“ఇంకా స్టేజ్ అంతా ఖాళీగా ఉందేమిటి? తెరలూ, డెకరేషన్స్ ఏవీ లేవు!” కోక్ ఒక గుక్క తాగి అడిగింది. “అదే మరి దీని స్పెషాలిటీ! ఇది పూర్తిగా నాచురల్‌గా ఉంటుంది. మేకప్ కూడా ఉండదు. స్క్రిప్టూ, ప్రాంప్టింగ్ లాంటివీ ఉండవు. లైటింగ్‌లో కూడా ఏ ట్రిక్కులూ ఉండవు. బీజీఎమ్ కూడా ఉండదు. నో గిమ్మిక్స్, నో మానిప్యులేషన్స్! అంతా ప్యూర్, సింపుల్ ఎండ్ నాచురల్!” అన్నాడు అతను.
ఈమాట మే 2014 సంచికకు స్వాగతం!
బ్రౌన్ దొర! తెలుగుభాషోద్ధారకుడు! తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన మహనీయుడు! కేవలం ఇలానే మనకు తెలిసిన సి.పి. బ్రౌన్ (ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్, 1798-1884) గురించి ఇప్పటికీ మనం వర్ణించుకుంటున్నాం. గడిచిన ఇన్నేళ్ళలో కవిపండితులు, మేధావులు మొదలుకొని విశ్వవిద్యాలయాల ఆచార్యుల దాకా ఇలా బ్రౌన్ గురించి వందిమాగధుల స్తోత్రాలు చదివిన వారే, పోటీలు పడి మరీ అతన్ని కీర్తించిన వారే కానీ, చారిత్రక దృష్టితో తెలుగు భాషలో బ్రౌన్ చేసిన పనులేమిటి, బ్రౌన్ ఉద్దేశాలేమిటి, తెలుగు భాషకు అతని సంస్కరణలవల్ల నిజంగా జరిగిన మేలేమిటి, కీడేమిటని అని ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రశ్నించి పరిశోధించినవారు లేకపోవటం ఆశ్చర్యాన్నీ, మన దాస్యప్రవృత్తిపట్ల బాధనూ కలిగించే విషయం. ఈ రోజు ఆ ప్రశ్నలకు మొట్టమొదటిసారిగా ఒక సమాధానం దొరుకుతున్నది. గత కొన్నేళ్ళుగా విస్తృతంగా పర్యటించి, అసంఖ్యాకమైన సాహిత్య, చారిత్రక ఆధారాలను పరిశీలించి, బ్రౌన్ తెలుగు భాషలో చేసిన పని గురించి క్షుణ్ణంగా పరిశోధించి ఒక సమగ్రవ్యాసంగా మనకు పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావులు మనకు తెలియని బ్రౌన్‌దొర పేరుతో ఈ సంచికలో అందిస్తున్నారు. తెలుగు భాషాభిమానులు ప్రతి ఒక్కరూ చదవవలసిన ముఖ్యమైన వ్యాసం ఇది.
ఇంకా: నిషిగంధ, తఃతః, మానస, దేశికాచార్యులు, భాస్కర్, సమవర్తి, ఉదయకళల కవితలు; పూర్ణిమ, సాయి బ్రహ్మానందం, రాధ, ఆర్. శర్మ, చంద్ర, వేంకటేశ్వరరావుల కథలు; సుజాత, మానసల పుస్తక సమీక్షలు; సీతారాం, వేంకటేశ్వరరావు, మోహనరావు, మురళీధరరావుల వ్యాసాలు; రాజా ముఖాముఖి; సురేశ్, కామేశ్వరరావుల శీర్షికావ్యాసాలు పలుకుబడి, నాకు నచ్చిన పద్యం, పెండ్యాల జనరంజని ఆడియో, గ్రంథాలయంలో పెద్దక్కప్రయాణం పుస్తకం…
అతని ముఖంలో ఏ మార్పూ కనిపించటం లేదు కానీ అతడి ఒంటిమీద వెంట్రుకలన్నీ గొంగళి దారాలుగా మారిపోయుండడం చూసి హడలిపోయింది. భయంతో వణికిపోయింది. పట్టుకొని లాగటానికి చూసింది. బలంగా పీకితేగానీ ఊడి వచ్చేలా కనిపించలేదు. అందుకని వెళ్ళి తన వాక్సింగ్ స్ట్రిప్ తెచ్చి, అతడి చేతికి అతికించి, కాసేపుంచి ఫట్‍మని లాగింది. అది ఊడి రాలేదు గానీ, అతడు లేచి కూర్చున్నాడు .
తనడుగుతున్న ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఏమీ లేదు. హద్దులు లేని మంచితనం, స్నేహం, అభిమానం, సహాయం ఆవిడ అని నాకూ తెలుసు. కాని ఇదేమిటి ఈ రోజు నాలో ఇంత ఈర్ష్యని కలగచేస్తుంది? లోపం నాలోనా లేక ఆవిడ లోనా? అసలు ఇక్కడ నాకు జరిగే హాని ఏమిటి? ఆవిడ స్త్రీ కాబట్టి ఈయనతో స్నేహం చేయకూడదా? అది ధర్మానికి విరుద్ధమా? ఆ స్నేహం నా భర్తతో కాకుంటే నా ఆలోచన ఇలానే ఉండేదా?
అంతే! ఆ క్షణం నుండి మాస్టారికి ఇస్మాయిల్ దేవుడు. వాడికి వెనుక బెంచీ నుండి ముందు బెంచీకి ప్రమోషన్ వచ్చింది. ఇస్మాయిల్‌కి తెలుగు కష్టంగా ఉందనీ ఆయనే ట్యూషన్ ఫ్రీగా చెప్పేవాడు. అంతేకాదు వాడికి శబ్దమంజరీ, రఘువంశం అన్నీ కంఠతా వచ్చేలా నేర్పేశాడు. చూస్తూండగా నాలుగు నెలల్లో ఇస్మాయిల్‌కి తెలుగంటే భయం పోయింది.
హోజే పెరేజ్ మరో సారి బయటకి నడచేడు. గదిలో ఉన్న వ్యక్తి మీద, దూరం నుంచే, ఒక కన్నేసి ఉంచమని అక్కడ ఉన్న పోలీసుతో చెప్పి, చరచర నాలుగు గదులు అవతల ఉన్న మరొక గదిలోకి వెళ్ళి, అక్కడ కంప్యూటర్‌లో ఉన్న ‘నేషనల్ ఆటోమేటిక్ ఇండెక్స్ లుకౌట్ సిస్టం’ని సంప్రదించి చూసేడు. ఖతానీ పేరు అందులో ఎక్కడా లేదు. ప్రపంచంలో ఎవ్వరూ ఇతని కోసం వెతకటం లేదు.
ఎక్కడా ఆగకుండా సూర్యుడు పైకొచ్చేదాకా నడిచాక ఏలీషా ఒక చెట్టు కింద కూర్చుని సంచీ బయటకి తీసేడు. ఉన్న డబ్బులు లెక్కపెడితే పదిహేడు రూబుళ్ళ ఇరవై కొపెక్కులు మిగిలాయి. కూర్చున్న చోటునుంచి ఒకవైపు, జీవితాంతం వెళ్దామనుకున్న జెరూసలం రా రమ్మని పిలుస్తోంది. ఏలీషా ఆలోచనలు పరివిధాలా పోయేయి. చేతిలో డబ్బులు చూస్తే వీటితో జెరూసలం వరకూ వెళ్ళగలడం అసంభవం.
బ్రౌన్ ఎవరు? ఏ పరిస్థితుల్లో తెలుగు దేశానికి వచ్చాడు? ఆయన చేసిన పని ఏమిటి? ఆయన దగ్గర పండితులు ఏ పరిస్థితుల్లో ఎలాంటి పని చేశారు? బ్రౌన్ చేసిన పని తెలుగుకి ఎంత వరకు ఉపయోగ పడింది? దానివల్ల అన్నీ లాభాలేనా, నష్టాలేమయినా జరిగాయా? ఈ విషయాల్ని సవిర్శకంగా పరిశీలించి బాధ్యతాయుతంగా కొన్ని ఆలోచనలు ప్రతిపాదించడం ఈ వ్యాసంలో మేము తలపెట్టిన పని.
అనగనగా ఒక భీముడు. పేరుకు తగ్గట్టుగానే అరివీర భయంకరుడు. తన కత్తితో పిడుగును సైతం నరికిన పరాక్రమం అతనిది. అది ఆషామాషీ కత్తి కాదు! కాలకూటవిషపు ముద్దని తన మూడవకన్ను అనే కొలిమిలో కాల్చిపెట్టి, వాసుకి కోరలనే పట్టకార్లతో పట్టి, ఒక దిగ్దంతి తలపై పెట్టి, పిడుగుల సమూహమనే సమ్మెటతో కొట్టి, స్వయంగా ఆ లయకారుడైన శివుడే కమ్మరిగా తయారుచేసినదేమో అన్నంత భయంకరంగా ఉండే ఖడ్గం అది.
వచన కవిత్వం వ్రాస్తున్న వారిలో చాలా మందికి, పాదాల విరుపే అన్ని బాధ్యతలనూ నిర్వహిస్తుందన్న గుడ్డి నమ్మకమొకటి బలంగా ఉంటుంది. అది నిజం కాదు. ఒక్కోసారి బలమైన ప్రతీక లేదా పదబంధం చేసేపనిని కామా, లేదా ఫుల్‌స్టాప్ చేస్తుందనడం అతిశయోక్తి కాదు. స్పష్టత విషయంలోనూ విరామచిహ్నాల సాయం తీసుకోవడం నేరమనిపించుకోదు. కవిత్వంలో అవేమీ నిషిద్ధాలు కావు.
నా కవిత చదవటానికి
పెదాల రంగూ గాజుల రంగూ
చీరా రైకల రంగుతో సరిచూసుకుంటూ
ఆడాళ్ళూ మొగాళ్ళూ
అన్ని వయసుల వాళ్ళూ చప్పట్లు కొట్టే
తెలుగు చలన చిత్ర సంభాషణ మల్లే
రాత్రి తెలిసిందిలే ఆ సంగతన్దామనుకుని
ఇదొక 20 ఏళ్ళ యువకుడి అంతరంగ ఘోష. తెరలు తెరలుగా పొరలు వీడి నగ్నంగా పరిగెత్తే అతని ఆలోచనలు, అతని ఊహలు, అతని పశ్చాత్తాపం, అతని ధర్మాగ్రహం, అతని నిస్సహాయత, అతని ఓటమి, అవమానం, అతని గెలుపు, అతని హృదయోల్లాసం, అతని మోహం, అతని లైంగిక అశాంతి, అతని ఆకలి, అతని ప్రేమ, ఇంకా అతనివే స్నేహం, అభిరుచులు, దుఃఖం — అన్నీ అతడివే!
దారి అలవాటైనదే అయినా
తరచూ తూలిపోతుంటాను…
పిల్లతెమ్మెరై బుజ్జగించడమొక్కటేనా
అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టి
మలుపు వరకూ తోడొస్తావు కూడాను.
రదము అంటే దంతము. నాయిక పలువరుసతో అప్పుడు ‘కోరకము’ పోటీకి దిగింది. కోరకము అంటే పూవుమొగ్గ. ఆ కోరకము రదముతో సాటి కాలేకపోయింది. ఓటమి మూలాన ‘అరగతి’ని పొందింది. అరగతి అంటే ఛిన్నాభిన్నమైన దన్నమాట. అరగతి అంటే అ’ర’గతి. ర అన్న అక్షరం లేకుండా పోయిందన్నమాట. రేఫలోపం వల్ల ‘కోరకము’ అప్పుడు ‘కోకము’ అయింది.
ఆ నిశ్శబ్దపు వీథిలో
రెక్కలల్లార్చిన
తేనెటీగల అల్లరికి
విసుగంతా విదుల్చుకున్న
కిటికీ రెక్కల రెపరెపల్లో
తరులు లతలును వెరవునఁ దమ తలపుల
వెలువరించుచుఁ దొలికారుఁ దెలియజేయ
భావుకులకెల్ల పరవశ తావలంబి
సమయవికసన సౌందర్య సముచితముగ
కారు వెళ్ళిపోయింది
వాళ్ళు వదలి వెళ్ళిన పూలబుట్ట చుట్టు
జుయ్యిమంటూ కందిరీగలు
కింద పడున్న క్యూటీక్యూరా పవుడర్ డబ్బా
జనకపుత్త్రికాలక్ష్మణసహితుఁ డగుచు
మున్ను రాముండు వసియించి యున్నయట్టి
పంచవట్యాశ్రమంబును గాంచి మున్నె
తానమాడంగ వచ్చెను తటిని కతఁడు.
సాములూ సాములూ
గవర్మింట్టు సాములూ
సాలెగూడు తెంపేదానికి
చీటీ తీసుకొచ్చినేరా?
చీమని నలిపేదానికి
జీపెక్కొచ్చినేరా?
ఆరుగెజాలిల్లు కూలగొట్టను
ఆర్డరు తీసుకొచ్చినేరా?
“కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్,” అన్నాడో సినీకవి. అయితే, అనేక మానవ సమాజాల్లో కుడిచెయ్యిని మంగళప్రదమైనది గానూ, ఎడమచెయ్యిని అమంగళకరమైనదిగా భావించడం కనిపిస్తుంది. ఎన్నో ఇండో-యూరోపియన్ భాషలలో కుడిచేయి అంటే దక్షిణహస్తం అని, దక్ష- అంటే నేర్పుగల (dexterous), బలం కలిగిన- చెయ్యి అన్న అర్థాలున్నాయి. లాటిన్ భాషలో ఎడమ అన్న అర్థంలో వాడే పదం sinister. అదే పదానికి వక్రమైన-, చెడ్డ, దుష్ట- అన్న అర్థాలున్నాయి.
అయినా నిరీక్షించడమంటే ఏమిటో మనకు తెలియనిది కాదు. దేనికోసం ఎవరెవరం ఎదురుచూస్తున్నామో అదే వచ్చేస్తే మనమంతా తప్పకుండా భంగపడేవాళ్ళం. అది ఆదర్శరాజ్య మైనా, కమ్యూనిస్టు సమాజమైనా, సాంస్కృతిక విప్లవమైనా సరే. అయినప్పటికీ, ‘నిరీక్షించువారు ధన్యులు. వారికన్నియును నొసగబడును,’ అని చెపుతూనే ఉంది. కొత్తదో, పాతదో ఓ నిబంధన గ్రంథం.
ఎవరైనా కొత్తపల్లి లోని కథలని ఎప్పుడైనా ఎక్కడైనా ముద్రించి ఎవరితోనైనా పంచుకోవచ్చు. హక్కులు అన్నీ పిల్లలవే. కథలకి బొమ్మలు వేయించి ఒక వేదికని ఏర్పరచడం, ఒక సమన్వయ కర్తగా వ్యవహరించడం మాత్రమే కొత్తపల్లి చేసే పని. కాపీరైట్ కాదిది; కాపీ లెఫ్ట్. అంటే అన్ని హక్కులూ సమూహానికే వదలబడ్డాయన్నమాట. ఓపెన్ సోర్స్ స్పిరిట్ అంటే ఇదే.
తెలుగు సాహిత్యపు ఛందోగగనములో మిక్కిలి ప్రకాశవంతముగా మెరిసే మినుగుతార కందపద్యము. ఒక చిన్న పద్యములో అనేకానేక భావములను సంతరించుకొనే శక్తి సామర్థ్యములు గలిగిన పద్యము కందపద్యము. ఇట్టి కంద పద్యపు పుట్టు పూర్వోత్తరాలను, అందచందాలను, భూతభవిష్యత్తులను నా శక్తి మేరకు ఈ రెండు వ్యాసములలో తెలిపినాను.
అనుకరణకి గమ్యం తెలుగు అనుకున్నప్పుడు ఏ తెలుగు అనే ప్రశ్న వస్తుంది? ఈ వ్యాసం నిర్మించుకున్న పరిధిలో మన గమ్యం శిష్టవ్యవహారికం – అనగా, ఈ రోజుల్లో వార్తాపత్రికలలోను, అంతర్జాలపత్రికలలోను, కథలలోను, తరచుగా కనిపించే వ్యవహార శైలి భాష. ఈ రకం భాష ముద్రణా మాధ్యమంలో కనిపిస్తోంది కాని టెలివిజన్ కార్యక్రమాల్లో ‘లంగరమ్మలు, లంగరయ్యలు’ మాట్లాడే భాషలో వినిపించటం లేదు.
ఈ ప్రత్యేక జనరంజని కార్యక్రమంలో పెండ్యాలగారు సినీ సంగీతం గురించి, గాయకుల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆయన వర్ధమాన గాయనీ గాయకులకు యిచ్చిన సూచనలు ఆలోచించదగ్గవి.
పెద్దక్కను పోగొట్టుకున్న చెల్లెమ్మలు, ఒక్క పట్టున మూడురోజుల్లో యీ పుస్తకం రాసి, మరో వారం రోజుల్లో పుస్తకంగా ప్రచురించి వాళ్ళ అమ్మా నాన్న చేతుల్లో పెట్టారట (కూతురిని పోగొట్టుకున్న దుఃఖాన్ని కూడా మరిచి యీ ముచ్చట చెప్పారు వాళ్ళ నాన్నగారు.) ‘పెద్దక్క ప్రయాణం’ వీలైనంత మందికి అందుబాటు లోకి తీసుకు రావాలనే మల్లీశ్వరి గారి సంకల్పానికి ఆసరాగా ఈమాట గ్రంథాలయంలో ఈ పుస్తకాన్నుంచుతున్నాం.