ఐతే, ఏ దుర్ముహూర్తాన శ్రీశ్రీ సంపాదకుడంటే నాకింపారెడు భక్తి కలదు అని వెటకరించాడో, అది ఆయనకు ఏ అనుభవం అయో, కాకో, సరదాకో చెప్పాడో కాని అది పట్టుకుని కర్రసాము చేయడం ఒక అలవాటయింది కవులకూ రచయితలకూ. అసలే సాహిత్య విమర్శ మనకు మృగ్యం. అలాంటప్పుడు నేను రాసింది దిద్దడానికి నువ్వెవరు అనడం రానురానూ ఏ విమర్శనూ తీసుకోలేకపోవడానికి దారి తీసింది.

ఉన్నంతసేపు దిగులుగా ఉంటావు. నవ్వితే మాత్రం పిచ్చిదాన్లా నవ్వుతావేమ్మా, అన్నాడు నాన్న. రాత్రి దాదాపు స్పృహపోతూ తలపక్కకి వాలుస్తుంటే ఏవో ఇంజెక్షన్లు పొడిచేరు నాలుగు చోట్ల. ఇవ్వాళ తల ఎంత తేలిగ్గా ఉందో, ఏ పిచ్చి ఆలోచనలు లేకుండా. ఆ ఇంజెక్షన్లేవో రోజూ చేస్తే బాగుండు. రోజూ ఇంజెక్షన్లు కావాలనుకోవడం కంటే పిచ్చి ఆలోచన ఏముంది, అన్నాడు కొడుకు. నాకెందుకో ఇంటికన్నా ఇక్కడే హాయిగా ఉంది.

మన ఇలాకాలో మొనగాడిని
బంగారు పతకాల వేటగాడిని
ఏమనుకున్నావ్,మామయ్యంటే?
ఆ పురవీథుల్లో యువసింహాన్ని
నా బ్లాక్‌ అండ్ వైట్‌ కాలానికి
నేనే ఈస్టమన్ కలర్ హీరోని!

బయటి చలి వెన్నులో కూడా అనుభవమైంది. అటునుంచి ఎవరూ రావట్లేదని నిర్ధారణ కోసం ఒకసారి చెవిని మళ్ళీ కొంచెం ముందుకు వంచాడు. ఏ అలికిడీ లేదు. చల్లటి నీళ్ళలో అడుగు పెట్టేముందు అనుభవించే క్షణకాలపు తటపటాయింపు. నెమ్మదిగా కుడికాలు మోపాడు. ఏమీ తెలియలేదు. రెండో అడుగు కూడా పడ్డాక మొత్తం మనిషి బరువు పడటం వల్ల చెక్క క్రీక్‌మంది. ఒక క్షణం ఆగి, మళ్ళీ పైకి కదిలాడు.

ఇలాటి వర్షపురోజులు ఎలా గడిచేవి చిన్నప్పుడు?! స్కూలుకి అప్పటికప్పుడు సెలవు ప్రకటించేసేవారు. తడుచుకుంటూ ఇంటికెళ్ళేసరికి అమ్మ అననే అనేది, ‘వర్షం కాస్త తగ్గేక పిల్లల్ని వదలచ్చుకదా’ అంటూ. నీళ్ళోడుతున్న తల తుడిచి, పొడిబట్టలు మార్పించేది. నేను ఇంట్లోకి జాగ్రత్తగా వెళ్ళటం చూసేకే అన్న స్కూల్ బ్యాగ్ గుమ్మంలోంచి లోపలికి విసిరి అమ్మ చేతికి అందకుండా పారిపోయేవాడు. ఆ చిన్ననాటి ప్రేమ ఏమయిపోయింది?

వాడు వచ్చేలోపు స్నానం చేద్దాం అనుకుంది. రెడీగా ఉండి వాడిని సర్ప్రైజ్ చెయ్యొచ్చు. ఒక కాలి చెప్పుని మరో కాలి మడమ సాయంతో తీసి దాని పై అంచుని బొటనవేలితో పైకెత్తి పెండ్యులంలా ఊపి నవ్వుకుంది. ఆపైన కాలితోనే గోడవైపుకు విసిరింది. అది గోడకి కొట్టుకొని నేలమీద పడింది. మరో చెప్పునీ కాలితోనే తీసి విసిరింది. ఒంటిమీదున్న దుస్తులు విప్పి స్నానం చేసి వదులుగా ఉన్న బాత్ రోబ్ తొడుక్కుంది.

ఈ ప్రపంచం ఎంత వింతైనదంటే, ఒకే వీధిలో ఏళ్ళ తరుబడి వుంటూ కూడా పలకరించుకోకుండా, ఎదురైతే కనీసం నవ్వకుండా జీవితాలు గడిపేసేవాళ్ళు ఎందరో?! అందులో ఇతడు పరాయివాడికన్నా ఎక్కువే. అందుకే ఎదురైతే ముభావంగా పక్కకి తప్పుకుని పోయే మేమిద్దరం మాట్లాడుకోవలసి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. కానీ నిన్నటి రోజున అదే జరిగింది.

సర్వస్వాన్ని శ్రవణేంద్రియంగా మార్చుకుని
సర్వదా పదాల ముద్రలు వేసుకుని
శ్రోతగా హోతగా
తియ్యని కన్నీటిచుక్కలని జార్చుకుంటూ
త్వమేవాహమై తన్మయిస్తూ…

శ్రావస్తి నగరానికి వెనక్కి వస్తూంటే ఊరి బయట కనిపించిన ఖాళీ స్థలం గురించి వాకబు చేశాడు అనాథపిండకుడు. తనకి తెల్సిన విషయాల ప్రకారం అది కోసల రాజు ప్రసేనజిత్తుకి చెందినది. భగవానుడి కోసం ఒక విహారం నిర్మించడానికి ఈ స్థలం సరిపోతుందనుకుంటే దీన్నిరాజు దగ్గిరనుంచి కొనాలి. తానో వర్తకుణ్ణని తెలిస్తే ఏం ధర చెప్తాడో? తన ప్రయత్నం చేయడం తప్పులేదు కదా.

చెన్నపట్నం తూర్పు కోస్తాలో చాలా ముఖ్యమైన రేవుపట్నంగానుండేది. దేశంలో అన్నిప్రాంతాలలోను తయారైన మేలురకం నూలుబట్టలు రంగు అద్దకాలు ఇంకా తూర్పుదేశాల సరుకులు ఈ రేవునుండి సీమకు ఎగుమతి అయ్యేవి. పాండుచేరిలోని ఫ్రెంచి వర్తకులు తమ ముద్దవెండిని అమ్మడానికి చెన్నపట్నంలోని వెండిబంగారు షరాబు వర్తకుల ద్వారా వ్యాపారం జరిగించేవారు. సెంట్ ఆండ్రూస్ చర్చి ఫాదరీలు ఈ బేరాలు జరిగించేవారు.

కవితలో వడి ఒకేలా ఉన్నా పోలికల్లో తేలిగ్గా కొరుకుడుపడని సంబంధం, సామ్యం కొన్ని చోట్ల ఇబ్బందిపెడతాయి. వినూత్నమైన, పూర్తిగా తనకు సొంతమైన కల్పనాశక్తితో రాసిన పాదాలు కవితల్లో స్పష్టంగా కనపడుతాయి. ఈ కాలపు మానసికావస్థలకు తగ్గట్టుగా తిప్పుకున్నవా అనిపించే అబ్‌స్ట్రాక్ట్ భావనలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

స్వానుభవం పాఠాలు నేర్పుతుంటే
వెలిసిపోతున్న పేదరికం మౌనగీతాలు పాడుతోంది
గాలివాటున సాగే గోదారి పడవలా
జీవితం కాలాల ప్రవాహంలో సాగిపోతోంది
గిరికీలు కొడుతున్న సరంగు పాటలా
మౌనవిపంచి గొంతు సవరించుకుంటోంది

గ్రీకు పురాణ గాథలలో అస్తవ్యస్త పరిస్థితి నుండి సృష్టి జరిగిన విధానం, సంతానోత్పత్తి కొరకు ఆది జంట ఏర్పడిన విధానాలలోని ఆచార వ్యవహారాలు చూస్తే కాసింత ఆశ్చర్యం, కాసింత జుగుప్స పుట్టుకొస్తాయి. ఇటీవలి కాలంలో డార్విన్ ప్రవచించిన పరిణామ సృష్టివాదం బలం పుంజుకొనక పూర్వపు రోజులలో మానవుడి పుట్టుక గురించి మనకి ఉన్న అవగాహన పూజ్యం.

నీది బయటి మెరుపు
నాది లోపలి వెలుగు.
నువ్వొక పులకరింతని పూసి రాలిపోతావు
నేను గాయంతో రగిలి మాని మరకనై ఉండిపోతా.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.