ప్రాణాంతక ప్రణయము


తృతీయాంకము

ప్రథమదృశ్యము

(స్థలము: భీమవర్మ దుర్గములోని విశాలమైన వివాహశాల; భద్రగోపుఁడు సపరివారముగా కామినితో వివాహనిశ్చితార్థమై భీమవర్మ దుర్గమున కేతెంచును. ఆ పరివారము నాహ్వానించుటకై భీమవర్మ స్వకీయపరివారమును సిద్ధము చేసి యుండును. ఆపరివారమే ఈక్రింది కోరస్‌ను పాడుచు పుష్పగుచ్ఛాదులందించి అతిథివర్గమును సత్కరించుచు స్వాగతము పల్కును.)

కోరస్:
స్వాగత మిదియే స్వాగత మిదియే
సౌహృదపూరితసత్కృతు లివియే
చింతలఁ జెంతకుఁ జేరఁగనీయక
సంతోషంబున సహగామిని యై
నిచ్చలు సాగెడు నెలఁతను గోరఁగ
వచ్చిన వరునకు పరివారమునకు

స్వాగత మిదియే స్వాగత మిదియే
సౌహృదపూరితసత్కృతు లివియే
మునుపటి మైత్రీముకుళం బిప్పుడు
అనురాగసుమంబై యలరారఁగ
ఆ విరి కుపభోగ్యంబగు తరుణిని
ఆవీక్షింపఁగ నౌత్సుక్యంబున
వచ్చిన వరునకు పరివారమునకు
స్వాగత మిదియే స్వాగత మిదియే
సౌహృదపూరితసత్కృతు లివియే
భాసురమగు నీవాసర మందున
ఆశాలతయే అలరులు దాల్పఁగ
పరమంబగు దాంపత్యంబునకై
సరియగు తరుణీకరమును గోరఁగ
వచ్చిన వరునకు పరివారమునకు
స్వాగత మిదియే స్వాగత మిదియే
సౌహృదపూరితసత్కృతు లివియే
భద్రగోపుఁడు:
ఉల్లాసంబును నుత్సాహంబును
పెల్లడరఁగ నీ చెల్లెలి కరమును
కోరుచు వచ్చితి కూరిమినేస్తమ!
సారంబగు నీసంబంధంబున
మన నేస్తంబింకను దృఢతరమై
మనుఁ గాత సదా మంగళకరమై
అరయుదు నీభాగ్యం బధికారము
తరుగుట అధునాతనకాలంబున;
త్వరగనె యది పరివర్తితమగు నీ
పరిణయకల్పితబాంధవ్యంబున
మన బాంధవ్యము మన మిత్రత్వము
మను నిరతంబుగ ననుచుం బ్రకటిం
తును నీకరముం గొని నాయెదపై
మనసారఁగ నిడుకొని మిత్రోత్తమ!

(పై విధముగాఁ బాడుచు భద్రగోపుఁడాప్యాయముగా భీమవర్మ చేతిని గ్రహించి తన యెదపై నుంచుకొనును.)

భీమవర్మ:
సన్నుతుఁడగు సచివాగ్రణి
మున్నుగ మిత్రుఁడయి నాకు, ముదమునఁ బెండ్లా
డన్నాదు సహోదరినే
యెన్నుకొనుట నాకుఁ గూర్చు నెంతో ముదమున్

(పై విధముగా భద్రగోపునకు సంతోషముతోఁ బల్కును.)

భద్రగోపుఁడు:
వధు వెక్కడ?
భీమవర్మ:
త్వరలో వచ్చును.

(తర్వాత జనాంతికముగా క్రిందివిధముగాఁ బల్కును.)

కాని ఒక్క మాట.
మొన్నమొన్ననె మరణించియున్న తల్లి
విరహమామెకు నింక దుర్భరముగానె
ఉన్న కతమున విన్నఁబాటూనియున్న
తాము మన్నింపవలె వేఱు దలఁపకుండ
భద్రగోపుఁడు:
సహజంబే కద యది, వేఱుగ దలఁపగ నేల?

(ఇంతలో పెండ్లికూతురు వేషములో నున్న కామినిని మాలినీమైత్రేయులు తీసికొనివత్తురు. ఆమె మైత్రేయుని బోధనలవల్ల భద్రగోపునితో వివాహమునకు అసమ్మతిగానే అంగీరించి యుండుటచే, ఈ సందర్భములో విచారగ్రస్తగనే యుండును.)

కోరస్:
అలమైత్రేయుఁడు చెలి మాలిని అండ యొసంగఁగ
అలనల్లన వధువదిగో అరుదెంచుచు నున్నది
అలనల్లన వధువదిగో అరుదెంచుచు నున్నది
భీమవర్మ:
నన్నుఁ గావంగ నమ్మితి నిన్నె నేను
కరుణతోఁ జేయవలె నుక్తకార్యమెల్ల!

(ఇట్లు అసమ్మతిగా వచ్చిన కామినితో రహస్యముగా బల్కి ఉత్తరోక్తముగా నుడువుచు ఆమెను భద్రగోపునకు సమర్పించును)

ఈ కులజను లెల్లరు సా
క్షీకృతదృక్కులగుచు దరిసించుచు నుండన్
నీకరమందిడి యీ క
న్యాకరము నొనర్తును పరిణయనిశ్చయమున్
భద్రగోపుఁడు:
(కామినితో) నీపాణిం గొన నాతను
వాపులకితమై సుఖించె నానందమునన్
ఆపగిదిని నీతనువును
ఆపులకితమై సుఖించె నంచుఁ దలంతున్
నిను నర్థింతును కామిని!
నను నీభర్తగ గ్రహించి నవసౌఖ్యదజీ
వనసహచారిణివగుచున్
మనసారఁగ నన్నుఁ గూడి మనుమని యింకన్

(ఇంకను అసమ్మతిగానే యున్న కామిని స్పందించులోగా వివాహాంగీకారపత్త్రమును సంతకముచేయుటకై భీమవర్మ భద్రగోపుని ప్రక్కగాఁ గొనిపోవును.)

భీమవర్మ:
బంధుమిత్రులు సాక్షులై పరగుచుండ
వరుఁడు వధువును వరుసగా వచ్చి యిటకు
సంతకము సేయఁగావలె సంతసమున
పాణిబంధనిర్ణాయకపత్త్రమందు

(భద్రగోపుఁడు సంతోషముగా నాపత్త్రమును సంతకము చేసి ప్రక్కకుఁ దొలఁగును. భీమవర్మ కామినిని సమీపించి, ఆమెతో ఏకాంతముగాఁ బల్కును)

భీమవర్మ:
రమ్ము ముందుకు నీదు చేవ్రాలు నుంచ
వమ్ముసేయకు మామకాభ్యర్థనంబు
కామిని:
సవనపశువట్లు ముందుకు సాగుచుంటి
చిత్త మొప్పని చేవ్రాలు చేయుచుంటి

(పైవిధముగా తనలో ననుకొనుచు ముందుకు సాగి వివాహపత్త్రముపై సంతకము చేయును)

భీమవర్మ:
(తనలో) హమ్మయ్య! గుండెపై బరువు తొలఁగినది.
కామిని:
(తనలో) సంతకంబు చేసికొంటి నిపుడె
నాదు మరణదండనంబు నేనె
కోరస్:
వరుఁడయ్యె భద్రుండు వధువయ్యె కామినియె
పరిణయం బీనాఁడె స్థిరమయ్యె నిర్వురకు
జరుగంగఁ బోవు నా పరిణయంబును మేము
కనుదోయి కింపుగాఁ గనఁగాను వేడ్కతో
గణియించుచుందుము క్షణములే యేండ్లుగా
గణియించుచుందుము క్షణములే యేండ్లుగా
వరుఁడయ్యె భద్రుండు వధువయ్యె కామినియె
పరిణయం బీనాఁడె స్థిరమయ్యె నిర్వురకు

ద్వితీయదృశ్యము

(మాళవములో తన కార్యమును ముగించుకొన్న ప్రవరసేనుఁడు ఉత్తరోక్తవిధముగా కామినినిగుఱించి ఆలోచించుచు తిరిగివచ్చును.)

ప్రవరసేనుఁడు:
నాదు ప్రాణము నాదు ప్రేయసి
నాదు కామిని నాదు విరహము
నెట్టులోర్చెనొ, ఎట్టు లీడ్చెనొ
వట్టిపోయిన బ్రతుకు నొంటిగ?
అలరువంటిది ఆమె హృదయము
కొలదిబాధకె కలఁగుచుండును
అట్టి కోమలి నెట్టి వంతలఁ
బెట్టుచుండెనొయిట్టి విరహము?
నామనంబను నాకసంబున
ధామమొల్కెడు తార కామిని
ఆమె సన్నిధి యగును నిజముగ
భూమియందునఁ బొల్చు స్వర్గమె
ఆమె యొసఁగిన అంగుళీయక
ధామ మింతయుఁ దఱుగ నట్టుల
ఆమె మనమున అతిశయించుచు
ప్రేమ దఱుగక వెలయుచుండును
ఆమె స్మరణం బామనింబలె
నామనంబును నలరఁజేయును
కామితంబగుఁ గన్నుదోయికి
ఆమెదర్శన మామెతం బలె
ఎట్టికష్టము లెదురువచ్చిన
నట్టివెల్లను నెట్టివేయుచు
చనుదు నిప్పుడె సత్వరంబుగ
కనఁగ నామెను నెనరు మీరఁగ

తృతీయదృశ్యము

(పైవిధముగా తిరిగి వచ్చిన ప్రవరసేనుఁ డెంతో ఉత్సాహముతో కామినిని వివాహ మాడవలెనను ఆశయముతో ఆమెను దర్శింపఁబోవును. అది కామినీభద్రుల వివాహనిర్ణయము జరిగిననాటి మఱుసటిదినము. ప్రవరసేనుఁడు భీమవర్మ దుర్గమును సమీపించుచుండఁగా స్వస్థానమునకు బయలుదేఱిన భద్రగోపుని పరివారమునకు వీడ్కోలు నిచ్చుచున్న భీమవర్మ ఆతని కంటఁబడును.)

భీమవర్మ:
కూడెను సంతసంబు, సమకూడెను మీ ప్రియబాంధవంబు, పెం
డ్లాడఁగ నేర్పరించిన శుభాహమునందున వెండి యిచ్చటం
జూడఁగ మిమ్ము వేఁడెదను, సోదరభావముతో నృసింహుచే
మూడిన చేటునుండి నను ముక్తునిఁజేయఁగఁ జూడుఁ డింతలోన్
మాతృమరణంబుచే దుఃఖమగ్నయగుచు
నిప్పుడున్నను కామిని యెట్లొ దాని
నతకరించి ప్రసన్నయై యలరుచుండు
పెండ్లినాటికి నని నేను విశ్వసింతు
భద్రగోపుఁడు:
మాతృమరణశోకంబుచే మ్లానమైన
కామినీముఖాబ్జంబున క్రమముగాను
కాంతి నెలకొల్పఁ గల్గును కాలమొకటె
కాలమౌఁగద సర్వశోకాపహంబు!
అందుచే నామెకుం గొంత వ్యవధి నిచ్చి
పరిణయోత్సవ మాపైనిఁ జరుప నెంచు
నీదు యోజన సంశ్లాఘనీయమెంతొ,
ఉభయపక్షముల కిది శ్రేయోవహంబు.
తఱుగదు సోదరభావము,
త్వరగనె యత్నింతు నీదు దైన్యము దీర్పన్,
పరిణయశుభవేళకునై
నిరతోత్కంఠను నిరీక్ష నేనొనరింతున్
కోరస్:
పరిణయనిశ్చయపర్వము ముగియఁగ
పరిజను లెల్లరు ప్రక్కనఁ గొల్వఁగ
తరలెను తన పురవరమును జేరఁగ
వరుఁడిదె ఉజ్జ్వలవైభవ మొప్పఁగ
ఆతని పయనం బతి సుఖముగ సాగఁగ
ఆతని కతిశయమగు లాభము గల్గఁగ
ఆతని పూన్కి ఫలాస్పదమై తనరఁగ
ప్రీతిమెయిం బ్రార్థింతుము దైవంబును

(బయలుదేఱిన భద్రగోపుని గూర్చి కోరస్ పాడుచున్న పై పాటను దూరమునుండి ప్రవరసేనుఁడు విని వివాహనిశ్చయము కామినితోనే జరిగినదని అనుమానించి, ఈ క్రిందివిధముగా స్పందించును.)

ఏమీ కామిని అన్యుని
కామించి వివాహమాడఁగాఁ దలకొనెనా?
ఏమఱి నీతియు నియమము
కామాతుర యగుచుఁ జేయఁ గడఁగెన యిటులన్?
వనమందా నిసియందు జేసిన మహావాగ్దాన మేమయ్యెనో
తన సర్వస్వము నన్యపూరుషునికిం దత్తంబు గావింపఁగా
మనసెట్లూనెనొ నాప్రవాసమున, నేమాత్రంబు నమ్మంగ వ
చ్చునె కామైకవిచారమూఢలగు యోషోన్మత్త చిత్తంబులన్?
ఎందఱు నను శాసించిన,
ఎందఱు నన్నడ్డుకొనిన నింతయు భీతిం
జెందక చని యామెనె వెఱ
పందక వచియింపుమందు యాథార్థ్యంబున్

(అనుచు పరిక్రమించి, లోనికి పోఁబోగా భవనమునందు విష్ణణయై యున్న కామిని దూరమునుండియే అతనికి గన్పడును. అతఁడచ్చట కొంచెమాగి ఇట్లనుకొనును; అనుశయము=పశ్చాత్తాపము.)

వాడువాఱిన వనజంబు భంగి నున్న
ఆమె వాడిన వదనంబు నరయ నాకు
అనుశయంబున శోకించు నటులఁ దోఁచు;
ప్రేమమింకను ద్విగుణమౌ నామెయందు

(ఇంతలో భీమవర్మ పరివారము, కోరస్ లోనికి పూర్తిగా నిష్క్రమించును. ప్రవరసేనుఁడు ఖడ్గధారుఁడై లోనికి పోఁబోగా భటు లడ్డుకొందురు.)

ప్రవరసేనుఁడు:
పోనిండు లోనికిం బోనిండు నన్ను
భటులు:
ప్రాణంబు దక్కదు రాకింక ముందుకు
ప్రవరసేనుఁడు:
నన్నాపఁగా లేడు నరమాత్రుఁ డెవ్వఁడు

(కత్తిని దూసి యుద్ధమునకు సిద్ధమగును)

భటులు:
కాచుకో నీతలను కందుకంబట్లు
ఎగిరించు నిప్పుడే ఈఖడ్గధాటి

(ఖడ్గములు దూసి అతని నెదుర్కొందురు. ఉభయులకు మధ్య కత్తిపోరు జరుగును. కించిద్దూరములో జరుగుచున్న ఆ అలజడిని గమనించి భీమవర్మ భటులను వారించుచు నిట్లనును.)

భీమవర్మ:
రానిండు వానినిన్ రానిండు లోనికిన్
నాఖడ్గమే వాని నాశంబుఁ జూడనీ!

(అట్లు భటులచే విడువఁబడి ప్రవరసేనుఁడు సరభసముగా ప్రవేశించును. అతని గుర్తించి భీమవర్మ…)

ఓహో ప్రవరసేనుఁడా!

(అనుచు ప్రవరసేనుని తన ఖడ్గముతో నెదుర్కొనఁబోవును. ఆలోపలనే హఠాత్తుగా కనిపించిన ప్రవరసేనుని వైపుఱికి కామిని …)

కామిని:
ప్ర..వ..రా..! ప్ర..వ..రా..!

(అనుచు అతనిని గాఢముగా కౌఁగిలించుకొని కొంత అపస్మారముతో క్రింది కొరుగును. ఆమెను లేవనెత్తి మాలినీమైత్రేయభీమసేనులు ఒక సోఫాలో కూర్చుండఁబెట్టెదరు. మాలినీమైత్రేయు లామె కుపచారము చేయ నారంభింతురు. ఈలోపల భీమవర్మ ప్రవరసేనుని కడ కుఱికి కత్తితో నతని ఖండింపఁ బోగా కత్తితో నతఁడడ్డుకొనును. వారిర్వురికి చిన్నపాటి పోరు జరుగును. అది చూచిన మైత్రేయుఁడు పరుగున వచ్చి, క్రింది విధముగాఁ బల్కుచు వారిని శాంతపఱచి వేఱు చేయును.)

మైత్రేయుఁడు:
మంగళంబు జరిగినట్టి మందిరాన
తావు లేదు హింస కెట్టి తావు లేదు
హింసచేత గరిమ గాంచ నెంచు వ్యక్తి
హింసచేత మరణమొందు నిలను దానె
కాన ద్వేషముజ్జగించి, మాన ముడిగి
కత్తు లవలఁ బెట్టి శాంతిఁ గనుఁడు మీరు!
భీమవర్మ:
పానకంబులో పుడుక చందాన నీవు
ఏలవచ్చితివి యిటకు బాలిశుండ?

(వేఱుగాఁ జేయఁబడియున్న భీమవర్మ ప్రవరసేనునివైపు పరిక్రమించి పల్కును.)

ప్రవరసేనుఁడు:
రాలేదు దొంగవలె. నాదానినే స్వాధీనముం జేసికొన వచ్చినాను.
భీమవర్మ:
లేదు నీదన్నదేది యిట. అంతయు పరాయత్తమైనది.
ప్రవరసేనుఁడు:
అది అబద్ధము. నాధనము పరాయత్త మగుట అసాధ్యము.
మైత్రేయుఁడు:
శాంతింపుము ప్రవరా! ఆతని మాట యథార్థము.
ప్రవరసేనుఁడు:
అసంభవము. మీమాట అసత్యము.
మైత్రేయుఁడు:
ఇదిగో వీక్షింపుము. భద్రగోపున కామె అంకితమైనది.
స్పష్టముగ నుండె ప్రవర! యీపత్త్రమందు
భద్రగోపునితోఁ దన పరిణయంబు
సమ్మతించుచుఁ గామిని సల్పినట్టి
చక్కనగు నక్షరంబుల సంతకంబు.

(పరిణయాంగీకారపత్త్రమును చూపెట్టును. ఈలోపల కామిని అపస్మారమునుండి కొంతగా తేఱికొనును. ప్రవరసేనుఁడు కోపోద్రిక్తుఁడై ఆవేశముతో ఆమెను సమీపించి ఆమె కా పత్త్రమును చూపుచు నిష్ఠురముగాఁ బల్కును.)

ప్రవరసేనుఁడు:
చెప్పుము, ఇది నిజమేనా? ఇది నిజమేనా? ఇది నీ చేవ్రాలేనా?
కామిని:
(శోకముతో) ని..జ..మే.. అది.. అది.. నా.. వ్రా..లే..
ప్రవరసేనుఁడు:
ఐన నాచేతి కతిభార మగుచునుండె
నీ మృషాప్రేమచిహ్నంబు నీవె గొనుము!

(అని కోపముతో కామిని అతని చేతికి తొడిగియుండిన ఉంగరమును దీసి ఆమెవైపు విసరివేయును.)

కామిని:
(నిర్వేదముతో) అయ్యో.. అయ్యో..ప్రవరా..
ప్రవరసేనుఁడు:
అట్టి చేవ్రాలు చేసినయట్టి దుష్ట
హస్తమందున నాపవిత్రానురాగ
చిహ్నముండఁగా రాదు, త్యజింపు మిపుడె,
విసరివేయుము దాని నాదెసకు నిపుడె,
విసరికొట్టుము దాని నాదెసకు నిపుడె.

(అని కోపముతో పలికి, కామిని సంక్షుభితచేతస్కయై అతని ఉంగరమును తీయుచుండఁగానే, తానా ఉంగరమును లాగికొని, క్రిందఁబడవేసి కాలితోఁ ద్రొక్కును.)

కామిని:
(సంక్షోభముతో) అయ్యో ప్రియా ప్రవరా.. అయ్యో భగవంతుఁడా!
ప్రవరసేనుఁడు:
తెగఁగోసి ప్రణయంపుఁదీఁగెనే
భగవంతు నేటికిన్ భజియింతు వీవు
నిను నమ్మి మదిలోన నిర్మించు
కొనినట్టి హర్మ్యముల్ గూలిపడె నేఁడు
ఈవైపరీత్యమ్ము నిఁకముందె
భావించి మనకుండ వంచితుఁడ నైతి
మనవంశముల మధ్య మునుపున్న
ఘనవైరమున్మఱచి కామించి నిన్ను
కరముంచి విషపన్నగమునోట
గఱపించు కొన్నట్లు గావించుకొంటి
భీమవర్మ,కోరస్:
చాలించు చాలించు ప్రేలంగవలదింక
ఆలించి నీఘోష లాలింప రెవ్వరిట
బారుగాఁ దెర్వఁబడె ద్వారంబు నీకొఱకె
పాఱిపొమ్మింక నీ ప్రాణంబుకొఱకు
మైత్రేయుఁడు:
ప్రాణంబు ముఖ్యంబు ప్రణయంబు గౌణంబు
ప్రాణ ముండినఁగదా ప్రణయంబు సాధ్యంబు
అందుచే నీక్షేమ మామె క్షేమము నెంచి
కుందునొందుట మాని పొందుమిఁక శాంతి
కలతలం దొలగించి కాలంబు మునుముందు
కలిగించు నెమ్మదిం గ్రమముగా నీయందు
కామిని:
జడమయ్యె నాబుద్ధి సంక్షుభితమగుచు
కడ కేమి జరుగునో కానంగ లేను
అతినిరాశాపూర్ణమతి నైన నేను
ఇతనిలో నాశాభిరతిఁ గూర్పలేను
కావునం బ్రార్థింతు దైవంబ నిన్నె
కావఁగా నీతనిం గలఁతలం బాపి
ఆలించి నాదైన యభ్యర్థనంబు
పాలింపు మీతనిం బతనంబునుండి

(దీనముగా దేవుని ప్రార్థించును.)

భీమవర్మ:
తప్పుకో తప్పుకో యిప్పుడే యిటనుండి
తప్ప దిట నున్నచో ముప్పు నీ మన్గడకు
నాతాల్మి నశియించు నాఖడ్గధారచే
నీతనువు గూలిపడు నిర్జీవమై యిచట
పాఱిపొమ్మిటనుండి వాయువేగంబున
వేఱేమి యెంచక బీరంబు లాడక
ప్రవరసేనుఁడు:
జలములో జలగట్లు స్థానబలమునఁ జేసి
పలుకుచుంటివి నీవు బహువిరోధోక్తులు
ఎక్కటిపోరులో నెదిరించు నన్నపుడు
చక్కగాఁ దెలియు నీ సత్త్వమేపాటిదో
నీరక్తధారతో నేఁజేయఁ దలకొన్న
ఘోరతర్పణము చేకూరు మత్పితకు
కామిని:
(ప్రవరునితో) కలదింక నీయందు వలపు నా మదియందు
కలహింప కటు నీవు కఠినోక్తులం బల్కి
మైత్రేయుఁడు:
(ప్రవరునితో) భావుకంబైన వైవాహికంబునకు
తావలంబైన యీధామాంతరంబు
అతులాగ్రహోన్మత్తమతివౌచు నీవు
క్షతజాక్తముగఁజేయ యతనింతు విపుడు
ఈవైరమును మాని ఈక్షణంబందె
నీవేఁగు మిటనుండి నీమేలుకొఱకె
భీమవర్మ:
(తనలో) క్రోధంబు ద్వేషంబుఁ గూడఁగట్టుకొని
వ్యాధివలె నితఁడు మావంశారి యగుచు
ఉసికొల్పు నను ద్వంద్వయుద్ధంబుకొఱకు
పసలేని వీని గర్వంబు నెడఁబాపి
కసిమీర బలిచేసి కత్తికిని వీని
సిసలైన శాంతినిం జేకొందు నేను

(పైవిధముగా యోచించి, కోపోద్రేకములతో ప్రవరునితో నిట్లనును)

ఎక్కటిపోరులో నెదిరింప నన్ను
చక్కనగు తలంపె జనియించె నీకు
అనువంశికంబైన మనవిరోధంబు
కను నీవిధిం బరిష్కారంబు నిపుడు
సిద్ధంబుగా నుంటి జేయంగ నిట్టి
యుద్ధంబు నీతోడ నుద్దామముగను
ఆలసింపక స్థలము కాలంబు లెల్ల
వాలాయముగ నీవె వచియింపు మిపుడె
ప్రవరసేనుఁడు:
(కోపంతో) నేను సిద్ధమె! నిర్ణయింపుము స్థలకాలములు నీవె
భీమవర్మ:
(ఉద్రేకముతో) భానుఁడు ఱేపు తూర్పుమలపై నుదయించెడు వేళ చంచలా
నూన విభా సమంచిత వినూత్నకృపాణము పాణిఁ బూని నీ
తో ననిసేయ నిల్తు నిటఁ దోఁటను గ్రాలెడు వారియంత్రధా
త్రీనికటంబునందు, నరుదెంచు మెదుర్కొన నీవు నన్నటన్
మైత్రేయుఁడు:
ఆరిపోవని అనలంబు తీరు రేగు
ఆగ్రహంబుచే నంధీకృతాత్ములగుచు
అతితరప్రతీకారేచ్ఛ నలరి మీరు
వంశనాశనం బొనరింప వలతు రిపుడు!
భీమప్రవరులు:
ఎవరేమి యన్న మారదు
ధ్రువ మిది మానిర్ణయంబు, తుదకెవ్వారీ
బవరంబున గెల్చెదరో
అవితంబగు వారి యన్వయంబే యవనిన్