సింగన:
ఏమే మణీ! మఱి పినవీరనగారు మీ అమ్మగారింటికి రోజూ వస్తున్నారా?
మణిప్రభ:
నీకు తెలియని దేముంది. రోజూ నీవు ఆయన పద్యాలు వ్రాయడానికి పోతున్నావుగా!
సింగన:
పోతున్నాను గాని, ఒకటి రెండు పద్యాలు రాయగానే నన్ను ఇంటితోవ పట్టిస్తున్నాడు. ఇప్పటికి 120 పద్యాలు మాత్రమే నా తాటాకులలో పడ్డాయి. మఱి దసరా నాటికి ఆ భారతం ఎట్లా ముగుస్తుందా, రాజుగారికి ఎట్లా అంకితమౌతుందా అని నాకు చింత పట్టుకొన్నది. ఆయన కేమో ఏ చీకూచింతా లేదు. ఆ రెండు మూడు పద్యాలు చెప్పేసి సరస్వతీదర్శనం చేసికోవాలంటూ మీ యింటికే వస్తాడు.
మణిప్రభ:
అది నిజమే. రోజూ పినవీరనగారు మా యింటికి వస్తారు. మా యింట్లో చాలా సేపుంటారు. మా అమ్మగారు వారిని చాలా ఆదరించి, గౌరవించి, పరవశంతో వారి ముందు నాట్యం చేస్తుంది. వారు తన్మయత్వంతో దానిని చూస్తూ ఉండిపోతారు.
సింగన:
అంతేనా, మఱింకేమైనా వారి మధ్య …
మణిప్రభ:
ఛీ! ఛీ! అపచారం! అట్టిదేమీ లేదు. మా అమ్మగారి నాట్యమూర్తిలో వారు సాక్షాత్తు సరస్వతినే చూస్తారంట. అందుచేత వారికి భక్తిభావమే కాని మఱింకేమీ లేదు. అమ్మగారు కూడ వారిని చూస్తే సాక్షాత్తు బ్రహ్మదేవుడినే చూచినట్లు తృప్తి పడుతుంది. వారిని చాలా గౌరవిస్తుంది.
సింగన:
ఇద్దఱూ గొప్పవారే. వారిది అమలినమైన భారతీబ్రహ్మలబాంధవ్య మన్నమాట. ఐతే ఏం? లోకం పోకడ లోకానిది. రాయసకానిగా నాకు విజయనగరంలోని కవిపండితులతో మంచి పరిచయం ఉంది. కలిసినప్పుడల్లా పినవీరనగారినీ, వారు వ్రాసే కావ్యాన్నీ గుఱించి వారు నన్నడుగుతుంటారు. పినవీరనగారి కాలమంతా మీ అమ్మగారి కాలియందెలరవళికే అంకితమైందని వారి అభిప్రాయం. వీరి సంబంధాన్ని గుఱించి ఏవో వింతవింత ఊహలు!
మణిప్రభ:
లోక మేమమనుకున్నా వారిది మాత్రం పవిత్రబంధమే. అంతమాత్రం చెప్పగలను.
సింగన:
అంతేకాదు. పండితులలో కొంత అసహనం కూడ మొదలైంది. కావ్యరచన కుంటినడకగా సాగుతున్నదని తెలియగానే, మొదట పినవీరనగారే ఈ కావ్యరచనకు తగినవారని అన్న పండితు లిప్పుడు తమను కాదని ఆయనకు అప్పగించడం వల్లనే ఇట్లు జరుగుతున్నదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మణిప్రభ:
పినవీరనగారు మహాసరస్వతి ఉపాసకులు. ఆ దేవీకటాక్షమే వారిని కాపాడుతుందని అనుకుందాం. నీవు రాకుంటే నేనెప్పుడో పూలు కోసికొని అదృశ్యమయ్యేదానిని. నీవల్ల ఇంత ఆలస్యమైంది. నీకూ నేను కొన్ని పూలు కోసి పెడతాను. తీసికొని మనదారిన మనం పోదాం.
సింగన:
మంచిది. మొగలి ముండ్లు నాటించుకొనే ప్రమాదాన్ని నాకు తప్పిస్తున్నావు. ఎంతైనా మొగలి పూలు కోయడంలో నీవు గడుసరివి కదా! (కోసిన పూవుల నిర్వురు తీసికొని నిష్క్రమింతురు.)
పదమూడవదృశ్యము
(స్థలం: పెదవీరనగృహం. సమయం:మహానవమినాటి ఉదయం)
పెదవీరన:
తమ్ముడూ! రేపే విజయదశమి. నీవు జైమినిభారతాన్ని అంకితం చేయవలసిన దినం. నేను అధికారవశాత్తు అన్యప్రాంతమున కేగుటవల్ల ఆగ్రంథరచన ఎంత పూర్తియైనదో తెలిసికొనక పోతిని. కాని ప్రధానమంత్రులద్వారా నాకు తెలిసిన సమాచారం అది పూర్తి కాలేదనే.
పినవీరన:
అది మంత్రిగారి కెట్లా తెలుసు?
పెదవీరన:
ఆ రాయసకా డున్నాడే. వాడు రోజూ కావ్యపరిస్థితి ప్రధానమంత్రికి తెలుపుతున్నాడు. ప్రధానమంత్రి ఆ విషయాన్ని ప్రభువులకు నివేదిస్తున్నాడట.
పినవీరన:
అంటే ప్రభువులకు ఈ గ్రంథంలో స్వల్పభాగమే పూర్తయిందని తెలుసన్నమాట.
పెదవీరన:
ప్రభువులకే కాదు. ఇతర పండితులకు గూడ తెలుసునట. ఆ రాయసంగాడు వట్టి వదరుబోతు. వాని నోట్లో నూలగింజైనా నిలువదు. వాని ద్వారా పండితులకూ తెలిసినట్లుంది. అదెట్లున్నను, ఱేపు ప్రభువులకు గనుక గ్రంథ మంకిత మీయకపోతే అది ప్రభుధిక్కారం కింద పరిగణింపబడుతుంది. అది జరిగితే పడే శిక్ష నీవూహించుకొనవచ్చు.
పినవీరన:
గడ్డు సమస్యయే ఎదురైంది. (కొంచెం సేపు నిమీలితనేత్రుడై సమాధిలో నుండి…) అన్నయ్యా! చింతింపవలసిన అవసరం లేదు. ఆ తల్లి సరస్వతీకృప వల్ల అంతా సరిగానే జరుగుతుందని అనిపిస్తూ ఉన్నది. పూజామందిరాన్ని అలికి, ముగ్గులు పెట్టించి, మామిడి తోరణాలు,తులసీపుష్ప తోరణాలు కట్టించి సర్వసన్నద్ధం చేయించండి. మన ఇంట్లో రెండే గంటము లున్నవి కదా! మఱొక పది గంటములను, ఒక పెద్దబుట్టెడు సరళమైన తాళపత్రాలను తెప్పించండి. ఆవునేయితో అఖండంగా వెలిగే పది పెద్దపెద్ద దీపపు సెమ్మెలను పూజామందిరంలో పెట్టించండి. రాత్రివఱకు ఈ ఏర్పాటులన్నీ చేయిస్తే మిగిలిన విషయం నేను చూచుకొంటాను.
పెదవీరన:
ఏమో తమ్ముడూ! ఇంతవఱకు పదవ భాగమైనా పూర్తిగాని కావ్యం పూజామందిర మిట్లు సన్నద్ధం చేసి పూజలు చేస్తే హఠాత్తుగా పూర్తవుతుందా? ఇదంతా నాకు అనుమానాస్పదంగానే ఉంది. గత్యంతరం లేదు గనుక నీవు కోరినవన్నీ తు.చ. తప్పకుండా చేయించి పూజామందిరాన్ని సిద్ధం చేయిస్తాను.
పినవీరన:
ఆ… ఇంకొక నియమం. అన్నీ సిద్ధమైన తర్వాత నేను పూజామందిరంలో ప్రవేశించి తలుపులు మూసికొని సమాధిలో కూర్చుంటాను. ఎవ్వరూ తలుపులు తీయరాదు, లోపల ఏమి జరుగుతున్నదని దర్శింపరాదు, పరామర్శింపరాదు.
పెదవీరన:
అట్లే జరుగును గాక!
పదునాల్గవదృశ్యము
(స్థలం: మదాలసగృహం. సమయం: ఉదయం 12గంటలు. మహానవమి నాడు మదాలస సరస్వతి ఎదుట వీణాదివాద్యములను, చిఱుగజ్జెలను, నూత్ననాట్యాహార్యము నుంచి పూజించుచు దర్బారికానడ రాగములో క్రిందిపాట పాడుచుండును.)
పల్లవి:
సరసిజాసనురాణి జ్ఞానసంవాసినీ
దీవింపవే నన్ను దివ్యసన్నుత! వాణి!అనుపల్లవి:
కళలెల్ల కుసుమింపఁ గడగంటిచూపులో
నెలవైన గీర్వాణి! నిరతంబు నినుఁ గొల్తు (సరసిజాసను)చరణం 1:
నీపాదమంజీరనినదంబె రవళింప
నాపాదమంజీరనాదంబులోన
నీపల్కుతేనియలె నిండారి ప్రవహింప
నాపల్కుగమిలోన, నాపాటలోన (సరసిజాసను)చరణం 2:
నీనాట్యమునఁ గ్రాలు నిస్తులంబగు హేల
నానాట్యమున కొసఁగ నవ్యచైతన్యంబు
నీవల్లకీజాత నిరుపమక్వణనంబు
నావల్లకికిఁ గూర్ప నవ్యమాధుర్యంబు (సరసిజాసను)చరణం 3:
మందారకుందేందుచందనశ్వేతమై
అందమగు నీరూపు నానందముగఁ గొల్తు
సుందరోజ్జ్వల భావబృందంబులే నీకు
మందిరంబుగఁ జేసి మనఁగాను మది నెంతు (సరసిజాసను)చరణం4:
నాగానమును నీకు నైవేద్యముగఁ జేసి
నాగజ్జియల నీకు నవఘంటికలఁ జేసి
నానాట్యమున నీకు నారాత్రికముఁ జేసి
ఆనందముగ నిన్ను నారాధనము సేతు (సరసిజాసను)
(అనుచు పాడి, భక్తితో సరస్వతికి హారతి నిచ్చును. ఇంతలో మణిప్రభ ప్రవేశించును.)
మదాలస:
ఏమే మణిప్రభా! సమయానికే, సరిగా ప్రసాదం పంచే సమయానికే వచ్చావు. బాగున్నావా? నిన్న రాలేదేం?
మణిప్రభ:
ఇంటినిండా బంధువు లొచ్చారు. వారి సేవకే సరిపోయింది నిన్నంతా. ఈరోజు తీరించుకొని వచ్చా.
మదాలస:
సరే. ఈ దేవీప్రసాదం తీసికో (సరస్వతీప్రసాదమును మణిప్రభ కిచ్చును.)
మణిప్రభ:
(కన్నుల కద్దుకొని ప్రసాదమును గ్రహిస్తూ) అమ్మగారూ! రేపేకదా విజయదశమి. రేపే పినవీరనగారు ప్రభువులవారికి తమ కావ్యాన్ని అంకితం చేసే రోజు.
మదాలస:
నీకెందుకే ఆ కథ! కవిగారు, ప్రభువులూ ఆ విషయం చూచుకుంటారు. ఆ సమయంలో రాజా స్థానంలో పినవీరనగారికి నాట్యనీరాజనం సమర్పింపవలసిందని నాకూ పిలుపు వచ్చింది.
మణిప్రభ:
కాదమ్మగారూ! పినవీరనగారింకా కావ్యమే రాయలేదంట. ఇంతవఱకు రాసింది పిసరంతే నంట. ఈ సంగతి రాయసం సింగన నాకు మొన్న చెప్పాడు. ఆ మాట విన్నప్పటినుండి నాకు బుగులు బుగులు పట్టుకుంది. రేపు గనుక రాజుగారికి అంకిత మీయకపోతే ఆ బాపనయ్య కెట్టి గట్టిశిక్ష పడుతుందో అని నాకొక్కటే బుగులు!
మదాలస:
ఔనే! అదీ నిజమే! ఒప్పందం ప్రకారం రేపటి సభలో గ్రంథాన్ని అంకిత మీయకుంటే అది ప్రభుధిక్కార మౌతుంది. దానికి కఠినశిక్షే పడుతుంది. రోజూ నా నాట్యాన్ని చూస్తూ కాలం గడిపే కవిగారు ఇంటికి వెళ్ళిన తర్వాత కావ్యాన్ని వ్రాస్తున్నారని నేననుకొన్నాను. కాని పరిస్థితి ఇంత విషమంగా ఉందని నేనూహించలేదు. దీనికి పరోక్షంగా నేనే కారణ మయ్యానేమో అనే శంక నన్నిపుడు పీడిస్తున్నది. నాచెంత అంతకాలం గడపకుంటే ఇంట్లో కూర్చొని నిష్ఠగా కావ్యం వ్రాసికొనేవారేమో అనిపిస్తున్నది. (సరస్వతి వైపు తిరిగి) అమ్మా! చదువులతల్లీ! పినవీరన గారిని అనుగ్రహింపుము తల్లీ! వారికే ఆపత్తూ రాకుండ కాపాడుము తల్లీ!
(ఇంతలో పినవీరన ప్రవేశించును. మదాలసామణిప్రభలు లేచి నిల్చొని సాభివాదముగా నతని నాహ్వానింతురు.)
మదాలస:
కవిచంద్రులకు నమస్కారము. ఆసీనులు కండు.
పినవీరన:
శుభమస్తు.
మదాలస:
కవిగారూ! రేపే కదా మీకావ్యసమర్పణమహోత్సవము. కావ్యము సిద్ధముగా నున్నదా?
పినవీరన:
కొంత పూర్తి యైనది. కావలసినది తొంబదిపాళ్ళున్నది.
మదాలస:
మఱి ఇంత నిశ్చింతగా ఉన్నారేమి? ఇంట్లో నిష్ఠగా కూర్చొని వ్రాయవచ్చును కదా! ఇచ్చట కాలవ్యయం చేయడం ఈ సందర్భంలో ఉచితమేనా?
పినవీరన:
కాదు, ఔను కూడ. నా ఉపాస్యదేవతయైన వాణియే ఱేపటిలోగా కావ్యమునంతా పూర్తి చేయిస్తుందని ఆ తల్లినే ఇప్పుడు ఉపాసిస్తున్నాను. ఐనా మనస్సు తగినంత స్థిరంగా ఉండుట లేదు. అద్భుతమైన నీ నాట్యపాండితితో సరస్వతీస్తుతిప్రధానమైన ఒక్క నాట్యం నీవు చేస్తే దానిని చూచి ఆ దేవీస్వరూపాన్ని మనస్సులో స్థిరంగా నిల్పుకొని ఉపాసిస్తే ఫలితం చేకూరుతుందని ఇచ్చటికి వచ్చినాను. నా అభ్యర్థనను తిరస్కరింపవు గదా!
మదాలస:
ఎంతమాట స్వామీ! ఇంతవఱకు నా చెంత గడపుట చేతనే మీ కావ్యరచన కుంటుపడిందని చింతించుచుంటిని. ఈ నాట్యప్రదర్శనము చేత కార్య మనుకూలించు నన్నచో అంతకంటెను నాకు కావలసిన దేమున్నది? తప్పక మీ యభ్యర్థన నంగీకరింతును. (మణిప్రభతో) మణిప్రభా! ఇదిగో వీణ. దీనిని పలికిస్తూ ఉండు. ఈలోపల నేను ఆహార్యం మార్చుకొని నాట్యమునకు సిద్ధమౌతాను.
(అని పలికి నిష్క్రమించి, నాట్యాహార్యముతో ప్రవేశించును. ఆమె ప్రవేశించు వఱకు మణిప్రభ వీణపై ఆమె నటింపబోవు గీతమును పలికించుచుండును. అట్లు ప్రవేశించి ఆమె ఈ క్రింది పాటకు నటింప నారంభించును. పినవీరన సావధానముగా దానిని చూచుచుండును. ఈపాటను హిందోళరాగములో నాట్యమున కనుకూలమైన గమకములతో పాడవలెను.)
పల్లవి:
చిన్తయామి శ్రీకరీం శ్రీసరస్వతీం
బ్రహ్మలోకవాసినీం భారతీంఅనుపల్లవి:
సూరివారశోకభారదూరిణీం
కీరపుస్తకాక్షహారధారిణీం (చిన్తయామి)చరణం 1:
మందారధవళమంజులగాత్రీం
ఇందీవరసమసుందరనేత్రీం
వందారుసుజనవాంఛితదాత్రీం
మందాత్మగతతమశ్చయహర్త్రీం (చిన్తయామి)చరణం 2:
వందేఽహ మంబుజభవదయితే
వందేఽహ మద్భుతగుణకలితే
వందేఽహమఖిలామరవినుతే
వందేఽహమతులదయాసహితే (చిన్తయామి)