కవిత్వం పుట్టిన నాటినుండి — కామవశములైన క్రౌంచమిథునంలోని పోతుపక్షిని నిర్దాక్షిణ్యంగా నిషాదుడు వధింపగా ఏకాకియై విలపించే పెంటిపక్షిపోరును చూచి దయార్ద్ర హృయావేశపరిపూరితుడైన ఆదికవి వాల్మీకినోట అప్రయత్నంగా వెడలిన “మా నిషాద” అనే శ్లోకం పుట్టిననాటినుండి — కవిత్వానికి, ఛందస్సుకుగల ఘనిష్ఠసంబంధాన్నిగుఱించి చర్చలు సాగు తూనే ఉన్నవి. కాని ఛందస్సు రామాయణంతోటే ఆరంభం కాలేదు. అంతకంటె అతిపూర్వములైన వేదాలలో చాలా భాగాలు ఛందోమయంగానే ఉన్నవి. వేదమంత్రాలు పఠించేందుకు ముందుగా, ఆమంత్రానికి కారకుడైన ఋషిని, అధిపతియైన దేవతనూ, అది చెప్పబడిన ఛందస్సును ముందుగా ధ్యానించి, ఆ తర్వాతనే మంత్రాన్ని పఠించడం పరిపాటి. మనం తెలుగులో ఈనాడు వాడుకొనే సీస,గీతపద్యాల లక్షణాలు వేదాలలో ఉన్నాయని 18వ శతాబ్దికి చెందిన పొత్తపు వేంకటరమణకవి తన లక్షణశిరోమణిలో సోపపత్తికంగా నిరూపించినాడు.
తెలుగులో ఆదికవి నన్నయ మహాభారతం వ్రాసిననాటినుండీ నేటివఱకు సంప్రదాయకవులు ఛందస్సులోనే కవిత్వాన్ని వ్రాస్తున్నారు. విశ్వనాథ సత్యనారాయణగారు “కవిత్వమును ఛందస్సులోనేవ్రాయవలెను” – అని చెప్పి కొన్నారు. ఐతే ఈనాడు వచనకవిత్వప్రాబల్యంవల్ల కవిత్వానికి ఛందస్సుతో ప్రమేయంలేదనే వాదన బలవత్తరంగా వినవస్తూ ఉన్నది. నేటి వచనకవులకు గురుస్థానంలో నున్న శ్రీశ్రీగారు ఛందస్సర్పపరిష్వంగవిముక్తమైనదే నవ్యకవిత్వమని మహా ప్రస్థానంలో వ్రాసికొన్నారు. ఇది ఈనాటి వచనకవులకు వేదవాక్యంలాగ భాసించడం సహజమే. ఆంగ్లభాషలో బయలుదేరిన అచ్ఛంద, స్వచ్ఛందకవితోద్యమం తెలుగుకవిత్వానిపై చూపిన ప్రభావంకూడ ఈవిధమైన ధోరణికి కారణమని మనం గుర్తించవచ్చు. శ్రీశ్రీగారు స్వయంగా స్విన్బర్నుకవిచేత ప్రభావితుడైనట్లు, వారి మహాప్రస్థానంలోని కొన్ని ఖండికలు చెప్తు న్నాయి.
ఈవ్యాసంలో నేను కవిత్వానికి ఛందస్సు అవసరమా, అనవసరమా అనే వాదానికి తలపడడంలేదు. ఛందస్సులో వ్రాసిన సంప్రదాయకవులను భూషించడం లేదు, వ్రాయని వచనకవులను దూషించడం లేదు. కాని, సంస్కారవంతుడైన కవికి కవితావేశం కల్గినప్పుడు వెలువడే కవిత్వంలో ఛందస్సు స్వయంభువుగా – అంటే తనంతకు తానే – ఉద్భవిస్తుందని నిరూపించ దలచుకొన్నాను. అందుకొఱకే ఈ ప్రస్తావనకు “ఛందోధర్మము” అని పేరుపెట్టుకొన్నాను.
ఐతే, వచనకవిత్వం వాడవాడలా వినవస్తున్న ఈరోజుల్లో ఛందస్సును గుఱించిన ఈ విచారం కేవలం ఛాందసం కాదా? అని కొందరడుగవచ్చు. వచనకవిత్వాన్ని వ్రాసినంతమాత్రాన ఛందస్సును గుఱించి తెలిసికొనగూడదని, దాన్ని గుఱించి విచారింపగూడదని ఎవ్వరూ నిషేధింపలేదు. పైగా ఈరకమైన విశ్లేషణ వచనకవులకుగూడ హితంగాను, వారి క్రాఫ్టును నిశితంచేసేందుకుగాను తోడ్పడుతుందని నా విశ్వాసం.
“సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయమ్|
ఏకమాపాతమధరం, అన్యదాలోచనామృతమ్||”
అని ఉన్నదేకదా! సంగీతము, సాహిత్యము రెండూ గొప్పకళలు. సాహిత్యం లేకుండా సంగీతం వుండవచ్చు – పాశ్చాత్య దేశాలలో వందలాది వాద్యసంగీతకారులు చేరి వాయించే సింఫనీలు, ఆకాశవాణిలో తరచుగా వినిపించే వాద్యగోష్ఠులు ఇట్టివి. అట్లే సంగీతం లేకుండా సాహిత్యం వుండవచ్చు. దీనినే మనం వచనం అంటాము. ఆంధ్రప్రభాపత్రికలలోని కథానికలలోను, ఈనాడు కొల్లలుగా ప్రచురితమౌతున్న నవలలలోను ఉండేది వచనం. ఒక అందమైన అమ్మాయి వుంది. ఒక అందమైన అబ్బాయి ఉన్నాడు. వారు వ్యస్తంగా ఉన్నప్పటికంటే వారి ప్రేమమయమైన సాహచర్యం మఱింత పర్యాప్తంగా వుంటుంది. ఉద్యానవనంలో ఒక గున్నమామిడి ఉన్నది. ఒక మాధవీలత కూడ ఉన్నది. కాని అవి వేఱువేఱుగా ఉండే దానికంటే మాధవి మామిడిచుట్టూ అల్లుకొని నిండారినపూలతో నవ్వతూ వుంటే మఱింత అందంగా వుంటుంది. ఇటువంటిదే సంగీతసాహిత్యాల కుండే సంబంధం. సాహిత్యం సంగీతమయమైతే దానిని మనం పాట అంటాం. పాటలో పదానికంటే నాదానికే అధిక ప్రాముఖ్యం. నాదానికంటె పదానికి ప్రాముఖ్యమధికమైనప్పుడు మనం దాన్ని పద్యమంటాం. పదాని కీవిధంగా నాదసౌష్ఠ వాన్ని చేకూర్చేదే ఛందస్సు.
ఛందస్సనేది భాష కెవరో ఒకరు పెట్టినటువంటి అలంకారంకాదు. అది ఇజాలకు, గిజాలకూ, వాగ్వివాదాలకూ, అరస,విరసవిచక్షణలకూ లోబడింది గాదు. అది భాషలోగల పదాల అమరికలోంచి స్వయంభువుగా పుట్టుకొచ్చే నాద లక్షణం. చక్కని అంగాల పొందికనుండి అందమెలాగ స్వయంభువుగా భాసించి సర్వులనూ ఆనందపరవశులను చేస్తుందో చక్కనిపదాలపొందికనుండి ఛందస్సు తనకుతానుగా ఆవిర్భవించి కవిత్వానికి నాదసౌష్ఠవం చేకూరుస్తుంది. భావావేశం కలిగినప్పుడు కవితాత్మ ఛందస్సులో అప్రయత్నంగా ఘోషిస్తుంది. బాధితమైన క్రౌంచమిథునాన్ని చూచినప్పుడు ఆవేశ పూరితమైన ఆదికవి కవితాత్మఘోషయే అనుష్టుప్ ఛందంగా ఈవిధంగానే రూపొందిందని అందఱూ ఎఱిగినదే. దీనిని చర్వితచర్వణం చేయడం అనవసరం.
ఈ సందర్భంలో ఇటీవలి నా అనుభవాన్ని ఉదాహరింపలేకుండ ఉండలేను. అమెరికావాసులందఱికీ తెలుసు. కెనడా cold country అని. US లో చల్లగా ఉన్నపుడెల్లా Canadian Arctic Weather ను వారు నిందిస్తుంటారనికూడా నాకు తెలుసు. మొన్నటి మేనెలలో విన్నిపెగ్‌లో ఒకరోజు 22 డిగ్రీలు, ఆ మఱునాడే రెండు డిగ్రీలుండి, మంచుకూడ కురిసింది. ఈ విషయాన్నిగుఱించి మాట్లాడుతూ నేనొక మిత్రునితో
Yesterday it’s twentytwo,
Today it’s Two,
అని అన్నాను. అతడు హఠాత్తుగా,
It’s lousy that’s true.
అని పూరించాడు. నాకే ఆశ్చర్యమైంది. కలిపి చదివితే అంత్యప్రాసతో ఈ మూడువాక్యాలూ ఒక హైకూలాగ అయాచి తంగా తయారైనాయి. ఇది గొప్ప Poetry అని నేను చెప్పడం లేదు. భావావేశంవల్ల చేకూరిన పదాలకూర్పువల్ల నాదసౌష్ఠవ మెట్లా అయాచితంగా ఉద్భవించిందని చెప్పడమే దీని లక్ష్యం. ఇందులో ఛందస్సు శిథిలరూపంలోనైనా అయాచితంగా ఉద్భవించింది.
మఱొక ఉదాహరణం తీసుకొందాం. ఛందస్సర్పపరిష్వంగంనుండి కవితాకన్యను విముక్తి చేయ బద్ధకంకణుడైన శ్రీశ్రీ గారు కవిత్వాన్ని గుఱించి వ్రాసిన ఈ ఖండికను గమనించండి:
“కద-లేదీ, కద-లించే-దీ,
మా-రేదీ,- మా-ర్పించే-దీ,
పా-డేదీ,- పా-డించే-దీ,
పెను-నిద్దుర- వద-లించే-దీ,
మును-ముందుకు- సా-గించే-దీ,
పరి-పూర్ణపు- బ్రతు-కిచ్చే-దీ,
కా-వాలోయ్- నవ-కవనా-నికి” (చతురస్రగతి: 2+4+2+4+2)
తన కవితాకన్య ఛందస్సర్పపరిష్వంగంనుండి విముక్తురాలైందని ఘోషించే ఈ ఖండికను చూడండి. ముందుగా ఆయన పాదాల విఱుపును చూపి, ఆ తర్వాత అందులో గల లయను స్పష్టీకరించేందుకుగాను, ఈ పాదాలను మాత్రాబద్ధంగా సంధించి చూపుతున్నాను.
“పుంఖానుపుంఖంగా
శ్మశానాలవంటి నిఘంటువుల దాటి,
వ్యాకరణాల సంకెళ్ళు విడిచి,
ఛందస్సుల సర్పపరిష్వంగం వదలి –
వడిగా, వడివడిగా
వెలువడినై, పరుగిడినై, నాయెద నడుగిడినై
ఆ చెలరేగిన కలగాపులగపు
విలయావర్తపు
బలవఝ్ఝరవత్ పరివర్తనలో,
నే నేయే వీథులలో
చంక్రమణం చేశానో,
నా సృష్టించిన గానంలో
ప్రక్షాళిత మామక పాపపరంపర
లానందవశంవదహృదయుని జేస్తే –”
“పుంఖా|నుపుం|ఖంగా|
శ్మశా|నాల|వంటి| నిఘం|టువుల| దాటి|
వ్యాక|రణా|ల సం|కెళ్ళు| వదలి| (గణానికి 3 మాత్రల త్ర్యస్రగతి)
ఛం|దస్సుల| సర్పప|రిష్వం|గం| వదలి –
వడి|గా, వడి|వడిగా| వెలువడి|నై|
పరు|గిడినై,| నాయెద| నడుగిడి|నై|
ఆ| చెలరే|గిన కల|గాపుల|గపు|
విల|యావ|ర్తపు బల|వఝ్ఝర|వత్
పరి|వర్తన|లో, నే|నేయే|వీథుల|లో
చం|క్రమణం|చేశా|నో, నా| సృ|
ష్టిం|చిన గా|నంలో| ప్రక్షా|ళిత|
మా|మకపా|పపరం|పర లా|నం
దవ|శంవద|హృదయుని| జేస్తే — (చతురస్రగతి – 2+4+4+4++2)
పై గేయాలు సలక్షణమైన మాత్రాచ్ఛందస్సులో సాగినవి. త్ర్యస్రగతిలో నడిచే 3 పాదాలు మినహాయిస్తే, మిగితా పాదాలన్నీ చక్కని చతురస్రగతిలో నడుస్తున్నాయి. అంతేకాక మొదటి ఖండికలో అంత్యప్రాసకూడ పాటింపబడింది. అంటే ఈ మహాకవి కవితాత్మను అతనికే తెలియకుండా ఛందస్సర్పం కాటేసిందన్న మాట. పై శ్రీశ్రీగారి గేయాన్ని, ఈక్రింది గేయంతో పోల్చిచూడండి:
“చరణములన్
గనకస్ఫుటనూపురజాలము ఘల్లనుచుం జెలఁగన్,
గరములఁ గంకణముల్ మొరయన్,
నలిగౌ నసియాడఁ, గుచాగ్రములన్ సరులు నటింపఁ, గురుల్ గునియన్,
విలసన్మణికుండలకాంతులు విస్ఫురితకపోలములన్ బెరయన్
వ్రజసుందరు లంద ఱమందగతిన్…”
ఈ గేయ మెవ్వరిదా అని మీరు విస్తుపోతూ ఉండవచ్చు – ఈ విడ్డూరాన్నినేను తీరుస్తాను – ఇది పోతనమహాకవి శ్రీమద్భాగ వతంలోని దశమస్కంధంలో బలరాముని చూడవచ్చిన గోపికల యవస్థను వర్ణంచే గేయం – కాదు కాదు – కవిరాజవిరాజిత మనే పద్యం. అన్ని పద్యాలు వ్రాసినట్లు గణబద్ధంగా దీనిని 4 పాదాలలో వ్రాస్తే, దీని స్వరూప మీవిధంగా ఉంటుంది (నేనిక్కడ ఇందులో గల చతుర్మామాత్రాగణబద్ధమైన లయను ఊర్ధ్వరేఖలతో వ్యస్తంగా చూపెట్టినాను):
“చరణము|లం గన|కస్ఫుట|నూపుర|జాలము| ఘల్లను|చుం జెల|గన్
గరములఁ| గంకణ|ముల్ మొర|య న్నలి|గౌ నసి|యాడ గు|చాగ్రము|లన్
సరులు న|టింపఁ గు|రుల్ గుని|యన్ విల|సన్మణి|కుండల|కాంతులు| వి
స్ఫురితక|పోలము|లన్ బెర|యన్ వ్రజ|సుందరు|లంద ఱ|మందగ|తిన్..”
మఱొక వచనకవి కాళోజీ నారాయణరావు వ్రాసిన ఈ ఖండికను గమనించండి:
“వెనుకకు చూస్తే భూతం
కనుపించును చూడకు అటు,
లభ్యంకాని భవిష్యం
లక్షిస్తూ రభసపడకు,
వర్తమానం వ్యర్థం చేయని
కర్తవ్యం నీదని మఱువకు,
పశ్చాత్తప్తులు పూర్వతప్తులు
ప్రస్తుత మెఱుగని వ్యక్తులు వ్యర్థులు.”
ఇది చక్కని చతురస్రగతిలో నడిచే గేయం. అంతేకాక నియతంగా యతియో ప్రాసయతియో ఈ ఖండికలో ఉండటం విశేషం. అంటే ఈకవి కవితావేశాన్ని మఱింతఘాటుగా ఛంద స్సర్పం కాటువేసిందన్నమాట!
పై ఉదాహరణాలను పేర్కొనడంవల్ల నేను చెప్పదలచిందేమంటే, ఛందస్సనేది కృత్రిమమైన ఆభరణంగాదు. సంస్కారవంతుడైన కవికి కవితావేశం కలిగినప్పుడు దొరలే పదబంధాలలో స్వాభావికంగా సముద్భవమయ్యే నాదగుణం. నా వాదానికి లక్ష్యమింతమాత్రమే కాని, ఛందస్సులో వ్రాశారని ఈవచనకవులను విమర్శించడం కాదు.
మౌలికమైన ఛందోలక్షణాలను గఱించి తెలియనివా రరుదుగా ఉంటారు. ఐనా సందర్భపరిపుష్టికై మళ్ళీ వాటిని గుర్తుచేస్తాను. తెలుగులో ఛందస్సులను అక్షరఛందస్సులని, మాత్రాఛందస్సులని రెండురకాలుగా విభజింపవచ్చు. ఉత్పల, చంపక, మత్తేభాదివృత్తాలు అక్షరచ్ఛందస్సులకోవకు చెందినవి. ఒకటినుండి 26 గుర్వక్షరాలను క్రమంగా వ్రాసి, వానిని ప్రస్తారం చేస్తే కోట్లాది అక్షరచ్ఛందోవృత్తాలు నిష్పన్నమౌతాయి. ఐతే ఒకటి గుర్తుంచుకోవాలి, ఇట్లు కోట్లాది అక్షరగణ వృత్తాలున్నప్పటికీ మన తెలుగులో దదాపుగా 50,60 వృత్తాలకంటె ఎక్కువ ప్రచారంలో లేవు. వీనిలోనూ పాదానికి 20 అక్షరాలుండే ఉత్పల, మత్తేభవృత్తాలకూ, పాదానికి 21 అక్షరాలుండే చంపకమాలకూ, 19 అక్షరాలుండే శార్దూలవృత్తానికీ ఉన్నంత వ్యాపకం ఇతరవృత్తాలకు లేదు. ఈ అక్షరవృత్తాలకుండే ఇతరలక్షణాలు యతిప్రాసలు. యతిప్రాసల గుఱించి చాలామందికి సామాన్యంగా తెలిసేవుంటుంది. ఐనా పరిపూర్ణతకై వాని లక్షణాలను సంగ్రహంగా చెప్తాను. పాదాద్యక్షరముతో పాదమునందు నిర్ణీతస్థానములో స్వరమైత్రి కలిగిన మిత్రాక్షరమును వేయుట యతి వేయుట అనబడును. మొదటి 9 ఛందస్సులలోని పాదములు చిన్నవిగా నుండుటచే వానికి యతినియమము లేదు. 10 అక్షరములకు పైబడిన పాదములున్న వృత్తములకే యతినియమము. పాదమునందలి రెండవ అక్షరమునకు ప్రాసాక్షరమని పేరు. అదే రెండవ అక్షరము అన్ని పాదములలో సమముగా నుండుటయే ప్రాసలక్షణం. ఉదాహరణంగా, ‘హ’ కారం యతిగా, ‘ర’కారం ప్రాసగా గలిగిన శ్రీమద్భాగవతంలోని పోతనమహాకవీశ్వరుని ఈ హృద్యమైన పద్యాన్ని చూడండి:
“హారికి, నందగోకులవిహారికిఁ, జక్రసమీరదైత్య సం
హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీమనో
హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా
హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్.”
ఆధునికు లనేకులు ఈ యతిప్రాసలెందుకుండాలి? సంస్కృతంలో ప్రాసనియమం లేనేలేదు. యతియైనా పదవిరామమే కాని, తుల్యాక్షరం వేయాలనే నియమం లేదు. మఱి తెలుగులో ఈ బాధలెందుకు? అని అడుగవచ్చు. ఇంతకుముందు మనం చెప్పు కున్నాం – పదసంచయనంవల్ల సంగీతసౌలభ్యం, శ్రుతిసుభగత్వం చేకూర్చడమే ఛందస్సుయొక్క ప్రయోజనమని. హిందీ లోను, ఇంగ్లీషులోను అంత్యప్రాసలను వాడటం అలవాటు. ఉదాహరణం:
The lovely Helen launched a mortal strife
When Paris the Prince plotted to gain a wife
ఇక్కడ strife కు wife కు మధ్య అంత్యప్రాస. దీన్నే ఇంగ్లీషులో Rhyme అంటారు. అట్లే lovely, launch లలోని లకారాలకూ, Paris, plotted లలోని పకారాలకూ యతిమైత్రి ఉందని చెప్పవచ్చు. ఈ విశ్లేషణప్రకారం మన తెలుగులోని ప్రాసను ఆది Rhyme గా గుర్తింపవచ్చును. అంటే ఇంగ్లీషు,హిందీకవులకు అంత్య Rhyme ఇష్టమైతే తెలుగువారికి ఆది Rhyme ఇష్టమైందన్నమాట. ఈ విషయాన్ని స్పష్టంగా పై పోతనగారి పద్యంలో గుర్తించవచ్చు. ఆంగ్లభాషాప్రభావంవల్ల ఈనాటి వచన,గేయకవులు సామాన్యంగా అంత్యRhyme ను పాటించడానికి ఉబలాటపడటం మనం గమనించవచ్చు. “కదలేదీ, కదలించేదీ” – అనే శ్రీశ్రీగారి గేయంలో దీన్ని స్పష్టంగా చూడవచ్చు. కాని కాళోజీ మాత్రం పూర్వకవులపద్ధతిలో పదాదిలో యతియో , లేక ప్రాసయో పాటించి తన కవనానికి సంగీతసౌలభ్యతను చేకూర్చినాడు. ఇంతకు చెప్పదలచిందే మంటే, గణబద్ధమై సుస్పష్టమైన లయనుగాని, లేదా ఆంతరంగికలయను గాని కల్గిన వృత్తాల శ్రవణసుభగత్వాన్ని అధికం చేయడానికే యతిప్రాసనియమాలు తెలుగుఛందస్సులో చేర్చబడ్డాయని.
శ్రీశ్రీవంటి ఆధునికులు యతిప్రాసలు వ్యర్థప్రయాస లనడం మనం వినే వున్నాం. కాని ఇవి కవితాకల్పనకు దోహదం చేసే నియమాలని నేను కొన్నిసార్లు స్పష్టమైన అనుభూతిని పొందాను. ఉదాహరణకు ఈ పద్యం చూడండి:
“వీరులు, స్వామిరక్షణపవిత్రకళానిరతాంకితాంగధీ
సారులు, సద్వివేకపథచారులు, శాత్రవరాక్షసాటవీ
చారులు, త్యాగయోగగుణసారులు, నాంధ్రధరాసతీశుభం
కారులు, నాదు యోధులని క్ష్మాపతి యాత్మను నమ్మియుండగన్.”
ఇది నా “హనుమప్పనాయకుడు” కావ్యంలోని పద్యం. గద్వాలప్రభువైన సోమనాద్రి స్వల్పబలంతో కర్నూలుదుర్గంలో తురక సేనల మధ్య చిక్కుపడి ఉన్న సందర్భంలో, ఆ దుర్గానికి వెలుపల చిక్కుకొన్న అతని సైన్యం యుద్ధవిరమణ చేసి తిరిగిపోవా లని ఆలోచిస్తున్నపుడు హనుమప్ప అనే యోధుడు వారిని యుద్ధంచేసి ప్రభువును రక్షింపుడని ఉద్బోధించే ఘట్టంలోని దీ పద్యం. ఈ పద్యం రెండవపాదంలో “సారులు” అనే పదంలోని “సా”తోటి యతి “చారులు” అను పదంలోని “చా”తో చెల్లింది. దీన్ని చెల్లించడానికి సద్వివేకపథచారులు అనే సమాసం పడింది. సైన్యం ప్రభువును వదలిపెట్టి తిరోగమింప యత్నించుచున్న సమయంలో అట్టి విచారం సద్వివేకపథంలో చరించే యోధులకు తగదని – అట్లా చేయడం అవివేకమనీ, వారికి సూటిగా చెప్తుంది ఈ సమాసం. ఇది పడడంవల్ల ఈ పద్యానికి ఎంతో అర్థపుష్టి కలిగింది. నాకు బాగా గురుతు – సాతోటి యతి చెల్లించడానికే, ఒకటి రెండు నిముషాలు ఆలోచించి నేనీ సమావేశాన్ని వేసినాను. అంతేకాక వీరులు అనే పదంతో పద్యం మొదలు కావడంవల్ల, దానితో Rhyme చేసే పదాలు ప్రాసనియమాన్ని పాటించుటకు నాల్గుపాదాల మొదట్లో వేయుటయేకాక, ఈ Rhyming effect ను అధికతరం చేయడానికి 2,3 పాదాల మధ్యలో చారులు, సారులు అనే పదాలు పడ్డాయి. పద్యానికి ప్రాసనియమమే లేకుంటే పద్యరచనలో ఈ అదనపు అందాన్ని కూర్చే ఆలోచన నాకు తట్టకపోయేదేమో| మఱొక ఉదాహరణ. కొంతకాలం క్రింద ప్రసన్నభారతిలో ప్రచురితమైన “కన్నెగులాబి” అనే నా పద్యఖండికలో ఈ పద్యా లున్నాయి.
“నను గనినంత నెఱ్ఱనయినట్టి మదీయమనోహరాంగనా
హనుయుగముం గరాబ్జముల నంటుచు నంటి, “చెలీ! వనంబులం
గనుపడ వెందుఁజూచినను కన్నెగులాబులు నేడు, ఔనులే!
కనుపడు నెట్లు నీ మృదులగండము లందవి డాగియుండఁగన్!”
అనియెడు నాదుమాటలకు నగ్గలమై తగు సిగ్గుపాటుచే
కనకలతాంగి నెమ్మొగము కందె మఱింతగఁ, బ్రాక్సముత్థపా
ర్వణశశివోలె, మున్నుగను పాటలవర్ణవిభాసితంబులై
చనిన గులాబిపూలిపుడు చక్కని రక్తిమఁ దాల్చె వింతగన్.
కన్నెగులాబిపూవువలె కాయమునందున యౌవనంబు మే
ల్కొన్నపు డున్న వైనమిది; కోనకు జాఱెడు నేఱువోలె సం
స్కన్నములయ్యె నేండ్లిపుడు, కాని మనంబున జాఱకుండెఁబో
మున్నుగ మత్ప్రియాముఖసముత్థములైన గులాబియందముల్! ”
ఈ మూడవ పద్యంలోని రెండవపాదం “ల్కొన్నపుడున్న” అని ప్రారంభమౌతుంది. దీనికి యతి గూర్చడానికి “కోనకు జాఱెడు నేఱువోలె సంస్కన్నములయ్యె నేండ్లిపుడు” – అని వ్రాసినాను. నిజంగా ఈ పద్యాన్ని ఆరంభించినప్పుడు జారిపోయే వయస్సును, లేదా కాలాన్ని లోయలో జాఱిపడే నదితో పోల్చాలని నేననుకోలేదు. కాని “కో”తో యతి చెల్లించాలనే విజ్ఞతవల్ల చక్కనైన ఈ ఉపమానం మనస్సుకు అయాచితంగా తట్టింది. వయస్సు జాఱిపోవడమంటే కాలం జాఱిపోవడమే, ఒకసారి జాఱిపోయిన కాలాన్ని మనం వెన్కను త్రిప్పలేము. అట్లాగే లోయలో అధోగతమైన నీటిని మనం తిరిగి పైకెక్కించ లేము. క్రొత్త నీటిని పోకుండా అడ్డుకట్ట కట్టగలమేమో కాని, పోయిన నీరు గతం గతః. అందుకొఱకే “గతజలసేతుబంధన”మనే నానుడి ప్రసిద్ధమైంది. ఈ చక్కనైన ఉపమాన మిక్కడ పడడానికి యతినిర్బంధమే దోహదం చేసిందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లే రెండవపద్యంలో ‘కనకలతాంగి’ – అనే సార్థకసమాసం, ‘పార్వణశశివోలె’ – అనే సార్థకమైన సుందరోపమానం ముందుగా నేననుకోనివిధంగా ప్రాసనిబంధనవల్ల స్వతస్సిద్ధంగా సన్నద్ధమైనవని నా స్వీయానుభవాన్ని వ్యక్తీకరిస్తున్నాను.
ఐతే పైవిధమైన ఛందోనియమజన్యమైన భావస్ఫూర్తి కి అన్యమైన ఉదాహరణా లున్నాయా అనే ప్రశ్న ఉదయింప వచ్చు. ఇట్టి భావస్ఫూర్తి స్పష్టంగా ప్రతిబింబించే పద్యాల ఉదాహరణాలు కొన్నింటిని నేనిక్కడ చూపుతాను.
అష్టదిగ్గజాలలో మేటి దిగ్గజమైన రామరాజభూషణుడు నా కత్యంతప్రీతిపాత్రుడు. అతడు వసుచరిత్రలో అధిష్ఠాన పురాన్ని వర్ణించే సందర్భంలో ఆ నగరంలోని పూఁదోఁటలనుగుఱించి ఈ పద్యాన్ని వ్రాస్తాడు:
“పురిపూఁదోఁటలతావి మిన్నలమ వేల్పుల్ మెచ్చి తద్భూజ భా
స్వరసంతానములన్ దివిం బెనుప, నా సంతానముల్ దివ్య ని
ర్ఝరిణీనిర్మలవారిపూరపరిపోషం బందియుం దన్మహా
తరులక్ష్మీపరిపూర్తిఁ గాన కెసఁగెం దత్కల్పశాఖిప్రథన్.”
అధిష్ఠానపురంలోని ఉద్యానవనాలలో ఉండే పూల సుగంధం ఆకాశపర్యంతం వ్యాపించింది. దానికి దేవతలు మెచ్చుకొని, అట్టి సుగంధము దేవలోకంలో లేదనుకొని, ఆ పూలమొక్కల సంతానాలను (పిలకలను) తీసికొనిపోయి దేవలోకంలో నాటుకొని వాటికి ఆకాశగంగాజలాలను పాఱించినా, అవి అధిష్ఠానపురంలోని పూలమొక్కలకు సరిగానందున, ఆ దేవలోకవృక్షాలకు (తత్) కల్పవృక్షాలని పేరు వచ్చిందని చమత్కారంగా రామరాజభూషణుడు వర్ణించాడీ పద్యంలో. మనందతఱికీ తెలుసు దేవలోకంలో వుండేవి కల్పవృక్షాలని. ఐతే కల్పశబ్దము సమాసంలో ఉత్తరపదమైనప్పుడు “అంతకంటె కొంచెము తక్కువైనది – దాదాపుగా అటువంటిది” – అనే అర్థం వస్తుంది. అందుచేత “తత్-కల్పశాఖిప్రథన్” – అన్నపుడు భూలోకవృక్షాలకంటె కొంచెం తక్కువవైనందువల్ల ఆ దేవతావృక్షాలకు కల్పవృక్షాలని పేరువచ్చిందని ఇందులో చమత్కారం. ‘పంచైతే దేవతరవో మన్దారః పారిజాతకః, సన్తానః కల్పవృక్షశ్చ పుంసి వా హరిచన్దనమ్’ – అని అమరంలో చెప్పినట్లు సంతానమనేది స్వర్గ లోకంలో గల ఐదు దేవతావృక్షాలలో ఒకదానికి పేరు. అధిష్ఠాననగరంలోని చెట్ల సంతానం గావడంవల్ల ఆ దేవతావృక్షానికి సన్తానమనే పేరు వచ్చిందని ఇందులో మఱొక చమత్కారం. ఈ పద్యంలోని భాష కాస్త క్లిష్టంగా ఉండడంవల్ల నే నీ వివరణ ఇచ్చినాను. ఇక ప్రస్తుతాంశానికి వత్తాం. ఈ పద్యంలో ‘ర’కార ప్రాస ఉంది. దానిని చెల్లించ డానికిగాను రెండవపాదంలో భా’స్వర’ – అని వేసినాడు రామరాజభూషణుడు. ఈ శబ్దం ప్రాసనియమంవల్లనే అతనికి స్ఫురించి ఉంటుందని నా విశ్వాసం. ఈ శబ్దంవల్ల ఈ పద్యానికి విశిష్టమైన అర్థస్ఫూర్తి కలిగింది. ‘భాస్వర’మంటే ప్రకాశించేది అని అర్థం. అంటే దేవతలు తీసికొని పోయి నాటుకొన్నవి నాసిరకం మొక్కలు కాదు- అవి నిగనినగలాడే సారవంతమైన మొక్కలు – అటువంటి మేలురకపు మొక్కలను నాటుకొని దివ్యగంగాజలాలను పాఱించినా అవి భూలోకపు వృక్షాల కంటె తీసికట్టుగానే ఉన్నవని ప్రాస నియమంవల్ల కవి వేసిన ‘భాస్వర’శబ్దంవల్ల విశేషార్థం ఈ పద్యంలో స్ఫురిస్తూ ఉన్నది.
ప్రబంధకవులకంటె పూర్వుడైన నాచన సోమనాథుని ఉత్తరహరివంశం నాకు ప్రియమైన కావ్యం. అందులో శ్రీకృష్ణుడు ద్వారకను వీడి, బదరీకేదారములు, కైలాసాలను దర్శింప నేగుచు తాను లేనప్పుడు ద్వారకను రక్షించు బాధ్యతను సాత్యక్యా దులకు, యదువృద్ధులకు అప్పగిస్తూ యాదవవృద్ధుడైన ఉద్ధవునితో ఈ విధంగా అంటాడు:
“తండ్రులు మీరు, మీకు నయతత్త్వము చెప్పెద మన్న మమ్ము నే
మండ్రు జనంబు, లూఱడు బృహస్పతి మీయెడ, నేను లేనిచో
వెండ్రుకయంతమోసమును వేచి దురంబున కెత్తి వచ్చు నా
పౌండ్రుడు, వానిచేత మనబంధులు చిక్కక యుండఁ గావుఁడీ!”
“మీరు తండ్రివంటివారు మాకు, మీకు మేము హితాహితాలు చెప్పడం తగదు, మీ బుద్ధికుశలత బృహస్పతికిగూడ ఊఱట కలిగిస్తుంది, కాని నేను లేనప్పుడు వెండ్రుకయంత పొరపాటు జరిగినను పౌండ్రకవాసుదేవుడు ద్వారకపై దండెత్తి వస్తాడు, అతనిచేత మనవారు చిక్కకుండ మీరు కాపాడవలెను” – అని శ్రీకృష్ణుడు వృద్ధుడైన ఉద్ధవునికి విన్నవించుకొంటాడు. ఇందులో యతినియమంవల్ల ‘ఊఱడు బృహస్పతి మీయెడ’ – అనే విశిష్టార్థబంధురమైన పదబంధం, ప్రాసనియమంవల్ల ‘వెండ్రుకయంత మోసమును’ – అనే సార్థకోపమానం అయాచితంగా ఈ పద్యంలో సన్నద్ధమైనవని గుర్తించడం పద్యవిద్యా భ్యాసపరులకు కష్టం గాదు.
ఆధునికులలో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారంటే నాకమితమైన గౌరవం. వారి పద్యాలలో ఎన్నో అపూర్వమైన, విశిష్టమైన పదబంధాలు మనకు కనపడుతుంటాయి. వారి దక్షారామకృతి ఒక సుందరప్రౌఢఖండకావ్యం. దక్షారామ భీమేశ్వరుని మహిమలను వర్ణించే భీమఖండాన్ని శ్రీనాథకవిసార్వభౌముడు బెండపూడి అన్నయమంత్రికి అంకితమిచ్చే సన్నివేశం ఈ ఖండకావ్యేతివృత్తం. ఆ సందర్భంలో అన్నయమంత్రి శ్రీనాథుణ్ణి సభాముఖంగా సత్కరించి, ఆస్థాననర్తకీ నాట్యకళావిన్యాసనీరాజనంతో సంతుష్టుని గావిస్తాడు. ఆ సందర్భంలో హనుమచ్ఛాస్త్రిగారు వ్రాసిన పద్యమిది:
“తీయనిచూపులన్ గడుసుదేఱిన నాట్యపురాణి సోగ కం
దోయిని వెల్గు స్నేహమయధోరణులం బరికించి, చెక్కిళుల్
మోయఁగ వెన్నెలల్, మధురమూర్తి కవీంద్రుఁడు మందహాససు
శ్రీయుతవక్త్రుఁడై కనెను నృత్యచలద్భువనైకమోహినిన్.”
ఇందులో ‘య’ అనేది ప్రాసాక్షరం. ఈ నియమాన్ని పాటించేందుకుగాను హనుమచ్ఛాస్త్రిగారు ‘చెక్కిళుల్ మోయఁగ వెన్నెలల్’ – అని అత్యంతసుందరమైన పదబంధాన్ని వేసినారు. ఆ నర్తకియొక్క శృంగారమయమైన చూపులకు ముగ్దుడై మందహాసంచేసే కవిసార్వభౌముని చెక్కిళ్ళపై నూత్న ప్రకాశం విస్తరించింది అనే భావాన్ని ‘చెక్కిళుల్ మోయఁగ వెన్నెలల్’ అని చెప్పడం ఎంత సుందరంగా ఉంది? కవిత్వానికి ఇంతకంటె పరమావధి ఏముంటుంది? మఱి ఈ పదబంధం ప్రాస నియమం వల్లనే కవికి అయాచితంగా స్ఫురించి ఉంటుందనుటలో సందేహమేముంది? ఈ విధంగా ప్రాచీనార్వాచీనకవుల కృతులలో అనేకపద్యాల నుదాహరింపవచ్చు. మచ్చుకు కొన్నింటిని మాత్రం నేనిక్కడ చూపినాను.
ఐతే ప్రతిపద్యాన్ని ఇట్లా లయబద్ధంగా వ్రాయాలనే నియమం లేదు. కవిత్వం భావప్రాధాన్యమైన దగుటచే అందులో లయకంటె భావస్పష్టీకరణానికే ప్రాముఖ్యం. కాని ఛందస్సు వెనుక నుండే లయవిన్యాసాన్ని గ్రహించిన కవి, వాడేపదబంధాలలోను, పదాల విఱుపులోను ఎంతగానో లయవిన్యాసాన్ని ప్రదర్శింపవచ్చు. అందుచేతం ఈ అంశాలను దృష్టిలో నుంచుకొని కవిత్వం వ్రాయడంవల్ల మేలే కాని కీడు చేకూరదని నా అభిప్రాయం. ఇంగ్లీషులో “Necessity is the mother of Invention” అనే సార్థకమైన సామెత వుంది. ఈ సామెతే యతిప్రాసల నియమాలనుకోండి, నిర్బంధాలనుకోండి – వీనికి వర్తిస్తుంది. పరిణతకౌశల్యం గల వ్యక్తి కీ నిర్బంధాలు సంకెళ్ళుగా గాక, పూలదండలుగా భాసించి, అతని కవితాకౌశల్యాన్ని ఇనుమడింప జేస్తాయని నా అభిప్రాయం. ఆరంభంలో ఊహింపని పద బంధాలకు, ఉపమానాదులకూ, ఈ నిర్బంధాలు ఉద్భవకారకము లౌతాయని నేనంటాను. ఛందస్సుకు తాను లోబడక, ఛందస్సును తాను లోబఱచుకొన్న కవియొక్క కవితాకౌశల్యాన్ని నిశితంజేసే వీ నిబంధనలనీ, వాటిని దూషించడం ‘ఆడరాక అంగణం వంకర’ అన్నటువంటిదంటూ మనవి చేస్తూ ఈ వ్యాసాన్ని ముగిస్తాను.