(ఇంతలో వీరభద్రసోదరు లిర్వురు సభాప్రవేశము చేతురు. పెదవీరభద్రుని చేతిలో నొక బంగారు తాపిన నగిషీ చెక్కిన మంజూషిక ఉండును.)
పినవీరన:
చక్రవర్తులకు, సభకు నమస్కారము. గొప్ప అపచారము జరిగినది. దారిలో అనూహ్యపరిస్థితులవల్ల మా రాక ఆలస్యమైనది. ప్రభువులు, సభాసదులు మమ్ము క్షమింపవలెనని అర్థించు చున్నాము.
రాయలు:
మీరు మహాకవులు. ‘నిరంకుశాః కవయః’ అన్న సూక్తిని యథార్థము చేసినారు. మీరు క్షమింప నర్థింపవలసిన అవసరము లేదు. మేము క్షమింప నవసరము లేదు.
పినవీరన:
ప్రభువుల ఔదార్యమునకు కృతజ్ఞులము.
మంత్రి:
ఈనాటి కార్యమున కంతయు సిద్ధమే కదా! కావ్యకన్య సర్వశోభాలంకృతయై మీతో వచ్చినది కదా!
పినవీరన:
సందేహము లేదు అమాత్యవర్యా! భవ్యాలంకృతకావ్యకన్యాసహితునిగానే వచ్చినాను.
మంత్రి:
నిన్నటి సాయంతనము వఱకు స్వల్పభాగమైన పూర్తి కాలేదని విన్నాను. ఒక్కరాత్రిలో సర్వము ముగించి తెచ్చినారా?
పినవీరన:
ఔను అమాత్యవర్యా! ఒక్కరాత్రిలో నంతయు ముగించి తెచ్చినాను.
రాయలు:
మీకావ్యములో ఎన్ని ఆశ్వాసము లున్నవి? ఎన్ని పద్యము లున్నవి?
పినవీరన:
ఉద్వాహమునకు ముందే వధూటికావగుంఠనమును తొలగింపమంటారా మహారాజా? ఇంతమాత్రము చెప్పగలను. నిన్నటిరాత్రి పన్నెండువందలకంటెను అధికముగా పద్యములు చేరినవి. అంతకు ముందు దాదాపుగా రెండువందల పద్యము లుండినవి.
రాయలు:
ఇన్ని పద్యములు, గంటకు వంద కెక్కుడు పద్యములు నిద్రాహారములు మాని ఒక్క రాత్రిలో వ్రాయుట సాధ్యమా మహాకవీ?
పినవీరన:
అది సాధ్యము కనుకనే కావ్యము సమాప్తమైనది.
రాయలు:
ఎంత ఆశ్చర్యము! ఎంత సామర్థ్యము! ఇతఃపూర్వ మిట్టి కవితాశక్తి అశ్రుతము. (సభ నుద్దేశించి) సభలోని పండితవర్యుల అభిప్రాయమేమి? మీకిది అసాధారణముగా దోచుచున్నదా?
ఒక
పండితుడు:
ఇది అసాధారణ సామర్థ్యమే. ఏదో మహాదేవతోపాసనశక్తి ఉంటే కాని ఇట్టిది సాధ్యం కాదు. పూర్వము కాళిదాసాదులకు దేవతాప్రసాదం వల్ల ఇట్టి శక్తి కలిగిందని విన్నాము.
మఱొక
పండితుడు:
దేవీప్రసాదసిద్ధులు కోటి కొకరుండవచ్చును గాని పినవీరనగారి కిట్టి ఉపాసనాబల మున్నదా? అది తెలియదు. ఎవరో వ్రాసిన గ్రంథమునకు తాము వ్రాసిన అవతారిక, ఆశ్వాసాంత పద్యముల ముసుగు తొడిగి తమ కావ్యమని అమ్ముకొనే కవిబ్రువులు తఱచుగా నున్నారు.
పినవీరన:
(రోషముతో) ఏమన్నారు? నేనట్టి కవిబ్రువుడ నని మీ అభిప్రాయమా? వాణి నారాణి. ఔను – వాణి నారాణి. నా ఉపాస్యదేవత. నా మనోమందిరమే ఆమె ప్రాసాదం. నా కవితాసామర్థ్యం ఆ దేవి ప్రసాదమే.
పండితులు:
(కోపముతో) ఎంత గర్వం? ఎంత గర్వం? సర్వవిద్యాధిదేవత, సర్వమంత్రాధిదేవత, పరమేష్ఠిపత్ని, పరమపావని ఈయన రాణియా? ఇట్టి ప్రలాపములు ఆ మహాసరస్వతిని ప్రధాన దేవతగా నర్చించు ఈ నవరాత్రి పర్వమునందా? మహారాజుల మహాసభ యందా? ఇది మహాపరాధము. మహాపచారము. నింద్యాతినింద్యము, అవద్యము, శిక్షార్హము.
రాయలు:
పినవీరనా! ఈ ఆక్షేపణకు నీవేమందువు? నీ ఔద్ధత్యమునకు శిక్ష ననుభవించెదవా, (వ్యంగ్యంగా) లేక రక్షింపుమని నీ రాణిని ఆశ్రయింతువా?
పినవీరన:
(ఒక క్షణంసేపు సరస్వతిని మనసులో ధ్యానించుకొని) మహారాజా! సభామందిరాంతమున నొక తెరను గట్టింపుడు. నేను నారాణి నాశ్రయించెదను. ఆమెయే మీకు యథార్థము దెలుపును.
రాయలు:
అట్లే కానిండు.
(సేవకులు సభామందిరాంతమున నొక తెరను గట్టుదురు. ఆ తెర యెదుట నేలపై నిష్ఠతో గూర్చుండి పినవీరన ఈక్రింది పద్యములను చదువును.)
ప్రణవపీఠమున మంత్రపరంపరలు గొల్వ
నుండు నేదేవి పేరోలగంబు
భావజ్ఞులకుఁ బరాపశ్యంతి మధ్యమా
వైఖరు లేదేవి వర్ణసరణి
జపహార కీర పుస్తక విపంచిసమంచి
తంబు లేదేవి హస్తాంబుజములు
కుందేందు మందార కందళీ బృందంబు
చంద మేదేవి యానందమూర్తికాంచె నేదేవి కాంచనగర్భ చతుర
పూర్వదంత కవాట విస్ఫుట మనోజ్ఞ
చంద్రకాంత శిరోగృహస్థల విహార
మమ్మహాదేవి వాగ్దేవి నభినుతింతు.*వాణి! మత్సాహితీరాజ్ఞి! నేనమలిన
మానసాభోగమున ని న్ననూనభక్తి
గొలుతు నేని,యథార్థంబుఁ బలుకు మమ్మ!
సంశయము దీఱునట్టులీ సభకుఁ ద్వరగ.
(అంతట తెర వెనుక మెఱుపు నిశ్చలమై నిలిచినట్లు మహాప్రకాశము కలుగును. గౌరాంగి యగు నొక స్త్రీయొక్క కుడిచేయి తెర లోనుండి సభకు గన్పడి స్వర్ణకంకణములు ఘల్లుఘల్లుమన ‘బాఢమ్’, ‘బాఢమ్’, ‘తత్సత్యమ్’, ‘తత్సత్యమేవ’ అను మాటలు విన్పడును. అప్పుడు రాజుతో గూడ సదస్యు లందఱు ఆశ్చర్యచకితులై, నిల్చొని శారదాదేవి నిట్లు స్తుతింతురు.)
సువక్షోజకుమ్భాం సుధాపూర్ణకుంభాం, ప్రసాదావలమ్బాం ప్రపుణ్యావలంబామ్|
సదాస్యేన్దుబిమ్బాం సదానోష్ఠబింబాం, భజే శారదామ్బామజస్రం మదంబామ్||
కటాక్షే దయార్ద్రాం కరే జ్ఞానముద్రాం, కలాభిర్వినిద్రాం కలాపైః సుభద్రామ్|
పురస్త్రీం వినిద్రాం పురస్తుఙ్గభద్రాం, భజే శారదామ్బామజస్రం మదంబామ్ ||
లలామాఙ్కఫాలాం లసద్గానలోలాం, స్వభక్తైకపాలాం యశఃశ్రీకపోలామ్ |
కరే త్వక్షమాలాం కనత్పత్త్రలోలాం, భజే శారదామ్బామజస్రం మదంబామ్||
సుసీమన్తవేణీం దృశా నిర్జితైణీం, రమత్కీరవాణీం నమద్వజ్రపాణీమ్|
సుధామన్థరాస్యాం ముదా చిన్త్యవేణీం, భజే శారదామ్బామజస్రం మదంబామ్||
సుశాన్తాం సుదేహాం దృగన్తే కచాన్తాం, లసత్సల్లతాఙ్గీమనన్తామచిన్త్యామ్ |
స్మృతాం తాపసైః సర్గపూర్వస్థితాం తాం, భజే శారదామ్బామజస్రం మదంబామ్||
కురఙ్గే తురఙ్గే మృగేన్ద్రే ఖగేన్ద్రే, మరాలే మదేభే మహోక్షేఽధిరూఢామ్|
మహత్యాం నవమ్యాం సదా సామరూపాం, భజే శారదామ్బామజస్రం మదంబామ్||
జ్వలత్కాన్తివహ్నిం జగన్మోహనాఙ్గీం, భజే మానసామ్భోజసుభ్రాన్తభృఙ్గీమ్|
నిజస్తోత్రసంగీతనృత్యప్రభాఙ్గీమ్, భజే శారదామ్బామజస్రం మదంబామ్||
భవామ్భోజనేత్రాజసమ్పూజ్యమానాం, లసన్మన్దహాసప్రభావక్త్రచిహ్నామ్ |
చలచ్చఞ్చలాచారుతాటఙ్కకర్ణాం, భజే శారదామ్బామజస్రం మదంబామ్||
(ఈ స్తోత్రమును చదివిన పిమ్మట అందఱు యథాస్థానముల నాసీను లగుదురు. తర్వాత…)
రాయలు:
పినవీరభద్రకవీంద్రా! నీ మహిమ అమోఘము.
*ఎంత మహానుభావుఁడవొ, ఎంతగ నిన్ను విరించికాంత నే
త్రాంతవిలోకనోత్కటదయారససేచనఁ దన్పెనో కవీ!
ఇంతటి కావ్యకల్పనసమేధితశక్తియు, నింతపాండితిం
గాంతుమె యెందు నేనియును, కారణజన్ముఁడ వీవు వీరనా!
నీ పుణ్యమున మాకందఱికిని సువర్ణకటకసుందరమైన సరస్వతీకరదర్శనము, ఆమె గళధ్వని విను మహాభాగ్యము కల్గినది. నీభాగ్య మపారము. నీకు శిరసా వందనము చేయుచున్నాను.
పినవీరన:
సర్వము సరస్వతీప్రసాదము!
పురోహితుడు:
మహాకవీ! కావ్యార్పణమునకు శుభముహూర్త మాసన్నమైనది. సన్నద్ధులు కండు.
(పెదవీరన గ్రంథపేటిక గొనుచు రాఁగా, మదాలస స్రక్పుష్పఫలచందనతాంబూలాదుల నొక బంగరుపళ్ళెరమందిడుకొని రాఁగా, మంగళవాద్యములు మ్రోగుచుండగా పినవీరన నరసింహ రాయలమెడలో పుష్పస్రజమును వేసి, శాలువను గప్పి, ముఖమున కుంకుమ నుంచి, మదాలస కొనివచ్చిన పన్నీటిని చిలికి, నూత్నవస్త్రపుష్పఫలాదులతో గ్రంథపేటికను బంగరుపళ్ళెరంబులో నుంచి, ‘శ్రీమన్మహారాజాయ రాజపరమేశ్వరాయ కర్ణాటకాంధ్రాధీశ్వరాయ సాళువకులమండ నాయ శ్రీశ్రీశ్రీ నరసింహరాయప్రభువర్యాయ ఆంధ్రీకృత జైమినీయభారతపురాణ మిదం తుభ్య మహం సంప్రదదే నమమ. సర్వశోభనమస్తు’ అని ఆపళ్ళెరంబు నారాజుచేతిలో నుంచి అక్షతలు శిరముపై జల్లును. అట్లు చేయుచుండ పురోహితాదివేదవిప్రులు 7వ దృశ్యములో నిచ్చిన ‘అస్మి న్వసు — ప్రతి తిష్ఠతి’ అను మంత్రమును చదువుదురు. అట్లంకిత మొనరించి రాజును గూర్చి పినవీరన ఈక్రింది పద్యములు చదువును.)
శ్రీమందిర నయన సుధా
ధామాన్వయతిలక, ధైర్యధరణీధర, ది
క్సీమాధిక జయధాటీ
సామజహయసుభటరంహ సాళ్వనృసింహా!*సాళువవంశభూషణ, లసత్కవిపండితవర్గతోషణా!
మేలగుప్రోడవంచుఁ, గలిమిం బలిమిం గలవాఁడవంచు నెం
తో లలి నిన్నుఁ జేరెను మదుజ్జ్వలచిత్తసరోజజాతయౌ
నీ లలితంపుఁగావ్యరమ, యీమె చిరం బొనరించు నీప్రథన్.
రాయలు:
*ఏమన వచ్చును సుకవీ!
మామకభాగ్యము, త్వదీయమంజులకన్యా
కాముకతామహితమయిన
నామనమునఁ బూచె సౌఖ్యనవనందనమే!
మహాకవీ! ఈసువర్ణాసనము నలంకరింపుడు. (పినవీరన అట్లే చేయును.) మదాలసా! సత్కార సామగ్రిని గొని రమ్ము. మంగళవాద్యములు మ్రోగనీ!
(ఉక్తప్రకారము జరుగును. పురోహితాది విప్రవరులు 6వదృశ్యములో నిచ్చిన మంత్రములను సందర్భోచితముగా చదువుచుండగా నరసింహరాయలు పినవీరభద్రుని సన్మానించును. అనంతరము…)
సదస్యులు:
కవిచంద్రులు పినవీరభద్రులకు జై! పినవీరభద్రులకు జై!
నృపచంద్రులు నరసింహరాయలకు జై| నరసింహరాయలకు జై!
పినవీరన:
ప్రభువుల ఆదరణ అమోఘము.
◊శ్రీలావణ్య పయోనిధి త్రివళివీచీమధ్య రోమావళి
వ్యాళానల్ప సుఖైకతల్పుఁడు జగద్వ్యాపారలీలావతా
రాలంకారవిహారి శౌరి సదయుండై నారసింహక్షమా
పాలాగ్రేసర! నిన్నజస్రము నదభ్రశ్రీయుతుం జేయుతన్.