మేనక అను ఈ ఆపెరా ఈకోవలో నేను చేసిన ఏడవరచన. ఇది ఫ్రెంచిభాషలో గల సుప్రసిద్ధమైన మనోఁ (Manon) అను ఆపెరాను భారతసంస్కృతికి అన్వయించుకొనుటకై అనేకమగు మార్పులు, చేర్పులు చేసి చేసిన అనుసృజన. క్రీ.శ. 1731లో ఆబె ప్రెవో (Abbé Prévost) అను సుప్రసిద్ధ ఫ్రెంచి రచయిత Histoire du Chevalier des Grieux, et de Manon Lescaut అను నవలను ప్రకటించియుండెను. ఈ నవలనాధారముగాఁ జేసికొని, 1856లో డేనియల్ ఉబేర్ (Daniel Auber) అను నతఁడు, 1884లో జూల్స్ మసెనే (Jules Massenet) అనునతఁడు ఫ్రెంచిభాషలోను, 1893లో పుచీని (Puccini) అను నతఁడు ఇటాలియనుభాషలోను ఆపెరాలను రూపొందించిరి. వీనిలో చివరి రెండు రచనలు అత్యంతప్రసిద్ధమై అప్పటినుండి ఇప్పటి వఱకును తరచుగా వివిధదేశములలో ప్రదర్శింపఁబడుచున్నవి. మసెనే సంగీతరచన చేసిన ఆపెరా లన్నింటికంటెను ఈ మనోఁ ఆపెరా ప్రశస్తముగా భావింపఁబడుచున్నది. దీనికి ఆన్రి మెయాక్ (Henri Meilhac), ఫిలిప్ గిల్ (Philippe Gille) అను వారు సాహిత్యరచన చేయఁగా, మసెనే సంగీతరచన చేసెను. న్యూయార్కు సిటీ ఆపెరాచే ప్రదర్శితమైన ఇంగ్లీషు లఘువ్యాఖ్యలతోఁ గూడిన ఈ ఆపెరాయొక్క ప్రదర్శనను యూట్యూబులో చూడవచ్చును.
కథాసంగ్రహము
ప్రథమాంకము
భోగపురమునకు (Paris) 150 కిలోమీటర్ల దూరమున నున్న విజయపురము (Amiens) అను చిన్న ఊరిలో నున్న ఒకహోటలు అతిథులతో, ప్రయాణీకులతో సందడిగా నున్నది. అందులో అతిథులకు వినోదప్రసాదకులైన రమణి (Poussette), రంజని (Javotte), రాగిణి (Rosette) అను వేశ్యలున్నారు. అన్నపానములు, అద్దెగదులు లభించుచున్నవి. ప్రాంగణములో అశ్వశకటములు నిల్పికొనుటకు స్థలమున్నది. ఇంతలో భోగపురమునుండి అచ్చటికి 60 ఏండ్లకు పైనున్న శాకునికుఁడు (Guillot) అను ఉన్నతాధికారి, అతనికి మిత్రుఁడైన 35 ఏండ్ల భౌరికుఁడు (de Brétigny) అను ధనికవ్యాపారి వచ్చి, అన్నపానాదులతోడను, ఆ ముగ్గురు వేశ్యల శృంగార విలాసములతోడను గడపుచుందురు. వీరిలో శాకునికుఁడు వృద్ధుఁడైనను, అతనికి స్త్రీవ్యామోహము మెండుగా నున్నది. అతఁడు దానిని బాహాటముగా ప్రదర్శించుచున్నాఁడు. అతని సహచరుఁడైన భౌరికునకు అంతర్గతముగా నది యున్నది. ఇంతలో దేవనదత్తుఁడు (Lescaut) అను 25 ఏండ్ల యువకుడు, శాలిగ్రామమునుండి విజయపురమునకు రాఁబోవుచున్న తన వరుసచెల్లెలైన మేనక (Manon) అను 18 ఏండ్ల అందకత్తెను కలసికొనుటకు ఆహోటలు ప్రాంగణమున కిద్దఱు సహచరులతో వచ్చినాఁడు. మేనక బుద్ధపురములో శ్రమణికగా దీక్ష స్వీకరించుటకు ఆమె తండ్రి బలవంతముచే పోవుచున్నది. అచ్చటికి వెళ్ళు దారిలో విజయపురములో దేవనుఁడామెను కలసికొని బుద్ధపురమునకుఁ గొనిపోవుట కేర్పాటు జరిగినది. తన సహచరులకు కొంత డబ్బు నొసఁగి, వారిని ప్రక్కనున్న పానశాలలో కాలము బుచ్చుమని పంపివేసి దేవనుఁ డామెకై నిరీక్షించుచున్నాఁడు.
ఇంతలో శాలిగ్రామమునుండి అశ్వశకటములో మేనక (Manon) వచ్చి దిగినది. తానెప్పుడో బాలికగా నున్నప్పుడు చూచియుండిన ఆమె యిప్పుడు సంపూర్ణయౌవనవతి, అత్యంతసౌందర్యవతియై ఆశ్చర్యము గొల్పుచున్నది. ఆమె తనయూరినుండి చేసిన తొలి దూరప్రయాణ మిదియే. అందుచే ఆమెకు శ్రమణికగాఁ జేరుటకు ఇష్టము లేకున్నను, ఈప్రయాణములో చూచిన వివిధదృశ్యము లెంతో వినోదకరములుగా నున్నవి. ఆరాత్రి ఆహోటలులో బసచేసి మఱునాఁడు బుద్ధపురమునకుఁ బోవలెనని వారు నిర్ణయించుకొన్నారు. కాని అద్దెగది ఇంకొక రెండు గంటల తర్వాతగాని లభింపదు. అందుచేత వారచట నిరీక్షించుచున్నారు. ఇంతలో దేవనుని సహచరులు వచ్చి, పానశాలలో జూదమాడుటకు రమ్మని అతనిని బలవంతము చేసినారు. దేవనుఁడు రెండుగంటలలోపల తాను తిరిగివత్తునని, అంతవఱకు బుద్ధిగా నుండుమని మేననకుఁ జెప్పి వారితో నేఁగినాఁడు.
ఆమె అచ్చట నిరీక్షించుచుండగా శాకునికుఁడామెను చూచి మోహించినాఁడు. తాను అత్యంతైశ్వర్యవంతుఁడనని, ఆమె యథేచ్ఛగా తన అశ్వశకటములో భోగపురమునకు వచ్చి అన్ని భోగము లనుభవించునని ఆమెకు విన్నవించుకొని మఱల ఆముగ్గురు వేశ్యలతో గడపుటకుఁ బోయినాడు. అతని ప్రవర్తన మేనకకు వింతగాను, వెగటుగాను తోఁచినది.
ఇంతలో తరుణార్కుడు (des Grieux) అను ఒక 20 సంవత్సరముల అందమైన యువకుఁడు రాజపురములో నున్న తన తండ్రి స్థాయుకుని కలియుటకు బోవుచు అచ్చట ఆగినాఁడు. భోగపురము రాజపురసంస్థానములో నున్నది. స్థాయుకుఁడు రాజపురసంస్థానమునకు సైనికాధ్యక్షుఁడు. తండ్రితో విభేదించి భోగపురములో వేఱుగా నున్న తరుణార్కుఁడు ఆవిభేదమును బాపికొనుటకై తండ్రికడ కేఁగు దారిలో అచ్చట నిల్చినాఁడు. మేనక అతనికంటఁ బడినది. ఆమె సౌందర్యమున కతఁడు ముగ్ధుఁడై వెంటనే ప్రేమలోఁ బడినాఁడు. ఆమె కూడ అతని ప్రేమలోఁ బడిపోయినది. నూత్నయౌవనవతియైన ఆమెకు కామమందు, ధనమునందు, సొమ్ములయందు అభిలాషమెండుగా నున్నది. తరుణార్కుఁ డంత చిన్నవయసులో బుద్ధపురములో సన్యసించి బ్రతుకు వ్యర్థము చేసికొనుటకు బదులు తనవెంట భోగపురమునకు వచ్చి సుఖమనుభవింపుమని ఒప్పించినాఁడు. అందుచేత వారిర్వురు అప్పటికప్పుడు శాకునికుని శకటములో భోగపురమునకు పరారీయైనారు. తర్వాత ఆవిషయమును దెలిసికొన్న శాకునికునికి వారిపై ఆగ్రహామర్షములు నిండుగా నెలకొన్నవి. దేవనుఁడు భౌరికుని సాయముతో వారిని విడదీయు యత్నము చేయ సమకట్టినాఁడు.
ద్వితీయాంకము
తండ్రితో విభేదించుటవల్ల దేవనుఁడు బీదగనే ఉన్నాఁడు. సహజముగా సొమ్ములపై, ధనముపై ఆసక్తి గల్గిన మేనకను క్రొత్తలో ఈలోపమంతగా బాధించలేదు. కొన్ని నెలలు గడచినవి. భౌరికుఁడు లోలోపల తన ధనవైభవముచే మేనకను వశపఱచుకొనుటకు యత్నించుచున్నాఁడు. అతఁడు రహస్యముగాఁ దరుణార్కుఁడామెతోఁ జేయుచున్న సహజీవనమునుగుఱించి రాజపురములోని తరుణార్కుని తండ్రి స్థాయుకునికిఁ దెల్పినాఁడు. దేవనుని సహకారమును గూడ పొందినాఁడు. వంశగౌరవమును కాపాడుకొనుటకై ఒకనాటి రాత్రి తరుణార్కుని అపహరించి, రాజపురమునకు దీసికొనివచ్చుటకై స్థాయుకుఁడు భటులను పంపుచున్నాఁడని భౌరికుఁడు తెలిసికొన్నాఁడు. అతఁడు ఆనాటి సాయంకాలం దేవనునితో మేనకాతరుణార్కుల నివాసమునకు పోయి, దేవనుఁడు తరుణార్కుని దూరముగా ఇతరవిషయవ్యగ్రుని చేయుచుండగా మెల్లగా మేనక కానాటిరాత్రి జరుగఁబోవు తరుణార్కాపహృతిని గుఱించి తెల్పి, ఆవిషయ మతనికిఁ జెప్పక అది జరుగనిచ్చినచో తనవలన ఆమె కెనలేని వైభవభోగములు ప్రాప్తించునని ఆమెకు ఆశపెట్టినాఁడు. స్వాభావికముగా ధనవైభవ భోగములయం దత్యంతాసక్తిగల ఆమె తరుణార్కునికి ఆవిషయం తెల్పలేదు. అతఁడారాత్రి అపహరింపఁబడినాఁడు. మేనక భౌరికుని వశమైనది. ఆతఁడామెకు వైభవపూరిత జీవితమును ప్రసాదించినాఁడు.
తృతీయాంకము
అపహరింపఁబడిన దేవనుఁడు తండ్రి యింటికిఁ జేరుకొన్నాఁడు. తండ్రి యతనికి తమ యంతస్తుకు దగిన సుగుణురాలైన ఇతరకన్యకను పెండ్లాడి వంశగౌరవమును నిల్పుమని బోధించినాఁడు. కాని తరుణార్కుని మనసునుండి మేనక ఇంకను తొలఁగలేదు. అందుచే నతఁడామె వియోగశోకమును బాపికొనుటకు కొంత వ్యవధి నిమ్మన్నాఁడు. ధనవైభవాసక్తికి లోనై మేనక తనను వంచించినదను బాధ యున్నను ఆమెయందు కామము గూడ నున్నది. ఇంతలో బుద్ధపూర్ణిమ వచ్చినది. ఆనాటి రాత్రి ప్రదర్శింపఁబడిన సౌందరనందమను బౌద్ధధర్మ ప్రతిపాదకమైన నాటికను అతఁడు తండ్రితోఁబాటు చూచుటకుఁ బోయినాఁడు. ఆనాటకములో ప్రతిపాదింపఁబడిన నిర్మమత్వ, నిస్తృష్ణలు తనకు శాంతిప్రసాదింపగలవని అతఁడు విశ్వసించి, బుద్ధపురములోని బౌద్ధవిహారములో శ్రమణకత్వమును పొందు నుద్దేశ్యముతోఁ జేరినాఁడు.
చతుర్థాంకము
వసంతోత్సవము వచ్చినది.ఆ ముగ్గురు వేశ్యలు, భౌరికుఁడు, శాకునికుఁడు ఇతరులు ఆనాఁడు విహరించుటకై బుద్ధపురమున కేఁగు దారిలో భోగపురసమీపమున నున్న ప్రసిద్ధారామములో చేరినారు. ఇంతలో చక్కగా నలంకరించుకొన్న మేనక కూడ అచ్చటికి వచ్చినది. ఆమెను శాకునికుఁడు చూచి మఱల వశపఱచుకొన యత్నించినాఁడు. కాని ఆమె అతని పూర్తిగా నుపేక్షించినది. ఆమెపై నతని కోప మింకను అధికమైనది. కోపముతో నతఁడా తోఁటనుండి వెడలిపోయినాఁడు. ఇతరులతో మేనక విలాసముగా గడపినది. అందఱును ఆమె అందమును ప్రశంసించినారు. ఇంతలో బుద్ధపురమునుండి రాజపురమునకుఁ బోవుచు విశ్రమార్థమై స్థాయుకుఁ డాతోఁటలో ప్రవేశించినాఁడు. అతని దూరమునుండి చూచి, భౌరికుఁ డెదురేఁగి స్వాగతించినాఁడు. వారు కొంతసేపు తరుణార్కునిగుఱించి మాట్లాడుకొన్నారు. తరుణార్కుఁడు విరక్తుఁడై సన్న్యసింపఁగోరి బుద్ధపురమందు బౌద్ధవిహారములోఁ జేరినాఁడని, తానచటి కేఁ గి ఆ యత్నమును విరమించి, తగిన కన్యకను పెండ్లాడు మని చెప్పి తిరిగి రాజపురమున కేఁగు దారిలో అచ్చట ఆగినానని, కాని తన బోధనవలన తరుణార్కుని నిర్ణయ మేమీ మారలేదని స్థాయుకుఁడు భౌరికునికి తెల్పినాడు. వారి సంభాషణను చెట్లచాటునుండి మేనక విన్నది. భౌరికునివల్ల ప్రాప్తించిన సౌభాగ్యము తనకు విషయవాంఛలు దీర్చినను బీదవాఁడైన తరుణార్కుని ప్రేమయే వాటన్నిటికి కన్న మిన్న యను భావ మెదలో నుండనే యున్నది. భౌరిక స్థాయుకుల సంభాషణ విన్న తర్వాత అది మఱింత దృఢమై, ఆమె బుద్ధపురమునకుఁ బోయి మఱల తనను స్వీకరించి, తనతో దాంపత్యసుఖ మనుభవింపుమని తరుణార్కుని ప్రాధేయపడినది. మొదట దానికి విముఖత కనఁబఱచినను ఆమె తన ఉద్దీపకమైన దర్శనస్పర్శనాదులచే నెట్టకేలకు అతనిని సుముఖునిగాఁ జేసినది. అతఁడు విహారమును వదలి ఆమెతో భోగపురమున ఒక అద్దె యింటిలో ఉండసాగినాఁడు.
పంచమాంకము
గతించిన తల్లిద్వారా తరుణార్కునికి సంక్రమించిన ధనముతో వారి విలాసయుక్తమైన జీవితము నిరాటంకముగా కొన్ని నెలలు సాగినది. మేనక ఆభరణములకు, విలాసములకు చాలా అధికముగా వ్యయము చేయుటవల్ల ఏండ్లపాటు రావలసిన ధనము ఆఱు నెలలలోనే అంతమైనది. ఆమెకు సర్వదా విధేయుఁడై తరుణార్కుఁ డామె వ్యయపూరితమైన వ్యసనములను అడ్డుకొనలేదు. మునుముందు ఇల్లు గడచుటయే కష్టమైనది. ఏదో యొకవిధముగా తరుణార్కునిచేత తన విలాసములకు కావలసిన ధనమును ఆర్జింపఁజేయవలెనని ఆమె ఆలోచించినది. ఆసమయములో జూదములో ఆరితేరి, జూదముద్వారా అధికధనమును గడించుచున్న దేవనుఁ డామెకు తటస్థపడినాఁడు. అతని ద్వారా ద్యూతక్రీడ నేర్చుకొని ద్యూతంలో అధికధనం గడింపుమని ఆమె తరుణార్కుని ప్రేరేచినది. స్వాభావికంగా తరుణార్కుఁడు ద్యూతానికి వ్యతిరేకియే యైనను, మేనకాదేవనుల బోధనలవల్ల ద్యూతమాడుటకు బలవంతంగా అంగీకరించినాఁడు.
ద్యూతగృహములో దేవనుఁడు ఇతరద్యూతకారులతోఁ గలసి ద్యూత మాడుచున్నాఁడు. జూదరులు గడించిన ధనములో తమ విలాసములతో తామును కొంత లబ్ధిపొందుటకు ఆ ముగ్గురు వేశ్యలును అట నున్నారు. శాకునికుఁడును ద్యూతమాడుటకు వచ్చినాఁడు. ఇంతలో మేనకాతరుణార్కు లచ్చటికి వచ్చినారు. తాను మోహించిన మేనక తన శకటములోనే తరుణార్కునితో పరారీ అయి, అతనితో ఎంతో ప్రేమతో తన సమక్షములోనే ఉండుట శాకునికిని అత్యంత కోపసంక్షోభములను కల్గించినది. అతడు జూదములో తరుణార్కుని బొత్తిగా ఓడించి తన కసిని దీర్చుకొనఁ దలఁచి అతనిని ద్యూతమున కాహ్వానించినాడు. కాని తరుణార్కుఁడు సారిసారికి అతని నోడించినాఁడు. ఓడిపోవుచు నున్న శాకునికుఁడు తరుణార్కుఁడు మేనకతోఁ గూడి తనను మోసము చేసినాఁడని పెద్ద కయ్యముకు దిగినాఁడు. తరుణార్కుఁడును అతనికి దేహశుద్ధి చేయుటకు సిద్ధమైనాఁడు. శాకునికుఁడు కోపముతో అటనుండి నిష్క్రమించి, త్వరలోనే పోలీసులతో పునఃప్రవేశము చేసినాఁడు. వారితోఁబాటు స్థాయుకుఁడును అచ్చటికి వచ్చినాఁడు. మోసకారులని మేనకాతరుణార్కులను పోలీసులు చెఱలోఁ ద్రోసినారు. కాని స్థాయుకుఁడు తరుణార్కుని త్వరగనే విడిపించినాఁడు. మేనక మాత్రము కులటగా నిందింపఁబడి, నింద్యలైన కులటలనుంచు జైలులో అత్యంతహీనమైన స్థితిలో నుంచబడినది. అట్టి కులటలకందఱికి సముద్రాంతాన్యదేశబహిష్కారమే శిక్ష.
షష్ఠాంకము
ఇట్లు కొన్ని నెలలు గడచినవి. మేనకను దేశబహిష్కారమునకై ఓడరేవునకు దీసికొనిపోవు దినము వచ్చినది. ఆమెయందు ఇంకను బద్ధానురాగుఁడై యున్న తరుణార్కుఁడు అట్లు గొనిపోవు భటులనుండి బలప్రయోగముతో ఆమెను రక్షించుకొనఁ దలఁచి, దేవనునికి డబ్బిచ్చి కొందఱు ఆయుధధారులను ఏర్పాటు చేయించినాఁడు. కాని వారు డబ్బు తీసికొని భటులను జూడగనే పరారీ యైనారు. ఆ ప్రయత్నము విఫలము కాఁగా, దేవనుఁడు ఆభటులపై అధికారియైన తలారికి లంచమిచ్చి, ఒకగంటసేపు మేనకను తమతోనుండు నేర్పాటును చేసికొన్నాఁడు. అప్పుడామెను దీసికొని పరారీ కాకవలెనని అతని వ్యూహము. కాని అత్యంతబలహీనురాలై నడచుటకుగూడ శక్తి లేని మేనక వారి సమక్షమునకు వచ్చినది. మరణదశలోనున్న ఆమె తాను తరుణార్కునికి చేసిన ద్రోహమునకు పశ్చాత్తాపమును వెలిబుచ్చి క్షమింపుమని వేడికొన్నది. తరుణార్కుఁ డామె నత్యంతాదరముతో అనుగ్రహించి, అటనుండి దూరప్రాంతమునకు పాఱిపోయి సుఖముగా నుందమని ఆమెను రమ్మనినాఁడు. కాని పరిపూర్ణముగా బలహీనురాలై మరణదశలో నున్న ఆమె అతని కౌఁగిటిలోనే మరణించినది.
గమనిక: పై ఇతివృత్తమంతయు నేనీ రూపకంలో వ్రాసిన విధంగా పేర్కొన్నాను. ఇది మసెనే ఆపెరాకంటె అనేకవిషయములలో భిన్నముగా నున్నది. ఇతివృత్తమును భారతసంస్కృతికి అన్వయించుచు వ్రాయుటకై ఈభిన్నత్వ మవసరమైనది. తృతీయచతుర్థాంకములు చాలావఱకు అమూలకములే! మూలములో ఐదంకములే యున్నవి. ఇందులో ఆఱంకము లున్నవి. పైనిచ్చిన యూట్యూబు ప్రదర్శనను చూచిన యెడల ఈ భేదములింకను స్పష్టముగా బోధపడును. అందుచే మాసినో ఆపెరాకు అనువాదముగాఁ గాక అనుసృజనగా, అనేకమైన మార్పులతో, నూతనసన్నివేశ పరికల్పనలతో చేసిన స్వతంత్రరచన యిదని గ్రహింపవలెను.
పాత్రలు
మేనక: తండ్రియొక్క బలవంతంవల్ల బుద్ధపురమునందు బౌద్ధశ్రమణికగాఁ జేరుటకుఁ బోవుచున్న 18 సంవత్సరముల యువతి, అత్యంతసౌందర్యవతి. కథానాయిక.
తరుణార్కుఁడు: తండ్రితో విభేదించి భోగపురమునందు వేఱుగా జీవించుచున్న 20 సంవత్సరముల సైన్యాధిపతియొక్క పుత్రుఁడు, కథానాయకుఁడు.
స్థాయుకుఁడు: తరుణార్కుని తండ్రి, రాజపురసంస్థానసైన్యాధిపతి, 50 ఏండ్లవాఁడు
దేవనదత్తుఁడు: భోగపురవాసి యైన మేనకయొక్క పినతండ్రికొడుకు, 25 ఏండ్ల యువకుఁడు.
శాకునికుఁడు: వృద్ధుఁడయ్యును స్త్రీసంగాసక్తి మానని భోగపురమందలి ఉన్నతోద్యోగి, 60 ఏండ్లకు పైబడినవాఁడు. ధనవంతుఁడు.
భౌరికుఁడు: భోగపురమందలి వ్యాపారి, ధనవంతుఁడు, శాకునికుని మిత్రుఁడు, 35సంవత్సరములవాఁడు.
రమణి, రాగిణి, రంజని: 20 సంవత్సరముల గణికలు (వేశ్యలు)
ఇంకను విశ్రామగృహపాలకుఁడు, సభికుఁడు, జూదరులు, పౌరులు, భటులు మున్నగువారు
ప్రథమాంకము
ప్రథమదృశ్యము
( భోగపురమునకు దారిలో నున్న విజయపురమందలి పర్యాటకవిశ్రాంతిగృహము. విశాలమైన ఆ గృహప్రాంగణములో పర్యాటకులయొక్క శకటములను, గుఱ్ఱములను ఆపుకొనుటకు వసతి కలదు. పర్యాటకులకు కావలసిన అన్నపానాదుల అమ్మకములు, విశ్రమించుటకు కావలసిన అద్దెగదులు ఆవిశ్రాంతిభవనములో నున్నవి. జూదమాడుచు వినోదముగాఁ గడపగోరువారికి, దానికి చేరువలోనే ఇతర ద్యూతగృహములలో ఏర్పాట్లున్నవి. మేనక స్వస్థలమైన శాలిగ్రామమునుండి భోగపురమున కేఁగు ప్రయాణీకులు తరచుగా విజయపురములో విడిసి విశ్రాంతులై అటుపైని భోగపురమునకుఁ బోవుదురు. అది మధ్యాహ్నము 5 గంటల సమయము. అప్పుడొక అశ్వశకటములో శాకునికుఁ డావిశ్రాంతి గృహమునకు వచ్చినాఁడు. అప్పుడే భౌరికుఁడును అచటికి వచ్చినాఁడు. రమణి,రాగిణి, రంజనులను వేశ్యలును పర్యాటకులను వినోదింపఁ జేయుటకు అచ్చట నున్నారు.)
శాకునికుఁడు:
భౌరికుఁడు:
మాదు గోడు వినెడు మానవుండు
అన్నపానములను నందించు సుజనుండు
లేడు లేడు కానరాడెవండు
శాకునికుఁడు:
భౌరికుఁడు:
శాకునికుఁడు:
భౌరికుఁడు:
పలుకజాలనట్టి బధిరులో మూఁగలో?
రమణి:
శాకునికుఁడు:
భౌరికుఁడు:
రాగిణి:
రంజని:
మువ్వురు గణికలు:
కట్టిపెట్టి మీదు గర్వమెల్ల
నిట్టలంబుగాను మ్రొక్కుడింక
పట్టి వారి పాదపద్మములను
తిట్టకుండ…పద్మములను
విశ్రాంతిగృహపాలకుఁడు:
1తప్పిదంబయ్యె మిమ్మిట్లు తత్క్షణంబె
ఆదరింపక యుండుట అతిథులార!
అమరు నన్నియు క్షణములో, నంతవఱకు
మిమ్ము నలరించుచుందు రీమెఱుఁగుబోంట్లు
(అనుచు క్షమింప వేడికొని, ఆమువ్వురు గణికలను చూపించుచు ఆహారము సిద్ధమగువఱకు వారితో విలాసముగా గడపుఁడని కోరును. అదే అదనుగా నెంచి వారి వర్తన కనువుగా నేపథ్యమున వాద్యఘోష వినిపించుచుండఁగా ఆగణికల దర్శనస్పర్శనాలింగనాదులతో వారు గడపు చుందురు. ఇంతలో ఇతరజనులు కొందఱు ఆహారవిహారములకై అచ్చటికి వత్తురు.)
లోకులు:
ముచ్చటగఁ దినుటకై వచ్చితిమి మేము
అచ్చమగు మృష్టాన్న మందించి మాకు
చెచ్చెర న్మముఁ దృప్తిఁ జెందింపుఁడయ్య
ముచ్చటగఁ దినఁగాను వచ్చితిమి మేము
చెచ్చెర న్మముఁ దృప్తిఁ జెందింపుఁడయ్య
(ఇంతలో సిద్ధమైన ఆహారమునుగుఱించి అందఱికి తెలియజేయుచు ఔదనికాదు లీక్రింది పాటను పాడుదురు. ఔదనికుఁడు= వంటవాఁడు)
ఔదనికాదులు:
వేడివేడివంటకాలు వేగవేగఁ దినఁగ రండు!
పప్పుచారు లావకాయ లప్పడాలు పరోటాలు
పాయసంబు లోదనాలు పలురకాల పండ్లు పాలు
అమ్మకాని కున్నవండి, అన్నశాలఁ జేరుకొండి
కమ్మనైన క్రొత్తరుచులు కన్గొనండి, తినఁగ రండి!
గణికల కోరస్:
వేడివేడివంటకాలు వేగవేగఁ దినఁగ రండు!
అమ్మకాని కున్నవన్ని, అన్నశాలఁ జేరుకొండి
కమ్మనైన క్రొత్తరుచులు కన్గొనండి, తినఁగ రండి!
(అక్కడ ఉన్నవారు తినుటకై త్వరపడుచు అభ్యంతరమందలి భోజనశాలకు నిష్క్రమింతురు. అప్పుడు దేవనదత్తుఁడు ఇద్దఱు అనుచరులతో ఆగృహాంగణమునందు కన్పడును)
ద్వితీయదృశ్యము
దేవన:
అనుచరులు:
(దేవనుఁడనుచరుల చేతిలో కొంత ధనము నుంచుచు పల్కును; అక్షకేళి=పాచికలాట; మార్ద్వీకము=Wine)
దేవన:
మత్తు గొల్పెడు మార్ద్వీక మమ్ము చోటు
చెంతనే గలదందునఁ గొంతసేపు
కడపఁ బొండిఁక మీరలు కౌతుకమున
అనుచరులు:
దేవన:
5వరుసకుఁ జెల్లెలై తనరు వామవిలోచన వచ్చుచుండెఁ దా
నిరవును వీడి తొల్లిగను, నేనిట నామెను స్వాగతింపఁగా
దొరకొని వచ్చియుంటి నది తొందరగా ముగియించి మిమ్ములన్
సరసపుటక్షకేళికను సంతసమారఁగఁ గూడ వచ్చెదన్
అనుచరులు:
(నిష్క్రమింతురు. వారు నిష్క్రమింపఁగనే రెండు అశ్వశకటములు వచ్చి ఆగును. వానినుండి ప్రయాణీకులు తమతమ వస్తువులు గల పెట్టెలను తీసికొని దిగుదురు. వారిని చూచుటకు లోపల నున్న కొందఱు బయటికి వత్తురు. ఆప్రయాణీకులలో నందరికంటెను అందెకత్తె యైన మేనక కూడ ఒక పెట్టెను తీసికొని నడచుచుండును.)
లోకులు:
దేవనుఁడు:
అంతలోన నీమె అచ్చరట్లు
రాశివోసినట్టి రామణీయకమట్లు
పూర్ణయౌవనంబుఁ బూని యెదిగె
2సౌరుమీరునట్టి ఛాగంబు యాగంబు
పాలఁ బడినయట్లు పాప మీమె
నిండుయౌవనంబు నిష్ఫలంబై చన
పంపఁ బడియె సన్న్యసింప నిటకు!
(ఛాగంబు=మేఁక; లోకులు నిష్క్రమింతురు. ఇతరప్రయాణీకులు గూడ తమ సంభారములను తీసికొని నిష్క్రమింతురు. అచ్చట దేవనమేనకలు మాత్రమే మిగులుదురు. దేవనుఁడు ఆమె పెట్టెను గ్రహిస్తూ మేనకతో నిట్లు పల్కును.)
1రమ్ము సోదరి! నీకూర్మిరాకకొఱకె
ఎదురుచూచుచు నుంటిని నింతసేపు
నిన్నుఁ జేర్పఁగ శ్రమణకనిలయమందు
నీదు పితరుండు ననుఁగోరి నిన్నుఁ బంపె.
మేనక:
బంధనము సేయ నాతండ్రి పంపె నిటకు
ఐన తాత్కాలికంబుగ నపనయించు
నావిషాదము నేఁటి పైనంపువేడ్క!
(ప్రకాశముగా క్రిందిపాటను పాడును)
11పాట
(ఉల్లాసంతో)
పల్లవి:
పావురముంబలె పైకెగురుట కిదె నాందీ
(కించిద్విషాదంతో)
అనుపల్లవి:
ముదమును బూనుచు మదిలోఁ బొంగుట మానను
(ఉల్లాసంతో)
చరణం1:
రయిరయ్యంచును హయశకటముపై వడిగా
చూచితి దారుల సుందర వనములు ఝరములు
పూచిన పూవులఁ బొల్పగు తీవెలు తరువులు
చరణం2:
విచ్చెను కొలఁకుల వెయిఱేకులనళినమ్ములు
పచ్చిక మేయుచు నిచ్చఁ జరించెను గోవులు
స్వచ్ఛాంబులతో జలజలఁ బాఱె స్రవంతులు
చరణం3:
పురివిప్పిన నెమ్ములనాట్యముఁ బరికించితి
ఎగిరెడు ఖగముల స్వేచ్ఛకు నీర్ష్యవహించితి
ఎగురఁగ నటులే గగనంబున నూహించితి
చరణం4:
సోదర! దేవన! చూడకు చులుకనగా నను
ఇంటిని వీడి సమీక్షించిన వివి యెల్లను
కంటికిఁ బండువువంటివియై విలసిల్లెను
చరణం5:
మనమున మాయామర్మము లెఱుఁగని దానిని
నా తొలి పయనమునం జూచిన దృశ్యంబులు
చేతములో నించెను బహుళాశ్చర్యంబులు
దేవనుఁడు:
నీ యమలిన చిత్తవృత్తినే ప్రకటించున్
హేయము గాదిది, తెల్పు న
మేయంబగు నీహృదబ్జమృదుతాగుణమున్
1రమ్ము మేనక! నేఁడీ గృహమ్మునందె
విశ్రమించి రేపు ప్రభాతవేళయందు
బౌద్ధసన్న్యాసినుల నెలవైనయట్టి
బుద్ధపురమును జేరంగఁ బోవఁగలము
(అని ఆమెతోబాటు విశ్రాంతిగృహములోనికి ప్రవేశించి, ఆగృహనిర్వాహకుని ఇట్లర్థించును)
దేవనుఁడు:
గృహనిర్వాహకుఁడు:
కాని వేచియుండుఁడు రెండుగంట, లపుడు
దొరకఁగల దన్ని వసతులతోడ నున్న
అందమగుగది మీకవశ్యంబుగాను
దేవనుఁడు:
(అని వారచ్చటి ముఖశాలలోని సోఫాలో కూర్చొని యుండఁగా, ముందుగా దేవనునివెంట వచ్చిన అనుచరుఁడు సరభసముగా ప్రవేశించును.)
అనుచరుఁడు:
ఆరూప్యంబులు ఝటితిగ వ్యయమయిపోయెన్
నీరాక కెదురుచూతుము
రారమ్మిఁక మమ్ముఁ జేర రయమున నీవున్
దేవనుఁడు:
జూదంబాడంగఁ, జేరి సుర సేవింపన్,
లేదేని నీమె నిచ్చట
ఆదుకొనంగను నిలుతున ఆప్యాయముగన్?
1చింత పనిలేదు, రెండును జేయవచ్చు
రెండుగంట లిచ్చట వేచియుండవలెను
గాన నీలోన వారితోఁ గడపి తిరిగి
వచ్చి యీమెతో నుండంగవచ్చు నేను
(ప్రకాశముగ మేనకతో)
4వీరలఁ గూడ నేఁగవలె వెంటనె నిన్నిట వీడి కావునం
గోరెద నుండ ధైర్యముగఁ గొంతవడిం, ద్వరగానె వత్తు, నె
వ్వారల మాయమాటలను పాటియొనర్పక యుండు మిందె, సొం
పారెడు నీదు కుట్టుపనియందు నిమగ్నత నంది సోదరీ!
మేనక:
ఒంటిగానున్నచో భయ మొదవుచుండు
దేవనుఁడు:
తృతీయదృశ్యము
(అంతట శాకునికుఁడు ఆగృహాహారశాలలోఁ దిన్న తిండిని నిరసిస్తూ ప్రవేశించును.)
శాకునికుఁడు:
కూరలో కారంబు మెండయ్యె,
చారులో మిరియాలు కరవయ్యె.
సారంబు లేని ఆహారంబు
నీరంబు లేని నారికెడంబు!
కూరలో…నారికెడంబు!
(అట్లు వదరుచున్న అతని దృష్టి హఠాత్తుగా నొక చిన్నవస్త్రముపై పూవులను కుట్టుకొనుచున్న మేనకపై ప్రసరించును.)
ఆహా ఏమీ వింత? ఇలపై నున్నానా ఇంద్రలోకంలో ఉన్నానా?
8పార్వతీపుత్రియౌ పద్మయుంబోలె
ఊర్వశీసవతియౌ ఊర్మిళంబోలె
శ్రీకృష్ణు ప్రియకాంత సీతయుంబోలె
ఈకాంత చెలువంబు లోకోత్తరంబు
మేనక:
శాకునికుఁడు:
ధనికుండ, బంగారుగనివంటివాఁడ
కనిపింతు వృద్ధువలె గాని నేనింతి
తనియింతు యువతులం దరుణుండువోలె
దరహాసమొనరించి వరియింపు నన్ను
చిరకాలభాగ్యంబు చేకొనఁగ రమ్ము!
నీమేన నిలువెత్తు నిస్తులంబైన
హేమమణిభూషలను నింపుగా నుంతు
నాధనము నాసొమ్ము నర్పింతు నీకె
మోదించు ననుఁజేరి మోమోట మేల!
మేనక:
లొదవఁ జేయును క్రోధాగ్ని నెదను గాని
దానిఁ గప్పిపుచ్చుచునుండె వీని వింత
చేష్టలంగల్గు హాసంబు చిత్రముగను!
(పెద్దగా నవ్వును)
(శాకునికుఁడు చివరిమాటలు పల్కుచుండఁగనే ఆ ముగ్గురు వేశ్యలు, భౌరికుఁడు అచటికి వత్తురు. వారాతని చేష్టలకు నవ్వుకొనుచు అతని వారింప యత్నింతురు.)
భౌరికుఁడు:
శాకునికుఁడు:
రమణి:
భౌరికుఁడు:
1వృద్ధమిత్రమ! నీకిట్టి బుద్ధి యేల
అన్నెమును పున్నెమెఱుఁగని చిన్నదాని
వయసునందున నీపౌత్రివంటిదాని
కీచకునివోలె వెన్నాడఁ జూచెదేల?
(మృగము=లేడి, జంతువు – ‘మృగః కురఙ్గేచ’ అని విశ్వకోశము; శాకునికుఁడు= వేఁటకాఁడు – ‘జీవాన్తకశ్శాకునికః’ – అని అమరకోశము.)
వేశ్యలు మువ్వురు:
చిఱుతప్రాయముదానిఁ జెనకంగఁబోకు
వీక్షించు పైనుండి విష్ణుండు నిన్ను
శిక్షించు నీపాపచేష్టితం బతఁడు
పంకమున పూర్తిగాఁ బడిపోకముందె
సంకటము బాపుకో సన్మార్గమెంచి
విరమించు విరమించు వృద్ధశాకునిక
చిఱుతప్రాయముదానిఁ జెనకంగఁబోకు
(అనుచాస్త్రీలు శాకునికుని బలవంతముగా ప్రక్క కీడ్చెదరు. కాని వారి నతఁడు తప్పించుకొని మేనకవైపే పరుగిడుచుండును. అతనిని ఆపి భౌరికుఁ డిట్లనును; రామా=గీతకళావిలాసాదులచే రమింపజేయు స్త్రీ; సుందరీరమణీరామా
– అని అమరకోశము)
భౌరికుఁడు:
ఆరామ నొంటిగా నట నుండనిమ్ము!
శాకునికుఁడు:
లీలగా వచియించి వైళంబె యేతెంతు
(వారినందఱిని శాంతింపఁజేసి, వారికి దూరముగా నున్న మేనకకడ కుఱికి, నిమ్నస్వరంతో ఇతరులకు స్పష్టంగా వినపడకుండా ఇట్లనును.)
శాకునికుఁడు:
సుకుమారి! నినుఁ జూడ నొకగంటలోన
అతఁడు గొనిపోవు గమ్యంబునకు నిన్ను
అతివైభవంబుగా నతులాదరమున
ఆమీఁదఁ గానున్న దంతయును నీకు
కామితంబుగ, సౌఖ్యకరముగా నుండు
(అచ్చట మేనక తక్క మిగిలినవారందఱు నిష్క్రమింతురు.)
మేనక:
ఇతఁడు నుడివెడు గమ్యమేదో
అంతు చిక్కదు సుంతయైనను
ఐన నిచ్చట నాదుసోదరుఁ
డేఁగుదెంచెడు దాఁక నెట్టులొ
సాగదీయగవలెను కాలము!
(గుర్తుచేసికొన్నట్లు నటించి, ఉత్తేజముతో)
2అద్భుతంబు లహహ! ఆస్త్రీల సొమ్ములు
శ్లాఘ్యమెంతొ వారి సన్నవస్త్రమ్ములు
వానిఁ దాల్చి వారు ప్రకటించు సొబగులు
సుందరంబు లతను సందీపకంబులు
11మినమినమెఱిసెడు మణులం దాపిన
ఘనతరళంబుల గళసూత్రంబులు
తళతళలాడెడు తాటంకంబులు
తెలతెల్లని మౌక్తికహారంబులు
సౌవర్ణాంచిత సారసనంబులు
గ్రైవేయంబులు రవ్వల యూర్మిక
లాహా! వారల యాభరణంబులు
ఊహించినచో మోహము రేపును!
(అసంతృప్తితో చింతించుచు పాడును)
11మాడలు మేడలు మండనములపై
వీడుము మేనక! వీడుము లౌల్యము!
బందీ యగుదువు బౌద్ధారామము
నందున రేపే యెందుకు నీకిఁక
సుందరవేషము సొమ్ములు కాన్కలు?
11అందంబులు నానందంబులపై
పొందకు నీవిఁక మోజును మేనక!
కందళితంబులు గానీయకు నే
చందంబగు నాశలు డెందంబున!
చతుర్థదృశ్యము
తరుణ:
త్పాదితమైన తీవ్రతరవైరముచేత జనించు నాదు ని
ర్వేదము నెల్లఁ బాపికొన రేపుదయాన నవశ్యమేఁగి త
త్పాదసరోజయుగ్మమున వ్రాలి క్షమింపుమటంచు వేఁడెదన్
3కోపము నూనినఁ గానీ
నాపయి, వినయంబునఁ జరణంబుల వ్రాలన్
నాపితరుఁడు గణియింపక
నాపలువతనంబును కృప నన్నుం గనఁడే?
(చుట్టును జూచి, హఠాత్తుగా నట మేనకను గాంచి తనలో…)
తరుణ:
సొన్నపుసొమ్ములున్, జిలుఁగుసొంపులు, హారము, లంగరాగముల్,
చెన్నులు గూర్పకుండినను చెక్కినశిల్పమువోలె, మేనకా
సన్నుతరూపముంబలె, పసందుగ నుండెను నీమె రూపమే!
3ఈనళినాక్షినిఁ గౌఁగిట
బూనం గల్గిన భవంబె పుణ్యభవంబౌ,
ఈనారీదరహాససు
ధానిత్యసమాప్లుతమగు తనువే తనువౌ!
(మెల్లగా సవినయంగా ఆమెను సమీపించి ఇట్లనును)
యువతీమణీ! ఒకమాట!
మేనక:
తరుణ:
మేనక:
తరుణ:
మేనక:
తరుణ:
(ఇద్దఱు నవ్వుకొందురు)
మఱి నీపేరేదో నన్నూహింపనిమ్ము
మేనక:
తరుణ:
మేనక:
తరుణ:
3మున్నుగఁ జూచి యెఱుంగను
ఎన్నండును నిన్నుఁగాని యెది కారణమో
మిన్నగ నీతో పరిచయ
మున్నటులే ప్రశ్రయ మొదవును నిను జూడన్
మేనక:
న్నెవ్వారును బల్కరిటుల నిప్పటిదనుకన్
తరుణ:
బవ్విధిఁ బలికించు నన్ను నరయఁగ నిన్నున్
1కాన వినఁగఁ గోరెద నీదుగాథ కొంత
నీకు నభ్యంతరం బేమి లేకయున్న!
మేనక:
ప్రభవమంది నట్టి పల్లెదాన!
బయటిలోకగతుల స్పర్శ సుంతయు లేని
బేలనైన యట్టి పిల్లదాన!
తరుణ:
తెల్లమగుచుండె వేఱుగఁ దెల్పకున్న
ఐన నేల వచ్చితొ యిట కరయఁగాను
గాఢకౌతూహలమునాకుఁ గల్గుచుండె!
మేనక:
చక్కని భోగవస్తువుల, సాత్త్వికవృత్తి హుళక్కి యంచు న
న్నెక్కటిఁ జేసి బుద్ధపురి కేఁగి గ్రహింపుము భిక్షుకీత్వమం
చక్కట! నన్ను నాజనకుఁ డంపఁగఁ బోవుచు నిల్చి తిచ్చటన్
తరుణ:
గాసిన వెన్నెలం బలెను, కంధినిఁ బడ్డ ప్రవర్షముంబలెన్,
పాసి వివేక మిట్లు నిను బౌద్ధవిహారమునందుఁ బందిగా
దాసిగ నుండఁగాఁ బనుచు తండ్రి యగుంగద వ్యాఘ్రతుల్యుఁడే!
మేనక:
దైవనిర్ణయం బిటులుండె తప్పదనుచు
దాసివలె దానిఁ బాటింపఁ దగును గాని
ప్రతిఘటింపఁగరాదు నావంటివారు
తరుణ:
నీదుజీవిత మీరీతి బూది యగుట
మేనక:
తరుణ:
బుద్ధపురికిని మాఱుగా భోగపురము
గమ్యమైనచోఁ దీఱు నీకలఁత లెల్ల!
మేనక:
తరుణ:
ఆపురం, బందు నేనుందు నందుచేత
రమ్ము నాతోడ భోగపురంబుఁ జేర
రాగమున నిన్ను రంజింతు రాణివోలె
పంజరంబును వీడిన పక్షివోలె
స్వేచ్ఛగానుండు నాతోడ ప్రేమమీర
మేనక:
తరుణ:
3ప్రణయంబో సన్న్యాసమొ
ఘనకష్టమొ యౌవనసుఖకాంక్షయొ యెది నీ
మనమునకుం గూర్చునొ తృ
ప్తిని దానిఁ బరిగ్రహింపఁ దివురుట మేలౌ!
మేనక:
9వందనము నీకు నాబంధంబుఁ బాపి
నందింపఁ జేయఁగల సుందరుఁడవీవె
భోగపుర మగు మేనకాగమ్య మిపుడు
రాగమగు లక్ష్యంబు యోగంబు గాదు
(ఇంతలో శాకునికుని శకటచోదకుఁడు ప్రవేశించి మేనకతో భోగపురమున కేఁగు శకటము సిద్ధముగా నున్నదని తెల్పును.)
చోదకుఁడు:
మేనక:
చోదకుఁడు:
2నీమనం బెఱింగి నీయాన పాటించి
భోగపురికిఁ గొనుచుఁ బోవ నిన్ను
నిల్పియుంటి బయట నీటైన శకటంబు
అరుగ నెంచి నప్పు డటకు రమ్ము
మేనక:
(చోదకుఁడు నిష్క్రమించును. మేనక సంతోషంతో తరుణార్కుని కిట్లనును.)
మేనక:
దేవుండు పంపిన దీవనయె మనకు
హాయిగా జంటగా నందులో నిపుడె
పోయెదము చేరంగ భోగపురంబు
(మేనక తరుణార్కునితో తన పెట్టెను తీసికొని పోబోవుచుండఁగా కించిద్దూరమున ఆమువ్వురు వేశ్యలు కనిపింతురు. వారి ఉజ్జ్వల వేష భూషణాదుల మఱియొకసారి చూచుచు ఆమె క్షణమాత్రమాగును. అప్పుడా వేశ్యలు జంటగా వీడుచున్నటు వారిర్వురిని గమనింతురు. )
తరుణ:
మేనక:
తరుణ:
వేశ్యలు:
లేకున్న శూన్యమై నీకొంప మునుగు!
శాకునిక! శాకునిక! సత్వరము రమ్ము
లేకున్న శూన్యమై నీకొంప మునుగు!
మేనక:
(ఇర్వురు హుటాహుటిగ నిష్క్రమింతురు.ఆతర్వాత ఉద్వేగముతో శాకునికుఁడు ప్రవేశించును)
శాకు:
రాగిణి:
శాకు:
రమణి:
శాకు:
రంజని:
శాకు:
12ప్రీతితో నర్థించినట్లుగ
నాతి చేరెను నాదుగూటికి
పోతరించిన పోతుచందము
నీతినియమపు రీతులెఱుఁగక
వనముఁ గలఁచెడు వానరంబటు
లనుభవించెద నాలతాంగిని!
రమణి:
శాకు:
(పైమాట లంటుండగా భౌరికుఁడు ప్రవేశించును)
భౌరికుఁడు:
శాకు:
1సీత నెత్తుకపోయిన శివునివోలె
రంభ నపహరించిన దశరథునివోలె
ఎత్తుకొనిపోయె మేనకం దొత్తుకొడుకు
యువకుఁ డాతరుణార్కుండు యుక్తి పన్ని!
భౌరికుఁడు:
ఆమె రక్షింపఁబడె తరుణార్కుచేత
(ప్రకాశంగా)
చింతింపఁ బనిలేదు వృద్ధశాకునికా!
13పితతోడ కలహించి బీదయై యున్నాఁడు
తరుణార్కుఁ డనువాఁడు స్థాయుకుని పుత్రుండు
అతనిదారిద్ర్య మాయతివ కన్గొనఁ గానె
తటుకున న్నినుఁజేరు త్యజియించి వాని
శాకు:
1కనులు మిఱుమిట్లు గొల్పెడి కరణి నాదు
గొప్ప యైశ్వర్యమును జూపి త్రిప్పికొందు
గిరగిరం దిర్గు రాట్నంబుకరణి నామె
చపలబుద్ధిని నావైపు ఝటితిగాను!
(శాకునిక భౌరికులు నిష్క్రమింతురు. ఆమువ్వురు వేశ్యలు నిష్క్రమింపబోవుచుండఁగా దేవనుఁడు వారి కెదురుపడుచు ప్రవేశించును.)
దేవనుఁడు:
రాగిణి:
రమణి:
రంజని:
దేవనుఁడు:
4ఏది యెఱుంగనట్టి తరళేక్షణ నాదగుప్రాపు గోరఁగా
నాదట నామె నాదుకొన కామెను నొక్కతెఁ జేసి యేఁగితిం
జూదము నాడ నేను, కడుచోద్యమునందుచు నాదురీతికి
న్వేదనఁజెందు నామె స్థితినిం గని నేర్పునఁ జేరి యామెనున్
3ఆతరుణార్కుఁడు ధూర్తుం
డాతరుణీమణిపయి కృతకానుగ్రహముం
బ్రీతిం జూపుచుఁ, గొనిచనె
గాతం దనతోడనుండఁ గామాతురుఁడై
1కాని తండ్రితోఁ గలహించి కలిమిఁబాసి
యున్న వానితో మేనక యుండలేదు
అదియె కారణంబుగ నామె నతనినుండి
ముక్తమొనరింపఁగావచ్చు యుక్తితోడ
(ప్రథమాంకము సమాప్తము)
ద్వితీయాంకము
ప్రథమదృశ్యము
(ఉదయసమయం; స్థలము: భోగపురమందలి భౌరికుని భవనము. ముందుగా భౌరికుఁడు, తర్వాత దేవనదత్తుఁడు)
భౌరికుఁడు:
మేనకాఖ్యను గన్న నిమేషమందె
కామపూరితమయ్యెను నామనంబు
ఆమె పొందునె వాంఛించు నహరహంబు
1వంశగౌరవంబును గంగపాలొనర్చి
చెలువ నొక్కతె నపహృతిచేసితెచ్చి
ఆమెతోనుండెఁ దరుణార్కుఁ డనుచు నేను
స్థాయుకునికిఁ దెల్పితి రహస్యంబుగాను
1తత్ప్రవర్తన నచ్చని స్థాయుకుండు
భంగపఱుప నతని స్వైరవర్తనంబు
భటుల నంపును బలమునం బట్టి తేఁగ
నతని నీరాత్రి ననువార్త నరసియుంటి
(ఇంతలో తలుపు దట్టిన చప్పుడు. భౌరికుఁడు తలుపు తీయఁగా దేవనదత్తుఁడు ప్రవేశించును.)
భౌరికుఁడు:
దేవనుఁడు:
3అన్నెముపున్నెము నెఱుఁగని
చిన్నారిని నపహరించి స్వేచ్ఛావృత్తిన్
చెన్నఁటి తరుణార్కుం డా
కన్నియతో నున్నవాఁడు కామాంధుండై
వాని మాత్రమె నిందించి ఫలమేమి? ఆమె తోడ్పాటు లేక అది సాధ్యమా?
1బౌద్ధభిక్షుకిగాఁ జేయఁ బంపియుండె
నామె పితరుండు నాకడ కామెఁ గాని
త్యాగమునకంటె నమితానురాగమందె
ప్రేమ యున్నట్లుగాఁ దోఁచు నామె కిపుడు
భౌరికుఁడు:
బొంగారెడు ప్రణయభావపూర్ణాంతరయౌ
నంగనకున్ రుచియించునె
సంగంబుల నెల్లఁ బాసి సన్న్యసియింపన్?
1అందుచేఁ జేరె నాతని నామె యిపుడు;
ప్రణయతృష్ణను దీర్పంగ ఘనుఁడె కాని
నిర్ధనుండైన యతఁడెట్లు నిర్వహించు
ఆమెకుం గల వస్తుభోగాభికాంక్ష?
దేవనుఁడు:
భౌరికుఁడు:
ద్వితీయదృశ్యము
(భోగపురమందలి ఒక పెద్ద భవనములో నున్న చిన్న రెండుగదుల భాగములో మేనకాతరుణార్కులు నివసిస్తున్నారు. ఆనాఁడు మధ్యాహ్న సమయంలో భౌరికుఁడు పంపిన ఒక అందమైన బృహత్పుష్పగుచ్ఛమును తీసికొని వచ్చి ఒక పరిచారిక ఒంటరిగానే ఉన్న మేనక కిచ్చును.)
పరిచారిక:
మేనక:
పరిచారిక:
మేనక:
పరిచారిక:
మేనక:
పరిచారిక:
వాణ్ణి వారిస్తూ నీసుందరరూపాన్ని గన్నాఁడఁట!
మేనక:
అతఁడు ధనవంతుఁడా?
పరిచారిక:
దీని నాలోకిస్తూ ఆనందించు. (నిష్క్రమించును)
మేనక:
పల్లవి:
మెంతసుందర మీసుమంబులు!
చరణం1:
మంజులంబగు మాఱువేషము
లవధరించుచు నవనితలమును
మెట్టియుండిన నిట్టులుందురొ!
చరణం2:
వేషధారణ చేసి యాడెడు
నాట్యకత్తెల నలువు నొప్పుచు
అందమగు నీ యలరుగుత్తులు
చరణం3:
నేఱి కూరిచి చేరఁ బంపిన
అతని రసికత అతని హృదయపు
మార్దవం బసమానమౌ గద!
చరణం4:
సొమ్ము లన్నను, సొగసు లన్నను
అమితలాలస నలరు నాదగు
నైజ మేగతి నతఁడు గనెనో!
తృతీయదృశ్యము
(తండ్రి సంపన్నుఁడైన సైన్యాధ్యక్షుఁడైనను, తండ్రితో విభేదించి వేఱుగా నుండుటవల్ల తరుణార్కుఁడు బీదగనే ఉన్నాఁడు. ఇది మేనకకు నిరాశనే కలిగించింది. కాని గత్యంతరం లేక ఆమె కతనితోనే ఉండక తప్పలేదు. బీదవాఁడైనను తరుణార్కుఁడామెయందు బద్ధానురాగుఁడై ఉన్నాఁడు.
అతని ప్రేమ ఆమెకు కొంత ఊరట కలిగించినను, స్వభావతః విలువైన ఆభరణాలూ, వస్త్రాలూ, వైభవాలపై మోజు గల్గిన ఆమెకు మాత్రం నిరాశ, అసంతృప్తులు తప్పలేదు; సమయం: సాయంకాలం 6గంటలు. ముందుగా మేనకాతరుణార్కులు, తర్వాత దేవనదత్తభౌరికులు. దృశ్యారంభమున తరుణార్కుఁ డొక బల్లకడ కూర్చొని వంగి ఏదో వ్రాయుచుండును. మేనక తరుణార్కుని వెనుకనుండి చిలిపిగా తన చెక్కిలిని అతనిచెక్కిలితో జేరుస్తూ పలుకును)
మేనక:
తరుణ:
మేనక:
ఏదో వ్రాస్తున్నావు? నాపేరందులో ఉన్నట్లుంది!
తరుణ:
మేనక:
తరుణ:
మేనక:
తరుణ:
మేనక:
ఆమె మోవి మధుర మగును తేనె కన్న
ఆమెవాణి మధుర మమృతధార కన్న
ఆమె నవ్వు రమ్య మౌను జ్యోత్స్నకన్న
ఆమె ఎదుట నున్న నదియె స్వర్గమన్న
ఆమె భూమి నున్న అతివలందు మిన్న
తరుణ:
ఆమె ఎదుట నున్న నదియె స్వర్గమన్న
ఆమె భూమి నున్న అతివలందు మిన్న
మేనక:
2ఎఱుఁగనింతదాఁక నిట్లెంతువని నీవు
మునిగియుంటివోయి పూర్తిగా ప్రేమలో!
తరుణ:
మేనక:
(ఇద్దఱు చుంబింతురు. దానినుండి తేఱుకొని)
సరే! ఇఁక ముందేముందో చూతాం!
తరుణ:
ఆమెలేకయున్న నదియె నిదాఘంబు
వేకువందు వీచు పిల్లగాలి యట్లు
ఆకసాన వెలుగు జోకవెన్నెలట్లు
ఆమె సాహచర్య మమితసుఖము నొసఁగు
ఆమె మైత్రి శోకహరణ మగుచు నెసఁగు
మేనక:
ఆకసాన వెలుగు జోకవెన్నెలట్లు
తరుణ:
నాదు పత్ని వగుము నాదుకోర్కె దీర్చు
మేనక:
తరుణ:
మేనక:
తరుణ:
మేనక:
ఇక ఆఉత్తరం మీనాన్నకు పంపిరా!
తరుణ:
అందమైన పుష్పగుచ్ఛం. ఇదెక్కడిది?
మేనక:
తరుణ:
మేనక:
(వగలు పోతూ)ఎవరో కిటికీనుండి పడవేసినారు. అంత అందమైన పూలను పడవేయలేక బీరువాలో దాచుకొన్నాను.
ఇంకా అనుమానం తొలఁగలేదా?
తరుణ:
మేనక:
తరుణ:
(అని అతఁడు తలుపుదీయఁబోవుచుండఁగా, ఎవరో బయటినుండి పెద్దగా ఆతలుపును దట్టుచున్న చప్పుడగును. తరుణార్కుఁ డాతల్పును తీయగనే దేవనదత్తుఁడు, భౌరికుఁడు ప్రవేశింతురు.)
దేవనుఁడు:
భౌరికుఁడు:
తరుణులకు సహజమే పొరపడుట యీరీతి
దేవనుఁడు:
ఆకతాయను శిష్టుఁడని పొగడంగవలెనె?
తరుణ:
దేవనుఁడు:
తరుణ:
దేవనుఁడు:
1గంగపాల్సేసి మావంశగౌరవంబు
నాదుసోదరి హరియించినట్టి నీదు
ముక్కుచెవులను గోయుటే చక్కనైన
మాన్యతాయుత బహుమతి మహిని నీకు!
భౌరికుఁడు:
తరుణ:
ప్రతికృతియె నీకుఁ దప్పక ప్రాప్తమగును
కాన మసలుము నీదురాగ్రహము, తీవ్ర
వాగ్విధానంబు, గర్వంబు పరిహరించి
భౌరికుఁడు:
పూనుడు శాంతిని, వివాదమును దేల్చికొనం
గానిండిఁక యత్నంబును
సానునయంబుగఁ, దొఱంగి సాహసవృత్తుల్
మేనక:
3కూరుచు మీవాగ్యుద్ధ మ
పారంబగు వెఱపు నాకు, పరికింపఁగ నీ
పోరితమునకు న్నేనే
కారణమగుదుం బ్రియతమ! కావుము నన్నున్
తరుణ:
బూనఁగ నేల, బాధ్యతను బూనెద నంతకు నేనె, వీని క్రో
ధానల మిప్పుడే యడఁచి యాదృతి మీరఁగ నాదుకొందు ని
న్గాన మెలంగు స్వస్థతను నాపయి భారమునుంచి ప్రేయసీ!
దేవనుఁడు:
బ్రేమనెపంబుతో నపహరించితి వెంతయొ మోసకారివై,
నీమలినంపువర్తనను నింద్యముగాఁ దలపోయకీవు పె
న్దామసపూర్ణవృత్తి ననె దండ్యునిగాఁ దలపోతువుద్ధతిన్!
భౌరికుఁడు:
3మానుము కోపావేశము,
పూనుము సరసంపుగతులఁ బొందింపఁగ నీ
చానకు భవిష్య సుఖసం
ధానసమర్థమగు శోభనస్థితి నర్థిన్
1కలహమెందుకు యుక్తియుక్తంబుగాను
తీర్చుకొనఁగల్గు విషయంబుఁ గూర్చి యిట్లు;
వృద్ధికరమగు వర్షంబు వృక్షమునకు
పెఱికివేయును దానినె పెనుతుఫాను
అందుచే సామరస్యముగా నతనితో మాటాడి తేల్చికొమ్ము!
దేవనుఁడు:
శాంతంబుగా నింక సాధింప వలతు
(సవినయముగా తరుణార్కునితో)
1నాదుసోదరి సేమంబు నేఁదలంచి
అడుగుచుంటిని కైమోడ్చి ఆర్య! నిన్ను ….
తరుణ:
1‘అడుగుచుంటిని కైమోడ్చి ఆర్య! నిన్ను’
నీవె పల్కుచుంటివె యిది నిజముగాను?
దేవనుఁడు:
1సంశయంబేల మిత్రంబ! సవినయముగ
నిల్చితిని గద! కైమోడ్చి నీదుముందు
అడుగుచుంటిని నిస్సంశయముగఁ దెల్ప
పెండ్లియాడెదొ లేదొ యీపిల్లదాని?
దేవనభౌరికులు:
హర్షణీయమెంతొ ఆర్య! మాకు,
ఇట్టి నిన్ను మేము హృత్పూర్వకంబుగా
స్వాగతింతు మాప్తసఖునిగాను!
భౌరికుఁడు:
మానసంబున నున్నది మనసు విప్పి
తరుణ:
మీదు వాక్కులు విన నాకు మోదమెసఁగె
దేవనభౌరికులు:
హర్షణీయమెంతొ ఆర్య! మాకు,
ఇట్టి నిన్ను మేము హృత్పూర్వకంబుగా
స్వాగతింతు మాప్తసఖునిగాను!
తరుణ:
మీదు వాక్కులు విన నాకు మోదమెసఁగె
3ఇదిగో మేనకఁ గూరిచి
సదమలమనమున మదీయజనకునికి న్నా
మదిలో నున్నది యున్నటు
లదరక తెల్పికొను లేఖ, అరయుము దీనిన్
(అని సగర్వముగా, తాను లోఁగడ వ్రాసి తండ్రికి పంపఁబోవుచున్న లేఖను దేవనున కిచ్చును. దేవనుఁడు దానిని చూచి, అచ్చట వెలుఁగు తక్కువగా నుండుటచే నీక్రిందివిధముగాఁ బల్కుచు తరుణార్కుని బయట నున్నఅంగణములోనికిఁ గొనిపోవును .)
దేవనుఁడు:
దీనిం జదువంగఁ గలమె? తేజోమయమై
మానగు నంగణమందున
బూనికఁ గూర్చుండి చదువఁ బోవుద మటకున్
(దేవనతరుణార్కులు బయటికి నడచి అంగణములో నున్న ఆసనములపైఁ గూర్చొందురు. భౌరికుఁడు మేనకను సమీపించి ఆమెతో నిమ్నస్వరములో మాటాడును.)
మేనక:
భౌరికుఁడు:
మేనక:
భౌరికుఁడు:
నేఁటిరేయతని నదాటుగాను
అపహరించు సమయ మాసన్నమగుచుండె
ఇదియె తెల్ప వచ్చితిటకు నేను
మేనక:
భౌరికుఁడు:
మేనక:
అతనిఁ గాపాడవలె నవశ్యంబుగాను
భౌరికుఁడు:
పల్కుచుంటిని నీభావిభాగ్య మెంచి
మేనక:
భౌరికుఁడు:
చొప్పడు నీకతనికిని నశోభనకరమై,
ఇప్పుడె సమయం బాతని
చప్పున వీడి కన ధనము శాశ్వతసుఖమున్
11పాట
మేనక! దాఁచుము లోననె యీవిషయంబును
పూనికతోఁ గనుముజ్జ్వలనూత్నపథంబును
మేనక:
తెలియక కార్యము తికమకపడు నాడెందము
భౌరికుఁడు:
పైఁడివిభూషలు పరిచారిక లందలములు
మణిహారంబులు మధురతరాహారంబులు
కని జీవితమునఁ గాంచుము నవ్యారంభము
వినిపింపకు మాతని కీనిసి విషయంబును
విని నామాటను కను స్వేచ్ఛను విభవంబును
మేనక:
వీడఁగఁ దగునా ప్రియతమబంధంబును?
ఏమియుఁ దోఁచక నామనమూగాడును
నీమాటలతో నిఁక నాశల నెసకొల్పకు
చింతింపఁగ నిమ్మింతగ కర్తవ్యంబును
చింతింపఁగ నిమ్మింతగ కర్తవ్యంబును!
(అంగణములో దేవనుఁడు తరుణార్కుఁడు వ్రాసిన లేఖను చదువుచు తరుణార్కుని స్పందనకై అతని ముఖమును చూచుచుండును.)
దేవనుఁడు:
ఆమె నవ్వు రమ్య మగును జ్యోత్స్నకన్న
ఆమె ఎదుట నున్న నదియె స్వర్గమన్న
ఆమె భూమి నున్న అతివలందు మిన్న’
(అని చదివి తరుణార్కునితో నిట్లనును)
నిన్ను కవిగఁ జేసె నిజముగానె యామె!
తరుణ:
పడుచుమనసువలపు ప్రతిఫలించునవివి
దేవనుఁడు:
ఆమెలేకయున్న నదియె నిదాఘంబు
వేకువందు వీచు పిల్లగాలి యట్లు
ఆకసాన వెలుగు జోకవెన్నెలట్లు
ఆమె సాహచర్య మమితసుఖము నొసఁగు
ఆమె మైత్రి శోకహరణ మగుచు నెసఁగు’
ఆహా! అద్భుతం! సార్ద్రమగును కనులుచదువుచుండ దీని!
ఆమెను పెండ్లాడెదవా?
తరుణ:
దేవనుఁడు:
3సారంబగు రాగంబున
నీరామను బెండ్లియాడ నీతఁడు గోరున్
కోరెద వీరల సంగము
భూరిసుఖాంచితమయి పొలుపొందుత యనుచున్
భౌరికుఁడు:
భూరిసుఖాంచితమయి పొలుపొందుత యనుచున్
(దేవనునితో)
ఇఁక బయలుదేఱుదమా?
దేవనుఁడు:
(తరుణార్కుఁడు తండ్రికి వ్రాసిన లేఖ నచ్చటగల చిన్న బల్లపైనుంచి, వారిని తలుపుదాఁక అనుసరించుటకు దేవనునితో ముందు నడచుచుండఁగా భౌరికుఁడు కొంచెం వెనుకకుఁ జిక్కి, నిమ్నస్వరంతో మేనకతో నిట్లనును.)
భావింపుము భవిష్యద్భోగంబును, భాగ్యంబును!
(దేవనభౌరికులను బయటికి పంపి, తరుణార్కుఁడు తలుపు మూయును)
చతుర్థదృశ్యము
మేనక:
(ఆమె దీపమును వెలిగించి ఆబల్లపై గల లేఖను చూచి తరుణార్కునితో నిట్లనును)
నీ ఉత్తర మిక్కడే ఉంది.
తరుణ:
(ఆ ఉత్తరంతో అతఁడు ముందుకు సాగి, అంతలో ఆగి కొంత సంశయిస్తూ ఆమెతో నిట్లనును.)
మేనక! మేనక! ప్రేమింతును నిన్నతిగాఢంబుగ! నీవటులే నను ప్రేమింతువ మేనకా?
మేనక:
తరుణ:
మేనక:
తరుణ:
(అతఁడు నిష్క్రమించును. ఆమె భోజనపాత్రలను బల్లపై నుంచి ఇట్లు చింతించును)
మేనక:
నూతన రమ్యజీవనవినోదములం గనుగొంటిఁ గాని నే
డాతని ప్రేమకంటె మణిహాటకవస్త్రవిభూషణాదియో
గాతతభోగమే ప్రముఖమన్న తలంపెదఁ గ్రమ్ముచుండెడిన్
1ఆతలంపును నేనెంత అడ్డుకొనినఁ
గాని, యది వజ్రభూషణకాంతిజాల
బంధనమునుండి నిర్ముక్తి నొందకుండె
పంజరంబునఁ జిక్కిన పక్షివోలె
(వజ్రభూషణ…బంధనము= వజ్రాభరణాల కాంతిసమూహమనెడు వల లేక ఇంద్రజాలముయొక్క నిర్బంధము; జాలము=సమూహము,వల, ఇంద్రజాలము . )
1పైమెఱుంగులకే పారవశ్యమొందు
అలఁతితలఁపులగూడైన ఆత్మ నాది
తగను తరుణార్క నీజీవితాన నేను
తేజరిల్లఁగ నాఱని దీపమగుచు!
(అని వితర్కించి అచ్చట నున్న మేజాకు విషాదముతో వీడ్కోలు పల్కుచు నిట్లు పాడును. మేజా=బల్ల)
13మేజాపాట
చిన్నారి సఖుఁడవై చెలువారు మేజా!
వీడ్కోలు నీకింక వీడ్కోలు మేజా!
మాజీవితాలలో మఱవంగఁ జాల
నీపాత్ర నిజముగా నేనెపుడు మేజా!
ప్రాతదైనది యంచు పనికిరానిది యంచు
పడవేయకుండ నిను పరమాప్తునిగ నెంచి
యోజించి నీతోడ మాజీవితంబులను
మేముంటి మిట నీదు మిత్రులను బోలుచును
మాశోకహాసాల మాకోపతాపాల
మాకౌతుకంబుల మాకౌఁగిలింతల
మాకలహరీతుల మాకామరీతుల
ఆంతరజ్ఞుండవై అన్నిటినిఁ గన్నావు
ఇటువంటి నినువీడి ఏఁగంగ నిపుడు
మనసు రాకున్నను మఱి కానరాదు
అన్యతరమౌ మార్గ మందుచే మేజా
వీడ్కోలు నీకింక వీడ్కోలు మేజా!
(ఇంతలో తరుణార్కుఁడు సమీపించుచున్న శబ్దమగును.)
ఆ..అతఁడు తిరిగి వస్తున్నాడు. నా విషణ్ణవదనము నాతఁడు గమనించునేమో!
(అని కృత్రిమహాసము చూప నెంచునుగాని ఆమె ముఖవిషాద మింకను పొడసూపుచునే ఉండును.)
తరుణ:
(ఆమె ముఖవిషాదాన్ని గమనించి అలజడితో)
నీవేడుస్తున్నావు?
మేనక:
తరుణ:
మేనక:
తరుణ:
ముందుగా నీకు చెప్పాలని ఉంది సుందరీ! తిరిగి వస్తూ నేనొక కల గన్నాను!
మేనక:
తరుణ:
స్యదముగ నొక్క వాహిని, తదంతికమందున నందనంబునన్
త్రిదశగణేంద్రు కేళిగృహరీతిగ నొప్పుఁ గళాభిరామమై
సదనమొకండు, నందు నరుసంబున నే నినుఁగూడి యున్నటుల్…
(అని తరుణార్కుఁడు తన కలనుగూర్చి చెప్పఁబోవుచుండఁగా, అడ్డుకొని అనాసక్తితో)
మేనక:
తరుణ:
1నీవు తోడున్నచో ఫుల్లనీరజాక్షి!
అలరుతోఁటయౌ మరుభూమి యైనఁ గాని
సూనమృదులమౌ కంటకమైనఁ గాని
అమరలోకమౌ శూన్యగేహంబు గాని!
(అతఁడు ముగించుచుండఁగనే బయటినుండి పెద్దఁగా తలుపుదట్టిన చప్పుడు వినిపించును.)
మేనక:
తరుణ:
గొనకొని భంగంబు సేయఁ గొట్టెదరెవరో
రణభేరింబలెఁ దల్పును
కనుగొని వచ్చెదఁ దదీయకారణ మిపుడే
మేనక:
తరుణ:
మేనక:
తరుణ:
మేనక:
ఉండుమిందె తరుణ! ఉండు మిందె
(మఱల పెద్దఁగా తలుపుదట్టిన చప్పుడు వినిపించును.)
తరుణ:
తిరిగివత్తును గద త్వరగ నేను!
మేనక:
తరుణ:
సరసముగ వారలెవ్వారొ యరసివత్తు
(మఱల పెద్దఁగా తలుపుదట్టిన చప్పుడు వినిపించును.)
అంతలోపల మన భోజనార్థమన్ని
సిద్ధపఱచుము నీవు నిశ్చింతగాను
(అని తలుపు తీసి బయటికి నడచును. పెద్దసంఘర్షణ జరిగిన చప్పుడు వినిపించును. అతఁడపహృతుఁడగును.)
మేనక:
(తన ముందున్న బల్లపై కూలిపోవును)
(ద్వితీయాంకము సమాప్తము)
తృతీయాంకము
ప్రథమదృశ్యము
(భటులచే నపహరింపఁబడి మూఁడురోజుల ప్రయాణానంతరము తరుణార్కుఁడు రాజపురమందలి తండ్రి యింటికి చేరుకొనును. ఆలోపల తరుణార్కుఁడు మేనకనుగుఱించి వ్రాసిన లేఖ తండ్రికి చేరును. అంతేకాక, భౌరికుఁడు ఏర్పాటుచేసిన పెద్దభవనములో మేనక సేవికాపరివృతయై వైభవముగా నున్నట్లును అతనికి వార్త చేరును. తండ్రి తరుణార్కునికి వారి కుటుంబస్థాయికిఁ దగిన అన్యకన్యను పెండ్లాడుమని బోధించును. కాని ఆబోధనలు తరుణార్కుని మనసున కెక్కవు. అతఁడు మేనక వంచననే తలఁచికొని చింతించుచుండును. ఇట్లు మూఁడు నెలలు గడచిన తర్వాత అతఁడు విరక్తుఁడై బుద్ధపురములోని బౌద్ధాశ్రమములో చేరును.)
స్థాయుకుఁడు:
నీదుమేలునె నిత్యంబు నెఱదలంచు
నీదుతండ్రిని నేనంచు నిశ్చయముగ
నెఱిఁగి వర్తింపు మింతయు వెఱపు లేక!
2భటులచేత నేను బలవంతముగ నిన్నుఁ
బట్టి తెచ్చితినని వగవవలదు
నీదుమేలుకొఱకె నేనట్లు గావించి
యుంటినంచు నెఱుఁగుమోయి నిజము!
తరుణ:
జన నేనింతయుఁ గాని, నామనములో సంస్థాపితంబయ్యె శో
భనరూపాన్విత మేనకాఖ్య స్థిరమై, భద్రావహంబౌను న
వ్వనితారత్నముఁ గూడి జీవితమునన్వర్తించుటే నాకిఁకన్
స్థాయుకుఁడు:
3తెల్లని వెల్లను పాలని,
నల్లని వెల్లను జలమని నమ్ముచు నీవా
పల్లవగాత్రి నిగూఢపు
టుల్లపులోతుల నరయక యుంటివి తరుణా!
3ఎంతగఁ బ్రేమింతువొ యా
కాంతను నది నీదులేఖ కథనము చేసెన్,
సుంతయుఁ గన వీ వామె హృ
దంతరమున నుండె నన్యుఁ డను విషయంబున్
తరుణ:
మనసు నిల్పుచు మసలెడు మంజులాంగి
అన్యపురుషునిపై రక్తి నందియుండె
ననుట నాకు విశ్వాసయోగ్యంబు గాదు
స్థాయుకుఁడు:
మునిఁగి గణియింప వామె కుగుణములీవు
సంపదాఢ్యుండనుచు నామె చాటుగాను
భౌరికునిఁ గూడి క్రీడింపఁ జేరుచుండె
1అపహృతుఁడ వగుచుంటి వీవనియు నెఱిఁగి
నీకుఁ దెల్పక యుండెను నిహ్నవమున
ఇపుడు బాహాటముగ వసియించుచుండె
భౌరికుం డేర్పరించిన భవనమందె
3మణులన్నను,స్వర్ణం బ
న్నను, ధనమన్నను, మెఱుంగునగలన్నను, నీ
తిని గణియింప దొకింతయు,
కొను నామె యొసంగ నెట్టి కుజనుండైనన్
1స్వార్థపరుఁడైన భౌరికుండంపినట్టి
ఉత్తరంబులు దెల్పె నీయున్కి నాకు
నిన్ను నీరీతిఁ దొలఁగించి నీదు ప్రియను
వశపఱచుకొనె నతఁడామె భావమెఱిఁగి
తరుణ:
11పాట
పల్లవి:
లింతుల నమ్మెడి వారల ప్రేమకు
నింతేకద ఫలితం బంతంబున!
చరణం1:
పైనను క్షీరము లోన విషంబును
పూనిన చెలువగుభాండము లింతులు
చరణం2:
జేరిచి ఘనమగు ప్రణయోష్మంబున
మారణమొనరుచు దీపము లింతులు
చరణం3:
మణిగణమునకన్నను లోకువగా
గణియింతురు దమ కాంతుల నింతులు
(తండ్రి, అతని అనుచరులు ఉపచారములు చేయఁగా తెలివినంది, కోపముతో నిట్లఱచును.)
3ఆదుష్టాత్ముని భౌరికు
నాదుర్మార్గపువనితను నాహుతిసేయం
బోదును నిపుడే భీత్యు
త్పాదకఘోరాగ్నికీల వాలాయముగన్
3వ్యాపాదంబున నాకీ
యాపద కల్గించినట్టి యాభౌరికునిన్
పాపపథానుగయగు నా
రూపాజీవ నిపుడె చని రూపడఁగింతున్
(రూపాజీవ= రూపమే జీవనోపాయముగాఁ గలది=వేశ్య, వ్యాపాదము=ద్రోహచింత)
స్థాయుకుఁడు:
పంతగించుచుఁ బోయి పాపానఁ బడకు
దైవంబె వారలన్ దండింపఁ గలఁడు
నీవంతఁ బాపికొను త్రోవ యది గాదు
(అని అతనిని వారించి, నెమ్మదిగా ప్రక్కన కూర్చుండఁజేసి యిట్లు సముదాయించును)
9సౌందర్య మిలయందు శాశ్వతము గాదు
మ్రందునది ప్రాయంబు మళ్ళినకొలంది
సౌందర్యమున్నను సద్గుణము లేని
బొంది నిజముగ తోలుబొమ్మయే సుమ్ము
9అట్టిబొమ్మయె నీప్రియాంగనామణియు
పట్టింపుతో నీదు భావంబునందు
ఆమెనుం దొలఁగించి అన్యమౌ కాంక్ష
నీమది న్నెలకొల్పి నెమ్మదిం గనుము
9సౌందర్యసచ్ఛీలసంపదల్గల్గు
సుందరిని తరుణార్క! చూపింతు నీకు
మనువాడి యామెను మనవంశమునకుఁ
గొనిరమ్ము కీర్తినిం గుణగౌరవమును
తరుణ:
ద్భవికహితార్థయుక్తు లను వాస్తవముం గ్రహియింతుఁ గాని, క్లే
శవిలులితాంతరంబున విచారము సేయఁగలేను నేనెదిన్
వ్యవధి యొకింత నాకిడుము బాగుగ నాభవితవ్యమెంచఁగన్
స్థాయుకుఁడు:
భటులున్ సేవకసేవికాప్రతతి సర్వార్థంబులం దీర్పఁగన్
పటుసౌఖ్యస్థితిఁ, బ్రాఁతవాసనల నీస్వాంతంబునం దూల్చుచున్
స్ఫుటితంబై చను నూతనాశయములం బుష్పింపఁగాఁజేయుచున్
ద్వితీయదృశ్యము
(తరుణార్కుఁడు ఇంటిపట్టున నుండి మూఁడునెలలు గడచినవి. అంతలో వైశాఖపూర్ణిమ వచ్చినది. అది బౌద్ధుల కత్యంతపర్వదినము. ఆసందర్భములో సౌందరనందమను నాటిక ప్రదర్శింపఁబడును. ఇంకను దుఃఖితుఁడయ్యే యున్న తరుణార్కుని ప్రసన్నుని జేయుటకై స్థాయుకుఁ డతనితోఁబాటు ఆనాటకమును చూడఁబోవును.)
స్థాయుకుఁడు:
ర్వాశాగర్భమునందుఁ జంద్రుఁ డుదయంబైనట్లు జన్మించెఁ గా
దా శౌద్ధోదని, అందుచే నతని గాథాపూర్ణవృత్తం బిటం
గౌశల్యాయతి నాడుచుందు రది ప్రేక్ష్యంబౌను నత్యంతమున్
3దానిం గనఁ దరుణార్కా!
యీనిసిఁ బోదము మనమును, హృదయంగమమై
ఆనాటకంబు నీకతు
లానందప్రదమగు నని యాశింతును నేన్
తరుణ:
ఖదమనమార్గముం దెలుపు గ్రంథములం, గననెంచి నాదు దుః
ఖదళనమార్గముం గనుకఁ గాంక్షితమే యగు నాకు నాన్న! ఆ
సదయునిఁగూర్చికూర్చిన రసప్రచురంబగు నాటకంబులున్
స్థాయుకుఁడు:
కనుద మేఁగి కౌతుకంబుతోడ
అంతర్నాటకము
(అది సుందరమైన నాటకశాల. ఆరాత్రి అచట సౌందరనందమను నాటిక ప్రదర్శింపఁబడును. దానిని చూచుట కానగరములోని ఉన్నతశ్రేణి స్త్రీపురుషులు వచ్చియుందురు. వారిలో స్థాయుకతరుణార్కులు గూడ నుందురు.)
(సుందరీనందుల ప్రణయ దృశ్యము)
సుందరి:
భరితం బగు మన భవముల యందున
క్షణముల రీతిగ సాగె యుగంబులె
మనముల నిండెను మధురోహంబులె
నందుఁడు:
కలసి చరించెడు కలహంసలవలె
అలుపెఱుఁగక పెనువలపులఝరిలో
అలవోకగ నిఁకఁ గలసి చరింతము
క్షణములరీతిగ…మధురోహంబులె
సుందరి:
నీటుగ నీతోఁబాటుగ నుండిన
ప్రతినిమిషంబును పది స్వర్గంబులు
క్షితినే స్వర్గము జేయుచుఁ దోఁచును
క్షణములరీతిగ…మధురోహంబులె
నందుఁడు:
పర్వముగా మన భవముల నిల్చెను
ఈసుఖ మిటులే భాసిలు గావుత
వాసనఁ బాయని ప్రసవము రీతిగ
ఇర్వురు:
మనముల నిండెను మధురోహంబులె
(చావిట్లో పౌరుల దృశ్యము)
పౌరులు:
కౌతుకమారఁగఁ గాంతము రండు
కదలెడు దీపపుకళికం బోలుచు
సదమలతేజము సరణుల నింపుచు
పురవీథులలోఁ జరియించెడు నా
కరుణాసింధునిఁ గాంతము రండు
ఆతని పాదములందున వ్రాలుచు
పాతకమెల్లను బాఱం ద్రోలుచు
ఆతని బోధలయందునఁ దోఁగుచు
పూతాత్ముల మైపోదము రండు
గౌతమబుద్ధుని కారణజన్ముని
కౌతుకమారఁగఁ గాంతము రండు
(అని పాడుచు వారలు బయలుదేరఁగా బుద్ధుఁడు భిక్షకై పర్యటించు దృశ్యము కన్పడును. అప్పుడు వారు బుద్ధునికి పాదాభివందనము చేసి, అతని వెంట సాగుచుందురు. )
పౌరులు:
సేవించి తరియింపఁ జేరితిమి స్వామి!
ఆమహాభాగ్యమ్ము నందించి మమ్ము
ఓమంగఁ బ్రార్థింతు మోస్వామి మిమ్ము!
బుద్ధుఁడు:
చతురతం జనులార సాధించి వాని
బ్రతుకులన్ శోకంబు వారించుకొనుఁడు
మతులందు శాంతులై మనుచుండు డిలను
పౌరులు:
(మఱొకసారి ప్రణమింతురు. బుద్ధుఁడు ముందునకు సాగి ఒక ఇంటిముందు నిల్చి భిక్ష నర్థించును)
బుద్ధుఁడు:
గృహిణి:
ఈపుణ్యములరాశి కీభిక్ష నొసఁగు
పరమభాగ్యము నాకు బంగారురాశి
పరమనిర్ధను హస్తవశమైనరీతి
బుద్ధుఁడు:
భవతి! భిక్షాం దేహి! భవాన్ భిక్షాం దదాతు!
గృహస్థుఁడు:
పావనంబయ్యె నా భవమెల్ల స్వామి!
మీకొసఁగు నీభిక్ష నాకొసఁగుఁగాక
శోకరాహిత్యంబు సుకృతంబు స్వామి!
బుద్ధుఁడు:
(అని దీవించి ముందరికి సాగి నందుని ప్రాసాదముముందాగి భిక్ష నర్థించును. ఆసమయములో భవనాంతరమునుండి, సుందరీనందులు విలాసముగా నాలపించు గీతము సన్నగా విన్పించుచుండును. )
బుద్ధుఁడు:
(పైవిధంగా రెండు,మూడు సార్లు అర్థించి, ప్రతిస్పందన లేకపోవుటచే అతఁడు నివర్తిల్లును. ఆతని నాసమయమున ఆయింటి దాసి దూరమునుండి చూచి చింతించి, ఆవిషయమును నందసుందరులకు నివేదించును.)
దాసి:
అరయువారిట లేక తిరిగి చనె రిక్తుఁడై
ఇమ్ముగా పుణ్యంబె గుమ్మంబుఁ దట్టంగ
రమ్మంచు లోనికిన్ రక్తిమైఁ బిల్వంగ
వలయునే కాని యీపగిదిఁ జేతుర స్వామి!
కొలుతురే పాపంబుఁ దెలియకుండఁగ నైన?
నందుఁడు:
ఱెయ్యది లక్ష్యముం గొనక యిందున నేను విలాసకేళిలో
లియ్యమునంది దుఃఖపటలీపరిమోక్షణమర్మవేదియౌ
నయ్యతివర్యు నేమరితి, నాఱనిపాపము గట్టుకొంటిఁబో!
3అంటుచు నన్నీ దోషము
కంటకనిభమౌచుఁ గూర్చుఁ గళవళమెదలో,
వెంటనె చని యాసుగతుని
ఇంటికిఁ గొనివచ్చి భిక్ష నిచ్చెదఁ బేర్మిన్
సుందరి:
నీవొక నిముసంబు చెంత నిల్వకయున్నన్
భావించి కుందు నా మన
మావిరహంబును యుగంబులట్టుల నెంతో!
నందుఁడు:
త్రుటిలో నినుఁ జేరవత్తుఁ దోడ్కొని గురునిన్
అటమట వీడుము; పంతము
ఘటియించి వచించుచుంటి కంతునియందున్
4ఎవ్వని పాదధూళికయి యెల్లరు వీథుల వేచియుందురో
ఎవ్వని నూత్నమార్గము మహీజనశోకనివారకమ్మొ, నేఁ
డవ్విమలాత్ముఁ డిచ్చటికి నర్థిగ వచ్చి హతాశుఁడై చనెన్
ఱివ్వునఁ బోయి తేఁదగదె శ్రీఘను నాతని భిక్ష నీయఁగన్
(అని ఆమె నోదార్చి, ఆశ్రమమును సమీపించుచున్న శ్రీఘనుని(=బుద్ధదేవుని) చేరఁబోయి ఇట్లనును.)
3అంతఃపురమున నన్యా
క్రాంతుఁడనై యుండి మిమ్ముఁ గానక నేన
త్యంతావజ్ఞతఁ జేసితి
నంతవ్యాత్మా! క్షమింప నతి యొనరింతున్
(అని బుద్ధునికి మ్రొక్కి, క్షమింపుమని వేఁడుకొని, తిరిగి రమ్మని ఇట్లనును.)
1మద్గృహంబున కేతెంచి మఱల తమరు
భిక్ష గైకొని భవమోక్షభిక్ష మాకు,
పరగ దయసేయుఁడని చేతు ప్రార్థనంబు
రండు నాతోడఁ దిరిగి ధర్మస్వరూప!
(బుద్ధుఁ డతనిని సానునయంగా చూచి, భిక్ష అక్కఱలేదని సైగచేసి, తన భిక్షాపాత్ర నతనికి నిచ్చి ముందరికి సాగి తన ఆశ్రమములో ప్రవేశించును. నందుఁడు బుద్ధుని చర్యకు ఆంతర్యమేదో తెలియక అచ్చటనే నిల్చి ఇట్లాలోచించును.)
నందుఁడు:
తరుణులెల్లరు దాఁచికొనియెడు
భద్రపేటికవంటిపాత్రను
దీని నేటికి మౌనివర్యుఁడు
నాదుహస్తమునందు నుంచెను?
సన్యసించెడు సాధుజనులకు
ఆదిసాధనమనఁగఁ దగు నీ
మట్టిపాత్రను బెట్టిపోయెను
నాకరంబున నాకృపామయుఁ
డెందుకో మఱి యెఱుఁగ నైతిని!
కారణంబెది గాని దీనిని
నతనికే పునరర్పణంబుగఁ
జేయుటందున న్యాయమున్నది
అందుచే మాన్యతాయుతముగ
అప్పగించెద నతనికే యిది!
( ఇట్లాలోచించి ఆశ్రమములోనికిఁ జని, నందుఁడా భిక్షాపాత్రను తిరిగి యిచ్చుచు ఇట్లు పల్కును.)
1పరమపావనమైన మీపాణులందు
పూతవాసస్థితినిఁ గన్న పుణ్యపాత్ర !
తాఁకుటకునైన దీనిని తగను నేను,
తిరిగి గైకొనుఁడీపాత్ర గురువరేణ్య!
(బుద్ధుఁ డతని మనస్సరళతకు హర్షించి, చిఱునవ్వుతో నిట్లనును.)
బుద్ధుఁడు:
ఇచ్చితిని నీకు నాపాత్ర నింకమీఁద
కలుగఁబోవు దశాచిహ్నకంబు గాఁగ,
అర్హతత్వయోగంబు నీకబ్బనుండె!
నందుఁడు:
4సుందరి నాకు ప్రాణమయి, సుందరికేనును ప్రాణతుల్యమై
అందుచునుంటి మిద్ధరణియందునె ఆమరసౌఖ్య, మట్టి మా
బంధమునెట్లు ద్రుంతు, నెటు భగ్నమొనర్తును నామెడెందమున్?
పొందఁగ నర్హుఁడౌనె ననుఁబోలినకాముకుఁ డర్హతస్థితిన్?
3మానస మొకచో నిల్పఁగ
లే నింద్రియలౌల్యమడఁపలే నొకయింతన్
నేనర్హతపదమొందుట
శ్వానము స్వర్గపద మొందు చందము గాదే!
బుద్ధుఁడు:
ఉన్నతస్థితి మానవుం డొందవచ్చు
కాన నందని ఫలమేమి గాదు నీకు
అర్హతత్వము నంద! యథార్థ మిదియె
నందుఁడు:
ప్రాణముకంటెను నధికతరంబగు నాకున్,
ప్రాణము వీడుటె సులభం
బానళినాక్షిని త్యజించి అడలుటకంటెన్
తరుణ:
11అలరించెను సుందరి అతని మనంబును
అలరించెను మేనక నాదుమనంబును
బుద్ధుఁడు:
తృష్ణ యనునది మనుజప్రకృతులయందు
అనలముంబలె తీక్ష్ణమై, అంతమందు
నేవిధంబున సంతాపహేతువగునొ!
తరుణ:
అతని స్థితియుండెఁ దరుణార్క! అచ్చముగను
మేనకం బాసి శోకంబుఁ బూనెదీవు,
సుందరిం బాతునని శోకమొందు నతఁడు!
బుద్ధుఁడు:
మోహదంబగు జవరాండ్ర దేహలతిక
కాని వాడెడు విరివోలె కాలగతిని
పరువ ముడుగంగ నారూపె వెఱపుగొల్పు
1నశ్వరంబగు నిట్టి యందంబునందు
కృత్రిమానందముం గూర్చి తృష్ణ తుదకు
దుఃఖకారకమే యగుఁ దొలఁగఁగానె
అట్టి యందపుఁదెరయె దేహంబునుండి
1మానవుని తృష్ణయే నాది, నేననియెడి
స్వార్థభావపరంపరాసంయుతముగ
బంధములకెల్ల మూలమై పరగుచుండు
బంధములె దుఃఖదంబులై వరలుచుండు
1శోకహేతువు తృష్ణయే లోకమందు
దానితోఁ గూడి స్వార్థంబు కానరాని
కారయింటను మనుజునిఁ గట్టివేయు,
అదియె బంధము, దానిఁ బాయంగవలయు
1కానఁ దృష్ణయు స్వార్థంబు మనసు నెల్ల
కలుషితముఁ జేయఁగానీక మెలఁగు టొప్పు
నదియె ప్రణయభంగంబుచే నుదితమైన
వ్యథను మాన్పఁగఁగల్గు దివ్యౌషధంబు
తరుణ:
వ్యూహంబియ్యది, నితాంతయోషావిరహ
ప్రాహత మదీయ హృద్బా
ధాహృతికై ఆచరింపఁదగునిది, కానీ
1వాంఛలన్నియు మాని ప్రపంచమందు
మనఁగ వశమౌనె నాబోటి మానవునకు?
మేనకాక్రాంతమై నాదు మానసంబు
ఆమె స్మరణమె చేయు నిరంతరంబు
బుద్ధుఁడు:
జీవిత మామె కంకితము సేయుటకంటెఁ బ్రశస్తమౌను దీ
నావన లక్ష్యమై తనరు నార్హతవృత్తి వహించి, లోకసం
భావనలోలత న్మనుట, భావనసేయుము దీనిఁ జక్కగన్!
ఇంకను
4లేక మమత్వభావమెద, లేక యెదోయొక వృక్షమందె ప్ర
త్యేకతరేచ్ఛ, వృక్షముల నెల్లను మక్కువ నొక్కరీతిగా
సాఁకెడు తోఁటమాలివలె, సర్వజనంబుల కొక్కరీతిగా
సాకతమూని నిర్మమత సాయముసేయుట సాధుశీలమౌ
తరుణ:
పాఱఁద్రోలుట నావంటి పామరులకు
కష్టసాధ్యమె కాని, నాకలఁతఁ బాప
నదియె యుక్తమార్గంబని యరసి తిపుడు
నందుఁడు:
జ్ఞానోదయమయ్యెనాకు, స్వాంతము పొంగెన్,
నేనిఁక మీశిష్యుఁడనై
పూనెద నావిష్కరింపఁ బుణ్యపథంబున్
4కాని మహాత్మ! స్వార్థమతిఁ గాక వచింపుచునుంటి, సంఘధ
ర్మానికి లోటుగానియెడ మత్ప్రియకాంతకుఁ గూడ బౌద్ధసం
ఘానఁ జరించు పుణ్యపరికల్పన చేసిన దోసమేమి, మీ
జ్ఞానపథాన పూరుషుల సాటిగ స్త్రీలు చరింపలేరొకో?
బుద్ధుఁడు:
బ్రహ్మచర్యము వహియించి బౌద్ధసంఘ
నియమనిష్ఠలు పాటించు నెలఁత లున్న
అంగనలును సంఘమునఁ జేరంగవచ్చు
నందుఁడు:
కోరస్:
12బుద్ధదేవుని బోధనంబున
ప్రకటితామల పథమునందున
నిర్మమత్వపు ధర్మదండము
నండగాఁగొని యానమొనరుప
నందుఁడాశ్రమమందె యుండెన్
అతనివిరహం బతిశయంబుగ
దుఃఖదంబయి తోఁచ సుందరి
అన్నపానము లలంకారము
లన్నియుం బోనాడి వాడుచు
నున్న లతవలె సన్నబడియెన్
అంత నొక ఉదయంబునందున
తనదుపతితో దశబలుండును(దశబలుఁడు=బుద్ధుఁడు)
వచ్చి భిక్షకు ప్రాంగణంబున
నిలువ నక్కజమొలయ వారలఁ
గనియె సుందరి, కనినయంతన్
అమెమనమున నంకురించెను
ప్రచురమగు వైరాగ్యభావము
అంత నాసతి అయ్యతీంద్రుని
పాదములపై భక్తితోడుత
వ్రాలి కోరెను ప్రసాదింపఁగ
తనకుసైతము ధర్మదీక్షన్
అర్కబంధుంఁడధికకరుణను(అర్కబంధుఁడు=బుద్ధుఁడు)
ఆమెకోరిక నాదరించెను
సంఘమందున శ్రమణికాత్వము
నంది ఆసతి నందయుతముగ
బౌద్ధధర్మపువృద్ధికోసము
సేవలెన్నో చేసి పొందెను
భవవిమోచనభవ్యపథమున్
బుద్ధుఁడు దప్ప ఇతరులు:
బౌద్ధం సదా వృద్ధిరస్తు| లోకాస్సమస్తా స్సుఖినో భవన్తు|
(అంతర్నాటకము సమాప్తము)
తృతీయదృశ్యము
(స్థాయుకుఁడు, తరుణార్కుఁడు)
స్థాయుకుఁడు:
తరుణ:
1శ్రావ్యముగఁ బాడుచుం గడుచక్కనైన
హావభావ ప్రదర్శనం బావహిల్లు
రమ్యనటనచేఁ గట్టించి రక్తి నచట
ఆడి రానాటకంబు నాద్యంతముగను
వినోదప్రదంగానే కాక విజ్ఞానప్రదంగాను ఉండినదది.
స్థాయుకుఁడు:
తరుణ:
అడలువారలు తమవంత నధిగమింప
తామె విషవైద్యులై యెట్లు దనరవలెనొ
తెల్పు బుద్ధుని మార్గంబుఁ దెల్పె నదియె
స్థాయుకుఁడు:
తరుణ:
1తమదుకర్మకు బాధ్యులు తామె యనుచు
కర్మఫలమును మార్చంగ కఠినమైన
నియమనిర్దేశ మొనరించు నిష్ఠురంపు
దారి యది, అంత సులభసాధ్యంబు గాదు.
స్థాయుకుఁడు:
తరుణ:
1బుద్ధపురమున శ్రమణులయొద్ద నుండి
అభ్యసించిన సుగతోక్తమైన పథము
పట్టువడునేమొ యది నాకు ననుచు నేను
సైతము దలంచు చుంటి మీచందముగనె!
స్థాయుకుఁడు:
అర్హతవ్రాతసాన్నిధ్యమందు నుండ
బుద్ధపురికిని నినుఁజేర్పఁబోలునట్టి
యానసౌకర్య మేర్పాటు నేను జేతు
తరుణ:
స్థాయుకుఁడు:
1బుద్ధపురమున శ్రమణుల బోధచేత
చిత్తశాంతినిఁ గని శోకముత్తరింపఁ
గడఁగు మంతయే కాని లోకంబుతోడి
సంగముల నెల్ల నీవు వాయంగవలదు
1పూర్వసంసర్గదుఃఖంబుఁ బోనడంచి
మఱల సంఘమున జనసామాన్యమైన
వర్తనంబున నీవు సద్వంశజాత
సుదతిఁ బెండ్లాడి యుండుము సుఖముగాను
తరుణ:
(తృతీయాంకము సమాప్తము)
చతుర్థాంకము
ప్రథమదృశ్యము
(పది నెలలు గడచినవి. ఇంతలో చైత్రపూర్ణిమ వచ్చినది. ఆసందర్భముగా భోగపురమునకు వెలుపల భోగపురమునుండి బుద్ధపురమున కేఁగు దారిలోగల తోఁటలో ఉన్నతకుటుంబములలోని స్త్రీపురుషులు విలాసముగా గడపుదురు. అందులో పాల్గొనుటకై మేనక తనకు భౌరికుఁ డేర్పాటు చేసిన ప్రాసాదములో అద్దముముందర బంగారునగిషీ చేసిన విలువైన కుర్చీలో కూర్చొని, తన కలంకారమును చేయుచున్న పరిచారికలతో నిట్లు వచించుచుండును.)
పల్లవి:
చంద మలంకృతి సల్పుడు నాకు!
చరణం1:
శిరమున రవ్వల శేఖర ముంచుఁడు
ఉరమున కంచెల సరిగ బిగించుఁడు
విరులును సొమ్ములు విరివిగ నుంచుఁడు ||అందరి…||
చరణం2:
అమ్ములవలె కనుబొమ్మలఁ దీర్చుఁడు
కమ్మగ వలచెడి గంధపుపంకము
నెమ్మేనునఁ గడు నీటుగ నలఁదుఁడు|| అందరి…||
చరణం3:
సరిచేయుఁడు శేఖర మొక యించుక
అరుణాశ్మంబుల హరితాశ్మంబుల
విరచితహారము లురమున నుంచుఁడు || అందరి…||
చరణం4:
లలితారగ్వధలతచందంబున
విలసిల్లఁగ నను వివిధవిధంబుల
లలి మీరంగ నలంకృతి సేయుఁడు || అందరి…||
రెండవదృశ్యము
(స్థలము: భోగపురమునకు వెలుపల, భోగపురమునుండి బుద్ధపురమునకు పోవు దారిలో గల ఒక ప్రసిద్ధోద్యానవనము)
మువ్వురు:
ఈవనమయ్యెను హృద్యం బిలలో
రాగిణి:
విరితండంబులపరిమళ మూనుచు
రమణీరంజనులు:
ఈవనమయ్యెను హృద్యం బిలలో
రమణి:
కమ్మగఁ బాడెడు కలకంఠంబులతో
రాగిణీరంజనులు:
ఈవనమయ్యెను హృద్యం బిలలో
రంజని:
ముచ్చట గొల్పెడు పూదీవెలతో
రమణీరాగిణులు:
ఈవనమయ్యెను హృద్యం బిలలో
మువ్వురు:
సుందరచైత్రుఁడు శోభ తలిర్పఁగ
స్మరసంయుతుఁడై ధరణీతలమున
నిరవొందిన యీ తరుణమునందున
పూవఁగఁజేయుచు మోదం బెదలో
ఈవనమయ్యెను హృద్యం బిలలో
(భావయుక్తాభినయముతో పాడు నావేశ్యల విలాసమును గమనించుచున్న శాకునికుఁడు తనలో…)
శాకునికుఁడు:
(ఆస్త్రీలను సమీపించి…)
ఓహో! రాగిణీ! ఒక్కమాట!
రాగిణి:
శాకునికుఁడు:
(రమణితో)
రమణీ! ఒక్కమాట!
రమణి:
శాకునికుఁడు:
(రంజనితో)
రంజనీ! ఇటు రా! ఒక్కమాట!
రమణి:
(నిర్లక్ష్యముగా నాముగ్గురు స్త్రీలు దూరముగాఁ దొలఁగిపోదురు)
శాకునికుఁడు:
1డబ్బు కన్నులఁ బడినచో నుబ్బి యుబ్బి
గబ్బికప్పలవలె ప్రేలు కాంత లేల
బెబ్బులిం జూచి పాఱెడు వృషభమట్లు
దబ్బునం బాఱుదురు నేఁడు దాయగానె?
భౌరికుఁడు:
శాకునికుఁడు:
1మాటిమాటికి రొక్కంపుమూట నెదుట
బెట్టినం గాని సానులు బెట్టు విడరు
కొమ్మకొమ్మకు నెగిరెడు కోఁతిరీతి
చంచలంబగు సానుల స్వాంతవృత్తి
(ఇంతలో నొక అందమైన అశ్వశకటములో మేనక వచ్చి అచ్చట దిగును. ఆమె అత్యంతసుందరముగా నలంకరించుకొని యుండును. ఆమె శకటమును దిగి నడచుచుండఁగా త్వరగా శాకునికుఁ డామెను సమీపించి ఆమెను తనకు సుముఖముగా జేసికొన యత్నించును.)
శాకునికుఁడు:
రాత్రియందున చంద్రుని రశ్మిఁబోలి
తెల్లనగు నీదు ముఖకాంతివెల్లువందుఁ
దేలి వనమెల్ల సున్నమై తేజరిల్లె
1పండి విరిసిన తెలిప్రత్తిపంటవోలె
అనుభవంబునఁ దల పండినట్టివాఁడ
రమ్ము నాతోడ, నాదు కరమ్ము గొనుము
ఇమ్ముగా విహరింప వనమ్మునందు!
1వినుము నామాట మేనక! వెఱపులేక
గడపితివి యేని నాతోడఁ గలసి యిచట
దేవళంబున దుర్గకుం దీటుగాను
సొమ్ములం దగిలింతు నీకిమ్ముగాను!
మేనక:
(ఆమె అతనిని నిరసించి, పూర్తిగా విస్మరించుచు కొంత దూరములో గల భౌరికుఁడు, యౌవనవంతులైన స్త్రీపురుషు లున్నవైపు తిరిగి వారిని చేరఁ బోవును. శాకునికుఁ డామె నిర్లక్ష్యమునకు కోపించి ఆమెపై కక్షబూని ఉత్తరోక్తముగా చింతించి ఆపై నిష్క్రమించును.)
1ఱంకుటాలిదె నన్నుఁ దిరస్కరించి
పోవుచున్నది పోకిరిమూకఁ జేర
దీని గర్వమడతు ననువైన వేళ
కాదు వ్యర్థము నాదు సంకల్పమెపుడు
1ముసలివాడంచు ననుజూచి మొగము ద్రిప్పి
దొంగ తఱిమినయట్లు దాఁ దొలఁగిపోవు;
పండ్లు రాలియుండెన, లేక కండ్లు గాన
కుండెనా యేమి వైకల్యముండె నాకు?
2అదను జూచి దీని యాటలం గట్టింతు
నన్ను విస్మరించి చన్నవారు
బాగుపడరు వెన్క, బాగుపడరు ముందు
శాకునికుని ప్రకృతి సత్య మిదియె
(అతఁడు నిష్క్రమించును. భౌరికుఁడు, ఇతర యువతీయువకులున్న స్థలమునకామె చేరుకొనును)
మేనక:
భౌరికుఁడు:
మేనక:
ఇతరులు:
మేనక:
నందమును బొంద సందేహమొందవలదు;
పూర్ణిమేందుని యందంపు స్ఫూర్తిఁ గనుచు
నందమొందని డెందంబు లెందు గలవు?
(తర్వాత మేనక సగర్వముగా, సవిలాసముగా తూఁగుటుయ్యాలపై నూఁగుచు పాడుచుండఁగా యువకులు, భౌరికుఁడు ఊయల నూపుచు, మధ్యమధ్య కోరస్ పాడుచుందురు.)
11పాట
మేనక:
ఆనందమె నా పరమార్థము
వెన్నెల వెలుఁగుల విచ్చును కలువలు
వెన్నెలకంటెను విశదోజ్జ్వలమౌ
నాచిఱునవ్వుల రోచిస్సులలో
పూచును వలపులపూవులతోఁటలె
యువకుండైనను స్థవిరుండైనను
యువరాజైనను నెవడైనను నా
యన్నువఁ గాంచిన సన్నుతి సల్పక
మన్నన చేయక మఱి యుండడు గద!
ఇతరులు:
నీసమ్మోదమె మాసమ్మోదము
మేనక:
పువువిలుకానికి యువకుల గెల్వఁగ
నాకుం జాలును నాదుకటాక్షమె
లోకంబున యువలోకము గెల్వఁగ
ఇతరులు:
నీకడగన్నుల నెలవగు చూపులె
మేనక:
ఈయౌవనదశ యెంతయొ స్వల్పము
పాయగ నీయక ఈయవకాశము
ప్రాయపుసుఖములఁ బడయుట శ్రేష్ఠము
బ్రతుకే యొక చిత్రంబగు బంధము
మతిమంతులు ప్రేమంబను రెండవ
సుందరబంధమునందునఁ జిక్కుచు
పొందఁగవలె తొలిబంధవిముక్తిని
ఇతరులు:
కావలె నదియే జీవనలక్ష్యము!
మేనక:
తారవిధంబునఁదనరుచు నుంటిని
జారుచునుండెను సమయం బిప్పుడు
తోరంబగు సంతోషఝరంబటు
ఈసంతోషము ఈదరహాసము
భాసించుత నాబ్రతుకున నిరతము
తనువును వీడెడి క్షణమున సైతము
తనరుత నావక్త్రంబున హసితము
ఇతరులు:
మోదము గూర్చును మోహముఁ బెంచును
నీయొయ్యారము నిజముగ మాకును
హాయిని గూర్చును అనురతి నించును
యువకులు:
దండిగ వసతులు తిండికి మనకై
(అనుచు మేనకాభౌరికులు దప్ప ఇతరులందఱు ప్రక్క నున్న చిన్నకుటీరములోని కేఁగుదురు. ఇంతలో దూరమునుండి స్థాయుకుఁ డావనమందు ప్రవేశించుచుఁ గన్పడును. భౌరికుఁ డాతురతతో నతని సమీపించి మేనక యున్న ప్రదేశమునకు చేరువలో గల చెట్లచాటున నున్న శిలాపీఠముపైఁ గూర్చొని మాట్లాడుచుండును. వారి మాటలు మేనకకు సన్నగా వినిపించుచుండును.)
భౌరికుఁడు:
స్థాయుకుఁడు:
మేనక:
తెలియునేమో! సావధానముగ విందును.
భౌరికుఁడు:
మాట అడుగుతాను.
స్థాయుకుఁడు:
భౌరికుఁడు:
బుద్ధపురమునకుం దాము బోవునట్టి
అవసరం బేమి? శాంతి కొఱవడెన యట
దుండగులచేత భిక్షుకమండలులకు?
స్థాయుకుఁడు:
తరుణార్కుని చూడఁబోయితిని.
మేనక:
భౌరికుఁడు:
1తమరి ప్రాపున నాతండు తనమనంబు
నుండి మేనకం బోఁద్రోలియుండఁబోలు;
మఱొక సద్వంశజాతను మనసునందు
నిలుపఁగాఁబోలునంచును దలఁచుచుంటి!
స్థాయుకుఁడు:
1దుస్తరము మేనకాస్మృతి దొలఁగఁజేయ
డెందమందుండి ప్రాసాదమందు నున్న
ననుచు నిర్మమత్వపథబోధనము సేయు
అర్హతావాసమున నుండె నాతఁడిపుడు
భౌరికుఁడు:
స్థాయుకుఁడు:
1అర్హతత్వము నీకేల? అర్హమైన
కన్యఁ బెండ్లాడి చేయుము కాపురంబు
అనుచు బోధించి వచ్చితి నచటి కేఁగి
ఐన నతనిధోరణి మారినట్లు లేదు
మేనక:
1హృదయమందు దేవతగ నన్నెపుడు నిల్పి
ప్రేమసుమముల నర్చించు ప్రియుఁడు నేఁడు
రాగపథమును రోసి బైరాగి యగుచు
తిరిపమెత్తుచు వీథులఁ దిరుగనుండె
భౌరికుఁడు:
స్థాయుకుఁడు:
భౌరికుఁడు:
కన్నెయే మఱి యాతని కంటఁ బడుచు
అతిమృదూక్తుల పూర్వసుఖానుభవము
స్మృతికిఁ దెచ్చిన మారునొ అతని బుద్ధి?
మేనక:
స్థాయుకుఁడు:
1కరము గాల్చిన జ్వాలనే మఱల రేపి
శిరము గాల్చుకొందురెవారు ధరణిలోన?
భౌరికుఁడు:
స్థాయుకుఁడు:
గాదు నాకది; త్వరలోనె కలసి భోగ
పురములోన శాకునికుని, పోవలె నటు
పైని రాజపురముఁ జేరఁగాను నేను!
భౌరికుఁడు:
స్థాయుకుఁడు:
(రెండవదృశ్యము సమాప్తము)
మూఁడవదృశ్యము
(స్థలము: భౌరికుఁడు మేనకకై ఏర్పాటు చేసిన అందమైన ప్రాసాదం. అందులో ఏకాంతముగా మేనక తనలో నిట్లు చింతించుచుండును.)
మేనక:
మణిగణయుతహేమాభరణంబులు
సమకూడెను పుష్కలముగ నానా
వర్ణాంచితవరపట్టాంబరములు
సమకూడెను ప్రాసాదంబులలో
నుల్లాసంబుగ నుండెడి యోగము
సమకూడెను సరసాహారంబులు
విందులు దిని తనివొందెడు భాగ్యము
సమకూడిరి కనుసన్నలమాత్రనె
పనుపును జేసెడు పరిచారికలును
సమకూడెను బహుసంపన్నులతోఁ
గలసి చరించెడు ఘనగౌరవమును
ఈవిధముగ నాకీ క్షణమందున
విషయసుఖంబులు విరివిగ నున్నవి
ఐనను మానసమందెదొ ఖేదము
వీడక నను వెంటాడుచు నున్నది
తరుణార్కుఁడు నాతలఁపున నిల్చును
ఆతనికౌఁగిలియందలి సౌఖ్యమె
అన్యసుఖంబుల కన్నిటికంటెను
బహుధాసుఖదంబగుచుం దోఁచును
ఈ భోగము లీ యాభరణంబులు
ఈదాసీగణ మీసౌధంబులు
సగపాలైనను సరిగావాతని
సంశ్లేషోదితసౌఖ్యమునందున
అమలంబగు ప్రణయంబున నన్నుం
దన ప్రాణముకంటెను నధికంబుగ
నెంచెడు నాతని వంచనచేతం
ద్యజియించితి రిక్తసుఖమ్మునకై
ఆరని దీపంబటులాతనిపై
పాయక యుండెను నా యనురాగము
ఈభోగంబుల నెల్ల త్యజించుచు
ఆతనిఁ జేర మదాత్మ తపించును
సాధ్యమొ యద్ది అసాధ్యమొ కానీ
తహతహలాడును దానికె నామది
అభిలాషించును అదియే నామది
అభిలాషించును అదియే నామది
నాల్గవదృశ్యము
(స్థలము: బుద్ధపురములోని బౌద్ధవిహారోద్యానవనము. తెరవెనుక సన్నగా మహామంగళసూత్రగానము వినిపించుచుండును.ముందుగా తరుణార్కుఁడు, తర్వాత మేనక)
తరుణ:
స్వాంతమునందు రూఢమయి వమ్మొనరించును నాదుసాధనన్,
ఎంతయొ వేదనంబు జనియింపఁగఁ జేయుచు మాయమైన యా
యింతి మదీయమానసము నెప్పుడు వీడకయుండె మొండియై
3తొలఁగుము కాంతా! మనమును
కలుషితమొనరింపఁబోకు కామముచేతన్
ఫలియింపనిమ్ము నా ని
శ్చలతపమును నర్హతత్వసాధనకొఱకున్
3ఎడఁబాపి యామె సంస్మృతి
నడిపింపుము నన్ను నీదు నయపథమందున్
కడముట్టింపుము గౌతమ!
వడిగా నాప్రస్థితిని భవద్ధర్మములోన్
(ఇంతలో మేనక ఆవిహారద్వారమునఁ గన్పడి ద్వారపాలకునితో నిట్లనును.)
మేనక:
ద్వారపాలకుఁడు:
మేనక:
ద్వారపాలకుఁడు:
(ధ్యానమగ్నుఁడై యున్న తరుణార్కుని యెదుట నిశ్చలముగా నామె నిలుచుండును. కొంతసేపటకి అతఁడు కన్నులు దెఱవఁగా నామె ఎదుట సాక్షాత్కరించును.)
తరుణ:
మేనక:
తరుణ:
మేనక:
తరుణ:
మేనక:
నీదుమ్రో లనె నిల్చి నిలువెత్తుగాను
తనతప్పిదంబులం దాల్మితో నరసి
నెనరార మన్నింపుమని వేఁడుచుండె
తరుణ:
మేనక:
నిన్ను నెడఁబాపికొంటిని నిజముగానె,
కాని అనుశయమ్మొందుదు దాని కిపుడు (అనుశయము=పశ్చాత్తాపము)
నిన్నె సర్వస్వముగ నెంతు, నిన్నెవలతు!
తరుణ:
మేనక:
బాలార్కాంశూపమమగు త్వద్దృక్‌శ్రేణుల్
నాలోలాక్షుల నుంచి స
మాలోకించుచు వచింపు మావల నీవున్
3కొఱవడెనే నాయక్షుల
నిరుపమమగు మాదకత్వనిర్భరదృష్టుల్?
కురిపింపవె రాగరసము,
మురిపింపవె యెదను దాఁకి మున్నటిరీతిన్?
తరుణ:
యువకసమ్మోహనకరంబు లుజ్జ్వలరస
నిర్భరంబులౌ దృష్టుల నృత్యరీతి
కాని యానృత్య మిపుడు ప్రేక్ష్యంబు గాదు
(అతఁ డామె కన్నులలోనికిఁ జూచుచు పల్కును. ఉజ్జ్వలరసనిర్భరంబులు=శృంగారరసముతో నిండినవి; అంతట నామె ఒయ్యారముగా ముందుకు నడచి, అతని కన్నులలోనికిఁ జూచుచు పల్కును.)
మేనక:
చూడుము నన్నుం బ్రశాంతసుందరహృదయా
రూఢదయామయదృష్టుల
తోడుత నింకొక్కసారి తొలఁగి ఛలంబున్
తరుణ:
తాఽమోఘవిమోహనవచనామృతఝరిలో
కాముకునై, ధర్మచ్యుతు
నై మునుఁగు ప్రమాద మొదవె నాసన్నంబై
(గంభీరంగా ప్రకాశముగ)
1గాధిపుత్త్రుని తపమెల్లఁ గాకు చేయ
సరస నిల్చిన మేనకాప్సరసవోలె
నీవు మేనక! నావ్రతనిష్ఠఁ జెఱుప
వచ్చితివి గాని యది సులభంబు గాదు
మేనక:
పరమరాజర్షి యయి ధరం బరగ లేదె?
అందుచేఁ దలఁపంగ రా దంగనాను
షంగమున కీడె యెప్డు పొసంగు ననుచు
(ముందుకు పరిక్రమించి అతని కరమును గ్రహించుచు పల్కును)
3ఇదె నాకర, మీకరము
న్మృదువుగ నీచేత నదుమ నీయెదలోనన్
మృదువగు భావోద్రేకము,
మధురతర రసానుభూతి మల్లడిగొనవే?
1పంజరంబునఁ బెట్టఁగఁ బాఱిపోయి
మగిడి వచ్చిన పెంపుడుఖగమువోలె
మగిడివచ్చితి నీకునై సొగసి నేను;
ఆదరింపుము ప్రియురాలి నలసతేల?
తరుణ:
స్వాంతము నిఁక నిల్వరింపఁ జాలక యుంటిన్
కాంతా! గెల్చితి వీవే,
ఎంతయొ విధిలిఖిత మంతయే యగు నింకన్
(అని ఆమెను కౌఁగిలించుకొనును. ఇర్వురు కౌఁగిలిలోనే ఉండి క్రిందివిధముగా పాడుదురు)
ఇర్వురు:
నతిశయనవ్యప్రణయసమాసాదితమౌ
బ్రతుకున మఱలం గందము
మితిలేని సుఖంబు మనము మృదుతరరీతిన్
చతుర్థాంకము సమాప్తము
పంచమాంకము
మొదటి దృశ్యము
(పునస్సంయోగానంతరము మేనకాతరుణార్కులు భోగపురములో ఒక విలాసవంతమైన అద్దెయింటిలో నుందురు. దివంగతురాలై యుండిన తల్లిద్వారా తరుణార్కునికి సంక్రమించిన ధనముతో అచ్చట కొన్ని నెలలు విలాసముగా గడపుదురు. ఇంకను విలువైన వస్త్రభూషణములందు ఆసక్తి తగ్గని మేనకాజీవితవిధానము, ఆమెకు సదా విధేయుఁడై ఆమెను అడ్డుకొనని తరుణార్కుని స్వభావమును ఆ ధనమంతయు కొన్ని నెలలలో అంతమగుటకు కారణమగును. జూదమునందు నేర్పరియై, దానినే జీవికగా జేసికొన్న తన వరుస సోదరుఁడైన దేవనునిద్వారా తరుణార్కునికి ద్యూతకేళిని నేర్పించి, తద్ద్వారా డబ్బు గడించుమని ఆమె తరుణార్కుని ప్రేరేచును. అదియే వారి పరిపూర్ణపతనమునకు కారణమగును.)
మేనక:
తరుణ:
1నిన్నె దేవతగఁ దలంచి, నిన్నె యెంచి
నా బహిఃప్రాణముగ, బుద్ధనగరి వీడి
నది మొదలుగ నీదుసుఖమె నాదుసుఖమ
టంచు నెంచి దానికయి శ్రమించుచుంటి!
2నాదుజననివలన నాకుఁ జెందినయట్టి
విత్తమందు పెద్దమొత్తమెల్ల
నీవినోదములకె, నీవిలాసములకె
ఖర్చు చేయుచుంటిఁ గనవె దీని?
3సౌవర్ణదుకూలంబులు
గ్రైవేయకములు, మనోజ్ఞకటకంబులు, నా
నావిధహారంబులు నీ
కై విలిచితిఁగద లతాంగి! అతిమూల్యములన్
(ఇంతలో దేవనదత్తుఁడు ప్రవేశించుచు కొంతసేపు చాటుగా నాగి వారి మాటలు వినుచుండును.)
మేనక:
నీదుసుఖ మగు ప్రియతమ! నాదుసుఖము
మనది ఆదర్శదాంపత్య మనుట నిజము
ఐన మునుముందు నిదియెట్టు లగునొయెఱుఁగ
3ధనమంతయు వ్యయమయ్యెను
దినమేగతిఁ గడచునొయిఁకఁ దెలియఁగనైతిన్
కనుగొనవలె నూతనరీ
తిని రొక్కంబును గడించు తీరును త్వరగన్
(ఇప్పుడు దేవనదత్తుఁడు వారిసమక్షమున కన్పడును.)
మేనక:
దేవన:
1వేతనానికిఁ దోడుగ వేఱొకింత
ఆయమును గడియించు కార్యమున నుండి
నిన్నుఁ జూడకయుంటిని ఇన్నినాళ్ళు
ఎట్టకేలకు తీరిక యిప్పు డొదవె.
తరుణ:
దేవన:
కవీశ్వరుఁడు! అది నాకూ వర్తిస్తున్నది.
మేనక:
దేవన:
తరుణ:
దేవన:
ఆటలో మెలకువలెల్ల నభ్యసించి
పణము లొడ్డుటయందు నైపుణిని నేర్చి
ఆడుచో లక్ష్మి నిన్నెప్డు వీడకుండు!
తరుణ:
దేవన:
మేనక:
మార్గమిదె యని తోఁచును మనకుఁ దరుణ!
అభ్యసింపుము ద్యూతంబు నతనినుండి
మనదుకష్టము గట్టెక్కు క్షణములోన!
తరుణ:
త్యక్తము గావించి నీతి, అర్థముకొఱ క
వ్యక్తఫలదమౌ ద్యూతా
సక్తినిఁ బూనుట అనర్థజనకము గాదా?
2మాన్యులైనవారు మన్నింప రాక్రీడ;
పదమునుండి శిరమువఱకు బ్రాఁకు
చర్మరోగమట్లు స్వాంతంబు సాంతంబు
కలుషితంబు సేయు గరళ మద్ది!
మేనక:
యనుచు తరుణ! కుందునందవలదు
అక్షకేళిలోలురౌ నలధర్మజుల్
మాన్యచరితు లగుచు మనరె మున్ను?
2తలఁపవలదు నీవు త్యాగంబు నాకయి
చేయుచుంటివనుచు చింత నూని
మనదు సేమ మెంచి మన యిర్వురకునయి
చేయుచుంటి ననుము చింత మాని
దేవన:
ధనము గడియింపఁగా నుండె దారులెన్నొ
వానియందున సులువైన దాని నొకటి
ఎన్నుకొనుచుంద్రు విన్నాణ మున్నవారు
3ముందుగఁ దరుణార్క! గృహం
బందున నాతోడ నాడ నవగతమగు నీ
కందలి మర్మంబులు, గె
ల్పొందెడు మార్గంబులు, మది నుడుగుము శంకన్
మేనక:
తరుణా! నీవటు సులువుగ ధనమార్జింపన్,
తొఱఁగక నేనెప్పుడు సు
స్థిరమగు నెనరున సుఖింపఁ జేతును నిన్నున్
తరుణ:
మనసు వలదనుగాని, యామనసుకంటె
ప్రబలమై హృదయంబు నీపనుపుఁ జేయఁ
ద్రోయుచుండెను నన్ను ముందునకు నిపుడు!
1ద్యూతకేళిక మాన్యుల రీతి గాదు;
ఐన దానిచేఁ గూడును నర్థ మనుచు
భ్రమసి, ప్రేయసీప్రీణనార్థంబు నేను
ఆడఁ దలఁచుచునుంటి పోనాడి నీతి!
4గౌతమధర్మమార్గమును గాదని, దుఃఖనివారణంబుకై
యాతనిచేత ప్రోక్తమయినట్టి పథంబును సంత్యజించి, తృ
ష్ణాతిశయంబుచేత నిపుడాడఁగ ద్యూతము నియ్యకొంటి నీ
నాతికి నాటబొమ్మనయి నాదువితర్కము నెల్లఁ బాయుచున్
రెండవదృశ్యము
(స్థలము:భోగపురములోని విలాసవంతమైన ద్యూతకేళీభవనము. అందు ముందుగా దేవనుఁడు మున్నగు జూదరులు, రమణి,రంజని,రాగిణులు, కన్పడుదురు. తర్వాత శాకునికుఁడు, అతని తర్వాత మేనకాతరుణార్కులు ప్రవేశింతురు.)
జూదరుల కోరస్:
అందున్న మద్యంబు హాయిగాఁ ద్రావి
కౌతూహలంబుతోఁ జేతంబు లుఱుక
ద్యూతంబు నాడంగఁ దొరఁకొంద మింక
9ఎన్నినాళ్ళుండునో ఈయౌవనంబు
ఉన్నపుడె భోగంబు లన్నియు న్విడక
అనుభవింపఁగవలె మనసార మనము
అనుభవింపఁగవలె తనివార మనము
అందించుఁ డందించుఁ డాపానపాత్ర
అందించుఁ డందించుఁ డాపానపాత్ర!
9కాల మాగదు గదా క్షణమాత్రమైన
ఆలసించినయెడ నిరాశయే మిగులు
అందుచే ద్యూతమున నార్జించి ధనము
పొందవలె త్వరగ నానందము న్మనము
అందించుఁ డందించుఁ డాపానపాత్ర
అందించుఁ డందించుఁ డాపానపాత్ర!
9వరమిచ్చు దేవతలు పాచికలె మనకు
హరియైన సిరియైన అందులో గలరు
అందుచే పాచికల నిందింపరాదు
పొందవలె లాభంబు బుద్ధిగా నాడి
9అందించుఁ డందించుఁ డాపానపాత్ర
అందున్న మద్యంబు నానందముగను
పానంబు గావించి పాచికలయాట
పూనికను గెల్వంగఁ బోదాము మనము
(క్రిందిపాటను బాడుచు ఉద్దీపనకరముగా నటించు మువ్వురువేశ్యలతో మద్యము ద్రావుచున్న జూదరులు సవిలాసముగా నటింతురు.)
మువ్వురు:
అతిశయలాభము నందిన వారికి
మాకౌఁగిలియే మధురోపదయౌ
రమణి:
పడఁతుల కౌఁగిటఁ బడి సుఖియింపఁగ
వ్యయమొనరించెడు పరమోదారుఁడె
మాకగు మిత్రుఁడు, మాకగు బంధుఁడు
మువ్వురు:
రంజని:
తనయెడ స్థిరమయి తనరారంగను
బహమూల్యంబగు పణముల నొడ్డుచు
నాడెడు తెగువరి యగు మాకాప్తుఁడు
మువ్వురు:
రాగిణి:
మగువలపొందుల, మద్యపువిందుల
యందలి స్వారస్యంబును నెఱిఁగిన
కితవుఁడె మాకతిహితుఁడగు చెల్వుఁడు
మువ్వురు:
సభికుఁడు:
ఆరంభ మొనరింపుఁ డక్షకేళిక నింక!
(దేవనుఁడు, జూదరులు నెత్తపుపలకలముందు కూర్చొని ద్యూతమాడనారంభింతురు. ఇంతలో శాకునికుఁడు ప్రవేశించి ఆ ముగ్గురు వేశ్యలను సమీపించును. అతఁడు సకామముగా వారికరములును గ్రహించుచుండఁగా వారాతని నాహ్వానింతురు.)
రంజని:
రాగిణి:
రమణి:
అందుచే శాకునిక! ఆడంగ రమ్ము!
(శాకునికుఁడు వారి స్వాగతవచనములకు సంతసించుచు తనలో నిట్లనుకొనును.)
2విత్తమున్నవఱకె వేశ్యల ప్రేమంబు
పేదవాని వారుపీడవోలె
పరిహరింతురందు వలన వారలముందె
ఆడి గెలుతు జూద మద్భుతముగ!
(అంతలో మేనకాతరుణార్కులు ప్రవేశింతురు. దేవనుఁడు వారిని స్వాగతించును. వారినిఁ జూచి శాకునికుఁడు తనలో నిట్లు దలంచును)
శాకునికుఁడు:
తన్నుకొనిపోయెఁ ద్రుటిలోనె కన్నుఁ గప్పి
కులుకు నాధూర్త సైత మీ ఖలునిఁ గూడి
వీరిఁగన నా క్రుధావహ్నివింటి కెగయు
తరుణ:
హేయమగు ద్యూతమందున నేదొ గెల్చి
ప్రేయసీప్రీణనం బొనరింతు ననుచు
ఎండమావుల నీర మాశించుచుంటి!
మేనక:
నిదియె చుక్కాని యనుమాట నెఱిగి కూడ
ఏల నిర్వేదమందెద విపుడు నీవు
సాగుముందుకు ప్రియతమ! సాహసించి
(కొంత దూరమునుండి వారి సంభాషణను విన్న శాకునికుఁడు తనలో నిట్లు చింతించును)
శాకునికుఁడు:
జూదమాడిన మొగమిది గాదటంచు
వీని నాటలో నవలీలగాను గెల్చి
శాంతినందింతు నాక్రోధ మింతగాను
దేవన:
శాకునికుఁడు:
2నేను గోరినట్టి మేనక నాతండు
కోఁతివోలె నెత్తుకొనుచుఁ బోయె
వానిఁ జూడ నాదు వపువెల్ల మండును
ఐన నాడఁ దలఁతు వానితోడ
(అని తరుణార్కుని జూపుచు పల్కును)
దేవన:
(శాకునికుఁడు తరుణార్కుని చేరఁబోవును. అతఁడేఁగుచుండఁగా దేవనుఁడు తనలో నిట్లనుకొనును)
1వీనికంటెను కౌశల్యహీనుఁడైన
జూదకాఁడిని నేనెందుఁ జూడ లేదు
బాగు! బాగైన ప్రత్యర్థి ప్రాప్తమయ్యె
ఆడుటకుఁ దరుణార్కునితోడ నిపుడు
శాకునికుఁడు:
రమ్ము! కంద మెవ్వారి పక్షమ్మునందు
చంచలాదృష్టలక్ష్మి విశ్వాస్య యగుచు
మనఁగనేర్చునొ కొన్నేసి క్షణములైన!
తరుణ:
రమణి:
రంజని:
రాగిణి:
(దేవనుఁడు, మేనక ప్రక్కనుండి పరికించుచుండఁగా శాకునికతరుణార్కులు ద్యూతక్రీడ నారంభింతురు. ఇర్వురును రెండేసి సార్లు పాచికలు క్షేపమొనరింపవచ్చును. ఈ రెండు క్షేపముల మొత్తము ఎవరి దెక్కువ యైతే వారు పందెమును గెల్చుకొందురు.)
శాకునికుఁడు:
తరుణ:
శాకునికుఁడు:
మేనక:
(వంగి, వెనుకనుండి తరుణార్కుని మెడచుట్టును చేతులను వలయించి, ప్రేమతో నతని కుడిచెక్కిలిని తన ఎడమచెక్కిలితోఁ జేర్చుచు పల్కును. వారిని శాకునికుఁడు క్రోధామర్షములతో గమనించును.)
శాకునికుఁడు:
తరుణ:
శాకునికుఁడు:
మేనక:
యున్నది. మన విలాసవైభవాల కిదే మార్గము!
(మునుపటివలెనే తరుణార్కుని మెడచుట్టును చేతులను వలయించి, ప్రేమతో నతని ఎడమచెక్కిలిని తన కుడిచెక్కిలితోఁ జేర్చుచు పల్కును. వారిని శాకునికుఁడు మఱింత క్రోధామర్షములతో గమనించును.)
శాకునికుఁడు:
రెట్టింపు గెల్చుకొందును. ఆరవైవేల స్వర్ణములు నాపణం!
తరుణ:
మేనక:
(అనుచు వెనుకనుండి పలికి, ముందరికి తూఁగి తరుణార్కుని కౌఁగిలించుకొనును. దానిని చూచి మఱింత క్రోధామర్షాలతో శాకునికుఁడు మండిపడును.)
శాకునికుఁడు:
తరుణ:
శాకునికుఁడు:
తరుణ:
శాకునికుఁడు:
వ్యాఘ్రంబ వనుచున్నాను. దొంగ వనుచున్నాను. దీని కిచ్చటనందఱును సాక్ష్యముగా నున్నారు.
3నీచేతను బూనగనే
పాచికలందేదొ మాయ ప్రచలితమగుచున్
నీచేతను విజయంబును
నాచేతను నపజయంబు నందఁగఁజేయున్
తరుణ:
నీరీతిని మామకీన ఋజుతరవృత్తిం
దూఱెదవేటికి? నిన్నిఁక
దారిం బెట్టునది దండధర్మంబొకటే!
(కోపంతో అరచుచు శాకునికుని పైకుఱుకును. ఆ అలజడిచే ఆకర్షితులై ఇతరద్యూతకారులు వారి చుట్టును మూఁగుదురు.)
ఇతరులు:
శాకునికుఁడు:
‘దారిం బెట్టునది దండధర్మం బొకటే’ అని తన్నుటకు సిద్ధమగుచున్నాఁడు.
దేవన:
మంచిది.
ఇతరులు:
మేనక:
పోదాం పద ఈ క్షణమే!
తరుణ:
1ఇప్పుడేఁగిన వీరెల్ల తప్పు నీదె,
వంచకుండవు, దుర్నీతివర్తనుండ
వనుచు నన్ను నిందింత్రు, నేనట్టి నింద
మోయఁగాలేను సద్వంశమున జనించి
శాకునికుఁడు:
(కోపముతో నటనుండి నిష్క్రమించును.)
మేనక:
తరుణ:
1ఇప్పుడేఁగిన వీరెల్ల తప్పు నీదె,
వంచకుండవు, దుర్నీతివర్తనుండ
వనుచు నన్ను నిందింత్రు, నేనట్టి నింద
మోయఁగాలేను సద్వంశమున జనించి
సభికుఁడు:
జూదరులు:
వడివడిగా పణములొడ్డి పాచికలాడం
గడఁగుద మిఁక, స్వర్ణంబుల
యుడుగరలే గెల్చుకొంద మూర్జితఫణితిన్
(ఆనందంతో పైవిధముగాఁ బలికి జూదములో నిమగ్నులగుదురు. ఇంతలో తలుపులను పెద్దగాఁ దట్టిన చప్పుడగును.)
వేశ్యలు:
తల్పు లిది యరిష్టంబునే తెల్పుచుండె
భటులు:
జూదరులు:
దేవన:
(దేవనుఁడు, వేశ్యలు, కొందఱు జూదరులు పాఱిపోదురు. సభికుఁడు తల్పులు దెఱచును. రాజభటులతో శాకునికుఁడు ప్రవేశించి, రాజభటులకు మేనకాతరుణార్కులను చూపుచు పల్కును.)
శాకునికుఁడు:
1అంతమిదె తరుణార్క! నీయాట కెల్ల,
శాంతినిం గాంచుమిఁక చెరసాలయందె
(అని తరుణార్కునితోఁ బల్కి, మేనకకు క్రిందివిధముగాఁ బల్కుచు ఆమె కరమును బట్టి లాగి తన అక్కునఁ జేర్చుకొనఁ బోవును.)
1నన్నుఁ గికురించి నావాహనమ్మునందె
వానితో లేచిపోయిన పాప మెల్ల
పండి ఫలితంబు దాల్చుచునుండె నిపుడు
అనుభవింపుము మేనకా! తనివితీర!
తరుణ:
నీకాయువు మూఁడెనేమొ నేఁడే మూర్ఖా!
ఈకిటికీగుండన్నిను
నీకాయము నుజ్జుగాఁగ నేఁ బడవైతున్
(ఇంతలో స్థాయుకుఁడు ప్రవేశించి ఇట్లనును)
స్థాయుకుఁడు:
తరుణ:
స్థాయుకుఁడు:
4జీవితమందు గమ్యమెదొ చింతనసేయక గాలివాటునం
బోవుచు కంపలోనఁబడిపోయిన గాలిపటంబువోలె నీ
వీవిధి నింద్యవృత్తిఁ జరియించుచునుంటివి, అట్టి నీకు శి
క్షావిధిచే వివేకపరికల్పనచేయఁగ వచ్చితిన్ సుతా!
తరుణ:
స్థాయుకుఁడు:
తరుణ:
స్థాయుకుఁడు:
మేనక:
వ్రీలెను డెంద మతిశోకపీడిత మగుచున్
తైలము లేక నశించెడు
జ్వాలావిధమయ్యె నాదు భవితవ్యంబున్
3నాకలలన్నియు నేఁడే
శోకాబ్ధితరంగలిఖితసూక్తము లయ్యెన్
నాకామితంబు లన్నియు
మోకెత్తని విత్తనంపుమొత్తము లయ్యెన్
(మోకెత్తని=మొలకెత్తని; మోక=మొలక)
ఇతరులు:
అలతిగాసికైన ఆమె యోర్వలేదు
ఆమె లేతవయసు, ఆమె సోయగంబు
ఆమె యశ్రుపాత మరసియైన మీరు
కరుణఁ జూపలేరె? తరుణిఁ గావలేరె?
కరుగదెట్లు గుండె కనఁగ నామె నిట్లు?
10ఆమె లేతవయసు, ఆమె సోయగంబు
ఆమె యశ్రుపాత మరసియైన మీరు
కరుణఁ జూపలేరె? తరుణిఁ గావలేరె?
కరుగదెట్లు గుండె కనఁగ నామె నిట్లు?
స్థాయుకుఁడు:
ఇపుడు శిక్ష తప్పదిర్వురకును
కాన వీరి నింక కారాగృహంబందుఁ
ద్రోసిరండు కడఁకతోడ నిపుడె
శాకునికుఁడు:
రీతిగాఁ గొనిపోయి యీనాతి నిపుడె
నింద్యలగు కులటల కెల్ల నిలయమైన
కారయందునఁ ద్రోయుఁడు కరుణఁ దొఱఁగి
(అని అత్యంతవిద్వేషముతో మేనకను జూపుచు భటులకుఁ బల్కును. భటులు మేనకాతరుణార్కులను వేర్వేరు చెఱసాలలకు గొనిపోదురు)
పంచమాంకము సమాప్తము
షష్ఠాంకము
(రెండు నెలలు గడచును. స్థాయుకుఁడు తరుణార్కుని విడుదల చేయించును గాని, మేనక అత్యంతదయనీయస్థితిలో ఘోరమైన కారాగృహములోనే యుండును. ఆమెను ఓడలో దూరదేశమునకు బహిష్కరించు శిక్ష పడును. ఆమె నోడరేవుకు గొనిపోవుచుండగా తరుణార్కుఁ డామెను రక్షించును. అత్యంతబలహీనస్థితిలో నున్న యామె అతని కౌఁగిటిలోనే అసువులు వీడును.)
(స్థలము: భోగపురమునుండి ఓడరేవుకు పోవు దారిలోని ఒక కూడలి. ముందుగా దేవనతరుణార్కులు, తర్వాత భటులు, మేనక)
తరుణ:
శీలరహితలౌ చెడిపెల నడుమను
వసియించుట నీవంటి వరాంగికి
అసదృశదుఃఖద మగుఁగద మేనక!
11అతిదయనీయంబగు నాస్థితిలో
అతితరశోకసమన్వితవై నీ
వెటులుంటివొ, నీవెంత కృశించితొ
అటమట జెందుచు నాచెఱసాలను
11నీనిర్దోషిత నిర్ణయమొనరుప
నేనెంతయొ యత్నించితి నైనను
శకునిం బోలిన శాకునికుండది
సకలం బయ్యోవికలము చేసెను
11సామోపాయ మసాధ్యంబై తగ
నీమోక్షణమును నిర్వర్తింపఁగ
దండోపాయమె తగునని దేవను
నండగఁ గొంటిని యది గావింపఁగ
(అంతలో దేవనదత్తుఁడు నిరాశాపూరితవదనుఁడై ప్రవేశించును.)
ఏం దేవనా! సంతోషంగా లేవు?
(దేవనదత్తుఁడు జవాబీయక కొన్ని క్షణములు మౌనముగా నుండును.)
మౌనంగా ఉన్నావు దేవనా? వ్యూహం ఫలించ లేదా?
దేవనుఁడు:
నాయుధప్రయోగంబుచే నడ్డుకొనఁగ
కొందరిని ధృతిమంతులంచుం దలంచి
ధనము లర్పించి పంపితిం దరుణ! నేను
1కాని వారలు బహుళసంఖ్యాకులైన
భటలనుం గనినంతనే భయముతోడ
ప్రతిఘటింపక వారినిం బాఱి రకట!
ధనము వ్యయమయ్యె, ఫలితంబు దక్కదయ్యె!
తరుణ:
3దేవన! యిది నిజ మెట్లగు?
దేవుఁడు దీనావనుండు; దృష్టంబగు నా
భావిని త్వరలో నిట నా
దేవుని కరుణాప్తి నంచు దృఢముగఁ దలఁతున్
దేవనుఁడు:
తరుణ:
దేవనుఁడు:
1చాలిచాలకయున్నజీతాలతోడ
బ్రదుకు భటరాజి అవకాశ మొదవు నెడల
అదనముగ గడియించి సౌఖ్యంబు నంద
దలఁచు టేమియు వింతగఁ దలఁపరాదు!
తరుణ:
దేవనుఁడు:
నుండుము. నేను వ్యవహరింతును.
తరుణ:
దేవనుఁడు:
తరుణ:
(గుఱ్ఱపుబండిలో నిందితులైన కులటలను రేవునకు దీసికొని పోవుచున్న నల్గురు భటులు, వారి కధికారియైన తలారి ప్రవేశింతురు.)
భటులు:
విశ్రమింపక సుంత వెళ్ళంగ లేము
మద్యంబుచేఁ గల్గు మఱికొంత బలము
సద్యముగ సేవించి సాగంగఁ గలము
తలారి:
వాడి వత్తలైయున్న పుష్పాలువోలె
జైలునందున సొగసెల్లఁ దూలి కుందు
కులటలం గొనిపోయెడి ఘోరకర్మ
మెవని కింపగు, సంతోష మెవని కొసఁగు?
(భటునితో)
ఆ కులట లెట్లున్నారు?
భటుఁడు:
అత్యంతవిషమముగా నున్నది.
తలారి:
భటుఁడు:
(తరుణార్కుని దూరముగా నుంచి, దేవనుఁడు వారిని సమీపించి, తలారితో నిట్లనును)
దేవనుఁడు:
తలారి:
దేవనుఁడు:
(కొంచెము ప్రక్కకు రమ్మని సైగ చేయును.)
నేను దూరంనుండి విన్నాను. ఒక అందాల యౌవనవతి పరిస్థితి విషమంగా ఉన్నదనీ
ఆమె పేరు మేనక యనీ. ఆమె నాచెల్లెలు. చిట్టచివరిగా ఆమెతో ఒకగంట సేపుండుటకు
మీరనుమతింపవలె.
తలారి:
దేవనుఁడు:
తలారి:
దేవనుఁడు:
తలారి:
ఉంటాం. చీఁకటి పడకముందే ఆమెను మాకప్పగింపవలె. మాట నిల్పుకొనవలె సుమా!
దేవనుఁడు:
తలారి:
దేవనుఁడు:
భటులు,తలారి:
విశ్రమింపక సుంత వెళ్ళంగ లేము
మద్యంబుచేఁ గల్గు మఱికొంత బలము
సద్యముగ సేవించి సాగంగఁగలము
(అని పాడుచు మిగితా ముగ్గురు భటులును, తలారియు చెంతనున్న పానశాలలో దూరుదురు. భటుఁడు మేనకాబంధం తొలఁగించి ఆమెను తీసికొని రాఁబోవును. దేవనుఁడు త్వరగా తరుణార్కుని కడ కుఱికి ఇట్లనును.)
దేవనుఁడు:
ఆమెఁ గొని నీవు స్వేచ్ఛగా నరుగవచ్చు
(ఇంతలో అతిబలహీనముగా తూలుచు నడచుచున్న మేనకను దీసికొని వచ్చుచున్న భటుఁడు దూరమునుండి తరుణార్కునికి గన్పడును. అతఁడా భటుని చూచి దేవనునితో నిట్లనును.)
తరుణ:
ఆమె నంటియుండెను గదా ఆభటుండు?
దేవనుఁడు:
మిగిలియుండెను, దాని నెరగ నొనర్చి
అన్యవిషయాభిరక్తుని నతనిఁ జేసి
అడ్డుపడకుండఁ జేతు నే నతని నీకు!
(వారిద్ధరు మేనకచెంతకు సరగున నుఱుకుదురు)
తరుణ:
(ఆతఁ డామెను కౌఁగిలించుకొనును. దేవనుఁడు భటునికి ధనమును జూపి ప్రక్కకు దొలఁగుదమని సైగచేసి అతనితో మఱుగునకు బోవును.)
మేనక:
(ఆమె శోకింప నారంభించును.)
తరుణ:
మేనక:
నాచే నీకొనరిన యపకృతికిని
కుందుచునుంటిని వందురుచుంటిని
సిగ్గిలుచుంటిని బెగ్గిలుచుంటిని
తరుణ:
కలసి చరింతము, కందము సౌఖ్యము!
కనుగొందము బ్రతుకున నవగమ్యము
కనుగొందము నూతనభవితవ్యము
మేనక:
నాటఁగఁ జూడకు నాహృదయంబున
తరుణ:
13నినుఁ బంపఁగా నున్ననింద్యప్రదేశంబు
లను గూర్చి భయమూని వనరూనఁగావలదు
వారి యత్నము లెల్ల వ్యర్థంబు గావించి
పాఱిపోవుదమిపుడె దూరంబుగా మనము
అతులితంబైన నవ్యానురాగంబుతో
బ్రతుకులం దీర్తము, ప్రమదంబుఁ గందము
మేనక:
నీవలపు నిబిడంబు నిర్మలము నిస్తులము
అసలైన వజ్రంబునందునిల్పక మనము
పసలేని రాలకై ప్రాకులాడితి నేను
మోసంబు చేసితిని పూజింపఁదగు నిన్ను
పోసితిని పీయూషమున విషమునే నేను
తరుణ:
ఈలీలఁ జింతింతు వేలా పురాకృతము?
మేనక:
లీనాఁడు స్మరియింప మేనెల్ల పులకించు
అటువంటి మనబంధ మటమటమ్మున నేను
త్రుటితమ్ము జేసితిని, దోషినై నిల్చితిని
కనికరంబున నన్ను క్షమియించు తరుణార్క!
కనుమూతు నిఁక నీదు కౌఁగిటను దృప్తితో
తరుణ:
కనుగొంద మిఁకముందు కలసి యానందంబు
చాటుగా దూరంపు జనపదంబున మనము
నీటుగాఁ గడపంగ నిపుడె పోదము రమ్ము
మేనక:
ప్రమదానఁ జాలింతు బ్రతుకు నేనింక
తరుణ:
గమియింత మిటనుండి కనుగప్పి భటుల
ఎనలేని నెనరుతో నిఁకముందు మనము
కనుగొంద మానందకల్యాణపథము!
మేనక:
గమియింప నడుగైన కాలాడకుండె
తనువెల్ల చలిచేత స్తంభించుచుండె
కనులందు మృత్యువే కన్పడుచునుండె
క్షమియించి తీవన్న సంతుష్టి బూని
గమియింతు నింక నాకంబునకు నేను
గమియింతు నింక నాకంబునకు నేను
(అనుచు మృత్యుముఖురాలై ఆమె నేల కొరుఁగును. ఆతఁడామె నాప్యాయంగా ఒడిలోనికి దీసికొని ఆకాశంవైపు జూపుచు పల్కును.)
తరుణ:
మెఱసెఁ జూడుము తొలితార మింటిలోన
ఎట్టులైనను నీవు జీవించియుందు
వనెడు నా ప్రత్యయంబున కగుచుఁ జిన్నె
మేనక:
అకట! వజ్రముల యందాశ నన్నింక వదలకుండె!
తరుణ:
ఒదవనీ నీమేన నెదొ నవ్యమగు శక్తి
పదిలంబుగా నిపుడె పాఱిపోదము మనము
పదిలంబుగా నిపుడె పాఱిపోదము మనము
మేనక:
అదలించు నను మృత్యువే, దాని నాపంగ లేను
అదలించు నను మృత్యువే, దాని నాపంగ లేను
నిన్నె ప్రేమింతు తరుణార్క! నిన్నె, నిన్నె,
నిన్నె ప్రేమింతు తరుణార్క! నిన్నె, నిన్నె;
ఇంక వీడ్కోలు ప్రియుఁడ! నేనేఁగుచుంటి.
(అని ఆమె అతని కౌఁగిటిలో మరణించును.)
మేనక సమాప్తము
1.తేటగీతి, 2.ఆటవెలది,3.కందము,4.ఉత్పలమాల,5.చంపకమాల,6.మత్తేభము,7.శార్దూలము, 8.ద్విపద,9.ద్విపదతుల్యము,10.త్ర్యస్రగతి,11.చతురస్రగతి,12.మిశ్రగతి,13.ఖండగతి
*అలరులతోడుత…లతచందంబున= (నిండుగా) పూలు దాల్చి అందంగా నున్న సుకుమారమైన రేలచెట్టుయొక్క లేఁగొమ్మవలె; ఆరగ్వధ మనఁగా రేలచెట్టు. దీనికి ‘Golden Shower’ అని ఇంగ్లీషులో పేరు. ‘పంపావిరూపాక్ష బహుజటాజాటికారగ్వధ ప్రసవ సౌరభ్యములకు’ అని శ్రీనాథుని ప్రయోగము. కోమలమైన కొమ్మల చివర నిండుగా పూచిన బంగారురంగు పూవులతో నత్యంతాకర్షనీయముగా నుండుట ఈవృక్షధర్మము. అందుచేతనే ఆ ఉపమాన మిచ్చట వాడఁబడినది. ఈ వృక్షచిత్రము ఇక్కడ చూపబడినది.