లక్ష్మి

ద్వితీయాంకము – మొదటి దృశ్యము

(సమీపనగరంలోని జాతర దృశ్యము. వివిధప్రకారములైన వస్తువుల నమ్ముకొను చిల్లరవ్యాపారులతో, సందర్శకులతో ఆప్రదేశము చాలా సందడిగా నుండును. మధ్యాహ్నసమయ మాసన్నమగుచుండును. మధ్యాహ్నమున కావ్యాపారుల అమ్మకము లంతమై సాయంకాలము దుర్గా పల్లకీ సేవారంభమగును. ఆ జనసమ్మర్దములో మేడమ్ బెన్సన్ చిక్కుకొనియుండును. అన్ని రకముల వ్యాపారులు తమ తమ వస్తువులు కొనుమని ఆమె వెంటఁ బడుచు ఆమెను విసిగించుచుందురు.)

వ్యాపారుల కోరస్:
 
కాలూను మధ్యాహ్నకాలంబు త్వరలోన
ఆలోన బేరంబు లన్నియుం గావలెను
దండిగా ధరలన్ని తగ్గించి యమ్మెదము
రండి జనులార! రారండి కొనఁగాను

ఇంత తక్కువధర లెప్పుడుం గనలేరు
ఇంతచక్కని వస్తు వెచ్చటం గొనలేరు
రారండి జనులార! రారండి త్వరగాను
రారండి జనులార! రారండి కొనఁగాను

వ్యాపారులు:
 
1:
మధురమధురంబులౌ మామిడిపండ్లు! కండచక్కెరకంటె ఖాసైన పండ్లు!
2:
ఈచెప్పు లెంతయో ఇంపైనవండీ! కాలినిం బంటువలెఁ గాపాడునండీ!
3:
తళతళా మెఱసేటి దండలివి బాబు! నాణ్యమగు బంగారు నగలివ్వి బాబు!
4:
ఈమిఠాయికి సాటి యేది లేదండి, అమృతమ్ముకంటెను అతిమధురమండి!
5:
తాజతాజాపూల దండలు సుమండీ! పూజకై కట్టిన పూమాలలండీ!
6:
ఇంటిలో చేసినవి యీరొట్టెలండీ| రెండు దిన్నం జాలు నిండు కడుపండీ!

(పైవిధముగా నఱచుచు, జనులమధ్య తిరుగుచు చిల్లర వ్యాపారు లమ్ముకొనుచుందురు. ఈసందడిలో బెన్సన్ దిక్కుతోచక నిల్చియుండును. ఆమె నింకా చేరరాని ఫ్రెడరిక్, జెరార్డు, ఎలీనా హెలీనాలను గూర్చి ఆమె యిట్లనుకొనుచుండును.)

బెన్సన్:

(తనలో)

ఈరీతి నన్నిందు నేకాకిగాఁ జేసి
చేరంగ రారేమి వీరెంత సేపైన
ప్రేమంబులో మున్గి విస్మరింతురు నన్ను
ప్రేమంబె ముఖ్యంబు వీరికి న్నిరతంబు

ఒక సాముద్రికుఁడు:
 

(బెన్సన్ హస్తమును గ్రహింపఁబోవుచు పల్కును)

దొరసాని! నీభాగ్య మెఱిగింతు నిపుడు
జరుగు నేజెప్పునది గురిదప్ప కెపుడు

బెన్సన్:
చాలు, నీ సాముద్రికంబులు
నాలాభనష్టాలు నాకె తెలియు
పండ్ల వ్యాపారి:
 
దొరసాని యివ్వి చక్కెరకేళి పండ్లు
అఱటులందున నివ్వి సరిలేని పండ్లు
ఒకపండు దిన్నంత నుదయించు లోన
సకలంబుగా గెలనె సాపాడు కోర్కె
బెన్సన్:

(వ్యంగ్యంగా)

వలదయ్య వలదయ్య నీపండ్లు నాకు
కలవయ్య దేవుఁడిచ్చిన పండ్లు నాకు

సొమ్ముల వ్యాపారి:
చొక్కంపు బంగారు సొమ్ములివి మేడెమ్!
చుక్కవలె మెఱతువీ సొమ్ములం దాల్చి
తగ్గించి నీకొఱకె ధర పూర్తిగాను
అమ్మెదను కొనుమమ్మ నమ్ము నామాట?
బెన్సన్:
పోవయ్య, పోవయ్య, పోర్వెట్టకుండ!
సొమ్ముల వ్యాపారి:
 
ఇంత చౌకగ వీని నెచ్చటం గనవు
కొనుమమ్మ, కొనుమమ్మ అనుమానమేల?
బెన్సన్:
పోవయ్య, పోవయ్య, పోర్వెట్టకుండ!
ఒక మోసగాఁడు:
 
వినకుండ మేడాన్నివేధింతువేమి?
కొననంటె నీరీతి ఘోషింతువేమి?

(అని వ్యాపారిని వారించుచు, ఆమెకు సాయము చేసినట్లు ఆమెదగ్గరికి చేరి ఆమె గడియారమును హరించును.)

మందులమ్ము కొనువాఁడు:
 
వయసు వెన్కకుఁ ద్రిప్పు పరమౌషధంబు
ఈయాసవంబుతో నిగురించు యౌవనము
ఏదేశమందైన ఇంతమంచిది లేదు
స్త్రీలపాలిటికిది దేవతలవరము!
వాడి చూచిన నీకె బాగుగాఁ దెలియు!
బెన్సన్:

(వ్యంగ్యంగా)

నిండు యౌవనవతిని, నీమందు నాకేల?
బేరమాడఁగఁ బొమ్ము వేఱొక్క యవ్వతో!

చెప్పులమ్ము వాఁడు:
 
ఈస్లిప్పరుం జూడు మేడమ్
పండ్లమ్ము వాఁడు:
 
ఈపండ్లు మంచివి మేడమ్
విసనకఱ్ఱ లమ్మువాఁడు:
 
ఎండకాలము గడవ దిదిలేక మేడమ్
మిఠాయి నమ్మువాఁడు:
 
తియ్యతియ్యని స్వీటు మేడమ్
బెన్సన్:
పొండు, పొండిట్లు విసిగింపకుండ నన్ను
హద్దుమీరిన మీకు సమృద్ధిగాను
శిక్ష వేయింతు దొరగారిచేత నేను
పొండు నాకంటఁ బడకుండ పొండు, పొండు

(ఇట్లు చుట్టూ మూఁగి ఆమెను విసుగిస్తుంటే ఆమె కోపంతో పైవిధంగా వారిని వారించుచుండఁగా హెలీనా, ఫ్రెడరికు లామెను చేరవత్తురు.)

రెండవదృశ్యము

ఫ్రెడరిక్:
Madam Benson! You seem to be agitated!
క్రోధంబుచే శాంతి గోల్పడినట్లు
కనిపింతు వెయ్యది కారణంబు?
హెలీనా:
What happened Mistress Benson dear?
బెన్సన్:

(క్రోధనిరసనలతో)

These scoundrels are insulting me

హెలీనా, ఫ్రెడరికులు:
అమాయకులు; వారి నంతగా ఆగ్రహింపఁగ దగదు.
బెన్సన్:
కల్ల, వారమాయకు లనుటెల్ల కల్ల!
దొంగిలించిరి నాచుట్టు దొమ్మిగూడి
రమ్యమైన నాదు గడియారంబు వారు!

(ఇంతలో మధ్యాహ్నకాలఘంటానాదము వినిపించును. అప్పుడు ఈక్రింది వ్యాపారుల కోరస్ వినిపించును. అక్కడ నున్న జనులందఱు ఆవ్యాపారుల చుట్టును వారిచ్చు వస్తువులకై మూఁగుచు సందడి చేతురు. )

వ్యాపారుల కోరస్:
 
మధ్యాహ్నఘంటికల్ మార్మ్రోగె దిశల
బేరసారము లెల్ల విరమింపఁబడియె
ఇంక నీ వస్తువుల నిత్తు మూరకనె
రండి జనులార! రారండి కైకొనఁగ

ముందువచ్చినవారె పుణ్యాత్ములండి!
వారికే లభియించు వస్తువులు మెండు
ఆలసింపక రండి అందుచే త్వరగ
రండి జనులార! రారండి కైకొనఁగ

బెన్సన్:
ఈసంరంభ మేమి?
ఫ్రెడరిక్:
మార్కెట్ మూసేవేళ మామూలే ఈ సంరంభం!
బెన్సన్:
చెవులు బ్రద్దలగుచున్నవి. సుంత ప్రశాంతత సుఖంగా వుంటుంది.
ఫ్రెడరిక్:
ఈనాటి కాయాశ వదలుకోవలసిందే!
హెలీనా:
నాకు మాత్రం వీరి సంరంభం సంతోషంగానే ఉంటుంది.
బెన్సన్:
అయ్యో! తప్పిపోయింది ఎలీనా యెక్కడో!
హెలీనా:
ఆమె ప్రియునితో నుంది ఆనందంగా!

(వీరిట్లు మాట్లాడుకొనుచుండగా మార్కెటు పూర్తిగా మూయఁబడును. చాలా మంది అచటినుండి నిష్క్రమింతురు.)

బెన్సన్:
హమ్మయ్య! అణగింది గొడవ!
ఫ్రెడరిక్:
అసలు ఉత్సవం ఆరంభమౌతుందిప్పుడు.
బెన్సన్:
ఏం జరుగుతుంది?
ఫ్రెడరిక్:
వాడవాడలందు నాడుచుం బాడుచున్
వారు సంచరింత్రు వైభవముగ
వారి యాటపాటతీరెంతొ వేడ్కతోఁ
జూతు రెల్లవారు చోద్యమంది
హెలీనా:
ఆహా! నాట్యకత్తెలు!
బెన్సన్:
వీరెవరు?
హెలీనా:
మిస్ట్రెస్ బెన్సన్! వినలేదా నీవు దేవదాసీలను?
బెన్సన్:
వారేం చేస్తారు?
ఫ్రెడరిక్:
వారి నాట్యగాన వైదుష్యమంతయు
దైవసేవ కంకితంబు చేసి
దేవళంబులందు దేవునిం గొల్తురు
పాడి యాడి వారు ప్రతిదినంబు
బెన్సన్:
దైవమునే కాని పురుషులను సేవింపరా?
ఫ్రెడరిక్:

(ఎగతాళిగా)

వారు పురుషుల్లోను దైవమును జూతురు

హెలీనా:

(ఎగతాళిగా)

స్త్రీలలోఁ జూడరా?

ఫ్రెడరిక్:

(ఎగతాళిగా)

పురుషులలోనే దైవములను జూతురు. ఆదైవములనే సేవింతురు.

(మువ్వురును హేళనగా నవ్వుదురు. ఇంతలో క్రింది పాటతో దేవదాసీలు నాట్యము చేతురు. అచ్చట నున్న వారందఱు ఆనాట్యము నాసక్తితో చూతురు.)

దుర్గాపాట (ఆరభిరాగం,ఆదితాళం)

పల్లవి:
శశధరశేఖర చారుకుటుంబిని
శశిముఖి రజతాచలసంవాసిని
శశిరేఖాద్యుతి లసితాసితవేణి
అనుపల్లవి:
నతభక్తావని నాదవినోదిని
ప్రథితమహాదుర్గారూపిణి
అతులితశక్తిమయాకృతి పార్వతి
మధ్యమకాలం:
తాం తకిట తకతక ధిమి రి స ని ధ తఝణు స రి మ గ రి ధ స రి మ పా
తఝణు స రి మ గ రి తఝం ఝం తకిట ధిత్తాంకిట ధ ప మ గ రి తధింగిణతోం
చరణం:
నీవే లక్ష్మివి నీవే వాణివి నీవే మూలము నిఖిలజగత్తుకు
నీ వాధారము జీవన్ముక్తికి నిఖిలాండేశ్వరి యీశ్వరి
సా ని ధ ప మ గ రి విష్ణుసహోదరి వింధ్యనివాసిని
పాలింపుము మమ్ము కృపాశాలిని కాత్యాయని నారాయణి
మధ్యమకాలం:
తకిట ధిమిత తకతక ధిమి ధీంతక తకతిక తోంతక తోంతక ధిరణా
అతిశయతృష్ణామధుపాయిత పశుపతి పీతాధరమధుధారిణి
తకిట ధిమిత తకతక ధిమి ధీంతక తకతిక తోం తక తోంతక ధిరణా
అతులిత రజతాచల రంగస్థలకృత సుందరలాస్యవిలాసిని
తక తిక తోం తక తక తోంతక ధిరణా మహిషాసురదర్పవినాశిని
తక తిక తోం తక తక తోం తక ధిరణా నతజనకృతపాపవిదూరిణి
శ్రీచక్రేశ్వరి చిన్మయి సితశైలాధిప మేనానంద వివర్ధని

మూఁడవదృశ్యము

(నాట్యమును ముగించి దేవదాసీలు నిష్క్రమింతురు. వారితోఁ బాటు అక్కడ గుమిగూడిన లోకులును నిష్క్రమింతురు. అక్కడ బెన్సన్, ఫ్రెడరిక్, హెలీనాలు, ఏదో కొద్దిమంది భారతీయులు మాత్రము మిగులుదురు. ఆ నిష్క్రమించులోకులలో శ్రావకుఁడు, సన్యాసివేషములో నున్న నీలకంఠుఁడు, యాచకురాలి వేషములో నున్న అతని కూతురు లక్ష్మి దూరమునందు కనిపింతురు.)

హెలీనా:
కనుఁడు కనుఁడొక్క వృద్ధుండు కానుపించు
దూరమున నొక్క జవ్వనితోడఁ గూడి
మెఱయు నాతని కన్నులు మెఱపులట్లు
బీద యయ్యును చెలువూని వెలుఁగు నామె
బెన్సన్:
వారెవ్వరో?
ఫ్రెడరిక్:
ఆతఁ డగపించు సన్యాసి యట్లు నాకు
అతని కూఁతురె కాబోలు నాలతాంగి
గానమున నామె ప్రజల నాఁకట్టుకొనఁగ
నతఁడు యాచించు జనుల భిక్షార్థి యగుచు

(ఇంతలో ఎలీనాజెరార్డు లచటికి వత్తురు.)

బెన్సన్:

(వారిని చూచి)

ఆహా! ఎట్టకేలకుఁ జేరవచ్చితిరి!

హెలీనా:

(ఎలీనాతో)

సంతోషంగా ఉన్నావు. సొమ్ముల నతఁడు వ్రాసి తెచ్చెనా?

ఎలీనా:
ఏమీ తేలేదు.
వట్టిచేతులతోడనే వచ్చెఁ గాని
ఐన నేమయ్యె, ననుఁ జేరఁగాను వచ్చె
అంతయే చాలు, నాచెంత నాతఁడున్న
అదియె పదివేలు! కోర నన్యంబు నేను
హెలీనా:

(ఫ్రెడరికుతో ఏకాంతంగా)

తిరుగఁబాటును నణచంగ నరుగవలయు
ఆతఁడును నీవు త్వరలోనె యనెడు వార్త
నెఱుఁగ కాయమ యీరీతి మురియుచుండె
పాడి గాదామె మురిపెంబు భంగపఱుప

ఫ్రెడరిక్:
అట్టి నిర్ణయంబు నరయ నేను గూడ
హెలీనా:
అది రహస్యంబు. మీకుఁ దెలుపంగఁబడు నపరాహ్ణమందు.
ఫ్రెడరిక్:

(జెరార్డుతో)

నీలకంఠుఁడు నీకుఁ గన్పడెనా?

జెరార్డ్:
నీలకంఠునిఁ జూడను నేను గాని
సుందరాంగిని తత్సుతం జూచి తేను
మరులుగొల్పెడు నామె సమక్షమందు
నున్నచో మోహవివశత్వ మొదవు ననుచు
పాఱివచ్చితి నటనుండి త్వరగ నేను
ఎలీనా:
ఆహా!
పాయసంబునుబోలె నీవాక్యధార
పండువును చేసె నాశ్రుతిద్వంద్వమునకు
సంశయింపను నీదు విశ్వాస మెపుడు
ద్విగుణమయ్యెను నీపయి ప్రేమ యిపుడు!

(జెరార్డును కౌఁగిలించుకొనును)

బెన్సన్:
తిరిగిపోవలె నింక మన స్థావరములకు

(ఆమెతోఁబాటు ముందుగా ఎలీనాజెరార్డులు నిష్క్రమింతురు. చివరకు హెలీనాఫ్రెడరికులు నిష్క్రమించుచుండఁగా వారికి మఱల నీలకంఠ, లక్ష్మీ, శ్రావకులు కనిపింతురు. నీలకంఠుని పరీక్షగాఁ జూచుచు… )

హెలీనా:
ఇతని చూపులు రూపంబు లెంతగానొ
భయము గొల్పుచుఁ బుట్టించు వణకునాకు
ఫ్రెడరిక్:
వృద్ధుఁ డాతని వీక్షించి వెఱతువేల?
రమ్ము, పోదము మన స్థావరమ్ముఁ జేర

(నిష్క్రమింతురు.)

నాల్గవదృశ్యము

(నీలకంఠ, లక్ష్మీ, శ్రావకులు, తర్వాత ఇతరులు)

నీలకంఠుఁడు:
మలినంబగు చింపిరి దు
స్తులలోఁ గని నన్ను వీరు తూలికకంటెన్
చులకన చేతురు, కానీ
తెలియరు లోన న్వెలిగెడు తేజోమహిమన్

ఈదుస్తులలో నున్నా
డేదో యొక నేరచరితు వృత్తాంతంబున్
భేదింపఁ బూనియున్న క్రి
యాదక్షుం డొక్కడంచు నరయరు వీరల్

ప్రతికారేచ్ఛాతీవ్రత
నతులోగ్రంబైన మామకాస్యము గనినన్
గతధృతులై యాంగ్లేయులు
మతి సెడి మ్రాన్పాటు గనక మనగం గలరా?

లక్ష్మి:
క్షమించుట కనుమతింపవ శాస్త్రంబులు నాన్నా!
నీల:
(అత్యుగ్రతతో) క్షమించుటా? ఆమ్లేచ్ఛుని పొరపాటునా? అసంభవము!

(తరువాత శాంతుఁడై క్రిందివిధముగా లక్ష్మి నోదార్చును.)

పాట
ఓలక్ష్మి! నాలక్ష్మి! నీలోన మునుపున్న
లీలావికాసంబు లీవేళఁ గనరావు
నీరదావృతమైన తారకం బోలుచు
చారుతాహీనమై నీరూపు గనిపించు

ప్రత్యూషసంఫుల్ల పంకజంబులఁ బోలి
అత్యంతశోభతో నలరారు నీకనుల
చలికాలమున మించు తెలిమంచుపొరవోలె
కలఁత యేదో క్రమ్మి మలినంబు గావించు

అతనిఁగూర్చిన చింత యవసరము లేదు
అతని కర్మకుఁ దగు ననుభవంబే కలుగు
పైనుండి దైవంబు పరికించు సర్వంబు
రానున్న దెల్లయుం దానిర్ణయించు

నేఁ జూడఁగా నెంతు నీమోమున న్మఱల
రాజీవమునఁ బోలె తేజోవికాసంబు
నేనరయఁగానెంతు నీకన్నులన్మఱల
ఆనందవీచికల వ్యావర్తనంబు

ఓలక్ష్మి! నాలక్ష్మి! నీలోన మునుపున్న
లీలావిలాసంబులే యెపుడు గననెంతు
ఓలక్ష్మి! నాలక్ష్మి! నీలోన మునుపున్న
లీలావిలాసంబులే యెపుడు గననెంతు

లక్ష్మి:
ననుగూర్చి చింతింపఁ బనిలేదు నాన్న!
చనునులే నావంత సత్వరముగానె
కనుమిదే నామోముకళ మాఱుచుండె!
నీలకంఠుఁడు:
ఐన నూతనోత్సాహధైర్యముల నూని
శ్రేణిగట్టుచు జనులెల్లఁ జేరి యిచట
శ్రవణపర్వంబుగా విని సంతసింప
పాడు పాటను లక్ష్మి! శ్రావ్యంబుగాను

సంచరించిన నాదు స్థావరమునందు
ముంచుకొనివచ్చు ముప్పంచు నెఱిఁగియు
అతులసౌందర్యవతియైన నినుఁ జూడ
అతఁడుండె నట నుత్కటాపేక్షతోడ

ఈయుత్సవాలోకనేచ్ఛతో నిచట
నాయాతజనులందు నతడుండె నేని
ఆలించి నీపాట వాలాయముగను
వ్రాలు నతఁడిట నట్లు వానిఁ గనవచ్చు

లక్ష్మి:
(కించిద్విషాదముతో నిట్టూర్చుచు) హా!

(ఇంతలో జనులు చుట్టును గుమిగూడ నారంభింతురు.)

నీలకంఠుఁడు:
వినుఁడు జనులార! వినరండు వేడ్కతోడ!
నాదుపుత్త్రిక కాళీప్రసాదకలిత
గాన విద్యావిశారదయైన యీమె
పాడు నొక యనాథాంగనాభవ్యగాథ
లక్ష్మి:

(పాట)

కందారపురమందుఁ గలదొక్క కాంత
అందమైనదె కాని యనద యా కాంత
గుణవంతురాలయ్యు జనులచే నామె
గణియింపఁ బడ కెంతొ గర్హింపఁబడియె

చెన్నుగా విరిసిన పున్నాగములను
గన్నెరుల మల్లెలం గల్హారములను
ముద్దాడుచుం గరంబుల హత్తుకొనుచు
నిద్దంపుచంద్రుండు నింగిలో వెల్గు
చుండంగ నాయింతి యొకరాత్రిఁ దిరుగు
చుండె విపినంబులో నొంటరిగఁ దాను

తరుల కౌఁగిలులందుఁ దనియుతీవెలును
చొరరాక గుబురైన సుమకుంజములును
గగనంబుచుంబించు ఘనవృక్షములును
ఖగకులంబుల తీవ్రకలనాదములును
పరఁగు నా వనమందుఁ జరియించుచామె
మఱవఁగాఁ జూచుఁ దన పరిభవంబులను

అటులుండ నాయింతి ఆవనంబందు
తటుకునం బొడసూపెఁ దరుణుం డొకండు
సాజమగు తనువిలాసంబు గలవాఁడు
రాజులందఱికంటె రమ్యమగువాఁడు
తేజోమయంబైన దృగ్యుగమువాఁడు
భ్రాజిష్ణువాతండు ప్రత్యక్షమయ్యె

ఆతనిం గబళింప నాయత్త మయ్యె
ఘాతుకమృగంబు లా కానలో నంత
కని వాని నాయింతి తన కాళులందు
నినదించు నందెలం గొని చేతిలోన
గలగలా బిట్టుగా నలజడిం జేసి
తొలఁగించె నతనికింగల ప్రాణహాని

అతికృతజ్ఞతతోడ నామె నతఁ డరసె
అతనిచూపులతిమోహదములై త్రోసె
నాకాంత నొక స్వప్నలోకమ్మునందు
ఆకలలలోకంబె వైకుంఠమయ్యె

అతఁడయ్యె విష్ణువే అక్కజంబుగను
అతికృపాన్వితుఁడౌచు నాతండు వలికె
ధరలోన నీకేల పరిభవం బంద,
సరియైన దీతావె తరళాక్షి నీకు!

ఇలలోన నామె గర్హింపఁబడ నేమి?
కలదామె భాగ్యంబు కైవల్యమందు
ఆనాటినుండి యట నాశ్రుతంబౌను
ఆనాతి యందెల ధ్వాన మపుడపుడు

(ఆపాట పాడుచుండఁగా కొందఱాంగ్లేయభటులు ప్రవేశించి ఆపాటను లెక్కసేయక దూరముగా సంచరించుచుందురు.)

నీల:

(వారిని చూచి తనలో)

ద్విగుణమై నాదుక్రోధంబు రగులుచుండె
ఆతఁడింకను పొడసూపఁడయ్యె నిచట
(లక్ష్మితో) పాడు లక్ష్మి! యింకను పాడు పాడు!

లక్ష్మి:
(కొంత అనాసక్తితో) మళ్ళీ పాట….
జన సమూహము:
 
పాడు పాడుమింకొక్కసారి!

(ఇంతలో దూరమునుండి జెరార్డు, ఫ్రెడరికులు ప్రవేశింతురు.)

లక్ష్మి:
కందారపురమందుఁ గలదొక్క కాంత
అందమైనదె కాని యనద యా కాంత
గుణవంతురాలయ్యు జనులచే నామె
గణియింపఁ బడ కెంతొ గర్హింపఁబడియె

(కంపితస్వరముతో అంతమాత్రము పాడి ఆపును.)

నీలకంఠుఁడు:
మళ్ళీ…
జన సమూహము:
 
పాడు, పాడుమింకొక్కసారి!
లక్ష్మి:

(జెరార్డు ఆమెను సమీపించుచుండును. ఆమె మఱింత సంక్షుభితస్వరముతో పాడుచు నేలకొరుగ నారంభించును.)

చెన్నుగా విరిసిన పున్నాగములను
గన్నెరుల మల్లెలం గల్హారములను
ముద్దాడుచుం గరంబుల హత్తుకొనుచు
నిద్దంపుచంద్రుండు నింగిలో వెల్గు….

జెరార్డ్:
లా…క్మి!

(అతఁడు ముందుకుఱికి ఆమె పాటును దప్పింప యత్నించుచు. అతడామెను గ్రహించులోపలనే నీలకంఠుఁ డామెను గ్రహించి.. )

నీలకంఠుఁడు:
(తనలో) ఆహా! ఇతఁడే అతఁడు!!
జన సమూహము:
 
ఆమె కేమగుచున్నది?
లక్ష్మి:
(కొంత తేరుకొనుచు) ఏదో తాత్కాలికబాధ! ఇప్పుడు మఱల పాడుదును. (నిమ్నస్వరముతో) ఇది తప్పని శిక్ష!
జెరార్డ్:
(ఫ్రెడరికుతో) లాక్మి! బ్రాహ్మణపుత్రిక!
ఫ్రెడరిక్:
ఆమె ఇచ్చట…?
జెరార్డ్:
ఔను. ఆమెయే లా…క్మి!
ఫ్రెడరిక్:
జాగ్రత్త! ఆమె చెంతకుఁ జేరకు!
జెరార్డ్:
ఆమెను మఱొకసారి చూడనిమ్ము!

(ఇంతలో సైనికవాద్యఘోష వినిపించును.)

ఫ్రెడరిక్:
అదిగో వాద్యఘోష! మఱలిరమ్మనుచున్నది మనల!
జెరార్డ్:
కొంతసేపు నన్నిట నుండనిమ్ము!
ఫ్రెడరిక్:
ఆమె నిన్నిట గట్టివేయుచున్నదా?
జెరార్డ్:
(సర్దుకొంటూ) ఆఁ, లేదు, లేదు
ఫ్రెడరిక్:
ఐతే పోదాం పద!

(సైనికవాద్యబృందంతోబాటు వారును ఇతరాంగ్లసైనికులును నిష్క్రమింతురు.)

నీలకంఠుఁడు:
(లక్ష్మితో) దుర్గ ప్రసాదించింది. దొరికినాఁడతఁడు .
లక్ష్మి:
(నిర్వేదంతో) అయ్యో!

ఐదవదృశ్యము

(నీలకంఠుఁడు, అతనికి విధేయులైన హిందువుల బృందము. వారందఱు అక్కడే ఉన్న లక్ష్మీ, శ్రావకులకు దూరముగా సమావేశమై యుందురు.)

నీలకంఠుఁడు:

(విధేయబృందముతో రహస్యముగ)

ఈరేయి శర్వాణి ఊరేఁగు నుత్సవము
ప్రారంభమగు నందు పాల్గొనుట కిందు
హిందువులు నాంగ్లేయు లెందఱో యేతెంచి
సందడిని గావించుచుందు రవ్వారిలో
నతఁడున్న మీకతని వ్యంజింతు సైగచే
అతని నెట్టులనైన ఆజనంబులనుండి
వేఱుగావించి పరివేష్టించి తటుకునం
బాఱకుండఁగఁ బట్టి బంధింపఁగావలెను
చండికాదేవ్యపచారదూషితునతని
దండింపఁగావలెను ధర్మశాస్త్రోక్తముగ

విధేయ బృందము:
 
సంతతము మీపూన్కి సఫలంబు సేయంగ
పంతంబు గొని మేము బాసటగ నుండంగ
చింతింపనేల యీ చిన్నకార్యంబునకు?
అతనియున్కిని మాకు వ్యంజించినం జాలు
చతురత న్సరియైన సమయమ్మునందు
అతనినిం బట్టి మీకప్పగింతుము మేము!
నీలకంఠుఁడు:
భళిర! శ్లాఘ్యంబు మీభక్తిభావంబెంతొ
వెలిపుచ్చకుండ నిది వెడలండి మీరిపుడు
సరియైనవేళకున్ సన్నద్ధులై రండు
నెరవేర్పఁ గార్యంబు నియమానుసారంబు
విధేయ బృందము:
 
అవశ్యముగ!

(ఆబృందము నెమ్మదిగా నిష్క్రమించుచుండును. వారి వెనుక నిష్క్రమింప నుద్యుక్తుఁడగుచున్న నీలకంఠుని సమీపించి లక్ష్మి…)

లక్ష్మి:
నేనూ రానా నాన్నా!
నీలకంఠుఁడు:
నావెంట నీవున్న నాపూన్కి సడలు
కావున న్నీవిందె శ్రావకునితోడ
నుండు మాతండు నీకండగా నున్న
నుండు శ్వశ్శ్రేయసం బుండదు భయంబు!

(అని శ్రావకుని వైపు చూచుచు ఆమెను సముదాయించును)

శ్రావకుఁడు:
చింతింపఁ బనిలేదు చెంత నే నేనుందు!

(నీలకంఠుఁడు నిష్క్రమించును. శ్రావకుఁడు పరిస్థితిని గమనించి లక్ష్మి ముందు అవనతుఁడై కూర్చొని సానుభూతితో నిట్లనును.)

శ్రావకుఁడు:
నిరతంబు ప్రతికృతియె నీతండ్రి చింతించు
అరయండు నీచిత్తపరిణామ మాతండు
అరసితి న్నిను నేను చిఱుతప్రాయమునుండి
నిరతంబు దివిరితి న్నీకోర్కెలం దీర్ప

నీవు గోరిన పూవు లేవనంబున నున్న
ఆవనంబున నుండి వ్యాఘ్రాదిభాధలం
గణనసేయక నీకుఁ గొనివచ్చి యిచ్చితిని
చిననాఁడు నీకొఱకుఁ జెల్వారు ముత్తెములఁ
వనధిలోతులఁ గ్రుంకి నెనరారఁ దెచ్చితిని

ముకుళంబులోఁ దోచు పుష్పత్వమట్లు
వికసించి యౌవనం బిపుడు నీలోన
కలిగించె నూతనాకాంక్ష లెదలోన
తలఁతు నీసేవయే తరుణి నేనెపుడు

ఆనసేయుము నీకు నాప్తులం గావ
కానివారల కెల్ల కడగండ్లు గూర్ప
నీసేమమే సదా నేఁగోరుకొందు
నీసేవలోననే నేఁ దృప్తిఁగందు

(శ్రావకుఁడు పల్కిన మాటలకు ఆర్ద్రీకృతమానసయై లక్ష్మి ఆప్యాయముగా అతని తలను నిమురును. ఇంతలో దూరమునుండి వచ్చుచున్న జెరార్డు కనిపించును. శ్రావకుని దూరముగాఁ బొమ్మని, ఆమె జెరార్డు వైపున కుఱుకును.)

జెరార్డ్:
(అనురాగంతో) ఓహో లా..క్మి! ఓహో లా..క్మి!
ననుఁ జేరవచ్చిన నాప్రణయదేవత!

(పాట)

స్మరియించుచు నీచెల్వము
స్వప్నమ్మునఁ జరియించుచుఁ
జనుదెంచితి నిట నినుఁ గన నెంచుచు

తెరతీయఁగ దర్శితమగు
వరదాయిని దేవతవలె
దరిసించుచు నిన్నెదుటను
మురియుచునుంటిని ముదమున లాక్మీ!

అతిమోహదమై తగు నీ
స్మితపీయూషాస్వాదన
జనితానందంబున నే
గనుచుంటిని స్వర్గానుభవంబునె!

లక్ష్మి:

(ఉల్లాసంతో)

నేనెఱుఁగను నీ స్వర్గంబును
నేనెఱుగను నీ దైవంబును
ఐనను నీసాన్నిధ్యములో
ఆనందమె నేనందుచునుంటిని!

(విచారంతో)

కానీ హైందవు లిది మెచ్చరు
కాచికొనం దమ గౌరవమును
నిను హింసింపఁగ వెనుకాడరు
కనలే నాప్రతికర్మము నేను

జెరార్డ్:
వారలహింసాపూరితమగు
ప్రతికర్మకు నే భయమొందను
నీమోహంబున మత్తంబగు
నామానస మన్యము దలఁపదు

నీసాన్నిధ్యపు స్వర్గంబున
భాసించెడు సౌఖ్యము వెన్కనె
శోకాశ్రయమగు నరకంబే
దాఁకొనెనంచును జింతింపను

లక్ష్మి:

(నిష్కర్షగా)

కానీ పల్కెద నిది నిష్కర్షగ
నీనిధనంబును నేనోర్వను

జెరార్డ్:
(అనురాగంతో) ఆహా! నా శ్రేయమె నీవెంతువు!
స్నేహంబున నీచిత్తమునందున
నిద్రాణంబయి నిండిన ప్రేమయె
నిజముగ నీగతి నినుఁ బ్రేరేచును
లక్ష్మి:
(తనలో) ఆహా…!
నాహృద్వనమున నవరాగంబును
పండించిన యీతండు నిజంబుగ
హైందవదృష్టికి అరిగాఁ దోఁచును
హైందవు లీతని నంతము సేయఁగఁ
బన్నెడు వ్యూహము లెన్నఁగ నామది
భయశోకానల పరిదగ్ధంబగు
వార లెఱుంగని వనగేహంబున
ఈతని నుంచుట హితమగు నేమో!

(ఉత్కంఠతో ప్రకాశముగ)

చెంతనె గల ఘనకాంతారంబున
అంతర్హితమై అన్యుల దృష్టుల
కందక యోగ్యంబగు నొక వైణవ
మందిర మున్నది మనకై వేచుచు

అలరెడు తరులతలందున మఱుగై
కలనాదంబుల నలరించెడు ఖగ
కులముల గానంబులకు న్నెలవై
చెలువారును నా చిన్న కుటీరము

ఉన్నది నీకది ఉండుట కనువుగ
నిన్నటఁ గనఁగను నెనరున నేనును
వత్తును దప్పక ప్రతిదినమందును
చిత్తముఁ దన్పెడు చిఱునవ్వూనుచు

జెరార్డ్:

(సప్రశ్రయముగా)

“నిన్నటఁ గనఁగను నెనరున నేనును
వత్తును దప్పక ప్రతిదినమందును
చిత్తముఁ దన్పెడు చిఱునవ్వూనుచు”
ఆహా! ఎంతటి స్నేహప్రేరిత
మోహాసక్తవ్యాహారం బిది!

లక్ష్మి:
త్వరపడు! త్వరపడు! త్వరగ గతించును
స్థిరముగ నిల్వదు తఱి మనకోసము!
జెరార్డ్:
అన్నియుఁ గుదురును నన్నట దాఁచిన
నన్నతలం పెటు లాచరణీయము?
మానితమగు నాసైనికబాధ్యత
మాని వనంబున నేనెటులుందును?
లక్ష్మి:
నిన్నర్థింతును నిండుమనంబున
మన్ననసేయఁగ మత్కాంక్షితమును
జెరార్డ్:
కోరుము దానికి మాఱుగ ప్రాణము!
లక్ష్మి:
(నిర్వేదముతో) నీయాయువు రక్షింపఁగ నెంచెడు
నాయాశయ మగునా యిటు వ్యర్థము?

(శోకించును. జెరార్డు ఆమెను ఎదలోఁ జేర్చుకొనుచు పల్కును)

జెరార్డ్:
శోకింతువు లాక్మీ నీవు!
లక్ష్మి:
(దృఢనిర్దేశముతో) సహియింపను నీచావును నేను!
వలపెఱుఁగని నాస్వాంతము నందున
వెలిగించితి వొక ప్రేమజ్యోతిని
నీసఖ్యంబునె నాసంపదగా
నీసేమంబునె నాసేమముగా
భావించుచు నినుఁ గావ సతంబుగ
దైవంబును ప్రియతమ! ప్రార్థింతును

(ఇర్వురు కౌఁగిలించుకొనుచు క్రింది గీతమును పాడెదరు)

జెరార్డ్:
ఆహా! నా శ్రేయమె నీవెంతువు!
స్నేహంబున నీచిత్తమునందున
నిద్రాణంబయి నిండిన ప్రేమయె
నిజముగ నీగతి నినుఁ బ్రేరేచును
లక్ష్మి:
నీసఖ్యంబునె నాసంపదగా
నీసేమంబునె నాసేమముగా
భావించుచు నినుఁ గావ సతంబుగ
దైవంబును ప్రియతమ! ప్రార్థింతును

(ఇంతలో దుర్గా పల్యంకికాయాత్రావలోకనకై జనులు రానారంభింతురు. దూరమునుండే వారిని చూచి, కౌఁగిటిని వీడి వారు నిష్క్రమింతురు)

ఇర్వురు:
అంబికాదేవి పల్యంకికాయాత్ర
ఆరంభమగు వేళ ఆసన్నమయ్యె
అందుకై జనులిట కరుదెంతురిపుడు
అరుగవలె నిటనుండి త్వరగాను మనము

ఆఱవదృశ్యము

(రాత్రి యగుచుండును. దుర్గాపల్యంకికాయాత్రావలోకనార్థము వచ్చిన జనులతో ఆస్థలము సందడిగా నుండును. ఆయాత్రను చూచుటకు ఎలీనాహెలీనాలు, మేడమ్ బెన్సన్, ఫ్రెడరికు లట నుందురు. తర్వాత కొంత సేపటికి జెరార్డు అచటికి వచ్చును. నీలకంఠుఁడు, అతనికి విధేయు లైన హిందువుల బృందము అచ్చట ప్రచ్ఛన్నముగా నుండును. నీలకంఠుఁడు జెరార్డును గుర్తించి, తన బృందమునకు తెల్పుటకై అచ్చట వేచి యుండును. దూరముగా లక్ష్మీశ్రావకులు గూడ నుందురు. తెర తీయు సమయమునకు ఆయాత్రను నిర్వహించు బ్రాహ్మణార్చకులు, వారి ముందు సాగు వాద్యకారగాయకదేవదాసీబృందములు క్రింద నిచ్చిన దుర్గానామమాలను పాడుచు, దుర్గామందిరములో ప్రవేశించుచుండును.)

అర్చకుల బృందము:
 
దుర్గా దుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ ॥
దుర్గతోద్ధారిణీ దుర్గనిహన్త్రీ దుర్గమాపహా
దుర్గమజ్ఞానదా దుర్గదైత్యలోకదవానలా ॥

దుర్గమా దుర్గమాలోకా దుర్గమాత్మస్వరూపిణీ
దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా ॥
దుర్గమజ్ఞానసంస్థానా దుర్గమధ్యానభాసినీ
దుర్గమోహా దుర్గమగా దుర్గమార్థస్వరూపిణీ ॥

దుర్గమాసురసంహన్త్రీ దుర్గమాయుధధారిణీ
దుర్గమాఙ్గీ దుర్గమతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ ॥

ఇతర యాత్రికులు:
 
జయజయ దుర్గా! జయ శ్రీదుర్గా!
జయ ముక్తిద దుర్గా! జయ మోక్షద దుర్గా!

(పై వాక్యములను పలుమాఱు లుచ్చైస్వరముతో పాడి నటించుచు సందడి చేతురు)

ఎలీనా:
ఎంత సంబరంబొ యిటఁజేరి వీరెల్ల
సందడించుచుండ్రి చాల చాల!
హెలీనా:
పరవశించి వీరు పాడుచాడుచుఁ జేయు
చేష్టలెల్ల నుండె చిత్రముగను!
బెన్సన్:
వెఱ్ఱివారిఁ జేసి వింతగా నాడించు
వీరి నెల్ల వీరి వెఱ్ఱివేల్పు!
వేయి చేతు లూని వికృతాకృతిం బూని
వెఱపు గొల్పు వీరి వెఱ్ఱివేల్పు!

(ఇంతలో జెరార్డు ఆ స్త్రీలకు కొలది దూరములో నున్న ఫ్రెడిరికును జేరవచ్చును. )

ఫ్రెడరిక్:
(జెరార్డుతో) ఆహా! ఆ అందాలదేవతను గాంచ నేఁగితివా?
జెరార్డ్:
(పరధ్యానంతో) ఔను! వారల దేవత లాకర్షింతురు నను!
ఫ్రెడరిక్:
(నవ్వుతూ) ఔనులే! ఆదేవతను నేనును జూచితిని. ఆవిప్రుని పుత్త్రిక నాకును అగపడెను.
జెరార్డ్:
(సోత్సాహంగా) ఆమెను జూడఁగానె మన మద్భుతరీతిని మోహపూర్ణమై
ఏమఱి బాహ్యలోకగతి నేకముగాఁ దలపోయు నామెనే,
ఆమె తనూవిలాసఝరియందున నిచ్చలు గ్రుంకుచుండఁగం
గామన సేయుచు న్మఱలఁగానదు మానస మేమి చేయుదున్?
ఫ్రెడరిక్:
అనురాగము కాదది, నీ
మనమును గ్రమ్మిన విమోహమహిమయె కానీ,
చను నది క్రమముగ, మఱలం
గనుగొందువు సుపథ మీవు కాననమందున్

రెండునాళ్ళలోఁ బోవలె భండనోర్వి
కనెడు నిర్దేశముండెను మనకు నిపుడు
కొన్నిసారులు యుద్ధంబు గూర్చు మేలు
ఈవిమోహమునుండి రక్షించు నిన్ను

(ఇప్పుడు వాద్యబృందము, దాని వెనుక దేవదాసీబృందము, దాని వెనుక దుర్గావిగ్రహమును మోయు పల్యంకికావాహకులు, ఆ పల్యంకిక వెంట నడచు ఇతరజనులు గల యాత్రాదృశ్యము కన్పడును. వారీ క్రింద నిచ్చిన పాటను పాడుచు ఆయుత్సవమును నిర్వహించి నిష్క్రమింతురు.)

పల్యంకోత్సవగీతము (మోహనరాగం, ఆదితాళం)

పల్లవి:
ఓ మహిషాసురమర్దని!ఓమాహేశ్వరి!
క్షేమంబుగ మముఁ జూడుము శ్రీపరమేశ్వరి!
చరణం 1:
కైలాసాచలవాసిని కాత్యాయని కాళీ!
మాలాకృతధవళకపాలాలంకృత కాళీ!
నీలోత్పలదళలోచని శైలాత్మజ కాళీ!
శూలాధారిణిసుందరి సురసన్నుత కాళీ!
చరణం 2:
నీవే స్వాహారూపిణి వీవె స్వధాకృతివీ!
నీవే లక్ష్మివి వైష్ణవి వీవె చతుశ్శ్రుతివీ!
నీవే జ్యోతివి శక్తివి నీవె మహాస్మృతివీ!
నీవే క్షాంతివి శాంతివి నీవె సరస్వతివీ!
చరణం 3:
సేవింతుము, భక్తిని పూజింతుము నిను దేవీ!
భావింతుము, కీర్తింతుము నీవిభవము దేవీ!
ధ్యానింతుము, జపియింతుము నీనామము దేవీ!
గానము సేతుము, వ్రాతుము నీనుతులను దేవీ!
చరణం 4:
అమలంబగు మా మనసులె సుమనోజాలముగా
అమితంబగు మాతపములె ధ్యానావాహనగా
విమలంబగు మాభక్తియె ప్రియనైవేద్యముగా
సముదితమతి మేమర్చింతుము నిన్నే దుర్గా!

(పల్యంకికా యాత్ర అంతమగును. ఆయాత్రికుల వెంటఁబడి పోవుచు జెరార్డు ఇతరాంగ్లేయులకు కనపడకుండును.అచ్చట నున్న సాధారణయాత్రికులు క్రింది పాటను పాడుచు కొంత సందడి చేతురు.)

ఇతర యాత్రికులు:
 
జయజయ దుర్గా! జయ శ్రీదుర్గా!
జయ ముక్తిద దుర్గా! జయ మోక్షద దుర్గా!
బెన్సన్:
(అసహనంతో) తేరుకొనగలమా ఈగోలనుండి?
ఫ్రెడరిక్:
అంతమైనది ప్రధానోత్సవము. అరుగవచ్చును మనమింటికి.
ఎలీనా:
మఱి జెరార్డో?
ఫ్రెడరిక్:
చింతింపఁ బనిలేదు. చేరవచ్చు నతఁడు.

(వారు నల్వురు నిష్క్రమింతురు. ఇతరజనులును నిష్క్రమింతురు. జెరార్డు దూరముగా లక్ష్మీశ్రావకులను చూచి వారివైపు సాగుచుండును.)

జెరార్డ్:
లాక్‌మీ… లాక్‌…మీ!

(చాటునుండి తన అనుచరులతో జెరార్డును గమనించుచున్న నీలకంఠుఁడు, అతఁడే నింద్యుడైన వ్యక్తి యని అనుచరులకు సూచించును. వారు హఠాత్తుగా జెరార్డు చుట్టును మూగుదురు. వారిని తప్పించికొనుటకు జెరార్డు వారితో పోరుచుండఁగా ఆయనుచరులలో ప్రధానుఁడైనవాఁడు అతనిని బాకుతోఁ బొడుచును. జెరార్డు ఆర్తనాదముతో నేలకుం బడును. నీలకంఠుఁడు, అనుచరులు తత్క్షణమే అచటినుండి పాఱిపోవుదురు. ఆ ప్రమాదమును గమనించిన లక్ష్మీశ్రావకులు పఱుగుపఱుగున జెరార్డుకడ కుఱికివత్తురు. లక్ష్మి శ్రావకుని సాయంతో జెరార్డును లేపి అతని తలను తన ఒడిలో నిడుకొని, అతనికి చిన్నగాయమే తగిలినదని గుర్తించును.)

లక్ష్మి:
దుర్గాప్రసాదము. ఇతఁడు సజీవంగానే ఉన్నాఁడు.

తలఁతురు వారు చంపి నిను ధన్యుల మైతిమటంచుఁ గాని నా
వలపులఱేఁడ! దుర్గ మనపక్షపురక్షకురాలటంచు లోఁ
దెలియరు, వారి చెయ్దములు తీవ్రమొనర్చెను నాకు నీయెడం
గల యనురక్తిఁ బూర్వమునకంటెను, నేనిఁక నీదుసొమ్మునే!

(అనుచు సప్రణయముగా పలుకుచు అతనిపై వ్రాలిపోవును. అంతటితో రెండవఅంకము సమాప్తమగును.)

(ద్వితీయాంకము సమాప్తము)