లక్ష్మి

తృతీయాంకము- ప్రథమదృశ్యము

(అడవిలో నొక మహావృక్షము చాటున నున్న వెదురుగుడిసె గల దృశ్యము. రకరకముల పూలమొక్కలు, తీవలు ఆగుడిసె చుట్టును నుండును. అందులో పల్లవములతో మెత్తగాఁ గూర్పఁబడిన తల్పముపై జెరార్డు స్మృతి దప్పి పడియుండును. అతని ప్రక్క నొక కుర్చీలో లక్ష్మి కూర్చుండి అతని ముఖము నుత్కంఠతోఁ జూచుచు క్రింది పాటను పాడుచుండును. )

(జోలపాట)

పల్లవి:
అంబరవీథుల హాయిగ నెగిరే పావురమా!
సంబరముడుగుచు సాగక చిక్కితి వెటనో!
చరణం1:
కరుణం దొఱఁగుచు పరమాత్ముండే నీ
చిఱుఱెక్కల విక్షేపంబు నిరోధించునొ?
ఎగురుచుఁ జేరఁగనీయక నీప్రియురాలిని
తెగువను నిన్నీతెఱఁగున విధి వేధించునొ?
చరణం2:
ఆపరమాత్మనె అర్థించుచు నున్నది
నీపక్షక్షతినిం బాపఁగ, నిన్నామెకడం
జేర్పఁగ, నుభయుల జీవితముల సుఖముం
గూర్పఁగ నీయనుగుంజెలి పావురమా!
చరణం3:
చిరకాలంబును స్నేహము వర్ధిలు తీరున
సరసంబుగ నీతరుణిని నవరాగంబున
మురిపింపఁగ, సమ్మోహంబునఁ దేలింపఁగ
సరగున నెగురుచుఁ జనుదెంచుము పావురమా!

(ఇంతలో దూరమునుండి పుణ్యజలపానార్థము నిర్ఝరమున కేఁగు ప్రేమికుల పాట వినిపించును. లక్ష్మి కుటీరమునుండి బయటికి నడచి ఆసక్తితో ఆపాట వచ్చు దిశకు చూచుచుండును. )

ప్రేమికుల కోరస్:
సాగుదము సాగుదము జంటగా మనము
త్రాగుదము త్రాగుదము హ్రాదినీజలము

మనరాగ కుసుమంబు మ్లానంబు గాకుండ
అనిశంబు గాపాడు నఁట నానదీజలము
మనప్రేమబంధంబు మధురంబు గావించు
అనుపమామృతమంట ఆ నిమ్నగాజలము

సాగుదము సాగుదము జంటగా మనము
త్రాగుదము త్రాగుదము హ్రాదినీజలము

(ఆమె లోపలికి వచ్చులోపల జెరార్డు తేరుకొని మంచముపై కూర్చొని తన స్థితినిట్లు వితర్కించును .)

జెరార్డ్:
ఏదో శిథిలస్మృతి మెదలును నాలో
మోదంబును సమ్మోహంబును లోలో
నొందుచు నేదో యుత్సవ మీక్షించుచు
మందుఁడనై యేమఱుపాటున నుంటిని

నాకన్నులలో నపు డాకస్మికముగ
చీకటిలోఁ దోఁచెడు చంచలరీతిగ
భీకరఛురికావిద్యుతి దీప్తంబయి
చీకటి జేసెను లోకమ్ము సమస్తము

ఎఱుఁగను నటుపై జరిగిన వృత్తాంతము
ఎఱుఁగుదు నే ధర కొరిగితి నని మాత్రము
వచ్చితి నేగతి నిచ్చోటికి నేను?
తెచ్చిరి యెవ్వా రిచ్చోటికి నన్ను?

లక్ష్మి:

(కుటీరములోనికి ప్రవేశించి మేలుకొన్న జెరార్డునకు జరిగిన వృత్తాంతము దెల్పును.)

ఛురికచే గాయపడి స్రుక్కుచుం బడియున్న
నినుఁబట్టి శ్రావకుఁడు గొనివచ్చె నిచ్చటికి
ఏకాంతముగ నున్న యీకుటీరంబులో
నిన్నుంచి గ్రక్కున న్నీగాయముల మాన్ప
నోషధీరసముల న్నొనరించితిని సేవ
బ్రాహ్మణకులంబునం బ్రభవించుటం జేసి
స్వాభావికంబుగా సమకూడియున్నట్టి
ఓషధీవిజ్ఞాన ముపయోగపడె నిట్లు

జెరార్డ్:
కమ్మనగు నీదుపల్కులం గ్రమముగాను
స్మృతికిఁ దోఁచుచునుండె నాస్థితియె నిపుడు
చేతనత్వము గోల్పడి చేష్టలుడిగి
పుడమికిం బడినట్టి నన్నొడినిఁ జేర్చి
మోము మోమునఁ జేర్చి నన్నోమి నీవు
ప్రాణమూదితివిగద నాలోన లాక్మి!

ఏమందు నేమందు నిఁక నేను లాక్మి!
నామీద నెలకొన్న ప్రేమంబె నన్ను
నీరీతిఁ గాపాడఁ బ్రేరేచె నిన్ను
ఆరీతిగానె నాయంతరంగాన
నారూఢమయ్యె నీయందు రాగంబు

లోకంబు దృష్టికిన్ లోను గాకుండ
ఏకాంతముగ నిచ్చ యేకరణి నుండు
నాకరణిఁ మన రాగ మనుభవింపంగ
పూవుఁదీవెలతోడ తావులందించు
ఈవనం బర్హమై హృద్యమై మించు

లక్ష్మి:
నినుజూడ నాకిదియె యనువైన నెలవు
మనవచ్చు జంటగా మనమీవనాన
అన్యచింతలు మాని అరయంగవచ్చు
అన్యోన్యరాగంపు టవధుల న్మనము

వివరింతు మాదైవవిభవంబుఁ దెల్పు
శ్రవణపేయములైన సత్కథల నీకు

ఎవ్వారికరుణచే నీజగంబందు
నివ్వటిల్లుచునుండు నిఖిలసౌఖ్యములు
ఎవ్వారి కినుకచే నీజగంబందు
నివ్వటిల్లుచునుండు నిఖిలదుఃఖములు

అవ్వారి కథలెంతొ ఆస్వాద్యమగును
అవ్వాని వినిపించి అలరింతు నిన్ను

(ఇంతలో దూరమునుండి ప్రేమికులు ఆలపించు కోరస్ వినపడును)

ప్రేమికుల కోరస్:
సాగుదము సాగుదము జంటగా మనము
త్రాగుదము త్రాగుదము హ్రాదినీజలము

ఆవారి నొకపాత్రయందునం బూరించి
సేవించు ప్రేమికుల జీవితంబులయందు
పూవింటిదొర కృపాభోగంబు గల్గునఁట
సేవింత మావారిఁ జేరి ముదమున మనము

సాగుదము సాగుదము జంటగా మనము
త్రాగుదము త్రాగుదము హ్రాదినీజలము

జెరార్ద్:
(ఉత్కంఠతో) విను లాక్మి! విను లాక్మి! వీరెవ్వరిట్లు
గానంబు సేతురు కాననంబందు?
లక్ష్మి:
చింతింపఁ బనిలేదు. మనచెంతకున్ రారు.
జెరార్డ్:
చాల శ్రావ్యంబుగా, సంగీతయుతముగా
ఆలపింతు రేదొ వా రంతికంబున లాక్మి?
లక్ష్మి:
ప్రియతమ! వారు ప్రేమికులు, ప్రేమము మీరఁగ జంటజంటగం
బయనము సేసి, ప్రాంతమునఁ బాఱెడు పావననిర్ఝరాంబులం
గయికొని యేకపాత్రమునఁ గాముఁ దలంచుచుఁ ద్రావ నెంచుచున్
రయముగ నేఁగుచుండిరి అరణ్యపథంబులఁ గూడి పాడుచున్

ఏకపాత్రమునుండి యథేచ్ఛముగను
ఆఝరీవారి ద్రావిన యట్టి జంట
ప్రేమబంధంబు నింతేని ప్రిదులనీక
కామదేవుండు సతతంబుఁ గాచుచుండు

జెరార్డ్:
(పునరుక్తము చేయును) ఆహా!!
ఏకపాత్రమునుండి యథేచ్ఛముగను
ఆఝరీవారిఁ ద్రావిన యట్టి జంట
ప్రేమబంధంబు నింతేని ప్రిదులనీక
కామదేవుండు సతతంబుఁ గాచుచుండు
లక్ష్మి:
ఔను. అది యథార్థము.

మనమును నటులే యాపా
వననిర్ఝరవారి నేకపాత్రమునందున్
మనసారంగను గ్రోలిన
మనబంధంబును సడలక మనుచుం డెపుడున్

లేవఁగఁజాలని స్థితిలో
నీవుంటివి యందుచేత నేనే చని యా
పావనతటినీజలమును
వేవేగను గొనుచు వత్తు వేచి కనుమిటన్

(అని ఒక బంగారుగిండిని తీసికొని మెల్లగా నిష్క్రమించుచుండును. కంటిచూపందువఱ కామెను చూచుచు జెరార్డు…)

జెరార్డ్:
ఏమి మాయను చేసితో యింతి నీవు
నేను నీమాట జవదాఁట లేను, లేను!
మత్తు గొల్పెడు నీవచోమదిరచేత
సొగసి నినుదక్క నింకేమి చూడలేను!

ద్వితీయదృశ్యము

(ఫ్రెడరిక్ జెరార్డుకై వెదకుచు వచ్చి, అతనిని ప్రేమమత్తునుండి విముక్తునిఁ జేయును.)

ఫ్రెడరిక్:
ఆహా! అతఁడిట నున్నాఁడు!

దుర్గమము తీక్ష్ణకంటకదుష్టమైన
మార్గమును నిర్గమించి నిన్మార్గణంబు
సేయుచును వచ్చితిని, యిటఁ జేయుచుంటి
వేమి మిత్రమ! ఈక్షుద్రవేశ్మమందు?

జెరార్డ్:
స్వప్నలోకంబులోఁ జరియించుచుంటి
ఫ్రెడరిక్:
ఆహ! నీతోటివారెల్ల నాహవమున
కేఁగుచుండంగఁ బడియుంటి విచట నీవు!
జెరార్డ్:
నన్నొకింత చింతింపనిమ్ము!
ఫ్రెడరిక్:
దేశమంతయు మనయందు ద్వేషమూని
తిరుగఁబాటొనరించెడు తరుణమందు
చేయఁదగుచింత ఆహవచింత యొకటె
జెరార్డ్:
వినుము మిత్రమ! కలవన్య విషయములును
ఖడ్గహతిచేత క్షతినంది కడవనున్న
నన్ను రక్షించె లాక్మియే …

(అని జెరార్డు చెప్పుచుండఁగా మధ్యలోనే కల్పించుకొని ఫ్రెడరిక్ ఇట్లనును)

ఫ్రెడరిక్:
లాక్మి… బ్రాహ్మణపుత్రికయా?
జెరార్డ్:
ఔను, క్షతినంది స్మృతిదప్పి ప్రాణములనె
వీడఁగా నున్న నన్నుఁ గాపాడె లాక్మి!
గాఢమైనట్టి ప్రేమచేఁ గాదె యామె
కాచె నన్నట్లు మృత్యముఖంబునుండి!
ఫ్రెడరిక్:
నీదు లౌల్యమ్మె యిది కాని, కాదు ప్రేమ;
కలలలోకమ్ములో వివేకమ్ము నుడిగి
సంచరించుట మాని నిజమ్ముఁ గనుము,
కనులు దెఱచి కన్గొమ్ము లోకమ్మురీతి
జెరార్డ్:
ఆమె చెల్వంబు నన్నాఁకట్టుకొనియె
అమె దరహాసచంద్రాతపమునందు
కరఁగు నాయెద చంద్రకాంతంబువోలె
మఱచు సర్వము నామె మంజిమము దక్క
ఫ్రెడరిక్:
క్షణికమైన ఉత్కంఠచే జనితమైన
లౌల్యమునఁ జేసి యిట్లు దలంతువీవు
పగలు పూచినపూవు మాపటికి మ్లాన
మగు విధాన నిదియు మాయమగుట నిజము

తగిన సమయము నీకిది తప్పుకొనఁగ
ఏది మానసోద్రేకమో, యేది నిశ్చ
లానురాగమో యెఱుఁగని యామె నిన్ను
స్థిరముగాఁ గోరునని విశ్వసింపఁదగదు

జెరార్డ్:

(నిశ్శబ్దముగా క్షణకాలము పర్యాలోచించి పల్కును)

తర్కరహితము గాదు నీతలఁపు గాని
మన్మనంబును గ్రమ్మిన మాయ నన్ను
అట్లు యోచింపఁగా నీయదయ్యె నిపుడు

ఫ్రెడరిక్:
మఱి ఎలీనావిషయము నేమందువు?
జెరార్డ్:
దానిఁ జింతించు స్థితియందు లేను నేను
ఫ్రెడరిక్:
కానీ మిత్రమ! నీదగు
సైనికబాధ్యత త్యజించి స్వచ్ఛందముగా
నేనాఁడును నీవుండవు
ఈనాఁడును నది నిజమని యేను దలంతున్
జెరార్డ్:
సందేహము లేదందున
ఒందిలి యెంతగఁ గలిగిన నోర్చుచు, తృప్తిం
గందును నాబాధ్యతలు త
గం దీర్చుటయందు నొందు ఘనమోదమునన్

(ఒందిలి=దుఃఖము)

ఫ్రెడరిక్:
ఐనన్ రమ్మిఁక నేఁగఁగావలెను యుద్ధార్థంబు సంసిద్ధమై
యీనాఁడే రణభూమికిన్,

(ఇంతలో దూరమునుండి ఝరీనీరమును గొనివచ్చుచున్న లక్ష్మి కనిపించును. ఆమెను చూచుచూ…)

జెరార్డ్:
కనుము తానేతెంచు దూరాన లా
క్మీనీరేజదళాక్షి యామెకడ నెమ్మి న్వీడుకోల్వొంది, నే
నే నిన్నుం గన వత్తు, నింకఁ జనుమా నిశ్శంకగా మిత్రమా!

(పై రెండు సంభాషణ లీక్రింది శార్దూలవృత్తములోని ఖండము లనుట స్పష్టము)
(శా॥ ఐనన్ రమ్మిఁక నేఁగఁగావలెను యుద్ధార్థంబు సంసిద్ధమై
యీనాఁడే రణభూమికిన్- కనుము తానేతెంచు దూరాన లా
క్మీనీరేజదళాక్షి యామెకడ నెమ్మి న్వీడుకోల్వొంది, నే
నే నిన్నుం గన వత్తు, నింకఁ జనుమా నిశ్శంకగా మిత్రమా!)

ఫ్రెడరిక్:
(తనలో) ఈతనిమైకము దొలఁగిన
భాతినిఁ దోఁచును, వివేకభానూదయమై
చేతమునందలి తిమిరము
నాతలకుం ద్రోసివేసినట్లుగఁ దోఁచున్

(నిష్క్రమించును. )

జెరార్డ్:
(తనలో) ఆత్మసుఖముకన్న ఆధికంబు బాధ్యత
సమరమొదవినపుడు సైనికునకు
అనెడు నీతి యితని వ్యాహారమున నాదు
మనసునందు రూఢమయ్యె మఱల

తృతీయదృశ్యము

(లక్ష్మి ఉల్లాసంతో జలకలశమును గొని ప్రవేశించును. )

లక్ష్మి:
పాట
ఉల్లాసంబున యువతీయువకులు
సల్లాపించుచు సరసములాడుచు
సాగుచునుండిరి జంటలు గట్టుచు
త్రాగఁగఁ బావనతటినీజలమును

ఒంటరిగా నాయువతీయువకుల
జంటల వెంటనె సాగితి నేనును
నినె స్మరియించుచు, నీవును నాతోఁ
జనలేనందుకు సంతాపించుచు

వారాపావనవారిని పాత్రల
బూరించుచు నవ్వారిగఁ ద్రావిరి
మన సేవార్థం బాతీర్థమె నే
గొనివచ్చితి నీకనకాలుకలో (కనకాలుక=బంగారుగిండి)

జెరార్డ్:
లాక్మీ!

(అట్లామె ఉత్సాహముగా నాజలమును గొనివచ్చిన బంగారుగిండి నట నుంచుచుండఁగా నిరుత్సాహముతోఁ గూడిన అనాస్థతో జెరార్డామెను సంబోధించును. అతని మోములో, స్వనములో ప్రవ్యక్తమగుచున్న తీవ్రనిరుత్సాహమును గమనించి ఆమె నిర్వేదముతో నిట్లు పల్కును.)

లక్ష్మి:
ఎంతటి వింత! నీవదన మింతటిలోనె వెలార్చు నీయెదన్
ధ్వాంతమువోలెఁ గ్రమ్మిన నితాంతనిరా కరణంపుభావమున్,
సంతసమంతయుం దొఱఁగి సంతపనంబును గూర్చు నీస్వనం,
బంతయు మాఱిపోయె క్షణమందున నేనిట లేనియంతటన్
జెరార్డ్:
లాక్మి…లాక్మి! నీధోరణి వేఱుగఁ దోఁచును నేడు!
లక్ష్మి:
(గంభీరంగా) అరమరలు లేని విశ్వాసభరితమైన
స్థితిని జతగూడి మనవలె జీవితములు
నిర్ఝరీనీర మాపగానీరములును
ఏకమయినట్లుగా సదా యేకమగుచు
పొనరవలె మన భాగ్యంబు లనుచు నేను
కోరుకొనుచుంటి నీపైని కూర్మితోడ!
జెరార్డ్:
నీదుకోర్కెయె సఫలమై నెగడుగాక
నీదు మోమున స్మితశోభ నిండుగాక
యనియె నేనును గోరుదు నంబుజాక్షి!
లక్ష్మి:
ఇది ప్రతిజ్ఞయేనా?
ఏదైవంబును విశ్వసించెదవొ, ఏయేనీతిసూత్రావళుల్
నీదౌ మానసవృత్తి నిర్మలముగ న్నిత్యంబుగా నుంచునో,
ఆదేవుండె, తదీయసూత్రములె ప్రవ్యక్తంబు సేయుంగదా!
కాదెవ్వారికి ధర్మమార్గము ప్రతిజ్ఞల్ దప్పుటంచున్ సఖా!
జెరార్డ్:
లాక్మీ…

(అనుచు వాక్యమును మధ్యలోనే ఆపి అంతలో దూరమునుండి వినిపించు ఆంగ్లసైనికుల ప్రస్థానవాద్యధ్వనిపైననే తన లక్ష్యమునంతా కేంద్రీకరించి మాట్లాడును.)

జెరార్డ్:
సైనికులు! సైనికులు! సైనిక వాద్యఘో ష!
లక్ష్మి:
నీప్రతినయె నిజమైనన్
ఈప్రయతోదకము ద్రావి యిప్పుడె నీగా
ఢప్రణయప్రకటనమున్
సప్రీతిగఁ జేయుమోయి సంశయమేలా?

(అని ఆమె తాను దెచ్చిన జలపాత్ర నతని కడ నుంచబోవును. కాని జెరార్డు ఆమెను లక్షింపక ఆవాద్యఘోష వచ్చుచున్న దిశకు జూచును. ఇంతలో సైనికబృందముయొక్క ఈ క్రింది కోరస్ వినిపించును. జెరార్డు లేచి ఆ ధ్వని వచ్చుచున్న దిశకు నడచి తదేకముగాఁ జూచుచుండును.)

సైనికుల కోరస్:
వీరులార! వీరులార! విక్టోరియ యోధులార!
చేరరండు! చేరరండు! చేయరండు పోరితంబు!
ఇనుఁడు మునుగనట్టి ఇంగిలీషు రాజ్యమునకు
పొనరు శత్రుబాధ మూలముట్టుగాను బాపి

ఇంగిలీషురాజ్యమింక వేయి వత్సరాలు
పొంగు సాగరంబువోలె భూమి నాక్రమించి
దినదినాభివృద్దిఁ గనెడు నట్లు సేయ రండు
మన పరాక్రమంబు మహిని చాట రండు! రండు!

(జెరార్డు తనయందలి ప్రేమకంటె సైనికవిధియే పరమముగా నెంచుచున్నాఁడని లక్ష్మి గ్రహించును.)

లక్ష్మి:
(తనలో) కథ కంచికిఁ జేరినది. సైనికవిధియే యీతని ధ్యేయము. క్షణికోద్రేకమె యీతని ప్రేమము!
తన సైనికధర్మంబే,
తనదేశమె తప్ప యితని తలఁపులయందుం
గనరాదింతయు నాపై
ననురాగము, స్పష్టమయ్యె నది నాకిపుడున్

(ఆమె నిరాశతో చెంతనే యున్న ఉమ్మెత్తపొదనుండి పూవులను పెఱికి తిని ఆత్మహత్యకు పాల్పడును. అది గమనించిన జెరార్డు …)

జెరార్డ్:
విషపుష్పాలు లాక్మీ! వీని నెందుకుఁ దిన్నావు?

(ససంభ్రమముగా నురికి ఆమెను కౌఁగిటలోఁ జేర్చుకొనును.)

లక్ష్మి:
చవి జూచితి నీతో నవరాగసుధారసమును
కవగూడుచు నీతోఁ గంటిని తీయని కలలను
మావార లెఱుంగని మవ్వపు ప్రణయోక్తులచే
పూవంగను జేసితి వీవానందం బెదలో

విహరించితి నీతో విహగముచందము స్వేచ్ఛగ
ఇహమందునె స్వర్గపు మహిమంబును బొడగంటిని
ఇదె చాలును నాకీ స్మృతినే పదిలంబుగ నా
యెదలో నిడుకొని దివికేఁగెద నిఁక నెమ్మదిగా

జెరార్డ్:
నీముఖముం గన లాక్మీ!
మ్రానుపడున్ సాధ్వసమున మత్తనువెల్లన్
నేనన్యము గణియింపక
నీనీడనె నుండనెంతు నెనరున నిఁకపైన్
లక్ష్మి:

(పుణ్యజలపాత్రను తనపెదవుల కద్దుకొని త్రాగి, ఆపాత్ర నతని యెదుట నుంచి…)

విశ్వసింతును నిన్నిప్డు ప్రియసఖుండ!
ఇదిగొ పావనజలపాత్ర యెదురుచూచు
నీదు కర్తవ్యమును నీవు నిర్వహింప!

జెరార్డ్:
త్రావుచుంటిని ఉభయుల దైవతములు
సాక్షిగా లాక్మి! యీపుణ్యజలము నేను
మనదు ప్రేమను గుర్తించు మంగళాంక
మిదియె యగుఁగాక ధరయందు త్రిదివమందు!

(అట్లా పాత్రలోని జలమును ద్రావి, అశ్రునయనయైన లక్ష్మినిఁ గౌఁగిలించుకొని పాడును.)

నీవాఁడనె నేనైతిని
నీవదనం బశ్రుల మలినీకృతమై, శో
కావిలమగుట సహింపను;
నీవేల్పులనే భజింతు నీస్వస్థతకున్

లక్ష్మి:
శోకము మోదముం దెలుపుచున్ స్రవియించును నాదు నశ్రు, లీ
లోకమునే త్యజించి త్వరలోఁ జనుచుంటి నటన్నశోకమున్,
నీకమనీయసఖ్యమును నేఁ జనులోపలఁ గాంచితన్న య
స్తోకపు మోదముం దెలుపు తోయములే సఖ! నాదునశ్రువుల్

(అనుచు ఆవిషప్రభావముచే నశక్తురాలయి ఇంకను స్మృతితోడనే యుండి అతని కౌఁగిటినుండి ఆమె నేలకు వ్రాలుచుండును. అప్పుడే నీలకంఠుఁ డటకు ప్రవేశించును.)

నీలకంఠుఁడు:
అతఁడే… అతఁడే!! ఆమెతో నున్నాఁడు!
జెరార్డ్:
దండించిన దండింపుము!
నీలకంఠుఁడు:
నీకు మరణమే శరణ్యము!
జెరార్డ్:
కానిమ్మటులే! నిస్సహాయుఁడను, నిరస్త్రుడను నేను.
లక్ష్మి:
(హీనస్వరముతో) విను మిదే నాన్న! నాతుదివిన్నపంబు
పావనంబైన యీస్వర్ణపాత్రలోని
వారి నీతండు నాతోడఁ జేరి త్రావి
ప్రయతుఁడయ్యెను నిట్టి సువ్రతుని నీవు
చంప నెంచుట దుర్గ కిష్టంబు గాదు

దేవతలే యొకవ్యక్తిని
పావనమగు బలిపశువుగ వాంఛించినచోఁ
బోవుటకున్ సిద్ధంబుగ
నే వేచియెయుంటినిచట నిధనోన్ముఖినై!

(అని చెప్పి, ఆవిషప్రభావోద్ధృతివల్ల ఆమె పూర్తిగా బలహీనురాలై నేలపైఁ బడిపోవును.)

నీలకంఠుఁడు:
అయ్యొ లక్ష్మి! నా ప్రియాత్మజాత లక్ష్మి!
జెరార్డ్:
అయ్యయో లాక్మి! నీయక్షులందుఁ దోఁచు
చరమతేజంబు చంచలాచ్ఛవినిఁ బోలి
లక్ష్మి:

(అతిహీనస్వనముతో జెరార్డువైపు దృష్టి సారించుచూ క్రింది చరమవాక్యములు పల్కి మరణించును.)

చవి జూచితి నీతో నవరాగసుధారసమును
కవగూడుచు నీతోఁ గంటిని తీయని కలలను
మావార లెఱుంగని మవ్వపు ప్రణయోక్తులచే
పూవంగను జేసితి వీవానందం బెదలో

జెరార్డ్:
(ఏడ్చుచు) త్యాగము చేసితి వయ్యో తనువునె నాకైలాక్మీ!
నీలకంఠుఁడు:

(లక్ష్మి తలను తన ఒడిలో నుంచుకొని ఆమె ముఖమును పరిశీలించుచు పల్కును.)

నశ్వరంబగు కాయంబు నవనియందె
విడిచి నీయాత్మ చనె లక్ష్మి! విబుధపురికి
విన్నవింపఁగఁ జేరి మా విన్నపముల
నేరుగా మన దేవతానివహములకు!

(‘లక్ష్మి’రూపకము సమాప్తము)