ప్రాణాంతక ప్రణయము

లూచియా డి లమర్‌మూర్ (Lucia Di Lammermoor) అనునది సాల్వదోరే కమ్మరానో (Salvadore Cammarano) అను ఇటాలియను కవి రచించిన విషాదాంతసంగీతరూపకము. దీని నితడు స్కాంట్లండు దేశస్థుడైన సర్ వాల్టర్ స్కాట్ రచించిన లమర్‌మూర్ వధువు (The Bride of Lammermoor) అను నవల ననుసరించి రచించియుండెను. ఈ రూపకమును సుప్రసిద్ధుడైన ఇటలీదేశసంగీతకర్త గితానో దొనిత్సెత్తి (Geatano Donizetti, 1797-1848) అను నతడు సంగీతబద్ధము చేసెను. ఇది మొదటిసారిగా క్రీ.శ.1835లో ఇటలీలోని నేపుల్స్ నగరములో ప్రదర్శింపబడెను. అప్పటినుండి ఇప్పటివఱకును తరచుగా ప్రదర్శింపబడుచున్న దొనిత్సెత్తి యొక్క సుప్రసిద్ధమైన సంగీతరూపకమిది. ఇంగ్లీషు వ్యాఖ్యలతో గూడిన ఈ ఆపెరాయొక్క చక్కని ప్రదర్శనను యూట్యూబులో చూడవచ్చును.

కథాసంగ్రహము

18వ శతాబ్దపు స్కాట్లండుదేశములో తరతరములనుండి విరోధులైన రెండువంశముల సంస్థానాధీశు లున్నారు. ఇందులో లమర్‌మూర్ సంస్థానాధీశుడు ఎన్రికో ఆష్టన్ అను నతడు. ఇతనికి రేవన్స్‌వుడ్ సంస్థానమునకు వారసుడైన ఎడ్గార్డో అను నతడు విరోధి. ఎన్రికోకు లూసియా అను నామె ఏకైకసోదరి. రైమండో అను నాతడు అతనికి మతగురువు. నార్మానొ అను నాతడు అతని దుర్గరక్షకుడు. లూసియాకు ఆంతరంగిక పరిచారిక అలీసా అను నామె.

స్కాట్లండు అధిపతియైన విలియమ్ రాజుకు అనుకూలపక్షము వాడు ఎన్రికో. కాని ఇప్పుడు విలియం తర్వాత మేరీ అను నామె సమ్రాజ్ఞి యైనది. ఆమె పాలనలో విలియం పక్షమువాడైన ఎన్రికోకు అధికార మంతరించు ఆపద చేకూరినది. అందుచేత అతడు తనకు హితుడును, మేరీకి సన్నిహితుడును ఐన ఆర్టురో అను నాయకునికి లూసియా నిచ్చి వివాహము చేసి, తన అధికారమును నిల్పుకొన యత్నించుచున్నాడు. కాని దానికి విపరీతముగా లూసియా అతనికి బద్ధవైరి యైన ఎడ్గార్డో ప్రేమలో పడి, ఆ సంబంధమును నిరసించుచున్నది. ఇట్టి నేపథ్యములో ఈ ఆపెరా యొక్క మూడంకముల కథ ఈక్రిందివిధముగా జరుగును.

కథాసంగ్రహము ప్రథమాంకము

స్థలములు: ఎన్రికో దుర్గము, దుర్గపరిసరమందలి తోట.

నార్మానో రాత్రిపూట అనధికారముగా తోటలో ప్రవేశించిన ఒకానొక ఆగంతుకుని ఉనికిని కనుగొనమని అనుచరులకు దివ్విటీ లిచ్చి వారిని అన్వేషణకు పంపుతాడు. అట్లు ఆ ఆగంతుకుడు ఎడ్గార్డో అని నిర్ధారణ చేసి, అతడు లూసియాను ప్రతి రోజు కలిసికొంటున్నాడని, ఆమె ఆతని గాఢంగా ప్రేమిస్తున్నదని ఎన్రికోకు తెలుపుతాడు. అది విన్న ఎన్రికో ఎడ్గార్డోను మఱింతగా ద్వేషించి, లూసియాతో అతని ప్రేమను భగ్నం చేయడానికి పూనుకొంటాడు.

మధ్యరాత్రిసమయంలో ఎడ్గార్డోను కలసికొనుటకు లూసియా అలీసాతో ఆతోటలోని జలయంత్రము చెంతకు వస్తుంది. కాని ఎడ్గార్డో వచ్చుటకు కొంత ఆలస్యమౌతుంది. ఆలోపల లూసియా అక్కడ ఉన్న జలయంత్రాన్ని చూచి భయపడుతూ, పూర్వం అచ్చట రావెన్స్‌వుడ్ వంశస్థుడొకడు తన ప్రియురాలిని హత్యచేసిన దృశ్యం తన కన్నులకు గట్టినట్లుగా అగపించి తనను భయభ్రాంతురాలిని చేస్తున్నదని ఆలీసాకు చెపుతుంది. ఆలీసా ఇది ఘోరమైన దుశ్శకున మని, ఎడ్గార్డోతో ప్రేమ తన దుర్గతికే దారితీస్తుందని, అందుచే దానిని మానుకొమ్మని లూసియాకు సలహా నిస్తుంది. కాని ఆ ప్రేమయే తనకు జీవాధారమని అట్లు చేయుటకు లూసియా నిరాకరిస్తుంది. ఇంతలో ఎడ్గార్డో వచ్చి తాను అత్యవసరంగ రాబోవు ఉదయమే రాజకీయావసరములకై కొన్ని నెలల పాటు ఫ్రాన్సుకు పోవలె నని ఆమెతో చెప్తాడు. అట్లు వెళ్ళుటకు ముందుగా వారు వివాహాంగీకారమును చేసికొని, దానికి చిహ్నంగా ఉంగరములను మార్చుకొంటారు. ఉత్తరప్రత్యుత్తరములతో తమ ప్రేమను నిలుపుకొనుట కాశిస్తారు. ప్రత్యంతరము లేని ఈ వియోగమున కెంతో విషణ్ణులగుచు విడిపోతారు.

కథాసంగ్రహము: ద్వితీయాంకము

స్థలములు: ఎన్రికో అంతర్మందిరము, దుర్గమందలి వివాహానుకూలమైన విశాలమైన శాల.

ఆర్టురో ఆమెను పెడ్లాడుట కారోజే వస్తున్నాడని, తన ధనమానములను రక్షించుటకు లూసియా అతనిని తప్పక అంగీకరింపవలెనని ఎన్రికో లూసియాను బలవంతం చేస్తాడు. కాని తానిదివరకే ఎడ్గార్డోకు అంకితమైనానని ఆమె అందుకు నిరాకరిస్తుంది. అప్పుడు ప్రవాసములో ఎడ్గార్డో అన్యకాంతానురక్తుడై అమెను మఱచినాడని చూపునట్లుగా నార్మానోచేత కూటసృష్టి చేయబడిన ఒక లేఖను ఎన్రికో ఆమెకు చూపించి, ఎడ్గార్డోను త్యజించి ఆర్టురోను పరిగ్రహింపుమని బలవంతం చేస్తాడు. ఆమె ఇంకను విముఖురాలై యుండగా, రైమండో కుటుంబక్షేమమునకై ఆర్టురోను పెండ్లాడుమని ఆమెకు బోధిస్తాడు. ఆమె బలవంతముగా దాని కంగీకరిస్తుంది.

ఇంతలో ఆర్టురో సపరివారముగా వివాహమునకై వస్తాడు. ఆసమయంలో ఖిన్నురాలయ్యే ఉన్న లూసియాను గమనించిన ఆర్టురోకు అనుమానం కలుగకుండా అనతికాలం క్రిందనే మరణించిన తల్లియందలి శోకంతో ఆమె అట్లుందని ఎన్రికో వివరిస్తూ వివాహాంగీకారపత్రముపై ఆర్టురోచేత సంతకం చేయిస్తాడు. ఆతర్వాత లూసియాను కూడ సంతకం చేయమని దీనంగా అర్థిస్తాడు. ఆమె అర్ధాంగీకారంతో ఆపత్రంపై సంతకం చేస్తుంది. అదే సమయంలో హఠాత్తుగా ఎడ్గార్డో అక్కడికి ప్రవేశించి వివాహమును భంగంచేయుటకు ప్రయత్నిస్తాడు. ఎన్రికో అతనిని ఎదుర్కొంటాడు. వారిద్దరు ఖడ్గయుద్ధమునకు తలపడగా, రైమండో వారిని శాంతపఱచి, లూసియా ఆర్టురోను పెండ్లాడుట కిదివరకే అంగీకరించిందని ఆమె సంతకం చేసిన అంగీకారపత్రమును ఎడ్గార్డోకు చూపుతాడు. అది చూచి ఎడ్గార్డో అత్యంతక్రుద్ధుడై, ఆమె తోటలో తన చేతికి తొడిగియుండిన ఉంగరమును తీసి పడవేసి, ఆమె చేతియందలి తన ఉంగరమును లాక్కొని దానిని కాలికింద పడవేసి తొక్కుతాడు. ఎట్టకేలకు ఎన్రికోచేత అత డచ్చటినుండి బహిష్కరింపబడుతాడు.

కథాసంగ్రహము: తృతీయాంకము

స్థలములు: వైభవహీనమైన ఎడ్గార్డో నివాసము, ఎన్రికో భవనమునందలి విశాలమైన వివాహశాల, తోట.

ఆనాటిరాత్రి ఎన్రికో ఎడ్గార్డోకడకు వచ్చి లూసియా ఆర్టురోతో వివాహసుఖము ననుభవిస్తున్నదని చెప్పుచు అతనిని రెచ్చగొడుతాడు. ఇద్దఱిమధ్య వివాదం ఉద్ధృతమై పంతాలు పెరుగుతాయి. మఱునాటి ఉదయం ద్వంద్వయుద్ధంలో ఎవరు ఉద్దండులో, మరణమో విజయమో ఏదో ఒకటి నిస్సందేహంగా తేల్చుకొనవలెనని వారు నిర్ణయించుకొంటారు.

వీరిక్కడ ఇట్లు తలపడుచుండగా, అక్కడ వివాహశాలలో పరిజనములు చేసికొంటున్న వేడుకలను హఠాత్తుగా ఆపి, లూసియా ఉన్మాదంతో రెచ్చిపోయి ఆర్టురోను కత్తితో పొడిచి చంపివేసిందని రైమండో ప్రకటిస్తాడు. ఇంతలో అపస్మారస్థితిలో నుండి, తానప్పుడే ఎడ్గార్డోను వివాహమాడబోవుచున్నట్లుగా మనస్సులో ఊహిస్తూ విపరీతంగా ప్రవర్తిస్తూ మరణాసన్నదశలో నున్న లూసియా ఆ వివాహశాలలో ప్రవేశించి కొంత సేపటికి నేలకొరిగి అక్కడే మరణిస్తుంది.

ఇంతలో ఉదయమౌతుంది. కడచిన రాత్రి ఎన్రికోతో చేసికొన్న ఒప్పందము ప్రకారము ద్వంద్వయుద్ధమునకై ఖడ్గధారియై ఎడ్గార్డో దుర్గసమీపమునందలి తోటకు వస్తాడు. అక్కడ కోరస్ పాడే విషాదాలాపనద్వారా లూసియా మరణించిందని అతడు తెలుసుకొంటాడు. అత్యంతవిషాదంతో అతడు లూసియా శవమును చూచి, ఊర్ధ్వలోకంలో నైనా ఆమె సాహచర్యభాగ్యం పొందుతానని కత్తితో పొడుచుకొని ఆమె శవము ప్రక్కనే మరణిస్తాడు. ఇట్లు ముగ్గురి మరణంతో ఈ విషాదరూపకం సమాప్తమౌతుంది.

ప్రస్తుతప్రయత్నము

ఈ విషాదాంతనాటకం ఆద్యంతం కరుణారసనిర్భరమైన దనుటలో సందేహము లేదు. ఇందులో గల సన్నివేశములు, పాత్రల చేష్టలు, మనస్తత్వములు ఆద్యంతం చూపఱుల మనస్సుల నార్ద్రీకృత మొనర్చుననుటలో సంశయం లేదు. ఐనను ఇందులో కొన్ని అతార్కికమైన కల్పన లున్నవి. ముఖ్యముగా ఎడ్గార్డో వివాహశాలకు వచ్చి తనకు లూసియాతో గాఢమైన పూర్వానురాగబంధం ఉన్నదని, ఆమె తనకు మాట యిచ్చినదని, పరస్పరం ఉంగరాలు గూడ మార్చుకొన్నామని అంత స్పష్టంగా నిరూపించుకున్నా గాని, అదేమి పట్టించుకొనకుండా ఆర్టురో ఆమెను పెండ్లాడుట అసహజముగా నున్నది. అందుచేత నేనీ సన్నివేశమును మార్చినాను. ఆర్టురో లూసియాతో వివాహమునకు గాక వివాహనిశ్చితార్థమునకై వచ్చినాడని, అది ముగిసిన తర్వాత నివర్తుడగు అతనిని, అతని పరివారమును చూచి, వారు నిర్గమింపగనే ఎడ్గార్డో వివాహశాలలోనికి వచ్చి, తనను వంచించి తన ప్రవాసములో ఇతరుని పెండ్లాడుట కంగీరించి, అంగీకారపత్రమును సంతకము చేసినదని లూసియాను దూషించి, ఎన్రికోతో ఖడ్గయుద్ధమునకు తలపడినాడని మార్చినాను. ఆసందర్భములోనే అతనికి ఎన్రికోకు వివాదం పెరిగి, మఱునాటి ఉదయం వారు ద్వంద్వయుద్ధంలో నిగ్గు తేల్చుకొనుటకు నిర్ణయించుకొన్నారని, మఱునాడట్లు వచ్చిన ఎడ్గార్డోకు అలీసాద్వారా మరణావస్థలో నున్నట్లు తెలిసిందని కథను మార్చినాను. ఎడ్గార్డోనే నిరంతరంగా స్మరిస్తూ మరణముఖమున నున్న తన చెల్లెలిని రక్షించు కొనుటకై ఎన్రికోయే అలీసాను పంపి అతనిని దుర్గములోనికి రావించినాడని, కాని అతడు వచ్చువఱకే లూసియా మరణించినదని కథను మార్చినాను. ఇంకొక ముఖ్యమైన మార్పు ఆర్టురో హత్య. లూసియాకు అతనికి ఇంకా వివాహమే జరుగకుండుటచే, ఆమె అతనిని హత్యచేయు అవకాశమే లేదు. అందుచేత ఇందులో ఆర్టురో హత్య జరుగదు. ఈ నాటకమును భారతదేశమున కన్వయించుకొనుటచేత, ప్రాన్సు మాళవముగాను, లెమర్మూరు శ్రీపురసంస్థానంగాను, రావెన్స్ వుడ్ దానికి ప్రక్కనే ఉండే గోపుర సంస్థానంగాను, రైమండో మతగురువుగా గాక మైత్రేయుడను వృద్ధసచివునిగాను మారినారు. అట్లే లూసియా కామినిగాను, అలీసా మాలినిగాను, ఎన్రికో భీమవర్మగాను, నార్మానో మిత్రసేనుని గాను, ఎడ్గార్డో ప్రవరసేనునిగాను, ఆర్టురో భద్రగోపవర్మగాను, క్వీన్ మేరీ నరసింహసార్వభౌమునిగాను మారినారు.

పాత్రలు

భీమవర్మ (Enrico Ashton): వైభవము దొఱఁగుచున్న ఒక చిన్న (శ్రీపుర) సంస్థానమునకు అధిపతి
మిత్రసేనుఁడు (Normanno): భీమవర్మకు సన్నిహితుఁడైన అనుచరుఁడు
మైత్రేయుఁడు (Raimondo): భీమవర్మయొక్క సచివుఁడు, వృద్ధుఁడు
ప్రవరసేనుఁడు (Edgardo): భీమవర్మవంశమునకు వైరులైన వంశస్థులయొక్క చిన్న (గోపుర) సంస్థానమునకు వారసుఁడు
భద్రగోపవర్మ (Arturo): కామినిని పెండ్లాడఁబోవు సచివుఁడు, రాజకీయనాయకుఁడు, భీమవర్మకు మిత్రుఁడు
కామిని (Lucia Ashton): ప్రవరసేనునియందు ప్రగాఢముగా అనురక్తురాలైన భీమవర్మయొక్క ఏకైకసోదరి
మాలిని (Alisa): కామినికి ఆంతరంగికురాలైన పరిచారిక
ఇంకను భటులు, పరిజనములు, ఇతరబంధువులు

ప్రథమాంకము

మొదటిదృశ్యము

(మిత్రసేనుఁడు, దివటీలు పట్టుకొన్న అనుచరుల కోరస్ ప్రవేశించును.)

మిత్రసేనుఁడు:
తోరంబగు తరువారంబులతో
హేరాళంబగు ఈరంబులతో
దుర్గమమగు నీతోఁపున మీరలు
మార్గణసేయుఁడు మనవిఖ్యాతికి
మనమాన్యతకును బెనుగొడ్డలియై
మనియెడు నాతని మర్మము విప్పఁగ
అంబుదపటలము నావల ద్రోయుచు
అంబుజవైరిని అగపడఁ జేసెడు
అనిలము రీతిగ నాతని యునికిని
కనుగొన మీరలు చనుఁ డీ క్షణమున
అనుచరుల కోరస్:
వలవలె వనమునఁ బర్విన మా చూ
పుల కందకయే చలియింపంగల
మానవుఁడైనను మక్షికమైనను
లేనటు దివటీ లూని కరంబుల
వెదకెద మిందున వేయికనులతో
విదితము చేతుము వేఱెవరైనను
వంచనచే నిట సంచారించిన
కొంచక వారల గూఢాచరణము

(కోరస్ నిష్క్రమించును. మైత్రేయుఁడు, భీమవర్మ ప్రవేశింతురు.)

మిత్రసేనుఁడు:
(భీమవర్మతో) బహుళపక్షమందలి చంద్రవంక వోలె
వన్నె వీడియుండెను నీదు వదనమేల?
భీమవర్మ:
కారణమున్నది దానికి!
హిమసంహతమగు కమలము చందము
క్రమముగ నావిభవము క్షయమందెను
ననుఁగని ప్రవరుఁడు నవ్వుచు దెప్పుచు
గణియింపక యుండెను గర్వంబున
నన్నున్మున్నుగ మన్నన చేసిన
అన్నరపతి యిపు డంతం బొందెను
మన్ననసేయం డెన్నడు హితునిగ
నన్నిపు డేలుచునున్న మహీపతి
తొలఁగింపఁగ నా దుర్దశ నిప్పుడు
కలదొక హస్తము కరుణాకలితము
నిరసించును దానినె నా సోదరి
అరియే యగు, సోదరి కాదాయమ!
మైత్రేయుఁడు:
మాతృమరణంబు నింకను మఱవలేక
కుందు నామెకు ప్రణయసంబంధమందు
కాంక్ష గల్గున? ఆమె శోకంబు నింత
చింతసేయక యిట్లు వచింపఁ దగదు.
మిత్రసేనుఁడు:
ఎట్టి మిథ్యావిచారంబు? ఎట్టి సాకు?
పుట్టెడంత ప్రణయమందు మునిగితేలు
నామె వైఖరి నెఱుఁగక యాడు మీదు
మాటలెల్లను కల్లలమూట లేను
భీమవర్మ:
ఆమె ఆర్తి నిర్హేతుకమైన ఊహయే!
మైత్రేయుఁడు:
(తనలో) దేవుఁడే కాపాడవలె వీరిని!
మిత్రసేనుఁడు:
వినిపింతు నేఁగన్న విషయంబు నొకకొంత
అనతికాలము క్రింద వనరొందు చాయింతి
తనతల్లి ఖననంబు నొనరించి యున్నట్టి
వనమందు నేకతమ భ్రమియించుచున్నంత
దెసనున్న పొదనుండి విసము వెల్లువగట్ట
బుసలు గొట్టుచు నొక్క భుజగంబు పైకుఱికి
కసిమీర నామెనుం గాటేయు నంతలో
అసితోడ హతమార్చె నాపాము నొక్కండు
భీమవర్మ:
ఆతఁడెవ్వండొ?
మిత్రసేనుఁడు:
ఊహింతు నతని ఆచూకి నంతె!
భీమవర్మ:
వాని నెఱుఁగున కామిని?
మిత్రసేనుఁడు:
కామించు కామిని గాఢముగ వాని
భీమవర్మ:
కలసికొందుర వారు గూఢముగ?
మిత్రసేనుఁడు:
అనుదినంబును అహర్ముఖమందు!
భీమవర్మ:
ఏస్థలంబందు, ఏప్రాంతమందు?
మిత్రసేనుఁడు:
ఆ వనాంతరమందె చెల్వారుచున్న
వారియంత్రము చెంతనే వలపుమీర
భీమవర్మ:
ఆతం డయి యుండున నాకుం బ్రతికూలుండగు ప్రవరుండే?
మిత్రసేనుఁడు:
సరియైనదిగానే తోఁచును మీ సందేహము!
మైత్రేయుఁడు:
(తనలో) అయ్యో! దైవమా!
భీమవర్మ:
(కోపముతో) అనలము రీతిని నతిదుర్భర మయి
ననుఁ గాల్చుచు నున్నవి నీవాక్కులు
తహతహపడు నాతనువుల్ముకమై
దహియింపఁగ నాతని నీక్షణమే
ఎంతటి దోషం బెంతటి ద్రోహము!
అంతటి శత్రువు నాకాంక్షించున
నాతల్లిస్తన్యంబును ద్రావిన
నాతోబుట్టువె, నాసోదరియే?
పగవాఁడయి యేపగిదిని మైత్రికిఁ
దగని విరోధికిఁ దన చిత్తంబును
కానుక చేసిన కామిని సోదరి
యైనను వైరియె యగుగద నిజముగ!
మిత్రసేనుఁడు:
కాదు నిర్హేతుకము మీదు క్రోధరీతి
మైత్రేయుఁడు:
(వారించుచు) క్రోధబుద్ధికి తర్కంబు బోధపడదు
మసకచీకటి దారుల మఱుఁగుపఱచు
శాంతి వహియించి చిత్తంబు సంయమించి
సత్పథంబును గనుట సజ్జనవిధంబు

(వెదకుట కేఁగిన అనుచురుల కోరస్ పునః ప్రవేశించును.)

కోరస్:
వెదకితి మంతట, కంటిమి విషయం బెల్లను
మిత్రసేనుఁడు:
(భీమవర్మతో) వింటివె వీరల మాటలు?
భీమవర్మ:
(కోరస్ తో) విన్నవింపుడు మీరలు గన్నదెల్ల!
కోరస్:
పాదపంబుల పంక్తులందున
వీరుధంబుల వీథులందునఁ
దిరిగి బడలికఁ దీర్చికొనఁగం
జెంగటం గల శిథిలగృహమున
విశ్రమించుచు వేచియుండఁగ
నిండుచంద్రుని నిగ్గుతోడుత
తనువికాసము దనరుచుండఁగ
జాతిగుఱ్ఱము స్వారిచేయుచు
వీరుఁడొక్కఁడు దూరమందునఁ
కనఁగనయ్యెను వనమునందున
కాని యాతఁడు కంటిమేరను
మీరి త్రుటిలో దూరమయ్యెను
అతనిఁ జూచిన వ్యాధుఁడొక్కఁడు
నిర్ణయించెను నీదు శత్రువు
ప్రవరసేనుం డవునతండని
భీమవర్మ:
(ఉద్రేకంతో) ఆహా! ఆహా! అతఁడేనా అతడేనా
నా ఆగర్భశత్రువు ప్రవరసేనుఁడు?

మైత్రేయుఁడు:
ఒక్కమాట…!
భీమవర్మ:
నిరర్థకము మీ యభ్యర్థన!
ఎట్టివార్త వింటి నెట్టివార్త వింటి
పట్టరాని కోపవహ్నితోడ నిండి
నాదు డెంద మగ్నినగమువోలె రగిలి
బూదిసేయఁ గోరు నాదురాత్ము నిపుడె
లేదు లేదు కరుణ నాదుడెందమందు
నాదువంశకీర్తి నాదుప్రాభవంబు
బూదిలోనఁ గలుపఁ బూనియున్నవాని
నాదు ననుఁగు చెల్లి నేదొ వలపువలను
బన్ని అపహరింప నున్నవాని నెట్టు
లెన్నఁగలను నాకు హితునిఁగాను నేను?
వారి యక్రమంపు ప్రణయవార్ధితరణి
తీరమంటరాదు, తేలియుండరాదు
దాని భగ్నమొందఁగాను జేతు నేను;
మాననీయమైన మాదువంశకీర్తి
ప్రాణమైనఁ బుచ్చి రక్షణంబు సేతు
కోరస్:
సందియంబు లేదు; సందియంబు లేదు
ఘోరమైన ఇతని కోపవహ్నిలోన
పూరివోలె నతఁడు బుగ్గియగుట నిజము
మిడతవోలెఁ జచ్చిపడుట నిజము
మైత్రేయుఁడు:
(తనలో) చాలభయదమైన సమయ మావహిల్లె
కాలమేఘమట్లు క్రమ్ముకొనుచునుండె
కోటలోన నెల్ల ఘోరమైన సేగి
చేటుకొఱకె యితని చిత్త మిట్లు దలఁచు
భీమవర్మ:
అతని గర్వమెల్ల నడఁచునంతవఱకు
మతిని శాంతినంది మనఁగ లేను;
అతని మాయనుండి ఆమెను మఱలించి
హితుఁడు గోపవర్మకీయ నెంతు
కోరస్:
సందియంబు లేదు; సందియంబు లేదు
తలఁచినట్టిదెల్ల తత్క్షణంబు సేయు
కలిమిబలము గల్గు కార్యశూరుఁ డితఁడు
కలిమిబలము గల్గు కార్యశూరుఁ డితఁడు

(నిష్క్రమింతురు)

రెండవ దృశ్యము

(అర్ధచంద్రుఁడాకాశంలో వెలుగుచున్నాఁడు. ఆసమయంలో కామిని తన కాప్తురాలైన పరిచారిక మాలినితో ఇతఃపూర్వం తఱచుగా తాను ప్రవరసేనునితో కలసికొనుచుండిన వనమందలి జలయంత్రము చెంతనే ప్రవరసేనునికై నిరీక్షిస్తున్నది. సామాన్యంగా వారి సమావేశం తెల్లవారుజామున జరిగేది. ఇప్పుడు మాత్రం మధ్యరాత్రి తర్వాత కొద్దిసేపటికే ఆమె అతనికై ఎదురు చూస్తున్నది.)

కామిని:
ఎచ్చట నున్నవాఁడొ యతఁడింకను రాడు; సకాలమందునన్
జెచ్చెరఁ జేరవత్తునని చేసె ప్రమాణము గాని,
మాలిని:
కామినీ!
వచ్చునొ, రాడొ, కాని యిఁక భావ్యముగా దిట వేచియుండుటల్,
వచ్చు మహాపద ల్గనఁగవచ్చినచో భవదగ్రజుండిటన్

(పైరెండు సంభాషణ లొకే ఉత్పలమాలలోని భాగము లనుట స్పష్టము)

కామిని:
ఆపదలు, ననాపదలుం
బ్రాపించును నరులకు విధివశమున నైనం
జేపడు కార్యం బించుక
ఓపినచో నని మదాత్మ యుద్ఘోషించున్

(అని పల్కుచు భయభ్రాంతమైన చిత్తముతో వెనుక నున్న జలయంత్రమును చూడ నారంభించును)

మాలిని:
జలయంత్రము గని జడిసెదవేటికి?
కామిని:
కనినయంతనె దానినిఁ గదలుచుండు
కనులముందర కడుఘోర ఘటన మొండు
(పాట)
మవ్వంపు తనువును మవ్వంపు మనసు
మవ్వంపు నగవును జవ్వనపు సొగసు
గలయట్టి నొకకాంత వలపులోఁ దగిలి
బలియుండు ప్రవరుని వంశస్థుఁ డొకఁడు
ఆమె శీలంబందు ననుమానమొంది
ఆమర్షమున నామె నసితోడ నరికె
శోణితాక్తంబైన ఆనారి శిరము
ఈనీటిలో వ్రాల నెఱ్ఱనై పాఱె
శోణితాపగవోలె నీనీర మెల్ల
ఈనీటియంత్రంబు నేనెపుడు గందు
ఆనాటిఘటనంబె అక్షులకు ముందు
కదలాడి కాయంబు కంపంబు నొందు
హృదయంబు కలఁతచే నెంతయో కుందు
మాలిని:
చెప్పనేల? నీదు చిత్తవిభ్రమంబె
కారణంబు నీదు కలఁత కందు నేను!
కామిని:
కాదు కాదామె ప్రేతాత్మఁ గంటి నేను!
ఒకనాటి నడురేయి…

(అర్థోచితముగా నభినయించుచు ఈ క్రింది పాటను పాడును)

((పాట)

ఉడురాజు నింగిలో నుదయించుచుండె
సడిలేక వనమెల్ల శాంతమై యుండె
ఆవేళఁ జరియించి యీవనంబందు
నేవింటి నొకయార్త రావంబు నిందు
దూరాన వినిపించు నారావ మంత
తోరమై నినదించెఁ జేరువై చెంత
ఆరావ మంతలో నంతమై నిల్చె
స్త్రీరూపభూతంబు తెలిచీరఁ దాల్చి
అదలించి హస్తంబు లామె ననుఁ బిల్చె
కదలించి పెదవుల న్నెదొ పల్కనెంచె
అదియంతఁ గనుచుండ అదరెంతొ గలిగె
ఒదవు మ్రాన్పాటుచే నొడలెల్లఁ గలఁగె
సుడిగాలిగా మారి వడిగాను దిరిగి
అడఁగె నాభూత మీయంత్రంబు దరిని
ప్రవహించె జలమంత రక్తముం గూడి
అవదాతరుచి వీడి అరుణాభతోడ
ఆరక్తవారిలో నాభూత మపుడు
తోరమై ఘోరమై తోపంగసాగె
ఆనాటి ఘటనంబె ఈనీటియందు
కానఁబడి నామేను కంపంబునొందు
మాలిని:
కామిని! నీవిటఁ గన్నవి యన్నియు
భీమతరోత్కటవిలయపథంబున
నాటిన పథిచిహ్నము లనిపించును;
పాటింపుము నామాటను కామిని!
చేటును దెచ్చెడు చిత్తోద్రేకపు
బాటను బూనకు ప్రణయమిషంబున;
వీడుము నీవీ ప్రేమపథంబును
కాఁడాతఁడు నీకర్హుఁడు, కామ్యుఁడు.
కామిని:
వీడుము చెలి! నీవీ పాఠంబులు
వాడినపూవుకు పోడిమి క్రొత్తగఁ
గూడిన విధమున క్రొత్త వికాసము
గూడెను నాకీ కూరిమికతమున
మాలిని:
మోహముచే గనుమూయుచు నీవిటు
లూహలడోలల నూగుచునుంటివి
కామిని:
త్యాగమొ మోహమొ ధర్మచ్యుతియో
నే గణియింపను నిజముగ మాలిని!
ఆతని స్నేహమునందున సౌఖ్యపు
లోతులఁ గాంచుచు లోకమె మఱతును
మాలిని:
అరయుము కామిని! అన్నివిధంబుల
చెఱపును దెల్పెడు చిన్నెలె యున్నవి
ఇది కడముట్టుట యెటులో యని నా
మదిలో శంకయె యొదవుచు నున్నది
కామిని:
ఏదెటులైనను నెదలో నూతన
మోదాంకురమున కాదరువై తగు
శ్రావణమేఘపు సాప్తపదీనము
నేవిధిఁ గాదని జీవము దాల్తును?
ఆతని యనురాగాసవ మగు నా
చేతము మత్తిలఁ జేసెడు మద్యము
ఆతని రాగరసాంచితదృష్టులె
నాతనువున కిడు నవచైతన్యము
ఆతని పలుకులయందునఁ గందును
స్ఫీతప్రియతాపీయూషంబును
ఆతని కౌఁగిళులందునఁ గందును
భూతలనాకపుభూరిసుఖంబును
అతని సమక్షమునందున నాదగు
వెతలెల్లను నపగతమగు క్షణమున
అతని సమక్షం బలరించును నను
సితవిద్యుతిసంయుతపౌర్ణమివలె

(ఇంతలో ప్రవరసేనుఁడు వచ్చుచున్నచప్పుడు వినిపించును.)

మాలిని:
వినిపించును నాతని పదరావము
కనిపింపక మిముఁ గాచుచు నుందును

(అని దూరముగా నిష్క్రమించును. ప్రవరసేనుఁడు ప్రవేశించును.)

ప్రవరసేనుఁడు:
నా కామదేవతా!
కామిని:
నా మనోవసంతా!

(కౌఁగిలించుకొందురు. )

ప్రవరసేనుఁడు:
విరసమైన యిట్టి వేళను నిచ్చటం
గలసికొనుట సౌఖ్యకరము గాదు
ఐన భావికార్య మనివార్య మగుటచే
దానిఁ దెలుప వచ్చినాను నీకు
భానుఁడు తూర్పుకొండపయి భాసిలులోపల నేను బోవలెన్
మానిని! మైత్రిపూర్ణుఁడగు మాళవనాథుని పూన్కి దీర్పఁగన్
దీనిని సత్వరంబుగను దెల్పఁగ నీకును గోరికొంటి ని
న్నీ నిసివేళఁ గాంచఁగ, సహింపుము దీనిని నీవు తాల్మితోన్
కామిని:
ఎంతఘోరవార్త, ఏఁగక తప్పదా
దుఃఖజలధియందుఁ ద్రోసి నన్ను?
ఎంతకాల మిట్టి యెడఁబాటు నోర్చుచు
గణన సేయవలెను దినము లేను?
ప్రవరసేనుఁడు:
నాల్గునెలలపాటు నాసాయ మర్థించె
మాళవేశ్వరుండు మైత్రితోడ!
మనవియోగ మెట్లొ మదిలోన నోర్చుచు
మనఁగవలెను నంతదనుక మనము
పూర్వవైరము మాని యపూర్వమైన
స్నేహమున మన సంగముం జిత్తగింపు
మనుచు నీభ్రాత నర్థింపఁ జనుదు నేను
ప్రకటమొనరింతు మనబాంధవమ్ము నట్లు
కామిని:
వలదు, వలదాతనికిఁ దెలుపంగవలదు;
లోతుపాతులెఱుఁగక యీరీతి నీవు
తలఁతువే కాని, మనదు వృత్తాంత మిపుడు
దాఁచియుంచుటే శ్రేయఃప్రదంబు మనకు
ప్రవరసేనుఁడు:
నీమనంబునందు నీయన్నయన్నచో
వ్యక్తమగుచు నుండె భయము చాల
భయము గాదు నాకు వైరశుద్ధియె తోఁచు (వైరశుద్ధి=ప్రతీకారము)
అతనిఁ దలఁచినంత నాత్మయందు

(పాట)

పలుతరంబులనుండి నెలకొన్న యీర్ష్యతో
చెలరేగి నీయన్న చేటెంతయో చేసె
నాతండ్రిఁ జంపించె నాయాస్తి హరియించె
స్వాతిశయమూని మావంశమును నిరసించె
ఇంతచేసినవాని కింకేమి చిక్కె
అంతకుని కడకు నన్నంపుటయె తక్క
ఇదియెల్ల భావింప హృదయంబు మండు
కొదలేని ద్వేషంబు క్రోధంబు నిండు
కామిని:
శాంతి వహింపు మొకింతగ ప్రియతమ!
ప్రవరసేనుఁడు:
శాంతించెద నెటు? స్మరియింపఁగ నది
స్వాంతము నొగులును, వైరము రగులును (నొగులు=దుఃఖించు, పరితపించు)
కామిని:
నాకొఱకైనను నమ్రత నూనుము!
ప్రవరసేనుఁడు:
అకారణవిరోధము గాదిది. ఆలింపుము!
మీవంశజులచేత మృతుఁడైన నాతండ్రి
పావనసమాధికడ ప్రతినచేసితి నేను
వేవేగ గ్రహియించి మీవారి రుధిరంబు
కావింతు నాతనికి ఘనతర్పణం బంచు
అంతలో నినుగాంచి శాంతించితిని సుంత
అంతరించెను లోన నాద్వేషభావంబు
ఎంతవఱకీశాంత మెదలోన నుండునో
అంతమై యెప్పుడది ఆగ్రహమె నిండునో?
కామిని:
పాపము శమించుగాక! పాఱద్రోలుము నీ కోపంబును!
పట్టముం గట్టి నీవిట్టిభావంబులకు
మట్టిపాల్సేతువే మనరాగరసమెల్ల?
చెట్ట దలపక సుంత చింతింపు శ్రేయంబు
ఎట్టకేలకుఁ బ్రేమయే మనకు శరణంబు
ప్రవరసేనుఁడు:
కాని గలఁచుచునుండు నాప్రతిన నన్ను!
కామిని:
వీడుము నీవాతలఁపును
చూడుము మనప్రణయమందు సుఖసంభూతిన్
కూడుము వలచిన చెలిఁ, బో
నాడుము ప్రణయంబు దక్క నన్యము మదిలోన్
చిరవైరంబున కన్నను
ధరలో బలవత్తరమయి తనరును ప్రియతా
స్ఫురణయె యనునీతి కుదా
హరణం బయి తనరుత మన యనురాగంబే!
నిన్నభ్యర్థింతును, నన్నుం జూడుము!
నీయసహనంబును వీడుము!
ప్రవరసేనుఁడు:

(ప్రణయభావబంధురమైన హఠాత్పరిణామమును నటించుచూ,
తన ప్రేమకు చిహ్నముగా నుంగరమును గొని ఆమె వ్రేలికి దొడుగును)

ఈవనదేవత ల్మఱియు నిచ్చట వీచెడు కమ్మతెమ్మెరల్
వావిరిగా నభంబున ప్రభల్ వెదచల్లెడు చంద్రతారకల్
తీవలుపూవులుం దిశలు దీవెన లిచ్చుచునుండ నుంతు ని
న్నే వరియించు చిహ్నముగ నీరుచిరోర్మిక నీకరాంగుళిన్
నీవాఁడనె నేనైతిని నిస్సంశయముగ!

కామిని:

(ప్రణయముతో నతని చేతికి తన యుంగరమును దొడుగుచు పల్కును)

మనవంశంబుల వైరము
మనమునఁ దలఁపక త్వదీయమానసమందున్
మన నిరతము, నీకరమున
నెనరారఁగఁ దొడుగుచుంటి నీయుంగరమున్

నీదాననె నేనైతిని నిస్సంశయముగ!
ఇర్వురు:

(గాఢముగాఁ గౌఁగిలించుకొనుచూ పాడుదురు)

వృంతలతాంతంబులవలె
స్వాంతాకూతంబులవలె
అవినాభావోన్మేషముతో
కవగూడితి మొకటై, జ
క్కవలవలెం గూడితి మొకటై
https://eemaata.com/em/issues/202003/22217.html(స్వాంతాకూతంబులవలె= మనస్సు, ఆశయములవలె; నీరధి=సముద్రము; తరణి=ఓడ, దాటించునది)
ఈరాగం బీబంధమె
తీరుగ జీవితనీరధి
తీరముఁ జేర్పఁగఁ జాలెడు
సారపు తరణియె కానీ, సం
సారపు తరణియె కానీ

వృంతలతాంతంబులవలె … జక్కవలవలెం గూడితి మొకటై
ఈరాగం బీబంధమె… సంసారపు తరణియె కానీ
ప్రవరసేనుఁడు:
నిన్ను వీడెడి సమయమాసన్నమయ్యె
నింక ప్రియురాల! వీడ్కోలు నిమ్ము నాకు
కామిని:
ఎంత ఈర్ష్యయొ, కాలాని కెంత పగయొ?
సైపకింతయు మన పరిష్వంగసుఖము
నిన్ను దూరము చేయుచు నున్నదకట!
ఐన నాయాత్మ నీతోనె యరుగు సఖుఁడ!
ప్రవరసేనుఁడు:
తనువుమాత్రమె నాతోడఁ దరలుచుండు
ఆత్మ నీతోడనే యుండు ననిశముగను
చింతసేయంగవలదు హేమంతమేఁగ
రాకయుండునె వాసంతరమ్యవేళ?
సమయము స్వల్పమె యున్నది. సత్వర మేఁగక తప్పదు.
కామిని:
ఎంత యమర్షమో విధికి నిప్పుడె నిన్నెడఁజేయుచుండె, నొ
క్కింతయు నీవియోగము సహింపని నానయనాశ్రుధారలం
గొంతగనైనఁ బాపి మదిఁ గ్రొత్తవెలుంగులు నిల్పు నీదు వృ
త్తాంతము దెల్పు లేఖలను తప్పక వ్రాయుచునుండుమో ప్రియా!
ప్రవరసేనుఁడు:
చింతింపకు నీవింతగ,
చెంతను నే లేనిలోటు చేకుఱకుండన్
స్వాంతముఁ దన్పెడి లేఖా
సంతతిఁ బంపుదుఁ బ్రతిదివసంబును నీకున్

https://eemaata.com/em/issues/202003/22217.html(పాట)

కామిని:
ఈదేశమందుండి ఆదేశమును జేరు
తావిమోపరి దెచ్చు నావిరహశోకంపు (తావిమోపరి= గంధవహుఁడు, వాయువు)
రుతి నింత ఆలించి మతిలోన నన్దలఁచి
విడువు నాకైయొక్క వేడి బాష్పము నైన!
ప్రవరసేనుఁడు:
ఆదేశమందుండి ఈదేశమును జేరు
పవనుండు గొనివచ్చు ధ్వనిలోన వినిపించు
ననిశంబు నీస్మరణ మొనరించు నీప్రియుని
అనురాగమయమైన అనునయాలాపంబె
ఈదేశమందుండి… బాష్పము నైన!
ఆదేశమందుండి… అనునయాలాపంబె
వీడ్కోలు ప్రియురాల, ఏఁగవలె నింక
కామిని:
వీడ్కోలు, విస్మరింపకు నేటి బాసలు!
ప్రవరసేనుఁడు:
కామినీ…
కామిని:
ప్రవరా…

(ప్రవరసేనుఁడు నిష్క్రమించుచుండును. అతనిని చూపందునంతవఱకు జూచుచు కామిని నిష్క్రమించును.)