రచయిత వివరాలు

వేమూరి వేంకటేశ్వర రావు

పూర్తిపేరు: వేమూరి వేంకటేశ్వర రావు
ఇతరపేర్లు: రావు వేమూరి
సొంత ఊరు: పెరిగినది తునిలో
ప్రస్తుత నివాసం: ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా
వృత్తి:
ఇష్టమైన రచయితలు: ఏనుగు లక్ష్మణకవి, Isaac Asimov, Carl Sagan
హాబీలు: సైన్సుని తెలుగులో రాయడం
సొంత వెబ్ సైటు: https://www.cs.ucdavis.edu/~vemuri/
రచయిత గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.

 

శంతనుడికి ఒక అన్నగారు ఉన్నారన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. ఈ అన్నగారైన దేవాపి – బొల్లి (రోగం) వల్ల రాజ్యార్హతని పోగొట్టుకుని అడవులలో తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోబట్టే చిన్నవాడైన శంతనుడికి రాజ్యం దక్కింది. తరువాత తరంలో దేవవ్రతుడికి దక్కవలసిన రాజ్యం మరొక విధంగా చెయ్యి జారిపోయింది. పోనీ శంతనుడికి సత్యవతి వల్ల కలిగిన ప్రథమ సంతానమైన చిత్రాంగదుడికి రాజ్యం దక్కిందా? అదీ లేదు.

మెదడులలో ఉండే జీవకణాలని న్యూరానులు అంటారు. ఇవి శరీరంలోని ఇతర జీవకణాలవంటివి కావు. ఈ న్యూరానులని కొన్నింటిని ఒక జాడీలో వేసి అలా వాటి మానాన్న వాటిని వదిలేస్తే కొంతసేపట్లో అవి ‘ఆలోచించడం’ మొదలెడతాయి! ఈ వాక్యం కాసింత అతిశయోక్తి అనిపించినా, ఇది హాప్‌ఫీల్డ్ పరిశోధన సారాంశం.

మన మొట్టమొదటి శ్వాస పుట్టిన వెంటనే గాలిని లోపలి పీల్చుకోవడంతో మొదలవుతుంది, చిట్టచివరి శ్వాస గాలిని బయటకి వదలడంతో అంతం అవుతుంది. ఈ మధ్య కాలంలో, ప్రతి రోజూ, సగటున, 22,000 సార్లు ఊపిరి పీల్చి వదలుతామని ఒక పనిలేని దివాకీర్తి లెక్క కట్టేడు.

ప్రపంచ వ్యాప్తంగా, ప్రతి ఏటా 50 లక్షల పాము కాట్లకి ప్రజలు గురి అవుతున్నారు. వీటిలో 27 లక్షలు విషసర్పాలు వేసే కాట్లు. దరిదాపు లక్షమంది మరణిస్తున్నారు. అమెరికాలో పాము కాట్ల వల్ల మరణించేది కేవలం ఐదు మందే! కానీ భారతదేశంలో వాటివల్ల ఏటా 58,000 చచ్చిపోతున్నారు. ఇది ప్రపంచ దేశాలలో ప్రథమ స్థానం!

లక్షల సంవత్సరాలపాటు తీపి వస్తువు అంటే విషవస్తువు కాదు అని ఎరిగిన మానవులు, ఈ మధ్య కాలంలో అసలు ఒక పదార్థం తియ్యగా ఉండటానికి కారణమైన వస్తువేదో కనుక్కున్నారు. దాన్నే తయారు చెయ్యడం నేర్చుకున్నారు. వంటకాల్లో అమితంగా వాడటం మొదలుపెట్టారు. మితిమీరి తిని, షుగర్ జబ్బు తెచ్చుకున్నారు.

ఇండియాలో ఉన్న 1,500 మిలియన్ల జనాభాలో దరిదాపు 80 మిలియన్ల వయోజనులు అనగా (వయస్సు 20-79), నూరింట ఐదుగురు, మధుమేహం బారిన పడుతున్నారనిన్నీ, అందుకే ప్రపంచంలో ‘మధుమేహానికి ఇండియా ముఖ్యపట్నం’ అని ఇటీవల అనడం మొదలు పెట్టేరు! అతి రక్తపు పోటు విషయంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది

బొల్లి కలిగించే మనస్తాపం వర్ణనాతీతం. ఎవరికైనా ప్రాణాంతకమైన జబ్బు వస్తే జాలిపడతారు. ప్రాణం పోతే ఒకసారి ఘొల్లుమంటారు. కానీ బొల్లి వ్యాధి వచ్చిన అమ్మాయిల జీవితం సజీవ సమాధే! ఒక పక్క వ్యాధి వచ్చిందని బెంగ. మరొక పక్క ఎవరైనా చూస్తారేమోనని దిగులు.

ఒక విధంగా ఆలోచిస్తే భౌతిక శాస్త్రం యొక్క గమ్యం వాస్తవం యొక్క నిజ స్వరూపం కనుక్కోవడమే. ఈ వాస్తవాన్నే మనం వేదాంత తత్త్వంలో బ్రహ్మము, బ్రహ్మ స్వరూపము అని అంటాం. మన ఉపనిషత్తులు అన్నీ కూడా ఈ బ్రహ్మము గురించి చేసిన అన్వేషణ అనే చెప్పవచ్చు. ఈ రెండు వర్గాల గమ్యమూ ఒక్కటే; వారు ఎంచుకున్న మార్గాలు వేర్వేరు, వారి పరిభాషలు వేర్వేరు. వేదాంత తత్త్వంలో అన్వేషణ కేవలం తర్కం, మీమాంసల ద్వారా జరుగుతుంది.

ఇరవైయవ శతాబ్దం భౌతిక శాస్త్రానికి స్వర్ణయుగం అనవచ్చు. మేక్స్ ప్లాంక్ 1900 లో వేసిన విత్తు మహా వృక్షమై మన జీవితాలనే మార్చి వేసింది. అప్పటి నుండి ఇరవైయవ శతాబ్దం అంతం వరకు శరవేగంతో జరిగిన సంఘటనలని సాధ్యమైనంత తేలిక భాషలో, సాధ్యమైనంత తక్కువ గణిత సమీకరణాలు మాత్రం ఉపయోగించి, ఒక సింహావలోకనం చేసేను.

ఉపనిషత్తుల వల్ల ప్రభావితుడైనది ష్రోడింగర్ ఒక్కడే కాదు. అలనాటి భౌతిక శాస్త్రవేత్తలు ఎందరో ఈ కోవకి చెందినవారు ఉన్నారు. నీల్స్ బోర్, హైజెన్‌బర్గ్, ఆపెన్‌హైమర్ మొదలైనవారు ఉన్నారు. ఆమాటకొస్తే హైజెన్‌బర్గ్ ప్రవచించిన అనిర్ధారిత సూత్రం చెప్పేది కూడా ఇదే.

అవధాని తండ్రి యెడల భయభక్తులతో, తల్లి చాటున పెరిగిన బిడ్డ. మారుతున్న కాలానికి ఎదురీదే ధైర్యం లేక శాస్త్రానికి పిలకని ఉండనిచ్చి, కాలానికి అనుగుణంగా క్రాఫింగ్ చేయించుకున్నాడు. పాఠశాలలో లఘు సిద్ధాంత కౌముది, రఘువంశం అధ్యయనం చేసేడు. సహాధ్యాయులు చాలామంది బ్రాహ్మణేతరులు కావడంతో పౌరోహిత్యానికి కాని, అర్చకత్వానికి కానీ బ్రాహ్మణులకి ఉంటూ వచ్చిన గిరాకీ ఇటుపైన ఉండదేమో అనే భయం పట్టుకుంది అవధానికి.

వికీర్ణం (radiation) అనేది ప్రాణాంతకమైన ప్రమాదాన్ని తీసుకొచ్చే ‘అమ్మవారు’ కాదని తెలుస్తున్నాది కదా! మనం అంతా బహుకొద్ది మోతాదులలో అసంకల్పంగా వికీర్ణం ప్రసారం చేస్తూనే ఉన్నాం, మన ఎముకలలో ఉండే అనిశ్చల పొటాసియం కారణంగా. మన వంటగదులలో నల్లసేనపురాయితో చేసిన తీనెలు కాని ఉంటే అవి కూడా కాసింత వికీర్ణాన్ని ప్రసారం చేస్తూనే ఉంటాయి.

అతీతవాహకత్వం ఇంకా ప్రయోగశాలలకే పరిమితం కానీ అర్ధవాహకాలు (semiconductors) మన దైనందిన జీవితాన్నే పూర్తిగా మార్చివేశాయి! ఈ రోజుల్లో ట్రాన్సిస్టర్లు, చిప్పులు (chips), కంప్యూటర్లు, సెల్ ఫోనులు, లేసర్లు, వగైరాలు లేకుండా మనకి రోజు గడవదు కదా!

కొన్నాళ్ళకి నక్షత్రాలన్నీ చల్లారిపోయి, విశ్వం చైతన్యరహితంగా తిమిరాంధకారంలో ములిగిపోతుంది. ఇందుకేనా సృష్టి జరిగింది? చీదేసిన సిసింద్రీలా కాసింతసేపు హడావిడి చేసి చివరికి ఇలా ఒక మూల తొంగుంటుందంటే ఎవరు మాత్రం సహించగలరు? ఈ జగన్నాటకానికి మరొక అంకం ఉంటే బాగుంటుంది కదా!

రాతియుగంలో సహజసిద్ధంగా లభించే లోహపు కణికలు మానవుడి కంటికి కనబడినప్పుడు వాటిని పదిలంగా భద్రపరచి ఉంటాడు. ఆకుపచ్చగా ఉండే తామ్ర కర్బనితం రాళ్ళనీ, నల్లగా ఉండే అంజన గంధకిదము రాళ్ళనీ గుండ చేసి ఈజిప్టులోని పురాతన రాజవంశీయులు సౌందర్య సామగ్రులుగా ఉపయోగించినట్లు దాఖలాలు ఉన్నాయి.

పైన ఉదహరించిన కార్య-కారణ చయనిక మానవ ప్రపంచంలో సహజం అని మనం సంతృప్తి పడవచ్చు. ఒక సంక్లిష్టమైన అంతర్నాటకంలో మానవుల కోరికలు, వాటి ప్రేరేపణలు, తద్వారా జరిగే చర్యలు, ప్రతిచర్యలు కారణంగానే ట్రోయ్ యుద్ధం లాంటి సమరాలు, హెక్టర్ మరణం లాంటి సందర్భాలు ఎదురవుతాయి. కానీ హోమర్ చెప్పిన కథ ఇంత సజావుగా సాగదు.

రాజుగారివి గాడిద చెవులు అని మంగలికి తెలిసిపోయింది. మూడో కంటివాడికి ఈ రహస్యం తెలిసిందంటే తల తీయించేస్తానని మైడస్ మంగలిని బెదిరించేడు. రాచరహస్యం! రచ్చకెక్కితే కొంపలంటుకుపోవూ? కడుపులో దాచుకోలేక మంగలి కడుపు ఉబ్బిపోతోంది. ఎవ్వరికో ఒకరికి చెప్పాలి. తనకి తెలిసిన రహస్యాన్ని ఒక పుట్టలో ఊదేశాడు!

కేసియోపియా అని గ్రీసు దేశస్తులు పిలిచిన నక్షత్ర మండలాన్ని వివిధ సంస్కృతులలో ప్రజలు వివిధమైన పేర్లతో పిలిచేరు. ఈ గుంపులో ఉన్న నక్షత్రాల గురించి అరబ్బులకి తెలుసు, చైనీయులకి తెలుసు, వేదకాలపు భారతీయులకి తెలుసు. వారివారి పురాణ గాథలలో ఇటువంటి కథలు వారికీ ఉన్నాయి.

భర్తని కోల్పోయిన లైయస్ భార్య యొకాస్టా ఈడిపస్‌కి పట్టమహిషి అయింది! తను చంపినది తన తండ్రినే అనిన్నీ, తను వివాహం చేసుకున్నది తన తల్లినే అనిన్నీ ఈడిపస్‌కి కానీ అనుచరులకి కానీ ఊహామాత్రంగానైనా తెలియలేదు. విధి వైపరీత్యం! ఈడిపస్-యొకాస్టాల దాంపత్యానికి ఫలితంగా నలుగురు పిల్లలని కంటారు.

ఈ రోజుల్లో అయితే కసాండ్రా లాంటి వ్యక్తిని ‘శకున పక్షి’ అని గేలిచేసి ఉండేవారు. మనకి అవగాహనలో లేని ఏదైనా శక్తివంతమైన ప్రభావం వల్ల మనకి ఏదో కీడు కలగబోతోందని జోస్యం చెప్పేమనుకోండి. ఉదాహరణకి ‘పర్యావరణం వెచ్చబడడం వల్ల పల్లపు ప్రాంతాలు ముంపుకి గురవుతాయి’ అని ఒక శాస్త్రవేత్త జోస్యం చెప్పేడనుకోండి. మనకి వెంటనే నమ్మబుద్ది కాదు.

పాశ్చాత్యులు హోమర్ రాసిన ఇలియడ్, ఆడిస్సిలతో వ్యాసుడు రాసిన భారతాన్ని పోలుస్తారు. కేవలం ఉపరితలం మీద కనిపించవచ్చేమో కానీ లోతుగా పరిశీలిస్తే ఈ పోలిక సరికాదు. హోమర్ రాసిన ఇలియడ్, ఆడిస్సిలు రెండింటికంటే భారతం రెట్టింపుకి మించి పొడుగు ఉంటుంది! భారత యుద్ధం మానవుల అత్యాశ వల్ల జరిగితే ట్రాయ్ యుద్ధం దేవతల చెలగాటాల వల్ల జరుగుతుంది.

గ్రీకు పురాణ గాథలలో అస్తవ్యస్త పరిస్థితి నుండి సృష్టి జరిగిన విధానం, సంతానోత్పత్తి కొరకు ఆది జంట ఏర్పడిన విధానాలలోని ఆచార వ్యవహారాలు చూస్తే కాసింత ఆశ్చర్యం, కాసింత జుగుప్స పుట్టుకొస్తాయి. ఇటీవలి కాలంలో డార్విన్ ప్రవచించిన పరిణామ సృష్టివాదం బలం పుంజుకొనక పూర్వపు రోజులలో మానవుడి పుట్టుక గురించి మనకి ఉన్న అవగాహన పూజ్యం.

తన తండ్రి యూరెనస్ శాపం ఏ విధంగా పరిణమిస్తుందో అనే భయంతో క్రోనస్ తన సంతానాన్ని మింగేసి తన కడుపులో బంధిస్తాడు. కానీ రేయా పన్నుగడ పన్ని జూస్ స్థానంలో ఒక రాయికి దుప్పటి గుడ్డ చుట్టబెట్టి క్రోనస్‌కి ఇస్తుంది. ఆ రాయిని క్రోనస్ మింగేస్తాడు. ఈ విధంగా క్రోనస్ కడుపులోకి జూస్ వెళ్ళకుండా రక్షణ పొందుతాడు.

జూస్‍ని పోలిన వ్యక్తి ఇంద్రుడు. హిందూ పురాణాలలోని దత్తాత్రేయ పురాణం ప్రకారం కశ్యపుడు దక్షప్రజాపతి యొక్క ఎనమండుగురు కూతుళ్ళని పెళ్ళి చేసుకుంటాడు. వీరిలో పెద్ద కూతురు అదితికి పుట్టిన వారిలో ఆదిత్యులు పన్నెండుమంది. జూస్ పన్నెండుగురు ఒలింపియనులలో ఒకడైతే, ఇంద్రుడు పన్నెండుగురు ఆదిత్యులలో ఒకడు.

క్రోనస్ కుతంత్ర బుద్ది కలవాడు, అత్యంత భయంకరమైనవాడు. తల్లి గాయాకి జరిగిన అవమానానికి పగ తీర్చుకోగల సమర్ధుడు. క్రోనస్ ఒక రాత్రి యూరెనస్ మీదకి లంఘించి అతని జననాంగాలని తల్లి ఇచ్చిన కొడవలితో నరికేసి వాటిని సముద్రంలో విసిరేస్తాడు. ఆ జననాంగాల నుండి స్రవించిన స్రావములతో ఒక రకం రాక్షసులు, జలకన్యలు, తదితరులు పుట్టుకొస్తారు.

గ్రీసు దేశపు పురాణ గాథలు చదువుతూ ఉంటే వాటికీ హిందూ పురాణ గాథలకి మధ్య పోలికలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పోలికలు పేర్లలో కావచ్చు, సంఘటనలలో కావచ్చు, వ్యక్తుల ప్రవర్తనలో కావచ్చు, దేవతల ఆయుధాలలో కావచ్చు, దేవతల వాహనాలలో కావచ్చు, దేవతలకి మానవులకి మధ్య సంబంధబాంధవ్యాల రూపేణా కావచ్చు. ఈ పోలికలకి కారణాలు రకరకాల కోణాలలో వెతకవచ్చు.

అది ఒక లోతైన లోయ. ఆ లోయలో పొగమంచు దట్టంగా పేరుకుని ఉంది. స్వామి చూపిన దిశలో పొగమంచు కరిగినట్లయింది. కరిగిన ఆ కాసింత మేరలో, ఎదురుగా, దూరంలో – ఆశ్చర్యం – ఒక దృశ్యం సాక్షాత్కరించడం మొదలు పెట్టింది. మొదట్లో మసకమసకగా ఉన్నా క్రమేపీ తేజోకేంద్రంలో ఆ దృశ్యం ఘనీభవించి తెర మీద కదలాడే బొమ్మలా రూపుదిద్దుకుంటోంది. అది ఒక నదీతీరమో, సరోవరమో, సముద్రతీరమో?

గణిత ప్రపంచంలో మూడు శతాబ్దాలకి పైబడి పరిష్కారం లేకుండా ఉండిపోయిన అతి జటిలమైన సమస్య ఏదయ్యా అంటే అది ఫెర్మా కదాచిత్తుగా ప్రవచించిన ఒక అభిప్రాయం. ఎవరీ ఫెర్మా? ఏమిటా శిష్టాభిప్రాయం? ఈ సమస్య పరిష్కారం లేకుండా మూడు వందల ఏళ్ళు పైబడి ఎందుకు ఉండిపోయింది? చివరికి పరిష్కారం ఎలా దొరికింది?

నేను తెలుగు నేర్చుకోలేదు, ఎవ్వరూ నేర్పలేదు; దానంతట అదే వచ్చేసింది. భాష వచ్చిన తరువాత రాయడం, చదవడం గురుముఖంగా నేర్చుకున్నాను. కనుక తెలుగంటే ఏమిటో బొత్తిగా తెలియని వాళ్ళకి తెలుగు నేర్పడంలో ఉన్న కష్టసుఖాలు, తెలుగు నేర్చుకునేటప్పుడు విద్యార్థులు చేసే తప్పులు నా విద్యార్థులకి పాఠాలు చెప్పే సందర్భంలోనే నాకు అవగతం అయేయి.

రీమాన్ ఒక అమూల్య అభిప్రాయం వెలిబుచ్చేడు, రుజువు చెయ్యకుండా! ఈ అభిప్రాయం నిజమే అని రుజువు చేసిన వారికి మిలియను డాలర్లు బహుమానం ఇచ్చేస్తారు. ఏదో పెద్ద విశ్వవిద్యాలయం వారు ఆచార్య పదవి అంటగడతారు. ఏ హా(బా)లివుడ్ తారో పెళ్ళి ప్రతిపాదిస్తే, డాలర్లతో పాటు స్వర్గ ద్వారాలు కూడ తెరుచుకోవచ్చు!

గణితంలో ప్రావీణ్యం లేని వారు కూడ, గణితపు లోతులని తరచి చూసే సామర్ధ్యం లేని వారు కూడ, ఈ ప్రధాన సంఖ్యల అందచందాలని చవి చూడకపోతే జీవితంలో ఒక వెలితి మిగిలిపోయినట్లే. అదృష్టవశాత్తు ఈ ప్రధాన సంఖ్యలలోని అందచందాలని చవి చూసి ఆనందించడానికి గణితం లోతుల్లోకి అతిగా వెళ్ళనక్కరలేదు.

రాయుడు ఉత్త వాగుడుకాయ. బుర్రలో పుట్టే ఆలోచనల ప్రవాహం కంటె ఎక్కువ జోరుగా మాట్లాడడంలో అతనికి అతనే సాటి. అప్పుడప్పుడొక మోతాదు అశ్లీలాలు దొర్లిస్తూ మాట్లాడే తత్త్వమేమో, ‘కంట్రీ క్లబ్బు’లో అతను ఎక్కడ ఉంటే అక్కడ పదిమంది తేనె చుట్టూ చేరే ఈగల్లా చేరి కేరింతాలు కొడుతూ ఉంటారు. నాయుడికి రాయుడంటే చిరాకు. ముభావంగా ముడుచుకు కూర్చునే నాయుడు చుట్టూ వందిమాగధులు ఎవ్వరూ చేరరు. అందుకని రాయుడంటే అసూయ పడుతున్నాడో ఏమో! మనకి తెలియదు.

ఎవ్వరి కంటా పడకుండా, ఎక్కడో వినువీధులలో తన మానాన తను తిరుగాడుతూ ఉంటే ఉచ్చు వేసి పట్టుకున్నారు. పట్టుకుని కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టం కట్టేరు. ఇప్పుడు కుక్కని కొట్టినట్లు కొట్టి సింహాసనం నుండి దింపి, ‘కార్టూను బొమ్మలలో కుక్క బతుకులాంటి బతుకు చాలు,’ అన్నారు. ఆకాశం నుండి, శంభుని శిరస్సు నుండి, శీతాద్రిశుశ్లోకంబైన హిమాద్రి నుండి అన్నట్లు ఉంది నా ప్లూటో పతనం!

దుర్భిణిని అంతరిక్షంలో ఉంచటం వల్ల చాల లాభాలు ఉన్నాయి. భూమి వాతావరణం వల్ల చెదరకుండా ప్రతిబింబాలు ఖణిగా కనిపిస్తాయి. నక్షత్రాల దగ్గర బయలుదేరిన విద్యుదయస్కాంత తరంగాలలో కొన్ని భూమిని చేరలేవు కనుక మన దుర్భిణిని అంతరిక్షంలోకి తీసుకెళ్ళాలి.

దేశానికి ఒక ప్రధాన మంత్రి ఉంటే బాగుంటుంది కాని దేశంలో ఉన్న కులాలు అన్నీ, ‘ఎవరి కులం వారి ప్రధాన మంత్రి వారికే’ అంటూ, కులానికొక ప్రధాన మంత్రి కావాలంటే ఏమి సబబు? అలాగే ఈ భౌతిక ప్రపంచంలో మనకి ద్యోతకమయే దృగ్విషయాలని అన్నిటిని ఒకే ఒక సిద్ధాంతంతో అభివర్ణించగలిగితే బాగుంటుందనేది శాస్త్రవేత్తల చిరకాల వాంఛ.

హోజే పెరేజ్ మరో సారి బయటకి నడచేడు. గదిలో ఉన్న వ్యక్తి మీద, దూరం నుంచే, ఒక కన్నేసి ఉంచమని అక్కడ ఉన్న పోలీసుతో చెప్పి, చరచర నాలుగు గదులు అవతల ఉన్న మరొక గదిలోకి వెళ్ళి, అక్కడ కంప్యూటర్‌లో ఉన్న ‘నేషనల్ ఆటోమేటిక్ ఇండెక్స్ లుకౌట్ సిస్టం’ని సంప్రదించి చూసేడు. ఖతానీ పేరు అందులో ఎక్కడా లేదు. ప్రపంచంలో ఎవ్వరూ ఇతని కోసం వెతకటం లేదు.

అనుకరణకి గమ్యం తెలుగు అనుకున్నప్పుడు ఏ తెలుగు అనే ప్రశ్న వస్తుంది? ఈ వ్యాసం నిర్మించుకున్న పరిధిలో మన గమ్యం శిష్టవ్యవహారికం – అనగా, ఈ రోజుల్లో వార్తాపత్రికలలోను, అంతర్జాలపత్రికలలోను, కథలలోను, తరచుగా కనిపించే వ్యవహార శైలి భాష. ఈ రకం భాష ముద్రణా మాధ్యమంలో కనిపిస్తోంది కాని టెలివిజన్ కార్యక్రమాల్లో ‘లంగరమ్మలు, లంగరయ్యలు’ మాట్లాడే భాషలో వినిపించటం లేదు.

వైధవ్యం పొందిన ఆడవారు ఒక బ్రహ్మచారిని అమ్మవారికి బలి ఇస్తే తరువాత జన్మలో వైధవ్యం రాదనే మూఢ నమ్మకం ఈ బళ్ళారి ప్రాంతాలలో ఉంది. అమ్మవారికి పూజ చేసి ‘నైవేద్యం’ అవకాశం వెంబడి పెట్టుకుంటామని మొక్కుకుంటారు. అవకాశం చూసుకుని నెమ్మదిగా, నిదానంగా పని చేసే విషాన్ని భోజనంలో కలిపి పెడతారు.

ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? అన్న ప్రశ్నకి సమాధానం, గణితంలో ప్రవేశం ఉన్నవాళ్ళకి కూడా ఇంగ్లీషులో చెప్పటమే చాల కష్టం. గణితంలో ప్రవేశం లేని వారికి ఇంగ్లీషులో చెప్పబూనుకోవటం కష్టతరం. గణితంలో ప్రవేశం లేని వారికి తెలుగులో చెప్పటానికి ప్రయత్నించటం కష్టతమం.

ఆ చలికి భూమ్యాకర్షణ కూడ గడ్డకట్టుకు పోయిందా అన్నట్లు మంచు కూడ కురవటం మానేసింది. అంత చలిలో కంఠంలో ప్రాణం ఉన్న ఏ జీవి కూడ సాహసించి బయటకి రాలేదు. కాని, బయట ఏదో ఉంది. లోపలకి రాడానికి ప్రయత్నిస్తూన్నట్లు ఉంది. కుటీరపు గోడలని గోకుతోంది!

ప్రిన్స్‌టన్ లో విద్యార్ధి దశలోనే మన భార్గవ ఇటువంటి సంధి సూత్రాలని మరో పదమూడింటిని కనుక్కున్నాడు. కనిపెట్టటమే కాదు, గణిత శాస్త్ర రీత్యా ఈ సూత్రాలు ఎలా ఉద్భవించేయో కూడ రుజువుతో సహా చూపెట్టేడు. ఈ పని ఫలితంగా భార్గవకి పట్టా ఇవ్వటమే కాకుండా 28 ఏళ్ళ చిరుత ప్రాయానికే ఆచార్య పదవి (full professor) ఇచ్చి గౌరవించింది, ప్రిన్స్‌టన్.

రచయిత వెలిబుచ్చిన అభిప్రాయాలలో చాల వాటితో నేను ఏకిభవిస్తాను. ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు తమ తమ మాతృ భాషలలో కాకుండా క్రమానుగతంగా అరబ్బీ, లేటిన్‌, సంస్కృతాలలో ప్రార్ధనలు చెయ్యటం ఎందుకు? దేవుడికి ఆ మూడు భాషలలోనే అర్ధం అవుతుందా? అని ధ్వనిస్తూ ప్రశ్నించేరు రచయిత.

మీరు నమ్మండి, నమ్మకపొండి. నేను నడకకి వెళ్ళిన ప్రతి రోజూ – దరిదాపుగా ప్రతిరోజూ – దారిలో నేల మీద ఒక పెన్నీ (సెంటు లేదా పైస) కనిపించి తీరుతుంది. కరువు రోజుల్లో పుట్టి పెరిగిన శాల్తీనేమో, ఒంగుని పెన్నీని తీసి జేబులో వేసుకుంటాను.

ప్రకృతిలో నాలుగు ప్రాథమిక బలాలు (fundamental forces) ఉన్నాయని ఆధునిక భౌతిక శాస్త్రం చెబుతోంది. విశ్వార్భవానికి మూలకారణమైన ఆదిశక్తి ఒక్కటే అయినప్పటికీ అది ఈ నాడు మనకి నాలుగు వివిధ బలాలుగా ద్యోతకమవుతున్నాదని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.

ప్రజలని వేలి ముద్రలతో ఎలా పోల్చుకో వచ్చో అలాగే వ్యక్తుల మధ్య తారతమ్యాన్ని “నాలుక ముద్రలు” తో పోల్చుకో వచ్చేమోనని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. వేలి ముద్రలు జీవితాంతం ఒకేలా ఉంటాయి. కాని, “నాలుక ముద్రలు” జీవితంలో క్రమేపీ మారుతూ ఉంటాయి.

కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి. కీకారణ్యం. గహనాంతర సీమ! ఎంత ఆస్వాదించినా తనివి తీరని కాంతారం. ఇదీ వర్షారణ్యం అంటే!! ఆస్ట్రేలియాలో […]

పెద్ద పెద్ద సంఖ్యలంటే మనవాళ్ళకి బొత్తిగా భయం లేదని గతంలో ఒకసారి చెప్పేను. పెద్ద పెద్ద సంఖ్యలని కుదించి చిన్న చిన్న మాటలలో చెప్పడంలో […]

(వేమూరి వేంకటేశ్వర రావు గారు ఈమాట పాఠకులకు వ్యాసరచయితగా చిరపరిచితులు. ఆంధ్రప్రభ లాటి పత్రికల పాఠకులకు పాప్యులర్‌ సైన్స్‌ రచయితగా, సైన్స్‌ ఫిక్షన్‌ రచయితగా […]

(వేమూరి వెంకటేశ్వరరావు గారు University of California, Davis లో పనిచేస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ కథల్లోనూ, అందరికీ అందుబాటులో ఉండే “నిత్యజీవితంలో సైన్స్‌” రచనలు […]

తెలుగులో మూడుకి సంబంధించిన మాటలు మూడొంతుల ముప్పాతిక వరకు సంస్కృతం నుండి దిగుమతి అయినవే అని అనిపిస్తుంది. తెలుగులో లేకపోలేదు, కాని వాటి వాడకం […]

“అంకెలు నా సంగడికాళ్ళు” అన్నాడు, గణితంలో నభూతో నభవిష్యతి అనిపించుకున్నమహా మేధావి శ్రీనివాస రామానుజన్‌. సంగడికాడు అంటే స్నేహితుడు కనుక అంకెలు రామానుజన్‌స్నేహితులుట! అప్పడాలలాంటి […]