ధనుర్దాసు

‘నామదిలోన నివ్వటిలు నవ్యతరప్రణయంపులక్ష్యమై,
నామదియందు సంతతము నర్తనసేయు కళైకరూపమై,
నామదితోఁట నెల్ల సుమనఃపరిపూర్ణముసేయు చైత్రమై,
తామరసాక్షి! కూడితివి ధన్యము సేయుచు నాదుమన్గడన్.

ఆమనిలో కుహూస్వనసమాలపనం బొనరించు కోకిల
స్తోమమనోజ్ఞగానమును, సుందరకచ్ఛపిపై విరించిభా
మామణి పల్కునాదమును మచ్చరికించుచు నున్నదే సఖీ
నీమధురంపుఁబల్కె, యిఁక నీగళగానము చెప్పనేటికిన్?

తమ్ములు గల్వలు న్మఱియుఁ దళ్తళలీనెడు చేపపిల్లయం
దమ్ములు సాటివచ్చు నయనంబుల కంచు వచించు పూర్వకా
వ్యమ్ముల కేమి గాని రుచిరాక్షి! త్వదీయమనోజ్ఞనేత్రయు
గ్మమ్మునుబోలువస్తువు జగమ్మున లేదని యందు రూఢిగన్.

ఆకనుదోయియందున నిరంతరమున్ ప్రభవించు సుందరా
లోకనచంద్రికామృతములోన సమాప్లుతమైన నాదుహృ
ల్లోకమునందున న్మొలకలూనును నవ్యసుఖాంకురంబు, ల
స్తోకముగా సురేంద్రవనిఁ దోఁచు నవాంకురరాజి కైవడిన్.

శృంగార రస మరంద త
రంగములం దేలియాడు రమణీయచలద్
భృంగద్వయమౌగద యో
సింగారీ! నీముఖవికసితలోచనముల్.

మాటలతోఁ బని యేటికి
నీటుగ మాటాడు నీదు నేత్రములుండన్
మాటల కందని వలపులఁ
జాటునుగద చెలి!త్వదీయచక్షుర్ద్వయమే.

లోకోత్తరసుందరమగు
నీకన్నులతోడొదవిన యీలోకంబే
నాక నిభంబుగ నిత్య ము
దాకరమై చెలఁగు నాకు హరిణీనేత్రీ!’

ఈమాడ్కిని నొకయువకుఁడు
ప్రేమావిష్టాత్ముఁ డగుచుఁ బ్రేయసిచెలువున్
సామోదంబుగఁ బొగడఁగ
నామెయు సిగ్గిలుచుఁ బల్కె నాతని కిటులన్.

‘చాలును నాథ! మీపలుకుసందడి, సేతలు, లోకమందునం
గ్రాలెడు నందమెల్ల ననుఁ గావలెనంచును జేరినట్టు లీ
లీలను మీరు వల్కు టగులే పరిహాసము, మ్లానశీలమౌ
పూలను బోలు నీయొడలిపోఁడిమి నింతగ నెన్నఁ బోలునే?

నశ్వరము దేహ మయ్యది నాశమగుట
కంటెముందె యందం బడుగంటిపోవు;
దీనికంటెను శాశ్వతంబైనయట్టి
యంద మున్నచో నది యుపాస్యంబు మనకు.’

అన విని నాతఁడిట్లను, ‘ప్రియాంగన! నీపలు కౌను సత్యమే,
కనుగొన నైన నింతదనుక న్నిను మించిన మంజులత్వమున్
ఘనసుఖదాయకత్వమును గల్గిన వస్తువు ధాత్రియందుఁ, గా
వున మనసార నీదుచెలువున్ భజియింతు ననుక్షణంబునన్.

సాటిలేనట్టి నీకంటిసౌరు గనుచు
పరవశించుచు నుంటిని ప్రత్యహంబు;
తఱుగునో వానియందంబు తరణి సోఁక
ననుచు గొడుగు గప్పుదును నీవరుగు నపుడు.’

అని ప్రియమారఁగాఁ బలుకు నాతని భవ్యసుధోపమానమౌ
భణితము లాత్మయందున నవప్రణయాన్వితభావవీచికల్
పెనుపఁగ నామె యాతనిని పేరగుకౌఁగిట గ్రుచ్చి, తోరమై
చనియెడు మోవితేనియలచాలులఁ దన్పెను నుత్కటంబుగన్.

పరమంబౌ శ్రీరంగే
శ్వరపురనికటంబునఁ గల వరయూరనగం
బరగెడి యూరన్ వసియిం
తురు వారు నితాంతహార్దతుష్టాంతరులై.

కరికరంబులఁ బోలు ఘనదీర్ఘబాహువుల్
        బలలక్ష్మికిం బోల నెలవు లగుచు,
కంచుడాలును బోలు ఘనమైన వక్షంబు
        శౌర్యలక్ష్మికిఁ గ్రాల సద్మ మగుచు,
గిరిశృంగములఁ బోలు వరమాంసలాంసముల్
        కీర్తిలక్ష్మికి నొప్ప గృహము లగుచు,
సాలోపమంబైన సంహననంబు సౌం
        దర్యలక్ష్మికిఁ జెల్ల స్థాన మగుచు,

కర్కశుండయ్యు మల్లరికయ్యమందు
హృదయమార్దవ మింతేని వదలకుండ
అంద మెప్పు డర్చించుచు డెందమందు,
ఆతఁడుండు ధనుర్దాసుఁ డనగ నూర.

అంగము కుందనంపులత, ఆస్యము బంగరుతమ్మి, నాస సం
పంగికి దాయ, హస్తములు పల్లవమిత్రములుం, గచంబులుం
భృంగసదృక్షరమ్యములు, పీనకటిస్థలి భూమి గాఁగ, హే
మాంగి యనంగ నాతని ప్రియాంగన రంగిలు సుందరాంగియై.

వారక కవగూడుచుఁ జను
సారసములవలె నొకపరి సంవీక్షింపన్
శ్రీరంగనితిరునాళ్ళను
వారలు చనిరటకు భక్తిబంధురమతులై.

అచ్చట వారి కక్షిగతమయ్యెను మామిడితోరణంబులం,
బచ్చయనంటియాకులను, పంకజచంపకమల్లికాదిపు
ష్పోచ్చయరమ్యమాలికల నొప్పెడు రంగనితేరు, చెంగటం
బొచ్చెములేనిభక్తిమెయి మూఁగుచునుండ జనంబు దండిగన్.

వివిధదేశంబులందుండి వేడ్కమీర
వచ్చియున్నట్టి భక్తులు వరుసగట్టి
రంగ, శ్రీరంగ, కావేటిరంగ యనుచు
లాగుచుండి రాతేరును లావుమీర.

భజియింప వచ్చెనో వైకుంఠముననుండి
        నారదాదిమునీంద్రవార మిలకు,
సన్నాయిమద్దెల ల్చక్కగా వాయింప
        వచ్చిరో కిన్నరుల్ వరుసగట్టి,
చేరవచ్చెనొ దేవశిల్పీంద్రనిర్మిత
        స్యందనంబే నేఁడు చదలనుండి,
వచ్చెనో విష్ణుండు వైకుంఠముననుండి
        సిరిఁగూడి చెలువంబు మెఱయ భువికి,

నాఁగ మునుముందు భజనబృందములు వోవ,
వారివెన్కను వాదిత్రవర్గ మరుగ,
పైని సిరితోడిరంగనిప్రతిమ లెసఁగు
తేరు తిరువీథులందప్డు తిరుగసాగె.

బ్రహ్మతేజము గల్గు ఫాలభాగమునందు
        పట్టెవర్ధనములు పరిఢవింప,
వెడదయురమ్ముపై విశదంపుజందెంబు,
        తులసిపేరులు కాంతు లొలుకుచుండ,
త్యక్తరోషపురంగు దాల్చెనో యనఁ గ్రాలు
        కాషాయవసనంబు కటిని వ్రేల,
అద్వైతవేదాంతహరణాంకమన మీరు
        యతికేతనము చేత నలరుచుండ,

ధరణిలో విశిష్టాద్వైతసరణికాద్యుఁ
డైనయట్టి రామానుజయతివరుండు
ఛాత్రసంవృతుండయి తదుత్సవమునందు
కనులపండువు సేయుచుఁ గదలుచుండె.

ఆసమయంబందు ధను
ర్దాసుఁడు హేమాంగిమీఁదఁ దపనాతప మిం
తేసియుఁ బడకుండఁగ న
త్యాసక్తిం గొడుగువట్టి యరుగుచునుండన్.

ఎంతచక్కనిదైన నింతేసి గర్వమా
        పతిచేత ఛత్రంబుఁ బట్టించుకొనియె,
ఎంతప్రేముడి యున్న నింత వెలిపుత్తురా
        ఇంటిలోఁ జూపవలె నింతయే కాని,
పతికెంత ముద్దైన సతి సుంతవద్దంచు
        వారింప కీరీతిఁ బ్రకటింపఁ దగునె,
శ్రీరంగనాథునిన్ సేవింప వచ్చిరో
        ప్రణయయాత్రార్థమై వచ్చిరో యిటకు,*

అమ్మ! చూడమ్మ! చక్రవాకమ్ము లట్లు
పాయకింతయుఁ జను ప్రేమపక్షియుగము,
అనుచుఁ బలుతెఱంగుల జనుల్ గొణఁగుకొనిరి;
కాని చనుచుండి రదియేమి గనక వారు.

అట్టిమాటలె యొకశిష్యుఁ డనుచునుండ
వాని నాలించి పూజ్యరామానుజుండు
నళినయుగ్మముఁ బోలిన నయనయుగము
వారిపైఁ జేర్చి యొకసారి తేఱిచూచె.

ఆనతమైన యామెముఖ మానతముం బొనరించు ఛత్రమున్,
కానఁగఁ బ్రక్కలన్ ముఖ మొకంతగఁ ద్రిప్పినఁ ద్రిప్పు ఛత్రమున్,
ఆనన మెత్తినం దగినయట్లుగ నెత్తుచుఁ బట్టు ఛత్రమున్,
కానడు దారిలోనఁ బ్రియకాంతను దక్క నతం డిఁకేమియున్.

సందొకయింత యున్న రవిసాంద్రమరీచులు ప్రేయసీముఖం
బందున సోఁకుచుం గువలయంబులఁ బోలు తదక్షులం గడుం
గందగఁజేయునో యనుచుఁ గప్పుచు ఛత్రము నీగతిం బథం
బందుఁ జరించు నాయువకు నారసి విస్మయమంది మౌనియున్.

‘ఇంతటి యేకాగ్రతతో
నింతిని సేవించు నీతఁడెంతోశుద్ధ
స్వాంతుం, డటు గాకుండిన
నింతటిచిత్తస్థితిత్వ మేవిధిఁ జూపున్.

ఎంత ప్రయత్నమూనినను నింతగ నిల్వదు చిత్త మొక్కచో
నెంతటివారి కైన, నితఁ డీగతి స్వాంతము సంయమించె నా
యింతినిఁగూర్చి, వీనిమన మీ స్థితినుండి మరల్చి యిందిరా
కాంతునిపైని నిల్పునెడఁ గాఁడొకొ వీఁడు మహానుభావుఁడే!’

అనుచుఁ జింతించి రామానుజార్యుఁ డపుడు
శిష్యునిం బంపి రావించెఁ జెంత కతని
అట్లువచ్చిన వాని క్షేమాదు లరసి
పైని నీరీతి పృచ్ఛించెఁ బారికాంక్షి.

‘వింతగఁ జూచుచుండ్రి నిను వీథినిఁబోయెడువారలెల్ల, నీ
కాంతను నిట్లు ఛత్రమునఁ గప్పుచుఁబోవఁగ హేతువేమి? యే
కాంతమునందుఁ జూపఁదగినట్టి ఘనప్రియతానుభావ మీ
పొంతను జూపనేల వినఁబూనెద తెల్పుము మల్లనాయకా!’

నావుడు మల్లుఁడిట్లనె, ప్రణామశతంబులు మౌనివర్య! మీ
పావనదృష్టిపాతమునఁ బ్లావితమై కడుధన్య మయ్యె నా
జీవన మీదినంబున, నిశీథమునందున చంద్రమస్సము
ద్భావమువోలె మీపరమదర్శనభాగ్యము గల్గె నాకిటన్.

ఈకుసుమాంగి నాదుసతి, ఇంతులయందున నింతకంటె ర
మ్యాకృతి నున్నకాంత లరుదంచును నెంతును; ఈమెకన్ను లెం
తో కమనీయమై తనరు, నుష్ణమరీచిగభస్తి సుంతయుం
దాఁకిన నొచ్చు నయ్యవి, తదర్థము ఛత్రముఁ బట్టియుంచితిన్.

ఈకన్నులె నాప్రాణము
లీకన్నులఁ గాచికొనుటయె వినా యన్యం
బౌకార్యము పరమంబై
నాకుం దోఁపదు నిజముగ నంతవ్యాత్మా!’

అట్లు వల్కెడు వాని నత్యంతకరుణ
గల్గు చూడ్కుల మునిమౌళి కలయఁ జూచి
అనియె నీరీతి నాతనిమనమునందుఁ
బొల్చు సౌందర్యదృష్టి మరల్చుమాట.

‘ఈసతికన్నులట్టి రుచిరేక్షణయుగ్మము లోకమందునన్
భాసిల దెందుఁ గన్న నని పల్కుదు వీవు, మఱింతకంటె ను
ద్భాసిమనోజ్ఞనేత్రముల దర్శనమబ్బిన నీవు వానికిన్
దాసుఁడవౌదువా? త్రికరణంబుల నిత్యము వానిఁ గొల్తువా?’

అనవిని నాతఁడిట్లనె ‘మహామహితాత్మ! విమూఢచిత్తుని
న్ననుఁ దమ రీపరీక్షకుఁ బణంబుగఁ జేయుట పాడియౌనె, ఐ
నను వచియింతు నీమె నయనంబులకంటెను రమ్యమైన లో
చనములఁ గాంచఁగల్గుట యసాధ్యమటంచును నిశ్చయంబుగన్.

కావునఁ గాపాడుచు నుం
దీవామాక్షీనయనము లేమఱక సదా
పూవును వృంతం బటులన్
దావినిఁ బూవటుల నేను తత్పరమతినై.

ఐనను మీరలు పలికిన
యానయనంబులను జూడ నాత్రము గలిగెన్
వానిం జూపఁగ నెంచిన
మీ నిశ్చయమిద్ది నాదుమేలునకె కదా!’

అని వినయంబునం బలుకు నాతని భూరిదయార్ద్రదృష్టితోఁ
గనుచును బల్కె మౌని, ‘యువకాగ్రణి! ఱేపు మదీయశిష్యునిన్
నినుఁ గొనిరాఁగఁ బంపెదను, నీకొనగూడునుగాక తన్మనో
జ్ఞనయనదర్శనోత్సవము, జన్మము ధన్యత నొందుఁగావుతన్’

ఆమఱునాఁడే వచ్చెను
రామానుజగురునిశిష్యరత్నము, కొనిపో
గా మల్లుని రంగేశ్వర
ధామస్థితవైష్ణవమఠధామంబునకున్.

ఏడు ప్రాకారములతోడ నిలను వెలయు
పరమవైకుంఠధామంబుభాతిఁ దనరు
రంగనాథాలయంబునందుం గలట్టి
మఠమునందు రామానుజమౌనిఁ గాంచి.

భాసురభక్తితోడ నభివాద మొనర్చెడు మల్లునిన్ ధను
ర్దాసునిఁ గాంచి మౌని యనురాగభరోక్తులఁ దన్మనంబు ని
స్త్రాసముఁజేసి యట్లు శమితప్రతిపద్యుతుఁడైన యాతనిన్
శ్రీశునిసన్నిధిం గనఁగఁ జేకొనిపోయి వచించె నీవిధిన్.

‘నీసతినేత్రమంజిమను నీవెపుడుంగనుగొంచుఁ దన్నిధి
ధ్యాసనిబద్ధచిత్తమున నన్యముఁ గానవొ యట్టి గాఢని
ష్ఠాసితచిత్తవృత్తిమెయి నారయుమో యువకాగ్రగణ్య! శ్రీ
వాసునిదివ్యసూర్యవిధుభాసురచారుతరాక్షియుగ్మమున్’

అనఁగఁ ద్యక్తాన్యచింతాత్ముఁడై యతండు
నిష్ఠతో రంగనాథునినేత్రయుగము
నరసి యతిలోకనూతనాత్మానుభూతి
జనితహర్షాశ్రుఁడై యిట్లు సంస్తుతించె.

‘ఏ మీవైభవ మేమి యేమి యకటా! యీనేత్రయుగ్మంపుశో
భామాహాత్మ్యము, ప్లావితంబగుచు నీభవ్యప్రభాపూరమం
దేమోనూతనభావసంకలితమై యీకాయ మీచేతమున్
సామోదంబుగఁ బొంగుచున్నయది శ్రీశా! రంగనాథా! హరీ!

ఒకనేత్రంబు సమస్తసృష్టి కిలలో నుత్తేజముం గూర్చు, వే
రొకనేత్రంబు సుధాప్రసేకమున సర్వోత్కృష్టమై యోషధి
ప్రకరంబున్ బెనుపొందఁజేయు, నిటులన్ భద్రాత్మకంబైన నీ
ప్రకటాలోకరుచిప్రసారమున నన్బాలింపవే శ్రీహరీ!

ఏమనియందు దేవ! భవదీక్షణయుగ్మకదివ్యతేజముం
గామనసేయుచిత్తమును గానక కేవల మింతకాలముం
గామినినేత్రయుగ్మమె యఖండసుఖప్రదమంచు నెంచి మి
థ్యామతినై చరించితిని; వ్యర్థముఁ జేసితి నెల్లజన్మమున్.

ఇప్పటికైన నీదు పరమేక్షణశోభల మున్గితేలుచుం
దప్పని భక్తిచే నిను దినంబులు మాసములున్ శరత్తులుం
గొప్పగఁ గొల్చుచన్యమగు కోరికలం ద్యజియించు చేతముం
జొప్పడఁజేయవే ద్విరదశోకనివారక! దీనపాలకా!

అతని తీక్ష్ణాక్షియే కూర్చు నఖిలలయము
నీదు తీక్ష్ణాక్షియే కూర్చు నిఖిలజయము
హరహరిప్రకృతుల కిదె యంతరమ్ము
అందుచే నాశ్రయింతు నిన్నర్కనయన!’

అనుచు మకరందపూర్ణంబులైనయట్టి
నళినములలీల నశ్రుపూర్ణంబులైన
కనులతోడ, గద్గదకంఠనినద మమర
హరిని వినుతించి, యతఁడాలయంబునందె.

ఒక్కమూలనుగూర్చుండి యొడలు మఱచి
మనసు నూల్కొల్పి గాఢసమాధియందు
అపరవాల్మీకిచందాన హరినిఁ గూర్చి
కాలగతి నెఱుఁగక ధ్యానకలితుఁ డయ్యె.


వేకువ నేఁగినట్టి తనపెన్మిటి యెంతకు రాకపోవఁగా
వ్యాకులమొందు చాతని ప్రియాంగన వానిని, వానిఁ బిల్వఁగా
వేకువ వచ్చినట్టి మునిభృత్యుని, మౌనిని సైతము న్నవో
ద్రేకముతోడ మానససృతిం దలపోయుచు నిట్లు చింతిలెన్.

‘స్వామి! క్షణంబులోన మునివర్యునిపన్పును పూర్తిచేసి, నీ
మోమున చిత్రకంబుతడి పూర్తిగ నారకముందె వత్తునం
చేమొ ప్రియోక్తులం బలికి యెంతకు రావిది యేమి న్యాయ, మ
య్యో మునిచెంత నీవును మఱొక్క మునీంద్రుఁడ వైతివో సఖా!

‘నీకనునీడలం దెపుడు నిల్చెద, నాకనుపాపలందు ని
న్నేకననెంతు నెప్పుడు, త్వదీక్షణయోగములేనిచో క్షణం
బే కదలాడు కల్పమయి’, యీగతిఁ బల్కిన తేనెమాటలం
జేకురినట్టి తేనియలచే దెదొ యిప్పుడు తేలె నోసఖా!

నీకనులందు భాసిలెడు నిస్తులసుందరకాంతిరేఖలున్,
నీకనులందుఁ గన్పడెడు నిస్తులసుందరభావరేఖలున్
నీకనులందు విన్పడెడు నిస్తులసుందరవాక్యరేఖలున్
లేక క్షణంబు నేను మనలేనని యంటి వదేమియయ్యెనో?

నీకన్నుల సౌందర్యము
లోకోత్తరమంచు నిచ్చలుఁ బొగడు ప్రియునిన్
నాకన్నులఁ గననైతిని
ఏ కలుషపుఫలమొ యిద్ది యెఱుఁగగ నైతిన్.

కాషాయంబులు గట్టఁ బంచితివొ, భిక్షాపాత్రమున్ బాణికిన్
భూషాప్రాయముగా నొనర్చితివొ, సంపూర్ణంబుగా వర్జ్యమౌ
యోషాసంగమ మంచుఁ దెల్పితివొ, అయ్యో! ఎల్లసంసారమే
దోషంబంచును బోధచేసితివొ నాథుం బిల్చి రామానుజా!

అట్లు గాకున్న హేమాంగి నతఁడు విడిచి
యెట్టు లుండఁగలాడు దా నింతసేపు?
చేరఁగారాడె నన్నెడఁజేయకుండ
కవను వీడని చక్రవాకంబువోలె.’

అనుచుఁ బరిపరితెఱఁగుల వనటనొంది
చింత యొనరించు నాయింతి చివరి కరిగి
స్వయముగా రంగనాథునిసద్మమునకు
అరయఁగా నెంచెను యథార్థమైన స్థితిని.

కావేరికావారి ఘనమైనమణివోలెఁ
        దేలిన రమ్యంపుద్వీపమందు
ఏడుప్రాకారంబు లె‌త్తైనగోపురం
        బులును వైష్ణవమఠంబులును గలిగి,
పుష్పవనంబులు, పుష్కరిణులు, పాక
        శాలలు, భద్రేభశాల లొనర,
ప్రణవరూపాన్వితస్వర్ణమయవిమాన
        మండితం బగు గర్భమండపమున,

పాన్పుగాఁ జుట్టుకొనియున్న పాఁపఱేని
ఫణమె గొడుగుగ శయనముద్రను దనర్చు
రంగనాథుని రమ్యవిగ్రహము నామె
కనియె నారీతి దేవళంబునకు నరిగి.

ఆరమ్యంబగు విగ్రహ
మారయు నామెకు ననుభవ మయ్యెను తన్నుం
దేఱికనుంగొనుచున్నటు
లారంగఁడె విస్ఫుటనయనాబ్జద్వయుఁడై.

అయ్యది కాంచి యాపడఁతి యద్భుతభక్తిసమంచితాత్మయై
చయ్యనఁ దన్నుఁ దామఱచి చక్షువు లర్ధము మూసి శ్రావ్యమౌ
తియ్యనికంఠనాదమున దీనదయాళుని రంగనాథునిన్
నెయ్యముమీర సంస్తుతి ననేకవిధంబులఁ జేయసాగినన్.

ఆసమయాన గర్భనిలయాంతికమందలి మూలయందు ను
ద్భాసితభక్తియుక్తి భగవంతుని ధ్యానము సేయు నా ధను
ర్దాసునివీనులందు దయితాగళనాదము సోఁకె, నంత నా
స్త్రీసవిధంబు నంది వినుతించెను రంగని నాతఁ డీగతిన్.

‘రంగ! అవ్యాజకరుణాంతరంగ! అండ
జాధిపశతాంగ! నిస్తులాబ్జాస్యకాంతి
సంతతివ్యాజసుమరసాస్వాదశీల
సాధుజనభృంగ! నిస్సంగసంఘసంగ!

చక్రంబు, లక్ష్మియు, జలజాతసూతియు
        నాయుధం, బర్ధాంగి, యాత్మజుండు
చంద్రుండు, చైద్యుండు, జలజాతబాణుండు
        స్యాలుండు, శత్రుండు, సత్సుతుండు
వైకుంఠ, మహిరాజు, పక్షీశ్వరుండును
        గేహంబు, తల్పంబు, వాహనంబు
కనకంబు, కనకంబు, కస్తూరినామంబు
        చేలంబు, హారంబు, చిత్రకంబు

కౌస్తుభము, నందకమ్ము, గంగాఝరమ్ము
సొమ్ము, ఖడ్గమ్ము, పూతపాద్యమ్ము నగుచుఁ
బొలయ నే వేల్పు త్రైలోక్యపూజ్యుఁ డగుచు
వెలయు నావేల్పు రంగనిఁ గొలుతు సతము.

నీరమణీయరూపమును నిచ్చలు నర్చనసేయకుండినన్
నీరుచిరాంఘ్రిమాల్యమును నిచ్చలు నౌదలఁదాల్పకుండినన్
నీరుచిరంపుకీర్తనల నిచ్చలు గానము సేయకుండినన్
సారములేనిదౌనుగద జన్మము నిష్ఫలకాండమట్లుగన్.

అన్యమగు వ్యాపకంబుల నవలఁ బెట్టి
నీదుపదసేవ నిచ్చలు నిష్ఠతోడ
సల్పు మనుజుండె మనుజుండు సత్యముగను
లేని మనుజుండు దనుజుండె యౌను రంగ!

నీముఖచంద్రికల్ విరియునేలను నేను చకోరకంబునై
నీమృదుపాదధూళి గల నేలను నేనొక ఱెల్లుపోఁచనై
నీమధురోక్తి విన్పడెడు నేలను నేనొక రామచిల్కనై
సామి! సిరంగదేవర! పసందుగ వాసముసేయఁ గోరెదన్.

ఎన్ని జన్మల నీయాత్మ గన్నదొ మఱి,
ఉన్న యీజన్మమందున నిన్నుఁ గొలిచి
జన్మరాహిత్యమొందెడు సత్పథంబు
మాకుఁ గల్పింపు మోరంగ! మంజులాంగ!

ఇద్ది మనలోనిమాట యో యిందిరేశ!
అవధరింపుము పెఱవారి కందకుండ,
మోక్షమీయంగ నీకు నీపుడమియందు
లేడు నాకంటె నర్హుండు లేడులేడు.

నాది యన్నది లేదయ్య నళిననయన!
ఎల్లజగములు, సృష్టియు, నెల్లసిరులు
నీవె కావున నీకు నింకేవి యిత్తు;
ఐన కరుణింప మాన కీయల్పనరుని.

మాటలు పెక్కులేటికిరమాప్రియ! ఉన్నవిధంబు నంతయుం
జాటితి నీకు నింక నను సాదరబుద్ధిని నాదుకొందువో,
ఏటికి వీనిగోల యని ఏమఱుపాటున సంత్యజింతువో,
నీటనుముంతువో వికచనీరజలోచన! పాల ముంతువో?’

అని యుద్యద్ఘనభక్తిసంకలితచిత్తాంభోజులై సర్వ మా
యినచంద్రాక్షుని చల్వయే యనుచు లంకేశానుజాతుండు ము
న్నినగోత్రాంబుధిచంద్రుఁ గోరినటు రంగేశాంఘ్రిపద్మస్థితా
ననులై కోరిరి తత్కృపాయుతశరణ్యప్రాప్తి వారంతటన్.

ఆనళినాక్షి, యాయువకుఁ డవ్విధి రక్తికిమాఱు భక్తినిన్
మానసమందుఁ గీల్కొలిపి మాధవుఁ గొల్చుచు సంతతంబు, రా
మానుజు నాశ్రమంబున నిరామయులై వసియించుచున్, రమా
జానికృపావిశేషమున జన్మవిముక్తినిఁ గాంచి రిమ్ముగన్.

రంగనిపైని భారమిడి, రంగనినే నెఱనమ్మి, రంగఁడే
సంగడికాఁడు, చుట్టమని, చల్లగఁ గాచెడి దేవదేవుఁ డా
రంగఁడె యంచుఁ దచ్చరణరమ్యపదంబును జేరువారి కా
రంగఁ డొసంగకుండునె పురాకృతకర్మజజన్మముక్తులన్.

రంగా!రంగా! యనుచుం
బొంగారెడు భక్తితోడఁ బూజించెడు ని
స్సంగుల కాతఁడు భవభయ
సంగంబును బాపకున్నె చల్లనికృపచేన్

[ఇది భగవద్రామానుజుల చరిత్రయందలి నొక సన్నివేశము నాధారముగా గొని వ్రాసినది.

* ఇది సీసతుల్య పద్యము. నాదృష్టిలో ఇది పూర్వసీసపద్యాన్ని కొంచెంగా మారిస్తే వచ్చే సీసమువంటి నూతనమైన ఛందస్సు. ఇందు పూర్వసీసంలో వలెనే నాల్గు పెద్దపాదాలు (వీటిని రెండు లైన్లుగా వ్రాయడం పరిపాటి), ఆ తర్వాత ఒక తేటగీతి కాని, ఆటవెలది కాని, ఇతరమైన మాత్రాఛందోబద్ధమైన చిన్నపద్యం గాని ఉంటుంది. ఇందు ప్రతిపాదంలోని ఉత్తరార్ధం ద్విపదలాగ ఉంటుంది. అంటే పూర్వసీసపద్యంలో ఉత్తరార్ధంలో రెండు ఇంద్రగణాలపైన రెండు సూర్యగణాలుండగా, ఈఛందంలో ద్విపదలోవలె 3 ఇంద్రగణాలపైన ఒక సూర్యగణం ఉంటుంది. ఇట్లాంటి కొంచెం మారిస్తే జనించే నూతనఛందాలకు నేను సీసతుల్యములనే (సీ.తు) పేరు వాడుతుంటాను.]