అవరోధికాహరణము

Die Entführung aus dem Serail (The Abduction from the Harem = అవరోధికాహరణము = అంతఃపురస్త్రీల అపహరణము) అనునది యోహాన్ గాట్లిబ్ స్టెఫనీ డి యోంగర్ (Johann Gottlieb Stephnie De Jongere) అను నాటకకర్తచే రచింపఁబడి, వుల్ఫ్‌గాంగ్ అమెడెయుస్ మొజార్టు (Wolfgang Amadeus Mozart) అను సుప్రసిద్ధుడైన ఆస్ట్ర్రియను సంగీతకారునిచే సంగీతబద్ధము చేయఁబడిన గేయవచన సంభాషాత్మకమైన రూపకము (Singspeil). క్రీ.శ.1778లో జోసెఫ్ II అను ఆష్ట్రియా దేశపు చక్రవర్తి National Singspeil అను నాటకసంస్థను స్థాపించి, జర్మనుభాషలో వ్రాయఁబడిన Singspeil అను ఓపెరా రచనలను ప్రోత్సహించెను. ఆకాలములో సర్వత్ర ప్రచారములో నున్న కేవలం గేయమయములైన ఇటాలియను ఓపెరాలకంటె భిన్నంగా ఈ ఓపెరాలు పాటలతోఁ బాటు వచనసంభాషణలను గూడ కల్గియుండెను. కాని ఈసంస్థ ఐదేండ్లు మాత్రమే నడచెను. ఐనను ఆ ఐదు సంవత్సరములలో కొన్ని ప్రసిద్ధమైన రూపకములు వ్రాయఁబడి ప్రదర్శింపఁబడెను. అట్టివాటిలో నన్నింటికంటె ప్రసిద్ధమై నాటినుండి నేటి వఱకును తరచుగా ప్రదర్శింపఁబడుచున్నది ఈ మోజార్టు ఓపెరా. జార్జ్ సోల్టీ (Georg Solti) సంగీతదర్శకత్వములో లండనులోని రాయల్ ఓపెరాహౌజ్ ఆర్కెస్ట్రా (Royal Opera House Orchestra) ప్రదర్శించిన ఇంగ్లీషు లఘువ్యాఖ్యలతోఁ గూడిన ఈ ఓపెరాయొక్క ప్రశస్తమైన ప్రదర్శనను ఈ లంకెద్వారా చూడవచ్చును.

కథాసంగ్రహము

సముద్రయానములో పడవదొంగలచేత నపహరింపఁబడిన స్పెయినుదేశపు రాజ కుమారి కాన్‌ష్టాన్జ్, ఆమె ఇంగ్లీషు సేవకురాలు బ్లాండా, బ్లాండా ప్రియుఁడైన పెడ్రిలో తుర్కీ దేశమందలి సలీం అను ముస్లిము రాజునకు బానిసలుగా అమ్మబడుతారు. ఆస్త్రీలు అతని అంతఃపురంలో బందీలుగా చిక్కుతారు. పెడ్రిలో సేవకుఁడుగా నియమింపబడుతాడు. కాన్‌ష్టాన్జ్ ప్రియుఁడైన బెల్మాంటె ఈముగ్గురిని వారి బంధమునుండి తప్పించి స్పెయినుకు గొని పోవుట ఇందలి ఇతివృత్తము. ఇందలి కథ సంగ్రహముగా నిట్లున్నది:

ప్రథమాంకము: బెల్మోంటె తన ప్రియురాలైన కాన్‌ష్టాన్జ్‌ను వెదకికొంటూ తుర్కీదేశపు సముద్రతీరమందున్న నగరంలోని పాషా సలీం అంతఃపురావరణంలోని తోఁటకు జేరుకుంటాడు. అక్కడ అతఁడు ఆ అంతఃపురరక్షకుఁడైన ఉస్మానును చూచి పెడ్రిలోకై అడుగుతాడు. కాని చాలా కర్కశస్వభావుఁడైన ఉస్మాన్ అతనికేమీ చెప్పడు. అతనితో విసిగి, బెల్మోంటె ఒక పొదచాటున దాఁగుతాడు. కొంతసేపటికి పెడ్రిలో ఆతోఁటలోనికి వస్తాడు. ఇంతలో ఉస్మానట నుండి నిష్క్రమిస్తాడు. అప్పుడు బెల్మోంటె పెడ్రిలోను కలసికొని, పాషా కమ్మబడిన ఆ ముగ్గురిని అపహరించుకొని స్వదేశమునకు తీసికొనిపోవుటకు తాను సముద్రతీరంలో ఓడను సిద్ధముగా నుంచినానని తెల్పుతాడు. ఇంతలో కాన్‌ష్టాన్జ్‌తో జలవిహారానికి పోయిన పాషా సలీం ఆమెతో సహా అక్కడికి వస్తాడు. అతఁడచ్చట తన ప్రేమ నంగీకరింపుమని ఆమె నర్థిస్తాడు. కాని ఆమె విముఖత కనఁబఱచి తన మనస్సునందుల కనుకూలంగా మార్చు కొనుటకు ఒకరోజు వ్యవధి నిమ్మని అర్థించి నిష్క్రమిస్తుంది. పాషా వచ్చినపుడు దాఁగి కొన్న పెడ్రిలో బెల్మోంటెలు అప్పుడు పాషాకు కన్పడి అతని కభివాదం చేస్తారు. పెడ్రిలో బెల్మోంటె ఉద్యానవనశిల్పిగా పాషా సేవచేయుటకు వచ్చినాడని తెల్పుతాడు. పాషా మర్నాడతని నైపుణ్యాన్ని పరీక్షించి నియమించుకొంటానని, అంతవఱకు పెడ్రిలోతో నతఁడుండవచ్చునని చెప్పి నిష్క్రమిస్తాడు. ఇంతటితో ప్రథమాంకం ముగుస్తుంది.

ద్వితీయాంకము: బ్లాండా తోఁటలో నుండఁగా ఉస్మాన్ ఆమెతో గడపుటకు వస్తాడు. సర్వాధికారాలతో పాషా తనకామెను సేవికగా నిచ్చినాడని అందుచేత ఆమె తన వశవర్తియై యుండవలెనని అతఁ డామెను లోబఱచుకొన యత్నిస్తాడు. కాని ఆమె చాలా దురుసుగా ప్రవర్తించి అతని నక్కడ నుండి వెడలగొడుతుంది. నిర్ణయించుకొనడానికి కాన్‌ష్టాన్జ్‌‌ కిచ్చిన వ్యవధి ముగియ నున్నదని, అందుచేత తన నంగీకరింపుమని, లేకున్న చిత్రవధ పాలౌతావని పాషా ఆమెను బలవంతం చేస్తాడు. కాని తాను చిత్రవధకైనా, ప్రాణత్యాగానికైనా సిద్ధమేకాని తన ప్రియుఁడైన బెల్మోంటెను మాత్రం వంచింపనని పాషానామె నిరాకరిస్తుంది. తర్వాత కాన్‌ష్టాన్జ్‌‌, బ్లాండా, బెల్మోంటె, పెడ్రిలోలు నల్వురూ కలుసుకుంటారు. మధ్య రాత్రి వేళ ఆ స్త్రీల యొక్క గదుల కిటికీల కెదురుగా నిచ్చెనపై తాముంటామని, అప్పుడు కిటికీ ద్వారా దూరి బయటికివచ్చి తమతో రేవులో నుంచిన ఓడలో అదే రాత్రి పాఱి పోవచ్చునని బెల్మోంటె, పెడ్రిలోలు తమ ప్రియురాండ్రైన కాన్‌ష్టాన్జ్‌‌, బ్లాండాలకు తెల్పుతారు. వారందుకు సిద్ధముగా నుందుమని తెల్పుతారు. ఇంతటితో ద్వితీయాంకము ముగుస్తుంది.

తృతీయాంకము: మునుపనుకున్నట్లుగా మధ్యరాత్రి పారిపోవుటకు సమయమైనదని పెడ్రిలో సంకేతమిస్తాడు. అప్పుడు తన కిటికీ కెదురుగా నుంచిన నిచ్చెనద్వారా కాన్‌ష్టాన్జ్‌ బెల్మోంటెనుగూడి కొంతదూరం పలాయనమౌతుంది. తర్వాత అట్లే పరారీ యగుటకు పెడ్రిలో బ్లాండాలు నిచ్చెనపైనుండి దిగగానే ఉస్మాన్ వారిని పట్టుకొని పెద్దగా అఱచి రక్షకభటులను పిలుస్తాడు. వారు పెడ్రిలో బ్లాండాలను బంధించడమే కాక, కొంతదూరం పాఱిపోయిన కాన్‌ష్టాన్జ్‌ ‌బెల్మోంటెలను కూడ పట్టుకొని బంధిస్తారు. కాన్‌ష్టాన్జ్‌‌ బెల్మోంటెలను భటులు సలీం కడకు గొనిపోతారు. అప్పుడు బెల్మోంటె తాను రాజసంతతివాడనని తమను వదిలిపెడితే ఎంత పారితోషకమైనా తన తండ్రిచేత ఇప్పిస్తానని తన తండ్రిపేరును చెపుతాడు. ఆపేరు వింటూనే సలీం అత్యంతక్రుద్ధుఁడై, అతని తండ్రియే తన సర్వస్వాన్ని హరించిన తన బద్ధశత్రువని బెల్మోంటెకు తెల్పి, తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా బంధితులైన వారికి మరణశిక్ష ప్రాప్తమౌతుందనే భావాన్ని ప్రకటించి నిష్క్రమిస్తాడు. కాన్‌ష్టాన్జ్‌‌ బెల్మోంటెలు ప్రాణాలపై ఆశ వదలుకొని, సహమరణానికి సిద్ధమౌతారు. ఇంతలో పాషా తనకు మహాపకారం చేసిన బెల్మోంటె తండ్రియొక్క క్రూరపద్ధతి ననుసరించి ప్రతీకారేచ్ఛతో తుష్టినందుటకంటె కరుణతో అభయప్రదానం చేయుటలోనే సజ్జనత్వమూ, అంతకంటె అధికమైన తుష్టి ఉన్నదని భావించి, ఆనల్గురికి అభయప్రదానం చేసి వారికి స్వేచ్ఛను ప్రసాదించటంతో తృతీయాంకం ముగుస్తుంది.

ప్రస్తుతప్రయత్నం

స్థూలంగా ప్రేమకథయైన ఈ ఓపెరాను చాలా స్వల్పమైన మార్పులతో అనుసృజన చేసితిని. కాన్‌ష్టాన్జ్‌‌ బెల్మోంటెల పేర్లను అంతకంటె లలితమైన, అర్థవంతమైన అరియానా (Graceful) అమాండో (Loving)లుగాను, బ్లాండాపేరును బెలిండా (Beautiful) గాను మార్చితిని. మూలమందలి రెండవ అంకములో కాన్‌ష్టాన్జ్‌‌ బ్లాండాలు తుర్కీ అంతఃపురవాసినులుగా నుండుటవల్ల బెల్మోంటె, పెడ్రిలోలు వారి శీలమును శంకించినట్లు ఒక చిన్న దృశ్యమున్నది. కాని ఇట్టి దృశ్యము ప్రేమప్రధానమైన ఈ ఓపెరాస్థాయికి కొంత విఘాతక మగుటచేతను, ఇతరదృశ్యములలో వారి శీలపవిత్రతను ఇదివఱకే స్పష్టముగా నిరూపించి యుండుటచేతను ఆదృశ్యమును నేను వదలివేసితిని.

పాత్రలు

అమాండో (Belmonte) 24 సంవత్సరముల స్పెయిన్ రాజవంశీకుఁడు
అరియానా (Konstanze) 22 సంవత్సరముల అతని ప్రియురాలు
బెలిండా (Blonda) 20 సంవత్సరముల అరియానాయొక్క ఇంగ్లీషు సేవిక
పెడ్రిలో 22 సంవత్సరాల అమాండో సేవకుఁడు, బెలిండా ప్రియుఁడు
సలీం 34 సంవత్సరముల తుర్కీ మాండలికుఁడు
ఉస్మాన్ 45 సంవత్సరముల సలీం సేవకుఁడు, అంతఃపురరక్షకుఁడు

ఛందస్సులు

ఇందులో వాడిన ఛందస్సులకు సూచికలు: 1.చతురస్రగతి, 2.ఖండగతి, 3:మిశ్రగతి, 4.త్ర్యస్రగతి, 5.తేటగీతి, 6.ఆటవెలది, 7.కందము, 8.ద్విపద, 9.ద్విపదతుల్యము, 10.ఉత్పలమాల.


ప్రథమాంకము-ప్రథమదృశ్యము

(స్థలము: తుర్కీదేశంలో మధ్యధరాసముద్రతీరంలో గల రాజధానినగరంలో నున్న సలీ మనెడుమాండలికుని ప్రాసాదం, దాని ననుసరించి ఉన్న ఒకతోఁట. తన ప్రేయసి అరియానా అను యువతిని వెదకుచు వచ్చిన అమాండో ఆతోటలో ప్రవేశించి తన హారంయొక్క పతకంలో నిక్షిప్తమైన ఆమె ఆకృతిని జూచుచు ప్రేమతో నిట్లు పాడును.)

అమాండో:

పాట (చతురస్రగతి)

పల్లవి:
అరియానా! అరియానా! నా
యాఱవప్రాణమ అరియానా!
చరణం1:
అంబుధివిహరణ నలరెడు వేళను
అంబుధిచోరుల హస్తములం బడి
నీవపహృతి నందిన దాదిగ నా
జీవిత మయ్యెను చీకటిమయమే.
చరణం2:
తిరుగుచు నీకై దేశము లెన్నియొ
నరయుదు నిన్నిట నని యాశించుచు
చనుదెంచి నినుం గనుగొన వెదకుచు
క్షణమే యుగముగఁ గడపుచునుంటిని.
చరణం3:
నినుఁ గూడినచో మన జీవితముల
ననయును మఱలను నవ్యానందము
చెదరును ముదిరిన చీకటు లనుచును
వెదకుచు వచ్చితి ప్రేయసి! నీకయి
చరణం4:
నినుఁ గొనిపోవఁగ నీరధితటమున
నొనరించితిఁ దరణిని నాయత్తము
అనుకూలించిన నన్నియు నీవీ
దినమే స్వేచ్ఛను గనెదవు ప్రేయసి!

(ఇంతలో నాప్రాసాదమునుండి సలీము సేవకుఁ డుస్మాననువాఁడొక నిచ్చెనతోఁ గూడ బయటికి వచ్చి, ఆ నిచ్చెన నొక చెట్టున కానించి యుంచి, క్రిందివిధముగాఁ బాడుచు తోఁటపని నారంభించును.)

ఉస్మాన్:
పాట (ఖండగతి)
అనుకూలవతి యైన అందాల బరిణనుం
గనుగొన్న రసికుండు నెనరార నామెనుం
బొదివి గాటంబుగా హృదయంపుగూటిలో
కొదలేని ముద్దులం గుఱిపించి సొగయించి

అకలంకమోహంపుటంబుధిం దేలించి
సుకియింపఁగాఁ జేసి సుకియింపవలెఁ దాను!
లాలలా సాలలా సాలలా లాలలా
లాలలా సాలలా సాలలా లాలలా!

అమాండో:
(తనలో) వీని నడిగి ఆమె ఆచూకిని కనుగొందునేమొ!
(సమీపించి) హే మాలీ! ఇది పాషా సలీం భవనమేనా?
ఉస్మాన్:
(అతనిని విస్మరించి పూర్వమువలెనే పాడుచు పనిచేయును)
కాని చలియించు మేఘంబు చందంబు
మానినీప్రేమంబు మాఱుచుండు సతంబు
క్రొత్తవిటులం గూడి క్రొత్తరుచులం జూడ
చిత్తంబు తమకించు చెల్వలకు నిరతంబు

అందుచే నుంచవలె మందిరాంతరమందె
ఇందీవరాక్షులను నితరులం గనకుండ
లాలలా సాలలా సాలలా లాలలా
లాలలా సాలలా సాలలా లాలలా!

అమాండో:
(మఱల) వృద్ధమిత్రమా! ఇదేనా పాషా సలీం ప్రాసాదం?
ఉస్మాన్:
(మఱింత నిర్లక్ష్యంతో అతనిని విస్మరించి ఇంకను పాడుచు పనిచేయును)
పండువెన్నెలరేల పడఁతివర్తన లెల్ల
దండిగా గమనించుచుండవలె నేమరక
ఏమరిన నెవ్వఁడో ఇచ్చకంబుల నాడి
ఆమెనుం గొనిపోవ యత్నించుచుండు

దానితో నింటికిం దాళంబు లుండఁగనె
స్తేనవశమైపోవు లోనున్న సొమ్మెల్ల!
లాలలా సాలలా సాలలా లాలలా
లాలలా సాలలా సాలలా లాలలా!

అమాండో:
2చాలించి నీదువికృతాలాపములొకింత
ఆలింపవోయి నా యభ్యర్థనము నింత!
ఉస్మాన్:
9ఏల యఱతువు కాకివోలె నెల్గెత్తి?
నే లేను పనిలేక నీగోడు వినఁగ
ఏగంగనుంటి నేనిప్పుడే గాన
నీగోడు వినిపించు వేగంబుగాను
అమాండో:
ఇదేనా పాషా సలీం భవనం?
ఉస్మాన్:
ఐతే కావచ్చు. దానితో నీకేం పని?
అమాండో:
అదే అతిముఖ్యం!
ఉస్మాన్:
ఏం కన్నం వేయుటకా? కొల్లగొట్టుటకా? కన్నెల నపహరించుటకా?
అమాండో:
అదేం కాదు. చెప్పు, ఔనా కాదా అంతే!
ఉస్మాన్:
(అనాదరంతో) పాషాభవనమే యిది.

అమాండో:
ఐతే ఇందులో నాప్రియమిత్రుఁ డున్నాడు
ఉస్మాన్:
త్వరగా ముగించు. నెనేఁగవలె నింక!
అమాండో:
వాని పేరు పెడ్రిలో!
ఉస్మాన్:
ఆదుర్మార్గుడా? వాని నిప్పుడే ఉరికంబ మెక్కించవలె!వాని పేరును నేనెత్తను.(తనలో) వీఁడు గూడ అటువంటివాఁడే!
(మఱలి, భవనములోనికి పోఁబోవును)
అమాండో:
ఆగు మొకక్షణము. అది నీ అపోహ, వాడుత్తముఁడు, నమ్మఁదగిన వాఁడు!
ఉస్మాన్:
ఔను. ఇప్పుడే ఉరికంబ మెక్కింపఁ దగినంత ఉత్తముఁడు!
అమాండో:
(తనలో) ‘వీడెంత క్రూరుఁడు!’ (ప్రకాశంగా) నీవు వాని నెఱుఁగవు. వాఁడు నిజంగా మంచివాఁడు!
ఉస్మాన్:
వాఁడు మంచివాఁడే, నీవూ మంచివాఁడవే! ఇద్దఱూ ఒకేసారి ఉరిదీసి నీటనెట్టఁ దగినవారు. (మఱల లోపలి కేఁగఁ బోవును.)
అమాండో:
ఆగు మొక్కక్షణము. నేను…
ఉస్మాన్:
ఔనౌను. అంతిపురిలోనఁ దూరి, ఇంతులన్ హరియింప నెంతువంతేనా? అందుకొఱకేనా?

5ఇట్టివారల కాల్సేతు లిపుడె కట్టి
నెట్టవలె లోయలోనికి గట్టునుండి!

అమాండో:
అంతక్రౌర్యమేల, నామాట వినవేల?
ఉస్మాన్:
(మఱింత క్రౌర్యంతో)
మాటలాడ కెక్కువ! పోపొమ్మిటనుండి! నీముఖ మింక నాకుఁ జూపకు.
అమాండో:
(తనలో) ఇంక వీనితో లాభం లేదు. ఇచ్చటనే దాఁగి, పెడ్రిలో కన్పడునో యేమో వేచి చూస్తాను. (పోయి ఒక పొదచెంత దాఁగును)

ద్వితీయదృశ్యము

ఉస్మాన్:
(తనలో) పరమదుర్మార్గుఁడు పెడ్రిలో ఒక్కఁడు చాలడా? వానికిఁ దోడుగ వీనినిఁ గూడ కట్టుకొనవలెనా? వీరి నిర్వాకమేమి, ఆ బానిసప్రియురాండ్రను నానుండి అపహరింపఁజూచుట దక్క? ఒక్క ఱాయి చాలదా తల బాదుకొనుటకు? రెండు ఱాలు గావలెనా?
పెడ్రిలో:
(ప్రవేశించి) ఏం ఉస్మాన్ ఎట్లున్నావు? పాషా ఇంకా సముద్రవిహారంలోనే ఉన్నాడా?
ఉస్మాన్:
(కోపంతో) నన్నెందుకు అడుగుతావు? నీవే తెలిసికొనలేవా?

7పనిలేని యట్టి పలువలె
పనివారల పనుల నిట్లు భంగము సేతుర్
పనియేమి నీకు సలీం
జనపతితోఁ, దలఁతువిట్లు సమయముఁ బుచ్చన్

పెడ్రిలో:
6 ప్రజ్వలించు నగ్నిపర్వతంబును బోలి
మండిపడుదువేల మఱలమఱల
నేను చేసినట్టి నేరమేమియు లేదు
వరలలేమె మిత్రవరుల మగుచు?
ఉస్మాన్:
నేరమేమియు లేదా? నీముఖం చూపడమే ఒక నేరం. పాషా కిష్టుఁడ వైనందు కింకా బ్రతికే ఉన్నావు. లేకున్న ఎప్పుడో నీ మొండెం తల నుండి వేఱయ్యెడిదే!
పాట (చతురస్రగతి)
పల్లవి:
పలువలు తులువలు పంచనఁ జేరుచు
చెలువల, మాచెలువలఁ జేకొనఁ జూతురు
చరణం1:
వలపులు గుప్పుచు వనితలఁ దమకున్
సులభులుగ నొనర్చుకొనం జూతురు
పనులను మాలుచు వనితలఁ జూచుచు
దినము వ్యయించుచుఁ దిరుగుచు నుందురు
చరణ2:
అమితంబగు శ్రద్ధాసక్తులతో
శ్రమియించెడు నస్మాదృశులకు నీ
యలసుల తీరుల నవలోకించిన
వలగొను కినుకను వపువే మండును
చరణ3:
మోసంబులతో ముఖసంస్తుతితో
పాషాకరుణం బడయుచు నుందురు
అది యండగఁ గొని అభికత్వముతో
ముదితలఁ జూచుచు మురియుచునుందురు
చరణం4:
ఈకామాంధులు నీస్త్రీలోలురు
సాకల్యముగా సమయుటె శ్రేయము
అల్లాకృపచే నదియే జరిగిన
నుల్లాసముతో నురకలు వైతును
పెడ్రిలో:
ఎంత క్రూరుఁడవీవు, నిష్కారణంబుగా నన్ను దూషింతువు.
ఉస్మాన్:
5కలదు నీముఖమం దురికంబ మెక్క
దండితుండగువాని వక్త్రంబునందు
గల్గు కళయేను, చాలు నాకారణంబె
దూష్యునిగ, ద్వేష్యునిగ నిన్నుఁ దూలనాడ!

(పాడును)

1మొదటను నీతల ఖండితమగును
పదపడి యది ఉరి దీయంబడును
అటుపై చర్మం బొలువఁగఁ బడును
తటుకున నిప్పులఁ గాల్పంబడును
గట్టిగ త్రాళులఁ గట్టంబడును
తుట్టతుది న్నీటను నెట్టంబడును
(కోపంతో భవనంలోనికి నిష్క్రమించును.)

తృతీయదృశ్యము

పెడ్రిలో:
(తనలో)

5నీవె పాషావయిన యట్లు నిష్ఠురముగ
మాటలాడెదవేల ఉస్మానుఖాను!
ఎవరు గెల్తురొ, ఓడెద రింక నెవరొ
కాలమే తెల్పు, ఆగ్రహమేల నీకు?

అమాండో:
(పొదచాటునుండి వెడలి, పెడ్రిలోను సమీపించి) పెడ్రిలో పెడ్రిలో! ప్రియమైన పెడ్రిలో!
పెడ్రిలో:
(సంభ్రమాశ్చర్యాలతో అమాండో కడ కుఱికి, అతని నాప్యాయంగా కౌఁగిలించుకొని) స్వామీ! స్వామీ! ఏమాశ్చర్యం? ఇది మీరేనా? నా జాబులు మీకందినవా?
అమాండో:
నేనే నేనే ప్రియపెడ్రిలో! ముందుగా చెప్పు. నా ప్రేయసి అరియానా జీవించే ఉన్నదా?
పెడ్రిలో:
ఆమె సజీవంగానే ఉన్నది. ఇతరాశలన్నీ వమ్మైన యామె నీ పున ర్దర్శనాశతోడనే జీవిస్తున్నటు లున్నది. మా ఓడ పడవదొంగల పాలగుటవల్ల మేమెన్నో ఇడుమలఁ బడినాము. చివరి కొక చిన్నఆశా రేఖ పొడసూపినది. నన్ను, నాప్రేయసి బెలిండాను, అరియానాను పాషా సలీం కొన్నాడు. అప్పటినుండి ఇక్కడే ఉన్నాము మేము. ముఖ్యంగా అరియానా ముఖాన్ని గన్నప్పుడెల్లా పాషా సలీం ముఖం మక్కువతో పున్నమనాటి చంద్రునివలె వికసించడం గమనించినాను.
అమాండో:
హా! ఏమేమి? ఏమంటున్నావు? ఆమెయందు పాషా సలీం ప్రత్యేక మైన మక్కువ చూపుతున్నాడా? ఆమెను ప్రేమిస్తున్నాడా? ఆమె ఆతని వశమై పోయిందా?
పెడ్రిలో:
శాంతించు, శాంతించు! అది నీవనుకొన్నంత ఘోరమైన వార్త కాదు. ఆమె ఇంకను అధముల హస్తగతమై ఉంటే ఆమెకష్టాల కంతము లేక పోయేది. పాషా సరసుఁడూ, సజ్జనుఁడూ! పశువాంఛతో బలవంతంగా పడఁతులపై నతఁడు తన ప్రేమను రుద్దడు. ఐనా, నేనెరిగినంత వఱకు అరియానా అతనిని స్వీకరింప లేదు. అందుచేత అంత ఉద్రేకపడకు.
అమాండో:
ఆమె నాయందింకా అనురక్తురాలయ్యే ఉన్నదా?
పెడ్రిలో:
ఆ సందేహ మెందుకు నీకు?

5ఏల యామెను శంకింతు వీవు స్వామి!
అసితపక్షమందున శశి నరయకున్న
విశదపక్షానికై వేచు నిశను బోలె
ఆమె నీరాకకై వేచు ననుదినంబు!

కాని ఇక్కడినుండెట్లు పరారీ ఔతామనేదే ప్రధానమైన సమస్య!

అమాండో:
ఆ విచారం నీకనవసరం. ఓడరేవులో ఇక్కడనుండి పాఱిపోవడానికి నా ఓడను సిద్ధముగా నుంచినాను.
పెడ్రిలో:
మఱి స్త్రీలు? వారినీ అంతఃపురంనుండి ప్రచ్ఛన్నంగా తీసికొని పరారీ కావడం సులభం కాదు.
అమాండో:
5వత్స పెడ్రిలో! సరగున వారి నెట్లొ
చేరుకొను తీరొకింత యోచింపుమింక
అతితరోత్కంఠతో నరియానఁ గాంచ
కొట్టుకొనుచుండె నాగుండె బిట్టుగాను!
పెడ్రిలో:
మన మత్యంతమగు అప్రమత్తతతో వ్యవహరించవలెను. ముఖ్యంగా కంటకతుల్యుఁడైన ఉస్మాను కంటఁబడక మన కార్యమును గావించు కొనవలెను. ఇప్పుడు పాషా జలవిహారమునుండి తిరిగి వచ్చు వేళ యైనది. అతనికి సుందరోద్యాన, సుందరభవన నిర్మాణములందు మిక్కిలి మక్కువ. నిన్నతనికి నిపుణుఁడైన ఉద్యానవనశిల్పిగా పరిచయం చేస్తాను. కాని ఇప్పుడు మాత్రం నీవు పొదచాటున ఉండు.
అమాండో:
(కొంత దూరమున పొదచాటున నొదిగి, అరియాను దలంచుచిట్లు పాడును
పాట (చతురస్రగతి)
చరణం1:
అరియానా! ప్రియురాలా అరియానా!
నీయెడబాటును మోయఁగఁ జాలక
నిరతము దలఁచుచు నిన్నే మదిలో
ఎటులో గడపితి నిన్నిదినంబులు
అరియానా! ప్రియురాలా అరియానా!
చరణం2:
ఇప్పు డిట న్నిన్నెప్పుడు గందునొ
యను తహతహ హృదయంబును వడిగా
పరువెత్తించుచుఁ దఱుముచు నున్నది
అరియానా! ప్రియురాలా అరియానా!
చరణం3:
ఆమని దోఁచని ఆరామమువలె
నినుఁ గానని నామనుగడసైతము
వికసితసుఖసుమవికలిత మయ్యెను
అరియానా! ప్రియురాలా అరియానా!
చరణం4:
నీరుచిరాకృతి నిర్వర్ణనమే
నాయార్తినిఁ బోనడచెడి మార్గము
దానినిఁ గనుటకె నేనిట వేచితి
అరియానా! ప్రియురాలా అరియానా!

(ఇంతలో అరియానాతో సముద్రవిహారమునకు బోయిన పాషా తిరిగివచ్చుచున్నట్లు అతని రాకకు కొంచెము ముందుగా వచ్చు తుర్కీ సేనయొక్క బ్యాండుమేళము కాన నగును. అది గమనించి పెడ్రిలో వారికంట బడక, అమాండో దాఁగిన పొదకడనే దాఁగును.)

చతుర్థదృశ్యము

తుర్కీబ్యాండు కోరస్:
 
1జయజయ జయహో సలీము పాషా!
జయజయ జయహో సద్గుణభూషా!
అనుచుం దుర్కీ జనపతి సంస్తుతి
ఘనకుతుకంబున గాన మొనర్తుము
సరసత్వంబున సౌందర్యంబున
సరిలేని సలీం సంస్తుతి చేతుము

రసికత్వంబున రాజత్వంబున
అసదృశుఁడౌ నీ యవనీనాథుని
స్తుతిరావంబులె క్షితితలమందున
ప్రతినాదింపఁగఁ బ్రస్తుతిఁ జేతుము

జయ కోమలభాషాశోభితునకు
జయ సతతస్త్రీజనసేవితునకు
జయ సద్గుణభూషాలంకృతునకు
జయ తుర్కీరాజ్యశ్రీయుతునకు
జయజయ జయహో సలీము పాషా!
జయజయ జయహో సద్గుణభూషా!

(పై మేళము సాగుచుండఁగా పాషా సలీం, అరియానాలు చేతులు పట్టుకొని, సవిలాసముగా ప్రవేశింతురు. పాషా సంకేతము ననుసరించి, బ్యాండు మేళము నిష్క్రమించుచుండును. అప్పుడు పాషా అరియానాను చుంబింపఁబోవును. ఆమె చాకచక్యముతో అతనిని వారించి అటనుండి నిష్క్రమింప యత్నించును. పాషా మృదువుగా నామె హస్తమును గ్రహించి, ప్రక్కనున్న కుర్చీలో నామెను కూర్చుండఁబెట్టి తానామె ప్రక్క కుర్చీలో కూర్చొనును.)

సలీం:
అరియానా! సఖి అరియానా! ఇంకను నిస్సంతోషపు చాయలె నీ ముఖమందు వహింతువు. పరికింపు మీ ప్రమదవనమందలి అపూర్వమైన ప్రకృతి యందము. పుష్పితవల్లరు లిమ్ముగఁ దరుకాండమ్ముల నాయకులను నాయికలవలె కౌఁగిలించుచున్నవి. తరువులపై పరిపరివిధముల పక్షులు పాడుచు వారలసంగము నభినందించుచు నున్నవి. ప్రక్కన జలయంత్రపు ధారలు శృంగారరసధారల తీరున నంబరము నంటుచు లేచుచు నున్నవి. నీచిత్తము నలరించుట లేదా యివి యెవ్వియు అరియానా? ఇంకను నీముఖ మెందుకు సంతోష విహీనమై యున్నది?
అరియానా:
(అతనికి జవాబీయక పెద్దనిట్టూర్పుతో తన అసమ్మతిని ప్రకటించును.)
సలీం:
చూడు ప్రియసఖి అరియానా!

5అంతిపురినున్న అందాలఅతివలందు
నిన్నె మిన్నగ నేను మన్నింతుఁ జాల
అనుభవింపక ననుఁగూడి హాయి నేల
తామసించెద విట్లు వ్యర్థముగ నీవు

అరియానా:
5అంతిపురిలోన వసతుల కరిది లేదు
మీదునాదరమున కేమి లేదు లోటు
కాని స్వేచ్ఛనే ప్రాణసంకాశముగను
గాంచు నా కంతిపురి చెఱగానె తోఁచు.
సలీం:
పడవదొంగలపాలై, పలవించునప్పుడెట్టి స్వేచ్ఛ నీకుండెను? అంతః పురమున అతివలు నిన్ను సేవించుచుండ సుఖముగా నుండక ఏల యీనిర్వేదము? అదంత యటుంచి ఇప్పటి కర్తవ్యమాలోచింపుము.

5త్యక్త మొనరించి స్వేచ్ఛ లేదన్న చింత
నాదు ప్రేమను గ్రహియించి నన్నుఁ గూడి
రాణులందఱికిని శిరోరత్నమగుచు
వాసమొనరింపుమింక నాభవనమందె.

అరియానా:
అది సాధ్యము నామనస్సందులకు సుముఖముగా నున్నచో. కాని నా దురదృష్టమో లేక మీ దురదృష్టమో నామనమందుకు సుముఖముగా లేదు.
సలీం:
చెప్పు అరియానా! నీ విముఖత్వమునకు కారణ మేదో. నీకన్ని వసతులు గూర్చి సుఖముగా నుంచితిని గదా! నీయందు కరుణతో వ్యవహరింతును గదా! వినుమొక్కమాట!

5ప్రసభవృత్తిచేఁ బడయంగవచ్చు నిన్ను
కాని యాతీరు నాతీరు గాదు తరుణి!
కోరి స్వచ్ఛందముగ నీవె కూర్మిమీర
చేరఁగావలె నన్నంచుఁ గోరుకొందు;
నిండుమనసుతో నర్పించు నీదువలపు
నందె నేను సార్థక్యంబు నంద నెంతు
అందుచే నీమనస్సు మారుటకై నిరీక్షించుచున్నాను.

అరియానా:
నామనస్సు సంగతి మీకుఁ దెలియనే తెలుసు. నాకు ఏకైక ప్రియుఁడైన అమాండోకు దక్క నాప్రేమ అన్యుని కంకితము గాదు.

5అనుపమంబె మీప్రేమ, అట్లైనఁ గాని
అతని వంచించి అన్యునియందు నేను
సౌఖ్యముం గనలే నిది సత్య మార్య!
కాన నర్థింతు మన్నింపఁగాను నన్ను.

5అనుభవించితి ప్రేమంబు నతనియందె
సౌఖ్యమొందితి నతని సంస్పర్శయందె
కాని క్షతినందె సర్వంబు క్షణమునందె
ప్రాప్తమయ్యెను శోకంబె ప్రస్తుతంబు.

5మున్ను హర్షబాష్పంబులే యున్న కంట
దుఃఖబాష్పంబులే నేఁడు దొరలుచుండె
అతని నిఁకఁ గందునో లేదొ యన్న చింత
కలఁచుచుండెను నన్ననుక్షణమునందు.

సలీం:
ఆచింత స్వాభావికమే. కాని నీవిట నుంటివని అతఁడెఱుఁగునా? ఎఱింగినను సాగరము దరించి అతఁడిటకుఁ జేరుకొనునా? ఇట్టి పగటికలలతో ప్రయోజనమేమి? పండిన ఫలమువలె సిద్ధముగా ఎదుట నున్న సుఖమును స్వాగతింపుము.
అరియానా:
5మన్యుసంతప్తమైన నామానసంబు
సాధుపథమును జింతింపఁ జాల దిపుడు
అందుచే నిండు కొంతగా వ్యవధి నాకు
నామనోవిక్లబంబు శాన్తమగుదాఁక
సలీం:
అట్లే కానిమ్ము.
5‘కోరి స్వచ్ఛందముగ నీవె కూర్మిమీర
చేరఁగావలె నన్నంచుఁ గోరుకొందు;
నిండుమనసుతో నర్పించు నీదువలపు
నందె నేను సార్థక్యంబు నంద నెంతు!’

అని ఇదివఱకే తెల్పితిని గదా!
( ఆమె భవనములోనికి నిష్క్రమించును)

సలీం:
ఈమె శీలము, విశ్వాసపాత్రత అత్యంత శ్లాఘనీయ మైనవి ఈలక్షణ ములతోడ నీమె నాచిత్తమును మఱింత ఆకట్టుకొనుచున్నది. అరి యానా! సలీం గూడ ప్రేమించగలడు. అతనికిని హృదయ మున్నది. అది నీ కవగతమైనయెడల నతనియందు నీవిముఖత్వము సడలును.
(అని యోచించుచు అతడు పరధ్యానమగ్నుడై యుండును. అప్పుడు పెడ్రిలో అమాండో సహితంగా అతనిని సమీపించి పల్కును. )
పెడ్రిలో:
అభివాదములు సలీం ప్రభుపుంగవులకు (ఎక్సలాసరు పషా సైలిమె సలామ్‌లాష్)!
సలీం:
ఏం పెడ్రిలో, నీవెందు కిక్కడ ఉన్నావు?
పెడ్రిలో:
(అమాండోను చూపుతూ) ఇతఁడు నాకు సుపరితుఁడైన ఉద్యానవనశిల్పి. ఇతనిపేరు అమాండో. ఇటలీలో ఈవిద్యలో చక్కగా తర్ఫీదు పొందినాఁడు. ఉద్యానవనా లందు తమకుఁ గల విశేషమైన ఆసక్తినిగుఱించి విని తన నైపుణ్య మును తమకర్పించు నుత్సాహంతో వచ్చినాఁడు.
అమాండో:
(వినయంతో) జహాఁపనా! తమరి సేవాభాగ్య మబ్బుట నాభాగ్యంగా పరిగణిస్తాను. నా కళాభిజ్ఞతను తమరి కర్పించు అవకాశము కల్గుట నా అపూర్వమైన అదృష్టంగా భావిస్తాను.
సలీం:
సరే! నీవేమి చేయఁగలవో రేపు చూస్తాను. అంతవఱకు నీవు పెడ్రిలో తోడనే ఉండు.
(అని నిష్క్రమించును.)
పెడ్రిలో:
మన ప్రథమప్రయత్నం ఫలవంతమైంది. ఇక ముందుకు సాగవచ్చు.
(ఉత్సాహంతో పల్కును)
అమాండో:
ఇది నీవల్లనే సాధ్యమైంది పెడ్రిలో! నాప్రియురాలిని దూరమునుండి చూచినాను. వారి మాటలు గూడ కొంత అస్పష్టంగా విన్నాను. కాని ఆమెను గాంచియు ఆమెతో మాటాడ లేని అభాగ్యుఁడను.

10ఎప్పుడు నాసఖి న్మఱల నీక్షణముల్ దనివారఁ గాంతునో
ఎప్పుడు తన్మనోజ్ఞవచనేక్షురసంబును గ్రోలఁ గందునో
ఎప్పుడు తద్వరాంగిఁ బ్రియమెచ్చఁగ మత్తనువందుఁ జేర్తునో
అప్పటిదాఁక నామె విరహంబును నేగతి నోర్చికొందునో!

5ఆమెఁ గాంచియు నొక్కమాటైనఁ గాని
పల్కలేని దౌర్భాగ్యంబు ప్రాప్తమగుచు
వ్రణమునందుఁ జిలికిన కారంబువోలె
అధికమొనరించె నావిరహార్తి నకట!

పెడ్రిలో:
ఇది నిర్వేదమునకు సమయము గాదార్యా! ఉత్తరకార్యము నాలోచింపవలెను.
అమాండో:
అదియు నిజమే. చెప్పినాను గదా పాఱిపోవుటకై రేవులో నోడను నేను సిద్ధముగా నుంచినానని. బెలిండాఅరియానాలను అవరో ధమునుండి విడుదల చేసికొన్నచో వెంటనే పాఱిపోవచ్చును.
పెడ్రిలో:
అదియే అన్నింటికంటె కష్టము. ముఖ్యముగా దుర్మార్గుఁడు ఉస్మానుముష్కరుని కంటఁబడక అది సాధించుకొనవలెను.
అమాండో:
నీవే ఇందలి లోతుపాతు లెఱిఁగినవాఁడవు. నీసాయ మిందులో చాలా అవసరము.
అమాండో:
అట్లే కానిండు. ఇర్వురము కలిసి దీనిని సాధింప నుద్యమింతము.

పంచమదృశ్యము

(అమాండో పెడ్రిలోలు భవనములోనికి ప్రవేశింపఁబోఁగా ద్వారముకడ ఉస్మాన్ వారిని అడ్డుకొనును. వారిమధ్య కొంత ఘర్షణ జరుగును.)

ఉస్మాన్:
ఎక్కడికి మీ చొరబాటు?
పెడ్రిలో:
ఇంకెక్కడికి? భవనంలోనికే!
ఉస్మాన్:
నీవు సరే, నీవెంట నున్న వీఁడెవఁడు?
(అనుచు ఇర్వురిని బయటకుఁ ద్రోయును.)
పెడ్రిలో:
నీ ఔద్ధత్యమునకు శిక్ష ననుభవింతువు. ఇతఁడు పాషా సేవలో నున్నాఁడు. తప్పక లోనికిఁ బోవలెను.
(ఇర్వురతని దాఁటిపోవ యత్నింతురు.)
ఉస్మాన్:
ఉరిదీయు తలారి యైనచో వీఁడామడదూర ముండవలసిందే. వాని కిక్కడ ప్రవేశం లేదు.
(ఇర్వురిని బయటికి నెట్టును.)
పెడ్రిలో:
ముసలినక్కా! ఇతఁడు పాషా నియమించిన ఉద్యానవనశిల్పి. ప్రక్కకు జరిగి లోనికిఁ బోనిమ్ము.

త్రిగళగీతము (Trio)

ఉస్మాన్:
4 చేరరాకు చోరముఖమ!
పాఱిపొమ్ముదూర మిపుడె
అంతిపురమునందు దూరి
ఇంతులను హరింప నెంచు
తస్కరుండ దరికి రాకు
ముష్కరుండ పొమ్ము పొమ్ము! (అనుచు వారిని ద్రోయును)
వారిర్వురు:
3తొలఁగుఁడంచును ద్రోతువేటికి
ఖలుఁడ! మమ్ములఁ గనఁగలేవే
మేము పాషా కామితంబును
ప్రేమతోఁ గావింపనుంటిమి
దానికై త్వరగాను నిప్పుడు

లోని కేఁగఁగఁ బూనినారము
నిలుపఁజాలవు నీవు మమ్ముల
నిలుపఁ బూనిన నీకె ముప్పగు
ఉడిగి నీదగు నుద్ధతత్వము
వడిగ మమ్ములఁ బంపు లోనికి

(అనుచు వారు లోని కేఁగఁజూతురు. అప్పు డుస్మాన్ క్రిందిరీతిగా బల్కుచు, అమాండోను ప్రక్కకు ద్రోయును.)

ఉస్మాన్:
4దూరముండు దూరముండు
చేరువైన చేటు నీకె
చెంతఁ జేరి శిల్పినంచు
అంతిపురమునందు నున్న
స్త్రీల తస్కరింపఁ జూచు
బాలిశుండ ప్రక్కకుండు
అమాండో పెడ్రిలోలు:
(క్రిందివిధముగాఁ బాడుచు, అతనిని బలవంతముగా ప్రక్కకు నెట్టివేసి లోనికిఁ బ్రవేశింతురు)

4చాలుచాలిఁక, చాలుచాలిఁక
బాలిశుఁడ నీ వ్యర్థయత్నము
నీదుకట్టడి నూది గాలికి
పోదుమిప్పుడె, పోదుమిప్పుడె
లేదు మాకవరోధమెందును!
లేదు మాకవరోధమెందును!
పోదుమిప్పుడె పూని లోనికి
పోదుమిప్పుడె పూని లోనికి!

(ప్రథమాంకము సమాప్తము)


ద్వితీయాంకము-ప్రథమదృశ్యము

(తోఁటలో ఉస్మాన్ నివేశన మొకవైపున కుండును. ఒకచోట బల్ల, రెండు కుర్చీలు వేయబడి యుండును. బెలిండా ఒక తేనీటి పాత్రను, కొన్ని బిస్కెట్లను తీసికొని వచ్చి వానిని బల్లపై నుంచి ఒక కుర్చీలో కూర్చొనును. ఆమెను చూచి ఉస్మాను వచ్చి రెండవకుర్చీలో కూర్చొనును.)

బెలిండా:
పాట (చతురస్రగతి)
సరసపుమాటలు, చక్కనికాన్కలు
వరమణిఖచితస్వర్ణాభరణములు
అతిరుచ్యంబగు నాహారంబులు
పతియెడ బెంచును పడఁతులరక్తిని

అతివ ముదంబునె ఆత్మముదంబుగ
అతివ సుఖంబునె ఆత్మసుఖంబుగ
మతిలోనెంచుచు మక్కువ చూపెడు
నతనికె యంకితమగు స్త్రీచిత్తము

అంతియె కానీ ఆగ్రహమూనుచు
కాంతను సేవికగా భావించెడు
నతనికి లోఁబడి యతివలు మెలఁగరు
అతనిం బ్రియునిగ నవలోకింపరు

కావున కాంతల దేవతలంబలె
సేవించినచో సేమము గల్గును
ఇదె కాంతలఁ బ్రేమించు విధానము
ఇదె వారల మురిపించు రహస్యము

ఉస్మాన్:
(తేనీరు సేవించుచు, బిస్కెట్లు దినుచు నామె పాటను విని ఔద్ధత్యముతో నవ్వుచు నెగతాళిచేయుచు) వారెవా! ఏమంటున్నావ్? ఇంతిని దేవతవలె సేవింపు మంటున్నావా? తుర్కీలో అది సాగదు. మఱవకు – నీవు దేవతవు గావు, నా సేవికవు. నామాట జవదాటక నన్నాదింపఁజేయుటయే నీకర్తవ్యం, నీమనుగడ కవశ్యం.
బెలిండా:
ఏమేమీ, నేను నీసేవికనా? ముదుసలి మ్లేచ్ఛబకమా, నేను నాలుక లేని తుర్కీసేవిక ననుకొంటున్నావా?
ఉస్మాన్:
మఱచినావా? నిన్ను దాసిగా, సేవికగా పాషా నాకు ప్రదానం చేసినాఁడని.
బెలిండా:
పాషా గీషా! ఆపాషా, ఈపాషా! దానం చేయుటకు స్త్రీలేమీ గొఱ్ఱెలు, బఱ్ఱెలు కారు. నేను స్వేచ్ఛాజీవినైన ఆంగ్లవనితను. నేనెవ్వరి ఆజ్ఞలకు లొంగను.
ఉస్మాన్:
మఱవకు. నన్ను సేవింపుమనీ, ప్రేమింపుమనీ నేను నిన్ను శాసింపఁ గలను. నేననవలె, నీవు వినవలెనంతే. దానికి తిరుగులేదు.
బెలిండా:
నీ శాసనం నాయెడ వర్తించదు. నిన్ను ప్రేమింపుమని నన్ను శాసింపలేవు.
ఉస్మాన్:
అవధి దాటుచున్నది నీ అవిధేయత, వెంటనే లోనికి బొమ్మని నేనాజ్ఞాపిస్తున్నాను.
బెలిండా:
నేనొక్క అంగుళమూ కదలను.
ఉస్మాన్:
బలప్రయోగం చేసే అవకాశం నాకు గల్పింపకు.
బెలిండా:
నేనూ బలప్రయోగం చేయఁగలను. నా స్వామిని అరియానాయే నన్నిటకుఁ బంపినది. అందుచే నన్ను నీవు పొమ్మన లేవు.

5ఇష్టురాలామె పాషాకు నెంతగానొ,
ఆమె మాటయె చాలు, నీకతనివలన
బడితెపూజయె బాగుగా ప్రాప్తమగును,
పిండియగు మేను రొట్టెలపిండిపగిది.
అర్థమైందే? నేను పోను గానీ, నీవే పో లోనికి.

ఉస్మాన్:
(తనలో) నిజంగా ఇదొక పెనుభూతమే!
(ప్రకాశంగా) నేను పోతాను సరే. నీవుమాత్రం ఆ దుర్మార్గుడు పెడ్రిలోను దరిదాపుల్లో ఉండనీయకు.
బెలిండా:
నన్నేమీ ఆజ్ఞాపింపకు. నీకుఁ దెలియును నీ ఆజ్ఞకు పుల్లాకుకున్నంత విలువ ఉందని, అది పాటింపఁబడదని.
ఉస్మాన్:
నా ఆజ్ఞ పాటించనిదే నేనిక్కడనుండి కదలను.
బెలిండా:
నీవు సామ్రాజ్యాధినేతవైనా నీమాట వినను నేను.
ఉస్మాన్:
విననిదే నేనిటనుండికదలను.
పాట (ఖండగతి)
మీకర్మ మేమందు మింగ్లీషుజనులార!
ఈకాంతలను మీర లేరీతిఁ దాళుదురొ?
రండు తుర్కీకి నీఱాగలను నేవిధము
దండించి సరిచేయఁ దగునొ చూపెదము!’
బెలిండా:
స్వైరితం జరియించు జలజాక్షులెపుడు
కోరుకొన రెవ్వారి కారుణ్యభిక్ష
సేవికావృత్తితో స్వేచ్ఛనుం బాసి
భావింపరెప్పుడును జీవింప వారు

ఇఁకనైన దెలిసిందా, నాయందు నీ ఆజ్ఞ పాఱదని, నాముందు నీ ఆటలు సాగవని…ఇప్పుడైనా తప్పుకో, తప్పుకో యిటనుండి…

ఉస్మాన్:
ఎంత తెంపరివె నీవు, నన్నే శాసిస్తున్నావు. నీమాట నేను వినను. ఇటనుండి కదలనే కదలను.
బెలిండా:
(అతని కనులను పెఱకబోవు చున్నట్లు నటించి, అతనిని వెఱపించుచూ)

6కాచుకొమ్ము నీదు కనుల కపాయంబు
కలుగనుండె నిపుడు ఖలవరేణ్య!
ఆలసించితేని అంధత్వమే నీకు
ప్రాప్తమగును, దృష్టి లుప్తమగును.

ఉస్మాన్:
6చాలుచాలు నీదు సత్కార మిఁకఁజాలు
చనుదు చనుదు నేను సత్వరముగ
(అనుచు నిష్క్రమించును.)

ద్వితీయదృశ్యము

(దూరమునుండి అరియానా తోఁటలోనికి ప్రవేశించును. బెలిండా ఆమెను చూచును గాని, ఆమె బెలిండాను గమనింపదు.)

బెలిండా:
5కృష్ణపక్షమందలి చంద్రరేఖవోలె
సఖుని బాసిన వంతచే సగము క్రుంగి
మొగుడు కంజంబునుం బోలు ముఖముతోడ
కాననగు నీమె అతిదైన్యకలిత యగుచు!
అరియానా:
పాట (చతురస్రగతి)
అమాండో! అమాండో!
నానాథుఁడ వీవె అమాండో!
ఇపుడైనను, వేఱెపుడైన అమాండో,
నానాథుఁడ వీవె అమాండో!

కడపితి నీతోఁ గడు సౌఖ్యముతో
ఎడపక యెన్నో యేడులు మున్నుగ
అకస్మికముగ నది యంతంబై
నాకు మిగిల్చెను శోకమె యిప్పుడు

నీసఖ్యంబే నిస్తులనిధియై
నీసన్నిధియే నిర్జరజగమై
ఉన్న దినంబుల నూహించినచో
కన్నీరిప్పుడు గారును జడిగా

దరహాసముతో పరిహాసముతో
సరసంబులతో సరసోక్తులతో
సాగిన కాలపు స్మరణం బిప్పుడు
ఆగని యశ్రుల నక్షులఁ గార్చును

నీకూరిమికే నిలయం బగుచును
నీకంకితమై నెగడెడు నామదిఁ
గోరును మూరుఁడు కొల్లగొనంగను
ఏరీతిని నీ ఘోరము సైతును?

(మూరుఁడు= Moor= ఓపెరాలలో ముస్లిములకు నీచార్థంలో వాడే పదం.)

ఏదేవున కెఱిగింతును నావ్యథ
ఏదేవుఁడు నన్నాదుకొనంగల
డీదిక్కుల నిండిన నాదైన్యపు
నాదంబును విను నాథుం డెవ్వఁడు?

బెలిండా:
(అరియానాను సమీపించి)
అయ్యొ స్వామిని! చంద్రుని బాయని కళంకమట్లు నీముఖచంద్రుని సంతాపచిహ్నంబు పాయకుండె నేమి?
అరియానా:
5కడచె నింకొక్క రాత్రియుఁ గాని కనను
నా ప్రియుండరుదెంచు చిహ్నంబు నేను
బలిపశువువోలె నిఁక సలీం పాలఁ బడక
తప్పదను బాధ నాకెంతొ తలఁకు గూర్చు. (తలఁకు=చింత,దుఃఖము)
బెలిండా:
ఈదినమింకను శేషించియే యున్నది. మన భాగ్యము బాగున్నచో మేలు కలుగవచ్చును. ధైర్యముతో నుండుట మంచిది. (దూరమునుండి వస్తున్న పాషాను చూచి) పాషా ఇటకే వస్తున్నాడు. నేను నిష్క్రమించుట మంచిది. (నిష్క్రమించును)

తృతీయదృశ్యము

సలీం:
అరియానా! నీవు నిర్ణయించుకొన్నావా? నీకిచ్చిన గడువు త్వరలో అంతమౌతున్నది. ఆలోపల నీవు నిర్ణయించుకొనక తప్పదు.
అరియానా:
ఏమన్నారు? తప్పకుండానా? ప్రేమించుమని ఒకరిని శాసించడం సాధ్యమా? మనసులో లేని ప్రేమ శాసించినంతమాత్రాన పుట్టగొడుగు వలె పుట్టుకొస్తుందా?

5ఇంకునే వార్ధి శాసింప నింకుమనుచు?
ఎక్కునే నీరు మిట్టపై కెక్కుమనిన?
పుట్టునే రవి పడమటఁ బుట్టుమనిన?
కురియునే వాన శాసింపఁ గురియుమనుచు?

5అటులె శాసించి నాప్రేమ నంద లేవు,
అరసితిని నీదు సరసత నందుచేత
గారవింతును, మన్నింతుఁ గాని నిన్ను;
లేని ప్రేమను నీయందుఁ బూనలేను.

సలీం:
(క్రోధోద్రేకాలతో)
నీ తాత్పర్యం మీదేశంలోవలె ఈదేశంలో మాస్త్రీలు స్వీయాభీష్టంతోఁ గాక శాసితులయ్యే మమ్ము సేవిస్తున్నారనేనా?వారు సుఖంగా లేరనేనా?
అరియానా:
అది సర్వత్ర సత్యం గాకపోయినా ఇదిమాత్రం నిజం. ఈదేశంలో మీ కిష్టమైన స్త్రీలను బందిఖానాలవంటి అంతఃపురాలలో నుంచి వారిని వాడుకొంటారు.
సలీం:
ఈదేశంలో ఉన్నంతవఱకు నిన్నుకూడ వారివలెనే ఆదేశింవచ్చునని నీకుఁ దెలియదా? అట్టి ఆదేశమంటే నీకు భయం లేదా?
అరియానా:
నేనెంతమాత్రం భయపడను. నేనట్టి ఆదేశాన్ని పాటించక పోతే చేకూరే కఠినాతికఠినశిక్ష మరణమే కదా! దానికి నేను సిద్ధంగానే ఉన్నాను.
సలీం:
అమాయకురాలవు. మరణంకంటె దారుణమైన చిత్రహింసయే నీకు పడవచ్చు.
అరియానా:
భయపడను నేను దానికిఁగూడ. నేనన్నిటికీ సిద్ధమే. (ఆమె పట్టుదలకు క్రుద్ధుఁడై అతడామెను గ్రహించి బలవంతంగా చుంబించును. కొంతసేపట్లు గడచిన తర్వాత ఆమె విడిపించుకొని క్రిందివిధముగా పాడును.)
అరియానా:
పాట (చతురస్రగతి)
తర్జించిన నను దండించిన
గర్జించిన నను గర్హించిన
భర్జించిన నను తైలంబున
వర్జింపను నా శీలంబును

మరణంబన్నను మండనమన్నను
వరియింతును నేను సమంబుగనే
మరణముకంటెను దారుణమైనది
తరుణులకున్ శీలక్షతి యందును

ఆలింపుము నాయభ్యర్థనమును
చాలింపుము నీ స్త్రీలౌల్యంబును
భావింపక అతివల ప్రతిమలవలె, సం
భావింపుము లలనల మనుజులవలె!

(అని మహోద్రేకంతో సాభినయంగా పాడి ఆమె నేలకొరుఁగును. తుర్కీసేవిక లామె నెత్తుకొని క్షేమముగా నుంచుటకు గొనిపోవుదురు.)

సలీం:
(తనలో)

10ఎచ్చటినుండి ఈయబల కింతటి తేఁకువ వచ్చె, నన్నె తాన్
జెచ్చెర ధిక్కరించి తనశీలము గూర్చిన సూక్తులెన్నొ వా
క్రుచ్చును, లేదు తర్జనల క్రోధములన్ఫల, మింక నీమెకున్
నచ్చెడిరీతిఁ బైకి నటనంబొనరించుచు నొంపఁ జూచెదన్.

(నిష్క్రమించును.)

చతుర్థదృశ్యము

(పెడ్రిలో బెలిండాలు)

పెడ్రిలో:
బెలిండా! ఓడరేవు నిర్జనంగానే ఉందా?
బెలిండా:
ఆ సంగతి నీకెందుకు?
పెడ్రిలో:
దానికి కారణముంది. అది వింటే ఆనందిస్తావు నీవు.
బెలిండా:
చెప్పు త్వరగా ఉత్కంఠతో నన్ను జంపకుండా!
పెడ్రిలో:
అమాండో వచ్చినాఁడు. అతనిని గొప్ప ఉద్యావనశిల్పిగా నేను పాషాకు పరిచయం చేసినాను. అతఁడిప్పుడు భవనంలోనే ఉన్నాడు.
బెలిండా:
(ఆశ్చర్యంతో) ఎంత సువార్త! నేనిది తప్పక అరియానాకుఁ జెప్పవలె.
పెడ్రిలో:
అంతేకాదు. పాఱిపోవడానికి రేవులో ఓడను సిద్ధముగా నుంచినాడు.
బెలిండా:
ఈవార్తకిదో నా కానుక (ఆతనిని గాటముగా చుంబించును) ఆహా! ఇది వింటే ఆమె ఎంత సంతోషంతో ఉబ్బిపోతుందో!

10ఇంకను నుంటి నిచ్చటనె యేటికి? వెంటనె యేఁగి యామెకున్
సంకటముం బరాస్తముగ సల్పెడు నీ శుభవార్తఁ దెల్పి, ని
శ్శంకగ గొప్పకాన్కలను సత్వరమే గ్రహియింపకుండఁగన్,
అంకిలి దీఱునింకనని ఆమె ముదంబున నుబ్బిపోవఁగన్!

(అని యామె ఉఱికిపోవ నుద్యమించును. పెడ్రిలో ఆమె నాపి పల్కును.)

పెడ్రిలో:
అప్పుడే ఉఱుకకు. విషయం పూర్తిగా విను. మధ్యరాత్రిలో అమాండో ఒక నిచ్చెనను దెచ్చి అంతఃపురగవాక్షం ముందుంచుతాడు. అప్పుడు నేనుకూడ అక్కడుంటాను. అందఱం గలసి ప్రచ్ఛన్నంగా ఓడలో పరారీ ఔతాము.
బెలిండా:
అది సరే కాని, ఆ దుర్మార్గుడు ఉస్మాన్ సంగతి?
పెడ్రిలో:
దానికి సిద్ధమయ్యే ఉన్నాను. నిద్రమత్తు గొల్పే మందుతో గూడిన ద్రాక్షాసవాన్ని (మార్ద్వీకాన్ని) అతనిచేత త్రాగించి అతని బాధ తప్పిస్తాను. ఇప్పుడు నీవరియానా కిదంత తెల్పి పాఱిపోవుట కామె నాయత్తం చేసి రాత్రి మాకొఱకు నిరీక్షించుచుండుత్కంఠతతో.
(ఆమె నిష్క్రమించును. అతఁడు క్రిందిపాట పాడుచు ద్రాక్షాసవమును సిద్ధము చేయును.)
పెడ్రిలో:
పాట (ఖండగతి)
ఎంతబాగెంతబా గిది యెంతబాగు!
ఎంతబాగెంతబా గిది యెంతబాగు!

ఉదధిపై నోడలో నూర్జస్వలంబుగా
ముదితలిర్వురు గూడి ముదమార రాఁగా
పదిలంబుగా నేఁడె పాఱిపోగల్గిన
ఎంతబాగెంతబా గిది యెంతబాగు!
ఎంతబాగెంతబా గిది యెంతబాగు!

కట్టుబాటుల నెల్ల గంగలోఁ గల్పి
గట్టికౌఁగిలిలోన కాంతలను జేర్చి
ముదమార వారలన్ ముద్దులం గొనుచు
పదిలంబుగా నేఁడె పాఱిపోగల్గిన
ఎంతబాగెంతబా గిది యెంతబాగు!
ఎంతబాగెంతబా గిది యెంతబాగు!

పట్టుబడుదు మటన్న భయము నావలకు
నెట్టి ధైర్యముతోడ నెలఁతలం గూడి
తిరిగి భవ్యమగు మన దేశమును జేర
శరనిధిం దరియించి చనినచో నేఁడె
ఎంతబాగెంతబా గిది యెంతబాగు!
ఎంతబాగెంతబా గిది యెంతబాగు!

ఉస్మాన్:
(ఉత్కంఠతోప్రవేశించి) ఏం చాలా ఉల్లాసంగా ఉన్నావు. అన్నీ నీవనుకొన్నట్లుగా సాగుతున్నట్లుగా ఉన్నవి!
పెడ్రిలో:
అంతా మార్ద్వీకప్రభావం. మధురమైన మార్ద్వీకం ఎట్టి వంతనైనా నెట్టివేసి హాయినిస్తుంది. నిజమే మీ మహమ్మదు ప్రవక్త దీని మహత్తు నెఱుఁగకుండా మీకిది నిషేధించినాడు. నిరర్థకమైన ఈ నిషేధం ఒక్క సారికి కాదనుకుంటే నీవూ నాతోఁగూడి దీని ననుభవింపవచ్చు.
ఉస్మాన్:
ఆ ద్రాక్షాసవమా? ఛీ. ఛీ. ఆవిషమా?
పెడ్రిలో:
ఆమాటెందుకూ? ఒక్కసారికి కాదనుకో నిషేధం. చక్కగా నాతోఁ గూడి దాని మజా తెలిసికో!
ఉస్మాన్:
(పెడ్రిలో చేతిలోనుండి ఆసారాసీసాను లాగుకొని దానిని ఎగదిగా బాగుగా పరిశీలించి, మఱల ఆసీసాను పెడ్రిలో చేతికిచ్చి, తనలో) చూచుటకైతే చాలా బాగానే ఉంది. మఱి ఈతని మాటను నమ్మఁ వచ్చునా? (సందేహించును.)
పెడ్రిలో:
సందేహింప నక్కఱ లేదు. ప్రవక్త నిద్రనొంది యుగాలే సాగిపోయినాయి. ఐనా ఉస్మానుపై నిఘా ఉంచడంకంటె ఉత్తమమైన పనులతని కెన్నో ఉన్నాయి.
ఉస్మాన్:
(దగ్గరికి వచ్చి, సీసా మూతదీసి ద్రాక్షాసవం వాసన చూచి, నచ్చినట్లు నటించి) కాని నీవందఱికి చాటిస్తే…?
పెడ్రిలో:
ఆసీసా సాక్షిగాప్రమాణం చేస్తున్నాను. అట్లాంటిది జరుగనే జరుగదు.
(సారాయితో పానపాత్రను నింపి అతని కొసఁగి, అతఁడు త్రాగుచుండగా పాడుదురు.)
యుగళగీతం(చతురస్రగతి)
పెడ్రిలో:
సందేహింపకు సందేహింపకు
దేవతలెల్లరు దివమునఁ ద్రావెడి
మార్ద్వీకంబిది, మధురంబియ్యది
మార్ద్వీకంబిది, మధురంబియ్యది
ఉస్మాన్:
అది యట్లుండని, అల్లా నన్నుం
జూచున సేవించుచునుండఁగ నిది?
ధైర్యముఁ జేతున? తటుకున దీనిం
గటగుటజార్తున గళనాళంబున?
పెడ్రిలో:
అటమటమేటికి? తటుకునఁ బీల్చుము
అందలి మధురిమ నాస్వాదించుము
సురలే దీనినిఁ జొక్కచు ద్రావఁగ
వ్యర్థములేకద అల్లా ఆంక్షలు!
ఉస్మాన్:
(త్రాగును)
చేసితిధైర్యము, చేసితి ధైర్యము
అస్వాదించితి ఆసవ మధురిమ
కడచిన యౌవనకాలము నవముగ
మొలచిన యటులన్ మోదంబందితి
ఇర్వురు:
దనుజారులకై, మనుజావళికై
దేవుఁడు చేసిన దివ్యామృతమిది
దీనిని మించిన దేదియు జగమున
లేదు నిజంబుగ లేదు నిజంబుగ
ఉస్మాన్:
(పానపాత్రను బట్టుకొని విశృంఖంగా నటిస్తూ)
ఆహా… హాసవం…దరక్షా.. హాశవం
దరక్షా రిక్షా దరక్షా దరక్షా
దరక్షా రిక్షా రిక్షా దరక్షా
దరక్షా దరక్షా హాసవం హాశవం
హాశవం హాసవం దరక్షా దరక్షా
హాసవం హాశవం దరక్షా దరక్షా
పెడ్రిలో:
(తనలో) ఇఁక వీనిని విసర్జించడం ఉత్తమం. (ప్రకాశంగా) వృద్ధమిత్రమా! ఇక నిద్రింతమా?
ఉస్మాన్:
నిద్రా…?
పెడ్రిలో:
ఔను. నిద్రే. పోదాం పద. ఏక్షణంలోనైనా పాషా రావచ్చు. అతడు మనల నీస్థితిలో చూస్తే బాగుండదుగదా! పోదాం పద!
(అనుచు మతిదప్పి తూలుచున్న ఉస్మానును భవనంలోనికిఁ జేర్చి పెడ్రిలోతిరిగి వచ్చును)

పంచమదృశ్యము

(ముందుగా పెడ్రిలో, తర్వాత అమాండో అరియానాలు, తర్వాత బెలిండా)

అమాండో:
అరియానా రాలేదా ఇంకా?
పెడ్రిలో:
వస్తూనే ఉన్నదామె.
అరియానా:
(ప్రవేశించి) అమాండో! అమాండో! ఎన్నాళ్ళకు నీసుందరముఖ దర్శనం! ఎన్నాళ్ళకు నీ ఆలింగనసౌఖ్యం!
అమాండో:
ప్రియురాలా అరియానా! నా ప్రాణధనమా అరియానా! (ఇర్వురు గాఢముగా కౌఁగిలించుకొందురు.)
అమాండో:
నీకన్ను లశ్రుమయమౌతున్నవి.
అరియానా:
నీకన్నులూ అశ్రులు గార్చుచున్నవి.
ఇర్వురు:
ఔనవి ఆనందబాష్పాలు.
యుగళగీతం(చతురస్రగతి)
ఇర్వురు:
యౌవనవంతుల జీవితమందున
అనురాగంబను ఆరామంబున
ఆనందంబను అలరులు గురిసెడి
మధురసబిందులె మన యశ్రువులు
అరియానా:
ఆయారామము నందున వెలసిన
మధుమాసంబే మనసంశ్లేషము
ఆమాసంబున నలరు నశోకమె
అనుపమమై తగు మననిశ్శోకము
అమాండో:
ఈయాశ్లేషం బీయానందము
లెన్నిదినంబుల కెన్నిదినంబుల
కొదవుచు నున్నవి?ఇదియే నిజముగ
ఘనమగు పండుగ మనజీవితముల
అరియానా:
దొంగలపాలై దుఃఖాశ్రువులే
కన్నులఁ గారఁగ కష్టములందితి
వానిం గాదని ఆనందాశ్రులె
ఈనాఁడొదవుట యెంత అదృష్టము!
ఇర్వురు:
విరహము తావున వెలసెను నేఁడే
సంశ్లేషంబును సంతోషంబును
ఇది మన బ్రతుకుల నెప్పుడు వీడక
నిల్చును గావుత నిశ్చలమగుచును
అరియానా:
5అంబుదావృతమైన కాలాంబరాన
క్షణికముగఁ దోఁచు చంచలకరణి నీదు
దర్శనం బబ్బెఁగాని ఆ తమమునుండి
ముక్తమగుటెట్లు, దీని కేయుక్తి కలదు?

(ఇంతలో బెలిండా ప్రవేశించును.)

అమాండో:
చీకటిరాత్రివంటి యీనిర్బంధమునుండి తప్పుకొనుటెట్లని అడుగుచున్నావా? దాని కేర్పాటు చేసియే ఉన్నాను. సర్వసన్నద్ధంగా నా ఓడను రేవుకడ నుంచినాను. దానిలో పాఱిపోవుటకు మధ్యరాత్రి నిచ్చెనపై నీకిటికీ ముందుంటాను. నీవు కిటికీగుండా నన్నుఁ జేరు కొంటావు. అట్లే బెలిండాకూడ పెడ్రిలోతో చేరుతుంది. అందఱమూ కలిసి ఓడలో పరారీ ఔతాము.
పెడ్రిలో:
బెలిండా! విన్నావుగదా! నీవూ సిద్ధంగా ఉన్నావా?
బెలిండా:
ఇంతవఱకే నీవిది అన్నావుగదా! నేను సిద్ధంగానే ఉన్నాను.
నల్వురు:
5ఈతమోవిముక్తిని గందుమింకమనము
వేకువగు లోఁగ సాగరవీచులందు
సాగుచుందుము జలపక్షిసంఘమట్లు
సంబరంబున మాతృదేశంబుఁ జేర!

(నిష్క్రమింతురు)

(ద్వితీయాంకము సమాప్తము)


తృతీయాంకము-ప్రథమదృశ్యము

(మధ్యరాత్రికి ముందుగా అమాండో, తర్వాత పెడ్రిలో అరియానాలు)

అమాండో:
5ఎంత అలజడి చెందు నాహృదయమిపుడు!
అరుగుసమయంబు చేరువ యైనకొలది
తీవ్రమగు నది అరియాన, తీవ్రమగును
తరుణి! మనప్రేమ మనమార్గదర్శియగుత!

పాట (ఖండగతి)
రాజ్యములఁ గూల్పంగ రాజ్యముల నిల్ప
ప్రాజ్యమగు నీశక్తి ప్రస్తుత్యమెంతొ
ఓప్రేమ, ఓప్రేమ నీప్రేమ కొంత
నాప్రియం గొనిపోవు నాపైనిఁ జూపు

నీపరమసత్త్వంబు నింత నాకొసఁగి
నాపూన్కి సఫలమౌనట్లు దీవించు
ఓప్రేమ, ఓప్రేమ నీప్రేమ కొంత
నాప్రియం గొనిపోవు నాపైనిఁ జూపు

పెడ్రిలో:
(ప్రవేశించి) అందఱూ గాఢనిద్రలో ఉన్నారు. అంతా నిశ్శబ్దంగా ఉంది.
అమాండో:
మఱి నిచ్చెన యెక్కడ?
పెడ్రిలో:
అంత తొందర పడకు. నేను స్త్రీలకు సమయమైందని సంకేత మీయ వలె. కొంచె మోపిక పట్టు. (చేతిగడియారమును చూచి) మధ్యరాత్రి యగుచున్నది. నేనిక్కడ సంకేతార్థము పాడుతాను. నీవు ఎవరైన ఉన్నారేమో తోఁటలో నిఘా ఉంచి చూస్తుండు.
(అమాండో చూచుటకుఁ దొలఁగును. పెడ్రిలో మాండలీనుపై సంకేతార్థమిట్లు పాడును.)

యుగళగీతం(చతురస్రగతి)
బంధితురాలై పడఁతుక యోర్తుక
తప్పించుకొనం దలుపును దట్టును
తట్టినఁగానీ దరిదాపులలో
కావఁగ నామెను కనరారెవ్వరు

అవ్విధి నాయమ అలజడి చేయఁగ
వినియెను దానిని వీరుం డొక్కఁడు
తగువేళను నిను దప్పక ప్రోచెద
నని ప్రతినం జేసెను అతఁడామెకు

ఆతండిఁక నెపు డరుదెంచునొ యని
క్షణమొక యుగముగ గణియించుచు నా
సుదతి ప్రతీక్షించును నాత్రముతో
తాను దివారాత్రము లాతనికై
(ఇంతలో నిఘా ఉంచుటకు ప్రక్కకు దొలఁగిన అమాండో తిరిగి వచ్చును)

అమాండో:
ఏం స్పందన లేదా వారినుండి?
పెడ్రిలో:
కిటికీలో దీపపుకాంతి లేదు, వారి జాడ లేదు.
అమాండో:
ఏమరుపాటున నిద్రిస్తున్నారో?
పెడ్రిలో:
లేక నాపాట వినలేదో?
అమాండో:
మఱికొంచెం పాడఁగలవా?
పెడ్రిలో:
అంతట నొకనాఁ డాతఁడు మున్నుగ
ప్రతిన యొనర్చిన వితమును దప్పక
కడిమి తలిర్పఁగ నడురాతిరిలో
ముదితను బంధవిముక్తను జేయుచు
గొనిచనె తనతో గుప్తముగా
అతఁడెవఁడో కాడజ్ఞాతంబగు
నాకృతినుండిన ఆమె ప్రియుండే!
(అరియానా తన కిటికీతల్పును దెరచును. ఆమె గదిలో వెలుఁగు కాననగును)
పెడ్రిలో:
అదృష్టం, మన అదృష్టం! అమె తల్పును దెరచుచున్నది.
(అతఁడామె కిటికీముందర నిచ్చెన నుంచును. అమాండో దానిపైఁ బ్రాకి అరియానాతోఁగూడ క్రిందికి దిగును.)
అరియానా:
నాహృదయమెంత దడదడలాడుచున్నది. క్షేమంగా పోగల్గిన ఎంత బాగుండును!
అమాండో:
మనం మఱల ఏకమైనాము. మనల నాపఁగల వాఁడెవ్వఁడూ లేడు.
పెడ్రిలో:
సరే! మాటలు మాని కార్యం కానీయండి.ఉఱుకండి త్వరగా రేవుకు.
(వారిర్వు రటనుండి ఉఱికిపోతారు. పెడ్రిలో నిచ్చెనను బెలిండా కిటికీ ముందుంచి దానిపై ప్రాఁకుతాడు.)
బెలిండా, బెలిండా! త్వరపడు, త్వరపడు.
(ఇంతలో చీకటిలో కన్పడకుండా నల్లముసుగును కప్పుకొన్న నిఘాదారుఁ డొకఁడు వారిని గమనించి ఉస్మానును లేపుతాడు. ఉస్మాను లేచి అలజడితో..)
ఉస్మాన్:
ఏం సంగతి? ఏమౌతున్నదీ రాత్రిలో?
(నిఘాదారుఁడు నిచ్చెనవైపు చూపును.)
ఉస్మాన్:
ఏమౌతున్నది? నిచ్చెనపై ఎవరున్నారు? ఎవరు చొరబడు తున్నారు? ఎవరు కొల్లగొడుతున్నారు? ఎవరీ చోరులు, గజ దొంగలు, బందిపోటులు. వెంటనే భటులను పిల్చుకొని రా! ఆలోపల వీరి విషయం నేను చూచుకొంటాను.
(ఉస్మాన్ పరుగెత్తి గుట్టుగా నిచ్చెన వెన్క వేచి, క్రిందికి దిగుతూనే పెడ్రిలో బెలిండాలను పట్టుకొని పెద్దగా అఱచి భటులను పిలుచును.)
ఉస్మాన్:
దొంగలు దొంగలు, దోపిడీదారులు. దుర్మార్గుడా పెడ్రిలో ఇంక నీ మొండెముపై తల ఉండదు.
బెలిండా:
దేవుఁడా! ఇదే మా అంతం.
పెడ్రిలో:
ఉస్మాన్, కాస్త వినోదం చూడలేవా? నేను నీభార్యను తోఁటలో విహారానికై తీసుకపోతున్నానంతే! ఇంత రభసెందుకు దీనికి?
(ఇంతలో కొందరు భటులు అమాండో అరియాలను పట్టుకొని తీసికొని వత్తురు.)
అమాండో:
(పెనగులాడుచు భటులతో)
విడువండి విడువండి దుర్జాతులార మమ్ము. విడువండి, విడువండి.
ఉస్మాన్:
ఈవనశిల్పి కూడా విహారానికే పోతున్నాడా?
అమాండో:
ఈ గొడవంతా ఎందుకు? ఇదో. ఈసంచిని చూడు. నిండా బంగారు దీనారాలే ఉన్నాయి. తీసికొని మమ్ము వదలు.
ఉస్మాన్:
నీకు పిచ్చి తలకెక్కిందంతే! నీ దీనారాలకు మేమాశపడం. మా కక్కఱ లేవు. కావాలంటే మేమే వాటిని నీనుండి గుంజుకొంటాము.
(క్రిందిపాటను పాడుచు వారియెదుట ఉస్మాను విశృంఖలముగా నర్తించును)
ఉస్మాన్:
పాట (ఖండగతి)
ఎంత సంతోషమో యెంత సంతోష,మిపు
డెంత సంతోషమో యెంత సంతోషమో!

కర్కశంబుగ నురికంబ మెక్కించి యీ
ఖలుల కంఠములందు గట్టిగా నురితాడు
బిగియించు దృశ్యంబు వీక్షించుటకు నెంత
సంతోషమో , నాకెంత సంతోషమో!

పందికొక్కులభంగి ప్రమదానివాసమున
దూరి కన్నము వేయ దొరకొన్న వీరిఁ
బట్టుకొని పరిమార్చు పర్వంబుఁ గన నెంత
సంతోషమో నాకెంత సంతోషమో!

దొంగలై యేతెంచి, ద్రోహంబు లొనరించి
అవరోధమున నున్న అంగనల హరియించు
ఈదుండగులు పొందు హింసలం గన నెంత
సంతోషమో నాకెంత సంతోషమో!

(భటులా నల్వురిని అటనుండి కొనిపోదురు)

రెండవదృశ్యము

(పాషా భవనబహిశ్శాల – పరిచారకులతో నున్న పాషా సలీం. తర్వాత ఉస్మాను, భటులు గొనివచ్చిన అరియానా అమాండోలు)

సలీం:
ఏమీ అలజడి, అల్లరి? ఏమౌతున్నది?
ఉస్మాన్:
మహాప్రభూ! మన ప్రాసాదంలో మహాదుర్మార్గులు, రాజద్రోహులు, విశ్వాసఘాతకులు!
సలీం:
విశ్వాసఘాతకులా? రాజద్రోహులా?
ఉస్మాన్:
ఆ దుర్జాతులైన క్రిష్టియన్ సేవకులు మనస్త్రీల నపహరించుకొని పోతున్నారు. మీకిష్టుఁడైన ఆ వనశిల్పి ఇంకెవరినో కాదు – సాక్షాత్తుగా మీప్రియురాలిని అరియానానే ఎత్తుకపోతున్నాడు.
సలీం:
వెంటనే పిలువు భటులను. నేనిక్కడనే వేచి ఉంటాను.
(భటులు అరియానా అమాండోలను గొనివచ్చి సలీమెదుట నుంతురు)
సలీం:
(అరియానాతో) రాజద్రోహీ! ఇందుకొఱకేనా నీవు నన్ను నిరీక్షింపుమన్నది? నాకుద్రోహం చేయుటకే నా ఔదార్యాన్ని వినియోగించుకొన్నావా?
అరియానా:
(అమాండోను చూపుచు)
నేను మీదృష్టిలో నిజంగా ద్రోహినే, దుష్టురాలినే! కాని ఆదినుండి నాహృదయనాథుఁడైన ప్రియుఁడీతఁడు. నా దోషమునకు నాకు మరణం వేసినా సరే. కాని ఇతనిని మాత్రం కాపాడండి.
సలీం:
అవినీతిపరురాలా! ద్రోహివైన నీవు నీద్రోహంలో భాగస్వామి యైన ఇతనికి రక్షణ గోరుకొంటున్నావా?
అరియానా:
నేనంతకంటె అధికంగానే అభ్యర్థిస్తున్నాను. నేనతనికొఱకై నా ప్రాణముల నర్పింపఁ గోరుకొంటున్నాను.
అమాండో:
(కాళ్ళపైఁబడి) జహాఁపనా! ఇంతవఱ కెవ్వరినీ నేను దైన్యంతో యాచించ లేదు. కాని ఇప్పుడు మీకు మోకరిల్లి మీకనికరాన్ని యాచించు చున్నాను. నేనొక ఉన్నతమైన స్పెయినుదేశపు లాష్టడోస్ రాజసంత తికి చెందినవాఁడను. మమ్ములను క్షమించినందులకు మీకెంత పారి తోషికమైనను నాకుటుంబం చెల్లించగలదు. కనికరించి మాకు క్షమా భిక్ష దయచేయండి.
సలీం:
ఆశ్చర్యం! నేనేమి వింటున్నాను? నీవు లాష్టడోస్‌ రాజవంశీకుఁడవా? నీకు మిలిటరీ నాయకుఁడు ఓరాన్ తెలియునా?
అమాండో:
అతఁడే నాతండ్రి. నేనతని ఏకైకపుత్రుఁడను.
సలీం:
అతఁడే నీతండ్రి! ఎంత ఆశ్చర్యం!ఇదెంత శుభదినం! నా బద్ధశత్రువు కుమారుఁడు నాదయాభిక్షనర్థిస్తూ నాకు మోకరిల్లడ మెంత విశేషం! చూడు దౌర్భాగ్యుఁడా! నీతండ్రివల్లనే, అతని క్రూరత్వంవల్లనే నేను నాదేశంనుండి బహిష్కృతుఁడ నైనాను. అమితమైన అతని దురాశా లోభములే నాప్రియురాలిని, నా ఆస్తిపాస్తులను, నాపదవిని, అన్నిం టినీ హరించినాయి. ఒక్కమాటలో, నాసమస్తమైన ఆనందాన్ని, అభ్యుదయాన్నీ అవి మట్టిపాలొనరించినాయి. ఎంత విడ్డూరం! ఇప్పుఁడాతని ఏకైకపుత్రుఁడు నా అధీనంలోఁ జిక్కి నాకు మోకరిల్లు చున్నాడు. చెప్పు అమాండో నీవే నాస్థానంలో ఉంటే ఏంచేస్తావో?
అమాండో:
(అత్యంతదైన్యంతో) నా పరిస్థితి చెప్పలేనంత దారుణంగా ఉంటుంది.
సలీం:
సరే, అదే నిజమగు గాక! అతఁడు నాయెడ వర్తించినట్లే నేను నీయెడ వర్తించడం సరిగానే ఉంటుంది. (ఉస్మానుతో) నాతో రా ఉస్మాన్!
(ఉస్మానుతో నిష్క్రమించును.)
అమాండో:
(అమాండో నిర్వేదముతో నిట్లు పాడును)

10ఎంతటి క్రూరమైనదొకొ యీవిధి, అంత విరుద్ధమౌచు నా
కెంతయుఁ గూర్చు శోకమును, ఇంతికి సైతము నాకతంబునన్
అంతములేని శోకగతి ప్రాప్తిలుచుండె, నికేమి సేతు, దే
హాంతమె నాదువంతలను నంతమొనర్ప సమర్థమయ్యెడిన్.
అరియానా! అయ్యో! నామూలంగా నీకు మరణమొందు దౌర్భాగ్యము కల్గుచున్నది గదా!

అరియానా:
5నన్నుఁగూర్చిన చింత యనవసరంబు
మరణ మన నేమి? శాంతికిన్ మార్గ మదియె,
అందునను నినుగూడి దేహాంత మొంద
గల్గుటగును మద్భాగ్యరేఖాఫలంబు!
అమాండో:
5దేవదూతికవలె పల్కుదీవు చెలియ!
నీదువాక్కు లమోఘముల్ నిజముగాను
క్షుబ్ధచిత్తంబులకు నవ్వి సుఖము గూర్చు
మరణభీతినిఁ బోఁద్రోలు మంత్రములవి

ఎంత క్రూరుండనో కదా! యిపుడు నిధన
మొంద నాతోడ నిను గొనిపోవుచుంటి.

అరియానా:
5పొలియుచుంటివి నీవు నామూలమునను
అట్టి నీతోడఁ జనుట న్యాయంబె నాకు
బ్రతుకులోననె కాక మరణమునందు
గూడ నీతోడ నుండుట గొప్పవరము!
ఇర్వురు:
5నీకొఱకు బ్రతుకుటయె యీలోకమందు
నాదుజీవితలక్ష్యంబు, నాదు సౌఖ్య,
మదియె కఱవైన జీవితం బగును నాకు
సతతశోకప్రదము, ధ్వాంతసంవృతంబు.
అమాండో:
5మృతియె ననుఁ బిల్చుచుండెను మృదువుగాను
అరియానా:
అదియె ననుఁబిల్చు నిప్పు డాప్యాయముగను
అమాండో:
సిద్ధముగ నుంటి మరణంబ, చేర నిన్ను!
అరియానా:
సిద్ధముగ నుంటి మరణంబ, చేర నిన్ను!
ఇర్వురు:
5మరణమా! నీవు మము వేఱుపఱుప లేవు
కలసివత్తుము నినుఁజేర వలదు చింత!
బ్రతికియున్నపుడున్నట్టి వితముగానె
ప్రమదయుతముగ నినుఁజేర వత్తు మింక!

చివరిదృశ్యము

(సలీం భవనము. సలీము, బంధితులైన అమాండో అరియానా బెలిండా పెడ్రిలోలు, భటులు, సంతోషగర్వములు వెలార్చుచున్న ఉస్మాను.)

సలీం:
దౌర్భాగ్యులారా! మీరిఁక శిక్షార్థము వేచియున్నారా? చేరువైన మరణమును దలఁచికొనుచు పరితపించుచున్నారా?
అమాండో:
(సలీం ఎదుట మోకరిల్లి) తప్పక ప్రభూ! నాతండ్రి చేసిన కీడుకు ప్రతీకారం తీర్చుకొనండి. నేనెంత ఘోరదండనకైనా సిద్ధమయ్యేఉన్నాను. నిస్సంకోచంగా ఘోరాతిఘోరమైన దండన నాకు విధించి సాంతంగా మీ ప్రతీకారం తీర్చుకొనండి.
అరియానో:
అతనితోఁబాటు నాకదియే అనుగ్రహించండి మహాప్రభూ!
సలీం:
దౌర్భాగ్యుఁడా అమాండో! నీవు పరిపూర్ణంగా పొరపడుతున్నావు. నీతండ్రిని నేనెంత తీవ్రంగా ద్వేషిస్తానంటే అతని ఘాతుకత్వాన్ని నే నవలబింప నిచ్చగించను. అందుచేత నీకు పరిపూర్ణస్వేచ్ఛను ప్రసా దిస్తున్నాను. నీతోబాటు అరియానానుకూడ తీసికొని నీదేశాని కింక నిర్గమించు. నీవు నా యెదుట దోషిగా, శిక్షాధీనుఁడవై నిల్చియుంటి వని, కాని పరిపూర్ణస్వేచ్ఛతో వదలిపెట్టఁబడితివని నీతండ్రికిఁ దెల్పు. అపకారాన్ని ప్రతీకారంతోఁ గాక ఉపకారంతో దీర్చుకొనుట అధికా నందప్రదమౌతుందని అతనికి వివరించు. నీవు నీతండ్రివలె గాక, దయాహృదయుఁడవైతే అదే నాకమూల్యమైన పారితోషికం. ఆలస్య మెందుకు? ఇప్పుడే బయలుదేరు నీదేశానికి.
అరియానా:
ప్రభూ! నన్ను క్షమించండి. ఇంతవఱకు మీసరసత్వౌదార్యాలనే నేను చవిచూచితని గాని, మీరింతటి….
సలీం:
చాలించు నీ వదరులు. నీవు నాప్రేమను తిరస్కరించినానని ఎప్పుడూ వగవకుందువు గాక! నేను గోరుకొనునదంతే!
(నిష్క్రమింప నుద్యుక్తుఁడై లేచును.)
పెడ్రిలో:
(అతని కాళ్ళపై వ్రాలి, బెలిండానుకూడ చూపుచూ)
ప్రభూ! ఈదౌర్భాగ్యుల కిర్వురికిని మీకరుణ ప్రసాదింపరా?
ఉస్మాన్:
(అతనిని బలవంతంగాఁ బట్టుకొని వెన్కను లాగుచు)
ఇతని నక్కవినయం మిమ్ముల ప్రక్కత్రోవ పట్టించుచున్నది ప్రభూ! అల్లాపై ఆన. ఈదుర్మార్గుఁడు చిత్రహింసచేత చంపఁదగినవాఁడు.
సలీం:
ఐతే ఆ సత్కారం స్వదేశంలోనే అతనికి జరుగనిమ్ము. (భటులతో) ఈ నల్వురిని వారి ఓడదగ్గర వదలివేయండి.
(ఆమాట విని బెలిండాపెడ్రిలోలు సంతోషంతో కౌఁగిలించుకొందురు.)
ఉస్మాన్:
(విద్వేషంతో) ఏం వీఁడు నాబెలిండానుకూడ లేవదీసికొని పోతున్నాడా ?
సలీం:
(విలాసంగా) వృద్ధసేవకా నెమ్మదించు కొంత. సరసత్వంచేత, కరుణచేత గెల్చుకొనలేనివారిని త్యజించుటయే మంచిది.
అమాండో:
పాట (ఖండగతి)
గళమందు ప్రాణంబు నిలిచియుండెడు దాఁక
మఱవజాలము మీదు మానసోన్నతిని పాష!
ఏదేశమందున్న ఏభూమియందున్న
మీగుణగణంబులే మేము కీర్తించెదము
ఎవ్వాఁడు మఱచునో ఇట్టి ఔదార్యంబు
ఆతండు నిజముగా అధమాధముండిలను
అమాండో, అరియానా, బెలిండా, పెడ్రిలో, ఉస్మాన్:
గళమందు ప్రాణంబు నిలిచియుండెడుదాక
మఱవజాలము మీదు మానసోన్నతిని పాష!
అరియానా:

చెలికాని ప్రేమతో చేతంబు నిండినను
అందులో నొకమూల ననిశంబు నివసించు
నాకృతజ్ఞత్వంబు మీకృపాసాంద్రతకు
జోహారు ప్రభుపాష! జోహారు పాషా!

అమాండో, అరియానా, బెలిండా, పెడ్రిలో, ఉస్మాన్:
గళమందు ప్రాణంబు నిలిచియుండెడుదాఁక
మఱవజాలము మీదు మానసోన్నతిని పాష!
పెడ్రిలో:

మరణంబు దప్పించి మాకుస్వేచ్ఛనొసంగి
మమ్ముఁ గాచిన మీదు మానసౌదార్యంబు
తులలేనిదని నేను స్తోత్రంబుఁ గావింతు
ఎలుగెత్తిచాటెదను నలుదెసల మీకీర్తి

అమాండో, అరియానా, బెలిండా, పెడ్రిలో, ఉస్మాన్:
గళమందు ప్రాణంబు నిలిచియుండెడుదాక
మఱవజాలము మీదు మానసోన్నతిని పాష!
బెలిండా:

ముసలియౌ ఉస్మాను ముష్టిబంధమునుండి
కరుణతోఁ దప్పించి కాచినందుకు నన్ను
నాపెడ్రిలోవశము ననుజేసినందులకు
శతకోటి దండాలు సార్వభౌమా పాష!
(ఇదిపాడుచున్న బెలిండాను ఉస్మాన్ గుఱ్ఱుగా చూచి కోపంతో నిట్లు పాడును.)

ఉస్మాన్:
2ఈధూర్తశునకాల నిప్పుడే దహియించి
తప్పింపవలె గొప్పముప్పు ముస్లిములకు
మోసంబు గావించి పాషాను మెప్పించి
తప్పించుకొని వీరు తరలిపోవుచునుండ్రి

1వేయఁగవలె వీరికి శిక్షలు
తఱుగన్వలె శిరములు మున్నుగఁ
ఉరి దీయంగావలె పిమ్మట
ఒలువగవలె చర్మము లాపై
కాల్చఁగవలె నిప్పుల నటుపై
త్రాళులఁ గట్టఁగవలె మీదట
నీటను నెట్టఁగవలె తదుపరి
పిండిగఁ గొట్టఁగవలె తుదిగా
(ఇట్లు ఉద్రేకంతో అర్థరహితంగా పల్కి క్రోధంతో అటనుండి ఉఱికిపోవును)

అమాండో, అరియానా, పెడ్రిలో, బెలిండాలు:
1అతులితకరుణను అరులకు సైతము
హితమునె సేయఁగ నెంతురు సుజనులు
వారల మేలును భావన సేయని
వారు కృతఘ్నులు పాపులు ద్రోహులు

అతులితకరుణను… పాపులు ద్రోహులు

ఉపసంహారము

తుర్కీ స్తుతిపాఠకుల కోరస్, ఇతరులు అందఱు:
పాట (చతురస్రగతి)
విజయము నీకున్ విమలినచరితా!
విజయము నీకున్ విశ్రుతచరితా
కరుణాకారా కావఁగ మమ్ముల
చిరముగ మనుమిఁక ధరణీపతివై

నాలుగుచెఱఁగుల నేలను నీగుణ
జాలమునే జనులాలాపింపఁగ
పాలితజనులకు భద్రము గూర్చుచు
ఏలుము తుర్కీనేలను పాషా!

మేదినిలో నృపమండలి కెల్లను
ఆదర్శంబయి నీదుచరిత్రము
వరలుచునుండఁగఁ బరిపాలింపుము
స్థిరముగ తుర్కీధరణిని పాషా!

విజయము నీకున్ విశ్రుతచరితా!
విజయము నీకున్ విమలినచరితా!
విజయము విజయము విజయము నీకున్
విశ్రుతచరితా! విమలినచరితా!

(తృతీయాంకము సమాప్తము
అవరోధికాహరణము సమాప్తము.)