ఇంతులందఱు నింతయే

కొసీ ఫాన్ తుత్తె

కొసీ ఫాన్ తుత్తె (Così fan tutte) అనునది మొజార్ట్ (Wolfgang Amadeus Mozart) చేసిన సంగీతరూపకము (opera). లొరెన్జో ద పాన్తె (Lorenzo Da Ponte) అను నాటకకర్త ఇటాలియను భాషలో నీ రూపకమును వ్రాసెను. ఇది తొట్టతొలిగా క్రీ.శ. 26 జనవరి 1790 సంవత్సరమున వియన్నాలో మొజార్ట్ సంగీత దర్శకత్వములో ప్రదర్శింపబడెను. ఆకాలములో ఇది ఎక్కువ ప్రసిద్ధి గనకున్నను 20వ శతాబ్దార్ధమునుండి ఇది ప్రతి సంవత్సరమును ప్రపంచవ్యాప్తముగా అనేక సంగీత నాటక బృందములచే ప్రదర్శింపబడి సుప్రఖ్యాతమైనది. ఈకాలములో ప్రేక్షకులకిష్టమైన ఆపెరాల లోనిది ప్రథమ శ్రేణికి జెందినది.

ఇందులో గల కథ సంగ్రహముగా నిది: నేపుల్స్ నగరంలో ఫెర్రాందో (Ferrando), గుల్యెల్మో (Guglielmo) అను ఇద్దఱు యోధులున్నారు. వారికి దొరబేల్లా (Dorabella), ఫ్యోర్దిలీజి (Fiordiligi) అను యువతులతో వివాహమునకై నిశ్చితార్థము జరిగినది. ఈ యువతులకు తమపై అచంచలమైన ప్రేమ గలదని ఆ యోధులు వాకొనుచుండగా డాన్ ఆల్ఫోన్సో (Don Alfonso) అను మధ్యవయస్కుడు అచంచలచిత్తలైన యువతులే లేరని వారి వాక్కులను ఖండించుటయే కాక, దానిని నిరూపింపలేనిచో వారికి తలా నూరు బంగారు నాణెముల నిత్తునని ప్రమాణము చేసినాడు. ఇది నిరూపించుటకు రెండురోజుల పాటీ యువకులు తాను చెప్పినట్లుగా చేయవలెనని వారిచే ఒప్పందము చేసికొన్నాడు. మఱునాడు ఆ యోధులు యుద్ధమునకై దేశాంతరమునకు పోవుచున్నట్లు వారి వధువులకు నమ్మకము కల్గించినాడు. కాని ఈ యోధులకు ఆల్బేనియా ధనవంతుల వేషములు వేసి, వారిని యువతులకడకే పంపి ఆ యువతులకు తమపై ప్రేమాసక్తి కలుగునట్లు నటింపుమని నిర్దేశించినాడు. ఆ స్త్రీల మనస్సులీ కృత్రిమవేషధారులవైపు త్రిప్పుటకై ఆ స్త్రీల గృహసేవికయు, అత్యంత చతురురాలును ఐన దెస్పీనా (Despina) అను యువతికి లంచమిచ్చి ఆమె సహాయమును పొందినాడు. మొదట నిరాకరించినను, దెస్పీనా, ఆల్ఫోన్సోల బోధనలవల్ల ఆ యువతులు కృత్రిమవేషధారులకు వశమై వారిని వివాహమాడుట కంగీకరించినారు. కాని వివాహమగు వేళకు యుద్ధమున కేగిన యోధులు తిరిగి వచ్చుచున్నట్లు సైన్యభేరి మ్రోగినది. తమ ప్రియులు తిరిగి వచ్చుచున్నారని ఆవేగముతో యువతులు కృత్రిమవేషధారులను ప్రక్కగదిలో దాచినారు. వారు వెంటనే తమ వేషములను తొలగించుకొని నిజమైన వరులుగా వచ్చి తమ వధువులు పరపురుషులయందాసక్తులైనట్లు గ్రహించి, వధువులయం దపరాధము నారోపించినారు. వధువులు తమ తప్పిదమునకు భయభ్రాంతులైనారు. దీనికి కారణమైన పరపురుషులను (మారువేషములలో నున్న తమనే) వెదకి శిక్షించు నెపముతో వారా పురుషులు దాగియున్న గదిలో ప్రవేశించి, కొన్ని క్షణములలో వారు ధరించియున్న కోట్లను మాత్రము వేసికొని బయటకు వచ్చినారు. అసలైన మోసము వధువుల కవగతమైనది. కొసీ ఫాన్ తుత్తె అనగా అతివలీ విధముననే చేయుదురు అని అర్థము, అనగా ఇంతులందఱు నింతయే. కడకు అదే రంగముపై ఇద్దఱు యోధులకు, వారి వధువులకు పాణిగ్రహణము జరిగి కథ సుఖాంతమైనది.

ప్రస్తుత ప్రయత్నము

ఇటాలియను భాషలో నున్న అత్యంత రసవత్తరమైన ఈ రూపకముయొక్క ఆంగ్లానువాదమును ఆధారముగా చేసికొని, తెలుగులో దీనిని పునర్నిర్మించితిని. ఇది ఇంగ్లీషు ప్రతికి అనుకరణయే కాని అనువాదము కాదు, మూలేతివృత్తాధారముగా నిర్మింపబడిన స్వతంత్ర రచన. మూలములో నున్న సన్నివేశములు, పాత్రల పేర్లు భారత సంస్కృతికి తగునట్లుగా మార్చబడినవి. ఫెర్రాందో, గుల్యెల్మోలు విక్రమ పరాక్రములుగాను, ఆల్బేనియా కేరళగాను, కేరళ దేశీయులుగా మారువేషములలో నున్న వీరి పేర్లు ప్రవిక్రమ త్రివిక్రములుగాను మారినవి. దొరబేల్లా, ఫ్యోర్దిలీజిలు మాలినీశాలినులైనారు. అట్లే దెస్పీనా, డాన్ ఆల్ఫోన్సోలు మాలతీశల్యులైనారు. ఇటలీ మాళవదేశమైనది. కథలోను కొంత మార్పు జరిగినది. మూలకథలో మారువేషములోనున్న ఫెర్రాందో గుల్యెల్మో ప్రియురాలు ఫ్యోర్దిలీజిను, అట్లే గుల్యెల్మో ఫెర్రాందో ప్రియురాలైన దొరబేల్లాను వశపఱచుకొనినట్లున్నది. అనగా మారువేషములోనున్న యొకడు తన ప్రియురాలితో గాక ఇతరుని ప్రియురాలితో ప్రణయము నెరపినట్లున్నది. ఇది అంత ఔచిత్యసమంచితముగా లేకుండుటచే, వారు మారువేషములు ధరించి, పరపురుషులుగా భ్రమగొల్పి తమ ప్రియురాండ్రనే తాము వశపఱచుకొనుటకు నటించినారని కథను మార్చినాను.

ఆపెరా (opera) అనునది సంగీతనాటకము. అందులో పొడిపొడిమాటలనుగూడ తాళయుక్తముగా పఠింతురు. నేను పొడిమాటలను విధిలేనిచోట క్వాచిత్కముగా వ్రాసితిని. ఇవియు సామాన్యముగా తాళమునకు సరిపడునట్లు జాగరూకత వహించితిని. ఇవి మినహాయించిన, ఇతర సంభాషణలన్నియు పాడుటకనుకూలమైన తేటగీతి, ఆటవెలది, కందపద్యములలో వ్రాసితిని. భావము దీర్ఘముగా నున్న కొన్నితావులలో ఉత్పలచంపకమాలలను వాడితిని. పాటలను త్ర్యస్ర, మిశ్ర, ఖండ, చతురశ్ర గతులలో వ్రాసితిని. అన్వయోచ్చారణ సౌలభ్యమునకై కొన్నిచోట్ల విసంధి చేసితిని. ఒకవిధముగా నీప్రయత్నము నెల్లను ఆధునిక యక్షగానముగా చూడవచ్చును.


ప్రథమాంకము

మొదటి దృశ్యము

స్థలము: 18వ శతాబ్దములో మాళవదేశమునందలి మదిరాగృహము. విక్రమపరాక్రములను దాదాపు పాతిక సంవత్సరముల వయస్సు గల ఇద్దఱు యోధులు కత్తులుంచిన యొరలు భుజములనుండి వ్రేలాడుచుండఁగా మద్యమును సేవించి క్రిందనిచ్చిన పాటను పాడుచుందురు. 45, 50 సంవత్సరముల ప్రాయము గల శల్యుఁడను మధ్యవయస్కుఁడొకఁడు వారితోఁబాటు అచ్చట నుండును.

యుగళగీతం

ఉభయులు:
మన ప్రేయసీమణుల కెనయైన మానినులు
కనరారు లోకాల గాలించినం గాని
ఉభయులు:
అందాలరాశులే అపరంజిబొమ్మలే
అవనికిం దిగినట్టి అప్సరోభామలే
మన జీవితోద్యానవనములం బూచిన
పరువంబు దఱుగని విరిచెండులే వారు
ఉభయులు:
మన ప్రేయసీమణుల కెనయైన మానినులు
కనరారు లోకాల గాలించినం గాని
విక్రముడు:
నా చెలియ మాలినీ నలినాయతాక్షికి
ఇలలోన నెవ్వారు తులతూగగలరు?
శిలకంటె దృఢమైన చిత్తమ్ముతో నన్ను
పూజించు నిరతంబు పుణ్యవతి యామె
ఉభయులు:
మన ప్రేయసీమణుల కెనయైన మానినులు
కనరారు లోకాల గాలించినం గాని
పరాక్రముడు:
నాతరుణి శాలినీ నవపల్లవాంగికి
ధరలోన నెవ్వారు సరితూగఁగలరు?
తనయాత్మలో పరమ దైవముగ నిల్పి
అర్చించు నాయింతి అనిశంబు నన్ను
ఉభయులు:
మన ప్రేయసీమణుల కెనయైన మానినులు
కనరారు లోకాల గాలించినం గాని

వారికి ప్రియురాండ్రపై గల నమ్మకమును శంకించుచు, స్త్రీలయొక్క చంచల ప్రకృతిని వర్ణించు నీ క్రింది రెండు పద్యములను వారితో నున్నశల్యుఁడు పాడును.

శల్యుడు:
ఎంతటి గుణగానము? మీ
కెంతటి విశ్వాసము తరళేక్షణలందున్?
కంతునిదాసులు మాయా
కాంతల వలలోనఁ దగిలి కానరు నిజమున్.
ఇంతులయందు నమ్మకము నింతగ నుంచి నుతించు మీ ఖల
స్వాంతము నేమనం గలను? చంచలవారితరంగలోలముల్
కాంతల స్వాంతముల్, క్షణవికారివిశృంఖలమేఘతుల్యముల్
కాంతులయందు కాంతలకుఁ గల్గు నళీకపు రాగభావముల్.

విక్రమపరాక్రములు సరోషముగా కత్తులను దూసి శల్యునిముందు ఝళిపించుచు క్రింది గీతమును పాడుదురు.

ఉభయులు:
మతిలేక శంకింప మాప్రియల నిటుల
హితమౌనె ఓశల్య! ఇంతైన నీకు?
విక్రముడు:
నాచెలియ మాలినీ నవనీతహృదయ,
ఆచెలువ మానసం బత్యంతనిర్మలము
నిరతంబు ననుఁదక్క నితరు నెవ్వని నైన
స్మరియింపఁగాఁ బోదు స్వప్నమున నైన
ఉభయులు:
మతిలేక శంకింప మాప్రియల నిటుల
హితమౌనె ఓశల్య! ఇంతైన నీకు?
పరాక్రముడు:
స్థిరచిత్తమున నన్నె నిరతంబు దలఁచు
సురతరంగిణిఁ బోలు శుద్ధాత్మురాలు
నామగువ శాలినీ, ఆమెనుం బోలు
వామాక్షు లిల లేరు, ఆమెయే తక్క.
ఉభయులు:
మతిలేక శంకింప మాప్రియల నిటుల
హితమౌనె ఓశల్య! ఇంతైన నీకు?
శల్యుడు:
రోషమేటికి? నేను నిర్దోషినయ్య!
అతివ లట్టి వారౌటచే నట్టు లంటి
తనుమనంబుల మీవారు తరుణులైన
తాదృశంబగు వర్తన తప్పదంటి.
విక్రముడు:
తలఁచుచు మమ్మే నిరతము
తలలో నాల్కవలె మెలఁగు తరుణుల శీలం
బుల శంకించి యవాచ్యపుఁ
బలుకులఁ బల్కెదవు శల్య! పాపాత్ముఁడవై.

(పరాక్రముఁడు కోపముతో కత్తిని శల్యుని కంఠమునకు గురిచేసి పల్కును)

పరాక్రముడు:
నీవాఙ్నిరూపణము నిశ్చయముగాను
నీవిప్డు జేయుమా నీతిమంతుఁడవైన
లేదేని నీకత్తి నీదు గళమునఁ దూర్చి
మోదింపఁగాఁ జేతు భూతముల నేను.

(శల్యుఁడు కత్తిని ప్రక్కకు నెట్టుచు వారించి పల్కును)

శల్యుడు:
వాఙ్నిరూపణ మొనరింపఁ బ్రతిన చేతు
పణముగా నొడ్డి యిన్నూరు స్వర్ణములను
కాని మీరు మాత్రము మదుక్తంబు లెల్ల
రెండునాళులు సేయుచు నుండవలెను.
ఉభయులు:

(తమలో)

పణమొడ్డి ఘనముగా ఘనమైన పరిభవము
కొనితెచ్చుకొనఁ జూచు కూళయే యీతండు;
ఇతని యుద్యమము మన యింతు లవలీలగా
పతనమొనరింతు రిఁక భయమేల మనకు?

(ప్రకాశముగా)

గారవము చెడకుండఁ గావింపు మని నీవు
చేరి పల్కినవెల్లఁ జేయుచుందుము గాని
పంతమందునఁ గూడు పరిభవంబే నీకు
స్వంతమగు; సమకూడు స్వర్ణములు మాకు.

శల్యుడు:
అది యట్టులుండనీ, అంతమునఁ దెలియు
ముద మెవ్వరిదొ, శోకపద మెవ్వారిదొ
మీనాయికామణుల మానసంబులఁ దెలియ
పూని సల్పుడు రేపె నేను చెప్పెడిరీతి.

నిష్క్రమించును. సంతోషగర్వములతో విక్రమపరాక్రము లీక్రింది పాటను పాడుచు నర్తింతురు.

ఉభయులు:
మఱునాఁడె పండును మన భాగ్యవల్లరులు
కరమందు నిండును మెఱుఁగారు నిష్కములు
విక్రముడు:
నావనిత మాలినికి నవరత్నముల పేరు
నే విలుతు నూరేసి నిష్కములతోడ

(నిష్కములు=స్వర్ణములు=బంగారు నాణెములు)

పరాక్రముడు:
నాచేతఁ బడగానె నవనిష్కములు నూరు
నా చెలికిఁ గైసేతు నవకంఠహారాలు
ఉభయులు:
మఱునాఁడె పండును మన భాగ్యవల్లరులు
కరమందు నిండును మెఱుఁగారు స్వర్ణములు

(నిష్క్రమింతురు.)

రెండవ దృశ్యము

(స్థలము: గృహారామము: మాలినీశాలినులు తమ హారతరళములందున్న విక్రమపరాక్రముల చిత్రములను చూచి ప్రశంసించుచుందురు.)

(హారతరళము=హారమునందలి పతకము, నాయకమణి)

మాలిని:
చూడు చూడవె సుందరాంగుని
ప్రోడయయి రణభూములందున
సంతతంబును జయమునందు ని
తాంతసాహసవంతు నార్యుని
అతనిహాసమె అమలచంద్రిక
అతని మోమున నాడు చంద్రుఁడు
అతనిఁ గన నా యాత్మ పొంగును
అతనుఁ గాంచిన రతివిధంబున
శాలిని:
పరాక్రముఁడను భవ్యనామము
సురేశ్వరనిభ సుందరాంగము
గలుగు నీతఁడు కొలువుదీరెను
అలతి నాహృదయాలయంబున
అతనినవ్వులె అమృతమయములు
అతనిచూపులె అతనుశరములు
అతనివాక్కులె అమృతగుళికలు
అతనిస్నేహమె అమరలోకము.
మాలిని:
ఉదయమందే యేదొ ఉరమందు తొందర
ఉదయించె సోదరీ ఉన్నపాటున నాకు
రాడయ్యె పతి నిన్న రాత్రిలో నాకడకు
నేడైన వచ్చునో రాడో మఱేమొ!
శాలిని:
కాంచెనో నీయెదను, కారణం బింకేమొ
సంచలించి యెడంద స్పందించు నటులె
వాంఛించు నాకనులు వల్లభుని జూడంగ
మించువలె చూడ్కులను నించి దెసలందు.

(నేపథ్యమున పదధ్వని నాలించి, క్రింది వాక్యమును బల్కుచు నపేక్షతోఁ జూతురు)

ఉభయులు:
అదిగొ పదరుతి! అల్లదిగొ పదరుతి!
అరుదెంచుచుండిరి ఆత్మీయసఖులు!

(వారి ప్రియులకు బదులు విచారవదనుఁడైన శల్యుఁడు ప్రవేశించును)

మాలిని:
శల్యుఁడ! నేస్తంబ! హృదయ
శల్యంబుగఁ దోఁచు నీవిషాదానన మీ
కల్యంబునఁ, జెప్పుము సా
కల్యంబుగ నీ విషాదకారణ మెదియో?
శల్యుడు:
చెప్పఁగాను నేను చేసెడు యత్నంబు
వ్యర్థమగుచునుండె వనితలార!
కంపమొందు పెదవి, కాయమెల్ల వణకు,
మాట రాదు నోట మగువలార!
స్త్రీలు:
అంత యేమి వచ్చె శాంతించి చెప్పుమా
సేదదేఱి సుంత చింత దొఱఁగి;
నీకుఁ గూర్చువారు, మాకుఁ గూర్చెడివారు
సరిగ నున్నవారె శల్య! చెపుమ.

(కూర్చువారు=ఆప్తులు, ఇష్టమైనవారు)

(క్రిందిది ప్రశ్నోత్తరోత్పలమాల. ప్రశ్నలు శాలినీమాలినులవి, ఉత్తరములు శల్యునివి.)

ఏమని చెప్పుదుం దరుణి! ఎంతొ యనిష్టము గల్గుచుండెడిన్,
స్వాములకా? అదే యనియె పల్కవలెన్, మరణంబ? కాదు, ఇం
కేమిటి? అట్టిదేను, మఱి యేమది? మిమ్ములఁ బాసి దవ్వులం
భూమికి సంగరార్థమయి పొమ్మనె వారల భూమికాంతుఁడున్.

శాలిని:
ఎట్టి వార్తను దెచ్చితివీవు శల్య!
సఖుని ముఖముఁ గనని ప్రతిక్షణము నాకు
కాలరాత్రియె; యింకెట్లు గడవఁ గలను
దీర్ఘకాలపు విరహంబుఁ దెల్పుమయ్య!
మాలిని:
ఆల మన్నది కందుకకేళి కాదు;
ప్రధనభూమియు నుద్యానవనము గాదు;
అట్టిచోటికి ప్రియుఁడేగ వట్టిపోయి
నట్టి మనుగడ నింక నేనెట్టు లీడ్తు?

(ఆలము=ప్రధనము=యుద్ధము; కందుకకేళి=బంతియాట)

శాలిని:
పూనిక యోద్ధలై పరగు పోటరు లాలము సేయఁ బోవఁగాఁ
బూనుట లోకరీతి, యటు పోవఁగ నెంచిన మాదువల్లభుల్
గానఁగరారొ మమ్ము క్షణకాలము? కౌఁగిటఁ గ్రుచ్చి ప్రేమస
న్మానము లొప్ప వీడ్కొలుపు మానినులం దరిసింపఁజాలరో?
శల్యుడు:
సాహసము లేక తెలుపంగ సముఖమందు
పరమదుఃఖదమగు నిట్టి విరహవార్త
నన్నుఁ బంపిరి చల్లగా విన్నవింప …
ఉభయులు:
ఇంత తెలిసియు ప్రాణంబు లెట్లొ విడక
యుంటిమింకను శల్య! మాకొదవఁ గలద
కడమసారిగ వారలఁ గాంచఁగల్గు
భాగ్యలేశంబు తెల్పుమా త్వరగ నీవు.
శల్యుడు:
వార లున్నారు చెంతనే వనితలార!
వచ్చుచున్నారు మిముఁ జూడ త్వరితముగనె.

(ఇంతలో విక్రమపరాక్రములు ప్రయాణ వేషములతో విషణ్ణవదనులై ప్రవేశింతురు.)

విక్రముడు:
(నటించుచు) జడిసినట్టుల మేను చలియించుచుండె,
తడబడుచు పదములే తచ్చాడుచుండె
పరాక్రముడు:
(నటించుచు) వడఁకుచుండెను పెదవి పల్లవంబట్లు,
వెడలకుండెను మాట వీడి వాతెరను

(వాతెర=పెదవి)

శల్యుఁడు:
అలజడిని చెందవల దయ్యలార!
బలము ధైర్యంబె ఆపదలయందు.
స్త్రీలు:
ఔను! ధైర్యము నూని మా ఆయువెల్ల
ఒక్కసారిగఁ దొలగంగ నురమునందు
మీదు కరవాలముల కసిమీరఁ గ్రుచ్చుఁ
డయ్య! యింకేల యింత విడంబనంబు?
మీదు సంశ్లేషరహితమౌ మేని కిపుడు
మృత్యుసంశ్లేషమొక్కటే మేలు సేయు.

(సంశ్లేషము=కౌఁగిలింత)

విక్రముడు:

(మాలినితో)

ఏమి సేతును ప్రియురాల! ఎన్నడేని
విడిచి యుంటినె నిను, క్రూరవిధియె యిపుడు
ఘోరమగు నెడబాటును గూర్చుచుండె;

మాలిని:
విధి యెదైనను నను వీడి వెడలకయ్య!
మగిడి వచ్చువఱకు నేను మిగులనయ్య!
పరాక్రముడు:

(శాలినితో)

రాజశాసనంబును త్రోసిరాజనంగఁ
జాల; క్షణమైన నిను వీడి చనఁగఁ జాల;
అకట!అడకొత్తులో పోక నయితి నేను.

శాలిని:
తనువుఁ బాసెద నీదు పదాల వ్రాలి
అరుగు మపుడు నిశ్చింతగా నాలమునకు.
విక్రమ పరాక్రములు:
ప్రణయవహ్నిసంతప్తలై పరగు మీకు
విరహవహ్నియుఁ దోడగు వేళ యయ్యె
ఐన శోకింపవలదు మృగాక్షులార!
తిరిగివత్తుము త్వరలోనె తీర్చి విధుల.
స్త్రీలిర్వురు:
కట్టిపెట్టుడు వట్టి తర్కములు మీరు
రణము గెల్తురొ, చత్తురో, తనువు నిండ
వ్రణములం గొనివత్తురో బ్రహ్మయేని
నెరుగలేడన నెరుగ మీరెంతవారు?
మాలిని:
ఎరియుచుండెను నాయెద యీ విచారమునను
శాలిని:
పగులుచుండెను నాయెద విరహభారమునను
శల్యుడు:

(తనలో)

నీటుగా సాగుచున్నదీ నాటకంబు
పాత్రధారులు పరిణతప్రజ్ఞతోడ
ఆడుచున్నారు నాటకం బద్భుతముగ.

విక్రమ పరాక్రములు:

(జనాంతికముగా శల్యునితో)

చూచితె శల్య! మా ప్రియల సుస్థిరరాగమయప్రవృత్తి, రౌ
ప్యాచలమట్లు మావిషయమందున నున్నది వారి బుద్ధి,

(రౌప్యాచలము=వెండికొండ)

శల్యుడు:

(జనాంతికముగా వారలకు శల్యుని హెచ్చరిక)

అప్డే చరితార్థులైతిరని ఎమ్మెలు వల్కఁగ రాదు, ముందుముం
దాచరణీయమైనయవి యన్నియుఁ దీఱెడుదాఁక నుండుఁడీ!

(ఇంతలో నేపథ్యమునందు యుద్ధభేరీనాదము, క్రింద నిచ్చిన దేశభక్తి గీతమును పాడుచు యోధులు వచ్చుచున్న చప్పుడు)

పల్లవి:
యుద్ధభేరి మ్రోగుచుండె
సిద్ధపడుడు యోధులార!
చరణం1:
క్షాత్రధర్మ మెదను దలచి
శత్రురాజబలము నణచి
ధర్మరక్ష సేయ త్వరగ
తరలిరండు తరలిరండు ॥యుద్ధభేరి॥
చరణం2:
కత్తిపోరులందు శాత్రవాళి
కుత్తుకలను దఱుగ రండు
బాణయుద్ధమందు రిపుల
ప్రాణములను గొనఁగ రండు ॥యుద్ధభేరి॥
చరణం3:
శౌర్యవహ్నిలోన నరుల
ధైర్యలతలఁ గాల్చ రండు
భండనంబునందు రిపుల
బాహుగర్వ మణచ రండు ॥యుద్ధభేరి॥
శల్యుడు:

(విక్రమ పరాక్రములను హెచ్చరించుచున్నాడు)

చేరువయ్యె నకట విధిచేష్టితంబు
మృత్యుదేవత పెనుబొబ్బరీతి నిపుడు
దద్దరిలఁజేసె దెసలను యుద్ధభేరి
చనక తప్పదు మీకు నేస్తంబులార!

స్త్రీలు:
ఎట్టి ఘోరము వినుచుంటి మిపుడు శల్య!
వ్రక్కలగుచుండె గుండె లా రవము చేత
మున్నె వ్రస్సిన హృదయాల మొత్తముగను
చూరుసేయుచునుండె నీ భేరి మఱల.
విక్రమ పరాక్రములు:
ధైర్యమును వహియించుఁ డో తరుణులార!
త్వరగ విజయులమై చేరవత్తుమేము.
శాలిని:

(శోకించుచు)

మరణభూమికె రణభూమి మఱొక పేరు
దానిఁ జొచ్చినవారు సప్రాణముగను
తిరిగివత్తురొ రారొ యెవ్వరికి నెఱుక?
నీదు కౌక్షేయకం బిట నిచ్చి పొమ్ము
ఎప్పు డవసరంబగునొ నేఁజెప్పలేను.

పరాక్రముడు:

(అమెను ఎదలో బొదివికొని లాలించుచు)

ఆపదలయందు ధైర్యంబె యండ నీకు,
మాను మట్టి నిర్వేదంబు మనసులోన.

మాలిని:

(శోకించుచు)

వలదు కౌక్షేయకము నాకు వల్లభుండ!
విరహవేదన చాలును వీడఁ దనువు.

విక్రముడు:

(ఆమెను ఎదలో జేర్చుకొని తలను ప్రేమతో నిమురుచు)

ఎందుకింతటి శోకంబు కుందరదన?
నృపుని శాసన మవిలంఘనీయమగుటఁ
జనక తప్పదు; నిన్ను నా మనసునందె
నిల్పుకొనియుందునుగద నేనెందు నున్న!

(ఇంతలో ఇద్దఱు సైనికులు ప్రవేశించి యుద్ధప్రస్థానమునకు ఆలస్యమగుచున్నదని, వెంటనే రమ్మని యోధులకు సైగ చేతురు.)

విక్రముడు:
ప్రేయసీ! సెలవింక, వేగ మేగవలెను.
మాలిని:

(కౌఁగిలించుకొని)

మఱవకుమునాథ! మఱిమఱి వ్రాయవలయు.

పరాక్రముడు:
సెలవింక శాలినీ! క్షేమముగ నుండుము.
శాలిని:

(కౌఁగిలించుకొని)

ప్రతిదినంబును నాథ! పత్రమును వ్రాయుము.

(ప్రేయసులను వీడ్కొలిపి విక్రమపరాక్రములా సైనికులతో నిష్క్రమింతురు. )

మూడవ దృశ్యము

(శల్యుఁడు తానారంభించిన కపటనాటకము చక్కగా సాగుచున్నదని సంతృప్తుఁడై పాడుకొనుచు నర్తించుచుండును.)

పల్లవి:
ఆరంభమయ్యెఁబో అద్భుతంబైన
సంరంభములతోడ సరసంపు నాటకము
చరణం1:
విక్రమపరాక్రములు విన్నాణ మెసఁగ
సక్రమంబుగఁ గూర్మి సంభాషణలతోడ
అసమానకపటరాగాభినయనముతోడ
రసపూర్ణమొనరించి రక్తి కట్టించిరి ॥ఆరంభమయ్యెఁబో॥
చరణం2:
ఘనమైన కూర్ములు, కన్నీటి యూర్ములు
మనలేను నినుఁబాసి యను విషాదంబులు
అనురాగసందీపితాలింగనంబులు
కనుగొన్న మనసులం గదలించు కవ్వించు ॥ఆరంభమయ్యెఁబో॥
చరణం3:
కాని యీకూర్ములును ఘనవిషాదంబులు
కానంగరావింత క్షణము గడచిన వెనుక
సిరిసంపదలవాడు సింగారములవాడు
నరుడొక్క డెదురైన నతని కంకితమౌను. ॥ఆరంభమయ్యెఁబో॥
చరణం4:
ప్రేయసీమణులందు పిచ్చినమ్ముకమూను
ఆయువకుఁ డనిలంబు నాలానమునఁ గట్టు,
ఉదధిలో వ్యవసాయమొనరింపఁ దలపెట్టు,
హృదయంబులో నబ్ధి నిమిడింప సమకట్టు. ॥ఆరంభమయ్యెఁబో॥

(ఆలానము=ఏనుగును గట్టు కంబము; ఉదధి=అబ్ధి=సముద్రము)

నాల్గవ దృశ్యము

(మాలతి యనునది మిక్కిలి చాతుర్యము గలదియు, 35 ఏండ్ల వయస్సు గలదియు నగు శాలినీమాలినుల సేవకురాలు. వారుద్యానమునుండి ఇంటిలోనికి వచ్చుసరికి ఆమె ప్రాతరల్పాహారమును వండుచు ఈక్రింది పాటను పాడుచుండును.)

ఎంతచేసినఁ గాని అంతమన్నది లేదు
అంతమున సేవికకు అనుభవము చేదు
నిరతంబు శ్రమియించి నేనెంత జేసినను
కరుణ గల్గదు సుంత దొరసానులకును
గంటసేపటినుండి కష్టించి చేసితిని
పంటికిని రుచియైన పచ్చడులు నేను
వండితిని పూరీలు, దండిగా నిడ్లీలు
పండు లెన్నియొ కోసి ప్రక్కగా నుంచితిని
వీనిఁ జూచుచునుండ బిట్టుగా నోరూరు
ఐనఁ దినగను నాకు నధికార మేది?
పోనిమ్ము, రుచిఁజూతు పూరీల నీరోజు

(బిట్టుగా=అధికముగా,తీవ్రముగా)

(అని పూరీలను పచ్చడి నంజుకొని తినుచుండును. ఇంతలో శాలినీమాలినులు గుమ్మములోనికి వచ్చిన సవ్వడి. మాలతి తడబడుచు…)

అమ్మయ్య! నాకర్మ! అమ్మవారిప్పుడే
గుమ్మమ్ము నంటిరి.

(అని పలికి తాను తినుచున్నది ఆదరాబాదరాగా మ్రింగి, మిగిలినది ఇతరులకు కనపడకుండ పడవేయును.)