పత్త్రపతనకాలము

క్రమముగా దీర్ఘమయి తోఁచె రాత్రులెల్ల,
అర్యముఁడు తీక్ష్ణతం బాసె నాకసమున,
ప్రత్యుషఃకన్య పొగమంచుపైటఁ దాల్చె,
పత్త్రపతనకాలంబు సంప్రాప్తమయ్యె.

పొలములఁ బండె గోధుమలు, పొంపువహించుచు నున్నతంబులై
బలిసిన కంకులం గనుచు బాగుగఁ బెర్గిన మొక్కజొన్నలున్,
చెలువగు స్వర్ణపుష్పములచీరను దాల్చిన నువ్వుపైరులున్,
పలురకమైన వర్ణముల భాసిలు రుచ్యఫలాగమంబులున్.

కోఁతకాలం బేతెంచె నంచాతురముగ
దయ్యములఁబోలు కోఁతయంత్రంబులూని
పైరులం గోయఁ గడఁగిరి పల్లెలందు
కర్మదీక్షితులపగిది కర్షకాళి.

అట్లు గోసిన సస్యకాండాళిచేత
ఘాసశిల్పీంద్రులంబోలెఁ గట్టిరంత
భూరితరవర్తులాకృతిం బొనరుచున్న
గడ్డిమోపు లవారిగా కర్షకాళి.

రంగులు దిరిగిన గుమ్మడు
లం గలిగిన పంటపొలములం గన నంతన్
బంగరుకుండలసిరి నిం
డం గలిగిన బొక్కసంబుడంబున మించెన్.

పొనరిన సస్యఫలంబున
కొనరింపఁ గృతజ్ఞత లపు డూరూర జనుల్
ఘనతరకృతజ్ఞతార్పణ
దినపర్వంబును సలిపి రుదీర్ణోత్సుకతన్.

గ్రీష్మవనరమాగండరక్తిమముఁ బూని
మున్ను వికసించిన గులాబిపుష్పరాజి
స్వీయవిభవంబుఁ గ్రమముగాఁ బాయఁదొడఁగె,
రాజ్యమును గోలుపడుచున్న రాజ్ఞివోలె.

తోరపుఁ బుష్పమంజరులతోఁ గనువిందొనరించినట్టి అం
టారియొ క్రాబుయాపిలుకుటంబులు నేఁడెఱయెఱ్ఱపం డ్లలం
కారముగా ధరించి కుతుకంబున లోకులు గ్రిస్మసందలం
కారము సేసినట్టి తరుకాండములం దలపించుచుండెడిన్.

అలమధుమాసవేళ నరుణాభ వహించి జనించి, యాపయిం
బొలుపగు నిండుపచ్చజిగిఁ బూనిన పర్ణములెల్ల నిత్తఱిం
దళమగు కుంకుమచ్ఛవిని దాలిచి ధూమఖరోష్ణతీక్ష్ణతల్
గలుగని రమ్యరాగమయకాననవహ్నులఁ గప్పె భూములన్.

కొఱవులఁబోలె నెఱ్ఱనగు కోమలపత్త్రసమంచితంబులై
కఱువలిచేతనల్లనలఁ గంపిలు మేపులువృక్షరాజిచేఁ
బరగెడు కాననేందిర ప్రభాసిలుచుండె నవారుణాంశుకా
వరణముఁ బూని వ్రీడమెయి వచ్చెడి పెండిలికూతురుంబలెన్.

అక్కజంబుగ జలములం దగ్నిశిఖలు
ప్రజ్వలించుచు నున్నట్లు వ్యక్తమయ్యె
సాంద్రరోహితదళపూర్ణసాలసంవృ
తాపగాసరస్సుల నరయంగ నిపుడు.

గగనమునందుఁ దేలు తెలిగాలిపటంబులలీల లీలగన్
నిగనిగలాడుఱెక్కలను నేర్పున నార్చుచు, నార్చుచున్, సుతీ
ర్థగులగు సాధువర్యులతెఱంగున దక్షిణమార్గగాములై
ఖగకులముల్ మనోజ్ఞముగఁ గట్టెను బారులు నాకమందునన్.

కరఁగినమంచుచేతఁ బరికల్పితమైన సమృద్ధవారితో
నొరయుచుఁగూలముల్ ఘనరయోద్ధతిఁ బాఱు నిదాఘవాహినుల్
తఱిగినవేఁడిచే నిపుడధఃకృతవారిరయంబుతోజవం
బురివినయాటకత్తెవలె నొయ్యనఁ బాఱెడి శీతలాంబులై.

మృదులకరప్రసారమున మేదినిఁ గప్పు హిమావగుంఠికన్
ఉదయముహూర్తమందుఁ గడు నుత్సుకతం దొలగించు భాస్కరుం
డదె వెలుగొందుచుండె నిపు డాత్మవధూవదనావగుంఠికన్
ప్రిదులఁగఁ ద్రోచి తన్ముఖముఁ బ్రీతిమెయిం గను భర్తపోలికన్.

ఇవమును వానయుం దనకు నిష్టసఖద్వయమై చెలంగ సం
రవపరిపూర్ణసంస్యదవిరాజితభీకరసంప్రసారణ
ప్రవిధుతసర్వలోకుఁడయి రక్కసిలావును బూని యిత్తఱిన్
పవనుఁడు వీవఁగాఁ దొడఁగె ప్రాంతమునందున మాటిమాటికిన్.

వాసిగ లోకవాంఛలను బాయఁగఁ ద్రోసి ముమూర్షతోడుతం
గాశిక నున్నవారివలె కాయము సాంతము పండిపోవ శా
ఖాసదనంబులందెటులొ కాలముపుచ్చుచునున్న పర్ణముల్
నాశనమయ్యె నయ్యొ! జవనాంచితతన్మరుదాగమంబునన్.

పుడమియందున నారీతిఁ బడినయట్టి
ఆకులను నొక్కచో నుండనీక క్షణము
ఆకసంబునఁ జిమ్ముచు నాడుకొనియె
మాణవకునిరీతిగఁ బవమానుఁడిపుడు.

భూషణంబులు దొలగింప బోసివోవు
వేషసంయుతలైనట్టి యోషలట్లు
త్యక్తపత్త్రంబులై యున్న తరువు లిపుడు
చూడశక్యము గాకుండ మ్రోడులయ్యె.

పాసిన నేమి పత్త్రములు? పచ్చనియాకులు చైత్రమందునన్
రాశులుగా జనించి తరురాజి కలంకృతిఁ గూర్చు, తథ్యమీ
బాసయె; పైమెఱుంగు లిలఁ బాసినఁ బాయును; లోన నున్నచో
వాసియుఁజేవయు న్మఱల వచ్చును గా ప్రవినష్టసంపదల్!

వృద్ధమయినట్టి గాత్రంబు విడిచి మఱల
తరుణదేహంబు నెట్లాత్మ దాల్చుచుండు
తరువులట్టులె జీర్ణపత్త్రంబు లుడిగి
తరుణపత్త్రాల చైత్రానఁ దాల్చుచుండు.