోభనకర్తగా నరుదెంచిన సాక్షాన్నారదుఁడవను విశేషార్థముగూడ ఇచ్చట స్ఫురించుచున్నది.

తర్వాత మంజువాణి ‘తావక శుభాంకముఁ గన్న సువర్ణరేఖలం బాయని కూర్మిఁ దెల్పి మదీయకర్ణపాళీయుగళీపరిష్కరణలీల ఘటింపఁగదే’ అని తన కర్ణములకు సువర్ణభూషణములుగా (స్వర్ణకర్ణికలుగా) నతని గోత్రనామముల రూపు వహించిన సువర్ణరేఖలం (మంచి యక్షరముల వరుసను) దెల్పి అనుగ్రహింపుమని ఆమాయాయతిని అర్థిస్తుంది. ఆమె అభ్యర్థనకు బదులుగా గౌతముఁ డనేక పద్యాలలో తన వృత్తాంతాన్ని తెల్పుతాడు. ఈపద్యము లాసన్నివేశమునకు వర్తించునట్లు తన యతిత్వమహిమాప్రతిపాదకముగ నొక విధముగను, యథార్థస్థితిలో నర్మసచివుఁడైన తనకును, తనస్వామియైన వసురాజునకు వర్తించునట్లు మఱొకవిధముగను శ్లేషమూలక ప్రకృతాప్రకృతార్థఘటితములై యుండుటవలన, వాటిని నిశితంగా పరిశీలించడం అవసరం. అందుచేత నేనీ సందర్భంలోని ముఖ్యమైన పద్యాలను అర్థవివరణతోఁ గూడ పేర్కొంటాను.

అన మునిరాజు వల్కు, వనితా! జనతావినుతాభిధేయుఁడై
యొనరిన గౌతమున్ మునికులోత్తముఁ జెప్పఁగ విందువే కదా!
అనఘతదన్వవాయకలశాంబుధిఁ బుట్టినవాఁడ గౌతమా
ఖ్య నెసఁగువాఁడ నేఁ బరమహాసరసప్రతిభానుభావుఁడన్. 2-90

మంజువాణి అడిగిన ప్రశ్నకు గౌతముఁ డిట్లు ప్రతివల్కుచున్నాఁడు: ‘ఓ వనితా, జనౌఘముచేత వినుతింపఁబడిన గౌతమమహర్షిని గూర్చి వినియే యున్నావుగదా! (ఇట్లు చెప్పుటవల్ల గౌతమమహర్షి ప్రఖ్యాతుఁడని అందుచే అతనినిగూర్చి అందఱికిఁ దెలియునని సూచింపఁబడినది) స్వచ్ఛమైన ఆగౌతమముని వంశమనే పాలకడలిలోఁ బుట్టినవాఁడను, గౌతమాఖ్యగలవాఁడను. అంతేకాక నేను పర మహా సరస ప్రతిభానుభావుఁడను-పర=పరమాత్మయందు, మహా సరస=మిక్కిలి సారస్యము గల, ప్రతిభా=నవనవోన్మేషమగు బుద్ధి యొక్క, అనుభావుఁడన్=ప్రభావముగలవాఁడను– ఇది అతఁడు నిజమైన యతియే యని నమ్మిన ఆస్త్రీలు అతనినిగుఱించి గ్రహించెడి అర్థము. కాని ‘హాస్యకారీ విదూషకః’ అన్నట్లుగా తన యథార్థవిదూషకలక్షణాన్ని ‘పరమహాసరసప్రతిభానుభావుఁడన్’ అను వాక్యం లోని శ్లేషవల్ల అతఁడు తెల్పుకొనుచున్నాఁడు. ఎట్లన, పరమ=శ్రేష్ఠమైన, హాసరస=హాస్యరసమందలి, ప్రతిభా=బుద్ధివికాసముయొక్క, అనుభావుఁడను=ప్రభావము గలవాఁడను – అనుచు. కాని అతని యతిత్వమును శంకింపని ఆస్త్రీలకు ఈయర్థంగాక మొదటి యర్థమే ప్రకరణోచితంగా తోఁచుననుటలో సందేహం లేదు. అనుభావము=ప్రభావము, పర=పరమాత్మ అనుటకు ‘సన్నిశ్చయేఽనుభావే స్యాత్, ప్రభావే, భావసూచకే’ అనియు, ‘పరోరిః పరమాత్మా చ కేవలే పరమవ్యయమ్’ అనియు నానార్థరత్నమాల.

ఓవలమానమీనమిథునోపమ లోలవిలోచనాంత కాం
తా! వసునాథు నున్నతనగాహితపాదసనాథు, నాత్మసం
సేవకశేవధిం దగ భజించి తదీయరహస్యమంత్ర సం
భావనచే ననాదిమునిమార్గముఁ గాంచితి నద్భుతంబుగాన్. 2-91

ఈపద్యంలోని పదశ్లేషవల్ల గౌతముఁడు సూర్యోపాసన చేసి తన్మంత్రప్రభావనచే ననాదిమునిమార్గమును గాంచిన గొప్ప యతీంద్రుఁ డను ప్రకృతార్థముతోబాటు అతఁడు వసుమహారాజును గొల్చి అతనికి సన్నిహితుఁడైన సేవకుఁడైనాడను అప్రకృతార్థము గూడ సిద్ధించు చున్నది. ఓవలమానమీన మిథునోపమ లోలవిలోచనాంత కాంతా=తరళించు చేపలజంటవలె చలించు నయనాంతములచే మనోజ్ఞమైన దానా! ఈసమాసంలో కాంతాశబ్దానికి ‘కామ్యత ఇతి కాంతా’ అని వ్యుత్పత్తి. అంటే మనోజ్ఞురాలగుటచే కోరఁబడునది అని అర్థము. అందుచే సుందరమైన ఈదీర్ఘసంబోధనము సాభిప్రాయమై, గౌతమోక్తమైన వృత్తాంతము నాసక్తితో (ఇష్టంతో) నాలకించుచున్న మంజు వాణీదృష్టులందలి అనుభావాన్ని (భావబోధకత్వాన్ని) ప్రకటించుచున్నది (‘అనుభావో భావబోధకః’ అని అమరకోశం). నంది కేశుఁడు అభినయదర్పణంలో పేర్కొన్న ఇష్టాన్ని (ఇంగితాన్ని) వ్యక్తంచేసే సాచీదృష్టివలె నీదృష్టులున్నవి. ‘సాచీదృష్టిరితి జ్ఞేయా అపాంగచలన క్రమాత్, ఇంగితాదిష్వియం ప్రోక్తా భరతాగమవేదిభిః’ – అని నందికేశుని సాచీదృష్టి నిర్వచనం.

ఆత్మ సంసేవకశేవధిన్=తనను సేవించువారికి నిధివంటివాఁడైన (‘నిధిర్నా శేవధిః’-అమరము), ఉన్నత నగ=ఎత్తైన వృక్షములు /కొండల పైని (‘శైలవృక్షౌ నగావగౌ’- అమరము), ఆహిత=ఉంపఁబడిన, పాదసనాథు=కిరణములతోఁ గూడిన (‘పాదా రశ్మ్యంఘ్రి తుర్యాంశాః’ – అమరము), వసునాథున్=రశ్మికి (కాంతికి) నాథుఁడైన సూర్యుని (‘దేవభేదేఽనలే రశ్మౌ వసూ రత్నే ధనే వసు’- అమరము), తగన్ భజించి=చక్కగాఁ గొలిచి, తదీయ రహస్య మంత్ర సంభావనచేన్=ఆసూర్యునియొక్క రహస్యమైన మంత్రమును (సూర్యమంత్రమును) చక్కగా మననముచేయుటచేత, అద్భుతంబుగాన్=ఆశ్చర్యకరముగా, అనాది= పురాతనులైన, మునిమార్గమున్=మునులయొక్క మార్గమును (పవిత్రమైన పద్ధతిని), కాంచితిన్= పొందితిని. సూర్యోపాసన చేసి సూర్యమంత్ర ప్రభావముచేత పురాతనమునిమార్గమును గన్న మహాత్ముఁ డతఁడని అతనివాక్కు లాస్త్రీల కవగతమైనవని, అందుచే అతనియందు వారిగౌరవ మినుమడించినదని ప్రకరణోచితమైన ప్రకృతార్థము.

ఆత్మసంసేవకసేవధిన్= తనను సేవించువారికి నిధివంటివాఁడైన, ఉన్నతనగ=ఎత్తైన పర్వతమైన కోలాహలపర్వతానికి, అహిత= ప్రతికూలుఁడైన, పాదసనాథు=పాదముతోఁగూడిన, అనఁగా తన కాలిగోటితో కోలాహలపర్వతాన్ని చిమ్మివేసిన, అందుచే నహితుఁ డైన, వసునాథున్=వసుమహారాజును, తగన్ భజించి= చక్కగాఁ గొలిచి, తదీయ రహస్య మంత్ర సంభావనచేన్= అతనియొక్క రహస్య మంత్రాలోచనచేత, అద్భుతంబుగాన్=ఆశ్చర్యకరముగా, అనాది=మొదట లేనట్టి, అనఁగా నూతనమైన, మునిమార్గమున్=ముని యొక్క పోవడిని (మాయామునిరూపమునని తాత్పర్యము), కాంచితిన్=కైకొంటిని – అనఁగా తన కాలిగోటితో కోలాహలపర్వతమును చిమ్మివేసిన, అందుచే ఆపర్వతమున కహితుఁడైన, వసుమహారాజుయొక్క సేవకుఁడనై, అతని రహస్యకార్యనిర్వహణకై నూతనమైన (కృత్రిమమైన) మునిరూపమును వహించితి ననునది శ్లేషమూలకమైన అప్రకృతార్థము.

నాఁతి వినుమేను బిన్నటనాఁటనుండి,యును దదంఘ్రిసేవావృత్తి నున్న కతన
నిచ్చె నాకుఁ బ్రసన్నుఁడై యినుఁడతండు, సకలపదముల నాత్మానుసరణమహిమ. 2-92

ఈపద్యాన్నిగూడ అర్థద్వయము కల్గునట్లు చెప్పినాఁడు. ముందుగా యతిపరమైన అర్థము. తదంఘ్రిసేవావృత్తిన్=ఆసూర్యుని యొక్క కిరణములను పానము చేయు తాపసవృత్తిలో (అంఘ్రి యనఁగా కిరణము), ఉన్నకతన, ఇనుఁ డతండు=ఆసూర్యదేవుఁడు (ఇనస్సూర్యే ప్రభౌ’ –అమరము), ప్రసన్నుఁడై=ప్రత్యక్షమై, సకలపదములందు=తాను వర్తించు (విశ్వమందలి) అన్ని తావులందు, ఆత్మానుసరణమహిమన్=తన్ను అనుగమింపఁగల ప్రభావమును, నాకున్ ఇచ్చెన్=నా కొసంగెను –అతఁడు సూర్యప్రసాదమువల్ల తత్తుల్యవేగముతో సూర్యు ననుగమింపఁగల మహిమను గాంచిన మహాత్ముఁడని ఆస్త్రీలకు విశ్వాసము గల్పించుట దీని ప్రయోజనము.

ఇక నర్మసచివుని పరమైన అర్థము. ఓ యింతీ! నేను చిన్ననాటినుండి తదంఘ్రిసేవావృత్తిన్=ఆవసురాజు చరణములను గొల్చు సేవావృత్తి గలవాఁడనై, ఉన్నకతన, ఇనుఁడతండు=ప్రభువైన యతఁడు, ప్రసన్నుఁడై=అనుగ్రహించి, సకలపదములన్=అన్ని పదవు లందును (అధికారములందును), అన్ని యెడలను (పదం వ్యవసిత త్రాణ స్థాన లక్ష్మాంఘ్రి వస్తుషు’ –అమరము), ఆత్మానుసరణ మహిమన్=స్వతంత్రముగ వర్తించు దొడ్డతనమును, తన్ననుగమించు అధికారమును, నాకున్ ఇచ్చెన్=నాకొసంగెను – ఇట్లతఁడు వసురాజును అంతటను అనుగమింపఁ గల్గుటయే కాక స్వతంత్రించి తత్కార్యనిర్వహణమొనర్పఁ జాలునని, అందుచేత వలనైన విధముగా వర్తించి నాయికను నాయకునకు గూర్పఁగల సామర్థ్యము గల్గువాఁడని ధ్వన్యర్థము సిద్ధించుచున్నది.

అంఘ్రి=పాదము, కిరణము; ఇనుఁడు=ప్రభువు,సూర్యుఁడు; పదము=పదవి, స్థితి, మార్గము అను పదములందలి శ్లేషవల్ల ఈ పద్యములో అర్థద్వయము కల్గుచున్నది. తరువాతి పద్యములో ఈ విషయమే విస్తరింపఁబడుచున్నది.

కావున నుద్యానగతుఁడైన మత్స్వామితో నమేరుసమేధమాన మంజు
లచ్ఛాయలఁ గరం బలరుచు, నీలగ్రీవనిలయాభిరామసీమలఁ దెలియుచు,
సుమనోమనోజ్ఞధామములు మెచ్చుచుఁ, బుష్కరసరోవరోర్మిసంభ్రమములు గనుచు,
రంభాదిలాస్యసంరంభముల్ దిలకించుకొనుచుఁ, గిన్నరమృదుధ్వనులు వినుచు,

శిశిరశిఖరిస్థలంబు లీక్షించుకొనుచుఁ, జంపకారణ్య మరయుచు, జగతి నద్భు
తం బయిన పుండరీక కేదార సేతు వైఖరికి నిచ్చగించుచు వచ్చివచ్చి. 2-93

ఈపద్యములో సూర్యుననుగమించు యతిపరముగాను, వసురాజు ననుగమించు నర్మసచివునిపరముగాను, శబ్దశక్తిమూల ధ్వనిచే ప్రకృతాప్రకృతార్థములు కల్గుచున్నవి.

ముందుగా యతిపరమైన ప్రకృతార్థము – కావునన్=పూర్వోక్తముగ నాస్వామియైన సూర్యుని అనుగమించుచుఁ బోవువాఁడను గావున, ఉద్యాన(ఉత్+యాన) గతుఁడైన= ఊర్ధ్వ (ఆకాశ) యానమును పొందినవాఁడైన, మత్స్వామితోన=నా స్వామితోడనే (నిర్ధార ణార్థములో తోన), మేరు సమేధమాన మంజులచ్ఛాయలన్=మేరుపర్వతముయొక్క పెంపొందుచున్న రమణీయమైన కాంతులచేత (‘ఛాయా సూర్యప్రియా కాన్తిః ప్రతిబిమ్బ మనాతపః’- అమరము), కరం బలరుచు=మిక్కిలి సంతోషించుచు – సూర్యుఁడు మేరువును ప్రదక్షిణ మొనరించునని, అందుచేత అతని ననుగమించిన యతిసైత మాపర్వతమును గాంచునని, స్వర్ణమయమైన ఆ పర్వతము సూర్యకిరణప్రసారమువల్ల మఱింత ప్రకాశించునని, అందుచే దాని దర్శనము యతని కరం బలరింపఁ జేయునని అర్థము.

నీలగ్రీవ నిలయాభి రామసీమలఁ దెలియుచు=నీలగ్రీవుఁడనగా శివుఁడు. ఆశివునకు నిలయమైన కైలాసమునందలి సుందరప్రదేశముల నరయుచు, సుమనో మనోజ్ఞధామములు మెచ్చుచున్=దేవతలయొక్క అందమైన భవనముల నరసి మెచ్చుకొనుచు, పుష్కరసరో వరోర్మిసంభ్రమములు గనుచున్= (పావనమైన) పుష్కరతీర్థమునందలి తరంగసంచలనంబులఁ బరికించుచు, రంభాదిలాస్యసంరంభ ముల్ దిలకించుకొనుచున్=రంభాద్యప్సరసల నాట్యముల దర్శించికొనుచు, కిన్నరమృదుధ్వనులు వినుచున్=కిన్నరులయొక్క కోమలగీతరావములు వినుచు (‘విద్యాధరోఽప్సరో యక్ష రక్షో గంధర్వ కిన్నరాః, పిశాచో గుహ్యకస్సిద్ధో భూతోఽమీ దేవ యోనయః’- అని అమరము. కిన్నరులు సంగీతమునకు ప్రసిద్ధులైన దేవజాతివారు), శిశిరశిఖరిస్థలంబు లీక్షించుకొనుచున్ =హిమవత్పర్వతమందలి స్థలములను దర్శించికొనుచును, చంపకారణ్యమరయుచున్=చంపకవన మనెడి పుణ్యక్షేత్రమును గాంచుచు, జగతిన్=భూమియందు, అద్భుతం బయిన=ఆశ్చర్యకరమైన, పుండరీక కేదార సేతువైఖరికిన్= పుండరీకము, కేదారము, సేతువులనెడి పుణ్యక్షేత్రముల (వైభవ)రీతికి, ఇచ్చగించుచున్=మెచ్చుకొనుచును, వచ్చివచ్చి…

నర్మసచివుని పరమైన యర్థము – కావునన్=పూర్వోక్తముగ వసురాజును అనుగమింపఁగలవాఁడను గావున, ఉద్యానగతుఁడైన మత్స్వామితోన్=(కోలాహలపర్వతమందలి) ఉద్యానమున నున్న నా స్వామియైన వసురాజుతో, నమేరు సమేధమాన మంజుల చ్ఛాయలన్=పొన్నచెట్లయొక్క పెంపొందుచున్న (విస్తరించుచున్న) హృద్యమైన (చల్లని) నీడలందు, కరం బలరుచు=చక్కగా సుఖించుచు, నీలగ్రీవ నిలయాభిరామ సీమలఁ దెలియుచు=నెమిళ్ళకు తావులైన సుందరప్రదేశముల నరయుచు (‘నీలకంఠౌ శిఖీశ్వరౌ’-నానార్థరత్నమాల), సుమనో మనోజ్ఞ ధామములు మెచ్చుచున్=పూవులతో మనోహరమైన పొదరిండ్లను ప్రశంసించుచు (‘సుమనాః పుష్ప మాలత్యోః త్రిదశే కోవిదేఽపి చ’–విశ్వకోశము), పుష్కరసరోవరోర్మిసంభ్రమములు గనుచున్=పద్మసరస్సులందలి తరంగసంచలనంబులం బరికించుచు (పుష్కరశబ్దము పద్మమునకు, పుష్కరద్వీపమునకు, పుష్కరతీర్థమునకు పేరు; ‘పుష్కరం … పద్మే తీర్థౌషధి విశేషయోః’- అని అమరము. అందుచే పుష్కరసరోవర మనఁగా పద్మసరోవరము), రంభాదిలాస్య సంరంభముల్ దిలకించు కొనుచున్= అరంటులు మున్నగు చెట్లయొక్క చక్కని తూఁగులను జూచికొనుచు (రంభాశబ్దము అరఁటికి, రంభ యను అప్సరసకు, వేణుదండమునకు పేరు; ‘రంభా కదళ్యప్సరసో రంభో వైణవదండకే’ – విశ్వకోశము), కిన్నరమృదు ధ్వనులు వినుచున్=కిన్నర పక్షులయొక్క కోమలగానములు వినుచును, శిశిరశిఖరిస్థలంబు లీక్షించుకొనుచున్ = (నీడలతో) చల్లనైన వృక్షములు గల స్థలములను జూచికొనుచును (‘తరు శైలౌ శిఖరిణౌ’- అమరము), చంపకారణ్యమరయుచున్= సంపెంగల వనమును జూచుచును, జగతిన్=భూమియందు, అద్భుతంబయిన=ఆశ్చర్యకరమైన, పుండరీకకేదారసేతువైఖరికిన్=తెలితామర మళ్ళయొక్కకట్టల పొందికకు (పుండరీకం సితామ్భోజం’ – అమరము), ఇచ్చగించుచున్ =మెచ్చుకొనుచును, వచ్చి వచ్చి… తర్వాతి పద్యముతో నన్వయము. ఇచ్చట ‘కిన్నరమృదుధ్వనులు వినుచున్’ అను వాక్యమువల్ల కిన్నరపక్షులు మనోజ్ఞమైన గానము సేయుచు కోలాహలపర్వతమున కెగిరి పోగా ప్రథమాశ్వాసములో చెప్పినట్లుగా ‘ఆ లోకాద్భుతవిహగయుగాలోకప్రీతివలన’ వసు రాజును గూడి తానాపర్వతమునకు వచ్చిన విషయమును గూడ వ్యంజించుచున్నాడు.

సామాన్యముగా నిరంతరనిర్ఝరీప్రవాహమువలె సాగు రామరాజభూషణుని పద్యగమన మీపద్యములో కొంతవఱకు త్రుటితముగా సాగుటకు కారణ మీపద్యమందలి అననుస్యూతమైన వివిధస్థలదర్శన కథనము. అది చక్కగా నీపద్యగమనములో ప్రతిబింబితమైనది.

సరసదరీఝరీ వికచసారససౌరభసారపూరితాం
బరమగు నిమ్మహానగము పజ్జనె యానవపద్మినీమనో
హరుఁడు వెలుంగ నాయన కుపాయన మిచ్చుటఁ గూర్చువాఁడనై
యరయుదుఁ బద్మినీసముదయం బని వచ్చితినమ్మ నెచ్చెలీ! 2-94

ఈపద్యంలో నామాయాయతి/నర్మసచివుఁడు తనస్వామికి ఉపాయన మిచ్చుటకై పద్మినులను (తామరతీఁగలను సూర్యుని కొఱకును, పద్మినీజాతిస్త్రీలను రాజుకొఱకును) వెదకుటకై వచ్చినానని తెల్పుచున్నాఁడు. సరస=రసవంతమైన, రమణీయమైన యనుట, దరీ=గుహాప్రాంతములందలి, ఝరీ=ప్రవాహములందు,వికచ=వికసించిన, సారస=పద్మములయొక్క, సౌరభసార=మేలైన సుగంధము చేత, పూరితాంబరమగు=నిండింపఁబడిన ఆకాశము గలదైన, ఇమ్మహానగము పజ్జనె=ఈగొప్ప (కోలాహల)పర్వతప్రాంతమందే, ఆనవపద్మినీమనోహరుఁడు=ఆనవపద్మినులకు (తామరతీఁగకని సూర్యపరముగ, పద్మినీజాతిస్త్రీకని రాజపరముగ నన్వ యము) ఇష్టుఁడైన యతఁడు (సూర్యుఁడు, వసురాజు) వెలుంగన్=విలసిల్లఁగా, నభోగమనముచే సూర్యుఁడును, విహారాసక్తిచే వసు రాజును కోలాహలపర్వతప్రాంతమున నుండఁగా ననుట, తాను వారికి సేవావృత్తి వహించువాఁడు గావున, వారికి కానుక నిచ్చుటకై పద్మినులను (సూర్యునికై తామరతీఁగలను, రాజునకై పద్మినీజాతి స్త్రీలను) వెదకుటకై వచ్చితినని నిపుణముగా ప్రకృతాప్రకృతార్థ ద్వయముతోఁ దనరాకకు కారణముగాఁ బల్కుచున్నాఁడు. ఆకసము పద్మసుగంధభరితమగుటచే నచట పద్మినులు (తామరతీఁగలు) ఉండునని, ముందే ‘తరువుల పొంతఁ బొంచి’ కన్గొనియుండుటచే నచట పద్మినులు (పద్మినీజాతి స్త్రీలు) ఉన్నారని వారికై వెదకుచు వచ్చినానని విశేషార్థము. ఇంకను గిరిక నుద్దేశించి మంజువాణితో నిట్లనుచున్నాఁడు.

అనుపమభాగ్యలక్షణసమన్విత యీరమణీలలామ యీ
మనసిజరాజరాజ్యరమ మానసవీథిఁ దలంప సింధునం
దన యచలేంద్రనందన యనం గననయ్యెడు నీలతాంగి పా
వనకులగోత్రభూతి చెలువా! చెలువారఁగఁ దెల్పవే యనన్. 2-96

మన్మథరాజరాజ్యలక్ష్మివలె భాసిల్లెడు నీనిరుపమభాగ్యలక్షణసమన్వితయైన కాంతారత్నమునుగూర్చి నామనమున వితర్కింప నీమె సాక్షాత్తుగా సింధునందన= పాలసముద్రమునకు బుట్టిన లక్ష్మీదేవియో, యచలేంద్రనందన=శైలేంద్రుఁడైన హిమవంతుని పట్టియైన పార్వతియో, అనన్=అన్నట్లుగా, కననయ్యెడిన్=తోఁచుచున్నది. చెలువా=ఓమగువా! ఈలతాంగి=తీఁగవలె సుకుమారమైన తనువు గల యీమెయొక్క, పావనకులగోత్రభూతిన్=పవిత్రమైన కులనామములవైభవమును, చెలువారఁగన్=ఇంపుమీరఁగా, తెల్పవే యనన్ = తెల్పుమనఁగా… తర్వాతి పద్యముతో నన్వయము.

ఈపద్యములోఁ గల సింధునందన, అచలేంద్రనందన, పావనకులగోత్రభూతి యను పదములందలి శ్లేషవల్ల శ్లేషమూలక ధ్వన్యర్థము ప్రకరణోచితముగా నాస్త్రీలకిట్లు దోఁచుచున్నది. ‘సింధుస్సముద్రే నద్యాం చ’ అని విశ్వకోశము. అందుచే సింధువనగా సముద్రము నకు, నదికిని పేరు. కావున సింధునందన యనఁగా సముద్రకన్యకయైన లక్ష్మియును, శుక్తిమతీనదీపుత్త్రికయైన గిరికయును. ఆస్త్రీల కీశబ్దము చేత గిరిక యనియే అర్థమైనది.

‘అచలేంద్రనందన’యనఁగా పార్వతియే కాక, శైలేంద్రుడైన కోలాహలుని పుత్త్రిక గిరిక గూడ. అందుచేత మాయామౌని ‘సింధునందన’, ‘అచలేంద్రనందన’ యని పల్కఁగా సమక్షములో నున్నశుక్తిమతీకోలాహలులకు జన్మించిన గిరిక యనియే ఆస్త్రీలకు దోఁచినది. అంతేకాక పావన మనఁగా పవిత్రమైనది, జలము అనియు, గోత్ర మనఁగా వంశము, శైలము అనియు, భూతి యనఁగా సంపద, పుట్టుక యనియు అర్థములు. ‘పావనం తు జలే కృచ్ఛ్రే పావకాధ్మానయోరపి’అని విశ్వకోశము, ‘గోత్రం నామ్నికులే క్షేత్రే గోత్రా భువి గవాంగణే, గోత్రశ్శైలే’ – అనియు, ‘భూతిర్మాతంగశృంగారే జన్మ సంపది భస్మని’ అనియు నానార్థరత్నమాల. అందుచే ఇంతవఱకు సింధునందన, అచలేంద్రనందన యనుచు గిరికను బేర్కొనియు, ఇప్పుడు మఱల ఆమె యొక్క ‘పావనకులగోత్రభూతి’ని దెల్పుమనఁగా నతఁడు మున్ను నుడివిన విషయమునే ఇట్లు మఱింత రూఢిగా పల్కుచున్నా డనియు, ఎట్టయెదుట నున్న నదీశైలముల పుత్త్రిక గిరికాజన్మవృత్తాంతము నతఁడు మునీశ్వరుఁడు గావున ‘మానసవీథి’ దలంచి, అనఁగాయోగదృష్టిచేఁ గనుగొనియు తమయందలి గౌరవముచే తమనోట మఱల వినగోరుచున్నాడనియు ఆస్త్రీలకు దోఁచినది.
కాని అతనికి గిరిక నదీశైలముల పుత్త్రిక యను విషయమింకా తెలియదు. ఒక అందెకత్తెయు, సులక్షణాన్వితయు నైన యౌవనవతిని గన్నపుడు ఈమె లక్ష్మియో, పార్వతియో అన్నట్లున్నది – అనుట సహజము. అట్లు యాదృచ్ఛికముగా బల్కిన ఆ కపటయతి వాక్యములు శ్లేషగర్భిత ప్రౌఢోక్తు లగుటచే వారి కామెయొక్క యథార్థజన్మక్రమమునే యతఁ డరసి పలుకుచున్నట్లు దోఁచి, ఆస్త్రీలుత్తే జితలై, తమ యనుభావములను నాశ్చర్యభరమైన దృష్టులతో నన్యోన్యముఖముల నాలోకించుచు ప్రదర్శించినారు. ఇట్లతని యతిత్వ మహత్వములందును, అతని భూతభవిష్యద్విషయవేత్తృతయందును వారికి విశ్వాసము పెంపొందినది. ఈవిషయమును రామరాజ భూషణుఁ డీ క్రింది యందమైన పద్యములో దెల్పినాడు:

అతులప్రౌఢవచోనుభావముల ప్రోవై మించు నావంచనా
యతి యాదృచ్ఛికసూక్తి సూటిపడ, నన్యోన్యాలోకనా
యతనానాద్భుతలీలఁ దేలి మునిమాహాత్మ్యంబు వర్ణించి రా
శతపత్రేక్షణ లెల్ల నుల్లముల విశ్వాసంబు సంధిల్లఁగన్ 2-97

ఈసన్నివేశమువల్లనే తర్వాతి మంజువాణీప్రోక్త గిరికాజన్మకథనమునకు బీజము పడినది. అప్పుడు మంజువాణి ఆమునిరాజుతో సవినయమ్ముగ నిట్లు వల్కినది:

అయ్యెడ మంజువాణి వినయమ్మున నమ్మునిరాజుఁ బల్కు, నో
యయ్య! సమస్తలోకభరణాభరణాత్మ మహామహోజ్జ్వలున్
నెయ్యము మీఱఁ గొల్చి మహనీయశుభోన్నతిఁ గాంచి యున్న మీ
కియ్యఖిలప్రపంచకథలెల్ల నెఱుంగుతెఱంగు చోద్యమే? 2-98

ఈపద్యభావమిది: ‘ఆర్యా! సమస్తలోకభరణమే ఆభరణముగాఁగలవాఁడై, తనదైన గొప్ప యుత్సవముచేత మహోజ్జ్వలుఁడైన (‘మహ ఉద్ధవ ఉత్సవః’-అమరము) సూర్యభగవానుని నాప్తభావమునఁ గొల్చి, గొప్పనైన శుభాధిక్యముఁ గన్న మీకు సమస్త ప్రపంచమునందలి గాథలు (సమాచారములు) తెలిసియుండుట చోద్యము గాదుగదా!’ సూర్యునికి కర్మసాక్షి, జగచ్చక్షువు, లోక భాంధవుఁడు, మిత్రుఁడు అని పేర్లుండుటచే అతనికి లోకభరణమే ఆభరణముగాఁ జెప్పఁబడినది. అట్టి సూర్యుని ఆప్తభావముతోఁ గొల్చి, అతనిని సదా అనుగమించుచు నున్న మౌనికి లోకవృత్తాంతము లెల్లఁ దెలియుట ఆశ్చర్యము గాదని విశ్వసించి నతనితో మంజువాణి మరల నిట్లనుచున్నది.

అనుపమభాగ్యలక్షణసమన్విత యీరమణీలలామ యీ
మనసిజరాజరాజ్యరమ మానసవీథిఁ దలంప సింధునం
దన యచలేంద్రనందన యనం గననయ్యెడు నంచు నిట్లు పే
ర్కొనియును గ్రమ్మఱం దెలియఁగోరుట కూరిమిపెంపునం గదా! 2-99

కావున నీవనజానన, పావనజననక్రమంబు భవదీయదయా
శ్రీవలన విన్నవించెద, నే వినుమని యవ్విలాసినీమణి పలికెన్. 2-100

ఈపద్యముల భావమిది: నిరుపమభాగ్యలక్షణసమన్వితయు, మన్మథరాజరాజ్యలక్ష్మియు నైన ఈరమణీలలామ (గిరికాదేవి) నదీ కులపర్వతముల పుత్త్రిక కాబోలునని ‘మానసవీథి’దలంచి (యోగదృష్టిచే గన్గొని) పల్కియు, మఱల నామె ‘పావనకులగోత్రభూతి’ని (నదీకులశైలములవలన నైన జన్మమును) దెల్పుమనుట మీకు మాపైనిఁగల అధికమైన అనుగ్రహముచేతనే కదా! అందుచేత ఈపద్మ ముఖియొక్క పావన (పవిత్రమైన, నీటి సంబంధమైన) జననక్రమమును మీదయావిశేషముచేత విన్నవించెదను, విందురుగాక!’ అని పల్కి, మంజువాణి ఆవిషయమును వివరించినది.

ఇంతటితో ఈవ్యాసముయొక్క పరిధి ముగిసినది. ఇచ్చటినుండి ఆరంభమగు శుక్తిమతీకోలాహలుల వృత్తాంతకథనము పలువురిచే విశ్లేషింపఁబడినది కావున దానిని మఱల నేను స్పృశించుట లేదు. కాని ఇచ్చట విశ్లేషించిన విషయమే తర్వాతి శుక్తిమతీ కోలాహలుల వృత్తాంతకథనమునకు బీజము వేసినదనుటలో సందేహము లేదు. నర్మసచివుఁడు యథార్థముగా బల్కిన స్వవిషయమును, శ్లేష ద్వారా ఆస్త్రీలయొక్క వర్తమానస్థితికి అన్వయించునట్లు గూర్చుట ఈరచనలోని గొప్పవిశేషము. దీనికి అతని యతివేషము తోడ్పడినది. ఇట్లతని కీసందర్భములో యతివేషమును వేసిన రామరాజభూషణుఁడు మహాకవిగానే కాక గొప్ప నాటక కర్తగా గూడ దర్శన మిచ్చుచున్నాడు ఇట్లు తన యథార్థచరితము నాస్త్రీలనుండి మఱుఁగుపరచి, వారివలన గిరికాజన్మచరితమును తన వాక్చాతుర్యముచే రాబట్టుకొని నర్మసచివుఁడు తన నర్మసచివత్వమును సార్థకమొనరించికొన్నాడు. ఈ సన్నివేశములోని సంభాషణ లందలి అర్థద్వయ మత్యంతాసక్తిజనకమై, చదివినకొలది పాఠకులలో నుత్కంఠను రేకెత్తించుచు, సాక్షాత్తుగా రంగముపై నాదృశ్యమును జూచిన అనుభూతిని కల్గించుచు రామరాజభూషణుని నాటకీయకథాసందర్భసంవిధానమునకు చక్కని ఉదాహరణమై వరలుచున్నది.