మాధవీమధుసేనము

(ఇది కల్పితగాథ. ఇందలి పాత్రలు, సన్నివేశము లన్నియు కల్పితములే.)

అది యొక దుర్గమాటవి; తదంతరమందున ముక్తివల్లభా
భిధుడగు మౌనిమౌళికి నివేశనమై యొక వైణవోటజం
బొదవును; తన్ని వేశనముఖోర్వితలంబున నొప్పు నింగుదీ
ఖదిరలతావృతం[1] బయిన గ్రావవితర్దిక విశ్రమార్థమై.

ఉదయముదొట్టి మౌనివరుఁ డుగ్రతపఃపరినిష్ఠితాత్ముఁడై
మదిని మహేశ్వరార్చనసమాధిసమంకితముం బొనర్చి, యం
బుదపథపశ్చిమాంతమును పుష్కరమిత్రుఁడలంకరించు నా
యదనునఁ దద్వితర్దిపయి హాయిగ నించుక విశ్రమించెడున్.

అనుదినమును దా నర్మిలి
గొనివచ్చిన నూత్నమృదులకుశవితరణచేఁ
దనపెంపుడు హరిణంబులఁ
దనుపుచు నుండును మునిమణి తత్కాలమునన్.

అటు లతఁడుండ నొక్కదినమందున నెక్కడనుండి వచ్చెనో
చిటులగ దిక్కు లార్చుచును, చెంగున దూఁకుచు, వెల్కి దట్టుచుం
బటుతరదాత్రమిత్ర మగు పాణిరుహంబుల, నొక్క వ్యాఘ్ర మా
జటిలునిపైని వ్రాలి తరసంబునఁ జంపఁగ నుద్యమించినన్.

అరయఁగఁ జాల మాతరుణమందు మహేశదయావిశేషమో
మఱియొక కారణంబొ, ఘనమార్గణకౌశల మేర్పడంగ నో
తరుణుఁ డదాటుగా నచటఁ దారసమై వెసఁ గూలనేసె భీ
కరగతి మౌనిపై దుముకఁగాఁ దమకించెడు వ్యాఘ్రరాజమున్.

ఈవిధి నద్భుతముగఁ బ్రా
ణావన మొనరించిన యువకాగ్రణి వాత్స
ల్యావిష్టాంతరుఁడై కని
యా వాచంయమియును ననె నాతని కిటులన్.

‘ఓరి కుమార! నీదుకథ నూహయొనర్చితి యోగదృష్టిచే
నారసి, శత్రురాజవశమైన పురంబుననుండి యెట్టులో
పాఱుచు నీమహాటవినిఁ బ్రాణము నిల్పికొనంగఁ జొచ్చి వి
స్ఫారితశౌర్యదీప్తిఁ బులిఁ జంపితి, నిల్పితి నాదుప్రాణముల్.

అట్టు లత్యంతహితుఁడవై యలరినట్టి
నీకుఁ బ్రత్యుపకారంబు నేను జేతు;
నీవు వాసిన నగరాధినృపతిపదవి
నీకుఁ జేకూరు దీనిచే నిశ్చయముగ.

ఆలమునందు నీదుపుర మాక్రమణం బొనరించినట్టి భూ
పాలుఁడు మందపాలునకు పంకజబాణసతీస్వరూపయౌ
బాలిక, పూర్ణయౌవనవిభాసిత యున్నది; నీవు తద్వధూ
కేళివనంబులోన నొకకీరమువై చరియింపఁగావలెన్.

అట్లు చరియించు నీకుఁ గల్యాణ మగును;
సద్వధూప్రాప్తియును మహీశత్వపదవి
సకలసంపద లతులయశస్సముదయ
మబ్బు నీ కది యెట్లు సాధ్యమగు ననిన.

కొను మిదె మంత్రశక్తిగుణగుంభితమైన మనోజ్ఞదర్భపుం
గణముల నిర్మితంబయిన కంకణరాజము; దీనిఁ దాల్ప నీ
కొనరును సుందరంబగు శుకోత్తమరూపము, తత్పరంబునన్
జనితములౌ ప్రభావములు సర్వము నీ కనుకూలమై చనున్.’

అని మునిసత్తముం డొసఁగినట్టి కుశాంచితకంకణంబునుం
దనకరమందుఁ దాల్చిన క్షణంబుననే మధుసేనుఁడన్ సమా
ఖ్యను దగు తన్మనోజ్ఞయువకాగ్రణి మంజులకీరరూపముం
గనియెను; మంత్రశక్తి కిలఁ గానిది యున్నదె సిద్ధు లెంచఁగన్.

అక్కజంబుగ మును వానిహస్తమందు
అంచితంబైన కంకణ మతఁడు చిలుక
రూపు గొనినంతనే మారి రుక్మమణిమ
యోర్మికగ శుకపాదమం దొదిగియుండె.

సరసత సర్వలోకజనసంతతిజిహ్వలకెల్ల శబ్దవా
గ్గరిమను గూర్చి , జ్ఞానయుతకల్పనశక్తి ఘటించి బుద్ధికిన్,
నిరతసుసేవ్యయై వఱలు నీరజసూతివధూటిపాణికిన్
సురుచిరభూషణంబయిన సుందరకీరపుఁ గూర్మిబంధువై .

ఆశుకరాజము వెస నా
కాశంబున కెగిరెను నిజకష్టౌఘము ని
ష్కాసిత మొనరింపం గల
యాసుందరవనమును గను నాశ న్మదిలోన్.

పెద్దవై తనరెడు వివిధహర్మ్యంబులు
       బొమ్మరిండ్లం బోలి ముద్దు గొలుప,
అత్యున్నతములైన ఆలయశిఖరముల్
       దేవతామూర్తులతీరు సూప,
నిడుదలై పాఱెడు వడిగల నిమ్నగల్
       తారహారంబులదారిఁ దనర,
పచ్చదనంబుతో హెచ్చెడు నడవులు
       పచ్చలపతకాల భంగిఁ దోఁప,

ప్రకృతి యనియెడు చిన్నారిపడుచు కూర్మి
నాడుకొనఁ గట్టుకొన్నట్టి వీడువోలె
నెగురుచోఁ గననయ్యెను దిగువభూమి
రమ్యతరముగఁ దత్కీరరాజమునకు.

అటు సని కాంచెఁ గీరము సమంచిత వప్ర వృత ప్రసీమమున్,
స్ఫటికమణీ వినిర్మిత విశాల గృహాంగణ శిల్పధామమున్,
ఘటిత సువర్ణకుంభయుత కాంచనసౌధ గణాభిరామమున్,
స్ఫుటిత సుమాభిశోభి వనభూమము, నొక్క పురీలలామమున్.

సాలంకృతసుందరివలెఁ
గ్రాలెడు నప్పురియె స్వీయరాజ్యంబునకున్
మేలగు ప్రధానపురి గా
నేలును ధర మందపాలనృపచంద్రుండున్.

చంద్రపురి యన సౌభాగ్యసాంద్ర మగుచు,
చంద్రమండలపరిచుంబిసౌధరామ
ణీయతకు కేంద్ర మగుచును, నిఖిలకళల
నిలయ మగుచును, దత్పురి నెగడుచుండు.

కల దొక యద్వితీయమగు కాంచనసౌధము; దానిచెంగటం
గల దొక కేళికావనము; కాంతతదీయవనాంతరంబునం
గల దొక యామ్రపాదపము; కమ్రతరంబగు దానిచెంతనే
కలదొక పద్మషండము; సుఖాస్పదమై తగు తత్పురంబునన్.

అమ్మహాసౌధమందున నలరుచుండు
తత్పురీనేత కేకైకతనయ యైన
మాధవీలత సౌందర్యసౌధ మనఁగ
పూర్ణతారుణ్యవతి యనఁ బొలుపుమీరి.

ఆనాఁడు నిజారామము
లోన న్విహరించు కోర్కె లోలో నలరన్
ఆనారీమణి చనియెను
ఆ నళినవనంబు చెంత కటనార్థంబై.

అట్లు వెలువడి యాయింతి యవ్వనాన
విరిసియున్నట్టి పలురంగువిరులఁ గనుచు,
మూర్కొనుచు వాని గంధంబు ముదము మీర,
ఎట్టకేలకు తమ్మిపూపట్టు చేరి.

‘బమ్మ యొనర్చినట్టి పలుభంగుల సృష్టికి శేఖరంబ వై,
సొమ్ములకొమ్మకున్ మహిత సుందరమందిర మై, అనంతర
త్నమ్మునకున్ హస త్ప్రియద దారముఖం బయి, తేఁటికిన్ మరం
దమ్ములు చిందు మాత వయి, ధన్యత నందితి వీవు పద్మమా!

అమరధునిలోన జలకంబు లాడునట్టి
అచ్చరలు కామరూపంబు లవధరించి
దిగిరొ నీరాడ నీవారిఁ దృప్తిదీర
వారె మీరౌదురో పద్మవల్లులార!

కన్నులు మూసి యోగపథగాములు నై తనువుల్ కృశింపఁగా
నెన్నియొ పాటులం బడుదు రీశ్వరునిం గన మౌను లట్టి యా
పన్నత లేల ? మీదుచెలువంబును విస్ఫుటనేత్రులౌచుఁ గ
న్గొన్నను జాలదే? యటులు గూరదె వారికి బ్రహ్మసంగమే?’

అనుచు నయ్యింతి తమ్ముల యందమునకు
బరవశించుచు నవ్వానిఁ బ్రస్తుతించు
చుండఁగా వచ్చి వ్రాలెను శుక మొకండు
చెలువు ఱెక్కలూనుచుఁ జెంతఁ జేరినట్లు.

హరితవర్ణంపుఱెక్కల హరువుతోడ
మనసునందలి రాగ మాననమునందు
ప్రోగు గట్టెనొ యన రాగపూర్ణమైన
ఘోణతోడ నయ్యది దృశ్యమాన మయ్యె.

ఆశుకపాదమందున మహస్సముదంచితమై వెలుంగు నా
నాశుభరత్నసంస్థగితనవ్యసువర్ణవరాంగుళీయకం
బాశను రేప డెందమున నాఖగరాజముఁ బట్టఁగా నవా
వేశముతోడ నా వనిత వెంటను బోయెను నక్కినక్కుచున్.

అది పొడగాంచి తత్తరుణి యత్నము నించుక వమ్ముసేసి స
మ్మదమున నాటవేడ్కల సమాయితముం బొనరింపఁ గాల మా
మదశుకరాజ మట్టిటుల మంటికి మింటికి మధ్య పారుచుం
దుదకుఁ దదంగనామృదులదోఃస్థలి వ్రాలెను వచ్చి తానుగన్ .

అట్లు వ్రాలిన చిలుక నత్యా దరమున
చేత గ్రహియించి, యాయింతి చేరవచ్చి
కాంతతరమైన స్వీయశుద్ధాంతమునకు
నల్లనల దాని నిజతల్పమందు నుంచి.

నెనరున దాని దువ్వుచును, నిస్తులతన్మధురోక్తిసంతతి
న్వినుచును, ‘పల్కుతొయ్యలియె నేర్పెనొ నీకిటువంటి చక్కనౌ
భణితము’ లంచు మెచ్చుచును, పాదమునం గనువిందుసేయు త
న్మణిఖచితాంగుళీయకము మవ్వముగాఁ దొలగించె, నంతటన్.

పరమాద్భుతముగఁ గీరము
పరిణామము జెందె నొక్క వరరూపునిగన్
దరుణత్వము పురివిప్పిన
తరుణీజనహృత్సరోజతరుణార్కునిగన్.

కమ్మనికుందనంపుజిగి గల్గిన గాత్రము, నిండుచందురుం
గిమ్మననీని యాననము, కేసరిమధ్యము, కోటతల్పులం
బొమ్మను పేరురమ్ము, మధువుం బరిహాసము సేయు హాస, మొ
చ్చెమ్మొకయింతలేని మది చేకుర నాతఁడు వొల్చె పూర్ణుఁడై.

ఔను! తత్కీరమే మధుసేనుఁ డయ్యె;
పారికాంక్షి యొసఁగిన దర్భవలయంబె
స్వర్ణకటకమయ్యెను శుకపాదమునకు,
దాని నులుచఁ గీరమె మధుసేనుఁడయ్యె.

అరయుచుఁ దత్పరిణామము
తరుణీమణి కొంతవట్టు స్తబ్ధాంతరయై
తరువాతం దేఱుకొనుచు
స్మరియించెను మున్ను గన్న స్వప్నమునిటులన్.

నాల్గునెలల క్రిందట మహర్నవమి రాత్రి
భారతీదేవి నర్చించి భక్తితోడ
నిదురజెందిన తనకు వాణిదయచేత
నద్భుతంబగు నొకస్వప్న మావహిల్లె.

ఒనరిన యట్టి స్వప్నమున నొక్కని చక్కనివానిఁ జూపి తా
ననియెను వాణి,‘యో వనిత! అర్హుఁడు నీకితఁ డన్నిభంగులన్,
ప్రణయముమీర నీతని వివాహమునం గ్రహియించి ధన్యవై
మనియెద వీవు సత్వరమె, మద్వచనం బిల రిత్తవోవునే?’

ఆవాణీదర్శితమౌ
భావుకమూర్తియె యిపు డట ప్రత్యక్షము గాన్
ఆవనితయు లజ్జాయుత
భావజభావాంకుర యయి భాసిలి యంతన్.

పూవునఁ బుట్టు తావివలెఁ బొంపిరివోయెడు రాగదీప్తితో
నా విధుసుందరాంగుని రయంబునఁ గౌఁగిటఁగ్రుచ్చి, తేనెకుం
దావలమైన స్వీయరదనచ్ఛద మాతనిపాలు సేసి, సౌ
ఖ్యావహసంగమంబునఁ దదైక్యము నొందెను, పొంద నాతఁడున్.

భారతీదేవి యెంచిన వరుఁడ నేను,
ముక్తివల్లభుఁ డెంచిన ముదిత వీవు,
జ్ఞానముక్తుల యనుబంధసరణి మనదు
బంధ మమలంబు, శాశ్వతం బగును గాక!

అని మును శుకపాదంబున
నొనరిన యుంగరము దొడిగి యుద్వాహం బ
య్యెను గాంధర్వవిధిం ద
త్కనకలతాంగిని నతండు ఘనమోదమునన్.

ముక్తివల్లభముని మంత్రశక్తి యెంత
గాఢమైనదొ కాని, శుకాంఘ్రియందు
నమరినట్టి యుంగరమె యిప్డా లతాంగి
యంగుళికిఁ దగినట్లు పెంపంది యుండె.

అంతఃపురభోగంబుల,
నంతం బెఱుగని ప్రణయవిహారంబుల, న
శ్రాంతము వారలు గడపఁగ
నంతం బయ్యెను క్షణములయటు దివసంబుల్.

భారతియె కుదిరించె బాంధవ్యమంట,
మారసన్నిభుఁడంట, మహనీయుడంట,
కోరఁదగువాఁడంట, వీరవరుఁడంట,
చేరి మాధవి వానిఁ జేపట్టెనంట,
అనుచుఁ గ్రమముగఁ బ్రజల కాశ్రుతం బయ్యె,
మనఁగ వారట్లు ప్రియమారఁ గవగూడి.*

కాని మందపాలనృపుని కర్ణములను
బడకయుండెను పుత్రికోద్వాహవార్త,
మాసముల క్రిందఁ బరరాజమండలమున
దండయాత్రకై యతఁడేఁగియుండు కతన.

అంతట నొక్కనాఁడు భయదాహవమందున మందపాలభూ
కాంతుఁ డమేయవిక్రమవికాసితుఁ డయ్యుఁ గృపాణవిద్ధుఁడై
యంతము నొందె నన్న కఠినాశనిసన్నిభమైన వార్త త
త్ప్రాంతము నంతయుం గలఁచివైచెను పెల్లగు నుప్పెనంబలెన్.

ఆరాజున కంతిమసం
స్కారము ముగిసిన తదుపరి సచివాగ్రణులున్
వారసు లింకెవ్వరు లే
రారాజతనూజ దక్క యను పూనికతోన్.

ఆయమ కామెభర్తకు శుభాహమునందున రాజ్య పట్టమున్
న్యాయము గట్టుటంచును, దదర్థము లగ్నము నిర్ణయింపఁగా
నాయది న్యాయదూర మని యడ్డము వెట్టెను సైన్యనేత భూ
ర్యాయుధశక్తిగర్వమున నందఱినిన్ వెఱపించు చెంతయున్.

‘ఎవఁడీ మధుసేనుం డే
మి వివాహంబిది, యెవరును మెత్తురె గాంధ
ర్వవివాహం బుత్తమశా
స్త్రవిహిత మగునని, వెడలఁగఁ దఱుముడు వీనిన్.

ఊరెదొ పేరెదో తెలియకుండఁగ నొక్కని జాతిహీనునిన్
భూరిపరాక్రముం డనుచు, పూతచరిత్రుఁ డటంచు గద్దెపై
మీరలు నిల్పఁజూతురె? యమేధ్యపుఁగుక్కకు జాతి యబ్బునే
కోరి సువర్ణపీఠమునఁ గూర్చొనఁబెట్టినఁ , బేరు మార్చినన్.

వెడల న్నడువుడు వీనిన్
కడిమి నజేయుఁడను, రాచకన్నెకు నత్య
ర్హుఁడ నగు వరుఁడను, తగుదును
పడతినిఁ జేకొనఁగ, రాజ్యపాలన సేయన్.’

అనుచు దురంతమోహమున నారుచిరాంగిని మాధవీలతన్,
ఘనమగు రాజ్యసంపద నెకాయెకి మ్రుచ్చిలఁ జూచు సైన్యనా
థుని నొకకొంత సాంత్వనమృదూక్తుల శాంతునిఁ జేసి మంత్రి యి
ట్లనియెను ప్రత్యయావహములై న మహాదరపూర్ణవాక్కులన్.

‘ఎందుకు నీకు నిట్టి శ్రమ? ఇంచుక నాపలు కాలకించు, తా
నిందునివంశజుండ నని, ఏలికనై మునుపుంటి వాసితో
సిందుకమందు[2] నంచు మధుసేనుఁడు వల్కు ప్రగల్భముల్ సదా,
ఇందు వితథ్యమున్నదని యెర్గుదు నేనొక కారణంబునన్.

వాసిగ మందపాలనృపవర్యుని కీవు బలాధినాథుఁడై
భాసిలునాటికంటె మును భండనమందున నోడి బంధనా
వాసమునందు సిందుకనృపాలుఁడు సిందుకమందె బందియై
వాసము సేయుచుండెఁ గద! వాఁడెటు రాఁగలఁ డీ పురానికిన్.

ఇది తెలియక మధుసేనుఁడు
వదరును సిందుకపతి నని, వరవిధుకులమం
దుదయించితి నని, మృషయగు
నిది సర్వము, లేదొకింత మృషయును నిందున్.

అది యిటులుండఁగ మాధవి
చదువులతల్లియె యతనిని సరియగు పతిగా
నొదవించె ననుచు వానిన్
వదలక యున్నది యదెంత బాలిశురాలో!

కాన నాతని కథ నసత్యముగా నిరూపణ చేసినం
బూన నక్కఱ కలుగదింతయుఁ బోరుసల్పఁగ నియ్యెడన్,
వాని సిందుకపురమునుండి రవాణ సేతము చయ్యనన్
మానితంబుగ ముడినిఁ దీతము; మాను మింక బిభీషికల్’**

అని యొకనాఁడు మంత్రి విబుధాగ్రణులున్, మధుసేనమాధవుల్,
ప్రణిధులు, సైన్యనాథుఁడును పల్వురు గల్గు సభాంతరంబునం
బనుపడి సిందుకస్థుఁడగు బంధితుని న్మధుసేనుఁ డీతఁడౌ
నని ప్రకటించి ముం దునుప నందఱు నక్కజ మొందు చెంతయున్.

మాసినకోకలున్, వలిపమబ్బుపిఱుందను దోఁచు జాబిలిం
ధ్యాసకుఁ దెచ్చు[3] వక్త్రమును, అంటలుగట్టిన కేశముల్ వినా
ఆసభ నిల్చినట్టి యతఁ డన్నివిధంబుల మాధవీసహా
ధ్యాసితుఁ డైన యట్టి యువకాకృతి నుండఁగఁ జూచి వారలున్.

ఏమీ యీచిత్ర, మెవం
డో మాధవి నీవిధమున నుపధాశీలుం
డై మోసగించెనా యని
యేమేమొ తలంచి సంశయించుచు నుండన్.

ఆతఁడు రాట్కుమారిపతియౌ మధుసేనునిఁ జేరఁ బోయి య
త్యాతురుఁ డౌచు బాష్పతతు లక్షుల ధారలు గట్టఁ బల్కె, ‘స్వా
మీ! తరియించితిన్ మఱల మీముఖముం గను భాగ్య మబ్బె, నెం
తోతఱి మీకు మాఱుగఁ బ్రతోదితు నైతిని కారయందునన్.’

అనుచుం బూర్వపు మధుసే
నుని యంఘ్రుల కతఁడు భక్త్యనూనతఁ బలుమా
ర్లు నతుఁడయి మ్రొక్కి యటుపై
ఘనవినయముతోడ ననియె గద్గదగళుఁడై.

‘ఉంటిని చెఱలో, నిడుములు
గంటిని; నేనే తమరను గాటపుభావం
బంటు నటుల వర్తించితి ;
పంటింపక సుంత మీకు బంటయి యుంటిన్.

ఈరజకుని కింతటి సే
వారాజ్యం బొసఁగిన జనవల్లభ! ధన్యం
బై రాజిల్లెను మద్భవ
మేరీ నాకంటె ధన్యు లీధరలోనన్.’

అని వాఁడు విధేయతఁ జూ
పిన నద్దానికి నపారవిస్మయవశులై
కొని క్షణములు కొయ్యలతెఱఁ
గున చేష్టలుడిగి నిలిచిరి కొలువున వారల్.

వారలు తెప్పరిల్లగను వాకొనియె న్మధుసేనుఁ డంతటన్
‘భూరిబలప్రభావమునఁ బూర్వము సిందుకరాజధానినిన్
వీరుఁడు మందపాలపృథివీపతి తాఁకగ నిల్వలేక నా
కూరిమి భృత్యుఁడైన రజకోత్తముని న్ననుఁబోలువానినిన్.

నాకుఁ బ్రతీకగా పురమునందున నిల్పి పురంబు వీడితిన్
వీఁకమెయి న్వినూత్నముగ వీరశతంబులు గల్గు సైన్యమున్
జేకొని మందపాలు డనిఁ జేకొనినట్టి మదీయరాజ్యముం
జేకొన యుక్తమౌ మఱలఁ జివ్వను నంచుఁ దలంచి యాత్మలోన్.

కంటిరి గద! రజకుం డెటు
వంటి విధేయుఁడొ, నయస్వభావుఁడొ, మేలౌ
బంటో, యిటువంటి నరుం
డుంట యసామాన్య మెల్లయుర్వరయందున్.

మందపాలుం డటుల గెల్చి సిందుకమును
వీని నేనంచుఁ జెఱసాలలోన నుంచె,
నాదురాజ్య మెల్లను విలీనంబు సేసి
తనదురాజ్యంబుఁ జేసె విస్తారముగను.

ఏనటు వీడి సిందుకము నెన్నియొ భూములయందు నవ్యమౌ
సేనను ప్రోవుసేయఁగ విశేషముగా శ్రమియించి తిర్గుచుం
గానను నొక్కతాపసినిఁ గాంచి తదీయకృపైకలబ్ధిచే
నీనృపపుత్త్రిఁ గంటిఁ, దదభీష్టయుతంబుగఁ బెండ్లియాడితిన్.

అతులితరూపరేఖలను, నంచితసద్గుణసంపదాఢ్యతన్,
శతధృతివల్లభా చరణసారససంతతభక్తిశీలతన్,
చతురవచఃప్రవీణతను, జ్ఞానసమగ్రత నద్వితీయ యౌ
సతి నిటువంటిదాని సహచారిణిగాఁ గొను టెంతభాగ్యమో!

అలభువిఁ బుట్టుప్రాణుల శుభాశుభకర్మఫలంబు సర్వముం
బలకలఁబోలుఫాలముల వ్రాయు విరించి చతుర్ముఖంబులన్
మెలఁగెడు వాణి యీమగువమేలునకై సమకూర్చినట్టి మా
కలయిక, పాణిబంధ మనఘంబు, పవిత్రము నై పొసంగదే?’

అని మధుసేనుఁ డా సభకు నాత్మకథాక్రమమెల్లఁ దెల్పినం
గని, నృపపుత్త్రి కీతనికిఁ గల్గిన బంధము శాస్త్రసమ్మతం
బును, నకలంకముం, బలుకుపొల్తుక గూర్చినదంచు నందఱుం
జనితముదంతరంగులయి సంస్తుతి చేసిరి కొల్వునందునన్.

కుక్కినపేనువిధంబున
నక్కెను సేనాపతియుఁ గనంజాలక యే
దిక్కుం దనపంతంబును
దక్కించుకొనం, ద్రపాభితప్తాంతరుఁడై.

ఆవల నొక్కనాఁ డతిశుభావహలగ్నమునందు మందపా
లావనినాయకాత్మజయు,నాసతిభర్తయు రాజ్యపట్టసం
భావితులై వెలింగి రలపద్మయుఁ బద్మవిలోచనుండనన్,
క్రేవలఁ జేరి పౌరులు పురే! యని పొంగి జయంబు వల్కఁగన్.

అత్తఱి మధుసేనుఁడు రజ
కోత్తముఁ డొనరించినట్టి యుపకారంబున్
చిత్తంబునఁ గొనియాడుచు
హత్తుకొనియె వాని నెదకు నాదర మొప్పన్.

మఱియును వానికి నిచ్చెను
పరమంబగు సిందుకపురపాలకపదవిన్
సరిగంచుల చేలంబులు
హిరణ్యమణిభూషణముల నెన్నియొ పేర్మిన్.

మాధవియు న్మధుసేనుఁడు
రాధాకృష్ణులవిధమున రంజిల్లుచు ధా
త్రీధరణం బొనరింప ని
రాధారములై సమసెను వ్యాధులు వెతలున్.

వారలు ధర్మశీలురు, కృపారససాగరులై ధరిత్రికిం
జేరిన స్వర్గమో యనెడు చెల్వున పాలనసేయ రాజ్యమున్
పౌరులు సౌఖ్యసంపదల భాసిలుచుండిరి ధారుణీస్థలిం
జేరిన వేల్పులో యనఁగఁ జింతలువంతలు లే కొకింతయున్.


  1. ఇంగుదీఖదిరలతావృతం బయిన గ్రావవితర్దిక = గారచెట్లయొక్కయు, చండ్రచెట్లయొక్కయు కొమ్మలచే నావరింపఁ బడిన శిలావేదిక. ‘ఇఙ్గుదీ తాపసతరుః’ అనియు,’ఖదిరో దన్తధావనః’ అనియు అమరము. ఇంగుది యనఁగా గారచెట్టు.‘తపస్వినోపయుజ్యమానత్వాత్తాపసతరుః’ తపసుల కుపయోగపడు పండ్లు గలది కనుక దీనికి తాపసతరువని నామాంత రము. ఇది బ్లూబెర్రీ వంటి ఫలవృక్షము . ఖదిర మనఁగా చండ్ర చెట్టు. ‘దన్తాన్ ధావయన్త్యనేన దన్తధావనః ‘ – దీనిచే దంతము లను పవిత్రము చేతురు గనుక చండ్రచెట్టుకు దన్తధా వన మనియు పేరు. వీని నిచ్చట చెప్పుట సందర్భోచితము. ‘లతా ప్రతానినీ వీరుత్’ అని తీఁగకును, ‘సమే శాఖా లతే’ యని కొమ్మకును అమరకోశము అర్థములు చెప్పుచున్నది. అందుచేత పైసమాసములో లతాశబ్దమునకు కొమ్మయని చెప్పుట ఉచితముగా నుండఁగలదు. పక్షాంతరమున గారచెట్లచేతను, చండ్ర చెట్లచేతను, (ఇతరమైన) తీఁగలచేతను ఆవరింపఁబడిన గ్రావవితర్దిక యనియు చెప్పవచ్చును. గ్రావ మనఁగా ఱాయి – ‘పాషాణ ప్రస్తర గ్రావోప లాశ్మాన శ్శిలా దృషత్’ అని యమరము. గ్రావవితర్దిక యనఁగా ఱాతియరఁగు.
  2. సిందుక మనఁగా వావిలిచెట్టు. ఈ వృక్షము లధికముగా నుండుటచే ఆదేశమునకు సిందుకదేశ మని పేరు వచ్చినది. ‘అథ సిన్దుకః సిన్దువారేన్ద్రసురసః’ అని యమరము.
  3. ‘ధ్యాస’ యనుపదము ధారాళముగా వ్యవహారములో నున్నను, పూర్వకవు లెవ్వరు దీనిని వాడినట్లు లేదు.
  4. * ఖండగతి; ** వసంతకోకిల.