ఇల్ మాత్రిమోనియో సెగ్రేతో
ఇల్ మాత్రిమోనియో సెగ్రేతో (Il Matrimonio Segreto) అనునది జొవాన్ని బెర్తాతి (Giovanni Bertati) అను రచయిత ఇటాలియను భాషలో వ్రాసిన గేయరూపకమునకు సుప్రసిద్ధ ఇటాలియను సంగీతకర్త యగు దొమీనికో చిమరోసా (Domenico Cimarosa) అను నతడు సంగీతరచన చేసిన సుప్రసిద్ధమైన సంగీతరూపకము (Opera). జార్జ్ కోల్మన్ (George Colman the Elder), డేవిడ్ గారిక్ (David Garrick) అను ఆంగ్లేయరచయితలు ఇంగ్లీషుభాషలో వ్రాసిన ది క్లాండస్టయిన్ మారేజ్ (The Clandestine Marriage) అను నాటకము నాధారముగా చేసికొని బెర్తాతి ఈ ఆపెరాను రచించియుండెను. ఇది ప్రప్రథమముగా వియన్నాలో క్రీ.శ.1792లో ప్రదర్శింపబడి అత్యంతప్రేక్షకాభిమానమునకు పాత్రమయ్యెను. ఆకాలములో ఆష్ట్రియా-హంగరీ సామ్రాజ్యమునకు చక్రవర్తియైన రెండవ లెపాల్డ్ (Leopold II) యావత్తు నాటకబృందమును తన ప్రాసాదమున కాహ్వానించి, వారికి అన్నపానాదిసంతర్పణము చేసి, వారిచే ప్రత్యేకముగా తన కుటుంబమునకీ ఆపెరాను ప్రదర్శింపజేసి, వారిని సత్కరించెను. చిమరోసా 80కి పైగా ఆపెరాలు వ్రాసినను, ఈకాలములో ఇదియొక్కటే తరచుగా ప్రదర్శింప బడుచున్నది. అంతేకాక అతడు వ్రాసిన అన్ని ఆపెరాలకును, ఇట్లే హాస్యరసాన్వితమైన ఇతివృత్తముతో ఇతరులు వ్రాసిన ఆపెరాలకును ఇది తలమానికమైనదని సంగీతపండితుల అభిప్రాయము. దీనికథ సంగ్రహముగా నిట్లున్నది.
కథాసంగ్రహము: ఇటలీదేశములో బొలోన్య (Bologna) అను నగరములో జెరోనిమో (Geronimo) అను ధనవంతుడున్నాడు. అతనికి ఎలిసెత్తా (Elisetta), కారొలీనా (Carolina) అను ఇద్దరు కూతురులును, ఫిదల్మా (Fidalma) అను చెల్లెలును, పావొలినో (Paolino) అను కార్యసహాయకుడును ఉన్నారు. జెరోనిమోకు తనకంటె ఉన్నతస్థాయిలో నున్న సామంతాదులవలె తనను కూడ అందఱు గౌరవించవలెనని, సామంతులతో వివాహసంబంధములు చేయవలెనని గాడమైన అభిలాష యున్నది. ఫిదల్మా మధ్యవయస్సులోనే ధనికుడైన తన భర్తను గోల్పోయి, తన ధనముతో గూడ జెరోనిమో ఇంటికి వచ్చి, తన ధనమును జెరోనిమో వ్యాపారములో మూలధనముగా పెట్టిబడి పెట్టి, అతని గృహమునకు యజమానురాలిగా బాధ్యత వహించినది.
పావొలినో, కారలీనాలు ప్రేమలోబడి రెండు నెలల క్రిందట రహస్యముగా వివాహము చేసికొన్నారు. ఉన్నతస్థాయి సంబంధములనే కోరుకొనుచున్న జెరోనిమోకు వారి వివాహవిషయము చెప్పుటకు వారికి ధైర్యము చాలలేదు. పైగా జెరోనిమో ముక్కోపి, చండశాసనుడు గూడ. అందుచేత పావొలినో ఒక ఉపాయమును పన్నినాడు. తనకు మిత్రుడును, సామంతుడును ఐన రాబిన్సన్ చేత ఎలిసెత్తాను అతడు పెండ్లాడునను ఒప్పందపుపత్రమును వ్రాయించి, ఆ లేఖను దెచ్చి జెరోనిమోకు ఇచ్చినాడు. ఇట్లు ఎలిసెత్తా పెండ్లియైన తర్వాత తమ వివాహమును బయల్పఱుచుట సులభముగా నుండునని అతని ఉద్దేశ్యము. కాని ఫిదల్మా కూడ లోలోపట పావొలినోను ప్రేమించుచున్నది. ఈవిషయము ఆమె మనసులోనే యున్నది, పావొలినోకు గాని, ఇతరులకుగాని ప్రకటితము గాలేదు.
కౌంట్ రాబిన్సన్ వచ్చినాడు. అతనికి ఎలిసెత్తా నచ్చలేదు. కాని కారలీనాపై అతని దృష్టి మళ్ళినది. కారలీనా అతనిని నిరాకరించినను తనకు వివాహమైనదని చెప్పలేక పోయినది. అందుచేత ఆమెయందు అతని అభిలాష ఇంకను అధికమైనది. ఇది గమనించిన ఎలిసెత్తా వారిర్వురు కలిసి తనను మోసము చేయుచున్నారని అనుమానించినది.
మాట తప్పకుండ ఎలిసెత్తాను పెండ్లావలెనని రాబిన్సన్‌ను జెరోనిమో నిర్బంధించినాడు. కాని అతడు ససేమిరా చేసికొననన్నాడు. ఐతే మధ్యేమార్గంగా ఇరువురి పరువులు నిల్పికొనుటకు మునుపు ఒప్పుకున్నదానిలో సగము వరకట్నమును మాత్రమే గ్రహించి కారలీనాను చేసికొంటానని జెరోనిమో ఒప్పుకొనునట్లుగా చేసినాడు. ఈవిషయమును తెలిసికొన్న పావొలినో తాను కారలీనాను పెండ్లి చేసికొన్న విషయమును ఫిదల్మా ద్వారా జెరోనిమోకు చెప్పించుట కామె నాశ్రయించినాడు. కాని ఈ విషయమును చెప్పక ముందే ఆమెయే తనను ప్రేమించుచున్నదని తెలిసికొని విభ్రాంతుడైనాడు. ఈసన్నివేశమును గమనించిన కారలీనా తనను వంచించుచుండెనని పావొలినోను తూలనాడినది. కాని అది నిజము కాదని పావొలినో ఆమెను ఒప్పించినాడు. ఈపరిస్థితులనుండి పూర్తిగా తప్పించుకొనుటకు వారిర్వురు తెలవారుజామున ఎవరికి తెలియకుండా ఇంటినుండి పాఱిపోవ నుద్యుక్తులైనారు.
తనకు పోటీగా కారలీనా పావొలినోను ప్రేమించుచున్నదని ఫిదల్మాకు అనుమానము గల్గినది. అట్లే తనను పెండ్లాడుటకు వచ్చిన సామంతుని కారలీనా తన వలలో వేసికొన్నదని ఎలిసెత్తా అనుమానించినది. ఈపీడలను తొలగించుకొనుటకై కారలీనాను సన్యాసినుల మఠానికి కొంతకాలం పంపడానికి నిర్ణయించి జెరోనిమోను దీని కొప్పించినారు. కారలీనా అట్లు చేయవలదని ప్రాధేయపడినా వారు వినలేదు. ఆనాటి రాత్రి కారలీనా తోబాటు పాఱిపోవుటకు పావొలినో ఆమె గదిలోనుండగా ఇతరులు వారిని పట్టుకొన్నారు. వారు రెండునెలలకు పూర్వమే ప్రేమవివాహము చేసికొన్నట్లు ఒప్పుకొన్నారు. జెరోనిమో ఆగ్రహోదగ్రుడై వారిని బహిష్కరింప నుద్యుక్తుడైనాడు. సామంతుడు కారలీనా పైగల స్వార్థప్రేమను నిస్స్వార్థముగా మార్చుకొని ఆమె ప్రచ్ఛన్నవివాహము నంగీకరించినచో తాను ఎలిసెత్తాను పెండ్లాడుదునని సంధి చేసినాడు. ఇర్వురు కన్యల వివాహములు వైభవముగా జరిగి కథ సుఖాంతమైనది.
ప్రస్తుతప్రయత్నము
ఇటలీభాషలోనున్న అత్యంతరసవత్తరమైన ఈరూపకముయొక్క ఆంగ్లానువాదమును ఆధారముగా చేసికొని, తెలుగులో దీనిని పునర్మించితిని. ఇది ఇంగ్లీషుప్రతికి అనుకరణయే కాని అనువాదము కాదు, మూలేతివృత్తా ధారముగా నిర్మింపబడిన స్వతంత్రరచన. మూలములో నున్న సన్నివేశములు, పాత్రల పేర్లు భారతసంస్కృతికి తగునట్లుగా మార్చబడినవి. కారలీనా, ఎలిసెత్తాలు మోహినీ పద్మినులుగాను, జెరోనిమో, ఫిదల్మాలు రత్నాకర మందాకినులు గాను, పావొలినో, కౌంట్ రాబిన్సన్‌లు సుబంధు, సామంత సరసవర్మలుగాను మారినారు. బొలోన్య శ్రీపురమైనది. మూలములోనున్న వరకట్నము ఇందులో కన్యాశుల్కముగా మార్చబడినది.
ఆపెరా అనునది సంగీతనాటకము. అందులో పొడిపొడిమాటలనుగూడ తాళయుక్తముగా పఠింతురు. నేను పొడిమాటలను విధిలేనిచోట క్వాచిత్కముగా వ్రాసితిని. ఇవియు సామాన్యముగా తాళమునకు సరిపడునట్లు జాగరూకత వహించితిని. ఇవి మినహాయించిన, ఇతరసంభాషణ లన్నియు పాడుట కనుకూలమును, వచనాత్మకసంభాషణమునకు చేరువగా గల తేటగీతి, ఆటవెలది, కందపద్యములలోను, మాత్రాచ్ఛందోబద్ధవాక్యములలోను వ్రాసితిని. భావము దీర్ఘముగా నున్న కొన్నితావులలో ఉత్పలమాలలను వాడితిని. పాటలను త్ర్యస్ర,మిశ్ర,ఖండ,చతురశ్ర గతులలో వ్రాసితిని. అన్వయోచ్చారణ సౌలభ్యమునకై కొన్నిచోట్ల విసంధి చేసితిని. ప్రప్రథమమున నేనిట్లే చేసిన ఇంతులందఱు నింతయే (Cosi Fan Tutte) ప్రయోగము తర్వాత ఇది నా రెండవ ప్రయోగము. నా దృష్టిలో వీనిని ఆధునికయక్షగానములుగా గ్రహింపవచ్చును.
పాత్రలు
సరసవర్మ: ఒక చిన్న సామంత ప్రభువు – 32 ఏండ్ల ప్రాయము వాఁడు
రత్నాకరుఁడు: ధనవంతుడైన రత్నవ్యాపారస్థుఁడు – 50 ఏండ్ల ప్రాయమువాఁడు
సుబంధుఁడు: సరసవర్మ స్నేహితుఁడు, రత్నాకరుని ఉద్యోగి – 30 ఏండ్ల ప్రాయమువాఁడు
మందాకిని: రత్నాకరుని చెల్లెలు – 40 ఏండ్ల ప్రాయముగలది. ధనవంతుడైన తన భర్త గతించిన పిదప తన ఆస్తిని రత్నాకరుని వ్యాపారములో మూలధనముగా నుంచి, అతని ఇంటికి యజమానురాలిగా బాధ్యత వహించుచున్న స్త్రీ.
పద్మిని: రత్నాకరుని పెద్దకూతురు – 26 ఏండ్ల ప్రాయము గలది
మోహిని: రత్నాకరుని చిన్నకూతురు – 24 ఏండ్ల ప్రాయము గలది, పద్మినికంటెను అందకత్తె.
(రెండు భాగములుగా నున్న ఈ ఆపెరాయొక్క చక్కనైన ప్రదర్శనను యూట్యూబ్‌లో చూడవచ్చును.
మొదటి భాగము, రెండవ భాగము)
మొదటిదృశ్యము
(శ్రీపురములో రత్నాకరుని యిల్లు. రత్నాకరుడు ప్రవేశించి పాడుచుండును.)
పల్లవి:
రత్నాకరుఁడను, గుణరత్నాకరుఁడను
చరణం1:
వైడూర్యంబుల, వజ్రంబుల,
మాణిక్యంబుల, మౌక్తికముల
నన్నియు నమ్మెడి వ్యాపారిని
చరణం2:
కమ్మలయందున, కమనీయంబగు
అఖిలాభరణములందున మెఱిసెడి
వన్నియు నాకడఁ గొన్నవె కాదా?
చరణం3:
తారలరీతిగ తళతళలాడెడు
అరుదగు రత్నము లన్నియు నాకడ
కోరికమీరఁగఁ గొన్నవె కాదా?
చరణం4:
నన్నును రాజాన్వయములఁ బుట్టిన
వారికి సమముగ భావించుచు సం
భావించుటయే భావ్యము గాదా?
(ఇంతలో మందాకిని ప్రవేశించును.)
రత్నాకరుఁడు:
మందాకిని:
ఎన్నినాళ్ళనుండొ నిన్ను నేను
రత్నాకరుఁడు:
మందాకిని:
హృదయంబును చక్కగ గ్రహియించితి వన్నా!
అదనిది పద్మిని కొకస
ద్హృదయునితో నుద్వహంబు నింపుగ సలుపన్.
యౌవనభరమున పద్మిని
పూవుంగొమ్మంబలెఁ గడుపొల్పున నలరున్
వైవాహికబంధంబున
నో వరునకుఁ గూర్ప నామె నొప్పగు త్వరగన్
నాదు మిత్రులు, ధనమంత లేదు గాని
కలదు రూపంబు, గుణము, సంస్కారగరిమ;
అట్టివార లుత్తమకులమందుఁ బుట్టి
నట్టి వారు పద్మిని కరం బడుగుచుండ్రి
రత్నాకరుఁడు:
సుందరమైనదె; వివాహశోభాన్వితయై
అందము లొల్కెడు పద్మిని
చందము గననెంతు నేను సైతం బైనన్.
ఉండిన చాలునె గుణమే?
ఉండఁగవలదా ధనమును నుచ్చస్థితియున్?
మెండుగ నివి యుంఁడగ, గుణ
మండితుఁడగు సద్వరునకె మత్సుత నిత్తున్.
సమమగు స్థితి గల్గినచో
క్రమముగ కల్యాణమైన కలహంబైనన్
సముపాదేయంబగు, నది
సమకూడని పెండ్లి యెట్లు సలుపఁగవచ్చున్?
ధనవంతుఁడ నగు నన్నును
ఘనులగు సామంతులందు గణుతింపవలెన్
ఘనుఁడగు సామంతుఁడె నా
తనయకు సరియైన వరుఁడు తర్కము లేలన్.
మందాకిని:
విన్నవించితి నంతయే వేఱు కాదు;
నీవు గోరిన సామంతుఁడే వరింప
సందియంబేల? నేనును సంతసింతు.
రెండవదృశ్యము
సుబంధుఁడు:
సమ్మోదంబున జంకక జడియక
సంచరియించెడు సమయము వచ్చెను
మబ్బుల మాటున మఱుఁగగు వెన్నెల
మబ్బులు దొలఁగఁగ మంజుతరంబుగ
ప్రబ్బిలు కాలము రానే వచ్చెను
పొదలో పూచిన పూవటు చాటుగ
పరగిన మన పతిపత్నీత్వం బిక
సమ్మాన్యంబగు సమయము వచ్చెను
మోహిని:
ఆమోదకరంబగుచుం దోఁచును
ఐనను మన రహస్యవివాహపు
వైనము నాకతిభయమును గూర్చును
సుబంధుఁడు:
మోహిని:
కలనైనను ఆకరణిం బ్రియతమ?
సుబంధుఁడు:
మన పరిణయ వేళను బూనినయటు
సంతోషంబున సంస్మిత మూనుము
మోహిని:
మన పరిణయమును జనకుఁడు మెచ్చున?
ఎని నాళ్ళాతని కెఱిఁగింపక యిటు
దాతుము మన యుద్వాహపుబంధము?
సుబంధుఁడు:
ఆతెర, ప్రకటితమగు మన బంధము
మోహిని:
ఈప్రచ్ఛన్నత యింకను సాగదు
ఇది నాజనకుని కెటులో తెలిసిన
ఆరంభంబగు ఘోరరణంబే
ఆఱడి కలుగును ఆప్తులచేతను
కావున నీవే కౌశలమేర్పడ
చల్లగ మెల్లగ సమయము నెఱిఁగి
ఆతని చెవికిది యంటింపుము
సుబంధుఁడు:
ఇట నుంటిని ప్రియ!
మోహిని:
పగిలెడు నిప్పుల పర్వతమట్లుగ
అది గని యలజడి నందకు మీవును
క్షణమాత్రమె యాతని క్రోధము
సుబంధుఁడు:
మోహిని:
మున్నీటను తెలిముత్యములున్నటు
ఆతని హృదయపులోతులయందున
మధురప్రియతామార్దవ మున్నది
సుబంధుఁడు:
సామంతులతో సముఁడే తానని
సంబరపడు నీ జనకుని కియ్యది
సమధికసంతోషంబును గూర్చును
సామంతుండగు నా మిత్రుండిదె
కన్యాశుల్కము కాన్క లొసంగుచు
పరిణయమాడెద పద్మిని నంచును
వ్రాసెను పత్రము పరమాదరమున
మోహిని:
సామంతుఁడు?
సుబంధుఁడు:
నేతెంచును నతఁడీ దినమందే;
నేనే కూర్చితి నీ సోదరి కీ
సంబంధం బిది సాగిన తోడనె
ప్రకటింపం దగు బంధుజనాళికి
గర్వముతో మన కల్యాణంబును
(ఇంతలో దూరమునుండి రత్నాకరుఁ డచ్చటికి వచ్చుచున్నట్లు చప్పుడులు వినపడును)
త్వరపడవలె నీ పత్రము నొసఁగి
ఘటియింపఁగ నిఁక కార్యము నేను.
మోహిని:
చనఁగానువలె నేను సత్వరమె యిటనుండి
పాట
మోహిని:
పెనుకష్ట మొనగూడు చనకున్ననేను
క్షణములే యుగములౌ నిను వీడి యున్న
కాని ప్రళయంబె కాలూను నీతోడ నున్న
సుబంధుఁడు:
రాకముందే యిటకు రత్నాకరుండు
మనల కౌఁగిటనిట్లు కనుగొన్న నాతండు
వినశించు నాక్షణమె మనయాశ లన్ని
మోహిని:
నేనొక్క క్షణమైన నీకౌఁగిలిం బాసి
క్షణములో సగమైన, సగమైన క్షణములో
సగమైన నిటులె నీసంశ్లేషమున నుందు
(ఇంతలో రత్నాకరుఁడు సమీపించుచున్నట్లు వినపడును. అదివిని మోహినీసుబంధులు సంభ్రమోద్వేగపూరితులౌదురు. సుబంధుఁ డీ క్రింది విధముగా మోహిని నోదార్చి వీడ్కొలుపును.)
సుబంధుఁడు:
బలపడును విరహంబువలన బంధంబు
కావునం జెలి ! నీకు కన్నీటివీడ్కోలు
నీవక్త్రమును మఱల నేఁజూచువఱకు.
(మోహిని నిష్క్రమించును. నేపథ్యములో తనయం దగౌరవము చూపగూడదని సేవకులకు రత్నాకరుఁడు శాసించు మాటలు వినపడును.)
రత్నాకరుఁడు:
నాదుముంగిట రాజులంబలె
ఎఱుఁగరో ఈదేశమందున
ధరణినాథుల కరణి ధనికుల
గారవంబునఁ గాంచవలెనని
సుబంధుఁడు:
తరుణమియ్యదె యతని కరుణ నార్జించుటకు
సనసన్నగాఁ బల్క వినఁజాలఁ డాతండు
స్వనమెచ్చఁగాఁ బల్కి స్పష్టముగ వచియించి
ఒనగూర్చుకొనఁ బోలు యుక్తిగా కార్యంబు
(రత్నాకరుఁడు రంగముపై కన్పించి, సుబంధుని చూచి)
రత్నాకరుఁడు:
సుబంధుఁడు:
(కొంచెం మెల్లగా)
సరసుండు సామంతుండు …
రత్నాకరుఁడు:
(చెవులు నిక్కించి వినుటకు యత్నించి)
సరసంబు లందువా సుబంధూ?
సుబంధుఁడు:
రత్నాకరుఁడు:
సుబంధుఁడు:
స్వామీ రత్నాకర! యిదె
సామంతవిభుండగు సరసాఖ్యుఁడు మీకున్
ప్రేమంబున లిఖియించిన
శ్రీమహితంబైన లేఖ, ప్రీతిం గొనుఁడీ!
రానుండెను సామంతుఁడు
మీ నిలయంబున స్వయముగ మిము దరిసింపన్
మానితముగ నాతని నా
హ్వానింపఁగ మీరలింకఁ ద్వరసేయవలెన్
రత్నాకరుఁడు:
(ఆలేఖను సుబంధుని హస్తమునుండి లాగికొని చదువును)
ఆహ, ఆహ! అద్భుతంబుగ నుండె ఆరంభమెంతొ!
ఓహొ, ఓహొ! మధురంబు, మధురంబు మధ్యభాగంబెంతొ!
ఈహి,ఈహి! శ్రీకరము, స్నేహదము చివరిభాగంబెంతొ।
సుబంధుఁడు:
రత్నాకరుఁడు:
కౌఁగిలించుకొనుము కౌతుకమున
నీదుపూన్కిచేతనే యిది సమకూడె
సాధు! ధన్యవాదశతము నీకు
సుబంధుఁడు:
(వీలైనచో తన వివాహమునుగుఱించి చెప్పఁబూని వినయముతో ననును)
రత్నాకరుఁడు:
మాన్యసామంతవర్యుండు మత్తనూజ
పద్మినీకరము నిపుడు; పట్టె నేఁడు
రాణి యగు భాగ్య మామెకుం బ్రాజ్యముగను
రాణియై యిట్లు పద్మిని రంజిలఁగనె
భాగ్యవంతుని మండలేశ్వరుని నొకని
వెదకి తెచ్చెద మోహినిం బ్రియము మీర
పరిణయంబాడ రాడ్వైభవంబుతోడ.
సుబంధుఁడు:
హతవిధీ! అనుకున్న దొకటి, అగుచున్నదొకటి
(అని విచారవదనుం డగును)
రత్నాకరుఁడు:
చేదుగాఁ దోఁచెనొ సుబంధు! నాదుమాట?
సుబంధుఁడు:
(‘నాకూ మీకూతురు మోహినితో …’ అనఁబోయి భయముతో మధ్యలో మాట మార్చును)
రత్నాకరుఁడు:
సుబంధుఁడు:
(అని మాటను మార్చి ప్రస్తుతాంశమునకును, తనస్థితికిని వర్తించునట్లుగా పల్కును. కాని రత్నాకరుఁడు దానిని ప్రస్తుతాంశమునకే అన్వయించుకొని ఇట్లనును.)
రత్నాకరుఁడు:
మాన్యసామంతవరుని సమ్మానమునకు
లోటు లేకుండ సర్వమేర్పాటు చేసి
వైభవంబున నాతని స్వాగతింప
సుబంధుఁడు:
(సుబంధుఁడు నిష్క్రమించును)
రత్నాకరుఁడు:
భాగ్యరమ మత్పురాపుణ్యఫలము కతన
పంచుకొందును నాకుటుంబంబుతోడ
ఈ యదృష్టఫలంబును నీక్షణంబ
పద్మినీ! మోహినీ! మందాకినీ!
సేవకులారా! సేవికలారా!
రండి! రండి! వినండి! వినండి!
(ఉత్సాహముతో బిగ్గరగాఁ బిలుచును)
మోహిని:
మందాకిని:
పద్మిని:
రత్నాకరుఁడు:
అద్భుతంబును కర్ణపేయంబు నగుచు
నింపుగొల్పెడు వార్త విన్పింపనుంటి
(పద్మినితో)
పద్మినీ! నీదు భాగ్యంబు పండె నేఁడు
క్షాత్రకులశేఖరుండును సద్గుణుండు
సరసుఁడను ఱేఁడు నేఁడె నీకరముగోరి
వచ్చుచున్నాఁడు; క్షాత్రగర్వంబుమీర
తనరుదువు నీవు రాజ్ఞీపదంబునంది.
నీదు కనుసన్న లానలై నిత్యముగను
సేవలందించుచుండ దాసీజనంబు
వైభవంబుగ ప్రాసాదవరములందు
జీవితము బుత్తువిఁక నీవు సేమముగను
ఇట్లు సామంతుఁ డల్లుఁడై యింటనుండ
మనము వీడెద మింక సామాన్యపదము
రాజవర్గములందు గౌరవముతోడ
ఉన్నతంబగు పదమంది యుందు మింక
(మందాకినితో)
మందాకిని! యేమందువు?
(పద్మినితో)
పద్మిని! నీవేమందువు?
(మందాకినీ పద్మినులు గర్వపూరితమైన భావమును ప్రదర్శింతురు)
(అందఱితో)
ఈబాంధవ్యంబున కీవైభవమునకు
కారణ మీరత్నాకరుఁడే
కారణ మీ రత్నాకరుఁడే!
సమయంబిది సంతోషంబున
స్వాగతమొసఁగఁగ సామంతునకు
సమయంబిది, సమయంబిది!
(ఆ ఉత్సాహమునకు విముఖురాలైన మోహిని ముఖమును పరిశీలించి ఇట్లనును)
చిన్నబోయెను మోహిని! చెన్ను దఱిగి?
ఈర్ష్యయో అసంతృప్తియో యేదొ నిన్నుఁ
గలఁచుచున్నట్లు నీమోము దెలుపుచుండె
చింతసేయవలదు చిన్నారి నాతల్లి!
నీకుసైతమొక్క నృపకులేంద్రు
సుగుణసాంద్రుఁ జూచి శుభవివాహముఁ జేతు
నీదుమదిని ముదము నిండఁ జూతు
(సేవకులతో)
త్వరపడుడిఁక మన భవనమునెల్లను
రాజోచితమగు ప్రాసాదంబుగఁ దీర్చుఁడు
ఇంటికిముందును ఇంటికి వెనుకను
గల తోటల, బాటల నీటుగ దీర్చుఁడు
(కుటుంబముతో)
ఆహా! నాభాగ్యము! నా పద్మిని
రాణీ యని గౌరవముగఁ బిలువంబడు;
తడబడుమాటల తాతా యనుచును
ప్రాకుదురొడిలో రాచనిసుంగులు
ఆనందంబున అంబరమంటుచు
ఆసామంతుని ఆహ్వానింపఁగ
సన్నద్ధంబగు సమయంబిది
సంబరపడియెడు సమయంబిది
(రత్నాకరుఁడు, సేవకులు నిష్క్రమింతురు)
మూఁడవదృశ్యము
(పద్మిని అప్పుడే తాను రాణి నైనట్లు గర్వముతో పల్కును. మోహిని ఆమెను చులకన చేయుచు ఆటపట్టించును)
పద్మిని:
నన్న విషయము నాత్మ నెంచుము
చిలిపిచేష్టలు చికిలిచూపులు
మాని నన్నిఁక రాణికిం దగు
గారవంబునఁ గాంచు మింకను
మోహిని:
జేసియుంటిన చెడ్డనేరము?
మనవిసేతును మహారాణికి
నేరమును మన్నింపుమంచును
పద్మిని:
మానుమిఁక నీమడ్డిమాటలు
నేను రాణిని, నీవొ యేమియు
లేనిదానివి, లేకిదానివి
మోహిని:
నాకుఁ గూర్చును నవ్వు మెండుగ
హాహ హీహీ! హాహ హీహిహి!
హాహ హీహీ! హాహ హీహిహి!
నీదు గర్వమె నీదు రాజ్యము
నీదు డంబమె నీకిరీటము
హాహ హీహీ! హాహ హీహిహి!
హాహ హీహీ! హాహ హీహిహి!
మందాకిని:
జననమందిన చానలిర్వురు
గర్వమేటికి? కలహమేటికి
మెలఁగలేరా మిత్రులట్టుల?
పద్మిని:
పెద్దదానిని, పెద్దయింటికి
రాణియై చనుదాని నించుక
గారవించుట గాదె మంచిది?
మోహిని:
ఒక్కయింతయు లెక్కసేయను
కాని గర్వము మాని యించుక
మనిషిచందము మసలుమందును
పద్మిని:
అందుచే నిట్లనుచునుంటివి
మోహిని:
రాణినంచును రభస చేతువు
ఇట్టిరాణుల వట్టిమాటల
కెట్టి యీర్ష్యయుఁ బుట్టనేరదు.
మందాకిని:
మాని శాంతముఁ బూని యుండుఁడు
కవుంగిలిలోఁ గలహమెల్లను
కరగఁజేయుఁడు, కనుఁడు స్నేహము
(అనిష్టముగా నైనను ఇద్దఱు కౌఁగిలించుకొని శాంతించుదురు. మోహిని ఉద్రేకముతో నిష్క్రమించును.)
మందాకిని:
కాని నీయందు వైరంబు గలది కాదు;
ఐన పెండ్లియై నీవుందు వామెనుండి
దూరముగ, నుండదిఁక నామె పోరు నీకు
అంకురితమయి యుండె నాయందుఁ గూడ
హృద్యమగు రహస్యప్రణయేచ్ఛ యొకటి
దీని చూచాయగా నీకుఁ దెలుపుచుంటి
ఈరహస్యంబు బయటివా రెఱుఁగరాదు
పద్మిని:
దాఁచుకొందును నాలోనె ధనమువోలె
అంకురించెన తిరిగి పెండ్లాడు కోర్కె?
మందాకిని:
ధనికురాలను, నింక యౌవనపుశోభ
తరుగకున్నదానను నన్ను పరిణయమ్ము
నాడఁ గోరెడు పురుషులుగూడ లేరె?
పద్మిని:
మందాకిని:
పద్మిని:
మందాకిని:
(ఆప్రశ్నకు ప్రియునిరూపు మనసులో మెదలగా నుబ్బిపోవుచు, తనలో నిట్లనుకొనును)
ఆతఁడు సుబంధుఁడని చెప్పివైతునేమొ
నిబ్బరించుకొనవలె నా యుబ్బుపాటు
(ప్రకాశముగ) అన్నియున్నవాఁడె.
పద్మిని:
మందాకిని:
పాట
చరణం1:
స్వయమగు కూతులవలె ననుఁ గను
కోడండ్రును గల్గుదురిటఁ గానీ
వీరలు చూపెడు ప్రేమలకంటెను
పత్యనురాగమె బహుళ ప్రశస్తము
చరణం2:
నను నమ్ముచు పూర్ణంబుగ నుంచిరి
నాపై యింటిని నడపెడి బాధ్యత
కానీ ఈయధికారముకంటెను
ధవుకౌఁగిటిబంధనమే శ్రేయము
చరణం3:
చెలువుని కౌఁగిటిచెఱయే కామ్యము
త్వరలో పద్మిని! పరిణయవశమున
ఈవిషయంబునె నీవును గందువు
కని తలఁతువు మఱిమఱి నా మాటలు
నాల్గవదృశ్యము
(రత్నాకరుఁడు, మోహిని ప్రవేశింతురు. మోహిని విచారగ్రస్తయై యుండును)
రత్నాకరుఁడు:
సన్నద్ధులమై సంతోషంబుగ
నుండఁగవలె నిఁక నుల్లాసంబును
పూనుము నీముఖమున మోహిని!
మోహిని:
నామనసందున లేకున్నను?
రత్నాకరుఁడు:
అక్కకుఁ బెండిలి యయ్యెనొ లేదో
నీవంతును రానేవచ్చును గద!
మోహిని:
జారుచునున్నది, దిగ
జారుచునున్నది నాస్థితి
నా ప్రచ్ఛన్నతయును
నా మౌనంబును శోకము
నాకుం గూర్చుచు నున్నవి;
ఎందుంటివొ నీవు సుబంధూ!
ఇపుడే నీ యవసర మయ్యెను
రత్నాకరుఁడు:
సుబంధుఁడు:
వచ్చియున్నాడు సామంతవర్యుఁడిపుడు
త్వరపడుం డింక నాతని స్వాగతింప
రత్నాకరుఁడు:
తర్వాతఁ జేత మీభాషణము
(అందఱును సామంతునికి స్వాగతమిచ్చుటకై అటనుండి నిష్క్రమింతురు)
ఐదవదృశ్యము
(రత్నాకరసుబంధులు, మోహినీపద్మినీమందాకినులు, సేవకులు వేచియుండగా సామంతుఁడు ప్రవేశించును.)
సుబంధుఁడు:
సామంతుఁడు:
సామాన్యుఁడనగు సామంతుండను
కట్నంబులు కాన్కల నాశింపను
ఆహ్వానోత్సవ మసలే కోరను
సరసాత్ముండను సరసాఖ్యుండను
సామాన్యుఁడనగు సామంతుఁడనూ,
సామాన్యుఁడనగు సామంతుఁడనూ!
బంధుతుల్యుండవె నీవు సుబంధూ!
(అని తన కెదురుగా నున్న సుబంధుని పలుకరించును. సుబంధుఁడు రత్నాకరుని, స్త్రీలను అతనికి చూపించును.)
శ్వశురున కివియే సాదర ప్రణతులు
(మందాకినితో)
సుందరమూర్తికి శుభమును గోరుదు
(పద్మినితో)
శైశిరతామరసంబును బోలిన
నీయందంబును నేను నుతింతును
(మోహినితో)
ఓహో! కలదిట నుజ్జ్వలదీపము
నళినంబుల, హరిణంబులఁ గేరెడు
నయనంబులు గల నవకపురూపము
(సుబంధునితో ఏకాంతముగ)
రతికిని రంభకు ప్రతిరూపం బీ
శతపత్త్రేక్షణ సత్యంబుగ
(రత్నాకరునితో)
శ్వశురోత్తమ! నీ భాగ్యమె భాగ్యము
రత్నంబులకుం బ్రతియగు తనయా
రత్నంబులు సార్థకమొనరించిరి… నీ
రత్నాకరనామము;
ఈరత్నంబుల నీక్షింపఁగనే
సడలెను నాలో సంశయమెల్లను
కలిగెను తృప్తియు కల్యాణార్థము
సఫలంబగు నా సంకల్పంబని
సర్వం బిచ్చట స్వాంతంబునకు
సంతోషంబు నొసంగుచు నుండెను
ఈకారణమున నిచ్చటనుండఁగ
చేకురుచుండెను నాకుత్సాహము
రత్నాకరుఁడు:
నీయుత్సాహమె మాయుత్సాహము
నీకాతిథ్యము నిచ్చుటయే
మాకానందము.
సామంతుఁడు:
మక్కువ గూర్చెను మానసమందున
నిక్కువముగ నిఁక నేనువరించెడి
చక్కని చుక్కను సన్నిహితంబుగ
గని మాటాడెడి ఘనయోగంబును
గల్పించుట మీ కంగీకార్యమె?
రత్నాకరుఁడు:
సఖ్యము మీరఁగ సంభాషించుచు
కన్యాహృదయము గాంచిన ముందుగ
సౌఖ్యము గల్గును జాయాపతులకు
ఈసమయంబున హితముగ నుండదు
వ్రేలాడుచు నిట పితరుం డుండుట
కాన సుబంధుఁడు నేనును నుపవన
మందునఁ గ్రుమ్మరుచుందుము
(రత్నాకరసుబంధులు నిష్క్రమింతురు)
ఆఱవదృశ్యము
( మోహినీపద్మినీమందాకినులు, సామంతుఁడు)
సామంతుఁడు:
నా అందాల వధూరత్నమా!
మోహిని:
తాఁక దటువంటి భాగ్యంపురేక నన్ను
తాఁకు నారేఖ నా సహోదరినె స్వామి!
సామంతుఁడు:
మోహిని:
(సామంతుఁ డు నిర్విణ్ణుఁడై ఆమెనే యింకను చూచుచుండుటచే ఆమె సైగ చేయుచు నిట్లనును.)
(ఆసైగను తప్పుగా గ్రహించి, అతఁడు మందాకినియే వధువనుకొని ఆమెను చూచుచుండును)
సామంతుఁడు:
(మందాకినితో)
ఎంత పొరపాటు? నీవే నా…
(మందాకినియే వధువనుకొని పలుకబోవును)
మందాకిని:
సామంతుఁడు:
(సందిగ్ధావస్థలో నుండును)
పద్మిని:
ఎంత హాస్యపరులొ ఎఱుఁగరే వధువును?
ఆవధువును నేనె ఆర్య! కనుడు
మీదుకరముఁ బట్టు మేదురాదృష్టంబు
ప్రాప్తమైనయట్టి భాగ్యవతిని!
సామంతుఁడు:
(పైకి వ్యంగ్యంగా) నీవా నావధూమణివి?
పద్మిని:
సామంతుఁడు:
పద్మిని:
మందాకిని:
మోహిని:
నల్గురు పాడే పాట (Quartet)
సామంతుఁడు:
శమితంబగు నీ హిమపాతంబున
ఈ తరుణికిఁ గా దాతరళాక్షికె
స్పందించును నాడెందం బిప్పుడు
పద్మిని:
ఆతని ముఖ మరయంగనె నన్ను
పలువాక్కులు తెల్పఁగఁ జాలని
న్యక్కారమునది వ్యక్తము చేసెను
మోహిని:
నాతని వైఖరి కచ్చెరువొందుచు
ఖర్వము కాఁగా గర్వము కొంతగ
నిర్వేదముతో నీమెయుఁ జూచును
మందాకిని:
వీరల ముఖములు వీక్షింపఁగనే
ఉత్పాతం బెదొ ఉత్పన్నంబగు
సూచన లెన్నియొ తోఁచుచునుండెను
అందఱు:
భూజమువలె నుద్వేజితమగు మది
కలఁగిన ఆమది కానఁగఁజాలదు
రాఁగలదేమియొ కాఁగల దేమియొ
ఏడవదృశ్యము
సుబంధుఁడు:
అనుభవజ్ఞుండు నాకు శ్రేయస్కరుండు
మామకోద్వాహవిషయంబు మామతోడ
నెమ్మదిగఁ దెల్పఁగాఁ జాలు నేస్తకాడు
వచ్చుచున్నాఁడు సామంతవర్యుఁడదిగొ
(సామంతుఁ డుద్వేగముతో ప్రవేశించును)
సామంతుఁడు:
అందిందనకన్నిచోట్ల నరసితి నీకై
అందింపఁగ నొకవిషయం
బందున సాయంబు నాకు నర్హుఁడ వీవే.
సుబంధుఁడు:
సామంతుఁడు:
కాని నావిషయము ముందుగాను దెల్పి
కాంచవలె దానికిం బరిష్కార మిపుడు.
సుబంధుఁడు:
సామంతుఁడు:
వలపొదవ దొకింతయేని పద్మినియందున్
సుబంధుఁడు:
గొలువం దగునే తదీయగుణగణ మార్యా?
సామంతుఁడు:
నా నాతిం బరిణయంబు నాడఁగఁజాలన్
సుబంధుఁడు:
గ్దానము నిటు వమ్ముసేయఁ దగునా మీకున్?
సామంతుఁడు:
దప్పక పెండ్లియాడెదను, ధైర్యముతో నిఁక నామెతండ్రికిం
జెప్పుము నాదు నిర్ణయము, స్నేహివి యౌదువు గాన నాకు నా
యొప్పులకుప్పతండ్రికిని, నొప్పగు నీవె యెఱుంగఁ జెప్పినన్.
సుబంధుఁడు:
( ఇది తనకే ముప్పు దెచ్చుచున్నదను ఆవేదనతో అనును)
సామంతుఁడు:
సుబంధుఁడు:
లేదు, లేదు నా
స్వాంతమునం దెదో తలఁచి వాకొనుచుంటిని; పద్మినీమన
స్సెంతగఁ గుందునో యనుచుఁ జింతిలుచుంటిని;
సామంతుఁడు:
సుంతగ వేచియున్న నొక సుందరుఁ డామె కరంబుఁ బట్టడా?
(పై నాల్గు సంభాషణలు ఈక్రింది ఉత్పలమాలలోని వాక్యములు:
ఎంత విషాదవార్త యిది! ఏమనుచుంటివి? లేదు, లేదు నా
స్వాంతమునం దెదో తలఁచి వాకొనుచుంటిని; పద్మినీ మన
స్సెంతగఁ గుందునో యనుచుఁ జింతిలుచుంటిని; చింత యేటికిన్,
సుంతగ వేచియున్న నొక సుందరుఁ డామె కరంబుఁ బట్టడా?)
పాట
సుబంధుఁడు:
సుదతుల చిత్తము లిది గమనింపుము
యోచింపుము నీ యోచన యేగతి
ఆచెలువకు ప్రాణాంతక మగునో!
సామంతుఁడు:
ఆ చెల్వకు నాయందు సుబంధూ!
నామది మాఱిన నది ప్రాణాంతక
మామెకు నగు ననుమాట యసత్యము
సుబంధుఁడు:
శ్రీమంతుండని చేసితి నీతో
నొప్పందము నిది తప్పినఁ గల్గును
గొప్పవిషాదము, తప్పును మన్నన
సామంతుఁడు:
చనకుండఁగ మన్నన చెడకుండఁగ
చెన్నుగ పద్మిని చెల్లెలినే యిఁక
మన్నన లేగతి మఱుఁగగు మనకు
సుందరులందున సుందరి మోహిని
స్పందించును నా డెందం బామెకె
అభిలషణీయం బామె కరంబే, నా
కభిలషణీయం బామె కరంబే.
సుబంధుఁడు:
ఈతని ధోరణి యింతింతకు నా
చేతము నెరియఁగఁ జేయుచు నున్నది
ఈతని చేతము నిటు మఱలింపఁగఁ
జేతును నేనొక చిన్న ప్రయత్నము
(ప్రకాశముగా నిట్లనును)
చక్కనిరూపం బొక్కటె చాలదు
చక్కనిగుణముల సంపద యుండిన
చక్కని సంతతి, సౌఖ్యము లొదవును
చక్కగ సాగును సంసారంబును
కరుణయు క్షాంతియు గౌరవకాంక్షయు
వరగుణములు గల వధువే పద్మిని
పరిణయమాడిన పురుషుని కాచెలి
సరగునఁ గూర్చును చిరసౌఖ్యంబులు
సామంతుఁడు:
నా హృదయంబున నాట వొకింతయు
మోహినియే పరిపూర్ణంబుగ నా
యూహలలో నెలవూనెను స్థిరముగ
పాఱదు నా మది పద్మినియందున
పాఱిన నీవే పరిణయమాడుము
చేరెడుకన్నుల చెలువను మోహినిఁ
జేరుటకే నాచిత్తము గోరును
సుబంధుఁడు:
ఎంతగ హితమో ఈ యోచనయే
శాంతంబుగ నీ స్వాంతము నడుగుము
ఇంతయె నిన్నర్థింతును నేను.
(నిష్క్రమింతురు)
ఎనిమిదవదృశ్యము
( ముందుగా మోహిని, తర్వాత సామంతుఁడు)
మోహిని:
మంతుని, కాతఁ డా విషయమంతయుఁ జెప్పెనొ నాదుతండ్రికిన్?
శాంతముతోడ దాని విని సమ్మతి జూపెనొ తండ్రి, లేక రో
షాంతురుఁడౌచు నగ్గిమల యట్లుగ రాల్చెనొ నిప్పు లక్షులన్?
ఇదె వచ్చును సామంతుం
డది వివరింపంగనొ యిట, కాప్యాయముగా
నెదురుగఁ జని యాతని నడు
గుదుఁ గలవిషయంబు నెల్లఁ గొంచక యింకన్.
సామంతుఁడు:
ఏకాంతంబున నిచ్చట
నీకాంతను జూచు భాగ్య మిప్పుడు గలిగెన్
లేకింతయు దాపఱికం
బీకాంతకుఁ దెల్పికొందు హృద్గత మెల్లన్
(ప్రకాశముగా)
స్నేహముతో గుప్తంబుగ
మోహిని! మాటాడు సమయ మొదవెను నిపుడే!
మోహిని:
నా హృదయంబును నట్లే
యూహించుచు నుండె నార్య! ఉత్కంఠతతోన్
సామంతుఁడు:
నాతో నుండుటకా? యిది
చేతోమోదావహమగు చిహ్నమె నాకున్!
(ప్రకాశముగా)
ఆయతనేత్రి! ఈతరుణమందె సుబంధుఁడు నీదుతండ్రి నా
ప్యాయన మొప్పఁ జేరి విషయంబును దెల్పుచునుండె, నిట్టి రా
గాయతమైన బంధమును కాదన డాతఁడు గాన వెల్లడిం
జేయఁగ నొప్పు నిప్పుడె విశిష్టతరంబగు నా యుదంతమున్
మోహిని:
సాకల్యంబుగ బయటికి స్పష్టం బైనన్
నాకది మోదావహమగు
ఆకర్ణింపఁగఁ బ్రియమగు నందఱి కదియే
సామంతుఁడు:
(తనలో)
భళిభళి! నా కార్యము నతి
సులభంబుగఁ జేయుచుండె శ్రోత్రంబులకుం
జెలువయి నీచెలి లలితపుఁ
బలుకు లయాచితవరముల పగిదిం బ్రియమై
ఊహింపఁగ నివి నన్నున్
మోహించుచుఁ బల్కు వాక్యములె యని తోఁచున్
(ప్రకాశముగా)
మోహిని! వినుమిది ప్రియముగ
వ్యాహారింతును మదిఁగల భావము నిపుడే
వచ్చితిఁ బద్మినీకరముఁ బట్టుతలంపునఁ గాని యాత్మకున్
నచ్చనిదాని నే విధమున న్వరియింతును?
మోహిని:
సామంతుఁడు:
నచ్చనిదాని నే విధమున న్వరియింతును? నీదు సౌరు కే
నచ్చెరువొంది తత్క్షణమె అర్పణచేసితి నామనంబు, ని
న్నొచ్చెములేని ప్రేమమున నుద్వహమాడఁగనెంతు మోహినీ!
మోహిని:
పాట
పల్లవి:
ఊరక మోహము నూనుచునుంటిరి
చరణం1:
గానని దానికి నేననుచుంటిని
పాలకకులమున ప్రభవం బందను
బాలను నిష్ప్రతిభాన్వితురాలను
చరణం2:
నేత్రములందున నిండినఁ జాలునె?
అందము గల్గని యతిసామాన్యను
జెందుట తగునే శ్రీమంతులకు?
చరణం3:
వేషముచేఁ గనువిందొనరింపను
ఒంటెను బోలుచు కుంటుచు నడతును
ఒంటెను బోలుచు కుంటుచు నడతును
(అట్లు నడచి చూపించును)
చరణం4:
నెన్నడు నెఱుఁగని నన్నుం జేకొని
యరిగెడు మిమ్ముల నన్యాయంబుగ
పరిహసియింతురు బంధువులందఱు
చరణం5:
నాలోఁ గలుగవు లీలగ నైనను
ఛలమున నను మీరలు పెండ్లాడిన
కలుగును మీకే గౌరవలోపము.
(నిష్క్రమింతురు)
తొమ్మిదవ దృశ్యము
(రత్నాకరుఁడు, మందాకిని, పద్మిని)
పద్మిని:
మోటమొ యింకేమిటొ ముదమున ననుఁ గనఁడున్,
చాటఁడు ముఖమున భావము,
చేటునె సూచించు నితని చేష్టలు గనఁగన్
మందాకిని:
కన నెప్పుడు నింతవఱకు కన్యాముఖముం
గని కుతుకంబున వదనం
బున దరహాసం బొకింత పూనని వరునిన్!
రత్నాకరుఁడు:
తీరుగ సామంతులు సుదతిం జూడఁగనే
ధీరతఁ బాసి నగుదురే?
భోరన వదరుదురె త్రాగుబోతులరీతిన్?
సామంతులు గంభీరులు
సామాన్యులకంటె వారి స్పందన వేఱౌ
కామక్రోధములందును
భూమీశులు చూపకుంద్రు ముఖమున వానిన్.
హేమంతాబ్జమునందును
సౌమాసవమున్నయట్లు సామంతునిలో
ప్రేమంబున్నను నాతఁడు
సామాన్యులవలె బయటికి చాటఁడు దానిన్
అందుచే వంత జెందుట యనవసరంబు
అంత సరిగానె సమకూడు నందు నేను.
సుబంధుఁడు:
(ప్రవేశించి, రత్నాకరునితో)
సమకూర్చితి నేనన్నియు
సమధికమైన భవదీయ సన్మాన్యతకున్
సమమగు నట్లుగ, వానిం
గ్రమముగఁ బరికింప మిమ్ముఁ బ్రార్థనసేతున్
అందఱు:
బాగుగ సిద్ధంబయ్యెను సర్వము
మనమవ్వానిని కనఁగం ద్వరగా
చనెదము మదులను సమ్మద మొదవఁగ.
(అందఱు నిష్క్రమింతురు.)
పదియవ దృశ్యము
(మోహినీ సామంతులు, రాత్రిసమయము)
మోహిని:
నొప్పరికించుటయె నన్ను నొప్పుగు నంచున్
సామంతుఁడు:
చెప్పుము నీకన్యుఁ డొకఁడు చెలువుం డున్నన్
మోహిని:
అక్కట! యథార్థము న్వెలికాడలేని
భూరిదుష్కరస్థితిలోనఁ గూరుకొంటి
(ప్రకాశముగా)
ఇంతమాత్రము తెలుపంగ నెంతు నార్య!
అపహరింపఁడు నామనం బన్యుఁడెవఁడు
సామంతుఁడు:
సంశయంబేల చెప్పుమా సారసాక్షి!
మోహిని:
చప్పునను దయతోడ నొప్పికొని దాని
పొండి యిటనుండి మీమొండితనము మాని
పొండి యిటనుండి మీమొండితనము మాని
సామంతుఁడు:
ఇంతవఱ కంకురమువలె నెదను నున్న
ప్రణయలత యిప్డు వృద్ధమై ప్రాకుచుండె
కరుణఁ జూడఁగఁ దగు నన్ను కనకగాత్రి!
(సామంతుఁడు బలవంతముగ నైనను మోహినిని గాఢముగా కౌఁగిలించుకొని క్రిందివిధముగాఁ బల్కుచుండును. ఆ దృశ్యమును చాటునుండి పద్మిని చూచి ఆగ్రహోదగ్రురాలగుచుండును.)
మోహిని:
పద్మినికి ద్రోహ మొనరింప పాడి గాదు
సామంతుఁడు:
నేను గోరుచునుంటి నీపాణి నిపుడు
సురుచిరంబగు నీరూపుఁ జూచినట్టి
క్షణమునుండియు నామానసంబె నీకు
మందిరంబుగఁ జేసి ప్రేమంబుతోడ
అర్చనము సేతు నిన్ను పద్మాయతాక్షి!
పద్మిని:
( ప్రవేశించి)
ఎంత మోసం బెంత ద్రోహము!
ఇంతనీచం బింత హేయం
బైన వర్తనకంటె నున్నదె
అధికదోషం బధికపాపము!
కులటయై నా చెలియ లీతని
గలసి చేసెడు కలుషకార్యము
నింటివారికి నెల్లఁ దెలుపఁగ
నిప్పుడే యెలుఁగెత్తి యఱచెద
సామంతుఁడు:
త్రాసమొందను దానికింతయు
మోహిని:
మాదువర్తనయందు సోదరి!
నాదు పల్కుల నాలకింపుము
క్రోధమొందుచుఁ గుందఁబోకుము.
పద్మిని:
యేమి లేదని వాదు సేతువు;
వానికౌఁగిటిపంజరంబున
పక్షివలె నిన్నిపుడె గంటిని.
సామంతుఁడు:
మోహిని:
మందాకిని:
ఏమిటీ కలవరం బేల యీ కలహంబు?
పీన్గునైనను లేపు పెల్లఱపు లేల?
పద్మిని:
నాముద్దుసోదరిం దాముద్దులం దనిపి
ఆమెనే పెండ్లాడ నాయత్తుఁడై యతఁడు
నామోముఁ గనఁడంట నాపేరు వినఁడంట!
మందాకిని:
గట్టిగా దీనికిం గనవలెం గారణము
మోహిని:
ఆమె శాంతము నూని యాలించినన్నన్ను.
(సామంతునితో)
మాటాడ విదియేమి? మాయత్తకుం జెప్పు
చేటు నే నేమియును జేయలే దామెకని
పద్మిని:
నమ్మునటు మనవారు నమ్మునటు పెఱవారు
గుమ్మమ్ములో నిల్చి గొంతెత్తి యఱచెద.
( అని సావేశముగా ఉచ్చైస్వరముతోఁ బల్కును. ఆకోలాహలమునకు మేల్కొని రత్నాకరుఁడు ప్రవేశించుచుండును)
మందాకిని:
మేలుకొల్పితి రిపుడు మీతండ్రి నకట
చాల కలఁగుచు నతఁడు చనుదెంచు నిటకు
పోలఁగాఁ దగ దిల్లు భోగినీగృహమును
ఆలింపఁ దలఁచుచో నాతనికి విషయంబు
మేలౌను వివరింప మెలమెల్లగాను
రత్నాకరుఁడు:
(ప్రవేశించుచున్న అతనిఁ జూచి అందఱు మౌనముగా నుందురు. ఇంతలో సుబంధుఁడును ప్రవేశించును)
ఏదో కలకల, మేవో యఱపులు,
ఏదో వాదన లిట వినవచ్చెను;
దీనికి హేతువు తెలియఁగఁగోరెద
కానీ యెవరును గళమును విప్పరు
మాటలు మాని మౌనులమాదిరి
నాటకమాడుదు రేటికొ?
సుబం:
అనిలాహతమగు అవనీజమువలె
వణకుచు నున్నది పాపము నాప్రియ
అక్కట నల్గురియందున నామెను
అక్కునఁ జేరిచి ఆశ్వాసించెడు
చక్కని భాగ్యము దక్కని పేదను!
రత్నాకరుఁడు:
(పద్మినిని తట్టుచు పలుకును. ఆమె కోపముతో మోహిని నడుగుమని సైగ చేయును)
అలుకను బూనుచు పలుకవు పద్మిని!
తెలుపుము నీమదిఁ గలఁచెడి దానిని
మోహిని:
కలహించుటచేఁ గలకల మొదవెను
ఈసంరంభముకెల్లను కారకుఁ
డీ సామంతుఁడె యీతని నడుగుఁడు.
(అని సామంతుని జూపును.)
పద్మిని:
సామంతుఁ డొకం డేమొనరించును?
ఆమె స్వార్థమె యంతకు మూలము
నామాటకు మేనత్తయె సాక్ష్యము
మందాకిని:
ఇరువురి మధ్యను నేదో జగడము
జరుగుటమాత్రము నెఱుఁగుదు నేను.
రత్నాకరుఁడు:
ఉడుగుచు నర్థము లూరక మీరలు
నుడివెడు పల్కుల నుండిన మతియును
వడివడిగా లోపంబగుచున్నది.
సామంతుఁడు:
(రత్నాకరుని ప్రక్కకుఁ బిలిచి, ఏకాంతముగా సంభాషించును.)
వచ్చితి నీతొలికూఁతునె
ముచ్చటగాఁ బెండ్లియాడఁ బూనుచుఁ గానీ
నచ్చదు నాకాయమ; మది
మెచ్చుదు నామె చెలియలినె మీననిభాక్షిన్
కారణమిదె శ్వశురోత్తమ!
వారల కలహమునకు, తరువాతను దీనిం
దీరికగాఁ జర్చింతము
వారల శాంతపఱచుట యవశ్యం బిపుడున్.
రత్నాకరుఁడు:
పికపకపకపాపకపికపికపీ
పపపిపిపపపాపపపిపపిపపీ
సమసిమసిమసాసుమసిమసీ
సారవిహీనపు సంభాషణములు
భారములై తల పగులుచునుండెను
(సుబంధుఁడు దప్ప అందఱును నేను జెప్పునది నిజమంటే నేను జెప్పునది నిజమని మఱిమఱి చెప్పుచు దొమ్మిగా రత్నాకరుని చుట్టును మూగుదురు.)
మోహిని:
పద్మిని:
మందాకిని:
సామంతుఁడు:
రత్నాకరుఁడు:
పికపికపకపాపకపికపికపీ
పపపిపపిపపాపపపిపపిపపీ
సమసిమసిమసాసుమసిమసీ
చాలింపుడు నిస్సారోక్తులు
చాలింపుడు నిస్సారోక్తులు
(రత్నాకరుఁడు వారి ధాటిని తట్టుకొనలేక అచ్చటినుండి నిష్క్రమించును. ఇతరులును నిష్క్రమింతురు.)
ప్రథమాంకము సంపూర్ణము
ద్వితీయాంకము- ప్రథమదృశ్యము
రత్నా:
గడబిడ చేసిరి ఘనముగ నర్థము
లుడిగిన మాటలు నుడువుచుఁ గానీ
గడుసరి రత్నాకరుఁడు యథార్థము
కడముట్టంగను గనుగొనఁజాలఁడె?
(ఇంతలో సామంతుఁడు ప్రవేశించును. అతనిని జూచి…)
రమ్ము సామంత! రారమ్ము ప్రియమార!
నెమ్మదిగఁ దెల్పుమా నీమనోభావంబు!
సామంతుఁడు:
సందియము లేకుండ సర్వంబుఁ దెల్పెద
రత్నాకరుఁడు:
సామంతుఁడు:
అందుచే పెండ్లాడనందు నామెను నేను.
రత్నాకరుఁడు:
నీమాటపై నీవె నిల్వంగ లేవ?
సామంతుఁడు:
(పరుషమైన ఈక్రింది రెండు సంభాషణలు ఉత్పలమాలలో సాగును.)
రత్నాకరుఁడు:
వారక పెండ్లియాడవలె;
సామంతుఁడు:
మీరల యాగ్రహోక్తులకు మెత్తబడంగలవాఁడఁగాను; చే
కూరదు సౌఖ్యమిర్వురకుఁ గోరని యుద్వహబంధమందునన్.
మీరల యాగ్రహోక్తులకు మెత్తబడంగలవాఁడఁగాను; చే
కూరదు సౌఖ్యమిర్వురకుఁ గోరని యుద్వహబంధమందునన్.
(అని పునరుద్ఘాటించును)
(ఉత్పలమాల పూర్ణరూపము)
ఈరకమైన నాటకము లేను సహింపను, నీవు పద్మినిన్
వారక పెండ్లియాడవలె; బాలుఁడఁ గాను, వివేకహీనతన్
మీరల యాగ్రహోక్తులకు మెత్తబడంగలవాఁడఁగాను; చే
కూరదు సౌఖ్యమిర్వురకుఁ గోరని యుద్వహబంధమందునన్
(క్రిందివిధముగా పరస్పర మెదురుకొనుచు ఆగ్రహపూరితులై వాదింతురు.)
రత్నాకరుఁడు:
మార్చఁబోవు మాట మార్చఁబోవు
పెండ్లియాడు దీవు పెండ్లాడుదువు నీవు
మార్చఁబోవు మాట మార్చఁబోవు
సామంతుఁడు:
మనసులేనియట్టి మగువ నెపుడు
పెండ్లియాడ నేను పెండ్లియాడను నేను
మనసులేనియట్టి మగువ నెపుడు
(కొంచెము శాంతించి పల్కును.)
ఐన విన్నవింతు నన్యవిధంబొండు
చింతసేయుఁడిదియె శాంతముగను
రత్నాకరుఁడు:
(బింకముతో ననును.)
రత్నమట్లు దృఢుఁడు రత్నాకరుండన్న
ఆడి తప్పువాఁడు గాఁడతండు
ఆడి తప్పువారి అన్యవిధంబులు
ఆలకింపఁజాలఁ డాతఁ డెపుడు
సామంతుఁడు:
(బింకముతో బదులు చెప్పును.)
మీరలట్టులైన మీకంటె కఠినుండ
వజ్రభేదియైన వజ్రసముఁడ
బింక ముడిగి మీరు విన్నచో నామాట
కలుగు మేలు మీకు; కలుగు నాకు.
రత్నాకరుఁడు:
(క్షణమాత్ర మాలోచించి…)
కలదందు వేదియో ఘనవిధానంబు
పలుకుమింకను దాని స్పష్టంబుగాను.
సామంతుఁడు:
డ్లాడెద మీకనిష్ఠతనయన్ ద్విగుణంబుగ శుల్క మిచ్చి, మా
ఱాడక మీరు దీనికి సమాశ్రుతిఁ జూపినఁ జాలు, తోరమై
కూడఁగ రాజవైభవము కూడెద నామెను నుద్వహంబునన్.
రత్నాకరుఁడు:
రెండింతలొసంగి నాదు రెండవకూఁతున్?
సామంతుఁడు:
రెండింతలొసంగి తమరిరెండవకూఁతున్.
రత్నాకరుఁడు:
(తనలో)
ఇదియుఁ దోఁచును యోచింప హితముగానె
కలుగు బాంధవ్య మున్నతగణముతోడ
రొక్కమున నిండుచక్కగా బొక్కసంబు
ఐన బేరమాడుదునిట్టు లతనితోడ.
(ప్రకాశముగా)
సమ్మతి జూపిన పద్మిని,
ఇమ్ముగ శుల్కమ్ము నాలుగింతలకున్ లో
పమ్మొదవక యిచ్చినచో,
సమ్మతమగు నాకునట్టి సంబంధంబే.
సామంతుఁడు:
పాడు కృపణత్వమింతయు వీడఁడితఁడు
అందుకొనఁజూచు శుల్కంబు నవధి లేక
ఐన మోహిని కర్పితంబైన మనము
తుష్టినందంగ నాకిది యిష్టమందు.
(ప్రకాశముగా)
ఏక్షణమున మోహినినిన్
వీక్షణపర్వముగ నేను వీక్షించితినో
ఆక్షణముననుండియె నా
కక్షయమగు వలపు గలిగె నాయమ పైనన్.
కావున కోరిన శుల్కము
నావధువునకై యొసఁగెద నానందముగన్,
నావర్తనఁ గని పద్మిని
యేవరియింపనియటు నటియించెద నింకన్.
ఇర్వురు:
(ఈక్రింది పద్యమును పాడుచు ఆప్యాయముగా ఆలింగనము చేసికొందురు)
ఇట్టు లుభయతారకమౌచు గట్టిపడిన
పరమబాంధవ్యసరణిచే మఱల మనము
గాఢసౌహృదసరసిలో గాహమొందు
పరమమిత్రులమైతి మవశ్యముగను.
(రత్నాకరుఁడు నిష్క్రమించును)
రెండవ దృశ్యము
సామంతుఁడు:
నిరసించెడునటు నన్నున్
పరిపరివిధములఁ బలుకుచు పద్మినిమనమున్
మరలించుట నాకుం జే
కురు సులువుగనే యని యనుకొందును నేనున్.
(ఇంతలో సుబంధుఁడు ప్రవేశించును. అతనితో నిట్లనును.)
సమయమునకె వచ్చితివి సుబంధు నీవు!
సుబంధుఁడు:
అంపునో నన్నెదో వార్త నందఁజేయ!
సామంతుఁడు:
సరసంబుగఁ బల్కి యామె జనకునితోడన్
మురిపంబున మోహినినే
పరిణయమాడఁగ ననుజ్ఞఁ బడసితి నిపుడే
సుబంధుఁడు:
హతవిధి! వినుచుంటిని యెది,
(ప్రకాశముగా)
అతఁడగ్రజకుం బదులుగ నవరజ నీయం
బ్రతిన యొనర్చెన నీకున్?
సామంతుఁడు:
ఆమెకు త్వరగాఁ దెల్పఁగ
నీ మధురంబైన వార్త యిపుడే చనుమా!
ఏమగునో యను సంశయ
మామెను పీడించుచుండు నది తొలగింపన్.
(నిష్క్రమించును.)
మూఁడవ దృశ్యము
సుబంధుఁడు:
కుంపటిని వీడి కొల్మిలోఁ గూలినట్లు
కష్టతరమయ్యె నాస్థితి క్రమముగాను
ఎట్టులీవార్త మోహిని కెఱుకపఱతు?
కొట్టుకొందును కూర్చున్న కొమ్మ నేను?
ఎవరి సాయము నర్థింతు నిపుడు నేను?
ఎవ్వరున్నారు సాయమందించువారు?
(కొంత వితర్కించి)
ఆహ! మఱచితి నన్ను స్నేహానఁ గనెడు
దాని మందాకిని న్మతి దప్పి నేను,
విన్నవించి నాస్థితినెల్ల నున్నయట్లు
ఆమె సాయంబుతో శోక మపనయింతు.
మందాకిని:
(ప్రవేశించి తనలో నిట్లు యోచించుచుండును)
ఉన్నాఁడితఁ డొంటరిగా
కన్నార్చుచు, నూర్చుచు నెదొ గాఢంబుగ లో
నెన్నుచు, నిదె సమయము లో
నిన్నాళ్ళును దాఁచికొంటి నెది యది తెలుపన్.
సుబంధుఁడు:
(ఆమెను చూచి క్రిందివిధముగాఁ దనలో ననుకొనుచు ఆమెతోమాటాడుటకు సంకోచించుచుండును.)
ఈమందాకిని యిపు డే
మేమో యోచించుచుండె, నేనును నిపుడే
యామెకు నాస్థితిఁ జెప్పుట
క్షేమంబుగఁ దోఁచకుండె చిత్తమునందున్.
మందాకిని:
ఎంత సిగ్గరియో సంశయించుచుండె,
ఎదను దాఁగిన వలపును నితఁడు దెలుప!
సుబంధుఁడు:
ఎటులొ తెగియించి నాస్థితి నీమె కిపుడె
తెలుపకున్న నింకను ముప్పు గలుగు నాకు
(ప్రకాశముగా)
మెలమెల్లఁగ మందాకిని!
తెలుపఁదలఁతు నీకు నామదింగలదానిన్
మందాకిని:
పలుకవు నీవింతయు నను ప్రక్కనఁ గనియున్!
సుబంధుఁడు:
అదనో కాదో పలుకఁగ నని యటులుంటిన్
మందాకిని:
నొదిగిన భావంబుల బయలొనరింపంగన్
ఏదో ప్రణయవిచారము
నీదు మనోరంగము యవనిక చందము నా
చ్ఛాదించుచు నుండెననుచు
నీదుముఖంబును గనఁగనె నేఁగనుగొంటిన్
సుబంధుఁడు:
అద్దమునె పట్టితివి మదీయాత్మకీవు
మందాకిని:
విదితంబు సేయుమిఁక వివరంబుగాను
పదిలంబుగా నింతవఱకును నీదు
మదిలోన దాఁగిన మధురభావంబు
సుబంధుఁడు:
కంతయు వివరించియున్న నంతయు సంతో
షాంతంబయ్యెడి దెప్పుడొ…
మందాకిని:
సుబంధుఁడు:
నందకరంబైనఁ గాని నచ్చున యీ సం
బంధము మీయన్నకు నని
ముందుగ నాతని నడుగుట ముఖ్యము గాదా?
మందాకిని:
నాతలపై బెట్టు మైన నాతఁడు నిన్నుం
జేతంబున శ్లాఘించును
ఏతంటయుఁ బెట్టఁడాతఁ డీవిషయమునన్.
సుబంధుఁడు:
వేవేగ నతనికిఁ దెల్ప విషయం బెల్లన్
మందాకిని:
నీదు ప్రతిపాదనంబును మోద మెసఁగ
సమ్మతించితి నేనంచు స్పష్టముగను
సుబంధుఁడు:
మందాకిని:
నేనంగీకరించితిని. నేను నీదాని నైతిని.
సందేహమేల సుందర!
అందింపుము నీయధరము; అతిశయమగు నా
నందంబున చుంబించుచు
పొందెద నతులంబగు సుఖముం గౌఁగిటిలోన్.
(అనుచు ఆతని కౌఁగిలించుచుండును. ఈసన్నివేశమును దూరమునుండి మోహిని చూచుచుండును.)
సుబంధుఁడు:
రామచంద్రా! నామాట లెట్లు
ఈమె కన్వయ మయ్యె నిట్లు?
పాట
గిరగిర రాట్నము తెఱఁగున నాతల
తిరుగుచునున్నది తిరుగుచు నున్నది
అడుగులు నిలువక తడబడుచున్నవి
తడబడుచున్నవి తడబడుచున్నవి
మందాకిని:
(అనునయించుచు పాడును)
అటులే యుండును అనురాగంబున
తటుకునఁ గల్గెడు తనువివశత్వము
సరియగు త్రుటిలో సర్వము ప్రియతమ
వెఱవకు చెంతనె ప్రియసతి యుండెను
సుబంధుఁడు:
తనుపటిమంబును దప్పుచునున్నది
భరమగుచున్నది శ్వాసానిలమును
శిరమును దిమ్మున దిరుగుచు నున్నది
మందాకిని:
దనువులు మనములు మునిగిన యప్పుడు
అగపడు నీవిధమగు చిహ్నంబులు
వగవగఁ దగదవి యగపడినంతట
సుబంధుఁడు:
నేలకుఁ గూలెడు తాళముఁ బోలుచు
కూలుచునున్నది నేలకు గాత్రము
కూలుచునున్నది నేలకు గాత్రము
( మూర్ఛితునివలె పూర్తిగా నేలపై పడిపోవును)
మందాకిని:
చయ్యనఁ బాయుచు చైతన్యంబును
గుప్పున నీతఁడు గూలెను నేలకు
గొప్పప్రమాదమె యిప్పుడు గూడెను
( అనుచతనిని తాఁకి పరామర్శించి, అతనిలో చైతన్యము గలిగించు విఫలయత్నము చేసి, అన్యసహాయము నర్థించును)
ఉన్నారా ఇట నున్నారా ఎవరైనా
నన్నిట నాదుకొనంగల వారున్నారా?
(ఆత్రతతో మోహిని ప్రవేశించును. మందాకిని అతనిని జూపుచు ఆమెతో నిట్లనును)
ఈతరుణాననె నాతోఁ బండెను
ఈతని ప్రణయం బిమ్ముగఁ గానీ
అది దుస్సహమై అయ్యో యీతఁడు
కదలక మెదలక కట్టెవలెంబడె
మోహిని:
( ఉద్వేగముతో నతనిని దట్టి పరిచర్య చేయుచు పల్కును. అతఁడామె చర్యలకు స్పందింపకుండును)
ఇదియేమి కర్మంబు, ఇంతైన కదలవు
ఎది హేతువో దీని కింతైన పలుకవు
మృదువైన నాపలుకు మృదువైన నాస్పర్శ
ఒదవింపదేమి నీమదియందు స్పందనము?
మందాకిని:
ఘనమతిభ్రమణంబు గావించె నిట్లతని
క్షణములో నీస్రుక్కు శమియించు విరుఁగుడుం
గొనివత్తు నీతనిం గనుచుండు మోహినీ!
(నిష్క్రమించును.)
మోహిని:
ఇది కనంగనె యెద సమస్తము
ఫట్టుమంచును బగులకుండఁగ
నెట్టులుంటినొ యెఱుఁగనేరను
ఏది కల్లయొ ఏది నిజమో
ఏర్పరుపలే నింతయైనను
వీడి మత్తును ప్రియసఖా!
ఉన్నవిషయము విన్నవింపుము
సుబంధుఁడు:
అయ్యో మోహిని! ఇటనుండకు, ఇట నుండకు, పొమ్మిటనుండి.
మోహిని:
తఱుముచుంటివి నన్నుఁ ద్వరగఁ బొమ్మంచు
సుబంధుఁడు:
అదనెఱిగి తరువాత సావకాశముగను
అంతయును సరియౌ ననంతరము మనకు
ఇంతకును మించి నేనిపుడేమి యనఁజాల
మోహిని:
వలపన్న నేదియో భ్రమ యన్న నేదియో
తెలియకుండఁగ నాదు తల పగులుచుండె.
మందాకిని:
(చేతిలో నొకసీసాలో నేదో ద్రావకమును తీసికొనుచు తిరిగి వచ్చి, సుబంధుని ఉద్దేశించి పల్కును)
తిరిగివచ్చితి నేను త్వరగానె కాని,
చరియింతు వీలోన స్వాస్థ్యంబు నంది
ఆనందముగ నింక నాశ్లేష మొనరించి
ఆనంగనిమ్ము నీ యధరంపుమధువు.
సుబంధుఁడు, మోహిని:
తగదిట్టి సాహసము తరుణీసమక్షమున
మందాకిని:
మవ్వముగఁ గాఁబోవు మగనినే కాద!
నేను చుంబింతును, నేఁ గౌఁగిలింతు
దీనికిం భయమొందఁగా నేల నాకు?
(బలవంతముగా సుబంధుని కౌఁగిలించి చుంబించి నిష్క్రమించును)
నాల్గవ దృశ్యము
పాట
మోహిని:
ఈమోహినిం గూడి ఇటనుంటివేల?
నామానధనమిట్లు నష్టమై పోవంగ
వ్యామోహమున నీదు వలలోనఁ జిక్కితిని
ఎందఱికి తనువిచ్చి నందింపఁ జేసితివొ?
ఎందఱింగూడి కుసుమేషు నర్చించితివొ?
ఇందుకే కాఁబోలు నింతగోప్యంబుగా
ఇందనుక మనపెండ్లి బంధమ్ము నుంచితివి
సుబంధుఁడు:
ఆలింపుమొకయింత అసలైన విషయంబు
మోహిని:
అసలైన విషయంబు నరయనే యరసితి
విసమైన సేవించి వీడెదను నాతనువు
ఖుసిమీర నామెనే కూడి యుందువుగాని
సుబంధుఁడు:
(ఆమె ననునయించుచు నిట్లనును)
బాసను జేయుచుంటి ప్రియభామిని, ఆమెను నెప్పుడేని నే
నాసపడంగలేదు; నను నారసినంతనె యామె నేఁడు తీ
వ్రాసమబాణవిద్ధహృదయప్రవిచోదితయై పయింబడం
ద్రాసముతోడ మూర్ఛితుని నల్వున ధాత్రికి వ్రాలి నక్కితిన్.
అరసితివిగద! ఆస్థితియందె నన్ను
మున్నుగా నీవు నన్నిటఁ గన్న యపుడు
వీడుమింక నిర్వేదంబు విద్రుమోష్ఠి!
నీవె నాప్రాణధనమింక నెవరు లేరు.
నీవే సతి! సుఖదాత్రివి,
నీవలపులపంజరమున నీడోద్భవమై
ఆవాసించును నామతి;
కావున శంకను త్యజించి కనుమిఁక నన్నున్
ఇచ్చట నింకను నుండిన
హెచ్చగుచుండు నిటువంటి యిడుములె మనకున్
ఇచ్చోటుఁ దొరఁగి పోదము
ముచ్చటగా మఱొకచోట ముదమున నుండన్
సుబంధుఁడు:
తోఁటకుఁ జేరువ నుండెడి ద్రుమముల నీడన
చకచక పరుగిడు జవనాశ్వంబులు పూన్చిన
శకటం బొక్కటి యుండును సన్నద్ధంబయి
ఎల్లరు నిద్రావశులై యింటను నుండఁగ
అల్లన మనమా శకటము నధిరోహింతుము
అనిలజవంబునఁ బర్వుచునశ్వములంతటఁ
మనలను జేర్చును మధురాపురమునకు
అచ్చట నాకుం బ్రియమగు నత్త వసించును
ముచ్చటదీరఁగఁ గొన్నాళ్ళచ్చట నుందుము
ఆవిధి నిల్కడ గందుము జీవితమందున
ఆవెన్కను భవితవ్యము నాలోచింతుము
(నిష్క్రమింతురు)
ఐదవ దృశ్యము
(సామంతుఁడు తనకుగుణంబు లన్నియు ప్రస్తావించి, పద్మినిని తనయందు విరక్తురాలిగాఁ జేయుటకు యత్నించును)
సామంతుఁడు:
లెన్నో యున్నవి; యవెల్ల నిపుడే నీకున్
విన్నపము సేతు; పెండ్లికి
మున్నే సర్వము దెలియుట ముఖ్యము గానన్
పద్మిని:
వేచియుంటినార్య! వినఁగ నేను
సామంతుఁడు:
వీని విన్న నీకు విద్రుమోష్ఠి!
పాట
పల్లవి:
నాకున్నవి యవి కోకొల్లలుగా
సరసపు భాషణ సల్పఁగ నేరను
వెఱపును గొల్పెడు విరసోక్తులనే
పలుకుటయందున పాండిత్యంబును
గలిగినవాఁడను, కఠినాత్ముండను ॥నీకుం దెలియవు॥
పద్మిని:
మధురంబుగనే మాటాడితివి
ఇపుడును నీస్వన మెంతయొ మధురము
కపటులె యందరు కఠినంబది యని
సామంతుఁడు:
ఘనపాషాణంబును దలపించును
గరువముచే కనుగానని నాస్థితి
గురుపోతులనే గుర్తుకుఁ దెచ్చును ॥నీకుం దెలియవు॥
పద్మిని:
ఆయవి దలఁచుచు వ్యాకులమొందను
పరిపూర్ణంబగు ప్రణయమునందవి
పరివర్జితమయి బంధము దృఢమగు
సామంతుఁడు:
గుఱకలు వెట్టెద కోల్పులి విధమున
నాతో తల్పమునందునఁ బండుట
నీతరమా? యిది నీవు దలంపుము ॥నీకుం దెలియవు॥
పద్మిని:
ఆవిధమగు నభ్యాసము లబ్బెను
జాయను గూడుచు శయనించినచో
ఆయలవాటులు మాయంబగులే
సామంతుఁడు:
అలసుఁడ మత్తుఁడ నతికుత్సితుఁడను
జారుఁడ భీరుఁడ నారీలోలుఁడ
కోరవు నీవీ కూళను భర్తగ ॥నీకుం దెలియవు॥
పద్మిని:
ఇది నిజమని నే నింతయు నమ్మను
ఇది పరిహాసం బివి హాస్యోక్తులు
దోసంబులఁ గాదీ సరసోక్తులు
నీసరసత్వమునే సూచించును
సామంతుఁడు:
మాటలగారడిమాటున దాఁచఁగ
నది పరిహాసాస్పదముగఁ దోఁచెను
ఇదె వినుమిఁక వచియింతు యథార్థము
అందంబగు నీ యాస్యముఁ జూడఁగ
స్పందింపదు నా డెందం బింతయు
ఇదియే సత్యం బిది హేతువుగాఁ
నొదవదు పరిణయయోగము మనకు
(సామంతుఁడు నిష్క్రమించును. పద్మిని విషణ్ణురాలై నేలకొరిగి విలపించుచుండును. ఇంతలో మందాకిని ప్రవేశించును.)
ఆఱవదృశ్యము
మందాకిని:
ఈక్షోభంబున కెది హేతువు?
పద్మిని:
సాక్షాత్తుగ నా సహజాతయె
ఆమాయావియె, ఆకులటయె
సామంతునినే స్వాధీనునిగాఁ
గావించుకొనంగా నాతండును
నావంకైనను నవలోకింపఁడు.
ఈ వ్యవహారం బింకను ముదురకముందే
అన్యస్థలమున కామెను బంపుట శ్రేయము
మందాకిని:
కనుగొంటి సుబంధునిపై సైతము
కనువేసిన దాకాంతామణి యని
పద్మిని:
మందాకిని:
చల్లనిరాయని ద్యుతిలో
వెల్లడియగు రాత్రింబలె
వెల్లడి యగుచుండెను నా
యుల్లములోని రహస్యము
పద్మిని:
ఒకఁడు కాదిర్వురకు వలలు వేసి వశము జేసికొనఁగఁ జూచు.
మందాకిని:
అన్యస్థలమున కామెను బంపుట మేలగు
పద్మిని:
రత్నా:
విరమింపఁగ జేసెనె పద్మిని!
పరిణయయత్నము సామంతుఁడు నీచేన్?
పద్మిని:
ఈమాదిరి నడుగుచుంటి రేటికి నన్నున్?
సామంతునితోఁ బెండ్లియె
నామది కింపైనది, యదె నా యభిమతమౌ!
నాకు దక్కకుండ నాతనిం దనవైపు
ద్రిప్పికొనఁగ చెల్లె తివురుచుండె
కాని యామె యాట కడముట్టనీయను
కాచికొందు విభునిఁ గనకమట్లు
మందాకిని:
ఆచరించుచుండెను నిశ్చయంబుగాను
హద్దుమీరుచు మోహిని గద్దవోలె
తన్నుకొని పోవుచుండెను తనకు నాప్తు
లైనవారల ప్రియులనె, యామె నింకఁ
బంపఁదగును యోగాశ్రమావాసమునకు
మోహాతిరేకమున నిటు
లాహా! వర్తిల్లు నామె కా యాశ్రమ మా
మోహంబు శమించుట కగు
దోహద, మటఁ గొన్నినాళ్ళు దొరఁకొని యున్నన్.
రత్నాకరుఁడు:
చేసెను దోసమేదొ యని చిన్నరి మోహినిఁ బంపివేయఁగాఁ
జేసిరి వీరు నిర్ణయము; చెప్పరు,చూపరు సాక్ష్యమొండు వి
శ్వాసము గూర్పఁగాఁ దమదు వాదుకు, నెట్లుబహిష్కరింతు న
య్యో సదనంబునుండి కృపయుం బ్రియమున్విడనాడి మోహినిన్?
(ప్రకాశముగా)
చక్కగ యోచింపక నే
నిక్కట్టులఁ బెట్టఁజాల నిందుముఖి న్నా
మక్కువ కూఁతును మోహిని
నొక్కింతగ సమయమిండు యోచన సేయన్
మందాకిని:
నిప్పుడె పంపఁగవలె నట కిది గాకున్నం
దప్పుకొనియెదను నేనే
చప్పున నిలునుండి నాదు సర్వస్వముతోన్.
ఇది యేదో వదరుట యని
యెదలోఁ దలపంగఁబోకు మేగఁగ నెంతున్
పదిలముగా నిట దాఁచిన
మదశేషధనంబుతోడ మద్గృహమునకున్
రత్నా:
ఎటుల చిన్నారి మోహిని నింటినుండి
ఆశ్రమంబున నుండంగ నంపువాఁడ?
అలరులంబలె మృదువైన యామె తనువు
కర్కశాశ్రమక్లేశమేకరణి నోర్చు?
ఐన నాచెల్లె లటు చేయుమనుచునుండె
దానిఁ గాదన్నఁ దన మూలధనమునెల్ల
నామె యుపసంహరించుకొనంగ నుండెఁ
గాన వేఱొకమార్గంబు కాన రాదు.
(ప్రకాశముగా)
వింటిని సావధానముగ విస్మయమొందుచు మీదుమాటలన్
కంటిని మీదు భావములఁ గాని వచింపక యామెతోడ నే
నొంటిగ నిర్ణయింపఁదగ, దున్నవిధంబును నేఁడు దెల్పి, ఱే
పింటిని వీడనాడి వసియింపఁగఁ బొమ్మను దాశ్రమంబునన్
(నిష్క్రమింతురు)
ఏడవ దృశ్యము
(మోహినీ సుబంధులు, తర్వాత ఇతరులు)
మోహిని:
(చింతాక్రాంతయై అనును)
ఏరీతిగ నగునో మన
కీరాతిరి ననెడు శంక యెదలో నిండెన్
చేరఁగఁ గలమో లేదో
ఈరాతిరిలోన నన్యు లెఱుఁగక యుండన్?
సుబంధుఁడు:
(ఆమెను కౌఁగిటఁ జేర్చుచు పలుకును.)
చింతింపవలదు నీవింతగాఁ జెలియ!
అంతయుం జరుగు నే నన్నటులు రేయి
మనప్రేమయే యౌను మనకెపుడు రక్ష
మనసిజుని కృపచేత మనకంత గుదురు
సన్నద్ధమొనరింతు సర్వ మిపుడేగి
నిన్ను రాతిరిలోన తిన్నగా వచ్చి
కలసికొందును నేను కలత విడనాడి
మెలఁగుచుండుము ధృతి మీరఁగా నీవు
(చివరి నాల్గు వాక్యములు పల్కుచుండఁగా పద్మినీమందాకినులు వారిని చాటునుండి చూతురు. ఈవాక్యములు పలికి, మోహినిని వీడ్కొలిపి అతఁడు నిష్క్రమించును. అతఁడు నిష్క్రమించుచుండఁగా వచ్చి చూడుమని మందాకినీపద్మినులు రత్నాకరునికి సైగఁ జేతురు. అప్పుడతఁడు గూడ అచ్చటికి వచ్చి చాటునుండి వారిని చూచును.)
మోహిని:
మతినిండ శంకలే వెత నించుచుండె
ఎపుడు రాతిరి వచ్చు, నెపు డతఁడు వచ్చు
ఎపుడేమగునొ యంచు నింక మది కలఁగు
(ఇట్లు పలికి ఇంకను చింతాక్రాంతగనే ఉండి మోహిని కుర్చీలో వ్రాలును. ఇంతలో సామంతుఁడు ప్రవేశించును.)
సామంతుఁడు:
వ్రాలియుంటి విచట వన్నె దఱిగి
సలుపఁదలఁతు నీకు వలనైన సాయంబు
పలుకు మింక నీవు భయము లేక
(అనుచాప్యాయముగా నామెను లేపి వదులుగా కౌఁగిలించుకొనును.)
మోహిని:
పలుక, జాలి చూపువారు లేరు
(అని కౌఁగిటిలోనే యుండి పల్కును.)
సామంతుఁడు:
నీదు మనసు దెలుపు నిక్కువముగ
మోహిని:
ప్రతిన చేయఁగలవ ప్రభువరేణ్య?
సామంతుఁడు:
చేతు ప్రతిన నందుచేత నేను
పొనర నీదుకరము ముద్దాడి శపథంబుఁ
జేయుచుంటి నింకఁ జెప్పు మమ్మ
(అని మోహిని చేతిని ముద్దాడుచుండును. అప్పుడు చాటునుండి చూచుచున్న మువ్వురు పరాక్రమించి వారికడకు వత్తురు)
పద్మిని:
మందాకిని:
పద్మిని:
నీతి రీతి లేక యెట్టి వాని కైన
వలను బన్ని వాని ముద్దువెట్టుచుండు
రత్నాకరుఁడు:
అంపవలయు నీమె నాశ్రమమునకు
సామంతుఁడు:
రత్నాకరుఁడు:
(నిరసించుచు పల్కును)
మందాకిని:
పద్మిని:
మోహిని:
నాకే మతి తప్పెనొ, లేకిది ఘోరస్వప్నమొ
పాట
మోహిని:
పల్లవి:
ఆలింపుఁడు నా యాలాపములు
చరణం1:
ఆపుడు మీనిందారోపణలు
ఊపిరి పీల్చుట కొసగుఁడు క్షణము
ఊపిరి పీల్చుట కొసగుఁడు క్షణము ॥చాలింపుఁడు॥
చరణం2:
ఆసింతున నే నామె పదంబును?
మల్లెలవలె నా మది నిర్మలము
చెల్లదు నన్నిటు చెడిపెగ నెంచుట ॥చాలింపుఁడు॥
చరణం3:
(సామంతునితో ననును)
నాపై నిందారోపణ చేయుట
పాపపు కార్యంబని వివరింపుము
నను వీరెల్లరు నమ్మక యున్నను
నిను నమ్ముదురని నా నమ్మకము ॥చాలింపుఁడు॥
సామంతుఁడు:
పద్మినీ మందాకినులు:
(క్రోధధిక్కారములతో నందురు.)
స్త్వైరిణి జారిణి స్వార్థస్వరూపిణి
రాగాంధీకృత భోగపరాయణి
బాగగు నీమెకు యోగాశ్రమమే
ఏగఁగవలె రేపే యట కీమె
రత్నాకరుఁడు:
ఏగఁగవలె రేపే యట కీమె
మోహిని:
ఐనను పోవుట కాశ్రమవాటికి
కొంచెము వ్యవధిని కోరుచునుంటిని
పద్మినీ మందాకినులు:
రత్నాకరుఁడు:
త్వరపడుమిఁక, వరువాతనె యానము
సామంతుఁడు:
అల్పపుగోరిక, యది కాదందురు
మోహిని:
(అభ్యర్థించుచు దీనముగాఁ బల్కును.)
రెండుదినంబులె యిండని వేడెద
కొండలు కోటలు గోరను నేను
రెండుదినంబులె యిండని వేడెద
కొండలు కోటలు గోరను నేను
పద్మినీ మందాకినులు:
(ధిక్కరింతురు.)
రత్నాకరుఁడు:
సామంతుఁడు:
పాట
మోహిని:
(శోకించుచుఁ బాడును)
కరుణ యొకింతయుఁ గానక నాపైఁ
ద్వరపడి చేయని తప్పును మోపిరి
హరిణముఁ దఱిమెడు వ్యాఘ్రంబులవలెఁ
దఱుముచునుండిరి యిరవుననుండియె
యోగాశ్రమమున నున్మాదపు
యోగంబే నాకొనఁగూడును
ఇటనున్నను నీకఠినాత్ములు
అటులే మతిఁ బాయంజేతురు
నావారలె నన్ననుమానించిన
నావారలె నన్నవమానించిన
భారంబగు నాబ్రతుకున నేగతి
సారంబగు సుఖశాంతులు గందును?
( పద్మిని దప్ప ఇతరులు నిష్క్రమింతురు.)
పద్మిని:
మోసంబునఁ దన దాసునిఁ జేసిన
ఆవగలాడికి నాశ్రమవాసమె
కావలసిన శిక్షారూపము
సామంతుని ననఁజాలం బేమియు
ఆమాయావిని ఆకామాతుర
తన కుటిలపువర్తనచే నాతని
ఘనమోహాంధుని గావించెను
తెగు నీ హేయపుఁదగులము ఱేపే
తగ నాయం దాతని డెందంబును
త్రిప్పఁగ నాతనిఁ దప్పక పెండ్లికి
నొప్పింపఁగ వీలొనరును ఱేపే
(నిష్క్రమించును.)
ఎనిమిదవ దృశ్యము
(రాత్రిసమయమును సంకేతించుచు సేవికలు దీపములను వెలిగింతురు. రత్నాకరుఁడు ప్రవేశించును)
రత్నాకరుఁడు:
కటువుగా సాగె దినమెల్ల, క్రమ్ముచుండె
నాదుగాత్రము నెల్ల సాంద్రమగు నిద్ర
ఇంతరాత్రి యయ్యె, సుబంధుఁడేల రాడు!
సుబం:
ఆర్యునకు స్వస్తి యౌను గాక!
రత్నా:
వేగ రమ్మన జుణిగితి వింతసేపు
ఆన విననట్టి ఖలుఁడ వజ్ఞానివీవు!
సుబం:
మీదు గుఱ్ఱాలకుం దగు మేత గొనుచు
వచ్చుటకు నింత తడవయ్యె స్వామి నాకు
కినుక మాని చెప్పుడిఁక మీపనుపు నాకు.
రత్నాకరుఁడు:
స్నేహమునఁ బ్రొద్దు పూచెడిలోగ రేపు
జవనాశ్వములు లాగు శకటంబులోన
అవనీంద్రనగరయోగాశ్రమంబునకుఁ
గొనిపోవలెను గానఁ జని యిప్పుడీవు
ఒనగూర్చికొని యన్ని చనుదెమ్ము మఱల.
సుబం:
(విస్మయవిచారములతో గొణగికొనును)
యోగాశ్రమంబేమి? నాపత్నికీవియోగ మేమి?
రత్నాకరుఁడు:
సుబం:
ఏమియు లేదు. అట్లే యనుచుంటిని.
రత్నా:
అలసినాను. నిద్రాదేవి నన్నావరించినది.
చెప్పినవెల్లయుఁ జేయుము,
చప్పునఁ బోవఁగ సిద్ధము గమ్ము.
(నిష్క్రమించును)
సుబంధుఁడు:
అంతయును నాదుమేలుకే యగుచునుండె
పోవు గుఱ్ఱము లవనీంద్రపురము వైపు
పోవు నవి ఱేపు మాయత్తపురము వైపు
తెలుపుదును మోహిని కిపుడె దీని నేను
(నిష్క్రమించును)
తొమ్మిదవ దృశ్యము
సామంతుఁడు:
(తనలో)
మోహినివశమైపోయెను నామది
ఆహిమకరముఖి ఆనందార్థము
త్యాగం బెంతటిదైనను జేసెద
ఆగుణశాలిని ఆంతర్యంబును
నేఁ గనఁ గోరెద, నేఁ గనఁ గోరెద
పాములఁ బోలుచు పగలం బూనుచు
నీమెను బందుగులే బాధింతురు
ఈపె విషాదము నేవిధినైనను
బాపఁగఁజాలినఁ బాపుదుఁ దప్పక
(అనుచు పచార్లు చేయుచుండును)
పద్మిని:
(ప్రవేశించుచు, తనలో)
ఈతఁడు నిద్రాన్వీతుఁడు గాకీ
రాతిరియం దీరీతిగఁ దిరుగును
ఈతీరును గన నేదో శంకయు
నాతురపాటును నన్నుం గలఁచును
(ప్రకాశముగా)
శాంతంబుగ సుఖశయ్యను నుండక
ఇంతటిరాతిరి నిచ్చట నార్యా!
ఏకాకిగఁ జరియించుచు నుంటిరి
నాకుం దెలుపుడు మీకెదియైనను
చేయం గలిగినఁ జేతు నవశ్యము
సామంతుఁడు:
వృథగానే చరియింతును నేనిట
పద్మిని:
నాకుచితంబుగ నుండదొ యేమో!
సామంతుఁడు:
నమ్ముము నాకది నచ్చెను మెండుగ
ప్రొద్దయిపోయెను పోదును గూటికి
తద్దయు నిద్రం దనువును ముంతును
పద్మిని:
శయనించుటకై చనుదును నేనును
సామంతుఁడు:
(తనలో)
వైగుణ్యంబును వైయాత్యంబును
బాగుగఁ గలవీ ప్రమదకుఁ గావున
ఈయమ చర్యల నీనిసిఁ గనుగొనఁ
జేయుదు శయనించినయటు నటనము
(నిష్క్రమించును)
పద్మిని:
ఈనిసి నంతయు నీతని చర్యలఁ
గానఁగ లేచియె నేనుండెదను
(నిష్క్రమించును)
పదియవ దృశ్యము
(మోహినీసుబంధులు చీకటిలో దొంగతనంగా ఇంటిలోనుండి పాఱిపోవ నారంభింతురు.)
సుబంధుఁడు:
పదపద ముందుకు ప్రాణసఖీ!
ఇదె సమయంబీయింటిని వీడుచు
బెదరక స్వేచ్ఛం బ్రదుకం జనుటకు
మోహిని:
ధీరత కొఱవడుఁ జేరఁగ దానిని
వడఁకుచునున్నవి పదములు కరములు
నడపింపుము నను తడబడకుండఁగ
ఇర్వురు:
మెఱయుచు వెలియగు తరుణము వచ్చెను
ఇది మనమదిలోఁ గుదురుగ నిల్పినఁ
గుదురును ధైర్యం బెదురగు గమ్యము
మనసిజకృపయును, మనధైర్యంబును
మనప్రణయంబున ఘనవిశ్వాసము
మనకుం దోడయి మనయానంబును
అనపాయంబుగ నొనరించునులే
అనపాయంబుగ నొనరించునులే
సుబంధుఁడు:
హుష్! నిశ్శబ్దము! ఏదో అలజడి! ఏదో శబ్దము!
ఇర్వురు:
ఇచ్చట నుండిన నెదురగు మోసము
చెచ్చెర గదికిం జేరుట శ్రేయము
చెచ్చెర గదికిం జేరుట శ్రేయము
(అనుచు మెల్లగా తలుపు దెఱచి తమ గదిలో దూరుదురు)
పద్మిని:
వింటిని యిట నెటువంటిదొ శబ్దము
కంటికి నెవరిం గానను గానీ
యేవో గుసగుస లేవో పదరుతు
లేవో తల్పులు దీసిన రవములు
ఏమగుచుండెనొ ఏదియొ హేతువు
ఈమర్మము నే నిపుడే విప్పెద
ఈమర్మము నే నిప్పుడె విప్పెద
(పద్మిని వారి తల్పు దగ్గర చెవి యొగ్గి విని)
విసవిసనగవులు ప్రియముగ సాగెడు
గుసగుసలాటలు గురువగు శ్వాసలు…
ఇవియెల్ల నిరూపించును లోపల
నెవియొ యకృత్యము లొదవెడి వైనము
ఆసామంతుఁడు, ఆదుర్జాతుఁడు
నా సోదరి యందాసక్తుండై
నసగూటితనంబున నామెను
రసికుండై యీరాత్రిని గూడెను
పద్మిని నా పేరైనం
బయలగు నీగుట్టిపుడే
బయలగు నీగుట్టిపుడే
(మందాకిని తల్పును దట్టుచు)
లెమ్మా అత్తమ్మా! లెమ్మా అత్తమ్మా!
మందాకిని:
పద్మిని:
(రత్నాకరుని తల్పును దట్టుచు)
నాన్నా! నాన్నా!
(మందాకినీ రత్నాకరులు వారి శయనగృహములనుండి సంరంభముగా బయటికి వత్తురు)
రత్నాకరుఁడు:
క్షేమముగ నిదురింప కీయపరరాత్రి?
త్రాసంబొ మోసంబొ తస్కరభయంబొ
ఏసేగి కారణం బీగోల కిపుడు?
పద్మిని:
నమ్మకద్రోహము జరిగెను, అవమా
నమ్మున క్రుంగెడు కార్యము జరిగెను
అయ్యో! అయ్యో। ఏమందును
శయ్యాలయమున సామంతుఁడు
సయ్యాటలఁ గూడుచుండె నా
తొయ్యలి మోహినితో నిప్పుడు
నాకై వచ్చిన సామంతుని అ
స్తోకంబగు మోహభరంబున
లేకింతయుఁ ద్రప నాచెలియలె
చీకటిలోఁ గవయుచు నుండెను
చీకటిలోఁ గవయుచు నుండెను
మువ్వురు:
( మోహిని శయనగృహము ముందు నిల్చి పల్కుదురు)
సామంతుఁడ సామంతుఁడ దు
ర్ధీమంతుఁడ దుర్జాతుఁడ దుష్టుఁడ
నయదూరుఁడ, నీవిందుంటివి
బయటికి రమ్మిఁక బయటికి రమ్మిఁక
నీవేషము వైదొలఁగెను
నీవంచన బయలయ్యెను
నీవైభవమడుగంటెను
రమ్మిఁకబయటికి, రమ్మిఁక బయటికి
సామంతుఁడు:
(తన శయనగృహమునుండి వెలువడి పల్కును)
ఏమీ దుర్భాషలు, దూఱులు
ఏమీ యఱపులు, అపనిందలు
ఏమీ యున్మాదపుచేష్టలు
మీమతి చలియించుచు నుండెన?
మీమతి చలియించుచు నుండెన?
మువ్వురు:
మేము వివేచింపక త్వరపడి
నీమాన్యతనే శంకించితిమి
మామాన్యతనే కోల్పడితిమి
క్షమియింపుము సామంతుఁడ! క్షమియింపుము మమ్ముల!
సామంతుఁడు:
వదరుచునుంటిరి పరుషపుదూఱులు!
రత్నాకరుఁడు:
(పద్మినిని జూపుచు పల్కును)
ఇదియంతయు పద్మిని కృత్యమె
ఇదియంతయు పద్మిని కృత్యమె
పద్మిని:
ఆమోహిని యొక్కనితో
శయ్యామందిరమందున
సయ్యాటలలో నున్నది
మందా,రత్నా:
ఈయభియోగంబునకును
ఈయమ సిగ్గునఁ గ్రుంగుగ
నీయెడ నిర్ధారింతుము
మువ్వురు:
(శయ్యాగృహము తల్పును దట్టుచు పల్కుదురు)
తలుపు దీయుము మోహినీ!
తలుపు దీయుము తత్క్షణంబె
నలుగురెదుట వచ్చి నిలువు
కల నిజంబును గాంచ నిమ్ము!
(అందరి కాశ్చర్యమును గొల్పుచు శయ్యాగృహమునుండి మోహినీసుబంధులు వెల్వడుదురు)
మువ్వురు:
ఎంత మానహీన, యెంత కులట యీమె!
ఎంతధైర్య మెంత దురితవర్తనంబు!
ఎంత ఘోర మెంత దారుణంబు!
మోహినీ సుబంధులు:
(రత్నాకరుని కాళ్ళపైఁబడి ప్రార్థింతురు)
అనుకంపను గనుడని యీ దీనుల
వినయంబున మిము వేఁడెద మార్యా!
రత్నాకరుఁడు:
మందాకిని:
మోహినీ సుబంధులు:
తోరపుఁ బ్రేమయె చేసెను
మాదు వివాహము రెండగు
మాసంబులకుం బూర్వమె
మందా, రత్నా:
మోహినీ, సుబంధులు:
రత్నాకరుఁడు:
ఇంత చేసి ఇంట నుంటిరేమి?
పొండుపొండు మీర లీక్షణంబె
పొండు పొండు ఇంట నుండవలదు
పొండు పొండు పొండు పొండు
పోయి బిచ్చ మెత్తుకొండు
నేను తండ్రి నింకఁ గాను మీకు
నేను శాత్రవుండ, బద్ధ శాత్రవుండ
మీదు మోము లింకఁ గనఁగ లేను
మీదు వేడుకోలు వినఁగ లేను
పొండు పొండు పొండు పొండు
పోయి బిచ్చ మెత్తుకొండు
మోహినీ సుబంధులు:
గూఢవివాహపు హేతువు
మోసము చేయ మెవారికి
మోదంబున మము దీవింపుము
మందాకిని:
మోసంబే కలదంతయు
నీయనుమతిలేకుండనె
ఈయుద్వాహంబాడిరి
ఇరవున నుండఁగనీయక
తఱుమఁగవలసినదే యీ
దురితాత్ముల నిర్దయతో
దురితాత్ముల నిర్దయతో
రత్నాకరుఁడు:
నేరమేమి లేని వారి తీరు నున్న
మిమ్ము నమ్మలేను, మిమ్ము నమ్మలేను
మిమ్ముఁజూడ లేను, మిమ్ముఁ జూడలేను
పొండుపొండు మీర లీక్షణంబె
పొండు పొండు ఇంట నుండవలదు
పొండు పొండు పొండు పొండు
పోయి బిచ్చ మెత్తుకొండు
మోహినీ, సుబంధులు:
దానిన్మఱలుప జాలము
కావున కరుణను తండ్రీ!
దీవింపుము మమ్మింకను
సామంతుఁడు:
శాంతించినచో సర్వము సాధ్యము
దీనిని విప్పఁగ నేను వచించెద
మానితమగు నొక మార్గంబును
అల మోహినిపై గల ప్రియమున
సలిపెద నేనొక శపథము రూఢిగ
మీరాచెలిని క్షమించిన నేనును
పేరిమిఁ బద్మినిఁ బెండిలియాడెద
పద్మిని:
మతికింపగు సామంతుని మాటలు
అతిభవ్యంబగు నాతని ప్రతినయు
కరుణింపుము సోదరి నిఁక తండ్రీ!
సరి యని యామెను సంభావింపుము
మోహినీ సుబంధులు:
మాదోసంబును మన్నింపుఁడు
రత్నా:
నీవేమందువు?
మందాకిని:
సరి యని యొప్పుటె సరసపుమార్గము
అందఱు:
రత్నాకరుఁడు:
తులువలు తుంటరు లలసులు వెకలులు
మీరైనను …..మీ నేరము నెంచక
గారాముగ మిము కౌఁగిటఁ జేర్తును
(అని సాదరముగ మోహినీసుబంధులను కౌఁగిలించుకొనును)
(పాత్రధారులందఱును గలిసి పాడుదురు)
పల్లవి:
సుతలిర్వురికిని శుభకల్యాణము
అనుపల్లవి:
పువువలె విరిసెను నవమోదము
చరణం1:
వరమణిఖచితస్వర్ణాసనముల
మించులవలె భాసించెడు దివ్వెల
నంచితమగు వివహాంగణమందున ॥అతులిత॥
చరణం2:
మంగళహారతు లంగన లీయఁగ
బంగరుసొమ్ములు పట్టువస్త్రములు
రంగుగఁ దాలిచి రాగ దంపతులు ॥అతులిత॥
చరణం3:
అంబరములు నుపహారంబుగఁ గొని
బందులు మిత్రులు పరిణయముం గన
సందడి చేయుచు సరసనఁ జేరఁగ ॥అతులిత॥
చరణం4:
తోరపుఁ గాన్కలతో ప్రముదితులై
ఆదట నాగతు లాశీస్సులతో
హ్లాదము గూర్పఁగ నాలుమగలకు ॥అతులిత॥
ప్రచ్ఛన్నపరిణయము సమాప్తము